వైరాగ్య రాగంలో మీటిన ఏక్‌తార: బైరాగి కవిత్వం

తెల్లవారిందన్న స్పృహ లేకుండా గాఢంగా నిద్రపోతున్నప్పుడు పల్చని మబ్బు తెరల్ని చీల్చుకొని సూర్యకిరణాలు ముఖం మీద పడితే, త్రుళ్ళిపాటుతో మెలకువ వస్తుంది. సరిగ్గా అలాగే బైరాగి కవిత్వంలోకి మేలుకొన్నాడు; 1950కి పూర్వం తెలుగు పత్రికల్లో ఎప్పుడూ తన కవితల్ని ప్రచురించలేదు. నేరుగా తన తొలి కవితా సంపుటి చీకటి నీడలుతోనే నలుగురి కంటా పడ్డాడు. ఆ గ్రంథమే రుజువు చేసింది – అంతకుముందు ఎంత సాధనా, తపస్సూ అతనికున్నాయో!

బైరాగి నాకు మా గురుదేవుల ద్వారా సన్నిహితుడు. కృష్ణశాస్త్రిగారు హైదరాబాద్ విడిచిపెట్టక పూర్వం బైరాగి మకాం కృష్ణశాస్త్రిగారింట్లోనే! భోజనం నిద్రా అన్నీనూ. నేను హైదరాబాదు వెళితే వాళ్ళింటికి వెళ్ళడం తప్పనిసరి. పైగా 1956లో కాబోలు శ్రీ పోతుకూచి నవ్య సాహితీ సంస్థ ఆధ్వర్యంలో మా ఇద్దరికీ ఒకే వేదికపై సన్మానం చేశారు. ఆ సభకు కృష్ణశాస్త్రిగారే అధ్యక్షించారు. ఇదంతా చూస్తే ఆ సన్మానం వెనుక గురువుగారి కుట్ర ఉందేమోనని ఇదమిత్థంగా తేలని అనుమానం ఉంది నాకు. ఆ విధంగా కూడా బైరాగి నాకు ఆత్మీయుడయ్యాడు. ఐతే, అతడు నాకు సన్నిహితుడు కాకముందే నేనతన్ని కవిగా గుర్తించాను, ఆకస్మికంగా, విస్మయజనకంగా.

“ఊహకీ, వాస్తవానికీ, క్రియకీ, కదలికకీ మధ్య వ్యవధిలో నీడలు పడుతున్నాయి” అనే ఎలియట్ దర్శనంతో అతడు 1950లోనే అనుకుంటాను – సాహితీ లోకంలోకి చెంగున దూకి వచ్చాడు. తన చీకటి నీడలు విసిరాడు. ఆ తర్వాత కొద్దికాలానికే “తెలుగు స్వతంత్ర”లో నూతిలో గొంతుకలు ధారాపాతంగా సృజించాడు. అతని గొంతే వేరు. చీకటి నీడలులో శ్రీశ్రీ మార్కు మాత్రా ఛందస్సులే ఉన్నా – అయినా అతని గొంతే వేరు. కవిత్వపు తీరే వేరు! మహాప్రస్థానం మొదలు త్వమేవాహమ్ వరకు ఆధునిక కవులంతా తమ కావ్యాలకు సంస్కృత శీర్షికలు పెట్టేవారు. కాని బైరాగి తెలుగు పదాల సమాసంతో గొప్ప బొమ్మ కట్టాడు. ఒక నిరంతర క్లేశాన్నీ, జీవన సంక్షోభాన్నీ ప్రతిధ్వనించాడు.

బైరాగి కావ్య సంపుటాలు తెలుగులో రెండే వెలువడ్డాయి. గ్రంథస్థం కాని కవితలు కొన్ని వందలు ఉండిపోయాయి. పత్రికలలో ఉండిపోయిన కవితలను పరిశీలించడం సాధ్యం కాదు. నూతిలో గొంతుకల గురించి ఒక ప్రత్యేక విపుల సమాలోచన చేయవలసిన అవసరం ఉంది. అది ఎంత ఉత్తమ కావ్యమో అంతకు మించిన తాత్త్విక ఆధార భూమికతో దాని పరిశీలన సాగాలి. ఇక మిగిలింది అతని ప్రథమ కవితా సంపుటి. దానినే ఇక్కడ పరిశీలించుకోవడం అవసరం.

అచ్చమైన కవి

చీకటి నీడలుతోనే బైరాగిని కవిగా గుర్తించాను. ఇంతలో ఆరుద్ర కలిశాడు. బైరాగి కవిత్వంపై నీ అభిప్రాయమేమిటని అతన్ని అడిగాను. వెంటనే అతను “బైరాగి – కవులకు కవి” అనేశాడు. అతనేదో అందమైన అతిశయోక్తిని ఆరాధిస్తున్నాడులే అని సరిపెట్టుకున్నాను. ఇప్పటికీ నా అభిప్రాయం అదే: బైరాగి అచ్చమైన కవి. కవి అనే పదమే సర్వసంపూర్ణం. ఉపసర్గలూ, తోకలూ దానికవసరం లేదనే నా విశ్వాసం. బైరాగి చీకటి నీడలులో తొలి కవిత దీపావళి! అదే అతని చమత్కారం, అదే అతని యోచనా వైఖరి. అది పరిపాటిగా సాహిత్యంలోకి ఎక్కిన దీపావళి కాదు. వేదులవారి దీపావళి వంటిదీ కాదు; ప్రత్యేక సంచికల్లో దర్శనమిచ్చే మామూలు కవితల మూసకట్టు దీపావళీ కాదు.

అది ఆకాశాన్ని మండించే దీపావళి. పాతాళాన్ని తగలేసే దీపావళి. ప్రపంచం ప్రపంచమంతా ఒక నరకప్రాయంగా ఉండగా – ఇక నరకాసురుడ్ని వెదకడమెందుకని సవాలు చేసే దీపావళి. యుగఘంటానాదం పగిలిపోగా చీకటి శవసంగీతం విజృంభిస్తోంది. ఉన్మత్తుని స్వేచ్ఛాగీతం లాగుంది లోకం. ఆకలి తీరక ఎగబాకే కరువుపులి దీపావళి. కనక అభినవ లంకాదహనమొక్కటే శరణ్యమంటాడు బైరాగి. “ఈ రాత్రి గొడ్రాలు… ఆమె కడుపు నుంచి నెత్తుటి పిండంలా జారింది దీపావళి. గత సంస్కృతి చిహ్నాల కోసం అర్రులు చాస్తోంది.” ప్రళయవేదనా పంకిల ప్రపంచ పంకం మధ్య ప్రేమలు పొసగవని పసితనంలోనే తెలిసింది బైరాగికి. కనకనే బండరాళ్ళపై ఏ మొక్కలు నాటినా ఏం లాభమని సూటిగా అడుగుతాడు. మనసంతా చీకటితో, ఆకటితో పోరాడే అస్వతంత్ర సైనికులం. మనకు ఫలశ్రుతిలేదు.

వీర ప్రసవ వేదన

తాను పుట్టి పెరుగుతున్న కాలం ఒక యుగసంధిగా గుర్తించే కవితా చైతన్యం బైరాగికుంది. భూగర్భం ప్రజ్వలాగ్నులతో చలించిపోతోంది. తప్పనిసరిగా రాబోయే సంఘర్షణ త్రోవ కాచుకొని ఉంది. నూతనయుగ సంగీతం మనీషి మనస్సుకు ఉరిపోస్తోంది కాని, పురాణవ్యాధిలా పురాతన వ్యామోహం వదలకుండా పీడిస్తోంది. వర్తమాన గగనంలో జీర్ణజగతి కంఠశోషలూ – నవ్య ప్రగతి శంఖఘోషలూ ఆవరించాయి. నిశా “సభాంచలం”లో ఒక కొత్త తోకచుక్క యుగసంకేతంలా పొడిచింది. దాన్ని చూసి పిచ్చికుక్కలు మొర్రో మొర్రో అని ఏడుస్తున్నాయి. దరిద్రజనులు సైతం మొగాల మీద నవోదయ రక్తజ్యోతుల కాంతి కిరణాలు! ఈ జీవితరంగస్థలిపై సృష్టి ప్రళయం కలగలిసిపోగా, ఆకాశపు కనుకొలకులలో ఎరుపుజీరలు దర్శనమిస్తున్నాయి. ఒక ప్రక్క రాలిపడుతూన్న పండుటాకుల ఆర్తారావాలు, మరోప్రక్క మెత్తని చిగురుటాకుల కోలాహలం. అలాంటి గాఢరేఖలతో యుగసంధి దర్శనమిచ్చింది బైరాగికి!

విధ్వంస దేవతాశ్వం

చిరజర్జర జగత్ వృక్షమూలాన్ని కదిలించే పెనుతుఫాను రాబోతోందని కవిగా బైరాగి హృదయం జోస్యం చెప్పింది. చిరప్రసుప్త జీవితసాగరంలో రేగే తుఫాను, శతాబ్దాల సమాధిలో నిదురించే మృతజీవిత శవాలను వణికించే తుఫాను… ఉరుముల కంఠధ్వనితో గర్జిస్తూ- మెరుపుల కంటి వెలుగుతో వీక్షిస్తూ ఆగమించే తుఫాను!

ఈ తుఫాను ఎక్కడిది? “గౌతమబుద్ధుని హృదయం కరుణాంబుధి సముచ్ఛయం ఉప్పెనగా కప్పగా” పెల్లుబికింది. పాపతాపతప్త పృథ్వి శోకం చల్లారడానికే యిది పుట్టింది. ఈ భీషణ ధ్వంస లీలనుంచే నూత్న వసంతాంకురాలు పొడుచుకు రాగలవు. రేపటి సూర్యుడు అందరికోసం తరుణారుణ మధుకాంతుల జయమాలలు సంసిద్ధం చేస్తాడు. అదీ బైరాగి కవితా దర్శనం! అదే అతని కవితావేశం కూడా! “నిదురించిన ప్రపంచ గర్భంలో మేలుకొన్న ఆకలిలా పాపం మిణుకుమనే వీధిలాంతరు” నీడగా వేశ్యను గుర్తుపడతాడు కవి. ఆనందపు బేరగాళ్ళ కోసం గుండెదడలతో నిరీక్షించే ఆ దయనీయతపై కవికి అసహ్యమట! కారణం ఎంత చమత్కారంగా చెబుతాడో – అది ఆలోచనామృతమే! “నీ కుళ్ళిన అంతర్యం, నీ తళతళ మెరిసే బాహ్యం” అందుకే అతనికంత అసహ్యం. ఆ రూపజీవుల ఆకృతులు జీవితకారాగారంలో పెరిగిన జీవచ్ఛవాలు.

చారిత్రక జ్యోతి

ఏది చారిత్రక జ్యోతో బైరాగి విస్పష్టంగా గుర్తించాడు. అతని సంస్కారం, సాహితీ శిక్షణ, సంప్రదాయ మౌఢ్యాలకు లోనుగాని ప్రగతీ దర్శనం అతని చైతన్యాన్ని తీర్చిదిద్దాయి. విధ్వంసకవాద, అధివాస్తవికవాద, భావవాద ధోరణులన్నీ అతని కవితా హృదయానికి ఎక్కి వచ్చాయి. అతను సర్వవిధాలా ఆధునిక కవి. ఇరవైయవ శతాబ్ది భావుక హృదయానికి తప్ప అందని గడసరి పోకడలెన్నో అతనికి అవలీలగా సొంతమయ్యాయి.

“శ్రామికజన రక్తతైల పోషితమౌ
ప్రభు విలాస నృత్యోత్సవ
ప్రమత్త దీపికలు కావు.
సంస్కృతి బలిపీఠంపై
ఆత్మోత్సర్గపు దీపమాలలై
వెలిగిన మేధావుల జీవితాల
ఎర్రని ఒంటరి జ్యోతులు!!”

అని స్పష్టం చేస్తాడు. అవి ఆశా నిగూఢరశ్ములు, నవ్యపథ ప్రదర్శన జ్యోతులు! భవిష్యయుగ చోదకాలు. ఆధునిక కవిత్వానికి హేతువాదమే ప్రధాన ఆధారభూమి. నవ్య ఋషి చతుష్టయం చూపిన వెలుగుదారిలో ఆధునిక యోచన వివేచించగలుగుతుంది.

లోకవృత్తానుశీలనం ఆధునికతకు జీవలక్షణం. రసజ్ఞులెవరైనా తమ అసమ్మతి తెలిపినా – ఆధునిక కావ్యవస్తువులలో – సమాజపీడన, సంఘర్షణ, పెట్టుబడిదారీ దోపిడీ, సమరోన్మాదం, ఆకలి వంటివన్నీ సజీవంగా విజృంభిస్తూనే ఉంటాయి. బైరాగి ఆకలి అనే శీర్షికతో ఒక దీర్ఘకావ్యమే రచించాడు. పదిమంది కవులూ ఒకే ఇతివృత్తాన్ని స్వీకరించడం వల్లనే అది మైలపడిపోదు. ఒక కవికి వేరొక కవికి తన కవితను పిష్టపేషణంలా రూపొందిస్తేనే అరిష్టం! ప్రతీ కవీ తన కవితను విశిష్ట మూర్తిమంతంతో తీర్చిదిద్దితే – తన మౌలికత, విలువలు ధ్రువపడతాయి. ఈ దృష్ట్యా బైరాగి ఆకలి విశిష్టమైన రచన. అతని ప్రతి అభివ్యక్తీ ప్రత్యేక కాంతి కలది.

“లావావాహిని” వంటిది ఆకలి. ఆకొన్నవారి బుర్రలో అర్థరాత్రి అడవిజంతువుల హాహాకారం వినిపిస్తుందట! ఈ అనుభూతులన్నీ కవి స్వీయ హృదయానుభవాలనుంచి వచ్చినవే ననుకొనేటంత మనోహరాలు! అభివ్యక్తిలోని క్లిష్టత వల్ల, సంక్షిప్తత వల్ల, సార్వత్రికానుభూతులుగా ఉద్ధరించడం వల్ల! ఆకలికి మంచి చెడ్డలు లేవు. ఉచ్ఛనీచాలు లేవు. తన శిశువులను తానే చంపగలిగేంత కఠినంగా తల్లులను మారుస్తుంది. కాళిదాస మహాకవి చెప్పినట్లు ఆకలే లోకంలోని నేరాలన్నిటికీ కారణభూతం. దొంగల్ని ఆకలే రూపొందిస్తుంది. జీవిత పుష్పాన్ని లోపల్లోపల తొలిచే వేరుపురుగు ఆకలి.

బైరాగి దర్శనలో ఇంకా ఎలాంటిదీ ఆకలి?

“ఆకలి హక్షరముందు
పిడుగైనా వినిపించదు.
ఆకలి క్రమ్మిన కళ్ళకు
ప్రపంచమే కనిపించదు!”

అలాంటి భయంకరమైన ఆకలిని తీర్చలేని నాగరికత మనకెందుకు పొమ్మంటాడు ఆ కవి. పేదలను నిరుపేదలుగా మార్చే వ్యవస్థను పరిమార్చి తీరాలని అతను కంఠోక్తిగా పలికిన ఆక్రోశమది!

స్వప్న జగతీయాత్ర

21 కవితలతో కూర్చిన చీకటి నీడలు 75 పుటల చిన్న పుస్తకం. ఇది ప్రచురితమై ఏళ్ళు గడిచింది. నేటి సారస్వతులైన యువ మిత్రులు ఇటీవల నాకెన్నో లేఖలు వ్రాశారు. బైరాగి గురించి తెల్పమంటూ అడిగారు. యువ రచయితల పిపాసే నా ఈ వ్యాసరచనకు ప్రోత్సహించింది. యువ తరంగంలో గల కవితా దాహస్థాయికి దీటుగా గ్రంథ ప్రచురణ జరగడం లేదు. కవిత్వ ప్రచురణ జరగడం లేదు. ఈ దేశపు దురదృష్టమే అది.

కవితా రసజ్ఞులు స్వర్గీయ బెల్లంకొండ రాఘవరావుగారు ఒకసారి విజయవాడలో జరిగిన గోష్ఠిలో ఆధునిక కవిత్వం గురించి మాట్లాడుతూ – బైరాగి కవితాశకలాన్ని జ్ఞాపకం చేసుకొని – ఇలా వివరించారు: “పీడితులు తమ కడుపు మంటల్ని మౌనంగా వ్యక్తం చేస్తున్నారు. ఆ మౌనసందేశాలను కవి బాహ్యపరుస్తాడు. “మీరు ఉదయమే త్రాగబోయే టీకప్పులో ఈగగా పడి చస్తానేగాని – మీకా టీ దక్కనీయను’ అని బైరాగి ఎంతో రమ్యంగా చెప్పాడని వివరించారు. తన ప్రాణాల నొడ్డి అయినా ధనస్వామికి సుఖం లేకుండా చేస్తానన్నంత కార్పణ్యం పీడితులలో ఉండడం సహజం” అని వివరించారు శ్రీ రాఘవరావు. ఇలాంటి సునిశితత్వం ఎందరిలో ఉంది?

ఆయన్ని ఆకర్షించిన ఈ పాదం కడుపుమంట అనే కవితలోనిది. వెనుకటి తరానికి చెందిన సహృదయుని ఆకర్షించిన వాక్యాలివి:

“మీ హేమమానస పాత్రల్లో
మీ స్వప్నజగతీ యాత్రల్లో
మా అశ్రుధార నింపేస్తాం,
మీ బాటను జారుడు చేస్తాం.
పానకపు పుడకగా వస్తాం…
టీ కప్పులో ఈగై చస్తాం!
మా ప్రాణాలైనా విడుస్తాం…
మీ శాంతిని భగ్నం చేస్తాం.”

ప్రభువుల ప్రేమల కుళ్ళు వాసనలతో, మానవశ్రమ మ్రింగిన ప్రళయంగా, ఐశ్వర్యం మానవజాతిని చేసే వెటకారంగా నిలిచిన తాజ్మహల్ను పడగొట్టమంటూ కక్షాకంఠంతో రంకెవేస్తాడీ కవి. సౌందర్యోపాసనతో రసతుందిలమైన హృదయాలకు ఈ కేక రవ్వంత శూలపు పోటుగా తోచక మానదు. కాని కవి ధర్మాగ్రహం కూడా అక్షర సత్యంగా ప్రత్యక్షం కాకపోదు!

ఈ కవితా సంపుటిలోని “జీవితం” అనే దీర్ఘ కవిత ఉత్తమశ్రేణి కావ్యత్వాన్ని అందుకొన్న గొప్ప రచనలలో ఒకటి. 243 పాదాల దైర్ఘ్యం ఎంతమాత్రం కారణంకాదు. అది ప్రతిపద పరిపుష్టినీ, ప్రతిపాద సంతుష్టినీ సహృదయ పాఠకులకందిస్తూ చిరముద్రలు కల్పిస్తోంది. చెదిరిపోయిన సుఖస్వప్నాలను వెర్రిగా వెదుక్కుంటూ, బిక్కుబిక్కుమంటూ దిక్కు తెలియని చూపులు ప్రసరిస్తూ, సనాతన చరిత్ర శిధిలాలలో నిస్సహాయంగా అన్వేషించే దీనులనుద్దేశించిన ఈ కవిత – శిథిలీకృత సహస్రాబ్దాలనే ప్రతీకలుగా నిలుపుతుంది. “గడచిన గొప్పదనం ఒక కిరణం! మంచి పాటలోని ఒక చరణం?” అంటాడు బైరాగి. అతని కవితా వాణిలోని ఈ తీక్షణత చదువరి గుండెల్ని చుర్రుమనిపిస్తుంది. “అనంత జీవిత శూన్యంలో గాలి అలల అస్పష్టపు ఏడ్పుల”ను సైతం ఈ కవి వినగలడు, పట్టుకొని అందించగలడు; “ఉషా సుందరి చీర చెంగులో అలముకొన్న పరిమళ తరంగం వడగాడ్పుల్లో నశించి పోతుంటే” సమిష్టి దైన్యాన్ని వ్యష్టి ఆర్తారవంగా వినిపించగలడు బైరాగి! మన కట్టెదుట నిలచిన జీవితం ఎంత రౌద్రరసప్రధానంగా ఉందో, ఎంత అకటావికటంగా ఉందో, ఎంత విహ్వల దైన్యంతో కునారిల్లుతుందో బైరాగి వర్ణించిన జీవితం చదివితే తెలుస్తుంది. ఐతే ఒక వైపు చూడగలగటం మాత్రమే. ఈ దురదృష్టం వల్లనే వర్తమాన మేధావి జీవితం ఎన్నో ఆత్మవేదనల పాలవుతోంది. ఎంత నైరాశ్య పూరితమైనదైనా జీవితం ఒక్కటే ఆరాధ్యమైనది, జీవనార్హమైనదీ అని. ఆశావహదర్శనతో పురోగమించడమొక్కటే మార్గం! అనాసక్తితో జీవితాన్ని తిరస్కరించడం ఎంత మాత్రం వాంఛనీయం కాదు!

విషయదర్శనం బైరాగి కవిత్వాన్నే కాక జీవితాన్ని సైతం నిస్పృహాయుక్త అరాజకత్వంలో ముంచి వేసింది.

బైరాగి వైరాగ్యం

వెనక ఎప్పుడో మా గురువుగారు ఒక గొప్ప జోక్ చేశారు. అది 1943లోనని జ్ఞాపకం. “పిచ్చయ్యా, మీ తల్లితండ్రులు గొప్ప తెలివైన వాళ్ళోయ్! ఎంచి ఎంచి నీకు చక్కగా తగిన పేరు పెట్టారు!” అన్నారు. వెంటనే పిచ్చయ్య ఎంతో నిర్లిప్తంగా – “అవునండి నిజమే!” అని ఒప్పుకున్నాడు. ఆ పిచ్చయ్య బహుశా యిప్పటికీ అంత స్పోర్టివ్‌నెస్‌ను తీసుకొని సంతోషిస్తూనే ఉంటాడనుకుంటాను! సరిగ్గా అలాగే జరిగింది బైరాగి విషయంలో! తల్లి తండ్రులతనికి ఆ పేరు ఏ కారణాలవల్ల పెట్టనీయండి కాక! అతని వైరాగ్య జీవితానికి అది చక్కగా సరిపోయింది. జీవితంలో ఆర్థికంగా బలపడ్డానికి తగిన మంచి ఉద్యోగాలెన్నో అతన్ని వరించాయి. అలాంటి వాటన్నిటినీ అనాసక్తంగా తిరస్కరించాడు. యావద్భారతదేశ శ్రేణిలో, హిందీ సాహిత్యంలో గణనీయత పొందిన తెలుగు కవి బైరాగే! శ్రీ అరికపూడి రమేశ్ చౌదరి తర్వాత మన ప్రఖ్యాత ప్రతినిధి కూడా!

బైరాగి సర్వాత్మనా కవి. అతని ఇంటి పేరు కవిత్వం. సశక్త, సముజ్జ్వల వాగ్విలాసుడు బైరాగి! బైరాగి లేని ప్రస్తుతం, సోదరకవులకు శోకతరంగాలను మిగిల్చింది. అరాజకత్వం విధ్వంసం చేయగా అసంపూర్ణంగా ముగిసిపోయిన అపురూప మహాకావ్యం బైరాగి జీవితం! అదే మన స్మృతుల్ని వెలిగించే సజీవగీతం!

పరిదేవనా పరిష్వంగంలోంచి బైరాగి తృతీయ పరిణామం

శిరంలా ముడుచుకు పోయిన నా గదిలో, చిగురించని నా కుర్చీలో… పులకించని మ్రోడు మోకలవంటి మూసిన పుస్తకాల రాశులలో వసంతార్భటిని మేలుకొల్పుతున్న చైత్రద్రుమంలా ప్రవేశించాడు బైరాగి! వెర్రిగాలి పంకా నుంచి నేల వంకకీ, నేల మీంచి వేల పుస్తకాల మూతబడిన గుండెలలోనికీ యథేచ్ఛగా పచార్లు చేస్తోంది. ఆలోచనాతరంగాలు ఉత్తుంగమవుతున్నాయి. సుడిగుండాలు త్రిప్పుతున్నాయి. నేను రాకముందు నిర్జనారణ్యంలా నిలిచింది నా సరస్వతీ నిలయం… రాత్రంతా ఏకాంత స్వప్నలోకంలో కలవరించింది. ప్రత్యూషపవనాంకురాలతో జాగరించింది నా కార్యాలయం. కాంతినీ, గాలినీ ప్రసరింప జేసింది. అప్పుడు వచ్చి ఆశీనమైంది బైరాగి కవితా హృదయం నా మ్రోల! అజరామర వసంతంలా వచ్చి నా గదినీ, మదినీ ఆవేశించింది. అగాధాలను స్పర్శిస్తూ ప్రవేశించింది. అంతరాలను కదిలిస్తూ సందేశించింది. అప్పుడొక నవ్వునవ్వాడు బైరాగి! కొండల వెనుక సూర్యోదయంలా గండపాళికి అరుణిమలందించింది.

మొన్న మొన్న సంక్రాంతి నాటి రాత్రి ఏక్‌తార మీటుకుంటూ మంద్రగంభీరంగా పాడుకుంటూ నా స్వప్నవీధిలో సంచరించాడు బైరాగి. జీవన నైరాశ్యాలు మ్రోగించాడు, “మొన్న గడచిన సంక్రాంతికి – రంకు కలహం కాల్చె పల్లెను! ఏరు నిండెను ఎరుపు నెత్తుట – ఊరు ఊరే పొగచితికాడై!”- ఇంకా ఏమి పాడుదామనుకొన్నాడో – అకస్మాత్తుగా ఆపేసి, అదృశ్యమైపోయాడు! అవతలి సరిహద్దు నుంచీ అతని పాట మళ్ళీ ఎప్పటికీ తొంగి చూడదనిపించింది.

నైరాశ్యయాత్ర

“తాజ్మహల్ పడగొట్టండోయ్!” అంటూ ఉన్మత్త కైశికీ ఆలపిస్తూంటుందనిపించింది. చీకటి నీడల ముదిమి – చదునులనే స్పర్శిస్తుందనిపించింది. విషాదయోగం నుంచి ఎప్పటికీ తెప్పరిల్లని హృదయార్జునుడై అతని కవితాకంఠం నిలచిపోతుందనిపించింది. అస్త్రసన్యాసం చేస్తూ తిరోగమిస్తుందనిపించింది. అధ్వాన్న ధ్వాంతాలబడి నూతిలో గొంతుకలనే నిరంతరాయంగా వినిపిస్తూ ఉంటుందనిపించింది.

అవునా?! ఇంతలోనే ఇన్ని పరివేదనా పరిష్వంగాలనూ ఒక్క అదుటున విదళించి, ఆశారుణ శిఖరాల నధిరోహిస్తూ తృతీయ పరిణామాన్ని ఆవిష్కరించింది. ఈ నవ్యవసంత నిశాంతంలో నా గదిలో నిలచి బైరాగి దుందుభి పూరిస్తున్నట్లు గొంతెత్తాడు:

“ప్రాతర్గమ్య విహీనము
వాతానీతాప్తగంధ వైణిక గీతా
జ్ఞాతస్తోత్రము శీతభవాతపమీ
నైశయాత్ర వాంఛిత మిడుతన్!”

అని మంగళాశాసనం వినిపిస్తున్నాడు. తమోనిశాలోకాల కష్టనిష్ఠుర యాత్రలు గడిచివచ్చిన అలుపు సొలుపు లన్నిటినీ బుద్ధిపూర్వకంగా విస్మరిస్తున్నాడు. హృదయం నిండా ఆశానవోషస్సుషమలను సాంద్రతర మొనర్చుకుంటున్నాడు. పాఠకుడైన నా హృదయాన్ని అనునయింప పూనుకొన్నాడు! ఎంత ఔదార్యశేముషీ రోచిర్నివహమిది!

“ఉదయకాంతులతో తళతళలాడే గమ్యం ఎక్కడా కనిపించడం లేదు. గాలి మోసుకువస్తున్న పరిమళం మాత్రం సుదూరతీరాల వేణుగాన మాధుర్యాలను జ్ఞప్తి చేస్తోంది. మధురానుభూతులను జ్ఞప్తికి తెస్తోంది. చల్లదనం నుంచి పుట్టిన వెన్నెల వెలుగులతో నిశాయాత్ర మన కోర్కెలను తీర్చుగాత!…” అదీ కవి కనీసకోరిక. ఈ కోరికను రమ్యంగా అభివ్యక్తం చేయడానికి వినియుక్తమైన ఈ కందపద్యం నన్నయ్యగారి కాలమంత పాతదే! ఐతేనేం? అదే కొత్తశిల్ప విన్యాసంతో సంసిద్ధమైంది.

బైరాగి సంవిధానం

ప్రతిభావంతుడైన ఏ కవీ అభివ్యక్తవస్తువును వేరుగానూ, శిల్పసంవిధాన విరహితంగానూ ఎన్నడూ భావించడు. వస్తుశిల్పాలు ఓతప్రోతాలుగా, అవిభాజ్య భాగ్య రేఖలుగా ప్రతిష్ఠిస్తాడు. సిద్ధాంతం వేరూ ఆచరణ వేరుగానూ భావించేవారే వస్తువు వేరూ సంవిధానం వేరూ అనుకుంటారు. వస్తువు ప్రాణమైతే సంవిధానం శరీరం; ప్రాణంలేని శరీరం శవమైనట్లే శరీరంలేని ప్రాణం దయ్యమవుతుంది. రససిద్ధుడైన కవి హృదయం నుంచి వెలువడిన ప్రతి కవితావాక్కూ దానిదైన ప్రత్యేక సంవిధానంతోనే ఉద్భూతమవుతుంది.

నిరంతర అధ్యయనమూ, అభ్యాసమూ సాధకుని కవితా యాత్రకు ఉపాదేయాలు. తన్నుతాను అనిమిష జాగరూకతతో నిర్మించుకుంటూ పురోగమించినపుడే కవితాసిద్ధి! అప్పుడే రచనలోని మెళకువలు కరతలామలకాలవుతాయి. క్లిష్టగ్రంథులు విడిపోతూంటాయి. సహజోన్మీలనంగా సంవిధానం సంతరించబడుతుంది. ఆ కృషిలో దర్శనా నైశిత్యమూ పెంపొందుతుంది.

కవి వ్యక్తిత్వం చరమ నిర్ణాయకశక్తిగా స్వీయకవితా తేజస్సును ప్రకాశింపచేస్తుంది. వ్యక్తిత్వం అంటే ఆలోచనా విధానమూ, ధారణారీతి, జీవనదృక్పథమూ, వ్యుత్పన్నత, నైజ లక్షణమూ వంటివన్నీ కలగలిసిన సమగ్రరూపమే. అట్టి వ్యక్తిత్వమే (పర్సనాలిటీ) కవితా వస్తువును ఎన్నుకోవడంలోనూ, దానిని అభివ్యక్తం చేయడంలోనూ విశిష్ట ముద్రను సంధానిస్తుంది. ఐతే ఈ వ్యక్తిత్త్వం స్థాణువుకాదు; సంచలనశీలమే! నిత్యం పురోభివృద్ధి చెందుతూంటుంది. జ్ఞానార్జన, కవితాసాధనాదులు కవి చైతన్యాన్ని సంస్కరిస్తూంటాయి. అందువల్లనే ఏ కవీ నిన్న తాను రాసినట్లే నేడున్నూ రాసుకుంటూ పోవడం సాధ్యం కాదు. అధవా అలా వ్రాసుకుంటూ పోయేవాడు ప్రతిభావంతుడైన కవిగా గుర్తింపబడడు. నమూనాల ననుసరించి వస్తువును చేసుకుంటూ పోవడం యంత్రానికే సాధ్యం.

ఒక కవితకీ వేరొక కవితకీ ప్రధాన విభేదంగా గుర్తించగలిగిన లక్షణం సాధారణంగా సంవిధానం పైనే ఆధారపడుతుంది. సంవిధానంలోని భాగమే అభివ్యక్తి. మార్పును సాధించుకోగలిగేదీ, కవిత్వ సంపద విషయంలో వృద్ధిక్షయాలు ద్యోతకం చేసేదీ సంవిధానమే! కనకనే కవులు సంవిధానం గురించి ఉదాసీనత వహించడం దోషమే! అంతమాత్రంలో సంవిధానానికి విపరీత ప్రాధాన్యత కలిగించడమూ అంతే దోషం. మేస్సింజర్ అనే కవి, సంవిధానానికి అతి ప్రాధాన్యతనిచ్చేవారిని యిలా గేలిచేశాడు: “బలహీనంగా నిర్మించిన భవనానికి ఎంత గొప్ప రంగులు పూస్తే మాత్రం ఏం బలం ఏర్పడుతుంది?” సంవిధానం గురించిన విపరీత జాగరూకులు యిలాంటి అభిశంసలకు గురవుతుంటారని బైరాగికి తెలుసు. అందుకే అతను చెప్పదలచుకొన్న విషయాన్ని సాధ్యమైనంత అందంగానూ, అభినవంగానూ, ఆర్తిదాయకంగానూ చెప్పి మన హృదయాలలో చెరగని ముద్ర వేస్తాడు. శిల్పవిన్యాసానికి అతివేల ప్రాముఖ్యం ఈయడు.

జీవిత కుసుమానికి చింతాక్రిములు

“ఊహను వాస్తవంచేసి
వాస్తవాన్ని సుందర స్వప్నం చేసి
మేధకూ క్రియకూ మధ్య
ఆశయానికీ సంశయానికీ మధ్య
సాధనకూ సాధ్యానికీ మధ్యపడిన నీడలు తుడిచి”

వేస్తాడు బైరాగి. ఈ మహత్కార్యాన్ని సాధించడానికే కవిగా అతని వ్యక్తిత్వం తృతీయ పరిణామం పొందింది. తత్ఫలితంగానే తొలిరోజుల అరాజకత్వపు పితూరీలను పటాపంచలు చేసుకుంది. తనకు విశేష ప్రఖ్యాతి చేకూర్చిన “నూతిలో గొంతుకల” నాటి నైరాశ్య తిమిర లోకాలకు తెరదించింది. సామాజిక శ్రేయంకర ధాతువుల సమకూర్చుకుంది. ఆగమగీతాన్ని ఆయత్తపరచుకొంది.

“కుళ్ళిన సంఘనీతుల చెత్త, తొలి నెత్తుటి చెమట వాకలు పార – సాగుచేసిన బీడు నేడు పండుతున్నది బంగరుపంట!” అంటూ వాగ్దత్త వసుంధరా గాత్రంతో పులకించిపోతాడు. మన తరంలోని క్రాంతి కర్షకులింట పండుగ జరుపుకోవడం త్రిశుద్ధిగా ఆకాంక్షిస్తాడు. “ఇకపై చింతా క్రిముల బారిపడదు జీవిత కుసుమం!” అనే భరోసా అందిస్తాడు; “భావనలో సంశయభయదాకృతులు కలచలేవు!” అనీ నమ్మకమిస్తాడు.

సహజీవన పావన హర్షం

బైరాగి కవితలలో “వాగ్ధత్త వసుంధర” కావ్యస్థాయినందుకున్న ఉత్తమరచన. ఆశా వసుంధర జీవనాహ్వానం ప్రతి పదహృదయంలోనూ సాంద్రంగా నిక్షిప్తం చేశాడు కవి. రేపు బూచి కాదనీ, అనురాగార్హమైన అతిథి అనీ గాఢవిశ్వాసం కలిగిస్తూ సుందర భవిష్యత్తు నాశ్లేషిస్తాడు. అట్టి రేపులో-

“మనిషికీ మనిషికీ మధ్య సంఘర్షణ ఉండదింక
సహజీవన పావన హర్షం తప్ప!
మనిషికీ మనిషికీ మధ్య అమర్షం ఉండదింక
సహజ సులభస్నేహాకర్షణ తప్ప!”

అని వజ్రకంఠంతో గర్జిస్తాడు.

మిట్టపల్లాలేకంచేసి, మకిలిగుంటలు పూడ్చేసే శాస్త్రీయ సామ్యవాద విప్లవమనే బుల్ డోజర్ పురోగమనాన్ని కీర్తిస్తాడు. గాలిలాగ, నీరులాగ నేల కూడా అందరికీ చెందే వ్యవస్థ కోసం ఆహ్వానమందిస్తాడు. సొంత ఆస్తులు, కుచ్చితాలనూ, బొక్కసాల పీడకలలనూ పరిమార్చే వ్యవస్థ కోసం – తన తృతీయ పరిణామంలో సిద్ధ సంకల్పుడవుతాడు బైరాగి. అందమూ, ఆనందమూ కొద్దిమందికే హక్కుభుక్తమైన పురాణవ్యాధిగ్రస్త వ్యవస్థ అంతరించాలనీ, అన్నీ అందరివిగా ప్రవర్తించే శుభదినం రావాలనీ అనంత చరమ స్వప్నాలతోనే జీవనయాత్రను తుది మజిలీకి చేర్చాడు. ఆకలీ, చీకటి, అకాల మరణాలు జాతిజీవితం నుంచి శాశ్వతంగా నిష్క్రమించాలన్న అక్షయవాంఛతో అనుశ్వాస విడిచాడు. ఇదే దారుణ విషాద సన్నివేశం!

కవి వ్యక్తిని అనారోగ్యం తినవేస్తున్నా, హృదయంలో నిండి ఉన్న ఆశావాదం చెక్కు చెదరలేదు. అందుకే-

“ఉదయపు సూర్యుని ఉద్యోగాన్ని ఖాయపరిచాం
ఆకాశాన్ని అటకచేసి ఆనందపు నిచ్చెన వేశాం
సంద్రాలను స్నానాల తొట్లు చేశాం!”

అని ధీమాగా అనుశాసించగలుగుతాడు. ఆకాశం ఇప్పుడు అందుకోజాలని భయంకర శూన్యం కాదు. గ్రహచారాదులు బీభత్స సంకీర్ణమూ కాదు. స్వర్గ నరకాల సంక్లిష్టభీషణోగ్రమూ కాదు. అది భూమికి అటక వంటిది మాత్రమే! ఆధునిక విజ్ఞానశాస్త్రం సాధించిన వ్యోమనౌకల ద్వారా అది అచుంబిత స్థితిని కోల్పోయింది. ఊహ వాస్తవంగా మారింది. అదే కవి స్పృహ!

నిశాశ్మశానం

మానవ సమాజం ఇంతవరకూ సాధించిన సకల వ్యవస్థా స్వరూపాలలోనూ మానవానుబంధాలు కేవల ధనపాశ బంధాలుగానే కలుషితమైపోయాయి. అందుకే వివేకానందుని వంటి మహనీయ తత్త్వవేత్త సైతం “మానవ జాతి సర్వ వ్యవస్థలనూ ప్రయోగించి విఫలమైంది. సామ్యవాద వ్యవస్థలోనైనా చిరంతన శాంతి లభిస్తుందేమో ప్రయోగించి చూడడంలో తప్పులేదు” అని ఉద్ఘాటించాడు.

బైరాగి, కవిగా ఎంత కళాత్మక స్రష్టో, అంత గాఢ ప్రతిభుడైన ద్రష్ట. అందుకే “మనిషి మనసులో మమతా సస్యానికి పట్టుదలే చీడ!” అంటూ భవిష్యత్తు గురించి ధైర్యంగా ప్రకటిస్తాడు. స్త్రీ శీలాన్ని, పురుషుని పరువునీ, పసిపాపల ప్రాణాలనూ అమ్మే అంగడులన్నీ రేపు మూసివేయబడతాయని నమ్మకం కలిగిస్తాడు. పైగా, “భీషణ శోషణ యంత్రపు పండ్ల చక్రాల ముండ్లకంచెలు… అంకెల గారడీలతో పేదవాని కడుపు కొట్టే లంకాసురుల రహస్య సొరంగాలూ, మాయా సింహాసనాలూ” వగైరా కాపట్యాలనన్నిటినీ కూలత్రోస్తుంది భవిష్యత్తు! ఆ వసుంధరా వాగ్దానాన్ని కవితా కంఠస్ఫూర్తితో వినిపిస్తాడు బైరాగి. ప్రస్తుతం పుంజీకృతమై ఉన్న బూర్జువా వ్యవస్థ “దౌర్భాగ్య నాగరికతల నిశాశ్మశానం” లా తయారైంది. దానినిండా తోడేళ్ళు, గుంటనక్కలూను! రాజవీధులు, గగనమార్గాలలో బీభత్సం తప్పక అంతరిస్తుంది. ధనాశావ్యవస్థ సామ్రాజ్యవాదుల్నీ, యుద్ధోన్మాదుల్నీ, అమానుష నేరస్థుల్నీ పరిపోషిస్తుంది. మానవుని ఆయుర్దాయంపై పగబట్టే విషాయుధాల అధికోత్పత్తిపై ఆధారపడుతుంది. జీవితంపై మరణాన్ని నిఘాగా నిలుపుతోంది. అలా విపరీతంగా గుట్టలుపడ్డ ఆయుధాల్నీ “కరగబోసి పలుగులుగా, పారలుగా రూపొందిస్తుంది భవిష్యత్తు. సృజనాత్మక కృషికి సహకరిస్తుంది.” ట్యాంకులు, ట్రాక్టర్లుగా రూపమూ మార్చుకుంటాయి. విజ్ఞానానికీ, జ్ఞానానికీ స్వార్థపరులు కల్పించిన చెర విరగడవుతుంది.

ఒకే గానం, ఒకే ధ్యానం

మానవుల చిరవాంఛితాన్ని – కవిగా బైరాగి తన చరమ స్వప్నంగా మార్చుకున్నాడా అనిపిస్తుంది. స్వీయ స్వప్నాన్నే “వాగ్ధత్త వసుంధర”గా పరివర్తింపజేశాడు. ఐతే ఈ స్వప్నం కేవలం ఊహపై, ఉత్త ఆశపై ఆధారపడ్డది కాదు. సామాజిక పరివర్తనాన్ని శాస్త్రీయంగా సాధించగలిగినదే. అందుకే అతనంటాడు: “మన జాతి ఒకే ప్రాణం, ఒకే గానం, ఒకే ధ్యానం, మానవులంతా సమానం”! అదే అతని స్వాప్నిక ప్రసవంలో ప్రధాన పరిమళం! “న్యాయం తూచే త్రాసు తప్ప వేరే రాజులేడు. యథాశక్తి శ్రమచేస్తాం. యథాభక్తి అనుభవిస్తాం. వృధా కాదు చేసిన శ్రమ… చెలిమిలోనే జనుల కలిమి” అంటూ తన స్వప్నహృదయాన్ని విప్పుతాడు.

కవిత్వమంటే ఏమిటి? పూర్ణ జాగృతిలో స్వప్నించడం తప్ప! బైరాగి స్వయంగా ఇలా చెప్పుకున్నాడు: “స్వయంగా ఏ కృతి అయినా దానికదే భాష్యం. కావ్యం తనంతట తాను వెలువరచలేని అర్థాన్ని ఏ భాష్యకారుడూ వెలువరించలేడు. కావ్యం స్వతస్సిద్ధం. దానికి భాష్యకారుని చేయూత అనవసరం. పోతే భాష్యకారుడు అపరిణత బుద్ధులైన పాఠకులకు సహకారి కావచ్చు. సాధారణార్థాలను బోధించవచ్చు,” అంటూ తన నూతిలో గొంతుకలుకు తొలిపలుకు రాసుకున్నాడు. ఆ కావ్యమే సంశయకావ్యం, దాని తొలిపలుకులోనూ సంశయం లేకపోలేదు.

తనంత తాను కావ్యం అంతస్సారాన్ని అభివ్యక్తం చేయలేకపోతే నిజంగా వ్యర్థ ప్రయత్నమే. ఐతే కావ్యగత మసృణార్థాలు సహృదయ భాష్యకారునకు అందినంత సమగ్రంగా అపరిణత పాఠకులందరికీ అందకపోవడమూ సత్యమే. పాఠకుల భావుక కౌశలాన్ని పెంపొందింపచేసి, హార్దిక సునిశితత్వాన్ని మేల్కొల్పగల వ్యాఖ్యాతే ఉత్తమ విమర్శకుడు. అలాంటి ఉత్తమ విమర్శకుడి కోసం ప్రతి ఉత్తమ కావ్యమూ నిరీక్షిస్తుంది.

కవితా వ్యాఖ్యానం కవిత్వంలాగే కళాసంపన్నంగా ఉండాలా? అనే అధిక్షేపం ఇటీవల కొందరు అధికార విమర్శకుల నోళ్ళనుంచి బిగ్గరగా వెలువడుతోంది. నువ్వు చెప్పేదెంత సత్యమైనా, పాఠకుడ్ని రోగిగా భావించి పథ్యం లాగా అందిస్తావో – అది తప్పక వికటిస్తుంది. సగ్గుబియ్యం జావను పరమాన్నంగా మార్చి ఇస్తే తప్ప రోగి సైతం దరికి చేరనివ్వడు. నువ్వందించేదేదైనా మాధుర్యగుణంతో స్వాద్యం కాకపోతే ఖాద్యం కాబోదు. ఆ వ్రాత నీకు తప్ప ఎవరికీ కొరకాదు, అని అలాంటి అధికార విమర్శకులకు గట్టిగానే చెప్పక తప్పదు. ఆస్వాదయోగ్యం కానిది ఎంత సత్యమైనా పైత్యంగానే పరిగణింపబడుతుంది. ఆ సత్యం తెలిసినవారు కనకనే మార్క్స్, ఏంగెల్స్ మహాశయులు కమ్యూనిస్ట్ మేనిఫెస్టోను సైతం అంత కళామయంగా, రసావేశ సంసిద్ధం చేశారు. డబాయింపుల డమరుకనాదాలు విడిచి ఇప్పటికైనా ఈ యథార్థం గుర్తించడం మంచిది.

కాంచన యుగం ఉదయిస్తోంది

“బానిసల నెత్తురు దోగి విరియబూసిన విభూతి ఉండదు. మునులను మోసే ఆసనమెక్కి శాసించదు బలిసిన బుర్ర మదం. బక్కచిక్కిన డొక్కలను వెక్కిరించదు బకాసురుని బొర్ర మదం… సైరంధ్రి జోలికి రాడు పీచమణిగిన కీచకుడు. చారిత్రక రాత్రిలోన కలలుగన్న కాంచనయుగం ఉదయిస్తోంది.”

రానున్నయుగం కాంచనయుగంగా ఎందువల్ల పేర్కొనబడుతోంది? మునులపై స్వారీచేసే రాక్షసులుండరు గనుక! సాధుజనులకు పరిత్రాణమందించే వ్యవస్థ ఆగమిస్తుంది కనుక! బకాసురులూ కీచకులూ నశిస్తారు కనుక! చిరదినాల ఇరుల పొరల నిరాశలకు మరణశాసనం లిఖించబడుతుంది కనుక! నరుడు కోరుకున్న ‘విడమర’కు (విశ్రాంతికి) చేరుకోగలడు కనుక! ద్రష్టలు, యుగస్రష్టలు సూచించిన మేరకు ఆగామిలో వాగ్దత్త వసుంధర దర్శనమిస్తుంది కనుక! బైరాగి స్వయంగా ద్రష్టయై వాగ్దత్త వసుంధరా స్వరూపాన్ని మన కనుల ముందు నిలుపుతున్నాడు. సర్వ సమగ్రంగా… సహృదయ హృదయ నివేదనంగా!….

బైరాగికి మరణంలేదు

ఉజ్జ్వలకవి బైరాగి కవిత్వం కోసం జన్మించినవాడు; కవిత్వంలోనే జీవించాడు. కవితా దాహంతోనే మరణించాడు. కవితానంద రోచిస్సులతో – రసహృదయ తమిస్రలను దూరీకరించాడు. అందుకే అతని పెదవులపై కవితల ఉదయకాంతులు, నిండు మనస్సుతో… నవనీత మంజుల భావ వీచికలతో… దారుణ అఖండ వాగ్ధారతో…. తానే ఒక వాగ్దత్త వసుంధరగా మారిపోయిన వాడు…. నితాంత శ్యామలమూర్తిగా నవనవలాడినవాడు.. కదిపితే చాలు పరిమళాలు కురిసే పూచిన కదంబంలా జీవించాడు!

అందుకే మళ్ళీ చెబుతున్నాను, బైరాగికి మరణం లేదు. అతని కవితాహృదయం అక్షరామ్నాయం! అది నిదుర ఎరుగని జలపాతం! సెలవడిగి వెళ్ళిపోదామనుకున్నా వీడలేని అమృత మందస్మితం…

అతని కన్నుల వెనుక బాష్పజలధులు, నీరవఘోషలు! విషాదమయ దరస్మేరాల ఆదర పూర్వక ఆహ్వానాలు.. జగన్మంగళ నీరాజనాలు! అందుకే చెబుతున్నాను, బైరాగికి మరణంరాదు. అతని కవితాగానం వీగిపోదు. అతని విశాలహృదయం – భాగీరథీ, గోదావరి, కావేరి నదుల సంగమస్థానం. అతని విరాగహృదయం నదీమాతృకల సమారాధ్య పులిన కేదారం!

అతడు ఉత్త తెలుగుకవి! అతడు ఉత్తాల భారత కవిత్వేందురేఖ! అతని తీవ్రోజ్జ్వల హృదయం తంద్రాలస బడబాగ్ని! జాగృత స్వప్నదావాగ్ని! అతని కవిత్వం జాతి జీవితంలో సంలీనమయ్యే కాంతి కళిక… జాతిని మేలుకొలిపే క్రాంతిరేఖ!


ఆవంత్స సోమసుందర్

రచయిత ఆవంత్స సోమసుందర్ గురించి:

ప్రముఖ తెలుగు కవి, విమర్శకుడు అయిన ఆవంత్స సోమసుందర్ (1924-2016) వజ్రాయుధం అన్న తమ కావ్యం ద్వారా సుప్రసిద్ధులు. కాహళి, రక్తాక్షి, మేఘరంజని, అనలకిరీటం వీరి ఇతర రచనలలో కొన్ని మాత్రమే.

 ...