బైరాగి సర్వదా సజీవుడే

[ఈ వ్యాసం బైరాగి స్మృత్యర్థం తెలుగు వెలుగు పత్రికలో 1985 జూన్ సంచిక కోసం వ్రాయబడింది. దీన్ని మాకు అందజేసిన రచయిత వేలూరి వేంకటేశ్వర రావుగారికి మా కృతజ్ఞతలు — సం.]

“శబ్దాల అసమర్థత ప్రతి కవికీ ఏదో ఒక సందర్భంలో తట్టే వుంటుంది. కవితా కామిని చేలాంచలాల కొసవిసురులు ఎప్పుడూ ఒక బారెడు దూరానే మాయమైనట్టు అగుపిస్తాయి” అన్నాడు కవిత్వ తత్వవేది, కవీ అయిన బైరాగి. కానీ, కృష్ణశాస్త్రి గారి దృష్టిలో “బైరాగికి మాత్రం ఆ కొసవిసురులు దూరాన మాయమైనట్లు గాక, దగ్గిరగా వచ్చినప్పుడు అతనిని నిలువునా నిమిరి, అంతరంగాన్ని పలకరించేవి. బైరాగి మన కవులలో వ్రేళ్ళ మీద లెక్కపెట్టదగిన బహుకొద్ది మందిలో ఒకడు.”


చేతిరాతతో అమెరికాలో ప్రచురించబడిన తెలుగువెలుగు పత్రికలో బైరాగి స్మృత్యర్థం 1985లో జూన్ సంచికలో వచ్చిన వ్యాసం మొదటి పేజి

బైరాగి పూర్తి పేరు ఆలూరి బైరాగి చౌదరి. జననం 1925. కేవలం స్వయం కృషితో, తెలుగు, హిందీ, ఉర్దూ, బెంగాలీ, ఇంగ్లీషు భాషల్లో ప్రావీణ్యం సంపాదించాడు. 14వ ఏట బీహారు రాష్ట్ర హిందీ సాహిత్య సమ్మేళనంలో హిందీలో కవిత్వం వినిపించి బహుమతి పొందాడు. ఆ తరవాతే తెలుగు కవిత వైపు మొగ్గాడు.

బైరాగిని తలచుకుంటే ‘నూతిలో గొంతుకలు’ వినిపిస్తాయి. చుట్టపు చూపుగా వచ్చి, అట్టేసేపు వుండని ‘ధూమకేతువు’ కనిపిస్తుంది. “రాయప్రోలు, విశ్వనాథ వంటి ధ్రువతారలేకాదు, శిష్ట్లా, నారాయణబాబు, బైరాగి వంటి నక్షత్రాలు కూడా సాహిత్య రోదసికి అలంకారాలే” అన్నాడు శ్రీశ్రీ. “ఆంగ్ల సాహిత్యంలో ఫ్రాన్సిస్ థామ్సన్ కెంత ప్రాముఖ్యం వుందో బైరాగికి మన సాహిత్యంలో అంత ప్రాముఖ్యమూ వుంది. ‘స్వర్గ భైరవం” (HOUND OF HEAVEN) చాలా గొప్ప గీతం. ఆ స్వర్గ భైరవాన్నే నేను బైరాగిలో చూస్తాను-అని రాశాడు శ్రీశ్రీ.

చందమామలో చిన్న పిల్లల కోసం అనేక గేయ కథలు రాశారు బైరాగి. అవి ఎంత సులభ సుందరంగా వుండేవో, అంత గడుసుగా, ప్రౌఢంగా వుండేవి. మానవుడి సహజవేదనలో మథనపడి పూర్ణత్వాన్ని పొందిన కవిత ‘నూతిలో గొంతుకలు’. “నాక్కొంచెం నమ్మకమివ్వు” అన్నగేయం యిలా సాగిపోతుంది –

“నాక్కొంచెం నమ్మకమివ్వు!
కొండలు పిండి కాల్చేస్తాను
చితికిన టొమేటో లాంటి సూర్యుణ్ణి
ఆరిన అప్పడం లాంటి చంద్రుణ్ణి
ఆకాశపు ఎంగిలి పళ్ళెం లోంచి నెట్టేస్తాను!
నాదగు బాహుబంధనంలో ఈ విశాల బ్రహ్మాండాన్ని
చాపలా చుట్టేస్తాను …”

కృష్ణశాస్త్రి, పద్మరాజు మొదలయిన వాళ్ళ ప్రభావంతో బైరాగి 1965 వరకూ ‘మానవతావాది’ (ROYIST) గా కవిత్వం రాశాడు. తదుపరి విప్లవ రాజకీయాల వైపు మొగ్గాడు. ”నాక్కొంచెం నమ్మకమివ్వు” గేయాన్ని శ్రీశ్రీ ఆంగ్లీకరించాడు. శ్రీశ్రీ రాసిన ‘జగన్నాథుని రధచక్రాల’ని ఉర్దూలోకి బైరాగి అనువదించాడు. ఆ అనువాదం ఒక స్వతంత్రరచనలా సాగిపోయిందని శ్రీశ్రీయే అన్నాడు. ‘జనం గెలుస్తారు!’ గేయంలో-

“విప్లవానికి దొడ్డిగుమ్మంలేదు.
అన్నా అది పాలకులు, రాజస్యాలకులు తెరిచేదికాదు.
అమెరికాలో తిరిపెమెత్తుకొనేవారు,
ఆకలిగొన్న ప్రజల ఆర్తి తీర్చలేరు.
ఇన్నాళ్ళకు చెర తలుపులు తెరచినవారు,
దీనుల దారిద్ర్యపు చెర తలుపులు తీయలేరు.
భారతదేశమనే చెరతలుపులు తీయలేరు.
అవి తెరవవలసినవారు,
జన నాయకులైన మీరు”.


చేతిరాతతో అమెరికాలో ప్రచురించబడిన తెలుగువెలుగు పత్రికలో బైరాగి స్మృత్యర్థం 1985లో జూన్ సంచికలో వచ్చిన వ్యాసం రెండవ పేజి

బైరాగి రాసిన ‘చీకటి నీడలు’, ‘నూతిలో గొంతుకలు’, ‘ఆగమ గీతి’ కవితా సంపుటాలు అచ్చయ్యాయి. ‘కాంచన మృగం’ (నాటకం), ‘పాప పోయింది’ (నవల), ‘దివ్య భవనం’ (కథలు), బాలల గేయకథలు, ఎన్నో హిందీ, ఇంగ్లీషు రచనలు యింకా పుస్తక రూపంలో రాలేదు.

“మృత్యువుని చూసి కాదు నేను, జీవితాన్ని చూసి జంకుతున్నాను
హంతకుని కత్తి చూసి కాదు, కనుల ద్వేషం చూసి గొంకుతున్నాను
మనసు లోని క్రౌర్యం చూసి జంకుతున్నాను
నాకు చావులేదు
నేను మృత్యుంజయుణ్ణి
మానవుణ్ణి.”

అని బైరాగి చెప్పుకున్నాడు.

కవిగా బైరాగి సర్వదా సజీవుడే. 53 సంవత్సరాలు నిండీనిండక ముందే 1978లో బైరాగి స్వర్గస్థులైనాడు.

~ మహిత బొబ్బా సౌజన్యంతో~