చంద్రికాపరిణయము – 5. తృతీయాశ్వాసము

ప్రహరణకలితము. అభినవధృతి లో◊నడరఁగఁ బలభు
గ్విభుఁ డరిబలముల్ ◊వెడలి నడవఁగన్
స్వభటనికర మెం◊చఁగఁ జటులగదన్
ప్రభుకులమణిపైఁ ◊బఱపెను వడిగన్. 135

టీక: అభినవధృతి = నూతనధైర్యము; లోన్=మనస్సునందు; అడరఁగన్=ఒప్పుచుండఁగా; పలభుగ్విభుఁడు=రాక్షసరాజు; అరిబలముల్ = శత్రుసైన్యములు; వెడలి నడవఁగన్= రణమునుండి భీతులై పాఱఁగా; స్వభటనికరము=తనసైన్యము; ఎంచఁ గన్=ప్రశంసింపఁగా; చటులగదన్=చంచలమైన గదాయుధమును; ప్రభుకులమణిపైన్= రాజేంద్రునిపై; వడిగన్=వేగముగా; పఱపెను = ప్రయోగించెను. ‘పనిగొను నెపుడున్◊బ్రహరణకలితన్, ననభనవలు మం◊దగజవిరమమున్’ అని ప్రహరణకలిత వృత్తలక్షణము.

పంచచామరము. సురారిరాజు మీఁద వైచు◊శూరహర్షమార్గదన్
స్థిరధ్వనిప్రభావదీర్ణ◊దిక్పదన్ మహాగదన్
ధరావరాగ్రయాయి ఖడ్గ◊ధారఁ ద్రుంచె నుర్వరా
ధరోరుకూట ముగ్రవజ్ర◊ధార నింద్రుఁడో యనన్. 136

టీక: సురారిరాజు =రాక్షసేశ్వరుఁడు; మీఁదన్=మీఁదికి; వైచు శూరహర్షమార్గదన్ = ప్రయోగించునదియు, శూరుల హర్ష మార్గము ఖండించునదియు; స్థిరధ్వనిప్రభావదీర్ణదిక్పదన్= స్థిరమగు ధ్వనియొక్క మహిమచేత బ్రద్దలుచేయఁబడిన దిక్తట ములు గలదియు నగు; మహాగదన్ = గొప్పదగు గదాయుధమును; ధరావరాగ్రయాయి =రాజేంద్రుఁడు; ఉర్వరాధరోరు కూటము = పర్వతసమూహమును; ఉగ్రవజ్రధారన్=కఠినమైన వజ్రాయుధముయొక్క అంచుచేత; ఇంద్రుఁడోయనన్ =సురే శ్వరుఁడో యనునట్లు; ఖడ్గధారన్=ఖడ్గముయొక్క అంచుచేత; త్రుంచెన్ = ఖండించెను. ‘జరజ్రజంబులున్ గముం బొ◊సంగి తొమ్మిదింటిపై, విరామ మొంది’ యని పంచచామరవృత్తలక్షణము.

మ. గద యీలీల నృపాసిధార ధరఁ ద్రుం◊గం దీవ్రరోషం బెదన్
గదురం దానవమాయచే నసురలో◊కస్వామి యవ్వేళ వై
రిదరాపాది మహాసురాస్త్రము ధరి◊త్రీభర్తపై వైచె స
త్పదవిన్ జూచు సురాళి కన్నులకు ని◊ద్రాముద్ర చేకూడఁగన్. 137

టీక: ఈలీలన్=ఈతీరుగ; నృపాసిధారన్=రాజుయొక్క ఖడ్గముయొక్క అంచుచేత; గద =తనగదాయుధము; ధరన్= భూమియందు; త్రుంగన్= తునియలు కాఁగా; తీవ్రరోషంబు = అధికమైనకోపము; ఎదన్=హృదయమందు; కదురన్=కల్గగా; అసురలోకస్వామి=రాక్షసేశ్వరుఁడు; దానవమాయచేన్=రాక్షసమాయచేత; అవ్వేళన్=అపుడు; వైరిదరాపాది మహాసురా స్త్రము = శత్రుభయప్రదమగు గొప్ప యాసురాస్త్రమును; సత్పదవిన్ = నక్షత్రపదవి యగు నాకాశమందు; చూచు సురాళి కన్ను లకు = చూచునట్టి దేవబృందముయొక్క నేత్రములకు; నిద్రాముద్ర =ముకుళీభావ మనుట; చేకూడఁగన్=కల్గునట్లు; ధరిత్రీభర్త పైన్ =రాజుమీఁద; వైచెన్= ప్రయోగించెను.

శిఖరిణి. ఖరాస్యాస్త్రంబుల్ ఘూ◊కముఖశరముల్ ◊కాకవదన
స్ఫురద్బాణంబుల్ త◊న్బొదివికొని రా ◊భూరిపరిఘ
క్షురప్రాసిశ్రేణిన్ ◊గురియుచు వెఱం◊గూల నజరుల్
త్వరన్ దద్దైతేయా◊స్త్రము నడచెఁ ద◊త్సైన్య మలరన్. 138

టీక: ఖరాస్యాస్త్రంబుల్=ఖరముఖబాణములు; ఘూకముఖశరముల్ =ఘూకముఖములు గలిగిన బాణములు; కాకవదన స్ఫురద్బాణంబుల్ = కాకముఖములచేఁ బ్రకాశించుచున్న బాణములు; తన్ = తనను, ఆసురాస్త్రము ననుట; పొదివికొని రాన్ = కప్పికొని రాఁగా; భూరిపరిఘక్షురప్రాసిశ్రేణిన్= అధికములైన పరిఘలయొక్కయు, చురకత్తుల యొక్కయు, ఖడ్గముల యొక్కయు గుంపులను; కురియుచున్=వర్షించుచు; అజరుల్=దేవతలు; వెఱన్=భయముచేత; కూలన్=దిగులొందునట్లుగ; త్వరన్ =వేగముచేత; తత్సైన్యము=వానిసైన్యము; అలరన్=సంతోషింపఁగా; తద్దైతేయాస్త్రము=ఆయాసురాస్త్రము; నడచెన్ = వెడలెను. ‘ద్విజశ్రేష్ఠుల్ మెచ్చ న్యమనసభవల్ విశ్వవిరతి ప్రజాతాహ్లాదంబై శిఖరిణి యనా భాసురమగున్’ అని శిఖరిణీవృత్త లక్షణము. ఇట నప్పకవి యొకచోటనే విశ్రమముఁ జెప్పినను ఈకవి విశ్రమద్వయమునుఁ బొందుపఱచెను.

మందాక్రాంత. ఉర్వీశస్వామి ఘనమతితో ◊నుగ్రకీలాళి పైపైఁ
బర్వన్ రాఁ జూచి వెఱఁగు మదిన్ ◊బాయకెచ్చన్ దదీయా
ఖర్వప్రస్ఫూర్తి నడఁచుతమిం ◊గాంచి దోశ్శక్తిమై గాం
ధర్వాస్త్రం బప్డు మహిపతి సం◊తానముల్ మెచ్చవైచెన్. 139

టీక: ఉర్వీశస్వామి=సుచంద్రుఁడు; ఘనమతితోన్=గొప్పబుద్ధితో; ఉగ్రకీలాళి=భయంకరమగు నగ్నిజ్వాలాపరంపర; పైపైన్ పర్వన్ రాన్ = మీఁదికిఁ బ్రసరించుటకు రాఁగా; చూచి; వెఱఁగు =ఆశ్చర్యము; మదిన్ పాయక ఎచ్చన్ = మనస్సులో విడువక యధికము కాఁగా; తదీయాఖర్వప్రస్ఫూర్తిన్=వాని యతిశయస్ఫూర్తిని; అడఁచుతమిం గాంచి=శమింపఁజేయు కోర్కిఁ బూని; దోశ్శక్తిమైన్ = బాహుశక్తిచేత; అప్డు=ఆసమయమున; మహిపతి సంతానముల్=రాజబృందములు; మెచ్చన్ = కొనియాడు నట్లుగా; గాంధర్వాస్త్రంబు=గాంధర్వాస్త్రమును; వైచెన్=ప్రయోగించెను. ‘మందాక్రాంత న్గిరిశవిరతు ల్మభ్నతాగాగణంబుల్ పొందెన్’ అని మందాక్రాంతావృత్తలక్షణము నప్పకవి చెప్పె.

భుజంగప్రయాతము. ఖరాంశుచ్ఛటన్ వహ్ని◊కాండంబులన్ శీ
తరుక్పాళిని న్మించి ◊ధాత్రీనభంబుల్
స్వరోచిం బ్రకాశింప ◊క్ష్మానాయకాస్త్రం
బిరం దానవాస్త్రీయ◊వృత్తిన్ హరించెన్. 140

టీక: ఖరాంశుచ్ఛటన్ = సూర్యపరంపరను; వహ్నికాండంబులన్=అగ్నిపరంపరను; శీతరుక్పాళినిన్=చంద్రపరంపరను; మించి = అతిశయించి; ధాత్రీనభంబుల్ = భూమ్యంతరిక్షములు; స్వరోచిన్=తనకాంతిచేత; ప్రకాశింపన్=విలసిల్లఁగా; క్ష్మానా యకాస్త్రంబు = రాజుయొక్క బాణము; ఇరన్=భూమియందు; దానవాస్త్రీయవృత్తిన్ = రాక్షసబాణసంబంధివ్యాపారమును; హరించెన్ = శమింపఁజేసెను. ‘భుజంగప్రయాతాఖ్యము ల్నాల్గుయాలన్ గజవ్రాతవిశ్రాంతిగాఁ జెప్ప నొప్పున్’ అని భుజంగ ప్రయాతవృత్తలక్షణము.

తే. ఇట్లు తనయస్త్రసామర్థ్య ◊మెల్లఁ దూల, నౌడు కఱచుచు హుమ్మని ◊యాగ్రహమున
మీసములు నిక్క నపుడు త◊మీచరుండు, శక్తి నృపు వైచె నిజమంత్ర◊శక్తి గరిమ. 141

టీక: తమీచరుండు = రాక్షసుఁడు; ఇట్లు=ఈప్రకారముగా; తనయస్త్రసామర్థ్యమెల్లన్ = తనయాసురాస్త్రసామర్థ్యమంతయు; తూలన్=తొలఁగిపోవఁగా; ఔడు కఱచుచున్ = పెదవికఱచుచు; హుమ్మని =హుంకారము చేసి; ఆగ్రహమునన్=కోపముచేత; మీసములు = శ్మశ్రువులు; నిక్కన్=నిగుడఁగా; అపుడు=ఆసమయమున; నిజమంత్రశక్తిగరిమన్=తనమంత్రసామర్థ్యముచేత; శక్తి = శక్తి యను నాయుధమును; నృపున్=రాజును గూర్చి; వైచెన్=ప్రయోగించెను.

పృథ్వి. కనత్కనకఘంటికా◊కలఘుణత్కృతిప్రక్రియన్
జనాధిపమహాచమూ◊శ్రవణభేదనం బూన్చుచున్
ఘనప్రతిమ ధూమసం◊ఘములఁ జీఁకటు ల్నించుచున్
ఘనస్యదనిరూఢిచేఁ ◊గదలి శక్తి యేతేరఁగాన్. 142

టీక: కనత్కనకఘంటికాకలఘుణత్కృతిప్రక్రియన్ – కనత్=ప్రకాశించుచున్న, కనకఘంటికా=బంగరుగజ్జెలయొక్క, కల= అవ్యక్తమధురమగు, ఘుణత్కృతి= తద్రూపమైన ధ్వనివిశేషముయొక్క, ప్రక్రియన్=వ్యాపారముచేత; జనాధిపమహాచమూ శ్రవణభేదనంబు – జనాధిప=రాజుయొక్క, మహాచమూ=గొప్పసేనయొక్క, శ్రవణభేదనంబు = చెవుల భేదించుటను; ఊన్చు చున్ = చేయుచు; ఘనప్రతిమధూమసంఘములన్ – ఘనప్రతిమ=మేఘమునకు సాటియగు, ధూమసంఘములన్ = పొగ గుంపులచేత; చీఁకటుల్=అంధకారములను; నించుచున్ =పూరించుచు; ఘనస్యదనిరూఢిచేన్=అధికమగు వేగస్ఫూర్తిచేత; కదలి = వెడలి; శక్తి = శక్తి యను నాయుధము; ఏతేరఁగాన్=రాఁగా. దీని కుత్తరపద్యముతో నన్వయము.

పృథ్వీవృత్తలక్షణమును గూర్చి, ‘జసల్ జసయవంబు లుష్ణకరసంఖ్యవిశ్రాంతులున్, బొసంగి కవిపుంగవుల్ పలుక భూమిలోఁ బృథ్వినా, నసంశయమగుం గళిందతనయామనోవల్లభా’ అని యప్పకవి పండ్రెండవయక్షరము యతిగాఁ జెప్పి నను మహాకవులు పెక్కండ్రు తొమ్మిదవవర్ణము విశ్రమముగా వ్యవహరించుచున్నారు.

క. మనుజపతి దానిఁ గనుఁగొని, యనిఁ గుండలితాశుగాసుఁ◊డై శరపంక్తిం
దునియలుగాఁ బడ వైచెన్, మనమున వేల్పులు నిజైక◊మహిమను బొగడన్. 143

టీక: మనుజపతి=రాజు; దానిన్ = ఆ శక్త్యాయుధమును; కనుఁగొని=అవలోకించి; అనిన్=యుద్ధమునందు; కుండలితాశు గాసుఁడై – కుండలిత=వలయాకారముగాఁజేయఁబడిన; ఆశుగాసుఁడై =ధనువుగలవాఁడై, ఆశుగాసశబ్దము శరాసాదిశబ్ద ములవలె ధనుర్వాచకమగునని దెలియవలయు; వేల్పులు = దేవతలు; మనమునన్ =చిత్తమునందు; నిజైకమహిమను = తనయొక్క ముఖ్యమగు సామర్థ్యమును; పొగడన్ =శ్లాఘింపఁగా; శరపంక్తిన్=బాణపరంపరలచేత; తునియలుగాన్= శకలములుగా; పడవైచెన్=పడఁగొట్టెను.

చ. తనవరశక్తి యిట్లు వసు◊ధాపతిమార్గణధారఁ ద్రెళ్ళ నా
దనుజవిభుండు శత్రుబల◊దారణశీలము స్వాగ్రనిర్గళ
త్సునిశితకీలికీల మొక◊శూలము చయ్యనఁ బూని దీనిచే
మనుము నృపాల యంచుఁ బర◊మప్రతిఘోద్ధతి వ్రేయ నెత్తఁగన్. 144

టీక: ఆదనుజవిభుండు = ఆరాక్షసరాజు; ఇట్లు=ఈచొప్పున; తనవరశక్తి = తనయొక్క శ్రేష్ఠమగు శక్త్యాయుధము; వసుధాపతి మార్గణధారన్=రాజుబాణములయొక్కఅంచుచేత; త్రెళ్ళన్=పడఁగా; శత్రుబలదారణశీలము = వైరిసైన్యసంహరణస్వభావము గలదియు; స్వాగ్రనిర్గళత్సునిశితకీలికీలము – స్వ=తనయొక్క, అగ్ర=అగ్రభాగమువలన, నిర్గళత్=వెడలివచ్చుచున్న, సుని శిత=మిక్కిలి తీక్ష్ణములగు, కీలికీలము = అగ్నిజ్వాలలు గలదియు నగు, ఒకశూలము = ఒకశూలాయుధమును; చయ్యనన్ =వేగముగా; పూని=వహించి; దీనిచేన్=ఈయాయుధముచేత; నృపాల=ఓరాజా! మనుము = బ్రతుకుము, విరుద్ధలక్షణచే చావుమని యర్థము; అంచున్=ఇట్లనుచు; పరమప్రతిఘోద్ధతిన్ = అత్యంతమగు కోపముచేత; వ్రేయన్=ఏయుటకు; ఎత్తఁగన్= మీఁదికెత్తఁగా. దీనికి ముందుపద్యముతో నన్వయము.

చ. జనవిభుఁడంతలోఁ గరము ◊చాతురి హెచ్చఁగ ధన్వ మూని వే
గనియతి నర్ధచంద్రవిశి◊ఖద్వయి పావకమంత్రరేఖతోఁ
దనరఁగఁ గూర్చి వైచి ధరఁ ◊దార్కొనఁ జేసెఁ దదీయదోర్యుగం
బనుపమశూలకాంచనశ◊రాసనముల్ తొలుదొల్త డిందఁగన్. 145

టీక: జనవిభుఁడు=సుచంద్రుఁడు; అంతలోన్=వాఁడు శూలమెత్తివేయునంతలో; కరము=మిగుల;చాతురి =నేర్పు;హెచ్చఁగన్ = మించఁగా;ధన్వము=ధనుస్సును; ఊని=వహించి; వేగనియతిన్=వేగనియమముచేత; అర్ధచంద్రవిశిఖద్వయిన్=అర్ధచంద్ర బాణద్వయమును; పావకమంత్రరేఖతోన్=ఆగ్నేయమంత్రపుంజముచేత; తనరఁగన్=ఒప్పునట్లుగా; కూర్చి=ఘటించి; వైచి = ప్రయోగించి; అనుపమశూలకాంచనశరాసనముల్ = సాటిలేని శూలమును, కాంచనధనువును; తొలుదొల్త న్=మొదటనె; డిందఁగన్ = పడఁగా; తదీయదోర్యుగంబు=వానిబాహుయుగ్మమును; ధరన్ = భూమియందు; తార్కొనన్ చేసెన్ = పడు నట్లు చేసెను.

ఉ. అంత ననంతరోషశిఖి ◊యాంతరవీథికఁ జిందు ద్రొక్కఁ గా
లాంతకతుల్యమూర్తి యల◊యాశరసంతతిచక్రవర్తి దు
ర్దాంతరయంబుతో మణిశ◊తాంగము డిగ్గన డిగ్గి వ్యాత్తవ
క్త్రాంతర మూని మ్రింగెద ర◊సాధిపు నం చరుదెంచె నుద్ధతిన్. 146

టీక: అంతన్=అటుతరువాత; కాలాంతకతుల్యమూర్తి =ప్రళయకాలమృత్యువుతో సమానమైన; అలయాశరసంతతిచక్రవర్తి = ఆరాక్షసకులాధిపతియగు తమిస్రుఁడు; ఆంతరవీథికన్=హృదయప్రదేశమందు; అనంతరోషశిఖి=అధికమైన క్రోధాగ్ని; చిందు ద్రొక్కన్=ఉప్పొంగఁగ; దుర్దాంతరయంబుతోన్=నివారింపరానివేగముతో; మణిశతాంగము=మణిమయమైనరథమునుండి; డిగ్గన డిగ్గి =తటాలున దిగి; వ్యాత్త=తెఱవఁబడిన; వక్త్రాంతరము=ముఖమధ్యమును; ఊని=వహించి; ఉద్ధతిన్=దర్పము చేత; రసాధిపున్=రాజును; మ్రింగెద నంచు=కబళించెద ననుచు; అరుదెంచెన్=వచ్చెను.