శతవసంతాల కవి ఆలూరి బైరాగి

“నాకు కొంచెం నమ్మకమివ్వు
కొండలు పిండి కొట్టేస్తాను
చితికిన టమాటో లాంటి సూర్యుణ్ణి
ఆరిన అప్పడం లాంటి చంద్రుడ్ని
ఆకాశపు ఎంగిలి పళ్లెంలోంచి నెట్టేస్తాను
నాదగు బహు బంధనంలో
ఈ విశాల బ్రహ్మాండాన్ని చాపలా చుట్టేస్తాను”

ఇలా అడుగుతున్నది తెలుగులో అతి నవ్య కవిగా పేరుగాంచిన ఆలూరి బైరాగి. బతికిన కాలమంతా కవిత్వమే శ్వాసగా జీవించినవాడు, కవిత్వంలో ఉద్రేకాలు, ఉద్వేగాలు ఒక సముద్రపు పొంగులా అనేకానేక భాషాపద చిత్రాలతో కొత్తపుంతలు తొక్కినవాడు. 1925 సెప్టెంబర్ ఐదున జన్మించిన ఆలూరి బైరాగికి ఇది శతజయంతి సంవత్సరం. బైరాగి శతజయంతితో పాటు ప్రముఖులైన ఆరుద్ర, ఆవంత్స సోమసుందర్, దాశరథి, భానుమతి తదితరుల శతజయంతి ఉత్సవాలు ఈ సంవత్సరం పొడవునా జరుగుతున్నాయి. ఇటీవల ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నెలకొల్పిన కృష్ణాజిల్లా రచయితల సంఘం వారి ఆలూరి బైరాగి స్మారక పురస్కారం అందుకోవడం నాకు సంతోషాన్నిచ్చే అంశం.

ఆలూరి బైరాగి, వెంకట్రాయుడు-సరస్వతమ్మ దంపతులకు 1925 సెప్టెంబర్ ఐదున తెనాలి దగ్గర ఐతానగరంలో జన్మించాడు. పాఠశాలకు వెళ్లి చదువుకున్నది రెండవ తరగతి వరకు మాత్రమే. తండ్రి దేశభక్తుడు అవడంతో బైరాగిని హిందీ చదువుకోమని ప్రోత్సహించాడు. ఎలమంచిలి వెంకటప్పయ్య స్థాపించిన హిందీ పాఠశాలలో చదువుకుంటూ, తరువాత హిందీలో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఉత్తరభారతం వెళ్ళాడు ఆలూరి బైరాగి. హిందీ భాషా సాహిత్యాలను చదువుకుంటున్న ప్రాథమిక దశలోనే హిందీలో కవిత్వం రాయడం ప్రారంభించాడు. బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో జరిగిన కవి సమ్మేళనంలో తన 15వ ఏటనే పాల్గొని హిందీ సాహిత్య ప్రముఖులతో ప్రశంసలు అందుకున్నాడు. తన తొలినాళ్ళలో రాసిన హిందీ కవితలన్నింటినీ కలిపి ‘పలాయన్’ పేరుతో కవితా సంపుటిని ప్రచురించాడు. హిందీలో ‘పలాయన్’ కవిత్వాన్ని ఆస్వాదించిన అనేకమంది పాఠకులు, ఈ కవి రాసిన ఇంకేవైనా పుస్తకాలు ఉన్నాయా అని వెతుకుతూ ఉండగా, కొందరు ప్రచురణకర్తలు ‘పలాయన్’లోని అవే కవితల్ని వేరొక పేరుతో పుస్తకంగా వేసి ఆ పుస్తకాన్ని హిందీలో ప్రచారంలోకి తెచ్చారు. అతని తొలి హిందీ కవితాసంపుటి అంతటి పేరు ప్రఖ్యాతులు పొందింది.

తెనాలి తిరిగి వచ్చిన బైరాగి, గుంటూరుకు సమీపంలోని పత్తిపాడులో హిందీ ఉపాధ్యాయుడుగా చేరాడు. 1942లో స్వాతంత్ర్యం కోసం గాంధీజీ పిలుపుమేరకు జరుగుతున్న క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆ తరువాత ఎం.ఎన్. రాయ్ రాడికల్ హ్యూమనిజం ప్రభావానికి లోనై రాడికల్ డెమోక్రటిక్ పార్టీలో కొంతకాలం పనిచేశాడు.

‘చందమామ’ తెలుగులో పిల్లల మాసపత్రికగా అత్యంత ఆదరణ పొందిన పత్రిక. ఆ పత్రికను హిందీలో కూడా ప్రచురించాలని నిర్వాహకులు అనుకున్నప్పుడు, ఆ నిర్వాహకులలో ఒకరైన చక్రపాణిగారు తన అన్న వెంకటరాయుడు కుమారుడైన బైరాగిని ఆ పత్రికకు సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించడానికి ఆహ్వానించారు. అలా బైరాగి హిందీ ‘చందమామ’ పత్రికకు తొలి సంపాదకుడయ్యాడు. అయితే తొలి నుంచి ఎటువంటి కట్టుబాట్లకు, నియమ నిబంధనలకు లొంగి ఉండే అలవాటు లేని కారణాన, ఆ పత్రికలో ఎక్కువ కాలం కొనసాగలేకపోయాడు. నెల పొడవునా చేయాల్సిన పనిని వారం రోజుల్లో ముగించి, తనకిష్టమైనవి చదువుకుంటూ గడపడం బాబాయ్ చక్రపాణికి నచ్చలేదు. దానితో ‘చందమామ’కు రాజీనామా చేసి తిరిగి తెనాలి చేరుకున్నాడు. ‘చందమామ’లో పనిచేసిన కాలంలో బాలల కోసం అనేక రచనలు చేశాడు. ‘స్నేహ ధర్మం’, ‘వేటగాని సాహసం’, ‘కలవారి అబ్బాయి’ లాంటి గేయ కథలు బహుళ ప్రాచుర్యం పొందాయి. పిల్లల గేయాలు రాసేటప్పుడు బైరాగి వాడిన భాష అతి సులభగ్రాహ్యంగాను, అలతి అలతి పదాలతో ఉండడం గమనార్హం.

“చీకటి పడింది తల్లీ, దీపం చూపవేలనే
మాకై దీపం చూపవేలనే
ఆటపాటల ప్రొద్దు బుచ్చినవి
పిట్టలు గూటికి తిరిగి వచ్చినవి
రెక్కలార్చి పవలెల్ల నొచ్చినవి
సంజమసక నిన్ను దరియ వచ్చితిమి కోపమేలనే?
మాకై దీపం చూపవేలనే
పాప పుణ్యములు పరిచిన బాటలు
కూడని వేడుక కూడిన చోటుల
పయనించాం మా పసి చెలగాటల
మలిన దేహులము, చల్లని చేతులు చూపవేలనే?”

ఇలా ఉంటుంది ఆయన రచన శైలి.

బైరాగి ఆయన కలంపేరు కాదు. పూర్తి పేరు ఆలూరి బైరాగి చౌదరి. తల్లిదండ్రులకు బైరాగి కంటే ముందు ఇద్దరు పిల్లలు పుట్టి చిన్న వయసులోనే చనిపోవడం, బైరాగి పుట్టినప్పుడు ఆయన తాత బిడ్డను చూసి “బైరాగిలాగా తెల్లగా ఉన్నావురా” అనడంతో ఆయన పేరు బైరాగిగా స్థిరపడిపోయింది. పైగా అప్పట్లో పుట్టిన బిడ్డలు చనిపోతుంటే తర్వాత పుట్టినవాళ్ళకు వింత పేర్లు పెట్టే ఆచారం కూడా ఉండడంతో, ఆయన పేరు ఆలూరి బైరాగి చౌదరి అయింది. ఆయనకు ముగ్గురు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లు. బిహార్ చదువుకోవడానికి వెళ్లి 1941లో తిరిగి వచ్చిన కొద్ది కాలానికే ఆయన తల్లి చనిపోవడం ఆలూరి బైరాగికి అశనిపాతమైంది. ఆమె మరణం అతన్ని అన్ని విధాలా కృంగదీసింది. తల్లి పట్ల అతనికున్న ప్రేమను ప్రకటించుకోవడానికి ‘చీకటి నీడలు’ కవితా సంపుటిని అమ్మకు అంకితమిస్తూ, “అమ్మా, ఈ కవిత్వాల ప్రతి చరణంలో, బ్రతికి ఉన్న ప్రతి శబ్దంలో పలుకరిస్తున్న నీకు, ఇవ్వడానికి నా దగ్గర ఇంతకంటే ఏముంది?” అంటాడు బైరాగి. పాఠశాలకు వెళ్లి చదువుకున్నది రెండవ తరగతి అయినప్పటికీ, హిందీ, ఆంగ్లభాషల పట్ల అద్భుతమైన అభినివేశాన్ని కలిగి ఉండడం మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది.

హిందీ నేర్చుకోవడానికి యలమంచిలి వెంకటప్పయ్య, వ్రజానందన శర్మల దగ్గర శిష్యరికం చేసినప్పటికీ, ఆంగ్లం నేర్చుకోవడానికి ఎవరి దగ్గర శిష్యుడిగా చేరలేదు. స్వయం అధ్యయనం ద్వారా ఆంగ్లం నేర్చుకున్నాడు. బైరాగికి వివాహం పట్ల ఎటువంటి ఆసక్తి లేదు. ఎవరైనా మిత్రులు “ఇంకా పెళ్ళెప్పుడు?” అని అడిగితే, “చేసుకొని మీరేం సాధిస్తున్నారు?” అంటూ పెళ్ళి మాటల్ని పక్కకు నెట్టేవాడు. బైరాగి పట్ల సోదరులందరూ ప్రేమాభిమానాలను చూపేవారు. మరణానికి ముందు చివరి రెండు దశాబ్దాలు హైదరాబాదులోని తన తమ్ముడు సత్యం దగ్గరే గడిపాడు. కానీ, క్షయ వ్యాధితో అనారోగ్యం పాలైనప్పుడు హాస్పిటల్‌కు వెళ్లడానికి కానీ, చికిత్స చేయించుకోవడానికి కానీ ఇష్టపడలేదు.

బైరాగి జీవించి ఉన్నంతకాలం ఆయన కవిత్వం పట్ల ఇష్టం చూపిన వారున్నారే కానీ, ఆయన కవితాలోకానికి దూరంగానే ఉండిపోయారు. దానికి ప్రధాన కారణం ఆయన కవిత్వంలో చూపిన స్వతంత్రత, స్వేచ్ఛాతత్వం, ఏ నిజానికి లొంగని నవ్య మానవతా దృక్పథం అనుకోవచ్చు. బైరాగి పెద్దగా ఎవరితో కలిసేవాడు కాదు. ఏకాంత చింతన, తనలో తానే ఉండిపోవడం ఎక్కువగా ఉండేది. ఆయన తమ్ముడి దగ్గర గడిపిన చివరి 20 ఏళ్ళలో ఎవరితో పెద్దగా మాట్లాడేవాడు కాదు. తన చిన్ననాటి మిత్రులు నన్నపనేని సుబ్బారావు, కోగంటి రాధాకృష్ణమూర్తి లాంటి వాళ్ళు వస్తే తప్ప గదిలోంచి బయటకు కూడా వచ్చేవాడు కాదు. పత్తిపాడులో పనిచేస్తున్నప్పుడు, అంతకంటే ముందు కాలంలో తాను రాసిన కవితలన్నింటినీ ‘చీకటి నీడలు’ పేరుతో కవితా సంపుటిగా తీసుకువచ్చాడు. ‘చీకటి నీడలు’ కవితాసంపుటి సాహితీలోకంలో గొప్ప సంచలనాన్ని తీసుకువచ్చింది. ఊహకీ వాస్తవానికీ, క్రియకీ కదలికకీ మధ్య ఎవరిలో నీడలు పడుతున్నాయంటూ మొదలైన ఆ కవితా సంపుటి ఆధునిక నవ్య కవితా వాదాన్ని ముందుకు తెచ్చింది. అప్పటికే తెలుగు సాహిత్య లోకాన అభ్యుదయ కవితాజ్వాలలు వెలుగు రేఖల్ని చిమ్ముతూనే ఉన్నాయి. మరోపక్క కృష్ణశాస్త్రి భావ కవితావీచికలు పాఠక హృదయాలపై చల్లని గాలులు ప్రసరింపజేస్తున్నాయి. అయితే బైరాగి ఈ రెండు దారులకు భిన్నంగా తనదైన కవిత్వాన్ని పాఠక లోకానికి అందజేశాడు. అప్పటికే ఉగాదులకు, దీపావళులకు సందర్భోచిత కవిత్వం రాయడం కవులకు పరిపాటి అయింది. అయితే బైరాగి కొత్త ధోరణితో దీపావళి కవితను రాశారు:

“దీపావళి ఉత్సవమండీ
దీపావళి చేద్దాం రండి
ఆకాశం మండిద్దామా
పాతాళం తగలేద్దామా
దీపావళి చేద్దామా
నరకాసురుడు ఎందుకు
ప్రపంచ నరకాన్నే మసి చేద్దామా
కాటుకల నల్లని చీకటి యోధుల బంధించిన
వాకిటి తలుపులు పగలేద్దామా”

ఇక్కడ దీపావళి ఏ ఆనందాల కోసం జరుపుకుంటున్నాము? ఆ ఆనందాలు అందరివీ కావు, ఇంకా ప్రపంచమంతా నరక కూపంలోనే ఉంది. ఆ నరకాన్ని మసి చేసే దీపావళిని జరుపుకుందామని పిలుపునిస్తున్నాడు.

“తమ బ్రతుకుల ఆఖరి శ్వాసలు
వదిలిన చల్లారిన ఆశల
మొగము పైన నల్లని దుప్పటి
కన్ను మిన్ను కానని చీకటి
రండోయ్! చితులు రగుల్చండీ!
చీకటి గుండెలు కలచండీ!
మంటల నాట్యపు మ్రోగే గజ్జలు
చిటపట కాలే శవాల సెజ్జలు
రగిలిన చితిమంటల వాదం
పగిలిన యుగ ఘంటానాదం
అది చీకటి శివ సంగీతం
ఉన్మత్తుని స్వేచ్ఛా గీతం
దీపావళి తెచ్చిందండి
దీపావళి చేద్దాం రండి”

అంటాడు.

పరిసర వాతావరణం నుండి రవంత తొలగి నిలిచి, లోకాన్ని ఆత్మీయతతో, జాలితో, ఆవేశంతో, ఆవేదనతో చూడగలిగిన కవితాత్మక శక్తి బైరాగిది. సాటి మనిషి కష్టాలను సొంతం చేసుకొని వాటికి విశ్వజనీనతను కల్పించడం బైరాగి కవితా నిర్మాణం. బైరాగి కవిత్వంలో వాడే పదజాలం అద్భుతంగా ఉంటుంది. భాష మీద ఉన్న పట్టు చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. పైగా ఈ పదజాలం ఏ ప్రత్యేక వాదానికీ, ఇజానికీ చిక్కదు. ఇదంతా ఆయన ప్రత్యేక సృష్టి. ప్రత్యక్ష పదం ఒక విధంగా ఉంటే, వాటికి నిగూఢ అర్థాలను ఆపాదించడం బైరాగి ప్రత్యేకత. “అర్థమైన దానికన్నా అధికంగా స్ఫురించేది, చేతలకు చెందనిది, మాటలకు అందనిది కవిత్వం” అన్న వాక్యాలు ఆయన తన కవిత్వానికి ఇచ్చుకున్న నిర్వచనంగా మనం భావించాలి.

బైరాగి కవితలలో నైరాశ్యం, నిస్పృహ, ఆత్మ చింతన ప్రస్ఫుటంగా కనబడతాయి. అయితే ఆయన నైరాశ్యం మనసును కిందకు లాగివేసేది కాదు, అంతరాత్మను తొలిచే ప్రభంజనం లాంటిది అంటాడు పాలగుమ్మి పద్మరాజు.

వేశ్యావృత్తి మీద ఒక చురక లాంటి కవిత రాశాడు బైరాగి.

“ఆ అచ్చోత్తిన వారచూపులా ఆ వల మరుని తూపులు
విద్యుత్ కాంతులు
చల్లని రేయి అశాంతులు
ఎరువిచ్చిన శృంగారం
నీ తళతళ మెరిసిన గాజులు
నీ గిల్టు చంద్రహారం
అణా పూలు, కాణీ తాంబూలం
నలిగిన చీరలు, చీకటి ముసుగులు
ఇదా నీకు జీవితమిచ్చిన బహుమానం?”

అంటూ నెత్తుట తడిసిన అడుగులతో, కన్నీరుల ఉప్పని మడుగులపడి జీవితాల్ని కాల్చేసుకున్న వారి గురించి శోకిస్తాడు. వేశ్య దైనందిన జీవన వాస్తవాన్ని అక్షరీకరించడంలో బైరాగి కృతకృత్యుడయ్యాడు. “నీ చల్లని నిట్టూర్పులలో బ్రతుకుటెడారుల గాడ్పులు, ఓ కులటా! రూపాజీవి! అనాకారి బ్రతుకుల దౌర్భాగ్యపు వెక్కిరింతలా నిలిచిన నీపై, నాపై, జగతీతలిపై అలుముకొనే ద్వేషపు చీకటిలో కరుడుగట్టిన నెత్తుటి పాటలు, ప్రపంచమొక ప్రశ్నా చిహ్నమై నిలుచును” అంటాడు.

ఆనాటి కవిత్వావరణంలో తాను ఇమడలేనని, తన మాట తన బాట వేరని అంటూ “నేను మీ కవిని కాను” అని ప్రకటించుకున్నాడు బైరాగి.

“నాదాల, నినాదాల, వివాదాల బాణసంచాలు పేల్చడానికి
రంగురంగుల మతాబులు కాల్చడానికి
చిలుకలాగ సూక్తులు పలకడానికి
శాక్రీన్ తేనె సోన లొలకడానికి
నేను మీ కవిని కాదు”

అంటాడు.

“నిధనం వంటి ధనం చేసే సత్కారాలు, సన్మానాలు,
జరీ అంచుల శాలువాలు, చందన తాంబూలాలు,
పూల గుత్తులు, హారాలు,
కవితాసతి శవ సంస్కార క్రతువులోన
తీరని అవమానాలు.
జీవిత-మహిత-జనక-దుహిత స్వయంవర సమరంలోన
పినాకాన్ని తృణంలాగా త్రుంచిన నేను
దీనంగా, మౌనంగా నేడు వేడుకుంటున్నాను
నేను మీ కవిని కాను”

అంటాడు.

ఆనాటి కవులందరూ ఒక ధోరణిలో సాగుతుంటే, బైరాగి నూతన అన్వేషణలతో తన మార్గాన్ని వెతుక్కునే క్రమంలో అప్పటి కవుల్ని, వారి చుట్టూ మూగే సమూహాల్ని నిరసిస్తున్నాడు.

అనారోగ్యంతో మృత్యువు వాకిట నిలిచినప్పుడు కూడా ‘నాకు చావు లేదు’ అంటూ మరణానికి తాను భయపడడం లేదని, తాను మృత్యుంజయుడినని అంటూ,

“మృత్యువును చూసి కాదు నేను
జీవితాన్ని చూసి జంకుతున్నాను.
హంతకుని కత్తి చూసి కాదు
కనుల ద్వేషం చూసి గొంకుతున్నాను
మనసులోని క్రౌర్యం చూసి జంకుతున్నాను”

అని సమాజంలోని ద్వేషాన్ని, క్రౌర్యాన్ని నిలదీస్తాడు.

ఒక తాత్విక ధోరణితో సాగిన ఈ కవితలో, “చూపులోన మృత్యువుంది, పిడికెడు బూదిలోన మృత్యువుంది, మృత్యువులేని చోటు చెప్పు, మనకచట ఉనికి ఏర్పరుస్తాను” అంటాడు. వేదనాగ్ని సంభవుడు, భావుకుడు, నిత్య పునర్నవుడు అయిన తనకు చావు లేదని, తాను ఒక మృత్యుంజయుడనైన మానవుడినని అంటాడు.

బైరాగి ‘నూతిలో గొంతుకలు’ ఒక విలక్షణమైన సంశయాత్మక కావ్యం. దీనిలో మానవుడు “ఏది త్రోవ?” అని అడుగుతాడు. అనేక ఆవేదనలతో నడుస్తున్న జీవితంలో ఏది కర్మ, ఏది కర్మక్షేత్రంలో తాత్కాలికం, ఏది కర్మానంతర బాధ అనే అంశాలను షేక్స్‌పియర్ ‘హామ్లెట్’, మహాభారతంలోని అర్జునుడు, దాస్తొయెవ్‌స్కీ ‘రాస్కల్నికోవ్’ ద్వారా చర్చకు పెడతాడు.

“ఏది బ్రతుకు, ఏది చావు? పొంగే వరదల మధ్య ఈదేవారు, ఈదనివారు, మునిగేవారు, తేలేవారు, కర్మణ్య-అకర్మణ్యతల, సాఫల్య-అసాఫల్యాల, చలదూర్ముల ప్రహారాలు తప్పుకొని చేరుతాడు ఒకే ఒక్క తీరాన్ని. కాని వాళ్ళు, అయిన వాళ్ళు నిలుస్తారు ఒకే ఒక్క ద్వారాన్ని. ఒక్క చావు, ఒక్క బ్రతుకు లెక్క ఏమిటి?” అంటూ హామ్లెట్ ద్వారా పలికిస్తాడు. ఇది కర్మ పూర్వపు వేదన. ఈ వేదన మానవుని సహజ వేదన. మనిషి తనలోకి తాను చూసుకున్నప్పుడు కలిగే వేదన. రెండవ ప్రపంచ యుద్ధం బైరాగి మీద తీవ్రంగా ప్రభావం చూపించిందనడానికి ఉదాహరణగా అర్జున విషాద యోగం కనబడుతుంది. భారతంలో కురుక్షేత్ర రణరంగంలో అస్త్ర సన్యాసం చేయబోయిన అర్జునుని పాత్రను, అప్పటి యుద్ధ వ్యతిరేక భావనలకు ప్రతీకలుగా తీసుకొని బైరాగి, “పోదాం పద, ఓ దేవా! రాజ్యము వద్దు, రాజభోగం వద్దు, ఈ విద్వేషాగ్నులకిక ఆజ్యం వద్దు, అతి విస్తృత వసుధ మీద దుర్లభమా ఆశ్రయమే?” అని తన యుద్ధ వ్యతిరేకతను ప్రకటిస్తాడు. రాస్కల్నికోవ్ ద్వారా “త్రోవ ఎక్కడ? వెలుగులెక్కడ? శరణం ఎక్కడ? త్రోవ తప్పిన ప్రేతకోటికి త్రోవ ఎక్కడ?” అని వెతుకులాట మొదలుపెడతాడు.

బైరాగి మరణం తరువాత ఆయన పెట్టెలోని రచనలన్నీ వెలికితీసి “ఆగమగీతి” పేరుతో ప్రచురించారు. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఒంటరితనాన్ని ప్రేమించిన బైరాగి, మిత్రులెవరినీ దగ్గరకు రానిచ్చేవాడు కాదు. చివరి రోజుల్లో హైదరాబాద్లో తమ్ముని దగ్గర ఉన్నప్పుడు గదిలోంచి బయటకు వచ్చేవాడు కాదు. అప్పటి తన స్థితిని గూర్చి ‘త్రిశంకు స్వర్గం’ అనే కవితలో, “గాలిరాని చీకటి గదిలో, మారుమూల మదిలో నిర్మించిన మహా ప్రపంచం, నేను విరించిని – భారంగా వ్రేలాడే సిగరెట్ పొగ, పారాడే బండరాయి, చీకటితో పోరాడే వెలుతురులో నోరాడని కటికదుమ్ము, భూమ్యాకాశాల మధ్య ఆ త్రిశంకు స్వర్గంలో తారాడే సాలీడుకు ఈడు జోడు, వాడు వీడు చాపమీద పొరలాడే నరాధముడు” అని తన ఉనికిని ప్రకటించుకున్నాడు.

బైరాగి కవిత్వం పార్శ్వాలను తడిమి చూడడం, ఆయనలోని సామాజిక, రాజకీయ, తాత్విక కోణాలను పరిశీలించడం, మరీ ముఖ్యంగా ఆయన ఉపయోగించిన పదబంధాలు, భాషా సౌరభాలు ఆస్వాదించడం, తాదాత్మ్యం చెందడం దాదాపు నాకు ఒక నిరంతర ప్రక్రియ. ఎప్పుడు ఆయన కవిత్వం తీసి చదివినా కొత్త దృశ్యాలు మనోఫలకం మీద ఆవిష్కృతమవుతాయి. కవిత్వంతో నూరేళ్ళు జీవించి ఉన్న బైరాగి, మరో నూరు నూరులైన బతికే ఉంటాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.