‘తెలుగు స్వతంత్ర’లో ‘నూతిలో గొంతుకలు’ ధారావాహికంగా ప్రచురితమవుతున్న రోజులు అవి. శ్రీ ఆలూరి బైరాగి చౌదరిని తొలిసారిగా చూశాను. తొలి చూపులోనే నన్ను ఆకర్షించాడు అతను. అంతర్ముఖుడైన మౌనిలా కనిపించాడు. అతనికి లోచూపు ఎక్కువని అప్పుడే గ్రహించాను. మా పరిచయం మైత్రిగా మారింది. అతని కవితలు కొన్ని వినిపించాడు. ఆస్పత్రిలో అడుగుపెట్టినట్లు నా మనస్సు అల్లకల్లోలమైంది. నా గీతాలు చూపించాను. అభినందించాడు.
ఆ తరువాత ఎన్నోసార్లు కలుసుకున్నాం. ముఖ్యంగా విజయవాడలో. ఏవేవో కబుర్లు, కవిత్వతత్వం, కవ్యాత్మ, జీవితం, బాధలు, వేధలు, అధోజగత్తు, ఆకలి, శోకం, సంకర సమాజం — ఇవే మా ముచ్చట్లకు మూలపదార్థాలు. చర్చించి చర్చించి ఏమీ చేయలేని అసమర్థుల్లా విడిపోయేవాళ్ళం. అయితే నేను కొంత ఆశావాదిని. భూగోళాన్నే పెకిలించి వేయగలనన్నంత పొగరు, ధీమా నాకు. అంతులేని ఆవేశం నాది ఆ రోజుల్లో. ఊహించలేనంత పొంగు. బైరాగిలోనూ పొంగు ఉంది. కాని ఆ పొంగు, పొంగి పొర్లేది కాదు. అది అతని అంతరాంతరాలలో తుకతుక ఉడుకుతున్న ఉద్వేగం. కోరలు చాచిన క్రూరసమాజాన్ని నుసి నుసి చేయాలన్నంత కసి. పగపట్టిన కోడె త్రాచులా నిరంతరం లోలోపల బుసల భుగభుగలు. ఈ ఉద్వేగాన్ని కవితా స్రవంతిగా ప్రవహింపజేశాడు బైరాగి.
బైరాగి మితభాషి. పదిమందితో పూసుకుని తిరగలేడు. సమాజంతో కలిసిపోలేదు. పరిస్థితులకు ‘అడ్జస్ట్’ కాలేదు. జీవితంతో రాజీపడలేదు. అందుకే అతడు పట్టుమని పదినాళ్ళు ఎక్కడా ఇమడలేకపోయాడు.
ఒక సంఘటన జ్ఞాపకం వస్తున్నది. ఒకసారి విజయవాడలో విశాలాంధ్ర ప్రచురణాలయం మేడ పైన సాహిత్యసభ జరుగుతున్నది. చాలామంది కవి మిత్రులు వచ్చారు. కవితా పఠనం జరిగింది. ఆ నాటి సభకు నేను అధ్యక్షుణ్ణి. సభ జరుగుతుండగా బైరాగి వచ్చాడు. ఒక మూలన కూర్చున్నాడు. నన్ను చూసి పలకరిస్తున్నట్లు మందహాసం చేశాడు. నాలో సంతోషం పెల్లుబికింది. వేదిక మీది నుంచి లేచి, ప్రముఖ కవి బైరాగి వచ్చాడని సభకు పరిచయం చేసి, అతను కవితాగానం చేస్తాడని ప్రకటించాను. అంతే, బైరాగి చివాలున లేచి సభ నుంచి నిష్క్రమించాడు. అందరూ తెల్లబోయి చూశారు. నాకు మనస్సు చివుక్కుమన్నది. సభానంతరం నేను చకచకా బయటికి వచ్చాను. బైరాగి గురించే నా ఆలోచన. దగ్గరలోనే ఒక కిళ్ళీ కొట్టు ముందు అతను కనిపించాడు. వెళ్ళి పలుకరించాను. తెనాలి నుంచి వచ్చానన్నాడు. సభలో పాల్గొనకుండా ఎందుకు వచ్చేశావని అడిగాను. అతను వెగటుగా నవ్వాడు. “ఏమిటా కవిత్వం? ఏమిటా మనుషులు?” అని బదులు చెప్పాడు. అంతే! బైరాగి ప్రవర్తన ఒక్కొక్కప్పుడు ఎంత విచిత్రంగా ఉంటుందో ఈ సంఘటన వల్ల ఊహించుకోవచ్చు.
నేను “ఆంధ్రప్రభ” దిన పత్రిక సంపాదక వర్గంలో ప్రవేశించిన తరువాత బైరాగి, వారం వారం పత్రికలో ఏదో వ్రాయడానికి అంగీకరించాడు. కాని అది ఎన్నాళ్ళో సాగలేదు. అంతే అతని ధోరణి. అంతలోనే అతని ‘మూడ్’ మారిపోతూ ఉంటుంది. ఎక్కడా నిలకడలేని మనిషి. అతనికి ఏ నాడూ స్థిమితిం లేదు. నా గీతాలు కొన్ని అడిగి తీసుకొని హిందీలోకి అనువదించాడు. మూలానికి వన్నె తెచ్చేలా ఉన్నాయి ఆ అనువాదాలు. అయితే అతను పకపకా నవ్వుతూ, అమితోత్సాహంతో ఏనాడూ కనిపించలేదు. చిరునవ్వు నవ్వినా, దాని వెనుక ఏదో చింత దోబూచులాడుతూ సాక్షాత్కరించేది. జీవితమంటే అతనికి ఏదో విరక్తి, వెగటు. ‘హిపోక్రసీ’ గూడుకట్టుకున్న సమాజం అంటే అతనికి అసహ్యం.
ఎంత పరిచయం ఉన్నా, బైరాగి నాకు సంపూర్ణంగా అవగతం కాలేదు. అతని అంతరంగం నాకు అంతుపట్టలేదు. అతని కావ్య శిల్పాన్ని పృథక్కరించి చెప్పగల ప్రజ్ఞ నాకు ఉన్నదని నేను అనుకోను. కాని ఒకటి మాత్రం నిజం. బైరాగిని గురించి, అతని కవిత్వాన్ని గురించి నాలో కొన్ని స్పష్టమైన అభిప్రాయాలు చోటుచేసుకున్నాయి.
బైరాగి ఒక భయపడిన మనిషి. ఘోరకాంతార మధ్యంలో క్రూరమృగ సందోహాల సందడికి భయవిచలితుడై, తోడులేక, నీడలేక, ఏకాకిగా ఆక్రోశించిన మనిషి. అతని కవితలు ‘నూతిలో గొంతుకలు’లోను, ‘చీకటి నీడలు’లోను, ఇతర అముద్రిత రచనలలోను, అన్నిటా ఈ ఆక్రందన అంతర్నిహితమై ఉంది. సమాజానికి ఎదురు నిలిచి, పోరాడి పోరాడి అలసిపోయి, అదృశ్యమయ్యేవారు కొందరు. నిర్వేదంతో నిరంతరాయంగా దిగంతాలు ప్రతిధ్వనించేలా నినదించి అస్తమించేవారు కొందరు. బైరాగి ఈ రెండవ కోవకు చెందినవాడు. అతని కవితలన్నీ ఆ నినాదతరంగాలే.
అతను ఎప్పుడూ జీవితంలో ఏదో పోగొట్టుకున్నవాడిలా కనిపిస్తాడు. ఏకాంతధ్వాంత గుహాంతరాళాలలో, దేనికోసమో అన్వేషిస్తున్నవాడిలా అగుపిస్తాడు. అతనికి కావలసింది దొరకలేదు. దొరికింది దక్కలేదు. అందుకే ఏదో నిరాశ, నిర్లిప్తత, అతృప్తి. ఆర్థిక పరిస్థితులా? జీవితంలో ఎదురైన క్లిష్టసమస్యలా? కలుషితమైన సామాజిక పరిసరాలా? ఇవి అందరికీ ఉంటాయికదా, అందరూ బైరాగిలా ఉండడంలేదే? అతనికెందుకు ఇంత నిరాశ, నిర్వేదం? చాలాసార్లు నాలో నేను వేసుకున్న ప్రశ్నలు ఇవి. చనువుకొద్దీ, చాపల్యం కొద్దీ ఒకసారి అతన్ని అడిగాను కూడా. అతను తర్జనితో ఏదో నిర్దేశిస్తూ తలపంకించాడు. అంతే, బదులు చెప్పలేదు.
నాకు అనిపించింది, ఏదో తెలియదుకాని, ఏదో తెలియని దెబ్బతిన్న మనిషి బైరాగి అని. ఏదో కర్కశమైన అదృశ్య హస్తం బైరాగి సుకుమార హృదయంపై పెద్దదెబ్బ కొట్టి ఉండవచ్చు. అది మానని గాయమై, ఎల్లప్పుడూ పెచ్చు రేగుతూ ఉండవచ్చు. అందుకే జీవితం పట్ల అతని దృక్పథం భిన్నమైంది. లయసందేహాల మధ్య నిరంతరం ఊగిపోయాడు. స్పష్టంగా ఒక గమ్యానికి “కమిట్” కాలేకపోయాడు. గాయపడిన ఆత్మ వేదన మాత్రం అతని గొంతునుండి విలక్షణమైన కవితగా జాలువారింది.
విపథులకు, విచలితులకు, పీడిత జనాళికి ప్రతినిధి బైరాగి. మానవాంతరాళ అగాధ కుహరాల్లో అంధశక్తులు జాగృతమై, చేసిన ఆక్రందన అతని కవిత. విపథగాముల విలయగానం అతని గీతాలలో అడుగడుగునా ప్రతిధ్వనిస్తుంది. పలుభాషలలో ప్రజ్ఞావంతుడై బహుముఖాల జీవితాన్ని దర్శించిన బైరాగి గొంతులో బ్రతుకులోని అపశ్రుతులన్నీ ఒక్కమాటు ఒక్క శ్రుతిగా పలుకుతాయి. విరధులైన మానవ మనోవ్యధల విలాపగానం అది. ఉజ్వల మానవతను ఉరితీస్తున్న సమాజాన్ని వ్రేలెత్తి చూపిన కవిత అతనిది!
చిత్రం ఏమిటంటే, బైరాగి, నేనూ పుట్టిన తేదీ, నెల ఒకటే– సెప్టెంబరు 5. సంవత్సరం మాత్రం వేరు. నాకంటే అతను రెండేండ్లు చిన్నవాడు. మా ఇరువురి అనుబంధానికి అది ఒక సహజ హేతువేమో! 1978 సెప్టెంబరు 9 న బైరాగి ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయాడన్న వార్త విన్నప్పుడు నా హృదయం వికలశకలమైంది. నా స్వహస్తాలతోనే ఆ విషాద వార్త వ్రాసి, పత్రికలో ప్రచురించవలసి వచ్చినందుకు అంతులేని దుఃఖం పొర్లి వచ్చింది. ఆ వార్త వ్రాసి ఆప్తమిత్రుడికి భాష్పాంజలి సమర్పించుకొన్నాను.
మహోజ్వలమైన కావ్యకాంతులు వెదజల్లిన దీపశిఖ అతను. అన్నిటా ఉన్నా దేన్నీ అంటని విరాగి. విషాద విషాన్ని పుక్కిట పట్టిన విశ్వయోగి బైరాగి. మానవతకు మకుటమైంది అతని కవిత! కవిగా బైరాగి చరితార్థుడు!