ఆకాశపు కాసారంలో సూర్యుడు కెందామర
బ్రతుకు పూల ధూళి చిమ్మే పుడమి ఒక కెందామర
నాడీ నాళ శైవాలా లలమిన ఈ
శరీర సరోవరాన హృదయం ఒక కెందామర
మందేహ దేహచ్ఛాయాసిత మోహ తంద్రా విల తమస్వినిలో
జాగ్రత సందేహం ఒక కెందామర.మస్తిష్కపు రుధిర స్నిగ్ధ బలివేదిక కెందామర
అక్షరాల సిరామరకల తరంగిణి శిరసుమీద
పూచిన కవిత కెందామర.
కరువు చెరువులో ఆకలి కెందామర
బాధల అగాధంలోంచి, నిరాశల నిశీధపంకంలోంచి
అంకురించిన రుధిరాంకం. క్రాంతి ఒక కెందామర.
దిగంతాల అనంతశూన్యంలోన
పరమాణువుల, రేణువుల, పదార్థపంకంలోన
తరుగక, చెరుగక, నిలచే ఆ అదృశ్య ఆదిశక్తి కెందామర.
వినీల కేశాల కాసారంలో నీ వదనం కెందామర
నిశ్చల నీరంవంటి నిర్మలవదనంలో నీ నయనం కెందామర
కన్నీరుల సరసిలో పూచిన ప్రేమ కెందామర.