అణువణువున కవి

ఆలూరి బైరాగిని అర్థం చేసుకొనడానికి ఆయన జీవిత కాలంలో యత్నించాను. అది నా వల్ల కాలేదు.

ఆయనను అర్థం చేసుకొనడానికి ఇప్పుడు సయితం యత్నిస్తున్నాను. ఇప్పుడైనా అది నాకు సాధ్యం కావడంలేదు.

వ్యక్తిగా కాకపోతే, కవిగా ఆయనను పోల్చుకొనగలుగుతున్నానా? లేదు.

కవిగా కాకపోతే, వ్యక్తిగా ఆయనను అంచనా చేయగలుగుతున్నానా? తిరిగి నేను చెప్పగలిగింది “లేదు” అని మాత్రమే!

ఎందువల్ల?

కవిగా ఒక బైరాగి, వ్యక్తిగా ఒక బైరాగి, ఇద్దరు బైరాగులు లేకపోవడమే ఇందుకు కారణమేమో!

కవిత జీవితాన్ని ప్రతిబింబించాలి; జీవితం ఆశయాలను అది చూపించాలి. జీవితం అర్థాలను వివరించాలి; జీవితం ధ్యేయాలను అది నిర్దేశించాలి.

జీవితంతో సన్నిహిత సంబంధం లేనిది కవిత కాదు. అయితే, కవితే జీవితం కాదు. ఇదే విధంగా జీవితమే కవిత కాదు.

కవితకు, జీవితానికి మధ్యగల సరిహద్దును బైరాగి గుర్తించలేదు. ఒకవేళ గుర్తించివుంటే, దాన్ని చెరిపివేయడానికి ప్రయత్నించాడు.

ఇది చేయరాని ప్రయత్నం. ఇటు కవితకు, అటు జీవితానికి కూడా “ఫుల్‌స్టాప్” పెట్టగల ప్రయత్నం.

ప్రఖ్యాతి గడించి, ఒక భాషలో కాదు, రెండు భాషలలో కవిగా వెలుగుతున్న ఘట్టంలో హఠాత్తుగా బైరాగి కవితా రచనను విరమించాడు. తర్వాత జీవితం పట్లనే వైముఖ్యాన్ని పెంచుకొని, జీవిత రంగం నుంచి హుటాహుటిగా వెళ్ళిపోయాడు.

అయితే, బైరాగి చేసింది పలాయనం కాదు.

కవిగా “మబ్బుల్లో పసిపాపల నవ్వు”లను బైరాగి చూడగలిగాడు; “కొండలపై కురిసే కిరణాల”కు మురిసిపోగలిగాడు; “అడవులలో వికసించే పువ్వుల”కు పరవశించగలిగాడు. “నేల దుమ్ము”లను “మాణిక్యకణాలు”గా సంభావించుకోగలిగాడు.

అయినా, ఈ బైరాగినే “వెదికేందుకు ఇక్కడ ఏమున్నది?” అనే ప్రశ్న ఎందుకు వేధించాలి? అయినా, ఇదే బైరాగిలో “జీవితానికేమిటి శృంగారం?” అనే వేదన ఎందుకు జనించాలి?

కవితకు, జీవితానికి మధ్య సర్వకాల సర్వావస్థలలో అంతరం ఉంటుంది. అగాధం ఉంటుంది. దీన్ని గుర్తించలేకపోవడానికి బైరాగి అంధుడూ కాదు, అజ్ఞుడూ కాదు. కాని, అంగాంగంలోని అణువణువులో ఆయన కవి. కవిగా తప్ప ఊపిరి పీల్చుకొనడమైనా ఆయనకు తెలియదు.

అందువల్ల కవితకు జీవితం ఇంత భిన్నంగా ఎందుకున్నదని, కవితను జీవితం ఎందుకు చెక్కిరిస్తున్నదని, వెటకారం చేస్తున్నదని — ఆయన ఖిన్నుడై ఉండాలి. కవిగా ఆయన మౌనవ్రతానికి, వ్యక్తిగా ఆయన మహాభినిష్క్రమణకు అదే మూలమై ఉండాలి.

“కంఠం, ఒక కంఠం కావాలి నాకు;
పుంఖానుపుంఖ శంఖాల మంటల ఘంటలా పలుకగల
ఒక కంఠం.
కంఠం, నాకొక కంఠం మానవగీత ఆలపించే ఒక కంఠం.”

అని కోరుకున్న బైరాగి “నీడలు! నీడలు! చీకటి నీడలు!” తప్ప, “నీడలనే వెన్నాడే నీడలు!” తప్ప మరి వేటిని చూడలేని స్థితికి పయనించడానికి నేను ఇక్కడ చెప్పిన కారణం కావచ్చునా? లేక మరేవైనా ఉన్నాయా?

ఏమో! నిరాటంకంగా నేనేమీ చెప్పలేను. నాకు ఒక విధంగా కనబడుతున్న బైరాగి మీకు మరొక విధంగా కనబడవచ్చు. మీ మాటేమిటి? నాకే కొన్ని వారాల క్రితం ఒక స్మారక సభలో కనబడినట్టుగా బైరాగి ఈనాడు కనబడడంలేదు.

బైరాగి ఒక క్లిష్టప్రశ్న, ఒక నిగూఢ ప్రహేళిక, ఒక దుర్భేద్య పద్మవ్యూహం.

ఆలూరి బైరాగి సంస్మరణ సంచిక – 1979