చంద్రికాపరిణయము – 4. ద్వితీయాశ్వాసము

ఉ. దాన నొకింతయున్ విధృతిఁ ◊దాల్పని యాదమినేతఁ జూచి, త
త్సూనశరుండు బీరమున ◊శూరత యుట్టిపడంగ నయ్యెడన్
మానితపారిజాతసుమ◊నఃకలికాగద కేల నెత్తి, య
మ్మౌనిని మోఁదె దివ్యకుసు◊మప్రతతుల్ మరుదాళి నింపఁగన్. 90

టీక: దానన్ = ఆశక్తి యను నాయుధముచేత; ఒకింతయున్ = కొంచెమయినను; విధృతిన్ = అధైర్యమును; తాల్పని = ధరింపనట్టి; ఆదమినేతన్=ఆమునిరాజును; చూచి=అవలోకించి; తత్సూనశరుండు=ఆమన్మథుఁడు; బీరమునన్=పరాక్ర మముచేత; శూరత=శౌర్యము; ఉట్టిపడంగన్=అతిశయింపఁగా; అయ్యెడన్=ఆసమయమందు;మానిత పారిజాతసుమనః కలికాగద – మానిత=శ్రేష్ఠమగు, పారిజాతసుమనః=పారిజాతపుష్పముయొక్క, కలికా=మొగ్గ యనెడు, గద=గదాయుధ మును; కేలన్ ఎత్తి=హస్తముతో నెత్తి; మరుదాళి=దేవసంఘములు; దివ్యకుసుమప్రతతుల్ – దివ్య=స్వర్గమందున్న, కసుమ = పుష్పములయొక్క,ప్రతతుల్=సమూహములను; నింపఁగన్=నిండించుచుండఁగ; అమ్మౌనిని=ఆమునిని; మోఁదెన్=కొట్టెను.

ఆముని శక్తి యను నాయుధమునకు ధైర్యము చెడకయుండుటం జూచి, మరుఁడు శౌర్యముతో పారిజాతకోరక మను గదతో నతని మోఁదె నని భావము.

ఉ. అందుల కింతయుం జలన◊మందనిపెంపున కబ్బురం బెదం
జెంది, ప్రసూనకోశతటిఁ ◊జెల్వగు గేదఁగిఱేకుఁజిక్కటా
రంది, యనూనరోషగతి ◊నమ్మునిఁ గ్రుమ్మె మరుండు శాంకరా
మందమనోధృతిక్షపణ◊మాన్యభుజాబలరేఖ హెచ్చఁగన్. 91

టీక: అందులకున్=ఆగదాయుధప్రహారమునకు; ఇంతయున్=ఇంచుకైనను; చలనమందని=చలింపని; పెంపునకున్= మహ త్త్వమునకు; అబ్బురంబు=ఆశ్చర్యము; ఎదన్=హృదయమందు; చెంది=పొంది; ప్రసూనకోశతటిన్ – ప్రసూన=పూవనెడు, కోశ=ఒరయొక్క, తటిన్=ప్రదేశమందు; చెల్వగు గేదఁగిఱేకుఁ జిక్కటారు – చెల్వగు=అందమైన, గేదఁగిఱేకు=కేతకీదళ మనెడు, చిక్కటారు=చూరకత్తిని; అంది=పొంది; అనూనరోషగతిన్ – అనూన=తక్కువకాని, రోష=క్రోధముయొక్క, గతిన్= ప్రాప్తిచేత; మరుండు =మన్మథుఁడు; అమ్మునిన్=ఆమునిని; శాంక రామంద మనోధృతి క్షపణ మాన్య భుజాబల రేఖ – శాంకర=శంకరునికి సంబంధించిన, అమంద=అధికమగునట్టి,మనోధృతి=మనస్థైర్యముయొక్క, క్షపణ=పోగొట్టుటచేత, మాన్య=పొగడఁదగిన, భుజాబల=భుజబలముయొక్క,రేఖ=విలాసము; హెచ్చఁగన్=అతిశయింపఁగ; క్రుమ్మెన్=పొడిచెను.

అనేకవిధము లగు నస్త్రములకు చలనమందకయున్న మునిశక్తికి మనమున నబ్బుర మంది, యామరుండు వెతకి కేతకీ దళమను కటారు గొని మునిని పొడిచె నని భావము.

చ. సరసబలంబు గొల్వ సుమ◊సాయకుఁ డంతటఁ బోక మౌని డా
సి రమణ మొగ్గ యన్ గుదియఁ ◊జేకొని మొత్తి ప్రవాళ మన్మహా
పరశువుఁ బూని వే యడిచి ◊బాగగు మంకెనవంకిఁ బట్టి ప
ల్తరములఁ గ్రుమ్మి యార్చె హిమ◊ధాముఁడు గన్గొని మెచ్చ నయ్యెడన్. 92

టీక: సుమసాయకుఁడు=మన్మథుఁడు; సరసబలంబు – సరస=శ్రేష్ఠమగు, బలంబు=సేన; కొల్వన్=సేవింపఁగా; అంతటఁ బోక = అంతటితో నిలువక; మౌనిన్=మునిని; డాసి=సమీపించి; రమణన్=ఆసక్తిచేత; మొగ్గ యన్ గుదియన్=కోరకమను గదను; చేకొని=గ్రహించి;మొత్తి=కొట్టి; ప్రవాళమన్మహాపరశువున్=చిగురనునట్టి గొప్పగండ్రగొడ్డలిని; పూని=గ్రహించి; వే=వేగముగ; అడిచి =కొట్టి; బాగగు మంకెనవంకిన్= శ్రేష్ఠమగు బంధూకమనెడు బాకును; పట్టి=పట్టుకొని; పల్తరములన్=అనేకరీతులచే; అయ్యెడన్=ఆసమయమందు; హిమధాముఁడు=చంద్రుఁడు; కన్గొని =చూచి; మెచ్చన్=మెచ్చుకొనునట్లు; క్రుమ్మి = పొడిచి; ఆర్చెన్=అఱచెను.

మరుఁడు పలువిధములైన ఆయుధములను ప్రయోగించినను ముని చలింపకుండుటఁ జూచి, మునిని సమీపించి, మొగ్గ యను గుదియతో మొత్తి, చిగురా కనుపరశువుతోఁ గొట్టి, మంకెన యనుబాఁకుతోఁ బొడిచె నని భావము.

తే. ఇట్టు లమ్మారుఁ డమ్ముని ◊నెనసి యని ఘ
టించు నవ్వేళ నిది వేళ◊యంచుఁ దలఁచి
చిత్రరేఖావధూటి వి◊చిత్రరీతి
శమి కనతిదూరమున సఖీ◊జనము గొలువ. 93

టీక: ఇట్టులు= ఈప్రకారము; అమ్మారుఁడు=ఆమన్మథుఁడు;అమ్మునిన్=ఆమునిని; ఎనసి=కలసి; అనిన్= యుద్ధమును; ఘటించు నవ్వేళన్=చేయునట్టి యాసమయమందు; ఇది వేళ యంచున్=ఇది తగిన సమయమనుచు; తలఁచి=స్మరించి; చిత్రరేఖావధూటి=చిత్రరేఖ యను దేవాంగన; విచిత్రరీతిన్=ఆశ్చర్యమగువిధముచే; శమికి=మునికి; అనతిదూరమునన్= సమీపమందు; సఖీజనము=చెలికత్తెలు; కొలువన్=సేవింపఁగా. తిలకాళి దిలకించు నను నుత్తరపద్యస్థక్రియతో నన్వయము.

సీ. తిలకాళిఁ దిలకించుఁ ◊జెలి పెండ్లితఱిఁ గాంచు,తెఱఁగు తపస్వికిఁ ◊దెలుపుకరణి,
గోఁగుచెంగటఁ బల్కుఁ ◊గోమలి ప్రియములు, పలుకుటల్ దపసికిఁ ◊దెలుపుకరణి,
మావిపైఁ గరముంచు ◊మగువ కళాస్థాన,మలముటల్ మౌనికిఁ ◊దెలుపుకరణిఁ,
గ్రోవిఁ గౌఁగిటఁ దార్చుఁ ◊గుముదాక్షిపరిరంభ,కలనంబు యోగికిఁ ◊దెలుపుకరణి,

తే. నిట్టు లప్పారికాంక్షి క◊హీనమదన,తంత్రవిజ్ఞానగరిమను ◊దరుణి దెలుప
వల్లి దోహదచర్య దై◊వాఱ నపుడు, హాళి దళుకొత్తఁ దద్వనీ◊కేళి సలిపె. 94

టీక: చెలి=చిత్రరేఖ; పెండ్లితఱిన్=వివాహసమయమందు; కాంచు తెఱఁగున్=చూచునట్టి రీతిని; తపస్వికిన్=జడదారికి; తెలుపు కరణిన్=తెలియఁజేయు రీతిగ; తిలక=బొట్టుగుచెట్లయొక్క; ఆళిన్=పంక్తిని; దిలకించున్=చూచెను. కోమలి=చిత్రరేఖ; ప్రియములు పలుకుటల్ =ప్రియోక్తులు పలుకురీతిని; తపసికిన్=మునికి; తెలుపుకరణిన్=తెలియఁజేయు రీతిగా; గోఁగు=కర్ణికారముయొక్క; చెంగటన్= సమీపమందు; పల్కున్=పలికెను.మగువ =దేవాంగన; కళాస్థానము=కామశాస్త్రప్రసిద్ధమగు కళాస్థానమును; అలముటల్=ఆక్రమించుటలు, స్పృశించుటలను అనుట; మౌనికిన్=తపసికి; తెలుపుకరణిన్=తెలియఁజేయురీతిగ; మావిపైన్=చూతవృక్షము మీఁద; కరము=హస్తమును; ఉంచున్=ఉంచెను. కుముదాక్షి=చిత్రరేఖ; పరిరంభ=కౌఁగిలింతయొక్క; కలనంబు =చేయుటను; యోగికిన్=మునికి; తెలుపుకరణిన్=తెలియఁ
జేయు నటుల; క్రోవిన్=కురువకమును; కౌఁగిటన్=భుజాంతరమందు; తార్చున్=చేర్చెను. ఇట్టులు=ఈప్రకారముగ; అప్పారికాంక్షికిన్=ఆమునికి; అహీన మదనతంత్ర విజ్ఞాన గరిమను – అహీన=అధికమగు, మదన తంత్ర=కామశాస్త్రముయొక్క; విజ్ఞాన=తెలివియొక్క; గరిమను=అతిశయమును; తరుణి=వనిత(చిత్రరేఖ); తెలుపన్=తెలియఁ జేయుటకు; వల్లి దోహదచర్య – వల్లి=తీవలయొక్క, దోహదచర్య=దోహదములయొక్క క్రియ; దైవాఱన్=అతిశయింపఁగ; అపుడు=ఆసమయమున; హాళి =ఉత్సాహము; తళుకొత్తన్=అతిశయింపఁగ; తద్వనీకేళి=ఆవనమునందలి విహారమును; సలిపెన్= ఒనరించెను.

ఇందు దోహద మనఁగాఁ దరుగుల్మలతాదుల కకాలమున ఫలపుష్పదాయక క్రియావిశేషము. ‘తరుగుల్మలతాదీనా మకాలే ఫలపుష్పయోః, ఆధానాయక్రియా యాస్యా త్స దోహద ఇతీర్యతే’ అని తల్లక్షణము. ‘ఆలిఙ్గనా త్కురవక శ్చమ్పకో ముఖదర్శనాత్, చూతో యోషిత్కరస్పర్శా త్తిలకో దృక్ప్రసారణాత్, ఆకర్ణనా త్కర్ణికార స్త్వశోకః పాద తాడనాత్’ ఇత్యాది గా దోహదవిశేషములు దెలియవలయు.

సీ. దమి దీన నైనఁ జి◊త్తము బయల్పఱచునో, యని సంచరించు న◊భ్యర్ణపదవి,
ముని దీననైన నూ◊తనరక్తిఁ దాల్చునో, యని పాడుఁ దేనియల్ ◊చినుకుపాట,
శమి దీననైన ని◊శ్చలభావ ముడుపునో, యని పొదల్ దూఱు ల◊తాళి గదల,
యతి దీననైన ధై◊ర్యముఁ బాయఁ జేయునో, యని పల్కు సఖుల నొ◊య్యారి పలుకు,

తే. నియమి దా దీననైనఁ గ◊న్విప్పు నొక్కొ, యని మసలు దండ రాసాప్తి ◊నాళియుక్తి,
నైన నానాతి చిత్రచ◊ర్యానిరూఢిఁ, దాపససమాధివైఖరి ◊దఱుఁగ దయ్యె. 95

టీక: దమి=మునివర్యుఁడు; దీన నైనన్=దీనిచేతనైనను; చిత్తము=మనసును; బయల్పఱచునోయని=తెలియఁబఱచునా యని; అభ్యర్ణపదవిన్=సమీపస్థానమందు; సంచరించున్=తిరుగును.
ముని=జడదారి; దీన నైనన్=దీనిచేతనైనను; నూతనరక్తిన్=నూతన మగు ననురాగమును; తాల్చునో యని = వహించునా యని; తేనియల్చినుకుపాట= మకరందమును గురియు గీతమును; పాడున్=పాడును.
శమి =జడదారి; దీన నైనన్=దీనిచేతనైనను; నిశ్చలభావము=నిశ్చలత్వమును; ఉడుపునో యని =విడుచునా యని; లతాళి =తీవలగుంపులు; కదలన్=కదలునటులు; పొదల్=కుంజములను; తూఱున్=ఈఁగును.
యతి=మునిరాజు; దీన నైనన్=దీనిచేతనైనను; ధైర్యమున్ =ధృతిని; పాయఁ జేయునోయని =విడుచునా యని; సఖులన్= చెలికత్తెలతో; ఒయ్యారి పలుకు=విలాసోక్తిని; పల్కున్=వచించును.
నియమి=జడదారి; తాన్=తాను; దీన నైనన్=దీనిచేతనైనను; కన్విప్పు నొక్కొయని =కనులు దెఱచునా యని; దండన్= సమీపమందు; ఆళియుక్తిన్=సకియలతోడికూడికచేతను; రాసాప్తిన్—రాస=కోలాటముయొక్క; ఆప్తిన్=ప్రాప్తిచేత; మసలున్=విహరించును; ఐనన్=అయినను; ఆనాతిచిత్రచర్యానిరూఢిన్—ఆనాతి=ఆదేవాంగనయొక్క, చిత్రచర్యా= విచిత్ర కార్యములయొక్క, నిరూఢిన్ = అతిశయముచేత; తాపససమాధివైఖరి =మునిమనస్థైర్యముయొక్క రీతి; తఱుఁగ దయ్యెన్ = తక్కువపడ దయ్యెను.

చిత్రరేఖ ముని హృదయమును దెలుపునా యని సమీపమందు సంచరించినను, అనురాగమును పూనునా యని రమణీయగానముఁ జేసినను, చలించునా యని లతలు గదలఁ బొదలు దూఱినను, ధైర్యమును విడుచునా యని సఖులతోఁ బ్రియో క్తులు పలికినను, కనులనైన విప్పునా యని సకియలఁగూడి కోలాట మాడినను, కొంచెమైనను మునియొక్క సమాధి తక్కువ గాలేదని భావము.

ఉ. ఆయతిలోకమౌళిహృద◊యంబు బయల్పడ కున్కి గాంచి యా
తోయజనేత్ర యాళితతి◊తో మునిసన్నిధిఁ జేరి జాళువా
కాయలవీణె గైకొని త◊గన్ శ్రుతిఁ గూర్చి యొయార మెచ్చఁగా
నాయెడ నేర్పు మించ గమ◊పాదికపుంఖణ మూన్చి వేడుకన్. 96

టీక: ఆయతిలోకమౌళిహృదయంబు =ఆమునిరాజుయొక్క చిత్తము; బయల్పడక=వెల్వడక; ఉన్కి=ఉండుటను; కాంచి =చూచి; ఆతోయజనేత్ర =ఆచిత్రరేఖ; ఆళితతితోన్=సకియలగుంపుతో; మునిసన్నిధిన్=యతిసమీపమును; చేరి=పొంది; జాళువాకాయలవీణెన్=బంగరుకాయలు గల వీణెను; కైకొని =గ్రహించి; తగన్ =ఒప్పునటులు; శ్రుతిన్=స్వరముల కారంభక మైన సుతిని, ‘స్వరా శ్శ్రుతిభ్య స్సంజాతాః’ అని సంగీతరత్నాకరము; కూర్చి= కలుగఁజేసి; ఒయారము=విలాసము; ఎచ్చఁగాన్=అతిశయింపఁగా; ఆయెడన్=ఆసమయమందు; నేర్పు=నైపుణ్యము; మించన్=అతిశయించునటులు; వేడుకన్ =సంతోషముతో; గమపా దికపుంఖణము – గ=గాంధారము, మ=మధ్యమము, ప=పంచమము, ఆదిక=మొదలుగాఁ గల, స్వరములయొక్క, పుంఖణము=మూర్ఛనను, స్వరారోహావరోహక్రమము ననుట. గమపాద్యక్షరములు గాంధారాదిస్వర వాచకము లనుట సంగీతశాస్త్రమందు సంకేతింపఁబడినది; ఊన్చి=చేసి. దీనికి వీణె వాయించె నను ఉత్తరపద్యస్థక్రియతో నన్వయ మని తెలియవలయును. అనఁగా నామునివర్యునియొక్క యాశయము దెలియక చిత్రరేఖ సకియలతోఁ గూడి, యా మునిసన్నిధిం జేరి, బంగరు కాయలు గల మంచివీణను దీసికొని సుతిచేసి, గమపాదిస్వరముల వాయించె నని భావము.

సీ. ఘనమార్గవిభవంబు ◊వనితవేణినె గాదు, శ్రుతిపర్వరాగసం◊తతి నెసంగె,
సమతాళవిస్ఫూర్తి ◊సతిగుబ్బలనె గాదు, నవ్యగీతప్రతా◊నముల నెనసెఁ,
గలహంసవైఖరి ◊చెలిగతులనె గాదు, సరసప్రబంధపుం◊జమునఁ దోఁచెఁ,
బల్లవంబులపెంపు ◊పడఁతికేలనె గాదు, సొగసైనపదపాళి ◊సొంపు పూనె,

తే. ననుచు వనదేవతాజనం ◊బభినుతింప, రక్తివిధమును దేశీయ◊రాగగతియుఁ,
జిత్రతరమంద్రరాగజ◊శ్రీలు వెలయ, నింతి మునిచెంత వీణె వా◊యించె నంత. 97

టీక: ఘనమార్గవిభవంబు – ఘనమార్గ=ఆకసముయొక్క, విభవంబు=నైల్యము, లేదా, ఘన=మేఘముయొక్క, మార్గ= కస్తురియొక్క, విభవంబు=నైల్యము; వనితవేణినెగాదు – వనిత=చిత్రరేఖయొక్క, వేణినె కాదు=జడయందే కాదు; శ్రుతిపర్వ రాగసంతతిన్ – శ్రుతిపర్వ=చెవుల కింపగు, రాగ=భైరవి, తోడి మొదలగు రాగములయొక్క, సంతతిన్=సమూహమందు; ఎసంగెన్=ఒప్పెను; ఘనమార్గవిభవంబు – ఘనమార్గ=గొప్పదైన సంగీతభేదముయొక్క, విభవంబు=అతిశయము, రాగసం తతి నెసంగె నని యర్థము. మార్గము, దేశి యని సంగీతము రెండువిధములు. మహేశునియొద్దనుండి బ్రహ్మాదులచేఁ దేఁబడి, భరతాదులచేఁ బ్రకటింపఁబడినది మార్గము. దేశదేశమునందు భిన్నముగాఁ బ్రచారము గలది దేశి యని తెలియునది. సమతాళవిస్ఫూర్తి – సమ=సమానమగు, తాళ=తాళఫలములయొక్క,విస్ఫూర్తి =అతిశయము; సతిగుబ్బలనె గాదు = చిత్ర రేఖయొక్క స్తనములందే కాదు; నవ్యగీతప్రతానములన్ – నవ్య=నూతనమగు, గీత=గానముయొక్క,ప్రతానములన్=పుంజ ములను; ఎనసెన్=పొందెను; సమతాళవిస్ఫూర్తి – సమ=సమగతి గల చంచత్పుటాదితాళములయొక్క,విస్ఫూర్తి =అతిశ యము, గీతప్రతానముల నెనసె నని యర్థము. కలహంసవైఖరి – కలహంస=రాయంచయొక్క, వైఖరి=గతివిశేషము; చెలిగతులనె గాదు=చిత్రరేఖయొక్క నడకలయందే కాదు; సరసప్రబంధపుంజమునన్ తోఁచెన్= ‘చతుర్భిర్ధాతుభి ష్షడ్భి శ్చాఙ్గై ర్యస్మాత్ప్రయుజ్యతే, తస్మాత్ప్రబన్ధః కథితః’ అని సంగీతరత్నాకరములో ప్రబన్ధలక్షణము. ఇట్టి లక్షణము గల సరసమైన ప్రబంధమందు కాన్పించె నని భావము. ‘శ్లో. చక్ర వాకః క్రౌఞ్చ సహస్వరాధోధ్వనికుండిని, ఆర్యా గాధా ద్విపదగా కలహంసశ్చ తోటకః’ అని సంగీతరత్నాకరమందున్నది. అనఁగా, కలహంసవృత్తముయొక్క వైఖరి ప్రబంధమునఁ దోఁచె నని యర్థము. పల్లవంబులపెంపు=చిగురాకులయొక్క అతిశయము; పడఁతికేలనె గాదు=చిత్రరేఖయొక్క కరమునందే కాదు; సొగసైనపద పాళిన్=సుందరమగు ధ్రువపదములయొక్క బృందమునందు; సొంపు =అందమును; పూనెన్=పొందెను. పల్లవంబులపెంపు = గీతములందలి మొదటిపాదములయొక్క అతిశయము, ధ్రువాదులఁ బొందె నని యర్థము. అనుచున్=ఈప్రకారము వచించుచు; వనదేవతాజనంబు=వనదేవతలు; అభినుతింపన్=కొనియాడఁగ; రక్తివిధమును =రక్తి యొక్కరీతిని; దేశీయరాగగతియున్=దేశీయరాగముయొక్కరీతియును; చిత్రతరమంద్రరాగజశ్రీలు—చిత్రతర=విచిత్రమగు, మంద్ర=హృదయస్వరములవలనను, రాగ=శుద్ధస్వరములవలనను,జ=పుట్టిన,శ్రీలు=రచనలు; వెలయన్=ప్రకాశింపఁగ; ఇంతి=చిత్రరేఖ; మునిచెంత=మునిసమీపమునందు; అంతన్=అప్పుడు; వీణె వాయించెన్=వీణను పలికించెను.