అస్తిత్వవాద మహాకవి బైరాగి

అపరిచితుడు బైరాగి

1975 నుంచి 1982 దాకా, అభ్యుదయ కవి సోమసుందర్ దగ్గర అంతేవాసిత్వం చేసాను. ప్రఖ్యాతులు, ఇంకా కీర్తిని అందుకోని అనేకమంది సాహిత్యకారులు నిత్యమూ ప్రస్తావనలోకి వచ్చేవారు. ఆయన అనేక పుస్తకాలని, కవుల్ని వివరణాత్మకంగా పరిచయం చేసేవారు. అప్పట్లో ఆయన పుంఖానుపుంఖంగా సాహిత్య వ్యాసాలు రాసేవారు. ప్రతీ వారం ఏదో ఒక దిన పత్రికలో ఆయన వ్యాసం తప్పనిసరి. అయితే, ఆయన చాలా తక్కువగా ప్రస్తావించిన కవి బైరాగి. అలా అని ఆయనకి బైరాగి మీద సదభిప్రాయం లేదని అనుకోకూడదు. ఆయన తదనంతర కాలంలో బైరాగికి నివాళి అర్పిస్తూ ఇలా అన్నారు. చీకటి నీడలతోనే బైరాగిని కవిగా గుర్తించాను, ఇంతలో ఆరుద్ర కలిసాడు. బైరాగి కవిత్వం పై నీ అభిప్రాయం ఏమిటని అతన్నడిగాను. వెంటనే అతను ‘బైరాగి కవులకు కవి’ అనేసాడు. అతనేదో అందమైన అతిశయోక్తిని ఆరాధిస్తున్నాడులే అని సరిపెట్టుకున్నాను ఇప్పటికీ నా అభిప్రాయం అదే, బైరాగి అచ్చమైన కవి. కవి అనే పదమే సర్వ సంపూర్ణం. ఉపసర్గలూ, తోకలూ దానికి అవసరం లేదనే నా విశ్వాసం.”

“బైరాగికి మరణం లేదు అతని కవిత హృదయం అక్షరామ్నాయం అది నిదుర ఎరుగని జలపాతం సెలవడిగి వెళ్ళిపోదామనుకున్నా వీడలేని అమృత మందస్మితం.”

“అతడుత్త తెలుగు కవి! అతడుత్తాల భారత కవిత్వేందురేఖ! అతని కవిత్వం జాతి జీవితంలో సంలీనమయ్యే కాంతి కళిక. జాతిని మేలుకొలిపే క్రాంతి రేఖ!”

( వైరాగ్య రాగంలో మీటిన ఏక్‌తార: బైరాగి కవిత్వం, శరచ్చంద్రిక వ్యాస సంకలనం)

సిలబస్‌లో లేని కవి

మరి ఆయన సాంగత్యంలో నేను బైరాగిని ఎందుకు అధ్యయనం చేయలేదని ఆలోచిస్తే పలు కారణాలు కనిపిస్తాయి. బైరాగి ఎవరితోటీ ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపినవాడు కాదు. సాహిత్యలోకపు ఉద్యమాలతోటి, వివాదాలతోటి సంబంధం ఉన్నవాడు కాదు. ఐకాంతిక జీవితం గడిపినవాడు. విస్తారంగా రాసినవాడు కాదు.

“నాదాల నినాదాల వివాదాల బాణసంచాలు ప్రేల్చటానికి
రంగు రంగుల మతాబాలు కాల్చటానికి
చిలుకలాగు సూక్తులు పలకటానికి
శాక్రీన్ తేనె సోన లొలకటానికి
మహామహులకు అభినందన వందనలు తెలపటానికి
ఇష్టం లేని కృపణ ప్రశంసల తీయని విషం కలపటానికి
నేను మీ కవిని కాను”

అని తనకు తాను దూరంగా ఉంచుకున్నందువల్ల కావచ్చు.

బైరాగి ఏక్ తార, తిలక్ బాణీలో కచ్చేరీ!

భావ కవిత్వం నుంచి విడివడ్డ అభ్యుదయ కవిత్వ తొలిదశ కవుల్లో పురిపండా, శ్రీశ్రీ, నారాయణ బాబు, శిష్ట్లా, తిలక్ ప్రముఖులు. మలిదశలో సోమసుందర్, దాశరథి, ఆరుద్ర, బైరాగి, నయాగరా కవులు ముఖ్యులు అనేది చారిత్రక సత్యం.

కొందరు వ్యక్తీకరణలో , కొందరు భాషలో, మరికొందరు భావ ప్రకటనలో పూర్తిగా భావకవిత్వ ప్రభావం నుంచి బయటపడలేకపోయారు. దరిమిలా ప్రయత్నపూర్వకంగా తమ శైలిని, పద విన్యాసాన్ని, తమ ఆలోచనలకు అనుగుణంగా, వచన కవితా రూపంలోకి సర్దుబాటు చేసుకున్నారు. సంస్కృత భాషాభూయిష్టమైన పదాలు అత్యంత శక్తివంతంగా తెలుగు నుడికారంతో కలిపి ప్రయోగించినవాడు తొలితరం అభ్యుదయ కవి తిలక్. అంతే సమర్థతతో సంస్కృత పదాల్ని తన కవితల వ్యక్తీకరణలో ప్రయోగించినవాడు బైరాగి. నిజానికి నూతిలో గొంతుకలు, చీకటి నీడల్లో సంస్కృత భాషావిన్యాసం తక్కువే.

ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి.

ఆదిత్య కొర్రపాటి అన్నట్లు “ప్రతి ప్రతిభావంతుడైన కవికీ తనదైన dialect ఉంటుందని అనుకున్నా, బైరాగి భాషలోని సంస్కృతం పూర్తిగా క్లాసికల్ తెలుగు కావ్యాల సంస్కృతం కాదు. అలాగని సంస్కృత కావ్యాల లలిత మృదుల సంస్కృతమూ కాదు. ఆయన, హిందీ సాహిత్యంలో వాడే సంస్కృత పదాల కూర్పు వంటిది ఉపయోగించడం వల్లనూ, కఠిన శబ్దాలు – కర్ణపేయంగా అనిపించనివి – ఎన్నుకోవడం వల్లనూ పాఠకులు defamiliarization కి లోనవుతారు. పైగా, ఈ సంస్కృతం status-quoist కాదు. ‘Sanskrit cosmopolis’ (Sheldon Pollock) తాలూకు భాషా కాదు. ఆయన భాష సంస్కృతభాష లోనుంచి gothic, baroque లక్షణాల్ని వెలికి తీసి తయారుచేసుకున్న భాషనవచ్చు.” (ఆమిషాస్థుల పతనోన్ముఖ సేతువు: ‘The Visceral-Corporeal’, బైరాగి కవిత్వం, సారంగలో వ్యాసం)

తిలక్ అక్షరాలు ప్రేమాశ్వాసనలు — బైరాగి అక్షరాలు తాత్త్విక దీపికలు

తిలక్ అంటాడు కదా:

“నా అక్షరాలు కన్నీటిజడులలో తడిసే దయాపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు”

బైరాగి అక్షరాలు:

“సూక్ష్మగ్రాహ్య పారిజాత పరిమళాలు
దూరగ్రాహ్య సాగర నీర గభీర కలకలాలు
దుర్గ్రాహ్య దురూహ్య విపిన జటిల విటప పర్ణార్ణవ మర్మరాలు
యామినీ కోమల గర్భవాంఛావహ్ని స్నాత ధూప దీపితాఘ్రాణలు
ఏడు కడలుల కావలనున్న దీవిలోన పంచెవన్నెల రామచిలుక ప్రాణాలు
మూసిన దిక్కవాటాలు ఛేదించి దూసుకుపోయే వన్నెవన్నెల కిరణాల బాణాలు”

బైరాగి తన కవిత్వశక్తిమంతిత్వాన్ని ఇలా పరిచయం చేస్తాడు.

“లోకం చూశాను నేను, శోకం చూశాను నేను
లోకంలోన శోకంలోన, నాకం కూడా చూడకపోలేను నేను,
జీవిత మహిత జనక దుహిత స్వయంవర సమరంలోన
పినాకాన్ని తృణంలాగ త్రెంచిన నేను
మైనాకుని రెక్కలు ఉత్తరించి
గర్వోన్నత సర్వపర్వత శీర్ష శృంగాలను వంచిన నేను”

సుషమా విషమ వారిధిలోన దీవి వెదికే నావికుడను
తెల్లని కాగితాలకు మసి పూసే గారడీ ఇక చేయలేను
నేను మీ కవిని కాను”

బైరాగిపై టి. ఎస్. ఎలియట్ ప్రభావం

బైరాగి టి. ఎస్. ఎలియట్‌ను చాలా క్షుణ్ణంగా చదువుకున్నాడు. అస్తిత్వవాద పోకడలను సాధికారికంగా ఒంట పట్టించుకున్నాడు. వేస్ట్ ల్యాండ్, హాలోమెన్, లవ్ సాంగ్ ఆఫ్ ప్రుఫ్రాక్ బైరాగి కవిత్వానికి మార్గదర్శకాలుగా నిలిచాయనడం సైద్ధాంతిక భూమికను కూర్చాయని చెప్పడమే. ఎలియట్ రచనల్లో వలె, బైరాగి కవిత్వం నిండా వాస్తవ చిత్రణ, అధోజగత్సహోదరులతో మమేకత, దుర్భర జీవన క్లేశాల పరిశీలన, తిరుగుబాటు ధోరణి, తీవ్ర నిరాశ, బలమైన ఆశా దృక్పథం పదే పదే కనిపిస్తాయి.

ఎలియట్ తన రచనలో గ్రీకు పురాణ గాథల్ని, షేక్‌స్పియర్ రచనల్లోని ప్రఖ్యాత పాత్రల్ని, నేపథ్యాన్ని విరివిగా ఉపయోగించాడు. బైరాగి భారతీయ ఇతిహాసాలలోని పాత్రల్ని, షేక్‌స్పియర్ పాత్రలనే కాకుండా, దాస్తొయెవ్‌స్కీ నవలలోని పాత్రల సంవేదనను కూడా ప్రతిబింబించాడు.

సైద్ధాంతికంగా దీన జనుల పక్షపాతి. వామపక్ష ఆలోచనాపరుడు. తన కవిత్వంలో సంశయాత్మను, వేదనను, మానవ సంక్లిష్టతను పదచిత్ర సమాహారాలతో కళ్ళకు కట్టాడు.

సాధారణ మానవుడు తన సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి, శక్తిని సంపూర్ణంగా వినియోగించుకోవడానికి అవసరమైనది ‘తన మీద తనకి నమ్మకమే’ అని చాలా వివరంగా “నాక్కొంచెం నమ్మకమివ్వు” అనే కవితలో వ్యక్తం చేస్తాడు.

అజరామర కవిత్వాన్ని సృజించిన కవి బైరాగి

తానెందుకు రాసాడో, ఏమి రాసాడో, ఎవరి గురించి రాసాడో, తన సంశయాలేమిటో, తన తాత్త్విక భూమిక, తన విచారధార, అన్నింటినీ స్థిరంగా తెలిసినవాడు బైరాగి. జీవితకాలమంతా తన రచనల్లో ప్రస్ఫుటించినవాడు బైరాగి. భాషని, శైలిని, సంవిధానాన్ని నిర్దేశిత భావాల ప్రకటనకు సమర్థంగా ప్రయోగించినవాడు బైరాగి.

అజరామర కవిత్వాన్ని సృజించిన కవి బైరాగి.


ఇంద్రప్రసాద్

రచయిత ఇంద్రప్రసాద్ గురించి:

ఆవంత్స సోమసుందర్ అంతేవాసిగా సాహిత్యంతో ప్రారంభమయిన ఇంద్రప్రసాద్ గారి సాహిత్య ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. నడిచి వచ్చిన దారి (కవిత్వం 1993), కాలం సైకత తీరం (కవిత్వం 2023), మూడు పడవలు (కవిత్వం 2024) అనే సంకలనాలను ప్రచురించారు.

 ...