శాంతి సాగరోద్గత కౌస్తుభ! జయ,
జయ భవార్తవారుణ పలాశమా!
జయము కోటి శిశువుల ఆనందపు
ప్రోజ్వల ముక్తామ్లాన హాసమా!
జయము హైమగిరి రజత శిఖరమున
ప్రతిభాసించిన సూర్యకిరణమా!
నిరత ముఖరమై వర్ధిల్లుము, ఓ నవయుగ వైతాళిక గాయనమా! తావక మంగళమయ మార్గమ్మున పరచుకొనును అగణిత దృక్ సుమములు,
సుమనస్సురభి రజో వాసితమగు ధౌత రజతగిరి ధూళి భ్రమములు.
రెక్కలుచాచిన శాంతివిహగమై నీ విమానమెగురును లోకముపై.
దాని ఛాయలో మానవులందరు నవ్యసృష్టి చేతురు శోకముపై.
రాష్ట్ర- వాద-గత రాగ-ద్వేషములకుమించి మానవమర్యాదలు
శస్త్ర ఝుంకృతి మించి లోకములు వినును అబలజీవుల ఫిరియాదులు.
రాష్ట్ర పితృ- స్వప్నావళి నీ ఈ సుదృఢ హస్తములచే రూపొందును.
అమ్లానమ్మాదర్శము, ఆశల మొక్కవోని పదనులు వెలుగొందును.
కోటి కోటి మానవుల అర్చనల దీప్తినందు ఓ పుణ్యధామమా!
హే! మధ్యమ ఋజు పంథాగ్రేసర! ఏకైకా దక్షిణావామమా!
కోటి కోటి జఠరానలార్చికా! కోట్లకొలది అధరాల దాహమా
కోటి కోటి నయనాంబుజ విగళిత కరుణాశీతల వారివాహమా!
సమాశ్వస్త భీతావని జయహే! సత్యాహింసల మంగళదూతా!
జంగమ సంగమ వల్లీన కృత భావి వర్తమానాంచిత భూతా!
మంగళమగు గావుత మార్గమున నీ అడుగుల సడిలో సంగీతం
మేలుకొలుపు రేతిరి కనురెప్పల క్రొవ్వెలుగుల క్రొంక్రొత్త ప్రభాతం.
మరకత దూర్వాదల భూషితమై పచ్చపచ్చనగు ధరణీవక్షము.
గరళదగ్ధ హింసా శిలీముఖము నిత్య విఫలమగుగాత విలక్షము.
భారత భువి ఛాత్రమకుట విరహిత సమ్రాట్టూ! జయ దేవానాం ప్రియ!
తెరచిన విశ్వహృదయ దేహలిలో కాలిడిరమ్ము. శుభమ్మగు, జయ, జయ!