బైరాగి

నలభై ఏళ్ళకు పైన, మా నాన్నగారు నాట్యగోష్ఠి ఉద్యమానికి అనుబంధంగా “నటాలి” అనే నాటక సంస్థను ప్రారంభించారు. యుద్ధం ముమ్మరంగా సాగుతున్న రోజులు. మా నాన్నగారితో పాటు మేమందరమూ ఎం.ఎన్. రాయ్‌గారి నాయకత్వం కింద అప్పుడు జరుగుతున్న ప్రపంచ యుద్ధాన్ని ఫాసిస్టు వ్యతిరేక యుద్ధంగా పరిగణించి, అందులో యథాశక్తి పాల్గొనాలని నిర్ణయించాము. యుద్ధంలో ఫాసిస్టు వ్యతిరేకశక్తులు విజయం సాధించిన పక్షంలో, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి తీరుతుందని ఎం.ఎన్. రాయ్‌గారు ప్రవచించారు. ఆయన అనుచరుల్లో కొందరు, “అయ్యా, యుద్ధాన్ని మనం బలపరిస్తే ప్రజల్లో మన పలుకుబడి పోతుందేమో?” అన్న భయాన్ని వ్యక్తం చేశారు. రాయ్‌గారన్నారు, “మీకు దేశ స్వాతంత్ర్యం కావాలా, తాత్కాలికంగా ప్రజల్లో పలుకుబడి కావాలా అన్నది తేల్చుకోండి,” అని. అప్పుడందరూ యుద్ధ ప్రయత్నంలో పాల్గొనటానికి తీర్మానించారు.

తెలుగు దేశంలో చాలామంది మేధావులూ, యువ రచయితలూ రాయ్‌గారి అనుచరులై, వివిధ రంగాల్లో యుద్ధ ప్రయత్నానికి దోహదం చేశారు. మా నాన్నగారు కాక, ములుకుట్ల వేంకటశాస్త్రి, పాలగుమ్మి పద్మరాజు, త్రిపురనేని గోపీచంద్, జి.వి. కృష్ణారావు, పి.వి. సుబ్బారావు, బాలగంగాధర తిలక్ ప్రభృతులుండేవారు. ఆ కోవలో చివరన నిల్చున్న వాడు ఆలూరి బైరాగి. ఎంచేతనంటే, అప్పటికి అతను తెలుగులో రచయిత కాలేదు.

ఆ రోజుల్లో నేనూ “నటాలి”లో పనిచేస్తుండేవాణ్ణి. నాతో పాటు శ్రీరంగం శ్రీనివాసరావూ, శ్రీరంగం నారాయణబాబూ పనిచేసేవాళ్ళు. శ్రీరంగం శ్రీనివాసరావుని మా నాన్నగారు స్వయానా పట్టుకొచ్చారు. నారాయణబాబు దొడ్డివాకిలిని ప్రవేశించాడు. అది వేరే కథ. మద్రాసు నుంచి నటాలిని మొదట్లో చీరాల తరలించారు. చీరాల నుంచి తెనాలికి మార్చారు మా నాన్నగారు. నటాలిలో నలభై మంది నటీనటులు, సాంకేతిక నిపుణులూ ఉండేవారు. తెనాలిలో ముందుగా ముత్తెంసెట్టిపాలెంలో ఒక పెద్ద మేడలో ఉండేవాళ్ళం. ఆ తరువాత నాజరుపేటలో మరో పెద్ద ఇల్లు తీసుకుని అందులో ప్రవేశించాము. మాకు ప్రదర్శనలు లేని రోజున తెనాలిలో ఉండేవాణ్ణి. సాయంకాలం కాగానే సూతాశ్రమంలో చేరేవాళ్ళం. అందులో గోపీచంద్, ఆయన తమ్ముడు గోకుల్‌చంద్ ఉండేవారు. గోపీచంద్‌తో కలిసి ఆ పక్క ఉన్న రత్నా టాకీస్ ముందర బల్లల మీద కూచునేవాళ్ళం. అక్కడికి ప్రతిరోజూ సమావేశమయ్యేవారిలో పి.వి. సుబ్బారావు, సూరీ, బైరాగి, నేనూ ఉండేవాళ్ళం.

మొదటి పరిచయంతోటే బైరాగి సన్నిహితుడైనాడు. ఆ రోజుల్లో అతను తెలుగు సాహిత్యం కొంతకొంత అధ్యయనం చెయ్యటం ప్రారంభించాడు. ముఖ్యంగా ఆధునిక సాహిత్యం. అందులోనూ కథలూ, నవలలూ — అవన్నీ రత్నా టాకీస్ సమావేశంలో దీర్ఘంగా చర్చిస్తుండేవాళ్ళం. గోపీచంద్ కూడా ఆ చర్చల్లో పాల్గొని తన కథల గురించి, నవలల గురించి విపులంగా చెబుతుండేవాడు. ఇవన్నీ వింటున్న బైరాగికి ఎవరి రాతల మీదా ప్రత్యేకాభిమానం లేదని మాకు తెలిసేది. మేమంతా మాట్లాడుకుంటుంటే మధ్య కలుగజేసుకుని ఒక వితండవాదాన్ని లేవదీసేవాడు. దాంతో గోపీచంద్‌కి విసుగొచ్చేది. కోపం కూడా తెచ్చుకునేవాడు.

షికారుకు బయల్దేరి రాజకీయాలు చర్చించేవాళ్ళం. అందరమూ విడిపోతున్నప్పుడు నాతో పాటు బైరాగి వచ్చేవాడు. మేమిద్దరం మళ్ళీ కొంచెం సాహిత్యం గురించి మాట్లాడుకునేవాళ్ళం. నేను బైరాగికి చెప్పాను, “ఊరికే అన్ని పుస్తకాలూ చదవకు, ఏమైనా రాయటం ప్రారంభించు,” అని. అతను మాట్లాడేవాడు కాదు. ఇలా కొన్నాళ్ళయిన తర్వాత ఓ రోజున బైరాగి రత్నా టాకీస్ గోష్ఠిలో కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరిగారిని విమర్శించాడు. బైరాగి అంటాడు, “మనమంతా వర్ణాశ్రమ వ్యవస్థను సమూలంగా విచ్ఛేదించాలని తీర్మానిస్తుంటే, కవిరాజుగారు ప్రతి కులంలోనూ మరో వర్ణాశ్రమ ధర్మాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు,” అని. దాంతో పి.వి. సుబ్బారావుకి కోపం వచ్చింది. ఇద్దరూ చెడామడా వాదించుకున్నారు. మేం వింటూ మాట్లాడలేదు. తర్వాత ఇంటికి పోతున్నప్పుడు, “నాకు రాయాల్నుందిరా ఇప్పుడు,” అన్నాడు. “రాయ్, ఆలస్యం చెయ్యక,” అన్నాను నవ్వుతూ. “అదో కోరిక,” అన్నాడు.

ఓ రోజున గోపీచంద్ కొత్త నవల రాయటం ప్రారంభించాడు. బైరాగి లాంటి అసమర్థుడు అందులో నాయకుడిగా ఉంటాడన్నాడు. నేనన్నాను, “‘అసమర్థుడి జీవనయాత్ర’ అని నేనూ ఆత్మకథ రాద్దామనుకుంటున్నాను,” అని. గోపీచంద్ ఆ శీర్షికను తను వాడుకుంటానన్నాడు. నవ్వుతూ నేను చెప్పాను, అందులో బైరాగి నాయకుడు కాకపోయిన పక్షంలో మీరు ఈ శీర్షికను వాడుకోవచ్చని. బైరాగికి ఇదంతా విని ఉక్రోషం వచ్చింది. సమావేశం అయిపోగానే మామూలుగా మేమిద్దరమూ మా ఇంటివైపు నడుస్తున్నాము. “నాకో నవల రాయాలనుంది, అందులో మన మేధావుల్నందర్నీ బట్టబయలు చెయ్యాల్నుంది,” అంటూ బైరాగి ఆవేశంతో మాట్లాడుతున్నాడు. బైరాగితో చెప్పాను, “అందరి మీదా నీది పైచేయి కావాలంటే కవిత్వం రాయి. అంతేకానీ, అందరిలాగా నవలలూ, కథలూ తలపెట్టకు,” అని.

మళ్ళీ బైరాగి రత్నా టాకీస్ వైపు రాలేదు. మూడు, నాలుగు రోజులైంది. అతనికి ఒంట్లో బాగోలేదేమో అనుకున్నాము. ఓ రాత్రి ముత్తెంసెట్టిపాలెంలో మా ఇంటికొచ్చాడు. అప్పుడా ఇంట్లో ఏమీ లేదు. కొత్తగా కట్టిన పూర్తికాని మేడ మెట్ల మీద “వరదా, వరదా!” అని అరుస్తున్నాడు. నేను కిందికి వచ్చాను. “కాసేపు బయటికి రా,” అన్నాడు. మేడ వెలుపలికి వచ్చాం. “నేను రాశాను. నువ్వు చదివి చెప్పు,” అన్నాడు. చేతిలో రెండు కాగితాలు. మళ్ళీ లోపలికి పోయాం. లాంతరు పెట్టుకుని అతను చదవడం, నేను వినడం. విన్న తర్వాత అద్భుతంగా ఉందన్నాను.

అందులో రెండే పంక్తులు నాకిప్పటికీ గుర్తు.

నగనగమ్మున పన్నగమ్ము
నదీ నదమ్ముల ఉపద్రవమ్ము …
చిరపరిచిత పాంథులార! పతితజీవ బంధులారా!

అదే బైరాగి తొలి ప్రయత్నం. అదెక్కడా అచ్చు వేయలేదు. తర్వాత మేమంతా విడిపోయాం. మిత్రుడు కృష్ణానందం, బైరాగి ‘నూతిలో గొంతుకలు’, నా ‘అందాక’ రెండో ముద్రణ అచ్చు వేయిస్తున్నప్పుడు, బైరాగి తన ‘నూతిలో గొంతుకలు’ పుస్తకానికి నన్ను తొలిపలుకు రాయమన్నాడు. మా నాన్నగారి చాటువులలో రెండు పంక్తులను ఉల్లేఖిస్తూ మన రచనలకు ఉపోద్ఘాతాలు అనవసరం అని రాశాను. అయినా తన పుస్తకంలోనే నేనన్నది ఒప్పుకుంటూ క్లుప్తంగా పరిచయం రాసుకున్నాడు.

మళ్ళీ అతణ్ణి చూడలేదు. మా ‘కవిత’కు అతని పద్యాల కోసం రాశాను. అప్పుడు తెనాలిలో ఉన్నాడు. ఒకేసారి నలుగురం మాలాంటివాళ్ళం ‘కవిత’లో కలిశాం. మా అందరికీ ఆనందదాయకంగా ఉండేది.

ఆఖరిసారిగా అతణ్ణి హఠాత్తుగా ఢిల్లీలో కలిశాను. వేమూరి ఆంజనేయశర్మగారు అతణ్ణి ఢిల్లీ పిలిపించారు. ఏదైనా ఉద్యోగం వెతుకుదామనే ఉద్దేశంతో, మా ఇంటికొచ్చాడు. “ఒరేయ్ వరదా, మనం ఇంకెన్నాళ్ళని బతకడం? ఇక్కడే ఉందామని వచ్చాను. ఇది నా ఆఖరి ఉద్యోగం,” అన్నాడు గుమ్మంలో కాలు పెడుతూ. డిసెంబర్ చలి. ఒక కోటు వేసుకున్నాడు. జవహర్‌లాల్ నెహ్రూ మార్గ్‌లో ఒక పాత కొంపలో శర్మగారు అతనికో గది ఇప్పించారు. చలికి తట్టుకోలేకపోయాడు. అతను ఉన్న కొద్దిరోజులూ నాతోనూ, రాజశేఖరుతోనూ గడిపాడు. “వెళ్ళిపోతాను, నన్ను రైలెక్కిచ్చి పుణ్యం కట్టుకో,” అన్నాడు. అతనే, “రైలు నుంచి దిగడం సులభం, ఎలా దిగామో తెలీదు. మళ్ళీ ఎక్కడమే బాధ,” అన్నాడు నవ్వుతూ. ఆ నవ్వే నాకిప్పటికీ జ్ఞాపకం.