(మూలం : పారసీక కవి – షమ్సుద్దీన్ హాఫిజ్)
శా.
నీ సంయోగపు వార్త విన్నతరి, నే నీ మృణ్మయావాసపుం
గాసిన్ వీడుచు లేచి వచ్చెద, విహంగమ్మాత్మ వీడే క్షణో-
ల్లాసప్రోద్ధతి రెక్కలార్చినటులే, లావొంది నా యాత్మ కై-
లాసౌన్నత్యము నందబోవు, మమతా లౌల్యంపుటుచ్చుల్ విడన్.
ఉ.
నీ ప్రణయమ్ము బిల్వ విని నే నమృత స్రవదంతరుండనై
అప్రతిమాన వేగమున నంబరవీధిని తేలివత్తు; నా-
క ప్రతిమ త్వదంఘ్రితల కామిని, దుర్లభ జన్మ మృత్యు యు-
గ్మప్రభుతన్ త్యజించెదను, కాలము, దేశము కాలదన్నెదన్.
శా.
దేవా! ఎక్కడ తావకీన కరుణా దివ్యాంబుదాసార సం-
స్రావమ్మక్కట! నాదు బూది నవ సంస్కారార్థ మెన్నాళ్ళుగా
త్రోవల్ గాచె తృష్ణార్త ధూళి పటలిన్ రూక్షాబ్ధముల్ పోయె, ఝం-
ఝా వాత్యల్ గొనిపోకమున్నె రసముల్, జాలొంద వర్షింపుమా!