క. వలయితచాపజ్యాసం,స్థలి రోపత్రితయిఁ గూర్చి ◊జనపతియెద నే
ర్పలవడ నాటించి మహీ,వలయాధిపుఁ గాంచి యసుర◊వరుఁ డిట్లనియెన్. 123
టీక: వలయితచాపజ్యాసంస్థలిన్ – వలయిత=వలయాకారముగాఁ జేయఁబడిన, చాప=ధనుస్సుయొక్క, జ్యాసంస్థలిన్ = అల్లెత్రాటియందు; రోపత్రితయిన్=బాణత్రయమును; కూర్చి = సంధించి; జనపతియెదన్ = సుచంద్రునివక్షమందు; నేర్పు అలవడన్ = నేర్పుమీఱునట్లు; నాటించి = నాటుకొనునట్లు చేసి; మహీవలయాధిపున్=సుచంద్రుని; కాంచి =చూచి; అసుర వరుఁడు = రాక్షసశ్రేష్ఠుఁడు; ఇట్లనియెన్= వక్ష్యమాణప్రకారముగాఁ బలికెను.
మ. మతి నొక్కింత విచార మూన కురుసం◊పద్గర్వరేఖ న్మహా
దితిజాధీశవిరోధ మంది యిటు లే◊తేర న్మనం బుంతురే
రతి ధాత్రిన్ మనఁ గల్గినన్ జనుము మ◊ద్రాజద్భుజాదండమం
డితకోదండవినిర్వమద్విశిఖముల్ ◊నిం గాఁడ విప్పట్టునన్. 124
టీక: మతిన్=బుద్ధియందు;ఒక్కింత = అల్పమయినను;విచారము=ఆలోచనమును; ఊనక=వహింపక; ఉరుసంపద్గర్వరేఖన్ = అధికమగు నైశ్వర్యమదపరంపరచేత; మహాదితిజాధీశవిరోధము = గొప్పరాక్షసప్రభువైన నాతో వైరమును; అంది = పొంది; ఇటులు ఏతేరన్=ఇట్లు వచ్చుటకు; మనంబు ఉంతురే = మనస్సు నుంచుదురా? ధాత్రిన్=భూమియందు; మనన్=బ్రతుకుటకు; రతి = కోరిక; కల్గినన్ = ఉన్నయెడల; చనుము = పొమ్ము; మద్రాజద్భుజాదండమండితకోదండవినిర్వమద్విశిఖముల్ – మత్ = నాయొక్క, రాజత్=ప్రకాశించుచున్న, భుజాదండ=బాహుదండములచేత, మండిత=అలంకరింపఁబడిన, కోదండ=ధనువు వలన,వినిర్వమత్=వెడలుచున్న,విశిఖముల్=అమ్ములు; నిన్=నిన్ను; ఇప్పట్టునన్=ఈసమయమున; కాఁడవు=బాధింపవు.
మ. మునివాక్యంబున మోసపోయితివి త◊న్మూలంబుగాఁ జుమ్ము నీ
కెనసెన్ గాలము మద్రణేహ గనువాఁ◊డెవ్వాఁడిలన్ మించెఁ జొ
చ్చెనొ నీవీనుల లేదొ భూమివర యా◊జిప్రాప్తదేవేశకృం
తనసంలోలమదాశయాన్యవిధికృ◊ద్ధాత్రుక్తమిత్త్రోక్తికల్. 125
టీక: మునివాక్యంబునన్=శాండిల్యమునివచనముచే; మోసపోయితివి = వంచితుఁడవైతివి; తన్మూలంబుగాఁ జుమ్ము = అతని మూలముగా సుమీ; నీకున్; కాలము = నాశకాలము; ఎనసెన్ =ఘటిల్లెను; మద్రణేహ గనువాఁడు = నాతో యుద్ధము జేయు నిచ్ఛగలవాఁడు; ఎవ్వాఁడు=ఎవఁడు; ఇలన్=భూమియందు; మించెన్=అతిశయించెను? భూమివర = ఓ మహీపతీ! ఆజిప్రాప్తదేవేశకృంతనసంలోలమదాశయాన్యవిధికృద్ధాత్రుక్తమిత్త్రోక్తికల్ – ఆజిప్రాప్త = యుద్ధమును బొందిన, దేవేశ=ఇంద్రుని యొక్క, కృంతన=సంహారమందు, సంలోల=మిక్కిలిఆసక్తుఁడనగు, మత్=నాయొక్క, ఆశయ=అభిప్రాయమునకు, అన్య విధికృత్= మఱియొకప్రకారముఁ జేయుచున్న, ధాత్రుక్త = బ్రహ్మదేవునిచేఁ బలుకఁబడిన, మిత్త్రోక్తికల్=సాంత్వనములు; నీ వీనులన్= నీశ్రోత్రములను; చొచ్చెనొ లేదొ = ప్రవేశించెనో లేదో? అనఁగా నొకపుడు దేవేంద్రుఁడు యుద్ధమునకు వచ్చియుండఁగా నతని సంహరింప నుద్యమించిన నేను బ్రహ్మ బతిమాలఁ గాఁ జంపక వదలినవాఁడ. ఈవృత్తాంతము నీచెవి సోఁకినదో లేదో అనుట. ఇట్లు చెప్పుటం జేసి సర్వాతిశాయిసామర్థ్యము గల వాఁడని గర్వము ధ్వనిత మగును.
సీ. లలనాళిగీతక◊ల్యాణగీతిక గాదు, చెవి యాన ఘనసింహ◊రవము గాని,
సరసకేళీచంద్ర◊శాలికావళి గాదు, విహరింప సంగ్రామ◊వీథి గాని,
బంధురకర్పూర◊గంధచర్చిక గాదు, మే నూన మొనముల్కి◊సోన గాని,
సేవాపరాప్తధా◊త్రీవరౌఘము గాదు, తిలకింప దనుజేంద్ర◊బలము గాని,
తే. గురుహితజనావృతవిహార◊ఖురళి గాదు, శరగరిమఁ జోప శాత్రవాం◊తరము గాని,
తరము గాదిట్లు రణ మూనఁ ◊దరణికులజ, తఱిమి వధియింతు నీవేళఁ ◊దలఁగి చనుము. 126
టీక: తరణికులజ = సూర్యవంశజుఁడవైన సుచంద్రుఁడా! చెవి యానన్ = శ్రోత్రపానము చేయుటకు, సుఖాకర్ణనమున కనుట; ఘనసింహరవము గాని = (ఇది) గొప్పసింహనాదము గాని; లలనాళిగీత =స్త్రీబృందముచే గానముచేయఁబడిన;కల్యాణగీతిక = శుభగీతము; కాదు. విహరింపన్=క్రీడించుటకు; సంగ్రామవీథి గాని = (ఇది) రణరంగముగాని; సరసకేళీచంద్రశాలికావళి – సరస=శ్రేష్ఠమగు, కేళీ చంద్రశాలికా = క్రీడాసౌధవిశేషములయొక్క, ఆవళి =పంక్తి; కాదు. మేనూనన్ = శరీరమందూనుటకు; మొనముల్కిసోన గాని = (ఇది) తీక్ష్ణాగ్రములగు బాణములవృష్టిగాని; బంధురకర్పూర గంధ చర్చిక – బంధుర=దట్టమగు, కర్పూరగంధ = కర్పూరగంధముయొక్క, చర్చిక =లేపనము; కాదు. తిలకింపన్ =వీక్షించుటకు; దనుజేంద్రబలము గాని = (ఇది)రాక్షసేశ్వరసైన్యముగాని; సేవాపరాప్తధాత్రీవరౌఘము – సేవాపరాప్త = కొలుచుటకై వచ్చినట్టి ప్రియులైన, ధాత్రీవర=రాజులయొక్క, ఓఘము =సంఘము; కాదు. శరగరిమన్ = బాణగరిమచే; చోపన్=తఱుముటకు; శాత్రవాంతరము గాని = (ఇది) శత్రుమధ్యముగాని; గురుహితజనావృత విహారఖురళి – గురు=అధికులగు, హితజన=మిత్త్రజనులచేత, ఆవృత=వ్యాప్తమైన, విహారఖురళి =క్రీడార్థమైనగరిడి; కాదు; ఇట్లు=ఈవిధముగా; రణ మూనన్=యుద్ధముసేయుటకు; తరము గాదు = శక్యము గాదు; ఈవేళన్ = ఈక్షణమందు; తఱిమి వధియింతున్ = బలాత్క రించి పరిమార్తును; తలఁగి =యుద్ధమునుండి తొలఁగి; చనుము = పొమ్ము.
త్వరితగతి. అనియసురకులరమణుఁ ◊డరుణతరవీక్షా
జనితరుడనలకణవి◊సర మరిమనోభీ
జనక మయి పొదల శిత◊శరచయముచేఁ ద
ద్వనజహితజననపతిఁ ◊ద్వరితగతిఁ గప్పెన్. 127
టీక: అని = ఈప్రకారముగాఁ బలికి; అసురకులరమణుఁడు = దనుజేశ్వరుఁడైన తమిస్రుఁడు; అరుణతరవీక్షాజనితరుడనలకణ విసరము – అరుణతర = మిక్కిలి యెఱ్ఱనగు, వీక్షా=చూపులచేత, జనిత=పుట్టింపఁబడిన, రుడనల = రోషాగ్నియొక్క, కణ విసరము = లేశములగుంపు; అరిమనోభీజనకమయి = శత్రుహృదయములకు భయజనకమై; పొదలన్=ఒప్పఁగా; శితశర చయముచేన్ = తీక్ష్ణబాణపరంపరచేత; తద్వనజహితజననపతిన్=ఆసూర్యవంశజుఁడైన రాజును, ‘సంతతి ర్గోత్ర జనన కులాని’ అని యమరుఁడు; త్వరితగతిన్ =శీఘ్రగతిచేత; కప్పెన్ = ఆవరించెను.
ఆరాజుపైఁ గఱకుటమ్ములగుంపులు గురిపించెనని తాత్పర్యము. ఇందు వృత్తనామమయిన త్వరితగతిశబ్దము ప్రకృతార్థ పరముగ నిమిడించుటచే ‘నితమ్బ గుర్వీ తరుణీ దృగ్యుగ్మవిపులా చ సా’ ఇత్యాదిస్థలములయందువలె ముద్రాలంకారము. ‘సూచ్యార్థసూచనం ముద్రా ప్రకృతార్థపరైః పదైః’ అని తల్లక్షణంబు. త్వరితగతివృత్తలక్షణము. ‘అదనదనున హరినుతు ◊లమర ధర బాలా|శదళమనఁ దనరుఁ గవి◊జనులు వచియింపన్| బదునొకటగు నెడ యతి ◊పదిలముగఁ జేరన్| గదియు నగ ణము లయిదు ◊గగము తుద నొందన్’ అని యప్పకవీయమునఁ జెప్పఁబడియె. త్వరితగతికి పాలాశదళమని నామాంతర మని యందె వచింపఁబడియె.
చ. తెఱలనిశక్తి నప్పొలసు◊దిండికొలంబులమేటి యిట్టు ల
త్తఱి విశిఖాళిఁ గప్ప వసు◊ధాపతి దట్టపుమంచుపిండు బల్
కఱకఱిమించులం దునుము◊కంజహితుం డన వాఁడితూపులన్
మఱలఁగఁ జేసి యాదనుజ◊నాథుఁ గుఱించి మృదూక్తి నిట్లనున్. 128
టీక: అప్పొలసుదిండికొలంబులమేటి =ఆరాక్షసకులాధిపతి; తెఱలనిశక్తిన్=తొలఁగని సామర్థ్యముచేత; ఇట్టులు=ఈరీతిగ; అత్తఱిన్=అప్పుడు; విశిఖాళిన్=బాణపరంపరచే; కప్పన్=ఆవరింపఁగా; వసుధాపతి = సుచంద్రుఁడు;దట్టపుమంచుపిండున్= నిబిడహిమకదంబమును;బల్ కఱకఱిమించులన్=అధికమైన కఠినమైన తేజస్సులచేత;తునుముకంజహితుండనన్=ఖండించు సూర్యుండో యనునట్లు; వాఁడితూపులన్=కఱకుబాణములచేత; మఱలఁగఁ జేసి =మఱలునట్లు చేసి; ఆదనుజనాథుఁగుఱించి = ఆరాక్షసేశ్వరునిగూర్చి; మృదూక్తిన్=మృదువైన వాక్కులచేత; ఇట్లనున్=వక్ష్యమాణప్రకారముగఁ బలుకును.
చ. అలఘురణోర్విఁ జేరి యసు◊రాధిప యీగతి వట్టిపల్కుచాల్
పలుకుట వీరధర్మమె న◊భస్స్థలి నిర్జరు లెల్లఁ జూడ నీ
చలము బలంబు శస్త్రకుల◊చాతురిఁ జూపుము చూచి యంతటన్
బ్రలయకృశానుహేతిసమ◊బాణపరంపరఁ గూల్తు గ్రక్కునన్. 129
టీక: అసురాధిప =రాక్షసాధిపతీ! అలఘురణోర్విన్=అధికమయిన యుద్ధభూమిని; చేరి =పొంది; ఈగతిన్=ఈతీరున; వట్టి పల్కుచాల్=వ్యర్థవాక్పరంపరను; పలుకుట = చెప్పుట; వీరధర్మమె=వీరులపాడియా? నభస్స్థలిన్=ఆకసమునందు; నిర్జరు లెల్లన్ = దేవతలెల్లను; చూడన్=అవలోకింపఁగా; నీచలమున్=నీమాత్సర్యమును; బలంబున్=సామర్థ్యమును; శస్త్రకుల=బాణ పుంజమునందలి; చాతురిన్ = నేర్పును; చూపుము =కనఁబఱపుము; చూచి=అవలోకించి; అంతటన్=అటుతరువాత; ప్రలయ కృశానుహేతిసమబాణపరంపరన్=ప్రళయకాలానలజ్వాలాతుల్యమగు బాణసంఘముచేత; గ్రక్కునన్=వేగముగా; కూల్తున్ =చంపుదును.
తే. ఈయెడఁ దమిస్ర నీదర్ప◊మెల్లఁ గూల్చి, యరిభయదలీలఁ దనరు దీ◊వ్యత్సుచంద్ర
శైత్యవత్కరకాండముల్ ◊చక్కఁ గాంచి, త్రిదశబృందంబు లానంద◊రేఖఁ జెందు. 130
టీక: తమిస్ర =ఓతమిస్రాసురుఁడా! అంధకారమా యని యర్థాంతరము దోఁచుచున్నది; ఈయెడన్=ఇపుడు; నీదర్పమెల్లన్ = నీయహంకారమంతయు; కూల్చి=పడవైచి; అరిభయదలీలన్ = శత్రువులకు వెఱపుగొలుపునట్లుగా, జక్కవలకు భయప్రద మగు నట్లుగా నని యర్థాంతరము; తనరు = ఒప్పుచున్న; దీవ్యత్సుచంద్రశైత్యవత్కరకాండముల్ – దీవ్యత్=ప్రకాశించుచున్న, సుచంద్ర=సుచంద్రునియొక్క, శైత్యవత్=వాఁడిగల, తీక్ష్ణవాచకమయిన శితశబ్దముమీఁద శైత్యశబ్దమయినది, కరకాండముల్ = హస్తమందుండిన బాణములను; సుచంద్ర=మంచిశీతాంశువుయొక్క, శైత్యవత్=చలువగల, కరకాండముల్=కిరణజాలము లను; చక్కన్ =బాగుగా; కాంచి=చూచి; త్రిదశబృందంబులు=దేవసంఘములు; ఆనందరేఖన్=ఆనందపరంపరను; చెందున్ =పొందును.
ఇచటఁ బ్రస్తుతాప్రస్తుతముల కౌపమ్యము గమ్యము గాన నంధకారదర్పమడంచి, చక్రవాకభయంకరము లగుచు చంద్ర కిరణములు దేవతాబృందము నానందింపఁజేయునట్లు, నాతీక్ష్ణబాణపరంపర నీదర్ప మడంచి శత్రుభయంకరమై దేవతాగణము నానందింపఁజేయు నని భావము.
చ. యతుల వధించి తత్కృతస◊వాళి హరించి ధరిత్రి ధార్ష్ట్యసం
గతిఁ దగునీవు నాయెదురు◊కట్టున నిల్చితిగా నిశాట త
త్కృతికి ఫలంబు నీ వెనయ ◊నిత్తఱిఁ దార్చెద మద్భుజోగ్రధ
న్వతరుణభోగివాంతవిష◊వహ్నిసమానకలంబధారచేన్. 131
టీక: నిశాట =రాక్షసుఁడా! యతులన్=మునులను; వధించి =హింసించి; తత్కృతసవాళిన్=వారిచే నాచరింపఁబడిన యజ్ఞ సంఘములను; హరించి =చెఱపి; ధరిత్రిన్=భూమియందు; ధార్ష్ట్యసంగతిన్ – ధార్ష్ట్య=గడుసుఁదనముయొక్క, సంగతిన్ = సంబంధముచేత; తగు నీవు = ఒప్పుచున్న నీవు; నాయెదురుకట్టున నిల్చితిగా = నాసమ్ముఖమున నిల్చితివి గదా! తత్కృతికిన్ = ఆచర్యకు; ఫలంబున్=లాభమును; నీ వెనయన్ =నీవు పొందునట్లు; ఇత్తఱిన్=ఈసమయమున; మద్భుజోగ్రధన్వతరుణ భోగివాంతవిషవహ్నిసమానకలంబధారచేన్ – మత్=నాయొక్క, భుజ=బాహువులయందున్న, ఉగ్రధన్వతరుణభోగి = కోడె నాగుఁబామువంటి భయంకరమగు ధనుస్సుచేత, వాంత=క్రక్కఁబడిన, విషవహ్ని=విషాగ్నితోడ, సమాన=సాటియయిన, కలంబధారచేన్=బాణపరంపరలచేత; తార్చెదన్=చేసెదను.
మాలిని. అని మనుజకులేంద్రుం◊ డయ్యెడన్ భూరిబాణా
సన మెనసి శరాళిన్ ◊జాల దైత్యేంద్రు నొంచెన్
ఘనము నగముపై ని◊ష్ఖండవార్ధారచే నా
ఘనగుణరుతి గర్జా◊గౌరవం బూని మించన్. 132
టీక: అని = ఇట్లు వచించి; మనుజకులేంద్రుండు=జనపతి; ఘనగుణరుతి=గొప్పనగు అల్లెత్రాటి ధ్వని; గర్జాగౌరవంబు=మేఘ ధ్వనియొక్క అతిశయమును; ఊని=వహించి; మించన్=అతిశయింపఁగా; ఘనము =మేఘము;నగముపైన్=వృక్షముపై; నిష్ఖండ=అఖండమగు; వార్ధారచే నాన్=వారిధారచేత నన్నట్లు; అయ్యెడన్=ఆసమయమున; భూరిబాణాసనము=గొప్ప వింటిని; ఎనసి=పొంది; శరాళిన్ = బాణపరంపరలచేత; చాలన్=మిక్కిలి; దైత్యేంద్రున్=రాక్షసాధిపతిని; నొంచెన్=నొప్పిం చెను. ‘మనసిజగురునెంతున్ మాలినీవృత్తమందున్, ననమయయగణంబుల్ నందవిశ్రాంతి గూడన్’ అని మాలినీలక్షణము.
చ. జనపతి వైచినట్టి శిత◊సాయకముల్ నిజసాయకచ్ఛటన్
దునియఁగఁ జేసి దైత్యపతి ◊తోడనె యమ్ములు కొన్ని గూర్చి వై
చినఁ గడుఁ జూర్ణతన్ గగన◊సీమను గప్పఁగ నాత్మబాణవ
ర్తన నెనయించెఁ జూచునజ◊రప్రకరంబులు కేలఁ బాపఁగన్. 133
టీక: దైత్యపతి =తమిస్రుఁడు; వైచినట్టి శితసాయకముల్= రాజు ప్రయోగించినట్టి తీక్ష్ణమైన బాణములను; నిజసాయకచ్ఛటన్ = తనబాణపరంపరలచేత; తునియఁగన్ చేసి =తునియునట్లు చేసి; తోడనె = వెంటనే; అమ్ములు కొన్ని గూర్చి = కొన్నిబాణము లను సంధించి; వైచినన్=ప్రయోగింపఁగా; జనపతి =సుచంద్రుఁడు; ఆత్మబాణవర్తనన్=తనబాణవ్యాపారముచేత; చూచునజర ప్రకరంబులు=అవలోకించుచున్న దేవసంఘములు; కేలన్=హస్తములచేత; పాపఁగన్=తొలఁగఁజేయునట్లు; కడున్ చూర్ణతన్ = మిగుల చూర్ణత్వముచేత; గగనసీమను=ఆకాశప్రదేశమును; కప్పఁగన్=ఆచ్ఛాదించునట్లు; ఎనయించెన్=పొందించెను.
అనఁగా సుచంద్రుఁడు తన నిశితసాయకములను దైత్యేంద్రుఁడు తునియలుచేసి కొన్ని బాణములు ప్రయోగింపఁగా వానిని నిజసాయకములచే చూర్ణమై గగనసీమకు వ్యాపించునట్లు చేసెననియు, అందు రణావలోకనమునకై ఏతెంచిన దేవసంఘములు ఆచూర్ణము తమకడ్డము గాఁగా హస్తములచేతఁ దొలఁగించుకొని రనియు భావము.
చ. అలపతి వైచు బాణముల ◊నాదనుజేశుఁడు, వాఁడు వైచు న
మ్ముల హరిభేది తున్ముచు, న◊పూర్వరణం బొనరించి రయ్యెడన్
తలఁకక విల్లునన్ ఖగవి◊తానము గూర్చుట వాని వైచుటల్
దెలియఁగ నోప కెంతయు మ◊తిన్ సురసంతతి సన్నుతింపఁగన్. 134
టీక: అలపతి వైచు బాణములన్= ఆరాజు ప్రయోగించు తూపులను; ఆదనుజేశుఁడు = ఆతమిస్రాసురుఁడు; వాఁడు వైచు అమ్ములన్ = ఆదనుజేశుఁడు ప్రయోగించుబాణములను; హరిభేది = సుచంద్రుఁడు, కుముదుఁడనువాఁడు శాపవశమున హరి, అనఁగా సింహరూపమునొందియుండఁగా వాని సింహశరీరమును భేదించినవాఁడు గావున హరిభేది యనఁబడియె; తున్ముచున్ = ఖండించుచు; అయ్యెడన్=ఆసమయమున; తలఁకక = భయపడక; విల్లునన్ = ధనువునందు; ఖగవితానము= బాణసంఘ మును, ‘ఖగస్సూర్యేషు పక్షిషు’ అని రత్నమాల; కూర్చుట=సంధించుటను; వాని వైచుటల్=వానిం బ్రయోగించుటలను; సుర సంతతి = దేవసంఘము; ఎంతయున్=మిక్కిలి; తెలియఁగ నోపక=తెలియఁజాలక; మతిన్=చిత్తమునందు; సన్నుతింపఁగన్ = కొనియాడఁగ; అపూర్వరణంబు= లోకోత్తరయుద్ధమును; ఒనరించిరి=సల్పిరి.