బైరాగి గీతాలకు గానరూపం: అదే జ్యోతి

అదే జ్యోతి వెలిగించము దేవా!
ఇందు కిరణ మృదు మంద చరణముల
నందన వన మకరంద తుహినముల
గంధ శ్వసన స్వచ్ఛంద వ్యజనముల
ఏ ఆనందము జాలువారునో
అదే కాంతి కలిగించుము దేవా!
అదే జ్యోతి వెలిగించుము దేవా!

ప్రోద్ధత ఝంఝా ప్రశయ తర్జనల
కృద్ధ జలధి సంక్షుబ్ధ గర్జనల
భంగ తురంగమఫేన సర్జనల
ఏ విలోల కల్లోలమాడునో
అదే జ్వాల రగిలించుము దేవా!
అదే జ్యోతి వెలిగించుము దేవా!

జనని నయనద్వయ నీల నలినముల
స్వప్న సఘన వన హరిత పులినముల
శైశవ సుప్త స్మితాధర స్వనముల
ఏ దివ్యామృత మూటలూరునో
అదే శాంతి ప్రసరించము దేవా!
అదే జ్యోతి వెలిగించుము దేవా!