కంఠం, ఒక కంఠం కావాలి నాకు.
పుంఖానుపుంఖ శంఖాల మంటల ఘంటలా పలుకగల కంఠం,
కంఠం నాకొక కంఠం
మానవ గీత ఆలపించే ఒక కంఠం.
అంటూ మహోద్రేకంతో గొంతు పూరించి నినదిస్తాడు బైరాగి.
ఆ గొంతులో ఉద్రేకం వుంది, ఉద్వేగమూ వుంది. ఆలోచనల చివర దట్టించిన ఆవేశమూ వుంది. అయినా అదొక బలహీనమైన స్వరం, నీళ్ళులేని నూతి లోంచి పలుకుతున్నట్టు నిర్జీవంగా వెలికి వస్తుంది ఆ స్వరం. పాడు నుయ్యి పతనానికీ, మరణానికీ సంకేతమని బైరాగి అంటాడు. అందులో పడివున్నవారికి వెలుగు కనిపించదు. పైకి పాకడానికి ఆధారం కానరాదు. వాళ్ళు కేకలు వేస్తారు. ఆ కేకల్లో స్పష్టత వుండదు. భూగర్భపు లోతులు వాళ్ళని బాహ్య ప్రపంచాన్నుంచి వేరుపరుస్తాయి. వాళ్ళు యాత్రికులు కూడా కారు. వాళ్ళకొక గమ్యంలేదు. చీకటి తప్ప వాళ్ళకి మరో తోడు లేదు. కానీ ఆ పాపం వాళ్ళది కాదు. అది సమస్త మానవకోటికీ వర్తిస్తుంది.
అక్షరాల లోతులు తరిచేకొద్దీ అతనిలోంచి ఒక అపరిచిత వ్యక్తి ఆవిష్కృతమవుతుంటాడు. జీవితం రెస్టోరాలో ఆవతలి కుర్చీ మీదనే అతను కూర్చొని వుంటాడు. మనకు, అతనికి మధ్య దూరం ప్రాణంలేని ఒక టేబుల్. పెదాలమీంచి పదాల రూపంలో ఒకరి అంతరంగాన్ని మరొకరు స్పర్శిస్తూనే వుంటాం. ఆయినా సరే, మన మధ్య దూరాలు చెరిగిపోవు. వ్యక్తిత్వాల అభివ్యక్తీకరణ అసంపూర్తిగానే వుంటుంది. మానసిక వాతావరణంలో సారూప్యత కనిపించదు. భౌతికంగా మనం అతి దగ్గర. మానసికంగా మన మధ్య ఆకాశమంత దూరం. ఈ దూర సామీప్యాల సంఘర్షణ కవిత్వం విషయానికివస్తే బైరాగిలో మరీ ఎక్కువ.
బైరాగి అంతర్లోకాల వేళ్ళు ‘సంశయం’లో వున్నాయి. సంప్రదాయాల శిరసు వంచి మానవ జీవితానికి కొత్త ఇరుసు చూపించాలన్న ఇరవయ్యో శతాబ్దపు తపనలోంచి పుట్టుకొచ్చినవాడు బైరాగి. అతను వాస్తవికత దిశగా కన్నువిప్పేనాటికీ సమాజం ఒక సంశయాల చౌరస్తాలో సందేహాల భయబీభత్సాలను కప్పుకుని నిలబడింది. విశ్వాసాల గట్లు తెగిపోయాయి. మహోద్రేకంతో కొత్త పవనాలు ప్రవాహ వేగంతో జీవితంలోకి ప్రవేశిస్తున్నాయి. ‘బ్రహ్మాండ కటాహంలో సల సలసల మరుగుతోంది. నూతన జీవన పాకం’ నవయుగ దైత్యుల దురంత విజయభేరికి వెరచి గౌరవనీయులు నిన్నటి దేవముఖ్యులు పారిపోయారు. ఎప్పటినుంచో ఊడలు దిగుతున్న వట వృక్షాలు కూలిపోయాయి. మనమెరిగిన ప్రపంచానికిది అంతం. ఒక కొత్త ప్రపంచం కొత్త నమ్మకాల దివిటీ వెలుగుల్లోంచి పుట్టుకువస్తోంది.
ఆ కొత్త ప్రపంచానికి, నవ మానవోదయానికి ‘ఆగమ గీతి’ పలుకుతున్నాడు బైరాగి. ఆ ప్రపంచం స్వరూపమేమిటో అతనికి తెలియదు. పునాదులను పెళ్ళగించుకుని వస్తున్న ఆ ‘అపరాజేయ మానవేయుడి’ కంఠం కూడా అతనికి పరిచయం లేదు. ఒక అదృశ్య దిశను వెతుక్కుంటూ అతను వెళ్ళిపోతాడు. ఒక అపరిచిత కంఠాన్ని అనుసరిస్తూ అడుగులు కదుపుతుంటాడు. ఆ బాట వెంటా, ఆ లక్ష్యం దిశగా తను సాగిస్తున్న ప్రయాణాన్ని తనదైన మాటలో వ్యక్తం చేసుకుంటాడు.
భావాన్ని వెతుక్కునే భాష అసమర్థత బైరాగికి తెలుసు. తన ఆంతరంగిక ప్రపంచాలను వివస్త్రగా చూపాలనుకున్న ప్రతిసారి అతను ఓడిపోతాడు. తనని తాను వెతుక్కుని నీడల్ని పట్టుకోబోయేసరికి అతనికి అద్దమే దొరకదు. వాడి పారేసిన విస్తరాకుల్లాంటి పదాలనే మళ్ళీ మళ్ళీ కడిగి తెస్తుంటాడు. అవి సిగ్గుపడి తలలు వంచిన శబ్దాలు. అసమర్థతను గుర్తించిన శబ్దాలు. మొక్కవోయిన అమ్ములు. అభివ్యక్తి విఫలమవుతుంది. అందరాని ఆనందాల సుందర సంకేతంలా జల జల జల ధ్వని మాత్రం వినిపిస్తుంది.
‘కాదు, కాదు, లక్ష్యం ఇది కాదు అసలు
ఏడో స్వర సంపూర్ణత, స్థిర సమగ్ర సమీచీనత
బహు వివరాల అంగాంగాల
అణువులోంచి మూలకందపుటాత్మలోకి
క్షుద్ర రేణు కణం నుంచి, మహా మేరునగం వరకు
సంక్షబ్ద సాగరాల ఘోష నుంచి, మూగ జీవాల భాష వరకు
అన్నిటినీ ఒక లయ, ఒక తాళం, ఒక రాగంలో మేళవించి
నాలో లోకం కొరకై, లోకంలో నా కొరకై
ఏకైక మహోద్రేకం ఉరికించాలని కోరిక’
కాని ‘స్వర సంపూర్ణత’ దక్కదు. వివరాలకు, విషయానికీ పొంతన కుదరదు. వివరం విషయాన్నో, విషయం వివరాన్నో విభేదిస్తుంది. ఆలోచనల చివర ఒక నిశ్శబ్దం మాత్రం మిగులుతుంది. నిశ్శబ్దం ఒక తుఫానులాంటి ఆవేశానికి పల్లవి.
నూతిలో గొంతుకలు
అది తమస్సులు ఆవరించిన కరాళ కాలరాత్రి. తోవ ఎటో తెలియని సందిగ్ధంలో మానవాత్మ ఆక్కడ మేల్కొంది. నాగరిక ప్రపంచపు భీకరతర అరణ్యంలో మహా జనసమ్మర్దపు నీరవ నిర్జనత్వంలో తల్లిలేని పిల్లలా మానవాత్మ రోదిస్తోంది. అక్కడ ప్రతి మనిషీ ఒక చెరలో బందీ. ప్రతి మనిషి మార్పు కోసం ఎదురుచూసేవాడే. అదొక రంగస్థలం. నటుల సొంత గొంతుకలు అక్కడ వినిపించవు. శబ్దాల చప్పుళ్ళతో నిండిన శూన్యం అది. అస్తిత్వం వెతుక్కుంటూ బైల్దేరిన మానవాత్మను బహిష్కరించిన ‘విరాడ్విశ్వమందిరం’ అది. రంగస్థలంమీద నవ్వుల పూలవాన కురిపించిన విదూషకుడు తెర వెనక్కి వెళ్ళి బావురుమంటాడు. ఎప్పటికీ తల్లి కాలేని వంధ్య పురిటి నొప్పులు నటించి తృప్తిపడుతుంది. అక్కడి జీవితాలు అసంపూర్తి కావ్యాలు. తెగిపోయిన గీతాలు. ఆవేదనల అనంతంలోనే అవి అంతమవుతాయి.
మనిషి జీవితాన్ని ఒక ప్రళయం చుట్టుముట్టింది. మానవ మేధ మలమలా మాడిపోతోంది. పొద్దు పొడవదు, కూచునేందుకు వీలులేదు. ఒంటరిగా మంటల్లోంచి వెళ్ళిపోతున్నాడు మనిషి తనకే తెలియని దిక్కులవైపు.
‘నూతిలో గొంతుకలు’ కావ్యం సంక్షిప్త సారం ఇది. ప్రాచీన శిథిలాల్లోంచి, కొద్దిపాటి గతకాలపు అవశేషాల్లోంచి సంశయం పొరని కప్పుకుని సాగిపోతున్న ఏకాకి బహిరంతర్లోకాల ఘర్షణ ఇది. బలహీనపడిపోతున్న ఉనికిని నిలుపుకోవడం కోసం, కాళ్ళ కిందనుంచి హఠాత్తుగా జారిపోతున్న ఆధార పీఠాలను నిలదొక్కుకోవడం కోసం, మనిషి తనది కాక పరాయి జీవితాన్ని కప్పుకుని బతక్క తప్పని పరిస్థితిలోంచి కాపాడుకోవడం కోసం పడే తపనంతా ఈ కావ్యంలో కనిపిస్తుంది. అస్తిత్వాన్ని అన్వేషిస్తూ బయలుదేరినవాడికి ఒక అవరోధం పలకరిస్తుంది. ఒక అగాధం ఆవులిస్తూ ఎదురొస్తుంది. అక్కడ జ్ఞానం శాపంగా మారుతుంది. సున్నితత్వం వేధిస్తుంది. ప్రతి ప్రశ్నకు మౌనమే సమాధానమవుతుంది.
అక్కడ మనిషి కర్మకు, జ్ఞానానికి మధ్య నిరంతర ఘర్షణ సాగుతుంది. జ్ఞానం మనిషి నరాల సంవేదనాశక్తిని పదునుతీస్తుంది. ఆలోచన చుట్టూ అనుభూతి పొరలు కప్పేస్తుంది. అప్పుడు జీవితానికీ, బతుక్కీ మధ్య ఒక అడ్డుగోడ లేస్తుంది. ఆటు జీవిత జ్వరం, ఇటు బతుకు వ్యామోహానికీ మధ్య నలిగిపోతాడు జ్ఞాని. అప్పుడు మనిషి ఒక ‘హేమ్లెట్’గా మారిపోతాడు.
జ్ఞానం ఒక రంపంలా
చీల్చి, కోసి మానవుణ్ని తుత్తునియలు చేస్తుంది
అనస్తిత్వ పరిచయాన్ని క్షుద్రాస్తిత్వపుటా వేదనతో ముడివేస్తుంది.
జ్ఞానంలోవుండి బాధ, బాధలోన అనుమానం
నిత్య నిరుత్తరపు ప్రశ్న జ్ఞానం ఇచ్చిన దానం
అజ్ఞాతంలోంచి మరల అజ్ఞాతంలోకి పయనమే జ్ఞానం
జీవితం రంగస్థలం మీద మనిషికి బహు పాత్రాభినయాలు తప్పవు. కారణాల అకారణాలను అడ్డుపెట్టుకుని మనిషిని తరుముకొస్తుంది కాలం. ఒకోసారి అతను హేమ్లెట్గా మారి చావుబతుకుల మధ్య ఒకే ఒక నిట్టూర్పును చేసుకుని కొనవూపిరితో బతుకుతుంటాడు. మరోసారి రాస్కల్నికోవ్ ప్రపంచమ్మీది అన్ని పాపాల్ని, అన్ని నేరాల్ని తన వొంటికే పూసుకుని తనని తాను శిక్షించుకుంటాడు. మరింకోసారి జ్ఞాన జ్వరగ్రస్తుడై యుద్ధభూమి మధ్యలోంచి వెన్నుచూపే పిరికివాడయి విషాదంలో చిక్కుబడతాడు అర్జునుడిలా.
కవిగా బైరాగి తనని తాను ఏ పాత్రల్లో వెతుక్కుంటున్నాడో అక్కడ గమనించాలి. యుద్ధ రంగానికి వెళ్ళలేని హేమ్లెట్ నిస్సహాయత, యుద్ధాన్ని గెల్చి భయం చేతిలో వోడిపోయిన రాస్కల్నికోవ్ నిట్టూర్పులు, యుద్ధ భూమిలో కర్మకూ జ్ఞానానికి మధ్య పూగినలాడిన అర్జునుడి పశ్చాత్తాపంతో బైరాగి తన మానసిక ప్రపంచాన్ని ముడివేస్తున్నాడు.
బతుకు చీలు బాట మీద నిలబడి వున్నాను నేడు
ఎటుపోతే పూలబాట, ఎటుపోతే వల్లకాడు?
ఈ ప్రళయ ముహూర్తంలో ఏమిటి నా కర్తవ్యం
ఈ అగ్నిపర్వతంపై ఏ దిక్కున గంతవ్యం?
యుద్ధరంగం సిద్ధమయింది. రణభేరి మోగనుంది. రథమ్మీది కపిధ్వజంలా రెపరెపలాడుతోంది అర్జునుడి హృదయం.
‘నే యుద్ధం చేయలేను, మాధవా! రథం మరల్చు
ఈ మిత్తవ నేలనుంచి వేగం వెనకకు తరల్చు’
అంటూ యుద్ధ విరక్తుడయ్యాడు అర్జునుడు. మనిషి దుర్బల నరాల వీణ మీద ఎంత చిత్రంగా ఆడుకుంటుందీ కాలం? ధైర్యంలో భయాన్ని ఒంపి, ఆశలో నిరాశ కూర్చి నమ్మకాలను వమ్ముచేసి ఎంత వెనక్కి పరుగెత్తిస్తుంది జీవితం?
ఎటు పరిగెత్తుతాడు మనిషి? ఎప్పుడూ నడిరేయి చీకటి జడలు విచ్చిన అడవిలో వివిధ సిద్ధాంతాల ఆకర్షణలో, విషమ వైరుధ్యాల ఘర్షణలో తొట్రుపడుతూ ఎంత దూరం? వాడు శరీరాన్ని గాయాలతో అలంకరించుకున్న రాస్కల్నికోవ్గా మారి ‘త్రోవ ఎక్కడ’ అంటూ ఏ సోనియా ఆమాయకపు ఒడిలోకి జారిపోయాడో!
చీకటి, పగలూ ఒక్కటిగానే కనిపించే బతుకు. మనిషి శాపగ్రస్తుడయ్యాడు. తర్కం శుష్కమైపోయింది. కాలం శూన్యాన్ని నింపుకుంది. బంధాలు తెగిపోయాయి. శూన్య సీమలు ఆవరించిన బతుక్కి హామీ ఎవరిస్తారు? కనుక
‘పిలుపు మృత దుర్గతిలోంచి
నవ జీవిత సద్గతిలోకి
స్వాంతం నుంచి కాంతిలోకి
భ్రాంతి నుంచి శాంతిలోకి
సోనియా! తోవ చూపు
వెలుగు చూపు, తోవచూపు’
అంటూ ప్రాధేయపడి నిట్టూర్చడం కన్నా.
చీకటి నీడల్లో
వాస్తవం ఒక చేదు కల. మనిషిని పరిహసించడం దాని పని. మనిషికి వాస్తవమూ, స్వప్నమూ రెండూ సమాన దూరంలోనే వుంటాయి. వాటి మధ్య వ్యత్యాసం హేతువు మాత్రమే, కార్యకారణ సంబంధం మాత్రమే. కారణాలకు చేరువ కాబట్టి మనిషి వాస్తవికతను సులువుగా ఆశ్రయిస్తాడు. వాస్తవికత శిథిలమైన చోట స్వప్నం మేలుకుంటుంది. మనిషికీ, వాటికీ మధ్య ఎంత దూరమో, ఆ రెండింటికీ మధ్యదూరం కూడా అంతే. అయితే దూరాన్ని గురించి మనిషి ఎప్పుడూ సోహపడుతూనే వుంటాడు. అందుకే “ఊహకీ, వాస్తవానికీ, క్రియకీ, కదలికకీ మధ్య వ్యవధిలో నీడలు” పడుతుంటాయి.
ఆ నీడలు అచేతనంలో నుంచో, ఆంతరంగిక ద్వేషాల నుంచో, అపరిచితత్వంలో నుంచో, మార్పుల అపోహల నుంచో రాలిపడతాయి. ‘నైరాశ్యపు చిక్కని చీకటిలో’ మనిషి ఒక అడవిగా మారిపోతాడు. అదీ వెన్నాడే నీడల అడవి.
నీడ మనిషి అస్తిత్వానికి ప్రతీక. అక్కడి నుంచి మనిషి విశ్వాసాలను రాబట్టుకోవచ్చు. అసమర్థుడి నీడ మృత్యువుకన్నా భయంకరమైంది. అసాధ్యంనుంచి సాధ్యంలోకి, అసామర్థ్యం నుంచి సామర్థ్యంలోకి మనిషి సాగిస్తున్న ప్రయాణం అప్పుడు శాశ్వత ఆత్మవంచనగా మాత్రమే కనిపిస్తుంది. కాని బైరాగి నీడల నుంచి కలల శైథిల్యంలోకి పారిపోయే శూన్యవాదికాదు. ఒక నిరాశా నిస్పృహల చీకటి కోణం నుంచి బయలుదేరి సందేహాల, సంశయాల పొరలను దాటుకుని సువిశాల మేధావరణలోకి ప్రవేశించాలనుకునే అతివాస్తవికవాది. బైరాగి కవితలో ప్రతీ దృశ్యం చీకట్లోనే ప్రారంభమవుతుంది. కాని చీకట్లోనే అంతంకాదు. చివరన ఎక్కడో కనిపించీ కనిపించనట్టుగా ఒక సన్నటి అలలా వెలుగు రేఖ కనిపిస్తుంది.
‘శతాబ్దాల సమాధిలో
నిదురించే మృత జీవిత
శవము కూడా వణుకుతోంది.
యుగ యుగాల తరతరాల
పేద జనుల స్వేద ధార
మానధనుల అశ్రు ధార
ఆకాశపు కళ్ళలోంచి
కట్టలు తెగి పొరలుతోంది’
అంటూ ఒక సంధియుగాన్ని ఆవహించిన పెను తుఫానుని ఆహ్వానిస్తాడు.
ఆగబోదు ఈ తుఫాను
ఆగరాదు ఈ తుఫాను
మీ మేడలు మునుగువరకు
మీ కోటలు కూలు వరకు
మీ అంతఃపుర కాంతలు
భూమి పైన దొరలువరకు
శోకంతో పొరలు వరకు —
ఈ పంక్తులలో తుఫాను ఆవేశం నిండిన సంవేదన కనిపిస్తుంది, ద్వేషంతో వుబ్బిన నరాల సత్తువ గుర్తొస్తుంది.
బైరాగి తలుపులు తెరుచుకుంటున్నది నరకంలోకి కాదు. అవేదనావృత జీవన వాస్తవికతలోంచి ఆశాస్వప్నసౌధానికి అతను ఆడుగులు కదుపుతుంటాడు. తుఫాను హోరులోంచి చావుబతుకు పోరులోంచి వెనుదిరగక మున్ముందుకు సాగే ధీరోదాత్తుల అడుగు జాడలను అన్వేషిస్తాడు. ‘ఈ భీషణ ధ్వంస లీలలో నూతన వసంతాల అంకురాలు’ చూద్దామని ఆశపడతాడు. ‘తామస గర్భావేదన’ లోంచి ఉదయించే నవ మానవుడికోసం ‘ఆగమగీతి’ పాడతాడు అందుకే!
[1984 ఆంధ్రజ్యోతి సాహిత్య వేదిక తొలి ప్రచురణ (తరవాత 1993 లో తెనాలి పొయెట్రీ ఫోరం ప్రచురణ “ఆధునికత- అత్యాధునికత”లో పునర్ముద్రణ). బైరాగిపై ప్రత్యేక సంచిక కోసం ఈ వ్యాసాన్ని ఈమాటకు అందజేసిన అఫ్సర్ గారికి మా కృతజ్ఞతలు – సం. ]
