శ్రీద ఖ్యాతి నిరాకృతి
వైదుష్య సుపుష్య దర్థవైభవ యపరి
చ్ఛేదప్రాభవ యాచక
ఖేదప్రశమనవిలోల కృష్ణనృపాలా
అవధరింపు మవ్విధంబున నలఘువ్రతుండు భువనేశ్వరీమంత్ర జపంబు రెండు సంవత్సరంబులు పరిపూర్ణంబుగా జేయ నంతట మృగేంద్రవాహన “యో బ్రాహ్మణుండ! నీ యభీష్టంబు వేరొకచోట సిద్ధించు” నని పల్కె నప్పలుకులు వీనులంబడు నంతన యతండాకస్మికోద్ధూత తీవ్రవాతనిపతితుం డగుచు ననేక జనపదవ్యవహితంబైన యొక్క పురంబు నడుమ రాజస్థాన మధ్యంబునంబడి తదీయక్షోభాకులత్వంబున నొక్కింతతడవుండి మూసిన కనురెప్పలంత విచ్చి నలుదిక్కులుం బరికించి తన పతనప్రకారంబునకు వెరగుపడుచు జుట్టున నున్న సభాసదుల గొందరను గట్టెదుర రెండవ దేవేంద్రుం బోలె నపూర్వవైభవంబున నున్న యొక్క రాజును నతని యగ్రభాగంబున బసిండితొట్టియ లోపల బొత్తులలోనున్న యొక చక్కని బాలికనుం జూచి యొక్కింతతడవు నివ్వెరపాటున నిశ్చలుండగుచు నుండి పదంపడి దిగ్గునలేచి మణికంధరదత్తంబైన తన రత్నమాలిక యాశీర్వాదపూర్వకంబుగా నా రాజునకు గానుకపట్టుటయు నతండు నత్యాదరంబునం గైకొని కొంత సమీపంబునం గూర్చుండ నియమించి యప్పటికి దత్కులనామమాత్రంబు లడిగి తెలిసి “యిప్పటి నీ యాగమనప్రకారం బత్యద్భుతంబది చెప్పెదవు గాని యిటు మాటలాడక యొక్కింత నిలువు” మని పలికి “యిప్పటి కానుక లెవ్వియైనను దీని సొమ్ముల” యని యమ్మణిహారంబు తనయొద్ద నున్న యా శిశువునకు బెట్టించె
అత్తరిన తదీక్షల నా
పొత్తులలో శిశువు చిబుకము గళంబుపయిన్
హత్త నదిచూచి తెలిదళు
కొత్తుచు లేజెక్కులమర నొయ్యన నగియెన్
నగి యిట్లనియె
తిరుగగ రెండేండ్లకు నీ
సురుచిర హారోత్తమంబు జూడగ నాకున్
దొరకె గనుంగవ చేసిన
యురుపుణ్యము నేడు వెండియును ఫలియించెన్
అనిన విని యేమి చెప్పంగ నచట నున్న
వారలెల్ల జిత్తరువున వ్రాసినట్టి
ప్రతిమలును బోలె నతినిశ్చలత నొకింత
తడవు గనుపట్టి రత్యద్భుతంబు నొంది
ఎంతయు విస్మయంబున మహీశుడు బాలిక మోము జూచి య
త్యంతము వింత లీపలుకు లారయగా నిది యెట్టి దేవతా
కాంతయొ కాక యేవిధపు గారణజన్మయొ యింక మాటలా
డింతము గాక యంచు తన డెందమునం దలపోసి యిట్లనున్
ఓ యద్భుతంపు బాలిక
నీ యుదయం బరయ రెండు నెలలయ్యెనొ కా
దో యెట్టు పలికి తిమ్మెయి
నేయెడ రెండేండ్ల క్రింద నిది చూచితివో
అనవిని “యిట మునుపటి నా
జననంబున నేను దీని జాల గురుతుగా
గనుగొన్న దాన గావున
ననఘా యామాట యంటి నని యది పలికెన్
అమ్మహీపాలుండును నబ్బాలికం జూచి నీవు కారణజన్మవు గాని సామాన్యంబైన మనుజశిశువు మాత్రంబవు కావు కావున నీ తెరంగంతయు నెరుంగునందాక డెందం బమందకౌతుక సంరంభంబున సంభ్రమించుచున్నయది నీ పూర్వజన్మవర్తనంబు లెవ్వి యేమి కారణంబున నిచ్చట బుట్టితి వెరింగింప వలయునని ప్రార్థించుటయు నది తన పూర్వజన్మవర్తనంబును దజ్జన్మనిమిత్తంబైన తత్పూర్వవర్తనంబును సంస్మరణసంబంధ పరంపరావశంబున సమస్తంబును గరతలామలకంబుగా నాకలించి తన పలుకు లాస్థానంబెల్ల సావధానంబగుచు వింజమాకిడినట్లు వినుచుండ నన్నరేంద్రచంద్రునకు నిట్లని చెప్పందొడంగె
వినవయ్య యో కీర్తిధన యిట మునుపటి
పుట్టువు గాక తత్పూర్వమైన
పుట్టువునందు నంబుజగర్భుదేవి పెం
చినయట్టి ప్రోది రాచిలుక నేను
నాకు దజ్జన్మంబునన్ శాపమొక్కటి
తగుల రెండవమేను దాల్పవలసె
దచ్ఛాపమూలమంతయు నీకు వినిపించె
దను వినుమిది నిమిత్తముగ నైన
నొక యపూర్వకథ సముజ్వ్జల రసభావ
మాయు రభ్యుదయ కులాభివృద్ధి
హేతు వతిపవిత్ర మిప్పుడు వినిపింప
గలిగె జిహ్వకలిమి ఫలమునొంద
అంబుజాసను రాణివాసము నందు నేను వసించుగా
లంబు నందొకనాడు మోదమెలర్ప నాయన వాణితో
నంబరాభర ణాంగరాగ సమంచితాకృతి వైభవా
డంబరంబు కరంబు వింతబెడంగునం గనుపట్టగాన్
భవనారామమునకు జని
నవ నాఖేలనము లొనర్చుచు నరవిం
ద వనామోద భరాలస
పవనామోదముల చేత భావము లెసగన్
కృతకమరాళ సమేతా
గ్రత నమరెడు నడిమిమానికపు గంబముతో
నుత కాంచన సోపాన
ప్రతతులతో నొప్పు నొక్క సరసి తూర్పుదరిన్
తరుణ సంతానక చ్ఛాయ దలిరుబాన్పు
నందు నా సరోవరమున కభిముఖముగ
బవ్వళించెను దన పాదపల్లవంబు
లూరువుల జేర్చుకొని వాణి యొత్తుచుండ
అంతట నంతకంతకు నిరంతరమై తనరారు మారు దు
ర్దాంతత గాంత బాన్పునకు దార్చెను దన్మధురాధరామృతా
క్రాంతి రసోద్ధతిన్ దన మొగంబులు నాల్గును నొక్కమాటె య
త్యంతము దత్తరిల్లగ దదాననముం దనకై మరల్చుచున్
అప్పుడు
ఆ లీలలకు నవ్వి “మేలు మేలెంతయు
నీ వింత లన్యాయ మింత గలదె
మీ మొగంబులు నాల్గు నీమాడ్కి నువ్విళు
లూరిన నేకాస్య నొకతె నేను
జాలుదునే యివి చాలించెదరొ మరి
యేమైన గలదొ యంచా మృగాక్షి
మెడ బిగించుచు నించు కెడగ వక్త్రము నిల్పి
యధరంబునకు బాణి యడ్డమిడుచు
మొలకనగవును గోపంబు జెలువు జిలుకు
తళుకుచూపుల జూపులో దర్జనముల
వక్రిత భ్రూలతా తాండవంబు సిరుల
మిగుల గెరలించె బ్రియుమది మొరయు మరుని
ఆయజు డప్పు డంగన ముఖాబ్జము బల్మిని వంచి మోవిపై
చే యటు పారద్రొబ్బి పలుసేర్చె నొకించుక నాటునట్లుగా
నాయమకుం గళాభిదురమై మది నింపొనరింప మోహనం
బై యుదయించె నొక్క మధురాంచిత శబ్దము కంఠసీమలోన్
అంత నా వాగ్దేవి యా విధంబున నొదవిన కళామర్మభేదన సామ్రాజ్య సంపదనుభవావస్థ మానలాఘవశంక నప్రకాశంబుగా గడిపిపుచ్చుట కుపాయంబు జింతించి తద్విరోధకారిణియైన విభుని యభిమతకేళికి విఘాతంబుగ నధరపీడనాసహత్వ నాటితకంబున నలుక కల్పించుకొని యవ్వలిమొగంబుగా బొరలె నేనప్పుడు తదీయభావం బంతయు నూరుశ్లేషనయనాంత మీలనాదులైన శాస్త్రప్రసిద్ధ లక్షణంబుల చేత నూహించితి నజ్జలజభవుండును దద్విరహదశావికలితధైర్యుండయ్యు నుల్లంబునం గల్లగుట్టు నెట్టుకొలిపి యిట్టట్టు దెల్పుటకుం జొరకుండి యంతట బురోవర్తిశాఖా సమాసంజిత సమంజస రత్నపంజరంబున నున్న నన్నుం జూచి “యో చిలుకచెలువ యుబుసువోదు కథయొక్కటి జెప్పవుగా” యనుటయు నేను “నో దేవ దేవరముందట నెట్టి కథయు జెప్ప నేను భాజనంబనే మీరు జెప్పితిరేని వినియెద” ననుడు “నట్లేని వినుము చెప్పెద” నని యిట్లనియె
కాసార సంజ్ఞ తోడను
భాసిలుచున్నట్టి యొక్క పట్టణమున ల
క్ష్మీసంపద నొప్పును సువి
లాసుడు రాజొక్కరుడు కళాపూర్ణుడనన్
ఈ జగముల గల తన సరి
రాజుల నందరను జయధురంధరుడు మహా
రాజత డొనరించెను నిజ
రాజిత లీలాకళా పరాజితులనగన్
ఆతడు సద్యోయౌవను
డై తోడన యొక స్వభావుడను సిద్ధునిచే
నూతన మొక మణియు సము
ద్య్దోతిత శార్జ్ఞ్గము మెరుంగుదూపులు బడసెన్
ఆ మణిశలాక యరుణమై యద్భుతపు
రంగు గలిగినయది యా మెరుంగుదూపు
లక్షయము లాశరాసన మతనువిజయ
గౌరవానీక సంప్రాప్తి కారణంబు
అవి యట్లు వడసి యతండు తద్దాతృగౌరవంబునన యనవరతంబునుం దాల్చియుండు
అంతట నొకడు మదాశయుండను జగ
తీనాయకుండు రూపానుభూతి
యను భార్యయును దాను దనమంత్రి ధీరభా
వాఖ్యుండు తోడరా నట యదృచ్ఛ
నొక్కింత పొలయుటయును దత్కళాపూర్ణు
డాత్మకోదండ విహార పటుత
ధీరభావుని గడు దూరంబుగా బలా
యనము నొందించి మదాశయాఖ్యు
దనకు శరణు చొచ్చినవాని దత్కళత్ర
యుక్తముగ దాసుగా నేలి యూడిగంపు
బనులు సేయించుకొనుచు నింపెనయ నిలిపె
నతడు వర్తిలుచుండె దదాజ్ఞ లోన
అని చెప్పిన నప్పలుకులు సభ్రూవిలాసలోల లోచనాంచలకషిత కర్ణికయగుచు నాకర్ణించి యించుక నగుచు శారద నన్నుం జూచి “యా కళాపూర్ణుండు మరియేమి యయ్యె నతనికి దల్లిదండ్రు లెవ్వ రడుగు” మని కరప నేను నట్ల యడుగుటయు నజ్జగద్గురుం డిట్లనియె
అభినవకౌముది యను కాంతచే నంత
వరియింపబడియె నవ్వరవిలాసు
డాతనికిని సుముఖాసత్తి యనునది
తండ్రియు మరి మణిస్తంభుడనెడి
వాడు తల్లియు నన వాణి హాసంబుతో
గ్రక్కున గ్రమ్మరి కౌగిలించి
యింతలోనన యౌర యెన్ని తబ్బిబ్బులు
దద్దరిల్లకు డంచు ధవుని వీపు
చరచి యెట్టెట్టు లారాజు జనని మగది
యును జనకు డాడువాడునా యనుచు మరియు
మిగుల నవ్వుచు జెప్పుడామీదు ప్రాణ
రమణ మరి యేమి యయ్యె నారా జనుటయు
ఆ నర్మలీల చేత శ
తానందుం డధిక సంభృతానందుండై
తానును మేలొప్పగ న
మ్మానినిమెడ గౌగిలించి మక్కువ మీరన్
వదనములు నాలుగింటికి వరుస గలియ
మెలపుతో దన కంఠంబు మలచి మలచి
యొసగె దదధరపాన మహోత్సవంబు
గళము కౌగిలితోన చెక్కులు నిమురుచు
చెలువయు నంత నందొకటిచే జనితాధరపీడయై “మదిం
గొలది యెరుంగ రెందు” నని కోపము సూపుచు “జాలు జాలు న
వ్వల జెపుడేమియయ్యెను భవత్కథితుం డల రా”జటంచు గౌ
గిలి విడిపించి మోము లిరుగేలను బాయగ బట్టె బట్టినన్
దాన బ్రకాశితంబులగు తత్కుచకుంభ విజృంభణంబు లే
గౌను బెడంగు గొంతవడి గన్గొని చొక్కుచు నంత మోవి తీ
పానె నజుండు వెండియు బ్రియత్వముతో “నివియెల్ల నేర్తు రౌ
నౌ నృపుడేమియయ్యె గథ యానతి యిండ”ని పల్కె వాణియున్
పల్కిన నజుండిట్లనియె
ఏమియు నేల యయ్యెడు నమ్మహారాజు
సత్వదాత్ముండను సచివుడంత
రమణితో నంగదేశమునందు గ్రముకకం
ఠోత్తరంబను పట్టణోత్తమమున
దన్ను బట్టము గట్ట నున్నత సామ్రాజ్య
వైభవశ్రీ సముజ్వ్జలత నొప్పె
నతని యాపురికి మదాశయుండు పసిండి
కోట పెట్టించి యెక్కుడుగ నతని
దయవడసె నంత దనదు భార్యయును దాను
నుడుగ కభినవకౌముదీయుతుని నతని
గొలుచుచును దన్మణివిలోకగుణ మహత్వ్త
మునను మధురలాలస యను తనయ గనియె
కనిన తన్మణిగుణంబునకు మెచ్చుచు ప్రథ
మాగముండును ద్వితీయాగముడు దృ
తీయాగముండు దురీయాగముండు నా
బ్రఖ్యాతినొప్పువారలు నలువురు
తత్పురోహితులు సత్వరత గళాపూర్ణు
జేరి యాతడు దాల్చు చారుమణిని
బర్యాయమున దారు బట్టి తత్సంస్పర్శ
మహిమచే నానందమగ్నులయిరి
యతడు దద్వశీకృతాత్ములై వారాశ్ర
యించి యునికి దనదు హృదయమునకు
నియతివశత జాల బ్రియమగుచునికి ద
త్క్రియలకెల్ల నిచ్చగించియుండె
అంత వారిలో నొక్కరుండు మిక్కిలి మందెమేలమ్మున నమ్మణిని గరంబు నొక్కిపట్టుటయు గళాపూర్ణుండు కోపగించుకొని వారి బాయందోలి తదపరాధంబునం జేసి తత్స్వామియైన మదాశయుని కనకప్రాకారంబు నొల్లక విఘటితంబుగా జేయించె నతండును దానికి దలంకక “యందుల కేమి? యెట్లైనను దనవాడన తన దేశంబునంద యెందైనను బ్రతికెద” నని కళాపూర్ణుసేవ విడిచి కుటుంబసహితంబుగా గ్రముకకంఠోత్తరపురంబు వెల్వడి యొక్కించుక చనుచుండి
కట్టెదుటను బూర్ణకలశద్వయం బతి
శోభనస్ఫూర్తిమై సొంపుమీర
గని వేడ్క నుబ్బుచు జని సుఖంబున మధ్య
దేశంబునను జిరస్థితి దనర్చె
గ్రముకకంఠోత్తరాఖ్య పురంబు వెడలున
ప్పుడు ప్రయాణక్షోభమున గృశత్వ
మును బొంది తేరని ముద్దులపట్టిని
మధురలాలస దలంపగ నెరుగడ
యప్పుడేమి సెప్ప నాతడా పూబోడి
“యెట్టివారును గణియింప రంత
మీదమీద సుఖనిమిత్తంబు లొదవుచో
నడుమ జెందు నిజజనంబు పీడ”
క్రముకకంఠోత్తర పురోత్తమమున కంత
నరుగుదెంచెను దిరిగి మదాశయుండు
నిజకుటుంబయుక్తముగ నన్నిసువు భాగ్య
మెట్లు ప్రేరేచెనో మరి యెందునిలక
ఆ పగిది నేగుదెంచి క
ళాపూర్ణుని గనుగొనం జెలంగె నిజకృశ
త్వాపగమోల్లాసినియై
యేపున దత్పుత్రి యంత నెంతయు దెలివిన్
అంత మదాశయుండట్లు తేరి కరంబు
పొదలెడు సుత గళాపూర్ణునొద్ద
దగ నిల్పి యతనికి దత్ప్రకారము దెల్పి
యిట్టి చిత్రమహత్వ్త మేరికైన
గలదె యెందును నీకకా కంచు భార్యయు
దాను దన్మహిమయంతయును రమణ
వొగడుచు నింపున బొదలి రత్యంతంబు
నతని పురోహితులపుడు వినయ
పరత బ్రథమాగమాదులు దిరుగ జేరి
రా కళాపూర్ణు నాతండు నాత్మ నిచ్చ
గించుకొని యుండెనో తటిచ్చంచలాక్షి
సుప్రసన్నత్వ మెంతయు సొంపు మీర
మధురలాలస యంత గ్రమంబుతోడ
తల్లిదండ్రుల ప్రోదిని దరుణి యగుచు
నా కళాపూర్ణుచేత ననన్యసదృశ
మైన యౌవనఫలము దా ననుభవించె
అని చెప్పిన నాకర్ణించి
నిరవధిక ప్రేమోదయ
దరపహ్నవకందళ న్మృదుస్మిత శోభా
సురుచిర కృత్రిమరోష
స్ఫురణంబున బొమలు ముడుచుచున్ సతి పతితోన్
అటు దల “దౌర యెంతటి మహాత్ములు మీరలు నాదు మీదనా
కటకట మీ వచోరచనకౌశల మో భువనప్రపంచ సం
ఘటన ధురీణ” యన్న నగి “కామిని యిందిపు దేమి కాంచి యీ
కిటుకు గదించి పల్కె దెరిగింపుము కల్గిన నాకు” నావుడున్
చెల్లబో మీసేవ సేయుచు నింతమా
త్రము నెరుంగగలేన ప్రాణనాథ
యీ దంటమాటలు నిట్టిభావంబుల
విధము నేనిచ్చిన విద్యల కద
యిప్పటి మనవృత్త మీ కథ సర్వంబు
తుదముట్ట నేమిసెప్పెదరొ యనుచు
నూరక యిందాక నుంటి నంతయు జెప్పె
దను నది వినవలసిన వినుండు
కొలకు కాసారపురముగా బలికి యందు
బొలుచు నా మోమునీడ సంపూర్ణశశియు
నను తలంపున బలికితి రపుడు దాని
బ్రకటముగ గళాపూర్ణుడన్ రాజు గాగ
ఆరాజు కళాపూర్ణుడు సరిరాజుల నెల్ల లీలాకళాపరాజితులం జేసెననుట యా వదనప్రతిబింబచంద్రు డెల్ల ముఖచంద్రులకు నెక్కుడైన సౌందర్యము గలవాడని యతిశయోక్తిని మీ మహత్వ్తవిశేషంబు దెలిపితిరి ఇది యంతయు విస్పష్టంబు మరి యతండు స్వభావుండను సిద్ధుని చేత ధనుర్బాణంబులు నొక్క యరుణశలాకయుం బడసె ననుట భ్రూలతా వీక్షణంబులు నధరంబును స్వభావంబు చేతన కలిగియున్నవి యనుట యని యెవ్వరి కెరుంగబడదు మదాశయుం డనువాడు రూపానుభూతి యను భార్యయుం దాను ధీరభావుండను మంత్రితో నలవోకగ నటులు పొరసిన మాత్రన కళాపూర్ణుం డా ధీరభావుని దన ధనుర్విలాసంబునం బలాయనంబు నొందించి మదాశయు నతని భార్య తోడం గూడ నిజదాసునిం గావించి సేవ సేయించుకొనియె ననుట యా కాసారంబునకయి మీహృదయంబు దృష్టియుం దానును ధైర్యంబుతో గూడ నొక్కించుక ప్రవర్తించినం మన్ముఖ ప్రతిబింబంబు నిజభ్రూవిలాసంబున ధైర్యంబుం బారదరిమి మీహృదయంబును దృష్టిసహితంబుగా నాకర్షించి విడువదనుటయై కానుపించుచున్నయది. అంత నిప్పలుకులకు నాకు నవ్వు వచ్చినది అది తత్ప్రతిబింబంబునం దోచిన యానవ్వును జూచి లేతవెన్నెలతో సామ్యాతిశయంబు దోప దదభేదాధ్యవసాయంబు గల్పించి యభినవకౌముదీ శబ్దంబున బలికి యది స్త్రీలింగత్వసామర్య్థంబున స్త్రీనామధేయంబై కానుపింప నభినవకౌముది యను కాంతచేత నతండు వరియింపబడె నంటిరి ఆ కళాపూర్ణునకు సుముఖాసత్తి యనునది తండ్రియు మణిస్తంభుడనువాడు తల్లియు ననుట యా ప్రతిబింబంబు శోభనముఖసామీప్యంబు కారణంబుగా దత్కాసారమధ్య మణిస్తంభగర్భంబున నుదయించెనని చెప్పుటకాదె అందు స్త్రీపురుషత్వంబులు మీరలేమి తడబాటుననో విజ్జోడుపడ గల్పించి పలికిన నేను హాసౌత్సుక్యంబుల నాపలేక మీ కభిముఖంబుగా బొరలిన గాసారమధ్య విద్యోతమాన ప్రతిబింబము వోయి మన్ముఖంబు మీకు నెదుట గాన్పించిన నది మదీయదేహంబునందు గంఠోపరిభాగంబునం గనుపట్టుటం జేసి యా కళాపూర్ణుం డంగదేశంబున గ్రముకకంఠోత్తరపురంబునం బట్టంబు గట్టుకొనియె నంటిరి అది మదీయాత్మాధీనంబు గావున సత్వదాత్ముండను మంత్రి పట్టంబు గట్టుటగా జెప్పితిరి సత్వదాత్ముం డనగ సమీచీనత్వదాత్ముం డనుట తోచుచున్నయది అంతట మీరు మత్కంఠ పరిరంభణంబు గావించి యది యుష్మదాత్మాధీనం బగుటను మీ బాహువులు సువర్ణవర్ణంబు లగుటను మదాశయుండు క్రముకకంఠోత్తరంబునకు బసిండికోట బెట్టించెనంటిరి మీయాత్మయు దృష్టియు నెట్టి మమతావశంబుననో మన్ముఖంబునం బాయక వర్తిల్లుచు మధురాధరేచ్ఛ యార్జించుట యరసి మదాశయుండు రూపానుభూతి సహితుండై యా కళాపూర్ణునకు సేవ జేయుచు దన్మణిశలాక మహత్వ్తంబున మధురలాలస యను తనయం గాంచె నంటిరి అట్లు మధురలాలస గనినం దన్మణిశలాకా మహిమకు మెచ్చుచు బ్రథమాగప్రముఖు లయిన మదాశయుని పురోహితు లమ్మణిశలాకం బట్టి చూచుచు దత్సంస్పర్శన మహత్వ్తంబున నానందమగ్నులయి రనుట చుంబనేచ్ఛానంతరంబున మీ ముఖంబులు నాల్గును మదీయాధరపానంబున నింపొందె ననుట గాదె ఆ ముఖంబులు ఋగ్యజుస్సామాధర్వణ ప్రాదుర్భావకారణంబు లగుటను మీ యాత్మకు నధీనంబులగుటను గ్రమంబున బ్రథమాగమాదినామధేయులైన మదాశయుని పురోహితులంటిరి అంతట నేను మీ ముఖచేష్టల చేత నధరపీడ జనించిన గోపించి వాని వారించి కౌగిలి విడిపించుకొనిన నది కళాపూర్ణుండు తన తాల్చిన మణిశలాక యా బ్రాహ్మణులయం దొక్కరుని చేత గొంత పీడితంబైన గనలి వారిం బాయదోలించె ననియు దత్స్వామియైన మదాశయుని కనకప్రాకారంబు విఘటితంబు సేయించె ననియు బలికితిరి అంత దేవరచిత్తంబు దృష్టిసహితంబై మన్ముఖంబును విడిచి పరిరంభవిశ్లేష ప్రకాశితంబులైన యితరావయవంబులకు బోయిన నమ్మదాశయుండు నిజభార్యాసమేతుండగుచు నా కళాపూర్ణుసేవ విడిచి తదాశ్రయంబైన యంగదేశంబునకు బోయెనంటిరి అట్లు పోవునప్పుడెదుట నొదవిన పూర్ణకలశద్వయ శుభనిమిత్తదర్శనంబున నుబ్బుచు నేగి మధ్యదేశంబునం జిరనివాసంబు గావించెననుట వక్షోజయుగళ సందర్శనంబున నానందించుచు నరిగి వలగ్నభాగంబు నవలంబించి తడవు నిలిచెనని పలుకుట గాదె ముఖంబు బాయుట యాది గాగ నధరేచ్ఛ యడంగిన బ్రయాణక్షోభంబున మధురలాలస కృశత్వంబు నొందెనంటిరి అంత దృష్టిసహితంబుగా మీయాత్మ తిరిగి మన్ముఖంబునకు వచ్చుటయు దాన జుంబనేచ్ఛ మగుడ బరితుష్టి నొందుటయు నది ముఖపానంబు చేత సఫలమగుటయు గ్రమంబున మదాశయుండు కుటుంబసహితంబుగా మరలి కళాపూర్ణుని సేవకు వచ్చెననియు దత్కారణంబున మధురలాలసకు గృశత్వంబు మానె ననియు నది యౌవనంబున గళాపూర్ణు ననుగ్రహంబు వడసెననియు మీ కాముకత్వ సముచిత వచన రచనల దేటపరచితిరి ఇది యంతయు నిట్ల యగునో కాదో యానతీయవలయు ననిన యతం డట్ల తప్పదని నగుటయు నతని యథార్థవాదిత్వంబునకు మెచ్చుచు నిట్లనియె