చంద్రికాపరిణయము – 7. పంచమాశ్వాసము


ఆశ్వాసాంతపద్యములు

మ. తనుభానారద! నారదాదివినుతో◊ద్దామాహవప్రక్రియా
ఘనతాశారద! శారదాపకృతజా◊గ్రద్గోపవత్సప్రగో
పనభాసారద! సారదానవభిదా◊ప్రాంచద్యశోనిర్జితా
తనుసత్పారద! పారదాత్మచరిత◊ధ్వస్తాఖిలాఘోదయా! 145

టీక: తనుభానారద=దేహకాంతిచేత మేఘమువంటివాఁడా! నారదాది విను తోద్దా మాహవప్రక్రియాఘనతా శారద – నారదాది =నారదుఁడు మొదలుగాఁగలవారిచేత, వినుత=ప్రశంసింపఁబడిన, ఉద్దామ=మిక్కిలిగొప్పయగు, ఆహవ=యుద్ధముయొక్క, ప్రక్రియా=ప్రసంగమందు, ఘనతా=ఆధిక్యముచేత,శారద=నూతనమైనవాఁడా! ‘శారదః పీతమన్దే నాప్రత్యగ్రేఽభినవే త్రిషు’ అని రత్నమాల; పరులతో రణము సలుపుతఱి నితఁడు అపూర్వముగ నగపడునట్టివాఁడని తాత్పర్యము; శార దాపకృత జాగ్ర ద్గోప వత్స ప్రగోపన భా సార ద – శారదాప=నలువచేత,కృత=చేయఁబడిన,జాగ్రత్=నిస్తంద్రమగు,గోప=గొల్లలయొక్క, వత్స= దూడలయొక్క, ప్రగోపన=దాఁచుటయొక్క, భా=సామర్థ్యముయొక్క,సార=సారమును, ద=ఖండించినవాఁడా! గోవులను, గోపులను దాఁచుటకుఁ బూనిన బ్రహ్మకు భంగము కల్గించినవాఁడని భావము; సార దానవ భిదా ప్రాంచ ద్యశోనిర్జి తాతను సత్పా రద – సార=బలిష్ఠులగు, దానవ=రక్కసులయొక్క,భిదా=భేదనమందు,ప్రాంచత్=ఒప్పుచున్న,యశః=కీర్తిచేత, నిర్జిత= జయింపఁబడిన, అతను=అధికమగు,సత్=శ్రేష్ఠమైన, పారద=పాదరసముగలవాఁడా! ఇతని యశము పాదరసముకన్నఁ దెల్లనై యున్నదని భావము; పార దాత్మ చరిత ధ్వస్తాఖి లాఘోదయా – పారద=తరింపఁజేయునట్టి,ఆత్మ=తనయొక్క, చరిత= చరిత్రముచేత, ధ్వస్త=పోఁగొట్టఁబడిన, అఖిల=సమస్తమైన, అఘ=పాపములయొక్క, ఉదయా=ఆవిర్భావము గల వాఁడా! ఇతని చరిత్రలు స్మరించినమాత్రన పాపముల నశింపఁజేయునని భావము. ఈకృతిపతి సంబోధనములకును, ఉత్తర పద్యములందలి తత్సంబోధనములకును, ఆశ్వాసాంతగద్యముతో నన్వయము. ముక్తపదగ్రస్తాలంకారము.

క. శరధీనశరధిఘనభా,స్వరధీవిషయా! నిబద్ధ◊శరధీ! స్వరధీ
శరమావలంబ! శంబర,పరమాకరకరణభరణ!◊పరమాభరణా! 146

టీక: శరధీన శరధి ఘన భాస్వర ధీవిషయా – శరధీన=సముద్రుఁడె,శరధి=తూణీరముగాఁ గల శంకరునియొక్క, ఘన=అధిక మగు, భాస్వర=ప్రకాశించుచున్న,ధీ=బుద్ధికి,విషయా=లక్ష్యమైనవాఁడా! అనఁగా శివునకుఁగేశవుఁడు పత్నీభూతుఁడు గాన ఎల్లపుడు శంకరుని చిత్తమందు మెలఁగుచున్నవాఁడని భావము. ‘ఏకాపి శక్తిః పరమేశ్వరస్య హ్యుపాధిభేదా దభవ చ్చతుర్ధా, భోగే భవానీ సమరేచ దుర్గా, కోపేచ కాళీ త్వవనేచ విష్ణుః’ అను శ్రీభాగవతము ప్రమాణము; శరధీనశరధి=శివుఁడే, ఘనభాస్వర ధీవిషయా = అధికమై ప్రకాశించుచున్న బుద్ధికి విషయముగాఁగలవాఁడా; నిబద్ధశరధీ – నిబద్ధ=కట్టఁబడిన, శరధీ=సముద్రము గలవాఁడా! రామావతారమునందు బంధింపఁబడిన సముద్రము గలవాఁడని భావము; స్వరధీశ రమావలంబ – స్వరధీశ= స్వర్గా ధీశుఁడగు ఇంద్రునియొక్క, రమా=సంపదకు, అవలంబ=ఆధారమైనవాఁడా! శంబరపరమాకరకరణభరణ – శంబరపర= మన్మథునియొక్క,మా=సంపదకు, అనఁగా సౌందర్యమున కనుట, ఆకర=స్థానమగు, కరణ =దేహమును, ‘కరణం సాధక తను క్షేత్ర గాత్రేన్ద్రియేష్వపి’ అని యమరుఁడు, భరణ=వహించినవాఁడా! అనఁగా మన్మథునికి తుల్యమగు చక్కఁదనముగల దేహముగలవాఁడని భావము; పరమాభరణా=ఉత్కృష్టమైన యాభరణములుగలవాఁడా!

పంచచామరము: ధరాధరా! ధరారిమౌళి◊ధామధామసత్పదా!
పరాపరా! పరాగపూత◊భామ! భామహోజ్జ్వల
చ్ఛరాశరాశరాజదస్త్ర◊సార! సారభేదనా!
దరాదరా! దరాన్వితౌఘ◊తార! తారకౌస్తుభా! 147

టీక: ధరాధరా=భూమిని ధరియించినవాఁడా! ధరారి మౌళి ధామ ధామ సత్పదా—ధరారి=ఇంద్రునియొక్క, మౌళి=కిరీటము యొక్క,ధామ=కాంతికి,ధామ=స్థానమగు,సత్పదా=మంచిచరణములుగలవాఁడా! పరాపరా=అవిద్యావ్యతిరిక్తుఁడగువాఁడా! పరాగ పూత భామ – పరాగ=చరణరేణువుచేత, పూత=పవిత్రమగు, భామ=అహల్యగలవాఁడా! భా మహోజ్జ్వల చ్ఛరాశరాశ రాజ దస్త్రసార – భా=కాంతిచేత, మహోజ్జ్వలత్=మిగులవెలుఁగుచున్న, శర=బాణములుగల, ఆశర=రక్కసులను, ఆశ= భక్షించునట్టి, రాజత్=ప్రకాశించుచున్న, అస్త్రసార=అస్త్రములయొక్క బలముగలవాఁడా! సారభేదనా—సాల=సాలవృక్షము లను, ఇచట రలల కభేదమని తెలియవలయును, భేదనా=భేదించినవాఁడా! దరాదరా – దర=పాంచజన్యమునందు, ఆదరా = ఆదరముగలవాఁడా! దరాన్వితౌఘతార – దరాన్విత=భయముపొందినవారియొక్క, ఓఘ=సమూహములను, తార= తరి యింపఁ జేయువాఁడా; తారకౌస్తుభా=ఉత్తమమైన కౌస్తుభరత్నముగలవాఁడా! పంచచామరవృత్తమునకు అప్పకవి లక్షణము:

‘జరజ్రజంబులుం గముం బొ◊సంగి తొమ్మిదింటిపై,
విరామ మొంది సత్కవు ల్స◊విస్తరంబు సేయఁగాఁ
బరాత్పరుండు మాధవుండు ◊బంచచామరంబునన్
బ్రరూఢగుంభనంబులందుఁ ◊బాడ నొప్పు ధాత్రిలోన్’

గద్యము: ఇది శ్రీమదనగోపాలప్రసాదసమాసాదితోభయభాషాకళాకళత్ర రేచర్లగోత్రపవిత్ర సురభిమల్లక్షమాపాలసత్పుత్ర కవిజనవిధేయ మాధవరాయప్రణీతం బైన చంద్రికాపరిణయంబను మహాప్రబంధంబునందుఁ బంచమాశ్వాసము.

గద్యము. ఇది శ్రీసతీరమణకరుణాసమాసాదితసర్వసౌభాగ్యభాగ్యనగరమహారాజ్యసంకలిత శ్రీజటప్రోలుసంస్థానప్రాజ్యసకలసామ్రాజ్య శ్రీ రేచర్లగోత్రపవిత్ర కవిజనగేయ శ్రీవేంకటజగన్నాథరాయసత్పుత్ర సత్సంప్రదాయ శ్రీసురభి వేంకటలక్ష్మణరాయ పరిపోష్య సరసవైదుష్య తదాస్థానతలమండిత శేషసదాశివపండిత విరచిత శరదాగమసమాఖ్యవ్యాఖ్యయందుఁ బంచమాశ్వాసము.