బైరాగి అవగాహన

“కావ్యం స్వతస్సిద్ధం. దానికి భాష్యకారుని చేయూత అనవసరం” అంటాడు ‘నూతిలో గొంతుకలు’కు రాసిన తొలిపలుకులో బైరాగి. భాష్యకారుడు అనవసరమవడమే కాదు, “ద్రోహి అతడు. కావ్యంలో సహజత్వాన్ని చెరుస్తాడు. అతి సున్నితంగా చేయవలసినచోట నానా ఆర్భాటాలు చేసి తుదకు అభాసు చేసి పోతాడు” అని కూడా అంటాడు బైరాగి.

సాధారణంగా రొమాంటిక్ యుగం ప్రారంభమైనప్పుడు సాహిత్యంలో ఈ సిద్ధాంతం సర్వజనామోదం పొందుతుంది. అంతవరకు గౌరవం పొందిన భాష్యకారునికి బదులుగా అప్పుడు కవికే ప్రాధాన్యత కలుగుతుంది. ఎందుకంటే, అనుభూతి అనేది కావ్యం చెప్పినప్పుడు పాఠకునికి నేరుగా అందాలి గాని, భాష్యకారుని మధ్యవర్తిత్వం ద్వారా అందేది కాదు.

కాని ఈ సిద్ధాంతాన్ని ఆమోదించని ధ్వనివాదులూ, కావ్యానందం ఆలోచనామృతం అని చెప్పేవాళ్ళూ కొందరు ఉంటారు. వాళ్ళ సిద్ధాంతం ప్రకారం, సహజంగానే, భాష్యకారులకు గొప్ప పాత్ర ఉంటుంది. ‘ధ్వని’ రహస్యాలూ, ‘ఆలోచన’ లోతులూ మామూలు పాఠకునికి అందవు గనుక వాళ్ళకు భాష్యకారుడు ఎంతైనా తోడ్పడగలడు. అంతేకాదు, భాష్యకారుడు లేకుండా గొప్ప కవిత్వం అర్థం కాదని కూడా చెప్పవచ్చు, ఎందుకంటే, దాని గొప్పదనమంతా దాని ‘ధ్వని’ మీదా, మన ఆలోచనా శక్తిమీదా ఆధారపడి ఉంటుంది గదా? అంటే, సాధారణ మానవులకు ఆ కవిత్వం సుళువుగా బోధపడదు గదా? ఈ సిద్ధాంతం ప్రకారం కవి గొప్పతనమూ, కావ్యం గొప్పతనమూ భాష్యకారుని ప్రజ్ఞమీదనే ఆధారపడతాయి.

అయితే కొంతమంది ఆధునిక కవులలో స్పష్టత లోపించిన విషయం చాలా మంది గుర్తించే ఉంటారు. అధివాస్తవిక కవిత్వం అంటేనే అర్థం కానిది గనుక దాన్ని అలా వదిలేసినా, భావనలోని అసమగ్రత వల్లా, భాషమీద తగిన అధికారం లేకపోవడం వల్లా, ప్రతీక వాదం, మార్మికవాదం లాంటి వాదాల పేరుమీదా ఆధునిక తెలుగు కవిత్వంలో చాలా అయోమయం దిగుమతి అయింది. ఒకోసారి తల బద్దలుకొట్టుకున్నా కవి ఉద్దేశమేమిటో బోధపడదు. అలాంటి సందర్భాలలో ఎవరైనా భాష్యకారుడు ఉంటే బాగుండుననిపిస్తుంది. కానీ, ఆధునిక కవుల అయోమయాన్ని ఏ భాష్యకారుడూ వివరించలేడు. అన్వయ క్లిష్టతతో, భావనిగూఢతతో అయితే భాష్యకారుడు తోడ్పడగలడు గానీ, కవి బుర్రలోనే ఉన్న అయోమయం భాష్యకారునికి కూడా అంతుబట్టేది కాదు. కవి సామర్థ్యంలోని లోపాన్ని ఏ భాష్యకారుడూ పూరించలేడు.

అది అసమర్థ కవుల సమస్య కాగా, సమర్థులైన కవుల సమస్య మరొకటి ఉంది. ‘కవి సమస్య’లో బైరాగి చర్చించేది అదే. భావుకుడైన కవికి ఒక ప్రత్యేక మనస్థితిలో ఏదో అస్పష్టమైన అనుభూతి కలుగుతుంది. అది బాధ కావచ్చు, సంతోషం కావచ్చు, దుఃఖం కావచ్చు, ఆనందం కావచ్చు, ప్రేమ కావచ్చు, విరాగం కావచ్చు, ఏదైనా, అస్పష్టంగా ఉంటుంది. ఏమిటో తెలియనంత అస్పష్టంగా కూడా ఉండవచ్చు. అలాంటి అనుభూతిని మాటల్లో వ్యక్తం చేయడం ఎలా? అనేదే కవి సమస్య.

“పొగమంచు ముసుగులోని ఆకృతిలా, గాలిబాట వెంట మాట తెలియరాని ఆరాటపు పాట” లా ఉంటుంది.

“నిదురించే మోవిమీది ముద్దులాగ వ్యక్తావ్యక్తపు వినీల విపినంలో సుమ కపోల పాళిపై సౌరభ శ్వసనంలా” ఉంటుంది.

“‘చల్లని’ తల్లి ఒడిలా, మక్కువ నిండిన ముగ్ధ కన్నుల్లా” ఉంటుంది.

అది “అర్థమైన దానికన్నా అధికంగా స్ఫురించేది.” అందువల్ల అది “చేతలకు చెందనిది, మాటలకు అందనిది.”

అనుభూతి అస్పష్టంగా ఉన్నంత మాత్రాన బలహీనంగా ఉండనక్కరలేదు.

“ఏదో ఒక ప్రబల బాధ మాటలు వెదుకుతున్న గాధ తీరని కోరికల పోరు హోరని నోరెత్తి నటుల” అది మహాప్రగాఢంగా ఉండవచ్చు.

“ఎగురబోయే గరుత్మంతుడు రెక్కలల్లార్చి నటుల ఎక్కడనో ప్రభవించిన గిరికందరాల ప్రతిధ్వనిలా” మహాప్రచండంగా ఉండవచ్చు.

అయినా అది “మాటలకు అందనిది.” కవికే ఆ అనుభూతి స్పష్టంగా అందదు. కవికే “తన కల స్వరం” స్పష్టంగా వినిపించదు. “జల జల జల ధ్వని మాత్రం వినిపిస్తుంది అందరాని ఆనందాలనే సంకేతంగా.”

ఆ అనుభూతి మాటలకు చిక్కదు. భాషకు లోబడదు. భాష “పరాభూతి చెంది బిలంలో దాగిన పిల్లిలాంటిది” అవుతుంది. శబ్దాలు అర్థం కానివిగా మిగిలిపోతాయి.

“గాలి విసురుల తావిలా తప్పించుకొని శిరీష సుమ మార్దవమై నవనవలా జారిపోతూ కనులు మూసి కిలకిల నవ్వి, కనబడక మాయమయ్యే మనోజ్ఞతను ఈ తెగిన త్రాళ్ళు పెట్టి, వాక్యాల మొండిగోడల మధ్య ఎలా బంధించడం?”

ఇది కవి సమస్య. ‘తొలి పలుకు’లో బైరాగి ఈ సమస్యను ప్రస్తావించి, “శబ్దాల అసమర్థత ప్రతి కవికీ ఏదో ఒక సందర్భంలో తట్టే ఉంటుంది. కవితా కామిని చేలాంచలాల కొస విసురులు ఎప్పుడూ ఒక బారెడు దూరానే మాయమైనట్లు అగుపిస్తాయి” అంటారు. నిజమే, భావుకుడైన ప్రతి కవికీ ఈ సమస్య ఎప్పుడో ఒకసారి ఎదురౌతుంది. “అందీ అందకపోయే నీ చేలాంచలముల విసురుల కొసగాలులతో నిర్మించిన నానుడి….” అన్న శ్రీశ్రీ కి ఎదురైన సమస్య ఇదే కావచ్చు.

కానీ, ‘కవి సమస్య’లో బైరాగి వర్ణించేది కేవలం శబ్దాల అసమర్థతేనా? శబ్దాల అసమర్థతే అయితే, హామ్లెట్లు, రాస్కల్నికోవ్లు ఈ సమస్యలోకి ఎలా ప్రవేశించినారు?

“ఎంతమంది హామ్లెట్లు రాస్కల్నికోవ్లు తడబడుతున్న కోరికల్లోంచి విడివడు భావాలై ఒక కంఠం, గొంతు, శంఖం కొరకు ఎదురు చూస్తూ” చింతిస్తాడు కవి.

వాళ్ళు ఒకరిద్దరు కాదు, “లక్షల అవ్యక్త గొంతుల మూక కంఠ సందోహం” అట. లక్షమంది హామ్లెట్ల, రాస్కల్నికోవ్ల మూక బాధను తన కవిత్వంలో వ్యక్తం చేయాలనేది బైరాగి ప్రయత్నం. ఆ ప్రయత్నం పూర్తిగా నెరవేరలేదనేది ఆయన బాధ. ఆ బాధే ‘కవి సమస్య’లో వర్ణింపబడింది.

“క్షుద్ర రేణు కణం నుంచి మహా మేరునగం వరకు సంక్షుబ్ద సాగరాల ఘోష నుంచి మూగజీవాల భాషవరకు అన్నిటికీ ఒక లయ, ఒక తాళం, ఒక రాగంలో మేళవించి నాలో లోకం కొరకే, లోకంలో నా కొరకై ఏకైక మహోద్రేకం ఉరికించాలని కోరిక.”

“కంఠం, ఒక కంఠం కావాలి నాకు పుంఖానుపుంఖ శంఖాల మంటల ఘంటలా పలుక గల ఒక కంఠం. కంఠం, నా కొక కంఠం మానవగీత ఆలపించే కంఠం.”

ఇదీ బైరాగి తపన. కోటానుకోట్ల దుఃఖిత మానవుల తరపున “మానవ గీత” ఆలపించే కంఠం కావాలి తనకు. మంటల ఘంటలా పలుకగల అలాంటి కంఠం లభించకపోవడమే కవి సమస్య.

“కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ కాదు. శ్రీశ్రీ బాధ ప్రపంచపు బాధ.” అన్నాడు చలం. ప్రపంచపు బాధే బైరాగి బాధ కూడా. ఆ బాధను తెలపడానికే తనకొక కంఠం కావాలంటున్నాడు ఆయన. కానీ, శ్రీశ్రీ ప్రపంచం దీనుల, హీనుల ప్రపంచం; పతితుల, శ్రామికుల, బాధా సర్ప దష్టుల ప్రపంచం. బైరాగి ప్రపంచం అదికాదు; కనీసం ప్రధానంగా అదికాదు. ప్రధానంగా అది హామ్లెట్ల, రాస్కల్నికోవ్ల ప్రపంచం. వీళ్ళది కూడు, గుడ్డలు లేని బాధ కాదు. వీళ్ళది ధర్మాధర్మాల సంశయం వల్ల కలిగిన మనఃక్లేశం, పాపపుణ్యాల విచికిత్సవల్ల కలిగిన హృదయ శోధన.

ఈ శోధనను గురించి బైరాగికి చిత్రమైన అవగాహన ఉంది. హామ్లెట్, అర్జునుడు, రాస్కల్నికోవ్ — ఈ ముగ్గురి బాధను గురించి చెబుతూ బైరాగి “అది మానవుని సహజ వేదన. అతణ్ని త్రికాలాల్లోనూ వెంటాడుతుంది” అంటాడు. అంతేకాదు, “ఆ బాధలో మధనపడనివాడు పూర్ణత్వాన్ని అందుకోలేడు” అని కూడా అంటాడు. ఈ బాధ నుంచి తప్పుకోవడమంటే ఆత్మహననమేనట.

అసలు జీవితం గురించే బైరాగికి గల అవగాహన భయంకరమైనది. ఆ అవగాహన ఆయన కవిత్వం అంతటా వ్యక్తమౌతుంది. ‘నూతిలో గొంతుకలు’ లోని ఇతివృత్తం అదే. ఆ కావ్యంలోని ఖండం II లో ఇలా ఉంది:

ప్రతి మనిషి ఒక గదిలో చెదపురుగులు ప్రతి మదిలో
ప్రతి మనిషి ఒక నదిలో సుడిగుండం ప్రతి ఎదలో
ప్రతి మనిషీ ఒక చెరలో – ఉరికంబం ప్రతి హృదిలో
ప్రతి మనిషి ఒక మరలో మరమేకులు ప్రతి ఎదలో
ప్రతి మనిషీ ఒక సెగలో పొగగొట్టం ప్రతి మదిలో
ప్రతి మనిషీ ఒక పొదలో- బెబ్బులి రొద ప్రతి హృదిలో

ఖండం IV లో బైరాగి జలపాతం లాంటి భావావేశంతో జీవితాన్ని ఇలా వర్ణిస్తాడు :

జీవితమిట నిరావరణ నిరాభరణ నగ్నచ్ఛవి
వికట కుటిల ఘన ఘటాచ్ఛటా జటా నటద్భైరవి
జీవితమిట కామాతుర కంకాళ కరాళ కేళి
ప్రేమేతర మృతికాతర కపాలాల కృపణ ధూళి
జీవిత మిట బీభత్సోత్సవోత్సాహ ప్రేతహేల
రుధిర మధువు గ్రోలి సోలే దైత్యుల మత్తిలిన లీల
జీవిత మిట సంఘర్షణ, సంఘర్షం, సంక్షోభం
దుస్స్వప్నం, దుస్స్వప్నం, దుర్మోహపు దుర్లోభం
జీవితమిట ఒక అవిరత నీరవ రౌరవ యాతన
అవిరళ గరళస్తన్యద కుహనా ధాత్రీ పూతన
జీవితము ఉరోమరువుల తృషా మృషా మృగమరీచి
హాలాహల తరళానల చటులోల్బణ కుటిల వీచి
జీవితమిట కటు నృత్యువు జీవితమిట అకృత్యం
జీవితమిట ఒక దుస్తర ప్రస్తర హస్తపు సత్యం.

“చీకటి నీడలు” అనే గేయ సంపుటిలో ‘జీవితం’ అనే ఇతివృత్తం మీద సుదీర్ఘమైన ఖండకావ్యమే ఉంది. అందులో ఒక చోట

బ్రహ్మాండపు గుండ్రని సుడిగుండంలో చిక్కిన ఈ జీవితపిండం
గడ్డిపోచలా క్రిందికి మీదికి తిరుగుతోంది బయటకు రాలేరక

అంటాడు బైరాగి.

మరొకచోట జీవితాన్ని ఒక దేవతగా ఉపమించి,

కరువు, తుఫాను, ప్రబల భూకంపం దారుణ ప్రపంచ మారణ యుద్ధం
ఈర్ష్యాద్వేషపు నరకజ్వాలలు నలుదిక్కుల మానవ వధశాలలు
మిన్నులు ముట్టే హాహాకారం అది జీవితదేవత జయకారం

అంటాడు.

ఇంకొక చోట

కఠిన తపస్సులు బలిసమర్పణలు నెత్తుటిపూజలు వెర్రి ప్రార్థనలు
ఈ రాక్షస విగ్రహం ముందునా? ఈ జీవిత శనిగ్రహం ముందునా?

అంటూ జీవితంలోని విలువల నన్నిటినీ అపహాస్యం చేస్తాడు.

యుగయుగాలుగా మ్రొక్కిన శిరసుల వణికే చల్లని మెత్తని స్పర్శల
విడిచెడి బండ రాయి ఇది కదలని మెదలని మొండి రాయి ఇది”…

అంటూ జీవితాన్ని కఠిన శిలతో పోలుస్తూ

దీనిపైన నీ దీనాలాపం అనునయ వినయం కరుణ విలాపం
పని చేయదు.

అంటాడు.

జీవితం గురించి బైరాగికి ఇంత భయంకరమైన అవగాహన ఎలా కలిగిందో తెలియదు. అస్తిత్వవాదం లాంటి ఆధునిక తాత్విక సిద్ధాంతాలు ఆయనమీద పనిచేసి ఉండవచ్చు. ఎం. ఎన్. రాయ్ ప్రభావం కూడా ఆయన మీద కొంత ఉన్నట్లు తెలుస్తున్నది. ఏ తాత్విక సిద్ధాంతాలు ఆయన్ను ప్రభావితం చేసినా, వాటికి కవితా రూపం ఇవ్వగలగడం బైరాగి గొప్పతనం.