చ. అళినికరంబు కీలుజడ, ◊యందపుఁగెందలిరాకు మోవి, ని
స్తలతరమంజరుల్ మెఱుఁగుఁ◊జన్నులు, మొగ్గలచాల్ పదాంబుజ
స్థలనఖపాళి గాఁగ, వన◊ధాత్రిఁ గనంబడుతీవ లెల్ల నా
చెలిసొబ గానృపాలు మదిఁ ◊జేర్చి భ్రమింపఁగఁజేసె నయ్యెడన్. 93
టీక: అయ్యెడన్ = ఆసమయమందు; అళినికరంబు =తుమ్మెదలగుంపు; కీలుజడ = జాఱవిడిచిన జడయును; అందపుఁగెందలి రాకు = అందమయిన ఎఱ్ఱనిచిగురాకు; మోవి =అధరంబును; నిస్తలతరమంజరుల్=వట్రువులగు పువ్వుగుత్తులు; మెఱుఁగుఁ జన్నులు = ప్రకాశించు కుచములును; మొగ్గలచాల్=మొగ్గలగుంపు; పదాంబుజస్థలనఖపాళి = పాదకమలములయందుండు గోరులచాలును; కాఁగన్=అగుచుండఁగా; వనధాత్రిన్=ఉద్యానవనభూమియందు; కనంబడుతీవలు ఎల్లన్ = కననగుచున్న లత లెల్ల; ఆచెలిసొబగు=ఆచంద్రికయందమును; ఆనృపాలు మదిన్=ఆరాజుమనమునందు; చేర్చి; భ్రమింపఁగఁజేసెన్ = భ్రమ నొందునట్లు చేసెను.
అనఁగాఁ బైఁజెప్పిన చొప్పున నొప్పులతలెల్లఁ జంద్రికావయవములసొబగుఁ గాన్పించి, యారాజు ననంగదశలలోని యున్మాదావస్థ నొందునట్లు చేయు ననుట. ‘సర్వావస్థాసు సర్వత్ర తన్మనస్కతయా సదా| అతస్మిన్ తదితి భ్రాన్తి రున్మాదో విరహోద్భవః’ ఇట్లుక్తలక్షణలక్షితం బగునున్మాద మను ననంగదశావిశేష మిందు వచింపఁబడియె. ఇట్లు శారి పూఁబొదఁ జేరి యను క్రిందిపద్యమునందును దెలియవలయు.
సీ. కమ్మపుప్పొడిగాడ్పు ◊గ్రమ్మ నొప్పగుబండి,గురివెందవిరిగుత్తి◊కొమరుఁ జూచి,
యలరు సంపెఁగతీవ ◊యలమ నింపుగఁ దోఁచు,కలికిక్రొమ్మల్లియ◊చెలువుఁ జూచి,
మగతేఁటి వేడ్క మిం◊చఁగ ముద్దుగొనిన చ,క్కనిమెట్టదామర◊కళుకుఁ జూచి,
సొలపుచక్కెరతిండి◊పులుఁగు నొక్కెడిబింబి,కాపక్వఫలముపొం◊కంబుఁ జూచి,
తే. తరుణిచనుదోయి, కెంపుగం◊దవొడిఁ బూసి, చెలువనెమ్మేను కౌఁగిటఁ ◊జేర్చి కొమ్మ
మోము ముద్దిడి, పూఁబోణి◊మోవిఁ గ్రోలి, చెలఁగు టెపు డబ్బునో యంచుఁ ◊దలఁచు నృపతి. 94
టీక: నృపతి=సుచంద్రుఁడు; కమ్మపుప్పొడిగాడ్పు=కమ్మనిపుప్పొడిసంబంధి యగు వాయువు; క్రమ్మన్=ప్రసరింపఁగా; ఒప్పగు బండిగురివెందవిరిగుత్తికొమరున్=ఒప్పిదమగు బండిగురివెందపూగుత్తియొక్క సౌందర్యమును; చూచి=వీక్షించి; అలరు సంపెఁగతీవ = ప్రకాశించు చంపకలత; అలమన్=ఆక్రమింపఁగా; ఇంపుగన్=ఇంపగునట్లు; తోఁచు కలికిక్రొమ్మల్లియ చెలువున్ =తోఁచుచున్న యందమగు నూత్నమల్లికయొక్క యందమును; చూచి=వీక్షించి; మగతేఁటి =గండుతుమ్మెద; వేడ్కన్=ఉత్సవము; మించఁగన్=అతిశయించునట్లు; ముద్దుగొనిన =చుంబించిన; చక్కనిమెట్ట దామరకళుకున్ = అందమైన మెట్టదామరయొక్క చక్కఁదనమును; చూచి=వీక్షించి;
సొలపుచక్కెరతిండిపులుఁగు =పరవశమయిన శుకపక్షి; నొక్కెడిబింబికాపక్వఫలముపొంకంబున్ = కొఱుకుచున్న పండిన దొండపండుయొక్క యందమును; చూచి=వీక్షించి; తరుణిచనుదోయి =చంద్రికాకుచయుగ్మమును; కెంపుగందవొడిఁ బూసి=ఎఱ్ఱనిగందపొడిచేఁ బూసి; చెలువనెమ్మేను= సుందరి యొక్క యందమైన శరీరమును; కౌఁగిటన్ చేర్చి = ఆలింగనముఁజేసికొని; కొమ్మమోము=ఆస్త్రీముఖమును; ముద్దిడి=చుంబ నము చేసి; పూఁబోణిమోవిన్ = ఆనారియధరమును; క్రోలి = పానముఁజేసి; చెలఁగుట = ప్రకాశించుట; ఎపుడబ్బునో = ఎపుడు కలుగునో; అంచున్ ; తలఁచున్=స్మరించును.
అనఁగా బండిగురివెందవిరిగుత్తి చన్దోయిగను, దానిపైఁ గ్రమ్ము పుప్పొడి కెంపుగందవొడిగను, సంపెంగచేఁ జుట్టఁబడిన మల్లియ పురుషాలింగితతన్వంగిగాను, మగతేటిచేఁ జుంబితమైన మెట్టదామర పురుషచుంబితస్త్రీముఖముగను, శుకతుండ ఖండితమగు బింబఫలము దంతక్షతమైన స్త్రీ యధరముగాను దోఁచి యారాజు చంద్రికాస్తనయుగ్మాలింగనాధరచుంబనాదు లెపు డబ్బునో యని స్మరించె ననుట. ఇట ననుస్మృతి యను ననంగదశ చెప్పఁబడియె. ‘ముహుర్ముహు ర్నిశ్వసితై ర్మనోరథ విచిన్తనైః| ప్రద్వేష స్త్వన్యకార్యాణా మనుస్మృతి రుదాహృతా’ అని నాట్యశాస్త్రమందుఁ దల్లక్షణము.
సీ. ఎంతమాధవదయా◊సంతానసంసిద్ధిఁ, బొలిచెనో యిచ్చటి◊తిలకపాళి,
యెంతపుణ్యద్విజా◊ధీశసంసేవన, వఱలెనో యిచ్చటి◊చిఱుతమావి,
యెంతమహాసవో◊ద్ధృతిగతాత్మసుమాప్తి, మనియెనో యిచ్చటి◊కనకరాజి,
యెంతసదాళిచి◊త్తేష్టదానస్ఫూర్తి, వెలసెనో యిచ్చటి◊కలికిక్రోవి,
తే. చెలికటాక్షైకధారచేఁ ◊జెలఁగ నెలఁత, పాణిలాలనమున మించఁ ◊ బడఁతిమోము
గని యలర, నాతిపరిరంభ◊గరిమఁ జొక్క, ననుచు నృపమౌళి కడుఁజింతఁ ◊బెనుచు మదిని. 95
టీక: ఇచ్చటితిలకపాళి = ఈవని నున్న బొట్టుగులగుంపు; ఎంతమాధవదయాసంతానసంసిద్ధిన్ = ఎంత విష్ణువుయొక్క కరుణాసముదయసంసిద్ధిచేత, ఎంత వసంతదయాసముదయసంసిద్ధిచేత నని స్వభావార్థము; పొలిచెనో = ఉదయించెనో, ఇచ్చటిచిఱుతమావి = ఇటనున్న చిన్నిమావి; ఎంతపుణ్యద్విజాధీశసంసేవనన్ = ఎంత పుణ్యవంతులైన విప్రశ్రేష్ఠులసేవచేత, ఎంత మనోజ్ఞములగు పక్షిశ్రేష్ఠములయొక్క సేవచేత నని వాస్తవార్థము, ‘పుణ్య మ్మనోజ్ఞేఽభిహితం తథా సుకృత ధర్మయోః’ అని విశ్వము; వఱలెనో =ఒప్పెనో, ఇచ్చటికనకరాజి =ఈయుద్యానవనమందలి సంపెఁగచాలు; ఎంతమహాసవోద్ధృతిగతాత్మసుమాప్తిన్ – ఎంతమహాసవ = ఎంతగొప్పయజ్ఞములయొక్క, ఉద్ధృతి=పోషణముచేత, గత=పొందఁబడిన, ఆత్మ=తమయొక్క, సు=లెస్సయిన, మా= సంపదయొక్క, ఆప్తిన్=ప్రాప్తిచేత; ఎంత, మహత్=అధికమైన, ఆసవ=పూఁదేనియయొక్క, ఉద్ధృతి=భరణమును, గత= పొందిన, ఆత్మ=తమయొక్క, సుమాప్తిన్= కుసుమములప్రాప్తిచేత నని వాస్తవాభిప్రాయము; మనియెనో=పెంపొందెనో, ఇచ్చటికలికిక్రోవి =ఇందలి యందమగు గోరింట; ఎంతసదాళిచిత్తేష్టదానస్ఫూర్తిన్ – ఎంత, సదాళి=సత్పురుషులగుంపు యొక్క, చిత్త=చిత్తములకు, ఇష్టదాన = ఇష్టములైన వస్తువుల ప్రదానముయొక్క, స్ఫూర్తిన్ =విస్ఫురణముచేత; ఎంత, సదా= ఎల్లప్పుడు, అళి=తుమ్మెదలయొక్క, ఇట సదాశబ్ద మళిశబ్దముతో ‘సుప్సుపా’ అని సమసించినది, చిత్త=చిత్తములకు, ఇష్టదాన = ఇష్టమైన పుష్పాసవప్రదానముయొక్క, స్ఫూర్తిన్ =విస్ఫురణముచేత నని వాస్తవాశయము; వెలసెనో = ప్రకాశించెనో,చెలికటాక్షైకధారచేన్ = చంద్రికయొక్క క్రేగంటిచూపులపరంపరచేత; చెలఁగన్=ఒప్పుటకు; నెలఁతపాణిలాలనమునన్ = ఆమె హస్తముచే లాలించుటవలన; మించన్=అతిశయించుటకు; పడఁతిమోము గని =ఆమెయొక్కముఖమును గాంచి; అలరన్ = సంతసించుటకు; నాతిపరిరంభగరిమన్=ఆమె యాలింగనాతిశయముచేత;చొక్కన్=సుఖపరవశత నొందుటకును; అనుచున్ =ఇట్లనుచు; నృపమౌళి =రాజశ్రేష్ఠుఁడు; మదిని=హృదయమునందు; కడున్=మిక్కిలి; చింతన్=విచారమును; పెనుచున్= వృద్ధిఁ బొందించుకొనును.
అనఁగాఁ దిలకపాళి, చిఱుతమావి, కనకరాజి, కలికిక్రోవి అంత లోకోత్తరనాయికా కటాక్షప్రసార,కరలాలన, ముఖదర్శన, పరిరంభములచే నలరుట దుర్ఘటము గావున నవి యెంతో మాధవదయాసంసిద్ధి, ద్విజాతిసేవనాదులు పొందియుండవలెననుట. బొట్టుగులకు స్త్రీకటాక్షవీక్షణంబు, మావులకు స్త్రీకరలాలనంబు, సంపెఁగలకు స్త్రీముఖదర్శనంబు, గోరంటలకు స్త్రీపరిరంభంబు దోహదములు గావునఁ గటాక్షవీక్షణాదులచే నవి సంతసించుట స్వభావసిద్ధంబని కవిహృదయంబు. ‘తరుగుల్మలతాదీనా మకాలే ఫలపుష్పయోః| ఆధానాయ క్రియా యా స్యా త్స దోహద ఇతీర్యతే| ఆలిఙ్గనా త్కురవక శ్చమ్పకో ముఖదర్శనాత్| చూతో యోషిత్కరస్పర్శా త్తిలకో దృక్ప్రసారణాత్| ఆకర్ణనా త్కర్ణికార స్త్వశోకః పాదతాడనాత్|దాడిమీ ధూమసందోహా త్ప్రియాళు ర్గానసంపదః|’ ఇత్యాదిగా దోహదలక్షణములు. ఏతద్విశేషంబులుకొన్ని ద్వితీయాశ్వాసమున వ్రాయఁబడియె.
మ. నవలా యేగినదారిఁ గాంచు, మదిఁ ద◊న్నాళీకపత్త్రేక్షణా
నవలావణ్యవిశేష మెంచు, వలవం◊తం జాలఁ జింతించు, రా
జవలారాతి తదేకమోహలహరీ◊సంసక్తచిత్తంబునన్
గువలాస్త్రాతినిశాతసాయకశిఖా◊కుంఠీభవద్ధైర్యుఁడై. 96
టీక: రాజవలారాతి (రాజ+బలారాతి)=రాజేంద్రుఁడు, ‘శసయో ర్బవయో స్తథా’ అనుటచేత బవలకు భేదంబులేమి కవి వ్యవ హారసిద్ధమని వెనుక వ్రాయంబడియె; తదేకమోహలహరీసంసక్తచిత్తంబుననన్ – తత్=ఆచంద్రికయందు, ఏక= ముఖ్యమగు, మోహలహరీ=మోహప్రవాహముతో, సంసక్త=కూడుకొన్నట్టి, చిత్తంబునన్=మనస్సుచేత; కువలాస్త్రాతినిశాతసాయకశిఖా కుంఠీభవద్ధైర్యుఁడై – కువలాస్త్ర=మరునియొక్క, అతినిశాత=మిక్కిలితీక్ష్ణములగు, సాయక= బాణములయొక్క,శిఖా = జ్వాలలచేత, కుంఠీభవత్=తగ్గుచున్న, ధైర్యుఁడై =ధైర్యము గలవాఁడయి; నవలా యేగినదారిన్= చంద్రిక పోయిన త్రోవను; కాంచున్=చూచును; మదిన్=హృదయమునందు; తన్నాళీకపత్త్రేక్షణానవలావణ్యవిశేషము – తన్నాళీకపత్త్రేక్షణా = ఆకమల నయనయగు చంద్రికయొక్క, నవ=నూతనమగు, లావణ్యవిశేషము=విలక్షణలావణ్యమును; ఎంచున్=ప్రశంసించును; వల వంతన్=మన్మథవ్యథచేత; చాలన్=మిక్కిలి; చింతించున్=చింతసేయును.
చ. నరవిభుఁ డిట్లు తత్సతియ◊నర్గళమోహగతిం భ్రమింపఁ గి
న్నరపతి యప్డుచేరి మహి◊నాయక యీగతి వంత నాత్మ నుం
తురె నినుఁ బ్రేమఁ జూచిన వ◊ధూమణి నింతకు మున్నె యేఁచెఁ ద
త్స్మరశరకోటి త్వద్గతస◊మగ్రమనోరథగా ఘటించుచున్. 97
టీక: నరవిభుఁడు=సుచంద్రుఁడు; ఇట్లు=ఈప్రకారముగ; తత్సతియనర్గళమోహగతిన్ = ఆచంద్రికావిషయకమైన యనివార్య మగు మోహరీతిచేత; భ్రమింపన్=చిత్తభ్రమనొందఁగా; కిన్నరపతి = కుముదుఁడు; అప్డు; చేరి = ఆరాజు సమీపమునొంది; మహి నాయక =ఓరాజా! ఈగతిన్=ఈరీతిగ; వంతన్=సంతాపమునందు; ఆత్మన్=చిత్తమును; ఉంతురె =ఉంచుదురా? నినున్; ప్రేమన్=ఆసక్తిచేత; చూచినవధూమణిన్=అవలోకించిన యాస్త్రీరత్నమును; ఇంతకున్ మున్నె=ఇంతకుఁ బూర్వమె; తత్స్మర శర కోటి = ఆమన్మథుని మార్గణపరంపర; త్వద్గతసమగ్రమనోరథ=నీయందుఁ గలిగిన సమగ్రాభిలాషగలది; కాన్=అగునట్లు; ఘటించుచున్ =చేయుచు; ఏఁచెన్=బాధించెను. స్మరుఁడు మున్నే చంద్రికను నీసంగమము నభిలషించుదానిఁగా గావించుటం జేసి తనంతనే కార్యసిద్ధి యగుఁగాన దానికై నీవు చితింపఁ బని లేదని తాత్పర్యము.
క. నీలాలక వరియించెద,వేలా వలవంత మేది◊నీశ్వర యన నా
కాలాబ్జవిమతకులజన,పాలాగ్రణి కూటధృతివిభాస్వన్మతితోన్. 98
టీక: మేదినీశ్వర=సుచంద్రుఁడా! నీలాలకన్=చంద్రికను; వరియించెదవు=పెండ్లియాడెద వనుట; వలవంత = మన్మథవ్యథ; ఏలా=ఎందుకు? అనన్= కుముదుఁ డిట్లు వచింపఁగా; ఆకాలాబ్జవిమతకులజనపాలాగ్రణి – కాలాబ్జవిమత=నీలోత్పలవిరోధి యగు సూర్యునియొక్క, కుల = వంశస్థులైన, జనపాల=రాజులయందు, అగ్రణి =శ్రేష్ఠుఁడైన యా సుచంద్రుఁడు; కూటధృతి విభాస్వన్మతితోన్=నిశ్చలమైన ధైర్యముచే నొప్పుచున్న మదితోడ, దీని కుత్తరపద్యస్థమగు ‘పనిచె’ నను క్రియతో నన్వయము.
తే. గగనయానోత్తమస్యద◊గతి ధరిత్రి,నగరకాననకుధరసం◊తతులఁ గనుచుఁ
జని తనబలంబు నెనసి యా◊క్ష్మావిభుండు, కూర్మి గనుపట్ట నంత నా◊కుముదుఁ బనిచె. 99
టీక: ఆక్ష్మావిభుండు = ఆరాజు; గగనయానోత్తమస్యదగతిన్ – గగనయానోత్తమ = ఉత్తమవిమానముయొక్క, స్యద = వేగముయొక్క, ‘రయ స్యదః’ అని యమరుఁడు, గతిన్ =తీరుచేత; ధరిత్రిన్=భూమియందు; నగరకాననకుధరసంతతులన్ =పురారణ్యపర్వతములగుంపులను; కనుచున్=చూచుచు; చని=పోయి; తనబలంబున్=తన సైన్యమును; ఎనసి=చేరి; కూర్మి=ప్రేమము; కనుపట్టన్=కనఁబడునట్లు; అంతన్; ఆకుముదున్= పైఁజెప్పిన కుముదుని; పనిచెన్=పంపివేసెను.
చ. మును మునితోడఁ బల్కిన య◊మూల్యనిజోక్తిఁ దలంచి యారసా
జనపతిమౌళి సత్వరత ◊సంగరభూమిఁ దమిస్రదానవేం
ద్రుని వధియింతు నంచు లలి◊తోఁ దపనీయరథాధిరూఢుఁడై
చనియె రణానకప్రకర◊సాంద్రరుతుల్ దెస లెల్లఁ గ్రమ్మఁగన్. 100
టీక: మును =పూర్వమున; మునితోడన్=శాండిల్యునితోడ; పల్కిన యమూల్యనిజోక్తిన్ = వచించినట్టి యనర్ఘమగు తన మాటను; తలంచి = స్మరించి; ఆరసాజనపతిమౌళి = ఆరాజశేఖరుఁ డగు సుచంద్రుఁడు; సత్వరతన్=వేగముచేత; సంగర భూమిన్ = యుద్ధభూమియందు; తమిస్రదానవేంద్రునిన్ = తమిస్రాసురుని; వధియింతున్ అంచున్= సంహరింతు ననుచు; లలితోన్=ప్రీతితోడ; తపనీయరథాధిరూఢుఁడై = కనకరథము నధిష్ఠించినవాఁడగుచు; రణానకప్రకరసాంద్రరుతుల్ – రణ = యుద్ధసంబంధమైన, ఆనకప్రకర=భేరీసంఘముయొక్క, ‘ఆనకః పటహో స్త్రీ స్యాత్’ అని యమరుఁడు,సాంద్ర=దట్టములగు, రుతుల్=ధ్వనులు; దెసలు ఎల్లన్= దిక్కులనెల్లను; క్రమ్మఁగన్=ఆవరింపఁగా; చనియెన్=పోయెను.
సీ. అతులరింఖోద్భవ◊క్షితిధూళి నానాశ,రాధీశమహిమఁ బో◊నాడు హయము,
లతిశాతదంతప్ర◊హతిఁ గర్బురాచల,స్థితి నెల్ల మాయించు ◊ద్విరదచయము,
లలఘుకేతనమారు◊తాళి మహాసురో,త్తమమండలిఁ దెరల్చు ◊విమలరథము,
లాత్మభాసురసమా◊ఖ్యాశక్తి యామినీ,చరభయంబు ఘటించు ◊సద్భటేంద్రు,
తే. లపుడు వేవేలు గొలువ, న◊య్యవనిభర్త, యిటులు కల్యాణమయరథం ◊బెక్కి వేగ
శిశిరగిరిఁ జేర నరిగె న◊క్షీణదనుజ,దళనచణదివ్యసాధనోద్భాసి యగుచు. 101
టీక: అతులరింఖోద్భవక్షితిధూళిన్ – అతుల=సాటిలేని, రింఖా=ఖురములచేత, ఉద్భవ=ఉదయించిన, క్షితిధూళిన్ = భూ పరాగముచేత; నానాశరాధీశమహిమన్ – నానా=అనేకప్రకారములగు, శరాధీశ=సముద్రములయొక్క, మహిమన్ = అతి శయమును, అనేకప్రకారులగు, ఆశరాధీశుల లనఁగా రాక్షసేశ్వరులయొక్క మహిమను నని యర్థాంతరధ్వని, ‘క్రవ్యాదో స్రప ఆశరః’ అని యమరుఁడు; పోనాడు హయములు = పోఁగొట్టెడు నశ్వములు; అతిశాతదంతప్రహతిన్=మిక్కిలితీక్ష్ణములగు దంతములయొక్క ప్రహారములచేత; కర్బురాచలస్థితిన్=మేరుపర్వతస్థితిని, రాక్షసులయొక్క స్థిరమైన స్థితి నని యర్థాంతరము, ‘గాఙ్గేయం భర్మ కర్బురమ్’, ‘రాత్రించరో రాత్రిచరః కర్బురః’ అని యమ రుఁడు; ఎల్లన్; మాయించు = మాపుచున్న; ద్విరదచయము =గజసమూహము; అలఘుకేతనమారుతాళిన్ – అలఘు=అధికమగు, కేతన=ధ్వజములయొక్క, మారుతాళిన్=వాతజాతముచేత; మహాసురో త్తమమండలిన్ – మహత్=అధికమగు, సురోత్తమమండలిన్=సూర్యపుంజమును, ద్వాదశాదిత్యుల ననుట, ‘సురోత్తమో ధామనిధిః పద్మినీవల్లభో హరిః’అని యమరుఁడు, గొప్ప యసురోత్తమమండలి నని యర్థాంతరము; తెరల్చువిమలరథములు=పోఁగొట్టుచున్న నిర్మలమైన రథములు; ఆత్మభాసురసమాఖ్యాశక్తిన్ – ఆత్మ=తమయొక్క, భాసుర=ప్రకాశమానమగు, సమాఖ్యా=యశముయొక్క, శక్తిన్=సామ ర్థ్యముచేత; యామినీచరభయంబు – యామినీచర=చంద్రునియొక్క, రాక్షసులయొక్క యని యర్థాంతరము, భయంబు = భీతిని; ఘటించుసద్భటేంద్రులు = చేయు శ్రేష్ఠభటనాయకులు; అపుడు = ఆసమయమున; వేవేలు = అనేకసహస్రములు; కొలువన్=సేవింపఁగా; అయ్యవనిభర్త=ఆరాజు; ఇటులు =ఈరీతి గా; కల్యాణమయరథంబు = బంగరుతేరును, మంగళమయమయినరథము నని యర్థాంతరము, ‘కల్యాణ మర్జునం భూరి’ అని యమరుఁడు; ఎక్కి=అధిష్ఠించి; అక్షీణదనుజదళనచణదివ్యసాధనోద్భాసి – అక్షీణ= తక్కువగానట్టి, ఇది సాధనశబ్దము నకు విశేషణము, దనుజదళనచణ = రాక్షససంహారమునకు సమర్థమగు, దివ్య=లోకోత్తరమైన,సాధన=శరాదిసామగ్రిచేత, ఉద్భాసి=ప్రకాశించువాఁడు; అగుచున్; వేగ=వేగముగా; శిశిరగిరిన్=హిమవత్పర్వతమును; చేరన్ అరిగెన్ = పొందునట్లు చనెను. అనఁగా ఖురధూళిచే సముద్రమహిమ నపహరించు హయములును, దంతప్రహారములచేఁ గాంచనాచలము రూపు మాపు గజములును, గేతనవాతముచే సూర్యమండలిని దెరల్చు రథములును, నిజతేజములచేఁ జంద్రుని భయపెట్టు భటశ్రేష్ఠు లును గొలుచుచుండ స్వర్ణమయరథంబు నెక్కి సుచంద్రుఁడు రాక్షససంహారసాధనసహస్రంబుతో శిశిరగిరిం జేరె ననుట.