తల్లిదండ్రులు ఆ పేరు అతనికి ఏ ముహూర్తాన పెట్టారో, తదనంతర జీవితంలో అది సార్థకమైంది. అతను నిజమైన బైరాగి. పరిసర వాతావరణం నుంచి రవంత తొలిగి నిలిచి, లోకాన్ని ఆత్మీయతతో, జాలితో, ఆవేశంతో చూడగలిగిన కవితాత్మ అతనిది. విరక్తితో ఏ హిమాలయాలకో తొలిగిపోయే వైరాగ్యం కాదు. సాటి మనిషి కష్టసుఖాలను పంచుకోకపోయినా, సొంతం చేసుకుని వాటికి తన కవితలలో విశ్వజనీనత కలిగించగల వైరాగ్యం బైరాగి సొత్తు.
అప్పుడు కృష్ణశాస్త్రిగారూ నేనూ ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం. బైరాగి తరుచు అక్కడికి వచ్చేవాడు; ఒక్కొక్కప్పుడు నవ్వుతూ లోకాభిరామాయణం సాగించేవాడు. అప్పుడు అతని జిజ్ఞాస, మేధ, హృద్యమైన లోక దృష్టి వ్యక్తమయ్యేవి. ఒక్కొక్కప్పుడు వచ్చి, అలా మౌనంగా మా వంక చూస్తూనే చూడకుండా, మాటామంతీ లేకుండా కూర్చునేవాడు. ఇచ్చిన కాఫీయో టీయో తాగేసి, మమ్మల్ని పలకరించకుండానే వెళ్ళిపోయేవాడు; అప్పుడు అతన్ని చూస్తే మాకు ఏదో ఆందోళనగా ఉండేది. ఒకరోజు అలా కొన్ని గంటలు కూర్చుని వెళ్ళిపోయాడు. మరునాడు వాహిని స్టూడియోలో అనుకుంటాను, ఎదురయ్యాడు. ఒక కాగితం నా చేతికిచ్చాడు. ‘నిద్రాభంగం’ అన్న పద్యం వ్రాసి ఉంది అందులో. ‘ఎంత బాగుందో’ అందామనుకున్నాను. నా అభిప్రాయం కోసం ఎదురుచూడకుండానే వెళ్ళిపోయాడు, ఆ కాగితం తీసుకుని. ఆ ఖండకావ్యం గొప్పదని అతనికే తెలుసు. ఒకరు మెచ్చుకోవలసిన అవసరం లేదు, అతనికి. బహుశా అప్పుడప్పుడు అతన్ని ఆవేశించే ఆ మౌనంలోంచే అతని కవితలు పుట్టుకొచ్చేవేమో అనిపిస్తుంది ఇప్పుడు తలుచుకుంటే.
బైరాగి అక్షరాలా కవి. ఏ ‘ఇజానికీ’ సంబంధించిన పడికట్టు పదాలూ అతని కవితలలో కనిపించవు. పదాలకు అర్థానికి అందని అర్థాలు సంతరించగల కవితాశక్తి అతని సొత్తు.
“సిగ్గుపడి తలలు వంచిన శబ్దాలు
అసమర్థతను గుర్తించిన శబ్దాలు
మొక్కవోయిన అమ్ములీ శబ్దాలు”
అని ‘కవి సమస్య’లో అతనే అన్నాడు.
నేటి కవితలలో చాలా భాగం ఖాళీ డబ్బాల్లా మ్రోగుతూ, చిల్లిపడిన పాత్రల్లా అర్థం కారిపోతూ అసంఖ్యాక స్పర్శలతో ‘జిగట బారే శబ్దాలు’ అంటే అతనికి ఏవగింపు. ‘అర్థమైన దానికన్న అధికంగా స్ఫురించేది, చేతలకు చెందరానిది, మాటలకు అందరానిది’ కవిత్వమని అతనే నిర్వచించుకున్నాడు.
‘బహు వివరాల అంగాంగాల అణువుల్లోంచి మూలకందపుటాత్మల్లోకి, క్షుద్రరేణుకణం నుంచి మహా మేరునగం వరకు….’ దర్శించగలవాడే కవి అని స్పష్టంగా చెప్పుకున్నాడు.
బైరాగి కవితలలో నైరాశ్యం, నిస్పృహ మౌలికమైన ఆవేశాలు. అయితే బైరాగి నైరాశ్యం మనసును క్రిందికి దిగలాగేది కాదు. అంతరాత్మను ఉర్రూతలూగించే ప్రభంజనం వంటిది.
‘ఒకదాన్నొకటి మ్రింగేశాయి రాకల పోకల అడుగుజాడలు’ అని అంత బాగా అనగలిగిన కవికి ఒకరి మెచ్చుకోలు అనవసరం. ప్రతి పంక్తిలోనూ విలక్షణమైన పదబంధంతో, మనసులోని చీకటితెర మీద చప్పున ఒక అనుభూతిని వెలిగించగల శక్తి బైరాగిది. ఈ అనుభూతి వైయక్తికమైనదీ, సార్వజనీనమైనదీ కూడా; అతని నిస్పృహలో తాత్విక జిజ్ఞాస ఉంది. అది లోకాన్ని అంతటినీ ఆకళించుకుంటుంది. ఎలియట్ వేస్ట్లాండ్లోలాగా. ఆ ఖండకావ్య ప్రభావం బైరాగి మీద కొంతవరకు ఉంది. ఇతని రచనా విధానంలో కూడా మేధ, కవితాశక్తి, అధునాతన పౌరాణికత అన్నీ సమన్వయం పొందాయి.
బైరాగి కవి. కవికి మరణం లేదు.