ఆలూరి బైరాగి (5.9.1925 – 9.9.1978) కవిగా, రచయితగా, ఒక స్వాప్నికుడిగా, ఏకాంత సాహితీ మౌనవిరాగిగా కన్పిస్తాడు. రైతు కుటుంబంలో పుట్టి, తెనాలి మట్టివాసన వాసెన గట్టి, చీకటి నీడల్లో నడిచి కవితా వెన్నెల ఝురిని ఝళిపించాడు. తన జ్ఞానం తరువాత తరానికి పంచిన మేధావిగా, చందమామలో తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌లో పద్యాలు, నీతికథలు రాసిన బహుముఖ చరిత సమ్రాట్టుగా సాక్షాత్కరిస్తాడు. 1955లో ‘నూతిలో గొంతుకలు’ ప్రచురించి ‘దివ్యభవనం’ అనే కథల సంకలనాన్ని కూడా వెలువరించాడు. ఆయన మరణానంతర ప్రచురణ ‘ఆగమ గీతి’. దీనికే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.
దివ్యభవనం తొలి ప్రచురణలో ఏడు కథలు, మలి ప్రచురణలో మరో నాలుగు కలిపి పదకొండు కథలున్నాయి. తొలి కథే దివ్యభవనం. ఇది సూడో ఫాంటసీ కథ. కల్పితమే అయినా కొత్త ఆలోచనకు పదును పెడుతుంది. విచిత్రమైన ఈ భవన వర్ణన చాల చిత్రంగా ఉంది. ఇటుకలు, సున్నంతో కట్టింది కాదు. నిరంతరం మెరుస్తుండేది. ఇది కట్టారనడంకన్నా పోత పోసిన లోహపు భవనం అంటాడు. అలౌకికమైన కాంతితో రాత్రివేళ మెరుస్తుంది. ఎక్కడా గుమ్మాలుండవు. అందులో అసలు మనుషులే ఉండరు. గాజులా పారదర్శకం. అస్పష్టమైన మూల్గుల మేడ. దానిలో ప్రవేశించినవాళ్ళు, తిరిగివచ్చినవాళ్ళు లేరు. కాని షేక్స్పియర్, దోస్తయెవ్‌స్కీ, కాళిదాసు, బుద్ధుడు, క్రీస్తు, గాంధీలతోపాటు అశోకుడు, న్యూటన్, గలీలియోలాంటివాళ్ళు కన్పిస్తారు. ఐతే చాలాకాలానికి ఒక పిల్ల రచయిత ఆ భవన దర్శనం చేశాడు. అంతే నాల్రోజులు సమాజంలో అతని గూర్చిన వార్తలు. చివరికి అతన్నే కలిశాడు మన కథానాయకుడు. పిల్ల రచయిత చెప్పిన మాటల్లో…
బాహ్య ప్రపంచానికి ఈ భవనానికి అస్పష్టమైన తెర ఉంది.
ఎడారిలో ఉన్న భావన
ఎగిరి దూకినా కాలికి నేల తగలని అనుభూతి
బయటి ప్రపంచమంతా లోనున్న పిల్ల రచయితని చూస్తున్న భావన, తట్టుకోలేని ఒంటరితనం, ఏదో అపరాధ భావన బయటికి పరుగెత్తేలా చేశాయి.
కథ ముగింపులో మసక చీకట్లో దివ్యభవనం మిలమిలా మెరుస్తుందని అంటాడు.
లోకంలో ఎక్కడా తారసపడని సోషియో ఫాంటసీ ఈ కథలో ఉంది. అడుగడుగునా తర్వాత ఏమిటనే భావనతో నడిపిస్తాడు. ఇదో దివ్యభవన ఊహాలోక మాయవిన్యాసం.
తరువాత కథ ‘దరబాను’. ఈ పదం హిందీలోనూ, నేపాలీ భాషలోనూ కనిపిస్తుంది. వ్యక్తి నామం. నామవాచకం. వితంతు పుత్రుడయిన లక్ష్మణ సింగు బ్రాడ్వేలో వాచ్‌మన్ ఉద్యోగం. నిరంతరం వాకిలి ముందు కాపలా. వాకిలి లోపల బ్యాంక్ ఉంది. లోపలి వాళ్ళకి అన్నాలు అంటే కారియర్లు తెచ్చే ‘లచ్చి’ని చూసిన తర్వాత ‘ధూమ రూపంలో మనస్సులోని నిమ్న తీర స్థలాలను ఆవరించిన వాంఛలు ఒక రూపం దాల్చినయే’. మాటామంతీ కలిశాక లచ్చి చేయిపట్టుకున్నా ఏమీ అనలేదు. కాని, పదిరోజుల్లో లచ్చికి పెళ్ళయి అత్తారింటికి వెళ్ళింది.
అంతే. వాడికి భవిత లేదు, భూతవర్తమానాలు లేవు. ఎదురుగా ఉన్న తెల్లటి గోడ తప్ప. ముగింపులో మేనేజరుగారి కేక వినిపించింది అంటాడు.
కథలో అమలిన శృంగారం చక్కగా పండించాడు. ఒంటరితనంలో అగమ్యగోచరమైన ఆర్తి, నిరంతర జీవితానికి మిగిలిన తెల్లగోడను నూతన భావుకతలో సాక్షాత్కరింపజేసిన కథనం నూతన ఆవిష్కరణ.
తదుపరి కథ ‘ఒక గంట జీవితం’. రాత్రివేళ హోటల్లో గుంపులు గుంపులుగా చేరి పిచ్చాపాటి చెప్పుకునేవాళ్ళకి దూరంగా కూర్చుని ఒంటరితనం అనుభవించే ఏకాకి జీవితం ఇది. ప్రేమ, శాడిజం, శృంగారపు తాకిడి మధ్య అంతరాంతరాళంలో ఉన్న ఆత్మని దర్శించాడు. అదే మానవ జాతుల శోకార్థ సంగీతం, వాయులీనం మధ్య ఆనందభైరవి రాగం వస్తున్నా, నీవూ నేనూ మధ్య నలిగి పువ్వులు కురవడం ఒక భావన. అంతలోనే మూలుగుతున్న వాయులీన విషాద ధ్వని మృత్యుస్పర్శలో ముసురుకున్న రాత్రి కడసారి కౌగిలింతలో గతకాలపు ప్రతిధ్వనులౌతాయి. ఇది ఆనందం-విషాదం కలగలిపిన ఉరి ఉచ్చులో బిగిసిన గొంతులో నుంచి వెలువడిన గురగురలు. రాత్రిపూట విద్యుత్ కాంతుల నుంచి బయటపడి ఒక గంట వాస్తవంగా జీవించానని ముగిస్తాడు. ఇదో విషాద విహ్వల సారంగధర. ఒకవైపు ఆనందం, మరోవైపు విషాదం. చీకటి వెలుగుల చిన్మయ నాట్యాన్ని ప్రదర్శించి ఒక గంట జీవించానని తృప్తిగా నిట్టూర్పు విడిచాడు.
మరో కథ ‘స్వప్న సీమ’. ఇది నిజంగా స్వప్నమే. ఇద్దరు అపరిచితులయిన స్త్రీ పురుషులమధ్య ఏర్పడిన సాన్నిహిత్య భాషణ భావన రాగ వాశిష్టమే ఈ గాథ. చివరికి ఆమె అతగాడిని రమ్మని తనతో ఉండమని ఆహ్వానించినా ‘ప్రూఫులు చూసుకునేవాడిని… మీవాళ్ళకి ఏమని పరిచయం చేస్తావు’ అనే శంకావంకలతో ఆగిపోతాడు. చివరికి మెత్తని చెయ్యి గట్టిగా పట్టి, చీకటిలోకి నడిచాడని ముగింపు. ఒక అద్భుతమైన కథనం ఈ కథను నడిపిస్తుంది. శృంగార భావన, అల్ప మానవ అపరాధ నిమ్నతావున పొసగని పరిస్థితిలో అంతః ఘర్షణకు ప్రతీక. కథనం అంతా రెండు భిన్నస్వరాల కలయిక, పొసగని తావు కనిపిస్తుంది.
తరువాత కథ ‘బీజాక్షరి’. చదువుతున్నంతసేపూ బైరాగి ప్రతి అక్షరంలోనూ కనిపిస్తాడు. కథారచనకూ, మనస్సుకూ మధ్య ఘర్షణ. కలానికీ కాగితానికీ పొత్తు కుదరని భావన. చివరికి కావ్యానికి ఫలశ్రుతిలా కథకు ఆశీర్వచనంతో బైరాగి రచనా విన్యాసానికి ఆశయం, స్వాప్నిక జగతికి ఒక చిత్రాన్ని పింగాణి పాత్రలా దించి ముగిస్తాడు.
ఆపై కథ ‘జేబుదొంగ’, తెనాలి రైల్వేస్టేషను నుంచి పయనించిన చిరుద్యోగి జీవనయానం. జేబులో ఉన్న ఐదురూపాయలు తస్కరించిన పిల్లాడిని మందలించకపోగా జాలిచూపిన వింత ఘటనాఘటన మనోల్లాస చిత్రీకరణ. విచిత్ర వేదాంత విజ్ఞానం ప్రస్ఫుటమైన జీవన మనస్తత్వం ఇమిడిన ఆలోచనాలోచనా పరిధి. భారతీయ కథలకు ఆకలి-పేదరికం ఇతివృత్తాలన్న భావనతో ‘ఆహో! జీవితపు రక్తోజ్వల ముక్తిక్షణమా! అని ముగింపు పలకడం ఎన్ని ఆలోచనలకు దారితీసిందో!
తరువాత వచ్చే ‘కన్నతల్లి’. యాభై ప్రాంతాల్లో తెలుగువారి సామాజిక కుటుంబ జీవితం స్ఫురించే కథ. మనస్తత్వానికి సాంఘిక వ్యవస్థకు, ఆత్మాభిమానానికి అంతశ్చేతన ఈ గాథ. కుటుంబం విడాకుల నేపథ్యంలో విడివడిపోయి చివరికి బిడ్డల సౌభాగ్యాన్ని ఉన్నతంగా త్యాగం చేసిన త్యాగమయి జీవితరేఖలు ఈ కథాసారాంశం. ఆత్మీయ అనురాగ జీవనంలో అందనంత విషాదం దిగమింగిన స్త్రీమూర్తి అమూర్త వ్యధాభరిత భార జీవన చిత్రీకరణ ఇది. కన్నతల్లి కన్న బిడ్డల ఉన్నతిని కాంక్షించిన మాతృమూర్తిత్వం ఈ కథలో వ్యక్తమయింది.
అనంతరం వచ్చే ‘దీపస్తంభము’ ఓ అద్భుత మానసిక వేదనా భరిత జీవితం. మద్రాసు జీవితంలో మలుపులు తిరిగిన కథనం. మధ్యలో బైబిలు కథనంలోని లాజరస్ మరణ జీవితం, ఆపై ఏసు మాటతో పునర్జీవితుడు కావడం కథను జీవింపజేసిన ఘటనకు పునాది. జీవన్మరణ జీవవారధిలో కథాకథనం ఘటనా ఘటన సమర్థన, అన్యాయం ఈ కథలోని అంతర్లీన దీపపు వెలుగు. అది ఆశాకిరణపు మేలుకొలుపు.
దీపస్తంభం అనంతరం వచ్చిన ‘కిమాని’ కథ, తెలుగు లోగిళ్లలో తాత, మనవళ్ళకు రాత్రిపూట చెప్పే కథాకథన విజయవిన్యాసం, ఓడల్లో జరిగే జీవన జలయాన జీవితగాథ యిది. కథలో కొంత శృంగార ఆకర్షణ, ఊహాలోక సుందరితో నృత్యతరంగం, ఆనంద జీవనరాగ విపంచిలో అందని ఎత్తుల క్రియాకర్మల ప్రియనేస్తాల మాధుర్యాలు అలల జీవనంలోని విన్యాసాలను అద్భుతంగా నడిపాడు రచయిత. కథ చివరిభాగంలో ‘స్త్రీ హృదయంలోని రహస్యాలు భగవంతుడు కూడా కనుక్కోలేదు’ అంటాడు.
తరువాత ‘నాగమణి’ కథ అద్భుత శిల్పసంపద. ఇద్దరు స్నేహితుల మధ్య తుపాను భీభత్స వాతావరణంలో జరిగిన ఇతివృత్తం. కలిసి తాగడం, తాగిన తర్వాత ఎక్కడా అసభ్య సంభాషణగాని, స్వీయ వృత్తాంత వ్యక్తీకరణగాని కనిపించని ఉన్నత పాత్ర చిత్రీకరణ. వాల్తేరు విశ్వవిద్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఇంటి వాతావరణం. రాజు తాగి తాగి చివరికి సముద్రంలో పరుగిడి మరణించే ఇతివృత్తం. మహాసర్పాల శిరస్సులపై ఒక వయస్సు వచ్చాక ఏర్పడిన మహామణి కోసం ఎందరో ప్రాణాలు కోల్పోయారనే మాటలు కథ మధ్య భాగంలో చెప్పడం ఎందుకా అని ఆలోచన కలిగిస్తుంది. అదే చివరికి రాజు ముగింపు పలకడం కూడా వాచ్యం చేసిన మాటలు బైరాగి రచనకు పరాకాష్ట. రాజు పరుగెత్తి సముద్రంలో పడి మరణిస్తాడనే ఊహకు కథాశీర్షికకూ ఒక విచిత్రమైన భావుకత. అది ఊహకు అందని మలుపు.
చివరి కథ ‘తండ్రులు కొడుకులు’. ఊరిపై ఒక వర్గం చేసే దాడితో ప్రారంభవుతుందీ కథ. యాభై దశకానికి పూర్వం పల్లెపట్టు జీవనగాథ ఇది. ‘పెడకట్టె’ మనిషి రామారావు కథ. ఎవరితోనూ సరిగా కలవని మనస్తత్వం. ఒంటెత్తు మనిషి, కాలేజి చదువుల్లో ఉండే రాజకీయాల్లో పాల్గొనడం అయిష్టంగా ఉండేది. సాహిత్యంతో సావాసం చేశాడు. రామారావుని తండ్రి పొరుగూరు పంపడం, ఆ రాత్రే ఊరి మీద దాడి జరగడం, తండ్రి, అసువులు బాయడం… అంతా లిప్తకాలంలో జరిగిన ఘటన. రామారావుని రక్షించడం కోసం తండ్రి పొరుగూరు పంపాడని అర్థం చేసుకున్నపుడు రామారావు పడిన వేదన అంతా యింతా కాదు. తండ్రిపై ప్రేమ వరదలా పొంగింది. చిన్నపిల్లవాడిలా వెక్కివెక్కి ఏడ్చాడు. ఇతివృత్తం అంతా పల్లె వాతావరణం. దానికితోడు గ్రామాలపై జరిగే దాడి. అంతా ఒక సినిమాలా గోచరించింది బైరాగి రచనలో.
దివ్యభవనం పరిచయంలో బైరాగి అడుగడుగునా కన్పిస్తాడు. సామాజిక జీవన వ్యవస్థతోపాటు, మానవ మనస్తత్వ విశ్లేషణ ప్రతి కథలో కన్పిస్తుంది. అంతర్లీనంగా ప్రధాన పాత్రలో బైరాగి సాక్షాత్కరిస్తాడు. ఒక అద్భుత ప్రపంచాన్ని, తెనాలి పరిసర గ్రామీణ విధానాన్ని సన్నిహితంగా వివరించాడు. పరాయి దేశంలో ఉద్యోగిస్తున్న వాళ్ల అవస్థలు, ఆవేదన అడుగడుగునా కనిపిస్తాయి.
బైరాగి జీవితకాలానికి సరిపడినంత కవితలను, అనుభవాల అగచాట్ల మధ్యతరగతి జీవనాన్ని, సోలో లైఫ్ సాలిట్యూడ్ని ఒక కాన్వాస్‌పై చిత్రీకరిస్తే ఎలా ఉంటుందో దివ్యభవనం కథలు వివరిస్తాయి. శతజయంతి వరకు నిలిచిన బైరాగి రచనలు, తెలుగు సాహిత్యం, తెలుగు ప్రజ ఉన్నంతకాలం శాశ్వతంగా ఉంటాయి. అవి మానవ జీవితాలకు వెలుగుబాటలు. తరతరాలకు కీర్తి పతాకలు.
(రచయిత అనుమతితో ఈ వ్యాసాన్ని అందించినందుకు సాక్షిలో పనిచేసే బి.ఎల్. నారాయణగారికి ధన్యవాదాలు – సం.)