బైరాగిని నేను బాగా ఎరుగుదును, కాని అదే అతని అసలు పేరనీ, ఆలూరి బైరాగి అనేది అతని పూర్తి పేరనీ ఇటీవలి దాకా తెలియదు. తెలియవలసిన అవసరం కూడా లేదు.
బైరాగిని తలుచుకుంటే ‘నూతిలో గొంతుకలు’ వినిపిస్తాయి. చుట్టపు చూపుగా వచ్చి అట్టేసేపు ఉండని ధూమకేతువు కనిపిస్తుంది.
(నారాయణ బాబుని కూడా తెలుగు సాహిత్యంలో ఒకప్పుడు ప్రవేశించి నిష్క్రమించిన తోకచుక్కగా అభివర్ణించాను.)
రాయప్రోలు, విశ్వనాథ వంటి ధ్రువతారలే కాదు, శిష్ట్లా, నారాయణ బాబు, బైరాగి వంటి నక్షత్రాలు కూడా సాహిత్య రోదసికి అలంకారాలే!
ఈ స్మారక సంచికలో బైరాగి కవిత్వం మీద విమర్శలూ, సమీక్షలూ చేయను. ఒక్క మాట మాత్రం చెబుతాను. ఆంగ్ల సాహిత్యంలో ఫ్రాన్సిస్ థామ్సన్కు ఎంత ప్రత్యేక ప్రాముఖ్యం ఉందో బైరాగికి మన సాహిత్యంలో అంత ప్రాముఖ్యమూ ఉంది. “స్వర్గ భైరవం” (Hound of Heaven) గొప్ప గీతం అంటారు. ఆ స్వర్గ భైరవాన్నే నేను బైరాగిలో చూస్తాను.
ఒకసారి బైరాగి నా దగ్గరకు వచ్చి నా “జగన్నాథుని రథచక్రాలు”కు తాను ఉర్దూలో (హిందీలో కాదు!) చేసిన అనువాదాన్ని చదివి వినిపించాడు. కన్నడంలో “సంపత్కుమార” చేసిన అనువాదం కన్నా అది గొప్పగా ఉన్నట్లనిపించింది. బైరాగి ఉర్దూ అనువాదం ఒక స్వతంత్ర రచనలా సాగిపోయింది. హిందీలో కూడా కొందరు అనువదించారు గాని అవేవీ దీని ముందు ఆగేవి కావు.
“నాకు కొంచెం నమ్మకమివ్వు!” అన్న బైరాగి గీతాన్ని ఇంగ్లీషులోకి నేననువదించాను.
“Grant me a grain of Faith” అంటూ.
బైరాగి తెలుగు గీతాల హిందీ సంకలనం ప్రకటించినట్లు, గురజాడ నుంచి నేటిదాకా సాగిన తెలుగు కవితను ఎంపిక చేసి, ఇంగ్లీషులోకి అనువదించి, ఒక Anthology ప్రకటించాలనేది నా అనేక సంకల్పాలలో ఒకటి. అది నెరవేరితే అందులో బైరాగి కవితలు రెండు మూడైనా ఉంటాయి.
ఆలూరి బైరాగి సంస్మరణ సంచిక – 1979