భారత దేశ స్వాతంత్ర్య సమరం ముమ్మరంగా సాగుతున్న సమయంలో, తెనాలి తెలుగు వాళ్ళ సాంస్కృతిక వికాస కేంద్రంగా పేరొందింది. అక్కడ చాలా మంది మేధావులు, రచయితలూ ఉండేవారు. కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి ప్రముఖ హేతువాది. తెనాలిలో వారి నివాసం పేరు “సూతాశ్రమం.” దాని పక్కనే ఉన్న రత్నా టాకీస్ ముందర బల్ల మీద వారి కుమారుడు గోపీచంద్, అబ్బూరి రామకృష్ణారావు గారి అబ్బాయి వరద రాజేశ్వరరావు, పి. వి. సుబ్బారావు, బైరాగి, చేరి సాహిత్య, రాజకీయ చర్చలు జరిపేవారు. వీరందరి మీదా ఎం. ఎన్. రాయ్ ప్రభావం గాఢంగా ఉండేది.
ఈ చర్చలలో బైరాగి కలుగజేసుకొని ఏదో ఒక వితండవాదాన్ని లేపి గోపీచందుకి విసుగు కలిగించే వాడు. ఓ రోజున బైరాగి, “మనం (రాయిస్టులం) అంతా వర్ణాశ్రమ వ్యవస్థని సమూలంగా నిర్మూలించాలని తీర్మానిస్తే, కవిరాజు గారు ప్రతి కులంలోనూ మరో వర్ణాశ్రమ ధర్మాన్ని ప్రవేశపెడుతున్నారు” అని విమర్శించాడు. (చౌదరి గారు కమ్మవారి వివాహ తంతు జరపడానికి బ్రాహ్మల్ని వద్దని కమ్మ పురోహితులని పెట్టారు.) అప్పటికి బైరాగి హిందీలో కవితలు ప్రచురించాడు కాని తెలుగులో ఏమీ రాయలేదు. అబ్బూరి బైరాగితో, ఊరికే పుస్తకాలు చదవకు, ఏదన్నా రాయి, అని చెప్పేవాడు.
మరికొన్నాళ్ళకి గోపీచంద్ ఒక కొత్త నవల రాయడం మొదలెట్టి, బైరాగి లాంటి అసమర్థుడు అందులో నాయకుడిగా ఉంటాడన్నాడు. అబ్బూరి నవ్వుతూ, “‘అసమర్థుడి జీవనయాత్ర’ పేరిట నేనూ ఆత్మకథ రాద్దామనుకుంటున్నాను,” అన్నాడు. గోపీచంద్ ఆ పేరు తను వాడుకుంటానన్నాడు. బైరాగి అందులో నాయకుడు కాకపోతే తనకు అభ్యంతరం లేదన్నాడు అబ్బూరి. బైరాగి ఉక్రోషపడి, ఈ సంభాషణ తర్వాత, అబ్బూరితో, “నాకో నవల రాయాలనుంది, అందులో మన మేధావులందర్నీ బట్టబయలు చెయ్యాలనుంది,” అన్నాడు. అబ్బూరి, “అందరిమీదా నీది పైచేయి కావాలంటే కవిత్వం రాయి. అంతేకాని, అందరిలాగా నవల్లూ, కథలూ తలపెట్టక,” అన్నాడు.
ఆ తర్వాత బైరాగి రత్నా టాకీసు వైపు రాలేదు. మూడు నాల్రోజుల తర్వాత, అబ్బూరి ఇంటికి వెళ్ళి, బైరాగి తను రాసిన మొట్టమొదటి తెలుగు కవిత వినిపించాడు:
నగనగమ్మున పన్నగమ్ము
నదీ నదమ్ముల ఉపద్రవమ్ము …
చిరపరిచిత పాంథులార! పతితజీవ బంధులారా!
అద్భుతంగా ఉందన్నాడు అబ్బూరి. తరవాత వారంతా విడిపోయారు. కొన్నాళ్ళకి బైరాగి “నూతిలో గొంతుకలు” ప్రచురిస్తూ అబ్బూరిని తొలిపలుకు రాయమంటే, అబ్బూరి తన నాన్నగారిని ఉల్లేఖించి, రచనలకి ఉపోద్ఘాతాలు అనవసరం అని చెప్పాడు.
నూతిలో గొంతుకలు
నేనెప్పుడో వయసులో ఉన్నప్పుడు చదివి హైలైట్ చేసిన పాదాల మీద రంగు ఇప్పుడు వెలసిపోతున్నది కాని, ఆ పంక్తులు నా మనసులో నాటుకుపోయినవి:
శతసహస్ర శబ్దాల స్రఖరశరపరంపరముందు
నిశ్చలమై నిలచిన నిశ్శబ్దంలో
నానారావ తరంగతురంగాల ఉరవడి క్రింద
నిలవనీరుల నికరపు నిశ్శబ్దంలో
ఆడే చేతుల క్రింద, వాగే జిహ్వల క్రిందసొమ్మసిలిన హృదయమందు
ఆటముందు పాటముందు
ప్రణయంముందు ప్రళయంముందుప్రగల్భ నిరీక్షణతో నిండిన, పండిన ఈ నిశ్శబ్దంలో
వేచియున్నవాడే ప్రతిఒక్కడు
మార్పుకొరకు, తీర్పుకొరకుఓర్పుగలిగి
చరమఘంటారావం కొరకు
తప్పిపోయిన భావం కొరకు.
…
ఆవేదనల అనంతంలో అంతమైన జీవితాలు
విమోచనపు యోచనలేని శోచనీయ శర్వరిలోన
ఆలోచనల లోచనాలు మూతబడిన ముహూర్తానప్రాతస్సూర్య స్వర్ణశంఖం, రాకాపతి రజతశంఖం
రెండూ మూగబోయినవేళ
తిరుగుపోకకు త్రోవలేని చివికిన చీకటుల మూల
సకల రేఖా సంగమ కేంద్ర బిందువు క్రింద
ఆక్రందన స్యందనాల మందాగమరవం ముందు
నిలబడి ఒక్క టడుగుతాను బాబూ! చెప్పు
ఎక్కడ బయలుదేరాం మనం?
కడ కెక్కడ చేరాం మనం?
కావ్యం స్వతస్సిద్ధం, దానికి భాష్యకారుని చేయూత అనవసరం అంటూనే, ఈ కావ్యానికి బైరాగి తొలిపలుకుగా నాలుగు మాటలు చెప్పాడు: ఇదొక సంశయ కావ్యం, దీనిలోని నాయకులు, హేమ్లెట్, అర్జునుడు, రాస్కల్నికోవ్, తమ సందిగ్ధావస్థని తెలిపే ప్రయత్నం. కర్మ పూర్వం (హేమ్లెట్), కర్మక్షేత్రంలో తక్షణికం (అర్జునుడు), కర్మ తరువాత (రాస్కల్నికోవ్) వారి బాధని వర్ణిస్తుంది.
అది మానవుని సహజవేదన, ఆ బాధలో మధనపడనివాడు పూర్ణత్వాన్ని అందుకోలేడు, అంటాడు బైరాగి. “ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ,” అని చలం అన్న బాధ వేరు; అది దీనుల, హీనుల కూడూ గుడ్డలు లేని బాధ అయితే హేమ్లెట్, అర్జునుడు, రాస్కల్నికోవ్ పడేది ధర్మాధర్మ, పాపపుణ్యాల విచికిత్స వలన కలిగిన మనోబాధ అంటాడు రారా.
ఆ బాధనుండి తప్పుకునే మార్గముందా అంటే, బైరాగి, ఉంది — పలాయనం, కృతకశక్తుల పూజనం, ఆత్మహననం, అంటాడు. నాకవి ఒకదాని నొకటి మించిన దుర్గతులు అనిపిస్తాయి కాని పరిష్కారాలనిపించవు.
మానవ జీవితం కూటికీ గుడ్డకీ పరిమితం కాదు. ఈ ముగ్గురు నాయకులు ఎదుర్కొన్న విపరీత విపత్తులను అందరూ ఎదుర్కోకపోవచ్చు. అయినా సామాన్య మానవుడూ చింతనాపరుడే. శ్రీశ్రీ కూడా కొన్ని కవితలలో, ఓ సినిమా పాటలో, పాపపుణ్యాల సత్యాసత్యాల ప్రస్తావన తెస్తాడు:
ఓ మహాత్మా ఓ మహర్షి
ఏది చీకటి, ఏది వెలుతురు
ఏది జీవితమేది, ఏది మృత్యువు
ఏది పుణ్యం, ఏది పాపం
ఏది నరకం, ఏది నాకం
ఏది సత్యం, ఏది అసత్యం
…
నిన్న స్వప్నం, నేటి సత్యం
నేటి ఖేదం, రేపు రాగం
ఒకే కాంతి, ఒకే శాంతి
ఓ మహర్షి, ఓ మహాత్మా
బైరాగి కవితలో కనీసం “హేమ్లెట్ స్వగతం” ఆశాజనకంగా ముగుస్తుంది:
కర్మకు, జ్ఞానికి శ్రుతి కుదిరినపుడు
ఎగిరే విహగాలకుండ దావేదన
సంశయాన్ని చూచి స్వేచ్ఛ బెదరదపుడు
మానవునకుండదు తనతో వాదన“అర్జున విషాదయోగం” మాత్రం,
బ్రతుకు చీలుబాటమీద నిలబడి యున్నాను నేడు
ఎటుబోతే పూలతోట, ఎటుబోతే వల్లకాడు?ఈ ప్రళయ ముహూర్తంలో ఏమిటి నా కర్తవ్యం
ఈ అగ్ని పర్వతంపై ఏ దిక్కున గంతవ్యం
దేనివలన జనులందరు తరతరాల సుఖిస్తారు
మన మహూచ్చ నిర్ణయాన్న్ని సంప్రీతిని స్మరిస్తారు?అని అడుగుతూ, ఆలోచన లోచనాలు మూసుకుంటాడు:
నా సంశయ సాంధ్య వేళ నీ సైగే ధ్రువతారిక
నా యోచన నీ సూచన కెల్లప్పుడు పరిచారిక
“అందీ అందని నీ చేలాంచలముల విసరుల కొసగాలులతో నిర్మించిన నా నుడి నీ గుడిగా,” అని శ్రీశ్రీ కవితని స్మరిస్తే, బైరాగి, “కవి సమస్య,” లో అనేకానేక హేమ్లెట్లు, రాస్కల్నికోవ్ ల బాధని “విశ్వవ్యధా వారినిధి తటాన బహుభంగుల ఫేనోజ్వల, రుదనాకుల, క్షుభితోచ్చల తరంగాళి” గా ఆలాపించడానికి యత్నించి, “శబ్దాల అసమర్థత” ఎదురయి “కవితాకామిని చేలాంచలాల కొస విసురులు ఎప్పుడూ ఒక బారెడు దూరానే మాయమవడాన్ని” అనుభవిస్తాడు:
దిక్కుల కనురెప్పలలో పరమోష స్వప్నాలను మేలుకొలిపి
చల్లనితల్లి ఒడిలా, మక్కువ నిండిన ముగుద కన్నుల్లా
అర్థమైన దానికన్నా అధికంగా స్ఫురించేది,
చేతలకు చెందరానిది, మాటలకు అందరానిది,
…
గాలి విసురుల తావిలా తప్పించుకొని,
శిరీషసుమ మార్థవపు నవనవలా జారిపొతూ,
కనులు మూసి, కిల కిల నవ్వి
కనబడక మాయమయే మనోజ్ఞతను
ఈ తెగిన త్రాళ్ళు బెట్టి, వాక్యాల
మొండి గోడల మధ్య ఎలా బంధించటం?
…
క్షుద్ర రేణుకణం నుంచి, మహామేరు నగం వరకు
సంక్షుబ్ద సాగరాల ఘోష నుంచి, మూగ జీవాల భాష వరకు
అన్నిటినీ ఒక లయ, ఒక తాళం, ఒక రాగంలో మేళవించి
నాలో లోకం కొరకై, లోకంలో నా కొరకై
ఏకైక మహోద్రేకం ఉరికించాలని కోరిక.
కాని, కడకు పాడుబడిన గుడిమాత్రం మిగులుతోంది.
వివరాల్లో విషయాన్నో, విషయంలో
వివరాన్నో కోల్పోడం జరుగుతోంది.
…
ఎక్కడ మొదలెట్టడమో, ఎక్కడ తుది ముట్టడమో
ఈ విరిగిన పనిముట్టులతో ఏమిటి చెక్కడమో?
పులుగు గొంతుక మూగబోయి, చిన్న తరంగోత్తమాంగాలు
నైశ్శబ్దపు శృంగం తాకి, జాలిగా తిరిగి, చెరగి పోయేవేళ
పువ్వుల చెవుల్లో గుసగుసల మంచు బొట్టులు
చల్లగా, మెల్లగా కరిగి పోయేవేళ
కంఠం, ఒక కంఠం కావాలి నాకు:
పుంఖానుపుంఖ శంఖాలమంటల ఘంటలాపలుకగల ఒక కంఠం,
కంఠం, నాకొక కంఠం,
మానవగీత ఆలపించే ఒక కంఠం.
ఒకే జ్యోతి
“ఊహకీ వాస్తవానికీ, క్రియకీ, కదలికకీ మధ్య వ్యవధిలో నీడలు పడుతున్నయ్”
బైరాగి కవితలలో కొన్నిచోట్ల అంతర్లీనంగా, ఎక్కువచోట్ల ప్రస్పుటంగా కనిపించే అస్తిత్వ చింతన వేదనాభరితంగా ఉండటంలో ఆశ్చర్యం లేదు. అందుకు మానవజీవితంలోని సంక్లిష్టతే ముఖ్య కారణం. అయినా అస్తిత్వవాదం మానవక్రియకూ, ఆశావాదానికీ పెద్ద పీటయే వేస్తుంది. “చీకటి నీడలు” సంపుటిలో ఆశాజ్యోతిని వెలిగించమనే కవిత, “ఒకే జ్యోతి”:
నిరంతాందోళిత మానవహృదయంలో
పిరికివాని భీతిలోన, వీరుని అభయంలో
ఆశలో నిరాశలోన
తృప్తిలో దురాశలోన
విరిసిన పుష్పాల సువాసనలో
కవిగాయక ప్రేమికజన
సకలశిల్పి సౌందర్యోపాసనలో
నాట్యాంగన విన్యాసములో
…
అనేక స్వరూపాల
శతజీవిత తరంగాల
నురుగునవ్వు దివ్వెల్లో
వెలుగుతుంది ఒకేజ్యోతి!
…
ఏజ్యోతిని వెదకి వెదకి
తెలియని సృష్ట్యాదినుండి
తెలిసిన మన యుగమువరకు
ఎందరో మహానుభావులు
అనేక విప్లవకారులు
సత్యాన్వేషణ మిషతో
త్రోవతప్పిన మతప్రవక్తలు
…
ప్రాణాన్నే దివ్వెచేసి
నేటివరకు దేనికొరకు
వెదకి వెదకి విసిగారో
అదే జ్యోతి, ఒకేజ్యోతి!
…
గౌతమబుద్ధుని హృదిలో
…
శిలువెక్కిన ఏసుక్రీస్తు హృదయంలో
అదే చిచ్చు రగిలిందట
…
కాని యెచట? జ్యోతియేది?
మన నిద్రిత హృదయాల్లో
మన ముద్రిత నేత్రాల్లో
మన బానిస భావాల్లో
జ్యోతియేది! జ్యోతిలేదు,
జ్యోతిని కోరేవారలు
జ్యోతి పాదపూజారులు
ఈ జగజీవిత నిశిలో
నూతన మార్గంకొరకై
…
జ్యోతిని వెలిగించండి
మీ హృదయపు తిరుగుబాటు
ఆరిపోని నిప్పురవ్వ
ప్రపంచాన్ని మండించే
మంటల పంటలు పండించే
మీ బ్రతుకొక హారతిగా
జ్యోతిని పూజించండీ!
జ్యోతిని ఆరాధించండీ!
చిరపరిచిత మిత్రుడు మృత్యువు
బైరాగి మరణించిన తరవాత వచ్చిన “ఆగమగీతి” లో మనసుకు హత్తుకునే పద్యాలు అనేకం ఉన్నాయి.
“కామ్రేడ్ రాయ్ స్మృత్యర్ధం” లో మృత్యువు వర్ణనని చూడండి:
పొగమంచు క్రమ్ముతున్నది
శిథిలాంగాల చైతన్యం క్రుంకుతున్నది
త్వరత్వరగా చలికాలపు ప్రొద్దులాగు.
తృషిత మృత్యు సైకతంలో ప్రాణరసం ఇంకుతున్నది
ఎగిరిపో నుంకిస్తోంది రామచిలుక
పెదవులపై ఇగిరిపోయే ముద్దులాగు
కడిగివేసి పాత జ్ఞాపకాల పలక!
సంధ్యాసాగర తటాన అలలు విరిగి పడుతున్నవి.
తెరువని తలుపు తడుతున్నది.ఇది కాదా మన మృత్యువు —
చిరపరిచిత మిత్రుడు మృత్యువు!
ఎరిగినదంత చెరిగిపోయే
మహాశూన్యపు దుర్గమ దూర తీరాలంట
పులుగు గూటికి తిరిగిపోయే చరమక్షణం!
సర్వ విరమణ పరమక్షణం!
మాసిన చొక్కాలా ఈ దేహాన్ని విడిచివేసి
శబ్దాలంబన త్యజించి విహరించే భావంలా
కనుపించని కరం చాచి, అయినవారి అక్షాల్లో అశ్రులు తుడిచివేసి
పయనిస్తున్నాడు దేహి మునుపెరుగని మార్గమూని.
దారి ఖర్చు అక్కరలేదు చిల్లికాని!
…
పొగలు సెగలు క్రమ్ముతున్నవి, కన్నులు నీరు చిమ్ముతున్నవి
తీసిపోడు అతడు ఏ అంశంలో మునుపెరిగిన మహనీయులకు.
పెద్దన కోవకు చెందని కవి
బైరాగి విలక్షణమైన కవి. తన కవిత్వం గురించి రాసిన కొన్ని కవితలని చూద్దాం. “సూతాశ్రమం” లో:
కత్తివంటిది తార్కికబుద్ధి.
ఇరువంకల పదునుగల వంకరకత్తి వంటిది.
సుత్తివంటిది విశ్వాసం
ఆటంకాల సహించని అహంకారం.
రెండూ ఢీకొనిన వేళ విప్లవ విలయ విస్ఫులింగ మహాసారం
సృష్టి కావ్య నవాశ్వాస మహోచ్ఛ్వాసం.
తార్కిక శిలల నిర్జల, సంకట సంకుల భూమి
సామాన్య కుసుమ కన్యల నెలవు కాదు
శూలాగ్రాల శయనించే అశరీర దివ్యాప్సరలు
(కల్పనా కోమల హంసతూలికల తల్పం మీద కాదు)
అసిధారా ప్రఖర తీక్ష్ణ మేధాగంధ వీచికలపై నర్తిస్తారు.
కాని వారి ఆ అందం అందరికొరకు కాదు.
రొమాన్సుల రోమాంచాలు
లలనా కమ్ర స్తన స్తబక కలనా నమ్రతనూవల్లరీవేల్లిత
ప్రాబంధిక ప్రణయ నికుంజాల నీడ
మానవ మాంసగంధ మాదన పర్వతాల బంగరు విరుల మరులవాడ
ప్రబంధాల లలిత పదబంధాలు
భావంలేని చీకటిలో మాటల బాణాసంచాలు
ఇవి అందరికీ అందే ఆనందాలు.
త్రోవ తేలిక కౌగిలినుంచి మంచం వరకు
ఆకలినుంచి కంచంవరకు.
సూతాశ్రమ సశ్రమాధ్వం అందరికొరకు కాదు.
శుభ్ర విద్యుత్ కాంతిలో శస్త్రకారుని శస్త్రం నవ్విన అందం
స్వస్థ శ్వాసలాగ, ఎర్రని మూసలోన పారే లోహపు అందం
కనుచూపుల కనుమ దాటి, మింటిని ఒంటరిగా
పయనించే ఇనుపడేగ తెల్లని రెక్కల అందం,
డీను స్విఫ్ట్, ఆనటోల్ ఫ్రాన్సుల వంకర వ్యంగపుటందం
అందరికీ కాదు.
…
ఎవడైనా “కవిత ఇదమిత్థమ”ని అంటే
గోష్పదమంత నీటిలో మునిగి చావమనవలదా?
అని కవిత్వాన్ని నిర్వచించి నియంత్రించే వాళ్ళని ఈసడించుకుంటాడు.
“నేను మీకవిని కాను,” అన్న కవితలో, తానే శిబిరానికీ చెందననీ, కాచుకున్న రేతిరికి మాత్రమే సన్నిహితుడను అంటాడు:
నాదాల నినాదాల, వివాదాల బాణసంచాలు ప్రేల్చడానికి
రంగు రంగుల మతాబాలు కాల్చటానికి
చిలుకలాగు సూక్తులు పలకటానికి
శాక్రిన్ తేనె సోన లొలకటానికి
మహామహులకు అభినందన వందనలు తెలపటానికి
ఇష్టంలేని కృపణప్రశంసల తీయనివిషం కలపటానికి
నేను మీకవిని కాను.
మూగిన మహాజనం మధ్య, దయదలచిన ధనం మధ్య
పొత్తాల పత్తనాల, నాగరికుల శాస్త్రీయ భ్రమలసఘనవనం మధ్య
నిధనంవంటి ధనంచేసే సత్కారాలు, సన్మానాలు
జరీఅంచుల శాలువాలు, చందన తాంబూలాలు, పూలగుత్తులు, హారాలు,
కవితాసతి శవసంస్కృతి క్రతువులోన తీరని అవమానాలు,
నే వలచిన ఈ మృణాళదేహానికి చేజేతుల నిప్పుపెట్టలేను నేను.
నేను మీకవిని కాను, వెడలిపొండి.
…
ఇతర కవులు, వారు సుకృతులు,
వారికి నా నమస్కృతులు.
పరాజితుడను, మౌన వ్రతుడను
మీ శ్రేయైషిని, హితుడను
కాని నేను కాచుకున్న రేతిరికే సన్నిహితుడను!
“వినతి,” లో
నిరుపహతి స్థలముల్లేవు
రమణీ ప్రియ దూతికలు తెచ్చి ఇచ్చే కప్పురపు విడెముల్లేవు
జరీ నగిషీ కాశ్మీర శాలువలూ, గండపెండేరాలూ లేవు.
భావ కవుల గిరిజాల్లేవు, విరహాల్లేవు.
…
పెద్దవాడు పెద్దన, కాదనలేను, కాని నేను
అతని కోవవాడను కాను.
…
అర్థం వెనుక భావన కొరకు, భావనలోని దయగల దీవెన కొరకు
అలమటిస్తున్నాను నేను, కలవరిస్తున్నాను నేను.
తీరని జీవితేచ్ఛ
సంస్కృత సమాసాలతో కూడిన కొన్ని కవితలు ఓపట్టాన అర్థం కావు. “జీవిత బుభుక్ష” లో మొదట ఏమి చెబుతున్నాడో అర్థం కాదు. “గోధూళివేళ” (నిఘంటు అర్థం సాయంకాలం) అంటే బహుశా జీవిత చరమాంకం అని తోస్తుంది. “విధురవంశి నాలోన మ్రోయి,” అంటే విషాద గీతం లోలోన మ్రోగుతుందనీ, దిగులు విత్తు మనసులో నాటుకుందనీ కొంత బోధపడుతుంది:
రేలిరుల కురులు విరబోయు వేళ
ధూమ్యాలతాళి విరబూయు వేళ
విక్లాంత కిరణ గోయూథ మింటి
పట్టునకు చేరు పుంతలను మింటి
గట్టులను మసృణ శోణాభధూళి
చెలరేగు వికల గోధూళివేళ
ఒక విధురవంశి నాలోన మ్రోయి
మధు తిక్తరుచుల రాగాలుతీయు
మేల్కొలుపు నెడద జీవిత బుభుక్ష
విస్మయాతీత పాట దిదృక్ష!
ఒక దిగులు విత్తు వడి మొలకలెత్తు
వటుడెదిగినట్లు ఆకాశమెత్తు
వటవిటపమట్లు పటు జటలుదించి
నిజఘనచ్ఛాయ లోకాలనించి
ఎవడరుగగలడు పూర్వపు పథాన,
మానసావేగ భాస్కర రథాన
ఇది నిరాలోకమౌ సాంధ్య జగతి
ఎటులొదవు పూర్వ సందీప్త సుగతి!
అయినా అతృప్త జీవిత బుభుక్ష
అడుగును నిరంతరానంద భిక్ష.
దిశలంత నలముకొను తిమిరరాశి,
నైరాశ్యకాళి, ఘన వ్యోమకేశి.
అస్పుటావేదనా తరల రేఖ
ఆ మనోరాత్రిలో తటిల్లేఖ.
ప్రత్యగము జీవ సార్ధాభియాన
మాహ్లాద వాహినీ తటోద్యాన
గత సుమాఘ్రాణ మత్త క్షణాలు,
అవి కంటినీళ్ళు, అవి మంటిపాలు!
పావక పరీక్ష, జీవిత బుభుక్ష
తీరని బుభుక్ష మానవుని శిక్ష.
మరలా, జీవన వేదన సరళమైన తెలుగులోనూ చెప్పగలడు. చిన్న బ్రతుకు ఎంత వేదనాభరితమో “ఎంతెంత దూరం?” వర్ణిస్తుంది:
అలసిన బాట ఆకసంకేసి నిస్పృహగా చూస్తోంది
వెల్లికిలా పండుకొని మెల్లగ కాళ్ళు చాస్తోంది
జోగుతున్న దిక్కులు, ఆవులించే గహ్వరాలు
అలసిన గాలి మ్రోయలేని వాలుటాకుల మర్మరాలు
నడక కూడా కునుకుతోంది, రెప్పల కౌగిలి విడదు
ఎంత విసుగు, ఎంత వేసట, చిన్ని బ్రతుకులో ఇమడదు
ఎంతెంత దూర మింక తమ్ముడూ!
“కోసెడు, కోసెడు దూర మోరి అన్నయా!”మూడే మూడు మజిలీ లిచట, పుట్టుక, ప్రేమ, చావు
ఎంతసేపు నడచినా గడచిపోము బయలుదేరిన తావు
గతి ఉన్నది, ప్రగతి లేదు, ముది పెదవిని లేదు పాట
తమ్ముడూ! ముమ్మాటికి చెబుతున్నా, బాటసారి తోడిది బాట
మన తోడుత పొడచిన ప్రొద్దు మన వెనకే క్రుంకుతోంది
పగటి నొసటి పసిడిచెమ్మ నల్లనినేల నింకుతోంది.
ఎంతెంత దూర మింక తమ్ముడూ?
“కోసెడు, కోసెడు దూర మోరి అన్నయా?”
సూర్యుణ్ణీ, చంద్రుణ్ణీ, ఆకాశాన్నీ, విశ్వాన్నీ, సామాన్యమైన వస్తువులతో పోల్చి, “నాక్కొంచెం నమ్మకమివ్వు” లో విస్మయపరుస్తాడు:
నాక్కొంచెం నమ్మకమివ్వు!
కొండలు పిండి కొట్టేస్తాను
చితికిన టొమేటోలాంటి సూర్యుణ్ణి
ఆరిన అప్పడంలాంటి చంద్రుణ్ణి
ఆకాశపు ఎంగిలి పళ్ళెంలోంచి నెట్టేస్తాను!
నాదగు బాహుబంధనంలో ఈవిశాల బ్రహ్మాండాన్ని
చాపలా చుట్టేస్తాను!
నిస్సహాయ మానవేయుని నొసటివ్రాలు
ఒక్క కలంపోటుతోటి కొట్టేస్తాను.
జీవిత సభా భవన ద్వారంనుంచి
అన్యాయాన్ని, అక్రమాన్ని మెడబట్టి గెంటేస్తాను.
ఇంకా ఎన్నెన్నో చేసేస్తాను.
కాని ఒక్కటి —
నాక్కొంచెం నమ్మకమివ్వు!
అస్తిత్వ వేదన
బైరాగి పద్యాలు అస్తిత్వ వేదనని (existential angst) వెల్లడి చేస్తాయని ఇస్మాయిల్ ప్రశంసించాడు. ఆ వేదనకి అద్దం పట్టే పద్యం, “ఒంటరి డేగ.” నాదృష్టిలో ఈ కవిత బైరాగి తాత్వికతని చక్కగా చిత్రీకరించింది:
విశాల వినీల వ్యోమపు విస్తృతిలో ఒంటరిడేగనై
మందలో తప్పిపోయిన లేగనై
వెదకుతున్నాను, వెదకుతున్నాను అర్థం కొరకు;
అమ్మవంటి అర్థం కొరకు.
రెక్కలు అలసిపోయేదాక,
రిక్కనుంచి సన్నని చుక్కనై, నీలాలశూన్యంలో కలసిపోయేదాక
వెదకుతున్నాను, వెదకుతున్నాను అర్థం కొరకు
దీనికంతకు అర్థమేమి?
నొచ్చిన నారెక్కలక్రింద పగులబోయే గ్రుడ్డులాగు భూమి
లోయల లోతుల్లో నీలినీడల పోరాటాలు,
రెక్కలులేని, రెక్కలురాని తలపుల ఆరాటాలు.
పిడికెడు మంటి సంకెలలో
చలియించే వేనవేల నరాల నీలివలలో చిక్కిన నెత్తుటికలలు.
నమ్మిన మ్రొక్కులధాటికి వ్రక్కలైన శిలలు.
బాధల నెత్తుటిజీరల పచ్చసొనతో, పగిలే గ్రుడ్డులాగు భూమి.
దీనికంతకు అర్థమేమి?
నింగినుంచి నీలాలుకురిసేచోట, బంగరు వెలుగుల జాలుమెరిసే చోట
శోక బాష్పాల పొగమంచులు క్రమ్మనిచోట
ఇచ్చట ధరకు దూరంగా, ఊపిరాడని ఉలిపిరి తెమ్మెరలో
మేలిమి నీలిపట్టుకుచ్చుల జిలుగుల జాలరు తెరలో
ఆసీమ అనంతానికి తెరచిన దిక్ పంజరాల గవాక్షాలు,
ఆవల ఆనల కావలిలేని పరోక్షాలు.
నింగినుంచి నీలాలుకురిసేచోట, బంగరు వెలుగుల జాలుమెరిసే చోట
ప్రశ్నలు ప్రత్యుత్తరాలులేని శాంతి పద్మంలా విరిసేచోట
చంచువు తెరచి ఉలిపిరి తెమ్మెరలను పీలుస్తాను.
మేలిమి నీలాలతావి పీల్చి, మత్తిలి, తూగి, తూలి,
రెక్కల చురియలతో ఎగురరాని ఎత్తులను చీలుస్తాను.
కాని ఇంతలోనే నేల పిలుస్తుంది.
రెక్కలు రాని నెత్తుటికందులాగు నేల పిలుస్తుంది.
దెబ్బతిని రివ్వున క్రిందికి దిగివస్తాను.
రెక్కల పొత్తిళ్ళలోన అదమి సముదాయించటానికి
తెరచిన చంచువులో ముద్దులమేత నించటానికి.
జీవితానికి అర్థమేమిటని, అందరూ చింతిస్తారు. అమ్మలాంటి అర్థం అంటే, జీవిత పరమార్థం కదా. ఈ కవితని చదివినపుడు నాకు వెంటనే గుర్తొచ్చేది స్టీవెన్ వైన్బెర్గ్ (Steven Weinberg) రాసిన ప్రఖ్యాత జనరంజక సైన్సు పుస్తకం, “The First Three Minutes: A Modern View of the Origin of the Universe.” దాని ముగింపు నుండి సంగ్రహంగా:
“విశ్వానికీ మానవునికీ మధ్య ప్రత్యేక సంబంధమేదో ఉందని అనాదిగా మనుషుల ప్రగాఢ నమ్మిక. విశ్వం పుట్టుక నుండీ మానవుడు ఉన్నాడనీ, అంతేకాని తర్వాత యాదృచ్ఛిక ఘటనల మూలంగా ఉద్భవించలేదనీ భావిస్తారు.
నేనిది రాసేటప్పుడు పశ్చిమతీరాన్నుండి తూర్పుతీరానికి వెళ్ళే విమానంలో ఉన్నాను. క్రింద చూస్తే, భూమి మెత్తగా సుఖంగా ఉన్నది; అక్కడక్కడా ఉన్న మబ్బుతునకలు, సూర్యాస్తమయంలో కరిగి రంగుమారుతున్న మంచు, పట్టణాలని కలిపే రోడ్లు.
అత్యంత ప్రతికూలమైన విశాల విశ్వంలో ఈ భూమి బహు స్వల్పమైనదంటే నమ్మలేము. అంతకన్నా నమ్మలేనిది, ఇప్పటి విశ్వం ఊహాతీతమైన పరిస్థితులనుండి ఉద్భవించిందనీ, సుదూర భవిష్యత్తులో అత్యంత శీతల స్థితిలోనో, తీక్షణమైన వేడిలోనో నశిస్తుందనీ. విశ్వం అర్థమయే కొలదీ, అది నిరర్థకమనిపిస్తుంది. (The more the universe seems comprehensible, the more it also seems pointless.)
కాని మన పరిశోధనా ఫలితాలు శాంతినివ్వకపోయినా, పరిశోధనలోనే కొంత ఊరట ఉంది. ఆడా మగా, కేవలం దేవతల-రాక్షసుల కథలతో, దైనందిన వ్యవహారాలతో తృప్తిపడక, టెలెస్కోపులు, ఉపగ్రహాలు, ఆక్సిలేటర్లు నిర్మించి, ఆసక్తితో సత్యాన్వేషణకి కృషిచేస్తారు. విశ్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం, మానవ జీవితానికి విషాదంలోని ఉదాత్తాన్ని ఇచ్చి ఉన్నతపరుస్తుంది. (The effort to understand the universe is one of the very few things that lifts human life a little above the level of farce, and gives it some of the grace of tragedy.)”
నిరాశ నిస్పృహలను ప్రబోధిస్తున్నాడన్న ఆరోపణలకి సమాధానంగా, నైరాశ్యం తన ఉద్దేశం కాదంటూ [8], వైన్బెర్గ్:
“మానవజీవితంపై ఈ దృక్పథం విషాద భరితమైనది. కాని ఇది శాస్త్రవేత్తలతో మొదలవలేదు.
Our revels now are ended. These our actors,
As I foretold you, were all spirits and
Are melted into air, into thin air;
And like the baseless fabric of this vision,
The cloud-capped towers, the gorgeous palaces,
The solemn temples, the great globe itself,
Yea, all which it inherit, shall dissolve,
And, like this insubstantial pageant faded,
Leave not a rack behind. We are such stuff
As dreams are made on, and our little life
Is rounded with a sleep.
– The Tempest, Act IV, Scene 1.మనకూ షేక్స్పియర్కీ విశ్వం అంతం గురించిన ఆందోళన పెద్ద బాధాకరం కాదు. మనమంతా బతికేది సుమారుగా వందేళ్ళు మాత్రమే. షేక్స్పియర్ వేరేచోట అన్నట్లు:
Golden lads and girls all must,
As chimney-sweepers, come to dust.అయితే ఈ విషాదం రాసింది షేక్స్పియర్; మన విషాదమేమిటంటే మన భవిష్యత్తు ఎవరూ రాసిపెట్ట లేదు. దానికి మనమే బాధ్యులం. మనమే జీవితానికి అర్థం చెప్పుకోవాలి.
మనకి వారసత్వంగా వచ్చిన విలువలలో కళలని ఆస్వాదించడం, ప్రకృతి సౌందర్యాన్ని ఆనందించడం, ఇతరులని ప్రేమించడం లాంటి వాటిని ఉంచుకొని, ఆడవాళ్ళని అణచి ఉంచడం లాంటి వాటిని వదిలెయ్యవచ్చు. మరికొన్ని కొత్త విలువలను కనుగొనవచ్చు. విశ్వంలో మానవాళికి చరితార్థమనేది లేకున్నా, విశ్వం గురించి కాకమ్మ కథలతో తృప్తి పడక, శాస్త్రీయంగా పరిశోధన చెయ్యడం ద్వారా ఏదన్నా ప్రయోజనం కనిపెట్టవచ్చు.”
“లోకం చూశాను నేను, శోకం చూశాను నేను, లోకంలోన శోకంలోన, నాకం కూడా చూడకపోలేను నేను,” అన్న బైరాగి, “కన్నీరుల సరసిలో పూచిన ప్రేమ కెందామర.”
సంప్రదించినవి:
1. బైరాగి. కవనకుతూహలం మరియు వరదకాలం. అబ్బూరి వరదరాజేశ్వరరావు. తెలుగు ప్రింట్. 2013. (తెనాలి రత్నా టాకీస్ సమాచారమంతా దీనిలోనిదే.)
2. నూతిలో గొంతుకలు. బైరాగి. ఏ. బి. సి. ప్రచురణలు. 1978.
3. చీకటి నీడలు. బైరాగి. ఏ. బి. సి. ప్రచురణలు. 1978.
4. ఆగమగీతి: కవితా సంచయనం. బైరాగి. ఏ. బి. సి. ప్రచురణలు. 1981.
5. బైరాగి అవగాహన. రా రా సమగ్ర సాహిత్యం — 2. రాచమల్లు రామచంద్రారెడ్డి. యుగసాహితి. 2012.
6. ఆగమగీతి: ఆలూరి బైరాగి. రావినూతల సత్యనారాయణ. మిసిమి మాసపత్రిక. మార్చి, 2014.
7. The First Three Minutes: A Modern View of the Origin of the Universe. Steven Weinberg. Basic Books. 1993.
8. The Future of Science, and the Universe. Steven Weinberg. The New York Review of Books. November 15, 2001.
