అ‘తను’

రెండవ ప్రపంచ మహా సంగ్రామం ముమ్మరంగా సాగుతున్న రోజులవి. ఇంకా మనకు స్వాతంత్ర్యం రాకముందే బైరాగి ప్రత్తిపాడులో “చీకటి నీడలు” రాస్తున్నాడు. మా రామదాసు ద్వారా చాలా దగ్గరవాడయ్యాడు మాకు.

రెంటాల ‘సంఘర్షణ’కు నారాయణబాబుగారు రాసిన పీఠిక ‘ప్రవర’లోని మేమూ, శిష్ట్లా, దేశిరాజు కృష్ణశర్మ గార్లూ హిగిన్‌బాదమ్స్ బుక్ స్టాల్లో దర్శనమిస్తుండే సప్త హస్తుడు మల్లాది రామకృష్ణ శాస్త్రిగారి దగ్గర తరచు కలుస్తుండేవాళ్ళం, కలల వలల్లోని కలువ రేకుల్లా, గుంటూరులో.

మొదటి ప్రపంచ యుద్ధం తరువాత, పెట్టుబడిదారీ ప్రపంచం ముఖ్య నగరాలన్నింటినీ తృటిలో ముట్టడించిన, అనేక దేశాలకు స్వాతంత్ర్యాన్ని ప్రసాదించి, అసలు యుద్ధ నిరసనానికి, ప్రపంచ శాంతి పోరాటానికీ ఒరవడి దిద్దిన రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో వచ్చిన సాహిత్యం అంతా ఆయన ముందర ప్రశాంతచ్ఛాయలా పరచుకొని ఉండేది. ఇక్కడే మాకు కమ్మింగ్స్, ఆడెన్, ల్యువిస్, Sacred Woods, Instigations ఎన్ని గొంతులో పరిచయమయ్యాయి.

“… Who were truly great, who from the womb, remembered the Soul’s history, through the corridors of light where the hours are SUNS” అని, “A sharp star should show its own way of light” అన్న మిసెస్ రాడ్లర్ మాటలతో మొదలుపెట్టి టి. ఎస్. ఎలియట్‌ను గురించి చెప్పేవారు ఒక్కొక్కప్పుడు. ఆయన పలుకుకు ఉన్న కాలమానానికి అతీతమైన, కాల సంబంధమైన శక్తినీ, ఆ ధర్మ నిష్ఠనూ మాకు నొక్కిచెబుతూ ఆయన లోని నవ్యత్వం, ప్రాచీనత అంతటి పరిపాకం కలదని అనేవారు. మహాకావ్య స్ఫూర్తిగల బైరాగిని ఇట్లా ఎలియట్ కొంత ప్రభావితం చేశాడు. ఎవరన్నా ‘Glimpses of world History’ ఇమ్మని అడిగితే శాస్త్రిగారు చింతాకంత చిరునవ్వు నవ్వుతూ ‘Das Capital’ ముందర పెట్టి ‘కాస్త దీనిని పరికించండి’ అనేవారు. ఒకరు పద్యం వినిపిస్తే, ఎవరూ వ్రాయని వృత్తాన్ని ఎంచుకొని కొత్త ఛందస్సులో ఏడుకొండల వాడిమీద పది పద్యాలు రాసి తరించమంటుండేవారు. నిబద్ధ కవిత్వమైనా, అనిబద్ధ కవిత్వమైనా ఏదో ఒక మెరుపు, ధూర్జటి కవిత్వంలోని వాదర (రాజ నిరసన) వంటిది లేకపోతే బాగుండదంటూ, ప్రేరణ, చెప్పవలసినది ఏదైనా ఉంటేనే రాయాలనేవారు.

చుట్టూరా యుద్ధం, లోపల పడగవిప్పుతున్న ఒక తుఫాను మమ్మల్ని నిలవనిచ్చేవి కావు. అసలు ఆ యుద్ధమే మాకు ఒక మానవానుభవ ప్రబంధమైంది. “జగన్నాథ రథ చక్రాలు” గుండెలమీద పరుగులు పెడుతుండేవి. ప్రపంచ ప్రజా హృదయ నయాగరా భీషణ ఘోషణలకు ప్రతిచలించి పోతుండేవాళ్ళం.

హిందీ రామాయణాలను, దర్శనాలను, భారత, భాగవతాలను తిరగవేస్తూ బైరాగీ, మేమూ ఆ రోజులలో గురజాడ, శ్రీశ్రీ, విశాఖపట్నం వంక చూస్తుండేవాళ్ళం. నరసరావుపేట నుంచి హైదరాబాదుకు, హైదరాబాదు నుంచి ఢిల్లీకి ఇట్లా మా స్థావరాలు మారి మళ్ళీ మేము మద్రాసుకు వచ్చేసరికి ‘ఫిడేల్ రాగాల డజను’, ‘త్వమేవాహమ్’, ‘అడవి’, ‘మహాప్రస్థానం’ ఎన్నెన్నో వచ్చాయి.

అభ్యుదయోద్యమంతో ప్రజల ముందుకు కవిత సాక్షి చిత్రంలా వచ్చి నిల్చుంటున్నది. వస్తువు ప్రజలది అయినట్లు కవిత ప్రజలది అయింది. మద్రాసులో తటస్థపడినప్పుడు అప్పుడప్పుడు బైరాగి, ఎలియట్, హిందీ, బెంగాలీ, ఉర్దూ, ఫ్రెంచి, జర్మన్ కవుల కవితలకు తాను చేసిన అనువాదాలను వినిపించేవాడు (సభల్లో కాదు). ఒకసారి “శబరి”, “హెచ్చరిక” అన్న కవితలు వినిపించాడు. ఎందులోదో జ్ఞాపకం రావడం లేదుగాని, “పొద్దు పొడుస్తున్నది అప్పుడు అతని కొరకు” అన్న అతని పంక్తి ఇప్పటికీ మనసులో మెదులుతున్నందువల్ల దానిని అతనికే అన్వయించి, నాలో అతనిని గురించి చెలరేగుతున్న ఆలోచనలను మీ ముందుంచుతాను.

“జ్యోతుల బంధించిన వాకిలి తలుపులు పగలేద్దామా?
నరకాసురుడెందుకు ప్రపంచ నరకాన్నే మసి చేద్దామా?
దీపావళి ఉత్సవమండీ.. దీపావళి చేద్దాం రండీ!”
(‘చీకటి నీడలు’ మొదటి పుటలోని మొదటి నాలుగు చరణాలు)

అని భవిష్యయుగ యాత్రికులకు, నవ్య కథా ప్రదర్శకులకు జ్యోతులు వెలిగించాడు.

“ఆర్పేయండి సూర్యచంద్రులను
చమురు లేని దీపాలని
చీకటిలో ముంచేయండి
నీడల పాపాలను…”
అంటూ–

“ఆశలోన నిరాశలోన
ఉరి కెక్కే విప్లవకారుని
అంతిమ దరహాసంలో
నేటి వరకు దేని కొరకు
అనేక విప్లవ కారులు
దేని కొరకు వెతికారో
ఆ జ్యోతిని వెలిగించి
ప్రపంచాన్ని మండించే
మంటల పంటలు పండించే
ఆ జ్యోతిని ఆరాధిస్తూ”

ఆ జ్యోతికి తానే ఆజ్యమై, త్యాగ ప్రేమల విజయ స్తంభాలకు బాపు సమాధిని మించిన పునాది ఏముంటుందని, సాటి వారిని వేటాడే ఆ కరుణ వన మృగాల్లాంటి జనత ఏమిటని, ఆత్మ త్యాగ యాగంలో రుధిరారక్త వేదికలపై నిలిచిన మేము క్రతువును ముగించే పూర్ణాహుతి కొరకు అన్నీ సిద్ధం చేశామని చెప్పి …

“పట్టణాల రాజవీధుల పందులు తిరుగుతున్నవి
ఎంగిలికై ఎగబడే నరులను జూచి కుక్కలు మొరుగుతున్నవి.
బియ్యపు కొట్ల వద్ద బారులు తీర్చి నిలబడినారు పౌరులు
అమృతం పొంగే ఏరులు పారుతూనే ఉన్నాయి
శ్రమించే తనువుల స్వేదాలు కారుతూనే ఉన్నాయి.
గిడ్డంగులు, చీకటి కొట్లు, వినాయకుల జేబులు నిండుతూనే ఉన్నాయి.
అయినా అన్నపూర్ణ భాండంలో తండులాలు నిండుకొన్నవి
పొయ్యిలోన రగలని చిచ్చు కడుపులో రగులుతోంది
పగ సెగలై ఎదుగుతోంది”

అని నేటి మన సమాజంలోని ఈ దౌర్భాగ్య స్థితి వైదొలగాలని, భరతఖండమనే ఈ చెర తలుపులు తెరవటానికి,

“భయద మృత్యు గహ్వర వక్షంపై
ఊయల లూగేవారితో
తెగిన తలను చేతబట్టుకొని
ముందుకు సాగేవాడిలా”

సాగాడు బైరాగి.

తను చెప్పదలచుకొన్న దానిని పఠిత మనస్సుకు హత్తుకొనేటట్టు చెయ్యడానికి బైరాగి ఒక్కొక్కప్పుడు, ఆశ్చర్యావహంగా పదద్యోతక ధ్వనితో చెబుతుంటాడు. పావకయుత ఫాలుడు శ్రీ గోరాశాస్త్రి ‘తెలుగు స్వతంత్ర’లో ప్రకటించిన అతని ‘నూతిలో గొంతుకలు’ విశదంగా పరిశీలించవలసిన కావ్యం. అందులో ప్రతి అక్షరమొక భటుడూ, ప్రతి ఊహ ఒక వ్యూహం కాకుండినట్టయితే అది ‘అనుగీతి’కి మరొక ప్రతి అయి ఉండేది. అట్లాగాక ఇది బైరాగి విశిష్టతకు ఒక భూమిక అయింది.

ఇందులోని ప్రతి పాత్రనూ, కత్తిరించిన ప్రతి ఒరవడినీ, సృజన పథంలోని ప్రేమ పరిమళాన్ని సర్వత్రా వ్యాపింప చెయ్యడానికి కుసుమ కళికలా వెలిగించాడు బైరాగి, చూసుకోమన్నాడు. ఈ వెలుగులో ధనస్వామ్యం, సోషలిజం — ఈ త్రోవలు రెండింటిలో ఏది ఎన్నుకుంటారోనని, ప్రతి నేనుకూ ఒక నీవు తోడు కావాలన్నదే బైరాగి నిర్దేశం. యుద్ధహతులూ, సజీవ మానవుల స్వరమేళవింపు కూడా. షాజహాన్ ప్రేమకు కాదు, కార్మికులను వంచించడానికి ఒక వేషమైన తాజ్‌మహల్ “రాయి రాయి విడగొట్ట”మన్న ఆ శూరుడు, ఉదయ బీజాలకై పాతాళపు లోతులు చూశాడు. కత్తుల కవనంతో నెత్తుటి మొగ్గలపై పూచిన మంటల కలలను విదితం చేశాడు. మౌలికమైన భావ చిత్రాలను ఆవిష్కృతం చేశాడు. సోదరి అబ్బూరి ఛాయాదేవి ప్రచురించిన కవితలో ‘మేలుకొన్నవాడు’ రాసిన బైరాగే ‘వాగ్దత్త వసుంధర’లో…

“మనిషి మనిషికీ మధ్య సంఘర్షణం ఉండదింక
సహ జీవన పావన హర్షం తప్ప
మనిషి మనిషికీ మధ్య అసూయ ఉండదింక
సహజ సులభ స్నేహాకర్షణ తప్ప
మనిషి మనిషికీ మధ్య గోడలుండవు, గోతులుండవు,
అదృష్టం గీచిన గీతలుండవు
విప్లవ బుల్ డోజర్ మిట్ట పల్లాల్ని ఏకం చేశాము,
మకిలి గుంటలు పూడ్చేశాము
బండరాతి గుండెలు బద్దలు కొట్టి
అద్దంలాంటి రోడ్లేశాము
గాలి లాగ, నీరు లాగ నేలను గూడా అందరికీ అందజేశాం

మేధకూ, క్రియకూ మధ్య,
ఆశయానికీ సంశయానికి మధ్య
సాధనకూ సాధ్యానికీ మధ్య
పడిన నీడలు తుడిచేశాం”

అని వాస్తవ ప్రపంచం ఎటు మొగ్గుతున్నదో, దానితో తనూ అటు మొగ్గాడు.

సాంప్రదాయిక కవిత నుండి వచన కవితా వసుంధర మీదకు వచ్చిన బైరాగి అన్ని దారులూ చూపి, బ్రతుకులో నుంచి బ్రతుకుకు పరిస్థితులను మానవీయం చేయాలన్న తనదైన బాటనే తొక్కాడు.

జీవిత మధ్యాహ్నంలో, చీకటి పచ్చికలో, ముత్యాల మంచులోన రేయి కలలకు అక్షరాలతో అచ్చులు పోశాడు.

బైరాగిలోని ఆ మృత్యుచ్ఛాయే, ఆ చితానల ధూమమే అతనిని జనన జీవన మరణాల కాలం అంతస్తులకు తీసుకొని పోయి కరుణా జ్యోతిగా ప్రకాశింప జేసింది. అతనిలోని నైరాశ్యం, అభావాత్మకమైనది కాదు. అది వీర, కరుణ, హాస్య, రౌద్ర, బీభత్సాలకు అమృత స్రోతస్విని అయింది. ధర్మాన్ని అంగీభూతం చేసుకొన్న ఆత్మోపలబ్ధి అది. అతను కోరినదల్లా మనిషికి మనిషి తోడు కావాలన్నది. అతని కవితా సందేశామృతంలోని పంక్తులు ఆశల కరములూచు కిరణ తంతువులు.

బైరాగిది ప్రహ్లాద నుడి.


ఏల్చూరి సుబ్రహ్మణ్యం

రచయిత ఏల్చూరి సుబ్రహ్మణ్యం గురించి:

ఏల్చూరి సుబ్రహ్మణ్యం (1920 – 1995) తెలుగు సాహిత్యంలో ప్రాముఖ్యత వహించిన అభ్యుదయ కవిత్వోద్యమానికి ఆద్యుల్లో ఒకరు. నయాగరా కవులుగా ప్రసిద్ధి పొందిన ముగ్గురిలో ఒకరు.

 ...