చంద్రికాపరిణయము – 4. ద్వితీయాశ్వాసము

క. సత్యాహితాంతరంగా, సత్యాశయపుండరీక◊చంచద్భృంగా,
సత్యాత్మకగుణసంగా, సత్యాలయయోగియోగ◊సంతతరంగా! 144

టీక: సత్యాహి తాంతరంగా – సత్యా=సత్యభామయందు, ‘నామైకదేశే నామగ్రహణ’ మను న్యాయమువలన సత్యభామా నామైకదేశమగు సత్యాశబ్దమునకు సత్యభామ యని యర్థమని యెఱుంగునది, ఆహిత=ఉంపఁబడిన, అంతరంగా =మనస్సు గలవాఁడా, సత్యభామయందు ఆసక్తి గలవాఁడని భావము; సత్యాశయపుండరీక చంచ ద్భృంగా – సతీ= పార్వతీదేవియొక్క, ఆశయపుండరీక = హృత్కమలమందు, చంచత్=చలించుచున్న, భృంగా =తుమ్మెదరూప మైన వాఁడా, పార్వతి తన హృ త్పుండరీకమున నెల్లపుడు నారాయణమూర్తిని ధ్యానించుచున్నదని భావము; సత్యాత్మక గుణ సంగా – సత్యాత్మక = సత్య రూపమగు, గుణ=శౌర్యాదిగుణములయొక్క, సంగా = సంబంధము గలవాఁడా; సత్యాలయ యోగి యోగ సంతత రంగా – సత్య=సత్యలోకమే, ఆలయ = నివాసముగాఁ గల, యోగి=మునులయొక్క, యోగ=ధ్యానమె, సంతత=ఎల్లపుడును, రంగా =నాట్యస్థానముగాఁ గలవాఁడా!

సత్యలోకమందు వసించి తపం బొనరించు మునుల ధ్యానమునందు నెడఁబాయకుండు వాఁడని భావము.

ఉత్సాహవృత్తము: కరివరాంగబహులభంగ◊కరణసంగతగ్రహా
చరరథాంగ! హరిశతాంగ◊జనక! రంగదద్రిజాం
తరసుమంగళాబ్జభృంగ!◊తతపతంగమందిరా!
పరభుజంగరిపుతురంగ!◊ప్రబలరంగభూషణా! 145

టీక: కరివ రాంగ బహుల భంగకరణ సంగత గ్రహాచర రథాంగ – కరివర=గజేంద్రునియొక్క, అంగ =దేహమును, బహుల= అనేకప్రకారములు, భంగకరణ = నాశము సేయుటయందు, సంగత = ఆసక్తమైన, గ్రహ=మొసలియొక్క,ఆచర = సంహారక మగు, రథాంగ = చక్రాయుధము గలవాఁడా, గజేంద్రునిం బట్టుకొన్న మొసలిని సంహరించిన చక్రాయుధము గలవాఁ డని భావము; హరి శతాంగ జనక – హరి=మారుతము, ‘యమానిలేన్ద్ర చన్ద్రార్క విష్ణు సింహాంశు వాజిషు, శుకాహి పిక భేకేషు హరిః’ అని యమరుఁడు, శతాంగ=రథముగాఁ గల మన్మథునకు, జనక = తండ్రి యైనవాఁడా; రంగ దద్రిజాంతర సుమంగ ళాబ్జ భృంగ – రంగత్=చలించుచున్న, అద్రిజా=పార్వతీదేవియొక్క, అంతర = హృదయ మనెడు, సుమంగళ= మంగల ప్రదమగు, అబ్జ =కమలమునకు, భృంగ=భ్రమరరూపుఁ డైనవాఁడా, అనఁగా పార్వతీ దేవి యెల్లపుడును హృదయకమల మందు నారాయణమూర్తిని నిల్పుకొని ధ్యానించుచున్నది గాన నామె హృదయకమలమునకు భ్రమరప్రాయుఁడై యున్నవాఁ డని భావము; తత పతంగ మందిరా – తత=విశాలమగు, పతంగ=సూర్యుఁడే, ‘పతంగౌ పక్షి సూర్యే చ’ అని యమరుఁడు, మందిరా = గృహముగాఁ గలవాఁడా, సూర్యమండలమందు సర్వదా వసించు వాఁడని తాత్పర్యము. ఇందుకు ‘ధ్యేయ స్సదా సవితృమణ్డలమధ్యవర్తీ నారాయణః’ అను వచనము ప్రమాణము; పర భుజంగరిపు తురంగ – పర =ఉత్కృష్టుఁడగు, భుజంగ రిపు=గరుత్మంతుఁడె, తురంగ = గుఱ్ఱముగాఁ గలవాఁడా; ప్రబల రంగ భూషణా – ప్రబల=ఉత్కృష్టమగు, రంగ=శ్రీరంగవిమా నమునకు, భూషణా=అలంకారప్రాయుఁడైనవాఁడా! ‘ఈహ మీఱ సూర్యగణము ◊లేడు గాంతమైన ను, త్సాహవృత్త మనఁగఁ గృతులఁ ◊జాగుచుండు’ నని ఉత్సాహవృత్తలక్షణ మప్పకవీయమునఁ జెప్పఁబడినది.

గద్యము: ఇది శ్రీమదనగోపాలప్రసాదసమాసాదితోభయభాషాకళాకళత్ర రేచర్లగోత్రపవిత్ర సురభిమల్లక్షమాపాలసత్పుత్ర కవిజనవిధేయ మాధవరాయప్రణీతం బైన చంద్రికాపరిణయంబను మహాప్రబంధంబునందు ద్వితీయాశ్వాసము.

గద్యము: ఇది శ్రీసతీరమణకరుణాసమాసాదితసర్వసౌభాగ్యభాగ్యనగరమహారాజ్యసంకలిత శ్రీజటప్రోలుసంస్థానప్రాజ్యసకలసామ్రాజ్య శ్రీ రేచర్లగోత్రపవిత్ర కవిజనగేయ శ్రీవేంకటజగన్నాథరాయసత్పుత్ర సత్సంప్రదాయ శ్రీసురభి వేంకటలక్ష్మణరాయ పరిపోష్య సరసవైదుష్య తదాస్థానతలమండిత శేషసదాశివపండిత విరచితశరదాగమసమాఖ్యవ్యాఖ్యయందు ద్వితీయాశ్వాసము.