నేను ఎప్పుడో చదివిన బైరాగి. సాహిత్య ప్రపంచానికి దూరంగా కాలేజీలో ఉన్నప్పుడెప్పుడో కొన్ని కథలు, కవితలు చదివిన గుర్తు. నిజానికి, బైరాగి రచనలు చదివి నేను ఏర్పరచుకున్న అభిప్రాయాలకన్నా మిగిలినవాళ్ళు చెప్పిన ఆహా, ఓహో పొగడ్తలూ, కొండొకచో పెదవివిరుపులూ ఎక్కువ గుర్తున్నాయి. ఎందుకో బుచ్చిబాబుకు దగ్గరగా ఉండే రచయితగా గుర్తున్నాడు. బుచ్చిబాబు తనస్థాయికి మించి కలంసాము చేస్తే, బైరాగి తన పాండిత్య అతిశయాన్ని ఎక్కడికక్కడ తగ్గించుకుంటూ కాస్త కాళ్ళు నేలమీద పెట్టుకుని రచనలు చేశాడనే అభిప్రాయం నాలో ఎప్పట్నించో స్థిరపడి ఉండింది.
ఇపుడు మళ్లీ ఓ పనిగా బైరాగిని చదవటం మొదలుపెట్టాక, ఆయన రచనలు అలాగే ఉన్నా, నా దృష్టికోణంలో చాలా మార్పులు వచ్చిఉంటాయి కదా. ఇప్పుడు రాసేది ఈ రోజున నాకు బైరాగి రచనలు ఎలా తోచాయి అని. ప్రయత్న పూర్వకంగా ఇంతకుముందు అభిప్రాయాలని దూరంగా ఉంచాను. ఉంచానని అనుకుంటున్నాను.
దివ్యభవనం పుస్తకంలో ఆ పేరుతోనే ఉన్న మొదటి కథ చదివి భయంవేసింది. కథలన్నీ ఇలాగే ఉంటే వీటిని ప్రాసెస్ చెసే శక్తినాకు ఉండదని. నావి సాదాసీదా ఆలోచనలు. మార్మికత, చైతన్యస్రవంతి లాంటివి ఒకస్థాయి దాటితే నేనందుకోలేను. లోతైన కవిత్వానికి కూడా అందుకే నేను దూరంగా ఉంటాను. రెండవ కథ దరబాను చదివాక, హమ్మయ్య అనిపించింది. అన్నీ చదివాక, ఈయనకి మార్మికత అంటే ఇష్టం ఉందని తెలుస్తున్నా, అన్ని కథలనీ ఆ ఒక్క మూసలోనే రాయలేదనీ, ఏ కథలో ఎంతమేరకు వాడాలో ఆయనకో స్పష్టమైన అంచనా ఉందనిపించింది. దివ్యభవనం, బీజాక్షరీ, దీపస్తంభం, జేబుదొంగ లాంటి కథల్లో ఆ మార్మికత వివిధస్థాయిల్లో ఉండడాన్ని చూడవచ్చు.
‘ఒక గంట జీవితం’ లాంటి కథ చదువుతున్నప్పుడే మనకి బుచ్చిబాబూ, అతని చైతన్య స్రవంతి కథ(?) గుర్తుకువస్తాయి. బుచ్చిబాబు చైతన్య స్రవంతి కథలో నాకు రచయిత పాండిత్య ప్రకర్ష ఎక్కువగా, అది ఓ ప్రయోగంలా అనిపిస్తుంది. బైరాగి దాదాపు అలాంటి కథే ‘ఒక గంట జీవితం’ రాస్తే అది నాకు మరింత నేలమీద ఉన్నట్తుగా తోచింది. ఆ ఆలోచనా స్రవంతిని మనం (పోనీ నేను) అందుకోగలుగుతాం. కదులుతున్న దృశ్యాలు, మనుషులూ, పదబంధాలు, రాండమ్‌గా వచ్చే రిఫరెన్సులూ అన్నీ మనకి అందుబాటులో ఉంటాయి. బుచ్చిబాబు లాగా మార్మికత వాక్యం కూడా అర్థంకాని స్థాయిలో ఉండదు. మార్మికత ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్నవాడి మానసిక స్థితికి మాత్రమే పరిమితమై ఉంటుంది ‘ఒక గంట జీవితం కథలో’. బుచ్చిబాబు చైతన్య స్రవంతికీ, బైరాగి మార్మికతకీ మధ్య నాకు తోచిన వ్యత్యాసం ఇది.
“మానవుల్లో రాక్షసత్వం, దేవత్వం రెండూ ఉన్నట్టే దేవతల్లో, రాక్షసుల్లో ఇద్దరిలో కూడా కొంత మానవత్వం ఉంటుంది.” (దివ్యభవనం)
“సుందరీ వక్షవీక్షణ సౌభాగ్యానందకందళిత హృదయారవిందుడనై అడుగుతున్నాను నేను. ఏది నిజం? సిల్కుచీరలా? చింకిగుడ్డలా? మాడిన కడుపులా? బలిసిన రొమ్ములా? వృద్ధవేశ్య ప్రలాపాలా? జవ్వనుల పకపకలా? చీకటిలో ఒంటరితనం? వెలుగులో జంటలు? ఏది నిజం? చావుబ్రతుకుల సంజమసక. కల్తీలేని వెన్న కాచిన నిజం ఏది? ఎలా గుర్తుపట్టేది దాన్ని” (ఒక గంట జీవితం)
పైన చూపిన లాంటి వాక్యాలూ, ఆలోచనలూ నాబోటి వాడిక్కూడా అందుబాటులో కథలనిండా ఉండి వాటిగురించే బోలెడు మాట్లాడాలనిపిస్తాయి. కానీ ఆ మత్తులోంచి బయటపడి ఆయన కథల్లోని మనుషుల్ని, జీవితాలనీ చూస్తే, అవి ఈ నాటికీ రిలవెంట్గా కనిపిస్తాయి.
కథా వస్తువులు, ఒకటి రెండు మినహాయింపులతో, ఇప్పటి వాడుకలో ఉన్న సాహిత్య పరిభాషలో ‘మెట్రో కథలు’ అనాల్సి ఉంటుంది. మద్రాసు నగరంలో, ఆ రణగొణ జీవన పరుగు పోరాటాలే చాలావరకూ ఈ కథల్లో. అర్బన్ స్పృహ, అర్బన్ భాష, అర్బన్ విలువలూ, అర్బన్ డాంబికాలూ, అర్బన్ శూన్య వైరాగ్యాలూ, అర్బన్ నిస్పృహలూ పూర్తిగా విస్తరించి ఉన్న కథలు ఇవి.
ఒక్క కథ దరబాను గురించి కాస్త వివరంగా చూద్దాం. టూకీగా: నేపాల్ వాడైన ఓ ఒంటరి మధ్యవయస్కుడైన మాజీ సైనికుడు, ఒకానొక నేపాల్ గ్రామంలో అనాథగా తిరుగుతున్న కుర్రవాణ్ణి మద్రాసుకు చేర్చి కొంతకాలానికి కాలం చేస్తాడు. ఆ ఒంటరి కుర్రవాడు ఆ మాజీ సైనికుడి స్థానంలో అక్కడే కూరుకుపోతాడు… అదీ కథ.
స్పష్టమైన తేదీ నాకు దొరకలేదు కానీ, ఇది 1951కి ముందు వచ్చిన కథ అని కాస్త ఇంటర్నెట్లో వెతికి ఊహించవచ్చు. (దివ్యభవనం మొదటి ముద్రణ 1951 – కథానిలయం. బైరాగి జీవన కాలం 1925-78 – వికీపీడియా). అంటే దాదాపు 75 సంవత్సరాలకి పూర్వం వచ్చిన కథ ఇది. నన్నడిగితే, ఈ రోజున కూడా మనం మాట్లాడుకునే వలస కార్మికుల గురించిన కథ కూడా ఇది. పెద్ద మార్పులు లేకుండా ఈ కథని నిన్ననో ఇవ్వాళో రాసిన ‘వలస కార్మిక అర్బన్ అస్తిత్వ కథ’ అని ప్రచురించేయవచ్చు.
అస్తిత్వ కథ అంటే ఏమిటి అనే చర్చ ఈ మధ్య తరచూ వినబడుతోంది. మొన్నటికి మొన్న బెంగళూరు బుక్ బ్రహ్మ ఫెస్టివల్లో కూడా తెలుగు రచయితలు ఎక్కువ మాట్లాడింది ఈ అస్తిత్వ కథ గురించే. ఈ అస్తిత్వ కథల గురించి అకడమిక్‌గా ఎవరన్నా ఏమన్నా నిర్వచనాలని స్థిరపరచారో లేదో నాకు తెలీదు. నా మట్టుకు నేను చెప్పుకున్న నిర్వచనం, ‘లక్ష్యమూ, లక్షణమూ ఒక్కటే అయిపోతే అది అస్తిత్వ కథ’. (వస్తువూ, శిల్పమూ అనకుండా లక్ష్యమూ లక్షణమూ అని కేటగరీకరించినవాడు శ్రీశ్రీ)
అంటే, ‘అబద్ధమాడటం తప్పు’ అనే నీతి సూత్రం గురించిన కథ చెప్పాలంటే అందులో ఆవు, పులి అయినా ఉండవచ్చు, ఆఫ్రికా మనుషులయినా ఉండవచ్చు, గ్రహాంతరవాసులూ, దేవుళ్ళూ, రాక్షసులూ కూడా ఉండవచ్చు. ఇక్కడ లక్ష్యం, ఓ స్పష్టమైన నీతి చెప్పడం. అందుకు తగ్గ పాత్రలూ, సంఘటనలూ, ఎత్తుగడలూ ఎన్నుకోవడం రచయిత ప్రతిభ, అవగాహన. ఆ ఎన్నుకున్న పాత్రలూ, సంఘటనలూ ఇత్యాదులన్నీ కలిసి కథ ‘లక్షణం’ అవుతాయి. అలా ఓ నీతి సూత్రానికో, తాత్విక చింతనకో బదులు, నీటికోసం, గౌరవమైన బతుకు కోసం ప్రతిరోజూ ఓ గండంలా బతుకీడ్చే రాయలసీమ రైతుగురించో, రైతుకూలీ గురించో కథ రాయాలంటే, ఆ రైతుజీవితమే కథ ‘లక్ష్యం’ అవుతుంది. అప్పుడు ఆ కథ చెప్పడానికి మరో చోటనించి, మరో పాత్రని తీసుకురాలేం. ఆ కథలో జరిగే సంఘటనల్లో కూడా కాల్పనికత తక్కువే ఉంటుంది. అలా లక్ష్యమూ, లక్షణమూ ఒక్కటే అయి, కాల్పనికతకి అవకాశం తగ్గుతుంది.
అందుకే, ఓ కథ అస్తిత్వ కథ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి నేను వాడే లిట్మస్ టెస్ట్… కథలో ఉన్న పాత్రలన్నీ తీసివేసి వేరే పాత్రలతో అదే కథ చెప్పగలమా లేదా అని.
ఆ కోణంలోంచి చూసినప్పుడు, ఈ దరబాను కథ ఇవ్వాల్టి భాషలో ఒక ‘వలస కార్మికుడి’ అస్తిత్వ కథ. పైన చెప్పిన లిట్మస్ టెస్ట్ వాడి చూద్దాం. ఈ సెక్యూరిటీవాణ్ణి నేపాల్ బదులు బిహార్ నించి తెస్తే కథలో మార్పు వస్తుందా? బహుశా రాదు. వాడు సెక్యూరిటీ గార్డు బదులు బాత్రూములు కడిగే పని చేస్తే కథ మారుతుందా? బహుశా మారదు. కానీ వాణ్ణి స్థానిక తమిళ/తెలుగు వాడిగా మారిస్తే కథ అలాగే ఉంటుందా? ఉండదు. పోనీ ఇవ్వాళ్టి రోజున బాగా చదువుకుని అమెరికాలో మాంఛి సాఫ్ట్వేర్ ఉద్యోగానికి వెళ్ళే ఇంజనీర్ పాత్రగా ఈ కథ చెప్పగలుగుతామా? నా ఉద్దేశంలో సాధ్యం కాదు. ఎందుకంటే, భారత దేశంలో ఉత్తరాదినించీ, కొంచెం వెనక బడివున్న ఒరిస్సా లాంటి రాష్ట్రాల నించీ పొట్ట చేత పట్టుకుని దక్షిణాదికి చేరుతున్న వలస కార్మికుల జీవితాలు మనం చూస్తూ కూడా పట్టించుకోని దీనగాథలు. వాటికి ప్రత్యేకమైన అస్తిత్వం ఉంది, గమనించాలి, గుర్తించాలి.
1950కి ముందే ఈ జీవితాలు ఉండటం, వాటిని ఒక తెలుగు రచయిత పట్టించుకోవడం, పట్టుకోవడం, మంచి పట్టున్న కథ రాయడం గొప్పవిషయం.
నగరాల్లో ఈ సెక్యూరిటీ ఉద్యోగాలు చేసేవాళ్ళు చాలా వరకూ ఉత్తరాది రాష్ట్రాలనించి వస్తారు. నేపాల్ నించి కూడా ఇప్పటికీ ‘గూర్ఖాలు’ వస్తున్నట్టే ఉన్నారు కానీ ఇప్పుడు వాళ్ళు ఒక్కళ్ళే కాదు. హైదరాబాద్ వంటి నగరాల్లో అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లన్నింటిలోనూ సెక్యూరిటీగా పనిచేసేవాళ్ళు ఈ ఉత్తరాదివాళ్ళే అయివుంటారు. తెలుగు రాష్ట్రాలలో మెట్ట ప్రాంతాలలో పొలాలెండిపోయి, నగరానికి వచ్చి అపార్ట్మెంట్ కాంప్లెక్స్ సెల్లార్లో జీవితాలని గడుపుతున్న కుటుంబాలూ ఉన్నాయి. ఎ.టి.మ్.ల ముందు సెక్యూరిటీ గార్డులుగా మారిన ఒకనాటి రైతుల గురించి కూడా మనం విని, చదివి ఉన్నాం. కానీ వాళ్ళ సంఖ్య నిర్మాణ రంగంలోనూ, ప్రైవేట్ సెక్యూరిటీ కంపెనీల్లోనూ పనిచేయడానికి లక్షల్లో తరలి వస్తున్న ఉత్తరాది కార్మికులతో పోల్చుకుంటే చాలా తక్కువ.
కోవిడ్ సమయంలో అందరికంటే ఎక్కువ దెబ్బతిన్నది ఈ వలస కార్మికులే అయివుంటారు. ఒక్కసారిగా వచ్చిన లాక్డౌన్ల వల్ల ఉపాధి కోల్పోవడమే కాదు, తిరిగి ఇంటికి వెళ్ళే అవకాశమూ లేక వీళ్ళు పడ్డ అవస్థలు ఒకటికాదు. వేల కిలోమీటర్లు రోడ్లమీద పడి నడుస్తూ, సైకిళ్ళమీదా తరలిపోతున్న ఈ జనాల మీద ఈ దేశం ఎంత నిర్దయగావుండిందో తలచుకుంటేనే గుండె మండిపోతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ నడిచిపోతున్న వాళ్ళపట్ల ఎవరి బాధ్యత ఎంత అని లెక్కలు వేయడంతోనే సరిపోయింది. ఆ సమయంలోనే కొందరు పాత్రికేయులూ, సేవా సంఘాలూ, వాలంటీర్లూ లేవనెత్తిన ప్రశ్నలు, ఈ దేశంలో ఎంతమంది వలస కార్మికులు ఎక్కడెక్కడ ఉన్నారూ? వాళ్ళలో ఎంతమంది రోడ్లమీద నడుస్తున్నారూ అని. ఇప్పటికీ ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పిన గుర్తు నాకయితే లేదు. ‘మా దగ్గర సమాచారం లేదు’ అని ఓ మంత్రిగారు చెప్పడం పేపర్లో చదివి వున్నాం.
అంటే, 2020-2025 నాటికి కూడా ఈ జీవితాలగురించిన అజ, లెక్కా, జమా ఈ ప్రభుత్వాలకీ, సమాజానికీ లేదు. అయినా బైరాగికి మాత్రం ఈ చెప్పాల్సిన జీవితం 1950కి ముందే కనపడింది.
ఈ ప్రజలు ఇక్కడా చెందరు, అక్కడా చెందరు. పైగా అనేకానేక స్టీరియోటైపుల్ని కూడా వీళ్ళే మోయాలి. దోపిడీలు, నేరాలు జరిగితే చుట్టుపక్కల ఉన్న బిహార్, యు.పి. వాళ్ళ దగ్గర్నించే సోదాలు మొదలవుతాయి. దక్షిణాదిన హిందీని బలవంతంగా రుద్దేస్తున్నారు అని గొడవ జరిగితే చిత్రంగా వీళ్ళని బూచిలా చూపిస్తారు. ముంబాయి లాంటి మహానగరంలోనే ‘నార్త్ ఇండియా గో బాక్’ అని రోజువారీ కూలీల మీద దాడులు జరిగిన వార్తలు విన్నాం.
ఈ బతుకులు ఎవరికీ కాకుండా పోతున్న, ఎక్కడా చెందని ఏ అస్తిత్వమూ లేని అస్తిత్వవేదనలు.
బైరాగి పెట్టిన కథ పేరు దరబాను. ఈ పదానికి అర్థం వెతికితే ఓ సెక్యూరిటీ గార్డు, గేట్ కీపర్, ద్వారపాలకుడు అని తెలుస్తుంది. అప్పట్లో గూర్ఖాలని దరబాను అనేవాళ్ళేమో! బైరాగి ఈ కథలో ఈ మనుషుల రోజువారీ కష్టాలనీ, బతుకునీ కూడా కొద్దిగా చెప్తాడు, కానీ ఆ మనుషుల మనోస్థితిలోకి, ఆలోచనల్లోకి వెళ్ళాలని ఎక్కువగా ప్రయత్నిస్తాడు. దైనందిన కార్యక్రమాల డైరీని అస్తిత్వ కథ అని ఒప్పించాలని చూసే రచయితలకి, ఏం చేస్తే అస్తిత్వ వేదన సాహిత్యంగా మారి కథ కాగలుగుతుందో చెప్పడానికి ఈ కథని చూపించవచ్చు.
“వాడికి ఈ పరదేశంలో పట్టణం హడావిడి మధ్య ఎప్పుడన్నా సాయంత్రం పూట చీకటిపడేటప్పుడు తన పల్లెటూరి పొలాలు, అక్కడి జనం, చిన్నప్పటి నుంచి ఎరిగిన ఇళ్ళూ ఇవన్నీ జ్ఞాపకం వచ్చేవి.”
“భూటాసింగు స్థానంలో లక్షణసింగు ప్రవేశించాడు. అదే స్టూలుమీద అక్కడే కూర్చోటం. భూటాసింగు భుజాలి, తుపాకి, వాడికి సంక్రమించినయ్.”
“ఈ ట్రాములు, ఈ కార్లు, రంగురంగుల బట్టాల్లో తిరుగుతున్న ఈ మహాజనం, అతనికళ్ళకొక నిరర్థకమైన బొమ్మలాటలా కనుపించారు. అతని మనస్సు మాటి మాటికీ దూరాన ఉన్న తన దేశంలో పల్లెటూరి చేలమీదకు మరల సాగింది. చిన్నప్పటి నుంచి ఎరిగిన మొఖాలను చూడటానికి తపించసాగింది. ఒక్కొక్కసారి ఎదురుగా ఉన్న దుకాణాల తెల్లని గోడలు ఏదో ఇంద్రజాలంవల్ల మారిపోయి తన ఊళ్ళో పచ్చని చేలుగా మారిపోయేవి. ట్రాముల మోతల్లోంచి ఒక్కొక్కసారి కోతకొచ్చిన బంగారపు గోధుమ చేలల్లో వంగి కోతకోసేటప్పుడు ఎరిగిన కంఠాల సమవేత స్వరంలో, పల్లె పదాల సంగీతంలా వినిపించేది…”
ఇలా కథలో మూడు భాగాల్లో ఆ కుర్రవాడు తన కొత్త జీవితంలో రాజీ పడిపోయిన క్రమాన్ని వర్ణిస్తాడు రచయిత. ఆ లక్షణసింగ్ తొలి యవ్వనపు మోహంలో ముచ్చటపడ్డ ‘లచ్చి’ గురించిన వ్యాఖ్యానంలోనూ రచయిత నిర్దయగా అతని పరిస్థితిని గుర్తుచేస్తాడు.
“సంఘ బహిష్కృతుని లాంటి అతని ఒంటరితనం, జీవితంలోని శూన్యం, అతణ్ణి అవ్యక్తంగా ప్రేరేపిస్తున్నాయ్.”
ఆ యువకుడికి ఆ అమ్మాయి తోడుతో కొంత స్థానికత, పోనీ ‘అస్తిత్వం’ ఏదన్నా ఏర్పడుతుందేమోనని చదువరి ఆశపడేలోపు రచయిత కర్కశంగా ఆ అవకాశాన్ని కూడా ధ్వంసం చేసేసి అలాంటి జీవితాలకు ఆశపడే అర్హత కూడా లేదని తేల్చేస్తాడు.
“వాడికి భవిష్యత్తు లేదు. భూతవర్తమానాలు ఆ తెల్లటిగోడలో ఉన్నవి. వాడి జీవితాని కొక గోడ అడ్డం వచ్చింది. మెరుస్తున్న తెల్లటి గోడ”
అంటూ కథ ముగిస్తాడు. ఇది లక్షణసింగు కాపలాకాస్తూ కూర్చున్న స్టూలుకు ఎదురుగా ఉండే పెద్ద తెల్లని గోడ. అదే వాడి మొత్తం అస్తిత్వ చిత్రం. బహుశా వలస కార్మికుల జీవితాలకి అప్పటికీ ఇప్పటికీ ఇంతకంటే గొప్ప పోలిక ఉంటుందని నేననుకోను.
ఎవరి అస్తిత్వ కథలు వాళ్ళే రాసుకుంటేగానీ పూర్తిగా న్యాయం జరగదనే వాదం ఉంది. ఆడవాళ్ళ కథలు ఆడవాళ్ళే రాయాలీ, ముస్లిమ్ కథలు ముస్లిములే రాయాలీ. అనుభూతికే, సహానుభూతికీ మధ్య చాలా తేడా ఉంటుంది అని గట్టివాదాలే వింటాం. మరి ఇలా మనచుట్టూ ఉండి అస్తిత్వ స్పృహలేని అస్తిత్వాల గురించి ఎవరు చూడాలి, ఎవరు రాయాలి, ఎవరు మాట్లాడాలి? బైరాగి ఓ దారి, ఆ దారి ఏమిటో ఎప్పుడో చూపించాడు!
