బైరాగితో ప్రయాణం

నేను బైరాగి అభిమానినని నా మిత్రులలో చాలామందికి తెలుసు. సమయం సందర్భం వచ్చినపుడు ఏవో కొన్ని లైన్లు ఉటంకించడం అలవాటు. అయినా తెలుగు కవిత్వాభిమానులకి నేను ఇప్పుడు మాత్రం గట్టిగా చెప్పగలుగుతున్నాను — బైరాగిని చదవ వద్దు. చదివినా మనకు తెలిసిన కవిత్వంలాగ, ఒక ఉద్వేగం, ఒక ఉన్మత్తత కలగదు. ఆ పద సమూహాలు ఆపాత మధురంగా తోచవు. శ్రీశ్రీ ఎంత విప్లవ సానుభూతిపరంగా రాసినా, “చిగురించిన తోటలలోనో, చితులుంచిన చోటులలోనో” అంటాడు అందంగా. బైరాగి లాగ “పానకపు పుడకగా వస్తాం // టీకప్‌లో ఈగై చస్తాం” అనడు. పోనీ అంతకు ముందు పఠాభి లాంటివాళ్ళో, దిగంబర కవులో “ఈ లోకం మా శత్రువు, మా గమ్యం మృత్యువు” అంటే ప్రొటెస్ట్ కవిత చెప్పినా, మనకు ప్రొటెస్ట్ దేనిమీదో అర్థం అవుతుంది! బైరాగి “ప్రేమేతర కామాతుర కంకాళ కరాళ కేళి” అని జీవితం గురించి చెబితే, అది ప్రొటెస్ట్ కాదు — వర్ణన, అయితే దేని వర్ణనా?

అందుకే, బైరాగి (మన) కవి కాదు. కాదని, ఆయనే చెప్పుకున్నాడు. “పొండి పొండి, వెడలిపొండి; నేను మీ కవిని కాను” అని. ఆయన కవిత్వం గురించి ఆయనకి బాగా తెలుసు. “నేను కవిత రాయకపోతేనేమి. విశ్వ సుషమకు చావు రాదు”. మన తెలుగు సంప్రదాయానికి దూరంగా, కవి సమయాలకు దూరంగా, తెలుగు కవితా వస్తువులకు దూరంగా బ్రతికాడు. అందుకే, తెలుగు కవిలాగా బైరాగిని చదవ వద్దు.

మరెలాగ చదవాలి? అదృష్టవశాత్తూ, నేను కవిని కాను. విమర్శకుడినీ కాను. కేవలం పాఠకుడిని. ఏ పదిహేడేళ్ళ వయసులో బైరాగి పుస్తకం ముట్టుకున్నానో కానీ, ఇన్నేళ్ళుగా నాతో బైరాగి ప్రయాణిస్తూనే ఉన్నాడు. కవిత్వంలో ఉద్వేగంతో మునకలేస్తున్న రోజులనుంచీ, నిర్వేదంతో వదిలివేసినప్పటి నుంచీ, ప్రపంచంలో నా స్థానం వెతుక్కుంటున్న రోజుల్లోనూ, కొన్ని సార్లు మరీ ముఖం కొట్టవచ్చినట్లు, మరికొన్ని సార్లు క్రీగంట కనిపిస్తూ, బైరాగి నా వెంటనే ఉన్నాడు. అమెరికాలో తెలుగు మనుషుల మధ్య ఉన్నా తెలుగులో ఆలోచన లేని రోజుల్లో కూడా బైరాగి తలపులోకి వచ్చేవాడు. తెలుగంటే పంచెకట్టు, ఆవకాయ, బాపు బొమ్మ అంటూ కుదించి చూస్తున్న ఈ అమెరికా రోజుల్లో కూడా, తెలుగుకి అతీతంగా, విశ్వ మానవ గళంతో బైరాగి నా తోడుగా, నాకు తోడుగా ఉన్నాడు.

అందుకే, నేనెలా బైరాగిని చదువుతానో చెబుతాను. వీలయితే, అన్నీ అంకెల్లోకి దించాలని వాదించే నేను, సోదాహరణంగా బైరాగి నామీద ఎందుకు ప్రభావం వేశాడో చెబుతాను. ఇది ఒక కవిత్వ విమర్శ కాదు. అది పండితులకూ, కవులకూ, విమర్శకులకూ వదిలివేస్తాను. కవిత్వం అంటే తీవ్రంగా పర్సనల్‌గా ఉంటుంది. ఎవరూ లేనప్పుడు, మనతో మనం మాట్లాడుకుంటున్నపుడు, మన అశక్తతల అభివ్యక్తి భాష కవిత్వం అయినప్పుడు, కవిత్వం కేవలం మనలో ఏవిధంగా ప్రతిబింబించిందో అదే కొలమానం అవుతుంది అని నా ఉద్దేశ్యం.

ముఖ్యంగా పదినాళ్ళు చదివించే కవిత్వంలో రెండు లక్షణాలు ఉంటాయి. ఇప్పటికే మీకు అర్థం అయి ఉంటుంది — నేను కవిత్వం అనే పదం లక్షణ శాస్త్ర పదంలా వాడటంలేదు. రసమూ, ధ్వని లాంటి పదాలు వాడబోవటంలేదు. పోనీ కవిత్వం అనే పదం బదులు రచన అనుకోండి.

ఒకటి ఇంటర్ప్రెటబిలిటీ — అనగా, అది పది కాలాలపాటూ, అన్ని సమయాల్లోనూ సరిపోయేటట్లు మనకి అనిపించినట్లు ఉండటం. అంటే, ఎప్పుడు చదివినా, ఆ కవిత్వంలో కొత్త అర్థాలు స్ఫురిస్తాయి. మనమే ఆ అర్థాలు ఆపాదించుకున్నట్లు అనిపించవచ్చు — కానీ, ఆ పదాలే మనల్ని ఆ దారిలోకి నడిపించాయా అంటే చెప్పడం కష్టం. దాని మీద భాషా శాస్త్ర వేత్తలు ఇప్పటికీ పరిశోధిస్తున్నారు. సపిర్ వార్ఫ్ హైపోథెసిస్ అనే విషయం మీద చూడండి. నేనయితే రెంటికీ (భాషకీ, మన ఆలోచనలకీ) మధ్యన సంబంధం ఉన్నదనుకుంటాను.

రెండవది, కవిత్వం ఒక రహస్య భాష. ఎప్పుడో చదివాను. గొప్ప నాయకులలో ఒక లక్షణం ఉంది. వాళ్ళు మనతో మాట్లాడితే, అవి రెండు మాటలయినా, కేవలం మనతో మాత్రమే చెప్పినట్లుంటుంది. చిన్నప్పుడు ఎన్టీఆర్ సినిమాలు చూసినప్పుడు నాకలాగనే అనిపించేది — మిగిలిన వారికి తెలియని, నాకోసం మాత్రమే ఆయన చేసిన నటన నాకు తెలుసు. మనకి నచ్చిన కవిత్వంలో మనం మాటల్లో చెప్పలేని అనుబంధం, ఎప్పుడూ నిత్య నూతనమైన అనుబంధం కనబడుతూ ఉంటుంది.

ఆ ఇంటర్ప్రెటబిలిటీ గురించి ఆలోచిస్తే, కొడవటిగంటి అన్న ఒక మాట గుర్తొస్తుంది. ఆయన ముందు తరాలకోసం రాస్తున్నాననే భ్రమ లేదంటూ, ప్రస్తుతం పాఠకులకు నచ్చితే చాలు అని. అది నిజమే. చార్లెస్ డికెన్స్ లాంటివాళ్ళు తమ తమ అనుభవాలు అప్పటి జనాల కోసం, నిజానికి పత్రికలలో సీరియల్స్‌గా రాశారు. అయినా ఇప్పటికీ అవి చదువుతూనే ఉన్నారు. జీవితానుభవం నుంచి రాని రచనలు ఎలా కలకాలం మనగలవు? జీవితానుభవం నుంచి మాత్రమే అయితే ఎలాగ కలకాలం నిలవగలవు?

ఒక మిత్రుడు నాతో అన్నాడు: “ఆదర్శాలు కాలంతో మనలేవు. చిన్నప్పుడు అవి మన జీవితాన్నే శాసిస్తాయి. పెద్దయిన తర్వాత మరీ సిల్లీ గా, ఇంప్రాక్టికల్‌గా అనిపిస్తాయి.” అందుకే కాబోలు కవిత్వం పెద్దవుతున్నకొద్దీ జీవితంలో అదృశ్యమవుతుంది. చిన్నప్పుడు ఒక ఉన్మత్తతతో చదువుకున్న కవితలు ఇప్పుడు చూస్తే, ఆకాశంలో తారలు భూమ్మీదకి దిగివచ్చినట్లు పేలవంగా కనబడుతున్నాయి. జ్ఞాపకాల మూలాన, ఒకప్పటి పరిచయం మూలాన, చిన్నప్పటి మనమీద మనకున్న ప్రేమ మూలాన, ఆ రచయితలంటే సానుభూతి ఉంటుంది కానీ, ఏ సంకెళ్ళు లేకుండా ఆలోచిస్తే, నా ఇష్టమైన రచయితల్లో కాలదోషం పట్టని కవి ఒకే ఒక కవి బైరాగి. అది జీవితానుభవం నుంచే కాదు, ప్రపంచానుభవం, మానవ చరిత్ర వికాసం నుంచి వచ్చిన కవితలు కావడం వల్ల, అది ఆగమ గీతి.

ఉదాహరణకి, నా అనుభవం నుంచి చెబుతాను. నేను చదువుకున్న అందరి లాగానే తెలుసుకోవడం వల్ల సమాధానం దొరుకుతుంది అని నమ్మాను. అందుకే చదువుకున్నాను. ఒకప్పుడు పురాణాలు చదివాను. మరొక రోజుల్లో వామపక్ష భావజాల కవిత్వాలు చదువుతూ వచ్చాను. శాస్త్రీయ దృక్పథంలో అన్నిటినీ అర్థం చేసుకోగలను అని, నమ్మకంతో ఉండేవాడిని.

ఇది నా భావాలే కావు. వేదం — విద్ అంటే జ్ఞానం అనే పదం నుంచి వచ్చింది. భగవంతుడు మొహమ్మద్ ప్రవక్తకి ఇచ్చిన మొదటి పదం — ఇక్రా, అంటే చదువు (రిసైట్). మనిషి ఎదుగుదల జ్ఞానంతో వచ్చింది. తెలుసుకోవడంతో వచ్చింది. శాస్త్రం, జ్ఞానం మనల్ని కాపాడుతాయి. జ్ఞానం అన్నం పెడుతుంది. మందులిస్తుంది. వెలుగు తెస్తుంది. బండి నడిపిస్తుంది. సినిమా చూపిస్తుంది. ఇంకా మనుషులకి దైవ శక్తులిస్తుంది.

కానీ, ఆ జ్ఞానానికి రెండు అవరోధాలు. ఒకటి, జ్ఞానం ఎప్పుడూ నిస్సందేహంగా చెప్పదు. ఏది చేయాలి? అనే ప్రశ్నకి సమాధానం రాకపోతే, ఏం చెయ్యాలి? ఇంకా తెలుసుకోవాలి. కానీ, జ్ఞానం ఎప్పుడూ పెరుగుతూనే ఉండదు. అది వంకర టింకర దారుల్లో ప్రయాణిస్తుంది. దీన్ని నాన్‌మోనటానిక్ లాజిక్ అంటారు.

ఉదాహరణకి, పక్షులు ఆకాశంలో ప్రయాణించగలవు. అన్ని పక్షులు కాదే? పెంగ్విన్లు ఎగరలేవు. పోనీ, పెంగ్విన్లు తప్ప. కానీ విమానంలో పోతున్న పెంగ్విన్ పక్షులు ఆకాశంలో ఎగురుతున్నాయే? పోనీ, విమానంలో లేని పెంగ్విన్ పక్షులు తప్ప, మిగిలిన పక్షులన్నీ. విమానం నేల మీద ఆగి ఉంటేనో? అంటే, గాలిలో ఎగురుతున్న విమానంలో ఉన్న పెంగ్విన్ పక్షులు తప్ప మిగిలిన పక్షులు ఆకాశంలో ప్రయాణించగలవు. పోనీ ఆ పెంగ్విన్ పక్షికి ఒక పారాచూట్ కట్టి విమానం నుంచి బయటకి వేస్తే? [ఈ కథ ఇక ఇలా కొనసాగుతూ ఉంటుంది లెండి. సాఫ్ట్‌వేర్ రాసేవారికి అనుభవమే!]. బైరాగి అంటాడు, జ్ఞానం ఎలాగ పెరుగుతుందో అని.

జ్ఞానంలో ఉంది బాధ, బాధలోన అనుమానం
నిత్య నిరుత్తరపు ప్రశ్న జ్ఞానం యిచ్చిన దానం
అజ్ఞాతంలోంచి మరల అజ్ఞాతంలోకి పయనమే జ్ఞానం.

జ్ఞానం అసంపూర్ణం అని మనందరికీ తెలుసు. సైన్స్ చదివే ప్రతివారికీ జ్ఞానమార్గం తెలుసు. సత్యం అనేది తాత్కాలికమేనని తెలుసు. ఆ తాత్కాలికమైన సత్యం నుంచి మరో తాత్కాలిక సత్యం వరకు ప్రయాణించడమే శాస్త్రీయ పరిశోధన అనీ తెలుసు. అది తెలియడమే జ్ఞానం అనేది కూడా మనం వింటాం! ఇంతవరకూ సరే కానీ, మొదటి ప్రపంచ యుద్ధం దాటిన తర్వాత కానీ, దీనికి మించిన విషయం మరొక్కటి ఉన్నదని శాస్త్రవేత్తలకు తెలియలేదు. ఇదే జ్ఞాన మార్గంలో రెండవ అవరోధం. బైరాగి భాషలో చెప్పాలంటే

నిరవధి కాలావధిలో జీవితమే ఒక్కక్షణం.
తప్పొప్పుల నిర్ణయ మిట దుస్సాధ్యం.

అంటే, ఈ ప్రయాణం ఆగదు. దీనికి గమ్యం లేదు. ఉన్నా గమ్యం మనం చేరలేము. ఇది సైంటిఫిక్ సత్యం అని ఒక శతాబ్దం కిందటికి కానీ తెలియలేదు. దాని ప్రభావం అన్ని రంగాల్లోనూ పాకటానికి మరో యాభై ఏళ్ళు పట్టింది. మనకి తెలిసినంత వరకు, జ్ఞానానికి సరిహద్దులుంటాయి అని శాస్త్రం నిరూపించింది. భాషకి పరిమితులు ఉంటాయనీ, మన ఇంద్రియాలకు అవధులు ఉంటాయనీ తెలిసివచ్చింది. శాస్త్ర విజ్ఞానంలో ఈ విషయం అనేక విధాలుగా ఋజువు అయింది — క్వాంటమ్ ఫిజిక్స్, అన్‌సర్టెన్‌టీ ప్రిన్సిపల్, హాల్టింగ్ ప్రాబ్లమ్, ఇన్‌కంప్లీట్‌నెస్ థీరం, ఇలాగ మన జ్ఞానం ఎప్పటికీ సరిపోదు అని తెలిసింది.

అంటే, అజ్ఞానంలోనే ఎప్పుడూ చిక్కుకొని ఉంటాము అన్న మాట! అసతోమా సద్గమయ కాదు ఇది! అది అసంపూర్ణమే కాదు. ఎన్నటికీ అసంపూర్ణంగానే ఉంటుంది. అయితే, సైన్స్‌లో దానికి సర్దుకుపోయాం. వంతెనలు కడుతూనే ఉన్నాం. కంప్యూటర్లు తయారుచేస్తూనే ఉన్నాం. సత్యం అంటే తెలియకపోయినా అనేక విషయాలలో మన సాధారణ జీవితాలకేం లోపం రాదు.

మరి సత్య నిరూపణ నిర్దుష్టంగా చెయ్యలేని విషయాల సంగతి ఏమిటి? అందులో ఏమి నష్టం వచ్చింది? ఆ విషయంలో బైరాగి ఏమంటాడు?

మానవునకు క్రియ ఒకటే ఆరాధ్యం.
మనస్సాక్షి మనల నిలా చేస్తుంది పిరికివాళ్ళను
ఆలోచన క్రియతో శ్రుతి కుదరని ఒక భగ్నవీణ

జ్ఞానం మీద ఆధారపడి మనం నిర్ణయాలు చెయ్యనంతసేపూ ఏమీ ఫర్వాలేదు. కొత్తగా తెలిసిన జ్ఞానం మనకి అంతకు ముందు తెలిసిన జ్ఞానాన్ని ఖండిస్తే పెద్ద కష్టం నష్టం కాదు. లెక్కలు వేసేటప్పుడు, ఒక విషయం దత్తాంశంలో భాగంగా భావిస్తాం. అది చివరకు అసంబద్ధతకి దారి తీస్తుంది. ఆ విషయం తప్పు అని నిర్ధారణకి వస్తాం. సైన్స్ పెరుగుదలలో ఇది ఒక భాగం.

అయితే, సామాజిక న్యాయాల్లో జ్ఞాన మార్గం బహు దుస్తరం. అందరూ తమకు తెలిసిన సిద్ధాంతాలు నమ్ముతారు. వాటికి నిరూపణ మార్గం ఉండదు. మాటలు వింటే, జ్ఞానంలాగానే తోస్తుంది. అంతవరకూ తెలిసిన విషయాలు, ఆ సిద్ధాంతాలను సమర్థిస్తూనే ఉంటాయి. వాట్సాప్‌లో చదివితే, నిజమే కదా అని అనిపిస్తుంది. దాని మీద ఆధారపడి మనం ఒక కార్యాచరణ చేస్తే? చెయ్యకపోతే, తెలుసుకొని ఏం ప్రయోజనం? చేస్తే సమస్య ఏమిటంటే, అది తప్పో ఒప్పో వెంటనే తెలియదు. అందుకే ఒక్క క్షణపు జీవితంలో తప్పొప్పుల నిర్ణయ మిట దుస్సాధ్యం, అన్నది!

బ్రతుకు పలకపై వ్రాసిన ప్రత్యక్షర మక్షరమే
సవరించే సమయమేది, ప్రతి దోషం నిర్జరమే
చేసిన పని చెరగి పోదు, రానున్న తరాలవారు
మన విజయపు కీర్తి సౌధశిథిలాలను అడుగుతారు

“మానవజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం” అనే మాటలకన్నా, ఇది లోతైన ఆలోచన, నిజమైన భావన. చూడండి, సర్వమానవ కళ్యాణంకోసం చేసిన పనులు. మావో రోజుల్లో పిచుకలు గింజలు తినివెయ్యడంవల్ల ప్రజలకు తిండి సరిపోవడంలేదని, వాటిని చంపడం మొదలుపెట్టారు. కొన్ని ఏళ్ల తర్వాత, పిచ్చుకల కొరత మూలాన మిడతలు పెరిగిపోయి, పంటలను పూర్తిగా నాశనం చేశాయి. సోవియెట్ రష్యాలో, రైతుల ఆదాయం పెంచడం కోసం ఆనకట్టలు కట్టి, ఎడారుల్లో ప్రత్తి పండించారు. కానీ, ఆ నదుల నీరు అందని ఆరల్ సముద్రం ఎండిపోయి, మొత్తం పర్యావరణం, పొలాలతో బాటు నాశనం అయింది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఆశయాలతో మొదలుపెట్టిన ఫ్రెంచ్ విప్లవం ఎలా ఫ్రాన్స్‌ని దెబ్బ తీసిందో మనకి తెలుసు.

ఎవ్వరో మావోని అడిగారట, “ఫ్రెంచ్ విప్లవం మీద మీ అభిప్రాయం ఏమిటి?”. దానికి ఆయన జవాబు: “ఇంత తొందరగా చెప్పలేం!” (ఇది ఒక అపార్థం వల్ల వచ్చిన జోకు కానీ, నిజం అనిపిస్తుంది!) అంతెందుకు? ఒక సోషియాలజిస్టు అసలు మానవులు వ్యవసాయం చెయ్యడం అనేది, మానవ జాతికి నష్టం కలిగించింది అని ప్రతిపాదించాడు!

చిన్నపుడు శ్రీశ్రీ దేశ చరిత్రలు చదివి, మార్క్సిజం చదివి, ప్రపంచాన్ని అది ఒక్కటే అర్థం చేసుకునే సిస్టం ఇస్తుంది అనుకున్నాను. కానీ, ఇప్పుడు చారిత్రిక న్యాయాల గురించి ప్రశ్నించుకుంటున్నపుడు, అంతకంటే, ఈ బైరాగి మాటలు చెవుల్లో మారుమోగుతున్నాయి. అమెరికాలో బానిసత్వానికి పరిహారం గురించి మాటలు. భారతదేశంలో దళితుల అణిచివేత. ఏమి చేస్తే సరిపోతుంది? ఎవరికి, ఏవిధంగా న్యాయం చెయ్యాలి? “ఎవరికంద చేయగలం పశ్చాత్తాపాల జాబు?” ఇదీ ఈ నాటి సమస్య.

అందుకే, ఇజాల మీద రాను రాను నమ్మకం తరిగిపోయింది. మనకి పూర్తిగా తెలియకుండా ఎలాగ ఏది చెయ్యాలో ఎలాగ నిర్ణయిస్తాం? అంటే, మనం సగం తెలిసిన సత్యాలతో, ఎలాగ ఆచరణలో పెట్టగలం? ఇదే మన అపజయ చరిత్ర. తెలిసీ తెలియని అవగాహనతో, మనం నిర్ణయాలు తీసుకోవాలి. ఆ కార్య ఫలితాలు మన జీవితకాలంలో తెలియకపోవచ్చు. తెలిసిన కొద్దీ, సందేహాలు పెరుగుతాయి.

ఈ సందిగ్దతనే అనేకమంది సామాజిక శాస్త్రవేత్తలు ప్రయోగరీత్యా పరిశీలించారు. వారు చెప్పిందేమిటంటే, లిబరల్స్, బాగా చదువుకున్నవారు, నాస్తికులు, హేతువాదులు, ఆలోచనాపరులు వీరంతా తొందరగా నిర్ణయాలు తీసుకోరు. తీసుకున్నా ద్వైధీభావంతో సతమతమవుతారు. సమాజం మీద ప్రభావం ఎక్కువగా చూపలేరు అని.

దీన్నే యేట్స్ ఈ విధంగా రాశాడు:

Things fall apart; the centre cannot hold;
Mere anarchy is loosed upon the world,
The blood-dimmed tide is loosed, and everywhere
The ceremony of innocence is drowned;
The best lack all conviction, while the worst
Are full of passionate intensity.

జ్ఞానాన్వేషులు నమ్మకహీనులై నిలిస్తే, మూఢులు తీవ్రమైన ఉద్వేగంతో నిండి ఉన్నారు — ఇది యుద్ధకాలంలో రాసిన కవిత. ఇప్పటికీ ఇది నిజం అనిపిస్తుంది. ఒక్కసారి మన చుట్టూ ఉన్న రాజకీయ వాతావరణం చూడండి. స్ట్రాంగ్ మెన్ అంటే నియంత లాగ, నిస్సందేహంగా ఉండటం ఒక నాయక లక్షణం లాగ భావించి ప్రజలంతా ప్రజాస్వామికంగా ఎన్నుకోవడం చూస్తున్నాం. ప్రజలు ఆచరణకి కావలసిన మొండితనం సందేహ రాహిత్యం నుంచి వచ్చినట్లు నమ్ముతున్నారు!

ఇంతకు ముందు మతాలన్నీ జ్ఞానం గురించి రాశాయి అని చెప్పాను. కానీ, అవే మతాలు జ్ఞానమంతా సరిపోదు, విశ్వాసం దానికి తోడు అని చెప్పాయి. [ఒక్క హిందూ మతంలోనే, నాసదీయ సూక్తంలో సందేహంతో బతకడం గురించి ఉంటుంది. తర్వాత్తర్వాత హిందూ మతం కూడా, విశ్వాసం యొక్క ప్రధాన పాత్ర చెబుతుంది]. క్రిస్టియానిటీలో ముందే హెచ్చరిక ఉంది — భగవంతుడి అనుమతి లేని జ్ఞానం ప్రమాదకరం అని. ఇస్లాంలో కూడా ఇక్రా, భగవంతుడి పేరు మీదగా, ఉపయోగకరమైన జ్ఞానం అంటే, మంచి పనులకి దోహదం చేసే జ్ఞానం సంపాదించమని చెబుతుంది. ఇందులో మతం జ్ఞానానికి ఒక విశ్వాసం తోడు చేస్తుంది. ఆ విశ్వాసాన్ని జ్ఞానానికి అతీతంగా చేస్తుంది.

మరి కవులేం చేస్తున్నారు? జ్ఞానానికి, విశ్వాసానికి మధ్యన ఏ విధంగా పొంతన కలిగిస్తున్నారు? చాలమంది కవుల మాటలు వింటే తెలిసేది ఇది — జ్ఞానం బాల్యం నుంచి దూరం వేస్తుంది. గార్డెన్ అఫ్ ఈడెన్ నుంచి మనిషిని బహిష్కరిస్తుంది. మనిషికీ, మనిషికీ అంతరం పెంచుతుంది. అయితే దానికి వారు చెప్పే పరిష్కారం ఏమిటి? ఏదీ క్రియాశీల మార్గం?

ఇక్కడ కవుల రాతల్లో నాకు రెండు మార్గాలు కనిపిస్తాయి.

ఒకటి — ఈ ప్రగతిని తిరస్కరించి, పూర్వపు సులభమైన లోకానికి వెళ్ళిపోవడం. అనేక రొమాంటిక్‌ కవులు ఈ మార్గాన్ని ప్రశంసించారు. వారు ఊహించే ప్రపంచం అనేది పూర్వపు సరళతతో నిండి ఉంటుంది — నదులు, చెట్లు, పొలాలు, పల్లెలు. ప్రకృతితో వేరుపడ్డామనే ఒక నిరంతర వేదన. లియో టాల్‌స్టాయ్‌ వంటి మహానుభావులు కూడా ఈ దారిన నడిచారు — కోల్పోయినదాన్ని తిరిగి పొందాలని. మానవ జాతి బాల్యం లోని అసంక్లిష్టత, తల్లి గర్భంలో ఉన్న క్షేమం- ఇవి వారికి కవితారూప సాక్షాత్కారాలు. నగరాలూ, జనసమూహాలు, నాగరికత వీటిలో వారికి దుమ్మూ, ధూళి, మురుగు, స్వార్థం, క్రౌర్యం ప్రస్ఫుటంగా కనబడుతుంటాయి. వీరికి ప్రపంచ ప్రయోగశాలలో అంతకు ముందెపుడో శుద్ధి చేసిన పరిశుద్ధ విశ్వాసం కార్యాచరణకి దారి చూపుతుంది.

మరో దారి — నమ్మకం కోల్పోవడం అనేది ప్రగతికి చెల్లించాల్సిన ధర అని అంగీకరించిన కవులది. వారికి సందేహం సముఖాన కర్మ స్తంభించిపోవడం తెలుసు. నమ్మకం దానికి విరుగుడు అని తెలుసు. నమ్మకం మనకు చర్య చేయగల శక్తి ఇవ్వగలదు అని తెలుసు. కానీ అంతకన్నా నమ్మకం ఒక విషం లాంటిదనీ తెలుసు. తార్కికతను మించి, అవగాహనను మించి, మార్పును కూడా మించి నిలిచే అంధవిశ్వాస ప్రమాదం కూడా తెలుసు. అన్నింటికన్నా, ఏది మందో, ఏది విషమో తెలియదు అని కూడా తెలుసు.

బైరాగి రెండవ రకం కవి. “నాక్కొంచెం నమ్మకమివ్వు” అని గొంతెత్తి అడిగినా, ఆ నమ్మకం పట్ల ఉండవలసిన జాగ్రత్త తెలుసు. “నా ఆశల విశ్వాసాల వాడిన వడలిన పూలు” అని, విశ్వాసంతో వచ్చే శాంతి, జ్ఞానంతో వచ్చే శక్తి — ఈ రెంటి మధ్య పోరాటం తెలుసు. రెంటికీ మధ్యన సత్యం నలిగిపోతుందని తెలుసు. ఇది ప్రతికవితలోనూ అంతర్లీనంగా కనబడుతుంది. ఉదాహరణకు:

అంశికసత్యాల అర్ధసత్యాల అసత్యాల ఆధిపత్యంలో
ముక్కూ చెవులూ తెగిన సత్యాన్ని గుర్తుబట్టలేవు నీవు
విప్లవాల ప్రసవ బాధల దైత్య శిశువు భస్మాసురుడు,
నిలకడగల నమ్మిక ఎలా కలుగుతుంది.
జ్యోతి ఎలా నిశ్చలమై వెలుగుతుంది

అలాగని పలాయన వాదమూ కాదు. నూతిలో గొంతుకలు ముందు మాటలో అన్నాడు “ఆ బాధలో మథన పడనివాడు పూర్ణత్వాన్ని అందుకోలేడు. ఆ బాధ నుంచి అతను తప్పుకునే మార్గం లేదా- అంటే ఉంది. పలాయనం, కృతకశక్తుల పూజనం. ఆత్మహననం.”

ఆలోచించే మనుషులకి ఏం చేసినా తప్పేనని అనిపిస్తుంది. అప్పుడే, “నా తలపుల పిరికి బంటులకు నీదే సంశిక్షణ” అని ఎవరో ఇచ్చే నమ్మకం కోసం ఎదురుచూస్తారు. ఇదీ అర్జున విషాదయోగ కథ. కృష్ణుడి మీద నమ్మకం “సర్వధర్మాన్ పరిస్యజ్య మామేకం శరణం వ్రజ” అంటే అందులో సరిపోయింది. మరి కనబడేవాడు కృష్ణుడో, దైత్య శిశువు భస్మాసురుడో, ఎవరని మనకు తెలుసు? పరీక్ష కందనిదే నమ్మకం. పరీక్ష పెట్టి ఋజువులు సాధించగలిగితే అది జ్ఞానం. నమ్మకం విషయం జీవితకాలంలో తెలియదు. “ఐ అలోన్ కెన్ ఫిక్స్ ఇట్” అనే రాజకీయ నాయకుడి పరిపాలన చూస్తున్నాం ఇప్పుడు. అది నమ్మినవారి నిర్ణయం తప్పో, ఒప్పో ఎప్పటికి తెలుస్తుంది?

ఇదంతా, విశ్వాసం యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం. ఎందుకంటే, నమ్మకం నిజంకన్నా బలమైనది అని బైరాగికి తెలుసు. ఎందుకంటే, కర్మ లేని జ్ఞానం నిష్ప్రయోజనం. దాన్ని ఇలాగ చెబుతాడు.

కర్మ యొనర్చడమెలాగ, ఈ బాధ్యత కఠినతరం
వరణం దుష్కరం, ఇరుల తెరమరుగున స్వయంవరం
[వరణం=వంతెన. ఇరులు=చీకట్లు. ]

ఇప్పటికి నా అనుభవానికి వద్దాం. తెలుసుకున్న కొద్దీ, తెలిసింది తప్పు అని తెలుస్తున్న కొద్దీ, సందేహం మధ్యలో కొట్టుమిట్టాడుతున్న ప్రగతిశీల వాద వర్గానికి చెందినవాడిని. ప్రపంచమంతా, గోడలు కట్టుకుంటూ, ఒక శతాబ్దపు చీకటి రోజుల గొప్పతనం కావాలని వెనక్కి పోవడం విస్మయంతో చూస్తూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవాడిని. జ్ఞాన మార్గాన్ని తిరస్కరిస్తున్న ప్రజలు నమ్మకం ఇచ్చే బలంతో ప్రపంచాన్ని మారుస్తుంటే, నాలాంటి వాళ్ళకి కావలసిందేమిటి?

కర్మకు, జ్ఞానానికి శ్రుతి కుదిరినపుడు
ఎగిరే విహగాలకుండ దావేదన
సంశయాన్ని చూచి స్వేచ్ఛ బెదరదపుడు
మానవునకుండదు తనతో వాదన.

ఆలోచించే ప్రతివాడికీ ఉండే బాధ ఇది. తనతో తనకు ఉండే వాదన. దీన్నే ఎలియట్ అంటాడు “After such knowledge, what forgiveness?” అని. ఎలియట్ ప్రభావం బైరాగి మీద ఉన్నప్పటికీ, బైరాగి ఎలియట్ లాగ నిర్వేదంతో ఆపలేదు. ఎలియట్ లాగ మతం అనే విశ్వాసంలో మునిగిపోలేదు. అందులో విముక్తి కోసం చూడలేదు. అలాగ చేస్తే “ఆవేదనల అనంతంలో అంతమైన జీవితాలు // విమోచనపు యోచనలేని శోచనీయ శర్వరిలోన” ఉన్నట్లు ఉంటుంది.

కానీ బైరాగికి విమోచనం వేరే చోట దొరికింది. నమ్మకం అక్కర్లేదు. నమ్మకం సరైందో కాదో తెలియనక్కరలేదు. జ్ఞానం సరిపోతుందో లేదు తెలియనక్కరలేదు. కావలసింది — కరుణ, దయ, సానుభూతి, క్షమ.

కవితలోన లేదు ఘనత
విశ్వ మహో కావ్యాలన్ని వేదనతో విలపించే
పసివాని అశ్రుబిందువు పాటి చేయవు
ఏసుక్రీస్తు పదరేణువు పాటి చేయవు;
హృదయపు చీకటి పూచిన పూవుల తావి
మహామహుల కరుణాపరీమళానికి సరి రాదు.

“పాపాల పాపవుగా పుట్టి పెరిగిన నీవు// ఈ పాపికి శాపముక్తి నివ్వగలవు నేడు” — ఇదీ విమోచనం. ప్రతి ఒక్కళ్ళూ తమతో ఏకీభవించనివారు శత్రువులుగా భావించే ఈ రోజుల్లో, కావలసింది ఇది! సానుభూతితో ఉన్న కరుణ. బాంబులు పడుతున్న ఈ రోజుల్లో, విరిగిన రెక్కలు చల్లటి చేతుల్తో కట్లు కట్టే కరుణ. యుద్ధాలు ఎలా ఆపాలో తెలియని ఈ కాలంలో, కావలసింది ఒక మంచి మాట. కర్తవ్యం తెలియని ఈ రోజుల్లో, కావాల్సింది ఒకటే. కరుణ!

తృషాదగ్ధ వసుధా కంఠ గహ్వరంలో
కొంచెం కరుణ
తులసి నీళ్ళు
నవ్య సృజన బీజాలు!

ఇది మన సందేహాలకు సమాధానం కాదు. కానీ ఇంతకు మించి మనం చేయగలిగేది లేదు. అందుకే, కనీసం ఇంతవరకైనా చేయవలసిందే!

బైరాగి నాకు తోడుగా నిలిచాడంటే అందుకే. పదాల మాధుర్యం చవిచచ్చిన నాకు, కవిత్వం మీద నిరాసక్తత పెరిగిన నాకు, తెలుగు సంస్కృతీ, చరిత్ర లాంటివి అనవసరమైన నాకు, అసలు సాహిత్యం అనేదే పగిలిన చేతి అద్దంలో నిలువుటెత్తు ఇరుకుగా మసకగా తోస్తున్న నాకు, ఇప్పటికీ బైరాగి ఆలోచన కలిగిస్తాడు, ఆసక్తిని పెంచుతాడు, ప్రపంచ పౌరుడిగా చేస్తాడు, నిలువుటెత్తు అద్దంలో నన్ను నేను పూర్తిగా చూసుకునేలా చేస్తాడు. అందుకే, ఈ కుడి ఎడమల రాజకీయ పోరాటంలో, నమ్మకం కోల్పోతున్న ఎడమ, జ్ఞానం కోల్పోతున్న కుడి, మధ్యన దారి ఏది అని అడుగుతున్న క్షణాల్లో, బైరాగి కవి కాదు, ఒక తోడు అంటే అర్థం ఉంది కదా?

నాకు తెలుసు — బైరాగి నాకు చెప్పిన రహస్యాలు మాటల్లో పెట్టడం అంటే కష్టం అని నాకు తెలుసు. ఆయనే చెప్పాడు. “నిండుమదిలోంచి తొణకిన భావావిష్ట మహాఝరులు, నిరర్ధక శబ్దాల సహారా సైకతాల్లో ఇంకనీక జనసాగర సంగమానికి అందించటం కష్టం” అని. బైరాగిని చదవడం జరిగితే, విప్లవ భావాలకు చదవకండి. మృదు లలిత భావాల కోసం అసలే వద్దు. అసలు కవిత్వం కోసం చదవ వద్దు. మీ గురించి, ప్రపంచంలో మీ చోటు గురించి, మార్పు చెందుతున్న మీ అనుభవాల గురించి, ఆలోచిస్తే, బైరాగి మీతో ప్రయాణించడానికి తోడు ఉంటాడు నాకు లాగానే. తాను చెబుతున్న రహస్య సందేశం మీరు ఎప్పటికీ అన్వయించుకుంటూ ఉంటారు. అదీ ఉత్తమ కవిత్వం నా దృష్టిలో!

చివరిగా బైరాగి మాటలు ఓ నాలుగు అరువు తెచ్చుకొని ఈ వ్యాసం ముగిస్తాను.

కాలాతీతమై పోతోంది, చెప్పవలసిన చెప్పదలచిన దానిలో
ఇప్పటికి చెప్పినదొక సహస్రాంశమైనా లేదు.
ఏమిటి చేసేది నేను?