చీకటి నీడల రమ్యక్రీడ – విరాగి జీవనగమ్య హేల

కొన్ని దశాబ్దాల క్రితం, భావ కవిత్వం అంటే దేవులపల్లి కృష్ణ శాస్త్రి, విప్లవ కవిత్వానికి శ్రీశ్రీ చట్టుక్కున మనకు గుర్తొచ్చేవారు. బైరాగి మాత్రం ఈ రెండు విధానాలకు భిన్నంగా కేవలం సమాజంలోని కన్నీళ్ళు, కష్టాలు, చీకులు, చింతలు చూశాక కలిగే మనోవేదనను మనకు తన కవిత్వంలో దృశ్యమానం చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే దిగంబరకవులకంటే ఎంతో ముందుగా జీవితాన్ని నగ్నంగా చూపించేందుకు తన కవితలను ఉపయోగించేవాడనిపిస్తుంది. తన మొదటి కవితా సంపుటి చీకటి నీడలులో:

మీ నిద్రాసుఖ సమయంలో
స్వాప్నిక ప్రశాంతి నిలయంలో
మేం పీడకలలుగా వస్తాం
రౌరవ దృశ్యం చూపిస్తాం

అన్న పంక్తులు మనసుపెట్టి చదివితే ఆయన కవితా దృక్పథం ఏమిటో మనకు స్పష్టంగా అవగతమౌతుంది.

సాహిత్య ప్రపంచంలో “బైరాగి” అనే పేరుతో విలసిల్లిన ఆయన పూర్తి పేరు ఆలూరి బైరాగి చౌదరి. 1925 నవంబరు 5వ తేదీన గుంటూరు జిల్లాలో తెనాలికి దగ్గరగా ఉన్న ఐతానగరంలో ఒక మధ్య తరగతి రైతు కుటుంబంలో వెంకట్రాయుడు, సరస్వతమ్మ దంపతులకు జన్మించాడు. ఈ దంపతులకు ఇద్దరు బిడ్డలు పుట్టి చనిపోవడంతో ఆరోజుల్లోని ఆనవాయితీ ప్రకారం ఈతనికి “బైరాగి” అని పేరుపెట్టాక, ముగ్గురు తమ్ముళ్ళు, మరో ముగ్గురు చెళ్ళెళ్ళు పుట్టడం ఆశ్చర్యమే!

ఆరోజుల్లో చదువులన్నీ వానాకాలపు చదువులే! బైరాగి రెండవతరగతి వరకూ మాత్రమే చదువుకున్నాడు. ఎందుకో ఆయన మనసు హిందీ వేపు మళ్ళింది. హిందీ అభ్యాసంలో ఉత్తమ ప్రతిభను కనపరుస్తూ పై చదువుల కోసం ఉత్తరభారత దేశం వెళ్ళి వారితో సమానమైన ప్రతిభ చూపించారట. హిందీ కవిసమ్మేళనాలలో పోటాపోటీగా కవితలను వినిపించి శ్రోతలను ముగ్ధులు చేసేవాడట. 1946 సం.లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో హిందీ ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించాడు. ఇటు హిందీలోను అటు తెలుగులోను అద్భుతమైన కవిత్వాన్ని వినిపించే వాడు. బైరాగి తన 15వ సం.లోనే కవితావ్యాసంగంలోకి వచ్చాడు. మొదలెట్టిన తొలినాళ్ళలోనే “పలాయన్” అనే హిందీ కవితా సంకలనాన్ని ముద్రించాడు. ఆయనకు కేవలం హిందీ, తెలుగు మాత్రమే కాక బెంగాలీ, ఉర్దూ, హిందీ భాషలలో ప్రవేశం ఉంది. తరువాతి కాలంలో సమీప బంధువైన చక్రపాణి (ఆలూరు వెంకట సుబ్బారావు) సుప్రసిద్ధ పిల్లల మాసపత్రిక చందమామలో సంపాదకుడిగా అవకాశం కల్పించినా, అతని స్వేచ్ఛాప్రియత్వం వల్లనో మరెందువల్లనో అందులో యిమడలేక తప్పుకున్నాడు.

బైరాగిపై బెంగాలీ కవి జీవనానంద్ దాస్ ప్రభావం ఉందని అంటారు. ప్రభావం అన్నది చాలా పెద్ద మాట. కానీ, స్వంత గొంతుక బైరాగికి ఉంది. ఆయన బాణీ ఎవరినీ అనుకరించినదీ, అనుసరించినదీ కాదని ఆయన కవిత్వంతో పరిచయం ఉన్నవారికి ఇట్టే తెలుస్తుంది. బైరాగి ఎన్నడూ ఎవ్వరినీ అనుకరించాలని చూడలేదు. కవిత్వం తనకు హాబీ కానే కాదని, ఒక జీవన మధుసారమని భావించే వాడు. తెలుగులో ఆయన రచించిన తొలి కవితా సంపుటి “చీకటి గోడలు” కావ్యంలో కొన్ని కవితా పంక్తులను చూస్తే సాహితీ ఉగ్రవాది అని విమర్శకులు అన్న మాటలో సత్యం ఏదో దాగి ఉన్నదనిపిస్తుంది. “తాజమహల్‌ పడగొట్టండోయ్‌!” అన్న కవితలో:

మా కెందుకు షాజహాన్‌ ప్రణయం
మానవ శ్రమ మింగిన ప్రళయం
ఈ కుళ్ళిన విలాస చిహ్నం
కర్దయ మోహపాశ చిహ్నం
తాజమహల్‌ పడగొట్టండోయ్‌!
రాయిరాయి విడగొట్టండోయ్‌!

అది అతీత శవదుర్గంధం
ముందడుగిడు కాళ్ళకుబంధం
అది ఐశ్వర్యపు వెటకారం
గృహహీనుల హాహాకారం
తాజమహల్‌ పడగొట్టండోయ్‌!

అని నినదిస్తాడు. ఇంకా

‘ప్రేమకు గురుతీ పన్నీరా!
వెచ్చని బాధల కన్నీరా!
రాతిగుండెగల తాజమహల్‌!
ప్రేమగురుతు గావీశిలలు
తాజమహల్‌ పడగొట్టండోయ్‌!’

అనడంలో అంతరార్ధం గ్రహిస్తే ఆధునిక తాత్విక సిద్ధాంతాలు, అస్తిత్వ వాదాలు ఆయన మీద గొప్ప ప్రభావం చూపించినట్లనిపిస్తుంది. తాను చూస్తున్న ఆనాటి సమాజంలో ఆకలి, దరిద్రం విచ్చలవిడిగా దర్శనీయమవడంతో శ్రమదోపిడితో నిర్మించిన తాజ్ మహల్‌ను పడగొట్టమన్నాడనిపిస్తుంది.

అలిశెట్టి ప్రభాకర్ వేశ్య గురించి చిన్న కవిత రచించి విఖ్యాతి పొందితే బైరాగి “వేశ్య”ను కొంచెం సుదీర్ఘంగానే వర్ణించాడు.

‘ఆ అచ్చొత్తిన ఓరచూపులా?
అవా మరుని తూపులు?
విద్యుత్కాంతులు
చల్లనిరేయి అశాంతులు

ఎరువిచ్చిన శృంగారం
నీ తళతళ మెరిసిన గాజులు
నీ గిల్టు చంద్రహారం?

అణా పూలు, కానీ తాంబూళం
నలిగిన చీరలు, చీకటి ముసుగులు
ఇదా నీకు జీవితమిచ్చిన బహుమానం?’

అని ప్రశ్నిస్తాడు.

‘నెత్తుట తడిసిన అడుగుల
కన్నీరుల ఉప్పనిమడుగుల
ఒళ్ళంతా పచ్చిపుళ్ళు, రసికారే కురుపులు
మూగుతోన్న ఈగలు
ఎందుకు చీదర?
జీవితపు కాళ రాత్రి, గుండెలు పిండేచలి
భగభగమండే ఆకలి
పాపపు చిరిగిన దుప్పటిలో
గడగడవణికే మనకెందుకు చీదర?
ఎందుకు చీదర? రా ఇంకా దగ్గర.’

అంటాడు. తెలుగు ఆధునిక కవిత్వానికి మణిపూస బైరాగి. పదాలకు సొగసులు, కులుకులు నేర్పించాడు. నవ్య పద ప్రయోగంలో బైరాగి సమర్ధుడు. ఆగమ గీతిలో ‘నరునికి మూల మంత్రం ప్రేమ/ నరునికి గుర్తు తంత్రం కరుణ’ అన్న మాటలు అంత సులభంగా మరపురావు.

శ్రీశ్రీ కవిత్వంలోని “చూడు, చూడు, నీడలు! నీడలు, పొగ మేడలు!” అనే పంక్తులు ఆయన మహాప్రస్థానం లోని “నీడలు” అనే కవితలో ఉన్నాయి. ఈ పంక్తులు సామాన్యుల కష్టాలు, పేదరికం, అన్యాయాలను వర్ణిస్తూ, పాలకుల అక్రమాలను, దోపిడీని ఎత్తిచూపుతాయి. కవిత మొత్తంగా ఈ పంక్తులు నిరుపేదల నిస్సహాయతను, సమాజంలోని ఆర్థిక అసమానతలను, పాలకుల నిర్లక్ష్యాన్ని శ్రీశ్రీ తన కవితా శైలిలో వ్యక్తపరిచారు. అలాగే బైరాగి “చీకటి నీడలు” కవిత ఆ సంపుటికే వన్నె తెచ్చింది.

‘నీడలు! నీడలు! చీకటి నీడలు!
గాలిమేడలకు ఎగిరే గోడలు!
అమావాస్య, చిక్కని చీకటిలో
చలిచీమల్లా ముసిరే నీడలు!
నీడలు! నీడలు! ఊళ్ళూ, ఇళ్ళూ
పేదలగూళ్ళూ, కుబేరులమేడలు!
ఆకాశంలో మబ్బులనీడలు!
భూమిపైన ప్రారబ్ధపునీడలు!
కునుకుకనులలో నిద్దురనీడలు!
అచేతనంలో అద్దపునీడలు!
ప్రేమలనీడలు! ద్వేషపునీడలు!
శాంతపునీడలు! రోషపునీడలు!
కదిలేనీడలు! కదలనినీడలు!
తెలిసేజాడలు! తెలియనిజాడలు!
రంగులనీడలు! తావులనీడలు!
తెల్లకాగితపు టావులనీడలు!
గడచినకాలపు చారల నీడలు!
గడిచేకాలపు భారపు నీడలు!
గడువనికాలపు దూరపు నీడలు!
కాలసముద్రపు తీరపునీడలు!
అంతులేని బ్రహ్మాండపుతెరపై
దేశకాలముల మార్పులనీడలు!”

అన్నాడు. కవిత నడకలో ఎక్కడా తడబాటన్నది కనిపించదు. అంతే కాదు!

‘ఘోరనిశీథపు చీరచెరగులో
మూగరహస్యపు నీలిముసుగులో
త్వరత్వరగా ముందుకు అడుగిడుతూ
తడబడుతూ మరిమరి పొరబడుతూ
పోతున్నారా? లేస్తూ పడుతూ
నీడలు వారల మిగిలినజాడలు!
నీడలు! నీడలు! చీకటినీడలు!’

అంటూ చీకటి నీడలు చేసే ప్రతి ప్రకృతి రూపాన్ని, వికృత రూపాన్ని కూడా ఎత్తి చూపించాడు.

“ప్రతి మనిషీ ఒక చెరలో ఉరికంబం” అన్న బైరాగి మాటలో మానవుని అంతర్గత మానసిక సంఘర్షణను, వికాసంలోని విభిన్న దశలలో, అతను ఎదుర్కొనే వేదనను వ్యక్తీకరించే కవిత్వ పంక్తి. మనిషిలోని వేర్వేరు ఆలోచనలు, బాధ్యతలు, మరియు పరిస్థితుల కారణంగా ఏర్పడే ఒంటరితనం, బాధ, కారాగారం వంటి అనుభూతులను ఈ మాట సూచిస్తుంది. మనిషిని ఏదో ఒక రకమైన కట్టడి, నిస్సహాయత, ఒంటరితనం లేదా గందరగోళంలో ఇరుక్కున్నట్లుగా సూచిస్తుంది. పశ్చాత్తాపం, మరణం లేదా తీవ్రమైన నిరాశకు ప్రతీకగా నిలుస్తుంది. జీవితంలో ఎదురయ్యే బాధాకరమైన పరిస్థితులను సూచిస్తుంది. ఈ పంక్తితో పాటు “ప్రతి మనిషీ ఒక గదిలో చెదపురుగులు”, “ప్రతి మదిలో ప్రతి మనిషీ ఒక నదిలో సుడిగుండం” వంటి ఇతర పంక్తులు కూడా మానవ జీవితంలోని వేర్వేరు కోణాలను, వాటిలోని సంఘర్షణలను వివరిస్తాయి. బైరాగి చీకటి నీడలు కవితా సంపుటితో బాటూ నూతిలో గొంతుకలు, ఆగమగీతి కవితా సంపుటులను వెలువరించాడు. ఆగమగీతి కవితా సంపుటికి బైరాగి మరణానంతరం 1984లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. కవిత్వంతో పాటూ దివ్య భవనం పేరుతో పదకొండు కథల సంపుటిని వెలువరించాడు.

“నాకు తెలుసు” అన్న కవితలో

“నాకు తెలుసు, నాకు తెలుసు
ప్రళయవేదనా పంకిల ప్రపంచపథం మధ్య
ప్రేమలు పొసగవనీ
ఈ బండరాళ్ళపైన ఏ మొక్కలు ఎదగవనీ
మనమంతా చీకటిలో ఆకటితో పోరాడే
అస్వతంత్ర సైనికులమనీ
పెనుతుపాను చేతుల్లో
చిక్కుకొన్న
త్రోవలేని నావికులమనీ
జీవిత ప్రభంజనం
కలయిక సహించదనీ
ఉన్నగడువు కొద్ది అనీ
నాకు తెలుసు! నాకు తెలుసు!’

అనడంలోనే అతనికి మరణ భయం లేదని మృత్యువంటే మిత్రుడని అర్ధమౌతుంది. సన్మానాలను, అనవసర ఆర్భాట ప్రచారాలను, కృత్రిమ అభినందనలు నిష్కర్షగా తిరస్కరించగల గుండె ధైర్యం కేవలం బైరాగికే స్వంతం. అన్యులకు అసాధ్యం. తన జీవితానికి మార్గదర్శకుడైన తండ్రి మరణం ఆయనను బాగా కృంగ దీసింది. బైరాగిలో వైరాగ్యాన్ని మరింత పెంచింది. “మృత్యువు ఏదో ఒకటి చూచిపోయే అతిథి, వెంట పడిన అప్పు పుట్టుకలో చావు చావులో చస్తుంది” అన్న బైరాగి మాటలు హృదయాన్ని పిండివేస్తాయి. 1978లో క్షయ వ్యాధికి గురైనా సరైన వైద్యం చేయించుకోవడం పట్ల ఆసక్తి చూపని వ్యక్తి. తన 53 సం.ల వయసులో సెప్టెంబరు 9, 1978 బైరాగి మరణించాడు. ఒక్కసారి బైరాగి జీవితాన్ని పరిశీలిస్తే “సామాజిక సంఘ సంస్కర్త, ఉగ్రరూపం ధరించిన ఉద్యమ స్ఫూర్తి” అన్న విమర్శకుల మాటల్లో ఎంతో నిజం ఉందని మనకు అవగతమౌతుంది. “ఆంగ్ల సాహిత్యంలో ఫ్రాన్సిస్ థాంప్సన్‌కు ఎంత పేరు ప్రఖ్యాతులున్నాయో తెలుగులో బైరాగికి అంత ప్రాముఖ్యం ఉంది. స్వర్గ భైరవం (హోండ్ ఆఫ్ హెవన్) గొప్ప గీతం. ఆ స్వర్గ భైరవాన్ని మళ్ళీ నేను బైరాగిలో చూశాను” అన్న గో.రా.శాస్త్రి గొప్ప వ్యాఖ్యానంతో ముగిస్తున్నాను.