బైరాగి గొంతుక

హిందీ సాహిత్య ప్రపంచంలో తెలుగు వారికి కీర్తి తెచ్చిన కవులు ముగ్గురనుకుంటాను. ఆ ముగ్గురూ రాంగేయ రాఘవ, బాలకృష్ణరావు, బైరాగి. ఆ ముగ్గురిలో బైరాగి సవ్యసాచి: ఉభయ భాషల్లోనూ కవితలు వ్రాసి పాఠకులను ఆశ్చర్యచకితుల్ని చేశాడు.

నా అదృష్టం ఏమంటే, నేను బైరాగిని చాలా సన్నిహితంగా ఎరుగుదును. 1962లో మద్రాసు వెళ్ళినప్పుడు, అప్పుడే కొత్తగా కట్టిన అశోకా హోటల్లో (ఎగ్మూరులో) మేము కలుసుకున్నాం. నేను సినిమా పనిమీద వెళ్ళాను. బైరాగి కూడా ఏదో సినిమాకి వ్రాయవలసినట్లు చెప్పారు. శ్రీ ఈదర లక్ష్మీనారాయణగారితో తరచు చక్రపాణిగారి వద్దకు బైరాగి వస్తుండేవాడు. చక్రపాణిగారి కార్యాలయం రచయితలకు దేవాలయం. బైరాగి నన్ను ఆకర్షించింది తన “నూతిలోని గొంతుకలు”తో.

ఒకనాడు మద్రాసులో మెరీనా బీచిలో కవి సమస్యను గురించి నేనూ బైరాగి చర్చించుకుంటున్నప్పుడు ఆయన ఒక కవిత వ్రాశాడు:

“ఈ విశ్వవ్యధా వారినిధి తటాన
బహుభంగుల ఫేనోజ్జ్వల, రుదనాకుల, క్షుభితోచ్ఛల తరంగాళి
లక్షల అవ్యక్త రుద్ధమూక కంఠ సందోహం
ఈ సాగర సంపుటాన
ఏకైక మహాఘోషగా బయలువెడలి
చాస్తున్నది అంబర చుంబన కరాలు;
ఎన్నెన్ని స్వరాలీ చిన్ని చిన్ని శీకరాలు?”

సముద్రాన్ని చూడగానే ఆయనకు ‘విశ్వవ్యథ’ కనిపించింది. శీకరాలను స్వరాలుగా ఊహించడం బైరాగికే చేతనవును.

ఆయన వాచాలుడు కాదు. బహు కొద్దిగా మాట్లాడేవాడు. పెద్దగా వ్రాసేవాడు. “Bairagi writes like an Angel and speaks like a poor Paul” అనేవారు చక్రపాణిగారు. నేను దాన్ని కొంచెం మార్చి “Bairagi writes about Poor Pauls. So naturally he speaks like him” అనేవాణ్ణి.

బైరాగికి హిందీలోని మహాకవుల రచనలు ఎన్నెన్నో జ్ఞాపకం ఉండేవి. అప్పుడప్పుడూ సంభాషణల్లో ఉదాహరించేవాడు. ఆయన ఏ సిద్ధాంతానికీ లోబడినవాడు కాదు. ఆయన సిద్ధాంతం ఆయనదే. ఆయనకు రాద్ధాంతం ఇష్టంలేదు. రాద్ధాంతం ఇష్టంలేని కొద్దిమంది కవుల్లో ఆయనొకడు.

నాకు మా బైరాగి తెలుగు కవితలు ఎంత ఇష్టమో హిందీ కవితలూ అంత ఇష్టం.

“ఈ ఉదార నిస్సీమ వ్యోమంలో
భావాల రెక్కలు పరుచుకొని
జీవన మహానాటక క్రూరరూపాన్ని
అవహేళన చేసి
ఉచ్చత్వపు ఎత్తుమీద అసమతాసీమను దర్శించి
ఆ శిఖరం మీదే, కంపించే కల్పనాపతాకాన్ని నాటి
మానవుడి జీవన ఘోషణా గానం చేయాలని ఎందుకనిపిస్తుంది?”

అని ప్రశ్నిస్తాడు బైరాగి తన “సంశయసంధ్య” అనే హిందీ కవితలో.

నిరాశావాదిగా కనిపించే బైరాగి ఆశావాది అని రుజువు చేయడానికి, ఆయన ఉభయ భాషల్లో రచించిన ఎన్ని కవితలనైనా ఉదహరించవచ్చు.

ప్రతి కవీ ఒకప్పుడు హామ్లెట్‌గా సందిగ్ధావస్థలో పడతాడు అని చెప్పడానికేమో ‘హామ్లెట్ స్వగతం’ రాశాడు బైరాగి:

“వేసిన ప్రశ్న ఒప్పైనా ప్రత్యుత్తరం తప్పేనని
ప్రత్యుత్తరం తప్పైతే వేసిన ప్రశ్న తప్పేనని”

అంటాడు బైరాగి ఆ కవితలో. నా దృష్టిలో ప్రశ్న, ఉత్తరం ఒకటే; రెండులా కనిపించే ఒకటి.

బైరాగి తన హిందీ కవితా సంపుటికి “పలాయన్” అని పేరు పెట్టగానే ఆయన పలాయనవాద కవి అని కొందరనుకొన్నారు. ఎంత భ్రమ! ఆయన “జాగృతిగానం” చదివితే ఆయన పలాయనవాది కాడని తెలుస్తుంది.

“లేరా, జీర్ణశీర్ణ కంకాళా!
గుడ్డిరాత్రి నల్లదనం విచ్చుకుపోయింది ఈ రోజు,
సింహకవాటాలు విరిగిపోయాయి!”

బైరాగిది సొంత గొంతు. అతని మీద, అందరి మీద లాగే, కొందరు మహాకవుల ప్రభావం ఉండవచ్చుగాని, ప్రభావాతీతంగా, భావావేశంలో కవిత వ్రాసిన స్వతంత్రుడు బైరాగి.

అతని గొంతుక నూతిలోనుంచి కాదు, హేతిలోనుంచి వినబడింది. భీతిలేనివాడు, ఖ్యాతికోరనివాడు, నేతలను నమ్మనివాడు, భూతలాన్ని అకాలంలో వదిలేసి వెళ్ళగలిగినవాడు బైరాగి.

(ఆలూరి బైరాగి సంస్మరణ సంచిక-1979)