చెప్పొద్దూ– డెభ్భైయ్యో దశకంలో గుంటూర్లో కాలేజ్ రోజుల్లో శ్రీశ్రీ ‘కవితా, ఓ కవితా!’ పదేపదే మననం చేసుకుంటూ, ఆ ‘చేలాంచలాల కొసమెరుపుల విసరిన రసవిసృమర’ పవనం ఝంఝామారుతంలా మనసుని అల్లకల్లోలం చేస్తుంటే, ఇంకా ఇంకా అలాంటి కవితారుతాల్నీ, మారుతాల్నీ ఆత్రంగా వెదుకుతున్నప్పుడు కనిపించిన వాటిలో బైరాగి “నూతిలో గొంతుకలు” కూడ ఒకటి — నారాయణబాబు “రుధిరజ్యోతి”లో “కపాలమోక్షం”, ఆరుద్ర “త్వమేవాహం”, సోమసుందర్ “వజ్రాయుధం”, కుందుర్తి “నగరంలో వాన”, రమణారెడ్డి “మహోదయం”, అజంతా “చెట్లు కూలుతున్న దృశ్యం”, తిలక్ “ప్రార్థన” లాటి వాటి మధ్య. అప్పట్లో వీటిలో చాలావాటిలోని శబ్దసౌందర్యానికి, భావబాహుళ్యానికి, ఎగిసిపడే ధారోద్ధృతికి కొట్టుకుపోయి ఆ ఆనందంలో తలమునకలు కావటం ఇప్పటికీ గుర్తుంది.
అయితే కొన్నాళ్ళ తర్వాత అది శబ్దసౌందర్యమా లేక ఆడంబరమా అనీ, భావబాహుళ్యతా లేక అక్లుప్తతా అనీ, ధారోద్ధృతి కాదేమో శబ్దశాసనతాలోపమేమో అనీ మెల్లగా అనుమానబీజాలు మొలకెత్తి గుబురులు వేసి విస్తరించటం కూడ నిజం. అయితే ‘కవితా, ఓ కవితా’ మాత్రం ఈ నాటికీ వన్నె తగ్గలేదు; మిగిలిన వాటిని ఆ తర్వాత మళ్ళీ చదవనూ లేదు. ఇలా ఇన్నాళ్ళకి “నూతిలో గొంతుకలు” మళ్లీ వినిపించినయ్. సరికొత్తగా కనిపించినయ్. అప్పుడు “నా కన్నవీ విన్నవీ” ఇవి.
కవినీ కాలాన్నీ వేరుచేయలేం.
1940-50ల్లో కొత్తదారుల్లో కవిత్వాన్ని కదిలించిన తెలుగు కవులు రెండవ ప్రపంచయుద్ధ కాలంలో పెరిగినవాళ్ళు. చాలామంది దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినవాళ్ళు. కాస్తో కూస్తో కళాశాల చదువులు చదివినా తీవ్ర నిరుద్యోగ పరిస్థితుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో బతికినవాళ్ళు. బహుశా (ఇది కేవలం నా ఊహే) వేరే చేసేదేం లేక యూరోపియన్ కవుల్ని, రచయితల్ని చదివి ఎంతో కొంత అర్థం చేసుకుని (కనీసం అర్థం అయిందనుకుని) వాళ్ళలో వాళ్ళు ఆవేశంగా చర్చించుకుని ఒకరిని మించి ఒకరు రాద్దామని ప్రయత్నాలు చేసినవాళ్ళు.
అలాటి పరిస్థితుల్లో దాదాపుగా వాళ్ళందరిమీదా కమ్యూనిజం భావాల ప్రభావం విస్తృతంగా పడటం ఆశ్చర్యం కలిగించకూడదు. అలాగే, ముఖ్యంగా జపాన్, యూరప్ ఎంత కష్టనష్టాల్ని చూశాయో ప్రత్యక్షంగా చూడకపోయినా, బహుశా రేడియోల్లో విరివిగా విని, వార్తాపత్రికల్లో చదివి, ప్రపంచమంతా తగలబడిపోతున్నదనీ, మానవజాతి భవిష్యత్తు అంధకారమయం కాబోతున్నదనీ, అలా జరక్కుండా చూడవలసిన బాధ్యత కవులుగా తమ మీద ఉన్నదనీ వాళ్ళు అనుకోవడంలో కూడా తప్పులేదు. నా ఉద్దేశ్యంలో ఇలాటి భావాల నుంచి వెలువడ్డవే మనకిప్పుడు కనిపించే ఆనాటి రచనలు. అందుకే భవిష్యత్తు మీద అపనమ్మకం, ధనిక దోపిడి వర్గాల మీద అక్షర దాడులు వీటిలో మనకు ధారాళంగా కనిపిస్తాయి.
బైరాగి రచనల్లో అందరూ ప్రముఖంగా చెప్పుకునేవి — నూతిలో గొంతుకలు, ఆగమగీతి. వీటిలో నూతిలో గొంతుకలు అతని ఉత్కృష్టరచనగా చాలామంది భావిస్తారు.
బైరాగి కవిత్వాన్ని గురించి గత యాభై ఏళ్ళలో ఎంతోమంది “పరిశోధనలు” చేసివుంటారనుకుంటాను, కాని నాకు అవేవీ అంతర్జాలంలో దొరకలేదు. సినారె తన పరిశోధనా గ్రంథంలో ఇలా అన్నాడు (పేజి 625):
“… ఈ కవులందరికన్న అధికముగా నిరాశావాద ధోరణిని ప్రదర్శించిన అతినవ్యకవి బైరాగి. ఈ కవి వ్రాసిన ‘నూతిలో గొంతుకలు’ నిరాశాధోరణికి దారిచూపు సంశయకావ్యము. … ఈ కావ్యముపై టి. ఎస్. ఎలియట్ ప్రభావము సాంద్రముగానున్నది. …. ఈ కావ్యము ప్రధానముగా ‘సంశయకావ్య’మైనను నైరాశ్యమును, నిస్పృహను, ఆందోళనను పుక్కిటబెట్టుకున్నది.”
ఇలాటి భవిష్యద్విమర్శనల్ని ముందుగా గుర్తించే బైరాగి తన “తొలిపలుకు”లో ఇలా అంటాడు:
“ఈ కావ్యంలో నేను అంటే కవి కాదు. నేటి మానవుని అనుభూతిలో అది కవి తాదాత్మ్యం. స్వీయబాధ వెలువరించటం కవి పరమావధి కాదు. ప్రపంచంతో ఏకమైన నాడే కవి కంఠం సరిగా పలుకగలుగుతుందని నా నమ్మకం. ప్రపంచానుభూతిలో స్వీయానుభూతి పరమైనపుడే ఉత్తమ కవిత ఉద్భవిస్తుందని నా విశ్వాసం.”
కనుక ఈ కావ్యంలో వ్యక్తమైంది తన బాధ కాదని, ప్రపంచబాధ అని కవి బాహాటంగా, ప్రస్ఫుటంగా వివరించాడు. పైన చెప్పినట్టు ఈ రచనా కాలంలో ప్రపంచంలో నిరాశా నిస్పృహలు ఆవరించి వున్నాయి; భవిష్యత్తు అగమ్యంగా, అంధకారబంధురంగా అనిపిస్తూ వుంది. అనేక దేశాల్లో వలసపాలనలు అంతమై స్వపరిపాలనలు వచ్చాయి. అయితే పశ్చిమ దేశాల ధనస్వామ్య భావాలూ మార్క్సిస్టు లెనినిస్టు మావోయిస్ట్ భావాలూ ఆధిపత్యం కోసం పొటీపడుతున్నాయి. ఇలాటి పరిస్థితుల్లో బుద్ధిజీవులు సంశయగ్రస్తులు కావటంలో ఆశ్చర్యం ఉండకూడదు. ధనస్వామ్య రాజ్యాల్లో మనుషుల మధ్య అసమానతల్ని, అనేకమందిపై కొద్దిమంది పెత్తనాన్ని ప్రత్యక్షంగా చూసిన, అనుభవించిన కవులూ కళాకారులూ చాలామంది తమకు అనుభవంలో లేని కమ్యూనిజాన్ని ఎంతో అందంగా ఊహించుకుని సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని, సమసమాజాన్ని సాధించే మార్గంగా భావించి గానించటం, కీర్తించటం కూడ ఊహించదగ్గ పరిణామాలే.
ఈ దృష్టితో చూస్తే “నూతిలో గొంతుకలు”, “ఆగమగీతి” తెలుగు సాహిత్యంలో ఆనాటి ప్రధానస్రవంతిని అనుసరించినవే. సినారె అన్నట్టు ఏదో ప్రత్యేకంగా నిరాశా నిస్పృహల్ని “పుక్కిటబెట్టుకున్నవి” కావని నా ఉద్దేశం.
కాకుంటే నాకు తెలిసినంతవరకు ఇంక ఏ తెలుగు కవీ తన రచనని “సంశయ” కావ్యంగా ప్రకటించుకోలేదు. అలాగే బైరాగి సంశయకావ్యం అంటే ఏమిటో వాచ్యంగా చెప్పలేదు. అంటే, కావ్యాలోకనంతో మనమే తెలుసుకోవాలన్నమాట అదేమిటో.
కవి ఎంచుకున్న టెక్నిక్ — ముగ్గురు సంశయగ్రస్త పాత్రల్ని తన పనిముట్లుగా వాడుకోవటం. వారు హేమ్లెట్, అర్జునుడు, రోడియాన్ రాస్కల్నికోవ్. హేమ్లెట్ “కర్మ”కి పూర్వం సంశయంలో పడితే, అర్జునుడు కర్మ సమయం లోను, రాస్కల్నికోవ్ కర్మ తరవాతా సంశయగ్రస్తులౌతారు. తన తండ్రిని చంపి తల్లిని వశం చేసుకున్న పినతండ్రిని ఏం చేయాలా అనేది హేమ్లెట్ని వేధిస్తే, యుద్ధారంభంలో బంధుమిత్రుల్ని చంపటం ఎలా అనేది అర్జునుడి ఊగిసలాటకి కారణం. అప్పులిచ్చి పీడించే ఒకర్ని చంపి ఆమె డబ్బుతో తన జీవితాన్ని, ఇతర నిర్భాగ్యుల జీవితాల్ని మారుద్దామని తీరా చంపాక తీవ్రమైన అలజడికి మానసిక సంఘర్షణకి లోనవటం రాస్కల్నికోవ్ వంతయింది. ఈ మూడు పాత్రల ద్వారా నాటి మానవజీవన సంశయాల్ని వెలికిదియ్యటానికి ప్రయత్నించాడు బైరాగి.
అంతేకాదు, బైరాగి దృష్టిలో సందిగ్ధావస్థ మానవుడి ‘సహజవేదన’. తన తొలిపలుకులో ఇలా అంటాడు: “… ముగ్గురి బాధ ఒకే స్థాయిని అందుకుంటుంది. అది మానవుని సహజవేదన. అతణ్ణి త్రికాలాల్లోనూ వెంటాడుతుంది. ఆ బాధలో మథనపడనివాడు పూర్ణత్వాన్ని అందుకోలేడు. ఆ బాధ నుంచి అతను తప్పుకునే మార్గం లేదా –అంటే ఉంది. పలాయనం, కృతకశక్తుల పూజనం. ఆత్మహననం.” అలా కాకూడదంటే సంశయావస్థలో మథనపడటం తప్ప మనిషికి గత్యంతరం లేదు — త్రికాలాల్లోనూ. ఇకపోతే, కర్మ చెయ్యాలా వద్దా అనేది, దాని భూత వర్తమాన భవిష్యత్ కాలాలని, ఎవరికి వారే నిశ్చయించుకోవాలన్నమాట.
నూతిలో గొంతుకలు బయటికి వినపడకపోవచ్చు; వినపడినా చాలా అస్పష్టంగా, గందరగోళంగా, అక్కడక్కడ అర్థమైనట్టు కానట్టు ఉండొచ్చు. ఈ గుణాన్ని కవి ఈ కావ్యమంతటా విస్తరించాడు.
అది చీకటి నుయ్యి. పగలైనా రాత్రిలానే వుంటుంది. తలుచుకునే కొద్దీ మరీ చీకటిగా వుంటుంది. అందుకే కావ్యం మొదలుకావటమే —
“రాత్రి
కాళరాత్రి
కరాళ కాళరాత్రి”
అంటూ మొదలౌతుంది.
దానికితోడు ఆ రాత్రి మేలుకుని లేదు, నిద్ర పోతున్నది.
“రాత్రి నిదురబోతున్నది
జగతి నిదురబోతున్నది
నిదురబోతున్నది వీణ
మూగి గాయకుని గొంతుక”
మూగ గాయకుని గొంతుకలా దానికి మెలకువ రాబోదు.
అందుకే–
“చివరకు చీకటొకటే, చలనం లేదు చీకటికి
హేమంతవసంతా లాద్యంతాలు
కొంతలు సాంతాలు
ఎరుగనివీ తమస్సులు
లేవిక్కడ ఉషస్సులు”
అలాటి అంధతమస్సులో మానవాళికి దిక్కు లేదు. ఆకాశంలోనైనా ఆశల తారలు మినుకుమంటాయో లేక తారలనుకున్నవి ప్రాణాంతక విస్ఫోటన శకలాలౌతాయో! ఏమైనా తెగించక తప్పదు.
“ప్రతి ఒకచూపు మింటివైపు
మరలుతోంది శూన్యంగా దైన్యంగా
వర్షం కొరకు, బాంబుల వర్షం కొరకు
తెగింపుతో, ముగింపు తెగింపుతో”
లోకం నిరాశా నిస్పృహల్లో మునిగివున్నా కవి నిరాశావాది కాదు. వాటినుంచి ఎలా బయటపడాలో ఉద్బోధించగలడు, స్పష్టంగా ప్రకటించగలడు. అయితే అతని బాటని పాటించటానికి సాహసం కావాలి.
“సాహసికుడా, కనిపించవు చీకటి కూకటి వేళ్ళీ వాకిటిలో
చొచ్చుకపో చీకటిలోకి
చీకటి గుండెల్లోకి
ఈ మంటిని ఈ రాతిని
ప్రత్యక్షపు కూటనీతిని
తొలిచి మలచి చీకటిలో
చొచ్చుకపో గ్రుచ్చుకపో”
ఎందుకంటే —
“కూకటివేళ్ళ రహస్యాలు తెలిసిన తరవాతనే
తెలిపూవుల తొలిపలుకులు వినవస్తాయ్ నీ చెవులకు
కన్నీరుల కుంభవృష్టి వెలిసిన తరవాతనే
హరివిల్లుల రంగవల్లులు కనిపిస్తాయ్ నీ కనులకు”
అలా చొచ్చుకుపోయి చీకటి కూకటివేళ్ళ రహస్యాన్ని తెలుసుకున్నాక–
“ఆశల పాఠం నీకు నేర్పుతుంది నీ నిరాశ
ఆహ్లాదానికి అర్థం గరుపుతుంది నీ విషాదం
పూర్ణత్వపు సూత్రం విడమరుస్తుంది చీకటి
అప్పుడు వింటావు నీవు
ఉరియుచ్చుల అనుభవాలు ప్రకటించే నూతిలోని గొంతుకలు”
అలా నిరాశా విషాదాల్లోంచి ఆశలు, ఆహ్లాదాలు పుట్టుకొచ్చాక చీకటే నిజాన్ని వెలువరిస్తుంది. నూతిలో గొంతుకలు ఖంగుమంటూ బయటికి వినిపిస్తాయి.
బైరాగి కవిత్వంలో సంపూర్ణ పరిణితిని ప్రదర్శించింది “నూతిలో గొంతుకలు”. తను ఈ రచన ఎందుకు చేస్తున్నది కవికి తెలుసు — నాటి మానవజీవన సంఘర్షణని తన గొంతులో పలికించటం. అది వివిధ కవితా రూపాల్లో, నాడు వాడుకలోకి వస్తున్న భావప్రకటనా మార్గాల్తో పాటు తను తయారుచేసుకున్న కొత్త దారుల్లో ప్రకటించటం. అయితే కేవలం సమాజంలో గూడుకట్టుకున్న నిరాశా నిస్పృహల్ని, అయోమయ భవిష్యత్తుని ప్రతిఫలించి ఊరుకోకుండా దాన్ని ఎలా మార్చుకోవాలో చెప్ప సాహసించటం.
ఈ కావ్యంలో కొట్టొచ్చినట్టు కనిపించే మరొక అంశం కవికి తన భావాలు, ఆలోచనల పట్ల వున్న స్పష్టత; వాటికి అక్షరాకృతి నివ్వటంలో తన సామర్థ్యం పట్ల తనకున్న అకుంఠిత విశ్వాసం. కవితాప్రవాహంలో ఎక్కడా తొట్రుబాటు కనిపించదు, తన భాషవిన్యాసాల గురించి ఎలాటి సంశయాలు, సందిగ్ధతలు మచ్చుకైనా మనకు తగలవు. ఎక్కడ సరళభాషని వాడాలో, ఎక్కడ ప్రౌఢసమాసాల్ని సంధించాలో లోతుగా తెలిసినవాడుగా మనకు కనిపిస్తాడు. “మానవజాతి ఆర్జించిన సిఫిలిస్ నీ వారసత్వం” అనటానికి ఎంత సంకోచం లేదో “జీవితమిట నిరావరణ నిరాభరణ నగ్నచ్ఛవి / వికట కుటిల ఘనఘటాచ్ఛటా జటా నటద్భైరవి” అనటానికి అంతే విశృంఖలత ప్రదర్శిస్తాడు.
చివరగా ఒక ప్రశ్న మిగుల్తుంది: అద్భుతమైన కవిత్వం రాశాడు, నాటి మానవజీవన ప్రమాదాలకి దర్పణం చూపాడు, నిజమే; అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లోనూ ఇలాటి కావ్యాలకు చోటుందా? ఈ భావాలకు అవసరం ఉందా? ఇలాటి కవిత్వానికి పని ఉందా? నేటి తరం తెలుగువారిలో ఎవరైనా ఇలాటివి చదవుతారా? చదవగలరా?
ఈ ప్రశ్నలు ఈ ఒక్క కావ్యానికే కాదు, బహుశ గత యాభై అరవై ఏళ్ళలో వచ్చిన తెలుగు కవిత్వానికంతటికీ వర్తిస్తాయి. నాకు తెలిసినంతవరకు, నేను మొదట్లో ఉదహరించిన దీర్ఘకవితలన్నిట్లోను చాలావరకు శ్రీశ్రీ, కొంతవరకు తిలక్ తప్ప మిగిలిన వాళ్ళను, నేటి తరాల్లో ఎవరన్నా — చదవటం మాట అటుంచుదాం — పేర్లన్నా విన్నారా అనేది అనుమానాస్పదమే.
నా మట్టుకు నాకు ఈ ప్రశ్నలకు సమాధానం తెలియదు. ఇప్పుడు కాకపోయినా ముందుముందైనా అలాటి వారు రాకపోతారా అని ఆశించటం ఈ కావ్యం లక్ష్యానికి కూడ గౌరవం ఇవ్వటం ఔతుందేమో!
(“నూతిలో గొంతుకలు” డిజిటల్ కాపీని పంపిన కొలిచాల సురేశ్‌కు కృతజ్ఞతలు — రచయిత)