రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

ఆలూరి బైరాగి ‘ఆగమగీతి’

రచన: పి. రామకృష్ణ
సెప్టెంబర్ 2025

దాదాపు ముప్పయ్యేళ్ళ క్రితం తెలుగు స్వతంత్రలో వినిపించిన నూతిలో గొంతుకలు బలమైన ధ్వని వలయాలను సృష్టించుకుంటూ బయటి ప్రపంచాన్ని చుట్టుకొని, ముఖ్యంగా తెలుగు కవిత్వ ఆవరణలో నలుమూలలా ప్రతిధ్వనించాయి. వస్తువును కవిత్వంగా వ్యక్తీకరించడంలోనూ, ఆ వ్యక్తీకరణలో సమకాలీనమైన వ్యక్తిని ప్రపంచవ్యాప్తమైన అనుభవాల రేఖలతో, తనదైన తాత్వికత రంగులో ప్రదర్శించడంలోనూ, భాష, శైలి లాంటి స్థూల రూపంతోనే కాక, అంతశ్చేతన లాంటి సూక్ష్మరూపంతో సహా బైరాగి ఆనాడు ఎంత ప్రత్యేకంగా కనిపించాడో, ఇప్పటికీ అంతే ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు.

కవిత్వం చదివే కొద్దిమంది పాఠకుల్లో నుంచి, తన విలక్షణ తాత్విక దృక్పథం కారణంగా మరికొద్దిమందే మిగిలినా, వాళ్ళు, బైరాగిని ఒకప్పటి కవిగా కాక ఎప్పటికీ కవిగా, అతని కవిత్వాన్ని ఎప్పటికీ ఆగమగీతిగానే గుర్తించుకొంటారు. అయితే, ఏ కావ్యం ద్వారా బైరాగి తీక్షణంగా ఎదిగి బృహదాకారంతో కనిపిస్తాడో, ఆ కావ్యంలోనే మానవుడుగా (మానవుడిలో తాదాత్మ్యత) చీకట్లో కలిసిపోవడం ఆశ్చర్యకరమైన పరిణామం. స్వయంగా కవి ఆ కావ్యాన్ని సంశయకావ్యంగా చెప్పుకోవడమే గాక, సంశయదశలో నలిగిన అర్జునుడు, హేమ్లెట్, రాస్కల్నికోవ్ పాత్రల ద్వారా జీవితాన్ని దర్శించి, వ్యాఖ్యానించాడు. చీకట్లో పడికొట్టుకొంటున్న మానవుడికి త్రోవ చూపించమని సోనియాను కోరుతూ, ఆవేదనతో కూడిన నివేదన చేశాడు. విశ్వమానవుడికి ప్రతీకలుగా తీసుకున్న ఆ ముగ్గురివీ ‘ఆవేదనల అనంతంలో అంతమైన’ జీవితాలుగా ప్రతిపాదించారు. నూతిలో గొంతుకలు కంటే ముందు వెలువడిన చీకటి నీడలులోనే నిరాశల చీకటి కనిపించినా, అప్పటికి చీకటి అంత చిక్కబడినట్టులేదు. ‘కొంచెం నమ్మకమిస్తే కొండల్ని పిండి కొడతా‘నన్న కవికి, ఆ కొంచెం నమ్మకం దొరక్కపోవడం… విశ్వవిషాదం అనుకోవాలేమో!

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అంతర్జాతీయంగా ఆందోళన కలిగించిన అప్పటి ప్రచ్ఛన్నయుద్ధ వాతావరణమూ, జాతీయ స్థాయిలో నెలకొన్న నిరాశా వాతావరణమూ కాక… పాశ్చాత్య మేధావుల నుంచి దిగుమతైన కొత్త సాహిత్య సిద్ధాంతాలూ, ఎమ్.ఎన్. రాయ్ ‘నవ్య మానవతావాదం’ లాంటివీ, మరికొన్ని కారణాలూ తోడై, బైరాగిలో చీకటి నీడలను పరచి ఉండవచ్చునని ఊహిస్తూనే, తన మీద ఇంకా నమ్మకముంచుకున్న వాళ్ళు మాత్రం కవిగా, వ్యక్తిగా ఆయన సమగ్ర రూపాన్ని చూడాలని కోరుతూ వచ్చారు. అందువల్ల, ఇప్పుడు వెలువడిన ‘ఆగమగీతి’కి ఒక మంచి కవితా సంకలనానికి మించిన ప్రముఖత ఉంది. బైరాగి ముఖ చిత్రంతో, ప్లాస్టిక్ కవర్, 1/8 డెమ్మీ సైజులో మంచి కాగితం మీద అచ్చు తప్పుల్లేకుండా ఉన్న అందమైన ముద్రణతో, బ్లాకులు చేయించిన 98 సొంత కవిత్వ శీర్షికలతోనూ, 31 అనువాద కవితలతోనూ 250 పేజీలున్న ఈ పుస్తకానికి సహేతుకమైన ధరనే నిర్ణయించి, ప్రచురణకర్తలు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ పుస్తకం విలువను పెంచారు.

పుస్తకంలో ఏ కవిత ఎప్పుడు రాసిందీ వంటి వివరాలు లేవు. కానీ, ‘నూతిలో గొంతుకలు’కు ముందు రాసినవీ, తర్వాత రాసినవి ఉన్నట్టు అర్థమవుతుంది. ఈ పూర్వాపరాల కవితల్ని పరిశీలించి చూస్తే, మొదట ఆశావాదిగా ఉండిన బైరాగి తర్వాత నిరాశావాదిగా మారినట్టు నిర్ధారించుకోవడానికి వీల్లేదనీ అర్థమవుతుంది. ఆశనూ, నిరాశనూ కూడా అంతే బలమైన ఆధారాలతో, ఆత్మవిశ్వాసంతో ప్రకటించిన కవిని, ‘ఏదో ఒక ‘వాది’గా ముద్ర వెయ్యడం ఎలా సాధ్యం? కనుక, మిగిలిందీ, సరైనదీ అయిన మార్గం కవిత్వంలోనూ, జీవితంలోనూ నిజాయితీని కనపర్చిన కవి, ఇలా పరస్పర వ్యతిరేకంగా కనిపించడానికి కారణాలేమిటి… అని ఆలోచించడమే.

“ఆకలినీ, చీకటినీ, అకాల మరణాన్నీ రద్దు చేశాం” అని సగర్వంతో సముత్సాహంతో ప్రకటించిన కవే

“సర్వమసత్యం, ఒకటే సత్యం: ఎల్లబాటలూ వల్లకాటికే;
ఓటమి సత్యం, ఓటమి తథ్యం”

అని క్రుంగిపోవడం ఎందుకు జరిగినట్టు?

కవి ఎప్పటికప్పుడు తన కళ్ళు చూసిన సంఘటనల ద్వారా, ఎదురైన అనుభవాల ద్వారా సామాజిక జీవితాన్నో, మానవ జీవితాన్నో (‘మానవగీత’ను ఆలపిస్తున్నట్టు బైరాగి చెప్పాడు) అర్థం చేసుకున్నామనుకుంటే, అది పొరపాటవుతుంది. కవిత్వ వ్యక్తీకరణకు కావలసిన సమర్థత, నిజాయితీ అవసరమైనట్టే శాస్త్రీయమైన ప్రాపంచిక, చారిత్రక దృష్టి అవసరం.

దీని అర్థం, బైరాగికి నిజాయితీ లేదంటున్నట్టో, శాస్త్రీయ దృక్పథం లేదంటున్నట్టో కాదు.

కవిగా, వ్యక్తిగా బైరాగి నిజాయితీపరుడని ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఇప్పుడు గుర్తుంచుకోవలసిందేమిటంటే, తను పరస్పర వ్యతిరేకంగా కనిపిస్తానేమోనని భయపడకుండా చెప్పగలగడం నిజాయితీపరుడికే సాధ్యమన్నది.

“మానవుడు రాజరాజు అతని నవరత్న ఖచిత సింహాసనం ఈ భూతలి”

“విప్లవానికి దొడ్డి గుమ్మం లేదు.
అన్నా పాలకులు రాజ్యశ్యాలకులు తెరచేది కాదు.
అమెరికాలో తిరిపెమెత్తేవారు
అన్నార్తుల ఆకలి తీర్చలేరు
అవి తెరవవలసిన వారు
జననాయకులైన మీరు”

అని చాటిన బైరాగికి శాస్త్రీయ దృష్టి లేకపోయిందంటే అపచారమవుతుంది.

అసలు సమస్య ఏమిటంటే, శాస్త్రీయ దృష్టి ఉండటమే కాదు, ఆ శాస్త్రీయ దృక్పథం మీద సడలని నమ్మకం ఉండటం. అది లేనప్పుడు శాస్త్రీయం, అశాస్త్రీయం రెండూ ఒకటే, లేదా, రెండు రూపాలూ విడివిడిగా కనిపిస్తూ ఉంటాయి. “నాక్కొంచెం నమ్మకమివ్వు” అని బైరాగి కోరిన సంగతి ఈ సందర్భంలో జ్ఞప్తికి ఉంచుకోవాలి.

అటువంటి సడలని నమ్మకం లేనందువల్ల, తొందరపడి, పొరపడి ప్రజా వ్యతిరేకులకు ఉపయోగపడే భావాలను ప్రకటిస్తానేమోననే భయమూ ఉంది బైరాగికి.

“ఇచట మసక చీకటిలోన
నా నిస్వన శిథిల వికట కుటిలోన
తోచక నేనేదైనా పొరపడి, తొందరపడి
వ్రాసినా, అది మీ కోసం కాదు
ఏదైనా, చేదైనా నాదే అది, మీ కోసం కాదు
మోసం కాదు”

‘మీకోసం కాదు’ అని అటు ప్రజా వ్యతిరేకులనూ, ‘మోసం చెయ్యడం లేదు’ అని ఇటు ప్రజలను ఉద్దేశించి, స్పష్టంగా వీలునామా రాశాడు.

“పరాజితుడను, మౌనవ్రతుడను
శ్రేయోభిలాషిని, హితుడను
కాచుకున్న రేతిరికే హితుడను”

‘పరాజితుడిని’ అని చెప్పుకున్నా ప్రజాశ్రేయోభిలాషి. మోసం చెయ్యలేదు, మోసపోయి ఉండవచ్చు. అదీ పొరపడి, తొందరపడి (ఏదైనా, చేదైనా అది నాదే).

చీకటి నీడల కవి బైరాగి గడ్డకట్టిన కారుచీకటి కాదు. ఉదయకాంతికి ముందటి పల్చటి చీకటి. “రాతిరికే హితుడు” కాదు, ప్రభాతానికి మరింత సన్నిహితుడు.

తుఫానుకు ముందటి తుఫానును మించిన లోలోపలి అశాంతి. అదీ… ఆలూరి బైరాగి.

[ఇది ఆంధ్రజ్యోతి వీక్లీ, జనవరి 1982 తొలి సంచికలో తొలుత ప్రచురింపబడింది. ఈ వ్యాసాన్ని సేకరించి, కాపీరైటు అనుమతిని పొంది మాకు పంపిన పద్మజ సూరపరాజు గారికి మా కృతజ్ఞతలు. – సం.]

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • ఆలూరి బైరాగి ‘ఆగమగీతి’
  • ఆకు రాలు కాలం
  • వలస పక్షి

ఇటువంటివే…

  1. అంధ తమిస్రాన అఖండ జ్యోతి ఆలూరి బైరాగి
  2. శతవసంతాల కవి ఆలూరి బైరాగి
  3. అనుశీలనకు అందని అనువాదాలకు లొంగని ఆలూరి బైరాగి కవనానునాదం!
  4. ఆలూరి బైరాగి ప్రత్యేక సంచికకు రచనల ఆహ్వానం
  5. ఆలూరి బైరాగికవి

సెప్టెంబర్ 2025 సంచికలో ...

  • GRANT ME A GRAIN OF FAITH
  • అంధ తమిస్రాన అఖండ జ్యోతి ఆలూరి బైరాగి
  • అణువణువున కవి
  • అనుశీలనకు అందని అనువాదాలకు లొంగని ఆలూరి బైరాగి కవనానునాదం!
  • అస్తిత్వ కథా రచయితగా బైరాగి
  • అస్తిత్వవాద మహాకవి బైరాగి
  • అ‘తను’
  • ఆధునిక ఆర్షకవి ఆదిమ బైరాగి
  • ఆలూరి బైరాగి ‘ఆగమగీతి’
  • ఆలూరి బైరాగి కథల్లో తాత్త్విక చింతన, కవితా ధోరణి
  • ఆలూరి బైరాగికవి
  • ఏకాంతంలో ఒక బైరాగి
  • ఒంటరి డేగనై, తప్పిపోయిన లేగనై — బైరాగి
  • ఒక గంట జీవితం — మనసు అంతరంగ యాత్ర
  • ఒక బైరాగి చింతన
  • కవన మర్మయోగి బైరాగి
  • కవి కథక విరాగి బైరాగి
  • చీకటి నీడల రమ్యక్రీడ – విరాగి జీవనగమ్య హేల
  • చీకటి నీడలలో బైరాగి జాడ
  • దివ్యభవనంలో బీజాక్షరి
  • దివ్యభవనంలోకి…
  • నా వాడు
  • నాకు జీవితాన్ని ఇచ్చిన కవి బైరాగి
  • నిరంతర స్వేచ్ఛాజీవి బైరాగి
  • నూతిలో గొంతుకలతో నలభయ్యేళ్ళ ప్రయాణం
  • నేనెరిగిన బైరాగి
  • పూర్ణకవి బైరాగి
  • బైరాగి
  • బైరాగి
  • బైరాగి “నూతిలో గొంతుకలు”
  • బైరాగి అవగాహన
  • బైరాగి కవితాత్మానుభవం
  • బైరాగి గీతాలకు గానరూపం: అదే జ్యోతి
  • బైరాగి గీతాలకు గానరూపం: అనునయము
  • బైరాగి గీతాలకు గానరూపం: ఎంతెంతదూరం?
  • బైరాగి గీతాలకు గానరూపం: కెందామర
  • బైరాగి గీతాలకు గానరూపం: జయ దేవానాం ప్రియ
  • బైరాగి గీతాలకు గానరూపం: నీ కోసం
  • బైరాగి గీతాలకు గానరూపం: మాతృ గీతిక
  • బైరాగి గీతాలకు గానరూపం: వర్షాయామిని
  • బైరాగి గీతాలకు గానరూపం: సాంధ్యగీతిక
  • బైరాగి గీతాలకు గానరూపం: హేజననీ!
  • బైరాగి గొంతుక
  • బైరాగి సర్వదా సజీవుడే
  • బైరాగి సూతాశ్రమం
  • బైరాగితో ప్రయాణం
  • యూట్యూబ్‍లో ఈమాట: ఆగస్ట్ 2025
  • వెలుగు నీడల్లో బైరాగి
  • వేదనాభరితం బైరాగికవిత్వం
  • వైరాగ్య రాగంలో మీటిన ఏక్‌తార: బైరాగి కవిత్వం
  • శతవసంతాల కవి ఆలూరి బైరాగి
  • సమాజాన్ని వ్రేలెత్తి చూపిన కవి
  • సెప్టెంబర్ 2025 బైరాగి ప్రత్యేక సంచిక
  • స్మరణ
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

ఆలూరి బైరాగికవి
నేనెరిగిన బైరాగి

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.