మ. కనుగల్వ ల్వికసిల్ల, మోదము పొసం◊గన్ దజ్జనాధీశచం
ద్రుని వీక్షించినఁ గాని మామకహృదు◊ద్భూతస్పృహారేఖ యి
మ్మెనయం జాలదు, చాన, యవ్విభుని మీ◊కీలోపలం గాంచఁ గ
ల్గు నన, న్గోమలి కిన్నరేశ్వరునిఁ బ◊ల్కు న్గోర్కి దైవాఱఁగన్. 76
టీక: కనుగల్వల్=కన్నులనెడు కలువలు; వికసిల్లన్=వికసించునట్లును; మోదము=సంతసము; పొసంగన్ = కల్గునట్లును; తజ్జనాధీశచంద్రునిన్ =ఆరాజచంద్రుని; వీక్షించినన్ కాని =చూచినంగాని; మామకహృదుద్భూతస్పృహారేఖ = నామనంబునఁ బొడమిన వాంఛాతిశయము;ఇమ్మెనయం జాలదు= ఆనుకూల్యముఁ బొందఁజాలదు; చాన =చకోరీ! అవ్విభునిన్=ఆరాజును; మీకు; ఈలోపలన్= ఇంతలోనె; కాంచన్ కల్గు = చూచుట సంభవించును; అనన్ = ఇట్లు వచింపఁగా; కోమలి= చకోరి; కోర్కి దైవాఱఁగన్ = కోరిక యతిశయింపఁగా; కిన్నరేశ్వరునిన్=కుముదునిగూర్చి; పల్కున్=వచించును.
మ. హరివంశోత్తము సద్గుణాళి విని ని◊త్యం బేము వర్ణింప స
త్వరబుద్ధిం గనఁ జాన గోరుఁ బతి నా◊త్మం, గాంచ మాకుం దదం
తర మెల్లప్పుడు మించుఁ గాన, నలగో◊త్రాభర్త నే మిప్పు డే
కరణిం గాంతుము, గాంచుదారిఁ గృప ని◊క్కం దెల్పవే నావుడున్. 77
టీక: హరివంశోత్తముసద్గుణాళి =సూర్యవంశమునం దుత్తముఁడగు నారాజుయొక్క శ్రేష్ఠమగుగుణములగుంపును; విని= ఆక ర్ణించి; నిత్యంబు=ఎల్లపుడు; ఏము=మేము; వర్ణింపన్=ఆరాజుగుణములఁ గొనియాడఁగా; చాన=చంద్రిక; సత్వరబుద్ధిన్ = త్వరతోఁ గూడిన మతిచేత; పతిన్=రాజును, భర్త ననియుఁ దోఁచును; కనన్=అవలోకించుటకు; ఆత్మన్ =మనమున; కోరున్ = వాంఛించును; మాకున్; కాంచన్=చూచుటకు; తదంతరము=ఆమనస్సు, అంతరశబ్దార్థములు చెప్పునపుడు ‘బహి రవసర మధ్యేంత రాత్మని చ’ అని యమరుఁడు; ఎల్లప్పుడు; మించున్=అతిశయించును; కానన్=ఆహేతువువలన; అలగోత్రాభర్తన్ = ఆరాజును; ఏము; ఇప్పుడు=ఈసమయమున; ఏకరణిన్ = ఏరీతి; కాంతుము=చూతుము; కాంచుదారిన్=చూచుమార్గమును; కృప నిక్కన్= కరుణ యతిశయిల్లునట్లు; తెల్పవే=ఆనతీవే, నావుడున్=ఇట్లనఁగా, దీనికి ముందుపద్యముతో నన్వయము.
మ. వనితా యావిభుఁ గాంచువాంఛ మదిఁ జె◊ల్వం బూనినం గాంచవే
జనితాసక్తి నృపాలు మామకకర◊చ్ఛాయ న్మనోవీథి నూ
త్ననితాంతాద్భుత మబ్బ నంచు మహిమం ◊దత్సద్గుణశ్రేణికా
ఖని తాఁ బ్రాక్కృతమాయ నంతయుఁ జనం ◊గావింప నప్పట్టునన్. 78
టీక: వనితా=చకోరీ! ఆవిభున్=ఆరాజును; కాంచువాంఛ =చూడవలెననుకోరిక; మదిన్=మనస్సునందు; చెల్వంబు ఊనినన్ = చక్కగాఁ గుదిరినయెడల; మనోవీథిన్=మనఃప్రదేశమునందు నూత్ననితాంతాద్భుతము=అపూర్వమైన మిక్కిలియాశ్చర్యము; అబ్బన్=అమరునట్లు; మామకకరచ్ఛాయన్=నాచేతిచాయను; జనితాసక్తి న్=కలిగినప్రీతితో; నృపాలున్=రాజును; కాంచవే=చూడుమా; అంచున్=ఇట్లనుచు; తత్సద్గుణశ్రేణికాఖని=ఆశ్రేష్ఠగుణాకరుఁడగు కుముదుఁడు; మహిమన్=ప్రభావము చేత; తాన్; ప్రాక్కృతమాయను అంతయున్=ఇతరజనులకుఁ గాన్పింపఁ గూడదని మున్ను చేసిన మాయ నంతయు; చనన్ = తొలఁగునట్లు; కావింపన్=చేయఁగా; అప్పట్టునన్=ఆప్రదేశమున, దీనికి ముందు కన్వయము.
సీ. బెళుకుచూపులవానిఁ, బలుమాఱు బలుమారు,సొంపు నిందించుమే◊ల్సొబగువాని,
నొఱపు మించినవాని, నెఱమించునెఱమించు,మెలపుఁ గందించు నె◊మ్మేనివాని,
సొగసు మీఱినవానిఁ, బగడంబుపగడంబు,తలఁపుఁ గుందించుమేల్◊తళుకువానిఁ,
గళుకు హెచ్చినవానిఁ, గపురంపుకపురంపు,వలపుఁ జిందించున◊వ్వొలయువానిఁ,
తే. గళ మెలకువాని, మంజులో◊జ్జ్వలమువానిఁ, జెలువు గలవాని, నొయ్యార ◊మలరువాని,
నభ్రయానసమాసీను, ◊నాక్షితీశుఁ, జూచి వెఱగంది నిలిచి రా◊సుదతు లపుడు. 79
టీక: బెళుకుచూపులవానిన్= ప్రకాశించుచున్న దృష్టులుగలవానిని; పలుమాఱు=సారెకు; బలుమారుసొంపు –బలు = అధికమైన, మారు=మన్మథునియొక్క, సొంపు=సౌందర్యమును; నిందించుమేల్సొబగువాని =నిందించునట్టి మేలైన చక్కఁ దనముగలవానిని; ఒఱపు మించినవానిన్=యోగ్యతచే నతిశయించినవానిని; నెఱమించు నెఱమించుమెలపున్ – నెఱ=అధికముగ, మించు = ప్రకా శించుచున్న, నెఱమించు=నిండుమెఱపుయొక్క, మెలపున్=జాగరూకతను; కందించు నెమ్మేనివాని=శ్రమపఱచు నందమగు శరీరముగలవానిని; సొగసు మీఱినవానిన్=అందముచే నతిశయిల్లువానిని; పగడంబుపగడంబుతలఁపున్ – పగడంబు=ప్రవాళముయొక్క, పగ=
విరోధముయొక్క, డంబు=అతిశయముయొక్క, తలఁపున్=చింతను; కుందించుమేల్తళుకువానిన్ – కుందించు=దుఃఖపెట్టుచున్న, మేల్=అధికమైన, తళుకువానిన్=ప్రకాశముగలవానిని; కళుకు హెచ్చినవానిన్ = కాంతిచే నతిశయించినవానిని; కపురంపుకపురంపువలపున్ – క=సుఖమునకు, పురంపు=స్థానమైన, కపురంపువలపున్=కర్పూరసంబంధిపరిమళమును; చిందించునవ్వొలయువానిన్ = చెదరఁగొట్టుచున్న మందహాసము వెల యించువానిని; కళ మెలకువానిన్=కళాప్రకాశముగలవానిని; మంజులోజ్జ్వలమువానిన్=మనోహరమైన శృంగారముగలవానిని, ‘ఉజ్జ్వలో ధీర శృంగార విశదేషు విలాసిని’ అని విశ్వము; చెలువు గలవానిన్=అందకానిని; ఒయ్యార మలరువానిన్ = విలాసమొప్పువానిని; అభ్రయానసమాసీనున్=విమానారూఢుని; ఆక్షితీశున్=ఆసుచంద్రుని; చూచి; వెఱగంది=ఆశ్చర్యమంది; ఆసుదతులు=ఆ స్త్రీలు; నిలిచిరి; అపుడు=ఆసమయమందు, దీని కుత్తరపద్యస్థక్రియతో నన్వయము.
చ. పులకలు మేన నిక్క, వల◊పుంబస మానసవీథిఁ జిక్క, దృ
క్స్థలి ననిమేషవిస్ఫురణ ◊దక్కఁ, బ్రమోదము చిందు ద్రొక్క, ని
ర్మలమణిపీఠి డిగ్గి యొక◊మానిని కేల్కయిలాగు వూని యా
యలికులవేణి రాజకుసు◊మాశుగుఁ గాంచె నొకింత సిబ్బితిన్. 80
టీక: మేనన్=శరీరమునందు; పులకలు=గగుర్పాటులు; నిక్కన్= అతిశయింపఁగా; మానసవీథిన్=అంతరంగమందు; వలపుంబస = మోహసమృద్ధి; చిక్కన్=చేరఁగా; దృక్స్థలిన్=చూపునందు; అనిమేషవిస్ఫురణ=ఱెప్పపాటులేమియొక్క స్ఫూర్తి; దక్కన్=లభింపఁగా; ప్రమోదము=సంతసము; చిందు ద్రొక్కన్=నటింపఁగా; ఆయలికులవేణి=నీలవేణియగు నా చంద్రిక; ఒకమానినికే ల్కయిలాగు =ఒకస్త్రీయొక్క హస్తావలంబమును; పూని = గ్రహించి; నిర్మలమణిపీఠిన్=స్వచ్ఛమగు మణిమయాసనమునుండి; డిగ్గి =దిగి; రాజకుసుమాశుగున్=రాజమన్మథుఁడగు సుచంద్రుని; ఒకింత సిబ్బితిన్=కొంచెము లజ్జచేత; కాంచెన్=అవలోకించెను.
ఇచటఁ జంద్రికకు లోకోత్తరవస్తుదర్శనమున విస్మయము, దానంజేసి మేనఁ బులకలు, తదనంతర మాతనియందు రత్యు దయము, తదనంతరము మనోరథలాభముచేత హర్షము, దానంజేసి నిమేషశూన్యదర్శనము, ప్రథమదర్శనమున లజ్జోద యము చెప్పఁబడియె. ‘శ్లో.లోకోత్తరపదార్థానా మపూర్వాలోకనాదిభిః|విస్తార శ్చేతసోయస్తు విస్మయ స్స నిగద్యతే| క్రియా స్తత్రాక్షివిస్తార సాధూక్తి పులకాదయః’ అని విస్మయలక్షణతత్కార్యకారణములు, ‘రోమాఞ్చో విస్మయోత్సాహహర్షాద్యై స్తత్ర విక్రియాః| రోమోద్గమో ముఖోల్లాస గాత్రసంస్పర్శనాదయః’ అని రోమాంచలక్షణతత్కార్యకారణములు, ‘యూనో రన్యోన్యవిషయాస్థాయినీచ్ఛారతి ర్భవేత్| నిసర్గేణాభియోగేన సంసర్గేణాభిమానతః| ఉపమాధ్యాత్మ్యవిషయై రేషా స్యాత్తత్ర విక్రియాః| కటాక్షపాత భ్రూక్షేప ప్రియవాగాదయో మతాః’ అని రతిలక్షణతత్కార్యకారణములు, ‘మనోరథస్యలాభేన సిద్ధ్యా యోగ్యస్య వస్తునః| ప్రియసంగమదేవాదిప్రసాదాదేశ్చ కల్పితః| మనఃప్రసాదో హర్ష స్స్యాత్తత్ర నేత్రస్యఫుల్లతా| ప్రియభాషణ మాశ్లేషః పులకానాం ప్రరోహణమ్|’ అనిహర్షలక్షణతత్కార్యకారణములు, తెలియవలయు. నేత్రస్యఫుల్లతా, అనుటచేత నిర్ని మేషభావమును వివక్షితమే. అట్లు ‘నివాతపద్మస్తిమితేనచక్షుషా నృపస్య కాంతం పిబత స్సుతానతమ్| మహోదధేః పూర ఇవేన్దు దర్శనాద్గురుః ప్రమోదః ప్రబభూవ చాత్మని’ ఇత్యాదులయందు నిర్నిమేషతఁ జూడవలయు. ‘అకార్యకరణావజ్ఞాస్తుతి నూతన సంగమైః| ప్రతీకారాక్రియాద్యైశ్చ వ్రీడాత్వనతిధృష్టతా| తత్ర చేష్టాని గూఢోక్తిరాధోముఖ్యవిచిన్తనే| అనిర్గమో బహిః క్వాపి దూరా దేవావగుంఠనమ్| నఖానాం కృన్తనం భూమిలేఖనం చైవమాదయః’ అని లజ్జాలక్షనతత్కార్యకారణములు తెలియవలయు. ఇట్లు చెప్పినవీనిలో రతి యనునది స్థాయిభావము. అది, ‘నియతం వికాసవిస్తృతివిక్షోభక్షేపసంజ్ఞితా ధర్మాః| చత్వారో జాయన్తే సపది విభావాదిసంగమే మనసః| కథితో వికాసమూలశ్శృఙ్గారోవిస్తరోపధిర్వీరః| క్షోభోపధిస్తురౌద్రోబీభత్సః క్షేపమూలకః పూర్వైః| హాస్యాశ్చర్యభయానకదయావికాసాదిమూలకాః క్రమశః’ అనుటవలన విభావాదిసంగమమున మనసునందుఁ గల్గు వికాసరూపధర్మము, దానికి స్థాయిత్వము సజాతీయవిజాతీయానభిభావ్యమై యావదానందానుభవము నిలిచియుండుటం బట్టి కలిగినది, తల్లక్షణంబు వెనుక వ్రాయఁబడియె. విస్మయంబు స్వతంత్రముగ నద్భుతరసమునుగూర్చి స్థాయి యైనను నిట దానికి స్థాయిత్వము గలుగదు. దాని కనుభవపర్యంతావస్థాయిత్వము లేక కించిత్కాలావస్థాయిత్వ ముండుటంబట్టి దాని యందు, ‘విరుద్ధైరవిరుద్ధైర్వా భావైర్విచ్ఛిద్యతే నయః| ఆత్మభావన్నయత్యన్యాన్’ ఇత్యాదిస్థాయిలక్షణము సమన్వయిం పదు. మఱేమన్న, ‘రత్యాదయః స్థాయిభావాస్స్యు ర్భూయిష్ఠ విభావజాః| స్తోకై ర్విభావై రుత్పన్నా స్త ఏవ వ్యభిచారిణః’ అను సంగీతరత్నాకరమువలనను, ‘భావోవాపి రసోవాపి ప్రవృత్తిర్వృత్తిరేవ వా| సర్వేషాం సమవేతానాం రూపం యస్య భవే ద్బహు| సమన్తవ్యోరసస్థాయీ శేషా స్సంచారిణో మతాః’ అను భరతవచనమువల్లను, దానికి రతినిగూర్చి సంచారిత్వమే ఘటిల్లునని తెలియవలయు. ఇఁక రోమాంచ మనునది సాత్త్వికభావము, అది యనుభావవిశేషమె, మనోగతభావమును బయల్పఱచునట్టి భావము లనుభావములు, వాని లక్షణములు, భేదములు వెనుక వ్రాయఁబడియె. హర్షము, లజ్జయు సంచారులు, ఇవి రతిని పుష్టి పఱచునవి, ‘ఉన్మజ్జన్తో నిమజ్జన్తః స్థాయిన్యమ్బునిధావివ| ఊర్మివ ద్వర్ధయన్త్యేనం యాన్తి తద్రూపతాం చ తే’ ఇత్యాదులు తత్ప్రమాణములు. ఇట్లు సాత్త్వికవ్యభిచారులచే నుపచితమగు స్థాయి రసరూపత నొందునని ముందు తెల్లమగును.
చ. జనపతియాస్యచంద్రుఁ గనఁ ◊జాలఁ జెలంగు వధూటికావలో
కనకుహనాచకోరములు ◊గ్రక్కున వ్రీళతమశ్చయంబు పొ
ల్చిన భ్రమియింప దాని సడ◊లించె మరుండు విచిత్రశక్తి నూ
తనశరజాతనిర్వమదు◊దారశిఖోదయరాగవైఖరిన్. 81
టీక: జనపతియాస్యచంద్రున్=రాజుముఖమనెడు చంద్రుని; కనన్=చూచుటకు; చాలన్=మిక్కిలి; చెలంగు = ఒప్పుచున్న; వధూటికావలోకనకుహనాచకోరములు – వధూటికా=చంద్రికయొక్క, అవలోకన=చూపులనెడు, కుహనా=నెపము గల , చకోరములు = వెన్నెలపులుఁగులు; గ్రక్కునన్=వేగముగా; వ్రీళతమశ్చయంబు =లజ్జయను నంధకారపుగుంపు;పొల్చినన్ = ఉదయించుటచేత; భ్రమియింపన్=కలఁతనొందఁగా; మరుండు = మన్మథుఁడు; విచిత్రశక్తి న్=అద్భుతమగుసామర్థ్యముచేత; నూతనశరజాతనిర్వమదుదారశిఖోదయరాగవైఖరిన్ – నూతన=క్రొత్తదగు, శరజాత=బాణసంఘముచేత, నిర్వమత్=వెడలు చున్న, ఉదార=అధికమైన,శిఖా=జ్వాలలనెడు, ఉదయరాగ=ఉదయకాలారుణ్యముయొక్క, వైఖరిన్ =రీతిచేత; దానిన్=ఆ లజ్జాంధకారమును; సడలించెన్=పోఁగొట్టెను.
అనఁగా నామె రాజును జూచునపుడు లజ్జ ప్రతిబంధకముగా నుదయించియు రాగాతిశయమునఁ దొలంగినదనియు, నందు వలన సంపూర్ణనయనానందము ఘటిల్లిన దనియు వ్యజ్యమానమగుచున్నది. కామము రాగాతిశయరూపమేకాని వేఱొండు పదార్థము గాదు. ఇచ్ఛారూపము రతి యనియు, నుత్కటేచ్ఛారూపము కామమనియు వ్రాయఁబడియె.రమ్యవస్తుదర్శనమున దానియందుఁ బ్రీతి గల్గి యిది మదిష్టసాధనమగునని దానియం దుత్కటప్రీతి గల్గుట యనుభవసిద్ధము. చంద్రికకు సుచంద్రునిఁ జూడగనె లోకోత్తరవస్తుదర్శనప్రయుక్తవిస్మయము గల్గి వెనుక రతి గల్గి తదనంతరంబ కామ ముదయించినదని చెప్పఁబడియె. సుచంద్రునకు నిట్లే రత్యనంతరము కామము వెనుక చెప్పఁబడినది. రతి సంభోగేచ్ఛాత్మక మను మతమును గూర్చియు రతి కామముల పౌర్వార్యమును గూర్చియు కావ్యాలంకారసంగ్రవిమర్శనము చూడవలయు.
తే. చెలిఁ దఱియ వచ్చునరపాల◊సితదృగాళి, దారి నానారిచూపుచా ◊ల్దవిలి నడచె
నపుడు గగనధునీప్రవా◊హంబు సొచ్చి, వేగ యెదురెక్కు మీనౌఘ◊విధి వహించి. 82
టీక: చెలిన్=చంద్రికను; తఱియన్=సమీపించుటకు; వచ్చునరపాలసితదృగాళిదారిన్=వచ్చుచున్న ఱేనితెల్లనిచూపుచాలు యొక్కత్రోవను; ఆనారిచూపుచాల్=ఆచంద్రికయొక్క దృక్పరంపర; తవిలి =సంబంధించి; అపుడు; గగనధునీప్రవాహంబు =వ్యోమగంగాప్రవాహమును; చొచ్చి=ప్రవేశించి; వేగ=త్వరగా; ఎదురెక్కు=ఎదురునడచుచున్న; మీనౌఘవిధిన్=మీనుల గుంపు ప్రకారమును; వహించి =పొంది; నడచెన్=పోయెను.
ఆరాజుచూపులు తెల్లగ స్వర్గంగాప్రవాహముంబోలెఁ జంద్రికయందుఁ బ్రసరించిన వనియు, ఆప్రవాహరూపమగు చూపు చాలునందు నెదురెక్కు మీనులఁబోలెఁ జంద్రికాదృక్పరంపర నృపుపై నడిచె ననియు, దానం జేసి యన్యోన్యదర్శనానందపరి పూర్తి ఘటిల్లె ననియుఁ దెలియవలయు.
ఇట నాయికానాయకాన్యోన్యదర్శనానందానుభవముచే నితరేతరానురాగము ప్రవ్యక్తంబగుచున్నది. దానంజేసి పూర్వా నురాగాఖ్యవిప్రలంభశృంగార మిందు సకలసామగ్రులు గలుగుటచేఁ బూర్ణముగ స్ఫురించుచున్నది. ఏలాగనిన, అన్యోన్యావ లోకనమున నితరేతరవిషయకమైన ప్రీతి వ్యక్తమగుచున్నదిగదా! ‘యూనో రన్యోన్యవిషయాస్థాయినీచ్ఛారతి ర్భవేత్’అనుట వలన నది రతి యనఁబడుచున్నది. దాని కిరువురును ఆలంబనవిభావములు. ‘ఆలమ్బన న్నాయికాస్యు ర్దక్షిణాద్యాశ్చ నాయకాః ’ అని వెనుక వ్రాయంబడియె. నాయిక స్వీయా, పరకీయా,సామాన్యాభేదముచేఁ ద్రివిధ యనియు, నందు స్వీయ, ముగ్ధా, మధ్యా,ప్రగల్భాభేదముచేఁ ద్రివిధ యనియు, నందు మధ్యాప్రగల్భలు ధీరా, అధీరా, ధీరాధీరాభేదముచేఁ బ్రత్యేకముగఁ ద్రివిధలై , జ్యేష్ఠాకనిష్ఠాభేదమునఁ బ్రత్యేకముగ నాఱుతెగ లనియు, పరకీయ పరోఢా, కన్యకాభేదముచేఁ ద్వివిధ యనియు, సామాన్య యొకతె యనియు, నిట్లు పదార్వురైన నాయికలు ప్రత్యేకముగ స్వాధీనపతికా, వాసకసజ్జా, విరహోత్కంఠిత, అభిసారికా, విప్రలబ్ధా, ఖండితా, కలహాంతరితా, ప్రోషితపతికాభేదముచేత నెన్మిదిభేదములు గలవారై, యుత్తమా,మధ్యమా, అధమాభేదములతోఁ బ్రత్యేకముగఁ ద్రివిధలై, మున్నూటయెనుబదినాల్గుభేదములతో రాజిల్లుదు రనియు, ‘శ్లో. స్వీయా త్రయోదశవిధా ద్వివిధాతు పరాఙ్గనా| వేశ్యైకైవం షోడశధా తాశ్చావస్థాభి రష్టభిః|ప్రత్యేక మష్టధా తాసా ముత్తమాదిప్రభేదతః| త్రైవిధ్య మేవం చ చతురశీతిత్రిశతం భవేత్|’ అనుటవలన నెఱుంగునది. అట్లు నాయకులు పతి, ఉపపతి, వైశికుఁడు,అని ముగ్గు రనియు, అందుఁ బతి దక్షిణుఁడు, అనుకూలుఁడు, ధృష్టుఁడు, శఠుఁడు, అని నాలుగుభేదములు గలవాఁడనియు సింగభూపా లీయమున, ‘శృఙ్గారాపేక్షయా తేషాం త్రైవిధ్యం కథ్యతే బుధైః| పతి శ్చోపపతి శ్చైవ వైశికశ్చేతి భేదతః| పతిస్తు విధినా పాణి గ్రాహకః కథ్యతే బుధైః| చతుర్థా సోఽపి కథితో వృత్త్యా కావ్యవిచక్షణైః| అనుకూల శ్శఠోధృష్టో దక్షిణశ్చేతి భేదతః|’ ఇత్యా దుల వలనఁ దెలియునది. ఇట్లు చంద్రికాసుచంద్రరూపాలంబనవిభావములు సానురాగావలోకనాద్యనుభావములు, పూర్వోక్త స్వేదాదిసాత్త్వికములు, హర్షలజ్జాదిసంచారులు, ‘యౌవనం రూపలావణ్యే సౌన్దర్యమభిరూపతా| మార్దవం సౌకుమార్యం చే త్యాలమ్బన గతాగుణాః’ అని చెప్పఁబడిన యాలంబనగుణములు, భావహావహేలావిభ్రమకిలికించితమోట్టాయితకుట్టమి తాదిగాఁ జెప్పఁబడినవానిలో యథాసంభవముగఁ దచ్చేష్టలు, నూపురాంగదహారాది తదలంకరణములు, ఉపవనమంద మారుతకోకిలాలాప భ్రమరఝంకారాదితటస్థములును నీనాలుగుతెగలైన యుద్దీపనవిభావములు చేరియుండుటవలనఁ బరి పూర్ణసామగ్రీసంఘటన మైనందున రతిరూపస్థాయిభావమునకు రసరూపత గలుగుచున్నది. ‘శ్లో.ఏతేచ స్థాయినః స్త్వెస్త్వె ర్విభావై ర్వ్యభిచారిభిః| సాత్త్వికై రనుభావైశ్చ నటాభినయయోగతః| సాక్షాత్కారమివానీతైః ప్రాపితా స్స్వాదురూపతామ్| సామాజికానా న్మనసి ప్రయాన్తి రసరూపతామ్|’ ఇత్యాదులు తత్ప్రమాణంబులు. ఇట నటాభినయపదము కావ్యమున కుప లక్షకము, ‘రత్యాదేః స్థాయినో లోకే తానిచే న్నాట్యకావ్యయోః| విభావా అనుభావాశ్చ కథ్యన్తే వ్యభిచారిణః| వ్యక్త స్సతై ర్విభా వాద్యైః స్థాయీభావో రస స్స్మృతః|’ అను కావ్యప్రకాశాదులవలన నయ్యది యెఱుంగునది. ‘విభావై రనుభావైశ్చ సాత్త్వికై ర్వ్యభిచారిభిః| నీతా సదస్యరస్యత్వంరతి శ్శృఙ్గార ఉచ్యతే’ అనుటవలన నిది శృంగారరసము. అందును, ‘అయుక్తయో స్తరుణయోర్యోనురాగః పరస్ప రమ్| అభీష్టాలిఙ్గనాదీనామనవాప్తౌ ప్రకృష్యతే| స విప్రలమ్భో విజ్ఞేయః’ అనుటవల్ల విప్రలంభ మనియు, అందును, ‘యత్ప్రేమ సంగమాత్పూర్వం దర్శనశ్రవణోద్భవమ్’ అని ఉపక్రమించి ‘సోయంపూర్వానురాగాఖ్యో విప్రలమ్భ ఇతీరితః’అనుటవలనఁ బూర్వానురాగాఖ్యవిప్రలంభ మనియుఁ దెలియునది. విప్రలంభము పూర్వానురాగమాన ప్రవాసాదిభేదములు గలదని వెనుక వ్రాయంబడియె.
చ. నిజబలరూఢి దోఁపఁ దఱి ◊నివ్వటిలెన్ బళి యంచుఁ దాఁ జతు
ర్భుజుఁడయి పంచసాయకుఁడు ◊భూరిధృతిన్ క్షణదోదయాధిపా
త్మజబొమవింటిదోయి నస◊మానవిలోచనమాలికాసితాం
బుజవిశిఖాళి నించె నల◊భూపతి పేరెద గాఁడి పాఱఁగన్. 83
టీక: పంచసాయకుఁడు=మరుఁడు; నిజబలరూఢి =తనసామర్థ్యాతిశయము; తోఁపన్=కనఁబడునట్లు; తఱి =సమయము; నివ్వటిలెన్ =ఘటిల్లెను; బళి =ఔర! అంచున్=అనుకొని; తాన్; చతుర్భుజుఁడయి =నాలుగుచేతులు గలవాఁడై, ఉప్పొంగిన వాఁడయి యనుట; భూరిధృతిన్ =అధికమైన ధైర్యముచేత; క్షణదోదయాధిపాత్మజబొమవింటిదోయిన్ – క్షణదోదయాధి పాత్మజ=క్షణదోదయరాజపుత్త్రిక యగు చంద్రికయొక్క, బొమవింటిదోయిన్=బొమలనెడు ధనుర్యుగ్మముచేత; అలభూ పతి=ఆరాజు (సుచంద్రుని)యొక్క, పేరెద =విశాలవక్షమును, కాఁడి పాఱఁగన్ =తూఱిపాఱునట్లు; అసమానవిలోచనమాలికా సితాంబుజవిశిఖాళిన్ – అసమాన= సాటిలేని, విలోచనమాలికా=(చంద్రికా)దృక్పరంపర యనెడు, అసితాంబుజవిశిఖాళిన్= నీలోత్పలరూపమైన బాణపరంపరను, ‘అరవిన్ద మశోకం చ చూతం చ నవమల్లికా| నీలోత్పలం చ పఞ్చైతే పఞ్చబాణస్య సాయకాః’ అని యమరుఁడు; నించెన్ = పూరించెను.
చంద్రికాదృక్పరంపర మన్మథునిచేఁ బ్రయోగింపఁబడిన నీలోత్పలబాణపరంపరను బోలియుండె ననియు, నామెబొమలు పంచశరశరాసనములఁ బోలియుండె ననియు భావము. ఆరాజున కామెచూపులు కరము మదనోద్దీపనకరము లని ఫలితార్థము.