బైరాగి గీతాలకు గానరూపం: ఎంతెంతదూరం?

ఎంతెంత దూరం
ఎంతెంత దూరం
ఎంతెంత దూరమింక తమ్ముడూ
ఆలసిన బాట ఆకసం కేసి నిస్పృహగా చూస్తోంది
వెల్లికిలా పండుకొని మెల్లగా కాళ్ళు చాస్తోంది
జోగుతున్న దిక్కులు, ఆవులించే గహ్వరాలు
ఆలసిన గాలి మ్రోయలేని వాలుటాకుల మర్మరాలు
నడక కూడా కునుకుతోంది. రెప్పల కౌగిలి విడదు
ఎంత విసుగు, ఎంత వేసట. చిన్ని బ్రతుకులో ఇముడదు

ఎంతెంత దూరం
ఎంతెంత దూరం
ఎంతెంత దూరమింక తమ్ముడూ
“కోసెడు, కోసెడు దూరమోరి అన్నయా!”

మూడే మూడు మజిలీచట పుట్టుక, ప్రేమ, చావు
ఎంత సేపు నడచినా గడచిపోము బయలుదేరిన తావు
గతి ఉన్నది. ప్రగతి లేదు,
ముది పెదవిని లేదు పాట
తమ్ముడూ! ముమ్మాటికి చెబుతున్నా.
బాటసారి తోటిది బాట
మన తోడుత పొడచిన ప్రొద్దు
మన వెనకే క్రుంకుతోంది
పగటి నొసటి పసిడిచెమ్మ నల్లనినేల నింకుతోంది.

ఎంతెంత దూరం
ఎంతెంత దూరం
ఎంతెంత దూరమింక తమ్ముడూ
“కోసెడు కోసెడు దూర మోరి అన్నయా!”

ఎగురరాని ఎత్తుల మిన్ను
తిన్నగా తలపైనుంది
పాతాళపు అందని లోతు
కాళ్ళ క్రింద దాగి ఉంది
మిన్నుల నొసలు ముద్దిడుకొనిగా ఎగురలేము
మన్ను ప్రేవుల అట్టడుగుల లోతులంటగ చొరలేము
మధ్యమార్గపు మకిలి బ్రతుకు,
ఎత్తుల చరమ చేతన లేదు
సౌఖ్యాన్ని పోలిన మరుపు
లోతుల మరణయాతన లేదు

ఎంతెంత లోతు
ఎంతెంత లోతు
ఎంతెంత లోతులోరి తమ్ముడూ!
“అడ్డం బడితే గడ్డం లోతు కన్నయా”

బ్రతుకుటెంగిలి మెతుకు లేరుకొంటూ అలా పయనిస్తాం
చివరకు ప్రాత సర్క్యులర్‌లా చెత్తలోన శయనిస్తాం
డెడ్ లెటర్ వీపు మీద తిరిగి
దేశాల ముద్రలన్ని
దీర్ఘనిద్రకు ముందు నరునికి చిన్న చిన్న నిద్రలెన్ని
బాట అలసిపోయినపుడు మిన్ను మన్ను కలుస్తాయి.
మూతబడే రెప్పలకొరకు చరమద్వారం తెరుస్తాయి.

ఎంతెంత లోతు
ఎంతెంత లోతు
ఎంతెంత లోతులోరి తమ్ముడూ!
“అడ్డం బడితే గడ్డం లోతు కన్నయా!”