జన జీవన జననీ! ప్రియ ధరణీ!
ధరణీ! జననీ!
నీ చిర హరితాంచలములు
చంచల మానవ శిశు తనూ ధూళి ధూసరములు
నీ శైల పయోధరములు
సించిత మానవ దృగవారిక్షార నిర్ఝరములు.
మమతా, సమతా, క్షమతా భరితా! మహితా జననీ!
నీ శ్వాసల మారుతములు
పంచును మా హృదిలో మంద గంధ శీకరములు.
నీ ఆశల కూజితములు
నించును మా శ్రుతిలో దివ్యగాన సుస్వరములు.
స్పర్శమాత్ర వికసితములు స్వప్నతతులు హే అవనీ!
నీ ఒడిలో యుగయుగములు
శాశ్వత సుస్థిర చిర సుప్తిమగ్న కాలగతులు
మారిన, ఆరిన జగములు
అగణిత జనపదములు, భాగ్యహీను లలకా నృపతులు
నీ చరమాశ్రయమున సుఖశయన మందరికి జననీ!
మానవాశ విలపించును
ఆకాశపుటంచుల మించిన అంచెల కలకై
మానవాస్థి విలసిల్లును
నీ పంక సంకులాంకపు క్రొచ్చెలికల మొలకై
నీ పాంశుల పరిరంభణ మనివార్యము హే జననీ!