ఒక్కక్షణం అతను దారిద్ర్య సంపదలూ, జాతిమత వయోభేదాలూ, సంఘపు అంతస్తుల మెట్టపల్లాలూ, ఆస్థిమాంసాల శరీరపు దౌర్బల్యాలూ, వ్యక్తి చైతన్యపు, అహంకారపు సరిహద్దులూ, అన్నీ అధిగమించి ఆ కుర్రవాడితో, ఒక మానవ జీవిమాత్రుడై, సంపూర్ణ తాదాత్మ్యం అనుభవించాడు. ఆ కుర్రవాడికీ తనకూ ఏమీ విభేదం లేదనీ, అతన్నించి తనను ఎవ్వరూ వేరుచెయ్యలేరనీ అనుకొన్నాడు.
బైరాగి
బైరాగి రచనలు
ఏది నిజం? సిల్కు చీరలా? చింకిగుడ్డలా? మాడినకడుపులా? బలిసిన రొమ్ములా? వృద్ధ వేశ్య ప్రలాపాలా? జవ్వనుల పకపకలా? చీకటిలో ఒంటరితనం? వెలుగులో జంటలు? ఏది నిజం? చావుబ్రతుకుల సంజమసక, కల్తీలేని వెన్నకాచిన నిజం ఏది? ఎలాగుర్తుపట్టటం?
వికల విహగ కలకంఠ నినాదం
చిలుకుతోంది ఇలపై అవసాదం.
శ్లోకానికి స్వాగతశ్లోకంలా, ఘూకరవానికి లేదు విలంబం
బాటసారి తోటిది బాట
మన తోడుత పొడచిన ప్రొద్దు
మన వెనకే క్రుంకుతోంది
పగటి నొసటి పసిడిచెమ్మ నల్లనినేల నింకుతోంది
శాంతి సాగరోద్గత కౌస్తుభ! జయ,
జయ భవార్తవారుణ పలాశమా!
జయము కోటి శిశువుల ఆనందపు
ప్రోజ్వల ముక్తామ్లాన హాసమా!
ఆకాశపు కాసారంలో సూర్యుడు కెందామర
బ్రతుకు పూల ధూళి చిమ్మే పుడమి ఒక కెందామర
మేఘాల మోహాలు ముసురుకొను నీరేయి
వీడి క్రొమ్ముడి చెదిరి క్రమ్ముకొన్నవి కురులు
నల్లత్రాచుల వోలె ఒల్లమాలిన ఇరులు
చూపులందని పొరల చీల్చి మూగిన మరులు
నా గానం జ్వలితానలమైతే
నా ప్రాణం చలితానిలమైలే
కావి మాత్రమిస్తా నీకోసం
తావి తేనెమోస్తా నీకోసం
ఇందు కిరణ మృదు మంద చరణముల
నందన వన మకరంద తుహినముల
గంధ శ్వసన స్వచ్ఛంద వ్యజనముల
ఏ ఆనందము జాలువారునో
అదే కాంతి కలిగించుము దేవా!
జన జీవన జననీ! ప్రియ ధరణీ!
ధరణీ! జననీ!
చీకటి పడినది తల్లీ దీపం చూపవేలనే!
మాకై దీపం చూపవేలనే?
నీ సంయోగపు వార్త విన్నతరి
నే నీ మృణ్మయావాసపుం గాసిన్ వీడుచు లేచి వచ్చెద