కత్తి వంటిది తార్కిక బుద్ధి
ఇరువంకల పదునుగల వంకర కత్తి వంటిది
సుత్తి వంటిది విశ్వాసం ఆటంకాల సహించని అహంకారం.
రెండూ ఢీకొనిన వేళ విప్లవ విలయ విస్ఫులింగ మహాసారం
సృష్టి కావ్య నవాశ్వాస మహోచ్ఛ్వాసం
తార్కిక శిలల నిర్జల సంకట సంకుల భూమి (సూతాశ్రమం — బైరాగి)
బైరాగి, ఒక తాత్విక కవిగా, హేతువు విశ్వాసం మధ్య ఘర్షణ నుంచి నవ్య కవిత్వం ఆవిర్భవించిందని అంటాడు. అంతేకాదు, హేతువులోని నిశితత్వాన్ని మాత్రమే కాకుండా దాని వక్రత్వాన్ని ఆర్ద్రత లేనితనాన్ని కూడా ఆయన పసిగట్టాడు. మరోవైపు, విశ్వాసం అహంభావంలో, మత దురభిమానంలో (fanaticism) ముగుస్తుందని సందేహించాడు. తనకు దేనిపైనా నమ్మకం లేదని స్పష్టం చేస్తూనే, విశ్వాసం లేకపోవడం వల్ల వచ్చే లోటును గుర్తించాడు. నమ్మకం లోపించిన జీవితాన్ని ఖాళీ సిగిరెట్టు టిన్నుగా, పుల్లలు లేని అగ్గిపెట్టెగా, కాలిన సిగిరెట్టు బూదిగా పోల్చాడు. అందుకే, “నాకు కొంచెం నమ్మకం ఇవ్వు” అంటూ వేడుకున్నాడు.
పాత విశ్వాసాలు చెదిరిపోతున్నప్పటికీ, సమ సమాజం, వైజ్ఞానిక పురోగతులపై తిరుగులేని కొత్త విశ్వాసం విజృంభిస్తున్న కాలంలో బైరాగి జీవించాడు. కానీ ఆయన హేతు వాదాన్ని కూడా ప్రశ్నించాడు.
బైరాగి పుట్టిన ప్రాంతం తెనాలి, ఇది హేతువాదం, సంస్కరణలకు నిలయంగా మారిన త్రిపురనేని రామస్వామి చౌదరి నివసించిన చోటు. స్వయానా త్రిపురనేని రామస్వామి కుమారుడు, రచయిత త్రిపురనేని గోపీచంద్‌కు బైరాగి మిత్రుడు. హేతువాదానికి, సంస్కరణలకు నిలయమైన తమ ఇంటికి త్రిపురనేని రామస్వామి చౌదరి “సూతాశ్రమం” అని పేరు పెట్టారు.
సూత అంటే ఎవరు?
సూతుడు పురాణాలను, మహాభారతాన్ని బోధించిన వ్యక్తి. పురాణాలను, కథలను గీతాలుగా ఆలపించే గాయకులుగా సూతులు ప్రసిద్ధి పొందారు. కర్ణుడి పెంపుడు తండ్రి సూతుడు తక్కువ కులం వాడని, అతన్ని క్షత్రియులు, బ్రాహ్మణులు అవమానించినట్లు కథలు ప్రసిద్ధిలో ఉన్నాయి. త్రిపురనేని రామస్వామి చౌదరి కుల నిర్మూలన వాది కావటం వల్ల, పురాణాలను విలోమంగా రాయడం వల్ల కూడా ఆయన నివాసం సూతాశ్రమం అనే సార్థక నామధేయాన్ని పొందింది. అయితే, ఆలూరి బైరాగి తన మిత్రుల సన్నిధిలో త్రిపురనేని రామస్వామి చౌదరిని తీవ్రంగా విమర్శించినట్లు రచయిత అబ్బూరి వరద రాజేశ్వరరావు రాశారు. ఈ విమర్శ బైరాగికి ఆధునిక సంస్కరణ దృక్పథం, హేతువాదం పట్ల కూడా తీవ్ర సందేహాలు ఉండడాన్ని స్పష్టం చేస్తుంది. అందుకే, “సూతాశ్రమం” అనే కవితలో బైరాగి హేతువాదాన్ని “వంకర కత్తి” అన్నాడు.
బైరాగి రచనలకు బీజం
అబ్బూరి వరదరాజేశ్వర రావు ఎం. ఎన్. రాయ్ చెప్పిన నవ్య మానవతావాదాన్ని సమర్థించిన సాహిత్యవేత్త అబ్బూరి రామకృష్ణారావు కుమారుడు, బైరాగికి సమకాలీన కవులు అందరికీ మిత్రుడు స్వయంగా కవి. బైరాగిలో రాయాలనే కోరిక ఎలా మొదలైందో అబ్బూరి వరదరాజేశ్వరరావు వివరిస్తారు. “మనమంతా వర్ణాశ్రమ వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలని తీర్మానిస్తుంటే, కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి గారు ప్రతి కులంలోనూ మరో వర్ణాశ్రమాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు” అని బైరాగి తన మిత్రుల దగ్గర తీవ్రంగా విమర్శించాడు. రామస్వామి ప్రతి కులంలోనూ సొంత పురోహితులు తయారై బ్రాహ్మణ పౌరోహిత్యాన్ని తిరస్కరించాలి అన్నారు. తన కులం నుంచి సంస్కరణ మొదలు పెట్టారు. దీనిని బైరాగి సంస్కృతీకరణగా బ్రాహ్మణీకరణగా భావించి వుండచ్చు. బైరాగి మాటలకు మిత్రుడు పి. వి. సుబ్బారావుకి కోపం వచ్చి ఇద్దరూ వాదించుకున్నారు. అప్పుడు ఇంటికి వెళ్తూ బైరాగి, “నాకు రాయాలని ఉంది రా” అన్నాడట. ఈ సంఘటన ద్వారా ఆధునికత తెస్తున్న హేతువాదం, వికాస యుగం పట్ల బైరాగికి సందేహాలు మొదలవడమే ఆయన రచనలకు బీజం అని తెలుస్తుంది.
అదే సమయంలో, గోపీచంద్ తన కొత్త నవల రాయడానికి ప్రారంభించాడు. బైరాగి లాంటి అసమర్థుడు నాయకుడుగా ఉంటాడని మిత్రులతో అన్నాడు. కానీ ఆ “అసమర్థుని జీవ యాత్ర” హేతువాదం యొక్క పరిమితులను బట్టబయలు చేసే నవలగా పరిణమించింది. అంటే, గోపీచంద్ అసమర్థునిగా భావించిన బైరాగి చివరికి గోపీచంద్ లోనే “సంశయాగ్నిని” రగిలించాడు. తన తండ్రి హేతువాదం నాటిన “ఎందుకు?” అనే ప్రశ్నకు, మొత్తంగా హేతువాదానికి కూడా పరిమితులు ఉన్నాయని నవల క్లైమాక్స్‌లో గోపీచంద్ తేల్చేశాడు. హేతువాదంలో పుట్టిపెరిగిన గోపీచంద్, ఆ దృక్పథం యొక్క లోటుపాట్లను గ్రహించి, దాని పరిధులను దాటి పురోగమిస్తూ తన అనుభవాన్ని పొందుపరిచిన నవల “అసమర్థుని జీవ యాత్ర” అంటారు విమర్శకుడు ఆర్. ఎస్. సుదర్శనం. గోపీచంద్ ఈ నవలను తన తండ్రికి అంకితమిస్తూ, “నాన్నగారికి ఎందుకు అనే ప్రశ్న నేర్పినందుకు” అన్నాడు. ఇది తనలోని తండ్రి ఛాయకు నమస్కారం.
వితండవాదం, ఆధ్యాత్మికత, సంశయం
ఇలా తన తండ్రి ఛాయకు వీడ్కోలు పలకడానికి బైరాగి కారణమా? త్రిపురనేని హేతువాద పరిమితులను నిలదీసిన బైరాగిలో “అసమర్థుని” చూసిన గోపీచంద్ క్రమేపి తన తండ్రి హేతువాదమే అసమర్థమైనదని గుర్తించాడా? బైరాగి “వితండవాదం” చేసేవాడని, దానికి గోపీచంద్ విసుగు చెందేవాడని వరదరాజేశ్వరరావు అంటారు. అసలు వితండవాదం అంటే ఏమిటి?
“స్వపక్ష స్థాపన హీనా పరపక్ష ఖండనపరా వితండా కథా” — అంటే తన పక్షాన్ని, తన ప్రమాణాన్ని చెప్పకుండా ఇతరుల పక్షాలను, ప్రమాణాలను మూలమట్టంగా ఖండించటం వితండవాదం. ఇదొక ప్రాచీన తర్క పద్ధతి. చివరికి గోపీచంద్ ఆధ్యాత్మికతను, ఆశ్రమాలను ఆశ్రయించాడు. కానీ బైరాగి అన్నిటినీ సంశయిస్తూ, కూడలిలో నిలిచిపోయాడు.
”నూతిలో గొంతుకలు” పేరుతో ఒక సంశయ కావ్యం రచించాడు. దీనికి ముందు వివిధ వాదాల పేరుతో సమాధానాలు ఇచ్చేవాళ్ళే కానీ, సంశయాన్ని కావ్యంగా మలచినవారు ఎవరూ లేరు. దీనిలో నాయకులు ముగ్గురు:హామ్లెట్ (Hamlet), అర్జునుడు, రాస్కోల్నికోవ్ (Raskolnikov). హామ్లెట్ వేదన కర్మ పూర్వం, అర్జునుడి వేదన కర్మ క్షేత్రంలో తక్షణమైంది, రాస్కోల్నికోవ్ బాధ కర్మ తర్వాతది. అది మానవుడి వేదన, అతన్ని త్రికాలాల్లోనూ వెంటాడుతుంది. ఆ బాధలో మథనపడనివాడు పూర్ణత్వాన్ని అందుకోలేడు. ఆ బాధ నుంచి అతను తప్పుకునే మార్గం లేదా అంటే, ఉంది. “పలాయనం, కృతక శక్తుల పూజలు, ఆత్మహననం” అంటాడు బైరాగి. ఆధ్యాత్మికమైన, రాజకీయపరమైన కృతక శక్తుల పూజలో గడుస్తున్న నేటి కాలంలో బైరాగి ఎక్కుపెట్టిన ప్రశ్నలకు ప్రాసంగికత ఉంది.
బైరాగి కవిత్వం: క్లిష్టత, అస్పష్టత
”సమాధానాలు దొరకని ప్రశ్నలు, ప్రస్తావనలు, జీవన తత్వసాధనకు ఉపలక్షించిన భావాలు, తిరుగుళ్లు, విరుగుళ్లు సుడిగుండాల్లాగా ఆవర్తాలను సృష్టించే కవి సంశయ సందేహాలు” ఇలాంటివన్నీ బైరాగి రచనలను క్లిష్టం, జటిలం చేశాయని విమర్శకుడు కె. వి. రమణారెడ్డి అంటారు.
కవిత్వంలో క్లిష్టత, జటిలత, అస్పష్టత వంటి లక్షణాలను క్యూబిజం చిత్రకళ రీతితో పోలుస్తూ నిరాకరిస్తారు సాహిత్యవేత్త తమ్మినేని యదుకుల భూషణ్. “పికాసో నాకు ఒక పట్టాన నచ్చడు. బొత్తిగా నన్ను కదలించని చిత్రం అతని గ్యుయెర్నికా (Guernica). కవిత్వంలోనైనా, చిత్రకళలోనైనా రూపమర్యాదను విచ్ఛిన్నం చేసే విశృంఖలతను నేను మెచ్చుకోలేను. ఒకవేళ అవి కళాకృతులే అని అంగీకరించవలసి వచ్చినా, అవి ప్రథమ శ్రేణికి చెందినవైతే కాదు. ప్రయోగ వైచిత్రి మైకంలా కమ్మినవాడు, బుద్ధిని పూర్తిగా నమ్మినవాడు, అచేతనకు, ఆత్మను తెగనమ్మినవాడు ఒకే పడవలో ప్రయాణిస్తుంటారు. పోతే అది గమ్యం లేని ప్రయాణం.” అంటారు యదుకుల భూషణ్.
క్యూబిజం, క్వాంటం ఫిజిక్స్, బైరాగి కవిత్వం
అయితే భౌతిక శాస్త్రవేత్త poet of physicsగా కీర్తించబడిన కార్లో రోవెల్లి క్యూబిజాన్ని క్వాంటం భౌతిక శాస్త్రంతో పోలుస్తాడు. క్వాంటం భౌతికశాస్త్రంలో ఒక వస్తువుకు ఒక నిర్దిష్టమైన రూపం ఉండదు, బహుముఖాలుగా చూడవచ్చు. అది సంక్లిష్టమైన సంబంధాల వలలా అల్లుకుపోయి ఉంటుంది. ఈ భావన భౌతిక శాస్త్రవేత్తల దృష్టిని కూడా పూర్తిగా మార్చేసింది. అదే విధంగా, క్యూబిజం చిత్రకళలో ఒక వస్తువును ఒకే కోణం నుంచి కాకుండా, వివిధ కోణాల నుంచి చూసినప్పుడు కలిగే అనుభవాన్ని ఒకే చిత్రంలో చూపిస్తారు. ఇక్కడ ఒక నిర్దిష్ట రూపం ఉండదు, కేవలం అనేక సంక్లిష్టమైన కోణాల సమ్మేళనం ఉంటుంది.
బైరాగి కవిత్వం కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తుంది. అందుకే బైరాగి కవిత్వంలో చూడవలసింది సమగ్ర రూపాన్ని కాదు, “అల్లిబిల్లిగా వలలా అల్లుకుపోయిన ఆలోచనల, సందేహాల, ఉద్వేగాల ప్రవాహాన్ని” చూడాలి. ఆ సంక్లిష్టమైన అల్లికే దాని రూపం. ఈ విధంగా, యదుకుల భూషణ్ స్పష్టమైన రూపాన్ని ఆశిస్తే, బైరాగి కవిత్వం క్వాంటం భౌతికశాస్త్రం, క్యూబిజం మాదిరిగా సంబంధాల, అస్పష్టతల క్లిష్టమైన వలయాన్ని ఆవిష్కరిస్తుంది.
కవిత్వం, జీవితం, స్పష్టత
అసలు స్పష్టమైన రూపం ఎలా ఏర్పడుతుంది? అస్పష్ట సంబంధాల్ని నిరాకరించి, కంపార్ట్మెంట్లుగా చేయడం ద్వారా మాత్రమే రూపం ఉన్నట్లు ఆభాస కలుగుతుంది. ఇటువంటి స్పష్టతను కోరడం వల్లే మేధావి నార్ల, “జీవితం, కవిత్వం దేనికది విడిగా ఉండాలి. రెండూ కలిసిపోకూడదు” అంటాడు. అలా కలిసిపోవడమే బైరాగి కవిత్వంలోని లోపం అంటాడు నార్ల. కవిగా కానీ, వ్యక్తిగా కానీ బైరాగిని అర్థం చేసుకోవడం సులభం కాదు. ఎందుకంటే కవిగా ఒక బైరాగి, వ్యక్తిగా ఒక బైరాగి లేకపోవడమే అందుకు కారణం కావచ్చు.
”కవిత జీవితాన్ని ప్రతిబింబించాలి. జీవిత అందాలను అది చూపించాలి, జీవిత అర్థాలను వివరించాలి. జీవిత ధ్యేయాలను అది నిర్దేశించాలి. జీవితంతో సన్నిహిత సంబంధం లేనిది కవిత కాదు. అయితే, కవితే జీవితం కాదు. అదేవిధంగా, జీవితమే కవిత కాదు. కవితకు, జీవితానికి మధ్య గల సరిహద్దును బైరాగి గుర్తించలేదు. ఒకవేళ గుర్తించి ఉంటే దాన్ని చెరిపివేయడానికి ప్రయత్నించాడు. ఇది చేయరాని ప్రయత్నం. ఇటు కవితకు, అటు జీవితానికి కూడా ఫుల్స్టాప్ పెట్టగల ప్రయత్నం” అని నార్ల తీవ్రంగా ఆరోపిస్తారు. అంటే, నార్ల దృష్టిలో కవిత్వం ఒక ప్రణాళికాబద్ధమైన ప్రక్రియ. దానిలోకి వ్యక్తిగతమైన జీవితం, స్వీయ జీవితంలోని భావోద్వేగాలు, కల్లోలాలు వచ్చి కలవరపెట్టకూడదు. దాని లక్ష్యం, ఆదర్శం, యూటోపియా స్పష్టంగా ఉండాలి. అప్పుడే కవిత్వానికి ఒక స్పష్టమైన, అందమైన రూపం ఏర్పడుతుంది. ఇది ఒక రూపవాదం.
ఐతే జీవిత సామాజిక ధ్యేయాలను వాటిని నిర్దేశించే సిద్ధాంతాలను ఇలా పరిహసిస్తాడు బైరాగి. మనిషి సారాన్ని పసిగట్టడానికి ఆధునిక సిద్ధాంతాల రిడక్షనిజాన్ని స్పష్టం చేస్తాడు.
“మేము వేలు చీకటంలో సెక్స్ ఉందంటాడు ఫ్రాయిడ్
మేము కాలు చాపటమే ఆర్థిక విపర్యాసం అంటాడు మార్క్స్
గంట కొట్టగానే చొంగ కారుస్తూ పరిగెత్తే కుక్కలమంటాడు పావ్లోవ్
ఎలుకల మీద ప్రయోగాలు చేసి మీరే ఎలుకలు అన్నాడు ఒక శాస్త్రవేత్త
మేమెవరం ఓ దేవా”
బైరాగి ఆధునికతా విమర్శ
కానీ ఆధునిక విజ్ఞానం సంఘటనలు, సంబంధాలు మాత్రమే సత్యం అని, పదార్థం అసత్యమని తేల్చింది. క్యూబిజం వంటి ఆధునిక చిత్రకళా రీతులు, ముఖ్యంగా బైరాగి వంటి కవిత్వం ఈ రూపవాదాన్ని ముక్కలు చేశాయి. ఒక యుటోపియాను, సామాజిక ఆదర్శాన్ని స్థాపించాలి అన్నా, లేక ఒక స్వచ్ఛమైన భాషతో స్పష్టమైన రూపాన్ని ఏర్పరచాలన్నా, జీవితానికి, కవిత్వానికి దూరం ఉండాలి. సంక్లిష్టంగా అల్లుకుపోయిన సంబంధాలను క్వాంటం స్థితిలో స్థాపించే బైరాగి కవిత్వంలో అది అసాధ్యం. “మానవహస్తం మలచిన శిల్పంలోనే ఓటమి చాలు ఉన్నది” అన్న బైరాగిలో రూపాన్ని వెతకడం వ్యర్థం. అందుకే బైరాగి కవిత్వం క్లిష్టం, అస్పష్టం అనే ఆరోపణలకు గురైంది.
జీవితానికి, కవిత్వానికి దూరం చెరిపేయడం వల్ల ఎవరూ బైరాగి కవిత్వాన్ని నిర్లక్ష్యం చేయలేకపోయారు. కవిత్వంలో అస్పష్టత, అవ్యక్తత వికాసవాద యుగం తీసుకువచ్చిన హేతువాదంపై తిరుగుబాటుగా మొదలయ్యాయి.
గోపీచంద్, బైరాగి: హేతువు, ఆధ్యాత్మికత, నిరంతర ప్రశ్న
తత్వవేత్త కాంట్, “మన ఇంద్రియాలకు, మనోబుద్ధులకు బయట ఉన్న దాని ఉనికిని తెలుసుకోలేము. దాని ప్రతిబింబాలను మాత్రమే మనం అనుభూతి చెందగలం” అన్నాడు. మానవ చరిత్ర సమాజ క్రమం పరిణామంలో, మానవ చైతన్య వికాసంలో ఒక క్రమాన్ని పురోగతిని చూశాడు హెగెల్. ప్రపంచాన్ని క్రమేపీ అర్థం చేసుకోగలం అనే ఆశను కల్పించాడు. “హేతుబద్ధమైనదంతా సత్యమైనది, సత్యమైనదంతా హేతుబద్ధమైనది” అన్నాడు. మార్క్స్ ఆ తత్వాన్ని భౌతిక పునాదులపై నిలబెట్టాడు. గోపీచంద్ ఆధ్యాత్మికంగా అనుసరించాడు. అందుకే అరవిందస్వామి చూసిన ఒక పరిణామశీలమైన మెటా ఫిజికల్ సూపర్ మాన్‌ను కలగన్న అరవింద ఆధ్యాత్మికతకు గోపీచంద్ ఆకర్షితుడై, తన తండ్రి హేతువాదాన్ని ఆధ్యాత్మికతలో ముగించాడు.
కానీ బైరాగి ఈ ఆధ్యాత్మిక సోపాన క్రమం వైపు ఏ మాత్రం మళ్లలేదు. “ఏది త్రోవ?” అని అడుగుతూనే ఉన్నాడు. ఉపనిషత్తులలోని మహావాక్యాలను కావ్యాలుగా మలిచి, వాటిని వర్తమాన కాలంలో మానవుని పరిస్థితిని వివరించడానికి సాధనాలుగా, తన భావాలను తగిలించే చిలకకొయ్యలుగా వాడుకోవడం ఒక కొత్త తరహా ప్రక్రియ. ఈ ప్రక్రియను బైరాగి పూర్తిగా వాడుకున్నాడని విమర్శకులు కేవీ రమణారెడ్డి అంటారు.
“నాన్యః పంథా విద్యతే అయనాయ” (ఇది శ్వేతాశ్వేతర ఉపనిషత్తు నుండి తీసుకున్నది) — పరమాత్మను తెలుసుకోవడం ద్వారా మృత్యువును అతిక్రమించగలం, వేరే మార్గం లేదు అని అర్థం. ఈ వాక్యాన్ని బైరాగి తన కావ్యం ముందుమాటలో తిరస్కరించాడు. లౌకికమైన, ఆధ్యాత్మికమైన హామీలు ఏమీ ఇవ్వడు.
గోపీచంద్, బైరాగి ఇద్దరూ హేతువును ప్రశ్నించారు. కానీ గోపీచంద్ ఆధ్యాత్మికతలో ముగిశాడు. బైరాగికి మాత్రం ఫుల్స్టాప్ లేదు. అందుకే బైరాగి అంటాడు: “సంశయం, ప్రశ్న అనేవి మానవుడిని త్రికాలల్లోనూ వెంటాడుతాయి,” ఆ బాధ నుంచి తప్పించుకునే మార్గం ఉందా అంటే, ఉంది: పలాయనం, కృతక శక్తుల పూజలు, ఆత్మహననం. ఇలా చెప్తూ శాంతికి ద్వారాలు మూసేశాడు.
హేతువు, ఆధ్యాత్మికత
హేతువాదం పేరుతో శుష్క తర్కాలు సాగించే కాలం నుంచి, కుహనా ఆధ్యాత్మికత (మోసపూరిత ఆధ్యాత్మికత), మతం పేరుతో ఆలోచనకు, ప్రశ్నకు ద్వారం మూసేయడమే సమాధానం అని భావించే మృతప్రాయుల యుగంలో మనం జీవిస్తున్నాం. అందుకే హేతువుని, విశ్వాసాన్ని రెండిటినీ ఒకేలా నిలదీసిన బైరాగికి ప్రాసంగికత ఎప్పటికంటే ఇప్పుడు ఎక్కువగా ఉంది. స్పష్టత మహాపాపం… స్పష్టత భయంకరమైన హింస. హేతుబద్ధంగా ప్రపంచాన్ని, మనిషిని అర్థం చేసుకోవడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. తత్వవేత్త షోపెన్ హోవర్ “ప్రపంచాన్ని హేతువు కాదు, ఇచ్చ (will) కనపడకుండా నడిపిస్తోంది” అన్నాడు. ఫ్రాయిడ్, “చైతన్యానికి మూలం అచేతన” అన్నాడు. తత్వ వేత్త జిజక్ పిచ్చి నుంచి నిరంతర పలాయనమే ఆలోచన అన్నాడు. నాస్తికుడు గోరా కూడా, “అసలు మతమే మొదటి హేతువాదం” అన్నాడు. సృష్టికర్త అనే భావన కార్య కారణ తర్కం పరిధి లోనిదే అన్నాడు. ఎవరికి తగిన చెప్పుల జత వారికి లభించునట్లే, ఎవరి హేతుతర్కం కొలతలు వారివి అన్నాడు. పాజిటివ్ నాస్తికతను ఆత్మవిశ్వాసపుర్ణమైన నైతికతగా పునర్నిర్వచించాడు. హేతుబద్ధమైన ఆలోచన మొత్తంగా సందేహానికి గురి అయింది.
”రబ్బరులా సాగుతున్న చైతన్యం తెగుతుంది ఉన్మాదంలో” అంటాడు బైరాగి. “తెరిచారట పిచ్చాసుపత్రి ద్వారాలు, బద్దలు కొట్టారట అవ్యక్తపుటానకట్టలు” అంటాడు. అవ్యక్తపుటానకట్టలు తెగిపోయాక, స్పష్టత అరణ్య రోదనమే.
మృత్యువు నుంచి మృత్యువులోకి, స్పష్టత నుంచి అస్పష్టతలోకి, వ్యక్తం నుంచి అవ్యక్తంలోకి, రూపం నుంచి విరూపంలోకి ప్రయాణం చేసిన బైరాగి జీవితం, మన దృష్టిని మృత్యువు వైపు తిప్పుతుంది. మృత్యువు అతిథి కాదని, వెంటపడే అప్పులవాడు అని స్పష్టం చేస్తాడు. ప్రేమలో, జీవితంలో పొంచి ఉన్న మృత్యువును చూపుతాడు. ప్రేమ శిశువు శిరంపై పడగవిప్పి గొడుగు పట్టిన మృత్యువును, మరణగానంతో ప్రేమ శిశువు పోషణను వర్ణిస్తాడు. అయితే, స్థల కాలాలలో క్షణికంగా ఏర్పడిన ఉనికి వెనుక మృత్యువు పొంచి ఉంటుంది. అందుకే, అర్థం కోసం, పరమార్థం కోసం ఆ ‘నేను’ చేసే అన్వేషణ వ్యర్థ ప్రయాసగానే మిగిలిపోతుంది. “విను విను, జీవన మరణాల మధ్య ఊగే గంటలు మ్రోగినాయి” అంటాడు బైరాగి.
అర్థం వ్యర్థం
”భిన్న ప్రకృతుల ఇంద్రియాల రంగు రంగుల కళ్ళజోళ్ళు ఉద్రేకాల ఆవేశాల తప్పుడు బేరోమీటర్లు
పనిచేయని దిక్సూచి వివేకం ఇది
వాస్తవిక ప్రపంచంలో ధ్రువతార ఎక్కడ ఉన్నది
పగిలి విరిగి చెరిగి చిరిగి ముక్కలైన చెక్కలైన
ఈ జ్ఞానం ఏమిటి చెపుతుంది నీకు
నికరమేది ఖాయమేది
ఆంశిక సత్యాల అర్థసత్యాల అసత్యాల ఆధిపత్యంలో ముక్కు చెవులు తెగిన సత్యాన్ని గుర్తుపట్టలేవు నీవు”
నిరంతర క్షణికత్వం ప్రవాహ ప్రాయత్వం అర్ధాన్ని చదరగొడుతుంది. ఇది భాషా సమస్యకు కూడా దారితీస్తుంది. “వివరాల్లో విషయాన్నో, విషయంలో వివరాన్నో కోల్పోవడం జరుగుతుంది” అంటూ బైరాగి శబ్దాల అసమర్ధత గురించి స్పష్టం చేస్తాడు. అదే నిజమైన అసమర్ధుని జీవయాత్ర. అందుకే “జ్ఞానం అసమర్ధనరుని అపజయ యాత్రల చరితం” అంటాడు బైరాగి
కార్య కారణ సంబంధం
“వివిధ సిద్ధాంతాల కర్షణ విషమ వైరుధ్యాల ఘర్షణ
శప్త మానవ హృదయ భూమిని అనవరతము ఒక అగ్ని వర్షణ
కార్య కారణ పరిణతులపై
శుష్క తర్కపు ఊక దంపులు”
ఆధునిక సూతాశ్రమంలోని లోని హేతువాదంపై విరక్తి నుంచి విముక్తి కోసం సోనియాను శరణు వేడుతాడు బైరాగి. ఇక్కడ సోనియా అంటే దోస్తోయెవ్స్కీ రాసిన నేరము-శిక్ష నవలలోని ఒక వేశ్య. సమస్యలతో నిండిన ప్రపంచంలో విముక్తి కోసం ఆమెను శరణు వేడుతాడు. మృత్యువు నుంచి అమరత్వానికి, చీకటి నుంచి కాంతిలోకి దారి చూపమని వేడుకుంటాడు. ఇది ‘తమసోమా జ్యోతిర్గమయ’ అనే ఉపనిషత్తు మంత్రానికి ఒక విలోమ వ్యక్తీకరణ. గోపీచంద్లా కాకుండా, అరవిందుడిని కానీ మరొకరిని కానీ కాకుండా, ఒక వేశ్యను జ్ఞానభిక్ష కోరుతాడు బైరాగి. “ప్రపంచపు ఫార్స్ పైన నీ బతుకు ఒక వ్యంగ్యచిత్రం “అని వేశ్యపై కవిత రాస్తాడు.
నడక ఎందుకు?
ఇలా కార్య కారణ సంబంధాలను, సిద్ధాంతాలను సందేహించిన బైరాగి జీవిత గమనానికి ఏ దిశను నిర్దేశిస్తాడు? ఏ గమ్యానికి దారి చూపుతాడు?
“ఈ నడకకు అర్థం లేదు.
అయినా ఇది వ్యర్థం కాదు
నడకలో ఉన్నదొక అందం
నడకలో యతిప్రాసలు నడకకు ఛందస్సు ఉంది”
టి. ఎస్. ఎలియట్ కవితలోని కొన్ని వాక్యాలు — బైరాగి అనువదించినవి — ఇక్కడ గుర్తుకొస్తాయి.
“బహుశా కృష్ణుడిదే అని ఉంటాడు
కురు భూమిని అర్జునునకు కర్తవ్యం బోధించినప్పుడు
సౌఖ్యంగా పోయి రండి అని కాదు
ముందుకు సాగండని మాత్రమే”
అందుకే ఆధ్యాత్మికత, మతం, సిద్ధాంతాల పేరుతో పలాయనం వల్ల ప్రయోజనం లేదు. నడక, నడక కోసమే. గమ్యం కాదు, మార్గమే ముఖ్యం. అందుకే బైరాగి నిరాశావాదం అత్యంత ఉత్తేజకరమని అంటారు పాలగుమ్మి పద్మరాజు. బైరాగి కవితలలో నైరాశ్యం నిస్పృహ ముఖ్యమైన ఆవేశాలు. ఐతే బైరాగి నైరాశ్యం కిందికి దిగేలాగేది కాదు. అంతరాత్మను ఉర్రూతలూగించే ప్రభంజనం లాంటిది అంటారు పద్మరాజు.
జీవితానికి కానీ, కవిత్వానికి కానీ అర్థం, గమ్యం, స్పష్టమైన రూపం అసాధ్యం. అర్థం అయిన దానికన్నా అధికంగా స్ఫురించేది, చేతలకు చెందరానిది మాటలకు అందరానిది కవిత్వం అని బైరాగి హృదయం. వివిధ సంక్లిష్ట సంబంధాలు తప్ప రూపం లేదు. మరి బైరాగి కవిత నిర్మాణం ఎటువంటిది? అది ఎటువంటి కవితా శిల్పం?
“ఏకాంత మానవాత్మల భీకర సైకత సాగరాన
తరుగని చెరుగని పిరమిడ్లు కడుతున్నాను
ప్రణయ మరణాల దాగుడుమూతల కొరకు
పిరమిడ్లు కడుతున్నాను”
విగ్రహాంతకుడనే కానీ విగ్రహ విక్రేతను కాను అంటాడు. నిజమే ఆయన తన కవిత్వానికి రూపం ఇవ్వలేదు. పైగా విగ్రహ విధ్వంసకుడను అని ప్రకటించుకొన్నారు కూడా.
చిదంబర క్షేత్రంలో ఒక పూజారి నాకు ఒక మాట చెప్పాడు. శివుని అభివ్యక్తి మూడు రకాలుగా ఉంటుంది: రూపం, రూపారూపం, మరియు అరూపం. ఇదే బైరాగి చెప్పిన చిదంబర రహస్యం.
“తాను నిర్మించే మందిరంలో నైరాశ్యానికి, శూన్యానికి, చిదంబర రహస్యానికి ప్రాణప్రతిష్ట చేస్తున్నాను” అని స్వయంగా ప్రకటిస్తాడు బైరాగి. స్పష్టత, రూపం, వ్యక్తతల పాత్ర నామమాత్రమని నిరూపిస్తాడు.
”శబ్దార్థాలు తమ స్వార్థాన్ని విడిచిపెట్టి, కనబడని అర్థాన్ని ఆశ్రయించడమే ధ్వని” అని అది విశిష్టమైన కావ్యలక్షణమని అంటారు ఆలంకారికులు. మరి అర్థాన్ని, రూపాన్ని పరమార్థంగా భావించే సాహిత్యవేత్తలకు బైరాగి ఇచ్చే సమాధానం ఏమిటి?
“ఇతర కవులు వారు సుకృతులు వారికి నా నమస్కృతులు
పరాజితుడను మౌనవ్రతుడను మీ శ్రేయోభిలాషిని
హితుడను కానీ నేను కాచుకున్న రేతిరికే సన్నిహితుడను
మళ్ళీ మీకు చెబుతున్నాను నేను మీ కవిని కాను
ఇంక నన్ను వదలండి దయచేసి వెడలిపొండి”
అని తరిమికొడుతూ, “ఆకాశమంతా ఆక్రమించిన ఆదిమ తమస్సులలోకి” బైరాగి నిష్క్రమించాడు.
మూలాలు
- నూతిలో గొంతుకలు, చీకటి నీడలు, ఆగమగీతి, ఆలూరి బైరాగి, మిలింద ప్రకాశన్ హైదరాబాద్ 2006.
- కవన కుతూహలం, అబ్బూరి వరదరాజేశ్వర రావు, విశాలా గ్రంథశాల 1989.
- ఆగమగీతి, ఆలూరి బైరాగి రావినూతల సత్యనారాయణ మిసిమి మాసపత్రిక మార్చి 2014.
- సాహిత్యంలో దృక్పథాలు ఆర్ ఎస్ సుదర్శనం, రాజమండ్రి 1968.
- అసమర్థుని జీవయాత్ర గోపీచంద్ విశాలాంధ్ర విజయవాడ 2001.
- Helgoland: Making Sense of the Quantum Revolution Carlo Rovelli Penguin Publishing Group 2021.
- నేటి కాలపు కవిత్వం తీరు తెన్నులు_తమ్మినేని యదుకుల భూషణ్ 2004.
- నేను నాస్తికుణ్ణి, గోరా, నాస్తిక కేంద్రం విజయవాడ 1976.
