కవన మర్మయోగి బైరాగి

‘నా క్కొంచెం నమ్మకమివ్వు
కొండలు పిండి కొట్టేస్తాను
చితికిన టొమేటోలాంటి సూర్యుణ్ణి
ఆరిన అప్పడంలాంటి చంద్రుణ్ణి
ఆకాశపు ఎంగిలి పళ్ళెంలోంచి నెట్టేస్తాను
నాదగు బాహుబంధనంలో ఈ విశాల బ్రహ్మాండాన్ని చాపలా చుట్టేస్తాను
నిస్సహాయ మానవేయుని నొసటివ్రాలు
ఒక్క కలం పోటుతోటి కొట్టేస్తాను’ (ఆగమగీతి)

ఈ ప్రత్యేక కంఠస్వరం ఆలూరి బైరాగిది. అది దేనికీ అనుకరణప్రాయం కాదు. ఆత్మవేదనను, ప్రపంచ బాధను సమానంగా పలికించిన కంఠస్వరం. ఆశ, నిరాశల అపురూప సమ్మేళనం. నిష్కల్మషమైన, ఆర్ద్రమైన, ప్రేమపూర్వకమైన, గాద్గదికమైన గొంతు.

ఆలూరి బైరాగి 1925లో తెనాలిలో జన్మించాడు. మధ్యతరగతి రైతు కుటుంబం. సాధారణ విద్యాభ్యాసం సరిగా సాగకపోయినా ప్రత్యేకించి హిందీ నేర్చుకొన్నాడు. ఆంగ్లభాషలోను పట్టు సాధించాడు. హిందీలో ఉన్నత విద్య కోసం ఉత్తరాది వెళ్ళి వచ్చాడు. 1941లో తల్లి సరస్వతి మరణం బైరాగి మనస్సుపై విషాదముద్ర వేసింది. క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. తర్వాత ఎమ్‌.ఎన్‌. రాయ్‌ నేతృత్వంలో ఏర్పడిన ‘రాడికల్‌ హ్యూమనిస్ట్‌ పార్టీ’లో చేరాడు. కొంతకాలం హిందీ ఉపాధ్యాయుడుగా పనిచేశాడు. ఆటు తర్వాత చక్రపాణి పిలుపుపై మద్రాసు వెళ్ళి, హిందీ ‘చందమామ’కు సంపాదకుడయ్యాడు. ‘పలాయన్‌’ అనే హిందీ కవితా సంకలనం వెలువరించాడు.

బైరాగి అవివాహితుడు. నిరాడంబరుడు. క్రమక్రమంగా జీవితం పట్ల ఒక అనాసక్తత పెరిగింది. ఏకాంతజీవి అయ్యాడు. ఏ ప్రభావాలు అతని వ్యక్తిత్వాన్ని ఎలా మార్చాయో తెలీదు, కానీ జీవితాంతం అతనొక ఒంటరి అన్వేషిగానే మిగిలిపోయాడు. క్షయ వ్యాధిగ్రస్తుడై 1978లో అస్తమించాడు. అతని కవిత్వ ఛాయ మాత్రం తెలుగు సాహిత్యరంగాన్ని ఆవరించే ఉంది. అతడే ఒకచోట ఇలా రాశాడు.

‘నాకు చావులేదు
నే సృజించిన అనంతజీవన వసంతవనంలోన చావుకు తావు లేదు
నేను మానవుణ్ణి
ప్రాణదాత్రి, పుణ్యధాత్రి కనకగర్భ సముద్భవుణ్ణి
వేదనాగ్ని సంభవుణ్ణి, భవుణ్ణి
నిత్య పునర్నవుణ్ణి, మానవుణ్ణి
నాకు చావు లేదు’

తన జీవితం గురించి, మరణం గురించి బైరాగి తలపోసింది వ్యక్తిగతమే కావచ్చు. తాను సృజించింది ‘అనంత జీవన వసంతవనం’ అని ఏ కవికైనా అనిపించవచ్చు. అయితే బైరాగి కవిత్వాన్ని ఇప్పటికి, బహుశః ఎప్పటికీ సంబద్ధం (relevant) చేసే అంశాలు కొన్ని ఉన్నాయి. బైరాగి గ్రహించిన కవితా విషయాలు ‘ప్రేమ, మృత్యువు, పలాయనం, పరాజితులకొకపాట, ఎందుకు మాసిపోతుందో ప్రేమ, ఒంటరి డేగ, కలలు పగలగొడుతున్నాను, మాతృగీతిక, అన్వేషణ మొదలైన శీర్షికలతో ఉన్నవన్నీ’ స్థలకాలాలకతీతంగా మానవుడి సంవేదనలకు సంబంధించినవే. ఏ కాలంలో ఏ పాఠకుడైనా వాటిని తనకు, సమస్త మానవులకు అన్వయించుకొని అర్ధం చేసుకోగలడు. ఈ విధంగా బైరాగి కవిత్వానికి పాతదనం లేదు. అకాల మరణం లేదు.

1950 ప్రాంతంలో వెలుగు చూసిన బైరాగి తొలి కవితాసంపుటి ‘చీకటి నీడలు’. దానితో సాహిత్య లోకంలో కొత్త గాలి వీచింది. ఆ తర్వాత ‘తెలుగు స్వతంత్ర’ పత్రికలో ‘నూతిలో గొంతుకలు’ కవితలు ధారావాహికంగా ప్రచురించబడ్డాయి. ఒక కొత్త కంఠస్వరం తెలుగు సాహిత్య ప్రాంగణంలో విన్పించింది. దేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ మొదలు ఎందరి దృష్టినో ఆకర్షించాడు బైరాగి. అతని మరణానంతరం 1981 లో ‘ఆగమగీతి’ కవితా సంచయం ప్రచురింపబడింది.

బైరాగి కథల్లోనూ ఎంతో విలక్షణత ఉంది. ‘దివ్య భవనం’, ‘త్రిశంకు స్వర్గం’ అనేవి అతని కథా సంపుటాలు. దరబాను, ఒక గంట జీవితం, స్వప్నసీమ మొదలైన కథల్లో బైరాగి వ్యక్తుల మనస్సుల్లోని ఆశ నిరాశల వెలుగు చీకట్లను అద్భుతంగా చిత్రించాడు. ఇక బైరాగి నవల ‘పాప పోయింది’. పింగళి సూరన కళాపూర్ణోదయ కావ్యంలో మాదిరి మెలికలు తిప్పుతూ, మెరుపుల్తో కథ అల్లుతాడని బైరాగి రచనాశిల్పాన్ని శ్రీ పురాణం సుబ్రహ్మణ్యశర్మ ప్రశంసించాడు.

‘బైరాగి గాలి కెరటమున్నూ, మనిషిన్నీ, బైరాగి మనిషిన్నీ, బైరాగిన్నీ’ – దేవులపల్లి కృష్ణశాస్త్రి.

తెలుగు కవితా రంగంలోకి ఆలూరి బైరాగి అడుగుపెట్టే నాటికే కృష్ణశాస్త్రి వంటి వాళ్ళు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పారు. వారితో ప్రారంభమైన భావకవితా యుగం 1915 నుండి 1940 దాకా ఉజ్వలంగా సాగింది. ‘దిగిరాను దిగిరాను దివినుండి భువికి’ అన్న ఆ కవిత్వం రానురాను సమాజాన్ని పట్టించుకోని పలాయనవాదంగా కూడా విమర్శల పాలైంది. అయితే కవితా వస్తువులో, అభివ్యక్తిలో ఎన్నో కొత్త మార్పులు తెచ్చింది.

ఇక సమసమాజాన్ని వాగ్దానం చేసిన మార్క్సిజం ప్రభావంతో 1935 ప్రాంతాల్లో ప్రారంభమైన అభ్యుదయ కవిత్వం తెలుగుజాతిని ఒక ఊపు ఊపింది. శ్రీశ్రీ ‘జయభేరి’తో (1934) ప్రపంచం బాధను పలికించే కవిత్వం మొదలైంది. దోపిడి, దారిద్య్రం, తిరుగుబాటు, వర్గపోరాటం, కార్మిక కర్షక పక్షపాతం, అంతర్జాతీయ దృక్పథం అభ్యుదయ కవిత్వంలోని దినుసులు. ఈ విధమైన కవిత్వం 1955 దాక ఉద్ధృతంగా వెలువడింది. ఆ తర్వాత 1955`65 మధ్య తెలుగు కవిత్వంలో స్తబ్ధత ఏర్పడిందని విమర్శకులంటారు. 1929-35 మధ్యకాలంలో దేశమంతటా ఆర్థిక మాంద్యం (depression) ఆవరించింది. మనుషుల జీవనస్థితి దయనీయంగా మారింది. ఇక రెండవ ప్రపంచయుద్ధం మానవాళికి పీడకల అయ్యింది. ప్రపంచంలో దేశాల ఉనికి, మానవుల ఉనికి బృహత్‌ సంక్షోభానికి లోనయ్యాయి. పెట్టుబడిదారీ సంస్కృతి దోపిడి పునాది మీద నిలబడి ‘నాగరికత’ నినాదమిచ్చింది. ఈ నాగరికతలో భౌతిక అభివృద్ధి తప్ప నిజాయితీ కరువైంది. నీతి-అవినీతి, ధర్మం-అధర్మం, ఆశయం-ఆచరణ — వీటి మధ్య వైరుధ్యం ఏర్పడిరది. మనిషి కర్తవ్యం సందేహాస్పదమయింది. అస్తిత్వవాదం మానవుడి రంగుల కలల్ని వెలిబార్చి, అతణ్ణి బీభత్స ప్రపంచంలో ఒంటరివాడిగా నిలబెట్టింది.

ఇక మన దేశంలో స్వాతంత్య్రోద్యమం సఫలమైనా ప్రజల పరిస్థితిలో పెనుమార్పు కలగలేదు. ఆకలి, అవినీతి, పీడన, నిరుద్యోగం వికృత నాట్యం చేశాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రజల ఆకాంక్షల్ని తీర్చటంలో విఫలమైంది. సోషలిజం స్వప్నంగానే మిగిలిపోయింది.

ఇటువంటి వాతావరణంలో బైరాగి కలం పట్టాడు. బ్రతుకుదారిలో తగిలిన ఎదురుదెబ్బల వల్ల ఆయనలో అప్పటికే కొంత నిరుత్సాహం ఏర్పడి ఉండవచ్చు. తొలి దశలో అతని కవిత్వంలో శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి ప్రభావాలు ఉండవచ్చు. అయితే అసంతృప్తుడు బైరాగి తెలుగు పాఠకులకు తన గొంతు గట్టిగానే విన్పించాడు. దేశ పరిస్థితిని నిరసించాడు. జీవితరంగంలోను, కవిత్వరంగంలోను ఒంటరివాడే అయ్యాడు. ఎవరి తోడు, నీడ అపేక్షించలేదు. ‘ఏక్లా చలో’ అని తానే ఒక కవితలో అన్నట్టు ఒంటరి యానమే సాగించాడు.

అస్తిత్వవాది:
బైరాగి కవిత్వంలో అస్తిత్వవాదం (existentialism) లక్షణాలు ప్రబలంగా అగపడతాయి. ‘అస్తి’ అంటే ఉన్నది. ‘అస్తిత్వం’ అంటే ఉన్నదాని స్వభావం. అస్తిత్వవాదం ప్రధానంగా మనిషి స్వభావాన్ని పరిశీలిస్తుంది. మనిషి ఉనికి, అతని కర్తవ్యం, ప్రపంచంలో అతని స్థానం, దైవంతో అతని సంబంధం మొదలైన విషయాల్ని ఈ వాదం వివరిస్తుంది. వ్యక్తి, సమాజాల మధ్య వైరుధ్యాన్ని కూడా పరిశీలిస్తుంది. ప్రతి వ్యక్తీ ఈ వాదం దృష్టిలో ప్రత్యేక వ్యక్తే. ఈ వాదంలో అస్తిత్వం (existence), స్థితి (being), అసంబద్ధత (absurdity), ఎన్నిక (choice), భీతి (dread), నిరాశ (despair), స్వేచ్ఛ (freedom), బాధ్యత (responsibility) మొదలైన పరిభాషలు తగులుతాయి.

19వ శతాబ్దంలో నీషే (Nietzsche), కీర్క్‌గార్డ్‌ (Kierkgard) అనే తత్త్వవేత్తలు ఈ వాదానికి రూపకల్పన చేశారు. ‘God is dead’ అన్నాడు నీషే.) ఆ తర్వాత ఈ వాదాన్ని ఉచ్చస్థితికి తీసుకెళ్ళిన ఫ్రెంచి తత్త్వవేత ఝాఁ పాల్‌ సార్త్ర్‌ (Jean Paul Sartre). ముఖ్యంగా being and nothingness అనే పుస్తకంలో సార్త్ర్‌ తాత్త్విక భావనలు వివరించబడ్డాయి.’Existence Precedes Essence అనేది సార్త్ర్‌ సిద్ధాంతానికి ప్రాతిపదిక. అంటే తొలుత మనిషి అస్తిత్వం / ఉనికి ఉంటుంది. తన ఆలోచనలతో, చర్యలతో అతను ఎప్పటికప్పుడు తన వ్యక్తిత్వాన్ని / స్వభావాన్ని నిర్మించుకొంటాడు. ఆ విధంగా అతని సారాంశం రూపొందుతుంది. తన వ్యక్తిత్వ, స్వభావాలను నిర్ణయించుకొనే స్వేచ్ఛ మనిషికుంది. అట్లా అతను సర్వస్వతంత్రుడు. ఆ స్వేచ్ఛ, స్వాతంత్య్రం అతనినెప్పుడూ వెన్నాడుతూనే ఉంటాయి. వాటినుంచి తప్పించుకోలేడు కనుక మానవుడు స్వేచ్ఛా శాపగ్రస్తుడు Man is condemned to be free.

స్వేచ్ఛ మనిషికెందుకు శాపమవుతుంది? మనిషికి నిర్ణయస్వేచ్ఛ ఉన్నప్పటికి తను చేసే ప్రతి పనికి తనే బాధ్యుడవుతాడు. అంటే స్వేచ్ఛతోపాటు కర్తవ్యం, మంచిచెడ్డలు నిర్ణయించుకొనే అవకాశం ఎలాగైతే వస్తాయో, దాని ఫలితం కూడా అలాగే అనుభవించాల్సి వస్తుంది. అంతా దైవనిర్ణయం అనుకొనే వీలులేదు. ఎందుకంటే దేవుడు లేడు కనుక. ఒకవేళ ఉన్నా అతనికి మానవజీవితంతో ప్రత్యక్ష ప్రమేయం లేదు. కాబట్టి మానవుడికి గల స్వేచ్ఛ అతనికి పెను బరువు అవుతుంది. అతనికి గల ఈ ఇచ్ఛా స్వాతంత్య్రం వల్ల ధర్మాధర్మాల మధ్య, నీతికి అవినీతికి మయాన, ద్వంద్వ కర్తవ్యాల నడుమ ఏది సరైనదో నిర్ణయించుకొనే అక్కర కలుగుతుంది. తన కర్తవ్యం యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుందో అనే ఆందోళన (anxiety) కలుగుతుంది.

ప్రపంచంలో మనిషి ఏకాకి. దేవుడు మొదలుకొని ఎవ్వరూ అతనికి అభయం ఇవ్వలేరు. దారి చూపలేరు. తన దారి తనే చూసుకోవాలి. ఈ క్రమంలో ఒక్కోసారి అతను తనపై తనే నమ్మకం కోల్పోతాడు. తనలో అపవిశ్వాసం (bad faith) ఏర్పడుతుంది. జీవితంలో తను వాస్తవంగా స్వతంత్రుడిని కానని, తనకు తరతరాల నుంచి సంక్రమిస్తున్న పూర్వ స్వభావం ఉందని, దాని ప్రకారమే జీవితగమనం ఉంటుందని, అంతకుమించి ఇంకో రీతిగా ప్రవర్తించలేనని తనను తాను నమ్మించుకొంటాడు. బాధ్యతనుంచి తప్పించుకోవటానికి చేసే మనః ప్రయత్నం అది. మనిషిలో అప విశ్వాసం ఏర్పడినప్పుడు తన శక్తియుక్తుల స్పృహ, ఉత్సాహం, కార్యశీలత- అన్నీ లోపిస్తాయి. ఆధునిక మానవుడి అస్తిత్వానికి సంబంధించిన ఒకానొక ప్రతికూల (negative) ఆలోచనా ధోరణి ఇది.

‘Faith is the conviction about the not yet proven, the knowledge of the real possibility, the awareness of pregnancy’ అన్నాడు Erich Fromm.

హేతుబద్ధమైన నమ్మకం జరగబోయే వాస్తవాన్ని ఊహిస్తుంది. కార్యాచరణకి దారి తీస్తుంది. హేతుబద్ధం గాని నమ్మకం జరగనిదాన్ని ఊహిస్తుంది. నమ్మకానికి ఆశ చిగురు. ఆశకి నమ్మకం పునాది. అది కోల్పోవటం చేతనే బైరాగి ‘నాక్కొంచెం నమ్మకమివ్వు’ అని వేడుకొన్నాడు.

అస్తిత్వవాదానికి తెలుగులో ఆలూరి బైరాగి సాహిత్యం అచ్చమైన అద్దం అనుకోవచ్చు. ‘అస్తిత్వ బాధాయోగి బైరాగి’ (కె.వి.రమణారెడ్డి).

తెలుగు సాహిత్యంలో ఒక రకంగా విస్మృత కవి బైరాగి. నిరాదృత కవి. అత్యంత మౌలికత (originality) గల కవి. ఉద్రేకపూరిత వాదాల్లో, ఉద్యమాల్లో పడి తెలుగు సాహిత్యకారులు ఇతర విషయాలెన్నో విస్మరించారు. ఉద్యమాలకు దూరంగా చూడాల్సిన ప్రదేశాలెన్నో ఉన్నాయి. అట్లాంటి ఒక ప్రదేశం బైరాగి కవిత.

బైరాగి ‘ఆగమగీతి’కి కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది. ‘ఆగమగీతి’, ‘చీకటి నీడలు’ కవితాసంపుటుల్లోను, ‘స్వప్నసీమ’, ‘దరబాను’, ‘ఒక గంట జీవితం’ కథల్లోను అస్తిత్వ సంవేదనలు తొణికిసలాడతాయి. ఒక నిరాశ నీడ బైరాగి రచనల్లో నడిచి వెళ్ళిందేమోనన్పిస్తుంది. ఆ కాలిగుర్తులు తేలిగ్గానే కనపడతాయి.

కాలం గోడమీద రెండో ప్రపంచ యుద్ధపు నెత్తుటి మరకలు. ప్రపంచమంతటా పునాదులు కదులుతున్న చప్పుడు. అగ్రరాజ్య విస్తరణవాదం. భగ్నస్వప్నమైన భారత స్వాతంత్య్రం. అవినీతి, ఆకలి, అసమానత, ఆదర్శ శిథిలాలు. గానుగెద్దు నడిమి తరగతి బతుకు. జీవం లేని ముఖాలు. ఈ అన్నిటిలోని చీకటి రంగు బైరాగికి కన్పించింది. జీవితమొక క్షణికోన్మాదం, జీవితమొక వ్యర్థ వినోదం అన్పించింది. స్వీయ అనారోగ్యం తన పరాజిత గీతానికి మరింత విషాదం జీర జోడించి ఉంటుంది.

‘మానవ యజన వాటికపై
మరల నేడు
ముసురుతోంది సందేహాల
మందేహాంధ దేహచ్ఛాయ’ (ఆగమగీతి)
అన్నీ సందేహాలే. అన్నీ ప్రశ్నలే. ఎక్కడా సమాధానం లేదు.
‘ప్రశాంతి సాగరాన్ని చేరుకొనే బాట ఏది?
సుఖదుఃఖాల బాధలేని నిర్వాణపు త్రోవ ఏది?
మా జీవిత ప్రవాహాల గమ్యమేది? లక్ష్యమెచట?’ (అన్వేషణ)

సందేహాలకు సమాధానం దేవుడు గాని, ఏ ప్రవక్త గాని ఇవ్వలేడు. సొంత అన్వేషణ తప్పదు. అలజడి తప్పదు. దారికోసం వెతుకులాటలో ‘చీకటి పడినది తల్లీ! దీపం చూపవేలనే?’ అని వేడుకోక తప్పదు. అంతా వెతుకులాటే.

‘విశాల వినీల వ్యోమపు విస్తృతిలో ఒంటరి డేగనై
మందలో తప్పిపోయిన లేగనై
వెదకుతున్నాను, వెదకుతున్నాను అర్థం కొరకు
అమ్మవంటి అర్థం కొరకు’ (ఒంటరి డేగ)

బతుక్కి అర్థం తెలియనప్పుడు, బతుకు అర్థవంతం కానప్పుడు మిగిలేది అసంబద్ధత (absurdity). చివరికి పరాజయం. పలాయనం.
‘ఎక్కడికని అడగవద్దు
ప్రశ్నలు, అనుమానాలన్ని రద్దు
చేతబట్టి ఖాళి సంచి
పోదాం పద, ముందిక్కడినుంచి’ (పలాయనం)

పలాయనం మనిషి ఉనికికి పరిష్కారం కాదని. బహుశః బైరాగికీ తెలుసు. అతని కవిత్వంలో ఆశావాదంతో తొణికిసలాడే పంక్తులు కూడా ఉన్నాయి.

నూతిలో గొంతుకలు:
‘నూతిలో గొంతుకలు’ అస్తిత్వవాద కోణం నుంచి పరిశీలించదగిన ఉత్తమ రచన. సార్త్ర్‌ చెప్పిన ‘బురద’ వంటిదే ‘నూయి’ కూడా. అభిశప్తులైన మానవులు అందులో పడి ఉన్నారు. వెలుతురు లేదు. పైకి పాకటానికి ఆధారం లేదు. చీకటి తప్ప తోడు లేదు. గమ్యం కన్పించదు. ఆ నిస్సహాయ ఆక్రందనలు బయటివారికి విన్పించవు.

‘నూతిలో గొంతుకలు’ సంశయకావ్యం. దీనిలో మానవుడు ఏదిత్రోవ? అని అడుగుతున్నాడు…చీకటిలో ప్రారంభమైన ఈ కావ్యం ‘ఆవేదనల అనంతంలో అంతమైన జీవితాలను’ చర్చిస్తున్నది’ — బైరాగి.

‘ప్రతి మనిషీ ఒక గదిలో
చెదపురుగులు ప్రతి మదిలో
ప్రతి మనిషీ ఒక నదిలో
సుడిగుండం ప్రతి ఎదలో
ప్రతి మనిషీ ఒక చెరలో
ఉరికంబం ప్రతి హృదిలో’

అన్నీ నిట్టూర్పులే, సందేహాలే, అలజడులే అయితే మనిషికి దారి దొరుకుతుందా?

‘కాలరాత్రి జీవిత యాత్ర
ప్రొద్దు పొడవలేదు, కూచునేందుకు వీలు లేదు
ఒంటరిగా ఒంటరిగా మంటల్లో మంటల్లో
పయనిస్తున్నాడు నరుడు
తానెరుగని దిక్కుకేసి’

‘నూతిలో గొంతుకలు’ కావ్యంలో ముగ్గురు నాయకులున్నారు. ఒకరు హేమ్లెట్‌. రెండవవాడు అర్జునుడు. మూడవ వ్యక్తి రాస్కల్నికోవ్‌. ముగ్గురూ సందిగ్ధాల మధ్య ఊగిసలాడిన వాళ్ళే. అస్తిత్వ వేదనపాలైన వాళ్ళే. హేమ్లెట్‌ వేదన కర్మ పూర్వం. అర్జునుడి వేదన కర్మ కాలికం. రాస్కల్నికోవ్‌ వేదన కర్మానంతరం.

‘To be or not to be’ అనేది హేమ్లెట్‌ సందిగ్ధత. ‘తప్పొప్పుల నిర్ణయ మిట దుస్సాధ్యం, మానవునకు క్రియ ఒకటే ఆరాధ్యం’ అనుకొంటాడు. ఏది దౌర్బల్యమో నిర్ణయించుకోలేడు.

‘జ్ఞానం ఒక రంపంలా చీల్చి, కోసి మానవుణ్ణి తుత్తునియలు చేస్తుంది.’ జ్ఞానానికి, కర్మకు శ్రుతి కుదిరితే అవేదనకు తావు లేదు. శ్రుతి కుదరనంత కాలం వేదన తప్పదు.

యుద్ధమా? నిర్యుద్ధమా! అనేది అర్జునుడి సందిగ్ధత. ‘కర్మ యొనర్చడమెలాగ, ఈ బాధ్యత కఠినతరం, రణం దుష్కరం.’ హింసే ధర్మం అయితే ఎవడికెవడు దిక్కు? రానున్న తరాలకేది జవాబు? కోల్పోవలసిందంతా యుద్ధంలో కోల్పోయినాక ఎవరికి కావాలి గెలుపు? ఈ విషమ సమస్య నుంచి విముక్తి కోరుతూ వ్యధ పాలయ్యాడు అర్జునుడు. సమాధానం కోసం కృష్ణుణ్ణి ఆశ్రయించాడు.

‘పలాయనమా? పశ్చాత్తాపమా?’ అనేది రాస్కల్నికోవ్‌ సందిగ్ధత. ఇతడు దొస్తొయెవ్‌స్కీ నవల Crime and Punishment కథానాయకుడు. రెండు హత్యలు చేసి అటు పిమ్మట విచికిత్సలో పడతాడు. సోనియా ప్రబోధం అతడిని మేల్కొల్పుతుంది. తనలోని చీకటికి అంతం ఏది? పాపికి శాపవిముక్తి ఏది?

‘సోనియా! సంశయ రజనిలో
ఆత్మహింసల ఘోరవనిలో
త్రోవ తప్పిన ప్రేత కోటికి
త్రోవ ఎక్కడ? వెలుగు ఎక్కడ?’

తన పాప విముక్తి కోసం, దారి కోసం, వెలుతురు కోసం రాస్కల్నికోవ్‌ సోనియాని ఆశ్రయించాడు. జ్ఞానానికి, కర్మకి శ్రుతి కుదిరినప్పుడు మనిషి అస్తిత్వవేదన అదృశ్యమవుతుందని బైరాగి ఈ కావ్యంలో ప్రతిపాదిస్తాడు. ‘నూతిలో గొంతుకలు’ కావ్యంలో పరాజిత మానవుల, నిస్సహాయ మానవుల ఆక్రోశాలు విన్పిస్తాయి. జీవితంలో అన్ని విధాలా ఓడిపోయిన వ్యక్తుల వేదన, చీకటి తప్ప వెలుతురు తెలీని మనుషుల రోదన విన్పిస్తాయి. ఆ పరాజిత మానవుల కంఠస్వరంలో పరాజిత కవి కంఠస్వరం కూడా కలిసిందనే భావించాలి.

అయితే ఆరుద్ర ‘బైరాగిని కేవలం పలాయనవాదిగా నేటి ఆంధ్రదేశం గుర్తుపెట్టుకొంటే అది అపచారం.’ అన్నాడు.

‘బైరాగి ఒక భయపడిన మనిషి. ఘోర కాంతారమధ్యంలో, క్రూరమృగ సందోహాల సందడికి భయ విచలితుడై, తోడు లేక, నీడ లేక ఏకాకిగా ఆక్రందించిన మనిషి. అతని కవితలు ‘నూతిలో గొంతుకలు’లోను, ‘చీకటి నీడలు’లోను, ఇతర అముద్రిత రచనలలోను, అన్నిటా ఈ ఆక్రందన అంతర్నిహితమై ఉంది.’ (రెంటాల గోపాలకృష్ణ, ఆలూరి బైరాగి సంస్మరణ సంచిక,1979).

ఆధునిక కవిత్వానికి ఆలూరి బైరాగి చేసిన దోహదం (contribution) తక్కువేమీ కాదు. ‘నూతిలో గొంతుకలు’ కావ్యం తెలుగు కవిత్వానికి కొత్త వస్తువును పరిచయం చేసింది. అప్పటిదాకా శ్రీశ్రీ మొదలైన గొప్ప అభ్యుదయ కవులు సామాజిక భవిష్యత్తు పట్ల గొప్ప నమ్మకం కలిగించారు. అయితే నాణేనికి అవతలివైపు ఎప్పుడూ ఉంటుంది. శ్రీశ్రీ కవిత్వం గొప్ప నమ్మకమైతే బైరాగి కవిత్వం గొప్ప సందేహం. సమ సమాజం ప్రాతిపదికగా మరో ప్రపంచం తప్పకుండా ఏర్పడుతుందని శ్రీశ్రీ కవిత్వం చెప్తుంది. మనిషి భవిష్యత్తు అగమ్యగోచరం అని బైరాగి కవిత్వం అంటుంది. ఇంకా మనిషి అస్తిత్వానికి సంబంధించిన అనేక ప్రాథమిక సమస్యలు బైరాగి కవిత్వంలో చర్చించబడ్డాయి. అభ్యుదయవాదం, నిరాశావాదం మొదలైన అంశాలెన్నో అతని కవిత్వంలో తొంగిచూస్తాయి. ఒక నిర్లిప్తుడి దృక్కోణం నుంచి జీవితాన్ని దర్శించాడు బైరాగి. మనిషి జీవితంలోని వేదన, అంతరంగ సంక్షోభం, సందేహం, భయం, ప్రేమ మొదలైన అనుభూతుల్ని అత్యంత నిరాడంబరంగా ప్రదర్శించాడు. చీకటినీడలు, ఆగమగీతి, కలలు పగలగొడుతున్నాను. ఒంటరి డేగ, తాజ్‌మహల్‌ పడగొట్టండోయ్‌, కవి సమస్య, పరాజితులకొక మాట, నేను మనిషిని కాను, ప్రేమ కవితలు మొదలైన కవితల్లో అంతకుపూర్వం తెలుగు కవులు ప్రకటించని భావాలెన్నో సరికొత్తగా కనపడతాయి. భావ శబలత బైరాగి కవిత్వ స్వభావం. చిరుగాలికే మంద్రధ్వనితో కంపించే వీణ వంటివాడు బైరాగి. సున్నితత్వం, మృదుత్వం అడుగడుగునా ఆ కవితల్లో కన్పించే సుగుణాలు.

ఆధునిక కవిత్వంలో ముఖ్యంగా వచన కవిత ఆవిర్భావంతో కవిత్వ వస్తువులో బ్రహ్మాండమైన వైవిధ్యం వచ్చింది. శ్రీశ్రీ ‘మహా ప్రస్థానం’లో శబ్దవిన్యాసాలు ఆయా వస్తువులకు సరిగ్గా సరిపోయాయి. తర్వాత తిలక్‌, బైరాగి శ్రీశ్రీ నుంచి కొంత వారసత్వం గ్రహించారు. దాంతోపాటు భిన్న భాషా సామగ్రి అవసరం అని తెలుసుకొన్నారు. ఈ కవుల్లో శ్రీశ్రీ కవిత్వంలో మాదిరి తత్సమ పద గుంఫనం, శబ్ద సౌందర్యం, తీరైన నడక ఉండవు. నిరావరణ నిరాభరణ నగ్నచ్ఛవి, కామాతుర కంకాళ కరాళకేళి – ఇట్లాంటి సమాసచాలనం కనిపిస్తుంది బైరాగి కవిత్వంలో. అదనంగా లలిత లలితమైన తెలుగు మాటల పొందిక కూడా ఉంటుంది – పొగమంచు ముసుగులోని ఆకృతి, గాలిబాట వెంట మాట తెలియరాని ఆరాటపు పాట, నిదురించే మోవిమీద ముద్దు – ఇట్లా. ఈ రెండురకాల భాషాప్రయోగ సమ్మిశ్రం బైరాగి కవిత్వంలో ప్రత్యేకించి అధ్యయనం చెయ్యదగిన అంశం. ఒక వైపు సంస్కృతంనుండి మనకు దిగుమతి అయిన పదాలు, పదబంధాలు, సిద్ధ సమాసాలు చాలా ఉన్నాయి. మరి ఇక్కడ బైరాగి ప్రత్యేకత ఏమంటే ఆయనపైన సంస్కృత సంప్రదాయం కన్న హిందీ భాషా సంప్రదాయం ప్రభావం గాఢంగా ఉంది. కనుకనే తన కవిత్వంలో భిన్నమైన భాషాసామగ్రి ఉంటుంది. దానికి తోడు సాధారణ లయాత్మక రచనా విధానాన్ని కూడా ఆయన పూర్తిగా పాటించలేదు.

‘చీకటినీడలు’ మొదలైన కవితల్లో మాత్రాచ్ఛందస్సులో గేయకవితలు రచించాడు బైరాగి. మరికొన్ని వచన కవితలు రచించాడు. కొన్నిచోట్ల గేయపద్ధతి, వచన పద్ధతి కలగలిసిన విలక్షణ విధానం కూడా అతని కవిత్వంలో ఉంటుంది. వాక్యనిర్మాణంలోను, భాషా ప్రయోగంలోను, పాద విభజన లోను బైరాగి పూర్తి స్వాతంత్య్రం ప్రకటించాడు. ఆకాశపు ఎంగిలి పళ్ళెంలోంచి సూర్యచంద్రుల్ని నెట్టెయ్యటం, బ్రహ్మాండాన్ని చాపలా చుట్టెయ్యటం, కాలుని మీద కలబడటం, బాష్పాకుల మేఘమాల, రేయి కడలి తరగలు, చీకటి చెట్ల కొమ్మలు, మక్కువ నిండిన మగువ కన్నులు, తూరుపు క్రొంజిగురు కెంపు, విశ్వవ్యధా వారినిధి తటం, మేఘాల మోహాలు ముసురుకొను ఈ రేయి – ఇటువంటి అద్భుత భావ పదచిత్రాలు, వ్యక్తీకరణలు అతనిలో ఎన్నో,

భాష గురించి బైరాగి అభిప్రాయాలు ఎలాంటివి? ‘కవిసమస్య’లో ఇట్లా అన్నాడు.

‘పరాభూత కవి కరంలో విరిగిన విల్లు లాంటి భాష
మొక్కవోయిన అమ్ములీ శబ్దాలు
తిరిగి తిరిగి, విరిగి విరిగి
కరగి, చెరగి, ముదిరి, మరిగి
గురుతు లేని గులకరాళ్ళై
వంకర మేకుల్లా పిన్నుల్లా గుర్రపునాడాల్లా
వీధుల్లో త్రోవలంట ధ్వనుల నీడల్లో నక్కుతూ
మశూచికపు మొగంలా
చిల్లిపడిన పాత్రలా అర్థం జారిపోతూ
ఖాళీ డబ్బాల్లా మ్రోగుతూ
అసంఖ్యాక స్పర్శలతో జిగటబారే శబ్దాలు’

జీవిత పోరాటంలో ఓడిపోయిన కవి భాష కూడా ఓడిపోతుంది. భావ వ్యక్తీకరణకు సరైన భాష అందదు. విరిగిన విల్లు, మొక్కవోయిన అమ్ములు ఏ వేటకీ పనికిరావు. అలాగే అటువంటి భాష, శబ్దాలు కూడా ఏ వ్యక్తీకరణకీ పనికిరావు.

కరిగిపోయేవి, చెరిగిపోయేవి స్పష్టంగా ఏ అర్థాన్ని ప్రకటించలేవు. గులకరాళ్ళను గుర్తించటం కష్టం. అట్లాగే శబ్దాలు కూడా యథాలాపంగా, యాంత్రికంగా ప్రయోగించేటప్పుడు తమ ప్రత్యేక స్థితిని కోల్పోతాయి. వంకర మేకులు సరిగా దిగవు. గుర్రపునాడాలు అపసవ్యంగా వంకర తిరిగి ఉంటాయి. అదేవిధంగా శబ్దాలు వక్ర వ్యక్తీకరణకు గురైనప్పుడు సక్రమ భావప్రకటన చెయ్యలేవు. శబ్దాలు ధ్వనుల నీడల్లో నక్కుతున్నాయంటే ధ్వని మాత్రమే ప్రధానమై అర్థ ప్రాధాన్యం కోల్పోయాయని భావం. మశూచికపు మొగం వికారంగా ఉంటుంది. చిల్లిపడిన పాత్రలో నీరు నిలవదు. ఖాళీ డబ్బాలు శూన్యాలు. ఈ పోలికలను అన్వయిస్తే భావశూన్యమైన శబ్దాలు స్ఫురిస్తాయి. ఒక వస్తువును పదే పదే పట్టుకొనేటప్పుడు దానిపై పల్చటి జిగటపొర ఏర్పడుతుంది. అదేవిధంగా ఎంతోమంది కవులు అవే శబ్దాల్ని నిరంతరం ఉపయోగిస్తుంటే అవి కూడా జిగటగా, అసహ్యంగా తయారవుతాయి. అప్పటి కవితల్లో సమత, మమత వంటి అరిగిపోయిన మాటలెన్నైనా గుర్తించవచ్చు.

తెలుగు కవిత్వంలో భాష దుస్థితిని బైరాగి గుర్తించాడనటానికి పై వాక్యాలు సాక్ష్యం పలుకుతాయి. కవిత్వంలో ప్రతి కొత్త ధోరణి కొత్త భాషని, కొత్త భావ వ్యక్తీకరణ పద్ధతిని వాంఛిస్తుంది. ఇది తెలియకపోవటాన ప్రసిద్ధులైన కవులు కూడా పూర్వం పదే పదే ఉపయోగించబడిన, అరిగిపోయిన, అర్థస్ఫూర్తి కోల్పోయిన పదజాలాన్నే ప్రేమగా ప్రయోగిస్తుంటారు. అట్లా స్థిరీకరింపబడిన పరిమిత భాషా సామగ్రితోనే తిరిగి తిరిగి గుడుగుడు గుంచం ఆడుతుంటారు. భావాల్లో కొత్తదనం ఉన్నా భాషలో కొత్తదనం లేనిదే కవిత రాణించదు. సరికొత్త ఆలోచనలకు దీటుగా సరికొత్త భాషావసరాన్ని బైరాగి గుర్తించాడు. అర్థవంతమైన మాటలు, భావాన్ని సవ్యంగా ప్రకటించగల పదాలు, కొత్తదనం నిండారిన పలుకులు కవిత్వానికి అవసరమని ఆ సృజనశీలి భావించాడు. ఆ విషయాన్నే అతని కవిత్వం దృష్టాంతపూర్వకంగా నిరూపిస్తుంది.

అడుగడుగునా నిరాశా నిస్పృహలు ధ్వనించే బైరాగి సాహిత్యాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? కవిత్వమంటే నిరసన, తిరుగుబాటు, పోరాటాలతో నిండిన వీర ప్రబోధమేనా? కాంతిగానమేనా? కవిత్వమంటే కేవలం కాంతిగానమే అయితే అభిశప్త జీవితాల్లోని చీకటి సంగతేమిటి? పిరికివాళ్ళకు, సందేహజీవులకు, నిరాశోవహతులకు, దుఃఖభాగులకు కూడా జీవితం ఉంటుంది గదా? ఈ అస్తిత్వ సంవేదనలను మొదలు గుర్తించటానికే మనం ఇష్టపడటం లేదా అనేది ఆలోచించాలి. అస్తిత్వవాద ధోరణుల్ని కేవలం ప్రతికూల ధోరణులుగా (negative trends) తిరస్కరించటం సబబేనా అని ప్రశ్నించుకోవాలి. ‘కంఠం, ఒక కంఠం కావాలి నాకు, మానవగీతం ఆలపించే ఒక కంఠం’ అంటున్న గొంతులో స్వేచ్ఛాపిపాస గురించి ఆలోచించాలి.

చీకటి ఒక వాస్తవం. ‘చీకటి నాడి దొరికితేనే తెలుస్తుంది త్రోవ’.

బైరాగి అప్పటికి సాహిత్యంలో నలిగిపోయిన ఏ దారినా ఎవరిదారినా నడవటానికి ఇష్టపడలేదు. కష్టమో, నిష్ఠురమో తన దారి తనే వెతుక్కున్నాడు. అది రాళ్ళు, ముళ్ళు, సంజె నీడలు పరుచుకొన్నదే కావచ్చు.

అయినా ఆ కనుచీకటి దారిలో అతనే తొలి బాటసారి.

(హైదరాబాద్‌ మిర్రర్‌, 21, 28 అక్టోబర్‌, 4 నవంబర్‌ 2007)