మ. నరనాథేంద్రభటుల్ సురారిభటులున్ ◊స్వస్వాభిధాశౌర్యముల్
వరుసం దెల్పుచుఁ బోరి రుగ్రరణఖే◊లాపాండితిన్ నిర్జరో
త్కరముల్ వ్యోమవితర్దిఁ జేరి యని ఖ◊డ్గాఖడ్గిలీలల్ శరా
శరియుజ్జృంభణముల్ గదాగదివిలా◊సంబుల్ మదిన్ మెచ్చగన్. 111
టీక: నిర్జరోత్కరముల్=దేవతాసంఘములు; వ్యోమవితర్దిన్=గగనమను వేదికను; చేరి=పొంది; అనిన్=యుద్ధమందలి; ఖడ్గా ఖడ్గిలీలల్ =ఖడ్గములచేఁ జేయు యుద్ధక్రియలను; శరాశరియుజ్జృంభణముల్=బాణములచేఁ జేయు యుద్ధవిజృంభణలను; గదాగదివిలాసంబుల్=గదలతోఁ జేయు యుద్ధవిలసనములను; మదిన్=చిత్తమందు; మెచ్చగన్=కొనియాడఁగా; నరనాథేంద్ర భటుల్= రాజభటులును; సురారిభటులున్=రాక్షసభటులును; స్వస్వాభిధాశౌర్యముల్=తమతమపేళ్ళను, పరాక్రమములను; వరుసన్=క్రమముగా; తెల్పుచున్=తెలియఁజేయుచు; ఉగ్రరణఖేలాపాండితిన్ – ఉగ్ర=భయంకరమగు, రణ=యుద్ధమనెడు, ఖేలా=క్రీడయొక్క, పాండితిన్=పాండిత్యముచేత; పోరిరి=యుద్ధముఁ జేసిరి.
శా. ఆలో నాదిననాథవంశమణి చ◊క్రాంగోత్తమాస్థానిఁ బ్ర
త్యాలీఢస్థితిఁ బొల్చి కుండలితబా◊ణాసోజ్జ్వలత్పాణియై
చాలన్ శింజినికానినాదమున నా◊శావీథి మేల్కాంచ ని
ర్వేలాస్త్రప్రకరంబు నించె నసుహృ◊ద్వీరాసుహృద్వృత్తిచేన్. 112
టీక: ఆలోన్=అంతలో; ఆదిననాథవంశమణి = ఆసూర్యవంశశ్రేష్ఠుఁడగు సుచంద్రుఁడు; చక్రాంగోత్తమాస్థానిన్ =ఉత్తమరథమను నాస్థానమునందు; ప్రత్యాలీఢస్థితిన్=స్థానవిశేషస్థితిచేత, అనఁగా నెడమకాలును ముందుకుఁ జాఁపి నిల్చి యనుట, ‘స్యాత్ ప్ర త్యాలీఢ మాలీఢ మిత్యాదిస్థానపంచకమ్’ అని యమరుఁడు; పొల్చి = ఒప్పి; కుండలితబాణాసోజ్జ్వలత్పాణియై – కుండలిత = కుండలాకారముగఁ జేయఁబడిన, బాణాస=ధనుస్సుచేత, ఉజ్జ్వలత్=ప్రకాశించుచున్న, పాణియై =హస్తముగలవాఁడై; చాలన్=మిక్కిలి; శింజినికానినాదమునన్ =అల్లెత్రాటిధ్వనిచేత; ఆశావీథి=దిక్ప్రదేశము; మేల్కాంచన్=మేల్కొనఁగా, అనఁగా దిగంతములవఱకు శింజానాదము వ్యాపింపఁగా; నిర్వేలాస్త్రప్రకరంబు = అధికములగు బాణములగుంపులు; అసుహృద్వీరాసు హృద్వృత్తిచేన్ – అసుహృద్వీర = శత్రువీరులయొక్క, అసుహృత్=ప్రాణములుహరించుచున్న, వృత్తిచేన్=వర్తనముచేత; నించెన్=పూరించెను.
మ. పరబర్హ్యుద్ధతిఁ దూల్చి తార్క్ష్యహరణ◊ప్రౌఢిన్ విజృంభించి ని
ర్భరశక్తిన్ ధర గాఁడి పాఱె నలగో◊త్రాభృన్మహాజిహ్మగో
త్కరముల్ తద్విహృతిప్రకారభయరే◊ఖావన్మహాజిహ్మగో
త్కరమున్ నిందయొనర్పఁ దత్పురము వే◊గం జేరు చందంబునన్. 113
టీక: అలగోత్రాభృన్మహాజిహ్మగోత్కరముల్ – అలగోత్రాభృత్=ఆసుచంద్రునియొక్క, మహత్=గొప్పలైన, అజిహ్మగ=
బాణములయొక్క, ‘అజిహ్మగ ఖగాశుగాః’ అని యమరుఁడు, ఉత్కరముల్=సమూహములు, సర్పసమూహములని యర్థాంతరము ధ్వనించుచున్నది. తత్పక్షమందు ‘జిహ్మగ’ అని పదచ్ఛేదము; పరబర్హ్యుద్ధతిన్ – పర=శత్రువులైన, బర్హి= గర్విష్ఠుల యొక్క, ‘బర్హిర్గర్వే కేకిపింఛే’ అని విశ్వము, ఉద్ధతిన్=దర్పమును, ఉత్కృష్టములైన మయూరములయొక్క యుద్ధతి నని యర్థాంతరము; తూల్చి = ఉడిగించి; తార్క్ష్యహరణప్రౌఢిన్ – తార్క్ష్య=అశ్వములయొక్క, హరణ=సంహారము యొక్క, ప్రౌఢిన్ = ప్రావీణ్యముచేత, గరుత్మత్సంహారప్రావీణ్యముచేత నని యర్థాంతరము, ‘తురంగ గరుడౌ తార్క్ష్యౌ’ అని యమరుఁడు; విజృంభించి=అతిశయించి; తద్విహృతిప్రకారభయరేఖావన్మహాజిహ్మగోత్కరమున్ – తత్=ఆబర్హితార్క్ష్య ములయొక్క, విహృతి ప్రకార=విహారభంగిచేత, భయరేఖావత్=భయపరంపరగల, మహత్=గొప్పలగు, జిహ్మగ= పాములయొక్క, ఉత్కరమున్=సమూహమును; నిందయొనర్పన్=నిందచేయుటకు; తత్పురము=సర్పపురమగు పాతాళ మును; వేగన్=శీఘ్రముగా; చేరు చందంబునన్ = పొందురీతిగా; నిర్భరశక్తిన్=అధికసామర్థ్యముచే; ధరన్=భూమిని; కాఁడి =నాటి; పాఱెన్=పరుగెత్తెను. అనఁగా సుచంద్రుని బాణములనెడు సర్పములు శత్రువులనెడు మయూరములఁ దూల్చి, వారి యశ్వము లనెడు గరుత్మంతుల సంహరించి, వేగాతిశయమున భూమిని దూఱిపోవుచుండఁగా నది మయూరగరుడులకు వెఱచి పాతాళము సొచ్చిన సర్పములను నిందింపఁ బాతాళముఁ జేరఁబోవుచున్నట్లుండె ననుట.
చ. అమితనృపాలసాయకచ◊యంబు నిశాటచమూతనుత్రఝా
టము వడిఁ దాఁకి పై కెగయు◊టల్ వినుతింపఁగ నయ్యె నౌర యు
త్తమనవకాముకచ్ఛట ము◊దంబున వచ్చె నటంచు నిర్జర
ప్రమదల కెల్లఁ జక్కఁ దెలు◊పం జనుపెంపు వహించి యయ్యెడన్. 114
టీక: అమితనృపాలసాయకచయంబు – అమిత=మితిలేనట్టి, నృపాల=సుచంద్రునియొక్క, సాయక=బాణములయొక్క, చయంబు=సముదాయము; నిశాటచమూతనుత్రఝాటము – నిశాటచమూ=రాక్షససేనయొక్క, తనుత్రఝాటము = కవచ సమూహమును; వడిన్=వేగముగా; తాఁకి=తగిలి; పై కెగయుటల్ = మీఁదికెగురుటలు; అయ్యెడన్=ఆసమయమందు; నిర్జరప్రమదల కెల్లన్ = రంభాదిదేవాంగనలకెల్లను; ఉత్తమనవకాముకచ్ఛట=శ్రేష్ఠమగు క్రొత్తకాముకులగుంపు; ముదంబునన్=సంతో షముతో; వచ్చెన్ అటంచున్ = వచ్చెననుచు; చక్కన్=బాగుగా; తెలుపన్=తెలియఁజేయుటకు; చనుపెంపు = పోవు నతిశయ మును; వహించి =పొంది; వినుతింపఁగ నయ్యెన్=శ్లాఘింపనాయెను; ఔర = ఆశ్చర్యము!
అనఁగా రాక్షససైనికకవచములను దాఁకి పైకెగయు సుచంద్రుని బాణపరంపర క్రొత్తకాముకవర్గంబు వచ్చుచున్నదని దేవాంగనలకుఁ దెల్పుటకుసురలోకమున కేగుచున్న చందమున నుండెననిభావము. ఆరాజుబాణములచే రక్కసులెల్ల నీలిగి దేవలోకమును బొందుచుండిరని ఫలితము.
చ. ఘనగజదర్పభేదన మ◊ఖండసురారిపురప్రభంజనం
బు నలఘుధర్మఖండనముఁ ◊బూనిచి వేలుపు లెంచ నుగ్రవ
ర్తనఁ దనరారు నమ్మనుజ◊రాజకలంబము చిత్రవైఖరిన్
దనిపె నజాత్మజాంతర ము◊దారతరప్రమదోర్మి నయ్యనిన్. 115
టీక: ఉగ్రవర్తనన్=తీక్ష్ణవ్యాపారముచేత, శివునివర్తనచేత నని యర్థాంతరము, ‘ఉగ్రః కపర్దీ శ్రీకంఠ శ్శితికంఠః కపాలభృత్’ అని యమరుఁడు; తనరారు అమ్మనుజరాజకలంబము – తనరారు = ఒప్పుచున్న, అమ్మనుజరాజ=జనపతియగు నాసుచంద్రుని యొక్క, కలంబము =బాణము, ‘కలమ్బ మార్గణ శరః’ అని యమరుఁడు; ఘనగజదర్పభేదనము = గొప్పగజములమదము యొక్కశమనమును, గజాసురుని దర్పభేదనమునని యర్థాంతరము; అఖండసురారిపురప్రభంజనంబును – అఖండ = అవి చ్ఛిన్నమైన, సురారిపుర=రాక్షసగాత్రములయొక్క, త్రిపురాసురులయొక్కయు నని యర్థాంతరము, ప్రభంజనంబును = నాశ నమును; అలఘుధర్మఖండనము = అధికమైన విండ్లను తునుముటను, యముని భంగముసేయుట నని యర్థాంతరము,‘ధర్మః పుణ్యే యమే న్యాయే చాపే చాపనిషద్యపి’ అని విశ్వము; పూనిచి =కల్పించి; వేలుపులు=దేవతలు; ఎంచన్ = ప్రశంసించునట్లు గా; అయ్యనిన్=ఆయుద్ధమందు;అజాత్మజాంతరము=నారదునియొక్కమనస్సును, దక్షప్రజాపతిపుత్త్రియైనపార్వతిమనస్సు నని యర్థాంతరము; ఉదారతరప్రమదోర్మిన్=అత్యధికమైన సంతోషపరంపరచేత; చిత్రవైఖరిన్=ఆశ్చర్యకరముగా; తనిపెన్ =తృప్తిపఱచెను. అనఁగా శివుండు గజాసురుని భేదించి, త్రిపురభంజనముఁ జేసి, యము నవమానించి, పార్వతిచిత్తమున కానం దముఁ జేసినట్లు సుచంద్రునిబాణము శత్రుగజభేదనమును, సురారిశరీరభంజనమును, తదీయధనుఃఖండనంబును గావించి యుద్ధము గాంచు ప్రీతితో గగనముఁ జేరిన నారదుని చిత్తమున కానందముఁ జేసెనని భావము.
ఉ. ఆది గుణచ్యుతిన్ గనిన◊యట్టినృపాలు నజిహ్మగాళి త
న్మేదినిలోన సుజ్జ్వలన◊మిత్త్రపరంపరఁ గ్రోలి వేగ మెం
తేఁ దనరన్ బళీ యసుర◊నేతృకులంబు తదేకయుక్తిఁ ద
చ్ఛ్రీ దయివాఱె నొక్కొ యజ◊రీవృతి నాకపదంబుఁ జేరఁగన్. 116
టీక: ఆదిన్=తొలుత; గుణచ్యుతిన్=అల్లెత్రాటివలన జాఱుటను; ఆదిగుణచ్యుతిన్=మొదటిదైన గుణసంజ్ఞ గల యకారము యొక్కచ్యుతినని యర్థాంతరము, అకారము గుణమని వ్యాకరణప్రసిద్ధము; కనినయట్టినృపాలు అజిహ్మగాళి = పొందినట్టి రాజుయొక్క బాణపరంపర, అజిహ్మగాళిశబ్దములో నాద్యకారచ్యుతి కాఁగా జిహ్మగాళి యగుటచేత సర్పపంక్తి యని యర్థాం తర మగు; తన్మేదినిలోన = ఆరణభూమియందు; సుజ్జ్వలనమిత్త్రపరంపరన్– సుజ్జ్వల=లెస్స ప్రకాశించుచున్న, నమిత్త్రపరం పరన్=శత్రుపరంపరను; ‘తన్మేదినిలోన్ అసుజ్జ్వలనమిత్త్రపరంపరన్’ అని విభాగము చేసి, తన్మేదినిలోన్ = ప్రసిద్ధమైన భూమి యందు, అసుజ్జ్వలనమిత్త్ర=ప్రాణవాయువులయొక్క,పరంపరన్=సముదాయమును; క్రోలి=పానముచేసి; వేగ =శీఘ్రముగా; ఎంతేన్=మిక్కిలి; తనరన్=ఒప్పఁగా; అసురనేతృకులంబు=రాక్షసనాయకకులము; అజరీవృతిన్=దేవాంగనాపరివృతిచేత; నాకపదంబుఁ జేరఁగన్ =స్వర్గముఁజేరుటకు; తదేకయుక్తిన్ – తత్=ఆబాణములయొక్క, ఏకయుక్తిన్=ముఖ్యసంబంధము చేత; తచ్ఛ్రీన్—తత్=ఆబాణములయొక్క, శ్రీన్=సంపదచేత; ఆసర్పములయొక్క విషముచేత నని యర్థాంతరము; దయి వాఱె నొక్కొ=ఒప్పెనేమో; బళీ!
అనఁగా, అజిహ్మగములు అనఁగా బాణములు ఆదిగుణచ్యుతినిబొంది జిహ్మగములు అనఁగా సర్పములై యసురులను బొందఁగా, నాయసురులు వానిసంబంధముచే నాజిహ్మగములయొక్క శ్రీని (విషమును) బొందినవారలై, వానిసంపద యైన ఆదిగుణచ్యుతిని బొంది సురలై స్వర్గముఁ జెంది రనుట. అసురులు సుచంద్రునిబాణములచే హతులై స్వర్గముఁ జేరిరని భావము.
మ. నరవర్యాశుగకృత్తతద్దనుజసై◊న్యం బప్డు చూపట్టె దు
స్తరఝంఝానిలధూతదావగతి భ్ర◊శ్యత్కాంచనస్యందనో
త్కరమై, నశ్యదనేకవాజివరజా◊తంబై, పతన్మౌళియై,
పరిశీర్యద్ఘనకుంభ్యనీకమయి, భూ◊భాగంబు దాఁ గప్పుచున్. 117
టీక: అప్డు=ఆసమయమందు; నరవర్యాశుగకృత్తతద్దనుజసైన్యంబు – నరవర్య=నరశ్రేష్ఠుఁడగు సుచంద్రునియొక్క, ఆశుగ= బాణములచేత, కృత్త=ఛేదింపఁబడిన, తద్దనుజసైన్యంబు = ఆతమిస్రుని సైన్యము; దుస్తరఝంఝానిలధూతదావగతిన్ – దుస్తర = తరింపశక్యముగాని, ఝంఝానిల=ఝంఝావాతముచేత, ధూత=కంపితమైన,దావగతిన్ =అరణ్యమువలె; భ్రశ్య త్కాంచనస్యందనోత్కరమై – భ్రశ్యత్=పడుచున్న, కాంచనస్యందన=బంగరుతేరులయొక్క, ఉత్కరమై=గుంపులు గలదై; భ్రశ్యత్=పడుచున్న, కాంచన=సంపెఁగలయొక్క, స్యందన=తినాసపుచెట్లయొక్క, ఉత్కరమై=గుంపులు గలదై యని దావ పరమైన యర్థము; నశ్యదనేకవాజివరజాతంబై =నశించుచున్న యనేక తురగశ్రేష్ఠములయొక్క గుంపులు గలదై, అనేక పక్షి శ్రేష్ఠముల గుంపులు గలదై యని యర్థాంతరము; పతన్మౌళియై=పడుచున్న కిరీటములు గలదై, కూలుచున్న యశోకములు గలదై యని యర్థాంతరము, ‘మౌళిః కంకేళి చూతయోః’ అని విశ్వము; పరిశీర్యద్ఘనకుంభ్యనీకమయి – పరిశీర్యత్= చీలు చున్న , ఘన=గొప్పలగు,కుంభి=ఏనుఁగులయొక్క, అనీకమయి=సమూహముగలదై; చీలుచున్న, కుంభి=కలిగొట్టు చెట్ల యొక్క, అనీకమయి=సమూహముగలదై యని దావపరమైన యర్థము; భూభాగంబు = భూప్రదేశమును; తాన్; కప్పుచున్ = ఆవరించుచు; చూపట్టెన్=అగపడెను.
అనఁగా నసురసైన్యము ఝంఝానిలధూతమైన యరణ్యము చందంబున భ్రశ్యత్కాంచనస్యందనాదికమై చూపట్టె ననుట.
మ. బలుపాదంబులు కూర్మముల్, మెఱుఁగు దోఁ◊ప న్మించు నేజల్ జలా
హులునుం, దెల్లనిచాయపట్టుగొడుగుల్ ◊ప్రోద్ధూతడిండీరకం
బులు, చిక్కుల్వడు కేశపాశనికరం◊బుల్ నాఁచులుం గాఁగ ద
త్పలభుగ్గాత్రజరక్తనిర్ఝరిణి గ◊న్పట్టెన్ శరోత్కర్షతన్. 118
టీక: బలుపాదంబులు = అధికమగు నంఘ్రులు;కూర్మముల్ =తాఁబేళ్ళును; మెఱుఁగు దోఁపన్= ప్రకాశము తోఁచునట్లుగా; మించు నేజల్ = అతిశయించు నాయుధవిశేషములు; జలాహులునున్=నీటిపాములును; తెల్లనిచాయపట్టుగొడుగుల్ = తెల్లనిరంగుపట్టుగొడుగులు;ప్రోద్ధూతడిండీరకంబులు = మిక్కిలి కంపితములగు నురుఁగులును; చిక్కుల్వడు కేశపాశనిక రంబుల్=చిక్కువడిన వెండ్రుకలగుంపులు; నాఁచులున్=శైవాలములును; కాఁగన్=అగుచుండఁగా; తత్పలభుగ్గాత్రజరక్త నిర్ఝరిణి = ఆరాక్షసులశరీరమునుండి పుట్టినరక్తనది; శరోత్కర్షతన్=బాణముల యుత్కర్షముచేత; కన్పట్టెన్=చూపట్టెను.
అనఁగా బాణపరంపరలచేఁ ద్రుంపఁబడిన రాక్షసశరీరములనుండి వెడలిన నెత్తురుటేర్లలోఁ బడినరాక్షసపాదములు కూర్మ ములుగాను, నేజలు నీటిపాములుగాను, శ్వేతచ్ఛత్రములు ఫేనములుగాను, కేశపాశములు శైవాలములుగాను దోఁచె ననుట.
సీ. భూరిదైత్యకపాల◊పూర్ణరక్తముపేరి,కాశ్మీరపంకంబు ◊కలయఁ బూసి,
రథములజాళువా◊రావిఱేకులపేరి,పసిఁడిబొట్టులు ఫాల◊పదవిఁ దీర్చి,
మహిఁ ద్రెళ్ళి యున్న ర◊మ్యశిరస్త్రములపేరి,కులుకుకుళ్ళాయి తాఁ ◊దల దవిల్చి,
యసృగంబుసిక్తధ్వ◊జాంబరంబులపేరి, బలుచంద్రకావిదు◊ప్పటులు గప్పి,
తే. యలఘుపలభక్ష్యభోజ్యము ◊లారగించి, మహితచక్రపదాస్థాన◊మండపమునఁ
జక్కఁ గొలువిచ్చె నపు డెద ◊నిక్కువేడ్కఁ, జటులబేతాళవంశ్యరా◊జన్యసమితి. 119
టీక: అపుడు=ఆసమయమందు; చటులబేతాళవంశ్యరాజన్యసమితి – చటుల=చంచలమగు, బేతాళవంశ్య=బేతాళవంశము నందుఁ బుట్టిన భూతములనెడు, రాజన్యసమితి =రాజసభ; భూరిదైత్యకపాలపూర్ణరక్తముపేరి కాశ్మీరపంకంబు – భూరి= అధికమగు, దైత్యకపాల=రాక్షసులపుఱ్ఱెలయందు, పూర్ణ=నిండినట్టి, రక్తముపేరి = రక్తమను పేరుగల, కాశ్మీరపంకంబు = కుంకుమపంకమును; కలయన్=అంతటను; పూసి =లేపనముఁ జేసి, రథములజాళువారావిఱేకులపేరి పసిఁడిబొట్టులు – రథముల=అరదములయొక్క, జాళువారావిఱేకులపేరి = బంగరు రావి ఱేకు లనెడు, పసిఁడిబొట్టులు = బంగరుబొట్టులను; ఫాలపదవిన్=ఫాలప్రదేశమున; తీర్చి = దిద్ది; మహిఁ ద్రెళ్ళి యున్న రమ్యశిరస్త్రములపేరికులుకుకుళ్ళాయి – మహిన్=భూమియందు, త్రెళ్ళియున్న =పడియున్న, రమ్య= మనోజ్ఞమైన, శిరస్త్రములపేరి=తలతొడుపులను పేరుగల, కులుకుకుళ్ళాయి = అందమైనటోపి; తాన్=తాను; తలన్=శిరము నందు; తవిల్చి=ఉంచి, అసృగంబుసిక్తధ్వజాంబరంబులపేరి బలుచంద్రకావిదుప్పటులు – అసృక్=రక్తమనెడు, అంబు=ఉదకమందు, సిక్త= తడుపఁ బడిన, ధ్వజాంబరంబులపేరి =ధ్వజపటములనుపేరుగల, బలుచంద్రకావిదుప్పటులు = పెద్దచెంగావివస్త్రములను; కప్పి= ఆచ్ఛాదించి, అలఘుపలభక్ష్యభోజ్యములు=అధికములగు మాంసములనెడు భక్ష్యభోజ్యములను; ఆరగించి=భక్షించి; మహితచక్రపదా స్థానమండపమునన్ – మహిత=పూజ్యమగు, చక్రపద=రథమనెడు,ఆస్థానమండపమునన్=సభామండపమందు; చక్కన్= బాగుగా; ఎదన్=హృదయమందు; నిక్కు వేడ్కన్=అతిశయించునుత్సాహముచేత; కొలువిచ్చెన్=కొలువుచేసెను.
అనఁగా నపుడు భూతములనెడు రాజులగుంపు రక్కసులతలపుఱ్ఱెలలో నిండిన నెత్తురనెడు గందము పూసికొని, తేరుల రావిఱేకులనెడు బంగరుబొట్టులు వెట్టుకొని, ధరఁ బడియున్న తలతొడుపులనెడు కుళ్ళాయీలు తలఁ దవిల్చికొని, నెత్తురుతోఁ దడిసిన కేతనపటము లనెడు చెంద్రకావిదుప్పటులు గప్పికొని మాంసమనెడు భక్ష్యభోజ్యము లారగించి, తేరులనెడు కొలువు కూటములఁ గూర్చుండె ననుట.