ఆధునిక ఆర్షకవి ఆదిమ బైరాగి

బైరాగి ఆగమ గీతి పుస్తకానికి ముందుమాట దేవులపల్లి కృష్ణశాస్త్రి రాశాడు. ఆ ముందుమాట శీర్షిక నా వాడు. అదేమిటో చిత్రం! బైరాగి ప్రతి పాఠకుడికి నా వాడు. దూరంగా ఊరవతల, తన కోసం తాను పాడుకుంటూ ఉండిన బైరాగిని ప్రతి ఒక్కడూ అతడు తనకోసమే రాశాడు, అతడు తనకు సొంతం అనుకోడం ఆశ్చర్యం! అతని ఆత్మీయత ఏమిటో తెలుసుకోవడం మన ధర్మం. నేను బైరాగిని ఇటీవలే చదవడం మొదలుపెట్టాను. సమగ్రంగా చదివానని కాని, చదవగలనని కాని అనుకోవడంలేదు. (వయోధర్మం ఒక కారణం.) బైరాగి పై ఒక సమర్థ సమగ్ర వ్యాఖ్య రావలసి ఉంది. అది మరెవరైనా చేయవలసినది. బైరాగి కవిత్వ పరిశీలనలోని ప్రధానాంశాలను నేను గుర్తించినవి మాత్రం ప్రస్తావిస్తాను, ప్రధానంగా ఆగమగీతి అన్న కవితలో.


అప్రస్తుతం

“న్యాయంగా ఏ కృతి అయినా దానికది భాష్యం. కావ్యం తనంతట తాను వెలువరించలేని అర్థాన్ని ఏ భాష్యకారుడూ వెలువరచలేడు. కావ్యం స్వతస్సిద్ధం. దానికి భాష్యకారుని చేయూత అనవసరం.” (బైరాగి “నూతిలో గొంతుకలు”: “తొలిపలుకు”.) అంతే కాదు, “భాష్యం అపరిణత బుద్ధులైన పాఠకులకు సహాయకారి కావచ్చు”, అని కూడా అన్నాడు. ఈ అభిప్రాయంతో ఏకీభవించడం అవసరం కాదు. బార్త్ (Death of the Author: Roland Barthes), డెరిడా (Derrida), ఫిష్ (Stanley Fish) ల వంటి వారి రచనల తర్వాత రచయిత నేనున్నాననడం కష్టం. ఖలీల్ జిబ్రాన్ సంతానాన్ని గురించి అన్నట్టే మనం రచయిత రచనలను గురించి అనవలసి ఉంటుంది: “నీ పిల్లలు నీ నుండి వచ్చారు, నీ వలన కాదు.” కావ్యానికి అర్థం చెప్పడం అసాధ్యం అన్నాడు ఎలియట్ (T.S. Eliot) కూడా. ఒకసారి ఎలియట్ ఆక్స్‌ఫర్డ్ విద్యార్థులకు ఒక ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్ళినపుడు, ఒక విద్యార్థి, “Lady! three white leopards sat under a juniper tree” (Ash Wednesday) అంటే ఏమిటి అర్థం అని అడిగాడు. ఎలియట్ చాలా ఓపిగ్గా వివరించాడు, “Lady! three leopards sat under a juniper tree” అని అదే చరణం అలానే చదివి. అదే ఎలియట్, తన కావ్యం (Wasteland) చివర కొంత నోట్స్ ఇచ్చాడు. అది చాలు అని కాదు. ఎలియట్ పై వచ్చినంత విమర్శ ఒక్క షేక్స్‌పియర్ పై తప్ప రాలేదు. ఆ విమర్శ, (Matthiessen, Helen Gardner వంటివారు చేసిన విమర్శ) లేకుంటే ఎలియట్ ఎప్పుడో విస్మృత ప్రపంచంలోకి వెళ్ళిపోయి ఉండేవాడు. James Joyce నవల యులిసిస్ (Ulysses) కూడా వ్యాఖ్యానిరపేక్షంగా చదవడం కష్టమే కాదు, దుస్సాధ్యం. ఎలియట్ పై వచ్చిన విమర్శ బైరాగి చదివి ఉండడు అనుకోను. [Helen Gardner ఎలియట్ పై రాసిన విమర్శగ్రంథం (The Art of T.S.Eliot) వెల ఈనాడు 25,000/-]

నేనన్నాను ఒకప్పుడు, “Literary Criticism is not on literature; it is literature”, అని. వ్యాఖ్య సాహిత్యసృష్టి. కనుక బైరాగి మీదగాని మరో రచయిత మీదగాని వ్యాఖ్య రాయడానికి రచయిత అనుమతి ఆమోదం అవసరం లేదు.

ఈ నాడు కావ్యాలకు వ్యాఖ్య ఎంతైనా అవసరం. బైరాగికి సంస్కృతపదప్రయోగము, సమాసగ్రథనము ఒక ప్రత్యేక పరిశీలనాంశం. ఆ పదాలకు, సంస్కృత సమాసాలకు, అర్థాలు కూడా చెప్పవలసిన అవసరం ఉంది. ఆధునిక తెలుగు సాహిత్యంలో అటువంటి కృషి జరగనే లేదు.

కావ్యవస్తువిచారణ: Archetypes

కావ్యాన్ని అనేకులు అనేకంగా నిర్వచించారు, కాని కావ్యవస్తువిచారణ అంతగా చేయలేదు అనిపిస్తుంది, ముఖ్యంగా భారతీయ ఆలంకారికులు. పాశ్చాత్య సాహిత్యంలో ఇటీవల ఈ విషయంగా కొంత చర్చ జరిగింది. ఫ్రై (Northrop Frye, Canadian critic) ఈ విషయమై రాసిన రెండు పుస్తకాలు ప్రసిద్ధమైనవి. ఒకటి, “The Archetypes of Literature”. రెండు, The Anatomy of Criticism. వీటిలో అతడు చెప్పిన ఒక విషయం, సమస్త ప్రపంచ సాహిత్యంలోను కనుపించే సాహిత్యవస్తువు మరణము, పునరుజ్జీవనము, అని. దీనిని మన భారతీయ పరిభాషలో ఒక ఋషి వాక్యంలో మరి కొంత వివరంగా, చెబితే, “అసతోమా సద్గమయ. తమసోమా జ్యోతిర్గమయ. మృత్యోర్మా అమృతంగమయ.” “చావడం” అనడాన్ని మనం కాలధర్మం అని కూడా అంటాం. తిరిగి పుట్టడం కూడా ఋతుచక్రంలోదే, వసంతం హేమంతం. అస్థికలలోనుండి తిరిగి అస్తిత్వం. “ఆగమగీతి”కి ఒక ఉపనామం ఇచ్చాడు. దానిని “సంచయనం” అన్నాడు. ఈ ఉపనామం మన చూపునుండి జారిపోగూడదు. ఈ పదం ఏ సందర్భంలో వాడతారో మనకు తెలుసు. కనుక తన కవితల్లో ప్రధానవస్తువు అస్థి-త్వంనుండి తిరిగి అస్తిత్వం, సూర్యాస్తమయం నుండి సూర్యోదయం. ఈ కవితలు ఆగమ(న)ము నుండి సంచయనము వరకు.

కళ్ళు పొడుచుకున్నా కనిపించడంలేదు అని ఆక్రోశించని మనిషి, చీకటి నీడలు తెలియని ఋషి “తమసోమా జ్యోతిర్గమయ”, అనడు. బైరాగి కవితలో ప్రధానం ఈ జ్యోతిర్గమనం. అతని “ఆగమగీతి” లోని అదే పేరు కల “ఆదిమగీతి”లోనే స్పష్టం.

“మానస యజన వాటికపై మరల నేడు
ముసురుతోంది సందేహాల మందేహాంధదేహచ్ఛాయ”

(మందేహులు నిత్యము ఉదయించే సూర్యుణ్ణి ఉదయించకుండా అడ్డగించే అసురులు. సంధ్యావందన సమయంలో గాయత్రిని జపిస్తే ఆ మంత్రశక్తి ఆ చీకటినీడలతో పోరాడి ఆ మందేహాంధకాసురులను సంహరిస్తుంది. తిరిగి తెల్లవారు సమయానికి అసురులు పునర్జీవితులై ప్రత్యక్షమవుతారు. ఇది తెగని పోరు. గాయత్రిని నిత్యము జపించవలసిందే “మందేహాంధదేహచ్ఛాయ” అడ్డు తొలగాలంటే)

ఈ కవిత ముగింపు కూడా ఈ ఉదయిస్తున్న సూర్యుడితో:

“ఉదయిస్తాడు…..నవమానవుడు…అతని వ్యోమమార్గంలో ఉల్కాధరప్రహరి తరణి.” (“ప్రహరి” లోని “హరి” విష్ణుసహస్రనామఫలశ్రుతిలోని సర్వప్రహరణాయుధుడా?)

ఈ చీకటితో పోరాటాన్ని, జ్యోతి కొరకు ఆరాటాన్ని ప్రపంచ సాహిత్యంలో ఒక మౌలిక కావ్యవస్తువు (archetype) అనవచ్చు. దీనికి అనుబంధమైన మరొక విషయం వెలుగులోకి పయనం అంటే చీకటినుండి పలాయనం. ఈ పలాయనం సమస్త సాహిత్యాన్ని ఆవరిస్తుంది.

భావకవులు ఊహాలోకాల్లోకి పలాయనం చేస్తారు:

“…away! for I will fly to thee…on the viewless wings of poesy…

Fade far away, dissolve, and quite forget
What thou among the leaves hast never known,
The weariness, the fever, and the fret
Here, where men sit and hear each other groan;
Where palsy shakes a few, sad, last gray hairs,
Where youth grows pale, and spectre-thin, and dies;
Where but to think is to be full of sorrow
And leaden-eyed despairs,
Where Beauty cannot keep her lustrous eyes,
Or new Love pine at them beyond to-morrow.”

(Keats: Ode to a Nightingale)

తెలుగు భావకవులలో ఇటువంటి పలాయనానికి ఉదాహరణలు కోకొల్లలు. ఈ పలాయనం తెలుగుకవులకు, లేక భావకవులందరికీ, సామాన్యం. అది (archetype) సాహిత్య జన్యుకణాలలోనే ఉన్నది. దీనిని గురించి మరింత విస్తారంగా పరిశీలించవలసి ఉంది. ఆ విషయానికి మళ్ళీ వద్దాం.

ఈ పలాయనం అందరిలో ఒకటిగా ఉండదు. ఒక కవికి ఆ పలాయనం అగ్నికిరీటం వైపుకైతే (“పదండి తోసుకు”), మరొక కవికి ముళ్ళకిరీటం వైపుకు, “శిలువ మోయలేనివాడు నవ్యజీవనార్హుడు కాడు” (ఆగమగీతి). శ్రీశ్రీని మరో ప్రపంచం పిలిచింది. అతడు వ్యవస్థలో మార్పు కావాలంటాడు. బైరాగి వ్యక్తిలో మార్పు కావాలంటాడు. “సంభవామి యుగేయుగే” అనే కృష్ణుడు; లేక

“వస్తున్నాడొస్తున్నాడరుదెంచక తప్పదతడు
జగతీవిషసారపాయి సంతతశూలాగ్రశాయి”

“శూలాగ్రాన్ని అధిష్టించి అనలహక్ అని ఖంగున మ్రోయగలవారెవరు?
దుర్బలరక్తమాంసాల్లోంచి పిండిన వజ్రఖండం వంటి విశ్వాసం
భ్రాతలఎడ వాసుకిబంధ సుదృఢమైన ప్రేమ పాశం
హిమాచలం వంటి దీక్ష నయాగరా వంటి కరుణ”

“దుర్బలరక్తమాంసాల్లోంచి పిండిన వజ్రఖండం వంటి విశ్వాసం” బక్కచిక్కిన సామాన్య మానవుడు, దధీచిలా తపశ్శక్తిచేత దుర్బలాస్థిని వజ్రఖండం వంటి ఆయుధంగా చేయగలిగిన అతిమానవుడు. అతడు ప్రేమతో కరుణతో నిండిన ఒక Superman (Übermensch).

దుర్బలమైన మానవుడి ఎముక ముక్క వజ్రఖండం కావలె. అటువంటి తపశ్శక్తియందు “విశ్వాసం” (“నాక్కొంచం నమ్మకం ఇవ్వండి”) కావలె అంటున్నాడు బైరాగి. ఈ నమ్మకాన్ని కీర్కెగాడ్ leap of faith అంటాడు. (కపి వారిధి దాటునా? దాటును.) శుష్కతర్కంతో సముద్రం శోషించదు. హెగెల్ హేతువాదం ఆగిపోయినచోట నమ్మకం పుడుతుంది.

సంభవామి యుగేయుగే అని జగతీవిషసారపాయి శూలాగ్రాన్ని అధిష్టించి వచ్చే నవమానవుడిని కలవరిస్తాడు బైరాగి. ఆ నవమానవుడు ప్రేమ కరుణలతో మలచిన వజ్రఖండం.

సంస్కృత సమాస భూయిష్ఠత

ఇక బైరాగి సంస్కృత సమాస భూయిష్ఠత. ఇది కేవలం హిందీ కవుల ప్రభావ ఫలితం అనవచ్చునా? అతని సంస్కృత సమాసాలలో ఆదిత్య అన్నట్టు తెలుగుతనం, మనకు పరిచయమైన “సుందరవధూ కదుష్ణపరీరంభముల రసింపను, ఇక నేను హసింపను” అని చెప్పిన తిలక్ వంటి సంస్కృతం తక్కువ. సమకాలిక హిందీ కవుల (దిన్‌కర్, నిరాలా, పంత్ మరి కొందరు) ప్రభావం కావచ్చు. బైరాగి హిందీలో తన ప్రధాన రచనలు చేసి ఉంటే అతనికి జాతీయకవిగా ఇంతకంటే ఎక్కువ గుర్తింపు ఉండేది.

ఆధునికత-సనాతనత్వం

మరో ముఖ్యవిషయం. బైరాగి రచనాకాలంలో ఆధునికతకు నిర్వచనం సనాతన ధర్మ వ్యతిరేకత, సనాతన సాహిత్య నిరసనం. “తాటాకుల” చప్పుళ్ళను ఈసడించడం, యజ్ఞాలు క్రతువులు ఆచారాలు బ్రాహ్మణ్యం, వీటిని తీవ్రంగా ప్రతిఘటించడం ఆనాటి, ఈనాటి ఆధునికత. బైరాగి భాష మాత్రమే కాదు, భావన కూడా సనాతనం. ఇది తప్పకుండా ఎలియట్ ప్రభావం అనవచ్చు. అతని కావ్యాల పేర్లతో రాసిన కవితల ప్రారంభంలోనే ఈ విషయం వాచ్యం. వాటిని వాచ్యార్థంలో గ్రహించరాదు, యజనవాటిక అంటే వైదికయజ్ఞశాల కాదు, అవి రూపకాలు, అని అనవచ్చు. అవును రూపకాలే. వాస్తవ యజ్ఞశాలకాదు. పైగా “యజనవాటిక” అనలేదు, “మానస యజనవాటిక” అంటున్నాడు. మనోభూమికపై జరుగుతున్న యజనం. అవును, ఇవి రూపకాలే కాని వాచ్యార్థంలో గ్రహించవలసినవి కావు. ఈ విషయం శంకరభాష్యం చెప్పడం లేదు, సాక్షాత్తు శ్రుతి (ఉపనిషత్తు) చెబుతోంది. “ఉషా వా అశ్వస్య మేధ్యస్య శిరః” (బలి ఇవ్వవలసిన అశ్వము యొక్క శిరము ఉష. బృహ. ఉప. 1.1.1.) దీన్ని వివరించాలంటే సూర్యోదయం అంటే వెలుగా, చీకటా అన్న ప్రశ్నకు, (“న తత్ర సూర్యో భాతి…” కఠ. ఉప.), ఇంకా చాలా వెనక్కు వెళ్ళాలి. (ఆసక్తి ఉన్న వారు నా Upanishads: insights into infinity చూడండి.) ఇప్పటికి ఇక్కడ సూర్యోదయం దగ్గర ఆగుదాం.

బైరాగి ఆధునిక ఆర్షకవి. “నేను ఆధునికులలో ప్రాచీనుణ్ణి, ప్రాచీనులలో ఆధునికుణ్ణి.” (ఎలియట్) బైరాగి ఉపనిషత్తులు లోతుగా చదివాడు. కేవలం చదవడంకాదు అవి అతడి భావనలో భాగమయిపోయాయి.

బైరాగి విశిష్టాద్వైతం

సాహిత్యంలో మరో మౌలిక కావ్యవస్తువు, బైరాగి భాషలోనే, “దేహాత్మల మిళితవాంఛల విశిష్టాద్వైతం” (మల్లెపూలు). బైరాగి విశిష్టాద్వైతం శ్రీవైష్ణవం కాదు. “పశువాంఛలో వసించు ఋషిని నేను.” (నా “అగ్నిమీళే” లోని కవిత “నైనం దహతి”). దేహాత్మల విరుద్ధాకర్షణలు మరొక నిత్య సాహిత్యవస్తువు: “Poor soul, the centre of my sinful earth” : (Shakespeare: Sonnet 146). బైరాగి విశిష్టాద్వైతం నీషే (Nietzsche) చెప్పిన బొందితో కైలాసం, సశరీరస్వర్గం: “The degree and nature of a man’s sensuality extends to the highest altitudes of his spirit.”(Beyond Good and Evil: 4.75) దేహం కోసం ఆత్మను, ఆత్మ కోసం దేహాన్ని వదలని విశిష్టాద్వైతం.

ఆగమగీతి అంటే ఏమిటి?

మళ్ళీ “ఆగమగీతి”కి వద్దాం. ఉపశీర్షిక “సంచయనం”. అసలు “ఆగమగీతి” లోని ఆగమం ఏమిటి? ఆగమము: 1. వేదము 2. అవ్యక్తంలో నుండి వ్యక్తంలోకి రావడం. పగలు రాగానే అన్ని వస్తువులు వ్యక్తమవుతాయి, కన్పిస్తాయి, రాత్రి రాగానే బ్రహ్మ నిదురించేటపుడు తిరిగి లయం (ప్రలీయంతే) అవుతాయి. (అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే। రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్తసంజ్ఞకే॥ 8.18. భగవద్గీత). “అహ్నః ఆగమః అహరాగమః….రాత్ర్యాగమే బ్రహ్మణః స్వాపకాలే.” (శం.భా). బైరాగి ఈ ఆగమదర్శనం కొరకు తహతహలాడాడు, అస్థిసంచయనం చేస్తూ.

అంటే బైరాగి కవితా ప్రయాణం అంతా అస్థిత్వం నుండి అస్తిత్వానికి. ఈ ప్రయాణాన్ని కూడా వర్ణించాడు బైరాగి మరో కవితలో:

“నీ గుండెల డమడమాల బండి మోత సద్దు మణగి”
(“క్షమించండి”)

ఈ డమడమాలబండి సాహిత్యంలో అక్కడక్కడా కనిపిస్తుంది, అయితే విభిన్న సందర్భాల్లో. “వేగన్‌లో కుదుపులతో, విసుగొచ్చింది.” జీవనశకటం (Pushkin: The Wagon). ఎర్రన హరివంశంలో కూడా గోకులం నుండి బృందావన ప్రయాణ సందర్భంలో ఈ బండి చప్పుడు మీద ఒక పద్యం ఉంది. కాని, ఇక్కడ మనం ఉపనిషత్తుకు వెళ్లాలి. “తద్యథాఽనః సుసమాహితముత్సర్జయానైతి, ఏవమేవాయం శారీర ఆత్మా ప్రాజ్ఞేనాత్మనాన్వారూఢ ఉత్సర్జన్యాతి, యత్రైతదూర్ధ్వోచ్ఛ్వాసీ భవతి”. (బృహ. ఉప. 4.3.35.)

“తత్తత్ర యథా లోకేఽనః శకటం (అనః అంటే శకటం) సుసమాహితం సుష్ఠు భృశం వా సమాహితం భాండోపస్కరణేన ఉలూఖల ముసల శూర్పపిఠరాదినా అన్నాద్యేన చ సంపన్నం సంభారేణ ఆక్రాంతమిత్యర్థః…” (శం. భా.) ప్రాణప్రయాణసమయంలో ప్రాణికి ఎగశ్వాస దిగశ్వాస (“ఊర్ధ్వోచ్ఛ్వాసీ భవతి”). దీనికి ఉపమానంగా ఉపనిషత్తు ఇంటి సరుకులు, బిందెలు గిన్నెలు డబ్బాలు, బరువును మోస్తున్న బండిని చెబుతున్నది. ఇది తన కవితలో అస్థిత్వం నుండి అస్తిత్వానికి ప్రయాణంగా ఊహించాడు ఔపనిషద బైరాగి.

మళ్ళీ మొదటికి వద్దాం.

“మానస యజన వాటికపై మరల నేడు
ముసురుతోంది సందేహాల మందేహాంధదేహచ్ఛాయ
ద్విధాదూషిత ద్వ్యాభా సహజాసుర మాయ.” (“ఆగమ”)

“ద్విధాదూషిత” అంటే ఈ చీకటికి రెండు కారణాలా? “ద్వ్యాభా” అంటే రెండు విధాలుగా భాసిస్తున్నదా? మందేహులు ఎవరు? “To be or not to be” అంటే నేను ఉండాలా పోవాలా అన్న సందేహం కాదు. ఈ సృష్టి ఉన్నదా లేదా అన్న సదసద్విచారణ కూడా. “అసద్వా ఇదమగ్ర ఆసీత్” అని కూడా అంటుంది ఉపనిషత్తు. అక్కడ “అగ్రే” అన్న పదానికి శంకరుడు “సృష్టికి పూర్వం” (“ప్రాగుత్పత్తేః”) అని భాష్యం చెప్పాడు. దానికి అనుబంధమే అవిద్య ఎవరిది అన్న ప్రశ్న. ఈ ప్రశ్నను శంకరుడు తన గీతాభాష్యంలో చమత్కారంగా సాగించాడు:

“సా అవిద్యా కస్యేతి. యస్య దృశ్యతే తస్యైవ. కస్య దృశ్యతే ఇతి. …ప్రశ్న నిరర్థకః. కథమ్? దృశ్యతే చేత్ అవిద్యా, తద్వన్తమపి పశ్యసి…న హి గోమతి ఉపలభ్యమానే “గావః కస్య” ఇతి ప్రశ్నః అర్థవాన్ భవతి.” (గీత. 13.2 శం. భా.) (“ఆ అవిద్య ఎవరిది? ఎవరిలో కనిపిస్తే వారిది. ఎవరిలో కనిపిస్తున్నది? అర్థంలేని ప్రశ్న. …అవిద్య ఎవరికుందో వాడు దాన్ని తొలగించుకుంటాడు. ఎవరికో కాదు, నాకే ఉంది. అయితే, నీకు అవిద్య తెలుసు, ఆ అవిద్య ఎవరికుందో కూడా తెలుసునన్న మాట!”)

ఇది “ద్విధాదూషిత” అంటే. ఇది బైరాగి సంశయప్రకటన. అవిద్య ఈశ్వరుడిదా జీవుడిదా? అది “సహజాసురమాయ”.

ఇక “ద్వ్యాభా”. “భ” అంటే ప్రకాశం. అదే ‘భ’ భ్రాంతి కూడా. సృష్టిని భాస అంటాం మనం. ఆ “భా”, ఆభాస. విభాతి అనుభాతి, అంటారు వేదాంతులు. “త్వమేవ భాంతమనుభాత్యేతత్సమస్తం జగత్” (దక్షిణామూర్తిస్తోత్రం: 4). వేదాంతులకు పగలు రాత్రి; రాత్రి పగలు. (“యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ | యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః|”) చీకటి వెలుగులకు ఒకటే మూలం. రెంటిని “భ” (“ద్వ్యాభా”.) అనవచ్చు. విజ్ఞానశాస్త్రవేత్తలు దానినే అంధరంధ్రం (Black Hole) అంటున్నారు. ఆ రంధ్రంలోకి వెలుగు వెళుతుంది, వస్తుంది. ఎత్తు వెళ్ళగలిగినవానికి సూర్యుడు చంద్రుడు, రెండు గోళాలూ, ఒకే సారి కనుపిస్తాయి. బైరాగి మానవుడి ప్రతినిధిగా ఆ ఎత్తుకై ఆరాటపడుతున్నాడు. “వస్తున్నాడొస్తున్నాడరుదెంచక తప్పదతడు.”

బైరాగి నా వాడు కూడా.