వేదన, వేదన, వేదన; ఆవేదన
జుగుప్స, కోపం, తాపం, తపన
బైరాగి కవితలో ఉద్రేకాలు, ఉద్వేగాలు వెల్లువ గోదారిలా, కడలి పొంగులా, పొంగి పొరలుతూ ఉంటాయి.
రచన పంపమంటూ రాసిన లేఖలో The ever humble poet Aluri Bairagi అని అభివర్ణించారు. బైరాగి కవితను చదివినా, బైరాగిని కలిసినా, ఆయనలో వినయం, వినమ్రతల జాడలు కూడా కనిపించలేదు నాకు.
బైరాగిని ఒక్కసారే కలుసుకున్నాను. అది 1962లో, అంతకు కొంత కాలం ముందే, మిత్రుడు గోపీచంద్ కాలం చేసి ఉన్నాడు. ప్రతిదినం అతని ఇంట్లో కొంత సమయం గడుపుతూ ఉండేవాణ్ని, విషాదాన్ని గోపీచంద్ కుటుంబంతో పంచుకుంటూ. ఒకానొక రోజున నేనక్కడ ఉండగా ఒకాయన వచ్చాడు. బక్కపలచగా బారుగా ఉన్నాడు. కూర్చోమని కుర్చీ చూపాను, నేనెవరో చెప్పాను, కాని ఆయన తనెవరో చెప్పలేదు. ఉలుకూ లేదు, పలుకూ లేదు. కొన్ని నిమిషాల నిశ్శబ్దం బరువుగా నడిచిన తర్వాత, గోపీచంద్‌గారి అబ్బాయి బయటకు వచ్చి “వీరు బైరాగిగారు” అని పరిచయం చేశాడు. అప్పటికే ఆయన కవిత్వం అంతా కాకపోయినా కొంతైనా చదివి ఉన్నాను, ఆయన్ని గురించి కొంత విని ఉన్నాను కూడా, గోపీచంద్, చక్రపాణి, మొదలైన మిత్రుల నుండి. కొత్తవాళ్ళకు తొందరగా కొరుకుడుపడే మనిషి కాదు బైరాగి అనే అభిప్రాయం నాకు ఏర్పడి ఉంది. అది ప్రధానంగా ఆయనగారి కవిత్వం చదివిన ప్రభావం.
అయితే భూకంపంలాగా కంపించే మనస్సు కలవాడు అనే ఆలోచన కూడా నాకు కుదిరి ఉంది. అట్టి ఆలోచన రాకుండా ఎలా ఉంటుంది? తాను రాసిన ప్రతి పంక్తిలో ఉవ్వెత్తున ఎగిసి పొంగే హృదయావేదన కొట్టవచ్చినట్టు కనబడుతుంటే.
అలా పరిచయమైన తరువాత కూడా మౌనంగా బిగువుగానే కూర్చొని ఉన్నాడు. నేనేమో వాగుడుగాయను. మనిషి దొరికితే చాలు అనుభవాలు, ఆలోచనలు ఒకరివి ఒకరం అందజేసుకోవడం నాకు ఇష్టం. కనక వదిలిపెట్టలేదు. అదిన్నీ కాక మా యిద్దరినీ దగ్గర చేస్తూ ఎం. ఎన్. రాయ్, గోపీచంద్‌లు ఉన్నారాయెను. మాటలు కలిస్తేనేగాని, మనసులు తెలియవు కదా, అందుకని నేనే మాటలు దొర్లించాను. చివరకు ఆయన్ని కదలించాను. చాలాసేపు చర్చించుకున్నాం, సమాజాన్ని గురించీ, దాన్ని వేధిస్తున్న బాధల్ని గురించీ, భావనలను గురించీ, భావుకులను గురించీ. అప్పుడు బయటకు వచ్చాడు బైరాగి, తన మనస్సుని విప్పిచెప్పడంలో గాని భిన్నభావాలనైనా సరే బలంగా చెప్పడంలోగాని ఆయన సందేహించలేదు. ‘రచనలోని కరుకుదనమే పలుకులోనూ అగుపించింది.’ కనుక బైరాగి వినయాల జోలికి పోయే మనిషి కాదు. నిర్భయుడూ, సాహసికుడూ.
అది అలా ఉంచండి, ఆయన కవిత చూద్దాం. అది సంశయ కవిత్వమని, ఆధునాతన రీతులలో ఒకరీతి అని రసజ్ఞులు, విమర్శకులు అంటూ ఉంటారు. అంతదాకా ఎందుకు! తనే చెప్పుకున్నాడు. ‘నూతిలో గొంతుకలు’కు తొలిపలుకు రాస్తూ, అది సంశయ కావ్యమని అందుకు కారణం కూడా ఆయన విశదపరిచాడు. ఏమని? “దీనిలో మానవుడు ఏది త్రోవ? అని అడుగుతున్నాడు.” గనుక. అది నాకు మటుకు సంశయం కంటే వేదన బైరాగిని కదలించింది, ఊపింది, అతని మనస్సులో మంటలు రగిల్చింది అనడం ఇంకా ఉచితంగా ఉంటుందని అనిపిస్తుంది. పేరుతోనూ, కవితలోని తరగతుల నిరూపణతోనూ నాకు పేచీలేదు. ప్రతి దానికీ మూసలు పోయడం, వర్గీకరణ చెయ్యడం, అందరికీ, చివరికి నవీనులకు కూడా ఇష్టం. అలా చేస్తే స్వేచ్ఛాయుతమైన కవితలో కూడా కొన్ని రహదారులు ఏర్పడతాయని ఆశ కాబోలు! ఛందస్సులు వద్దనుకుని కూడా కవితా రీతులు అట్టే పెట్టుకుంటున్నాం కదా మరి!
నా భయం ఏమిటంటే ఒక పేరు పెట్టి, కవితను రచనను, దాన్ని బట్టి తూకం కట్టడం జరుగుతుందేమోనని. అలాకాక, కవితలోని హృదయాన్ని పరిశీలించి, అవగాహన చేసుకోవడం ముఖ్యం. అలా చూస్తే “వేదన” బైరాగి కవితకు హృదయమని నాకు తోస్తుంది! సందేహానికి, వేదనకు పేరు భేదమే కాని తత్వభేదం లేదని అనవచ్చునేమో బహుశః.
కాని నా దృష్టిలో “వేదన” కారణం. “సందేహం” ఫలితం. తన చుట్టూ ఉన్న సమాజంలో చెలరేగుతున్న అన్యాయాన్ని, దుర్మార్గాన్ని, క్రూరత్వాన్ని చూచినప్పుడు బైరాగి మనస్సు విలవిలలాడింది. హృదిలో మంటలు రేగినవి. ఎంత అన్యాయం! ఎంత దుర్మార్గం! ఎంత క్రౌర్యం! కాలే మనస్సు నుండి పుట్టుకొస్తుంది సంశయం. దీన్ని నివారించడం ఎలా అనే ప్రశ్న దాన్ని బట్టి ఉదయిస్తుంది. వేదనంటూ ఉండాలి గాని, ఇట్టి ప్రశ్న, సంశయం ఉదయించి తీరాలి, చలనం గల ప్రతి మనిషిలోనూ.
స్వయంగా బైరాగే ఏమన్నాడో చూడండి: “నూతిలో గొంతుకలు సంశయ కావ్యం, దీనిలో మానవుడు ఏది త్రోవ? అని అడుగుతున్నాడు…. చీకటిలో ప్రారంభమైన ఈ కావ్యం ఆవేదనల అనంతంలో అంతమైన జీవితాలను చర్చిస్తున్నది. దీనిలో నాయకులు హామ్లెట్, అర్జునుడు, రాస్కల్నికోవ్ సందిగ్ధావస్థలో ఒక క్రమబద్ధమైన పరిణామాన్ని సూచిస్తున్నారు. హామ్లెట్ వేదన కర్మపూర్వం, అర్జునుడి వేదన కర్మక్షేత్రంలో తక్షణికం. రాస్కల్నికోవ్ వేదన ఘోరకర్మ తరువాత, కాని ముగ్గురి బాధ ఒకే స్థాయిని అందుకుంటుంది. అది మానవుని సహజ వేదన. అతణ్ణి త్రికాలాల్లోనూ వెంటాడుతుంది, ఆ బాధలో మధనపడనివాడు పూర్ణత్వాన్ని అందుకోలేడు. ప్రపంచానుభూతిలో స్వీయానుభూతి పరమైనప్పుడే ఉత్తమ కవిత ఉద్భవిస్తుందని నా విశ్వాసం.” వేదన, బాధ ముఖ్యమన్న ఈ మాటలు అన్నది తొలిపలుకులోనే.
తీరా కవిత్వంలోకి దిగితే అంతా వేదనే, విషాదమే. హామ్లెట్ ద్వారా చెప్పినా, అర్జునుని ద్వారా పలికినా, రాస్కల్నికోవ్ హృదయం విప్పినా అంతటా విషాదమే. జ్ఞానంలో కూడా బాధను చూపించాడు. హామ్లెట్ స్వగతంలో అంటాడు:
“జ్ఞానంలో ఉంది బాధ, బాధలో అనుమానం, నిత్యనిరుత్తరపు ప్రశ్న జ్ఞానం ఇచ్చిన దానం. అజ్ఞాతంలోంచి మరల అజ్ఞాతంలోకి పయనమే జ్ఞానం. జ్ఞానం సంకట భరితం….”
పిమ్మట అర్జునుని విషాదయోగంలో అర్జునుని ప్రశ్న:
“ఈ ప్రళయ ముహూర్తంలో ఏమిటి నా కర్తవ్యం? ఈ అగ్ని పర్వతంపై ఏ దిక్కున గంతవ్యం?”
ఆ ప్రళయాన్ని, అగ్నిపర్వతాన్ని ఈ విధంగా వివరించాడు, అర్జునుని పలుకుల్లో:
“ఏమిటి అనుభవిస్తారు, రానున్న తరాలవారు?
ఆస్తులు హరించిన పక్షాన వారేవిధి మెలగుతారు?
ఎవరు గెలిచినా యిక్కడ ఫలమొక్కటే కట్టకడకు.
ప్రజ్వలచ్చిత్తులై శోకాగ్నులొక్కటే కట్టకడకు.
జీవితమే దుర్వహ భారమయ్యి
తీరం నానాటికి దూరమయ్యి
కాలం కరాళమౌతుంది కడకు,
యాతన కరాళమౌతుంది కడకు…”
కనుక అర్జునుడికి యాతనా భరితమైన హృదయం నుండి పుట్టుకొచ్చింది ప్రశ్న ‘ఈ ప్రళయ ముహూర్తంలో ఏమిటి కర్తవ్యం?’ అని.
ఇక రాస్కల్నికోవ్ ఖండిక తీసుకుందాం. అది “త్రోవ ఎక్కడ సోనియా?” అనే ప్రశ్నతోనే ఆరంభమవుతుంది. “లోకమంతా శోకమయమై చిమ్మచీకటి చిమ్ముతున్నది” కనక త్రోవ ఎక్కడ అని అడిగాడు రాస్కల్నికోవ్.
శోకమయమైన చిమ్మచీకటి వారిని ముసిరినట్లే బైరాగి చుట్టూ కూడా అలముకున్నది. ఆ ఆర్ద్రహృదయం అందుకు స్పందించింది, చలించింది, కంపించింది, ఏడ్చింది. అగ్నిగోళంగానే మారిపోయింది. నిప్పు సెగలు కవితలుగా కక్కింది. కసిగా మారింది. “కడుపుమంట” ఖండికలో బైరాగి కసిని చూడండి:
“మీ ప్రణయోత్సుక మధు గీతం
మీ నృత్యమత్త సంగీతం
మా కటుక్షుధారోదనంలో
ముంచేస్తామొక్క క్షణంలో
మీ హేమాసన పాత్రల్లో
మీ స్వప్న జగతి యాత్రల్లో
మా అశ్రుధార నింపేస్తాం
మీ బాటను జారుడు చేస్తాం
పానకంలో పుడకగా వస్తాం
టీ కప్పులో ఈగై చస్తాం.
మా ప్రాణాలైనా విడుస్తాం,
మీ శాంతిని భగ్నం చేస్తాం!”
ఇది వట్టి ఆవేదన, సంశయం మాత్రమేకాదు, కసినుంచి పుట్టిన ప్రతీకార భావం.
ఈ స్పందనకు ఎలియట్ అననక్కరలేదు. వేస్ట్లాండ్ను తలవాల్సిన అవసరం లేదు. యుద్ధదావానలంతో శ్మశాన వాటికగా మారిన యూరప్, ఎలియట్ హృదయాన్ని వేదనపాలు చేయగా, తన చుట్టూ ఉన్న వైశాచికత్వం బైరాగిని విషాదంతో ముంచెత్తింది. ఆనాడు సిద్ధార్థుణ్ని గౌతమ బుద్ధుణ్నిగా, కరుణాజ్యోతిగా మార్చిన అనుభూతి కూడా అటువంటిదే. ఆనాడు ఎలియట్ లేడు. వేస్ట్‌లాండ్ లేదు. అపారమైన మానవ వేదన ఉంది, ఆనాడు ఈనాడు. ఆవేదనని అండగా చేసుకున్నారు ఆర్ద్ర హృదయం ఉన్న వీరందరూ. అందరినీ కదిలించింది ఆవేదనే. అదే బైరాగినీ, చాలా మందినీ కలవర పెట్టింది.
సమాజంలోని కుళ్ళును, జీవితంలోని కాఠిన్యాన్ని, ప్రపంచంలోని నగ్న సత్యాన్ని చూచి కంపించిన వారే నిజమైన ద్రష్టలు. కంపన, ఆ బాధ, వాళ్ళకు చైతన్యాన్ని కలిగిస్తుంది. అందులో కొందరినైనా కార్యశూరులుగా రూపొందిస్తుంది. ఆ చైతన్యం, పీడితులకు, ప్రొలిటేరియట్కు మాత్రమే పరిమితం కాదు. మనసున్న వారందరికీ విస్తరిస్తుంది. రష్యన్ విప్లవానికి ఆద్యులైన గోర్కీ లాంటి వారుగాని, దానికి సూత్రధారులైన లెనిన్ గానీ ప్రొలిటేరియట్ కాదు. అంతదాకా ఎందుకు? ఈనాడు మన సమాజం సమూలంగా మారాలని కోరేవారూ, అందుకు అంకితమైనవారు ప్రొలిటేరియట్ కాని వారూ ఎంత మంది లేరు? సమాజంలోని అన్యాయం వేదన పుట్టించగా, అన్యాయ నివారణకు మార్గాన్వేషకులైనారు. ఆ కోవకు చెందినవారే బైరాగి, అటువంటి తప్త హృదయులైన కవులు, రచయితలు, మరి చాలామందీ.
బైరాగి భాషను గురించి ఒక మాట చెప్పుకోవాలి. కవితలో ఉద్రేకం, తీక్షణం పొంగులు వారుతుంది గనుక, ఆ ఉద్వేగాన్ని సూచిస్తూ పదజాలం కూడా తీవ్రంగా ఉంటుంది; కఠినంగా ఉంటుంది, సమాసాలతో నిండి ఉంటుంది. భావంలోని బరువును భాషలోనూ, శైలిలోనూ ద్యోతకం చేస్తాడు బైరాగి. ఉద్వేగాన్ని శబ్దంలోనే చూపెట్టగల దిట్ట బైరాగి. కథ రాసేప్పుడు మాత్రం ఆ వచన రచన తీరు వేరు. అది సులభంగా, సుగమంగా ఉంటుంది.
చివరకు ఒక సంగతి. సంశయం కానివ్వండి, వేదన కానివ్వండి, ఆ అనుభూతి మాత్రమే పొంది ఊరుకోలేదు బైరాగి. సంశయానికి సమాధానం, వేదనకు నివారణ సూచన ప్రాయంగా చెప్పాడు. మచ్చుకు చూడండి, హామ్లెట్ స్వగతంలో:
“జ్ఞానం హోమాగ్ని, సర్వకర్మలు మసి చేయగలదు
నిజం, కాని కర్మ కూడ దానిని ఆర్పేయగలదు.
కర్మకు, జ్ఞానానికి శ్రుతి కుదిరినప్పుడు
ఎగిరే విహగాల కుండదావేదన
సంశయాన్ని చూచి స్వేచ్ఛ చెదరనపుడు
మానవున కుండదు తనతో వాదన.”
జ్ఞానంతో కూడిన కర్మ, వేదనకు నివారణోపాయం అంటాడు, ఒకే జ్యోతిలో:
“జ్యోతిని కోరే వారలు
జ్యోతి పూజారులు
ఈ జగజ్జీవన నిశీధిలో
నూతన మార్గం కొరకై
భూతల స్వర్గం కొరకై
వెదికే విప్లవకారులు
మీ ప్రాణం దివ్వెచేసి
మీ నెత్తురు చమురు పోసి
జ్యోతిని వెలిగించండి.
మీ హృదయపు తిరుగుబాటు
ఆరిపోని నిప్పు రవ్వ
ప్రపంచాన్ని మండించే
మంటల పంటలు పండించే
మీ బ్రతుకొక హారతిగా
జ్యోతిని పూజించండి!
జ్యోతిని ఆరాధించండి!”
మార్పు కావాలనే వారూ, కొత్త సమాజం కోరుకునే వారు త్యాగ దీక్షతో అంకితం కండి అని ప్రబోధిస్తున్నాడు. అంతేకాక:
“నాకొంచెం నమ్మకమివ్వు. కొండలుపిండి కొట్టేస్తాను.
నాదగు బాహుబంధనంలో విశాల బ్రహ్మాండాన్ని
చాపలాగా చుట్టేస్తాను — నాకొంచెం నమ్మకమివ్వు.”
అని ఆత్మ విశ్వాసం కోరుకుంటున్నాడు.
కాగా నేటిని యుగసంధిగా భావిస్తాడు బైరాగి. ఆ సంధిని ఎలా వర్ణించాడో చూద్దాం:
“త్రోవ కాచుకొని యున్నది,
నూతన యుగసంగీతం
మనస్సు ఊరిస్తున్నది
పురాణ జగద్వ్యామోహం
వదలక పీడిస్తున్నది
జీర్ణ జగతి కంఠ శోషలూ
నవ్యప్రగతి శంఖ ఘోషలూ
ఆవరించినవి మింటిని
కలచి వేసినవి మంటిని
…
అవి గిల గిల తన్నుకొనే
ప్రాతయుగపు ఘోర మరణ యాతనలూ!
ఇవి తళ తళ ఉదయించే
నూత్న జగతి వీర ప్రసవ వేదనలూ!
…
తిరుగుబాటు జెండాలా
ఆకాశం నెత్తురుతో రంగరించి అరుదెంచిన
సంధి యుగం! సంధియుగం!”
వేదన, సంశయం, మనిషిని పనికిమాలిన వానినిగా మార్చకూడదు. బాధకు, అన్యాయానికి, మనిషి కొంత కాలం తల ఒగ్గుతాడేమో కాని అంతకాలమూ కాదు. అతనిలోని మానవత్వం, అతనిలోని మనీషి మేల్కొంటాయి. నవమార్గానికై వెదుకుతాయి. మానవ నైజమే అది. మానవ చరిత్ర అదే. మానవ పరిణామమే అది.
నూతన అరుణోదయాన్ని, బైరాగి ఆశిస్తున్నాడు. అతని లక్ష్యం:
ఏదో సర్వ సంపూర్ణత, స్థిర సమగ్రసమాచీనత.
బహు వివరాల అంగాంగాల
అణువుల్లోంచి మూలకందపు టాత్మలోకి
క్షుద్రరేణుకణంనుంచి, మహమేరునగంవరకు
సంశబ్ద సాగరాల ఘోష నుంచి, మూగజీవాల భాష వరకు
అన్నిటికీ ఒక లయ, ఒక తాళం, ఒక రాగంలో మేళవించి
నాలో లోకం కొరకై, లోకం నా కొరకై
ఏకైక మహోద్రేకం ఉరికించాలని నా కోరిక.
అందుకు ‘కంఠం’ ఒక కంఠం కావాలి నాకు.
పుంఖాను పుంఖ శంఖాల మంటల ఘంటలా పలకగల ఒక కంఠం
కంఠం, నా కొక కంఠం,
మానవగీత ఆలపించే ఒక కంఠం.
అట్టి కంఠం ఆయన కలం నుంచి వచ్చిన ప్రతి పలుకులోనూ మారు మ్రోగుతోంది.
ఈ తెన్నున, వేదననుండి సంశయానికి, సంశయం నుండి బయటపడే బాటలోకి, పయనించి, ఆ బాటను చాటే వైతాళికుడైనాడు బైరాగి.
