బైరాగి ఆధునిక ఆర్షకవి. ఆధునికులలో ప్రాచీనుడు, ప్రాచీనులలో ఆధునికుడు. బైరాగి ఉపనిషత్తులు లోతుగా చదివాడు. కేవలం చదవడంకాదు అవి అతడి భావనలో భాగమయిపోయాయి.
సెప్టెంబర్ 2025 బైరాగి ప్రత్యేక సంచిక
ఆధునిక తెలుగు సాహిత్యంలో ఆలూరి బైరాగిది ఒక విశిష్టమైన గొంతుక. తన సమకాలికులు భావ, అభ్యుదయ, విప్లవ కవితోద్యమాలలో పయనిస్తుండగా, బైరాగి ఆ మార్గాలకు భిన్నంగా, మానవ అస్తిత్వానికి సంబంధించిన జటిలమైన ప్రశ్నలను లోతుగా అన్వేషించాడు. ఆయన కవిత్వం సత్యం కోసం చేసే అన్వేషణ; ఆ మార్గంలో ఎదురయ్యే వేదన, ఆశ, నిరాశ, సంశయాల మధ్య జరిగే సంఘర్షణకు అక్షరరూపం. అయితే, బైరాగి కవిత్వం శూన్యవాదంలో ముగిసిపోదు. దానితో ముఖాముఖి తలపడుతుంది. సులభమైన సమాధానాలను తిరస్కరించి, సందేహాన్ని, శోకాన్ని నిర్భయంగా చిత్రించడం ద్వారా, ఆయన ఆ అన్వేషణలోనే ఒక జీవిత ప్రయోజనాన్ని కనుగొన్నాడు. ఆయనకు జీవితంపై అపారమైన ప్రేమ ఉంది, కానీ దానిలోని వ్యర్థత గురించి కూడా ఆయనకు పూర్తి స్పృహ ఉంది. ఆశ-నిరాశల మధ్య, అర్థ-అర్థరాహిత్యాల మధ్య ఉన్న ఈ సంఘర్షణే ఆయన రచనలలోని ఆకర్షణ, శక్తి. బైరాగిని కొంతమంది టి.ఎస్. ఎలియట్ అనుచరుడనో, శ్రీశ్రీని అనుకరించాడనో భావిస్తారు. కానీ నిజానికి, ఐజాక్ న్యూటన్ చెప్పినట్టు, ఆయన ఆ మహామహుల భుజస్కంధాలపై నిలబడటం వల్ల కాబోలు, శ్రీశ్రీ చూసిన మేరకన్నా మరింత దూరం చూడగలిగాడు. ఎలియట్ చూపిన అన్వేషణాపథంలో మరింత ముందుకు వెళ్ళగలిగాడు.
బైరాగి శతజయంతి సందర్భంగా, ఈ ప్రత్యేక సంచికలో శ్రీశ్రీ నుండి సమకాలీన రచయితల వరకు ఎందరో ప్రముఖులు బైరాగి సాహితీమూర్తిత్వాన్ని వివిధ కోణాల్లో ఆవిష్కరించిన రచనలను మీకందజేస్తున్నాము. ఆయన కవిత్వాన్ని, జీవన గమనాన్ని, తాత్విక చింతనను లోతుగా విశ్లేషిస్తూ రాసిన 50 వ్యాసాల సమాహారం ఇది. అలాగే, బైరాగి గీతాలకు మొట్టమొదటిసారిగా బాణీలు కూర్చి, ఎంపిక చేసిన పది గీతాలను గానరూపంలో యూట్యూబు వీడియోలుగా మీకు అందిస్తున్నాం. ఈ సంచిక రూపంలో బైరాగి అక్షర, నాద ప్రపంచంలోకి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. చదివి, విని ఈ సంచిక గురించి మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియజేయండి.
[అడిగిన వెంటనే ఎంతో శ్రమపడి ఈమాట ప్రత్యేక సంచికకోసం విపులంగా ప్రత్యేక వ్యాసాలు వ్రాసి పంపిన రచయితలు, రచయిత్రులు, కవిమిత్రులందరికీ అనేక ధన్యవాదాలు. పాత వ్యాసాలను పునర్ముద్రించుకోవడానికి అనుమతి ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు. పాత వ్యాసాలను సేకరించడంలో మాకు సహాయపడిన శ్రీనివాస్ పరుచూరిగారికి, బైరాగి గీతాలకు స్వరకల్పన కూర్చి, శ్రావ్యంగా పాడి, ఈమాటకు అందజేసిన ప్రశాంతి చోప్రాగారికి, వీడియోలకు, ప్రత్యేక సంచికకు బొమ్మలు గీసి ఇచ్చిన అన్వర్గారికి ప్రత్యేక ధన్యవాదాలు! — సం]
ఒక భాష ఏళ్ళ తరబడి, శతాబ్దాల తరబడి చేసిన తపస్సు వల్ల బైరాగి వంటి కవి పుడతాడు. ఈ మాట మా మాష్టారు పోతన్న గురించి అన్నారు. నేను బైరాగి గురించి అంటున్నాను. బహుశా బమ్మెర పోతన ఇరవై శతాబ్దంలో పుట్టి ఉంటే బైరాగి లాగా కవిత్వం రాసి ఉండేవాడు.
ఏ పదిహేడేళ్ల వయసులో బైరాగి పుస్తకం ముట్టుకున్నానో కానీ, ఇన్నేళ్ళుగా నాతో బైరాగి ప్రయాణిస్తూనే ఉన్నాడు. కవిత్వంలో ఉద్వేగంతో మునకలేస్తున్న రోజులనుంచీ, నిర్వేదంతో వదిలి వేసినప్పటి నుంచీ, ప్రపంచంలో నా స్థానం వెతుక్కుంటున్న రోజుల్లోనూ, కొన్ని సార్లు మరీ ముఖం కొట్టవచ్చినట్లు, మరికొన్ని సార్లు క్రీగంట కనిపిస్తూ, బైరాగి నా వెంటనే ఉన్నాడు. అమెరికాలో తెలుగు మనుషుల మధ్య ఉన్నా తెలుగులో ఆలోచన లేని రోజుల్లో కూడా బైరాగి తలపులోకి వచ్చేవాడు. తెలుగుకి అతీతంగా, విశ్వ మానవ గళంతో బైరాగి నా తోడుగా, నాకు తోడుగా ఉన్నాడు.
వికల విహగ కలకంఠ నినాదం
చిలుకుతోంది ఇలపై అవసాదం.
శ్లోకానికి స్వాగతశ్లోకంలా, ఘూకరవానికి లేదు విలంబం
“అందీ అందని నీ చేలాంచలముల విసరుల కొసగాలులతో నిర్మించిన నా నుడి నీ గుడిగా,” అని శ్రీశ్రీ కవితని స్మరిస్తే, బైరాగి, “కవి సమస్య,” లో అనేకానేక హేమ్లెట్లు, రాస్కల్నికోవ్ ల బాధని “విశ్వవ్యధా వారినిధి తటాన బహుభంగుల ఫేనోజ్వల, రుదనాకుల, క్షుభితోచ్చల తరంగాళి” గా ఆలాపించడానికి యత్నించి, “శబ్దాల అసమర్థత” ఎదురయి “కవితాకామిని చేలాంచలాల కొస విసురులు ఎప్పుడూ ఒక బారెడు దూరానే మాయమవడాన్ని” అనుభవిస్తాడు.
బైరాగి తలుపులు తెరుచుకుంటున్నది నరకంలోకి కాదు. అవేదనావృత జీవన వాస్తవికతలోంచి ఆశాస్వప్నసౌధానికి అతను ఆడుగులు కదుపుతుంటాడు. తుఫాను హోరులోంచి చావుబతుకు పోరులోంచి వెనుదిరగక మున్ముందుకు సాగే ధీరోదాత్తుల అడుగు జాడలను అన్వేషిస్తాడు.
బైరాగి కవిత్వ తత్త్వం కథల్లో కూడా ప్రతిబింబిస్తుంది. ఒక రకంగా అది ఆయన సాహిత్య తత్త్వం. తీవ్రమైన భావావేశం, మార్మిక పద చిత్రణ, ఆశానిరాశల ఊగిసలాట, మృత్యు స్పర్శ నీడలో దాక్కునే వాక్యాలు, అర్థమై కానట్లుండే కొన్ని ఇతివృత్తాలూ వెరసి బైరాగి కథలు.
బాటసారి తోటిది బాట
మన తోడుత పొడచిన ప్రొద్దు
మన వెనకే క్రుంకుతోంది
పగటి నొసటి పసిడిచెమ్మ నల్లనినేల నింకుతోంది
శాంతి సాగరోద్గత కౌస్తుభ! జయ,
జయ భవార్తవారుణ పలాశమా!
జయము కోటి శిశువుల ఆనందపు
ప్రోజ్వల ముక్తామ్లాన హాసమా!
లోకం నిరాశా నిస్పృహల్లో మునిగివున్నా కవి నిరాశావాది కాదు. వాటినుంచి ఎలా బయటపడాలో ఉద్బోధించగలడు, స్పష్టంగా ప్రకటించగలడు. అయితే అతని బాటని పాటించటానికి సాహసం కావాలి.
బైరాగి మూడు పదులు నిండక ముందు రాసిన ‘నూతిలో గొంతుకలు’, రిల్కే చివరి రోజుల్లో రాసిన ‘Sonnets to Orpheus’ — ఈ రెండు కావ్యాల్లో భావ తీవ్రత, తాత్విక గాఢత పెనవేసుకుపోయాయి. రిల్కే కావ్యానికి వచ్చిన అనువాదాలు అన్నీ ఇన్నీ కావు. అమెరికా సాహిత్య ప్రియుల్లో రిల్కే పేరు తెలియనివారు లేరు. మన బైరాగి పేరు తెలుగు ఎల్లలు దాటలేదు.
బైరాగిని తలచుకుంటే ‘నూతిలో గొంతుకలు’ వినిపిస్తాయి. చుట్టపు చూపుగా వచ్చి, అట్టేసేపు వుండని ‘ధూమకేతువు’ కనిపిస్తుంది. “రాయప్రోలు, విశ్వనాథ వంటి ధ్రువతారలేకాదు, శిష్ట్లా, నారాయణబాబు, బైరాగి వంటి నక్షత్రాలు కూడా సాహిత్య రోదసికి అలంకారాలే” అన్నాడు శ్రీశ్రీ.
ఆకాశపు కాసారంలో సూర్యుడు కెందామర
బ్రతుకు పూల ధూళి చిమ్మే పుడమి ఒక కెందామర
బైరాగిది కవితాశిల్పం కాదు. రచనాశిల్పం, కవితాశిల్పం ఏకదేశ పర్యాప్తమైన ఉక్తివైచిత్రిలో అంతర్లయిస్తుంది. రచనాశిల్పం ఆద్యంత హేలగా ఉండే కూర్పు. వాగర్థ సంపృక్త భావ బంధురమైన తీర్పు. దానికి కడలికెరటంలా ఆటుపోటులుండవు; ఆవిచ్ఛిన తైలధారగా ప్రవహించే సమతానిర్ఝరి అది. ఇందుకు ఆయన రచనలన్నీ ప్రత్యక్షరసాక్ష్యాలే.
అతని గొంతుక నూతిలోనుంచి కాదు, హేతిలోనుంచి వినబడింది. భీతిలేనివాడు, ఖ్యాతికోరనివాడు, నేతలను నమ్మనివాడు, భూతలాన్ని అకాలంలో వదిలేసి వెళ్ళగలిగినవాడు బైరాగి.
మేఘాల మోహాలు ముసురుకొను నీరేయి
వీడి క్రొమ్ముడి చెదిరి క్రమ్ముకొన్నవి కురులు
నల్లత్రాచుల వోలె ఒల్లమాలిన ఇరులు
చూపులందని పొరల చీల్చి మూగిన మరులు
నా గానం జ్వలితానలమైతే
నా ప్రాణం చలితానిలమైలే
కావి మాత్రమిస్తా నీకోసం
తావి తేనెమోస్తా నీకోసం
తానెందుకు రాసాడో, ఏమి రాసాడో, ఎవరి గురించి రాసాడో, తన సంశయాలేమిటో, తన తాత్త్విక భూమిక, తన విచారధార, అన్నింటినీ స్థిరంగా తెలిసినవాడు బైరాగి. జీవితకాలమంతా తన రచనల్లో ప్రస్ఫుటించినవాడు బైరాగి. భాషని, శైలిని, సంవిధానాన్ని నిర్దేశిత భావాల ప్రకటనకు సమర్థంగా ప్రయోగించినవాడు బైరాగి.
మహోజ్వలమైన కావ్యకాంతులు వెదజల్లిన దీపశిఖ అతను. అన్నిటా ఉన్నా దేన్నీ అంటని విరాగి. విషాద విషాన్ని పుక్కిట పట్టిన విశ్వయోగి బైరాగి. మానవతకు మకుటమైంది అతని కవిత! కవిగా బైరాగి చరితార్థుడు!
నలభయ్యేళ్ళ కిందట నా తొలియవ్వన కాలంలో నన్ను నేనూ, నా చుట్టూ ఉన్న వాళ్ళని అడిగిన ప్రశ్నలే, ఇప్పుడు ఈ విద్యార్థిని తనని తానూ, తను చుట్టూ ఉన్న వాళ్ళనీ అడుగుతోంది కదా?! ప్రశ్నలూ, వాటి స్వగతాలూ, విషాద యోగాలూ ఏం మారాయి?!
ఈ మార్పు కోసం పాడే ఆగమగీతి దాకా బైరాగి మనకి తోడుగా వస్తాడు.
శ్రీశ్రీ ప్రపంచం దీనుల, హీనుల ప్రపంచం; పతితుల, శ్రామికుల, బాధా సర్ప దష్టుల ప్రపంచం. బైరాగి ప్రపంచం అదికాదు; అది హామ్లెట్ల, రాస్కల్నికోవ్ల ప్రపంచం. వీళ్ళది ధర్మాధర్మాల సంశయం వల్ల కలిగిన మనఃక్లేశం, పాపపుణ్యాల విచికిత్సవల్ల కలిగిన హృదయ శోధన.
బైరాగి ఒక క్లిష్టప్రశ్న, ఒక నిగూఢ ప్రహేళిక, ఒక దుర్భేద్య పద్మవ్యూహం.
వేదన, సంశయం, మనిషిని పనికిమాలిన వానినిగా మార్చకూడదు. బాధకు, అన్యాయానికి, మనిషి కొంత కాలం తల ఒగ్గుతాడేమో కాని అంతకాలమూ కాదు. అతనిలోని మానవత్వం, అతనిలోని మనీషి మేల్కొంటాయి. నవమార్గానికై వెదుకుతాయి.
బైరాగి మన కవులు వ్రేళ్ళ మీద లెక్కపెట్టదగిన బహు కొద్దిమందిలో ఒకడు.
బైరాగి కవితలలో నైరాశ్యం, నిస్పృహ మౌలికమైన ఆవేశాలు. అయితే బైరాగి నైరాశ్యం మనసును క్రిందికి దిగలాగేది కాదు. అంతరాత్మను ఉర్రూతలూగించే ప్రభంజనం వంటిది.
చీకటి నీడల కవి బైరాగి గడ్డకట్టిన కారుచీకటి కాదు. ఉదయకాంతికి ముందటి పల్చటి చీకటి. “రాతిరికే హితుడు” కాదు, ప్రభాతానికి మరింత సన్నిహితుడు.
ఏ దశలోనైనా బైరాగి సామాజిక భావాలు స్ఫటికంలాగా విస్పష్టంగానూ, నిర్మలంగానూ ఉండేవి. అందుచేత అతని కవితలు చదివి ఆనందించటానికి అతని భావాలతో ఏకీభవించనవసరం లేకపోయేది. ఇది కవిలో చాలా అపూర్వమైన గుణం అనుకుంటాను.
బైరాగిది సమదృష్టి, సమన్వయ దృష్టి.
ఆకుల అంచులపై తుహినాన్ని తుడుస్తున్న సూర్యకిరణపు సువాసనను తెలుసుకోగల ఘ్రాణశక్తి.
ఎక్కడా దిక్కు తోచక, ఏ దారీ దొరక్క, అంధతమిస్రం వంటి ఈ ప్రపంచాన్ని ఎలా తరింపజెయ్యాలా అన్న పెనుభారాన్ని మోస్తూ కరుణతో ప్రేమతో కవిత్వం రాశాడు బైరాగి.
ఆంగ్ల సాహిత్యంలో ఫ్రాన్సిస్ థామ్సన్కు ఎంత ప్రత్యేక ప్రాముఖ్యం ఉందో బైరాగికి మన సాహిత్యంలో అంత ప్రాముఖ్యమూ ఉంది. “స్వర్గ భైరవం” (Hound of Heaven) గొప్ప గీతం అంటారు. ఆ స్వర్గ భైరవాన్నే నేను బైరాగిలో చూస్తాను.
బైరాగిపై బెంగాలీ కవి జీవనానంద్ దాస్ ప్రభావం ఉందని అంటారు. ప్రభావం అన్నది చాలా పెద్ద మాట. కానీ, స్వంత గొంతుక బైరాగికి ఉంది. ఆయన బాణీ ఎవరినీ అనుకరించినదీ, అనుసరించినదీ కాదని ఆయన కవిత్వంతో పరిచయం ఉన్నవారికి ఇట్టే తెలుస్తుంది.
అతడు ఆదిమ మానవుడి నుండి అత్యాధునిక మనీషి పర్యంతం మధ్య కాలంలో మానవాళిని వెంట తరుముతున్న నిరవధిక భ్రంశాన్ని సమగ్రంగా చిత్రీకరించాడు. అందువల్లనే అతడు కవులకు కవి. పూర్ణకవి.
ప్రత్యేక కంఠస్వరం ఆలూరి బైరాగిది. అది దేనికీ అనుకరణప్రాయం కాదు. ఆత్మవేదనను, ప్రపంచ బాధను సమానంగా పలికించిన కంఠస్వరం. ఆశ, నిరాశల అపురూప సమ్మేళనం. నిష్కల్మషమైన, ఆర్ద్రమైన, ప్రేమపూర్వకమైన, గాద్గదికమైన గొంతు.
సాంప్రదాయిక కవిత నుండి వచన కవితా వసుంధర మీదకు వచ్చిన బైరాగి అన్ని దారులూ చూపి, బ్రతుకులో నుంచి బ్రతుకుకు పరిస్థితులను మానవీయం చేయాలన్న తనదైన బాటనే తొక్కాడు.
బైరాగి కవిత్వం పార్శ్వాలను తడిమి చూడడం, ఆయనలోని సామాజిక, రాజకీయ, తాత్విక కోణాలను పరిశీలించడం, మరీ ముఖ్యంగా ఆయన ఉపయోగించిన పదబంధాలు, భాషా సౌరభాలు ఆస్వాదించడం, తాదాత్మ్యం చెందడం దాదాపు నాకు ఒక నిరంతర ప్రక్రియ. ఎప్పుడు ఆయన కవిత్వం తీసి చదివినా కొత్త దృశ్యాలు మనోఫలకం మీద ఆవిష్కృతమవుతాయి.
బైరాగి కథ చెప్పే తీరు విలక్షణంగా ఉంటుంది. ఎత్తుగడ ఎటు దారి తీస్తుందో చెప్పలేము. కథాలోకంలోకి, నాయకుడి మనసులోకి మనల్ని తొందరగా తీసుకువెళతాడు. చిన్న చిన్న వాక్యాలతో కథ వడిగా నడుస్తుంది. కీలక సన్నివేశాలలో అతని అద్భుత పదవిన్యాసం మనల్ని మైకంలా కమ్మేస్తుంది.
చేయి తిరిగిన మగ్గం నేత పనివాడు సున్నితంగా జరీ పోగుల్ని చీరల్లో నేసినట్టు తన కథల్లో బ్రతుకుని గురించీ, మనుషుల గురించీ సున్నితమైన, నిగూఢమైన భాష్యాలు చేశారాయన.
1950కి ముందే ఈ జీవితాలు ఉండటం, వాటిని ఒక తెలుగు రచయిత పట్టించుకోవడం, పట్టుకోవడం, మంచి పట్టున్న కథ రాయడం గొప్పవిషయం.
లోయల లోతుల్లోకి
తదేకంగా చూస్తూ…
ఒంటరి పిట్ట
బైరాగి సర్వాత్మనా కవి. అతని ఇంటి పేరు కవిత్వం. సశక్త, సముజ్జ్వల వాగ్విలాసుడు బైరాగి!
ఇందు కిరణ మృదు మంద చరణముల
నందన వన మకరంద తుహినముల
గంధ శ్వసన స్వచ్ఛంద వ్యజనముల
ఏ ఆనందము జాలువారునో
అదే కాంతి కలిగించుము దేవా!
జన జీవన జననీ! ప్రియ ధరణీ!
ధరణీ! జననీ!
గోపీచంద్, బైరాగి ఇద్దరూ హేతువును ప్రశ్నించారు. కానీ గోపీచంద్ ఆధ్యాత్మికతలో ముగిశాడు. బైరాగికి మాత్రం ఫుల్స్టాప్ లేదు.
బైరాగి కవి, కథ రచయితగా ఒక గంట జీవితం కథలో మనిషి మనసు చేసే గారడీలను తెలియజేసాడు. అనుక్షణం మనసు స్పందనలు, ప్రతిస్పందనలు ఎలా మార్పు చెందేది ఈ కథలో మనకు చూపిస్తాడు.
బైరాగి కవిత్వోపాసకుల్లో బహుశా anthropophagic సహదేవుని అంశ ఉంటుందేమో అనిపిస్తుంటుంది. మరొక పోలిక చెప్పాలంటే, Ray Bradbury నవల ‘Fahrenheit 451’ లో ‘బుక్ పీపుల్’ ఉంటారు, తమని తాము పుస్తకాలుగా మార్చేసుకునే ఒక రహస్య కూటమి.
దివ్యభవనం పరిచయంలో బైరాగి అడుగడుగునా కన్పిస్తాడు. సామాజిక జీవన వ్యవస్థతోపాటు, మానవ మనస్తత్వ విశ్లేషణ ప్రతి కథలో కన్పిస్తుంది. అంతర్లీనంగా ప్రధాన పాత్రలో బైరాగి సాక్షాత్కరిస్తాడు.
రెండు ప్రత్యేకాంశాలు బైరాగి కవిత్వంలో కానవస్తాయి. ఒకటి, అతని పద — సమాస — వాక్య నిర్మాణ శైలి. రెండు, ఆశ్చర్యకరమైన కల్పనాశక్తి. భాషలోని శబ్దాలు తన వ్యక్తీకరణకి చాలనప్పుడు ప్రతి గొప్ప కవీ తన భాషాసంపద (diction) తాను సృష్టించుకుంటాడు. అందుకు బైరాగి కవితే ఉదాహరణ.
చీకటి పడినది తల్లీ దీపం చూపవేలనే!
మాకై దీపం చూపవేలనే?
“నాకో నవల రాయాలనుంది, అందులో మన మేధావుల్నందర్నీ బట్టబయలు చెయ్యాల్నుంది,” అంటూ బైరాగి ఆవేశంతో మాట్లాడుతున్నాడు. బైరాగితో చెప్పాను, “అందరి మీదా నీది పైచేయి కావాలంటే కవిత్వం రాయి. అంతేకానీ, అందరిలాగా నవలలూ, కథలూ తలపెట్టకు,” అని.
తన జీవితం గురించి, తన భవిష్యత్తు గురించి బైరాగికి ఎటువంటి బెంగాలేదు. తనకుతానుగా ఎటువంటి గుర్తింపు కోరుకోలేదు. సన్మానాలు, సత్కారాలకు పూర్తిగా దూరం. చదువుకోవటం, మనసుకు తోచినది రాయటం, రాసింది కూడా వేగంగా అందరికీ చేరాలన్న కోరిక తక్కువే.
Grant me a grain of faith
And I’ll pulverize the hills
And throw out the tomato sun
and the pancake moon
And make a clean sweep of the sky
మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ:
నీ సంయోగపు వార్త విన్నతరి
నే నీ మృణ్మయావాసపుం గాసిన్ వీడుచు లేచి వచ్చెద