శ్రియై నమః
శ్రీలక్ష్మీనరసింహాయ నమః
చంద్రికాపరిణయము-సవ్యాఖ్యానము
తృతీయాశ్వాసము
క. విలసత్కమలాపదయుగ
లలితానుపమానదివ్య◊లాక్షాలక్ష్మో
జ్జ్వలతరకౌస్తుభమణిపి
చ్ఛిలరుచివక్షోవిశాల శ్రీగోపాలా! 1
టీక: విలసత్కమలాపదయుగ లలితానుపమాన దివ్యలాక్షా లక్ష్మోజ్జ్వలతర కౌస్తుభమణి పిచ్ఛిల రుచి వక్షోవిశాల – విలసత్ = ప్రకాశించుచున్న, కమలాపదయుగ =లక్ష్మీపాదయుగళముయొక్క, లలిత=మనోజ్ఞము, అనుపమాన=సాటిలేనిది యగు, దివ్యలాక్షా=లోకోత్తరమగు లత్తుకయొక్క, లక్ష్మ=చిహ్నముచేత, ఉజ్జ్వలతర=మిక్కిలి ప్రకాశమానమగు, కౌస్తుభమణి = కౌస్తుభమను మణివిశేషముచేత, పిచ్ఛిల=దట్టమైన, రుచి=కాంతిగల, వక్షః=ఎదచేత, విశాల=గొప్పవాఁడ వగు, అనఁగా, విశాలవక్షస్స్థలముగల; శ్రీగోపాలా=శ్రీమదనగోపాలస్వామీ! అని కృతిపతిసంబోధనము. దీనికిఁ జిత్తగింపు మను నుత్తరపద్యస్థ క్రియతో నన్వయము.
తే. చిత్తగింపుము శౌనకా◊ద్యుత్తమర్షి
సమితి కిట్లను రోమహ◊ర్షణతనూజుఁ
డప్పు డామోద మూని య◊క్షాధిపతి మ
హీంద్రుఁ దిలకించి వెండియు ◊నిట్టు లనియె. 2
టీక: చిత్తగింపుము = అవధరింపుము; శౌనకాద్యుత్తమర్షిసమితికిన్ = శౌనకుఁడు మొదలుగాఁ గల మహర్షిసంఘమునకు; ఇట్లు =వక్ష్యమాణప్రకారముగ; రోమహర్షణతనూజుఁడు=సూతుఁడు; అనున్=వచించును ;అప్పుడు= ఆ సమయమందు; యక్షాధి పతి=యక్షశ్రేష్ఠుఁడగు కుముదుఁడు;ఆమోదము=సంతసమును, ‘ప్రమో దామోద సమ్మదాః’అని యమరుఁడు;ఊని=వహించి; మహీంద్రున్=సుచంద్రుని; తిలకించి =వీక్షించి; వెండియున్=మఱియు; ఇట్టులు=ఈప్రకారముగ; అనియెన్=పలికెను.
చ. ఇరఁ గల పద్మినీతతుల◊యింపును సొంపు నడంచు మంపునం
గరముఁ బొసంగు చంద్రిక య◊ఖండవిలాసము సన్నుతింపఁగాఁ
దరమె తదీయదీధితివి◊తానము గన్గొనుమాత్రఁ బెంపు దు
ష్కరగతి మించు భూర్యసమ◊కాండగవోదితతాపమండలిన్. 3
టీక: ఇటఁ బ్రస్తుతచంద్రికాఖ్యనాయికాపరమైనయర్థమును, జ్యోత్స్నాపరమైనయర్థమును గలుగుచున్నది.
ఇరన్=భూమియందు, జలమందని వెన్నెలపర మైనయర్థము, ‘ఇరా భూ వాక్సురాప్సు స్యాత్’అని యమరుఁడు; కల పద్మినీ తతులయింపును=కలిగినట్టి పద్మినీజాతిస్త్రీలయొక్క యానందమును, తామరతీవలయొక్క యానందము నని జ్యోత్స్నాపర మైనయర్థము; సొంపును=సౌందర్యమును; అడంచు మంపునన్=అడఁగించు మదముచే; కరమున్=మిక్కిలి; పొసంగు చంద్రిక అఖండవిలాసము =ఒప్పుచున్న చంద్రికయొక్క యవిచ్ఛిన్నమైన విలాసము, వెన్నెలయొక్క యఖండ విలాస మని యర్థాంత రము; సన్నుతింపఁగాన్=కొనియాడఁగా; తరమె =శక్యమా? తదీయదీధితివితానము – తదీయ = ఆ చంద్రికయొక్కయు, వెన్నెలయొక్కయు, దీధితివితానము=కాంతిపుంజము; కన్గొనుమాత్రన్ =అవలోకించునంతనే; దుష్కర గతిన్=అశక్యమగు రీతిచే; మించు=అతిశయించునట్టి; భూర్యసమకాండగవోదితతాపమండలిన్ – భూరి=అధికమయిన, అసమకాండ=విషమ బాణుఁడైన (అనఁగా, బేసిసంఖ్యగల బాణములు గల) మరునియొక్క, సప్తాశ్వుఁడైన సూర్యునియొక్క యని యర్థాంతరము, ‘కాణ్డో స్త్రీ దణ్డ బాణార్వ’ యని యమరుఁడు, గో=బాణములచేతను, కిరణములచేత నని యర్థాంతరము, ‘స్వర్గేషు పశు వా గ్వజ్రదిఙ్నేత్ర ఘృణి భూ జలే, లక్ష్య దృష్ట్యా స్త్రియాం పుంసి గౌః’ అని యమరుఁడు. గో+ఉదిత యనుచోట గోశబ్దముమీఁది ఓకారమునకు అవఙాదేశము వచ్చి ‘గవోదిత’ అని యయ్యె, ఉదిత=ఉదయించిన, తాపమండలిన్ =సంతాపాతిశయమును, వేఁడియొక్క యతిశయము నని వెన్నెలపరమైనయర్థము; పెంపున్=పోషించును, నశింపఁజేయు నని యర్థాంతరము.
అనఁగాఁ జంద్రికాఖ్యనాయిక భూమియందుఁ గలపద్మినీజాతిస్త్రీలలో నుత్తమురా లనియు, ఆమె దేహకాంతి యవలో కించినంతనే స్మరోద్దీపన మగుననియుఁ దాత్పర్యము. వెన్నెల జలమందున్న తామరతీవల యింపుసొంపుల నడంచుననియు, ఆతపబాధ శమింపఁజేయు ననియు నర్థాంతరమందుఁ దాత్పర్యము. ప్రకృతాప్రకృతార్థముల కౌపమ్యము గమ్యము.
సీ. నెలఁత చన్గవదారి ◊నెఱికొప్పు కటియొప్పు, ఘనచక్రవైఖరి ◊నని నడంచుఁ,
గొమ్మ కన్నులరాణ ◊నెమ్మోము మెడగోము, కలితాబ్జమహిమంబుఁ ◊దలఁగఁ జేయు,
సకి నుందొడలరీతి ◊చికురాళి నఖపాళి, సుకలభోర్జితజయ◊స్ఫూర్తి నలరుఁ,
జెలి వలగ్నాభ ప◊ల్కులతీరు నూఁగారు, హరిమదాపహవృత్తి ◊నతిశయిల్లు,
తే. నహహ! త్రైలోక్యవర్ణనీ◊యాజరాంగ, నావతారవిలాసాప్తి ◊నడరు కతన
మహిప! పాంచాలరాట్సుతా◊మంజులాంగ,కాంతి చిత్రకరస్థేమఁ ◊గాంచు టరుదె? 4
టీక: నెలఁత చన్గవదారి – నెలఁత=చంద్రికయొక్క, చన్గవ=స్తనయుగ్మముయొక్క, దారి=పద్ధతి; నెఱికొప్పు =అందమైన కేశబం ధము; కటియొప్పు=పిఱుందులయందము; ఘనచక్రవైఖరిన్ = గొప్పవి యైన జక్కవలరీతిని, మేఘసంఘముయొక్కరీతిని; ఘనచక్రవైఖరిన్—ఘన=గొప్పవియైన, చక్ర=బండికండ్లయొక్క, వైఖరిన్=రీతిని; అనిన్=పోరునందు; అడంచున్=అడఁగఁ జేయును. అనఁగాఁ జంద్రికయొక్క చన్గవదారి ఘనములైన జక్కవలరీతిని, కొప్పు మేఘసంఘపురీతిని, పిఱుందులు గొప్పవగు బండికండ్లరీతిని జయించు నని యథాసంఖ్యముగా నన్వయము. కొమ్మ కన్నులరాణ =చంద్రికయొక్క నేత్రములయొప్పిదము; నెమ్మోము =అందమగు ముఖము; మెడగోము =కంఠసౌకు మార్యము; కలితాబ్జమహిమంబున్ – కలిత=ఒప్పుచున్న, అబ్జ=కమలముయొక్క, చంద్రునియొక్క, శంఖముయొక్క, మహిమంబున్ =అతిశయమును; తలఁగన్=తొలఁగునట్లుగా; చేయున్. ఆమె కన్నులు కమలముయొక్కయు, మోము చంద్రునియొక్కయు, కంఠము శంఖముయొక్కయు మహిమను దలఁగఁజేయు నని తాత్పర్యము. సకి=చంద్రికయొక్క, నుందొడలరీతి=నునుపగు తొడలవైఖరి; చికురాళి=కుంతలపంక్తి; నఖపాళి=నఖములయొక్క పంక్తి; సుకలభోర్జితజయస్ఫూర్తిన్ – సు=లెస్సయైన, కలభ=కరబహిర్భాగముయొక్క, తుమ్మెదలయొక్క, ‘కలభః కరపార్శ్వే స్యా ద్భ్రమరే కరిశాబకే’అని విశ్వము, సుకల=మంచిప్రకాశము గల, భ=నక్షత్రములయొక్క, ‘నక్షత్ర మృక్ష భం తారా’ అని యమరుఁడు, ఊర్జిత=అతిశయించిన, జయ=గెలుపుయొక్క, స్ఫూర్తిన్ =ప్రకాశముచేత; అలరున్=ఒప్పును. ఆమెతొడలు కరబహిర్భాగముయొక్కయు, కేశములు తుమ్మెదలయొక్కయు, గోళ్ళు నక్షత్రములయొక్కయు గెలుపుచేత నమరుచున్న వని తాత్పర్యము. చెలి =చంద్రికయొక్క; వలగ్నాభ=మధ్యప్రదేశముయొక్కకాంతి; పల్కులతీరు =వచనభంగి; నూఁగారు=రోమావళి; హరి మదాపహవృత్తి న్ – హరి=సింహముయొక్కయు, చిలుకయొక్కయు, సర్పముయొక్కయు, మదాపహవృత్తి న్ =గర్వము నడంచు వర్తనచేత; అతిశయిల్లున్ =మించును. ఆమెనడుము సింహమును, పలుకు చిలుకను, నూఁగారు సర్పమును, బోలిన దనుట. అహహ=ఆశ్చర్యము! మహిప=సుచంద్రుఁడా! పాంచాలరాట్సుతామంజులాంగకాంతి =పాంచాలరాజపుత్త్రియైన చంద్రిక యొక్క మనోజ్ఞమగు దేహకాంతి; త్రైలోక్య వర్ణనీయాజరాంగనావతార విలాసాప్తి న్ – త్రైలోక్య=లోకత్రయముచేత, వర్ణ నీయ= కొనియాడఁదగిన, అజరాంగనావతార=దేవాంగనావతారముయొక్క, విలాస=విలాసముయొక్క, ఆప్తిన్=పొందిక చేత; అడరు కతన =ఒప్పుటవలన; చిత్రకరస్థేమన్=ఆశ్చర్యమగు స్థితిని; కాంచుట=పొందుట; అరుదె=ఆశ్చర్యమా?
అనఁగాఁ జంద్రిక ముల్లోకములచేత వర్ణనీయమైన విలాసమును బొందినది గావున నామెకు ఘనచక్రాదిజయము గల స్తన యుగ్మ కేశపాశ కటిస్థలాదులు మూఁడేసి యవయవములు గలిగియుండుట యాశ్చర్యము గాదని తాత్పర్యము. ఇట మంజు లాంగకాంతి యనుచోట ‘శోభైవ కాన్తి రాఖ్యాతా మన్మథాప్యాయితోజ్జ్వలా, సా శోభా రూపభోగాద్యై ర్యత్స్యాదఙ్గవిభూషణ’ మ్మని కాన్తి లక్షణమును, మెడగోము అనుచోట ‘యత్స్పర్శాసహతాఙ్గేషు కోమలస్యాపి వస్తునః, తత్సౌకుమార్యమ్’ అని సౌకుమార్యలక్షణమును దెలియవలయు.
చ. సమరహితాత్మమై యతను◊సాయకశక్తి భరించు నాసుదే
హమెఱుఁగుమేనితోఁ గడు ఘ◊నాళి సహాయముఁ గన్న చంచలౌ
ఘము పగ లొందిన న్విగత◊కాంతిక మౌ ననఁ దద్విహీనతా
క్రమమున మించు చంపకము ◊గాంచునె సొంపు విరోధ మూనినన్. 5
టీక: సమరహితాత్మమై = యుద్ధమునకు హితమయిన స్వరూపము కలదై, సమరహిత= సమమైనదానిచే రహితమైన, అనఁగా సాటిలేని, ఆత్మమై = స్వరూపము గలదై యని యర్థాంతరము; అతనుసాయకశక్తిన్ = అధికములగు బాణములయొక్క శక్తిని, మరునితూపనెడు శక్తిని నని యర్థాంతరము, ‘రమ్యం హర్మ్యతలం నవాస్సునయనా గుఞ్జద్విరేఫా లతాః ప్రోన్మీల న్నవ మల్లికాసురభయో వాతా స్సచన్ద్రాః క్షపాః, యద్యేతాని జయన్తి హన్త పరిత శ్శస్త్రా ణ్యమోఘాని మే’ అని మరునికి వనితయు సాయకముగాఁ జెప్పఁబడినది; భరించు నాసుదేహమెఱుఁగుమేనితోన్ = ధరించునట్టి యాచంద్రికయొక్క ప్రకాశించునంగము తోడ, దీనికిఁ బగలొందిన ననుదానితో నన్వయము; కడున్=మిక్కిలి; ఘనాళిన్ – ఘన=గొప్పవారలయొక్క, మేఘముల యొక్క యని యర్థాంతరము, ఆళిన్=సమూహమును; సహాయమున్=తోడునుగా; కన్నచంచలౌఘము = పొందిన విద్యు త్సమూహము; పగ లొందినన్=వైరముల నొందినచో, దివసము నొందినచో నని యర్థాంతరము; విగతకాంతికము ఔన్ అనన్ = కాంతిహీనమగు ననఁగా; తద్విహీనతాక్రమమున మించు చంపకము –తత్=ఆఘనాళిచేత, అనఁగా గొప్పదైన తుమ్మెదచేత, విహీనతా=రాహిత్యముయొక్క, క్రమమునన్=రీతిచేత, మించు = గర్వించు, చంపకము =సంపెఁగతీవ; విరోధము=వైరము; ఊనినన్ = పొందినచో; సొంపున్=అందమును; కాంచునె=వహించునా?
అనఁగా సమరసన్నద్ధమై యనేకబాణసంత్తితోఁ గూడుకొన్న యామెదేహముతో ఘనాళిసాహాయ్యము నొందిన మెఱుపే పగలొందినచో గెలువనపుడు అట్టి ఘనాళి సాహాయ్యము లేనిచంపకము విరోధ మూనినయెడల గెలువఁజాలదని చెప్పవలసి నది లేదనుట. ఆమె దేహము సాటిలేని దనియు, మదనోద్దీపకమనియు, మెఱుపుఁదీవయు సంపెంగతీవయు సాటి యనుట సంభావింపఁ దగదనియు భావము. ఇందుఁ జంద్రిక యొక్క దేహలత వర్ణింపఁబడియె. ఇట్లు చెప్పుటచేత లోకోత్తరలావణ్యాతి శయము చంద్రికాదేహమునందుఁ జెప్పఁబడినది. ‘ముక్తాఫలేషు చ్ఛాయాయా స్తరళత్వ మివాన్తరా, ప్రతిభాతి యదఙ్గేన లావణ్యం తదిహోచ్యతే’ అని లావణ్యలక్షణము దెలియవలయు.
మ. జగతీనాయక కన్యపాదనఖముల్ ◊సజ్జాలకత్రాణమా
న్యగతిం జేకొని లోకవర్ణ్యవిధుకాం◊తాకారసంపత్తి మిం
చఁగ ముత్యంబులు శుక్తికాతటిఁ దప◊శ్చర్య న్విజృంభించి హె
చ్చగు తాద్రూప్యముఁ బొందెఁ గానియెడ ము◊క్తాభిఖ్య యెట్లబ్బెడిన్. 6
టీక: జగతీనాయక=సుచంద్రుఁడా! కన్యపాదనఖముల్=చంద్రికయొక్క పాదములయొక్క గోరులు; సజ్జాలకత్రాణమాన్య గతిన్ – సజ్జాలక=సత్పురుషుల సమూహముయొక్క, శ్రేష్ఠములైన మొగ్గలయొక్క యని యర్థాంతరము, త్రాణ=రక్షణము చేత, మాన్య =పూజ్యమగు, గతిన్ =స్థితిని; చేకొని =గ్రహించి;లోకవర్ణ్యవిధుకాంతాకారసంపత్తిన్ – లోకవర్ణ్య=లోకముచేఁ గొని యాడఁ దగిన, విధు=విష్ణుమూర్తియొక్క, కాంత=మనోహరమైన, ఆకార=ఆకృతియొక్క, సంపత్తిన్=సంపదచేత, ‘విధు ర్విష్ణౌ చంద్రమసి’ అని యమరుఁడు; విధుకాంతా=నక్షత్రములయొక్క, ఆకారసంపత్తిన్=ఆకృతిసంపత్తుచేత నని యర్థాంత రము;మించఁగన్=అతిశయింపఁగా; ముత్యంబులు=మౌక్తికములు;శుక్తికాతటిన్ =శుక్తికయను నదియొడ్డున, ముత్యపు చిప్పలదరి నని యర్థాంతరము; తపశ్చర్యన్=తపముఁజేయుటచేత; విజృంభించి =అతిశయించి; హెచ్చగు తాద్రూప్యమున్= ఉత్కృష్టమగు తత్ (ఆగోరులయొక్క)రూపము కల్గియుండుటను;పొందెన్=పొందెను; కాని యెడన్ = అటుగానిచో; ముక్తా భిఖ్య=మోక్షమును బొందినవను పేరు; ఎట్లబ్బెడిన్ = ఏవిధముగ లభించును?
అనఁగా ముత్యములు శుక్తికానదీతీరమునఁ దపముఁ జేసి చంద్రికానఖసారూప్యముక్తిని గాంచినవి గావుననే ముక్తాఖ్య నొందినవి, కానిచో నొందఁజాల వనుట. చంద్రికాపాదనఖములు మొగ్గలను, నక్షత్రములను బోలియున్నవని భావము. ఇట నఖములు వర్ణితంబు లయ్యె. చిత్రరేఖావతారరూప యగుటం జేసి చంద్రిక దేవతాత్మ గావున ‘మానవా మౌళతో వర్ణ్యా దేవా శ్చరణతః పునః’ అను కవికులనియమము ననుసరించి నఖాదిగా వర్ణించుట యని తెలియవలయు.
చ. అనిశవిభాసితాత్మమృదు◊తారుణతాజితపల్లవాభ యై
తనరువెలందిపాదరుచిఁ ◊దమ్ము లిరం గమలాప్తుగోక్రమం
బునఁ గని మించఁగాదె సిరి ◊పూని కరమ్ములఁ జక్క నొత్తు లో
చనములు గంతుకేళివిధి◊జక్లమదారణదంభధీగతిన్. 7
టీక: అనిశ విభాసి తాత్మ మృదుతారుణతా జిత పల్లవాభ యై – అనిశ=ఎల్లపుడును, విభాసిత=ప్రకాశించుచున్న, ఆత్మ=తన సంబంధి యగు, అనఁగా పాదసంబంధి యగు, మృదుతా=మార్దవముచేతను, అరుణతా=ఎఱ్ఱఁదనముచేతను, జిత=జయింపఁ బడిన, పల్లవ=చిగురుటాకులయొక్క, ఆభ యై =కాంతి గలదై, అనఁగాఁ బల్లవములందు మ్రదిమారుణ్యములు సర్వకాలము నందు నుండునవి గావు కావునఁ బాదరుచిచే నవి యోడింపఁబడిన వనుట. ఇట్లు చెప్పుటచేఁ జంద్రికాపాదములయందు మార్ద వాతిశయము గదితం బయ్యె. ‘స్పృష్టం యత్రాఙ్గ మస్పృష్ట మివ స్యా న్మార్దవం హి తత్’ అని తల్లక్షణంబు. ఆరుణ్యోక్తిచే ద్వితీయయౌవనము గదిత మగు. ‘స్తనౌ పీనౌ తను ర్మధ్యః పాణౌ పాదే చ రక్తిమా, ఊరూ కరికరాకారావఙ్గం వ్యక్తాఙ్గసన్ధికమ్| నితమ్బో విపులో నాభి ర్గభీరా జఘనం ఘనమ్, వ్యక్తా రోమావళి స్స్నైగ్ధ్య మఙ్గకే లలితాక్షిణీ| ద్వితీయే యౌవనే’ అని రసార్ణవ సుధాకరమందుఁ దల్లక్షణం బెఱుంగునది; తనరువెలందిపాదరుచిన్ =ప్రకాశించునట్టి చంద్రికయొక్క పాదకాంతిని; తమ్ములు = తోఁబుట్టువులు, పద్మములని యర్థాంతరము; ఇరన్=భూమియందు, ఉదకమందు; కమలాప్తుగోక్రమంబునన్ =విష్ణుమూర్తి యొక్క వచనక్రమముచేత, విష్ణువుయొక్కవరప్రదానముచేత ననుట, సూర్యకిరణసంచారముచేత నని యర్థాంతరము; కని = పొంది; మించన్ కాదె = మించుటచేతఁగదా! సిరి =లక్ష్మి; కరమ్ములన్=హస్తములయందు; పూని=వహించి; లోచనములు = నేత్రములను; కంతు కేళివిధి జ క్లమ దారణ దంభధీ గతిన్ – కంతుకేళివిధి=అనంగక్రీడావిధానమువల్ల, జ=పుట్టినట్టి, క్లమ= శ్రమముయొక్క, దారణ= పోఁగొట్టుటయొక్క, దంభధీ=వ్యాజబుద్ధియొక్క, గతిన్ =ప్రాప్తిచేత; చక్కన్=బాగుగా; ఒత్తున్= ఒత్తుకొనును.
అనఁగా నెల్లపుడు రాజిల్లు తనమార్దవారుణ్యములచేఁ బల్లవకాంతి నోడించిన చంద్రికాపాదరుచిని, తమ్ములు అనఁగాలక్ష్మీ సహోదరములగు తామరసములు విష్ణుమూర్తివరముచేత గ్రహించెనని సిరి సంతసించుచుఁ గంతుకేళిపరిశ్రమాపనోదనవ్యాజ మునఁ గన్ను లొత్తుకొనుచున్న దనుట. చంద్రికాపాదములు పల్లవములకన్న మార్దవారణ్యములు గల వనియు, పద్మములు సూర్యకిరణప్రచారముచే నట్టివానికాంతిని బొందిన వనియు భావము. లక్ష్మీదేవి పద్మహస్త యగుట, ‘నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాఙ్గళ్యయుక్తా’ యని ప్రసిద్ధము. ఇట్లు సిరి పద్మహస్త యగుటకు, పద్మములు చంద్రికాపాదమ్రది మారుణ్యములను బొందుట హేతువు గాకున్నను, హేతువుగాఁ జెప్పుటవలన హేతూత్ప్రేక్షాలంకారము. ఆమ్రదిమారుణ్యము లకు భగవత్ప్రసాదైకలభ్యత చెప్పుట లోకోత్తరత్వానితరసాధ్యత్వాదిప్రతీత్యర్థ మని తెలియునది.
చ. వెలఁదిమెఱుంగుపిక్కల య◊వేలమరీచిక ధాటి వెల్వడెన్
జలమున నంచుఁ గాహళిక ◊సాంద్రరుతిన్ బయలూన్ప శాలి లోఁ
గలసినభీతి వాహినుల◊కాండముతో హరిమండలంబుతో
వల నగు పొందుఁ గాంచియును ◊వప్రము వెల్వడ కుండు నెంతయున్. 8
టీక: వెలఁదిమెఱుంగుపిక్కల యవేలమరీచిక – వెలఁది = చంద్రికయొక్క, మెఱుంగుపిక్కల = ప్రకాశించుచున్న జంఘల యొక్క, అవేలమరీచిక=అధికమగు కాంతి; ధాటిన్=జైత్రయాత్రనుగూర్చి; చలమునన్=మాత్సర్యముచేత; వెల్వడెన్= బయలుదేఱెను; అంచున్, కాహళిక = బూరుగ; సాంద్రరుతిన్=దట్టమగు ధ్వనిని; బయలూన్పన్=వెల్లడి సేయఁగా; శాలి = వరిపొట్టయనుట; లోన్=అంతరంగమందు; కలసినభీతిన్=కూడుకొన్నభయముచేత; వాహినులకాండముతోన్= సేనల యొక్క గుంపుతో, నదులజలముతోను, ‘కాణ్డో స్త్రీ దణ్డ బాణార్వ వర్గావసర వారిషు’ అని యమరుఁడు; హరిమండలంబుతోన్ = అశ్వసమూహముతో, శుకవర్గముతోను; వలనగుపొందున్ =అనుకూలమైన సంబంధమును; కాంచియును=పొందియును; వప్రము=కోటను, వరిమడిని; ఎంతయున్=మిక్కిలి; వెల్వడ కుండున్=బయలుదేఱకుండును. ‘చిత్రతన్’ అను పాఠమున వాహినుల కాండముతోను, హరిమండలముతోను వలనగుపొందుఁ గాంచియు వెల్వడకుండుట చిత్ర మని తెలియునది.
చంద్రిక పిక్కలకాంతి జైత్రయాత్ర వెడలఁగఁ గాహళిక పెద్దపెట్టున రొద సేయుటను శాలి విని తాను వాహినీకాండముల తోను, హరిమండలంబుతోనుం గూడినదయ్యు వప్రము వెల్వడకుండెననుట. ఆమె పిక్కలు బూరుగులకన్నను, వరిపొట్టల కన్నను మిన్నగా నున్నవని భావము. వాహినులకాండము, హరిమండలము, వప్ర మను చోటుల శ్లిష్టరూపకము. పిక్కలను కాహళములు వరిపొట్టలు లోనగువానితోడఁ బోల్చుట కవిసమయసిద్ధము.
ఉ. రాజవరాత్మజాతపరి◊రంభసుఖం బొనగూర్చు నాకుభృ
ద్రాజకుచోరుకాండములు ◊రంభలు గావున నొక్కొ నిచ్చలున్
రాజిలురక్తి సారసవ◊నప్రవివర్ధనవృత్తిఁ బూనుఁ బో
రాజితహస్తిహస్తనిక◊రంబులు తత్ప్రియభావ మూనఁగాన్. 9
టీక: రాజవరాత్మజాత పరిరంభసుఖంబు – రాజవరాత్మజాత=రాజకుమారునకు, నలకూబరునకని యర్థాంతరము, పరి రంభసుఖంబు =ఆలింగనసౌఖ్యమును; ఒనగూర్చు ఆకుభృద్రాజకుచోరుకాండములు – ఒనగూర్చు=కలుగఁజేయునట్టి, ఆకుభృద్రాజకుచా=పర్వతశ్రేష్ఠములవలె నున్నతములగు కుచములుగల చంద్రికయొక్క, ఊరుకాండములు =స్తంభముల వంటి యూరువులు, ‘నారీపీనపయోధరోరుయుగళం స్వప్నేపి నాలిఙ్గిత మ్మాతుః కేవలమేవ యౌవనవనచ్చేదే కుఠారా వయమ్’ ఇత్యాదికావ్యవ్యవహారములవల్లను, కామశాస్త్రాద్యుక్తాలింగన ప్రభేదాంతర్గతివల్లను, ఊర్వాలింగనము ప్రసిద్ధమని తెలియవలెను; రంభలు గావున నొక్కొ= రంభయను దేవాంగన లగుటవలననో, పూజయందు బహువచనము, అనఁటు లగు టనో; నిచ్చలున్=సర్వకాలమందును; రాజితహస్తిహస్తనికరంబులు =ప్రకాశించుచున్నట్టి యేనుఁగుతొండముల గుంపులు; తత్ప్రియ భావము = ఆరంభాత్మకములైన యూరువులకు మిత్త్రభావమును; ఊనఁగాన్ =పొందునట్లు; రాజిలురక్తిన్=ప్రకా శించుచున్న యనురాగముచేత; సారసవనప్రవివర్ధనవృత్తిన్ – సారసవన=తామరతోఁటలయొక్క, ప్రవివర్ధనవృత్తిన్ =ఛేదిం చుటయొక్క వ్యాపారమును; సారస=సరస్సంబంధియగు,వన=జలముచేత, ప్రవివర్ధన=వృద్ధిఁబొందుటయొక్క,వృత్తిన్ = వ్యాపారమును; సార=శ్రేష్ఠములైన,సవన=యాగములయొక్క, ప్రవివర్ధన=వృద్ధిఁబొందుటయొక్క,వృత్తిన్=వ్యాపారమును; సారస=రసిక సంబంధియగు,వన=సమూహముయొక్క, ప్రవివర్ధన=వృద్ధిఁబొందుటయొక్క, అనఁగా సంతోషపఱచుట యొక్క, వృత్తిన్ = వ్యాపారమును; ఇవి క్రమముగాఁ గరికర కదళీ దేవాంగనా చంద్రికోరూ పపరములయిన యర్థములు; పూనున్=వహించును; పో =నిశ్చయము.
చంద్రికోరువులు రాజవరాత్మజాతుఁడగు వరునకుఁ బరిరంభసుఖము నియ్యఁదగినవి కావున రాజవరాత్మజాతుఁడగు నలకూబరునకుఁ బరిరంభసుఖ మిచ్చు రంభలయ్యె ననియు, అట్లు రంభాభావము పొంది తమకు (అనఁగా రంభాశబ్దమునకు అనఁటులును అర్థము కావున నట్టి యనఁటులకు) శత్రువు లయిన కరికరంబులను సారసవనప్రవివర్ధనవృత్తిఁ బూనుటచే మిత్త్రములగునట్లు చేసికొనినవి యని తాత్పర్యము. ఏనుఁగుతొండములు కమలవనమును భేదించుటయు, అనఁటులు సరోజల ముచే వృద్ధిఁబొందుటయు, దేవాంగనాసంగసౌఖ్యమునకై యాగములు చేయఁబడుటయుఁ బ్రసిద్ధము. ఆమెయూరువులు అనంటులను, ఏనుఁగుతొండములను పోలినవని భావము. ‘ఊరూ కరికరాకారా వఙ్గం వ్యక్తాఙ్గసన్ధికమ్’ అన్నచొప్పున ద్వితీయయౌవన మిందుఁ జెప్పఁబడియె.
చ. సతిజఘనప్రభాగరిమ ◊సైకతముల్ పరిశుద్ధతీర్థవా
సితఁ దగి శారదాదరణ◊చే నిసుమంతగ్రహించి మించ స
మ్మతిఁ గన నోపకే యవని ◊మాటికిఁ గప్పికొను న్సమీరసం
తతిగతినిశ్చ్యుతాసనవ◊నప్రసవౌఘపరాగశాటికన్. 10
టీక: సైకతముల్ =ఇసుకదీములు; పరిశుద్ధతీర్థవాసితన్ – పరిశుద్ధ=నిర్మలమగు,తీర్థ=పుణ్యక్షేత్రమందలి, ‘తీర్థం శాస్త్రాధ్వర క్షే త్రోపాయోపాధ్యాయ మన్త్రిషు| అవతారర్షి జుష్టామ్భః స్త్రీరజస్సు చ విశ్రుతమ్’అని విశ్వము, వాసితన్=నివాసముచేత, వసించు వాఁడు వాసి, వానిధర్మము వాసిత అది వాసరూపంబ యగును; తగి= ఒప్పి; శారదాదరణచేన్=సరస్వతీప్రసాదముచేత, శర త్కాలసంబంధియైన యాదరముచేత, శరత్కాలముననే సైకతప్రకాశము గావున నిట్లు వచింపఁబడియె; సతిజఘనప్రభాగరిమన్ = చంద్రికయొక్క కటిపురోభాగములయొక్క శోభాతిశయమును; ఇసుమంతన్=కొంచెముగాను, ఇసుకనంతయు నని వాస్తవా ర్థము; గ్రహించి=పొంది; మించన్=అతిశయింపఁగా; అవని=భూమి; సమ్మతిన్=అంగీకారముచేత; కనన్=చూచుటకు; ఓపకే =సహింపకయే; సమీరసంతతి గతి నిశ్చ్యుతాసన వన ప్రసవౌఘ పరాగ శాటికన్ – సమీరసంతతి=వాయుసంఘముయొక్క, గతి = గమనముచేత, నిశ్చ్యుత=జాఱినట్టి, ఆసన=బంధూకవృక్షములయొక్క,వన=వనములయొక్క,ప్రసవౌఘ=పుష్పరాశి సంబంధి యగు, పరాగ=రజమనెడు, శాటికన్=కాషాయవస్త్రము ననుట, మాటికిన్=సారెకు, కప్పికొనున్=ఆచ్ఛాదించు కొనును. అనఁగా చంద్రికాజఘనసౌందర్యము నించుక గ్రహించి మించిన సైకతంబుల సౌభాగ్యము చూచి సహింపఁజాలక భూమి సన్న్యసించె నని భావము.
చ. స్థిరతపనీయసారసన◊దీప్తిమృషాతపనాతపంబు భా
స్వరకటిహర్మ్యనాభిమిష◊జాలకవీథికఁ బర్వినం దదం
తరమున నక్షిలక్ష్యగతిఁ ◊దాల్చినసూక్ష్మతరాణు వౌఁ జుమీ
కరికులరాజయాననును◊గౌను మనంబునఁ జింత యూన్పఁగన్. 11
టీక: కరికులరాజయాన నునుగౌను – కరికులరాజయాన=గజరాజగమన యైన చంద్రికయొక్క, నునుగౌను = నునుపైన మధ్యభాగము; మనంబునన్=మనసునందు; చింత ఊన్పఁగన్ = ధ్యానింపఁగా; స్థిర తపనీయ సారసన దీప్తి మృషా తపనాత పంబు – స్థిర=అచంచలమగు, తపనీయ=బంగరుయొక్క, ‘తపనీయం శాతకుమ్భమ్’ అని యమరుఁడు, సారసన=ఒడ్డా ణముయొక్క, ‘స్త్రీకట్యా మ్మేఖలా కాఞ్చీ సప్తకీ రశనా తథా| క్లీబే సారసనమ్’ అని యమరుఁడు, దీప్తి=కాంతి యనెడు, మృషా = వ్యాజముగల,తపనాతపంబు=సూర్యాతపము; భాస్వర కటి హర్మ్య నాభిమిషజాలక వీథికన్– భాస్వర=ప్రకాశించుచున్న, కటి=కటిప్రదేశమనెడు, హర్మ్య=మేడయొక్క, నాభిమిషజాలక=పొక్కిలియనెడు నెపముగల గవాక్షముయొక్క, వీథికన్= ప్రదేశమందు; పర్వినన్=ప్రసరింపఁగా; తదంతరమునన్=ఆసూర్యాతపమధ్యమున; అక్షిలక్ష్యగతిన్=చక్షురింద్రియవిషయ స్థితిని; తాల్చిన=ధరించిన; సూక్ష్మతరాణువు=అతిసూక్ష్మమగు నణువు; ఔన్ జుమీ = అగును సుమా!
‘జాలసూర్యమరీచిస్థం సూక్ష్మం య ద్దృశ్యతే రజః| తస్య షష్ఠతమో భాగః పరమాణు స్స ఉచ్యతే’ అని చెప్పిన రీతిగాఁ బ్రత్యక్షవిషయమగు త్రసరేణుత్వము మధ్యమం దధ్యవసిత మైనది. ‘కౌను సూక్ష్మతరాణువౌన్ కటిహర్మ్య’ మను చోటుల రూపకాలంకారము. ‘దీప్తిమృషాతపనాతపంబు’, ‘నాభిమిషజాలక’ యను చోటుల కైతవాపహ్నుతియు, కరికులరాజయాన యను చోట నుపమాలంకారంబు నగు.
మ. అలివేణీమణినాభి తుంగఘనపు◊ష్పాభంగశోభాగతిం
జెలు వందం దదమూల్యసద్గుణగణ◊శ్రీఁ గానఁగా లేమినో
జలజాతాకరపాళి చుట్టుకొను ని◊చ్చల్ దుర్యశోవల్లికా
వళి నస్పృశ్యనిరంతరావిశదశై◊వాలాళి దంభంబునన్. 12
టీక: అలివేణీమణినాభి=తుమ్మెదలవంటి జడగల స్త్రీలలో నుత్తమురాలగు చంద్రికయొక్క పొక్కిలి; తుంగ ఘనపుష్పాభంగ శోభాగతిన్ – తుంగ= ఉన్నతమైన, ఘనపుష్ప=జలముయొక్క, ‘మేఘపుష్పం ఘనరసమ్’ అని యమరుఁడు, అభంగ= తరఁగలు లేని,శోభా= కాంతియొక్క, గతిన్=రీతిచేత; తుంగ=పొన్నయొక్క, ఘన=గొప్పదగు, పుష్ప=పువ్వుయొక్క, అభంగ=భంగములేని, శోభాగతి చేత నని వాస్తవార్థము; చెలువందన్=సుందరమగుచుండఁగా; తదమూల్యసద్గుణగణశ్రీన్ – తత్=ఆనాభిసంబంధి యైన, అమూల్య=వెలలేని, సద్గుణగణ=శ్రేష్ఠమగు గుణసంఘముయొక్క, మొలనూలు లోనగువాని యొక్క, శ్రీన్= సంపదను; కానఁగా లేమినో=పొందలేకుండుటవలననో; నిచ్చల్=ఎల్లప్పుడు; అస్పృశ్య నిరంత రావిశద శైవా లాళి దంభంబునన్ – అ స్పృశ్య=తాఁకఁగూడనట్టియు, నిరంతర=ఎల్లప్పుడు, అవిశద=నల్లగానుండునట్టియు ‘విశదశ్వేత పాణ్డరాః’ అని యమరుఁడు, శైవాల =నాచుఁదీవలయొక్క, ఆళి=గుంపనెడు, దంభంబునన్=నెపముచేత; దుర్యశోవల్లికా వళిన్=అయశోలతాసంఘమును; జలజా తాకరపాళి=కమలాకరసమూహము; చుట్టుకొనున్=కప్పికొనును.
అనఁగా నామె పొక్కిలి ఘనపుష్పాభంగశోభాగతిని బొందఁగా సభంగశోభాగతియైన జలజాతాకరపాళి తదమూల్యస ద్గుణశ్రీ నొందఁజాలక యోడి దుర్యశోవల్లిని దాల్చినదని భావము. వర్ణ్యముచేత నోడింపఁబడిన దిట్లు చెప్పఁదగినదని సంప్రదా యము. ఇందులకు ‘లజ్జా కోపో యశోనాశ రోషాక్రన్దాస్య కృష్ణతాః| రాగ పాణ్డురతాశస్త్రీవిషఝమ్పాతపో జపాః| రాజప్రసాద హం సైకదన్తభక్తి నిషేవణమ్| దుఃఖస్నేహాభిచారేర్ష్యాసహనోద్గ్రీవికాదయః| వర్ణ్యేన విజిత స్యైతే పరాభవసముద్భవాః| భావా వాచ్యా యథౌచిత్యమ్’ అనియు, ‘ముఖజితం కమలం మూర్తమి వాయశో భృఙ్గావళీ వ్యాజేన ధత్తే’ అనియు, కవికల్పలతయం దున్నది.
చ. తలకక యౌవనాంబునిధిఁ ◊దానముఁ జేసి, కటీవితర్దిఁ జెం
ది, లలితవిప్రసేవితుఁడు ◊నీరజబాణుఁడు పాంథభేదనో
జ్జ్వలమతి నాభికుండమునఁ ◊జయ్యన హోమ మొనర్పఁ బర్వు శ్యా
మలతరధూమరేఖ యన ◊మానిని యారు పొసంగు నింపుగన్. 13
టీక: లలితవిప్రసేవితుఁడు – లలిత=సరళులైన,విప్ర=బ్రాహ్మణులచేత, సేవితుఁడు=కొలువఁబడినవాఁడగు; లలిత=సుందరము లైన, వి=శుకాదిపక్షులచేత, ప్రసేవితుఁడు=కొలువఁబడినవాఁడని వాస్తవార్థము; నీరజబాణుఁడు=మరుఁడు; పాంథభేదనోజ్జ్వల మతిన్ –పాంథ=బాటసారులయొక్క, భేదన=విదారణమందు, ఉజ్జ్వల=ప్రకాశించునట్టి, మతిన్=బుద్ధిచేత; యౌవనాంబు నిధిన్ =ప్రాయంబనెడు మున్నీటియందు; తలకక=వెఱవక; తానమున్ =స్నానమును; చేసి=ఒనరించి; కటీవితర్దిన్ = కటి ప్రదేశమను వేదికను; చెంది=పొంది; నాభికుండమునన్=పొక్కిలి యనెడు కుండమునందు, కుండ మనఁగా హోమమునకై విధిచొప్పునఁ ద్రవ్వఁబడిన గుంట; చయ్యనన్=వేగముగ; హోమము ఒనర్పన్ = హోమము చేయఁగా; పర్వు=వ్యాపించెడు; శ్యామలతరధూమరేఖ – శ్యామలతర=మిక్కిలి నల్లనగు, ధూమరేఖ=ధూమమాలిక; అనన్=అనునట్లు; మానినియారు = చంద్రికయొక్క రోమరాజి; ఇంపుగన్=అందముగా; పొసంగున్=ఒప్పును.
చంద్రికయారు మరుఁడు పథికుల వధింప నిచ్ఛించి యౌవనాంబునిధియందు స్నానము చేసి, విప్రసేవితుఁడయి, కటీ వితర్దియందు నాభికుండమున వేల్చిన ధూమమాలికయో యన్నట్లున్న దని భావము. ఉత్ప్రేక్షాలంకారము. ‘యౌవనాంబు నిధి’, ‘నాభికుండము’ అను చోట్ల రూపకములకు నుత్ప్రేక్షకు నంగాంగీభావముచే సంకరము.
మ. నవరోమావళియష్టికాగ్రముపయి ◊న్రాజిల్లి చందోయి తా
నవి మెప్పించి తదాత్మత న్మన నసూ◊యన్ గ్రీవ యబ్జాప్తువై
భవముం జేకొనె, నొందె మున్నరుణబిం◊బస్ఫూర్తిఁ గెమ్మోవి, వే
ణి విరాజిల్లెఁ దమస్సపత్నగతి నెం◊తేఁ దాల్చి యయ్యింతికిన్. 14
టీక: అయ్యింతికిన్ =ఆచంద్రికకు; చందోయి =స్తనయుగ్మము; నవ రోమావళి యష్టి కాగ్రముపయిన్ – నవ=నూతనమగు, రోమావళి= ఆరనెడు,యష్టికా=ఆసనవిశేషముయొక్క, యష్టికాసనము యోగప్రసిద్ధము, అగ్రముపయిన్ =కొనపైన; రాజిల్లి = ప్రకాశించి, అనఁగా తాదృశాసనారూఢమై తపము దాల్చి యనుట; తాన్, అవిన్=సూర్యుని; మెప్పించి =సంతుష్టుని జేసి; తదాత్మతన్=ఆయవిస్వరూపముచేతను, పర్వతస్వరూపముచేతను, ‘అవయ శ్శైల మేషార్కాః’ అని యమరుఁడు; మనన్ = వృద్ధిఁబొందఁగా; గ్రీవ=కంధరము; అసూయన్ = ఈర్ష్యచేత; అబ్జాప్తువైభవమున్= సూర్యునియొక్క వైభవమును; అబ్జ=శంఖ మునకు, ఆప్తు =చెలియనెడు, వైభవమున్ =విభవమును, ‘అబ్జౌ శఙ్ఖ శశాఙ్కౌ చ’ అని యమరుఁడు, ఇచట చకారమున పద్మా ర్థకతయు, సూర్యుండు పద్మబాంధవుం డగుటయు తెల్లము; చేకొనెన్=గ్రహించెను; కెమ్మోవి=ఎఱ్ఱనగునట్టి యధరము; మున్ను=తొలుత; అరుణబింబస్ఫూర్తిన్=సూర్యబింబప్రకాశమును, అరుణమైన దొండపండుయొక్క ప్రకాశమును; ఒందెన్= పొందెను; వేణి=జడ; తమస్సపత్నగతిన్ – తమః=రాహునకు, ‘తమస్తు రాహుః’అని యమరుఁడు, సపత్న=శత్రువనెడు, గతిన్ =రీతిని; ఎంతేన్=మిక్కిలి; తాల్చి=వహించి; విరాజిల్లెన్=ప్రకాశించెను.
ఆచంద్రికయొక్క కుచములు పర్వతోన్నతము లనియు, కంఠము శంఖతుల్యం బనియు, అధరము బింబసదృశమనియు వేణి రాహువును బోలియున్నదనియు భావము. ‘బన్ధు శ్చౌర స్సుహృ ద్వాదీ కల్పః ప్రఖ్యః ప్రభ స్సమః| దేశీయ దేశ్య రిప్వాభ సోదరాద్యా ఇవార్థకాః’ అనుటచే ఆప్త,సపత్నశబ్దములు తౌల్యమును ప్రతిపాదించును.
సీ. సకియురోజములసా◊టికి గహ్వరముఁ బూని, కుధరపాళిక కలఁ◊గుండు వడియెఁ,
గలికిగుబ్బలపెంపుఁ ◊గనఁ జాలఁ దమిఁ గాంచి, కోకముల్ రాజుచేఁ ◊గుందువడియెఁ,
జెలికుచంబులఁ బోల ◊నొళవున సరిఁ జూచి, కనకకోలంబముల్ ◊గట్టువడియె,
నెలఁతచందోయితోఁ ◊దులఁదూఁగ రతిఁ బూని, భృంగారుతతి వేగ ◊యెత్తువడియెఁ,
తే. దఱియు గోత్రమ్ములకును గో◊త్రమ్ము లరుల, కరులు కాయమ్ములకును గా◊యములు భద్ర
ఘటకములకు సదాభద్ర◊ఘటకములు బ,ళిరె వధూకులమణిపయో◊ధరము లెన్న. 15
టీక: కుధరపాళిక =పర్వతసమూహము; సకియురోజములసాటికిన్=చంద్రికపాలిండ్ల సామ్యమునకు; గహ్వరమున్=దంభ మును; పూని=వహించి; కలఁగుండు వడియెన్ = కలఁతపడెను, పర్వతము గుహలుగలిగి కలఁగుండు పడుట సహజము. కోకముల్=చక్రవాకములు; కలికిగుబ్బలపెంపున్=చంద్రికగుబ్బల యతిశయమును; కనన్=పొందుటకు; చాలన్=మిక్కిలి; తమిన్=ఆసక్తిని,రాత్రిని, ‘రజనీ యామినీ తమీ’ అని యమరుఁడు; కాంచి=పొంది; రాజుచేన్=ప్రభువుచేత, చంద్రునిచేత;కుందు పడియెన్=దుఃఖమును బొందెను. చక్రవాకములు రాత్రి చంద్రునిచే గుందువడుట సహజము. కనకకోలంబముల్ =బంగరుకిన్నెరకాయలు; చెలికుచంబులన్=చంద్రికాస్తనములను; పోలన్=పోలుటకు, ఒళవునన్ =లోలో పల, వీణాదండమందు; సరిన్=సాటిని; చూచి=అవలోకించి; కట్టువడియెన్=సిగ్గునఁజాలించుకొనెను. కోలంబకము లొళవునఁ గట్టువడుట సహజము. భృంగారుతతి – భృంగారు=బంగరుగిండ్లయొక్క, తతి=సమూహము, ‘భృఙ్గారుః కనకాలుకా’ అని యమరుఁడు; నెలఁతచం దోయితోన్=చంద్రికయొక్క చన్నుఁగవతోడ; తులఁదూఁగన్=సాటిఁబొందుటకు; రతిన్=ప్రీతిని; పూని=వహించి; వేగ = శీఘ్ర ముగా; ఎత్తువడియెన్=డస్సెను,తూఁచఁబడెను. బంగరుగిండ్లు తూఁచఁబడుట సహజము. వధూకులమణిపయోధరములు=స్త్రీరత్నంబగు చంద్రికయొక్క పాలిండ్లు; ఎన్నన్=ఎంచఁగా; తఱియు గోత్రమ్ములకున్ = సమీపించుచున్న పర్వతములకు; గోత్రమ్ములు=పూజనీయములు, ‘గోత్ర స్సంభావనీయేఽపి’ అని విశ్వము; అరులకున్= చక్రవాకములకు; అరులు=శత్రువులు; కాయమ్ములకున్=వీణాకాయములకు, కోలంబకముల కనుట; కాయములు= కటు వగు ద్రవ్యములచేఁజేసిన యౌషధములు; భద్రఘటకములకున్=పైఁజెప్పిన భృంగారువులకు,‘భద్రకుమ్భః పూర్ణకుమ్భో భృఙ్గారుః’ అని యమరుఁడు; సదాభద్రఘటకములు =ఎల్లప్పుడు శ్రేయమును ఘటిల్లఁజేయునవి, కాదేని ‘అభద్ర’ అని పద విభాగము చేసి, అమంగళము చేయునవని చెప్పవలెను. సదాపదము ‘సుప్సుపా’అని సమసించినది; బళిరె =ఆశ్చర్యము.
గోత్రమ్ములకు గోత్రమ్ము, లరుల కరు లిత్యాదిగాఁ దత్తత్సమానరూపత నొందుట యాశ్చర్య మని భావము. ఆమె స్తన ములు పర్వతములవలె నున్నతమయిన వనియు, జక్కవలవలె జతగూడి యున్నవనియు, వీణాకాయలవలెఁ బొంకముగ నున్నవనియు, భృంగారువులవలె మెఱుఁగు గలిగి యున్నవనియు భావము. ఇందుఁ జందోయి వర్ణితం బయ్యె.
మ. భువిఁ గశ్చిత్పదపూర్వకంబుగ సుధీ◊పుంజంబు తన్బల్క నా
త్మ వెతం జేకొని దేవదత్తము మిళిం◊దద్వేణికంఠాత్మ సొం
పు వెలుంగం జనియించి మించె బళి స◊త్పూగాంచితంబై ప్రసి
ద్ధవరాభిఖ్య నెసంగి భూరిగుణర◊త్నప్రాప్తి సంధించుటన్. 16
టీక: దేవదత్తము =అర్జునునిశంఖము, అజ్ఞాతకులగోత్రంబగు నొకవ్యక్తివిశేషము; భువిన్=భూమియందు; సుధీపుంజంబు = విద్వన్మండలము; తన్=తన్ను; కశ్చిత్పదపూర్వకంబుగన్ – కశ్చిత్పదపూర్వకంబుగన్ పల్కన్= ‘కశ్చిద్దేవదత్తః’ అను వ్యవహారముచే కశ్చిత్పదము ముం దగునట్లుగా, పల్కన్=వచింపఁగా, అట్లు వ్యవహరించుట శాస్త్రములయందుఁ బ్రసిద్ధంబు; ఆత్మన్=మనస్సునందు; వెతన్=దుఃఖమును; చేకొని =పొంది; మిళిందద్వేణికంఠాత్మన్ – మిళిందత్ వేణి=తుమ్మెదలవలె నాచరించుచున్నజడ గల చంద్రికయొక్క, ‘మిళిందత్’ అనుచోట ఆచారార్థమున క్విప్ ప్రత్యయము, కంఠాత్మన్=కంఠరూ పముచేత; సొంపు వెలుంగన్= శోభ యతిశయించునట్లుగా; జనియించి=ఉదయించి; సత్పూగాంచితంబు ఐ – సత్ = విద్వాం సులయొక్క, పూగ=సంఘముచేత, అంచితంబు ఐ =పూజితంబై, పోఁకభంగి నొప్పుచున్నదై; ప్రసిద్ధవరాభిఖ్యన్ = ప్రసిద్ధమై శ్రేష్ఠమైన పేరిచేత; ప్రసిద్ధ=ప్రసిద్ధమగు, వర=కుంకుమముయొక్క, అభిఖ్యన్=కాంతిచేత, ‘వరం బాహ్లీక పీతనే’, ‘అభిఖ్యా నామ శోభయోః’ అని యమరుఁడు; ఎసంగి =ఒప్పి; భూరిగుణరత్నప్రాప్తి –భూరి=అధికమైన, గుణరత్న=రత్నములవంటి గుణములయొక్క, ప్రాప్తి=పొందిక, భూరిగుణ=గొప్పసూత్రము గల, రత్నప్రాప్తి =మణులపొందిక; సంధించుటన్=కలుగుట వలన; మించెన్=అతిశయించెను; బళి=ఆశ్చర్యము!
దేవదత్తము పండితమండలిచే కశ్చిత్పదపూర్వకముగా వ్యవహరింపఁబడుచున్నానని వెత నొంది, చంద్రికాకంఠరూప ముగా జనించి, సుగుణరత్నములను బొంది, సత్పూగాంచితంబై , ప్రసిద్ధనామమును దాల్చి విరాజిల్లె ననుట. అనఁగా అర్జున శంఖావతారరూపముగా నామెకంఠము వెలయుచున్న దని భావము. పూర్వ మంతసామాన్యస్థితిలో నుండిన దేవదత్తము కంఠ రూపతఁ దాల్చి తద్విపరీతముగ లోకోత్తరస్థితిచేఁ జెలంగుట యాశ్చర్యము.
చ. వనితభుజాప్రసూనసర◊వల్గువిలాసముఁ జెందఁగోర్కిఁ గై
కొని వనజాకరాళి బిస◊కోటి గళద్వయసాంబుసీమ ని
ల్చి నయనపద్మము ల్దెఱచి ◊సేయుఁ దరణ్యవలోకనం బహం
బున నిశ వాని మోడ్చి పెను◊పుం దదుదంచితచింతనాగతిన్. 17
టీక: బిసకోటి=తామరతూఁడుగుంపు; వనిత భుజాప్రసూనసర వల్గు విలాసమున్ – వనిత=చంద్రికయొక్క, భుజాప్రసూనసర = పుష్పహారములవలెనుండు బాహువులయొక్క, వల్గు=మనోజ్ఞమైన, విలాసమున్=లీలను; చెందన్=పొందుటకు; కోర్కిన్ = వాంఛను; కైకొని =పొంది; వనజాకరాళిన్=పద్మాకరములయొక్కనికరమందు; గళద్వయసాంబుసీమన్ – గళద్వయస = కంఠప్రమాణమైన, ‘ప్రమాణే ద్వయసచ్’ ఇత్యాదిసూత్రముచేఁ బ్రమాణార్థమందు గళశబ్దముపై ద్వయసచ్ ప్రత్యయము, అంబు సీమన్ = జలప్రదేశమందు; నిల్చి; నయనపద్మముల్ = నయనరూపములైన పద్మములను; తెఱచి =విప్పికొని; అహంబునన్ = పగటియందు; తరణ్యవలోకనంబు=సూర్యావలోకనమును; చేయున్=ఒనరించును; నిశన్=రాత్రియందు; వానిన్ = ఆనేత్ర పద్మములను; మోడ్చి=మూసికొని; తదుదంచితచింతనాగతిన్ – తత్=ఆసూర్యునిసంబంధియైన, ఉదంచిత= అధికమైన, చింతనా=ధ్యానముయొక్క, గతిన్=రీతిని; పెనుపున్=వృద్ధిఁ బొందించును.
తపంబొనరించు వారిలోఁ గొందఱు జలమధ్యమునఁ గంఠమువఱకు నిల్చి, సూర్యావలోకనమే సేయుచు, సూర్యుం డస్త మిం పఁగా నతనినే ధ్యానించుచుఁ గన్నులు మోడ్చికొని రేయి గడిపి మఱల సూర్యోదయమునఁ దన్నిరీక్షణము సల్పుట ప్రసి ద్ధము. అట్లు బిసకోటి చంద్రికాభుజావిలాససిద్ధికై కొలంకునందు సూర్యావలోకనము సేయుచుఁ దపోవిశేషము నాచరించుచున్న ట్లుత్ప్రే క్షింపఁబడినది. అనఁగాఁ జంద్రికాభుజాలతలు మృణాళములను మించియున్నవని ఫలితార్థము. ‘ప్రాయోబ్జం త్వత్పదే నైక్యం ప్రాప్తుం తోయే తపస్యతి’ అనుచోటవలె నుత్ప్రేక్షాలంకారము.
సీ. ఎంత సద్గుణలబ్ధి ◊నెనసి మించిన నైన, మణులరంధ్రములె నె◊మకు ననంగ,
నెంతవారికిఁ బుట్టి ◊యెమ్మె గాంచిన నైన, సుధపెంపుఁ బలుచగాఁ ◊జూచు ననఁగ,
నెంత బల్మొనఁ గూడి ◊యింపుఁ జెందిన నైనఁ, జిగురాకు నగవీథిఁ ◊జేర్చు ననఁగ,
నెంత రసోదయం ◊బెచ్చఁ బొల్చిన నైనఁ, జెఱకు నిష్ఫలముగాఁ ◊జేయు ననఁగ,
తే. ననిశ మామోద మొక్కింత ◊గనక వాయు,రీతిఁ జాంచల్యము వహించి ◊రిత్త విరిసి
సొంపు చెడ వాడు బంధూక◊సుమచయంబు, తెఱవకెమ్మోవితో విరో◊ధింపఁ గలదె. 18
టీక: ఎంత సద్గుణలబ్ధిన్=ఎంత సుగుణలాభమును, మంచిసూత్రములయొక్క లాభమును; ఎనసి=పొంది; మించిననైనన్ = అతిశయించినప్పటికిని; మణులరంధ్రములె =మణులయొక్క దోషములనే, బెజ్జములనే యని యర్థాంతరము;నెమకున్= వెదకును; అనంగన్=ఇట్లనుచుండఁగా; ఎంతవారికిన్=ఎంతదొడ్డవారికి; పుట్టి = జనించి;ఎమ్మె=అందము; కాంచిన నైనన్ =పొందినప్పటికి; సుధపెంపున్=అమృ తముయొక్క అతిశయమును; పలుచగాన్=తక్కువగా, సుధ చిక్కనిది గాకుండుట స్వభావము; చూచున్ అనఁగన్ = అవలో కించు ననఁగా; ఎంత బల్మొనన్ = ఎంత యధికమైన సేనను, సూక్ష్మాగ్రమును; కూడి; ఇంపున్=యోగ్యతను; చెందిన నైనన్ =పొందినప్పటికి; చిగురాకు నగవీథిన్ చేర్చు ననఁగన్ = చిగురాకున్=కిసలయమును, నగన్ వీథిన్ చేర్చు ననఁగన్ = లోకమునవ్వునట్లుగా వీథికిఁ దెచ్చుననఁగా; చిగురాకున్=కిసలయమును; అగవీథిన్= వృక్షపంక్తిని, చేర్చు ననఁగ నని యర్థాంతరము; ఎంత రసోదయంబు=ఎంత వీర్యాతిశయము, పానకముయొక్క యుదయము; ఎచ్చన్=అతిశయించునట్లుగా; పొల్చిన నైనన్=ఒప్పినప్పటికి; చెఱకున్=ఇక్షువును; నిష్ఫలముగాన్= లాభములేనిదానిగ, పండ్లులేనిదానిగ నని యర్థాంతరము; చేయు ననఁగన్ = ఒనరించుననఁగా; అనిశము=ఎల్లప్పుడు; ఆమోదము=సంతసము,పరిమళము; ఒక్కింత గనక=కొంచెమైనను గానక; వాయురీతిన్—వాయు = వాతరోగముయొక్క, తెమ్మెరలయొక్క, రీతిన్=రీతిచేత; చాంచల్యము వహించి=చంచలత్వము నొంది; రిత్త విరిసి =వృథా గర్వముచేతఁజెడి, ఫలములేక వికసించి; సొంపు చెడన్=అందముడుగునట్లు; వాడు బంధూకసుమచయంబు=మ్లానమౌ దాసన పువ్వులగుంపు; తెఱవకెమ్మోవితోన్=చంద్రికయొక్క ఎఱ్ఱనిపెదవితో; విరోధింపఁ గలదె=పోరఁగల్గునా?
అనఁగా నంతంత యుత్కృష్టము లగు మణిసుధాపల్లవేక్షువులే యోడినపు డిట్లు సామాన్యమగు బంధూకము విరోధింపఁ జాల దనుట.చంద్రికమోవి బంధూకపుష్పపల్లవమణులకన్న మార్దవారుణ్యములు గలిగి యిక్షుసుధలకన్న తీయనైనదని ఫలి తార్థము.
మ. హరిమధ్యానఘదంతకోరకసమ◊త్వారూఢి పుణ్యాకర
స్ఫురణల్ గాంచినహీరసంతతి కిలం ◊బొల్పొందుఁగా కబ్బునే
పరమాఘంబునఁ బొల్చు మా కని వనిం ◊బల్మాఱు ఖేదించు బం
భరనాదంబున మొల్లమొగ్గలు గళ◊న్మధ్వశ్రుపూరంబుగన్. 19
టీక: మొల్లమొగ్గలు =కుందకుట్మలములు;హరిమ ధ్యానఘ దంతకోరక సమత్వారూఢి – హరిమధ్యా= సింహమువంటి సన్ననినడుముగల చంద్రికయొక్క, అనఘ=ఒచ్చెములేని, దంతకోరక=కలికలవంటి దంతములయొక్క, సమత్వారూఢి =సామ్యప్రాప్తి; పుణ్యాకరస్ఫురణల్ – పుణ్య=సుకృతములకు, ఆకర=ఆధారములైన, స్ఫురణల్=ప్రకాశములను; పుణ్య =మనోహరమైన, ఆకర=గనులయందు, స్ఫురణల్ =ఉండుటలను; కాంచినహీరసంతతికిన్=పొందిన వజ్రసంఘములకు; ఇలన్=భూమియందు; పొల్పొందుఁ గాక =ఒప్పును గాక; పరమాఘంబునన్ – పరమ=అధికమగు, అఘంబునన్=పాపము చేత; పర=శ్రేష్ఠమైన, మాఘంబునన్ = మాఘమాసమందు; పొల్చు మాకున్=ఉదయించిన మాకు; అబ్బునే=అమరునా? అని =ఇట్లనుచు; గళన్మధ్వశ్రుపూరంబుగన్ – గళత్=జాఱుచున్నట్టి, మధు=పూదేనియ యనెడు, అశ్రుపూరంబుగన్ = కన్నీటి ప్రవాహముగలదియగునట్లుగా; బంభరనాదంబునన్ =తుమ్మెదలరొదలచేత; వనిన్ =తోఁటయందు; పల్మాఱున్=సారెకు; ఖేదించున్ = దుఃఖించును. అనఁగాఁ జంద్రికయొక్క దంతకోరకములకు హీరములు సాటియగును గాని మొల్లమొగ్గలు తాము కామని దుఃఖించె ననుట. ఇట ‘దుఃఖస్నేహాభిచారేర్ష్యాసహనోద్గ్రీవికాదయః’ అను పూర్వోదాహృతప్రమాణమునుబట్టి ‘ముఖజిత శ్చన్ద్రః పీయూషబిన్దువ్యాజేనాశ్రూణి ముఞ్చతి, ముఖజితం కమలం భ్రమరారావై రాక్రన్దతి’ అని కవికల్పలతలోఁ జెప్పిన చొప్పున ‘ఖేదించు బంభరనాదంబున మొల్లమొగ్గలు గళన్మధ్వశ్రుపూరంబుగన్’ అని పరాజయచిహ్నంబు వర్ణిత మయ్యె. ఉత్ప్రేక్షాలంకారభేదము.
ఉ. మానినిమేటితావి గల ◊మాటలతేట గ్రహింపఁ గోరి నా
నానగరాజితప్రవచ◊నద్విజరాజులఁ జేరి యీప్సితం
బూనమి వాక్సతీపదప◊యోరుహయావకవారిఁ గ్రోల నౌ
నౌ నెఱకెంపు సొంపెసఁగె ◊నాననసీమలఁ గీరరాజికిన్. 20
టీక: మానినిమేటితావి గలమాటలతేటన్ – మానిని=చంద్రికయొక్క, మేటితావి గల=మంచిపరిమళము గల, మాటల=పలు కులయొక్క, తేటన్=సారమును; గ్రహింపన్=స్వీకరించుటకు; కోరి=ఇచ్ఛించి; నానా నగరాజిత ప్రవచన ద్విజరాజులన్ – నానా = అనేక, నగర=రాజధానులయందు, అజిత=గెలువఁబడనట్టి, ఓడనివారైన యనుట, ప్రవచన=ప్రకృష్టమైన వాక్కులు గల వారైన, ద్విజరాజులన్ =బ్రాహ్మణశ్రేష్ఠులను; నానానగ=అనేకవిధములైన వృక్షములయందు, రాజిత=ఒప్పుచున్న, ప్రవ చన= ప్రకృష్టమైన పలుకులు గల, ద్విజరాజులన్=పక్షిపంక్తులను; చేరి=ఆశ్రయించి; ఈప్సితంబు=ఇష్టార్థము; ఊనమిన్ = పొందనందున; వాక్సతీ పదపయోరుహ యావకవారిన్ – వాక్సతీ=వాగ్దేవియొక్క, పదపయోరుహ=పాదపద్మసంబంధి యగు, యావకవారిన్ =లత్తుకనీరును, వాగపేక్షగలవారు వాగ్దేవి నాశ్రయించుట సహజము; క్రోలన్=పానము సేయఁగా; కీరరాజికిన్ =చిలుకలగుంపునకు; ఆననసీమలన్=ముఖప్రదేశములయందు; నెఱకెంపు =అధికమైన యెఱ్ఱదనము; సొంపెసఁ గెన్=ప్రకాశిం చెను; ఔనౌన్=యథార్థము. చంద్రికపలుకులు చిలుకలపలుకులకన్న ముద్దుగా నున్నవని భావము.
చ. కలికికపోలయుగ్మరుచి ◊కాంచనదర్పణకాంతిసంతతుల్
కలయఁగఁ జేరఁ బ్రేమమునఁ ◊గౌఁగిటఁ గూర్చి నిజోజ్జ్వలాంకసం
స్థలి నిడి కర్ణపూరవిల◊సత్సితరత్నమరీచిపాళికా
చ్ఛలమునఁ బాలు వోసి వరు◊స న్వరపత్త్రికడోల నూఁచెడున్. 21
టీక: కలికికపోలయుగ్మరుచి – కలికి=చంద్రికయొక్క, కపోలయుగ్మ=గండస్థలద్వయముయొక్క, రుచి=కాంతి, ఇది కర్త; కాంచనదర్పణ కాంతిసంతతుల్ – కాంచనదర్పణ=బంగరుటద్దముయొక్క, కాంతిసంతతుల్=కాంతు లనెడు శిశువులు; కల యఁగన్ =కలయుటకు; చేరన్=సమీపింపఁగా; ప్రేమమునన్=ప్రీతిచేత; కౌఁగిటన్ కూర్చి=ఆలింగనముఁ జేసికొని; నిజోజ్జ్వ లాంకసంస్థలిన్ – నిజ=స్వీయమగు, ఉజ్జ్వల=ప్రకాశించునట్టి, అంకసంస్థలిన్=తొడమీఁదను, సమీపవనభూమియం దనుట; ఇడి=కూర్చుండఁబెట్టి; కర్ణపూర విలస త్సితరత్న మరీచిపాళికా చ్ఛలమునన్ – కర్ణపూర=కమ్మలయందు, విలసత్= ప్రకా శించుచున్న, సితరత్న=వజ్రమణులయొక్క, మరీచిపాళికా=కాంతిపరంపర లనెడు, ఛలమునన్=నెపముచేత; పాలు=క్షీర ములను; పోసి; వరుసన్=క్రమముగా; వరపత్త్రికడోలన్=శ్రేష్ఠములగు మకరికాపత్త్రము లనెడు నుయ్యెలయందు; ఊఁచెడున్.
కపోలరుచి దర్పణకాంతు లనెడు శిశువులను బ్రేమమునఁ గౌఁగిలించి, తొడపైఁ గూర్చుండఁబెట్టుకొని, పాలు పోసి, యుయ్యెల నూఁచె నని దర్పణకాంతులయందు శిశువృత్తమును, కపోలరుచులందు మాతృవృత్తమును వర్ణించుటవలన దర్పణకాంతికన్నఁ గపోలకాంతి యతిశయించి యున్న దని భావము. జననులు బిడ్డలు చేర రా నిట్లుచేయుట లోకప్రసిద్ధము.
చ. వనములఁ జేరి పుణ్యతమ◊వాసనఁ గాంచి మలీమసాళిమై
త్త్రి నడఁచి మాధవాదృతి సి◊రి న్భరియించి సమత్వ మెంచు కాం
చనకళికావళి న్నిజరు◊చాబలవైఖరి రిత్తవుచ్చనో
తనుతరమధ్యనాస తిల◊దాన మొనర్చుఁ జుమీ యజస్రమున్. 22
టీక: వనములన్=అరణ్యములందు; చేరి =వసించి; పుణ్యతమవాసనన్ – పుణ్యతమ=పవిత్రతమమైన, వాసనన్=అపూర్వ మును, మనోహరమైన పరిమళమును; కాంచి=పొంది; మలీమసాళిమైత్త్రిన్ –మలీమస=మలినులయొక్క, ఆళి=పంక్తియొక్క, మైత్త్రిన్ =సఖ్యమును; మలీమసాళి=నల్లనివైన తుమ్మెదలయొక్కమైత్త్రిన్ అని యర్థాంతరము; అడఁచి=పోఁగొట్టి; మాధవా దృతిన్= విష్ణువునందలి యాసక్తిచేత, వసంతానుగ్రహముచేత; సిరిన్=సంపదను,కాంతిని; భరియించి=ధరించి; సమత్వము =తనతోడి సామ్యమును; ఎంచు=కోరునట్టి; కాంచనకళికావళిన్=సంపెంగమొగ్గలపరంపరను; తనుతరమధ్యనాస=సూక్ష్మ మధ్య యగు నాచంద్రికయొక్క ముక్కు; నిజరుచాబలవైఖరిన్ – నిజ=స్వకీయమైన, రుచా=కాంతియొక్క, బల=అతిశ యముయొక్క, వైఖరిన్=రీతిచేత; రిత్త పుచ్చనో=వ్యర్థము సేయుటకో; అజస్రమున్=ఎల్లపుడును; తిలదానము=నూలదాన మును; ఒనర్చుఁ జుమీ = చేయును సుమీ; తిలకుసుమఖండనముఁ జేయునని వాస్తవార్థము.
ఇంత యనర్హమైన వస్తువు నాతో సాటిని గోరుట దురితమునఁ జేసియె కాఁబోలు నని తత్పాపనిరసనమునకై తిలదానము సేయుచున్నట్లున్న దనుట. తిలదానమువలన నరిష్టనిరసనము కలుగు ననుట ‘తిలాః పాపహరా నిత్య’మిత్యాదులవలనఁ దేట పడును. చంద్రికయొక్క నాసికతిలకుసుమమును, సంపెంగమొగ్గను మించి విరాజిల్లుచున్నదని ఫలితార్థము.
సీ. తారకావరదీప్తిఁ ◊దనరారఁగానె కా, గనియె సతీర్థతఁ ◊గలువగుంపు
ఘనరోహితహితాత్మ ◊ననువొందఁగానె కా, నెనసె సగోత్రత ◊నేణికాళి
ప్రద్యుమ్నబోధివ◊ర్తనఁ దాల్పఁగానె కా, గాంచె సపక్షత ◊ఖంజనములు
నమలినశ్రీ నన్వ◊హము మించఁగానె కా, పడసె సమిత్త్రతఁ ◊బంకజమ్ము
తే. లనుచు హృద్వీథిఁ దలఁప శ్యా◊మాళిమైత్త్రి, నిరతచకితస్వభావతా◊సరణి నతను
వాజిభావాప్తిఁ బక్ష్మస◊మాజలబ్ధి, నిందుముఖికన్నుదోయి తా◊నొందు టరుదె. 23
టీక: తారకావరదీప్తిన్ – తారకావర=చంద్రునియొక్క, దీప్తిన్=ప్రకాశముచేత; తారకా=నల్లగ్రుడ్లయొక్క, వర=శ్రేష్ఠమగు, దీప్తిన్=ప్రకాశముచేత; తనరారఁగానె కా=ఒప్పఁగానే కదా! కలువగుంపు=కువలయసమూహము; సతీర్థతన్=ఒకగురువు గలిగియుండుటను, జలములఁ గూడి వర్తించుటను; కనియెన్ = పొందెను.ఆమె కన్నులకుఁ గలువగుంపు సహాధ్యాయిత్వము నొందెననఁగా సామ్యము వహించె ననుట. ‘సతీర్థ్యాస్త్వేకగురవః’ అని యమరుఁడు. ఘనరోహితహితాత్మన్ – ఘన=గొప్పనగు, రోహిత=ఇఱ్ఱులకు,హిత=ప్రియమైన, ఆత్మన్ =స్వరూపముచేత,మత్స్యమువలె హితమైన స్వరూపముచేత నని యర్థాంతరము; అనువొందఁగానె కా= ఒప్పఁగానే కదా! ఏణికాళి=ఆఁడుజింకలగుంపు, సగోత్ర తన్=జ్ఞాతిత్వముచేత; ఎనసెన్=చేరెను. ఆమె నేత్రములకు ఏణికాళి బాంధవ్యమును బొందినదనఁగా సమాన మయ్యె ననుట. ‘గోకర్ణ పృషతైణర్శ్య రోహితాః’, ‘రోహితో మద్గురః’ అని యమరుఁడు. ప్రద్యుమ్నబోధివర్తనన్ – ప్ర=ప్రకృష్టమైన, ద్యుమ్న=ధనమును, ‘ద్యుమ్నమర్థో రై విభవావపి’ అని యమరుఁడు, బోధి=తెలి పెడు, వర్తనన్=వృత్తిని; తాల్పఁగానె కా=వహింపఁగానే కదా! ఖంజనములు =కాటుకపిట్టలు; సపక్షతన్=మిత్త్రత్వమును, ఱెక్కలతోఁగూడియుండుటను;కాంచెన్=పొందెను. కాటుకపిట్ట లామెకన్నులకు సపక్షభావమును బొందెననఁగా సాదృశ్యముఁ బొందెనని భావము. నిక్షేపగర్భమైన భూమిమీఁదనే కాటుకపిట్టలు జతగూడునని ప్రసిద్ధము. అమలినశ్రీన్= నిర్మలమైన కాంతిచేత, నిర్మలయగు లక్ష్మీదేవిచేత; అన్వహము=ఎల్లప్పుడు, ప్రతిపగటియందును; మించఁగానె కా=అతిశయింపఁగానే కదా! పంకజమ్ములు=పద్మములు; సమిత్త్రతన్=సమానమిత్త్రతను; పడసెన్=పొందెను. ఆమెనేత్రము లకు పద్మములు సమిత్త్రములయ్యె ననఁగా సమానము లయ్యె నని భావము. అనుచున్=ఇట్లనుచు; హృద్వీథిన్=అంతరంగప్రదేశమందు; తలఁపన్; ఇందుముఖికన్నుదోయి=చంద్రికయొక్క నేత్రద్వ యము; శ్యామాళిమైత్త్రిన్ – శ్యామా=రాత్రులయొక్క, ఆళి=గుంపుయొక్క, శ్యామ=నల్లనగు, అళి=తుమ్మెదలయొక్క, మైత్త్రిన్=సఖ్యమును; శ్యామా=యౌవనమధ్యస్థలగు,ఆళి=చెలులయొక్క, మైత్త్రిన్=మిత్త్రత్వమును; నిరతచకితస్వభావతా సరణిన్ – నిరత=ఎల్లప్పుడు, చకితస్వభావతా=భయసంభ్రమప్రధానమైన స్వభావముగలుగుటయొక్క, సరణిన్=మార్గమును; అతనువాజిభావాప్తిన్ – అతనువాజిభావ=అధికమగు పక్షిత్వముయొక్క, మదనబాణముయొక్క, ‘వాజినోశ్వేషు పక్షిణః’ అని యమరుఁడు, ఆప్తిన్=పొందికను; పక్ష్మసమాజలబ్ధిన్—పక్ష్మ=కింజల్కములయొక్క, ఱెప్పలయొక్క, సమాజ= గుంపుయొక్క,లబ్ధిన్=ప్రాప్తిని,‘పక్ష్మాక్షిలోమ్నికిఞ్జల్కే’ అని యమరుఁడు;తాన్; ఒందుట=పొందుట; అరుదె=ఆశ్చర్యమా?
అనఁగా కలువలు సతీర్థము లగుటచే శ్యామాళిమైత్త్రిని, ఏణికాళి సపక్షత దాల్చుటచే నిరతచకితస్వభావమును, కాటుక పిట్టలు సపక్షములగుటచే అతనువాజిభావమును పంకజములు సమిత్త్రము లగుటచే పక్ష్మసమాజలబ్ధిని, చంద్రికానయనము లొందుట యరుదు గాదనుట. ఆమె నేత్రములు కలువలను, జింకలను, కాటుకపిట్టలను, తామరలను బోలియున్నవని భావము. బంధుశ్చౌర స్సుహృ ద్వాదీత్యాదిపూర్వోక్తప్రమాణ మిందు గమనింపవలయు.
చ. నరవరతాపదాత్మకత ◊నాతి తపాంతరమాభ మించఁగా
హరిహయచాపముల్ బలె న◊యారె బొమ ల్గనుపట్టు నాపయి
న్సరససువర్ణసూనసర◊చంచలతోఁ జెలువందు కైశ్యకం
ధర మిలఁ గాలకంఠకుల◊దర్పవిభేదనశక్తి నొప్పఁగన్. 24
టీక: నాతి=చంద్రిక; నరవరతాపదాత్మకతన్ – నరవర=రాజులకు, తాప=సంతాపమును, ద=ఇచ్చెడు,ఆత్మకతన్= స్వభా వము గల్గుటచేత, మనుష్యశ్రేష్ఠులకు తాపమును బోఁగొట్టెడు స్వభావము గలుగుటచేత; తపాంతరమాభన్ – తపాంతరమా =వర్షాసంపదయొక్క, ఆభన్=కాంతివంటికాంతిచేత; మించఁగాన్=అతిశయింపఁగా; బొమల్=కనుబొమలు; హరిహయ చాపముల్ బలెన్=ఇంద్రధనువులవలె; కనుపట్టున్=అగపడును; ఆపయిన్=ఆపైని; సరససువర్ణసూనసరచంచలతోన్ – సరస=శ్రేష్ఠములగు, సువర్ణసూన=సంపెంగపువ్వులయొక్క,సర=హారమనెడు,చంచలతోన్=మెఱపుతో; చెలువందు కైశ్యకంధరము=ఒప్పునట్టి కేశసమూహ మనెడు మేఘము; ఇలన్=భూమియందు; కాలకంఠకులదర్పవిభేదనశక్తిన్ – కాలకంఠ= నీలకంఠములగు నెమిళ్ళయొక్క, హంససంబంధియగు, కుల=సమూహముయొక్క, ‘కలకణ్ఠః కలధ్వానే హంసే పారావతే పికే’ అని విశ్వము, శ్లిష్టరూపకము, దర్ప=గర్వముయొక్క, విభేదనశక్తిన్=భేదించుసామర్థ్యముచేత; ఒప్పఁగన్=ప్రకాశిం పఁగా, కనుపట్టున్ అను వెనుకటి క్రియతో నన్వయము; అయారె=ఆశ్చర్యము!
అనఁగా చంద్రిక వర్షాసంపదను బోలియుండఁగా నామెకనుబొమలు ఇంద్రధనువులను బోలినవనియు, కేశచయ మనెడు మేఘము సంపెఁగపూదండ యను మెఱపుతోఁ గూడినదై నెమిళ్ళను హంసలను బాఱఁదోలుశక్తి కలిగి యుండె ననియు భావము. ఇందు కనుబొమలు వర్ణింపఁబడియె.
మ. వరబాల్యాహ మడంగ యౌవననిశా◊వక్త్రంబునం గంజజి
త్కర దంతాంశుకశోణకాంత్యుదయరా◊గశ్రీలు హాసావదా
తరుచుల్ గన్పడఁ బ్రాచిఁ బోల నలిక◊స్థానంబు దృక్చంద్రికా
శ్యురుహర్షం బొనగూర్చు సామ్యుదితచం◊ద్రోత్కర్షమున్ బూనుచున్. 25
టీక: వరబాల్యాహ మడంగన్ – వర=శ్రేష్ఠమగు, బాల్య=శైశవమనెడు, అహంబు=పగలు, అడంగన్=శమింపఁగా; యౌవన నిశావక్త్రంబునన్ =తారుణ్యమనెడు ప్రదోషసమయమందు, ‘ప్రదోషో రజనీముఖమ్’ అని యమరుఁడు; దంతాంశుకశోణకాం త్యుదయరాగశ్రీలు – దంతాంశుక=అధరముయొక్క,శోణకాంతి=అరుణప్రకాశమనెడు, ఉదయరాగశ్రీలు=ఉదయకాలిక రాగసంపదలు; హాసావదాతరుచుల్ – హాస=చిఱునగవుయొక్క, అవదాత=శుభ్రములగు,రుచుల్=కాంతులు; కన్పడన్ =అగపడుచుండఁగా; కంజజిత్కర=చంద్రిక; ప్రాచిన్=తూర్పును; పోలన్=పోలుచుండఁగా; అలికస్థానంబు=ఫాలస్థలము, ఇది కర్త; సామ్యుదితచంద్రోత్కర్షమున్ –సామ్యుదిత= సగముదయించిన, చంద్ర=చంద్రునియొక్క, ఉత్కర్షమున్= ఉత్క ర్షమువంటి యుత్కర్షమును; పూనుచున్ =వహించుచు; దృక్చంద్రికాశ్యురుహర్షంబు – దృక్ =కన్నులనెడు, చంద్రికాశి= వెన్నెలపిట్టలయొక్క, ఉరు=అధికమగు, హర్షంబు=సంతసమును; ఒనగూర్చున్=చేయును.
అనఁగా బాల్యమను దివసముయొక్క యవసానమై, తారుణ్యమను నిశయొక్క ప్రాదుర్భావ మగునపుడు అధరారుణ్య మును, హాసావదాతరుచులును గన్పడఁగాఁ జంద్రిక పూర్వదిశను బోలియుండు ననియు, ఫాలస్థల మర్ధోదితచంద్రుని బోలి యుండు ననియు, నేత్రములు చకోరములఁ బోలు ననియు భావము. ఇట నలకస్థలము వర్ణితం బయ్యె.
మ. ఘనముక్తామయకుండలద్యుతులఁ ద◊త్కాంతాశ్రుతు ల్సాటిగా
వని నవ్వన్ సరి దామె యంచు నతితీవ్రా◊గ్నిచ్ఛటాతప్తతై
లనికాయంబులు ముట్టి శష్కులులు ని◊ల్వ న్మేల్రుచిం గాంచి యం
గన లేగింతురు సారెపేర రహి ని◊క్కం బ్రత్యగారమ్మునన్. 26
టీక: తత్కాంతాశ్రుతుల్=ఆచంద్రికయొక్క కర్ణములు; ఘనముక్తామయకుండలద్యుతులన్ – ఘన=గొప్పలగు, ముక్తామయ కుండల=మౌక్తికవికారములగు కమ్మలయొక్క, ద్యుతులన్=కాంతులచేత; సాటిగావని =శష్కులులు సరిగావని; నవ్వన్= నవ్వఁగా; శష్కులులు =చక్కిలములు; సరి తామె యంచున్ = తామే సాటియైన వనుచు; అతితీవ్రాగ్నిచ్ఛటాతప్తతైలనికా యంబులు – అతితీవ్ర=మిక్కిలి దుస్సహమగు, అగ్నిచ్ఛటా=అగ్నిపరంపరలచేత,తప్త=కాలినట్టి, తైలనికాయంబులు =తైల సమూహములను; ముట్టి=తాఁకి; మేల్రుచిన్=మంచికాంతిని, మంచి స్వాదువును;కాంచి=పొంది; నిల్వన్=నిల్వఁగా; అంగనలు = కాంతలు; సారెపేరన్ = సారెయను నెపమున; రహి=ప్రీతి; నిక్కన్=అతిశయింపఁగా; ప్రత్యగారమ్మునన్=ప్రతిగృహము నందును; ఏగింతురు=ఊరేగింతురు. బాసచేసి గెలిచినవారిని నూరేగించుట ప్రసిద్ధము. చంద్రికాకర్ణములు శష్కులులను బోలి యున్నవని తాత్పర్యము.
చ. తరుణిమొగంబె తా నని సు◊ధానిధి విష్ణుపదమ్ము ముట్టి దు
ష్కరకరజాతపాండిమ వి◊గర్హితుఁడై యశుచిం గృశింపఁ బం
కరుహము తన్ముఖోపమము ◊గా నని తా హరిపాద మంటి యిం
దిర దనుఁ జేరఁ గీర్తిఁ గని ◊దీపితజీవన మయ్యె నెంతయున్. 27
టీక: సుధానిధి=చంద్రుఁడు; తాను; తరుణిమొగంబె=చంద్రికయొక్క ముఖమే; అని=ఇట్లు వచించి; విష్ణుపదమ్మున్ = నారాయ ణుని చరణమును; ముట్టి =స్పృశించి, అనఁగా నేనామె ముఖమే కాని వేఱు గానని భగవంతుని చరణము బట్టి బాసచేసి యనుట, సుధానిధి విష్ణుపదమును అనఁగా నాకాశమును ముట్టి యున్నాడని సహజార్థము; దుష్కర కర జాత పాండిమన్ – దుష్కర = అచికిత్స్యమైన, కర=హస్తములయందు,జాత=పుట్టినట్టి, పాండిమన్=పాండురోగముచేత, దుర్లభమైన కిరణములయందలి ధావళ్యముచేత నని స్వభావార్థము; విగర్హితుఁడై=నిందితుఁడై; వి=చక్రవాకపక్షిచేత, గర్హితుఁడై యని స్వభావార్థము; అశుచిన్= మాలిన్యముచేత, కృష్ణపక్షమందు; కృశింపన్=క్షీణింపఁగా, కృష్ణపక్షమందు చంద్రుఁడు క్షీణుఁడగుట ప్రసిద్ధము; పంకరుహము =పద్మము; తన్ముఖోపమము – తత్=ఆచంద్రికయొక్క, ముఖ=మోముతో, ఉపమము=పోలికగలదానను; కానని; తాన్= కమలము; హరిపాద మంటి =నారాయణుని చరణము ముట్టి, సూర్యునికిరణము తాఁకి; ఇందిర =సంపద, లక్ష్మీదేవి; తనున్ చేరన్= తనను పొందఁగా, కమలము లక్ష్మికి వాస మగుట ప్రసిద్ధము; కీర్తిన్=యశస్సును, బురదను, ‘కీర్తి ర్యశసి కర్దమే’ అని విశ్వము; కని=పొంది; ఎంతయున్=మిక్కిలి; దీపితజీవనము=మంచిబ్రతుకు గలది, ప్రకాశింపఁజేయఁబడిన జలము గలది; అయ్యెన్=ఆయెను.
ఇట న్యాయమార్గము నవలంబించి సత్యమునందున్నవాఁడు మిగుల సంపదగలవాఁడై, కీర్తిమంతుఁడై, మంచిజీవనము గల వాఁ డగుననియు, అన్యాయము నవలంబించి బాసలు లోనగునవి చేయువాఁడుపాపరోగములు గలిగి గర్హితుఁడై క్షయించు ననియు వస్తుకృతవస్తుధ్వని యగును. చంద్రుఁడు, పద్మము ఈరెండును చంద్రికావదనమునకు సాటి గా వని ఫలితార్థము.
సీ. శుభకలాపాప్తి మిం◊చుమయూరి ఘనపోష్య,కోటిలోఁ దొలుదొల్తఁ ◊గొమరు గాంచె,
నఖిలశిరోధార్య◊యైన యుదీచ్యసం,తతి స్వవాలాఖ్యాన◊గతి రహించె,
నతనుగుణస్ఫూర్తి ◊నలరుహిందోళౌఘ, మనివారితాళితా◊వ్యాప్తి నెనసె,
వరరసోన్నతి నొప్పు ◊వర్షుకాంభోదజా,తము సుమనోహిత◊త్వమున వెలసె,
తే. నైన భాస్వత్సహాయత ◊స్వాంతసీమ, నించు కంతయుఁ గోరక ◊మించుతమము
తరుణి కైశ్యంబుతో విరో◊ధంబు గాంచి,చిత్రము మహానిశోదయ◊శ్రీల మనుట. 28
టీక: శుభకలాపాప్తిన్=శుభపరంపరాప్రాప్తిచేత, శుభమైన పింఛముయొక్క ప్రాప్తిచేత; మించుమయూరి =అతిశయించుచున్న మయూరస్త్రీ; ఘనపోష్యకోటిలోన్ – ఘనపోష్య=అధికమగునట్లుగాఁ బోషింపఁదగినవారియొక్క, మేఘములచేతఁ బోషింపఁ దగినవారియొక్క, కోటిలోన్=సమూహములో; తొలుదొల్తన్=మొట్టమొదట; కొమరున్=మనోహరతను; కాంచెన్=పొందెను. అనఁగాఁ గళ్యాణపరంపరతోఁ గూడిన మయూరి తరుణికైశ్యమునకు ఘనపోష్యకోటిలోఁ జేరిన దని భావము. మయూరి కలా పముతోఁ గూడియుండుటయు, మేఘములపోష్యకోటిలో జేరి యుండుటయు స్వభావము. అఖిలశిరోధార్య = అనఁగా నందఱకును బహుమానము చేయఁ దగినది, ఎల్లరకును శిరమున ముడువఁ దగినది; ఐన ఉదీచ్య సంతతి = అయినట్టి కురువేరుగుంపు; స్వవాలాఖ్యానగతిన్ – స్వ=తనయొక్క, వాల (=బాల)=శిశువనెడు, ఆఖ్యానగతిన్= అభిధానరీతిచేత, తనదు వాలమనెడు పేరు వొందుటచేత; రహించెన్= ఒప్పెను; ‘వాలం హ్రీబేర బర్హిష్ఠోదీచ్యా కేశాంబునామ చ’ అని యమరశేషము; అతనుగుణస్ఫూర్తిన్ – అతనుగుణ=దొడ్డగుణములయొక్క, స్ఫూర్తిన్ =ప్రకాశముచేత, మరుని యల్లెత్రాడనెడు ప్రకాశము చేత; అలరుహిందోళౌఘము = ఒప్పారు తుమ్మెదలగుంపు, ‘హిందోళౌ రాగ మధుపౌ’ అని యుత్పలము; అనివారితాళితా వ్యాప్తిన్ – అనివారిత=నివారింపఁబడని, ఆళితా= సఖీత్వముయొక్క, మధుపభావముయొక్క, వ్యాప్తిన్=వ్యాప్తిని; ఎనసెన్= పొందెను;భృంగపంక్తి అతనుగుణస్ఫూర్తి నలరుటచేతఁ జంద్రికాకైశ్యమునకు సఖీత్వమును గాంచిన దనుట. భృంగపంక్తి స్మర గుణస్ఫూర్తి నలరుటయు అళి యనుపేరిచే మహిత మగుటయుఁ బ్రసిద్ధము. వరరసోన్నతిన్ = శ్రేష్ఠమగు నాసక్త్యతిశయముచేత, వరమైన జలాధిక్యతచేత; ఒప్పు వర్షుకాంభోదజాతము = ఒప్పుచున్నట్టి వర్షించు మేఘములసముదాయము; సుమనోహితత్వమునన్=మిక్కిలి మనమునకు హితమగుటచేత, జాజికి హితమగుటచేత; వెలసెన్=ప్రకాశించెను. ఆమెకైశ్యమునకు భక్త్యతిశయము గల వర్షుకమేఘము కైశ్యముయొక్క మనసునకు హితమగుటచే వెలసె ననుట. వర్షుకమేఘము జలోన్నతిచే నొప్పుటయు, జాజికి హితమగుటయుఁ దెల్లము. ఐనన్=వీనిస్థితి యెల్లను నిట్లైనను; భాస్వత్సహాయత= మంచి సహాయసమూహము, సూర్యుని సాహాయ్యము; స్వాంతసీమన్ =హృదయప్రదేశమందు; ఇంచుకంతయున్ = కొంచెమైనను; కోరక=అభిలషింపక; మించుతమము=అతిశయించు నంధకా రము; తరుణి కైశ్యంబుతోన్=చంద్రికయొక్క కేశసమూహముతోడ; విరోధంబు గాంచి = పగఁ బూని; మహానిశోదయశ్రీలము – మహత్=అధికమైన, అనిశ=సార్వకాలికమైన, ఉదయశ్రీలము = ఉదయలక్ష్మి గలదానను; మహత్=అధికమైన,నిశా= రాత్రి యందలి, ఉదయశ్రీలము = ఆవిర్భావలక్ష్మి గలదానను, ‘లక్ష్మీవాన్ లక్ష్మణ శ్శ్రీలః’ అని యమరుఁడు; అనుట=అని నుడువుట; చిత్రము = ఆశ్చర్యము!
అట్లు శుభకలాపాప్తి, అఖిలశిరోధార్య యగుట, అతనుగుణస్ఫూర్తి, వరరసోన్నతి – వీనిచే నొప్పుచున్న మయూర్యు దీచ్యహిందోళవర్షుకాభ్రములు, చంద్రికాకైశ్యమునకు వరుసగ ఘనపోష్యకోటిలోఁజేరుటయు, వాలాఖ్యానగతి దాల్చుటయు, ఆళిత్వమును గాంచుటయు, సుమనోహితమగుటయు, సహజములైనను, మంచిసహాయ మించుకైన లేక మించు నంధకారము తత్కైశ్యమువలె మహానిశోదయశ్రీల మనుట చిత్ర మని భావము.అంధకారము సూర్యసాహాయ్యములేనిదగుటవలన, నిశలోన మాత్ర ముదయశ్రీగల దాన ననవచ్చును గాని అనిశోదయశ్రీ యనఁగాఁ బగటియందును ఉదయశ్రీ గలదాన ననుకొనుట చిత్ర మనియు తెలియవలయు. చంద్రికాకైశ్యము మయూర్యుదీచ్యభృంగసంఘవర్షుకాభ్రతమముల మించియున్నదని భావము.
మ. అలరుంగల్వలనీటు, మంచుజిగియొ◊య్యారంబునుం, దమ్మిమొ
గ్గలచెల్వంబును, గెంపుదామరల చొ◊క్కాటంపుటందంబు, రి
క్కలడాల్ పెంపును, మించ నిచ్చెలువురే◊ఖం బొల్చు నాశ్యామ ని
ర్మలరక్తిం గన రాట్సుతేక్షణచకో◊రంబుల్ ముదం బూనవే. 29
టీక: ఇట్లు చంద్రికావయవములను నఖకచాంతము వర్ణించి యీపద్యమున వాని మొత్తము యథాసంభవముగ వర్ణితంబయ్యె. ఏలా గనిన: అలరుంగల్వలనీటు=ఒప్పుచున్న కువలయములయొక్క శృంగారవిశేషము, కలువ లనఁగా నట్లు నిశ్చయింపఁ బడిన కన్నులు; మంచుజిగియొయ్యారంబునున్=హిమదీధితియొక్క సౌందర్యగర్వము, అనఁగా నట్లు నిశ్చితమగు మోము; తమ్మిమొగ్గలచెల్వంబును = పద్మముకుళములయొక్క యందమును, అనఁగాఁ జందోయి యనుట; కెంపుదామరల చొక్కా టంపుటందంబు = రక్తోత్పలములయొక్క చొక్కమగు నందము, అనఁగాఁ బైవిధముగ హస్తము లని భావము; రిక్కలడాల్ పెంపును= నక్షత్రకాంతియొక్క యతిశయమును, గోరు లనుట; మించన్=అతిశయింపఁగా; ఇచ్చెలువు రేఖన్ = పైఁజెప్పిన సౌందర్యరీతిచేత; పొల్చు నాశ్యామన్= ఒప్పుచున్న యాయౌవనమధ్యస్థ యగు చంద్రికను, రాత్రి నని యర్థాంతరము తోఁచు చున్నది. తత్పక్షమందుఁ గల్వలనీటు, మంచుజిగి లోనగువానికి శక్యార్థమే సమన్వయించు నని తెలియవలయు; నిర్మలరక్తిన్ =మంచి యనురాగముచేత; కనన్=చూడఁగా; రాట్సుతేక్షణచకోరంబుల్ – రాట్సుత=రాచకొమరులయొక్క, ఈక్షణచకో రంబుల్= దృష్టు లనెడి వెన్నెలపిట్టలు; ముదంబు=సంతోషమును; ఊనవే=వహింపవా? వహించు ననుట.
అనఁగాఁ గల్వలనీటు, మంచుజిగియొయ్యారంబు, తమ్మిమొగ్గలచెల్వంబు, కెంపుదామరలయందంబు, రిక్కలడాల్ పెంపు వీనితోఁ బొల్చు రాత్రిని గనినంతనే చకోరములకు సంతసము గల్గినట్లు గల్వలను బోలు కన్నులును, చంద్రునిబోలు ముఖ మును, తమ్మిమొగ్గలఁబోలు చందోయియు, కెందామరలను బోలు కరములును, రిక్కలను బోలు గోళ్ళును గలిగి విరాజిల్లు యౌవనమధ్యస్థ యగు నామెను జూచినమాత్రనె రాకొమరులనేత్రములకుసంతసము గలుగు నని భావము.
ఇట ‘వాపీ కాపి స్ఫురతి గగనే తత్పరం సూక్ష్మపద్యా సోపానాళీ మధిగతవతీ కాఞ్చనీ మైన్ద్రనీలీ| అగ్రే శైలౌ సుకృతి సుగమౌ చందనచ్ఛన్నదేశౌ తత్రత్యానాం సులభ మమృతం సన్నిధానా త్సుధాంశోః’ ఇత్యాదులయందువలె సాధ్యవసాయ లక్షణచేత కువలయాదిశబ్దములకు నయనాదిరూపార్థము చెప్పుకొనవలయును. సాధ్యవసాయలక్షణ యనఁగా లక్షణలో నొకభేదము. లక్షణ యనఁగా శబ్దవృత్తులలో నొక్కటి. వాచకము, లక్షకము, వ్యంజకము అని శబ్దము ముత్తెఱంగులు. అందు సాక్షాత్సంకేతితార్థమును జెప్పునది వాచకము, లక్ష్యార్థమును జెప్పునది లక్షకము, వ్యంగ్యార్థమును జెప్పునది వ్యంజకము. సంకేత మనఁగాఁ బదపదార్థసంబంధవిశేషము, అదియే శక్తి యనఁ బరగుచు రూఢి, యోగము, యోగరూఢి యని త్రైవిధ్య మొందును. శాస్త్రకృత్కల్పితావయవార్థనైరపేక్ష్యముచే విశిష్టార్థబోధకమగు గవాదిశబ్దములందలివ్యాపారము రూఢి యనియు శాస్త్రకృత్కల్పితావయవార్థమాత్రసహకారముచే నర్థమును జెప్పు పాచకాది శబ్దగతవ్యాపారము యోగము అనియు, పైవిధ మైన యవయవార్థసహకారముచేత విశిష్టార్థమును జెప్పు పంకజాది శబ్దగతవ్యాపారము యోగరూఢి యనియుఁ దెలియ వలెను. ఇఁక స్వశక్యసంబంధము లక్షణనాఁ బరగు. ‘గంగాయాం ఘోషః’ అనుచోట గంగాపదశక్యము ప్రవాహము, దానితో సంయోగసంబంధము ఘోషమునకు లేనందున వాక్యార్థానుపపత్తిపరిహారమునకై గంగాపదమునకు తీర మర్థమనుట కీలక్షణ యంగీకృతంబయ్యె. ఇది ప్రయోజనవతి, నిరూఢ అని రెండు విధములు. కొంచెము ప్రయోజనము నుద్దేశించి యాశ్రయించు నది ప్రయోజనవతి, ‘గంగాయాం ఘోషః’ ఇత్యాదిస్థలములయందు గంగాగత శైత్యపావనత్వాది ప్రతీతిప్రయోజనము నపే క్షించి యాశ్రయింపఁబడినందునఁ బ్రయోజనవతి, ‘కర్మణి కుశలః’ఇత్యాదిస్థలములలోఁ గుశలాదిపదములకు ‘కుశాన్ లూనాతీతి కుశలః’ ఇతి వ్యుత్పత్తి సిద్ధావయవార్థసంబంధనైరపేక్ష్యముగ చతురుండు బోధితుఁడగుచున్నాఁడు గావున నిరూఢ లక్షణ యగును. ఈలక్షణ గౌణి యని శుద్ధ యనిప్రకారాంతరమున ద్వివిధ యగును. సాదృశ్యసంబంధమూలకలక్షణ గౌణి యగును, తదితరసంబంధమూలక యగునది శుద్ధ యగును. ఈశుద్ధ జహత్స్వార్థ యని యజహత్స్వార్థ యని ద్వివిధము. స్వార్థమును పరిహరించి కేవల లక్ష్యార్థమునె చెప్పునది జహత్స్వార్థ. ‘గంగాయాం ఘోషః’ అనుచోట శక్యార్థమైన ప్రవాహ మునకు శాబ్దబోధలలో భావములేనందున నది జహత్స్వార్థ యగును. ‘కున్తాః ప్రవిశన్తి’ ఇత్యాదిస్థలములయందు శక్యార్థమగు కుంతములకుఁ బ్రవేశక్రియయం దన్వయముండుటంబట్టి అజహత్స్వార్థ యైనది. ఇఁక సారోప యనియు, సాధ్యవసానిక యనియు లక్షణ ప్రకారాంతరమున ద్వివిధయై యొప్పు. సారోప యనఁగా నారోపముతోఁ గూడినది, ఆరోపము ఆహార్యనిశ్చ యము. ‘గౌ ర్వాహికః, అగ్ని ర్మాణవకః సింహో మాణవకః’ ఇత్యాదిస్థలములయందు సాదృశ్యముచేతను, ‘ఆయుర్ఘృతమ్’ ఇత్యాదులయందుఁ గార్యకారణాది సంబంధములచేతను, వాహికాదులయందు గోత్వాద్యారోపమున సారోప యనియు, విషయిమాత్రము నిలిచి, విషయము దానిచే లక్ష్యము గాఁదగియున్నచోట అనఁగ,‘అయంగౌః, అయమగ్నిః, అయం సింహః’ ఇత్యాదిస్థలములయందు సాధ్యవసానిక యనియుఁ దెలియవలయు. ఇట్లత్యంతాభేదముగఁ జెప్పుటకు అదియే యిది యని యతిశయోక్తి ఫలము. కావుననె ‘విషయస్యానుపాదనాత్ విషయ్యుపనిబధ్యతే| యత్ర సాతిశయోక్తి స్స్యా త్కవిప్రౌఢోక్తి సమ్మతా’ అని యాలంకారికులుదీని నతిశయోక్త్యలంకారభేదముగా గణించినారు. ఇఁక వ్యంజనాదిభేదములు అధికముగా నుండుటచే విస్తరభీతిని విరమించితి.
శా. ఆవామేక్షణవిభ్రమస్ఫురణమా ◊యాతన్వియొయ్యారమా
యావామామణిచారుదీప్తిచయమా ◊యాకొమ్మసౌందర్యమా
యావక్రాలకసత్కళావిభవమా ◊యాలేమబిబ్బోకమా
భావంబందు నుతింప నల్వ వశమా ◊పద్మాప్తవంశోత్తమా! 30
టీక: పద్మాప్తవంశోత్తమా =సూర్యవంశపురాజులలో నుత్తముఁడ వగు సుచంద్రుఁడా! ఆవామేక్షణవిభ్రమస్ఫురణమా = ఆ చంద్రికయొక్క విలాసస్ఫురణమా! ‘విభ్రమ స్త్వరయా కాలే భూషాస్థానవిపర్యయః’ ఇత్యుక్తలక్షణవిభ్రమము ఇచట సంభవిం పమివలన విభ్రమశబ్దమునకు విలాసార్థము గ్రహించిన మేలని తలంచెద. ఇట్లు ‘ఇష్టేప్యనాదరో మానాద్గర్వా ద్బిబ్బోక ఈరితః’ అను లక్షణముచే లక్షితమైన బిబ్బోకము మాత్రము గాక ముందు బిబ్బోకపదము శృంగారచేష్టాసామాన్యపరముగానే చెప్పు కొనవలయు నని తోఁచుచున్నది; ఆతన్వియొయ్యారమా =ఆచంద్రిక సౌందర్యగర్వమా! ఆవామామణిచారుదీప్తిచయమా = స్త్రీరత్నమగు నాచంద్రికయొక్క మనోజ్ఞకాంతిపుంజమా! ‘కాంతి రేవ వయోభేద దేశకాలగుణాదిభిః| ఉద్దీపి తాతివిస్తారం యాతా చేద్దీప్తి రుచ్యతే’ అని దీప్తిలక్షణము. కాంతిలక్షణము వెనుక వ్రాయంబడియె; ఆకొమ్మసౌందర్యమా = ఆచంద్రికా సంబంధి యగు సౌందర్యమా! ఆవక్రాలకసత్కళావిభవమా = కుటిలాలక యగు నాచంద్రికయొక్క శ్రేష్ఠవిద్యావిభవంబా! ఆలేమబిబ్బోకమా = ఆచిన్నదానియొక్క శృంగారచేష్టయా! భావంబందున్ = మనసునందైనను; నుతింపన్=కొనియాడు టకు; నల్వ వశమా = బ్రహ్మ తరమా?
అనఁగా బ్రహ్మకైన సాకల్యముగ నామె గుణగణము తెలిసి మనసునందైనఁ గొనియాడ వశముగా దని తాత్పర్యము. లోకోత్తర సౌందర్యవతి యని ధ్వని.
చ. అలఘుమనోభవోదయక◊రాంగయుతిం దగు నామిళిందకుం
తల, నలమీననేత్ర, నల◊తామరసానన, నాపికారవో
జ్జ్వలవరమంజులాబ్జగళ◊సంగత, నాబిసబాహ, నాప్రవా
ళలలితపాద, నాచెలిఁ ద◊లంపఁగ నీకెతగు న్నృపాలకా! 31
టీక: నృపాలకా = సుచంద్రుఁడా! అలఘుమనోభవోదయకరాంగయుతిన్ – అలఘు=అధికమగునట్లు, మనోభవోదయకర =కామోదయకరమగు, అంగ=అవయవములతోడి, యుతిన్=కూడికచేత; తగు=ఒప్పునట్టి; ఆమిళిందకుంతలన్=ఆతుమ్మె దలఁబోలు కురులు గల యామెను; అలమీననేత్రన్=ఆమీలఁబోలు కన్నులుగల యామెను; అలతామరసాననన్=ఆతమ్మినిఁ బోలు మోముగల యామెను; ఆపికారవోజ్జ్వలవరమంజులాబ్జగళసంగతన్ – ఆపికారవోజ్జ్వల=ఆకోయిల పలుకులఁబోలు పల్కులచేఁ బ్రకాశించునదియు, వరమంజులాబ్జగళసంగతన్ = శ్రేష్ఠమగు శంఖమును బోలినదియు నగు కంఠ ముతోఁ గూడిన దియు నగు నామెను; ఆబిసబాహన్=ఆతామరతూండ్లనుబోలు బాహువులు గల యామెను; ఆప్రవాళలలితపాదన్=ఆచిగు రుటాకులవలె మనోజ్ఞములగు పాదములు గల యామెను; ఆచెలిన్=ఆస్త్రీని; తలంపఁగన్=స్మరింపఁగా; నీకె తగున్ = నీకే యుక్తము.
ఇటఁ జెప్పిన మిళిందములు,మీనములు, తమ్ములు, పికములు,శంఖములు, తామరతూడులు, చిగురుటాకులు ఇవి యెల్ల స్మరసామగ్రులలోఁ జేరి యుద్దీపనవిభావములుగాఁ జెప్పఁబడినవి కావున వానిని బోలు నవయవములు గలిగిన చంద్రిక మనోభవోదయకరాంగయుతిచేతఁ దగు నని భావము.
ఉద్దీపనవిభావము లనఁగా విభావవిశేషములు, విభావ మనునది రసోత్పాదనకారణంబు. ఇట రసశబ్దము రసస్థాయి యగు రతిహాసక్రోధాదులపరము గాని యద్వితీయానందాత్మకమయిన రసము పరము గాదు. అట్లయిన బ్రహ్మానందరూప మయి నిత్యమగుదాని కుత్పత్తిలయములు చెప్పవలసి వచ్చును. కారణ మనఁగాఁ గార్య నియత పూర్వవర్తి. ఇట్లా యుత్పా దనకారణంబు రెండు విధములు, ఆలంబనము, ఉద్దీపనము అని. రత్యాదుల కెద్ది యాలంబనమో అనఁగా విషయమో యది యాలంబనవిభావము. ఎట్లన, దుష్యంతునిరతికి శకుంతల యాలంబనము గనుక నాతని రతి కామె యాలంబనవిభావము. ఇట్లామెరతి కాయన యాలంబనవిభావ మగును. రత్యాదులఁ బోషించునవి యుద్దీపనవిభావములు. మలయానిల చంద్రోద యాదులు రతిని బోషించునవి గాన నుద్దీపనవిభావము లనం బరఁగు. ఇది యెల్లను, ‘విభావః కథ్యతే తత్ర రసోత్పాదన కారణమ్| ఆలమ్బ నోద్దీప నాత్మా సద్వేధా పరికీర్తితః| ఆలమ్బన న్నాయికా స్స్యు ర్దక్షిణాద్యాశ్చ నాయకాః|ఆలమ్బన గుణ శ్చైవ తచ్చేష్టా తదలంకృతిః| తటస్థ శ్చేతి విజ్ఞేయ శ్చతుర్థోద్దీపనక్రమః| ఆలమ్బన గుణో రూప యౌవనాది రుదాహృతః| తచ్చేష్టా యౌవనోద్భూత హావభావాదికా మతా| నూపురాఙ్గదహారాది తదలంకరణ మ్మతమ్| మలయానిల చంద్రాద్యా స్తటస్థాః పరికీర్తితాః|’ ఇత్యాది శాస్త్రప్రమాణములవలనఁ దెలియఁదగు. లోకమునఁ గారణములని, కార్యములని, సహకారులని చెప్పఁ బడునవియె కావ్యనాట్యములయందు విభావాదిశబ్దములతో వ్యవహరింపంబడు. ‘కారణాన్యథ కార్యాణి సహకారీణి యాని వై| రత్యాదేః స్థాయినో లోకే తానిచే న్నాట్యకావ్యయోః| విభావా అనుభావాశ్చ కథ్యన్తే వ్యభిచారిణః|’ అను కావ్యప్రకాశము వలన నీవిషయము వ్యక్తం బగును.
చ. సరసతరోక్తి నమ్ముని సు◊చంద్రసమాఖ్య రహించుభూపతిం
బరిణయ మందు మంచు సకిఁ ◊బల్కెఁ దదాఖ్య రహించుమేదినీ
శ్వరమణి వీవె కాన నల◊సారసలోచన ని న్వరించు న
ప్పరమయతీశువాక్తతి య◊పార్థతఁ గైకొనునే మహీస్థలిన్. 32
టీక: అమ్ముని = పూర్వమందు ద్వితీయాశ్వాసమునఁ జెప్పఁబడిన వసంతుఁ డను నాముని; సరసతరోక్తిన్ = మిక్కిలి రస వంతమైన వాక్కుచేత; సుచంద్రసమాఖ్యన్ రహించుభూపతిన్ – సుచంద్రసమాఖ్యన్=సుచంద్రుఁడను పేరిచేత, రహించు = ఒప్పుచున్న, భూపతిన్=రాజును; పరిణయ మందుము=వివాహమాడుము; అంచున్=అనుచును; సకిన్=చిత్రరేఖనుగూర్చి; పల్కెన్=వచించెను; తదాఖ్యన్=ఆసుచంద్రుఁడను పేరిట; రహించు=ఒప్పుచున్న; మేదినీశ్వరమణివి = రాజశ్రేష్ఠుఁడవు; ఈవె కానన్=నీవే కావున; అలసారసలోచన = పద్మనయన యగు నాచంద్రిక; నిన్ వరించున్ =నిన్నుఁ గోరును; మహీస్థలిన్=భూ తలమందు; అప్పరమయతీశువాక్తతి=ఆమునిశ్రేష్ఠుని వాక్యసమూహము; అపార్థతన్=అయథార్థతను; కైకొనునే =పొందునా? పొందదనుట. దానంజేసి నీ వవశ్యముగాఁ దత్పరిణయమునకై యత్నింపవలయు, నీప్రయత్నము సఫలమగునని భావము.
మ. అని యిట్లాత్మకథాప్రవృత్తి కలవా◊హాస్యుం డుపోద్ఘాతవ
ర్తన రాజిల్ల వినిర్మలోక్తిచయధా◊రం జంద్రికాసుందరీ
జననైకక్రమ మంతయుం దెలుప ని◊ష్ఖండైకతానాత్మచే
విని యాశ్చర్యసమగ్రతం బెనిచెఁ బృ◊థ్వీభర్త చిత్తంబునన్. 33
టీక: అని ఇట్లు; అలవాహాస్యుండు = కుముదుండను పేరు గల యాకిన్నరుఁడు; ఆత్మకథాప్రవృత్తికిన్ – ఆత్మ=తనయొక్క, కథా=కథయొక్క, ప్రవృత్తికిన్=ప్రసక్తికి; ఉపోద్ఘాతవర్తన=ఉపోద్ఘాతస్థితి;రాజిల్లన్=ప్రకాశించునట్లు; వినిర్మలోక్తిచయధారన్ = మిక్కిలినిర్మలమైన వాగ్ధారచేత; చంద్రికాసుందరీజననైకక్రమము= సుందరి యగు చంద్రికయొక్క యుత్పత్తియొక్క ముఖ్య మైన క్రమమును; అంతయుం దెలుపన్ = సర్వమును దెల్పఁగా; పృథ్వీభర్త = సుచంద్రుఁడు;నిష్ఖండైకతానాత్మచేన్ – నిష్ఖండ= అఖండమగు, ఏకతాన= ఏకాగ్రతగల, ఆత్మచేన్ = చిత్తముచేత; విని = ఆకర్ణించి; చిత్తంబునన్ = మనస్సునందు; ఆశ్చర్యసమ గ్రతన్= ఆశ్చర్యపరిపూర్తిని; పెనిచెన్= వృద్ధిఁ బొందించెను. అనఁగా లోకోత్తరసౌందర్యశాలిని యగు చంద్రికయొక్క గుణగణ ములు వినఁగా సుచంద్రుఁని కత్యాశ్చరము దోఁచినదని భావము.
శా. పాంచాలీవరవిభ్రమశ్రవణసం◊పద్రేఖనో, మాన్మథా
భ్యంచచ్ఛాంబరికా సమున్నతినొ, పూ◊ర్వాదృష్టసంభూతినో,
మించెం దన్మహిపాలహృత్పదవి ని◊ర్మేయస్థితిం బూను త
త్పంచాస్యోపమమధ్యమాకులమణీ◊భవ్యానురాగాళికల్. 34
టీక: తన్మహిపాలహృత్పదవిన్=ఆసుచంద్రునియొక్కమనోమార్గమందు; పాంచాలీవరవిభ్రమశ్రవణసంపద్రేఖనో – పాంచాలీ =చంద్రికయొక్క,వర=శ్రేష్ఠమగు, విభ్రమ=విలాసములయొక్క, శ్రవణ=వినికిడియొక్క, సంపద్రేఖనో=సంపత్పరంపరచేతనో; మాన్మథాభ్యంచచ్ఛాంబరికాసమున్నతినొ – మాన్మథ=మన్మథసంబంధిని యగు, అభ్యంచత్ = ఒప్పుచున్న, శాంబరికా = మాయయొక్క, సమున్నతినొ=అతిశయముచేతనో; పూర్వాదృష్టసంభూతినో = జన్మాంతరీయాదృష్టసంపత్తిచేతనో; నిర్మే యస్థితిన్=అమేయవృత్తిని; పూను=వహించునట్టి; తత్పంచాస్యోపమమధ్యమాకులమణీభవ్యానురాగాళికల్—తత్= ఆ, పం చాస్యోపమమధ్యమా = సింహమువంటి (సన్ననైన) నడుము గల స్త్రీలయొక్క, కులమణీ=సమూహమందు శ్రేష్ఠురాలైన చంద్రిక యందలి, భవ్యానురాగాళికల్=శుభోదర్కంబులగు అనురాగములగుంపులు; మించెన్ = అతిశయించెను.
అనఁగా సుచంద్రునకుఁ జంద్రికావిషయమై యనురాగోదయ మైనదని తాత్పర్యము. ‘యత్ప్రేమ సంగమాత్పూర్వం దర్శన శ్రవణోద్భవమ్| పూర్వానురాగ స్సజ్ఞేయశ్శ్రవణం తద్గుణశ్రుతిః| ప్రత్యక్ష చిత్ర స్వప్నాదౌ దర్శనం దర్శన మ్మతమ్|’ అనుటవలన దర్శనంబునంబోలె గుణశ్రవణంబునను రాగోదయ మగు. ఇట్లు హంసముఖమున నలగుణశ్రవణమువలన దమ యంతి కనురాగోదయము చెప్పఁబడినది.
ఇట ననురాగ మనఁగా ‘అంకుర పల్లవ కలికా ప్రసూన ఫల భోగ భాగియం క్రమశః| ప్రేమా మానః ప్రణయ స్స్నేహో రాగోఽనురాగశ్చ’ అని చెప్పఁబడిన రతియొక్క షష్ఠావస్థారూపము గాదు. మఱి యేమన్న రతిమాత్రమో, రతిప్రథమావస్థ యగు ప్రేమమో గ్రహింపవలయు. ఇది సంగమపూర్వకాలమందు సుఘటము. ‘యత్ప్రేమ సంగమాత్పూర్వ’ మనునదియు నీపక్షమున నూపపాదము. ఇది ‘నిసర్గే ణాభియోగేన సంసర్గేణాభిమానతః| ఉపమా ధ్యాత్మ్య విషయైః’ అనుటవలన నిసర్గము నను గలుగును. ఇట్లు ‘అలం వివాదేన యథా శ్రుతం త్వయా తథావిధ స్తావ దశేష మస్తు నః| మమాత్రభావైకరసం స్థితం మనో నకామవృత్తి ర్వచనీయ మీక్షతే’ అను కుమారసంభవమందు రూపాదిదృష్టకారణనిరపేక్షమై, జన్మాంతరవాసనారూపమైన రతి శివునియందుఁ బార్వతికి నిసర్గముగఁ జెప్పఁబడినది.
మన్మథమాయ శాస్త్రోక్తరతిజనకసామగ్రిలో స్వతంత్రకారణముగాఁ జూపట్టదు. కాని కార్యమాత్రమును గూర్చి దైవాదృష్టా దులకుఁ గారణత చెప్పుకొన్నట్లు రతిమాత్రమును గూర్చి మన్మథునకుఁ గారణత కవిసమయసిద్ధముగాఁ జెప్పుకొనవలయు. సాహిత్యదర్పణమందు ‘మౌర్వీ లోలమ్బమాలా ధను రథ విశిఖాః కౌసుమాః పుష్పకేతో ర్భిన్నం స్యా దస్యబాణై ర్యువజన హృదయం స్త్రీకటాక్షేణ తద్వత్| ఇత్యాద్యున్నేయ మన్య త్కవిసమయగతం సత్కవీనాం ప్రబన్ధే|’ అని యిది కవిసమయ మని చెప్పఁబడినది. ఇట్లు ‘అపి యది విశిఖా శ్శరాసనం వా కుసుమ మయం ససురాసురం తథాపి| మమ జగదఖిలం వరోరు నాజ్ఞా మిద మతిలఙ్ఘ్య ధృతి మ్ముహూర్త మేతి’ ఇత్యాదిగాఁ బ్రబోధచంద్రోదయకుమారసంభవాది సత్కవిప్రబంధములవలన నూహింపవలయు.
ప్రస్తుతపద్యమునఁ జంద్రికాగుణశ్రుతి మన్మథమాయా జన్మాంతరవాసనాత్మకములగు త్రివిధకారణములలో దేనిచేతనో సుచంద్రునకుఁ జంద్రికయందుఁ బ్రేమోదయమైనదని వచించుటవలన, సుచంద్రునియందుఁ బైకారణత్రయమునకును సంభవము కలదని కవియాశయము సూచితమగుచున్నది.
ఇటఁ బూర్వానురాగరూపమగు విప్రలంభశృంగారంబు వ్యక్తంబు. ‘విప్రలమ్భో విజ్ఞేయ స్స చతుర్ధా నిగద్యతే| పూర్వాను రాగ మానౌ చ ప్రవాస కరుణావితి’ అని సింగభూపాలీయమునఁ దత్ప్రమాణంబు.
విప్రలంభము శృంగారములో నొక భేదము, శృంగార మొక రసము, రసము, ‘శ్లో. విభావై రనుభావై శ్చ సాత్త్వికై ర్వ్యభిచా రిభిః| ఆనీయమాన స్స్వాదుత్వం స్థాయీభావో రస స్స్మృతః’ అనుటచే విభావానుభావ సాత్త్వికభావ వ్యభిచారి భావములచే నిర్భరానందరూపత నొందింపఁబడిన స్థాయిభావంబే. స్థాయిభావ మనఁగా ‘సజాతీయ విజాతీయై రతిస్కృతమూర్తిమాన్, యావద్రసం వర్తమాన స్సస్థాయీ లవణాకరః’ అనుటచే, సజాతీయభావములచేతఁ గాని, విజాతీయభావములచేతఁగాని తిరో ధానము నొందక లవణాకరము దనలోఁ జేరిన మంచినీటిని క్షారరూపము నొందించునట్లు తనలోఁ జేరు భావముల నన్నింటిని తనరూపము నొందించు భావము.అది రతి, హాసము, శోకము, క్రోధము, ఉత్సాహము, భయము, జుగుప్స, విస్మయము, శమము అని నవవిధము. ‘రతి ర్హాస శ్చ శోక శ్చ క్రోధోత్సాహౌ భయం తథా| జుగుప్సా విస్మయ శమాః స్థాయీభావా నవ క్రమాత్’ అని తత్ప్రమాణంబు. ఇఁక విభావ మనఁగా రసోత్పాదకకారణము. అయ్యది ఆలంబనము, ఉద్దీపన మని రెండు విధములు. అందు శృంగారమునకు ఆలంబనము నాయికానాయకులు. ఉద్దీపనము, ఆలంబనగుణము తచ్చేష్ట, తదలంకృతి, తటస్థ మని నాల్గు విధములు గలది. ఏతత్ప్రమాణవచనములు ‘అలఘుమనోభవోదయకరాంగద్యుతిన్’ అను పద్యంపుటీకలో వ్రాయఁబడియె. అనుభావము లనఁగా నాయికానాయకుల హృద్గతములయిన రత్యాదులను దెల్పు భ్రూవిక్షేపకటాక్షాదిక ములు, ‘భావ మ్మనోగతం సాక్షా త్స్వహేతుం వ్యఞ్జయన్తి యే, తేఽనుభావాఇతి ప్రోక్తా భ్రూవిక్షేపస్మితాదయః’ అని తత్ప్రమా ణము. ఇఁక సాత్త్వికములు శరీరభావములు, భావము లనఁగారసానుకూలవికారాత్మకము లనియు, కేవల మనోవికారరూ పము లనియు మతభేదముచేఁ జెప్పఁబడిన వికారవిశేషములు, అవి శారీరము లనియు, మానసము లనియు విభజింపఁబడి నవి. అందు శారీరములు సాత్త్వికము లనియు, మానసములు వ్యభిచారు లనియు నెన్నంబడుచున్నవి. సాత్త్వికములు స్తంభము, ప్రళయము, రోమాంచము, స్వేదము, వైవర్ణ్యము, కంపము, అశ్రువు, వైస్వర్యము అని యెనిమిది. ‘స్తమ్భ ప్రళయ రోమాఞ్చాః స్వేదో వైవర్ణ్య వేపథూ| అశ్రు వైస్వర్య మిత్యష్టౌ సాత్త్వికాః పరికీర్తితాః’ అని తత్ప్రమాణము. వ్యభిచారిభావము లనఁగా విశేషముగ రసాభిముఖములై సర్వరసములయందుఁ జరించుచుండు భావములు. ‘వ్యభీ ఇత్యుపసర్గౌ ద్వౌ విశేషాభి ముఖత్వయోః| విశేషా దాభిముఖ్యేన చరన్తో వ్యభిచారిణః’ అని చెప్పఁబడినవి. అవి ముప్పదిమూఁడు. ‘శ్లో. నిర్వేద గ్లాని శఙ్కాఖ్యా స్తథాసూయా మద శ్రమాః| ఆలస్యం చైవ దైన్యం చ చిన్తా మోహః స్మృతి ర్ధృతిః| వ్రీడా చపలతా హర్ష ఆవేగో జడతా తథా| గర్వో విషాద ఔత్సుక్య న్నిద్రాపస్మార ఏవ చ| సుప్త మ్ప్రబోధోఽమర్షా శ్చా ప్యవహిత్థ మథోగ్రతా| మతి ర్వ్యాధి స్తథో న్మాద స్తథా మరణ మేవ చ| త్రాసశ్చైవ వితర్కశ్చ విజ్ఞేయా వ్యభిచారిణః| త్రయస్త్రింశ దమీ భావా స్సమాఖ్యాతా స్తు నామతః’ అను భరతవచననిచయము తత్ప్రమాణము. ఇట్టివిభావాది కారణసామగ్రిచే నిర్భరానందరూపత నొందింపఁబడిన స్థాయియే రస మై శృంగారము, హాస్యము, కరుణము, రౌద్రము, వీరము, భయానకము, బీభత్సము, అద్భుతము, శాంతము అని నవవిధ మైనది. అందు శృంగారము సంభోగ మనియు విప్రలంభ మనియు రెండు తెగలై యున్నది. సంభోగశృంగారమనఁగా సంయోగ కాలావచ్ఛిన్నరతియు, సంయోగము బహిరింద్రియసంబంధరూప మనియు, ముదితపంచేంద్రియసంబంధాభావరూప విప్ర లంభభిన్నస్వరూప మనియు, సంయుక్తుండను ఇత్యాకారక మతిరూప మనియు నిర్ణీతమైనది. అది పరస్పరావలోక నాలింగ చుంబనాది నానారూపమై సంక్షిప్తము, సంకీర్ణము, సంపన్నము, సమృద్ధ మని నాల్గు భేదములు గలదిగాఁ జెప్పిరి. ‘దర్శన స్పర్శనాదీనా మానుకూల్య నిషేవణమ్| ఘటతే యత్ర యూనో స్స సంభోగోఽయం చతుర్విధః| సంక్షిప్త స్సంకీర్ణ స్సంపన్నతర స్సమృద్ధిమానితి తే| పూర్వానురాగ మాన ప్రవాస కరుణానుసంభవాః క్రమశః’ అని తత్ప్రమాణము. ఇఁక విప్రలంభము వియోగకాలావచ్ఛిన్నరతి, వియోగము దంపతులకు వైయధికరణ్యరూపము గాదు,ఏకశయ్యయందును నీర్ష్యాదిసద్భావము నందును విప్రలంభమును గవులు వర్ణించుటనుబట్టి , పైవిధమున ముదితపంచేంద్రియసంబంధాభావరూపము, వియుక్తుండ నైతి ఇత్యా కారకబుద్ధిరూపము గాని యగును. అది పూర్వానురాగ, మాన, విరహ, ప్రవాస, శాప భేదమునఁ బంచవిధ మని కావ్య ప్రకాశకా రాదిమతము. పూర్వానురాగ మనఁగా తరుణీతరుణులకు సంగమపూర్వకాలమందు దర్శనశ్రవణాదులచేఁ గల్గు నితరేతర ప్రేమయే. ‘యత్ప్రేమ సంగమాత్పూర్వం దర్శనశ్రవణోద్భవమ్| అసౌ పూర్వానురాగాఖ్యో విప్రలమ్భ ఇతీరితః’ అని వెనుక వ్రాసిన ప్రమాణముఁ జూడవలయు.
తే. కలితమానసకైరవం ◊బలరఁ జంద్రి,కావిలాసంబు వినిన భూ◊కాంతమౌళి
కపుడు నేత్రచకోరంబు ◊లమితమోద, మొదవఁ దిలకింప లాలసం ◊బుదిత మయ్యె. 35
టీక: కలితమానసకైరవంబు= ఒప్పుచున్న మనస్సనెడు కలువ; అలరన్=సంతసించునట్లు; చంద్రికావిలాసంబు =చంద్రిక యొక్క విలాసమును,వెన్నెలయొక్క విలాసము నని యర్థాంతరము; వినిన భూకాంతమౌళికిన్ = ఆకర్ణించిన రాజశేఖరునకు; నేత్రచకోరంబులు =కన్నులనెడు వెన్నెలపుల్గులు; అమితమోదము = అధికమైన యానందము; ఒదవన్=పొందునట్లు; తిల కింపన్=చంద్రికను వీక్షించుటకు; లాలసంబు = ఆసక్త్యతిశయము, ‘లాలసో లాలసాపి స్యా ద్యాచ్నా తృష్ణాతిరేకయోః, ఔత్సుక్యే చ’ అని విశ్వము; అపుడు; ఉదిత మయ్యెన్ = ఆవిర్భవించెను. వెన్నెలకుఁ గుముదములు ముదమందుటయు, చకోర ములు ప్రీతిఁ గాంచుటయు ప్రసిద్ధము. అనఁగా మానస మలర నామెవిలాసము విన్న నృపతికి నేత్రోత్సవమగునట్లుగా నామెను జూడ వాంఛ గలిగె నని భావము.
ఇందు చక్షుఃప్రీతి యను ననంగదశ వచింపఁబడినది. ఆదశలు, ‘చక్షుఃప్రీతి ర్మనస్సంగ స్సంకల్పోఽథ ప్రజాగరః| అరతి స్సంజ్వరః కార్శ్యం లజ్జాత్యాగో భ్రమో మృతిః| దశావస్థా భవన్త్యేతే విప్రలమ్భేఽభిలాషజే’ అని చెప్పఁబడినవి. చక్షుఃప్రీతి యనఁగా దదేకాలోకనరతి. ఈయనంగదశలంగూర్చి ‘అభిలాషచింతనానుస్మృతి గుణసంకీర్త నోద్వేగాః’ అనియు, ‘చక్షుః ప్రీతిః ప్రథమం చిన్తాసఙ్గ స్తతోథ సంకల్పః| నిద్రాచ్ఛేద స్తనుతా విషయనివృత్తి స్త్రపానాశః’ అనియు నానాప్రకార, నామక్రమభేద ములు గ్రంథములయందుఁ జూపట్టుచున్నవి. తన్నిరూపణంబు విస్తరభీతిచే నుపేక్షితంబయ్యె.మావ్రాసిన కావ్యాలంకారసంగ్రహ విమర్శమునఁ దెలియు.
క. ఈకరణి మదిం దద్రజ,నీకరముఖిఁ గాంచువాంఛ ◊నిక్కం ధరణీ
లోకరమాసుతుఁడు మధు,శ్రీకరవాక్పటిమ యక్ష◊శేఖరుఁ బలికెన్. 36
టీక: ధరణీలోకరమాసుతుఁడు=భూలోకమన్మథుఁడగు నాసుచంద్రుఁడు; ఈకరణిన్=ఈరీతిగా; మదిన్=చిత్తమందు; తద్రజనీ కరముఖిన్=చంద్రముఖియగు నాచంద్రికను; కాంచువాంఛ = చూడవలెనను నిచ్ఛ; నిక్కన్=అతిశయింపఁగా; యక్షశేఖరున్ =యక్షశ్రేష్ఠుఁడైన కుముదునిగూర్చి; మధుశ్రీకరవాక్పటిమన్=మకరందసంపదవంటి సంపదనుజేయునట్టి మాటలప్రౌఢిచేత, మధురవచనముచేత ననుట; పలికెన్=వచించెను.
ఉ. ధీరవరేణ్య! నీ విపుడు ◊దెల్పిన నిర్మలచంద్రికోదయో
దారసుధారసంబు మది ◊కప్రమితప్రమదంబు నించి, యెం
తే రచియించె నవ్వనజ◊నేత్రఁ గనుంగొన నూత్నలాలసా
పూరము గానఁ జానఁ గనఁ◊బోవుద మాస్పద మావహిల్లగన్. 37
టీక: ధీరవరేణ్య=పండితోత్తముఁడవగు నోకుముదుఁడా! నీవు; ఇపుడు; తెల్పిన నిర్మలచంద్రికోదయోదారసుధారసంబు – తెల్పిన =బోధించినట్టి, నిర్మల=స్వచ్ఛమగు, చంద్రికా=చంద్రికయొక్క, ఉదయ=ఆవిర్భావ మనెడు, ఉదార=అధికమగు, సుధారసంబు = అమృతరసము, అనఁగా వెన్నెలయొక్క యావిర్భావ మమృతమయమై సుఖకరమైనట్లు చంద్రికోదయ క్రమము సుఖకరమైన దనుట; మదికిన్=మనస్సునకు; అప్రమితప్రమదంబు=అమితమైన సంతసమును; నించి =పూరించి; అవ్వనజనేత్రన్ = ఆచంద్రికను; కనుంగొనన్=చూచుటకు; నూత్నలాలసాపూరము – నూత్న=అపూర్వమగు, లాలసా = ఉత్కటమగు కోరికయొక్క, పూరము =ప్రవాహమును; ఎంతేన్ = మిక్కిలి; రచియించెన్=కలిగించెను; కానన్ = కావున; ఆస్పదము ఆవహిల్లగన్ = పని ఘటించునట్లు; చానన్=ఆసుందరిని; కనన్=చూచుటకు; పోవుదము =చనుదము.
చ. అనఁ గుముదుండు వల్కు వసు◊ధాధిప! నీశుభరూపరేఖికల్
గనుఁగొనుమాత్ర నామహిప◊కన్య యెద న్నినుఁ జేర్చి దా వరిం
చు నిది నిజంబు కంజముఖిఁ ◊జూడఁగ రమ్ము మదభ్రయాన మీ
వనువుగ నెక్కి యంచు నతఁ ◊డయ్యెడ దానిఁ దలంచె నంతలోన్. 38
టీక: అనన్=సుచంద్రుఁడిట్లు పలుకఁగా; కుముదుండు =కుముదుఁడను యక్షుఁడు; పల్కున్; వసుధాధిప=సుచంద్రుఁడా! నీశుభరూపరేఖికల్=నీమంగళకరమగు రూపమును రేఖలను, అనఁగా సాముద్రికోక్తములగు పద్మాదిరేఖల ననుట,రూపము నకు ‘అఙ్గాన్యభూషితా న్యేవ ప్రక్షేప్యాద్యైర్విభూషణైః| యేన భూషితవద్భాన్తి తద్రూప మితి కథ్యతే’అని లక్షణంబు; కనుఁ గొను మాత్రన్=చూచినమాత్రముననే; ఆమహిపకన్య=ఆరాజకుమారి;ఎదన్=హృదయమందు; నినున్; చేర్చి=ఉంచి; తాన్ =తానే; వరించున్=కోరును; ఇదినిజంబు=ఈమాట నిక్కము; మదభ్రయానము=నావిమానమును;అనువుగ=అనుకూల ముగ; ఎక్కి =అధిరోహించి; కంజముఖిన్=పద్మముఖియైన యామెను; చూడఁగ రమ్ము =చూచుటకు రమ్ము; అంచున్= అనుచు; అతఁడు=ఆకుముదుఁడు; అయ్యెడన్=ఆసమయమున; దానిన్=ఆవిమానమును; తలంచెన్=స్మరించెను; అంతలోన్ = అట్లు స్మరించినంతలో, దీనికి ‘నిల్చె’ నను నుత్తరపద్యస్థక్రియతో నన్వయము.
చ. బలువగు విస్మయంబున నృపాలుఁడు గన్గొనఁ జెంత నిల్చె ని
ర్మలధనరాజపుష్పకస◊మానము, సద్వలభీతసుప్రభా
గిలితదినేశమానము, వి◊కీలితచారుమణీవితానకో
జ్జ్జ్వలరుచిరోచమాన, మల◊వాహముఖేంద్రవిమాన మయ్యెడన్. 39
టీక: అయ్యెడన్ = ఆసమయమందు; నిర్మలధనరాజపుష్పకసమానము=ప్రశస్తమైన కుబేరుని పుష్పకవిమానముతో సదృశ మైనదియు; సద్వలభీతసుప్రభాగిలితదినేశమానము – సత్=శ్రేష్ఠములైన, వలభి=చూరుపట్టెలను, ఇత=పొందినట్టి, సుప్రభా= మంచికాంతిచేత,గిలిత=మ్రింగఁబడిన,దినేశ=సూర్యునియొక్క, మానము=అహంకారము గలదియు; వికీలితచారుమణీ వితానకోజ్జ్జ్వలరుచిరోచమానము – వికీలిత=కట్టఁబడిన, చారుమణీ=అందమైనమణులయొక్క, వితానక= సమూహముచేత, ఉజ్జ్జ్వల=ప్రకాశించుచున్న, రుచి=కాంతిచేత, రోచమానము=ప్రకాశమానమైనట్టిదియు నగు;వాహముఖేంద్రవిమానము = యక్షేశ్వరునియొక్కవిమానము; నృపాలుఁడు=సుచంద్రుఁడు;బలువగు విస్మయంబునన్ =అధికాశ్చర్యముతోడ; కన్గొనన్= చూడఁగా; చెంతన్=సమీపమున; నిల్చెన్= నిల్చెను.
చ. నిలిచిన యవ్విమాన మవ◊నీపతిచంద్రుఁడు మిత్త్రయుక్తుఁడై
యలధనదాభ్రయానము ధ◊రాత్మభవాపతివోలె నెక్కి ని
స్తులరయసంగతిం జనియెఁ ◊దోడ్తఁ దదర్వముఖాన్వయాధిరా
ట్కలితమహాత్మభావగతిఁ ◊గన్పడకుండఁ బరాళి కత్తఱిన్. 40
టీక: అవనీపతిచంద్రుఁడు=ఆరాజచంద్రుఁడు; మిత్త్రయుక్తుఁడై = చెలికానితోఁ గూడిన వాఁడయి; నిలిచిన యవ్విమానము=ఎదుట నున్న యావిమానమును; అలధనదాభ్రయానమున్=ఆకుబేరునిపుష్పకవిమానమును; ధరాత్మభవాపతి వోలెన్=సీతాపతియైన శ్రీరామునివలె; ఎక్కి=అధిష్ఠించి; నిస్తులరయసంగతిన్=సాటిలేని వేగముచేత; తదర్వముఖాన్వయాధిరా ట్కలితమహాత్మభావగతిన్ – తదర్వముఖాన్వయాధిరాట్= ఆకుముదునిచేత,కలిత=చేయఁబడిన,మహాత్మభావ =మాహా త్మ్యముయొక్క, గతిన్= ప్రాప్తిచేత; పరాళికిన్=ఇతరజనసమూహమునకు; అత్తఱిన్=ఆసమయమున; కన్పడకుండన్=అగ పడనట్లు; తోడ్తన్= వెంటనే; చనియెన్= పోయెను.
అనఁగా శ్రీరాముఁడు రావణవధానంతరమున సుగ్రీవాదిమిత్త్రయుక్తుఁడై కుబేరునిపుష్పకము నెక్కినట్లు సుచంద్రుఁడు మిత్త్ర యుక్తుఁడై కుముదుని విమానము నెక్కి యాకుముదుని ప్రభావముచే నితరులకుఁ గనఁబడనివాఁడై చనియె నని భావము.
మ. వనితాదర్శనదోహదాతిశయధా◊వత్స్వాంతరంగాగ్రవ
ర్తనకన్న న్మునుమున్న యేగు మయుస◊మ్రాడ్వ్యోమయానంబునన్
జననాథేంద్రుఁడు వేడ్కతోఁ జనియె వీ◊క్షాలక్ష్యతం బూన దా
వనికాయంబులు పట్టణంబులు నదీ◊వారంబు లందంబుగన్. 41
టీక: జననాథేంద్రుఁడు = సుచంద్రుఁడు; వనితాదర్శనదోహదాతిశయధావత్స్వాంతరంగాగ్రవర్తనకన్నన్ – వనితాదర్శన = చంద్రికాదర్శనమందలి, దోహదాతిశయ=ఆసక్తియొక్క అతిశయముచేత, ధావత్=పరుగెత్తుచున్న, స్వ=తనయొక్క, అంత రంగ=మనస్సుయొక్క, అగ్రవర్తనకన్నన్= ముందునికికన్నను; మునుమున్న=ముందుముందుగనే; ఏగు =పోవుచున్న; మయుసమ్రాట్= కిన్నరప్రభువగు కుముదునియొక్క, వ్యోమయానంబునన్ =విమానమువలన; దావనికాయంబులు = అడ వులగుంపులు; పట్టణంబులు =నగరములు; నదీవారంబులు=నదీసమూహములు; అందంబుగన్=సుందరమగునట్లు; వీక్షా లక్ష్యతన్=దృగ్విషయతను; పూనన్=వహింపఁగా; వేడ్కతోన్=సంతసముతోడ; చనియెన్=పోయెను.
చ. చని చని తత్తరోమహిమఁ ◊జయ్యన నాక్షణదోదయక్షమే
శనగర మప్పు డబ్బుర మె◊సంగఁ గనుంగొని యంతఁ జంద్రికా
వనజముఖీవిలాసవన◊వాటికఁ దత్తిలకామ్రకుందచం
దనసుమవాసితానిలవి◊తాన మెదుర్కొనఁ జేరి యచ్చటన్. 42
టీక: తత్తరోమహిమన్=ఆవిమానవేగాతిశయముచేత; చని చని =పోయి పోయి; ఆక్షణదోదయక్షమేశనగరము = పూర్వోక్త మగు క్షణదోదయుఁడను రాజుయొక్క నగరమును; అప్పుడు; అబ్బురము=ఆశ్చర్యము; ఎసంగన్=అతిశయించునట్లు; కనుంగొని = చూచి; అంతన్=అంతట; చంద్రికావనజముఖీవిలాసవనవాటికన్=చంద్రికయొక్క క్రీడావనమును; తత్తిలకామ్ర కుందచందనసుమవాసితానిలవితానము – తత్=ఆవనమునకు సంబంధించిన, తిలక=బొట్టుగు, ఆమ్ర = మామిడి, కుంద = మొల్ల, చందన =గందపుచెట్లయొక్క,సుమ=పుష్పములచేత, వాసిత=పరిమళించు, అనిలవితానము=వాయుసమూహము; ఎదుర్కొనన్=అభిముఖముగా రాఁగా, పూజనీయులు విచ్చేయునపుడు వారల కెదురుగఁ బోవుట సముచిత మని వాయు వా రాజున కెదురుగఁ బోయినట్లున్న దనుట; చయ్యనన్= శీఘ్రముగ; చేరి =ప్రవేశించి; అచ్చటన్=ఆవనమందు. దీనికి ‘కాంచె’ నను ముంగలిపద్యమందలి క్రియతో నన్వయము.
చ. హరిముఖనేత సూప వసు◊ధాధిపచంద్రుఁడు గాంచె ముంగలన్
హరినిభమధ్యమన్, హరిక◊రాదృతశంఖసమానకంధరన్,
హరిజయశాలివాణి, హరి◊దంశుకవైరిశరాససుభ్రువున్,
హరిణసపత్ననేత్ర, హరి◊ణాంకముఖిన్, హరినీలకుంతలన్. 43
టీక: హరిముఖనేత = తురంగవదనశ్రేష్ఠుండగు కుముదుఁడు; చూపన్=చూపఁగా; వసుధాధిపచంద్రుఁడు =రాజశ్రేష్ఠుఁడగు సుచంద్రుఁడు; ముంగలన్=ఎదుట; హరినిభమధ్యమన్=సింహముయొక్క నడుమువంటి నడుము గలదానిని; హరికరాదృత శంఖసమానకంధరన్ = విష్ణుకరముచే నాదృతమైన శంఖము (పాంచజన్యము) వంటి మెడ గల దానిని; హరిజయశాలివాణిన్= చిలుకల జయించుటచేఁ బ్రకాశించు పలుకులు గలదానిని; హరిదంశుకవైరిశరాససుభ్రువున్ – హరిదంశుక= దిగంబరుఁడగు శివునకు, వైరి=శత్రువైన మరునియొక్క,శరాస=వింటినిబోలు, సుభ్రువున్=మంచిబొమలు గల దానిని; హరిణసపత్ననేత్రన్= ఏణములకుఁ బగలగు నేత్రములు గల దానిని; హరిణాంకముఖిన్ = చంద్రునివంటి ముఖము గల దానిని; హరినీలకుంతలన్ = ఇంద్రనీలమణులఁ బోలు నలకలు గల దానిని, అట్టి చంద్రిక ననుట; కాంచెన్=చూచెను. ‘యమానిలేన్ద్రచంద్రార్కవిష్ణుసింహాంశు వాజిషు, శుకాహి కపి భేకేషు హరిః’ అను నామలిఙ్గానుశాసనముచే హరిపదమున కిట తురంగ, సింహ, విష్ణు, శుక, ఇంద్రరూపా ర్థములు తెలియఁదగినవి.
సీ. తానచాతురి కద్భు◊తముఁ దాల్చుపోలిక, వరమణిపుత్రికల్ ◊శిరము లూఁప,
ఘనగానసుధఁ గ్రోలి ◊తనివొంది బయ లూన్చు, గతి శిలాతతి జలౌ◊ఘమ్ముఁ గురియ,
యతిలయశ్రుతులవి◊స్తృతితత్త్వ మూనిన,చాయ నాళులు విని◊శ్చలతఁ దాల్ప,
బలురక్తి లోనిండి ◊పట్టఁజాలక వెలు,వడుదారి వల్లికల్ ◊ కడుఁ జిగుర్ప,
తే. హారివసుపీఠికాసీన◊యై విపంచిఁ, గలసి గానము సేయు భూ◊కాంతపుత్త్రిఁ
గనకనిభగాత్రిఁ గాంచి య◊య్యినకులుండు, చాల నాశ్చర్యజలరాశిఁ ◊దేలె నపుడు. 44
టీక: తానచాతురికిన్ – తాన=తన్నకారముతోఁ బాడెడు పాటలయొక్క, చాతురికిన్=నేర్పునకు; అద్భుతమున్ =ఆశ్చర్య మును; తాల్చుపోలికన్ =వహించురీతి; వరమణిపుత్రికల్ =శ్రేష్ఠములగు మణిమయములైనప్రతిమలు; శిరములు=తలలను; ఊఁపన్= చలింపఁజేయఁగా; ఘనగానసుధన్=అధికమగు గానామృతమును; క్రోలి =పానముచేసి; తనివొంది =తృప్తిపొంది; బయ లూన్చు గతిన్= బయ ల్పఱచురీతిగా; శిలాతతి =పాషాణసంఘము; జలౌఘమ్మున్ = నీటిప్రవాహమును; కురియన్=వర్షింపఁగా; యతిలయశ్రుతుల విస్తృతితత్త్వము – యతి=యతులయొక్క, లయ=లయమనెడి తాళప్రాణముయొక్క, శ్రుతుల=స్వరారంభకావయవవిశేషముయొక్క, విస్తృతి =విస్తారముయొక్క,తత్త్వము =స్వరూపమును; ఇట తాళప్రాణములు, ‘కాలో మార్గః క్రియాఙ్గానిగ్రహో జాతిః కళా లయః| యతిః ప్రస్తారక శ్చైవ తాళప్రాణా దశ స్మృతాః’ అనునవి, శ్రుతి యనఁగా, ‘ప్రథమ శ్శ్రవణా చ్ఛబ్ద శ్శ్రూయతే హ్రస్వమాత్రకః| సా శ్రుతి స్సంపరిజ్ఞేయా స్వరావయవలక్షణా’ అని చెప్పఁబడినది. దాని విస్తృతి, ‘చతుశ్చతు శ్చైవ షడ్జమధ్యమపఞ్చమాః| ద్వేద్వే నిషాదగాన్ధారౌ త్రిస్త్రీ రిషభధైవతౌ’ఇత్యాదిగాఁ జెప్పబడినది; తత్త్వము =స్వరూపమును;ఊనిన చాయన్= వహించినరీతి; ఆళులు =చెలియలు; వినిశ్చలతన్=నైశ్చల్యమును; తాల్పన్=వహింపఁగా;బలురక్తి = అధికానురాగము; లోన్=అంతరంగమందు;నిండి; పట్టన్ చాలక= ఆఁగలేక; వెలువడుదారిన్ = బయల్పడురీతిగ; వల్లికల్ = లతలు; కడున్=మిక్కిలి; చిగుర్పన్=చివురింపఁగా; హారివసుపీఠికాసీన యై – హారి=మనోజ్ఞమగు, వసుపీఠికా=బంగరుపీఁటయందు, ఆసీన ఐ = కూర్చుండినదై; విపంచిన్ = వీణను; కలసి=చేరి; గానము సేయు = పాడుచుండెడు; భూకాంతపుత్త్రిన్=రాజకుమారిని;కనకనిభగాత్రిన్ = బంగరుతో, కాదేని సంపెఁగపువ్వుతో సాటియగు శరీరము గలదానిని, అట్టి చంద్రికను; కాంచి = చూచి; అయ్యినకులుండు= ఆసుచంద్రుఁడు; చాలన్= మిక్కిలి; ఆశ్చర్యజలరాశిన్ = విస్మయమను సముద్రమునందు; అపుడు=ఆదర్శనసమయమందు; తేలెన్=తేలెను. ‘అపూర్వదర్శనా చ్చిత్తవిస్తారో విస్మయో మతః’ అనుటవలన లోకోత్తరసౌందర్యశాలిని యగు నాసుదతిని జూడ రాజునకు విస్మయోదయం బయ్యె ననుట.
చ. తెఱలక కన్యఁజేరి తద◊ధీనతఁ బొల్చి యినావలోక మ
త్తఱి నలర న్మిళద్ధరిర◊థంబయి మున్నె మనోభ్ర మెంతయున్
మెఱయఁగ నంతకన్న మును ◊మించె శ్రమోదకవృష్టి చిత్రతన్
దొఱయఁగ మున్నె క్షేత్రమునఁ ◊దోరముగాఁ బులకాఖ్యసస్యముల్. 45
టీక: తెఱలక = బయలువెడలక; కన్యన్= చంద్రికను, కన్యారాశినని యర్థాంతరము; చేరి = పొంది; తదధీనతఁ బొల్చి = ఆ కన్యకు వశమై యొప్పారి; ఇనావలోకము – ఇన= రాజుయొక్క, అవలోకము=చూపు, సూర్యప్రకాశమని యర్థాంతరము, అనఁగా ధర్మధర్ముల కభేదగ్రహణముచే సూర్యుఁడే యనుట, సూర్యుఁడు కన్యారాశిని జేరఁగా నని ఫలితార్థము, ‘ఇన స్సూర్యే ప్రభౌ’ అని యమరుఁడు; అత్తఱిన్=ఆసమయమున; అలరన్=ఒప్పఁగా; మనోభ్రము=మనస్సనెడు నాకసము; మిళద్ధరిరథం బయి – మిళత్=సంబంధించినట్టి, హరిరథంబు = చిలుక రథముగాఁ గల మరుఁడుగలదై, ఇంద్రరథమగు మేఘము గలదై యని యర్థాంతరము; ఎంతయున్=మిక్కిలి; మెఱయఁగన్= ప్రకాశింపఁగా, మెఱపులు మెఱయఁగా; మున్నె =అంతకు ముందె; శ్రమోదకవృష్టి = స్వేదోదకవర్షము; చిత్రతన్= ఆశ్చర్యముచేత; దొఱయఁగన్=పొందఁగా; అంతకన్న మును = దానికంటెను పూర్వమె; క్షేత్రమునన్=శరీరమందు, సస్యోచితభూప్రదేశమునందు; తోరముగాన్ = అధికముగా; పులకాఖ్యసస్యముల్= పులకలనెడు సస్యములు; మించెన్=అతిశయించెను;
అనఁగా సుచంద్రునిదృష్టి కన్యను జేరి తెఱలక యుండఁగా అనఁగా దర్శనానందము ననుభవించుచుండఁగా మనంబునఁ గందర్పోదయమైన దనియు, మేనెల్ల స్వేదోద్గమ మయ్యె ననియుఁ, బులక ల్ననలొత్తె ననియు భావము. సూర్యుఁడు కన్యా రాశిని చేరఁగా వర్షర్తు వగుటంజేసి వృష్టి గలుగుట లోకప్రసిద్ధము. సూర్యుఁడు కన్యారాశిని జేరుట, తదనంతరము మేఘయుక్త మై యాకాశము మెఱయుట, తదనంతరము వర్షము, తదనంతరము క్షేత్రమున సస్యోదయమని క్రమముండఁగా, మేఘముతోఁ జేరి యాకసము మెఱయుటకు మున్ను వర్షమును, దానికి మున్ను క్షేత్రమున సస్యములు గలుగుటయు చిత్రమని తాత్పర్యము. ఇచట సస్యమునకు వర్షము, వర్షమునకు మబ్బుతోఁ గూడియున్న మిన్ను మెఱయుట కారణము గాకున్నను ఆకసము మెఱ యుటకు మున్ను వృష్టి గలిగె ననియు, నంతకు మున్ను సస్య ముదయించె ననియు, కార్యకారణభావమునకు వైపరీత్యమును బట్టి అత్యంతాతిశయోక్త్యలంకారము. ‘అత్యంతాతిశయోక్తి స్స్యాత్పౌర్యాపర్యవ్యతిక్రమే’అని తల్లక్షణము. అవిదితక్రమము లుగా నతిశీఘ్రకాలములో నుదయించినవని ఫలితార్థము.
‘పాంచాలీశుభవిభ్రస్ఫురణ’ యను పద్యమునందే భవ్యానురాగాళికల్ అనుటచేత రాగోదయమైనదని యేర్పడినను రాగము ఆసక్తిరూపమనియు, కామ ముత్కటాసక్తిరూపమనియు సిద్ధాంతము గాన గుణశ్రవణమున సామాన్యాసక్తి గలిగి సాక్షాద్దర్శనమున నుత్కటాసక్తి గలిగినదని తెలియునది. ‘ధ్యాయతో విషయా న్పుంస సఙ్గ స్తేషూపజాయతే| సఙ్గా త్సంజా యతే కామః||’ అను గీతావచనమునందును దద్భాష్యతద్వ్యాఖ్యలయందును రతికామముల స్వరూపము పైవిధముగ నున్నది. ఈవిషయము విస్తారముగఁ గావ్యాలంకారసంగ్రహమున ‘వనితయుఁ బతియు’ననుపద్యము టీకలో మాచే వ్రాయఁ బడినది. ఇట సుచంద్రునకు స్వేదము, పులకలు అను సాత్త్వికభావోదయము చెప్పఁబడినది. సాత్త్వికము లనఁగా ననుభావవిశే షములు. అనుభావము లనఁగా, ‘అనుభావయన్తి’ అను వ్యుత్పత్తిచే జాతరత్యాద్యనుమాపకములు. ‘భావం మనోగతం సాక్షా త్స్వహేతుం వ్యఞ్జయన్తి యే| తేఽనుభావా ఇతి ప్రోక్తా భ్రూవిక్షేపస్మితాదయః||’ అని తల్లక్షణము వ్రాయఁబడియె. స్తంభాదు లిట్టి యనుభావములలోఁ జేరినను దానికి సాత్త్వికములని నామము గలుగుట సత్త్వమాత్రమునఁ గలుగుటంజేసి. ఇందులకుఁ బ్రమా ణము, ‘సర్వేపి సత్త్వమూలత్వా ద్భావా యద్యపి సాత్త్వికాః| తథా ప్యమీషాం సత్త్వైకమూలత్వా త్సాత్త్వికప్రథా| అనుభావాశ్చ కథ్యన్తే భావసంసూచనా దమీ| ఏవం ద్వైవిధ్య మేతేషాం కథితం భావకోవిదైః|’అని సింగభూపాలీయము. సత్త్వ మనఁగా ‘అన్యేషాం సుఖదుఃఖాదిభావేషు కృతభావనమ్| ఆనుకూల్యేన యచ్చిత్తం భావకానాం ప్రవర్తతే| సత్త్వం తదితి విజ్ఞేయం ప్రాజ్ఞై సత్త్వోద్భవానిమాన్| సాత్త్వికా ఇతి జానన్తి భరతాద్యామహర్షయః| తే స్తమ్భస్వేదరోమాఞ్చస్వరభేదా శ్చ వేపథుః| వైవర్ణ్యమశ్రు ప్రళయా విత్యష్టౌ పరికీర్తితాః||’అనుట లోనగునది యాగ్రంథముననే నిరూపింపఁబడినది. ఇట హర్షాతిశయమున స్వేదరోమాం చములు. ‘నిదాఘ హర్ష వ్యాయామ శ్రమ క్రోధ భయాదిభిః| స్వేద స్సంజాయతే’ యనియు, ‘రోమాఞ్చో విస్మయోత్సాహ హర్షాద్యైః’ అనియు నందులకుఁ బ్రమాణము. ఇట శ్రమోదకశబ్దము స్వేదోదకమందు రూఢమని కవిహృదయముగాఁ గొనఁ దగి యున్నది.
చ. తరుణిమెఱుంగుటారుగడ ◊దారున నెక్కి నృపాలుచూపుదొ
మ్మరి రమణీయహారగుణ◊మండలిసందునఁ దారుచుం బయో
ధరసృతి లాగు వైచి వడిఁ ◊దార్కొని సమ్ముఖరాజుఁ జేరఁ బం
కరుహశరుండు శార్యభిధ◊కాహళి మ్రోయఁగఁ జేసె నత్తఱిన్. 46
టీక: నృపాలుచూపుదొమ్మరి =రాజుదృష్టి యనెడు దొమ్మరి;తరుణిమెఱుంగుటారుగడన్ = చంద్రికయొక్క మెఱయుచున్న యారనెడు గడను; దారునన్=వేగముగ; ఎక్కి=అధిష్ఠించి; రమణీయహారగుణమండలిసందునన్ – రమణీయ=మనోజ్ఞ మగు, హార=ముత్యంపుపేరు లనెడు, గుణ=త్రాళ్ళయొక్క, మండలి=సమూహముయొక్క, సందునన్=మధ్యభాగమున నుండు నవకాశమున; తారుచున్=చేరుచు; పయోధరసృతిన్ = స్తనసీమ యనెడుగగనమందు; లాగు వైచి =లాగు వేసి; వడిన్ = వేగముగా; తార్కొని =కదిసి; సమ్ముఖరాజున్=చంద్రునివంటి మోమనెడు నెదుట నున్న రాజును; చేరన్=చేరఁగా; పంక రుహశరుండు=మరుండు; శార్యభిధకాహళిన్=గొరువంక యను పేరుగల బూరుగును; అత్తఱిన్=ఆలాగువేచు సమయ మందు; మ్రోయఁగన్=ధ్వనించునట్టలు; చేసెన్=చేసెను. లోకమ్మున దొమ్మరి గడపాఁతి, దాని నెక్కి, త్రాళ్ళనుండి జాఱి, పైపైన లాగువైచి యధిపతి యెదుట నిలుచుటయు, నత్తఱిఁ దదీయుఁడు కాహళి మ్రోఁయఁగఁ జేయుటయుఁ బ్రసిద్ధంబు. అట్టు లానరపాలుచూపు తొలుత నాసుందరిరోమరాజిపైఁ బ్రస రించి పయోధరములను జేరి యామె మోమున కెదుట నిలిచియుండె ననియు, నప్పుడు గోరువంక కూయసాగిన దనియు, మరుఁడు మ్రోయఁగఁజేసె ననుటచే నాకూఁతరాజునకు మిక్కిలి కామోద్దీపకముగ నుండెననియు భావము.
చ. అవనిపకన్యనాభిజల◊జాకరసన్నిధి రోమవల్లికా
నవతరయష్టికాపదము◊నం బ్రియయోగము వూని శ్రీసతీ
భవమహిమాప్తి సిద్ధరస◊పాళికఁ బొందియుఁ బొంద వయ్యెఁ ద
త్ప్రవిమలకంధరాధ్వచర◊తన్ నృపునేత్రము లద్భుతస్థితిన్. 47
టీక: నృపునేత్రములు=సుచంద్రుని చూపులు;అవనిపకన్యనాభిజలజాకరసన్నిధిన్ – అవనిపకన్య=రాజపుత్త్రి యగు చంద్రిక యొక్క, నాభి=పొక్కిలి యనెడు,జలజాకర=సరస్సుయొక్క, సన్నిధిన్=తీరమునందు; రోమవల్లికానవతరయష్టికాపదము నన్ – రోమవల్లికా=నూఁగారనెడు,నవతర=అత్యపూర్వమైన,యష్టికాపదమునన్=యష్టికాసన మనెడు యోగాసనవిశేషము నందు; ప్రియయోగము=ప్రీతియుతమగు సంగతి యనెడు ప్రియధ్యానమును; పూని =వహించి; శ్రీసతీభవమహిమాప్తిన్ – శ్రీ సతీభవ=శ్రీపుత్రుండగు మరునియొక్క, శ్రీమంతులగు పార్వతీపరమేశ్వరులయొక్క, మహిమాప్తిన్=మాహాత్మ్యప్రాప్తిచేత; సిద్ధరసపాళికన్– సిద్ధరస=సిద్ధమైన శృంగారరసముయొక్క, దివ్యరసముయొక్క, పాళికన్=పరంపరను; పొందియున్; తత్ప్రవిమలకంధరాధ్వచరతన్ – తత్=ఆకన్యయొక్క, ప్రవిమల=నిర్మలమగు,కంధరాధ్వ=కంఠమార్గమందు,చరతన్ = సంచరణమును, ‘అధ్వని చరతీత్యధ్వచరః ’అను విగ్రహమందు ‘చరేష్టః’ అని కర్త్రర్థమందు టచ్ ప్రత్యయము, దానిపై భావార్థ మందు తల్ ప్రత్యయము రాఁగా చరించువానిధర్మము చరణమే యగును, ప్రసిద్ధమై నిర్మలమైన మేఘమార్గమగు గగనము నందు సంచారమును అని యర్థాంతరము; అద్భుతస్థితిన్=ఆశ్చర్యవర్తనచే; పొందవయ్యెన్=వహింపవయ్యెను.
పుణ్యతీర్థసన్నిధిని యష్టికాసనముపై యోగనిష్ఠాగరిష్ఠుండై పార్వతీపరమేశ్వరానుగ్రహమున సిద్ధరసమును బొందిన వాఁడు గగనమార్గసంచరణమును బొందుట ప్రసిద్ధము. అట్లు పొందకుండుట చిత్రముగ నున్నదని తాత్పర్యము. సుచంద్రనర పాలునిచూపు లాకన్యయారునందుఁ జేరి యందుఁ బ్రీతి గలిగి స్మరావేశముచే శృంగారసరససిద్ధి ననఁగా నానందాతిశయ మును బొంది కంఠముపైఁ బాఱక సుఖపారవశ్యమున నచటనే నిలిచియుండెనని ఫలితార్థము.
మ. స్తనమేరుస్థలవృత్తి నుబ్బు వళికా◊స్వర్ద్వీపినీభంగకు
ర్దనఁ జొక్కుం గను మధ్యనాకవిహృతిన్ ◊రమ్యోరురంభోపగూ
హనలబ్ధిం జెలఁగు న్నృపేక్షణము లా◊హా చిత్ర మేణీవిలో
చనయాస్యేందుసుధైకసేవ ననిమే◊షత్వంబు సంధిల్లుటన్. 48
టీక: నృపేక్షణములు=ఆరాజుదృష్టులు; ఏణీవిలోచనయాస్యేందుసుధైకసేవన్ – ఏణీవిలోచన=లేడికన్నులవంటి కన్నులు గల చంద్రికయొక్క, ఆస్యేందు=ముఖచంద్రునియొక్క, సుధా=అమృతముయొక్క, ఏక=ముఖ్యమగు, సేవన్=సేవచేత; అనిమేషత్వంబు =ఱెప్పపాటులేమి, దేవత్వము; సంధిల్లుటన్ =సంభవించుటచేత; స్తనమేరుస్థలవృత్తిన్ – స్తన=కుచములనెడు, మేరు స్థల = మేరుపర్వతప్రదేశమున, వృత్తిన్=ఉనికిచేత; ఉబ్బున్=వృద్ధిఁబొందును; వళికాస్వర్ద్వీపినీభంగకుర్దనన్ – వళికా=వళి త్రయమనెడు, స్వర్ద్వీపినీభంగ=వ్యోమగంగాతరంగములయందు,కుర్దనన్=క్రీడచేత, ‘క్రీడా ఖేలా చ కుర్దనమ్’ అని యమ రుఁడు; చొక్కున్ =సుఖపరవశమగును; మధ్యనాకవిహృతిన్ – మధ్యనాక=కౌననెడు నాకసమందు, విహృతిన్= విహార మును; కనున్=పొందును. స్వర్గవిహారము నొందు ననుట దేవత్వపక్షమున కత్యంతానుగుణం బైనను స్తనములు మేరువు తోడను, వళులు స్వర్గంగాతరంగములతోడను, ఊరువు లనంటులతోడను సాటియగునట్లు కౌనాకసముతోడనే సాటియగును గాని స్వర్గముతోడఁ గాదని యిట్లు వ్యాఖ్యాతంబయ్యె; రమ్యోరురంభోపగూహనలబ్ధిన్—రమ్య=మనోజ్ఞములగు, ఊరు= తొడలనెడు, రంభా=దివ్యస్త్రీయొక్క, ఉపగూహన=కౌగిలింతయొక్క,లబ్ధిన్=ప్రాప్తిచేత; చెలఁగున్=ఒప్పును; ఆహా చిత్రము= అత్యాశ్చర్య మనుట.
అనఁగాఁ బ్రసిద్ధచంద్రమండలస్థసుధను గ్రోలి దేవత్వమును గాంచినవారు మేరుస్థలవాస, స్వర్గంగాతరంగవిహార, వ్యోమ మార్గసంచార, రంభాలింగనాదుల నొందినట్లు నృపేక్షణములు చంద్రికాముఖచంద్ర సుధారసపానమున నట్టి విభవము నొందుట యాశ్చర్యతమం బనుట. ఆకన్యయొక్క లోకోత్తరముఖాద్యవయవములయందుఁ బ్రసరించి ఱెప్పపాటులేని నృపుని చూపులు నిరతిశయానందము నొందెనని భావము.
తే. ఉజ్జ్వలతరానురాగసం◊ధ్యోదయంబు, దగ మహాస్తంభభావంబు ◊దాల్చినట్టి
పతిమనంబున నీరజాం◊బకుఁడు దోఁచె, నపుడు హరిరథసంలబ్ధి ◊ననుసరించి. 49
టీక: ఉజ్జ్వలతరానురాగసంధ్యోదయంబు – ఉజ్జ్వలతర=మిక్కిలి ప్రకాశించునట్టి, అనఁగా నుత్కటమైనట్టి, అనురాగ=ప్రీతి విశేష మనెడు, సంధ్యా=సంధ్యాకాలముయొక్క, ఉదయంబు =ప్రాదుర్భావము; తగన్=ఒప్పఁగా; మహాస్తంభభావంబు – మహత్=అధికమైన, స్తంభభావంబు = చేష్టారహితత్వమును, గృహాధారదారువిశేషభావమును; తాల్చినట్టి పతిమనంబునన్ = వహించినట్టి నృపునిచిత్తమందు; నీరజాంబకుఁడు = పద్మబాణుం డగు మరుండనెడు పద్మనయనుండగు నారాయణుండు; హరిరథసంలబ్ధిన్ = మందమారుతమనెడు తేరియొక్క సంలబ్ధియను సింహదేహప్రాప్తిని; అనుసరించి=పొంది; అపుడు; తోఁచెన్ = అగపడెను.
పూర్వము హిరణ్యకశిపువధకై సంధ్యాకాలమున స్తంభమధ్యమున నారాయణుండు నృసింహరూపము దాల్చి తోఁచి నట్లు నృపునిమనం బుత్కటరాగంబయి స్తంభభావంబు దాల్చి యుండ నందు మందమారుతము నధిష్ఠించి కాముఁడు దోఁచె ననుట. ఆరాజున కనురాగోద్రేకమయి మనము స్తంభమనెడు సాత్త్వికభావము దాల్చిన దనియు, నపుడు మరుఁడు మందమారు తారూఢుండయి సాక్షాత్కరించిన యట్లు తోఁచెననియు భావము. ‘స్తంభ స్స్యాత్ నిష్క్రియాఙ్గత్వమ్’ అనుటచే స్తంభము శరీరధర్మము గాఁదగియున్నను, రాగాదిజన్యమానసస్తంభము లేక శారీరము గలుగదనియు ‘సత్త్వజన్యత్వే సతి గతినిరోధ స్తంభః’ అను లక్షణానుగతమైన రాగసంభవమయిన మనోవ్యాపారనిరోధమునుబట్టి యిట స్తంభపదప్రయోగ మని తెలియు నది. కామోదయరాగోదయములు వెనుకఁ జెప్పఁబడినవె యైన నిందుఁ దదుత్కటదశగాఁ దెలియఁదగును.
చ. నిరుపమపద్మినీకులమ◊ణీపరిదర్శనశక్తి నైశ్చలీ
గరిమ భజించి సమ్మదవి◊కాసమునం గనుపట్టుకుంభినీ
శ్వరతిలకంబు నుద్ధతి ని◊శాతపలాశసుమాంకుశంబుచేఁ
గర మసమాస్త్రయంత నఱ◊కం జనియించె శిరశ్చలనస్థితుల్. 50
టీక: నిరుపమపద్మినీకులమణీపరిదర్శనశక్తి న్ – నిరుపమ=సాటిలేనట్టి, పద్మినీకులమణీ =పద్మినీజాతిస్త్రీలయందు శ్రేష్ఠు రాలైన చంద్రికయొక్క, పరిదర్శనశక్తి న్=దర్శనసామర్థ్యముచేత, సాటిలేని గజస్త్రీరత్నముయొక్క దర్శనసామర్థ్యముచేత నని యర్థాంతరము, పద్మియొక్క స్త్రీ పద్మిని, ‘ఇభ స్తమ్బేరమః పద్మీ’ అని యమరుఁడు; నైశ్చలీగరిమన్=నిశ్చలభావము యొక్క యాధిక్యమును; భజించి =పొంది; సమ్మదవికాసమునన్ = సంతోషాతిశయముచేత, అధికమైన మదవికాసముచేత నని గజపరమైన యర్థము; కనుపట్టుకుంభినీశ్వరతిలకంబున్ = చూపట్టు రాజశ్రేష్ఠుని, చూపట్టు గజశ్రేష్ఠము నని యర్థాంత రము. ‘గౌ రిలా కుమ్భినీ క్షమా’ అనుటచే కుమ్భినీశబ్దము భూమియందును, ‘కుమ్భినః స్త్రీ కుమ్భినీ’ అను వ్యుత్పత్తి చే గజస్త్రీ యందును వర్తించును; ఉద్ధతిన్=దర్పముచేత; నిశాతపలాశసుమాంకుశంబుచేన్ – నిశాత=తీక్ష్ణమగు, పలాశసుమ=మోదుగ పూవనెడు, అంకుశంబుచేన్ = అంకుశమను నాయుధముచేత; అసమాస్త్రయంత = మన్మథుఁడను మావటివాఁడు; కరము= బాగుగా; నఱకన్=నఱకఁగా; శిరశ్చలనస్థితుల్= మెప్పున శిరఃకంపనము సేయుటలు, చుఱుకున తల విదుర్చుటలు అని గజపక్షమున నర్థము; జనియించెన్ = ఉదయించెను. చంద్రికాదర్శనానందాతిశయముచే నైశ్చల్యము వహించి, మన్మథబాణ హతుఁడై మెప్పున నారాజు శిరఃకంపము సేయఁగా నది యాఁడేనుఁగునం దాసక్తమయి మదవిలాసముచేఁ గదలకుండినగజ మును నియంత యంకుశముచేఁ బొడువఁగా నాగజము చుఱుకునఁ దల విదిర్చినట్లుండెనని భావము.
చ. అలరెడిశ్యామకెంజిగురు◊టాకులఁ జేరినఁ గోరకంబులన్
మలయుచు నున్నఁ జారుసుమ◊మాలిక లొందిన మంజుమంజరీ
స్థలములపొందు గన్న మధు◊సంతతిఁ గూడినఁ బాయ వయ్యెడం
జెలఁగుటనో ద్విరేఫగతి◊చే మహిపాలకురమ్యనేత్రముల్. 51
టీక: మహిపాలకురమ్యనేత్రముల్= సుచంద్రుని మనోజ్ఞనేత్రములు, అనఁగా దృష్టులు; ద్విరేఫగతిచేన్= భృంగరీతిచేత, రేఫ ద్వయప్రాప్తిచేత; చెలఁగుటనో = ఒప్పుటచేతనో, రమ్యనేత్రపదమందు ఆద్యంతములయందు రెండురేఫము లున్నవిగావున నవి ద్విరేఫగతిఁజెలంగు ననుట, ద్విరేఫశబ్దముచే లక్షితలక్షణావృత్తివలన భ్రమరపదబోధ్యములగు భృంగములు బోధితము లగు నని శాస్త్రసరణి; అలరెడిశ్యామకెంజిగురుటాకులన్ – అలరెడి=ప్రకాశించుచున్న, శ్యామ=లతయొక్క, కెంజిగురుటాకులన్= రక్తపల్లవములను, ఈ పద్యమున నుపమానములైన పల్లవాదులు చెప్పఁగా సాధ్యవసానలక్షణచే నుపమేయములగు హస్తా దులు బోధ్యములు గావున, శ్యామకెంజిగురుటాకులన్ అనఁగాఁ జంద్రికాహస్తములచేత నని గ్రాహ్యము. ఇట్లంతటఁ దెలియ వలయు; చేరినన్=పొందినను; కోరకంబులన్=మొగ్గలయందు, వానిచే లక్ష్యంబులగు గోరులయందు ననుట; మలయుచున్ ఉన్నన్=తిరుగుచున్నను; చారుసుమమాలికలు =మనోహరములైన పూలదండలను, అనఁగా నామె బాహువులను; ఒందినన్ = చేరినను; మంజుమంజరీస్థలములపొందు – మంజు=మనోజ్ఞములగు, మంజరీ=పువ్వుగుత్తులయొక్క, వానిచే లక్ష్యంబులగు స్తనములయొక్క, స్థలముల =ప్రదేశములయొక్క, పొందు = సంపర్కమును; కన్నన్ = కాంచినను; మధుసంతతిన్ = మరంద పరంపరను; కూడినన్=చేరినను, ఆమెపెదవిని జేరిన ననుట; అయ్యెడన్ = అప్పుడు; పాయవు = వీడవు.
అనఁగా ద్విరేఫములు లతావిశేషముయొక్క చివురులను, కోరకములను, సుమములను, పువ్వుగుత్తులను, మకరంద మును గూడి యున్నను బాయకుండునట్లు, ద్విరేఫగతిఁ జెలంగు నృపాలునినేత్రములు చిగురుటాకులఁ బోలు హస్తములను, కోరకంబులఁ బోలు గోరులను, సుమమాలికలఁ బోలు బాహువులను, పువ్వుగుత్తులఁబోలు స్తనములను, పూఁదేనియను బోలు నధరరసమును గూడియు వీడకున్నవని భావము. అతిశయోక్త్యలంకారభేదము. ‘విషయస్యానుపాదానా ద్విషయ్యుపనిబ ధ్యతే| విజ్ఞేయాతిశయోక్తి స్సా కవిప్రౌఢోక్తి సమ్మతా||’అని తల్లక్షణంబు పూర్వము దెలుపఁబడియె.
తే. ఇట్లు తచ్చంద్రికాయత్త◊దృక్చకోరుఁ,డై రసాధీశపద్మాకు◊మారుఁ డపుడు
ప్రమదము, నవాద్భుతంబును ◊బల్లవింప, నాత్మ నాయింతి నిట్లని ◊యభినుతించె. 52
టీక: ఇట్లు = ఈప్రకారముగ; రసాధీశపద్మాకుమారుఁడు = భూపతియనెడు మన్మథుఁడు; తచ్చంద్రికాయత్తదృక్చకోరుఁడై = ఆచంద్రికాపరతంత్రములగు నేత్రము లను చకోరములు గలవాఁడై; అపుడు; ప్రమదము = సంతసము; నవాద్భుతంబును =లోకో త్తరాశ్చర్యమును; పల్లవింపన్=చివురింపఁగా; ఆత్మన్=మనస్సునందు; ఆయింతిన్=ఆచంద్రికను; ఇట్లని =వక్ష్యమాణప్రకార ముగ; అభినుతించెన్= శ్లాఘించెను.
సీ. కాఁబోలు నీహేమ◊గాత్రి క్రొత్తగ సానఁ,దీరిన వలఱేని◊చారుహేతి,
కాఁబోలు నీకంబు◊కంఠి పాల్కడలిజి◊డ్డడఁగఁ జూపట్టుశీ◊తాంశురేఖ,
కాఁబోలు నీతమ్మి◊కంటి చిరద్యుతుల్, మించఁ బొల్చిన తళ్కు◊మించుఁదీవ,
కాఁబోలు నీనీల◊కైశ్య మన్మథశిల్పి, బాగుగాఁ దీర్చిన ◊పసిఁడిబొమ్మ,
తే. యౌర యీచెల్వచెలువ,మ◊యారె యీపొ,లంతి యొయ్యార, మహహ యీ◊యింతిమిన్న
సొంపు, మజ్జారె యీచాన◊సొగసుపెంపు, బళిరె యీలేమఁ బొగడ వా◊క్పతివశంబె. 53
టీక: ఈహేమగాత్రి =ఈకనకాంగి; క్రొత్తగన్=నూతనముగ; సానన్=సానయందు, సాన యనఁగా మణులు లోనగువానిఁ జక్కఁబఱచు సాధనవిశేషము; తీరిన వలఱేనిచారుహేతి – తీరిన=చక్కఁబడిన, వలఱేని=మరునిసంబంధియగు, చారు = మనోజ్ఞమైన, హేతి =ఖడ్గము; కాఁబోలు = కాఁదగును.ఈకంబుకంఠి =శంఖమును బోలు కంఠముగల యీసుందరి; పాల్కడలిజిడ్డడఁగన్ – పాల్కడలి = పాలసముద్రముయొక్క, జిడ్డడఁగన్ =జిడ్డు అణఁగిపోఁగా; చూపట్టుశీతాంశురేఖ =అగపడుచంద్రరేఖ; కాఁబోలు = కాఁదగును.ఈతమ్మికంటి =ఈపద్మనయన; చిరద్యుతుల్ = స్థిరమైన కాంతులు; మించన్=అతిశయించునట్లు; పొల్చిన తళ్కుమించుఁ దీవ = ఉదయించినట్టి ప్రకాశమానమయిన మెఱపుదీఁగ; కాఁబోలు = కాఁదగును.ఈనీలకైశ్య=ఈనీలకుంతల; మన్మథశిల్పి=మరుఁడను శిల్పకారుఁడు; బాగుగాన్= చక్కఁగా; తీర్చిన = దిద్దిన; పసిఁడి బొమ్మ=బంగరుబొమ్మ; కాఁబోలు = కాఁదగును.ఔర =ఆశ్చర్యము! ఈచెల్వచెలువము=ఈస్త్రీసౌందర్యము; అయారె = అద్భుతము! ఈపొలంతియొయ్యారము= ఈస్త్రీ యొక్క సౌందర్యగర్వము; అహహ=చిత్రము! ఈయింతిమిన్నసొంపు = ఈయుత్తమస్త్రీ రమ్యత; మజ్జారె =విస్మయకరము! ఈచానసొగసుపెంపు = ఈస్త్రీయొక్క సౌందర్యాతిశయము; బళిరె=వింత!ఈలేమన్=ఈస్త్రీని; పొగడన్=నుతించుటకు; వాక్పతివశంబె = బ్రహ్మతరమా?
అనఁగాఁ జతుర్ముఖుఁడై చతుర్వేది తెలిసిన యట్టి బ్రహ్మకైన నిట్టి లోకోత్తరనాయికను వర్ణింప నలవి గాదనుట. ఆమె స్మర హేతిని, శశిరేఖను, మించుఁదీవను, పసిఁడిబొమ్మను బోలియున్నదని ఫలితార్థము.
మ. అతిశోణం బతికోమలం బతివిశా◊లాత్మం బతిశ్లక్ష్ణకం
బతినిమ్నం బతిమేచకం బతిదృఢం ◊బత్యంతపారిప్లవం
బతివక్రం బతిదీర్ఘ మౌర బళి యీ◊యంభోజపత్త్రాక్షి య
ప్రతిమానావయవప్రతానము మనః◊పద్య న్విచారింపఁగన్. 54
టీక: ఈయంభోజపత్త్రాక్షి అప్రతిమానావయవప్రతానము – ఈయంభోజపత్త్రాక్షి =ఈకమలపత్త్రాక్షి యొక్క, అప్రతిమాన= సాటిలేని, అవయవప్రతానము = అవయవసంఘము; మనఃపద్యన్=చిత్తవీథిని; విచారింపఁగన్ =ఆలోచింపఁగా; అతిశోణంబు =మిక్కిలి యెఱ్ఱనైనదియు; అతికోమలంబు =మిక్కిలి మృదులమైనదియు; అతివిశాలాత్మంబు = మిక్కిలి విపులస్వరూపం బును; అతిశ్లక్ష్ణకంబు = మిక్కిలి కృశమైనదియు; అతినిమ్నంబు=మిక్కిలి లోఁతుగ నున్నదియు; అతిమేచకంబు=మిక్కిలి నల్లనైనదియు; అతిదృఢంబు=మిక్కిలి స్థూలమైనదియు; అత్యంతపారిప్లవంబు=మిక్కిలి చపలమైనదియు; అతివక్రంబు = మిక్కిలి కుటిలమైనదియు; అతిదీర్ఘ ము =మిక్కిలి పొడవైనదియు; ఔర బళి =అత్యాశ్చర్యము!
అనఁగ నొకయువతి యవయవసమూహము పరస్పరవిరుద్ధముగ శోణత్వమేచకత్వ, కృశత్వవిశాలత్వాదిధర్మముల నొప్పియుండుట యాశ్చర్యమని యాశయము. ఆయువతి యరకా లతిశోణం బనియు, పాదంబు లతికోమలము లనియు, కటిస్థల మతివిశాలం బనియు, మధ్యభాగం బతిశ్లక్ష్ణమనియు, నాభి యతినిమ్నం బనియు, నూగా రతిమేచకం బనియు, చను దోయి యతిదృఢంబనియు, కన్దోయి యత్యంతపారిప్లవం బనియు, ముంగురు లతివక్రంబు లనియు, జడ యతిదీర్ఘం బనియు భావము. ఇటఁ జంద్రికాగతసౌందర్యాతిశయంబు వర్ణితంబయ్యె. ‘అఙ్గప్రత్యఙ్గకానాం య స్సన్నివేశో యథోచితమ్| సుశ్లిష్టసంధి బన్ధ స్స్యా త్తత్సౌన్దర్య మితీర్యతే’ అని తల్లక్షణము. ఇట్లు ‘దీర్ఘాక్షం శరదిన్దుకాంతివదనం బాహూ నతా నంసయో స్సంక్షిప్తం నిబిడోన్నతస్తన మురః పార్శ్వే ప్రమృష్టే ఇవ| మధ్యః పాణిమితో నితమ్బి జఘనం పాదా వరాళాఙ్గుళీ ఛన్దో నర్తయితు ర్యథైవ మన శ్ల్శిష్టం తథాస్యావపుః||’ ఇత్యాదిగా గ్రన్థాన్తరములయందు సౌందర్యవర్ణనము తెలియవలయు.
సీ. అలరారు నేమొ ర◊మ్యాళిపాళి నెలంత, కులుకుపెన్నెఱులతోఁ ◊జెలిమిఁ గాంచి,
చరియించు నేమొ బల్ ◊మరుమార్గణశ్రేణి, పడఁతిదృగ్రుచి కర్థి◊భావ మూని,
చెలువొందు నేమొ మం◊జులకుచంబులు పక్వ,బింబోష్ఠిచనుదోయి ◊పేరు మోసి,
మనఁజేయు నేమొ యిం◊పున ధాత్రి చెలికటి,తటవిస్తృతికి దాది◊తనముఁ దాల్చి,
తే. యతిశయిలు నేమొ పద్మంబు ◊లనుదినంబు, భామపాదద్వయప్రభా◊ప్రాప్తి నొప్పి
మహిమ గను నేమొ సద్వంశ◊మణిచయంబు, కలికిపదనఖజననశే◊ఖరత నొంది. 55
టీక: రమ్యాళిపాళి =రమ్యమైన తుమ్మెదలగుంపు; నెలంతకులుకుపెన్నెఱులతోన్ = చంద్రికయొక్క యందమైన పెద్దవెండ్రు కలతోడ; చెలిమిన్=సఖ్యమును; కాంచి =పొంది; అలరారు నేమొ ప్రకాశించునేమొ; అనఁగా రమ్యమైన యాళిపాళి యన సఖీసముదయము గావునఁ జెలిమి గాంచుట దానికి నైజంబగునని కవిహృదయము. బల్=అధికమైన; మరుమార్గణశ్రేణి =మదనుని బాణములగుంపు; పడఁతిదృగ్రుచికిన్ = ఈస్త్రీయొక్కదృక్కాంతికి; అర్థి భావము = యాచకత్వమును; ఊని =పూని; చరియించు నేమొ = సంచరించునేమొ; మరుతూఁపు లీపడఁతిదృగ్రుచికి యాచకవృత్తి దాల్చి నట్లున్నవన దృగ్రుచియం దాధిక్యంబు మార్గణములయందు న్యూనతయుఁ దోఁచును. దానంజేసి పడఁతిదృగ్రుచి మరుతూఁ పులకన్న మిన్నగా నున్నదని ఫలితము. మార్గణశ్రేణి యనఁగా యాచకులగుంపు గావున నది యర్థిభావము దాల్చుట స్వభావము. ‘మార్గణౌ యాచకార్థినౌ’అని యమరుఁడు. మంజు=మనోజ్ఞములగు; లకుచంబులు =గజనిమ్మపండ్లు; పక్వబింబోష్ఠిచనుదోయి = పండినదొండపండువంటి మోవిగల చంద్రికయొక్క చనుగవయొక్క; పేరు మోసి =నామమును వహించి; చెలువొందు నేమొ = సొంపువహించునేమొ; ఆమె చను దోయి లకుచములను మించినదని భావము. మంజులకుచశబ్దములో కుచశబ్దము చేరియున్నది గావున మంజులకుచములు
కుచములపేరు మోసియుండుట సహజము. ధాత్రి =భూమి; ఇంపునన్=ఇచ్ఛచేత; చెలికటితటవిస్తృతికి= చంద్రికయొక్క జఘనవిస్తారమునకు; దాదితనమున్ = పెంపుడు తల్లి యగుటను; తాల్చి =వహించి; మనఁజేయు నేమొ =వృద్ధిఁ బొందించునేమొ; ఆమె జఘనము భూమియొక్క వైశాల్యము వంటి వైశాల్యమున రాజిల్లు నని భావము. ‘ధాత్రీ స్యా దుపమాతాపి’అను కోశమున ధాత్రీశబ్ద ముపమాతను బోధించుఁ గావున నుపమాత దాదితనమును దాల్చుట స్వభావము. పద్మంబులు=తమ్ములు; అనుదినంబు=ప్రతిదినమును; భామపాదద్వయప్రభాప్రాప్తిన్=ఈసుందరియొక్క పాదయుగళ కాంతియొక్క ప్రాప్తిచేత; ఒప్పి; అతిశయిలు నేమొ = అతిశయించునేమొ; ఆమె పాదద్వయప్రభ పద్మప్రభను మించిన దనుట. ‘పదః మేవ మా యేషాం తాని పద్మాని’అనుటచేత, పాదలక్ష్మివంటిలక్ష్మిగలవేపద్మములు. కావున నవి పాదద్వయప్రభాప్రాప్తి నలరుట యరిది గాదు. భామపదము సూర్యునిబోధించుఁగావున సూర్యకిరణప్రభాప్రాప్తిచేతఁ బద్మము లతిశయించుట సహజ మనియుఁ దోఁచు. ఇప్పక్షమున, భామ=సూర్యునియొక్క, పాదద్వయ=కిరణద్వయముయొక్కయే, అనఁగా రెండు కిరణ ములు ప్రసరించినను పద్మములు వికసిల్లి రాజిల్లునని యాశయముగాఁ దోఁచుచున్నది. సద్వంశమణిచయంబు = మంచివెదురులయందుఁ బుట్టిన ముత్యములగుంపు; కలికిపదనఖజననశేఖరతన్ – కలికి=ఈ సుందరియొక్క, పదనఖ =పాదములయందలిగోరులవలన, జనన=జన్మవలననైన, శేఖరతన్ = శ్రేష్ఠతను; ఒంది = పొంది; మహిమన్=పూజ్యతను; కను నేమొ = కాంచునేమొ. అనఁగా చంద్రికపాదనఖములు ముత్యములను మించిన వనుట. సద్వంశ మణిచయం బనఁగా మంచికులముగలమణులగుంపు పదనఖజనన అనఁగాఁ బాదనఖజనకము లైన పాదములకు భూషణ భావము దాల్చు ననుట. జననశబ్దము కర్త్రర్థల్యుట్ప్రత్యయాంతము, నఖములు కరరుహము లయినట్లు పదరుహములును గావచ్చును. ‘పదన్యాసక్రీడారణితమణీమంజీరరశనమ్’ ఇత్యాదికవివ్యవహారములవలన మణులు పదములకు భూషణము లనుట స్పష్టము. ఇందును చంద్రిక లోకోత్తరసౌందర్యశాలిని యని వ్యక్తం బగుచున్నది.
మ. వలజారత్నము దోఁచు నెన్నడు మణు◊త్వస్థేమఁ గాంచం గటి
స్థల మెంతేని మహత్త్వ మంద జడ దో◊డ్తం దీర్ఘతం బూన ని
చ్చలు గుల్ఫంబులు హ్రస్వతం గన రతీ◊శబ్రహ్మలీలాకృతో
జ్జ్వలమాయాపరిమాణవైభవసమ◊చ్ఛాయ న్విరాజిల్లఁగన్. 56
టీక: నెన్నడుము=అందమైన కౌను; అణుత్వస్థేమన్ – అణుత్వ=అణుపరిమాణభావముయొక్క, సూక్ష్మతయొక్క యనుట, స్థేమన్ = స్థితిని; కాంచన్=పొందఁగా; కటిస్థలము=కటిప్రదేశము; ఎంతేని=మిక్కిలి; మహత్త్వ ము=మహత్పరిమాణభావ మును, వైశాల్యముననుట; అందన్=పొందఁగా; జడ= వేణి; తోడ్తన్ = వెంటనె; దీర్ఘతన్=దీర్ఘపరిమాణభావమును; పూనన్; నిచ్చలు = ఎల్లపుడు; గుల్ఫంబులు = పిక్కలు; హ్రస్వతన్ = హ్రస్వపరిమాణభావమును; కనన్=పొందఁగా; వలజారత్నము =స్త్రీరత్నమగు చంద్రిక, ‘చారుస్త్రీ భూశ్చ వలజా’ అని రత్నమాల; రతీశబ్రహ్మలీలాకృతోజ్జ్వలమాయాపరిమాణవైభవసమ చ్ఛాయన్ – రతీశబ్రహ్మ=అనంగుఁడను విధాతచేత, లీలాకృత=విలాసనిర్మితమగు, ఉజ్జ్వల=ప్రకాశించుచున్నట్టి, మాయా పరిమాణ = మాయామయములగు నణుదీర్ఘాదిపరిమాణములయొక్క, వైభవ=సమృద్ధియొక్క, సమచ్ఛాయన్=తుల్య చ్ఛాయచేత; విరాజిల్లఁగన్ =ప్రకాశించునట్లు; తోఁచున్ = అగపడును.
అనఁగా ననంగుఁడను విధాత మాయావిలాసముచేత అణుమహద్దీర్ఘహ్రస్వభేదముచే శాస్త్రసిద్ధమైన పరిమాణచతుష్టయ మును జంద్రికారూపముగ సృజియించినట్లు తోఁచుచున్న దనుట.
చ. హరిణధరాస్యమోవిపస◊లా, కిసలాకృతిఁ బొల్చు నంఘ్రు లా,
యరుణతరోష్ఠిగుబ్బవగ ◊లా, మృగలాలస మూన్చు కన్నులా,
హరినిభవాణిమేనిసట◊లా, నిటలాకరవాలకమ్ములా,
యరిభిదురోజ నెన్న వస◊మా యసమాశుగమానభేదికిన్. 57
టీక: హరిణధరాస్యమోవిపసలా – హరిణధరాస్య=చంద్రవదనయొక్క, మోవి=అధరముయొక్క, పసలా=సారములా! కిసలాకృతిన్=పల్లవాకారముచేత; పొల్చు నంఘ్రు లా = ఒప్పుచున్న పాదములా! అరుణతరోష్ఠిగుబ్బవగలా = ఆబింబోష్ఠి యొక్కచన్దోయివిలాసములా! మృగలాలస మూన్చు కన్నులా – మృగ=లేఁడియొక్క,లాలసము= ప్రీత్యతిశయము, ఊన్చు కన్నులా = కలిగించు నేత్రములా! హరినిభవాణిమేనిసటలా – హరినిభవాణి=చిలుకపలుకులు గల దానియొక్క, మేని= శరీ రముయొక్క, సటలా = నడకలా! నిటలాకరవాలకమ్ములా – నిటల=నొసలు, ఆకర=ఆశ్రయముగాఁ గల, అనఁగా ఫాలము నందు వ్రేలాడునట్టి, వాలకమ్ములా = కేశములా! ముంగురులా యనుట; అరిభిదురోజన్ (అరిభిత్+ఉరోజన్) = చక్రవాకభేదక ములగు కుచములుగల నీమెను; ఎన్నన్=కొనియాడుటకు; అసమాశుగమానభేదికిన్ =శివునకైనను; వసమా= శక్యమా?
ఇట్టి లోకోత్తరసౌందర్యశాలిని యగు దీని నెన్నఁ బంచవక్త్రునంతవానికిని తరము గా దనుట.
సీ. కలికిచీఁకటిపిండు◊గలికిఁ బిల్చుకచాళి, వాలుగలసజాలు ◊వాలుఁగనులు,
బింబమ్మునకుఁ బ్రతి◊బింబంబు కెమ్మోవి, యేపూను రేరేని◊యేపు మోము,
ఇంచుమేలిమి నల◊యించు మేల్పలుకులు, కంబులకన్నఁ బొం◊కంబు గళము,
జక్కవకవ నేఁచుఁ ◊జక్క వలుదగుబ్బ, లలివధూకులము నా◊లలిత మారు,
వాపులసిరి సారె ◊వాపు లసన్నాభి, మెఱుఁగురంభలరూప◊మెఱుఁగుఁ దొడలు,
తే. తమ్ము లన మంజులశ్రీయు◊తమ్ము లడుగు, లుడుపురాణాస్యకాంతుల ◊నుడుపు గోరు,
లవని నీకొమ్మలావణ్య ◊లవనిరూఢి, యమరసుందరులం దైన ◊నమరఁ గలదె. 58
టీక: కచాళి =కేశపంక్తి; కలికిచీఁకటిపిండున్=అందమగు నంధకారపుంజమును; కలికిన్=జగడమునకు; పిల్చున్ = ఆహ్వా నముసేయును; వాలుఁగనులు =నిడుదకన్నులు;వాలుగలసజాలు –వాలుగల=మత్స్యములయొక్క, సజాలు=శిక్షారూప ములు; దీనికన్నులు మత్స్యములకు శిక్షారూపములనుటచే మత్స్యములకన్నఁ గన్నులుసుందరములని భావము. కెమ్మోవి =ఎఱ్ఱనిపెదవి; బింబమ్మునకున్=దొండపండునకు; ప్రతిబింబంబు =ప్రతిరూపము; మోము =ముఖము; ఏపు=గర్వ మును, ఊను =వహించుచున్నట్టి, రేరేనియేపు =చంద్రునియొక్క బాధ, అనఁగా తనయందమునకు గర్వించుచున్న చంద్రుని బాధించున దనుట. మేల్పలుకులు = శ్రేష్ఠములగు మాటలు; ఇంచుమేలిమిన్= చెఱకుయొక్క యతిశయమును; అలయించున్=అలయునట్లు చేయును; గళము =కంఠము; కంబులకన్నన్ = శంఖములకన్నను; పొంకంబు = సుందరమైనది. వలుదగుబ్బలు=స్థూలములగు స్తనములు; చక్కన్ =బాగుగా; జక్కవకవన్= చక్రవాకమిథునమును; ఏఁచున్= బాధించును; ఆరు=నూఁగారు; అలివధూకులమునాన్ = ఆఁడుతుమ్మెదలగుంపనఁగా; లలితము=ఒప్పునట్టిది. లసన్నాభి = ప్రకాశించుపొక్కిలి; వాపులసిరిన్=నడబావులయొక్క సంపదను; సారెన్ =మాటిమాటికి; పాపున్=తొలఁగఁ జేయును; తొడలు=ఊరువులు; మెఱుఁగురంభలరూపము=ప్రకాశించుచున్న యనంటులయొక్క రూపమును;ఎఱుఁగున్ = తెలియును.
అడుగులు=పాదములు;తమ్ములనన్=పద్మము లనఁగా;మంజులశ్రీయుతమ్ములు=మనోజ్ఞమైన కాంతితోఁ గూడినవి; గోరులు =నఖములు;ఉడుపురాణాస్యకాంతులన్ –ఉడు=రిక్కలయొక్క,పురాణ=మునుపటివైన, ఆస్యకాంతులన్=ముఖరుచులను; ఉడుపున్=ఉడుగఁజేయును; అవనిన్=భూమియందు; ఈకొమ్మలావణ్యలవనిరూఢి = ఈస్త్రీయొక్క లావణ్యలేశముయొక్క ఆధిక్యము; అమరసుందరులందైనన్=దేవలోకకామినులయందైన; అమరఁగలదె = అబ్బఁగలదా?
అనఁగా నిట్టిలావణ్యలేశము సురసుందరులకైన నమర దనుట. లావణ్య మనఁగా దేహకాంతివిశేషము. ఆమెకచములు చీఁకటిని,కన్నులుమత్స్యములను, మోవి బింబమును, ఇత్యాదిగాఁ బోలియున్నవని ఫలితము. ఇది పంచపాదిసీసము.
చ. అని పతి సన్నుతించు, హృద◊యంబున విస్మయ ముంచు, నేఁడుగా
యనుపమశక్తి దర్పకున ◊కబ్బె నటంచు వచించు, నవ్విరిం
చనుశుభసర్గకోవిదత ◊సారెకు నెంచు, నిమేషరాహితిం
గనుఁగవ వూన వెండియును ◊గాంచు వెలందిఁ దదేకతానతన్. 59
టీక: అని = ఇట్లని; పతి = సుచంద్రుఁడు; సన్నుతించున్=కొనియాడును; హృదయంబునన్=చిత్తమందు; విస్మయము= ఆశ్చర్యమును; ఉంచున్; దర్పకునకున్=మరునకు; అనుపమశక్తి = సాటిలేని సామర్థ్యమును; నేఁడుగా = ఇపుడుగదా! అబ్బెన్=అమరెను; అటంచున్; వచించున్=పలుకును; అవ్విరించనుశుభసర్గకోవిదతన్= ఆబ్రహ్మయొక్కశుభనిర్మాణ పాండితిని; సారెకున్=మాటిమాటికి; ఎంచున్=గణించును; కనుఁగవ =నేత్రయుగ్మము; నిమేషరాహితిన్ = ఱెప్పపాటు లేమిని; పూనన్=వహింపఁగా; వెండియును =మఱియును; తదేకతానతన్= తదేకాగ్రతతో, ‘ఏకతానోఽనన్యవృత్తిః’అని యమ రుఁడు; వెలందిన్=చంద్రికను; కాంచున్ = అవలోకించును.
చ. అపుడు మహీంద్రుతోడ నల◊యక్షవిభుండు వధూటిఁ గంటివే
తపనకులేంద్ర నాపలుకు ◊తథ్యత గాంచెఁ గదా తదాప్తి నే
నిపు డట కేగి కొమ్మకుఁ ద్వ◊దేకమతిం బొడమింతు నంచు న
న్నృపతియనుజ్ఞఁ గైకొనుచు ◊హృద్యవిమానము డిగ్గి యత్తఱిన్. 60
టీక: అపుడు; అలయక్షవిభుండు=ఆకుముదుఁడు; మహీంద్రుతోడన్=సుచంద్రునితోడ; తపనకులేంద్ర=సూర్యవంశోత్తముఁడా! వధూటిన్=చంద్రికను; కంటివే = చూచితివిగదా! నాపలుకు = నామాట; తదాప్తి న్= అట్లు నేఁజెప్పిన స్త్రీయొక్క ఉపలబ్ధిచేత; తథ్యత గాంచెఁ గదా =యథార్థత నొందెగదా! నేన్; ఇపుడు; అటకున్=ఆచంద్రికయుండుచోటికి; ఏగి; కొమ్మకున్= చంద్రికకు; త్వదేకమతిన్= నీయందలిప్రీతి ననుట; పొడమింతున్=ఉదయింపఁజేయుదును; అంచున్; అన్నృపతియనుజ్ఞన్ = ఆరాజు నాజ్ఞను; కైకొనుచున్=స్వీకరించుచు; హృద్యవిమానము=మనోజ్ఞపుష్పకమునుండి; డిగ్గి=దిగి; అత్తఱిన్=ఆసమయమందు,
దీనికి ‘వనధరఁ జేరి’ యను నుత్తరపద్యస్థక్రియతో నన్వయంబు.
చ. వనధరఁజేరి చారుతరు◊వారము చయ్యన దాఁటి పూర్వవ
ర్తన నవలాలఁ జేరఁ జనఁ ◊దామరసానన లెల్ల వచ్చెఁ గా
ఘనగురుఁ డంచు నబ్రమునఁ ◊గాంచఁగఁ గాంచనపీఠి డిగ్గి యా
జనవరకన్య యాళిజన◊సంవృతిఁ దా నెదు రేగి భక్తితోన్. 61
టీక: వనధరన్=ఉద్యానవనస్థలమును; చేరి; చారుతరువారము = మనోజ్ఞమగు వృక్షసంఘమును; చయ్యనన్=శీఘ్రముగ; దాఁటి; పూర్వవర్తనన్ = పూర్వరీతిగా; నవలాలన్ = ఉవిదలను; చేరఁజనన్ = చేరఁబోఁగా; తామరసాననలు ఎల్లన్ = స్త్రీలం దఱు; ఘనగురుఁడు =మన పెద్దయుపాధ్యాయుఁడు; వచ్చెఁ గా = వచ్చెనుగదా! అంచున్; అబ్రమునన్=ఆశ్చర్యముతోడ; కాంచఁగన్=చూడఁగా; ఆజనవరకన్య=ఆచంద్రిక; కాంచనపీఠిన్=బంగరుపీటను; డిగ్గి = దిగి; ఆళిజనసంవృతిన్ = సఖీ సంఘపరివృతిచేత; తాన్; ఎదురేగి = ఎదుర్కొని; భక్తితోన్=భక్తితోడ, దీనికి ‘ఆనతిసేయ’ నను ముందుక్రియతో నన్వయము.
చ. గురుకుచభారరేఖ నొగిఁ ◊గోమలి యానతి సేయ నాదయా
కరమతి పెండ్లికూఁతురవు ◊గమ్మని దీవన లిచ్చి తద్వధూ
త్కరకృతపూజనావిధులు ◊గైకొని తద్వనితాసమర్పితాం
బరచరరాజరత్నచయ◊భాసురపీఠి వసించె నయ్యెడన్. 62
టీక: గురుకుచభారరేఖన్ = గొప్పలగు స్తనములయొక్క భారాతిశయముతోడ; ఒగిన్=క్రమముగా; కోమలి=చంద్రిక; ఆనతిన్ = ప్రణామమును; చేయన్=చేయఁగా; ఆదయాకరమతి = కరుణాకరమగు మదిగల యాకుముదుఁడు; పెండ్లికూఁతురవు కమ్ము; అని = అనుచు; దీవనలు ఇచ్చి=ఆశీర్వదించి; తద్వధూత్కరకృతపూజనావిధులు = ఆస్త్రీసమూహముచే చేయఁబడిన అర్చనావిధులను; కైకొని = స్వీకరించి; తద్వనితాసమర్పితాంబరచరరాజరత్నచయభాసురపీఠిన్ – తత్=ఆయొక్క, వనితా =స్త్రీలచేత, సమర్పిత= ఈయఁబడిన, అంబరచరరాజరత్నచయ=ఇంద్రనీలమణిసమూహముతోడ, అంబరచరరాజనఁగా ఇంద్రుఁడు, అందుచే అంబరచరరాజరత్న మనగా ఇంద్రనీలమణి, భాసుర=ప్రకాశించుచున్న, పీఠిన్=పీటయందు; వసించెన్= కూర్చుండెను; అయ్యెడన్, దీనికి అగ్రిమపద్యస్థమగు ‘వసించె’ నను క్రియతో నన్వయము.
తే. మనుజపతికన్య సఖులతో ◊మణిమయాస,నమున వసియించె నప్పు డా◊కొమిరెమిన్న
నెచ్చెలి చకోరి యన మించు ◊నెలఁత యోర్తు, కుముదుఁ దిలకించి యిట్లనుఁ ◊గుతుకఫణితి. 63
టీక: మనుజపతికన్య = చంద్రిక; సఖులతోన్=చెలియలతోడ; మణిమయాసనమునన్ = రత్నపీఠమందు;వసియించెన్; అప్పుడు; ఆకొమిరెమిన్ననెచ్చెలి = ఆచంద్రికయొక్కసకియ; చకోరి యన మించు నెలఁత యోర్తు = చకోరి యను నొక స్త్రీ; కుముదున్=కుముదుని; తిలకించి = చూచి; కుతుకఫణితిన్=సంతసముతోఁ గూడిన వాక్కుచేత; ఇట్లనున్ = ఇట్లు పల్కును.
చ. హరిసమధామ! యుష్మదరు◊ణాంఘ్రులు గన్గొన నిప్డు మద్దృగం
బురుహము లెంతయుం జెడని◊మోదముఁ జేకొనె, దూరమయ్యె దు
స్తరహృదయాంధకారసము◊దగ్రత లెల్లఁ, బ్రవృద్ధిఁ గాంచె వి
స్ఫురదభిలాషచక్రములు, ◊పొల్పడఁగె న్నిబిడప్రదోషముల్. 64
టీక: ఇందుఁ గుముదపరమైన యర్థము, సూర్యపరమైన యర్థము గలుగుచున్నది. హరిసమధామ=సూర్యతుల్యమగు తేజముగలవాఁడా! యుష్మదరుణాంఘ్రులు = మీయొక్క శోణచరణములు, పాటలములగు కిరణములని యర్థాంతరము; కన్గొనన్=అవలోకింపఁగా; ఇప్డు; మద్దృగంబురుహములు =నానేత్రము లనెడు కమలములు; ఎంతయున్=మిక్కిలి; చెడని మోదమున్ = నశింపనిసంతసమును; చేకొనెన్=పొందెను; దుస్తరహృదయాంధకారసముదగ్రతలు – దుస్తర= తరింపనలవి గాని, హృదయాంధకారసముదగ్రతలు = హృదయమునందుండెడు నజ్ఞానమను చీఁకటులయాధిక్యములు; ఎల్లన్= సమ స్తము; దూరమయ్యెన్=తొలఁగెను; విస్ఫురదభిలాషచక్రములు= ప్రకాశించుచున్న కోర్కులగుంపులనెడు చక్రవాకములు; ప్రవృద్ధిఁ గాంచెన్=వృద్ధిఁబొందెను; నిబిడప్రదోషముల్ = దట్టములైన దురితములను రజనీముఖములు; పొల్పడఁగెన్=నశిం చెను. సూర్యుని శోణకిరణదర్శనమున నంబురుహములు సంతసించుటయు, చీఁకటులు దూరమగుటయు, చక్రవాకములు వృద్ధినొందుటయు, ప్రదోషములు శమించుటయు నెట్లో, అట్లు తమ చరణదర్శనమున నాకు నేత్రానందము, అజ్ఞాననాశము, వాంఛాసముదయాభివృద్ధి, దోషశాంతియుఁ గలిగె ననుట.
చ. అనుదినముం బ్రియంబును ద◊యామహిమంబును మించ వత్తు రీ
జనవరపుత్త్రికామణికిఁ ◊ జక్క విపంచిక నేర్ప నేఁటికిన్
జనియె సుమీ యనేకదివ◊సంబులు మీ రిట రాక నేఁడు నిం
దునిఁ దెలికల్వలో యన ని◊నున్ గనఁ గోరు మదీయనేత్రముల్. 65
టీక: అనుదినమున్=ప్రతిదినమును; ప్రియంబును=ప్రేమమును; దయామహిమంబును = కరుణాతిరేకమును; మించన్; ఈ జనవరపుత్త్రికామణికిన్=ఈరాజపుత్త్రిక యగు చంద్రికకు; చక్కన్=బాగుగా; విపంచికన్=వీణను; నేర్పన్=అభ్యసింపఁజేయు టకు; వత్తురు; నేఁటికిన్=ఇప్పటికి; మీరిటన్ రాక =మీరిచ్చోటి కరుదేరక; అనేకదివసంబులు = బహుదినములు; చనియెన్ సుమీ = కడచెను సుమా! నేఁడున్=ఇప్పుడు గూడ; ఇందునిన్=చందురుని; తెలికల్వలోయనన్ = తెల్లకలువలవలె; మదీయ నేత్రముల్=నాకన్నులు; నినున్; కనన్=అవలోకించుటకు; కోరున్=ఇచ్ఛించును. అనఁగా నిప్పుడు నీవు వచ్చుటకుముందు గూడ నిన్నుఁ దలఁచుచుంటి ననుట.
చ. మునుపటియట్ల యిచ్చటికి ◊మోదముతో నరుదేరకున్కి కో
జనపరివర్ణ్యదివ్యగుణ◊జాలక కారణ మేమి యేపురం
బెనసితి రేవిశేషగతు ◊లింపుగఁ గాంచితి రేనృపాలుతో
ననువగు మైత్త్రి సల్పితిరి ◊యంతయుఁ దెల్పఁగదే దయామతిన్. 66
టీక: ఓజనపరివర్ణ్యదివ్యగుణజాలక=జనులచే వర్ణింపఁదగిన లోకోత్తరగుణగణముగలవాఁడా! మునుపటియట్ల =పూర్వము వలెనె; ఇచ్చటికిన్;మోదముతోన్=సంతసముతోడ; అరుదేరకున్కికిన్=రాకుండుటకు;కారణ మేమి =హేతువేమి? ఏపురంబు =ఏనగరమును; ఎనసితిరి=పొందితిరి? ఏవిశేషగతులు; ఇంపుగన్=సొంపుగను; కాంచితిరి=అవలోకించితిరి? ఏనృపాలుతోన్=ఏరాజుతోడ;అనువగు = అనుకూలమైన; మైత్త్రిన్=చెలిమిని; సల్పితిరి=చేసితిరి; అంతయున్; దయామతిన్=కరుణాబుద్ధి తోడ; తెల్పఁగదే=తెల్పుడు.
క. అన వనితావాక్యసుధా,జనితామోదవృతమాన◊సపయోరుహుఁడై
యనువార యక్షవిభుఁడి,ట్లను వారణయానఁ గని మ◊హామధురోక్తిన్. 67
టీక: అనన్=చకోరి యిట్లనఁగా; వనితావాక్యసుధాజనితామోదవృతమానసపయోరుహుఁడై – వనితా=చకోరియొక్క, వాక్య సుధా=పలుకులను నమృతముచేత, జనిత=పుట్టినట్టి, ఆమోద=సంతసముచేత, వృత=కూడినట్టి, మానసపయోరుహుఁడై = చిత్తాంభోజము గలవాఁడై; అనువారన్=అనుకూలమగునట్లుగా; యక్షవిభుఁడు=కుముదుఁడు; వారణయానన్=ఆస్త్రీని;కని = చూచి; మహామధురోక్తిన్=మిక్కిలి తియ్యనిమాటలచేత; ఇట్లు అనున్=వక్ష్యమాణప్రకారముగఁ బల్కును.
మ. కలఁ డత్యుత్కటధాటికాతురగరిం◊ఖాజాతభూక్షోదక
జ్జలచిహ్నాప్తమహఃప్రదీపహృతతీ◊క్ష్ణధ్వాంతవేలాకుభృ
ద్బిలగేహప్రతిమాయితామితసమి◊ద్భేరీకులధ్వానమం
డలనిర్విణ్ణరిపుక్షితీంద్రుఁడు సుచం◊ద్రక్ష్మాపచంద్రుం డిలన్. 68
టీక: అత్యుత్కట ధాటికా తురగరింఖాజాత భూక్షోదకజ్జలచిహ్నాప్త మహఃప్రదీపహృత తీక్ష్ణధ్వాంత వేలాకుభృ ద్బిలగేహ ప్రతిమాయి తామితసమి ద్భేరీకులధ్వానమండల నిర్విణ్ణ రిపుక్షితీంద్రుఁడు – అత్యుత్కట =మిక్కిలి యధికమగు, ధాటికా =జైత్రయాత్రయందలి, తురగ=అశ్వములయొక్క,రింఖాజాత =గిట్టలవలనఁ బుట్టిన, భూక్షోద=భూపరాగమనెడు, కజ్జల =మసియొక్క,చిహ్నాప్త =చిహ్నమును బొందిన, మహఃప్రదీప=ప్రతాపమనెడు దీపముచేత, హృత=హరింపఁబడిన, తీక్ష్ణ ధ్వాంత=గాఢాంధకారము గల, వేలాకుభృత్=లోకాలోకపర్వతములయొక్క, బిలగేహ=గుహలనెడు నిండ్లయందు, ప్రతి మాయిత=బొమ్మలుగాఁజేయఁబడిన, ఇది రిపుక్షితీంద్రులకు విశేషణము, అమిత=కొలఁదిలేనట్టి, సమిత్=యుద్ధమందలి, భేరీకుల=భేరులగుంపుయొక్క, ధ్వానమండల=ధ్వనులసమూహముచేత, నిర్విణ్ణ=నిర్వేదము నొందిన; రిపుక్షితీంద్రుఁడు = శత్రురాజులు గలవాఁడు; సుచంద్రక్ష్మాపచంద్రుండు= సుచంద్రుఁడను రాజచంద్రుఁడు; ఇలన్=భూమియందు; కలఁడు.
అనఁగా సుచంద్రుని శత్రువులు లోకాలోకపర్వతగుహలు నిబిడధ్వాంతసంతతిసమావృతములని యచట దాఁగియున్న వారనియు, ఆబిలగృహములు సేనాపరాగ మనెడు మషీచిహ్నము గల సుచంద్రప్రతాపదీపముచేత నంధకారశూన్యములై యుద్ధభేరీనాదవ్యాప్తములు కాఁగా వారలు మన కిచట నైన క్షేమము లేక పోయెఁగదా యని నిర్విణ్ణులై బొమ్మలవలె చేష్టారహి తులై యున్నారనియు భావము. సూర్యతేజము ప్రసరింపని లోకాలోకపర్వతగుహలవఱకు సుచంద్రుని ప్రతాపము ప్రసరించిన దనియు, సర్వశత్రువులు పలాయితులై పర్వతగుహల నాశ్రయించి రనియు ఫలితార్థము.
మ. సరసీజాతహితాన్వయేశ్వరుయశో◊జాతంబు చక్రాప్తమై
హరిశోభాంచితమై భృతాబ్జనికరం◊బై రాజిలం దత్తులే
తరభావోదితపంక మంకవిధిచే◊త న్మేనునం గప్పినన్
సురకుత్కీలవరప్రదక్షిణముఁ బూ◊నుం జంద్రుఁ డశ్రాంతమున్. 69
టీక: వెనుకటిపద్యమున సుచంద్రుని ప్రతాపాతిశయమును జెప్పి, యిట నారాజు యశోతిశయమును జెప్పుచున్నాడు. సరసీజాతహితాన్వయేశ్వరుయశోజాతంబు = సూర్యవంశ్యులయందు శ్రేష్ఠుండగు సుచంద్రునియొక్క కీర్తిపుంజము; చక్రాప్తమై = రాష్ట్రహితమై, చక్రవాకములకు ప్రియమై యని యర్థాంతరము; హరిశోభాంచితమై =సింహతేజముతోడ నొప్పుచున్నదై, సూర్యదీప్తిచేతఁ బ్రకాశించుచున్నదై యని యర్థాంతరము; భృతాబ్జనికరంబై = పోషింపఁబడిన శంఖములు గలదై, పద్మములు గలదై యని యర్థాంతరము; రాజిలన్=ప్రకాశింపఁగా; తత్తులేతరభావోదితపంకము – తత్తులేతరభావ=ఆయశస్సుయొక్క సామ్యాభావముచేత, ఉదిత = జనించినట్టి, పంకము =పాపము; అంకవిధిచేతన్ = కలంకరూపముగా ననుట; మేనునన్ = శరీరమందు; కప్పినన్=వ్యాపింపఁగా; చంద్రుఁడు=శీతాంశువు; అశ్రాంతమున్ =ఎల్లపుడును; సురకుత్కీలవరప్రదక్షిణమున్ – సురకుత్కీలవర=మేరుపర్వతముయొక్క, ప్రదక్షిణమున్=ప్రదక్షిణమును; పూనున్ = వహించును.
అనఁగాఁ జంద్రకాంతి చక్రవాకముల కప్రియమైనదియు, సూర్యతేజముచే విరాజిల్లనిదియు, అబ్జములఁ బోషింపనిదియు, సుచంద్రుని యశోరాశి యట్లు కాక చక్రప్రియమును, సూర్యతేజోరాజితంబును, అబ్జపోషకంబునునై విరాజిల్లుటం జేసి, చంద్రు నకుఁ దద్యశోరాశి సామ్యము లేమిచేఁ గలంకరూపముగఁ బాపము శరీరమున వ్యాపించినందున నతండు తత్పాపనివృత్తికై మేరుపర్వతప్రదక్షిణమును బ్రత్యహముఁ జేయుచున్నాడని భావము. సుచంద్రుని యశము రాష్ట్రహితమై, సింహశంఖసమాన ధావళ్యము గలిగి తేజరిల్లుచున్నదని ఫలితార్థము.
మ. పరవాహిన్యధినాథజీవనహృతిం ◊బాటిల్లు తద్భూపని
ర్భరధామస్థితి తన్మహాప్రథనగో◊త్రాధూళి తద్వృత్తిమైఁ
గర మొప్ప న్వలయాద్రిఁ జేరుఁ దదరి◊క్ష్మాపాళినైజాంగముల్
వరకీరాళిపికవ్రజం బనుచర◊త్వం బూనఁగాఁ జేయఁగన్. 70
టీక: ప్రకారాంతరముగఁ బ్రతాపమునే చెప్పుచున్నాడు. పరవాహిన్యధినాథజీవనహృతిన్ – పరవాహిన్యధినాథ=శత్రుసేనా నాయకులయొక్క, జీవన=ప్రాణములయొక్క, హృతిన్=హరణముచేత; పాటిల్లు=ఒప్పునట్టి; తద్భూపనిర్భరధామస్థితి = ఆరాజుయొక్క అధికమైన ప్రతాపస్థితి, ఇది కర్త; తన్మహాప్రథనగోత్రాధూళి – తత్=ఆరాజుసంబంధియగు, మహత్=అధిక మైన, ప్రథన=యుద్ధమునందలి, గోత్రాధూళి= భూపరాగము; తద్వృత్తిమైన్= ఆపరవాహిన్యధినాథజీవనహృతి యనెడు వృత్తిచేత, అనఁగా పరమైన సముద్రముయొక్కనీరింకించుటచేత ననుట; కరము=మిక్కిలి; ఒప్పన్; తదరిక్ష్మాపాళి – తత్= ఆరాజుయొక్క, అరిక్ష్మాపాళి= శత్రురాజులగుంపు, నైజాంగముల్ = తమశరీరములు; వరకీరాళి – వర=శ్రేష్ఠములగు, కీరాళి =చిలుకలగుంపు; పికవ్ర జంబు=కోకిలలగుంపు; అనుచరత్వంబు=సహచరతను; ఊనఁగాఁ జేయఁగన్ = వహింపఁజేయు చుండఁగా; వలయాద్రిన్ = లోకాలోకపర్వతమును; చేరున్=పొందును. సుచంద్రుని ప్రతాపము శత్రుసేనానాయకుల ప్రాణహర ణముఁ జేసి, లోకాలోకమువఱకు వ్యాపించిన దనియు, తదీయ యుద్ధభూపరాగము సముద్రమునీ రింకించినదనియు, అతని యొక్క శత్రురాజుల శరీరములు పలుకులచేతను, తలవెండ్రు కలచేతను శుకపికాళి ననుసరించిన వనియు భావము. వారి శరీర ములు కీలు గొంతులు పడి తలవెండ్రుక లూచిపోయి పక్షి శరీరములవలె నుండెనని ఫలితార్థము.
చ. సరసకలాంచితాస్యుఁ డయి, చారువిలోచనపద్ముఁడై, కళం
కరహితగాత్రుఁడై, జగతిఁ ◊గన్పడు నానృపమౌళితో జనుల్
హరిముఖునిన్, సుమాంబకుఁ, గ◊ళంకసమన్వితగాత్రుఁ బోల్తురే
నిరుపమసౌందరీవిధికి ◊నిచ్చలు సాటి యటంచు నెమ్మదిన్. 71
టీక: ఇచట సుచంద్రుని సౌందర్యము చెప్పఁబడియె. సరసకలాంచితాస్యుఁ డయి – సరస=శ్రేష్ఠములగు, కలా=కాంతులచేత, అంచిత=ఒప్పుచున్న, ఆస్యుఁ డయి = ముఖముగలవాఁడై, శ్రేష్ఠములగు విద్యలచే నంచితమగు ముఖము గలవాఁడయి యని యర్థాంతరము; చారువిలోచనపద్ముఁడై=మనోహరమైన పద్మములవంటి నేత్రములు గలవాఁడై, మనోహరమైన నేత్రములందు పద్మ యనఁగా లక్ష్మి గలవాఁడై యని యర్థాంతరము; కళంకరహితగాత్రుఁడై = కళంకము (మచ్చ)లేని శరీరము గలవాఁడై, ఒచ్చెములేని శరీరము గలవాఁడై యని యర్థాంతరము; జగతిన్=లోకమందు; కన్పడు =చూపట్టుచున్న, ఆనృపమౌళితోన్ = ఆరాజశేఖరునితోడ; జనుల్=లోకులు; హరిముఖునిన్ = నలకూబరుని, గుఱ్ఱపుమోరగలవాని ననిగాని, కోతిమోరగలవాని నని గాని ధ్వని; సుమాంబకున్ = మన్మథుని, పూగంటివాని నని ధ్వని; కళంకసమన్వితగాత్రున్ = చంద్రుని, ఒచ్చెములతోఁ గూడిన శరీరము గలవాని నని ధ్వని; నిరుపమసౌందరీవిధికిన్ = సాటిలేని సౌందర్యవిధానమునకు; నిచ్చలు =ఎల్లప్పుడు; సాటి యటంచున్ = సరియనుచు; నెమ్మదిన్ = చిత్తమందు; పోల్తురే = సరిపోల్ప రనుట.
అనఁగా నట్టి ముఖము, లోచనములు, గాత్రముగల సుచంద్రునితోడ గుఱ్ఱపుమూతి, పువ్వుపడిన కన్నులు, ఒచ్చెములు గల గాత్రము గల నలకూబర, సుమాయుధ, చంద్రులు సాటి యని జనులు సరిపోల్పరని తాత్పర్యము. నిరుపమానసౌంద ర్యము వ్యంగ్యము.
చ. అవనిపచంద్రరూపవిభ◊వాతిశయశ్రవణోయమానమో
హవితతి యూను భోగిమను◊జామరకన్యల నిచ్చ నేఁచుఁ బం
చవిశిఖుఁ డాశుగత్రితయిఁ ◊జక్కగ శేషశరద్వయంబుఁ గాం
క్ష వెలయ డాఁచు ముంగల న◊ఖండఫలంబు వహించు నన్మతిన్. 72
టీక: అవనిపచంద్రరూపవిభవాతిశయశ్రవణోయమానమోహవితతి – అవనిపచంద్ర=సుచంద్రునియొక్క, రూపవిభవ= రూప సంపదయొక్క, రూపలక్షణము వ్రాయఁబడియె, అతిశయ=ఆధిక్యముయొక్క,శ్రవణ=వినుటచేత, ఊయమాన=నేయఁబడు చున్న, వృద్ధిఁ బొందింపఁబడుచున్న యనుట, ‘ఊఞ్ తన్తుసన్తానే’ అనుదానిపై శానచ్ ప్రత్యయము చేయఁగా ఊయమాన యని యైనది, మోహవితతి =మోహాతిశయమును; ఊను =వహించునట్టి; భోగిమనుజామరకన్యలన్=నాగ మానవ దేవకన్య లను, స్వర్గమర్త్యపాతాళలోకములందుండు కన్యకల ననుట; నిచ్చన్=ఎల్లపుడు; బంచవిశిఖుఁడు=మరుఁడు; ఆశుగత్రితయిన్ = అరవింద, నవమల్లికా, నీలోత్పలము లనెడు బాణత్రయముచేత; చక్కగన్=బాగుగ; ఏఁచున్=బాధించును; శేషశరద్వయం బున్ = తక్కిన చూతాశోకము లనెడు బాణద్వయమును; ముంగలన్=ఈచంద్రికకు రాజునకు పరస్పరావలోకన మబ్బునపు డనుట; అఖండఫలంబు =అవిచ్ఛిన్నలాభము, చూతాశోకములు ఫలించుఁ గావున నఖండమైన పండ్ల నని యర్థాంతరము దోఁచుచున్నది; వహించు నన్మతిన్= పొందునను తలంపుచేత; కాంక్ష వెలయన్= కోర్కియతిశయించునట్లు; డాఁచున్= మఱుఁగు పఱచును.
‘మార ఏకో మహాధన్వీ ద్వయ మేకం కరోత్యసౌ’ అనుటచే మన్మథశరప్రయోగమునకుఁ దరుణీతరుణసంఘటనమే ముఖ్యఫలంబు గాన నట్టిఫలము స్వర్గమర్త్యపాతాళలోకస్త్రీలయందుఁ గాక చంద్రికయందే కలుగు నని కాముండు చంద్రికా సుచంద్రసమావేశసమయమునకుఁ బ్రతీక్షించుచున్నాఁ డని భావము. ఇందువలన దేవాంగనాదిప్రార్థనీయసౌందర్యము గల వాఁ డనియు, వారలకు దుర్లభుం డనియు, దానం జేసి చంద్రికచే నవశ్యముగఁ గోరఁదగినవాఁ డనియు, ఫలిత మగుచున్నది.
తే. ఇట్టి సకలానఘగుణోత్క◊రాబ్ధి యైన,యామహీకాంతుతో మైత్త్రి ◊యడరు కతన
నిన్నిదినములు తద్యోగ ◊మెనసి యుంటి, నెడయ నేఁ గొమ్మ హృద్వీథిఁ ◊బొడమ కున్కి. 73
టీక: ఇట్టి సకలాఘగుణోత్కరాబ్ధి యైన యామహీకాంతుతోన్ = ఈప్రకారముగ సకలనిర్దుష్టగుణముల కాకరుండైన యా సుచంద్రుఁ డను రాజుతోడ; మైత్త్రి =సఖ్యము; అడరు కతనన్ = అతిశయించుహేతువున; ఇన్నిదినములు; తద్యోగము=అతని సంబంధమును; ఎనసి =పొంది; ఉంటిన్; కొమ్మ = చకోరీ! హృద్వీథిన్=అంతరంగప్రదేశమందు; పొడమ కున్కిన్=తోఁప కుండుటచేత; నేన్; ఎడయన్ = ఆరాజు నెడఁబాయను. ఇట్టి సకలసద్గుణములు గల సుచంద్రునితోఁ గూడి యారాజు నెడఁ బాయఁజాలక యంతకాల ముంటి నని భావము. (ప్రథమపాదమునందలి యతిభంగము ‘ఇట్టి’ని ‘అట్టి’గా మార్చినచో తొలగి పోవును.)
ఉ. ఈనృపకన్యఁ జూచురతి ◊నిప్పుడు తజ్జనరాడనుజ్ఞ చేఁ
బూని రయాప్తి వచ్చితి, న◊పూర్వవిలాసినియై రహించు నీ
మానినిఁ గాంచ నిత్తఱి న◊మందముదావళిఁ జెందె నాత్మ, కం
జానన! యంచు నామయుకు◊లాగ్రణి వెండియుఁ బల్కు నాచెలిన్. 74
టీక: ఈనృపకన్యన్=ఈరాజపుత్త్రిని; చూచురతిన్ = చూడవలెనను వాంఛచేత; ఇప్పుడు; తజ్జనరాడనుజ్ఞచేన్= ఆరాజునానతి చేత; పూని =ప్రయత్నపడి; రయాప్తి న్ =వేగప్రాప్తిచేత; వచ్చితిన్; అపూర్వవిలాసినియై=లోకోత్తరవిలాసము గలదై;రహించు నీమానినిన్ = ఒప్పుచున్న యీచంద్రికను; కాంచన్=చూడఁగా; ఇత్తఱిన్=ఈసమయమున; కంజానన=ఓపద్మముఖీ! ఆత్మ= చిత్తము; అమందముదావళిన్=అధికమగు సంతోషపరంపరను; చెందెన్=పొందెను; అంచున్; ఆమయుకులాగ్రణి =ఆయక్షేశ్వ రుఁడు; ఆచెలిన్=ఆచకోరినిగూర్చి; వెండియున్=మఱల; పల్కున్=వచించును.
చ. అళికచ! నెమ్మదిం దలఁప ◊నప్పతికే తగు నీవెలంది, యీ
జలరుహనేత్రకే తగు ర◊సారమణేంద్రుఁడు, గాన నామనో
జలలితమూర్తి యీలలనఁ ◊జక్క వరించినఁ గాక మామదిం
దళమయి మించ నేర్చునె యు◊దారకుతూహలవార్ధివీచికల్. 75
టీక: అళికచ=తుమ్మెదలఁబోలు కురులుగల చకోరీ! నెమ్మదిన్=మంచిమనస్సుచేత; తలఁపన్=విచారింపఁగా; ఈవెలంది = ఈచంద్రిక; అప్పతికే=ఆసుచంద్రునికే; తగున్=ఒప్పును; రసారమణేంద్రుఁడు=భూపతిశ్రేష్ఠుఁడైన యా సుచంద్రుఁడు; ఈజల రుహనేత్రకే=ఈకమలాక్షికే; తగున్=ఒప్పును; కానన్=ఆకారణముచేత; ఆమనోజలలితమూర్తి = ఆమన్మథసుందరతనువు గలరాజు; ఈలలనన్=ఈచిన్నదానిని; చక్కన్=చక్కగా; వరించినన్ కాక =వరించినఁగాని; మామదిన్=మామనస్సునందు; ఉదారకుతూహలవార్ధివీచికల్ – ఉదార=అధికమగు, కుతూహల=సంతసమనెడు, వార్ధి=సముద్రముయొక్క,వీచికల్=తరఁ గలు; దళమయి=దట్టమయి; మించన్ నేర్చునె = అతిశయింప నేర్చునా, నేర్వ వనుట.
మ. కనుగల్వ ల్వికసిల్ల, మోదము పొసం◊గన్ దజ్జనాధీశచం
ద్రుని వీక్షించినఁ గాని మామకహృదు◊ద్భూతస్పృహారేఖ యి
మ్మెనయం జాలదు, చాన, యవ్విభుని మీ◊కీలోపలం గాంచఁ గ
ల్గు నన, న్గోమలి కిన్నరేశ్వరునిఁ బ◊ల్కు న్గోర్కి దైవాఱఁగన్. 76
టీక: కనుగల్వల్=కన్నులనెడు కలువలు; వికసిల్లన్=వికసించునట్లును; మోదము=సంతసము; పొసంగన్ = కల్గునట్లును; తజ్జనాధీశచంద్రునిన్ =ఆరాజచంద్రుని; వీక్షించినన్ కాని =చూచినంగాని; మామకహృదుద్భూతస్పృహారేఖ = నామనంబునఁ బొడమిన వాంఛాతిశయము;ఇమ్మెనయం జాలదు= ఆనుకూల్యముఁ బొందఁజాలదు; చాన =చకోరీ! అవ్విభునిన్=ఆరాజును; మీకు; ఈలోపలన్= ఇంతలోనె; కాంచన్ కల్గు = చూచుట సంభవించును; అనన్ = ఇట్లు వచింపఁగా; కోమలి= చకోరి; కోర్కి దైవాఱఁగన్ = కోరిక యతిశయింపఁగా; కిన్నరేశ్వరునిన్=కుముదునిగూర్చి; పల్కున్=వచించును.
మ. హరివంశోత్తము సద్గుణాళి విని ని◊త్యం బేము వర్ణింప స
త్వరబుద్ధిం గనఁ జాన గోరుఁ బతి నా◊త్మం, గాంచ మాకుం దదం
తర మెల్లప్పుడు మించుఁ గాన, నలగో◊త్రాభర్త నే మిప్పు డే
కరణిం గాంతుము, గాంచుదారిఁ గృప ని◊క్కం దెల్పవే నావుడున్. 77
టీక: హరివంశోత్తముసద్గుణాళి =సూర్యవంశమునం దుత్తముఁడగు నారాజుయొక్క శ్రేష్ఠమగుగుణములగుంపును; విని= ఆక ర్ణించి; నిత్యంబు=ఎల్లపుడు; ఏము=మేము; వర్ణింపన్=ఆరాజుగుణములఁ గొనియాడఁగా; చాన=చంద్రిక; సత్వరబుద్ధిన్ = త్వరతోఁ గూడిన మతిచేత; పతిన్=రాజును, భర్త ననియుఁ దోఁచును; కనన్=అవలోకించుటకు; ఆత్మన్ =మనమున; కోరున్ = వాంఛించును; మాకున్; కాంచన్=చూచుటకు; తదంతరము=ఆమనస్సు, అంతరశబ్దార్థములు చెప్పునపుడు ‘బహి రవసర మధ్యేంత రాత్మని చ’ అని యమరుఁడు; ఎల్లప్పుడు; మించున్=అతిశయించును; కానన్=ఆహేతువువలన; అలగోత్రాభర్తన్ = ఆరాజును; ఏము; ఇప్పుడు=ఈసమయమున; ఏకరణిన్ = ఏరీతి; కాంతుము=చూతుము; కాంచుదారిన్=చూచుమార్గమును; కృప నిక్కన్= కరుణ యతిశయిల్లునట్లు; తెల్పవే=ఆనతీవే, నావుడున్=ఇట్లనఁగా, దీనికి ముందుపద్యముతో నన్వయము.
మ. వనితా యావిభుఁ గాంచువాంఛ మదిఁ జె◊ల్వం బూనినం గాంచవే
జనితాసక్తి నృపాలు మామకకర◊చ్ఛాయ న్మనోవీథి నూ
త్ననితాంతాద్భుత మబ్బ నంచు మహిమం ◊దత్సద్గుణశ్రేణికా
ఖని తాఁ బ్రాక్కృతమాయ నంతయుఁ జనం ◊గావింప నప్పట్టునన్. 78
టీక: వనితా=చకోరీ! ఆవిభున్=ఆరాజును; కాంచువాంఛ =చూడవలెననుకోరిక; మదిన్=మనస్సునందు; చెల్వంబు ఊనినన్ = చక్కగాఁ గుదిరినయెడల; మనోవీథిన్=మనఃప్రదేశమునందు నూత్ననితాంతాద్భుతము=అపూర్వమైన మిక్కిలియాశ్చర్యము; అబ్బన్=అమరునట్లు; మామకకరచ్ఛాయన్=నాచేతిచాయను; జనితాసక్తి న్=కలిగినప్రీతితో; నృపాలున్=రాజును; కాంచవే=చూడుమా; అంచున్=ఇట్లనుచు; తత్సద్గుణశ్రేణికాఖని=ఆశ్రేష్ఠగుణాకరుఁడగు కుముదుఁడు; మహిమన్=ప్రభావము చేత; తాన్; ప్రాక్కృతమాయను అంతయున్=ఇతరజనులకుఁ గాన్పింపఁ గూడదని మున్ను చేసిన మాయ నంతయు; చనన్ = తొలఁగునట్లు; కావింపన్=చేయఁగా; అప్పట్టునన్=ఆప్రదేశమున, దీనికి ముందు కన్వయము.
సీ. బెళుకుచూపులవానిఁ, బలుమాఱు బలుమారు,సొంపు నిందించుమే◊ల్సొబగువాని,
నొఱపు మించినవాని, నెఱమించునెఱమించు,మెలపుఁ గందించు నె◊మ్మేనివాని,
సొగసు మీఱినవానిఁ, బగడంబుపగడంబు,తలఁపుఁ గుందించుమేల్◊తళుకువానిఁ,
గళుకు హెచ్చినవానిఁ, గపురంపుకపురంపు,వలపుఁ జిందించున◊వ్వొలయువానిఁ,
తే. గళ మెలకువాని, మంజులో◊జ్జ్వలమువానిఁ, జెలువు గలవాని, నొయ్యార ◊మలరువాని,
నభ్రయానసమాసీను, ◊నాక్షితీశుఁ, జూచి వెఱగంది నిలిచి రా◊సుదతు లపుడు. 79
టీక: బెళుకుచూపులవానిన్= ప్రకాశించుచున్న దృష్టులుగలవానిని; పలుమాఱు=సారెకు; బలుమారుసొంపు –బలు = అధికమైన, మారు=మన్మథునియొక్క, సొంపు=సౌందర్యమును; నిందించుమేల్సొబగువాని =నిందించునట్టి మేలైన చక్కఁ దనముగలవానిని; ఒఱపు మించినవానిన్=యోగ్యతచే నతిశయించినవానిని; నెఱమించు నెఱమించుమెలపున్ – నెఱ=అధికముగ, మించు = ప్రకా శించుచున్న, నెఱమించు=నిండుమెఱపుయొక్క, మెలపున్=జాగరూకతను; కందించు నెమ్మేనివాని=శ్రమపఱచు నందమగు శరీరముగలవానిని; సొగసు మీఱినవానిన్=అందముచే నతిశయిల్లువానిని; పగడంబుపగడంబుతలఁపున్ – పగడంబు=ప్రవాళముయొక్క, పగ=
విరోధముయొక్క, డంబు=అతిశయముయొక్క, తలఁపున్=చింతను; కుందించుమేల్తళుకువానిన్ – కుందించు=దుఃఖపెట్టుచున్న, మేల్=అధికమైన, తళుకువానిన్=ప్రకాశముగలవానిని; కళుకు హెచ్చినవానిన్ = కాంతిచే నతిశయించినవానిని; కపురంపుకపురంపువలపున్ – క=సుఖమునకు, పురంపు=స్థానమైన, కపురంపువలపున్=కర్పూరసంబంధిపరిమళమును; చిందించునవ్వొలయువానిన్ = చెదరఁగొట్టుచున్న మందహాసము వెల యించువానిని; కళ మెలకువానిన్=కళాప్రకాశముగలవానిని; మంజులోజ్జ్వలమువానిన్=మనోహరమైన శృంగారముగలవానిని, ‘ఉజ్జ్వలో ధీర శృంగార విశదేషు విలాసిని’ అని విశ్వము; చెలువు గలవానిన్=అందకానిని; ఒయ్యార మలరువానిన్ = విలాసమొప్పువానిని; అభ్రయానసమాసీనున్=విమానారూఢుని; ఆక్షితీశున్=ఆసుచంద్రుని; చూచి; వెఱగంది=ఆశ్చర్యమంది; ఆసుదతులు=ఆ స్త్రీలు; నిలిచిరి; అపుడు=ఆసమయమందు, దీని కుత్తరపద్యస్థక్రియతో నన్వయము.
చ. పులకలు మేన నిక్క, వల◊పుంబస మానసవీథిఁ జిక్క, దృ
క్స్థలి ననిమేషవిస్ఫురణ ◊దక్కఁ, బ్రమోదము చిందు ద్రొక్క, ని
ర్మలమణిపీఠి డిగ్గి యొక◊మానిని కేల్కయిలాగు వూని యా
యలికులవేణి రాజకుసు◊మాశుగుఁ గాంచె నొకింత సిబ్బితిన్. 80
టీక: మేనన్=శరీరమునందు; పులకలు=గగుర్పాటులు; నిక్కన్= అతిశయింపఁగా; మానసవీథిన్=అంతరంగమందు; వలపుంబస = మోహసమృద్ధి; చిక్కన్=చేరఁగా; దృక్స్థలిన్=చూపునందు; అనిమేషవిస్ఫురణ=ఱెప్పపాటులేమియొక్క స్ఫూర్తి; దక్కన్=లభింపఁగా; ప్రమోదము=సంతసము; చిందు ద్రొక్కన్=నటింపఁగా; ఆయలికులవేణి=నీలవేణియగు నా చంద్రిక; ఒకమానినికే ల్కయిలాగు =ఒకస్త్రీయొక్క హస్తావలంబమును; పూని = గ్రహించి; నిర్మలమణిపీఠిన్=స్వచ్ఛమగు మణిమయాసనమునుండి; డిగ్గి =దిగి; రాజకుసుమాశుగున్=రాజమన్మథుఁడగు సుచంద్రుని; ఒకింత సిబ్బితిన్=కొంచెము లజ్జచేత; కాంచెన్=అవలోకించెను.
ఇచటఁ జంద్రికకు లోకోత్తరవస్తుదర్శనమున విస్మయము, దానంజేసి మేనఁ బులకలు, తదనంతర మాతనియందు రత్యు దయము, తదనంతరము మనోరథలాభముచేత హర్షము, దానంజేసి నిమేషశూన్యదర్శనము, ప్రథమదర్శనమున లజ్జోద యము చెప్పఁబడియె. ‘శ్లో.లోకోత్తరపదార్థానా మపూర్వాలోకనాదిభిః|విస్తార శ్చేతసోయస్తు విస్మయ స్స నిగద్యతే| క్రియా స్తత్రాక్షివిస్తార సాధూక్తి పులకాదయః’ అని విస్మయలక్షణతత్కార్యకారణములు, ‘రోమాఞ్చో విస్మయోత్సాహహర్షాద్యై స్తత్ర విక్రియాః| రోమోద్గమో ముఖోల్లాస గాత్రసంస్పర్శనాదయః’ అని రోమాంచలక్షణతత్కార్యకారణములు, ‘యూనో రన్యోన్యవిషయాస్థాయినీచ్ఛారతి ర్భవేత్| నిసర్గేణాభియోగేన సంసర్గేణాభిమానతః| ఉపమాధ్యాత్మ్యవిషయై రేషా స్యాత్తత్ర విక్రియాః| కటాక్షపాత భ్రూక్షేప ప్రియవాగాదయో మతాః’ అని రతిలక్షణతత్కార్యకారణములు, ‘మనోరథస్యలాభేన సిద్ధ్యా యోగ్యస్య వస్తునః| ప్రియసంగమదేవాదిప్రసాదాదేశ్చ కల్పితః| మనఃప్రసాదో హర్ష స్స్యాత్తత్ర నేత్రస్యఫుల్లతా| ప్రియభాషణ మాశ్లేషః పులకానాం ప్రరోహణమ్|’ అనిహర్షలక్షణతత్కార్యకారణములు, తెలియవలయు. నేత్రస్యఫుల్లతా, అనుటచేత నిర్ని మేషభావమును వివక్షితమే. అట్లు ‘నివాతపద్మస్తిమితేనచక్షుషా నృపస్య కాంతం పిబత స్సుతానతమ్| మహోదధేః పూర ఇవేన్దు దర్శనాద్గురుః ప్రమోదః ప్రబభూవ చాత్మని’ ఇత్యాదులయందు నిర్నిమేషతఁ జూడవలయు. ‘అకార్యకరణావజ్ఞాస్తుతి నూతన సంగమైః| ప్రతీకారాక్రియాద్యైశ్చ వ్రీడాత్వనతిధృష్టతా| తత్ర చేష్టాని గూఢోక్తిరాధోముఖ్యవిచిన్తనే| అనిర్గమో బహిః క్వాపి దూరా దేవావగుంఠనమ్| నఖానాం కృన్తనం భూమిలేఖనం చైవమాదయః’ అని లజ్జాలక్షనతత్కార్యకారణములు తెలియవలయు. ఇట్లు చెప్పినవీనిలో రతి యనునది స్థాయిభావము. అది, ‘నియతం వికాసవిస్తృతివిక్షోభక్షేపసంజ్ఞితా ధర్మాః| చత్వారో జాయన్తే సపది విభావాదిసంగమే మనసః| కథితో వికాసమూలశ్శృఙ్గారోవిస్తరోపధిర్వీరః| క్షోభోపధిస్తురౌద్రోబీభత్సః క్షేపమూలకః పూర్వైః| హాస్యాశ్చర్యభయానకదయావికాసాదిమూలకాః క్రమశః’ అనుటవలన విభావాదిసంగమమున మనసునందుఁ గల్గు వికాసరూపధర్మము, దానికి స్థాయిత్వము సజాతీయవిజాతీయానభిభావ్యమై యావదానందానుభవము నిలిచియుండుటం బట్టి కలిగినది, తల్లక్షణంబు వెనుక వ్రాయఁబడియె. విస్మయంబు స్వతంత్రముగ నద్భుతరసమునుగూర్చి స్థాయి యైనను నిట దానికి స్థాయిత్వము గలుగదు. దాని కనుభవపర్యంతావస్థాయిత్వము లేక కించిత్కాలావస్థాయిత్వ ముండుటంబట్టి దాని యందు, ‘విరుద్ధైరవిరుద్ధైర్వా భావైర్విచ్ఛిద్యతే నయః| ఆత్మభావన్నయత్యన్యాన్’ ఇత్యాదిస్థాయిలక్షణము సమన్వయిం పదు. మఱేమన్న, ‘రత్యాదయః స్థాయిభావాస్స్యు ర్భూయిష్ఠ విభావజాః| స్తోకై ర్విభావై రుత్పన్నా స్త ఏవ వ్యభిచారిణః’ అను సంగీతరత్నాకరమువలనను, ‘భావోవాపి రసోవాపి ప్రవృత్తిర్వృత్తిరేవ వా| సర్వేషాం సమవేతానాం రూపం యస్య భవే ద్బహు| సమన్తవ్యోరసస్థాయీ శేషా స్సంచారిణో మతాః’ అను భరతవచనమువల్లను, దానికి రతినిగూర్చి సంచారిత్వమే ఘటిల్లునని తెలియవలయు. ఇఁక రోమాంచ మనునది సాత్త్వికభావము, అది యనుభావవిశేషమె, మనోగతభావమును బయల్పఱచునట్టి భావము లనుభావములు, వాని లక్షణములు, భేదములు వెనుక వ్రాయఁబడియె. హర్షము, లజ్జయు సంచారులు, ఇవి రతిని పుష్టి పఱచునవి, ‘ఉన్మజ్జన్తో నిమజ్జన్తః స్థాయిన్యమ్బునిధావివ| ఊర్మివ ద్వర్ధయన్త్యేనం యాన్తి తద్రూపతాం చ తే’ ఇత్యాదులు తత్ప్రమాణములు. ఇట్లు సాత్త్వికవ్యభిచారులచే నుపచితమగు స్థాయి రసరూపత నొందునని ముందు తెల్లమగును.
చ. జనపతియాస్యచంద్రుఁ గనఁ ◊జాలఁ జెలంగు వధూటికావలో
కనకుహనాచకోరములు ◊గ్రక్కున వ్రీళతమశ్చయంబు పొ
ల్చిన భ్రమియింప దాని సడ◊లించె మరుండు విచిత్రశక్తి నూ
తనశరజాతనిర్వమదు◊దారశిఖోదయరాగవైఖరిన్. 81
టీక: జనపతియాస్యచంద్రున్=రాజుముఖమనెడు చంద్రుని; కనన్=చూచుటకు; చాలన్=మిక్కిలి; చెలంగు = ఒప్పుచున్న; వధూటికావలోకనకుహనాచకోరములు – వధూటికా=చంద్రికయొక్క, అవలోకన=చూపులనెడు, కుహనా=నెపము గల , చకోరములు = వెన్నెలపులుఁగులు; గ్రక్కునన్=వేగముగా; వ్రీళతమశ్చయంబు =లజ్జయను నంధకారపుగుంపు;పొల్చినన్ = ఉదయించుటచేత; భ్రమియింపన్=కలఁతనొందఁగా; మరుండు = మన్మథుఁడు; విచిత్రశక్తి న్=అద్భుతమగుసామర్థ్యముచేత; నూతనశరజాతనిర్వమదుదారశిఖోదయరాగవైఖరిన్ – నూతన=క్రొత్తదగు, శరజాత=బాణసంఘముచేత, నిర్వమత్=వెడలు చున్న, ఉదార=అధికమైన,శిఖా=జ్వాలలనెడు, ఉదయరాగ=ఉదయకాలారుణ్యముయొక్క, వైఖరిన్ =రీతిచేత; దానిన్=ఆ లజ్జాంధకారమును; సడలించెన్=పోఁగొట్టెను.
అనఁగా నామె రాజును జూచునపుడు లజ్జ ప్రతిబంధకముగా నుదయించియు రాగాతిశయమునఁ దొలంగినదనియు, నందు వలన సంపూర్ణనయనానందము ఘటిల్లిన దనియు వ్యజ్యమానమగుచున్నది. కామము రాగాతిశయరూపమేకాని వేఱొండు పదార్థము గాదు. ఇచ్ఛారూపము రతి యనియు, నుత్కటేచ్ఛారూపము కామమనియు వ్రాయఁబడియె.రమ్యవస్తుదర్శనమున దానియందుఁ బ్రీతి గల్గి యిది మదిష్టసాధనమగునని దానియం దుత్కటప్రీతి గల్గుట యనుభవసిద్ధము. చంద్రికకు సుచంద్రునిఁ జూడగనె లోకోత్తరవస్తుదర్శనప్రయుక్తవిస్మయము గల్గి వెనుక రతి గల్గి తదనంతరంబ కామ ముదయించినదని చెప్పఁబడియె. సుచంద్రునకు నిట్లే రత్యనంతరము కామము వెనుక చెప్పఁబడినది. రతి సంభోగేచ్ఛాత్మక మను మతమును గూర్చియు రతి కామముల పౌర్వార్యమును గూర్చియు కావ్యాలంకారసంగ్రవిమర్శనము చూడవలయు.
తే. చెలిఁ దఱియ వచ్చునరపాల◊సితదృగాళి, దారి నానారిచూపుచా ◊ల్దవిలి నడచె
నపుడు గగనధునీప్రవా◊హంబు సొచ్చి, వేగ యెదురెక్కు మీనౌఘ◊విధి వహించి. 82
టీక: చెలిన్=చంద్రికను; తఱియన్=సమీపించుటకు; వచ్చునరపాలసితదృగాళిదారిన్=వచ్చుచున్న ఱేనితెల్లనిచూపుచాలు యొక్కత్రోవను; ఆనారిచూపుచాల్=ఆచంద్రికయొక్క దృక్పరంపర; తవిలి =సంబంధించి; అపుడు; గగనధునీప్రవాహంబు =వ్యోమగంగాప్రవాహమును; చొచ్చి=ప్రవేశించి; వేగ=త్వరగా; ఎదురెక్కు=ఎదురునడచుచున్న; మీనౌఘవిధిన్=మీనుల గుంపు ప్రకారమును; వహించి =పొంది; నడచెన్=పోయెను.
ఆరాజుచూపులు తెల్లగ స్వర్గంగాప్రవాహముంబోలెఁ జంద్రికయందుఁ బ్రసరించిన వనియు, ఆప్రవాహరూపమగు చూపు చాలునందు నెదురెక్కు మీనులఁబోలెఁ జంద్రికాదృక్పరంపర నృపుపై నడిచె ననియు, దానం జేసి యన్యోన్యదర్శనానందపరి పూర్తి ఘటిల్లె ననియుఁ దెలియవలయు.
ఇట నాయికానాయకాన్యోన్యదర్శనానందానుభవముచే నితరేతరానురాగము ప్రవ్యక్తంబగుచున్నది. దానంజేసి పూర్వా నురాగాఖ్యవిప్రలంభశృంగార మిందు సకలసామగ్రులు గలుగుటచేఁ బూర్ణముగ స్ఫురించుచున్నది. ఏలాగనిన, అన్యోన్యావ లోకనమున నితరేతరవిషయకమైన ప్రీతి వ్యక్తమగుచున్నదిగదా! ‘యూనో రన్యోన్యవిషయాస్థాయినీచ్ఛారతి ర్భవేత్’అనుట వలన నది రతి యనఁబడుచున్నది. దాని కిరువురును ఆలంబనవిభావములు. ‘ఆలమ్బన న్నాయికాస్యు ర్దక్షిణాద్యాశ్చ నాయకాః ’ అని వెనుక వ్రాయంబడియె. నాయిక స్వీయా, పరకీయా,సామాన్యాభేదముచేఁ ద్రివిధ యనియు, నందు స్వీయ, ముగ్ధా, మధ్యా,ప్రగల్భాభేదముచేఁ ద్రివిధ యనియు, నందు మధ్యాప్రగల్భలు ధీరా, అధీరా, ధీరాధీరాభేదముచేఁ బ్రత్యేకముగఁ ద్రివిధలై , జ్యేష్ఠాకనిష్ఠాభేదమునఁ బ్రత్యేకముగ నాఱుతెగ లనియు, పరకీయ పరోఢా, కన్యకాభేదముచేఁ ద్వివిధ యనియు, సామాన్య యొకతె యనియు, నిట్లు పదార్వురైన నాయికలు ప్రత్యేకముగ స్వాధీనపతికా, వాసకసజ్జా, విరహోత్కంఠిత, అభిసారికా, విప్రలబ్ధా, ఖండితా, కలహాంతరితా, ప్రోషితపతికాభేదముచేత నెన్మిదిభేదములు గలవారై, యుత్తమా,మధ్యమా, అధమాభేదములతోఁ బ్రత్యేకముగఁ ద్రివిధలై, మున్నూటయెనుబదినాల్గుభేదములతో రాజిల్లుదు రనియు, ‘శ్లో. స్వీయా త్రయోదశవిధా ద్వివిధాతు పరాఙ్గనా| వేశ్యైకైవం షోడశధా తాశ్చావస్థాభి రష్టభిః|ప్రత్యేక మష్టధా తాసా ముత్తమాదిప్రభేదతః| త్రైవిధ్య మేవం చ చతురశీతిత్రిశతం భవేత్|’ అనుటవలన నెఱుంగునది. అట్లు నాయకులు పతి, ఉపపతి, వైశికుఁడు,అని ముగ్గు రనియు, అందుఁ బతి దక్షిణుఁడు, అనుకూలుఁడు, ధృష్టుఁడు, శఠుఁడు, అని నాలుగుభేదములు గలవాఁడనియు సింగభూపా లీయమున, ‘శృఙ్గారాపేక్షయా తేషాం త్రైవిధ్యం కథ్యతే బుధైః| పతి శ్చోపపతి శ్చైవ వైశికశ్చేతి భేదతః| పతిస్తు విధినా పాణి గ్రాహకః కథ్యతే బుధైః| చతుర్థా సోఽపి కథితో వృత్త్యా కావ్యవిచక్షణైః| అనుకూల శ్శఠోధృష్టో దక్షిణశ్చేతి భేదతః|’ ఇత్యా దుల వలనఁ దెలియునది. ఇట్లు చంద్రికాసుచంద్రరూపాలంబనవిభావములు సానురాగావలోకనాద్యనుభావములు, పూర్వోక్త స్వేదాదిసాత్త్వికములు, హర్షలజ్జాదిసంచారులు, ‘యౌవనం రూపలావణ్యే సౌన్దర్యమభిరూపతా| మార్దవం సౌకుమార్యం చే త్యాలమ్బన గతాగుణాః’ అని చెప్పఁబడిన యాలంబనగుణములు, భావహావహేలావిభ్రమకిలికించితమోట్టాయితకుట్టమి తాదిగాఁ జెప్పఁబడినవానిలో యథాసంభవముగఁ దచ్చేష్టలు, నూపురాంగదహారాది తదలంకరణములు, ఉపవనమంద మారుతకోకిలాలాప భ్రమరఝంకారాదితటస్థములును నీనాలుగుతెగలైన యుద్దీపనవిభావములు చేరియుండుటవలనఁ బరి పూర్ణసామగ్రీసంఘటన మైనందున రతిరూపస్థాయిభావమునకు రసరూపత గలుగుచున్నది. ‘శ్లో.ఏతేచ స్థాయినః స్త్వెస్త్వె ర్విభావై ర్వ్యభిచారిభిః| సాత్త్వికై రనుభావైశ్చ నటాభినయయోగతః| సాక్షాత్కారమివానీతైః ప్రాపితా స్స్వాదురూపతామ్| సామాజికానా న్మనసి ప్రయాన్తి రసరూపతామ్|’ ఇత్యాదులు తత్ప్రమాణంబులు. ఇట నటాభినయపదము కావ్యమున కుప లక్షకము, ‘రత్యాదేః స్థాయినో లోకే తానిచే న్నాట్యకావ్యయోః| విభావా అనుభావాశ్చ కథ్యన్తే వ్యభిచారిణః| వ్యక్త స్సతై ర్విభా వాద్యైః స్థాయీభావో రస స్స్మృతః|’ అను కావ్యప్రకాశాదులవలన నయ్యది యెఱుంగునది. ‘విభావై రనుభావైశ్చ సాత్త్వికై ర్వ్యభిచారిభిః| నీతా సదస్యరస్యత్వంరతి శ్శృఙ్గార ఉచ్యతే’ అనుటవలన నిది శృంగారరసము. అందును, ‘అయుక్తయో స్తరుణయోర్యోనురాగః పరస్ప రమ్| అభీష్టాలిఙ్గనాదీనామనవాప్తౌ ప్రకృష్యతే| స విప్రలమ్భో విజ్ఞేయః’ అనుటవల్ల విప్రలంభ మనియు, అందును, ‘యత్ప్రేమ సంగమాత్పూర్వం దర్శనశ్రవణోద్భవమ్’ అని ఉపక్రమించి ‘సోయంపూర్వానురాగాఖ్యో విప్రలమ్భ ఇతీరితః’అనుటవలనఁ బూర్వానురాగాఖ్యవిప్రలంభ మనియుఁ దెలియునది. విప్రలంభము పూర్వానురాగమాన ప్రవాసాదిభేదములు గలదని వెనుక వ్రాయంబడియె.
చ. నిజబలరూఢి దోఁపఁ దఱి ◊నివ్వటిలెన్ బళి యంచుఁ దాఁ జతు
ర్భుజుఁడయి పంచసాయకుఁడు ◊భూరిధృతిన్ క్షణదోదయాధిపా
త్మజబొమవింటిదోయి నస◊మానవిలోచనమాలికాసితాం
బుజవిశిఖాళి నించె నల◊భూపతి పేరెద గాఁడి పాఱఁగన్. 83
టీక: పంచసాయకుఁడు=మరుఁడు; నిజబలరూఢి =తనసామర్థ్యాతిశయము; తోఁపన్=కనఁబడునట్లు; తఱి =సమయము; నివ్వటిలెన్ =ఘటిల్లెను; బళి =ఔర! అంచున్=అనుకొని; తాన్; చతుర్భుజుఁడయి =నాలుగుచేతులు గలవాఁడై, ఉప్పొంగిన వాఁడయి యనుట; భూరిధృతిన్ =అధికమైన ధైర్యముచేత; క్షణదోదయాధిపాత్మజబొమవింటిదోయిన్ – క్షణదోదయాధి పాత్మజ=క్షణదోదయరాజపుత్త్రిక యగు చంద్రికయొక్క, బొమవింటిదోయిన్=బొమలనెడు ధనుర్యుగ్మముచేత; అలభూ పతి=ఆరాజు (సుచంద్రుని)యొక్క, పేరెద =విశాలవక్షమును, కాఁడి పాఱఁగన్ =తూఱిపాఱునట్లు; అసమానవిలోచనమాలికా సితాంబుజవిశిఖాళిన్ – అసమాన= సాటిలేని, విలోచనమాలికా=(చంద్రికా)దృక్పరంపర యనెడు, అసితాంబుజవిశిఖాళిన్= నీలోత్పలరూపమైన బాణపరంపరను, ‘అరవిన్ద మశోకం చ చూతం చ నవమల్లికా| నీలోత్పలం చ పఞ్చైతే పఞ్చబాణస్య సాయకాః’ అని యమరుఁడు; నించెన్ = పూరించెను.
చంద్రికాదృక్పరంపర మన్మథునిచేఁ బ్రయోగింపఁబడిన నీలోత్పలబాణపరంపరను బోలియుండె ననియు, నామెబొమలు పంచశరశరాసనములఁ బోలియుండె ననియు భావము. ఆరాజున కామెచూపులు కరము మదనోద్దీపనకరము లని ఫలితార్థము.
చ. అలవిభుఁ గాంచుఁ, గాంచి యెద ◊నప్పతిరూపము నుంచు, నుంచి ని
శ్చలమతి నెంచు, నెంచి మది ◊జాఱనికోర్కుల ముంచు, ముంచి యూ
ర్పులు కడు నించు, నించి వల◊పుల్ మన నాత్మ భ్రమించు, మించుఁబోఁ
డి లసదనంగసాయకత◊టీవిలుఠత్పటుశాంబరీగతిన్. 84
టీక: మించుఁబోఁ డి=మెఱుపువంటిదేహముగల చంద్రిక; లసదనంగసాయకతటీవిలుఠత్పటుశాంబరీగతిన్ – లసత్= ప్రకా శించుచున్న, అనంగసాయక=స్మరశరములయొక్క, తటీ=అగ్రభాగములయందు, విలుఠత్=పొరలుచున్న, పటు=సమర్థ మైన, శాంబరీగతిన్=మాయారీతిచేత; అలవిభున్=ఆరాజును; కాంచున్=చూచును; కాంచి =చూచి; అప్పతిరూపమున్ = ఆరాజురూపమును; ఎదన్=హృదయమునందు; ఉంచున్=నిలిపికొనును; ఉంచి = నిల్పికొని; నిశ్చలమతిన్=స్థిరచిత్తముచేత; ఎంచున్=ప్రశంసించును; ఎంచి =ప్రశంసించి; మదిన్=చిత్తమును; జాఱనికోర్కులన్ = వీడనిమనోరథములలో; ముంచున్ = మునుఁగఁజేయును; ముంచి; కడున్=మిక్కిలి; ఊర్పులు=నిశ్వాసములను; నించున్=నిండఁజేయును; నించి; వలపుల్= అను రాగములు; ఆత్మన్=చిత్తమందు; మనన్=పుట్టఁగా; భ్రమించున్=భ్రాంతినొందును. ఇటఁ జక్షుఃప్రీతి మనస్సంగ గుణనుతి చింత నోన్మాదము లను ననంగదశలు యథాసంభవముగ గదితంబు లయ్యె. ఊర్పులు స్మరదశానుభావములుగా నెఱుఁగవలయు.
క. ఈలీల నృపతిదర్శన,కేళీభవవిస్మయాను◊కీలితమతియై
నాళీకనయన ఆ! లల,నాళీకమలాస్త్రుఁ డనుచు ◊నతనిం బొగడెన్. 85
టీక: నాళీకనయన =కమలనేత్రయగు చంద్రిక; ఈలీలన్=ఈప్రకారముగ; నృపతిదర్శనకేళీభవవిస్మయానుకీలితమతి ఐ –నృపతి=రాజుయొక్క, దర్శనకేళీ=దర్శనవిలాసమున,భవ=పుట్టినట్టి, విస్మయ=ఆశ్చర్యముచేత, అనుకీలిత=బంధింపఁ బడిన, మతి ఐ =మనస్సుగలదై; ఆ = ఇది యాశ్చర్యమును దెలుపును; లలనాళీకమలాస్త్రుఁడు = యువతీసమూహమునకు కందర్పుఁడు; అనుచున్; అతనిన్=ఆరాజును (ఆసుచంద్రుని); పొగడెన్ = నుతించెను. నుతిప్రకారం బగ్రిమపద్యాదిగాఁ జెప్పఁ బడుచున్నది.
సీ. తనవిధుత్వ మ్మాస్య◊మున నొప్ప ఘనలక్ష్మి, యొనరఁ దోఁచినపూరు◊షోత్తముండు,
తనతమోగతి కైశ్య◊మునఁ దోఁప సద్గణ,త్రాణంబునకుఁ జేరు ◊రాజమౌళి,
తనయంగమహిమ నే◊త్రముల రాజిలఁ గళా,వ్యాప్తిఁ జూపట్టుప్ర◊జాధినేత,
తనశోణరుచి మోవిఁ ◊దగ జగమ్ములమ్రొక్కు,లంది చెల్వూనులో◊కైకబంధుఁ,
తే. డట్టి యీదిట్ట పతి యంచు ◊నబ్జపాణి, యవనిభృన్నాయకకుమారి ◊హంసయాన
పద్మినీమణి మానస◊పదవి మెచ్చ, సన్నుతింపఁ దరంబె భు◊జంగపతికి. 86
టీక: తనవిధుత్వమ్ము=తనవిష్ణుత్వము, చంద్రత్వమని యర్థాంతరము దోఁచుచున్నది, ‘విధు ర్విష్ణౌ చంద్రమసి’ అని యమ రుఁడు;ఆస్యమునన్=ముఖమున; ఒప్పన్; ఘనలక్ష్మి=గొప్పదియైన శ్రీదేవి, రాజ్యలక్ష్మి యని యర్థాంతరము దోఁచుచున్నది; ఒనరన్=ఒప్పఁగా; తోఁచినపూరుషోత్తముండు = తోఁచినట్టి నారాయణుఁడు, నరశ్రేష్ఠుఁడని యర్థాంతరము. తనతమోగతి =తన తమోగుణప్రాప్తి, చీఁకటితీరని యర్థాంతరము దోఁచుచున్నది; కైశ్యమునన్=కేశసమూహమందు; తోఁపన్; సద్గణత్రాణంబునకున్ = శ్రేష్ఠమగు ప్రమథగణరక్షణమునకు, సత్పురుషసంఘమున కని యర్థాంతరము; చేరు రాజమౌళి = భూమిఁ జేరిన మహాదేవుండు, రాజశ్రేష్ఠుండని యర్థాంతరము; తనయంగమహిమ = తనముఖాద్యవయవబాహుళ్యము, అంగములపూజ్యత యని యర్థాంతరము దోఁచును; నేత్రములన్ = కన్నులయందు; రాజిలన్=ప్రకాశింపఁగా; కళావ్యాప్తిన్=విద్యావ్యాప్తిచేత, తేజోవ్యాప్తిచేత నని యర్థాంతరము; చూపట్టు ప్రజాధినేత=అగపడుచున్న బ్రహ్మదేవుఁడు, నరపతి యని యర్థాంతరము; తనశోణరుచి = తనరక్తకాంతి; మోవిన్=పెదవియందు; తగన్=ఒప్పఁగా; జగమ్ములన్=లోకములందు; మ్రొక్కులు=ప్రణామ ములను; సూర్యపక్షమున ‘నమస్కారప్రియో భానుః’ అనుటచేతను, రాజపక్షమున శరణాగతిచేతను, అని తెలియవలయు; అంది =పొంది; చెల్వూనులోకైకబంధుఁడు = అందమందిన సూర్యుఁడు, భువనహితుఁడని యర్థాంతరము. అట్టి యీదిట్ట = పూర్వోక్తగుణశాలియగు నీదిట్టతనముగలవాఁడు; పతి = పెనిమిటి, భూపతి యని తోఁచును; అంచున్ = ఇట్లనుచు; అబ్జపాణి = పద్మహస్త యగు లక్ష్మీదేవి, పద్మములవంటి హస్తములుగల స్త్రీయని తోఁచును; అవనిభృన్నాయక కుమారి = పర్వతరాజసుత యగు గౌరి, రాజపుత్త్రి యని యర్థాంతరము దోఁచును; హంసయాన = హంస వాహనముగాఁగల సరస్వతి, హంసగమనయైన కలికి యని యర్థాంతరము దోఁచును; పద్మినీమణి = పద్మలత యను నారీమణి, ‘పద్మినీవల్లభో హరిః’ అనుటచేత సూర్యునిప్రియ పద్మిని యని చెప్పఁబడియె, పద్మినీజాతిస్త్రీరత్న మని యర్థాంతరము దోఁచుచున్నది; మానసపదవిన్=మనోవీథియందు; మెచ్చన్=ప్రశంసింపఁగా; భుజంగపతికిన్=శేషునికి; సన్నుతింపన్=కొనియాడుటకు; తరంబె =వశమా?
అనఁగా లక్ష్మీ గౌరీ సరస్వతీ పద్మినీమణులే, పైఁజెప్పినక్రమముగ విష్ణుమూర్తి యనియు, శివుఁడనియు, బ్రహ్మదేవుం డనియు, సూర్యుండనియుఁ గొనియాడుచుండఁగా నిట్టి యుత్తముని గొనియాడుటకు శేషునకైనఁ దరముగాదనుట. లక్ష్మి విష్ణువును, గౌరి శివుని, సరస్వతి బ్రహ్మను, పద్మిని సూర్యునిఁ బతి యని కొనియాడుట సహజమని తెలియునది. ఆరాజు మోము చంద్రునిఁ బోలిన దనియు, కేశములు చీఁకటిని బోలినవనియు, నేత్రములు విశాలము లనియు, మోవి యరుణమైన దనియు, దానంజేసి పద్మములఁబోలుకేలుగలదానికి, రాజపుత్త్రియగుదానికి, నంచనడలదానికి, పద్మినీజాతిస్త్రీరత్నమునకుఁ బతిగాఁ గోరఁదగినవాఁడనియు, భావపర్యవసానమగుచున్నది. ఇందువలన నబ్జపాణిత్వ రాజపుత్త్రీత్వ హంసగమనాత్వ పద్మినీమణిత్వాది గుణవిశిష్ట యగు తనకు నిట్టి లోకోత్తరగుణగరిష్ఠుఁడగు సుచంద్రుఁడు పతిగా వరింపఁదగినవాఁడని ఫలిత మగు చున్నది. శ్లిష్టరూపకము.
మ. గళపూగచ్ఛవి యబ్జకాండపరిస◊ర్గం బూన్పఁ, గన్నుల్ గనన్
నలరూపంబులు పెంప, లేనగవు చం◊ద్రశ్రేణుల న్మన్ప, ని
ర్మల మౌమోవి మధూత్కరంబు ఘటియిం◊ప, న్మించు నీభర్తతోఁ
దలఁపం జెల్లునె సాటి యౌ ననుచుఁ ద◊ద్రమ్యాంగసౌభాగ్యముల్. 87
టీక: గళపూగచ్ఛవి = పూగమువంటి గళముయొక్కకాంతి; అబ్జకాండపరిసర్గంబు—అబ్జకాండ = పద్మబాణుఁడగు మరుని యొక్క, శంఖసమూహముయొక్క, పరిసర్గంబు = సృష్టిని; ఊన్పన్ =వహింపఁగా; కన్నుల్ కనన్ =నేత్రములు చూడ; నల రూపంబులు = నలచక్రవర్తియొక్క స్వరూపములను, కమలరూపములను; పెంపన్=పోషింపఁగా; లేనగవు =చిఱునగవు; చంద్రశ్రేణులన్ = చంద్రులయొక్క గుంపులను, కర్పూరముయొక్క గుంపులను; మన్పన్=వృద్ధిఁబొందింపఁగా; నిర్మలము= నిర్దోషము; ఔ మోవి = అయిన పెదవి; మధూత్కరంబు = వసంతులయొక్క సమూహమును, తేనెలయొక్క సమూహమును; ఘటియింపన్= చేయఁగా; మించు నీభర్తతోన్ = అతిశయించు నీరాజుతో; తద్రమ్యాంగసౌభాగ్యమున్ – తత్=ఆస్మరనలచంద్ర వసంతులయొక్క, రమ్య=మనోజ్ఞములగు, అంగ =శరీరములయొక్క,సౌభాగ్యముల్=సౌందర్యములు; సాటియౌననుచున్
= సరియగుననుచు; తలఁపన్ చెల్లునె = స్మరింపఁదగునా? తగదనుట.
సుచంద్రుని యొక్కొక్క యవయవంబే యనేకస్మరనలచంద్రవసంతాదులను సృజించుచుండఁగా నట్టిసుచంద్రునితో వారు సాటి యౌదు రనుట చెల్ల దని యభిప్రాయము. ఈరాజు గళము శంఖమును, కన్నులు పద్మములను, లేనగవు కర్పూ రమును, బోలియున్న వనియు, పెదవి తేనియలు ఘటియించుచున్నదనఁగా నంత మధుర మనియు ఫలితము. శంఖాదులకు గళాద్యుపమిత్యనిష్పత్తిచేతఁ బ్రతీపభేదము శ్లిష్టరూపకోత్థాపితము.
చ. ఘనఖరతామిళద్విషమ◊కాండసమున్నతహేతిజాతతా
పనికర మంతయుం గడకుఁ ◊బాయఁగ నీసదధీశుపాదసే
వనగతి యేతదీయఘన◊వర్తనఁ గాంచక యున్నచోఁ గరం
బెనయదె నాదుశ్యామతన◊మెంతయు నుర్వి నిరర్థకత్వమున్. 88
టీక: ఇందుఁ జంద్రికాపరమైనయర్థము, రాత్రిపర మైనయర్థము గలుగును. ఏలాగనిన: ఘనఖరతామిళద్విషమకాండసము న్నతహేతిజాతతాపనికరము – ఘన=అధికమగు,ఖరతా=తీక్ష్ణత్వముతో, మిళత్=కూడుకొన్న, విషమకాండ=పంచబాణుని యొక్క, సప్తాశ్వుఁడైన సూర్యునియొక్క యని రాత్రిపరమైన యర్థము; సమున్నత=మిక్కిలి యతిశయించిన, హేతి=బాణ ములవలన, ‘హేతి స్స్యా దాయుధే జ్వాలే’ అని విశ్వము,జాత=పుట్టినట్టి, తాప=సంతాపముయొక్క, నికరము=సంఘము; హేతి=కిరణములయొక్క, జాత= సమూ హమువలన నైన, తాప=వేడియొక్క, నికరము= సమూహము అని రాత్రి పరమైన యర్థము; అంతయున్=ఎల్లను; కడకుఁ బాయఁగన్=కడకుఁ బోవఁగా; ఈసదధీశుపాదసేవనగతి– ఈసదధీశు = ఈ మంచి రాజుయొక్క, పాద=అడుగులయొక్క, సేవన=సేవించుట; ఈసదధీశు=నక్షత్రేశుఁడైన యీచంద్రునియొక్క, పాద= కిరణ ములయొక్క, సేవన=సేవించుట, అని రాత్రి పరమైన యర్థము; గతి =శరణము; ఏతదీయఘనవర్తనన్= ఈరాజుయొక్క యున్నతవృత్తిని, ఈచంద్రునియొక్క పూర్ణభావము నని యర్థాంతరము; కాంచక యున్నచోన్= చూడకుండినయెడల; నాదు శ్యామతనము=నాయొక్క యౌవనవతీత్వము, రాత్రిత్వము అని యర్థాంతరము; ఎంతయున్=మిక్కిలి; ఉర్విన్=పుడమి యందు; నిరర్థకత్వమున్=వ్యర్థతను; కరంబు ఎనయదె = మిక్కిలి పొందదా?
అనఁగా సూర్యకిరణజనితతాపము సనుటకు చంద్రకిరణసేవనమె రాత్రి కెట్లు శరణంబో అట్లుకాక యున్నరాత్రి యెట్లు వ్యర్థమో, అట్లు స్మరశరజనితసంతాపము సనుటకు నాకు నీరాజుపాదసేవనమె శరణంబు, అట్లు కానిచో నాదుతారుణ్య మంతయు వ్యర్థంబ యగునని భావము. ప్రకృతాప్రకృతముల కౌపమ్యంబు గమ్యము.
చ. అని యనివార్యదోహదస◊మన్వితమానసవల్లియై, వినూ
తనచపలాతనూకులమ◊తల్లి దలంచుచునుండునంతలో
వనిత యొకర్తు చేరి చెలు◊వా నిను రమ్మనె నిప్డు వీణియన్
విన జనయిత్రి యన్న గురు◊ని న్వినయంబునఁ గాంచెఁ గాంచినన్. 89
టీక: వినూతనచపలాతనూకులమతల్లి = నూతనమైన మెఱుపువంటి శరీరముగలవారిగుంపున శ్రేష్ఠయగు చంద్రిక; అనివార్య దోహదసమన్వితమానసవల్లియై – అనివార్య=నివారింప నలవికాని, దోహద=ఆసక్తితో, దోహదక్రియతో నని వల్లీపదస్వార స్యముచే నర్థాంతరము దోఁచును, సమన్విత=కూడుకొన్నట్టి, మానస=మనస్సనెడు, వల్లియై=లతగలదై; అని= పైవిధముగ; తలంచుచు = తలపోయుచు; ఉండునంతలో =ఉన్నంతలో; వనిత యొకర్తు = ఒకస్త్రీ; చేరి=వచ్చి; చెలువా=సకియా! జనయిత్రి =తల్లి; ఇప్డు =ఈసమయమున; వీణియన్ =వీణావాద్యమును; వినన్=వినుటకు; నినున్ రమ్మనెన్; అన్నన్=ఇట్లనఁగా; గురునిన్=గురువైన కుముదుని; వినయంబునన్ =వినయముతోడ; కాంచెన్=చూచెను; కాంచినన్ = అట్లు చూడఁగా, దీనికి ముందుపద్యముతో నన్వయము.
ఉ. కిన్నరకంఠి యీనృపతి◊కి న్సతి వయ్యెదు నాదుమాట యా
సన్నశుభంబు పొమ్మనుచుఁ ◊జక్కగ నంచినఁ దద్గురూక్తిచేఁ
గన్నియ యేగె మాతసము◊ఖంబును గాంతలు వెంట రాఁగ ను
ద్యన్నవహీరపాదకట◊కార్భటి యంచల బుజ్జగింపఁగన్. 90
టీక: కిన్నరకంఠి = కిన్నరులకంఠస్వరమువంటి కంఠస్వరముగలదానా! ఈనృపతికిన్=ఈరాజునకు; సతి వయ్యెదు = భార్యవు కాఁగలవు; నాదుమాట = నావాక్యము; ఆసన్నశుభంబు =సమీపించినశుభంబు గలది; పొమ్మనుచున్ = పోవలసిన దనుచు; చక్కగన్=బాగుగ; అంచినన్=పంపఁగా; తద్గురూక్తిచేన్=ఆగురువాక్యముచేత; కన్నియ=చంద్రిక; కాంతలు=స్త్రీలు; వెంట రాఁగన్ = వెంబడి రాఁగా; ఉద్యన్నవహీరపాదకటకార్భటి – ఉద్యత్=ఉదయించుచున్న, ఇది యార్భటికి విశేషణము, నవ=క్రొత్తనగు, హీర=వజ్రమయములగు, పాదకటక=కాలియందెలయొక్క, ఆర్భటి=ధ్వని; అంచలన్=హంసలను; బుజ్జ గింపఁగన్=లాలనసేయఁగా; మాతసముఖంబును = తల్లిసన్నిధింగూర్చి; ఏగెన్=పోయెను.
మ. అలయోషామణి యిట్టు లేగ రవివం◊శాధీశుఁ డుద్భ్రాంతహృ
త్తలయోగంబున నెందుఁ జెందె లతికా◊తన్వంగి వీక్షించుటల్
గలయో మారశరాళి నేకరణి వేఁ◊గ న్వచ్చు నివ్వేళ నా
నలయోషిత్సమఁ గాంచ కే ననుచుఁ జిం◊తారేఖ సంధించుచున్. 91
టీక: అలయోషామణి = ఆస్త్రీరత్నము; ఇట్టులు=ఈప్రకారము; ఏగన్=పోవఁగా; రవివంశాధీశుఁడు=సుచంద్రుఁడు; ఉద్భ్రాంత హృత్తలయోగంబునన్ –ఉద్భ్రాంత=బ్రమిసినట్టి, హృత్తల=హృదయప్రదేశముతోడి, యోగంబునన్=సంబంధముచేత; లతికాతన్వంగి =లతాసుకుమారదేహయగు చంద్రిక; ఎందున్ జెందెన్ = ఎటఁ బోయెను? వీక్షించుటల్=చూచుటలు; కలయో = స్వప్నమో; ఇవ్వేళన్=ఈసమయమందు; ఆ నలయోషిత్సమన్=దమయంతీతుల్యయగు నాచంద్రికను; కాంచక=చూడక; ఏన్=నేను; మారశరాళిన్=స్మరశరములగుంపుచేత; ఏకరణిన్=ఏరీతి; వేఁగన్ వచ్చున్=తపింపవచ్చును? అనుచున్=ఇట్ల నుచు; చింతారేఖ =చింతాపరంపరను; సంధించుచున్ = కావించుచు, దీని కుత్తరపద్యముతో నన్వయము.
సీ. శారి పూఁబొదఁ జేరి ◊చక్కఁబల్కినదారి, నారి వల్కె నటంచు ◊సారె దలఁచు,
రామచంపకధామ◊రాజి పర్వెడుసీమ, భామ నిల్చె నటంచుఁ ◊బ్రేమఁ గాంచు,
నంచ యింపు రహింప ◊నడుగు వెట్టినయంచఁ, గాంచనాంగి చరించె ◊నంచుఁ జూచు,
బాలకోకిల చాల◊నోలి మ్రోసెడుమూల, బాల పాడె నటంచుఁ ◊జాల మెచ్చు
తే. లలితపవమాన మాన నా◊లయవనస్థ,లాబ్జలసమానసౌమన◊సానుమోద
మలమ నసమానమానస ◊మతులప్రమద,మానఁగ సుచంద్రమానవా◊ధ్యక్షుఁ డలరు. 92
టీక: శారి =గోరువంక; పూఁబొదన్=పువ్వులపొదను; చేరి =పొంది; చక్కన్=బాగుగ; పల్కినదారిన్=పల్కినత్రోవను; నారి = చంద్రిక; పల్కెన్ అటంచున్ = పల్కె ననుచు; సారె =మాటిమాటికి; తలఁచున్=ఎంచును.
రామచంపకధామరాజి – రామ=ఒప్పుచున్న,చంపక=సంపెఁగలయొక్క,ధామరాజి =కాంతిపరంపర; పర్వెడుసీమన్ = ప్రస రించు ప్రదేశమునందు; భామ = చంద్రిక; నిల్చెన్ అటంచున్ = నిలిచియున్నదనుచు; ప్రేమన్ =ప్రీతితో; కాంచున్=చూచును.అంచ =హంస; ఇంపు రహింపన్=సొంపగునట్లుగా; అడుగువెట్టినయంచన్=అడుగిడినచోట; కాంచనాంగి =చంద్రిక; చరించె నంచున్=సంచరించె ననుచు; చూచున్ = అవలోకించును.
బాలకోకిల =చిన్నికోయిల; చాలన్=మిక్కిలి; ఓలిన్=వరుసగా; మ్రోసెడుమూలన్=కూయువంక; బాల =చంద్రిక; పాడెన్ అటంచున్ = గానముచేసె ననుచు; చాలన్=అధికముగా; మెచ్చున్ = శ్లాఘించును.
లలితపవమానము=మనోహరమైన మందమారుతము; ఆనన్=స్పృశింపఁగా; ఆలయవన స్థలాబ్జ లసమాన సౌమనసాను మోదము – ఆలయవన=సదనోద్యానమందుండెడు, స్థలాబ్జ=మెట్టదామరమొదలగు, లసమాన=ప్రకాశించుచున్న, సౌమనస = పుష్పసమూహముయొక్క, అనుమోదము =పరిమళము; అలమన్=క్రమ్ముటచేత; అసమానమానసము = సాటిలేని మనస్సు; అతులప్రమదము=నిరుపమానమగు సంతసమును; ఆనఁగన్=పొందఁగా; సుచంద్రమానవాధ్యక్షుఁడు = సుచంద్రనర పాలుఁడు; అలరున్ = ప్రకాశించును. చంద్రికాయత్తచిత్తుండై తదేకధ్యానము సేయు నారాజునకు పైఁజెప్పిన శారిపల్కులు లోనగునవి యెల్లఁ జంద్రికావ్యాపార ములుగఁ దోచె నని తాత్పర్యము.
చ. అళినికరంబు కీలుజడ, ◊యందపుఁగెందలిరాకు మోవి, ని
స్తలతరమంజరుల్ మెఱుఁగుఁ◊జన్నులు, మొగ్గలచాల్ పదాంబుజ
స్థలనఖపాళి గాఁగ, వన◊ధాత్రిఁ గనంబడుతీవ లెల్ల నా
చెలిసొబ గానృపాలు మదిఁ ◊జేర్చి భ్రమింపఁగఁజేసె నయ్యెడన్. 93
టీక: అయ్యెడన్ = ఆసమయమందు; అళినికరంబు =తుమ్మెదలగుంపు; కీలుజడ = జాఱవిడిచిన జడయును; అందపుఁగెందలి రాకు = అందమయిన ఎఱ్ఱనిచిగురాకు; మోవి =అధరంబును; నిస్తలతరమంజరుల్=వట్రువులగు పువ్వుగుత్తులు; మెఱుఁగుఁ జన్నులు = ప్రకాశించు కుచములును; మొగ్గలచాల్=మొగ్గలగుంపు; పదాంబుజస్థలనఖపాళి = పాదకమలములయందుండు గోరులచాలును; కాఁగన్=అగుచుండఁగా; వనధాత్రిన్=ఉద్యానవనభూమియందు; కనంబడుతీవలు ఎల్లన్ = కననగుచున్న లత లెల్ల; ఆచెలిసొబగు=ఆచంద్రికయందమును; ఆనృపాలు మదిన్=ఆరాజుమనమునందు; చేర్చి; భ్రమింపఁగఁజేసెన్ = భ్రమ నొందునట్లు చేసెను.
అనఁగాఁ బైఁజెప్పిన చొప్పున నొప్పులతలెల్లఁ జంద్రికావయవములసొబగుఁ గాన్పించి, యారాజు ననంగదశలలోని యున్మాదావస్థ నొందునట్లు చేయు ననుట. ‘సర్వావస్థాసు సర్వత్ర తన్మనస్కతయా సదా| అతస్మిన్ తదితి భ్రాన్తి రున్మాదో విరహోద్భవః’ ఇట్లుక్తలక్షణలక్షితం బగునున్మాద మను ననంగదశావిశేష మిందు వచింపఁబడియె. ఇట్లు శారి పూఁబొదఁ జేరి యను క్రిందిపద్యమునందును దెలియవలయు.
సీ. కమ్మపుప్పొడిగాడ్పు ◊గ్రమ్మ నొప్పగుబండి,గురివెందవిరిగుత్తి◊కొమరుఁ జూచి,
యలరు సంపెఁగతీవ ◊యలమ నింపుగఁ దోఁచు,కలికిక్రొమ్మల్లియ◊చెలువుఁ జూచి,
మగతేఁటి వేడ్క మిం◊చఁగ ముద్దుగొనిన చ,క్కనిమెట్టదామర◊కళుకుఁ జూచి,
సొలపుచక్కెరతిండి◊పులుఁగు నొక్కెడిబింబి,కాపక్వఫలముపొం◊కంబుఁ జూచి,
తే. తరుణిచనుదోయి, కెంపుగం◊దవొడిఁ బూసి, చెలువనెమ్మేను కౌఁగిటఁ ◊జేర్చి కొమ్మ
మోము ముద్దిడి, పూఁబోణి◊మోవిఁ గ్రోలి, చెలఁగు టెపు డబ్బునో యంచుఁ ◊దలఁచు నృపతి. 94
టీక: నృపతి=సుచంద్రుఁడు; కమ్మపుప్పొడిగాడ్పు=కమ్మనిపుప్పొడిసంబంధి యగు వాయువు; క్రమ్మన్=ప్రసరింపఁగా; ఒప్పగు బండిగురివెందవిరిగుత్తికొమరున్=ఒప్పిదమగు బండిగురివెందపూగుత్తియొక్క సౌందర్యమును; చూచి=వీక్షించి; అలరు సంపెఁగతీవ = ప్రకాశించు చంపకలత; అలమన్=ఆక్రమింపఁగా; ఇంపుగన్=ఇంపగునట్లు; తోఁచు కలికిక్రొమ్మల్లియ చెలువున్ =తోఁచుచున్న యందమగు నూత్నమల్లికయొక్క యందమును; చూచి=వీక్షించి; మగతేఁటి =గండుతుమ్మెద; వేడ్కన్=ఉత్సవము; మించఁగన్=అతిశయించునట్లు; ముద్దుగొనిన =చుంబించిన; చక్కనిమెట్ట దామరకళుకున్ = అందమైన మెట్టదామరయొక్క చక్కఁదనమును; చూచి=వీక్షించి;
సొలపుచక్కెరతిండిపులుఁగు =పరవశమయిన శుకపక్షి; నొక్కెడిబింబికాపక్వఫలముపొంకంబున్ = కొఱుకుచున్న పండిన దొండపండుయొక్క యందమును; చూచి=వీక్షించి; తరుణిచనుదోయి =చంద్రికాకుచయుగ్మమును; కెంపుగందవొడిఁ బూసి=ఎఱ్ఱనిగందపొడిచేఁ బూసి; చెలువనెమ్మేను= సుందరి యొక్క యందమైన శరీరమును; కౌఁగిటన్ చేర్చి = ఆలింగనముఁజేసికొని; కొమ్మమోము=ఆస్త్రీముఖమును; ముద్దిడి=చుంబ నము చేసి; పూఁబోణిమోవిన్ = ఆనారియధరమును; క్రోలి = పానముఁజేసి; చెలఁగుట = ప్రకాశించుట; ఎపుడబ్బునో = ఎపుడు కలుగునో; అంచున్ ; తలఁచున్=స్మరించును.
అనఁగా బండిగురివెందవిరిగుత్తి చన్దోయిగను, దానిపైఁ గ్రమ్ము పుప్పొడి కెంపుగందవొడిగను, సంపెంగచేఁ జుట్టఁబడిన మల్లియ పురుషాలింగితతన్వంగిగాను, మగతేటిచేఁ జుంబితమైన మెట్టదామర పురుషచుంబితస్త్రీముఖముగను, శుకతుండ ఖండితమగు బింబఫలము దంతక్షతమైన స్త్రీ యధరముగాను దోఁచి యారాజు చంద్రికాస్తనయుగ్మాలింగనాధరచుంబనాదు లెపు డబ్బునో యని స్మరించె ననుట. ఇట ననుస్మృతి యను ననంగదశ చెప్పఁబడియె. ‘ముహుర్ముహు ర్నిశ్వసితై ర్మనోరథ విచిన్తనైః| ప్రద్వేష స్త్వన్యకార్యాణా మనుస్మృతి రుదాహృతా’ అని నాట్యశాస్త్రమందుఁ దల్లక్షణము.
సీ. ఎంతమాధవదయా◊సంతానసంసిద్ధిఁ, బొలిచెనో యిచ్చటి◊తిలకపాళి,
యెంతపుణ్యద్విజా◊ధీశసంసేవన, వఱలెనో యిచ్చటి◊చిఱుతమావి,
యెంతమహాసవో◊ద్ధృతిగతాత్మసుమాప్తి, మనియెనో యిచ్చటి◊కనకరాజి,
యెంతసదాళిచి◊త్తేష్టదానస్ఫూర్తి, వెలసెనో యిచ్చటి◊కలికిక్రోవి,
తే. చెలికటాక్షైకధారచేఁ ◊జెలఁగ నెలఁత, పాణిలాలనమున మించఁ ◊ బడఁతిమోము
గని యలర, నాతిపరిరంభ◊గరిమఁ జొక్క, ననుచు నృపమౌళి కడుఁజింతఁ ◊బెనుచు మదిని. 95
టీక: ఇచ్చటితిలకపాళి = ఈవని నున్న బొట్టుగులగుంపు; ఎంతమాధవదయాసంతానసంసిద్ధిన్ = ఎంత విష్ణువుయొక్క కరుణాసముదయసంసిద్ధిచేత, ఎంత వసంతదయాసముదయసంసిద్ధిచేత నని స్వభావార్థము; పొలిచెనో = ఉదయించెనో, ఇచ్చటిచిఱుతమావి = ఇటనున్న చిన్నిమావి; ఎంతపుణ్యద్విజాధీశసంసేవనన్ = ఎంత పుణ్యవంతులైన విప్రశ్రేష్ఠులసేవచేత, ఎంత మనోజ్ఞములగు పక్షిశ్రేష్ఠములయొక్క సేవచేత నని వాస్తవార్థము, ‘పుణ్య మ్మనోజ్ఞేఽభిహితం తథా సుకృత ధర్మయోః’ అని విశ్వము; వఱలెనో =ఒప్పెనో, ఇచ్చటికనకరాజి =ఈయుద్యానవనమందలి సంపెఁగచాలు; ఎంతమహాసవోద్ధృతిగతాత్మసుమాప్తిన్ – ఎంతమహాసవ = ఎంతగొప్పయజ్ఞములయొక్క, ఉద్ధృతి=పోషణముచేత, గత=పొందఁబడిన, ఆత్మ=తమయొక్క, సు=లెస్సయిన, మా= సంపదయొక్క, ఆప్తిన్=ప్రాప్తిచేత; ఎంత, మహత్=అధికమైన, ఆసవ=పూఁదేనియయొక్క, ఉద్ధృతి=భరణమును, గత= పొందిన, ఆత్మ=తమయొక్క, సుమాప్తిన్= కుసుమములప్రాప్తిచేత నని వాస్తవాభిప్రాయము; మనియెనో=పెంపొందెనో, ఇచ్చటికలికిక్రోవి =ఇందలి యందమగు గోరింట; ఎంతసదాళిచిత్తేష్టదానస్ఫూర్తిన్ – ఎంత, సదాళి=సత్పురుషులగుంపు యొక్క, చిత్త=చిత్తములకు, ఇష్టదాన = ఇష్టములైన వస్తువుల ప్రదానముయొక్క, స్ఫూర్తిన్ =విస్ఫురణముచేత; ఎంత, సదా= ఎల్లప్పుడు, అళి=తుమ్మెదలయొక్క, ఇట సదాశబ్ద మళిశబ్దముతో ‘సుప్సుపా’ అని సమసించినది, చిత్త=చిత్తములకు, ఇష్టదాన = ఇష్టమైన పుష్పాసవప్రదానముయొక్క, స్ఫూర్తిన్ =విస్ఫురణముచేత నని వాస్తవాశయము; వెలసెనో = ప్రకాశించెనో,చెలికటాక్షైకధారచేన్ = చంద్రికయొక్క క్రేగంటిచూపులపరంపరచేత; చెలఁగన్=ఒప్పుటకు; నెలఁతపాణిలాలనమునన్ = ఆమె హస్తముచే లాలించుటవలన; మించన్=అతిశయించుటకు; పడఁతిమోము గని =ఆమెయొక్కముఖమును గాంచి; అలరన్ = సంతసించుటకు; నాతిపరిరంభగరిమన్=ఆమె యాలింగనాతిశయముచేత;చొక్కన్=సుఖపరవశత నొందుటకును; అనుచున్ =ఇట్లనుచు; నృపమౌళి =రాజశ్రేష్ఠుఁడు; మదిని=హృదయమునందు; కడున్=మిక్కిలి; చింతన్=విచారమును; పెనుచున్= వృద్ధిఁ బొందించుకొనును.
అనఁగాఁ దిలకపాళి, చిఱుతమావి, కనకరాజి, కలికిక్రోవి అంత లోకోత్తరనాయికా కటాక్షప్రసార,కరలాలన, ముఖదర్శన, పరిరంభములచే నలరుట దుర్ఘటము గావున నవి యెంతో మాధవదయాసంసిద్ధి, ద్విజాతిసేవనాదులు పొందియుండవలెననుట. బొట్టుగులకు స్త్రీకటాక్షవీక్షణంబు, మావులకు స్త్రీకరలాలనంబు, సంపెఁగలకు స్త్రీముఖదర్శనంబు, గోరంటలకు స్త్రీపరిరంభంబు దోహదములు గావునఁ గటాక్షవీక్షణాదులచే నవి సంతసించుట స్వభావసిద్ధంబని కవిహృదయంబు. ‘తరుగుల్మలతాదీనా మకాలే ఫలపుష్పయోః| ఆధానాయ క్రియా యా స్యా త్స దోహద ఇతీర్యతే| ఆలిఙ్గనా త్కురవక శ్చమ్పకో ముఖదర్శనాత్| చూతో యోషిత్కరస్పర్శా త్తిలకో దృక్ప్రసారణాత్| ఆకర్ణనా త్కర్ణికార స్త్వశోకః పాదతాడనాత్|దాడిమీ ధూమసందోహా త్ప్రియాళు ర్గానసంపదః|’ ఇత్యాదిగా దోహదలక్షణములు. ఏతద్విశేషంబులుకొన్ని ద్వితీయాశ్వాసమున వ్రాయఁబడియె.
మ. నవలా యేగినదారిఁ గాంచు, మదిఁ ద◊న్నాళీకపత్త్రేక్షణా
నవలావణ్యవిశేష మెంచు, వలవం◊తం జాలఁ జింతించు, రా
జవలారాతి తదేకమోహలహరీ◊సంసక్తచిత్తంబునన్
గువలాస్త్రాతినిశాతసాయకశిఖా◊కుంఠీభవద్ధైర్యుఁడై. 96
టీక: రాజవలారాతి (రాజ+బలారాతి)=రాజేంద్రుఁడు, ‘శసయో ర్బవయో స్తథా’ అనుటచేత బవలకు భేదంబులేమి కవి వ్యవ హారసిద్ధమని వెనుక వ్రాయంబడియె; తదేకమోహలహరీసంసక్తచిత్తంబుననన్ – తత్=ఆచంద్రికయందు, ఏక= ముఖ్యమగు, మోహలహరీ=మోహప్రవాహముతో, సంసక్త=కూడుకొన్నట్టి, చిత్తంబునన్=మనస్సుచేత; కువలాస్త్రాతినిశాతసాయకశిఖా కుంఠీభవద్ధైర్యుఁడై – కువలాస్త్ర=మరునియొక్క, అతినిశాత=మిక్కిలితీక్ష్ణములగు, సాయక= బాణములయొక్క,శిఖా = జ్వాలలచేత, కుంఠీభవత్=తగ్గుచున్న, ధైర్యుఁడై =ధైర్యము గలవాఁడయి; నవలా యేగినదారిన్= చంద్రిక పోయిన త్రోవను; కాంచున్=చూచును; మదిన్=హృదయమునందు; తన్నాళీకపత్త్రేక్షణానవలావణ్యవిశేషము – తన్నాళీకపత్త్రేక్షణా = ఆకమల నయనయగు చంద్రికయొక్క, నవ=నూతనమగు, లావణ్యవిశేషము=విలక్షణలావణ్యమును; ఎంచున్=ప్రశంసించును; వల వంతన్=మన్మథవ్యథచేత; చాలన్=మిక్కిలి; చింతించున్=చింతసేయును.
చ. నరవిభుఁ డిట్లు తత్సతియ◊నర్గళమోహగతిం భ్రమింపఁ గి
న్నరపతి యప్డుచేరి మహి◊నాయక యీగతి వంత నాత్మ నుం
తురె నినుఁ బ్రేమఁ జూచిన వ◊ధూమణి నింతకు మున్నె యేఁచెఁ ద
త్స్మరశరకోటి త్వద్గతస◊మగ్రమనోరథగా ఘటించుచున్. 97
టీక: నరవిభుఁడు=సుచంద్రుఁడు; ఇట్లు=ఈప్రకారముగ; తత్సతియనర్గళమోహగతిన్ = ఆచంద్రికావిషయకమైన యనివార్య మగు మోహరీతిచేత; భ్రమింపన్=చిత్తభ్రమనొందఁగా; కిన్నరపతి = కుముదుఁడు; అప్డు; చేరి = ఆరాజు సమీపమునొంది; మహి నాయక =ఓరాజా! ఈగతిన్=ఈరీతిగ; వంతన్=సంతాపమునందు; ఆత్మన్=చిత్తమును; ఉంతురె =ఉంచుదురా? నినున్; ప్రేమన్=ఆసక్తిచేత; చూచినవధూమణిన్=అవలోకించిన యాస్త్రీరత్నమును; ఇంతకున్ మున్నె=ఇంతకుఁ బూర్వమె; తత్స్మర శర కోటి = ఆమన్మథుని మార్గణపరంపర; త్వద్గతసమగ్రమనోరథ=నీయందుఁ గలిగిన సమగ్రాభిలాషగలది; కాన్=అగునట్లు; ఘటించుచున్ =చేయుచు; ఏఁచెన్=బాధించెను. స్మరుఁడు మున్నే చంద్రికను నీసంగమము నభిలషించుదానిఁగా గావించుటం జేసి తనంతనే కార్యసిద్ధి యగుఁగాన దానికై నీవు చితింపఁ బని లేదని తాత్పర్యము.
క. నీలాలక వరియించెద,వేలా వలవంత మేది◊నీశ్వర యన నా
కాలాబ్జవిమతకులజన,పాలాగ్రణి కూటధృతివిభాస్వన్మతితోన్. 98
టీక: మేదినీశ్వర=సుచంద్రుఁడా! నీలాలకన్=చంద్రికను; వరియించెదవు=పెండ్లియాడెద వనుట; వలవంత = మన్మథవ్యథ; ఏలా=ఎందుకు? అనన్= కుముదుఁ డిట్లు వచింపఁగా; ఆకాలాబ్జవిమతకులజనపాలాగ్రణి – కాలాబ్జవిమత=నీలోత్పలవిరోధి యగు సూర్యునియొక్క, కుల = వంశస్థులైన, జనపాల=రాజులయందు, అగ్రణి =శ్రేష్ఠుఁడైన యా సుచంద్రుఁడు; కూటధృతి విభాస్వన్మతితోన్=నిశ్చలమైన ధైర్యముచే నొప్పుచున్న మదితోడ, దీని కుత్తరపద్యస్థమగు ‘పనిచె’ నను క్రియతో నన్వయము.
తే. గగనయానోత్తమస్యద◊గతి ధరిత్రి,నగరకాననకుధరసం◊తతులఁ గనుచుఁ
జని తనబలంబు నెనసి యా◊క్ష్మావిభుండు, కూర్మి గనుపట్ట నంత నా◊కుముదుఁ బనిచె. 99
టీక: ఆక్ష్మావిభుండు = ఆరాజు; గగనయానోత్తమస్యదగతిన్ – గగనయానోత్తమ = ఉత్తమవిమానముయొక్క, స్యద = వేగముయొక్క, ‘రయ స్యదః’ అని యమరుఁడు, గతిన్ =తీరుచేత; ధరిత్రిన్=భూమియందు; నగరకాననకుధరసంతతులన్ =పురారణ్యపర్వతములగుంపులను; కనుచున్=చూచుచు; చని=పోయి; తనబలంబున్=తన సైన్యమును; ఎనసి=చేరి; కూర్మి=ప్రేమము; కనుపట్టన్=కనఁబడునట్లు; అంతన్; ఆకుముదున్= పైఁజెప్పిన కుముదుని; పనిచెన్=పంపివేసెను.
చ. మును మునితోడఁ బల్కిన య◊మూల్యనిజోక్తిఁ దలంచి యారసా
జనపతిమౌళి సత్వరత ◊సంగరభూమిఁ దమిస్రదానవేం
ద్రుని వధియింతు నంచు లలి◊తోఁ దపనీయరథాధిరూఢుఁడై
చనియె రణానకప్రకర◊సాంద్రరుతుల్ దెస లెల్లఁ గ్రమ్మఁగన్. 100
టీక: మును =పూర్వమున; మునితోడన్=శాండిల్యునితోడ; పల్కిన యమూల్యనిజోక్తిన్ = వచించినట్టి యనర్ఘమగు తన మాటను; తలంచి = స్మరించి; ఆరసాజనపతిమౌళి = ఆరాజశేఖరుఁ డగు సుచంద్రుఁడు; సత్వరతన్=వేగముచేత; సంగర భూమిన్ = యుద్ధభూమియందు; తమిస్రదానవేంద్రునిన్ = తమిస్రాసురుని; వధియింతున్ అంచున్= సంహరింతు ననుచు; లలితోన్=ప్రీతితోడ; తపనీయరథాధిరూఢుఁడై = కనకరథము నధిష్ఠించినవాఁడగుచు; రణానకప్రకరసాంద్రరుతుల్ – రణ = యుద్ధసంబంధమైన, ఆనకప్రకర=భేరీసంఘముయొక్క, ‘ఆనకః పటహో స్త్రీ స్యాత్’ అని యమరుఁడు,సాంద్ర=దట్టములగు, రుతుల్=ధ్వనులు; దెసలు ఎల్లన్= దిక్కులనెల్లను; క్రమ్మఁగన్=ఆవరింపఁగా; చనియెన్=పోయెను.
సీ. అతులరింఖోద్భవ◊క్షితిధూళి నానాశ,రాధీశమహిమఁ బో◊నాడు హయము,
లతిశాతదంతప్ర◊హతిఁ గర్బురాచల,స్థితి నెల్ల మాయించు ◊ద్విరదచయము,
లలఘుకేతనమారు◊తాళి మహాసురో,త్తమమండలిఁ దెరల్చు ◊విమలరథము,
లాత్మభాసురసమా◊ఖ్యాశక్తి యామినీ,చరభయంబు ఘటించు ◊సద్భటేంద్రు,
తే. లపుడు వేవేలు గొలువ, న◊య్యవనిభర్త, యిటులు కల్యాణమయరథం ◊బెక్కి వేగ
శిశిరగిరిఁ జేర నరిగె న◊క్షీణదనుజ,దళనచణదివ్యసాధనోద్భాసి యగుచు. 101
టీక: అతులరింఖోద్భవక్షితిధూళిన్ – అతుల=సాటిలేని, రింఖా=ఖురములచేత, ఉద్భవ=ఉదయించిన, క్షితిధూళిన్ = భూ పరాగముచేత; నానాశరాధీశమహిమన్ – నానా=అనేకప్రకారములగు, శరాధీశ=సముద్రములయొక్క, మహిమన్ = అతి శయమును, అనేకప్రకారులగు, ఆశరాధీశుల లనఁగా రాక్షసేశ్వరులయొక్క మహిమను నని యర్థాంతరధ్వని, ‘క్రవ్యాదో స్రప ఆశరః’ అని యమరుఁడు; పోనాడు హయములు = పోఁగొట్టెడు నశ్వములు; అతిశాతదంతప్రహతిన్=మిక్కిలితీక్ష్ణములగు దంతములయొక్క ప్రహారములచేత; కర్బురాచలస్థితిన్=మేరుపర్వతస్థితిని, రాక్షసులయొక్క స్థిరమైన స్థితి నని యర్థాంతరము, ‘గాఙ్గేయం భర్మ కర్బురమ్’, ‘రాత్రించరో రాత్రిచరః కర్బురః’ అని యమ రుఁడు; ఎల్లన్; మాయించు = మాపుచున్న; ద్విరదచయము =గజసమూహము; అలఘుకేతనమారుతాళిన్ – అలఘు=అధికమగు, కేతన=ధ్వజములయొక్క, మారుతాళిన్=వాతజాతముచేత; మహాసురో త్తమమండలిన్ – మహత్=అధికమగు, సురోత్తమమండలిన్=సూర్యపుంజమును, ద్వాదశాదిత్యుల ననుట, ‘సురోత్తమో ధామనిధిః పద్మినీవల్లభో హరిః’అని యమరుఁడు, గొప్ప యసురోత్తమమండలి నని యర్థాంతరము; తెరల్చువిమలరథములు=పోఁగొట్టుచున్న నిర్మలమైన రథములు; ఆత్మభాసురసమాఖ్యాశక్తిన్ – ఆత్మ=తమయొక్క, భాసుర=ప్రకాశమానమగు, సమాఖ్యా=యశముయొక్క, శక్తిన్=సామ ర్థ్యముచేత; యామినీచరభయంబు – యామినీచర=చంద్రునియొక్క, రాక్షసులయొక్క యని యర్థాంతరము, భయంబు = భీతిని; ఘటించుసద్భటేంద్రులు = చేయు శ్రేష్ఠభటనాయకులు; అపుడు = ఆసమయమున; వేవేలు = అనేకసహస్రములు; కొలువన్=సేవింపఁగా; అయ్యవనిభర్త=ఆరాజు; ఇటులు =ఈరీతి గా; కల్యాణమయరథంబు = బంగరుతేరును, మంగళమయమయినరథము నని యర్థాంతరము, ‘కల్యాణ మర్జునం భూరి’ అని యమరుఁడు; ఎక్కి=అధిష్ఠించి; అక్షీణదనుజదళనచణదివ్యసాధనోద్భాసి – అక్షీణ= తక్కువగానట్టి, ఇది సాధనశబ్దము నకు విశేషణము, దనుజదళనచణ = రాక్షససంహారమునకు సమర్థమగు, దివ్య=లోకోత్తరమైన,సాధన=శరాదిసామగ్రిచేత, ఉద్భాసి=ప్రకాశించువాఁడు; అగుచున్; వేగ=వేగముగా; శిశిరగిరిన్=హిమవత్పర్వతమును; చేరన్ అరిగెన్ = పొందునట్లు చనెను. అనఁగా ఖురధూళిచే సముద్రమహిమ నపహరించు హయములును, దంతప్రహారములచేఁ గాంచనాచలము రూపు మాపు గజములును, గేతనవాతముచే సూర్యమండలిని దెరల్చు రథములును, నిజతేజములచేఁ జంద్రుని భయపెట్టు భటశ్రేష్ఠు లును గొలుచుచుండ స్వర్ణమయరథంబు నెక్కి సుచంద్రుఁడు రాక్షససంహారసాధనసహస్రంబుతో శిశిరగిరిం జేరె ననుట.
శా. భాస్వన్మండలమధ్యగుం డగురమా◊భామావిభుండో యనన్
వస్వభ్యంచితచక్రపాదమున నం◊దం బంది భూభర్త సై
న్యస్వాముల్ భజియింప దైత్యకటకేం◊ద్రద్వారభూభృద్దరీ
భాస్వన్మార్గము సొచ్చె నంత ఘనబం◊భాఘోషముల్ హెచ్చఁగన్. 102
టీక: భూభర్త =సుచంద్రుఁడు; భాస్వన్మండలమధ్యగుండు=సూర్యమండలమధ్యవర్తి; అగురమాభామావిభుండు ఓ అనన్= అయినట్టి నారాయణుఁడో యనఁగా; వస్వభ్యంచితచక్రపాదమునన్ – వసు=సువర్ణముచేత, అభ్యంచిత=పూజ్యమగు, చక్ర పాదమునన్ = చక్రములు పాదములుగాఁ గల రథమునందు; అందంబు అంది = సొంపుగాంచి; సైన్యస్వాముల్ =సేనానాయ కులు; భజియింపన్=సేవించుచుండఁగా; అంతన్=ఆసమయమందు; ఘనబంభాఘోషముల్ = గొప్పలగు భేరులయొక్క నాదములు; హెచ్చఁగన్=అతిశయింపఁగా; దైత్యకటకేంద్రద్వారభూభృద్దరీభాస్వన్మార్గము – దైత్య=తమిస్రాసురునియొక్క, కటకేంద్ర=నగరశ్రేష్ఠముయొక్క, ద్వార=ద్వారమునందలి, భూభృత్=పర్వతముయొక్క, దరీ=గుహయనెడు, భాస్వత్= ప్రకాశించుచున్న, మార్గమున్=దారిని; సొచ్చెన్=ప్రవేశించెను.
మ. పతి గాంచెన్ నవగోపురేశమకుటా◊బ్జద్వేష్యుదంశుచ్ఛటా
మతికృత్కేతనధౌతదీప్రము మహా◊క్ష్మాహంసకజ్ఞానదా
యతవప్రంబు సమగ్రసాలవలయా◊గాంతస్థితాన్యాచలా
కృతిమత్సౌధసముత్కరంబు దనుజ◊శ్రీమత్పురం బయ్యెడన్. 103
టీక: అయ్యెడన్ = ఆసమయమందు; పతి = సుచంద్రుఁడు; నవగోపురేశమకుటాబ్జద్వేష్యుదంశుచ్ఛటామతికృత్కేతనధౌత దీప్రము – నవ=నూతనమగు, ఇది యంశుచ్ఛటకు విశేషణము, గోపురేశ=పురద్వారమనెడు శివునియొక్క, ‘పురద్వారం తు గోపురమ్’ అని యమరుఁడు, మకుట=శిఖరములనెడు కిరీటములందలి, అబ్జద్వేషి=చంద్రునియొక్క, ఉత్=ఊర్ధ్వముఖము లైన, అంశు=కిరణములయొక్క, ఛటా=పరంపర యనెడు, మతి=జ్ఞానమును, కృత్=చేయుచున్న, అనఁగా హరమకుటతట శీతాంశుకిరణపుంజమును బోలుచున్న దనుట, కేతన=ధ్వజములచేత,ధౌతదీప్రము=శుభ్రమైనదియు, ప్రకాశించునదియునగు; మహాక్ష్మాహంసకజ్ఞానదాయతవప్రంబు – మహత్=అధికమయిన, క్ష్మాహంసక=భూదేవిసంబంధియగు పాదకటక మనెడు, ‘హంసకః పాదకటకః’అని యమరుఁడు,జ్ఞాన=జ్ఞానమును; ద=ఇచ్చుచున్న, ఆయత=విశాలమైన,వప్రంబు=కోటగలదియు; సమగ్రసాలవలయాగాంతస్థితాన్యాచలాకృతిమత్సౌధసముత్కరంబు – సమగ్ర=సంపూర్ణమైన, సాలవలయాగ = లోకాలోక పర్వతమువంటి ప్రాకారముయొక్క, అంతస్థిత=లోపలనున్నవియు, అన్యాచల=ఇతరపర్వతములయొక్క, ఆకృతిమత్= ఆకారమువంటి యాకారముగలవియు నగు, సౌధ=మేడలయొక్క, సముత్కరంబు = గుంపులుగలదియు నగు; దనుజ = రాక్షసునియొక్క; శ్రీమత్పురంబు=ప్రకాశించుచున్న నగరమును; కాంచెన్ =చూచెను.
చ. కనుఁగొని యానతియ్య మహి◊కాంతుననుజ్ఞ బలంబు లెల్లఁ ద
ద్ఘనవరణంబు చుట్టి, పరి◊ఖాతతిఁ బూడ్వఁగఁ గోట ద్రవ్వ, గ్ర
క్కున బలుమేరువుల్ నిలుప ◊ఘోరతరోగతి సంభ్రమించెఁ ద
త్స్వనము సురారిపాళి కని◊వార్యరణక్రమ ముగ్గడింపఁగన్. 104
టీక: కనుఁగొని = చూచి; ఆనతియ్యన్ = అనుజ్ఞ యొసంగఁగా; మహికాంతుననుజ్ఞన్=రాజునాజ్ఞచేత; బలంబులు ఎల్లన్ = సైన్యము లెల్లను; తద్ఘనవరణంబు చుట్టి = ఆగొప్పకోట నావరించి; పరిఖాతతిన్=అగడ్తలగుంపును; పూడ్వఁగన్ = మృత్పా షాణాదులచే నించుటకును; కోటన్ త్రవ్వన్=ప్రాకారమును త్రవ్వుటకును; గ్రక్కునన్=వేగముగా; బలుమేరువుల్=అధికము లగు సారువలను; నిలుపన్=ఉంచుటకును; తత్స్వనము =ఆధ్వని; సురారిపాళికిన్=రక్కసులగుంపునకు; అనివార్యరణ క్రమము =నివారింపరాని యుద్ధక్రమమును; ఉగ్గడింపఁగన్ =బయల్పఱచునట్లు; ఘోరతరోగతిన్=అధికమైన వేగముతీరున, కాదేని బలముతీరున; సంభ్రమించెన్=వేగిరపడెను. ఆరాజు సైన్య మగడ్తఁ బూడ్చుట, కోట ద్రవ్వుట లోనగు కార్యములకు వేగ మున సంభ్రమించె ననుట.
వ. అంత నద్దురంత కోలాహలార్థవిజ్ఞాపక చారవార వాచా జాయమాన ప్రతిఘాసముద్దాముండగు నా తమిస్రతమిస్రాచరసార్వభౌముం డనూనకువలయ భయంకర కోపాటోపశోణిమధురీణ వదనాంబురుహ బంధుబింబ వినిర్గత కిరణాంకూరమాలికాయమాన నిస్తబ్ధతామ్రశ్మశ్రుజాలుండును, నధరాధర ఫలగ్రాస సమాసక్తోపరి ద్విజోపరిగతాగ్రహ తదితరద్విజారబ్ధ కలహసముదిత నినాదమతికృద్రదనాగ్రాఘాత సంజాతకిటకిటారవ బధిరీకృత పర్యంతవర్తికుండును, నరిరాజహంస మదాపహారి కరశరద ధగధగాయ మాన నూతనైరావతీ ప్రమాకర కనకకరవాలికాతారళీ ముకుళీకృత సభాజనలోచనాబ్జుండును, నతంద్ర సుచంద్రరాజచంద్ర ప్రతాపవీతిహోత్ర పరంపరాప్రకార సమున్నమ దంతరంగకరండాఖండరోషపార దౌల్బణీ విదార్యమాణ చీలబంధనశేముషీదాయక సాంపరాయిక లాలసాక్రమ సమేధమానాపఘన ఘనత్వ ఫలత్తనుత్రాణుండును, నలఘుబలాహితకాండాసమానవిలాస విక్షపణదీక్షాదక్ష వికటభ్రుకుటి కుండును, నఖిలప్రపంచ పంచతాకరణచణ విలయకాల మహాకాలసరూపరూపుండును, నగుచు నేఁడు గదా మదాశయపూర్తి గావించెఁ బంచజనమాంసంబని తలంచుచు, మణిమయాసనంబు డిగ్గన డిగనుఱికి, నిజావాసంబు వెడలి, వినీతసారథివరానీత శతాంగరాజం బెక్కి, క్రక్కిఱిసి రక్కసిదొరలు వెనువెంటం గొలువ, నభంగురమతంగజతురంగమ చక్రాంగపదాతిసముదయంబులతో నాహవోత్సాహంబున వెడలె నయ్యెడ.
టీక: అంతన్=అటుతరువాత; అద్దురంత కోలాహలార్థ విజ్ఞాపక చారవార వాచా జాయమాన ప్రతిఘాసముద్దాముండు – అద్దు రంతకోలాహల=ఆయపారమైన కలకలధ్వనికి, అర్థ=ప్రయోజనభూతమైన యుద్ధముయొక్క,విజ్ఞాపక=నివేదకులగు, చార =వేగులయొక్క, వార=సంఘములయొక్క,వాచా=వచనములచే, జాయమాన=జనించుచున్న, ప్రతిఘా=రోషముచేత,సము ద్దాముండు=అధికుఁడు; అగు నాతమిస్రతమిస్రాచరసార్వభౌముండు =అయినట్టి యా తమిస్రుఁడను పేరుగల రాత్రించరచక్ర వర్తి, ‘తమిస్రా తామసీరాత్రిః’ అని యమరుఁడు; అనూనకువలయభయంకర కోపాటోప శోణిమధురీణ వదనాంబురుహబంధుబింబ వినిర్గత కిరణాంకూరమాలికాయమాన నిస్తబ్ధ తామ్ర శ్మశ్రుజాలుండును – అనూన=అధికమైన, కువలయ=భూవలయ మనెడుకల్వకు, భయంకర=భయప్రదమైన, కోపాటోప=కోపాతిశయముచేత, శోణిమధురీణ=రక్తిమభారవాహకమగు, చాల నెఱ్ఱనయిన యనుట, వదన=ముఖమనెడు, అంబురుహబంధుబింబ = సూర్యబింబమువలన, వినిర్గత= వెడలివచ్చుచున్న, కిరణాంకూరమాలికాయమాన=బాలకిరణ పరంపరవలె నాచరించుచున్న, దానిం బోలుచున్నయనుట, నిస్తబ్ధ=నిగుడుకొన్న, తామ్ర=ఎఱ్ఱనయిన, శ్మశ్రుజాలుండును = మీసములగుంపుగలవాఁడును; అధరాధర ఫల గ్రాస సమాసక్తోపరిద్విజోపరిగతాగ్రహ తదితరద్విజారబ్ధ కలహసముదిత నినాదమతికృ ద్రదనాగ్రాఘాత సంజాత కిటకిటారవ బధిరీకృత పర్యంతవర్తికుండును – అధరాధర=క్రిందిపెదవి యనెడు, ఫల=పండుయొక్క, గ్రాస= భక్షణమందు, సమాసక్త=వాంఛగల, ఉపరిద్విజ=పైపండ్లనెడు పక్షులయొక్క, ఉపరి=మీఁదను, గత=పొందినట్టి, ఆగ్రహ =కోపముగల, తదితరద్విజ=వానికన్న నితరములగు దిగువపం డ్లనెడు పక్షులచేత, ఆరబ్ధ=ఆరంభింపఁబడిన, కలహ= పోరుచేత, సముదిత =ఉదయించిన, నినాద=ధ్వనియనెడు, మతి = బుద్ధిని, కృత్ = చేయుచున్న, రదనాగ్రాఘాత=దంతాగ్ర ఘట్టనముచేత, సంజాత=ఉదయించిన, కిటకిటారవ=కిటకిట యను ధ్వనిచేత, బధిరీకృత=బధిరులుగాఁ జేయఁబడిన, పర్యంతవర్తికుండును = పార్శమునందలి జనములుగలవాఁడును; అరిరాజహంస మదాపహారి కరశరద ధగధగాయమాన నూతనైరావతీ ప్రమాకర కనకకరవాలికాతారళీ ముకుళీకృతసభాజన లోచనాబ్జుండును – అరిరాజ=శత్రురాజులనెడు, హంస=హంసలయొక్క, మదాపహారి= గర్వము నుడిగించెడు,కరశరద = హస్తమనెడు మేఘమునందు, ధగధగాయమాన=ధగధగ ప్రకాశించుచున్న, నూతననైరావతీ=తొలకరిమెఱపనెడు, ‘ఐరా వత్యః క్షణప్రభా’అని యమరుఁడు, ప్రమాకర=యథార్థజ్ఞానకరమైన, కనకకరవాలికా=బంగరుచూరకత్తియొక్క, తారళీ= చాంచల్యముచేత, ముకుళీకృత=ముకుళములుగాఁ జేయఁబడిన, సభాజన=సభలోనిజనులయొక్క, లోచనాబ్జుండును = నేత్రకమలములు గలవాఁడును;అతంద్ర సుచంద్రరాజచంద్ర ప్రతాపవీతిహోత్ర పరంపరాప్రకార సమున్నమదంతరంగకరం డాఖండరోషపారదౌల్బణీ విదార్యమాణ చీలబంధనశేముషీదాయక సాంపరాయికలాలసాక్రమ సమేధమానాపఘనఘనత్వ ఫలత్తనుత్రాణుండును – అతంద్ర= జాగరూకమైన, సుచంద్రరాజచంద్ర=సుచంద్రనరపాలాగ్రణియొక్క, ప్రతాప=ప్రతాపమనెడు, వీతిహోత్రపరంపరా ప్రకార=అగ్నిపరంపరలరీతిచేత, సమున్నమత్=మిక్కిలి పైకెగయుచున్న,అంతరంగకరండ=చిత్తమనెడు మూసయందలి, అఖండ=అవిచ్ఛిన్నమగు,రోషపారద=క్రోధమనెడు పాదరసముయొక్క,ఔల్బణీ =ఉద్రేకముచేత,విదార్యమాణ=బ్రద్దలు చేయఁబడిన, చీలబంధన =మూసపై మట్టితో చేసిన గట్టనయనెడు, శేముషీ=మతియొక్క, దాయక=ఇచ్చునదియైన, దీనికి తనుత్రాణముతో నన్వయము, సాంపరాయిక=సమరమందలి, లాలసాక్రమ=తృష్ణాతిశయముచేత, సమేధమాన=వృద్ధిఁ బొందుచున్న, అపఘన=అంగముయొక్క,‘అఙ్గంశరీరోపఘనోవయవః’ అని యమరుఁడు, ఘనత్వ=గొప్పతనముచేత, ఫలత్=పగులుచున్న, ‘ఫల విశరణే’ అని యనిశాసనము, తనుత్రాణుండును =కవచముగలవాఁడును;అలఘుబలాహితకాండాస మానవిలాస విక్షపణదీక్షాదక్ష వికటభ్రుకుటికుండును – అలఘు=అధికమగు, బలాహితకాండాస =ఇంద్రధనస్సుయొక్క, మానవిలాస=గర్వవిలసనముయొక్క, విక్షపణదీక్షా=నాశనదీక్షయందు,దక్ష=సమర్థమగు, వికట= వికృతమగు, భ్రుకుటికుండును=భ్రూభంగముగలవాఁడును; అఖిలప్రపంచ పంచతాకరణచణ విలయకాల మహాకాలసరూపరూపుండును – అఖిల=సమస్తమగు, ప్రపంచ=లోకముల యొక్క, పంచతాకరణ=నాశకరణమందు, చణ=సమర్థమైన, విలయకాలమహాకాల=ప్రళయకాలరుద్రునితో, సరూప= సమానమగు, రూపుండును =రూపముగలవాఁడును; అగుచున్; నేఁడుగదా=ఇపుడుగదా! పంచజనమాంసంబు=మనుష్యమాంసము, ‘స్యుః పుమాంసః పంచజనాః’ అని యమరుఁడు; మదాశయపూర్తిన్=నాయిష్టపూర్తిని; కావించెన్=చేసెను; అని తలంచుచున్= ఇట్లు చింతిలుచు; మణిమయాసనంబు = మణిమయమైన సింహాసనమునుండి; డిగ్గనన్=తటాలున; డిగన్ ఉఱికి = వేగముగా దిగి యనుట; నిజావాసంబు=తనయొక్క గృహమునుండి; వెడలి = బయలుదేఱి; వినీతసారథివరానీతశతాంగరాజంబు = వినయవంతుఁడైన సారథిశ్రేష్ఠునిచేఁ దేఁబడిన రథశ్రేష్ఠమును; ఎక్కి=అధిష్ఠించి; రక్కసిదొరలు=రాక్షసాధిపతులు; వెనువెంటన్=మిక్కిలి వెంబడిగా; క్రక్కిఱిసి=ఎడములే నట్లు; కొలువన్=సేవించుచుండఁగా; అభంగుర మతంగజ తురంగమ చక్రాంగ పదాతి సముదయంబులతో – అభంగుర= అప్రతిహతములగు,మతంగజ=ఏనుఁగులయొక్కయు, తురంగమ=గుఱ్ఱములయొక్కయు,చక్రాంగ=రథములయొక్కయు, పదాతి=కాల్బలముయొక్కయు, సముదయంబులతోన్=సమూహములతోడ; ఆహవోత్సాహంబునన్=యుద్ధమునందలి వేడుకవలన; వెడలెన్=బయలుదేఱెను; అయ్యెడన్=ఆసమయమునందు.
అనఁగా నాతమిస్రాసురుఁడు సూర్యబింబమునుండి వెడలిన కిరణములుంబోలె తన ముఖమునుండి వెడలి నిగుడుకొన్న మీసములుగలవాఁడును, దంతాఘట్టనజనితారవ బధరీకృతపరివారజనుండును, నిజకరాగ్రజలదనానట్యమానవిద్యుల్లతాయ మానకరవాలికాధాళధళ్య ముకుళీకృత సభ్యజనలోచనాబ్జుండును, సుచంద్రప్రతాపాగ్నిసంతాపిత రోషపారదోద్రేక విదార్య మాణ మనఃకరండ చీలబంధనాయిత యుద్ధలాలసా సమేధమానగాత్ర ఘనతాభిద్యమాన తనుత్రాణుండును, ఇంద్రధనుర్మదా పహ భ్రుకుటీవిరాజమానుండును, సకలలోకలయకారి కల్పాంతకాలరుద్ర సదృక్షవిగ్రహుండును అగుచు మణిమయాసనము నుండి డిగ్గి రథారూఢుఁడై, యనేకరాక్షసనాయకపరివృతుఁడై, గజరథతురగాదిరణసామగ్రితో బయలుదేఱె ననుట.
మ. కరిఘీంకారము లాశరేశబలహుం◊కారంబు లర్వవ్రజ
స్థిరహేంకారము లక్షిచక్రవిలస◊త్క్రేంకారముల్ గూడి స
త్వరతం ద్విద్వయసాగరోర్మిచటుల◊ధ్వానంబు నాఁ జేర భూ
వరసేనాజన మాయితం బగుచు దై◊వాఱెన్ రణోత్సాహతన్. 106
టీక: కరిఘీంకారములు=గజముల ఘీమను ధ్వనులు; ఆశరేశబలహుంకారంబులు=రాక్షసేశ్వరుని సేనల హుంకారములు; అర్వవ్రజస్థిరహేంకారములు = అశ్వబృందముయొక్క స్థిరమైన హేషారవములును; అక్షిచక్రవిలసత్క్రేంకారముల్ = రథ సమూహముయొక్క ప్రకాశమానమగు క్రేంకారములు; కూడి=మెలఁగి; సత్వరతన్=వేగముచేత; ద్విద్వయసాగరోర్మిచటుల ధ్వానంబు నాన్—ద్విద్వయసాగర=నాల్గుసముద్రములయొక్క,‘నవద్వయద్వీప పృథగ్జయశ్రియామ్’అనునట్లు ద్విద్వయ ప్రయోగము, ఊర్మి=తరంగములయొక్క,చటుల=చంచలమైన, ధ్వానంబు నాన్=ధ్వనియో యనునట్లు; చేరన్=చెందఁగా; భూవరసేనాజనము=సుచంద్రునిసేనలోని జనము; ఆయితం బగుచున్=సిద్ధమగుచు; రణోత్సాహతన్ =యుద్ధోత్సాహము గలుగుటచేత; దైవాఱెన్=ఒప్పెను.
మ. అరుణాభ్రోదితరక్తవృష్టి యనుకూ◊లాన్యానిలశ్రేణి భా
స్వరకేత్వగ్రవిలగ్నగృధ్రము శివా◊జాతామితారావముల్
పరిదశ్యోల్క నిజాజయంబు వివరిం◊పన్ వానిఁ జింతింప కా
సురవంశేశిత సంగరోర్వి నెనసెన్ ◊శూరత్వ మొప్పారఁగన్. 107
టీక: అరుణాభ్రోదితరక్తవృష్టి — అరుణాభ్ర = ఎఱ్ఱనిమేఘమువలన, ఉదిత =ఉదయించిన, రక్తవృష్టి= రక్తవర్షంబును; అను కూలాన్యానిలశ్రేణి — అనుకూలాన్య =ప్రతికూలమైన,అనిలశ్రేణి=వాతసమూహమును; భాస్వరకేత్వగ్రవిలగ్నగృధ్రము – భాస్వర=ప్రకాశమానమగు, కేత్వగ్ర= ధ్వజాగ్రమందు, విలగ్న=సంబంధించిన,గృధ్రము=గద్దయును; శివాజాతామితారా వముల్—శివాజాత=జంబుకములగుంపుయొక్క, అమితారావముల్= అపరిమితధ్వనులును; పరిదశ్యోల్క=కనఁబడు చున్న కొఱవియు, ‘ఉల్కాస్యాన్నిర్గతజ్వాలా’ అని యమరుఁడు;నిజాజయంబు=తనపరాజయమును; వివరింపన్=స్ఫుటీ కరింపఁగా; వానిన్=ఆరక్తవృష్ట్యాదులను; చింతింపక = విచారింపక; ఆసురవంశేశిత — ఆసుర= రాక్షససంబంధియైన, వంశ =కులమునకు, ఈశిత=ప్రభువైన తమిస్రుఁడు; శూరత్వము=శౌర్యము; ఒప్పారఁగన్=ఒప్పుచుండఁగా; సంగరోర్విన్=యుద్ధ భూమిని; ఎనసెన్ =పొందెను.
ఉ. దానవనాయకాజ్ఞ సమ◊దక్షణదాచరసైన్యకోటులున్
మానవనాయకాజ్ఞ నస◊మానమహాజనసైన్యకోటులున్
బూనినరోషచండిమ న◊పూర్వకలంబసమీకకేళి వై
మానికవార మభ్రమున ◊మాటికిఁ గన్గొన సల్పె నేర్పునన్. 108
టీక: దానవనాయకాజ్ఞన్=రాక్షసేంద్రుని యాజ్ఞచేత; సమదక్షణదాచరసైన్యకోటులున్—సమద=గర్వయుక్తమైన, క్షణదా చర=రాక్షసులయొక్క, సైన్యకోటులున్=సేనాసమూహములును;మానవనాయకాజ్ఞన్ =నరపతియైన సుచంద్రునియాజ్ఞచేత; అసమానమహాజనసైన్యకోటులున్—అసమాన=సాటిలేనట్టి, మహత్=శ్రేష్ఠులైన, జన=నరులయొక్క, సైన్యకోటులున్=సేనా సమూహములును; పూనినరోషచండిమన్ = వహించిన రోషాతిశయముచేత; అపూర్వకలంబసమీకకేళిన్ – అపూర్వ=లోకో త్తరమగు, కలంబసమీక=బాణయుద్ధమనెడు,కేళిన్=క్రీడను, ‘కలంబ మార్గణ శరాః’ అనియు, ‘సమీకం సాంపరాయికమ్’ అనియు నమరుఁడు; అభ్రమునన్=ఆకాశమునుండి; వైమానికవారము=దేవతాబృందము; మాటికిన్=సారెకు; కన్గొనన్ = అవ లోకింపఁగా; నేర్పునన్=చాతుర్యముచేత; సల్పెన్=చేసెను.
చ. అపుడు మహోగ్రవర్తన భ◊టాగ్రణిఁ బోరె భటాగ్రయాయి, హ
స్తిపకవరేణ్యుతో రణముఁ ◊జేకొనె హస్తిపకేశ్వరుండు, సా
దిపటలిఁ జయ్యనం గదిసె ◊ధీరత సాదిచయంబు, దోర్బలై
కపటిమచేఁ బరస్పరజి◊ఘాంస మనంబుల నంకురింపఁగన్. 109
టీక: అపుడు=ఆసమయమున; మహోగ్రవర్తనన్=అత్యుగ్రవృత్తిచేత; భటాగ్రణిన్=భటశ్రేష్ఠునితో; భటాగ్రయాయి = భట శ్రేష్ఠుఁడు; పోరెన్=పెనఁగెను; హస్తిపకవరేణ్యుతోన్=మావటులయందు శ్రేష్ఠుఁడగువానితోడ; హస్తిపకేశ్వరుండు = మావటుల యందు శ్రేష్ఠుండు; రణమున్=యుద్ధమును; చేకొనెన్ = చేసెను; సాదిపటలిన్=అశ్వారోహకులయొక్క సమూహమును; సాది చయంబు = అశ్వారోహకుల సమూహము; చయ్యనన్=వేగముగా; ధీరతన్=దైర్యముచేత; కదిసెన్= తాఁకెను; దోర్బలైక పటిమచేన్=బాహుబలాధిక్యతచేత; పరస్పరజిఘాంస=అన్యోన్యహననేచ్ఛ; మనంబులన్=చిత్తములందు; అంకురింపఁగన్ =ఉదయింపఁగ. ఇది పై పోరెనిత్యాది క్రియల యన్నిటితో నన్వయించును.
మ. ద్రుఘణంబుల్ పరఁగించి, కుంతములచేఁ ◊దూలించి, కోదండము
క్తఘనాస్త్రాళులఁ గ్రమ్మి శూలతతి వే◊గన్ గ్రుమ్మి, దుర్వారపా
రిఘధారాగతిఁ జీరి, సంగరధరి◊త్రిన్ మించెఁ దద్వీరసే
న, ఘనాధ్వంబు పగుల్పఁ దత్తుముల స◊న్నాదంబు చిత్రంబుగన్. 110
టీక: ద్రుఘణంబుల్ = ముద్గరములను; పరఁగించి=ప్రయోగించి; కుంతములచేన్=బళ్ళెములచేత; తూలించి=తూలఁజేసి; కోదండముక్తఘనాస్త్రాళులన్ – కోదండ=ధనుస్సులనుండి, ముక్త=విడువఁబడిన, ఘన=గొప్పవగు,అస్త్రాళులన్=బాణముల సమూహములచేత; క్రమ్మి=కప్పి; శూలతతిన్=బాఁకులగుంపుచేత; వేగన్=త్వరగా; క్రుమ్మి=గ్రుచ్చి; దుర్వారపారిఘధారా గతిన్ – దుర్వార=వారింపశక్యముగాని, పారిఘ=పరిఘసమూహముయొక్క,ధారాగతిన్=అంచులతీరుచేత; చీరి=బ్రద్దలు చేసి; తద్వీరసేన=ఆమానవదానవవీరులయొక్కసైన్యము; చిత్రంబుగన్ =ఆశ్చర్యముగ; తత్తుములసన్నాదంబు = ఆసంకుల సమరముయొక్క ధ్వని; ఘనాధ్వంబు= ఆకసమును; పగుల్పన్=భేదింపఁగా; సంగరధరిత్రిన్ =యుద్ధభూమియందు; మించెన్=అతిశయించెను.
మ. నరనాథేంద్రభటుల్ సురారిభటులున్ ◊స్వస్వాభిధాశౌర్యముల్
వరుసం దెల్పుచుఁ బోరి రుగ్రరణఖే◊లాపాండితిన్ నిర్జరో
త్కరముల్ వ్యోమవితర్దిఁ జేరి యని ఖ◊డ్గాఖడ్గిలీలల్ శరా
శరియుజ్జృంభణముల్ గదాగదివిలా◊సంబుల్ మదిన్ మెచ్చగన్. 111
టీక: నిర్జరోత్కరముల్=దేవతాసంఘములు; వ్యోమవితర్దిన్=గగనమను వేదికను; చేరి=పొంది; అనిన్=యుద్ధమందలి; ఖడ్గా ఖడ్గిలీలల్ =ఖడ్గములచేఁ జేయు యుద్ధక్రియలను; శరాశరియుజ్జృంభణముల్=బాణములచేఁ జేయు యుద్ధవిజృంభణలను; గదాగదివిలాసంబుల్=గదలతోఁ జేయు యుద్ధవిలసనములను; మదిన్=చిత్తమందు; మెచ్చగన్=కొనియాడఁగా; నరనాథేంద్ర భటుల్= రాజభటులును; సురారిభటులున్=రాక్షసభటులును; స్వస్వాభిధాశౌర్యముల్=తమతమపేళ్ళను, పరాక్రమములను; వరుసన్=క్రమముగా; తెల్పుచున్=తెలియఁజేయుచు; ఉగ్రరణఖేలాపాండితిన్ – ఉగ్ర=భయంకరమగు, రణ=యుద్ధమనెడు, ఖేలా=క్రీడయొక్క, పాండితిన్=పాండిత్యముచేత; పోరిరి=యుద్ధముఁ జేసిరి.
శా. ఆలో నాదిననాథవంశమణి చ◊క్రాంగోత్తమాస్థానిఁ బ్ర
త్యాలీఢస్థితిఁ బొల్చి కుండలితబా◊ణాసోజ్జ్వలత్పాణియై
చాలన్ శింజినికానినాదమున నా◊శావీథి మేల్కాంచ ని
ర్వేలాస్త్రప్రకరంబు నించె నసుహృ◊ద్వీరాసుహృద్వృత్తిచేన్. 112
టీక: ఆలోన్=అంతలో; ఆదిననాథవంశమణి = ఆసూర్యవంశశ్రేష్ఠుఁడగు సుచంద్రుఁడు; చక్రాంగోత్తమాస్థానిన్ =ఉత్తమరథమను నాస్థానమునందు; ప్రత్యాలీఢస్థితిన్=స్థానవిశేషస్థితిచేత, అనఁగా నెడమకాలును ముందుకుఁ జాఁపి నిల్చి యనుట, ‘స్యాత్ ప్ర త్యాలీఢ మాలీఢ మిత్యాదిస్థానపంచకమ్’ అని యమరుఁడు; పొల్చి = ఒప్పి; కుండలితబాణాసోజ్జ్వలత్పాణియై – కుండలిత = కుండలాకారముగఁ జేయఁబడిన, బాణాస=ధనుస్సుచేత, ఉజ్జ్వలత్=ప్రకాశించుచున్న, పాణియై =హస్తముగలవాఁడై; చాలన్=మిక్కిలి; శింజినికానినాదమునన్ =అల్లెత్రాటిధ్వనిచేత; ఆశావీథి=దిక్ప్రదేశము; మేల్కాంచన్=మేల్కొనఁగా, అనఁగా దిగంతములవఱకు శింజానాదము వ్యాపింపఁగా; నిర్వేలాస్త్రప్రకరంబు = అధికములగు బాణములగుంపులు; అసుహృద్వీరాసు హృద్వృత్తిచేన్ – అసుహృద్వీర = శత్రువీరులయొక్క, అసుహృత్=ప్రాణములుహరించుచున్న, వృత్తిచేన్=వర్తనముచేత; నించెన్=పూరించెను.
మ. పరబర్హ్యుద్ధతిఁ దూల్చి తార్క్ష్యహరణ◊ప్రౌఢిన్ విజృంభించి ని
ర్భరశక్తిన్ ధర గాఁడి పాఱె నలగో◊త్రాభృన్మహాజిహ్మగో
త్కరముల్ తద్విహృతిప్రకారభయరే◊ఖావన్మహాజిహ్మగో
త్కరమున్ నిందయొనర్పఁ దత్పురము వే◊గం జేరు చందంబునన్. 113
టీక: అలగోత్రాభృన్మహాజిహ్మగోత్కరముల్ – అలగోత్రాభృత్=ఆసుచంద్రునియొక్క, మహత్=గొప్పలైన, అజిహ్మగ=
బాణములయొక్క, ‘అజిహ్మగ ఖగాశుగాః’ అని యమరుఁడు, ఉత్కరముల్=సమూహములు, సర్పసమూహములని యర్థాంతరము ధ్వనించుచున్నది. తత్పక్షమందు ‘జిహ్మగ’ అని పదచ్ఛేదము; పరబర్హ్యుద్ధతిన్ – పర=శత్రువులైన, బర్హి= గర్విష్ఠుల యొక్క, ‘బర్హిర్గర్వే కేకిపింఛే’ అని విశ్వము, ఉద్ధతిన్=దర్పమును, ఉత్కృష్టములైన మయూరములయొక్క యుద్ధతి నని యర్థాంతరము; తూల్చి = ఉడిగించి; తార్క్ష్యహరణప్రౌఢిన్ – తార్క్ష్య=అశ్వములయొక్క, హరణ=సంహారము యొక్క, ప్రౌఢిన్ = ప్రావీణ్యముచేత, గరుత్మత్సంహారప్రావీణ్యముచేత నని యర్థాంతరము, ‘తురంగ గరుడౌ తార్క్ష్యౌ’ అని యమరుఁడు; విజృంభించి=అతిశయించి; తద్విహృతిప్రకారభయరేఖావన్మహాజిహ్మగోత్కరమున్ – తత్=ఆబర్హితార్క్ష్య ములయొక్క, విహృతి ప్రకార=విహారభంగిచేత, భయరేఖావత్=భయపరంపరగల, మహత్=గొప్పలగు, జిహ్మగ= పాములయొక్క, ఉత్కరమున్=సమూహమును; నిందయొనర్పన్=నిందచేయుటకు; తత్పురము=సర్పపురమగు పాతాళ మును; వేగన్=శీఘ్రముగా; చేరు చందంబునన్ = పొందురీతిగా; నిర్భరశక్తిన్=అధికసామర్థ్యముచే; ధరన్=భూమిని; కాఁడి =నాటి; పాఱెన్=పరుగెత్తెను. అనఁగా సుచంద్రుని బాణములనెడు సర్పములు శత్రువులనెడు మయూరములఁ దూల్చి, వారి యశ్వము లనెడు గరుత్మంతుల సంహరించి, వేగాతిశయమున భూమిని దూఱిపోవుచుండఁగా నది మయూరగరుడులకు వెఱచి పాతాళము సొచ్చిన సర్పములను నిందింపఁ బాతాళముఁ జేరఁబోవుచున్నట్లుండె ననుట.
చ. అమితనృపాలసాయకచ◊యంబు నిశాటచమూతనుత్రఝా
టము వడిఁ దాఁకి పై కెగయు◊టల్ వినుతింపఁగ నయ్యె నౌర యు
త్తమనవకాముకచ్ఛట ము◊దంబున వచ్చె నటంచు నిర్జర
ప్రమదల కెల్లఁ జక్కఁ దెలు◊పం జనుపెంపు వహించి యయ్యెడన్. 114
టీక: అమితనృపాలసాయకచయంబు – అమిత=మితిలేనట్టి, నృపాల=సుచంద్రునియొక్క, సాయక=బాణములయొక్క, చయంబు=సముదాయము; నిశాటచమూతనుత్రఝాటము – నిశాటచమూ=రాక్షససేనయొక్క, తనుత్రఝాటము = కవచ సమూహమును; వడిన్=వేగముగా; తాఁకి=తగిలి; పై కెగయుటల్ = మీఁదికెగురుటలు; అయ్యెడన్=ఆసమయమందు; నిర్జరప్రమదల కెల్లన్ = రంభాదిదేవాంగనలకెల్లను; ఉత్తమనవకాముకచ్ఛట=శ్రేష్ఠమగు క్రొత్తకాముకులగుంపు; ముదంబునన్=సంతో షముతో; వచ్చెన్ అటంచున్ = వచ్చెననుచు; చక్కన్=బాగుగా; తెలుపన్=తెలియఁజేయుటకు; చనుపెంపు = పోవు నతిశయ మును; వహించి =పొంది; వినుతింపఁగ నయ్యెన్=శ్లాఘింపనాయెను; ఔర = ఆశ్చర్యము!
అనఁగా రాక్షససైనికకవచములను దాఁకి పైకెగయు సుచంద్రుని బాణపరంపర క్రొత్తకాముకవర్గంబు వచ్చుచున్నదని దేవాంగనలకుఁ దెల్పుటకుసురలోకమున కేగుచున్న చందమున నుండెననిభావము. ఆరాజుబాణములచే రక్కసులెల్ల నీలిగి దేవలోకమును బొందుచుండిరని ఫలితము.
చ. ఘనగజదర్పభేదన మ◊ఖండసురారిపురప్రభంజనం
బు నలఘుధర్మఖండనముఁ ◊బూనిచి వేలుపు లెంచ నుగ్రవ
ర్తనఁ దనరారు నమ్మనుజ◊రాజకలంబము చిత్రవైఖరిన్
దనిపె నజాత్మజాంతర ము◊దారతరప్రమదోర్మి నయ్యనిన్. 115
టీక: ఉగ్రవర్తనన్=తీక్ష్ణవ్యాపారముచేత, శివునివర్తనచేత నని యర్థాంతరము, ‘ఉగ్రః కపర్దీ శ్రీకంఠ శ్శితికంఠః కపాలభృత్’ అని యమరుఁడు; తనరారు అమ్మనుజరాజకలంబము – తనరారు = ఒప్పుచున్న, అమ్మనుజరాజ=జనపతియగు నాసుచంద్రుని యొక్క, కలంబము =బాణము, ‘కలమ్బ మార్గణ శరః’ అని యమరుఁడు; ఘనగజదర్పభేదనము = గొప్పగజములమదము యొక్కశమనమును, గజాసురుని దర్పభేదనమునని యర్థాంతరము; అఖండసురారిపురప్రభంజనంబును – అఖండ = అవి చ్ఛిన్నమైన, సురారిపుర=రాక్షసగాత్రములయొక్క, త్రిపురాసురులయొక్కయు నని యర్థాంతరము, ప్రభంజనంబును = నాశ నమును; అలఘుధర్మఖండనము = అధికమైన విండ్లను తునుముటను, యముని భంగముసేయుట నని యర్థాంతరము,‘ధర్మః పుణ్యే యమే న్యాయే చాపే చాపనిషద్యపి’ అని విశ్వము; పూనిచి =కల్పించి; వేలుపులు=దేవతలు; ఎంచన్ = ప్రశంసించునట్లు గా; అయ్యనిన్=ఆయుద్ధమందు;అజాత్మజాంతరము=నారదునియొక్కమనస్సును, దక్షప్రజాపతిపుత్త్రియైనపార్వతిమనస్సు నని యర్థాంతరము; ఉదారతరప్రమదోర్మిన్=అత్యధికమైన సంతోషపరంపరచేత; చిత్రవైఖరిన్=ఆశ్చర్యకరముగా; తనిపెన్ =తృప్తిపఱచెను. అనఁగా శివుండు గజాసురుని భేదించి, త్రిపురభంజనముఁ జేసి, యము నవమానించి, పార్వతిచిత్తమున కానం దముఁ జేసినట్లు సుచంద్రునిబాణము శత్రుగజభేదనమును, సురారిశరీరభంజనమును, తదీయధనుఃఖండనంబును గావించి యుద్ధము గాంచు ప్రీతితో గగనముఁ జేరిన నారదుని చిత్తమున కానందముఁ జేసెనని భావము.
ఉ. ఆది గుణచ్యుతిన్ గనిన◊యట్టినృపాలు నజిహ్మగాళి త
న్మేదినిలోన సుజ్జ్వలన◊మిత్త్రపరంపరఁ గ్రోలి వేగ మెం
తేఁ దనరన్ బళీ యసుర◊నేతృకులంబు తదేకయుక్తిఁ ద
చ్ఛ్రీ దయివాఱె నొక్కొ యజ◊రీవృతి నాకపదంబుఁ జేరఁగన్. 116
టీక: ఆదిన్=తొలుత; గుణచ్యుతిన్=అల్లెత్రాటివలన జాఱుటను; ఆదిగుణచ్యుతిన్=మొదటిదైన గుణసంజ్ఞ గల యకారము యొక్కచ్యుతినని యర్థాంతరము, అకారము గుణమని వ్యాకరణప్రసిద్ధము; కనినయట్టినృపాలు అజిహ్మగాళి = పొందినట్టి రాజుయొక్క బాణపరంపర, అజిహ్మగాళిశబ్దములో నాద్యకారచ్యుతి కాఁగా జిహ్మగాళి యగుటచేత సర్పపంక్తి యని యర్థాం తర మగు; తన్మేదినిలోన = ఆరణభూమియందు; సుజ్జ్వలనమిత్త్రపరంపరన్– సుజ్జ్వల=లెస్స ప్రకాశించుచున్న, నమిత్త్రపరం పరన్=శత్రుపరంపరను; ‘తన్మేదినిలోన్ అసుజ్జ్వలనమిత్త్రపరంపరన్’ అని విభాగము చేసి, తన్మేదినిలోన్ = ప్రసిద్ధమైన భూమి యందు, అసుజ్జ్వలనమిత్త్ర=ప్రాణవాయువులయొక్క,పరంపరన్=సముదాయమును; క్రోలి=పానముచేసి; వేగ =శీఘ్రముగా; ఎంతేన్=మిక్కిలి; తనరన్=ఒప్పఁగా; అసురనేతృకులంబు=రాక్షసనాయకకులము; అజరీవృతిన్=దేవాంగనాపరివృతిచేత; నాకపదంబుఁ జేరఁగన్ =స్వర్గముఁజేరుటకు; తదేకయుక్తిన్ – తత్=ఆబాణములయొక్క, ఏకయుక్తిన్=ముఖ్యసంబంధము చేత; తచ్ఛ్రీన్—తత్=ఆబాణములయొక్క, శ్రీన్=సంపదచేత; ఆసర్పములయొక్క విషముచేత నని యర్థాంతరము; దయి వాఱె నొక్కొ=ఒప్పెనేమో; బళీ!
అనఁగా, అజిహ్మగములు అనఁగా బాణములు ఆదిగుణచ్యుతినిబొంది జిహ్మగములు అనఁగా సర్పములై యసురులను బొందఁగా, నాయసురులు వానిసంబంధముచే నాజిహ్మగములయొక్క శ్రీని (విషమును) బొందినవారలై, వానిసంపద యైన ఆదిగుణచ్యుతిని బొంది సురలై స్వర్గముఁ జెంది రనుట. అసురులు సుచంద్రునిబాణములచే హతులై స్వర్గముఁ జేరిరని భావము.
మ. నరవర్యాశుగకృత్తతద్దనుజసై◊న్యం బప్డు చూపట్టె దు
స్తరఝంఝానిలధూతదావగతి భ్ర◊శ్యత్కాంచనస్యందనో
త్కరమై, నశ్యదనేకవాజివరజా◊తంబై, పతన్మౌళియై,
పరిశీర్యద్ఘనకుంభ్యనీకమయి, భూ◊భాగంబు దాఁ గప్పుచున్. 117
టీక: అప్డు=ఆసమయమందు; నరవర్యాశుగకృత్తతద్దనుజసైన్యంబు – నరవర్య=నరశ్రేష్ఠుఁడగు సుచంద్రునియొక్క, ఆశుగ= బాణములచేత, కృత్త=ఛేదింపఁబడిన, తద్దనుజసైన్యంబు = ఆతమిస్రుని సైన్యము; దుస్తరఝంఝానిలధూతదావగతిన్ – దుస్తర = తరింపశక్యముగాని, ఝంఝానిల=ఝంఝావాతముచేత, ధూత=కంపితమైన,దావగతిన్ =అరణ్యమువలె; భ్రశ్య త్కాంచనస్యందనోత్కరమై – భ్రశ్యత్=పడుచున్న, కాంచనస్యందన=బంగరుతేరులయొక్క, ఉత్కరమై=గుంపులు గలదై; భ్రశ్యత్=పడుచున్న, కాంచన=సంపెఁగలయొక్క, స్యందన=తినాసపుచెట్లయొక్క, ఉత్కరమై=గుంపులు గలదై యని దావ పరమైన యర్థము; నశ్యదనేకవాజివరజాతంబై =నశించుచున్న యనేక తురగశ్రేష్ఠములయొక్క గుంపులు గలదై, అనేక పక్షి శ్రేష్ఠముల గుంపులు గలదై యని యర్థాంతరము; పతన్మౌళియై=పడుచున్న కిరీటములు గలదై, కూలుచున్న యశోకములు గలదై యని యర్థాంతరము, ‘మౌళిః కంకేళి చూతయోః’ అని విశ్వము; పరిశీర్యద్ఘనకుంభ్యనీకమయి – పరిశీర్యత్= చీలు చున్న , ఘన=గొప్పలగు,కుంభి=ఏనుఁగులయొక్క, అనీకమయి=సమూహముగలదై; చీలుచున్న, కుంభి=కలిగొట్టు చెట్ల యొక్క, అనీకమయి=సమూహముగలదై యని దావపరమైన యర్థము; భూభాగంబు = భూప్రదేశమును; తాన్; కప్పుచున్ = ఆవరించుచు; చూపట్టెన్=అగపడెను.
అనఁగా నసురసైన్యము ఝంఝానిలధూతమైన యరణ్యము చందంబున భ్రశ్యత్కాంచనస్యందనాదికమై చూపట్టె ననుట.
మ. బలుపాదంబులు కూర్మముల్, మెఱుఁగు దోఁ◊ప న్మించు నేజల్ జలా
హులునుం, దెల్లనిచాయపట్టుగొడుగుల్ ◊ప్రోద్ధూతడిండీరకం
బులు, చిక్కుల్వడు కేశపాశనికరం◊బుల్ నాఁచులుం గాఁగ ద
త్పలభుగ్గాత్రజరక్తనిర్ఝరిణి గ◊న్పట్టెన్ శరోత్కర్షతన్. 118
టీక: బలుపాదంబులు = అధికమగు నంఘ్రులు;కూర్మముల్ =తాఁబేళ్ళును; మెఱుఁగు దోఁపన్= ప్రకాశము తోఁచునట్లుగా; మించు నేజల్ = అతిశయించు నాయుధవిశేషములు; జలాహులునున్=నీటిపాములును; తెల్లనిచాయపట్టుగొడుగుల్ = తెల్లనిరంగుపట్టుగొడుగులు;ప్రోద్ధూతడిండీరకంబులు = మిక్కిలి కంపితములగు నురుఁగులును; చిక్కుల్వడు కేశపాశనిక రంబుల్=చిక్కువడిన వెండ్రుకలగుంపులు; నాఁచులున్=శైవాలములును; కాఁగన్=అగుచుండఁగా; తత్పలభుగ్గాత్రజరక్త నిర్ఝరిణి = ఆరాక్షసులశరీరమునుండి పుట్టినరక్తనది; శరోత్కర్షతన్=బాణముల యుత్కర్షముచేత; కన్పట్టెన్=చూపట్టెను.
అనఁగా బాణపరంపరలచేఁ ద్రుంపఁబడిన రాక్షసశరీరములనుండి వెడలిన నెత్తురుటేర్లలోఁ బడినరాక్షసపాదములు కూర్మ ములుగాను, నేజలు నీటిపాములుగాను, శ్వేతచ్ఛత్రములు ఫేనములుగాను, కేశపాశములు శైవాలములుగాను దోఁచె ననుట.
సీ. భూరిదైత్యకపాల◊పూర్ణరక్తముపేరి,కాశ్మీరపంకంబు ◊కలయఁ బూసి,
రథములజాళువా◊రావిఱేకులపేరి,పసిఁడిబొట్టులు ఫాల◊పదవిఁ దీర్చి,
మహిఁ ద్రెళ్ళి యున్న ర◊మ్యశిరస్త్రములపేరి,కులుకుకుళ్ళాయి తాఁ ◊దల దవిల్చి,
యసృగంబుసిక్తధ్వ◊జాంబరంబులపేరి, బలుచంద్రకావిదు◊ప్పటులు గప్పి,
తే. యలఘుపలభక్ష్యభోజ్యము ◊లారగించి, మహితచక్రపదాస్థాన◊మండపమునఁ
జక్కఁ గొలువిచ్చె నపు డెద ◊నిక్కువేడ్కఁ, జటులబేతాళవంశ్యరా◊జన్యసమితి. 119
టీక: అపుడు=ఆసమయమందు; చటులబేతాళవంశ్యరాజన్యసమితి – చటుల=చంచలమగు, బేతాళవంశ్య=బేతాళవంశము నందుఁ బుట్టిన భూతములనెడు, రాజన్యసమితి =రాజసభ; భూరిదైత్యకపాలపూర్ణరక్తముపేరి కాశ్మీరపంకంబు – భూరి= అధికమగు, దైత్యకపాల=రాక్షసులపుఱ్ఱెలయందు, పూర్ణ=నిండినట్టి, రక్తముపేరి = రక్తమను పేరుగల, కాశ్మీరపంకంబు = కుంకుమపంకమును; కలయన్=అంతటను; పూసి =లేపనముఁ జేసి, రథములజాళువారావిఱేకులపేరి పసిఁడిబొట్టులు – రథముల=అరదములయొక్క, జాళువారావిఱేకులపేరి = బంగరు రావి ఱేకు లనెడు, పసిఁడిబొట్టులు = బంగరుబొట్టులను; ఫాలపదవిన్=ఫాలప్రదేశమున; తీర్చి = దిద్ది; మహిఁ ద్రెళ్ళి యున్న రమ్యశిరస్త్రములపేరికులుకుకుళ్ళాయి – మహిన్=భూమియందు, త్రెళ్ళియున్న =పడియున్న, రమ్య= మనోజ్ఞమైన, శిరస్త్రములపేరి=తలతొడుపులను పేరుగల, కులుకుకుళ్ళాయి = అందమైనటోపి; తాన్=తాను; తలన్=శిరము నందు; తవిల్చి=ఉంచి, అసృగంబుసిక్తధ్వజాంబరంబులపేరి బలుచంద్రకావిదుప్పటులు – అసృక్=రక్తమనెడు, అంబు=ఉదకమందు, సిక్త= తడుపఁ బడిన, ధ్వజాంబరంబులపేరి =ధ్వజపటములనుపేరుగల, బలుచంద్రకావిదుప్పటులు = పెద్దచెంగావివస్త్రములను; కప్పి= ఆచ్ఛాదించి, అలఘుపలభక్ష్యభోజ్యములు=అధికములగు మాంసములనెడు భక్ష్యభోజ్యములను; ఆరగించి=భక్షించి; మహితచక్రపదా స్థానమండపమునన్ – మహిత=పూజ్యమగు, చక్రపద=రథమనెడు,ఆస్థానమండపమునన్=సభామండపమందు; చక్కన్= బాగుగా; ఎదన్=హృదయమందు; నిక్కు వేడ్కన్=అతిశయించునుత్సాహముచేత; కొలువిచ్చెన్=కొలువుచేసెను.
అనఁగా నపుడు భూతములనెడు రాజులగుంపు రక్కసులతలపుఱ్ఱెలలో నిండిన నెత్తురనెడు గందము పూసికొని, తేరుల రావిఱేకులనెడు బంగరుబొట్టులు వెట్టుకొని, ధరఁ బడియున్న తలతొడుపులనెడు కుళ్ళాయీలు తలఁ దవిల్చికొని, నెత్తురుతోఁ దడిసిన కేతనపటము లనెడు చెంద్రకావిదుప్పటులు గప్పికొని మాంసమనెడు భక్ష్యభోజ్యము లారగించి, తేరులనెడు కొలువు కూటములఁ గూర్చుండె ననుట.
వ. అప్పు డప్పొలసుదిండిమూఁకలదండం బఖండదోర్దండమండితశౌర్యచండిమంబున నమ్మహీమండ లేశ్వరుం జుట్టుముట్టి యుట్టిపడుకట్టల్క నట్టిట్టు దెమలక పరిఘ పట్టిస ముద్గర గదా భిందివాల తోమర శూలాది నానావిధాయుధ యూథంబులం గప్పి, మరుత్కులాభినుత్య సమిత్కుతల చమత్కారోత్క ర్షంబు సూపుచు విజృంభించినం దిలకించి, మనోంచల ప్రపంచిత ప్రతిఘారస ప్రకాండుండై యామనుజ నాయకమార్తాండుండు వలయితచాపవల్లికాతల్లజంబున నిశితభల్లంబులు గూర్చి నేర్పు వెలయం బఱపి, కరంబులు శిరంబులు పదంబులు రదంబులు నురంబులు నుదరంబులు వేఱుపఱుపరాకుండం దుని యలు చేయుచు నరిభయంకర ప్రచురతర సహోవిభవంబునం దనచటులసాయకచాతుర్యంబు సూపు నెడ నొక్కొక్కయెడ నుదారతీవ్రాశుగధారాప్రచారంబున నుద్వేలకీలాలపూరంబులు బోరునం గురియ ముక్తాహారంబులు సారెకుం బుడమిఁ ద్రెళ్ళ విగతకరకంబులై నిజఘనాఘననామంబు నిజం బగుటకుంబోలె ననంతాస్థానంబున భ్రమించు దంతావళసంతానంబులును, నొక్కొక్కయిక్క మిక్కుటం బగు చాంచల్యం బున ధరాపరాగపూగసంవళితంబై రూపఱి నానాజిహ్మగసంహతిక్రమంబునకుఁ దల్లడిల్లుచు నాత్మ హర్యభిధానంబు సార్థకంబు గావించుటకుంబోలె మూలలకుఁ జేరు హయనిచయంబులును, నొక్కొక్క వంక విశంకటశింజినీటంకార జలదగర్జా సమూర్జనంబున నాంతరంబు వ్రీల విముక్తకాండజాతంబులై వాహినీమధ్యంబున గతివిశేష మొక్కింత యెఱుంగక చక్రాంగభావంబు సత్యంబగుటకుంబోలె సడలు స్యందనసందోహంబులును, నొక్కొక్కచెంత సుచంద్రసాంద్రధామస్తోమంబు గనుంగొనం బాయక నెమ్మ నంబుల సాధ్వసం బుప్పొంగి పొంగ మహాబలాతివియోగంబున స్రుక్కుచు మిక్కిలి రయంబునం బొదలు దూఱం దలఁచుచుఁ జిందువంబై పఱచుచు స్వచక్రనామంబు సిద్ధంబుఁజేయనుంబోలెఁ జలియించు సేనా జనంబులును, నొక్కొక్కమూల యాతుధానతనుత్రాణ వితానాయసచూర్ణపరంపర శోణితఝరపూరం బున శాదభూతంబై యేపుసూపఁ బుండరీకసమాఖ్యాకలితంబు లగుటంబోలె బహుశిలీముఖసమాక్రాంతం బులై విదళితత్వంబు వహించు తెలుపట్టుగొడుగులును, నొక్కొక్కపొంత నవక్రచక్రఘాతంబుల విశకలి తోత్తమాంగంబులై భాస్వచ్చంద్రరథాచ్ఛాదనం బంబరంబునం గావించుచుఁ గేతువిఖ్యాతిం బొగడొం దుటం బోలె నిశాటకాంతానుషంగంబు డింపని బిరుదపతాకానికరంబులును, నొక్కొక్కచాయఁ బరు లతోఁ గలహంబులు మాని యసమాంబకలగ్నహృదయలై ద్విజపక్షపాతంబు చేకొని తాము సాదు లగుటం బోలె నైశ్చల్యంబునం దోఁచువాహారోహకులును, నొక్కొక్కదిక్కున హరిదంశుక స్తవనీయ నరవర ప్రక్ష్వేడనతాడనంబుల విగతప్రాణంబులై రాజరా జుల్లసద్విస్మయంబున వీక్షింప సూతజాతతా గతిం బరఁగుటంబోలె ధరణిం బడిన యంతృకులంబులును, నొక్కొక్కక్రేవలఁ బుణ్యజనానంగీకృతంబు లై యెంతయు సౌగుణ్యంబు సంపాదింపక నిశ్శరయోగంబు బెరసి ధన్వాహ్వయంబులగుటంబోలెఁ బెంపు గననికోదండంబులును, నొక్కొక్కసీమల ఘనకాండాసారమహిమంబున వీతపత్రంబులై యలఘు ఫల నికాయసాంగత్యంబు గానక సొంపుచెడి బాణాత్మంబునఁ బరఁగుటంబోలె ధరాపదవి వ్రాలిన నారాచ జాలంబులును, బొలుపొంద నత్యద్భుతంబై దేవదానవాయోధనధరాస్థలంబు నందంబున జిష్ణుకరాసి ఖండిత కర్బురచక్రాంగసంగతంబై, రామరావణయుద్ధదేశంబుడంబున చటులహరిపటలరటనాఘటి తంబై, హరపురాసురసమరాస్థానంబుపోలిక ననంతకలంబవిజృంభణగుంభితంబై, కుమారతారకా స్కందనతలంబు చందంబున నభేద్యశక్తిసంయుతంబై, కౌరవపాండవసంగ్రామాంగణంబుచెలువునఁ జక్రికేతనవిదారణచణ భీమగదాక్రియాసముపేతంబై, యమ్మహాసంగరరంగంబు వినుతికెక్కె నయ్యవ సరంబున.
టీక: అప్పుడు=ఆసమయమందు; అప్పొలసుదిండిమూఁకలదండంబు=ఆక్రవ్యాదసేనలయొక్కగుంపు; అఖండదోర్దండ మండితశౌర్యచండిమంబునన్ – అఖండ=అవిచ్ఛిన్నమగు, దోర్దండ=బాహుదండములచేత, మండిత=అలంకృతమైన, శౌర్య చండిమంబునన్ = శౌర్యాతిశయముచేత; అమ్మహీమండలేశ్వరున్=ఆభూమండలేశ్వరుఁడగు సుచంద్రుని; చుట్టుముట్టి = చుట్టుకొని; ఉట్టిపడుకట్టల్కన్=మిక్కిలి యధికమైన క్రోధముచేతననుట; అట్టిట్టు దెమలక=అటునిటు పోక; పరిఘ పట్టిస ముద్గర గదా భిందివాల తోమర శూలాది నానావిధాయుధయూథంబులన్ = ఇనుపకట్లగుదియ మొదలు బళ్ళెమువఱకుఁ గల నానావిధాయుధసమూహములచేత; కప్పి=ఆవరించి; మరుత్కులాభినుత్యసమిత్కుతలచమత్కారోత్కర్షంబు – మరుత్కుల = దేవతాబృందముచేత, అభినుత్య=ప్రశంసనీయమగు, సమిత్కుతల=యుద్ధభూమియొక్క, చమత్కారోత్కర్షంబు = చాతు ర్యాతిశయమును; చూపుచున్=కనఁబఱచుచు; విజృంభించినన్=చెలరేఁగఁగా; తిలకించి=చూచి; మనోంచలప్రపంచితప్రతిఘా రసప్రకాండుండై – మనోంచల=చిత్తప్రదేశమందు, ప్రపంచిత=విస్తరిల్లఁజేయఁబడిన, ప్రతిఘారసప్రకాండుండై =ప్రశస్తరౌద్రరసము గలవాఁడై; ఆమనుజనాయకమార్తాండుండు=ఆనరనాథసూర్యుఁడు; వలయితచాపవల్లికాతల్లజంబునన్=కుండలీకృతమగు ప్రశస్తధనుర్లతయందు;నిశితభల్లంబులు=తీక్ష్ణములైన బాణములను;కూర్చి=తొడిగి; నేర్పువెలయన్=చాతుర్యము విలసిల్లగా; పఱపి=వ్యాపింపఁజేసి; కరంబులు = చేతులు; శిరంబులు =తలలు; పదంబులు=పాదములు; రదంబులు=దంతములు; ఉరం బులు =ఎదలు; ఉదరంబులు =జఠరములు; వేఱుపఱుపరాకుండన్ =వేఱుగాఁ దెలియరాకుండునట్లు; తునియలు చేయుచున్ =ఖండములు చేయుచు; అరిభయంకరప్రచురతరసహోవిభవంబునన్ – అరి=శత్రువులకు,భయంకర=భయప్రదమగు, ప్రచురతర = అధికతరమగు, సహః=బలముయొక్క, ‘తర స్సహోబల శౌర్యాణి’ అని యమరుఁడు, విభవంబునన్ = సమృద్ధి చేత; తనచటులసాయకచాతుర్యంబు = తనయొక్క వేగవంతమగు బాణములనేర్పును; చూపునెడన్=చూపుసమయమందు; ఒక్కొక్కయెడన్= ఒక్కొక్కచోట; ఉదారతీవ్రాశుగధారాప్రచారంబునన్ – ఉదార=గొప్పలగు, తీవ్రాశుగ=దృఢసాయక ములయొక్క, చండమారుతములయొక్కయని యర్థాంతరము, ధారా=అంచులయొక్క, జలధారలయొక్క, ప్రచారంబు నన్ = సమృద్ధిచేత; ఉద్వేలకీలాలపూరంబులు = అధికములగు రక్తప్రవాహములు, ఉదకప్రవాహములని యర్థాంతరము; బోరునన్ కురియన్ = మిక్కిలి కురియఁగా; ముక్తాహారంబులు = ముత్యపుసరములు; సారెకున్ = మాటిమాటికి; పుడమిన్ = భూమియందు; త్రెళ్ళన్=వ్రాలఁగా; విగతకరకంబులై = పోయినతొండములుగలవై, రాలినవడగండ్లుగలవై యని యర్థాంత రము; నిజఘనాఘననామంబు = తమమదగజనామము, వార్షుకాబ్దనామము; నిజం బగుటకుంబోలెన్ =యథార్థమగుటకువలె; అనంతాస్థానంబునన్ – అనంతా=భూమియొక్క, స్థానంబునన్=ప్రదేశమందు; అనంత ఆస్థానంబునన్=ఆకాశప్రదేశమందని యర్థాంతరము; భ్రమించు దంతావళసంతానంబులును=సంచరించుచున్నయేనుఁగులగుంపులును, అనఁగా వర్షించుమేఘ ములు చండమారుతముచే బోరున జలపూరము వర్షించి వర్షోపలవిహీనములయి గగనమందు సంచరించునట్లు ఘనాఘన నామసామ్యమున మదపుటేనుఁగులును సుచంద్రునితీవ్రబాణములచే రక్తము వర్షించి ముత్యములు పుడమిం ద్రెళ్ళఁగాఁ దొండ ములు లేనివై యుద్ధభూమిని జరించుచుండె ననుట. ఏనుఁగులగుంపు లొకమూల ఖండితతుండములయి యుండెనని ఫలితార్థము.ఒక్కొక్కయిక్కన్ = ఒక్కొక్కప్రదేశమందు; మిక్కుటంబగు చాంచల్యంబునన్=అధికమగు చపలతచేత; ధరాపరాగపూగ సంవళితంబై = భూపరాగపుంజముచేత వ్యాప్తమయి; రూపఱి =రూపుచెడి; నానాజిహ్మగసంహతి క్రమంబునకున్ – నానా = అనేకవిధములగు, అజిహ్మగసంహతి=బాణసమూహముయొక్క, అనేకవిధములగు సర్పసంఘముయొక్కయని యర్థాం తరము, క్రమంబునకున్=సంచరణంబునకు;తల్లడిల్లుచున్=పరితపించుచు; ఆత్మహర్యభిధానంబు=తమ యశ్వనామమును, వాయువనెడు పేరును; సార్థకంబు గావించుటకుంబోలెన్ = యథార్థము సేయుటకువలె; మూలలకున్=మఱుఁగులకు, విదిగ్భా గములకు; చేరు హయనిచయంబులును = చేరుచున్న గుఱ్ఱములగుంపులును; అనఁగా నశ్వసమూహము అనేకవిధములైన బాణప్రహారములచేతఁ దల్లడిల్లి మూలలఁ బడియుండఁగా నది తమకు గలహర్యభిధానము అనఁగా వాయువులను నామము సార్థకముఁ జేయుటకు సర్పసంచారమువలన తల్లడిల్లి వాయవ్యమూలల కొదిఁగినట్లుండెనని భావము. బాణాఘాతమున కశ్వ ములు తల్లడిల్లి పరాగవ్యాప్తములై యొకమూలఁ బడియుండె నని ఫలితార్థము.
ఒక్కొక్కవంకన్ = ఒక్కొక్కప్రదేశమునందు; విశంకటశింజినీటంకారజలదగర్జాసమూర్జనంబునన్ – విశంకట=విపులమగు, శింజినీటంకార=అల్లెత్రాటిధ్వనియనెడు, జలదగర్జా=మేఘనాదముయొక్క, సమూర్జనంబునన్ = అతిశయముచేత; ఆంత రంబు వ్రీలన్ = హృదయము వ్రయ్యలు కాఁగా; విముక్తకాండజాతంబులై =విడువఁబడిన గుఱ్ఱములసమూహములు గలవై , విడువఁబడిన జలసమూహముగలవై, అనఁగా నీటిని వదలినవై యని యర్థాంతరము; వాహినీమధ్యంబునన్=సేనామధ్యమున, నదీమధ్యమందని యర్థాంతరము; గతివిశేషము =గమనవిశేషము; ఒక్కింత యెఱుంగక =కొంచెమయినఁ గానక; చక్రాంగ భావంబు = రథభావము, హంసభావమని యర్థాంతరము; సత్యం బగుటకుంబోలెన్ = యథార్థమగుటకువలె; సడలు స్యందన సందోహంబులును = శిథిలమగు రథసమూహములును; అనఁగా హంసలు మేఘధ్వనిని విని భయపడి జలసమీపమును వీడి నదీమధ్యసంచారము కొంచెమయిన లేకయుండుట స్వభావము గాన చక్రాంగనామసామ్యంబున స్యందనంబులును వానివలె శింజినీనాదంబునకు వెఱచి విముక్తాశ్వములై సేనామధ్యసంచారము మాని పడి యున్నట్లు తోఁచుచున్న వనుట. ఒక్కొక్కచెంతన్ = ఒక్కొక్కప్రదేశమునందు; సుచంద్రసాంద్రధామస్తోమంబు = సుచంద్రునియొక్క సాంద్రమైన ప్రతాపసమూ హమును; కనుంగొనన్ =చూడఁగా; పాయక=ఎడయక; నెమ్మనంబులన్=నిండుమనస్సులయందు; సాధ్వసంబు= వెఱపు; ఉప్పొంగి పొంగన్ = ఉబికి వెలిపర్వఁగా; మహాబలాతివియోగంబునన్ – మహత్=అధికమైన, బల=బలముగలవారియొక్క, అతివియోగంబునన్ = మిక్కిలి యెడఁబాటుచేత; మహత్=అధికమైన, అబల=స్త్రీయొక్క, అతివియోగంబున నని యర్థాం తరము; స్రుక్కుచున్=కుందుచు; మిక్కిలి = అధికమైన; రయంబునన్=వేగముచేత; పొదలు =నికుంజములను; తూఱన్ = చొచ్చుటకు; తలఁచుచున్=సంకల్పించుచు; చిందువంబై =చెదరినవై; పఱచుచున్=పరుగెత్తుచు; స్వచక్రనామంబు = తన సైన్యనామమమును, తన చక్రవాకనామము నని యర్థాంతరము, ‘చక్రం చయే జలావర్తే రథాఙ్గే రాష్ట్ర సైన్యయోః’ అని రత్న మాల; సిద్ధంబుఁజేయనుంబోలెన్ = నిష్పన్నముసేయుటకువలె; చలియించు సేనాజనంబులును = కదలుచున్న సేనాజనము లును; అనఁగా చక్రవాకములు చంద్రధామస్తోమము చూచి భయపడి ప్రియావియోగమును గాంచి స్రుక్కుచు అతివేగముగ పొదలు దూఱుచు చెదరినవగుచు నొప్పుట స్వభావము గాన, చక్రనామసామ్యమున సేనాజనసముదాయంబును సుచంద్రరాజ ప్రతాపము గని భయపడి సేనానాయకవియోగమును గాంచి స్రుక్కుచు మిక్కిలివేగమున పొదలు దూఱఁ బాఱుచు చెదరె ననుట. సుచంద్రప్రతాపమునకు వెఱచి, సేనాజనులు పటాపంచలై చీకాకుపడిరని తాత్పర్యము.
ఒక్కొక్కమూలన్ = ఒక్కొక్కప్రదేశమునందు; యాతుధానతనుత్రాణవితానాయసచూర్ణపరంపర – యాతుధాన=రాక్షసుల యొక్క, తనుత్రాణవితాన = కవచసమూహముసంబంధియగు, అయసచూర్ణపరంపర = ఇనుపపొడిగుంపు; శోణితఝర పూరంబునన్ – శోణితఝర =నెత్తుటేర్లయొక్క, పూరంబునన్ =వఱదయందు; శాదభూతంబై =బురదరూపమై, ‘పంకో స్త్రీ శాద కర్దమౌ’అని యమరుఁడు; ఏపుసూపన్=అతిశయింపఁగా; పుండరీకసమాఖ్యాకలితంబులగుటంబోలెన్ = శ్వేతచ్ఛత్రము లయినందునంబలె, సితాంభోజములయినందునంబలె నని యర్థాంతరము; బహుశిలీముఖసమాక్రాంతంబులై=అనేకబాణముల చేతఁ జుట్టఁబడినవై, తుమ్మెదలచేతఁ జుట్టఁబడినవై యని యర్థాంతరము; విదళితత్వంబు = పగులుపఁ బడుటను, వికసించు టను; వహించు తెలుపట్టుగొడుగులును = పొందినట్టి శ్వేతచ్ఛత్రములును; అనఁగా శ్వేతచ్ఛత్రములు పుండరీకనామము గలవి గనుక తెల్లదామరలు నదీప్రవాహపంకమునందు అళికులమిళితములై వికసించియుండునట్లు శోణితనదీపూరమునందు యాతు ధానతనుత్రాణచూర్ణమను బురదయందు బాణసమాక్రాంతంబులై పగిలి పడియున్న వనుట. శోణితము నదీప్రవాహముగఁ బాఱు చున్నదనియు అందు రాక్షసకవచచూర్ణము పంకముగా నున్నదనియు అందు బాణసంకీర్ణములై పగిలి పడియున్న తెల్లగొడు గులు సితాంభోజములను బోలియున్నవనియు భావము.
ఒక్కొక్కపొంతన్ = ఒక్కొక్కప్రదేశమునందు; అవక్రచక్రఘాతంబులన్= అకుటిలమగు చక్రనామకాయుధములతాఁకులచేత, సుదర్శనప్రహారములచేత నని యర్థాంతరము; విశకలితోత్తమాంగంబులై = తునియలుచేయఁబడిన కొనలు కలవై, త్రుంపఁ బడిన శిరములు కలవై యని యర్థాంతరము; భాస్వచ్చంద్రరథాచ్ఛాదనంబు – భాస్వత్ చంద్రరథ=ప్రకాశించుచున్న స్వర్ణ రథములయొక్క, సూర్యచంద్రశరీరములయొక్క, ఆచ్ఛాదనంబు=ఆవరణమును; అంబరంబునన్ = వస్త్రముచేత, ఆకాశము నందు; కావించుచున్ =చేయుచు; కేతువిఖ్యాతిన్ = పతాక యను పేరును, కేతుగ్రహమనుపేరు నని యర్థాంతరము; పొగడొం దుటంబోలెన్ = ప్రసిద్ధిని బొందుటచేవలె; నిశాటకాంతానుషంగంబు – నిశాటకాంత=రక్షోనాథులయొక్క, రాక్షస్త్రీయొక్క అని యర్థాంతరము, అనుషంగంబు =అనుసరణమును; డింపని బిరుదపతాకానికరంబులును = వదలని బిరుదయుక్తములయిన టెక్కెముల గుంపులును; అనఁగా పతాకలు కేతుశబ్దసామ్యమున, కేతుగ్రహము చక్రముచే నఱకఁబడినతల గలిగి యంబరమున సూర్యచంద్రశరీరాచ్ఛాదనమును గావించుచు రాక్షసస్త్రీ యనుసరణమును వహించునట్లు, చక్రాయుధములచేతఁ ద్రుంపఁబడిన కొనలు గలవై, వస్త్రములచే రథముల నాచ్ఛాదించుచు, నిశాచరనాథుల ననుసరించుచు నొకమూలఁ బడియుండెనని భావము. ఒక్కొక్కచాయన్= ఒక్కొక్కప్రదేశమునందు; పరులతోన్ =శత్రువులతో, ఇతరజనులతో నని యర్థాంతరము; కలహంబులు మాని = జగడము వదలి; అసమాంబకలగ్నహృదయులై = సరిలేని యమ్ములు నాటిన ఱొమ్ములు గలవారై, విషమలోచనుఁ డైన శివునియం దాసక్తమైన హృదయము గలవారై; ద్విజపక్షపాతంబు = కంకగృధ్రాదులయొక్క ఱెక్కలపాటును, బ్రాహ్మ ణులయందలి ప్రీతిని; చేకొని = స్వీకరించి; తాము; సాదు లగుటన్ బోలెన్ = రౌతులగుటచేతవలె, సజ్జనులగుటచేబలె; నైశ్చ ల్యంబునన్ =నిశ్చలతచేత; తోఁచు వాహారోహకులును=తోఁచుచున్న అశ్వారోహకులును; అనఁగా సాధుజనులు పరులతో కలహము మాని, సాంబమూర్తియందు లగ్నహృదయులై , బ్రాహ్మణపక్షపాతము దాల్చి, ధ్యానయోగమున నైశ్చల్యమును భజించునట్లు తన్నామసామ్యంబున అశ్వారోహకులును పరులతో కలహము మాని, అసమాంబకములచే లగ్నహృదయులై, గృధ్రాదిద్విజపక్షపాతమును దాల్చి, ప్రాణవియోగ మగుటవలన నైశ్చల్యమును వహించి యొకమూలఁ బడియుండిరని భావము.
ఒక్కొక్కదిక్కునన్ = ఒక్కొక్కప్రదేశమునందు; హరిదంశుక స్తవనీయనరవరప్రక్ష్వేడనతాడనంబులన్ –హరిదంశుక = దిగంబరుఁడైన శివునిచేత, స్తవనీయ=కొనియాడఁదగిన, నరవర=సుచంద్రునియొక్క, ప్రక్ష్వేడన=బాణములయొక్క, తాడ నంబులన్=దెబ్బలచేత; హరిదంశుక = పీతాంబరుఁడైన కృష్ణునిచేత,స్తవనీయ=కొనియాడఁదగిన, నర=అర్జునునియొక్క, వర=శ్రేష్ఠములైన, ప్రక్ష్వేడన=బాణములయొక్క, తాడనంబులన్=దెబ్బలచేత, నని యర్థాంతరము; విగతప్రాణంబులై = గతా సువులై; రాజరాజు=కుబేరుఁడు, దుర్యోధనుఁడని యర్థాంతరము; ఉల్లసద్విస్మయంబునన్ = ప్రకాశించు నాశ్చర్యముతోడ; వీక్షింపన్=చూచుచుండఁగా; సూతజాతతాగతిన్ = సూతజాతిప్రాప్తిచేత, సూతులవల్లఁ బుట్టుట యనఁగా కర్ణత్వముయొక్క ప్రాప్తిచేత; పరఁగుటంబోలెన్ = ఒప్పుచుండుటచేతవలె; ధరణిన్=భూమియందు; పడిన యంతృకులంబులును = పడియున్న సారథుల సముదాయములును; శ్రీకృష్ణునిచేఁ గొనియాడఁదగిన కిరీటియొక్కబాణతాడనములచే విగతప్రాణుండై దుర్యోధను నిచే సవిస్మయంబుగ నీక్షింపఁబడు కర్ణుని చందంబున యంతృకులంబు సుచంద్రుని బాణతాడనములచే విగతప్రాణంబై కుబేరు నిచే సవిస్మయంబుగ నీక్షింపఁబడుచు యుద్ధభూమి కొకమూలఁ బడియుండెనని సూతజాతత్వసామ్యమున వర్ణింపఁబడియె. ఒక్కొక్కక్రేవలన్= ఒక్కొక్కప్రదేశములందు; పుణ్యజనానంగీకృతంబులై = రక్కసులచేతఁ బరిగ్రహింపఁబడనివియై, పెద్దల చేతఁ బరిగ్రహింపఁబడనివియై యని యర్థాంతరము; ఎంతయున్=మిక్కిలి; సౌగుణ్యంబు = మంచియల్లె గలుగుటను, మంచి గుణములు గలుగుటను; సంపాదింపక =ఆర్జింపక; నిశ్శరయోగంబు = గుణసాంగత్యములేమిచే బాణయోగాభావమును, జలసంగత్యభావమును; బెరసి = పొంది; ధన్వాహ్వయంబులగుటంబోలెన్ = విల్లనెడు పేరుగల వగుటచేతవలె, నిర్జలదేశము లని పేరుగాంచుటచేతవలె, ‘ధన్వజాంగలదేశే స్యా ద్ధన్వచాపే’ అని విశ్వము; పెంపున్=వృద్ధిని; కననికోదండంబులును = పొందని ధనుస్సులును; అనఁగా నిర్జలదేశములు సజ్జనులచే ననంగీకృతంబులై మంచిప్రదేశము లనుట లేక జలహీనములై పెంపు గనని యట్లు ధన్వనామసామ్యముచే విండ్లును పుణ్యజనులైన రాక్షసులచే విడువఁబడి అల్లెత్రాటిసంబంధము లేనందున శరసం బంధము గానక యొకమూలఁ బడియున్నవని భావము. ధనువులు తమ్ముఁ బట్టుకొను నాయకులచేతను, అల్లెత్రాళ్ళ చేతను వియుక్తములై విశకలితములుగాఁ బడియున్నవని పరమార్థము.
ఒక్కొక్కసీమలన్ = ఒక్కొక్కప్రదేశములందు; ఘనకాండాసారమహిమంబునన్ = గొప్పబాణవృష్టిమహిమచేత; ఘన = మేఘసంబంధియైన, కాండ=ఉదకముయొక్క, ఆసార=వర్షధారలయొక్క, మహిమంబునన్=అతిశయముచేత; వీతపత్రంబు లై =పోయిన ఱెక్కలు గలవై, రాలినయాకులు గలవై; అలఘుఫలనికాయసాంగత్యంబు – అలఘు= అధికమైన, ఫలనికాయ =ములుకులగుంపుయొక్క, పండ్లగుంపుయొక్క, ‘ఫలం హేతురసేర్థే స్యా త్ఫలకే ముష్టి లాభయోః జాతీఫలేపి కర్కోలేసస్య బాణాగ్రయోరపి’ అని విశ్వము, సాంగత్యంబు = కూడియుండుటను; కానక=పొందక; సొంపుచెడి =అందముఁ బాసి; బాణా త్మంబునన్ = శరస్వరూపముచేత, గోరంటవృక్షస్వరూపముచేత; పరఁగుటంబోలెన్ =ఒప్పుటచేతవలె; ధరాపదవిన్=భూ తలమందు; వ్రాలిన =పడినట్టి; నారాచజాలంబులును = బాణసమూహములను; అనఁగా గోరంటలు వర్షాకాలమున జలధార లచే విగతపత్రములై, ఫలములను బొందక, సొంపుచెడి భూతలమందు వ్రాలుట ప్రసిద్ధంబు గావున నట్లు బాణశబ్దసామ్యమున రాక్షసనారాచంబులు సుచంద్రబాణవర్షమహిమచేత పక్షహీనములయి వీడినములుకులు గలవై, సొంపుచెడి ధరాతలమున వ్రాలియున్న వనుట. పొలుపొందన్=ఇట్లు మూలమూలలకుఁ బడిన రథగజతురగాదు లొప్పుచుండఁగా; అత్యద్భుతంబై = మిక్కిలి యాశ్చర్య కరమై; దేవదానవాయోధనధరాస్థలంబు నందంబునన్ = దేవాసురయుద్ధభూమిచందంబున; జిష్ణుకరాసిఖండితకర్బుర చక్రాంగసంగతంబై – జిష్ణు=ఇంద్రునియొక్క, జయశీలుండైన సుచంద్రునియొక్క యని యర్థాంతరము, కర =హస్తమందలి, అసి=ఖడ్గముచేత, ఖండిత=నఱకఁబడిన,కర్బురచక్రాంగ=బంగరురథములతోడను, రాక్షససంఘములయొక్కతనువుల తోడను, సంగతంబై =కూడుకొన్నదై; రామరావణయుద్ధదేశంబుడంబునన్ = రామరావణులయొక్క యుద్ధప్రదేశమువలె; చటులహరిపటలరటనాఘటితంబై = చంచలములగు అశ్వసమూహముల ధ్వనితోఁగూడినదై, వానరసేనయొక్క యార్భటు లతోఁ గూడినదై; హరపురాసురసమరాస్థానంబుపోలికన్ = ఈశ్వరత్రిపురాసురుల యుద్ధభూమివలె; అనంతకలంబవిజృం భణగుంభితంబై – అనంతకలంబ = విష్ణురూపమగు బాణముయొక్క, బహుబాణములయొక్క,విజృంభణగుంభితంబై = అతిశయముతోఁ గూడుకొన్నదై; కుమారతారకాస్కందనతలంబుచందంబునన్ = కుమారతారకాసురలయొక్క రణభూమి వలె; అభేద్యశక్తిసంయుతంబై = భేదింప నలవిగాని శక్తియను నాయుధముతోఁ గూడినదై, అభేద్యమైన సామర్థ్యముతోఁ గూడిన దై; కౌరవపాండవసంగ్రామాంగణంబుచెలువునన్ = కౌరవపాండవుల యుద్ధభూమివలె; చక్రికేతనవిదారణచణభీమగదాక్రియా సముపేతంబై – చక్రికేతన=సర్పకేతనుఁడగు దుర్యోధనునియొక్క, విదారణ=భేదనమందు, చణ=సమర్థమైన, భీమ=భీముని యొక్క, గదాక్రియా =గదావిహారముతోడ, సముపేతంబై=కూడినదై; చక్రికేతన=రథపతాకలయొక్క, విదారణ=భేదన మందు, చణ=సమర్థమైన,భీమ= భయంకరమైన,గదాక్రియా =గదావిహారముతోడ, సముపేతంబై=కూడినదై, అనియర్థాంత రము; అమ్మహాసంగరరంగంబు = ఆమహాయుద్ధరంగము;వినుతికెక్కెన్=వాసికెక్కెను; అయ్యవసరంబునన్= ఆసమయ మున, దీని కుత్తరపద్యముతోడ సంబంధము.
చ. చకితనిశాటమై, పతిత◊సాదిజనంబయి, సుప్తయంతృజా
లకమయి, భిన్నకుంజరకు◊లంబయి, లూనరథంబునై, తద
ర్కకులనృపాలశక్తి నిల ◊వ్రాలిన యాత్మబలంబుఁ గాంచి, పా
యక మను రోషరేఖ యెడ◊నంది తమిస్రసురారి యత్తఱిన్. 121
టీక: చకితనిశాటమై = భయపడుచున్న రాక్షసులు గలదై; పతితసాదిజనంబయి = పడిన యశ్వారోహకులగుంపుగలదై; సుప్తయంతృజాలకమయి = నిద్రించిన సారథులగుంపు గలదై; భిన్నకుంజరకులంబయి = బ్రద్దలుచేయఁబడిన గజసంఘము గలదై; లూనరథంబునై = ఛిన్నములైన రథములు గలదై; తదర్కకులనృపాలశక్తిన్ = సూర్యవంశీయుఁడైన యారాజుయొక్క సామర్థ్యముచేత; ఇలన్=భూమియందు; వ్రాలిన =పడినట్టి; ఆత్మబలంబున్=తనసైన్యమును;కాంచి=చూచి; పాయక =వీడక; మను రోషరేఖ = వృద్ధిఁబొందుచున్నక్రోధపరంపరను; ఎడన్=మనస్సునందు; అంది = పొంది; తమిస్రసురారి = తమిస్రాసు రుఁడు; అత్తఱిన్=ఆసమయమందు. దీని కుత్తరపద్యముతో నన్వయము.
మహాస్రగ్ధర. వరకోదండప్రకాండో◊జ్జ్వలగుణనినద◊వ్రాతసాహాయ్యవద్దు
స్తరకంఠక్రోధనృత్య◊త్కహకహరవముల్ ◊తన్నృపానీకినీభీ
కరలీలన్ దోఁపఁ బ్రోత్థో◊త్కటరుడరుణితే◊క్షావిధిం దత్త్రియామా
చరుఁ డక్షీంద్రంబు భూమీ◊శరథము నెదుటం ◊జక్కఁ బోనిచ్చి యంతన్. 121
టీక: వరకోదండప్రకాండోజ్జ్వలగుణనినదవ్రాతసాహాయ్యవద్దుస్తరకంఠక్రోధనృత్యత్కహకహరావముల్ – వర=శ్రేష్ఠమగు, కోదండప్రకాండ=ప్రశస్తమగు చాపమందు, ఉజ్జ్వల=ప్రకాశించుచున్న, గుణ=అల్లెత్రాటియొక్క, నినదవ్రాత=ధ్వనిసంఘము యొక్క, సాహాయ్యవత్=సాహాయ్యయుక్తమగు, దుస్తరకంఠ=గహనమయిన కంఠమందు,క్రోధనృత్యత్=కోపముచే నాట్య మొనరించుచున్న, కహకహరవముల్= కహకహయను ధ్వనులు; తన్నృపానీకినీభీకరలీలన్ = ఆరాజుసైన్యమునకు భయం కరమగు రీతిచే; తోఁపన్ = తోఁచుచుండఁగా; ప్రోత్థోత్కటరుడరుణితేక్షావిధిన్ – ప్రోత్థ=ఉదయించిన, ఉత్కట=అధికమైన, రుట్= రోషముచేత, అరుణిత=ఎఱ్ఱగాఁజేయఁబడిన, ఈక్షావిధిన్ = దృగ్రీతిచేత; తత్=ఆయొక్క, త్రియామాచరుఁడు=తమి స్రాసురుఁడు; అక్షీంద్రంబు = రథశ్రేష్ఠమును; భూమీశరథము నెదుటన్ = సుచంద్రునిరథము ముందుగా; చక్కన్ పోనిచ్చి = సూటిగాఁ బోవునట్లు చేసి; అంతన్ = ఆమీఁదట, దీనికి ముందఱిపద్యముతో నన్వయము. ‘స్తతనస్రాగ ల్విరించాష్టవిరతులు మహాస్రగ్ధరం జెప్ప నొప్పున్’ అని మహాస్రగ్ధరలక్షణము.
క. వలయితచాపజ్యాసం,స్థలి రోపత్రితయిఁ గూర్చి ◊జనపతియెద నే
ర్పలవడ నాటించి మహీ,వలయాధిపుఁ గాంచి యసుర◊వరుఁ డిట్లనియెన్. 123
టీక: వలయితచాపజ్యాసంస్థలిన్ – వలయిత=వలయాకారముగాఁ జేయఁబడిన, చాప=ధనుస్సుయొక్క, జ్యాసంస్థలిన్ = అల్లెత్రాటియందు; రోపత్రితయిన్=బాణత్రయమును; కూర్చి = సంధించి; జనపతియెదన్ = సుచంద్రునివక్షమందు; నేర్పు అలవడన్ = నేర్పుమీఱునట్లు; నాటించి = నాటుకొనునట్లు చేసి; మహీవలయాధిపున్=సుచంద్రుని; కాంచి =చూచి; అసుర వరుఁడు = రాక్షసశ్రేష్ఠుఁడు; ఇట్లనియెన్= వక్ష్యమాణప్రకారముగాఁ బలికెను.
మ. మతి నొక్కింత విచార మూన కురుసం◊పద్గర్వరేఖ న్మహా
దితిజాధీశవిరోధ మంది యిటు లే◊తేర న్మనం బుంతురే
రతి ధాత్రిన్ మనఁ గల్గినన్ జనుము మ◊ద్రాజద్భుజాదండమం
డితకోదండవినిర్వమద్విశిఖముల్ ◊నిం గాఁడ విప్పట్టునన్. 124
టీక: మతిన్=బుద్ధియందు;ఒక్కింత = అల్పమయినను;విచారము=ఆలోచనమును; ఊనక=వహింపక; ఉరుసంపద్గర్వరేఖన్ = అధికమగు నైశ్వర్యమదపరంపరచేత; మహాదితిజాధీశవిరోధము = గొప్పరాక్షసప్రభువైన నాతో వైరమును; అంది = పొంది; ఇటులు ఏతేరన్=ఇట్లు వచ్చుటకు; మనంబు ఉంతురే = మనస్సు నుంచుదురా? ధాత్రిన్=భూమియందు; మనన్=బ్రతుకుటకు; రతి = కోరిక; కల్గినన్ = ఉన్నయెడల; చనుము = పొమ్ము; మద్రాజద్భుజాదండమండితకోదండవినిర్వమద్విశిఖముల్ – మత్ = నాయొక్క, రాజత్=ప్రకాశించుచున్న, భుజాదండ=బాహుదండములచేత, మండిత=అలంకరింపఁబడిన, కోదండ=ధనువు వలన,వినిర్వమత్=వెడలుచున్న,విశిఖముల్=అమ్ములు; నిన్=నిన్ను; ఇప్పట్టునన్=ఈసమయమున; కాఁడవు=బాధింపవు.
మ. మునివాక్యంబున మోసపోయితివి త◊న్మూలంబుగాఁ జుమ్ము నీ
కెనసెన్ గాలము మద్రణేహ గనువాఁ◊డెవ్వాఁడిలన్ మించెఁ జొ
చ్చెనొ నీవీనుల లేదొ భూమివర యా◊జిప్రాప్తదేవేశకృం
తనసంలోలమదాశయాన్యవిధికృ◊ద్ధాత్రుక్తమిత్త్రోక్తికల్. 125
టీక: మునివాక్యంబునన్=శాండిల్యమునివచనముచే; మోసపోయితివి = వంచితుఁడవైతివి; తన్మూలంబుగాఁ జుమ్ము = అతని మూలముగా సుమీ; నీకున్; కాలము = నాశకాలము; ఎనసెన్ =ఘటిల్లెను; మద్రణేహ గనువాఁడు = నాతో యుద్ధము జేయు నిచ్ఛగలవాఁడు; ఎవ్వాఁడు=ఎవఁడు; ఇలన్=భూమియందు; మించెన్=అతిశయించెను? భూమివర = ఓ మహీపతీ! ఆజిప్రాప్తదేవేశకృంతనసంలోలమదాశయాన్యవిధికృద్ధాత్రుక్తమిత్త్రోక్తికల్ – ఆజిప్రాప్త = యుద్ధమును బొందిన, దేవేశ=ఇంద్రుని యొక్క, కృంతన=సంహారమందు, సంలోల=మిక్కిలిఆసక్తుఁడనగు, మత్=నాయొక్క, ఆశయ=అభిప్రాయమునకు, అన్య విధికృత్= మఱియొకప్రకారముఁ జేయుచున్న, ధాత్రుక్త = బ్రహ్మదేవునిచేఁ బలుకఁబడిన, మిత్త్రోక్తికల్=సాంత్వనములు; నీ వీనులన్= నీశ్రోత్రములను; చొచ్చెనొ లేదొ = ప్రవేశించెనో లేదో? అనఁగా నొకపుడు దేవేంద్రుఁడు యుద్ధమునకు వచ్చియుండఁగా నతని సంహరింప నుద్యమించిన నేను బ్రహ్మ బతిమాలఁ గాఁ జంపక వదలినవాఁడ. ఈవృత్తాంతము నీచెవి సోఁకినదో లేదో అనుట. ఇట్లు చెప్పుటం జేసి సర్వాతిశాయిసామర్థ్యము గల వాఁడని గర్వము ధ్వనిత మగును.
సీ. లలనాళిగీతక◊ల్యాణగీతిక గాదు, చెవి యాన ఘనసింహ◊రవము గాని,
సరసకేళీచంద్ర◊శాలికావళి గాదు, విహరింప సంగ్రామ◊వీథి గాని,
బంధురకర్పూర◊గంధచర్చిక గాదు, మే నూన మొనముల్కి◊సోన గాని,
సేవాపరాప్తధా◊త్రీవరౌఘము గాదు, తిలకింప దనుజేంద్ర◊బలము గాని,
తే. గురుహితజనావృతవిహార◊ఖురళి గాదు, శరగరిమఁ జోప శాత్రవాం◊తరము గాని,
తరము గాదిట్లు రణ మూనఁ ◊దరణికులజ, తఱిమి వధియింతు నీవేళఁ ◊దలఁగి చనుము. 126
టీక: తరణికులజ = సూర్యవంశజుఁడవైన సుచంద్రుఁడా! చెవి యానన్ = శ్రోత్రపానము చేయుటకు, సుఖాకర్ణనమున కనుట; ఘనసింహరవము గాని = (ఇది) గొప్పసింహనాదము గాని; లలనాళిగీత =స్త్రీబృందముచే గానముచేయఁబడిన;కల్యాణగీతిక = శుభగీతము; కాదు. విహరింపన్=క్రీడించుటకు; సంగ్రామవీథి గాని = (ఇది) రణరంగముగాని; సరసకేళీచంద్రశాలికావళి – సరస=శ్రేష్ఠమగు, కేళీ చంద్రశాలికా = క్రీడాసౌధవిశేషములయొక్క, ఆవళి =పంక్తి; కాదు. మేనూనన్ = శరీరమందూనుటకు; మొనముల్కిసోన గాని = (ఇది) తీక్ష్ణాగ్రములగు బాణములవృష్టిగాని; బంధురకర్పూర గంధ చర్చిక – బంధుర=దట్టమగు, కర్పూరగంధ = కర్పూరగంధముయొక్క, చర్చిక =లేపనము; కాదు. తిలకింపన్ =వీక్షించుటకు; దనుజేంద్రబలము గాని = (ఇది)రాక్షసేశ్వరసైన్యముగాని; సేవాపరాప్తధాత్రీవరౌఘము – సేవాపరాప్త = కొలుచుటకై వచ్చినట్టి ప్రియులైన, ధాత్రీవర=రాజులయొక్క, ఓఘము =సంఘము; కాదు. శరగరిమన్ = బాణగరిమచే; చోపన్=తఱుముటకు; శాత్రవాంతరము గాని = (ఇది) శత్రుమధ్యముగాని; గురుహితజనావృత విహారఖురళి – గురు=అధికులగు, హితజన=మిత్త్రజనులచేత, ఆవృత=వ్యాప్తమైన, విహారఖురళి =క్రీడార్థమైనగరిడి; కాదు; ఇట్లు=ఈవిధముగా; రణ మూనన్=యుద్ధముసేయుటకు; తరము గాదు = శక్యము గాదు; ఈవేళన్ = ఈక్షణమందు; తఱిమి వధియింతున్ = బలాత్క రించి పరిమార్తును; తలఁగి =యుద్ధమునుండి తొలఁగి; చనుము = పొమ్ము.
త్వరితగతి. అనియసురకులరమణుఁ ◊డరుణతరవీక్షా
జనితరుడనలకణవి◊సర మరిమనోభీ
జనక మయి పొదల శిత◊శరచయముచేఁ ద
ద్వనజహితజననపతిఁ ◊ద్వరితగతిఁ గప్పెన్. 127
టీక: అని = ఈప్రకారముగాఁ బలికి; అసురకులరమణుఁడు = దనుజేశ్వరుఁడైన తమిస్రుఁడు; అరుణతరవీక్షాజనితరుడనలకణ విసరము – అరుణతర = మిక్కిలి యెఱ్ఱనగు, వీక్షా=చూపులచేత, జనిత=పుట్టింపఁబడిన, రుడనల = రోషాగ్నియొక్క, కణ విసరము = లేశములగుంపు; అరిమనోభీజనకమయి = శత్రుహృదయములకు భయజనకమై; పొదలన్=ఒప్పఁగా; శితశర చయముచేన్ = తీక్ష్ణబాణపరంపరచేత; తద్వనజహితజననపతిన్=ఆసూర్యవంశజుఁడైన రాజును, ‘సంతతి ర్గోత్ర జనన కులాని’ అని యమరుఁడు; త్వరితగతిన్ =శీఘ్రగతిచేత; కప్పెన్ = ఆవరించెను.
ఆరాజుపైఁ గఱకుటమ్ములగుంపులు గురిపించెనని తాత్పర్యము. ఇందు వృత్తనామమయిన త్వరితగతిశబ్దము ప్రకృతార్థ పరముగ నిమిడించుటచే ‘నితమ్బ గుర్వీ తరుణీ దృగ్యుగ్మవిపులా చ సా’ ఇత్యాదిస్థలములయందువలె ముద్రాలంకారము. ‘సూచ్యార్థసూచనం ముద్రా ప్రకృతార్థపరైః పదైః’ అని తల్లక్షణంబు. త్వరితగతివృత్తలక్షణము. ‘అదనదనున హరినుతు ◊లమర ధర బాలా|శదళమనఁ దనరుఁ గవి◊జనులు వచియింపన్| బదునొకటగు నెడ యతి ◊పదిలముగఁ జేరన్| గదియు నగ ణము లయిదు ◊గగము తుద నొందన్’ అని యప్పకవీయమునఁ జెప్పఁబడియె. త్వరితగతికి పాలాశదళమని నామాంతర మని యందె వచింపఁబడియె.
చ. తెఱలనిశక్తి నప్పొలసు◊దిండికొలంబులమేటి యిట్టు ల
త్తఱి విశిఖాళిఁ గప్ప వసు◊ధాపతి దట్టపుమంచుపిండు బల్
కఱకఱిమించులం దునుము◊కంజహితుం డన వాఁడితూపులన్
మఱలఁగఁ జేసి యాదనుజ◊నాథుఁ గుఱించి మృదూక్తి నిట్లనున్. 128
టీక: అప్పొలసుదిండికొలంబులమేటి =ఆరాక్షసకులాధిపతి; తెఱలనిశక్తిన్=తొలఁగని సామర్థ్యముచేత; ఇట్టులు=ఈరీతిగ; అత్తఱిన్=అప్పుడు; విశిఖాళిన్=బాణపరంపరచే; కప్పన్=ఆవరింపఁగా; వసుధాపతి = సుచంద్రుఁడు;దట్టపుమంచుపిండున్= నిబిడహిమకదంబమును;బల్ కఱకఱిమించులన్=అధికమైన కఠినమైన తేజస్సులచేత;తునుముకంజహితుండనన్=ఖండించు సూర్యుండో యనునట్లు; వాఁడితూపులన్=కఱకుబాణములచేత; మఱలఁగఁ జేసి =మఱలునట్లు చేసి; ఆదనుజనాథుఁగుఱించి = ఆరాక్షసేశ్వరునిగూర్చి; మృదూక్తిన్=మృదువైన వాక్కులచేత; ఇట్లనున్=వక్ష్యమాణప్రకారముగఁ బలుకును.
చ. అలఘురణోర్విఁ జేరి యసు◊రాధిప యీగతి వట్టిపల్కుచాల్
పలుకుట వీరధర్మమె న◊భస్స్థలి నిర్జరు లెల్లఁ జూడ నీ
చలము బలంబు శస్త్రకుల◊చాతురిఁ జూపుము చూచి యంతటన్
బ్రలయకృశానుహేతిసమ◊బాణపరంపరఁ గూల్తు గ్రక్కునన్. 129
టీక: అసురాధిప =రాక్షసాధిపతీ! అలఘురణోర్విన్=అధికమయిన యుద్ధభూమిని; చేరి =పొంది; ఈగతిన్=ఈతీరున; వట్టి పల్కుచాల్=వ్యర్థవాక్పరంపరను; పలుకుట = చెప్పుట; వీరధర్మమె=వీరులపాడియా? నభస్స్థలిన్=ఆకసమునందు; నిర్జరు లెల్లన్ = దేవతలెల్లను; చూడన్=అవలోకింపఁగా; నీచలమున్=నీమాత్సర్యమును; బలంబున్=సామర్థ్యమును; శస్త్రకుల=బాణ పుంజమునందలి; చాతురిన్ = నేర్పును; చూపుము =కనఁబఱపుము; చూచి=అవలోకించి; అంతటన్=అటుతరువాత; ప్రలయ కృశానుహేతిసమబాణపరంపరన్=ప్రళయకాలానలజ్వాలాతుల్యమగు బాణసంఘముచేత; గ్రక్కునన్=వేగముగా; కూల్తున్ =చంపుదును.
తే. ఈయెడఁ దమిస్ర నీదర్ప◊మెల్లఁ గూల్చి, యరిభయదలీలఁ దనరు దీ◊వ్యత్సుచంద్ర
శైత్యవత్కరకాండముల్ ◊చక్కఁ గాంచి, త్రిదశబృందంబు లానంద◊రేఖఁ జెందు. 130
టీక: తమిస్ర =ఓతమిస్రాసురుఁడా! అంధకారమా యని యర్థాంతరము దోఁచుచున్నది; ఈయెడన్=ఇపుడు; నీదర్పమెల్లన్ = నీయహంకారమంతయు; కూల్చి=పడవైచి; అరిభయదలీలన్ = శత్రువులకు వెఱపుగొలుపునట్లుగా, జక్కవలకు భయప్రద మగు నట్లుగా నని యర్థాంతరము; తనరు = ఒప్పుచున్న; దీవ్యత్సుచంద్రశైత్యవత్కరకాండముల్ – దీవ్యత్=ప్రకాశించుచున్న, సుచంద్ర=సుచంద్రునియొక్క, శైత్యవత్=వాఁడిగల, తీక్ష్ణవాచకమయిన శితశబ్దముమీఁద శైత్యశబ్దమయినది, కరకాండముల్ = హస్తమందుండిన బాణములను; సుచంద్ర=మంచిశీతాంశువుయొక్క, శైత్యవత్=చలువగల, కరకాండముల్=కిరణజాలము లను; చక్కన్ =బాగుగా; కాంచి=చూచి; త్రిదశబృందంబులు=దేవసంఘములు; ఆనందరేఖన్=ఆనందపరంపరను; చెందున్ =పొందును.
ఇచటఁ బ్రస్తుతాప్రస్తుతముల కౌపమ్యము గమ్యము గాన నంధకారదర్పమడంచి, చక్రవాకభయంకరము లగుచు చంద్ర కిరణములు దేవతాబృందము నానందింపఁజేయునట్లు, నాతీక్ష్ణబాణపరంపర నీదర్ప మడంచి శత్రుభయంకరమై దేవతాగణము నానందింపఁజేయు నని భావము.
చ. యతుల వధించి తత్కృతస◊వాళి హరించి ధరిత్రి ధార్ష్ట్యసం
గతిఁ దగునీవు నాయెదురు◊కట్టున నిల్చితిగా నిశాట త
త్కృతికి ఫలంబు నీ వెనయ ◊నిత్తఱిఁ దార్చెద మద్భుజోగ్రధ
న్వతరుణభోగివాంతవిష◊వహ్నిసమానకలంబధారచేన్. 131
టీక: నిశాట =రాక్షసుఁడా! యతులన్=మునులను; వధించి =హింసించి; తత్కృతసవాళిన్=వారిచే నాచరింపఁబడిన యజ్ఞ సంఘములను; హరించి =చెఱపి; ధరిత్రిన్=భూమియందు; ధార్ష్ట్యసంగతిన్ – ధార్ష్ట్య=గడుసుఁదనముయొక్క, సంగతిన్ = సంబంధముచేత; తగు నీవు = ఒప్పుచున్న నీవు; నాయెదురుకట్టున నిల్చితిగా = నాసమ్ముఖమున నిల్చితివి గదా! తత్కృతికిన్ = ఆచర్యకు; ఫలంబున్=లాభమును; నీ వెనయన్ =నీవు పొందునట్లు; ఇత్తఱిన్=ఈసమయమున; మద్భుజోగ్రధన్వతరుణ భోగివాంతవిషవహ్నిసమానకలంబధారచేన్ – మత్=నాయొక్క, భుజ=బాహువులయందున్న, ఉగ్రధన్వతరుణభోగి = కోడె నాగుఁబామువంటి భయంకరమగు ధనుస్సుచేత, వాంత=క్రక్కఁబడిన, విషవహ్ని=విషాగ్నితోడ, సమాన=సాటియయిన, కలంబధారచేన్=బాణపరంపరలచేత; తార్చెదన్=చేసెదను.
మాలిని. అని మనుజకులేంద్రుం◊ డయ్యెడన్ భూరిబాణా
సన మెనసి శరాళిన్ ◊జాల దైత్యేంద్రు నొంచెన్
ఘనము నగముపై ని◊ష్ఖండవార్ధారచే నా
ఘనగుణరుతి గర్జా◊గౌరవం బూని మించన్. 132
టీక: అని = ఇట్లు వచించి; మనుజకులేంద్రుండు=జనపతి; ఘనగుణరుతి=గొప్పనగు అల్లెత్రాటి ధ్వని; గర్జాగౌరవంబు=మేఘ ధ్వనియొక్క అతిశయమును; ఊని=వహించి; మించన్=అతిశయింపఁగా; ఘనము =మేఘము;నగముపైన్=వృక్షముపై; నిష్ఖండ=అఖండమగు; వార్ధారచే నాన్=వారిధారచేత నన్నట్లు; అయ్యెడన్=ఆసమయమున; భూరిబాణాసనము=గొప్ప వింటిని; ఎనసి=పొంది; శరాళిన్ = బాణపరంపరలచేత; చాలన్=మిక్కిలి; దైత్యేంద్రున్=రాక్షసాధిపతిని; నొంచెన్=నొప్పిం చెను. ‘మనసిజగురునెంతున్ మాలినీవృత్తమందున్, ననమయయగణంబుల్ నందవిశ్రాంతి గూడన్’ అని మాలినీలక్షణము.
చ. జనపతి వైచినట్టి శిత◊సాయకముల్ నిజసాయకచ్ఛటన్
దునియఁగఁ జేసి దైత్యపతి ◊తోడనె యమ్ములు కొన్ని గూర్చి వై
చినఁ గడుఁ జూర్ణతన్ గగన◊సీమను గప్పఁగ నాత్మబాణవ
ర్తన నెనయించెఁ జూచునజ◊రప్రకరంబులు కేలఁ బాపఁగన్. 133
టీక: దైత్యపతి =తమిస్రుఁడు; వైచినట్టి శితసాయకముల్= రాజు ప్రయోగించినట్టి తీక్ష్ణమైన బాణములను; నిజసాయకచ్ఛటన్ = తనబాణపరంపరలచేత; తునియఁగన్ చేసి =తునియునట్లు చేసి; తోడనె = వెంటనే; అమ్ములు కొన్ని గూర్చి = కొన్నిబాణము లను సంధించి; వైచినన్=ప్రయోగింపఁగా; జనపతి =సుచంద్రుఁడు; ఆత్మబాణవర్తనన్=తనబాణవ్యాపారముచేత; చూచునజర ప్రకరంబులు=అవలోకించుచున్న దేవసంఘములు; కేలన్=హస్తములచేత; పాపఁగన్=తొలఁగఁజేయునట్లు; కడున్ చూర్ణతన్ = మిగుల చూర్ణత్వముచేత; గగనసీమను=ఆకాశప్రదేశమును; కప్పఁగన్=ఆచ్ఛాదించునట్లు; ఎనయించెన్=పొందించెను.
అనఁగా సుచంద్రుఁడు తన నిశితసాయకములను దైత్యేంద్రుఁడు తునియలుచేసి కొన్ని బాణములు ప్రయోగింపఁగా వానిని నిజసాయకములచే చూర్ణమై గగనసీమకు వ్యాపించునట్లు చేసెననియు, అందు రణావలోకనమునకై ఏతెంచిన దేవసంఘములు ఆచూర్ణము తమకడ్డము గాఁగా హస్తములచేతఁ దొలఁగించుకొని రనియు భావము.
చ. అలపతి వైచు బాణముల ◊నాదనుజేశుఁడు, వాఁడు వైచు న
మ్ముల హరిభేది తున్ముచు, న◊పూర్వరణం బొనరించి రయ్యెడన్
తలఁకక విల్లునన్ ఖగవి◊తానము గూర్చుట వాని వైచుటల్
దెలియఁగ నోప కెంతయు మ◊తిన్ సురసంతతి సన్నుతింపఁగన్. 134
టీక: అలపతి వైచు బాణములన్= ఆరాజు ప్రయోగించు తూపులను; ఆదనుజేశుఁడు = ఆతమిస్రాసురుఁడు; వాఁడు వైచు అమ్ములన్ = ఆదనుజేశుఁడు ప్రయోగించుబాణములను; హరిభేది = సుచంద్రుఁడు, కుముదుఁడనువాఁడు శాపవశమున హరి, అనఁగా సింహరూపమునొందియుండఁగా వాని సింహశరీరమును భేదించినవాఁడు గావున హరిభేది యనఁబడియె; తున్ముచున్ = ఖండించుచు; అయ్యెడన్=ఆసమయమున; తలఁకక = భయపడక; విల్లునన్ = ధనువునందు; ఖగవితానము= బాణసంఘ మును, ‘ఖగస్సూర్యేషు పక్షిషు’ అని రత్నమాల; కూర్చుట=సంధించుటను; వాని వైచుటల్=వానిం బ్రయోగించుటలను; సుర సంతతి = దేవసంఘము; ఎంతయున్=మిక్కిలి; తెలియఁగ నోపక=తెలియఁజాలక; మతిన్=చిత్తమునందు; సన్నుతింపఁగన్ = కొనియాడఁగ; అపూర్వరణంబు= లోకోత్తరయుద్ధమును; ఒనరించిరి=సల్పిరి.
ప్రహరణకలితము. అభినవధృతి లో◊నడరఁగఁ బలభు
గ్విభుఁ డరిబలముల్ ◊వెడలి నడవఁగన్
స్వభటనికర మెం◊చఁగఁ జటులగదన్
ప్రభుకులమణిపైఁ ◊బఱపెను వడిగన్. 135
టీక: అభినవధృతి = నూతనధైర్యము; లోన్=మనస్సునందు; అడరఁగన్=ఒప్పుచుండఁగా; పలభుగ్విభుఁడు=రాక్షసరాజు; అరిబలముల్ = శత్రుసైన్యములు; వెడలి నడవఁగన్= రణమునుండి భీతులై పాఱఁగా; స్వభటనికరము=తనసైన్యము; ఎంచఁ గన్=ప్రశంసింపఁగా; చటులగదన్=చంచలమైన గదాయుధమును; ప్రభుకులమణిపైన్= రాజేంద్రునిపై; వడిగన్=వేగముగా; పఱపెను = ప్రయోగించెను. ‘పనిగొను నెపుడున్◊బ్రహరణకలితన్, ననభనవలు మం◊దగజవిరమమున్’ అని ప్రహరణకలిత వృత్తలక్షణము.
పంచచామరము. సురారిరాజు మీఁద వైచు◊శూరహర్షమార్గదన్
స్థిరధ్వనిప్రభావదీర్ణ◊దిక్పదన్ మహాగదన్
ధరావరాగ్రయాయి ఖడ్గ◊ధారఁ ద్రుంచె నుర్వరా
ధరోరుకూట ముగ్రవజ్ర◊ధార నింద్రుఁడో యనన్. 136
టీక: సురారిరాజు =రాక్షసేశ్వరుఁడు; మీఁదన్=మీఁదికి; వైచు శూరహర్షమార్గదన్ = ప్రయోగించునదియు, శూరుల హర్ష మార్గము ఖండించునదియు; స్థిరధ్వనిప్రభావదీర్ణదిక్పదన్= స్థిరమగు ధ్వనియొక్క మహిమచేత బ్రద్దలుచేయఁబడిన దిక్తట ములు గలదియు నగు; మహాగదన్ = గొప్పదగు గదాయుధమును; ధరావరాగ్రయాయి =రాజేంద్రుఁడు; ఉర్వరాధరోరు కూటము = పర్వతసమూహమును; ఉగ్రవజ్రధారన్=కఠినమైన వజ్రాయుధముయొక్క అంచుచేత; ఇంద్రుఁడోయనన్ =సురే శ్వరుఁడో యనునట్లు; ఖడ్గధారన్=ఖడ్గముయొక్క అంచుచేత; త్రుంచెన్ = ఖండించెను. ‘జరజ్రజంబులున్ గముం బొ◊సంగి తొమ్మిదింటిపై, విరామ మొంది’ యని పంచచామరవృత్తలక్షణము.
మ. గద యీలీల నృపాసిధార ధరఁ ద్రుం◊గం దీవ్రరోషం బెదన్
గదురం దానవమాయచే నసురలో◊కస్వామి యవ్వేళ వై
రిదరాపాది మహాసురాస్త్రము ధరి◊త్రీభర్తపై వైచె స
త్పదవిన్ జూచు సురాళి కన్నులకు ని◊ద్రాముద్ర చేకూడఁగన్. 137
టీక: ఈలీలన్=ఈతీరుగ; నృపాసిధారన్=రాజుయొక్క ఖడ్గముయొక్క అంచుచేత; గద =తనగదాయుధము; ధరన్= భూమియందు; త్రుంగన్= తునియలు కాఁగా; తీవ్రరోషంబు = అధికమైనకోపము; ఎదన్=హృదయమందు; కదురన్=కల్గగా; అసురలోకస్వామి=రాక్షసేశ్వరుఁడు; దానవమాయచేన్=రాక్షసమాయచేత; అవ్వేళన్=అపుడు; వైరిదరాపాది మహాసురా స్త్రము = శత్రుభయప్రదమగు గొప్ప యాసురాస్త్రమును; సత్పదవిన్ = నక్షత్రపదవి యగు నాకాశమందు; చూచు సురాళి కన్ను లకు = చూచునట్టి దేవబృందముయొక్క నేత్రములకు; నిద్రాముద్ర =ముకుళీభావ మనుట; చేకూడఁగన్=కల్గునట్లు; ధరిత్రీభర్త పైన్ =రాజుమీఁద; వైచెన్= ప్రయోగించెను.
శిఖరిణి. ఖరాస్యాస్త్రంబుల్ ఘూ◊కముఖశరముల్ ◊కాకవదన
స్ఫురద్బాణంబుల్ త◊న్బొదివికొని రా ◊భూరిపరిఘ
క్షురప్రాసిశ్రేణిన్ ◊గురియుచు వెఱం◊గూల నజరుల్
త్వరన్ దద్దైతేయా◊స్త్రము నడచెఁ ద◊త్సైన్య మలరన్. 138
టీక: ఖరాస్యాస్త్రంబుల్=ఖరముఖబాణములు; ఘూకముఖశరముల్ =ఘూకముఖములు గలిగిన బాణములు; కాకవదన స్ఫురద్బాణంబుల్ = కాకముఖములచేఁ బ్రకాశించుచున్న బాణములు; తన్ = తనను, ఆసురాస్త్రము ననుట; పొదివికొని రాన్ = కప్పికొని రాఁగా; భూరిపరిఘక్షురప్రాసిశ్రేణిన్= అధికములైన పరిఘలయొక్కయు, చురకత్తుల యొక్కయు, ఖడ్గముల యొక్కయు గుంపులను; కురియుచున్=వర్షించుచు; అజరుల్=దేవతలు; వెఱన్=భయముచేత; కూలన్=దిగులొందునట్లుగ; త్వరన్ =వేగముచేత; తత్సైన్యము=వానిసైన్యము; అలరన్=సంతోషింపఁగా; తద్దైతేయాస్త్రము=ఆయాసురాస్త్రము; నడచెన్ = వెడలెను. ‘ద్విజశ్రేష్ఠుల్ మెచ్చ న్యమనసభవల్ విశ్వవిరతి ప్రజాతాహ్లాదంబై శిఖరిణి యనా భాసురమగున్’ అని శిఖరిణీవృత్త లక్షణము. ఇట నప్పకవి యొకచోటనే విశ్రమముఁ జెప్పినను ఈకవి విశ్రమద్వయమునుఁ బొందుపఱచెను.
మందాక్రాంత. ఉర్వీశస్వామి ఘనమతితో ◊నుగ్రకీలాళి పైపైఁ
బర్వన్ రాఁ జూచి వెఱఁగు మదిన్ ◊బాయకెచ్చన్ దదీయా
ఖర్వప్రస్ఫూర్తి నడఁచుతమిం ◊గాంచి దోశ్శక్తిమై గాం
ధర్వాస్త్రం బప్డు మహిపతి సం◊తానముల్ మెచ్చవైచెన్. 139
టీక: ఉర్వీశస్వామి=సుచంద్రుఁడు; ఘనమతితోన్=గొప్పబుద్ధితో; ఉగ్రకీలాళి=భయంకరమగు నగ్నిజ్వాలాపరంపర; పైపైన్ పర్వన్ రాన్ = మీఁదికిఁ బ్రసరించుటకు రాఁగా; చూచి; వెఱఁగు =ఆశ్చర్యము; మదిన్ పాయక ఎచ్చన్ = మనస్సులో విడువక యధికము కాఁగా; తదీయాఖర్వప్రస్ఫూర్తిన్=వాని యతిశయస్ఫూర్తిని; అడఁచుతమిం గాంచి=శమింపఁజేయు కోర్కిఁ బూని; దోశ్శక్తిమైన్ = బాహుశక్తిచేత; అప్డు=ఆసమయమున; మహిపతి సంతానముల్=రాజబృందములు; మెచ్చన్ = కొనియాడు నట్లుగా; గాంధర్వాస్త్రంబు=గాంధర్వాస్త్రమును; వైచెన్=ప్రయోగించెను. ‘మందాక్రాంత న్గిరిశవిరతు ల్మభ్నతాగాగణంబుల్ పొందెన్’ అని మందాక్రాంతావృత్తలక్షణము నప్పకవి చెప్పె.
భుజంగప్రయాతము. ఖరాంశుచ్ఛటన్ వహ్ని◊కాండంబులన్ శీ
తరుక్పాళిని న్మించి ◊ధాత్రీనభంబుల్
స్వరోచిం బ్రకాశింప ◊క్ష్మానాయకాస్త్రం
బిరం దానవాస్త్రీయ◊వృత్తిన్ హరించెన్. 140
టీక: ఖరాంశుచ్ఛటన్ = సూర్యపరంపరను; వహ్నికాండంబులన్=అగ్నిపరంపరను; శీతరుక్పాళినిన్=చంద్రపరంపరను; మించి = అతిశయించి; ధాత్రీనభంబుల్ = భూమ్యంతరిక్షములు; స్వరోచిన్=తనకాంతిచేత; ప్రకాశింపన్=విలసిల్లఁగా; క్ష్మానా యకాస్త్రంబు = రాజుయొక్క బాణము; ఇరన్=భూమియందు; దానవాస్త్రీయవృత్తిన్ = రాక్షసబాణసంబంధివ్యాపారమును; హరించెన్ = శమింపఁజేసెను. ‘భుజంగప్రయాతాఖ్యము ల్నాల్గుయాలన్ గజవ్రాతవిశ్రాంతిగాఁ జెప్ప నొప్పున్’ అని భుజంగ ప్రయాతవృత్తలక్షణము.
తే. ఇట్లు తనయస్త్రసామర్థ్య ◊మెల్లఁ దూల, నౌడు కఱచుచు హుమ్మని ◊యాగ్రహమున
మీసములు నిక్క నపుడు త◊మీచరుండు, శక్తి నృపు వైచె నిజమంత్ర◊శక్తి గరిమ. 141
టీక: తమీచరుండు = రాక్షసుఁడు; ఇట్లు=ఈప్రకారముగా; తనయస్త్రసామర్థ్యమెల్లన్ = తనయాసురాస్త్రసామర్థ్యమంతయు; తూలన్=తొలఁగిపోవఁగా; ఔడు కఱచుచున్ = పెదవికఱచుచు; హుమ్మని =హుంకారము చేసి; ఆగ్రహమునన్=కోపముచేత; మీసములు = శ్మశ్రువులు; నిక్కన్=నిగుడఁగా; అపుడు=ఆసమయమున; నిజమంత్రశక్తిగరిమన్=తనమంత్రసామర్థ్యముచేత; శక్తి = శక్తి యను నాయుధమును; నృపున్=రాజును గూర్చి; వైచెన్=ప్రయోగించెను.
పృథ్వి. కనత్కనకఘంటికా◊కలఘుణత్కృతిప్రక్రియన్
జనాధిపమహాచమూ◊శ్రవణభేదనం బూన్చుచున్
ఘనప్రతిమ ధూమసం◊ఘములఁ జీఁకటు ల్నించుచున్
ఘనస్యదనిరూఢిచేఁ ◊గదలి శక్తి యేతేరఁగాన్. 142
టీక: కనత్కనకఘంటికాకలఘుణత్కృతిప్రక్రియన్ – కనత్=ప్రకాశించుచున్న, కనకఘంటికా=బంగరుగజ్జెలయొక్క, కల= అవ్యక్తమధురమగు, ఘుణత్కృతి= తద్రూపమైన ధ్వనివిశేషముయొక్క, ప్రక్రియన్=వ్యాపారముచేత; జనాధిపమహాచమూ శ్రవణభేదనంబు – జనాధిప=రాజుయొక్క, మహాచమూ=గొప్పసేనయొక్క, శ్రవణభేదనంబు = చెవుల భేదించుటను; ఊన్చు చున్ = చేయుచు; ఘనప్రతిమధూమసంఘములన్ – ఘనప్రతిమ=మేఘమునకు సాటియగు, ధూమసంఘములన్ = పొగ గుంపులచేత; చీఁకటుల్=అంధకారములను; నించుచున్ =పూరించుచు; ఘనస్యదనిరూఢిచేన్=అధికమగు వేగస్ఫూర్తిచేత; కదలి = వెడలి; శక్తి = శక్తి యను నాయుధము; ఏతేరఁగాన్=రాఁగా. దీని కుత్తరపద్యముతో నన్వయము.
పృథ్వీవృత్తలక్షణమును గూర్చి, ‘జసల్ జసయవంబు లుష్ణకరసంఖ్యవిశ్రాంతులున్, బొసంగి కవిపుంగవుల్ పలుక భూమిలోఁ బృథ్వినా, నసంశయమగుం గళిందతనయామనోవల్లభా’ అని యప్పకవి పండ్రెండవయక్షరము యతిగాఁ జెప్పి నను మహాకవులు పెక్కండ్రు తొమ్మిదవవర్ణము విశ్రమముగా వ్యవహరించుచున్నారు.
క. మనుజపతి దానిఁ గనుఁగొని, యనిఁ గుండలితాశుగాసుఁ◊డై శరపంక్తిం
దునియలుగాఁ బడ వైచెన్, మనమున వేల్పులు నిజైక◊మహిమను బొగడన్. 143
టీక: మనుజపతి=రాజు; దానిన్ = ఆ శక్త్యాయుధమును; కనుఁగొని=అవలోకించి; అనిన్=యుద్ధమునందు; కుండలితాశు గాసుఁడై – కుండలిత=వలయాకారముగాఁజేయఁబడిన; ఆశుగాసుఁడై =ధనువుగలవాఁడై, ఆశుగాసశబ్దము శరాసాదిశబ్ద ములవలె ధనుర్వాచకమగునని దెలియవలయు; వేల్పులు = దేవతలు; మనమునన్ =చిత్తమునందు; నిజైకమహిమను = తనయొక్క ముఖ్యమగు సామర్థ్యమును; పొగడన్ =శ్లాఘింపఁగా; శరపంక్తిన్=బాణపరంపరలచేత; తునియలుగాన్= శకలములుగా; పడవైచెన్=పడఁగొట్టెను.
చ. తనవరశక్తి యిట్లు వసు◊ధాపతిమార్గణధారఁ ద్రెళ్ళ నా
దనుజవిభుండు శత్రుబల◊దారణశీలము స్వాగ్రనిర్గళ
త్సునిశితకీలికీల మొక◊శూలము చయ్యనఁ బూని దీనిచే
మనుము నృపాల యంచుఁ బర◊మప్రతిఘోద్ధతి వ్రేయ నెత్తఁగన్. 144
టీక: ఆదనుజవిభుండు = ఆరాక్షసరాజు; ఇట్లు=ఈచొప్పున; తనవరశక్తి = తనయొక్క శ్రేష్ఠమగు శక్త్యాయుధము; వసుధాపతి మార్గణధారన్=రాజుబాణములయొక్కఅంచుచేత; త్రెళ్ళన్=పడఁగా; శత్రుబలదారణశీలము = వైరిసైన్యసంహరణస్వభావము గలదియు; స్వాగ్రనిర్గళత్సునిశితకీలికీలము – స్వ=తనయొక్క, అగ్ర=అగ్రభాగమువలన, నిర్గళత్=వెడలివచ్చుచున్న, సుని శిత=మిక్కిలి తీక్ష్ణములగు, కీలికీలము = అగ్నిజ్వాలలు గలదియు నగు, ఒకశూలము = ఒకశూలాయుధమును; చయ్యనన్ =వేగముగా; పూని=వహించి; దీనిచేన్=ఈయాయుధముచేత; నృపాల=ఓరాజా! మనుము = బ్రతుకుము, విరుద్ధలక్షణచే చావుమని యర్థము; అంచున్=ఇట్లనుచు; పరమప్రతిఘోద్ధతిన్ = అత్యంతమగు కోపముచేత; వ్రేయన్=ఏయుటకు; ఎత్తఁగన్= మీఁదికెత్తఁగా. దీనికి ముందుపద్యముతో నన్వయము.
చ. జనవిభుఁడంతలోఁ గరము ◊చాతురి హెచ్చఁగ ధన్వ మూని వే
గనియతి నర్ధచంద్రవిశి◊ఖద్వయి పావకమంత్రరేఖతోఁ
దనరఁగఁ గూర్చి వైచి ధరఁ ◊దార్కొనఁ జేసెఁ దదీయదోర్యుగం
బనుపమశూలకాంచనశ◊రాసనముల్ తొలుదొల్త డిందఁగన్. 145
టీక: జనవిభుఁడు=సుచంద్రుఁడు; అంతలోన్=వాఁడు శూలమెత్తివేయునంతలో; కరము=మిగుల;చాతురి =నేర్పు;హెచ్చఁగన్ = మించఁగా;ధన్వము=ధనుస్సును; ఊని=వహించి; వేగనియతిన్=వేగనియమముచేత; అర్ధచంద్రవిశిఖద్వయిన్=అర్ధచంద్ర బాణద్వయమును; పావకమంత్రరేఖతోన్=ఆగ్నేయమంత్రపుంజముచేత; తనరఁగన్=ఒప్పునట్లుగా; కూర్చి=ఘటించి; వైచి = ప్రయోగించి; అనుపమశూలకాంచనశరాసనముల్ = సాటిలేని శూలమును, కాంచనధనువును; తొలుదొల్త న్=మొదటనె; డిందఁగన్ = పడఁగా; తదీయదోర్యుగంబు=వానిబాహుయుగ్మమును; ధరన్ = భూమియందు; తార్కొనన్ చేసెన్ = పడు నట్లు చేసెను.
ఉ. అంత ననంతరోషశిఖి ◊యాంతరవీథికఁ జిందు ద్రొక్కఁ గా
లాంతకతుల్యమూర్తి యల◊యాశరసంతతిచక్రవర్తి దు
ర్దాంతరయంబుతో మణిశ◊తాంగము డిగ్గన డిగ్గి వ్యాత్తవ
క్త్రాంతర మూని మ్రింగెద ర◊సాధిపు నం చరుదెంచె నుద్ధతిన్. 146
టీక: అంతన్=అటుతరువాత; కాలాంతకతుల్యమూర్తి =ప్రళయకాలమృత్యువుతో సమానమైన; అలయాశరసంతతిచక్రవర్తి = ఆరాక్షసకులాధిపతియగు తమిస్రుఁడు; ఆంతరవీథికన్=హృదయప్రదేశమందు; అనంతరోషశిఖి=అధికమైన క్రోధాగ్ని; చిందు ద్రొక్కన్=ఉప్పొంగఁగ; దుర్దాంతరయంబుతోన్=నివారింపరానివేగముతో; మణిశతాంగము=మణిమయమైనరథమునుండి; డిగ్గన డిగ్గి =తటాలున దిగి; వ్యాత్త=తెఱవఁబడిన; వక్త్రాంతరము=ముఖమధ్యమును; ఊని=వహించి; ఉద్ధతిన్=దర్పము చేత; రసాధిపున్=రాజును; మ్రింగెద నంచు=కబళించెద ననుచు; అరుదెంచెన్=వచ్చెను.
వ. ఇట్లప్రతిమానప్రతిపక్షహర్యక్షవర్యంబు వీక్షించి మహాక్షితిధరాసన్నక్షోణివలనం గుప్పించు పంచాన నంబు తెఱంగునఁ దచ్చక్రాంగం బభంగురామర్షసాంగత్యంబున డిగ్గ నుఱికి గోత్రాధిపవిచిత్రపత్త్రిరాజ పరి త్రుటితబాహార్గళయుగళుండై, నిస్తంద్రసురేంద్ర శతకోటిశితకోటి పాటితపక్షద్వయంబగు నంజనాచలంబు చందంబునం జూపట్టుచు నశేషారిబలవిలోచనోత్సవవిమోచనంబు గావించు మేచకప్రభాధట్టంబున నెట్టన మట్టుమీఱు కటికచీఁకటిం బుట్టించుచుఁ బొడకట్టు నుద్దండతనూదండంబు శింశుమారచక్రవీథి రాయం బెరుఁగఁ జేయుచు, నిష్ఠురదీర్ఘనిశ్వాసధూమ నిష్కాలనీరదనికాయంబులకు శంఖారవోత్థహుంకారవారం బుల విశంకటగర్జనావిశేషంబులు నెగడించుచు, గ్రీష్మదినమధ్యందినమార్తాండమండలం బొడియం దమ కించు విధుంతుదగ్రహంబుదారి నున్మీలితవదనకోటరుండై మహిపమార్తాండుంగుఱించి యనంతాధ్వంబు నన్ బరువూన్చుచు, నతిభయంకరాకారంబునన్ బఱతేర, నప్పు డప్పొలసుదిండిమన్నీనిఁ గన్నారంజూచి ధీరోదాత్తుండగు నాసుచంద్రరాజేంద్రుండు నిజకోదండంబున సమంత్రకంబుగ నారాయణాస్త్రంబు గూర్చి ప్రయోగించిన నయ్యస్త్రశిఖావతంసంబును నతివేలశుచిజాలసమన్వితంబుగావునఁ బుష్కరస్థానసంస్థాయి నానానిమేషసంతానభంగంబు చేకూర్చుచు, ననేకదివ్యకాండసర్గచమత్కారి ఘనప్రకారభాసమానంబు గావున భువనజాతవిలాససముత్సారణంబు సంఘటించుచు, నమలకమలాప్త దైవతప్రభావిభూషితంబు గావున నాత్మమిత్రచక్రానందసంధాయకతేజోవైఖరిన్ దేజరిల్లుచు, నమితరయంబున నభ్రమార్గంబు చేపట్టి యెదురుగఁ బఱతెంచు నాదైతేయనాయకుశిరంబుఁ ద్రుంచె నయ్యవసరంబున. 147
టీక: ఇట్లు = ఈతీరున; అప్రతిమానప్రతిపక్షహర్యక్షవర్యంబు – అప్రతిమాన = సాటిలేని, ప్రతిపక్షహర్యక్షవర్యంబు = శత్రు శ్రేష్ఠుఁడు, ‘హర్యక్షః కేసరీ హరిః’ అనియు, ‘సింహ శార్దూల నాగాద్యాః పుంసి శ్రేష్ఠార్థగోచరాః’ అనియు అమరుఁడు; వీక్షించి = చూచి; మహాక్షితిధరాసన్నక్షోణివలనన్ – మహత్=గొప్ప, క్షితిధర=పర్వతముయొక్క, ఆసన్నక్షోణివలనన్ = సమీప భూమినుండి; కుప్పించుపంచాననంబుతెఱంగునన్ = దుముకుచున్న సింహమువలె; తచ్చక్రాంగంబు=ఆరథమునుండి; అభంగురామర్షసాంగత్యంబునన్ – అభంగుర=అప్రతిహతమగు, అమర్ష=చేతఃప్రజ్వలనముయొక్క, ‘అమర్ష స్సాపరాధేషు చేతః ప్రజ్వలనం మతమ్’ అని అమర్షలక్షణము, సాంగత్యంబునన్=సంబంధముచేత; డిగ్గన్ఉఱికి=వేగముగా దిగి; గోత్రాధిప విచిత్రపత్త్రిరాజ పరిత్రుటిత బహార్గళయుగళుండై – గోత్రాధిప=రాజుయొక్క,విచిత్ర=ఆశ్చర్యకరమగు, పత్త్రిరాజ=ఉత్తమసాయ కములచేత, పరిత్రుటిత=ఛేదింపఁబడిన, బాహార్గళయుగళుండై =అర్గళములఁబోలు భుజాద్వయముగలవాఁడై; నిస్తంద్రసురేంద్ర శతకోటి శితకోటి పాటితపక్షద్వయంబు – నిస్తంద్ర=జాగరూకుఁడైన, సురేంద్ర=దేవేంద్రునియొక్క, శతకోటి =వజ్రాయుధము యొక్క, శితకోటి= తీక్ష్ణాగ్రముచేత, పాటిత=నఱకఁబడిన, పక్షద్వయంబు=గరుద్యుగ్మము గలిగినది; అగు =అయినట్టి; అంజనాచలంబుచందంబునన్ = నీలాచలమువలె; చూపట్టుచున్=అగపడుచు; అశేషారిబలవిలోచనోత్సవవిమోచనంబు – అశేష = సమస్తములగు, అరి = శత్రువులయొక్క, తమిస్రుఁడుగావున జక్కవలయొక్కయని యర్థాంతరము స్ఫురించును, బల= సైన్యముయొక్క, విలోచనోత్సవ=నయనానందముయొక్క, విమోచనంబు = పోగొట్టుటను; కావించు మేచకప్రభా ధట్టంబునన్ – కావించు = చేయుచున్న, మేచకప్రభా=నీలకాంతులయొక్క, ధట్టంబునన్=గుంపుచేత; నెట్టనన్ = అనివార్య ముగా; మట్టు మీఱు కటికచీఁకటిన్= అతిశయించు గాఢాంధకారమును; పుట్టించుచున్=కలుఁగఁజేయుచు;పొడకట్టు ఉద్దండ తనూదండంబు – పొడకట్టు = చూపట్టుచున్న, ఉద్దండ=ఉత్కటమగు, తనూదండంబు = శరీరకాండము; శింశుమారచక్ర వీథిన్= సూర్యాది గ్రహసంచారచక్రముయొక్క ప్రదేశమును; రాయన్=ఒరయునట్లు; పెరుఁగఁ జేయుచున్ = వృద్ధిఁబొందఁ జేయుచు; నిష్ఠురదీర్ఘ నిశ్వాసధూమనిష్కాలనీరదనికాయంబులకున్ – నిష్ఠుర=కఠినమై, దీర్ఘ=పొడవైన, నిశ్వాస=ఊర్పు సంబంధియగు, ధూమ= పొగ యనెడు, నిష్కాల=అకాలభవమగు, నీరద=మేఘములయొక్క, నికాయంబులకున్=గుంపు లకు; శంఖారవోత్థహుంకారవారంబులన్ – శంఖారవోత్థ= శంఖనాదములనుండి పుట్టిన, హుంకారవారంబులన్ = హుమ్మను శబ్దపరంపరలచేత; విశంకటగర్జనావిశేషంబులు = విశాలములగు గర్జనావిశేషములను; నెగడించుచున్=పుట్టించుచు; గ్రీష్మ దినమధ్యందిన మార్తాండమండలంబు – గ్రీష్మదిన=గ్రీష్మకాలదినమందలి, మధ్యందిన=మధ్యాహ్నకాలికమగు, మార్తాండ మండలంబు = సూర్యమండలమును; ఒడియన్ తమకించు విధుంతుదగ్రహంబు దారిన్ –ఒడియన్ = పట్టుటకు, తమకించు= త్వరపడు, విధుంతుదగ్రహంబు = రాహుగ్రహముయొక్క, దారిన్ = తీరున; ఉన్మీలితవదనకోటరుండై = తెఱవఁబడిన ముఖ బిలముగలవాఁడై; మహిపమార్తాండుంగుఱించి = రాజనెడు సూర్యునిగుఱించి; అనంతాధ్వంబునన్ = అంతరిక్షమార్గమున; పరువూనుచున్ = పరుగెత్తుచు; అతిభయంకరాకారంబునన్=మిగుల భయప్రదమగు నాకృతితోడ; పఱతేరన్=రాఁగా; అప్పుడు=ఆసమయమున; అప్పొలసుదిండిమన్నీనిన్=ఆరాక్షసరాజును; కన్నారన్ చూచి=బాగుగ నవలోకించి; ధీరోదాత్తుం డగు నాసుచంద్ర రాజేంద్రుండు = ధీరశ్రేష్ఠుండగు ఆసుచంద్రుఁడను రాజశ్రేష్ఠుఁడు; నిజకోదండంబునన్=తనధనువునందు; సమంత్రకంబుగన్ = మంత్రయుక్తముగ; నారాయణాస్త్రంబున్ = నారాయణుఁ డధిదేవతయైన యస్త్రమును; కూర్చి = సంధించి; ప్రయోగించినన్= విడువఁగా; అయ్యస్త్రశిఖావతంసంబును = ఆయుత్తమాస్త్రంబును; అతివేలశుచిజాలసమన్వితంబు = అధిక మగు నగ్నిసంతతులతోడఁ గూడినది, అధికములు, శుద్ధములు నగు వలలతోఁగూడినదని యర్థాంతరముదోఁచును; కావునన్ = అయిన హేతువువలన; పుష్కరస్థానసంస్థాయినానానిమేషసంతానభంగంబు – పుష్కరస్థాన=ఆకసమునందు, సంస్థాయి = నిలిచియున్న, నానా=అనేకవిధములగు, అనిమేషసంతాన=సురసంఘముయొక్క, జలప్రదేశముల నున్న మత్స్యసముదా యముయొక్క యని యర్థాంతరము; భంగంబు=పతనమును; చేకూర్చుచున్=చేయుచు; అనేకదివ్యకాండసర్గచమత్కారి ఘనప్రకారభాసమానంబు – అనేక=అనేకములగు, దివ్య=లోకోత్తరములైన, కాండ=బాణములయొక్క, ఉదకములయొక్క, సర్గ=సృష్టియందు, చమత్కారి=నేర్పుగల్గిన, ఘనప్రకార=అధికవిధములచేత, మేఘప్రకారముచేత, భాసమానంబు=ప్రకాశిం చునది; కావునన్ = అయినందున; భువనజాతవిలాససముత్సారణంబు – భువనజాత=లోకసంతతియొక్క, జలజాతము యొక్క, విలాస=సంతసముయొక్క, సముత్సారణంబు=మోచనమును; సంఘటించుచున్=చేయుచు; అమలకమలాప్తదైవత ప్రభావిభూషితంబు – అమల = స్వచ్ఛమగు, కమలాప్తదైవత=విష్ణువుయొక్క, సూర్యునియొక్కయని యర్థాంతరము, ప్రభా= కాంతిచేత, విభూషితంబు = అలంకృతమైనది; కావునన్=అయినందున; ఆత్మమిత్రచక్రానందసంధాయకతేజోవైఖరిన్ – ఆత్మ =తనయొక్క, మిత్రచక్ర= సుహృత్సంఘములకు, మిత్రములగు చక్రవాకములకు, ఆనందసంధాయక = సంతసము జేయు, తేజోవైఖరిన్ = తేజోవిశేషము చేత; తేజరిల్లుచున్=ప్రకాశించుచు; అమితరయంబునన్=అమితవేగముచేత; అభ్రమార్గంబు = ఆకాశమార్గమును; చేపట్టి=అవలంబించి; ఎదురుగన్=అభిముఖముగా; పఱతెంచు =ఏతెంచు; ఆదైతేయనాయకుశిరంబున్ =ఆరాక్షసరాజుయొక్కశిరసును; త్రుంచెన్=ఖండించెను; అయ్యవసరంబునన్=ఆసమయమందు. దీనికి ముందుపద్యమందుఁ గల క్రియతో నన్వయము.
సీ. గంధర్వసతులు చొ◊క్కపుపాట వాడిరి, వాడిరి తద్భవ్య◊వార్తమయులు,
కులరాజమంత్రిము◊ఖ్యులు సంభ్రమించిరి, మించిరి సాధ్యు ల◊మేయసుఖిత,
నరనాథసిద్ధు లం◊దఱు కొనియాడిరి, యాడిరి బృందార◊కాబ్జముఖులు,
ప్రద్రవద్రిపుల రా◊డ్భటులు మన్నించిరి, నించిరి విరిసోన ◊నిఖిలలేఖు,
తే. లాత్మ సామంతనృపు లబ్ర◊మంది రిష్ట,సిద్ధి మును లాశ్రమంబులు చెంది రసుర
కువలయాక్షులు మిక్కిలి ◊గుంది రభయ,భూతి జానపదుల్ మదిఁ ◊బొంది రపుడు. 148
టీక: గంధర్వసతులు = గంధర్వస్త్రీలు; చొక్కపుపాట పాడిరి=చక్కనైన పాటను గానము చేసిరి; మయులు=యక్షులు; తత్= ఆవిజయమునకుసంబంధించిన, భవ్యవార్తన్=మంగలకరమగు వృత్తాంతమును; పాడిరి=గానము చేసిరి. కులరాజమంత్రిముఖ్యులు = కులమువారు, రాజులు, మంత్రులు; సంభ్రమించిరి = సంతోషించిరి; సాధ్యులు=దేవవిశేషులు; అమేయసుఖితన్=అపరిమితసౌఖ్యముచేత; మించిరి = అతిశయించిరి. నరనాథసిద్ధులు=రాజుయొక్క కార్యసిద్ధులను; అందఱున్=ఎల్లరును; కొనియాడిరి=ప్రశంసించిరి; బృందారకాబ్జముఖులు = దేవతాస్త్రీలు; ఆడిరి= నాట్యముఁ జేసిరి. ప్రద్రవద్రిపులన్ = పలాయమానులగు శత్రువులను; రాడ్భటులు = రాజభృత్యులు; మన్నించిరి = గౌరవించిరి; నిఖిలలేఖులు = సర్వదేవతలు; విరిసోనన్ = పుష్పవర్షమును; నించిరి = పూరించిరి.ఆత్మన్=హృదయమందు; సామంతనృపులు=ఇరుగుపొరుగు భూపులు; అబ్రమందిరి=ఆశ్చర్యమందిరి; మునులు= ఋషులు; ఇష్టసిద్ధిన్ = మనోరథలాభముచేత; ఆశ్రమంబులు = తమనివాసములను; చెందిరి=పొందిరి; అసురకువలయాక్షులు =రాక్షస స్త్రీలు; మిక్కిలి = అధికముగా; కుందిరి=దుఃఖించిరి; జానపదుల్ =ప్రజలు; అభయ భూతిన్=అభయసంపదను; మదిన్=బుద్ధియందు; పొందిరి=లభించిరి; అపుడు=ఆసమయమందు. దీనికి ముందుపద్య ముతో నన్వయము. ఈపద్యమందు యమకాలంకారవిశేషము. ‘అర్థేసత్యర్థభిన్నానాం వర్ణానాంసా పునః క్రియా| యమకం పాదతద్భాగవృత్తి తద్యాత్యనేక తామ్’ అని కావ్యప్రకాశమున యమకలక్షణము. ‘యుద్ధేతు వర్మ బలచారరజాంసి తూర్య నిస్సాణనాదశరమణ్డల రక్తనద్యః| ఛిన్నాతపత్రరథచామరకేతు కుమ్భిముక్తాసురీవృతభటా స్సురపుష్పవృష్టిః’ అనుటంబట్టి యథోచితముగ నిట్లు పుష్పవృష్ట్యంతము వర్ణితం బయ్యె.
మ. హరిదీశానసురాళితోఁ బ్రమథవ◊ర్యశ్రేణితో సర్వని
ర్జరయోగీశ్వరకోటితో రయిత గో◊త్రంజేరి గౌరీమనో
హరుఁ డాభూపతి గారవించి మహిలో◊కాత్యద్భుతాపాదిబం
ధురనానావిధపారితోషికములన్ ◊దోడ్తో నొసంగెన్ గృపన్. 149
టీక: గౌరీమనోహరుడు=శివుఁడు;హరిదీశానసురాళితోన్=దిక్పాలాదిదేవబృందముతోడ; ప్రమథవర్యశ్రేణితోన్=ప్రమథ శ్రేష్ఠులగుంపులతోడ; సర్వనిర్జరయోగీశ్వరకోటితోన్=సమస్తదేవమునిసంఘముతోడ; రయితన్ = వేగముచేత; గోత్రన్ = భూమిని; చేరి = పొంది;ఆభూపతిన్=ఆరాజును (సుచంద్రుని); గారవించి =గౌరవముచేసి;మహిలోకాత్యద్భుతాపాదిబంధురనానావిధపారితోషికములన్ – మహిలోక = భూలోకమునందు, అత్యద్భుతాపాది = మిక్కిలి యాశర్యమును గొల్పు, బంధుర = ఇంపైన, నానావిధ = బహువిధములైన, పారితోషికములన్=బహుమానములను; తోడ్తోన్=వెంటనే; కృపన్ = దయచేత, ఒనొసంగెన్=ఇచ్చెను. శివుఁడు దేవబృందముతోను, ప్రమథమునివర్గములతోను బుడమికి నేతెంచి యారాజునకు లోకోత్తరపారితోషికములనిచ్చె ననుట.
చ. దనుజకులేంద్రసైన్యవర◊దారుణసాయకపాళి నుర్విఁ ద్రె
ళ్ళిన మహిపాలసైన్యపట◊లిన్ మనఁజేసె శచీవిభుండు పా
వనకరుణాసుధానికర◊వర్షపరంపరకన్న మున్న ప
ర్విన నిజశక్తికల్పితన◊వీనసుధారసవృష్టిధారచేన్. 150
టీక: శచీవిభుండు = ఇంద్రుఁడు;దనుజకులేంద్రసైన్యవరదారుణసాయకపాళిన్ – దనుజకులేంద్ర = రాక్షసేంద్రునియొక్క, సైన్య=సైన్యముయొక్క, వర=శ్రేష్ఠమగు, దారుణ=భయంకరమగు, సాయకపాళిన్=బాణపరంపరలచేత; ఉర్విన్=భూమియందు; త్రెళ్ళిన మహిపాలసైన్యపటలిన్ = పడినట్టి రాజసైనికుల సమూహమును; పావనకరుణాసుధానికరవర్షపరంపరకన్నన్ – పావన=పవిత్రమగు, కరుణా=కృపచేతనైన, సుధానికర=సుధాసమూహముయొక్క, వర్షపరంపరకన్నన్=వృష్టిపరంపర కన్నను; మున్న = పూర్వమే; పర్విననిజశక్తికల్పితనవీనసుధారసవృష్టిధారచేన్ – పర్విన=వ్యాపించినదియు, నిజశక్తికల్పిత =తన సామర్థ్యముచే కల్పింపఁబడినదియు,నవీన=నూతనమగు, సుధారస=అమృతరసముయొక్క, వృష్టిధారచేన్=వర్షధార చేత; మనఁజేసెన్ = బ్రతికించెను.
మ. దివిజాలభ్యతమిస్రదైత్యవిజయా◊ప్తిన్ సేవితుం డైన యా
యవనీనాథవరేణ్యుఁ జేరి వినయా◊త్మాత్మ గాధేయగా
లవశాండిల్యవసిష్ఠముఖ్యమునిజా◊లం బేకవాచాగతిన్
నవకల్యాణకరాదిదివ్యవరసం◊తానంబు లూన్చెన్ రహిన్. 151
టీక: దివిజాలభ్యతమిస్రదైత్యవిజయాప్తిన్ – దివిజాలభ్య=దేవతలకుఁ బొందనలవిగాని, తమిస్రదైత్య=తమిస్రాసురునియొక్క, విజయ=విజయముయొక్క, ఆప్తిన్= ప్రాప్తిచేత; సేవితుండైనయాయవనీనాథవరేణ్యున్= సేవింపఁబడిన యారాజశ్రేష్ఠుని; చేరి = పొంది; వినయాత్మాత్మ =వినయవశమైన చిత్తముతో;గాధేయగాలవశాండిల్యవసిష్ఠముఖ్యమునిజాలంబు= విశ్వామిత్రుఁడు, గాలవుఁడు, శాండిల్యుఁడు, వసిష్ఠుఁడు మొదలుగాఁ గల మునిసంఘము; ఏకవాచాగతిన్=ఏకవాక్యముగ; నవకల్యాణకరాది దివ్యవరసంతానంబులు – నవకల్యాణకరాది = అపూర్వమగు మంగళకరములైనట్టివగు, దివ్యవర=దేవతాసంబంధులగు వరములయొక్క, సంతానంబులు = సమూహములు; రహిన్=ప్రీతిచేత; ఊన్చెన్=వహింపఁజేసెను. విశ్వామిత్రుఁడు లోనగు మునివర్యు లారాజున కభ్యుదయపరంపరాభివృద్ధిగా నాశీర్వదించి రనుట.
చ. జనవిభుఁడిట్లు దైత్యబల◊జాతజయంబు వహించి దేవతా
జనములచే బహూకృతిని ◊జాల భరించి కడుం దలంచె నె
మ్మనమునఁ జంద్రికాయువతి◊మంజుకటాక్షసమేధితేందిరా
తనయమహాజయం బెపుడు ◊దారునొకో యని కోర్కి మించఁగన్. 152
టీక: ఇట్లు=ఈప్రకారముగా; జనవిభుఁడు=సుచంద్రుఁడు; దైత్యబలజాతజయంబు = రాక్షససైన్యముయొక్క గెల్పును; వహించి = పొంది; దేవతాజనములచేన్ = దేవతాసంఘములచేత; బహూకృతిని = సత్కారమును; చాలన్=మిక్కిలి; భరించి = వహించి; నెమ్మనమునన్=మంచిమనస్సునందు; చంద్రికాయువతిమంజుకటాక్షసమేధితేందిరాతనయమహాజయంబు – చంద్రికాయువతి = చంద్రికయొక్క, మంజు=సుందరమగు, కటాక్ష=నేత్రాంతదృష్టులచేత, సమేధిత=వృద్ధిపొందింపఁబడిన, ఇందిరాతనయ = మన్మథునియొక్క, మహాజయంబు = గొప్పనైన గెలుపు; ఎపుడు దారునొకో = ఎపుడు కలుగునో, అని = ఈప్రకారముగా, కోర్కి మించఁగన్ = అభిలాష యతిశయించఁగా; కడున్=మిక్కిలి; తలంచెన్=చింతించెను. ఆచంద్రికతో నెప్పుడు సంభోగింతునో యని కోరుచుండె ననుట. ఇటఁ జింత యను ననంగదశగాఁ దెలియునది.
క. ఈలీల నపుడు తత్పాం
చాలీమోహాత్తచిత్త◊సారసుఁడై భూ
పాలాగ్రణి సకలాజర
జాలానుమతిన్ బ్రమోద◊సంతతి మెఱయన్. 153
టీక: అపుడు=ఆసమయమున; ఈలీలన్=ఈప్రకారముగ; భూపాలాగ్రణి = రాజశ్రేష్ఠుఁడు; తత్పాంచాలీమోహాత్తచిత్తసారసుఁ డై = ఆచంద్రికయందలిమోహముచేఁ బొందఁబడిన హృదయారవిందము గలవాఁడై; సకలాజరజాలానుమతిన్ = సమస్తదేవతా బృందములయొక్క సమ్మతిచేత; ప్రమోదసంతతి = హర్షాతిశయము; మెఱయన్ = ప్రకాశించుచుండఁగా, దీనికి చనియె నను వ్యవహితోత్తరపద్యస్థక్రియతో నన్వయము. పద్యత్రయ మేకక్రియతో నన్వయించుటవల్ల, ‘శ్లో. ద్వాభ్యాం యుగ్మ మితి ప్రోక్తం త్రిభి శ్ల్శోకైర్విశేషకమ్’ అను నుక్తలక్షణముచే లక్షితంబగు విశేషకసంజ్ఞ యీపద్యత్రయి కమరుచున్నది.
మ. అనఘోచ్చైస్తనకుంభలబ్ధి ఘనవా◊లావాప్తి హీరాభదం
తనిషక్తిన్ నవపద్మభాలసితవ◊క్త్రస్ఫూర్తి రాజిల్లు ప
ద్మిని రూఢానుశయాఢ్యహృత్సరణి భూ◊మిస్వామి దా నెక్కి కాం
చనబంభారభటుల్ తమిస్రవిజయ◊చ్ఛాయన్ బ్రబోధింపఁగన్. 154
టీక: భూమిస్వామి = భూపతియగు సుచంద్రుఁడు;అనఘోచ్చైస్తనకుంభలబ్ధిన్ – అనఘ=ఒచ్చెములేని, ఉచ్చైస్తన=మిక్కిలి గొప్పనైన, కుంభ=కుంభస్థలముయొక్క,లబ్ధిన్=ప్రాప్తచేత; ఉచ్చైః=మిట్టలైన, స్తనకుంభ=కలశములవంటికుచములయొక్క, లబ్ధిన్=ప్రాప్తచేత నని యర్థాంతరధ్వని; ఘనవాలావాప్తిన్ – ఘన=గొప్పదియైన, వాల=పుచ్ఛముయొక్క, ఆవాప్తిన్=ప్రాప్తి చేత, గొప్పతలవెండ్రుకల ప్రాప్తిచేత నని యర్థాంతరము; హీరాభదంతనిషక్తిన్ = వజ్రసమమగు దంతములయొక్క సంబంధము చేత నని ఉభయత్ర అన్వయము; నవపద్మభాలసితవక్త్రస్ఫూర్తిన్ – నవ=నూతనములగు, పద్మ=సిబ్బెపుబొట్టులయొక్క, భా= కాంతిచేత, లసిత = ప్రకాశించుచున్న, వక్త్రస్ఫూర్తిన్=ముఖప్రకాశముచేత; నవ=నూతనమగు, పద్మ=కమలముయొక్క, భా= కాంతిచేత, లసిత = ప్రకాశించుచున్న, వక్త్రస్ఫూర్తిన్=ముఖప్రకాశముచేత నని యర్థాంతరము; రాజిల్లు పద్మినిన్ = ప్రకాశించు చున్న ఆఁడేనుఁగును, పద్మినీజాతిస్త్రీ నని యర్థాంతరము; రూఢానుశయాఢ్యహృత్సరణిన్ – రూఢ=అధికమగు, అనుశయ = ద్వేషముచేత, ఆఢ్య=సమృద్ధమైన, హృత్సరణిన్=హృత్ప్రదేశముతో, అరతిచేత ననుట, అరతి యనఁగా ననంగదశావిశే షము; తాన్; ఎక్కి=అధిష్ఠించి; కాంచనబంభారభటుల్ =స్వర్ణమయభేరులయొక్క నినాదములు; తమిస్రవిజయచ్ఛాయన్ = తమిస్రాసురజయప్రకాశమును; ప్రబోధింపఁగన్=బోధించుచుండఁగా. దీనికి ‘చనియె’ నను ఉత్తరపద్యస్థక్రియతో నన్వయము.
అనఁగా పద్మిని చంద్రికాలక్షణములతోఁ గూడియుండుటం జేసి తత్స్మరణప్రయుక్తమైన యరతితో దాని నెక్కె నని భావము.
చ. అలఘుఝరీతరంగవిభ◊వాతిశయంబు కనద్వనీలతా
వలిమహిమల్ సరోలలిత◊వారిజవైఖరియున్ నగోజ్జ్వల
జ్జలదమహంబు తన్మహిప◊చంద్రసుతాంగవిభావిలాసముల్
దెలుపఁగఁ గాంచుచున్ జనియెఁ ◊ద్రిమ్మరునెమ్మదితోడ వీటికిన్. 155
టీక: అలఘుఝరీతరంగవిభవాతిశయంబు – అలఘు = అధికమగు, ఝరీ=సెలయేళ్ళయొక్క, తరంగ=అలలయొక్క, విభ వాతిశయంబు = సంపత్సమృద్ధి; కనద్వనీలతావలిమహిమల్ – కనత్=ప్రకాశించుచున్న, వనీ=వనములయందున్న, లతా = తీవెలయొక్క, ఆవలి = పంక్తులయొక్క, మహిమల్=అతిశయములు; సరోలలితవారిజవైఖరియున్ – సరః=సరస్సులందలి, లలిత=ఒప్పుచున్న, వారిజ=పద్మములయొక్క, వైఖరియున్=విధమును; నగోజ్జ్వలజ్జలదమహంబు – నగ=పర్వతముల యందు, ఉజ్జ్వలత్=ప్రకాశించుచున్న, జలద=మేఘములయొక్క, మహంబు =విలాసము; తన్మహిపచంద్రసుతాంగవిభావిలా సముల్ – తన్మహిపచంద్రసుతా = ఆరాజకుమారియగు చంద్రికయొక్క, అంగవిభావిలాసముల్=అంగములయొక్క కాంతి విశేషములను; తెలుపఁగన్=స్మరింపఁజేయుచుండఁగా; కాంచుచున్ = చూచుచు; త్రిమ్మరునెమ్మదితోడన్ = మిక్కిలి చలించు చున్న నిండుమనస్సుతోడ; వీటికిన్=నిజరాజధానికి; చనియెన్ = పోయెను. అనఁగా తరంగ,లతా,పద్మ,జలదములు చంద్రిక యొక్క వళులను,బాహువులను,కన్నులను,కొప్పును స్మరింపఁజేయుచుండఁగాఁ జూచుచుం బోయె నని భావము.
చ. తనపుర మంతఁ జేరి వసు◊ధాపతి భోటవరాటలాటము
ఖ్యనిఖిలదేశభూపతుల ◊నంచి నిజాంచితహైమమందిరం
బెనసి యనీహ మించ దిన◊కృత్యము లూన్చి విలాసహర్మ్యమౌ
ళి నలరుశయ్య నప్డు పవ◊ళించె నృపాలసుతైకమోహతన్. 156
టీక: అంతన్=అటుపైని; వసుధాపతి=సుచంద్రుఁడు; తనపురము=తనపత్తనమును; చేరి = పొంది; భోటవరాటలాటముఖ్య నిఖిలదేశభూపతులన్ = భోటవరాటలాటాదిసమస్తదేశప్రభువులను; అంచి = పంపి; నిజాంచితహైమమందిరంబు – నిజ = తన దగు, అంచిత=పూజ్యమయిన, హైమమందిరంబు = బంగరుమేడను; ఎనసి = పొంది; అనీహ = అరతి యను మన్మథావస్థ; మించన్=అతిశయింపఁగా;దినకృత్యములు=అవశ్యాచరణీయములగు సంధ్యాదికార్యములను; ఊన్చి=చేసి; విలాసహర్మ్య మౌళిన్=క్రీడాసౌధశ్రేష్ఠమందు; అలరుశయ్యన్=పువ్వుపఱపునందు; నృపాలసుతైకమోహతన్ =చంద్రికయందు ముఖ్యమైన ప్రీతిగలవాఁడగుటచేత; అప్డు = ఆసమయమున; పవళించెన్ = శయనించెను.
ఆశ్వాసాంతపద్యములు
మ. ప్రతిమాతీతగభీరతావిజితపా◊రావార, రావారసం
యతనానాశరకర్ణకోటరపృష◊త్కాసార, కాసారజాం
చితనేత్రాజనతామనోహరమహా◊శృంగార, శృంగారసం
భృతమార్గైకవిహారలాలసమనో◊బృందార, బృందారతా! 157
టీక: ప్రతిమాతీతగభీరతావిజితపారావార – ప్రతిమాతీత=సాటిలేనట్టి, గభీరతా=గాంభీర్యముచేత, ‘గాంభీర్య మవికార స్స్యాత్ సత్యపి క్షోభకారణే’ అని తల్లక్షణము, విజిత=గెలువఁబడిన, పారావార =సముద్రముగలవాఁడా! రావారసంయతనానా శరకర్ణకోటర పృషత్కాసార – రావ=ధ్వనిచేత, అర=శీఘ్రముగా, సంయత=నిరోధింపఁబడిన, నానా = వివిధములైన, ఆశర =రాక్షసులయొక్క, కర్ణకోటర=కర్ణరంధ్రములుగల, పృషత్క=బాణములయొక్క,ఆసార = వర్షధార గలవాఁడా! కాసార జాంచితనేత్రా జనతామనోహరమహాశృంగార – కాసారజ=పద్మములవలె, అంచిత=ఒప్పుచున్న, నేత్రా= కన్నులుగల స్త్రీల యొక్క, జనతా=సంఘములకు, మనోహర=మనోజ్ఞమగు, మహత్=అధికమైన, శృంగార =అలంకారములుగలవాఁడా! శృంగారసంభృత మార్గైకవిహారలాలసమనోబృందార – శృంగార=శృంగారరసముచేత, సంభృత=మిగులఁ బోషింపఁబడిన, మార్గ =మార్గమునందలి, ఏక=ముఖ్యమగు, విహార=క్రీడయందు, లాలస=ఆసక్తిగల, మనః=మనస్సుగల, బృందార= దేవుఁడా! బృందారతా = బృందాదేవియందు రతుఁడగువాఁడా! ఈకృతిపతిసంబోధనములకు, నుత్తరపద్యములందలి తత్సంబోధనములకును ‘ఇది’ యను నాశ్వాసాంతిమగద్యముతో నన్వయము.
క. రణభీమ! భీమనుతవా, రణవిజయైకాభిరామ! ◊రామాత్మకకా
రణధామ! ధామనిధికై,రణరాజద్భామ! భామ◊రహితాచరణా! 158
టీక: రణభీమ = యుద్ధమున భయంకరుఁడవైనవాఁడా! భీమనుతవారణవిజయైకాభిరామ – భీమ=శివునిచేత, నుత=కొని యాడఁబడిన, వారణ=కువలయాపీడమను గజముయొక్క, విజయ = గెలుపుచేత, ఏక=ముఖ్యమగునట్లుగా, అభిరామ = ఒప్పెడువాఁడా! రామాత్మకకారణధామ – రామా=స్త్రీలయొక్క, ఆత్మ=మనస్సులయొక్క, క=సుఖమునకు, కారణ=హేతు వగు, ధామ=దేహముగలవాఁడా! ‘ధామ దేహే గృహేపి చ’ అని విశ్వము; ధామనిధికైరణరాజద్భామ – ధామనిధి=సూర్యుని యొక్క, కైరణ=కిరణసంఘముభంగి, రాజత్=ప్రకాశించుచున్న, భామ=దీప్తిసంపదగలవాఁడా! భామరహితాచరణా =క్రోధ రహితమగు నాచరణముగలవాఁడా! ఈ రెండుపద్యములందును ముక్తపదగ్రస్తమను శబ్దాలంకారము.
కవిరాజవిరాజితము. నరకవిభేదన, నారజఖాదన, ◊నారదవాదనకేళి, దరీ,
యరిగణశాదనవారుణపాద, న◊యాంచితవాదన, భూరిదరీ
చరరిపుమాద, నరాశ్వవిచోదన, ◊సారఫలార్జనవార్జహరీ,
పరనిజపాదనతావన, రాదన◊భాజితకుంద, నరేశ, హరీ! 159
టీక: నరకవిభేదన = నరకాసురనకు భేదకుఁడైనవాఁడా! నారజఖాదన = అగ్నిభక్షకుఁడవైనవాఁడా! నారదవాదనకేళి = నార దునియొక్క వీణావాద్యమందుఁ గ్రీడగలవాఁడా! దరీ=శంఖముగలవాఁడా! అరిగణశాదనవారుణపాద = అరిగణ మనెడు పంకమునకు నూతనసూర్యరూపుఁడవైనవాఁడా! నయాంచితవాదన =నీతియుక్తమైన వచనముగలవాఁడా! భూరిదరీచరరిపు మాద – భూరి=అధికములగు, దరీ=గుహలయందు, చర=సంచరించుచున్న, రిపు=శత్రువులయొక్క, మా=సిరిని, ద= ఖండించినవాఁడా! నరాశ్వవిచోదన = అర్జునునియొక్క గుఱ్ఱములను దోలువాఁడా, అనఁగా పార్థసారథియైనవాఁడా! సార ఫలార్జనవార్జహరీ – సార=శ్రేష్ఠమగు, ఫల=మోక్షాదిఫలముయొక్క, ఆర్జన=సంపాదన మనెడు, వార్జ=కమలములకు, హరీ = సూర్యరూపుఁడవైనవాఁడా! పరనిజపాదనతావన = శ్రేష్ఠములగు తనయొక్క పాదములయందు నతులైనవారిని రక్షించు వాఁడా! రాదనభాజితకుంద – రాదన=దంతసంబంధమైన, భా=కాంతిచేత, జిత=జయింపఁబడిన, కుంద=మొల్లలుగలవాఁడా! నరేశ = పురుషోత్తముఁడా! హరీ =మదనగోపాలస్వామీ!
గద్య: ఇది శ్రీమదనగోపాలప్రసాదసమాసాదితోభయభాషాకవిత్వకళాకళత్ర రేచర్లగోత్రపవిత్ర సురభిమల్లక్షమాపాలసత్పుత్ర కవిజనవిధేయ మాధవరాయప్రణీతంబైన చంద్రికాపరిణయంబను మహాప్రబంధంబునందుఁ దృతీయాశ్వాసము.
గద్యము: ఇది శ్రీసతీరమణకరుణాసమాసాదిత సర్వసౌభాగ్య, భాగ్యనగరమహారాజ్యసంకలిత శ్రీజటప్రోలు సంస్థానప్రాజ్యసకలసామ్రాజ్య, శ్రీ రేచర్లగోత్రపవిత్ర కవిజనగేయ శ్రీవేంకటజగన్నాథరాయ సత్పుత్ర, సత్సంప్రదాయ, శ్రీసురభి వేంకటలక్ష్మణరాయ పరిపోష్య, సరసవైదుష్య,తదాస్థానతలమండిత శేషసదాశివపండిత విరచిత శరదాగమసమాఖ్య వ్యాఖ్యయందు తృతీయాశ్వాసము సంపూర్ణము.