చ. అలఘుఝరీతరంగవిభ◊వాతిశయంబు కనద్వనీలతా
వలిమహిమల్ సరోలలిత◊వారిజవైఖరియున్ నగోజ్జ్వల
జ్జలదమహంబు తన్మహిప◊చంద్రసుతాంగవిభావిలాసముల్
దెలుపఁగఁ గాంచుచున్ జనియెఁ ◊ద్రిమ్మరునెమ్మదితోడ వీటికిన్. 155
టీక: అలఘుఝరీతరంగవిభవాతిశయంబు – అలఘు = అధికమగు, ఝరీ=సెలయేళ్ళయొక్క, తరంగ=అలలయొక్క, విభ వాతిశయంబు = సంపత్సమృద్ధి; కనద్వనీలతావలిమహిమల్ – కనత్=ప్రకాశించుచున్న, వనీ=వనములయందున్న, లతా = తీవెలయొక్క, ఆవలి = పంక్తులయొక్క, మహిమల్=అతిశయములు; సరోలలితవారిజవైఖరియున్ – సరః=సరస్సులందలి, లలిత=ఒప్పుచున్న, వారిజ=పద్మములయొక్క, వైఖరియున్=విధమును; నగోజ్జ్వలజ్జలదమహంబు – నగ=పర్వతముల యందు, ఉజ్జ్వలత్=ప్రకాశించుచున్న, జలద=మేఘములయొక్క, మహంబు =విలాసము; తన్మహిపచంద్రసుతాంగవిభావిలా సముల్ – తన్మహిపచంద్రసుతా = ఆరాజకుమారియగు చంద్రికయొక్క, అంగవిభావిలాసముల్=అంగములయొక్క కాంతి విశేషములను; తెలుపఁగన్=స్మరింపఁజేయుచుండఁగా; కాంచుచున్ = చూచుచు; త్రిమ్మరునెమ్మదితోడన్ = మిక్కిలి చలించు చున్న నిండుమనస్సుతోడ; వీటికిన్=నిజరాజధానికి; చనియెన్ = పోయెను. అనఁగా తరంగ,లతా,పద్మ,జలదములు చంద్రిక యొక్క వళులను,బాహువులను,కన్నులను,కొప్పును స్మరింపఁజేయుచుండఁగాఁ జూచుచుం బోయె నని భావము.
చ. తనపుర మంతఁ జేరి వసు◊ధాపతి భోటవరాటలాటము
ఖ్యనిఖిలదేశభూపతుల ◊నంచి నిజాంచితహైమమందిరం
బెనసి యనీహ మించ దిన◊కృత్యము లూన్చి విలాసహర్మ్యమౌ
ళి నలరుశయ్య నప్డు పవ◊ళించె నృపాలసుతైకమోహతన్. 156
టీక: అంతన్=అటుపైని; వసుధాపతి=సుచంద్రుఁడు; తనపురము=తనపత్తనమును; చేరి = పొంది; భోటవరాటలాటముఖ్య నిఖిలదేశభూపతులన్ = భోటవరాటలాటాదిసమస్తదేశప్రభువులను; అంచి = పంపి; నిజాంచితహైమమందిరంబు – నిజ = తన దగు, అంచిత=పూజ్యమయిన, హైమమందిరంబు = బంగరుమేడను; ఎనసి = పొంది; అనీహ = అరతి యను మన్మథావస్థ; మించన్=అతిశయింపఁగా;దినకృత్యములు=అవశ్యాచరణీయములగు సంధ్యాదికార్యములను; ఊన్చి=చేసి; విలాసహర్మ్య మౌళిన్=క్రీడాసౌధశ్రేష్ఠమందు; అలరుశయ్యన్=పువ్వుపఱపునందు; నృపాలసుతైకమోహతన్ =చంద్రికయందు ముఖ్యమైన ప్రీతిగలవాఁడగుటచేత; అప్డు = ఆసమయమున; పవళించెన్ = శయనించెను.
ఆశ్వాసాంతపద్యములు
మ. ప్రతిమాతీతగభీరతావిజితపా◊రావార, రావారసం
యతనానాశరకర్ణకోటరపృష◊త్కాసార, కాసారజాం
చితనేత్రాజనతామనోహరమహా◊శృంగార, శృంగారసం
భృతమార్గైకవిహారలాలసమనో◊బృందార, బృందారతా! 157
టీక: ప్రతిమాతీతగభీరతావిజితపారావార – ప్రతిమాతీత=సాటిలేనట్టి, గభీరతా=గాంభీర్యముచేత, ‘గాంభీర్య మవికార స్స్యాత్ సత్యపి క్షోభకారణే’ అని తల్లక్షణము, విజిత=గెలువఁబడిన, పారావార =సముద్రముగలవాఁడా! రావారసంయతనానా శరకర్ణకోటర పృషత్కాసార – రావ=ధ్వనిచేత, అర=శీఘ్రముగా, సంయత=నిరోధింపఁబడిన, నానా = వివిధములైన, ఆశర =రాక్షసులయొక్క, కర్ణకోటర=కర్ణరంధ్రములుగల, పృషత్క=బాణములయొక్క,ఆసార = వర్షధార గలవాఁడా! కాసార జాంచితనేత్రా జనతామనోహరమహాశృంగార – కాసారజ=పద్మములవలె, అంచిత=ఒప్పుచున్న, నేత్రా= కన్నులుగల స్త్రీల యొక్క, జనతా=సంఘములకు, మనోహర=మనోజ్ఞమగు, మహత్=అధికమైన, శృంగార =అలంకారములుగలవాఁడా! శృంగారసంభృత మార్గైకవిహారలాలసమనోబృందార – శృంగార=శృంగారరసముచేత, సంభృత=మిగులఁ బోషింపఁబడిన, మార్గ =మార్గమునందలి, ఏక=ముఖ్యమగు, విహార=క్రీడయందు, లాలస=ఆసక్తిగల, మనః=మనస్సుగల, బృందార= దేవుఁడా! బృందారతా = బృందాదేవియందు రతుఁడగువాఁడా! ఈకృతిపతిసంబోధనములకు, నుత్తరపద్యములందలి తత్సంబోధనములకును ‘ఇది’ యను నాశ్వాసాంతిమగద్యముతో నన్వయము.
క. రణభీమ! భీమనుతవా, రణవిజయైకాభిరామ! ◊రామాత్మకకా
రణధామ! ధామనిధికై,రణరాజద్భామ! భామ◊రహితాచరణా! 158
టీక: రణభీమ = యుద్ధమున భయంకరుఁడవైనవాఁడా! భీమనుతవారణవిజయైకాభిరామ – భీమ=శివునిచేత, నుత=కొని యాడఁబడిన, వారణ=కువలయాపీడమను గజముయొక్క, విజయ = గెలుపుచేత, ఏక=ముఖ్యమగునట్లుగా, అభిరామ = ఒప్పెడువాఁడా! రామాత్మకకారణధామ – రామా=స్త్రీలయొక్క, ఆత్మ=మనస్సులయొక్క, క=సుఖమునకు, కారణ=హేతు వగు, ధామ=దేహముగలవాఁడా! ‘ధామ దేహే గృహేపి చ’ అని విశ్వము; ధామనిధికైరణరాజద్భామ – ధామనిధి=సూర్యుని యొక్క, కైరణ=కిరణసంఘముభంగి, రాజత్=ప్రకాశించుచున్న, భామ=దీప్తిసంపదగలవాఁడా! భామరహితాచరణా =క్రోధ రహితమగు నాచరణముగలవాఁడా! ఈ రెండుపద్యములందును ముక్తపదగ్రస్తమను శబ్దాలంకారము.
కవిరాజవిరాజితము. నరకవిభేదన, నారజఖాదన, ◊నారదవాదనకేళి, దరీ,
యరిగణశాదనవారుణపాద, న◊యాంచితవాదన, భూరిదరీ
చరరిపుమాద, నరాశ్వవిచోదన, ◊సారఫలార్జనవార్జహరీ,
పరనిజపాదనతావన, రాదన◊భాజితకుంద, నరేశ, హరీ! 159
టీక: నరకవిభేదన = నరకాసురనకు భేదకుఁడైనవాఁడా! నారజఖాదన = అగ్నిభక్షకుఁడవైనవాఁడా! నారదవాదనకేళి = నార దునియొక్క వీణావాద్యమందుఁ గ్రీడగలవాఁడా! దరీ=శంఖముగలవాఁడా! అరిగణశాదనవారుణపాద = అరిగణ మనెడు పంకమునకు నూతనసూర్యరూపుఁడవైనవాఁడా! నయాంచితవాదన =నీతియుక్తమైన వచనముగలవాఁడా! భూరిదరీచరరిపు మాద – భూరి=అధికములగు, దరీ=గుహలయందు, చర=సంచరించుచున్న, రిపు=శత్రువులయొక్క, మా=సిరిని, ద= ఖండించినవాఁడా! నరాశ్వవిచోదన = అర్జునునియొక్క గుఱ్ఱములను దోలువాఁడా, అనఁగా పార్థసారథియైనవాఁడా! సార ఫలార్జనవార్జహరీ – సార=శ్రేష్ఠమగు, ఫల=మోక్షాదిఫలముయొక్క, ఆర్జన=సంపాదన మనెడు, వార్జ=కమలములకు, హరీ = సూర్యరూపుఁడవైనవాఁడా! పరనిజపాదనతావన = శ్రేష్ఠములగు తనయొక్క పాదములయందు నతులైనవారిని రక్షించు వాఁడా! రాదనభాజితకుంద – రాదన=దంతసంబంధమైన, భా=కాంతిచేత, జిత=జయింపఁబడిన, కుంద=మొల్లలుగలవాఁడా! నరేశ = పురుషోత్తముఁడా! హరీ =మదనగోపాలస్వామీ!
గద్య: ఇది శ్రీమదనగోపాలప్రసాదసమాసాదితోభయభాషాకవిత్వకళాకళత్ర రేచర్లగోత్రపవిత్ర సురభిమల్లక్షమాపాలసత్పుత్ర కవిజనవిధేయ మాధవరాయప్రణీతంబైన చంద్రికాపరిణయంబను మహాప్రబంధంబునందుఁ దృతీయాశ్వాసము.
గద్యము: ఇది శ్రీసతీరమణకరుణాసమాసాదిత సర్వసౌభాగ్య, భాగ్యనగరమహారాజ్యసంకలిత శ్రీజటప్రోలు సంస్థానప్రాజ్యసకలసామ్రాజ్య, శ్రీ రేచర్లగోత్రపవిత్ర కవిజనగేయ శ్రీవేంకటజగన్నాథరాయ సత్పుత్ర, సత్సంప్రదాయ, శ్రీసురభి వేంకటలక్ష్మణరాయ పరిపోష్య, సరసవైదుష్య,తదాస్థానతలమండిత శేషసదాశివపండిత విరచిత శరదాగమసమాఖ్య వ్యాఖ్యయందు తృతీయాశ్వాసము సంపూర్ణము.