కవి కథక విరాగి బైరాగి

అనురాగం అంబరమైతే
ఆనందం అర్ణవమైతే
మేం తోకచుక్కగా వస్తాం
బడబానలమై మండిస్తాం
ప్రపంచమొక నందనవనమై
జీవితమొక గులాబీ ఐతే
మేం ముళ్ళ తొడుగుగా ఉంటాం
సుఖస్వప్నం భంగపరుస్తాం
ఈ జీవిత కేళీ గృహంలో
సుఖమే ఒక విరిపాన్పైతే
మేం కాలసర్పమై వస్తాం
విషజ్వాలల ధార విడుస్తాం
(బైరాగి ‘చీకటి నీడలు’ కవితా సంపుటి నుంచి)

కొన్ని కథల్ని, కొందరు కథకులను విశ్లేషించటం, కథలు రాయటం కంటే కష్టమైన పని. అలాంటి రచయితల కోవలోకి వచ్చే కవి-కథకుడు బైరాగి. అతని కవిత్వాన్ని ఎంతగా అభిమానిస్తామో అతని కథలను మరింతగా అనుభవిస్తాం. కవిత్వానికి, వచనానికి ఉన్న తేడాను తన కథల్లో అలవోకగా చెరిపేసిన కవి-కథకుడతడు. కథకులు కవులైతే పాఠకులు ఒక విధమైన భయంతోనే చదవడానికి సన్నద్ధులవుతారు. పాఠకులకు కవిత్వ కథలు ప్రధానంగా నచ్చకపోవటానికి కారణం చాలా సార్లు కవిత్వం కథను మింగేస్తుంది. కొన్నిసార్లైతే చంపేస్తుంది కూడా. కానీ బైరాగి, తిలక్ లాంటి కవి-కథకులకు అది పూవుకు తావి వంటిది. వారి కథల్లోని కవిత్వ వాక్యాలు కొన్ని పై కవితలాగానే పైకి చదువుకోవచ్చు. అందులో ఉన్నది కేవలం శబ్ద సౌందర్యమొక్కటే కాదు. కేవలం భాషా సౌందర్యంతోనే ఏ ఒక్క ప్రక్రియ రాణించలేదు. దానికి భావ సౌందర్యం తోడైతేనే ఆ అందం రాణిస్తుంది. శ్రీశ్రీ, నారాయణబాబు, శిష్ట్లా తదితరుల కోవలోనే బైరాగికి కూడా శబ్దశక్తి ఎక్కువ. దానికి తోడు తీవ్రమైన భావావేశంతో పాటు, ఒకింత భావ సౌకుమార్యం కూడా ఉంది. అదే బైరాగి కథలను ప్రత్యేకంగా నిలబెట్టింది.

ఇది ప్రధానంగా బైరాగి కథలను చదివినప్పుడు కలిగిన అనుభవపు అభిప్రాయ వ్యాసం. ఎంతమాత్రం సాహిత్య విమర్శ వ్యాసం కాదు. బైరాగి కథల విశ్లేషణకు నేను ఎలాంటి సాహిత్య విమర్శనా పరికరాలనో, పనిముట్లనో అరువు తెచ్చుకోవటం లేదు. కారణం ఒక్కటే. బైరాగి కథల్లో కొన్నింటి గురించి ఒక పాఠకురాలిగా మాట్లాడటంలో ఓ సౌలభ్యముంది. ‘ఈమాట’ అడిగినప్పుడు, మరోసారి బైరాగిని ఇష్టంగా చదువుకోవచ్చని సరే అన్నాను.

బైరాగి రాసిన 7 కథలు “దివ్యభవనం” పేరిట పుస్తకంగా 1955లో మొదట అచ్చయింది. అప్పటికి బైరాగి వయసు ముప్పై ఏళ్ళే. ఆ తర్వాత దొరికిన మరో నాలుగు కథలు జత చేసి ఈ కథాసంపుటిని ద్వితీయ ముద్రణగా 2006లో వెలువరించారు. ఈ పదకొండు కథలు కాక ఇంకా ఒకటి రెండు కథలు (ఒక కట్టు కథ, అగాధపుటంచున) కథా నిలయంలో లభ్యమవుతున్నాయి. ‘ఒక కట్టు కథ’ ఈ సంపుటిలో లేకపోయినా పర్వాలేదేమో కానీ ‘అగాధపుటంచున’ మలి ముద్రణలో జత చేస్తే బావుంటుంది.

‘దివ్యభవనం’ కథా సంపుటి మొదటగా బైరాగికి ముప్పై ఏళ్ళున్నప్పుడు వెలువడింది. ఇప్పుడు ముప్పై ఏళ్ళ రచయితలు రాసే రచనలు చూస్తే, బైరాగి లోని విలక్షణత ఏమిటో అర్థమవుతుంది. జీవితం పట్ల లోతైన అవగాహన, సమాజం పట్ల సూక్ష్మ పరిశీలన, వయసుకు మించిన అనుభవంతో అతను ఈ కథలు రాశాడు.

బైరాగి కథలను కేవలం ఇతివృత్తం తోనో, వస్తువు తోనో విశ్లేషించలేము. అతని కవిత్వం లాగానే కథలు కూడా చదివినంత సేపూ ఓ ప్రవాహ వేగంలో మనల్ని ముంచెత్తుతాయి. భావ సౌకుమార్యంతో కొన్ని వాక్యాలు చిక్కగా చిత్రిక పట్టి మనల్ని ఖచ్చితంగా ఒక్క క్షణం ఆగి ఆలోచింపజేస్తాయి. అది అతని శైలిలోని గొప్పతనమే తప్ప కథ చదవడానికి అడ్డు వచ్చే ప్రతిబంధకాలు కావు. జీవితాన్ని బైరాగి ఎంత సూక్ష్మంగా దర్శించాడో ఈ కథల ద్వారా, ఆ వర్ణనల ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కథకులు మాట్లాడే “show, don’t tell” పద్ధతిలోనే సాగుతాయి అన్ని కథలూ. అందువల్ల ఆ వాతావరణంలోకి, పాత్ర మానసిక స్థితిలోకి పాఠకులు సునాయాసంగా వెళ్ళగలుగుతారు.

నాకు ఈ సంపుటిలో బాగా ఇష్టమైన కథలు: జేబుదొంగ, బీజాక్షరి. రెండు కథల్లో కూడా ముగింపు కీలకం. పైకి చాలా సాధారణ కథల్లాగా కనిపిస్తూనే అసాధారణ ముగింపునిచ్చి పాఠకులను ఆకట్టుకుంటాడు.

జేబుదొంగ

“మెలకువలోనూ నిద్దురలోనూ, నీ హృదయపు చీకటి గదిలో మేలుకొన్నవాడు. నీ కళ్ళు కునకడం, నీ మెటిమలు విరగడం, నీ మెడ క్రింద లోయలో చిన్న చిట్టినరం నీడలా చలించడం ఇవన్నీ గమనించినవాడు అతడే. నీవు నవ్వుతున్న విధంగా నవ్వడం, నీవు ఏడుస్తున్న విధంగా ఏడవడం, ఏమీ తోచనప్పుడు కాళ్ళాడిస్తూ కూచోటం నీకు నేర్పినవాడు అతడే. ప్రపంచమంతా చీకటి చెరగు కింద నిద్దురలో, దద్దరిల్లిన క్షణాల్లో నీ ఎడమ చేతిని కుడి చేయి ఎరగని రోజుల్లో అంతా అయోమయంగా వున్నప్పుడు కూచుని కాపలా కాసినవాడు అతడే. ఆకాశంలో నక్షత్రాలూ, భూమి మీద దీపాలూ, రాత్రి రాల్చిన మంచుబొట్లూ, కునుకెరుగని కన్నుల లోని కన్నీటి చుక్కలూ లెక్క బెట్టిన గణిత శాస్త్ర పారంగతుడు అతడే. అతడే నీవు సిద్ధంగా లేని సమయాలలో వస్తాడు. నీవు సిద్ధం కాకముందే వెళ్ళిపోతాడు. నీవు స్వాగత పత్రం ఇచ్చిందాకా, కాళ్ళకు నీళ్ళిచ్చి కుశల ప్రశ్నలు వేసిందాకా ఆగడు. అతడు వచ్చిన క్షణం మెరుపు మెరుస్తుంది. ఉరుము ఉరుముతుంది. తప్పత్రాగిన తుఫానులో ప్రపంచపు పర్వత శిఖరాగ్రాలపై పాలుగారే పసిపాపలు సెలయేళ్ళ జలజలలా పకపకా నవ్వుతూ పరుగెత్తుతారు. ఒక్క క్షణం అంతా వుంటుంది. ఏదీ లేకపోదు. ఆ మనిషి. అతడే మనిషి. మనుష్య మాత్రుడు కాదు గాని కేవలం మనుష్యుడు. ఈ క్షణం ఆకాశం క్రింద ఈ ప్రదేశంలో రెండడుగుల మేర మానవుడా! మానవుడా! కొంచెం కరుణా కావాలి కదూ!”

“జేబుదొంగ” కథ ఇలా ప్రారంభమవుతుంది. ఈ వర్ణన తర్వాతనే కథలోని ప్రధాన పాత్రధారి ప్రసాదరావు గురించి కథకుడు చెప్పడం మొదలుపెడతాడు. “జీవితపు రక్తోజ్జ్వల ముక్తిక్షణం”తో మొదలయ్యే కథాప్రారంభం, ఆ వాక్యంతోనే ముగుస్తుంది. ఆ ముక్తిక్షణం ఎవరికి ఎక్కడైనా ఎదురుపడవచ్చు. ఈ కథలోని ప్రధాన పాత్రధారికి పదిహేనేళ్ళ జేబుదొంగ దగ్గర ఆ క్షణం ఎదుటపడుతుంది.

కథా ప్రారంభం చదివినప్పుడు ఈ వర్ణన ప్రధాన పాత్రధారి గురించేమో అనుకుంటాం కానీ కాదు. కథకు సంబంధం లేని వర్ణనేమో అనిపించటం కూడా కద్దు. కానీ ఆ వర్ణన మనల్ని తనవైపుకి లాక్కొని కథను ముందుకు చదివిస్తుందనటంలో సందేహం లేదు.

ఎంతో డబ్బు అవసరం పడి తెలిసిన వ్యక్తి పూర్ణచంద్రరావు దగ్గర అప్పు కోసం రైల్వే స్టేషన్‌కి వెళ్ళి పడిగాపులు కాసిన నిరుద్యోగి ప్రసాదరావుకి చివరకు దక్కింది ఓ అయిదు రూపాయలు. ఆ అయిదు రూపాయలు అతని అవసరాన్ని ఏ మాత్రం తీర్చవు. కానీ ఆ అయిదు రూకల్ని ఓ పదిహేనేళ్ళ జేబుదొంగ కొట్టేస్తాడు. ఆ జేబుదొంగ కళ్ళల్లోకి సూటిగా చూసిన క్షణం ప్రసాదరావు మనఃస్థితి కథను ఓ స్థాయిలో నిలబెడుతుంది. మామూలు వ్యక్తికి ఆ క్షణంలో కోపం వస్తుంది జేబుదొంగ మీద. కానీ ఆ క్షణం అతనిలో ఓ ‘రియలైజేషన్’ తీసుకొస్తుంది. కరుణతో కూడుకున్న తాదాత్మ్యం. అదే రచయిత కథ ప్రారంభంలో చెప్పిన ‘రక్తోజ్జ్వల ముక్తి క్షణమా!?’ ఆ క్షణమే కథకు ఆయువుపట్టు.

జేబుదొంగ మీద కోపం రాకుండా ప్రేమ, జాలి, కరుణ ఎందుకు పుట్టుకొచ్చాయో అర్థం చేసుకోవాలంటే ప్రసాదరావు మనఃస్థితి, అతని మనో ప్రపంచం అర్థం కావాలి. అప్పుడు గానీ ఆ జీవితపు రక్తోజ్జ్వల ముక్తిక్షణం మనకు కూడా అనుభవంలోకి రాదేమో. పూర్ణచంద్రరావు డబ్బు ఇవ్వకముందే ప్రసాదరావుకి ఏదో ఒక ఆత్మానుభవం కలిగింది. తనను తాను భౌతికంగా వేరుగా చూసుకున్నాడు. డబ్బు అవసరం, అది లేకపోతే వచ్చే కష్టాలు అన్నీ కేవలం ప్రసాదరావు దేహానికి సంబంధించినవిగా అతను తన నుండి తాను వేరుగా చూసుకున్నాడు. అలా రెండు ప్రపంచాల్లోంచి తనని తాను తెలుసుకున్నాడు.

“అందులో ఒక ప్రపంచం రెండో దాన్ని దూరం నుంచి మాత్రమే చూస్తున్నది. ఈ రెండు ప్రపంచాలకూ మధ్య వంతెన లాగా అతని డబ్బు అవసరం. బాహ్య ప్రపంచంతో అతనికి సంపర్కాన్నీ కలిగిస్తూ కూడా, ఆ సంపర్కాన్ని తనతో నింపివేసి కల్మషపరుస్తున్నది.” చేతిలో లేని డబ్బు కోసం ఏ మార్గం అనుసరించినా లాభం లేదని తెలుసుకున్న తర్వాత అతనికి జ్ఞానోదయం కలిగింది. అతనొక ప్రశాంతతతో ఉన్నాడు. అందువల్లే ఇదివరకెన్నడూ గమనించని విషయాలు అతను గమనించగలిగాడు. పూర్ణచంద్రరావుగారు సాయంత్రమంతా చెప్పిన మాటలూ, అతని ఆలోచనలూ, ఇంట్లోంచి వెళ్ళిపోతున్న అతిథిలా ఒక్క క్షణం వాకిలి దగ్గర ఆగి, ఒక ఇష్టం లేని వెనక చూపుతో మనస్సులో ప్రతిధ్వనులతో సహా చెరిగిపోయాయి.

జనసందోహంతో కిక్కిరిసిన ఆ ప్లాట్‌ఫారంని వదిలి ఆ రాత్రి రోడ్డు మీద నడుస్తున్నప్పుడు,

“అకస్మాత్తుగా అతను రాత్రి యొక్క సమ్మోహన విద్యుత్స్పర్శను అనుభవించాడు. సముద్రపు నిలువ నీరుకంటే గూడా ఎక్కువ నీలంగా ఉంది ఆకాశం. నక్షత్రాలు నల్లని మొఖమల్ మీద బంగారపు పూలలా మెరుస్తున్నాయి. నగరమంతా మెలకువకూ, నిద్దురకూ మధ్యనున్న సరిహద్దు ప్రాంతంలా ఉంది. ఈ పాటికి ఎక్కువ మంది నిద్రపోయి ఉండరు. కానీ అంతా నిద్రపోదామని ఆశిస్తూ ఉండి ఉంటారు. అంతా నిద్రల నీలవనంలో ప్రవేశించడానికి పయనిస్తూ ఉండి వుంటారు. ఈ నీడల నాటక రంగం మీద కలల కాంతిలో జీవితపు మెరకపల్లాల్లోంచి వచ్చిన వాళ్ళందరూ ఒకే ఒక హోదాతో నిలబడతారు. ఇక్కడ విభేదాలు లేవు. ఈ కౌగిలి అందరికీ ఒకేరకపు శాంతి నిస్తుంది. ఇక్కడ యాచన లేదు. లేదనటం లేదు. అవమానం లేదు. ఈ వాకిలి దగ్గరకు వచ్చిన వాడెవ్వడూ ఉత్త చేతులతో తిరిగి వెళ్ళడు. ఇదే రోజువారీగా చేసే యాత్రల గమ్యస్థానం”

అనుకొంటాడు ప్రసాదరావు.

అప్పుడు జరుగుతుంది ఆ సంఘటన. ఒక 15 ఏళ్ళ పిల్లవాడు జేబులోంచి ఆ మిగిలిన అయిదు రూపాయలు లాక్కున్నాడు. ఇక ప్రసాదరావుకి ఈ లోకంలో ఏ ఒక్క బంధం లేదు. ఆ పిల్లవాడి రెండు కళ్ళు రెండు బ్యాటరీ లైట్ల కాంతిలా, జాలిని, భయాన్ని, ఆశ్చర్యాన్ని, చెప్పరాని దైన్యాన్ని ప్రవహింపచేస్తూ అతడి నిర్దాక్షిణ్యాన్ని, క్రూరత్వాన్ని దూషిస్తున్నట్లు, నిందిస్తున్నట్లు, చూస్తూ, అతన్ని దేశకాలాలు మరిపించి, స్పృహ లేకుండా ఉక్కిరిబిక్కిరి చేశాడు. “ఆ ఒక్క క్షణం అతనికి విశ్వరూప సందర్శనానుభవం కలిగింది. తన అల్పత్వం అర్థమైంది. ఆ కుర్రవాడితో అతను సంపూర్ణ తాదాత్మ్యం అనుభవించాడు. “ఈ విశాల భూతలం మీద కళ్ళు తెరిచిన మొట్టమొదటి రోజు నుంచీ నేటి వరకూ ఎన్నడూ అనుభవించని ఏకత్వాన్ని అతడు ఈ క్షణంలో సాధించగలిగాడు. అతనికిప్పుడు ప్రపంచమంటే అసంతృప్తి లేదు. ఈ భూమి మీద తను బ్రతికి ఉండటాన్ని అతడు ఆశ్చర్యంతో ఆనందించసాగాడు”.

ఈ కథ రాసినప్పుడు బైరాగి మనఃస్థితి ఏమిటి? ఆ పాత్ర మానసిక స్థితి? కథ చదివిన పాఠకుల స్థితి? ఈ కథానుభవం ఒక్కటే కావచ్చు, వేర్వేరు కావచ్చు. అదే ఈ కథ గొప్పతనం. ఈ కథకు విశ్లేషణాలు, విమర్శలు అక్కరలేదు. కథ చదివి అయిదు నిముషాలు ఆ ముగింపు ప్రశాంతతను అనుభవిస్తే చాలు.

బీజాక్షరి

కేవలం ఒకే ఒక వాక్యం రాసిన ఓ అబ్బాయి కథ. నిజానికి ఆ వాక్యం కూడా ఆ అబ్బాయి రాయలేదట. ఆ కలం రాసిందట.

“అబ్బాయి చేతుల్లో ఆగిపోయిన కలం. అబ్బాయి కలం వంక చూశాడు ‘కదలవేమిటే’ అన్నట్లు. కలం కదలలేదు. కలం దిగులుగా ఉంది. కలం పాళీలో మధ్యనున్న ఏకాక్షి అబ్బాయి వంక జాలిగా చూస్తున్నది. పాళీ మీద అంచులకు కొంచెం సిరాపట్టి ఉన్నది. కలంలో కూడా సిరా పూర్తిగా అయిపోలేదు. కలం రాయదల్చుకుంటే అది కొంతసేపు రాయొచ్చు. కానీ దిగులుగా ఉండటం వల్ల కూడా కలం రాయకుండా ఆగిపోయింది.”

ఆ అబ్బాయి రాయాలనుకున్నది అలాంటి ఇలాంటి కథ కాదు. ఎలాంటి కథో చూడండి.

“నా కథలో అన్నీ దేశాలు, అన్నీ కాలాలు, అన్నీ జాతులు, అన్నీ భాషలు ఉండాలి. నా కథ చదివి మనుష్యులు ఏడవాలి, నవ్వాలి, గంతులేయాలి. నా కథలో ప్రతి అక్షరం మరకలు పడని ఉక్కులా మెరుస్తూ ఉంటుంది. నా కథలో సముద్రమూ, ఆకాశమూ, ఎడారులూ, పచ్చని చేలూ, చెట్లు, పుట్టలు, పిట్టలూ అన్నీ మాట్లాడేట్లు చేస్తాను. వినిపించే ధ్వనులన్నింటినీ భాషలోకి అనువాదం చేస్తాను. నా కథ రాగంలా, అనురాగంలా, యోగంలా, వియోగంలా అమోఘంగా ఎగురుతుంది.”

ఇలా కథ మొత్తం రచయిత చెప్తూ ఉంటాడు. ఆ గొప్ప కథ గురించి, ఆ అబ్బాయి గురించి, ఎలుక బోధించిన జీవిత పరమ సత్యం గురించి … ఇలా ఎన్నో విషయాలు వస్తాయి ఈ కథలో. కథ చదివే పాఠకులకు విసుగు పుట్టకుండా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. కథ ముగింపు, ‘జేబుదొంగ’ కథలో లాగానే ఆశ్చర్యకరమైన, ఏ మాత్రం ఊహించని ముగింపు. కథలోని అబ్బాయికి ఓ ఆరేడేళ్ళ పిల్లవాడు ఎదురవుతాడు. వాడి చిన్న కళ్ళు తెల్లగా గుండీల్లా మెరుస్తుంటాయి (ఈ పోలిక బైరాగికి ఇష్టమైన పోలిక అనుకుంటా, మరో రెండు మూడు కథల్లో వచ్చింది). ఆ పిల్లవాడి చేతిలో రెండక్షరాల తారక మంత్రం “ఆశ” అని రాశాడు. ఆ బీజాక్షరమంత్రం చాలదా ఈ ప్రపంచానికి, సాహిత్యానికి? పది పేజీల కథ ఇది. వర్ణనతో కథ మొత్తం సాగుతుంది. కథలోని ‘నేను’ పాఠకులతో చేసిన సంభాషణలో ఎన్నో విచిత్రమైన విషయాలు కథనిండా పర్చుకొని ఉంటాయి.

ఈ రెండు గొప్ప కథల గురించి మాట్లాడిన తర్వాత… బైరాగిని చదవాలనిపిస్తే, ఒక్కసారి ఆ ‘దివ్యభవనం’ లోపలకు వెళ్ళి రండి.

దివ్యభవనం

పదిహేనేళ్ళ క్రితం ఈ కథ చదివినప్పుడు కథ అర్థం కాలేదనిపించింది. ఇప్పుడు చదివితే, మనసు పెట్టి చదివి, ఆలోచిస్తే ఏదో అర్థమైనట్లే అనిపించింది. లేదా అర్థం చేసుకునే ప్రయత్నం చేశానేమో. మార్మిక కథ. కవులు కథలు రాస్తే ఎలా ఉంటుందో అలాంటి కథ. కథలోని దివ్యభవనం దేనికి సంకేతం? రచయిత రాసినట్లు ఆ దివ్యభవనం ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమవుతుంది. బైరాగి ఏ ఉద్దేశంతో రాశారో నాకు అర్థమైందో లేదో తెలియదు కానీ, నాకు అర్థమైన దివ్యభవనం కథ ఒకటి ఉంది. ఏమీ చదవకుండా, ఏమీ రాయకుండా తాత్కాలిక కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంటే అవి అలాగే కనుమరుగైపోతాయని చెప్తున్నారా? అప్పటి (లేదా ఇప్పటికీ) సమకాలీన సాహిత్యం మీద ఓ చురక కావచ్చు.

మిగతా ఎనిమిది కథలు కూడా ఒక్కొక్కటి ఒక్కో రకం. కథను కేవలం వస్తువుతోనో, శిల్పంతోనో తూకం వేసే విమర్శనా పద్ధతికి లొంగని కథలివి. శిల్పకథనం బైరాగి కథల గొప్పతనం. అది దాదాపుగా ప్రతి కథలోను కనిపిస్తుంది. కొన్ని కథల్లో దాని పాళ్ళు ఎక్కువైన సందర్భాలు లేకపోలేదు. కావాలని పనిగట్టుకొని కథల్లో కవిత్వం చొప్పించినట్లు ఉండదు. కథ, కథనం, వర్ణన అన్నీ సమపాళ్ళల్లో ఉంటాయి. ఇవన్నీ కావాలని కూర్చొని రాసిన కథలు కావని నిస్సందేహంగా చెప్పవచ్చు. బైరాగి ఇవాళ బతికుంటే, ఈ కథలను మెచ్చుకునేవాళ్ళ శాతం ఎంతో ఊహించటం కష్టమే. బైరాగి కథలు కాలక్షేపం కోసం చదివేవి కావని మాత్రం చెప్పగలను.

బైరాగి కథ చెప్పే విధానంలో ఓ ప్రత్యేకత కనిపిస్తుంది. అది అతని కథల థీమ్‌కి సరిగ్గా అతికినట్లు ఉంటుంది. పదేళ్ళ క్రితం ఈ కథలు చదివినప్పటి అనుభవం కంటే, ఇప్పుడు మరోసారి చదివినప్పుడు మరింత నచ్చాయి. మొత్తం కథల్ని ఏకబిగిన చదివినప్పుడు, బైరాగి మీద ప్రేమ, గౌరవం పెరిగాయి. మిత్తవ (మృత్యువుకు బైరాగి వాడే పదం) నీడలో బతికే మామూలు మనుష్యులకు, బైరాగికి తేడా ఈ కథల్లో కనిపిస్తుంది. అతనికి మృత్యువంటే భయం లేదు. అకారణ ద్వేషం కూడా లేదు. జీవితం పట్ల, సమాజం పట్ల బైరాగికి ఉన్నది కరుణ, ఆశ, ప్రేమ. అది ఈ కథల్లో స్పష్టంగా కనిపిస్తుంది. రామారావు, ప్రసాదరావు, వీరయ్య, లక్ష్మణసింగ్, కిమానీ, రీతా వీళ్ళంతా మనలోనే ఉన్నారు. భూతవర్తమానాలు తప్ప భవిష్యత్తు లేని దర్బాను (గూర్ఖా) ఎదుట ఉన్న తెల్లగోడ ఇవాళ చాలామందికి కఠోర సత్యం. వాళ్ళు ఈ కథలకు పాఠకులు కావచ్చు, కాకపోవచ్చు. లాజరస్ బతికి వచ్చినట్లే, మహానగరం మళ్ళీ బతికినట్లే, ఎంతటి నిరాశాపూరిత జీవితంలోనైనా కరుణ, ఆశ, మానవత్వం ఇవన్నీ సమాజాన్ని పునరుజ్జీవింపజేసే బీజాక్షరపు మహా మంత్రాలే.

ఈ పుస్తకం మలి ముద్రణలోనైనా సవరించాల్సిన అంశాలు: కథల కింద ప్రచురణ వివరాలు ఇవ్వటం, ముద్రారాక్షసాలను సరిచేయటం. ఏ కథ ఎప్పుడు రాశారో/ప్రచురితమైందో తెలిస్తే బైరాగి కథాక్రమాన్ని, ఆయన రచనా పరిణామక్రమాన్ని అర్థం చేసుకునే వీలుంటుంది. అసలు ఎలాంటి వివరాలు లేకపోవటం ఈ కథల పుస్తకానికి అదొక పెద్ద లోటుగా మిగిలిపోయింది. అలాగే అచ్చు తప్పులు, కామాలు, ఫుల్‌స్టాపులు వంటివి సరి చేయాల్సినవి చాలానే ఉన్నాయి.

బైరాగి కవిత్వ తత్త్వం కథల్లో కూడా ప్రతిబింబిస్తుంది. ఒక రకంగా అది ఆయన సాహిత్య తత్త్వం. తీవ్రమైన భావావేశం, మార్మిక పద చిత్రణ, ఆశానిరాశల ఊగిసలాట, మృత్యు స్పర్శ నీడలో దాక్కునే వాక్యాలు, అర్థమై కానట్లుండే కొన్ని ఇతివృత్తాలూ వెరసి బైరాగి కథలు. కవితాత్మక శైలి కథకు అడ్డం రాకుండా, కథలో అది కలిసిపోయేలా రాయటం వల్లే కవిగానే కాకుండా కథకుడుగా కూడా బైరాగి గురించి ఇప్పటికీ మాట్లాడుకోగలుగుతున్నాం.

బైరాగి కవిత్వంతో పాటు ఆయన కథలు, ‘పాప పోయింది’ నవల ఒక్కసారైనా చదివి తీరాల్సిన పుస్తకాలని అంటాను నేను. మీలో కొందరైనా నాతో ఏకీభవిస్తారనుకుంటా!


కల్పన రెంటాల

రచయిత కల్పన రెంటాల గురించి:

కల్పనా రెంటాల మొదటి కథ 1985-86లలో తన 20 ఏళ్ల వయస్సులో ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురితమైంది. మొదటి కవితా సంకలనం “నేను కనిపించే పదం” నకు అనంతా పురస్కారం లభించింది. స్త్రీలు, పిల్లలకు సంబంధించిన ఇతివృత్తాలతో కల్పనగారు అనేక కథలు, కవితలు, సాహిత్య విమర్శలు, అనువాదాలు చేశారు. ‘తూర్పు-పడమర’ అనే వెబ్ పత్రికను నిర్వహిస్తున్నారు.

 ...