చంద్రికాపరిణయము – 4. ద్వితీయాశ్వాసము

శ్రియై నమః
శ్రీలక్ష్మీనరసింహాయ నమః
చంద్రికాపరిణయము-సవ్యాఖ్యానము

ద్వితీయాశ్వాసము

క. అహరీశసుతావీచీ
విహరణరణదంఘ్రికటక◊విశ్వాసిపత
ద్గ్రహయాళుపాణిపద్మ
స్పృహయాళుమదాళిజాల ◊శ్రీగోపాలా! 1

టీక: అహరీశసుతా వీచీ విహరణ రణదంఘ్రికటక విశ్వాసి పతద్గ్రహయాళు పాణిపద్మ స్పృహయాళు మదాళిజాల – అహరీశసుతా=యమునానదియొక్క, వీచీ=తరఁగలయందు, విహరణ=క్రీడచేత, రణత్= మ్రోయుచున్న, అంఘ్రికటక= హంసకముల(అందెల)యందు, ‘హసకః పాదకటకః’ అని యమరుఁడు, విశ్వాసి=విశ్వసించునట్టి, పతత్=హంసపక్షిని, ‘పతత్పత్త్ర రథాణ్డజాః’ అని యమరుఁడు,గ్రహయాళు= గ్రహింప నిచ్ఛ గల, పాణిపద్మ=కరకమలమందు, స్పృహయాళు= వాంఛగల, మదాళిజాల =మదించిన తుమ్మెదలగుంపుగలవాఁడైన, శ్రీగోపాలా=శ్రీమదనగోపాలస్వామీ! అని కృతిపతిసంబో ధనము. దీనికిఁ జిత్తగింపు మను నుత్తరపద్యస్థక్రియతో నన్వయము.

యమునానదియందుఁ గ్రీడించుచున్న కృష్ణమూర్తియొక్క పాదకటకధ్వనియందు హంసపలుకు లనుభ్రాంతిచేత హంసలు సమీపమునకుఁ బోఁగా, శ్రీకృష్ణుండు వానిని బట్టు తలంపుతో కరకమలంబు సాపఁగా నాకేలుదమ్మియందు వాస్తవ కమలభ్రాన్తిచేఁ దుమ్మెదలగుంపు చుట్టుకొన్నదని తాత్పర్యము. భ్రాన్తిమదలంకారము. ‘శ్లో. భ్రాన్తిమా నన్యసంవిత్తి రన్యస్మిన్ సామ్యదర్శనాత్’ అని కావ్యదర్పణమందుఁ దల్లక్షణము.

తే. చిత్తగింపుము శౌనకా◊ద్యుత్తమర్షి
సమితి కిట్లను రోమహ◊ర్షణతనూజుఁ
డిట్లు వేలంబు డిగఁదార్చి,◊నృపతి హేమ
పటకుటి వసించి యుండె సం◊భ్రమ మెలర్ప. 2

టీక: చిత్తగింపుము = అవధరింపుము; శౌనకాద్యుత్తమర్షిసమితికిన్ = శౌనకుఁడు మొదలుగాఁ గల మహర్షిసంఘమునకు; ఇట్లు =వక్ష్యమాణప్రకారముగ; రోమహర్షణతనూజుఁడు=సూతుఁడు; అనున్=వచించును; ఇట్లు =ఈప్రకారము; వేలంబు= ఉప వనమును; డిగన్=దిగుటకు; తార్చి=ఒనరించి; నృపతి=సుచంద్రుఁడు; హేమపటకుటిన్ =బంగారుగుడారమునందు; సంభ్ర మము=సంతసము; ఎలర్పన్=అతిశయింపఁగ; వసించి యుండెన్ =నివసించి యుండెను.

చ. అలతఱిఁ దద్గిరీంద్రతటి◊కాంచనకాంచనమాలతీలతా
వలయలతాంతకాంతతర◊వాసనవాసనవానిలాళికల్
మలయ, విభుండు వేడ్కఁ దన◊మానస మాన, సముజ్జ్జ్వలాత్ము నె
చ్చెలిఁ గని పల్కు స్వర్ద్రుసుమ◊జీవనజీవనభేదనోక్తికన్. 3

టీక: అలతఱిన్=ఆసమయమునందు; తద్గిరీంద్ర తటికాంచన కాంచన మాలతీలతా వలయ లతాంత కాంతతర వాసన వాస నవానిలాళికల్ – తద్గిరీంద్ర = ఆహేమకూటముయొక్క, తటికా=దరులకు, అంచన= అలంకారమగు, కాంచన=సంపెఁగల యొక్క, మాలతీలతా= జాజితీవలయొక్క, వలయ=గుమురులయందలి, లతాంత = కుసుమములయొక్క, కాంతతర= మిక్కిలి మనోజ్ఞములగు, వాసన=సుగంధములకు, వాస= నివాసములగు, నవ=నూతనమగు, అనిలాళికల్=వాయుసమూ హములు; తనమానసము=తనమనస్సును; ఆనన్=స్పృశించునట్లుగా; మలయన్=వీచుచుండఁగా; విభుండు=సుచంద్రుఁడు; వేడ్కన్= సంతోషముచేత; సముజ్జ్జ్వలాత్మున్= మిక్కిలి ప్రకాశించుదేహముగల, లేదేని బుద్ధిగల; నెచ్చెలిన్= ప్రియసఖుని; కని=చూచి; స్వర్ద్రుసుమ జీవన జీవన భేదనోక్తికన్ – స్వర్ద్రుసుమ=కల్పతరుకుసుమములయొక్క, జీవన=మకరందము యొక్క, జీవన= బ్రదుకునకు, భేదన=భేదకమగు, ఉక్తికన్=వాక్యమును; పల్కున్=వచించును. యమకాలంకారము.

ఉ. ఈయగరాజమౌళి మన ◊మిచ్చట నుండుట తా నెఱింగి యా
త్మీయసమగ్రవైభవగ◊తిం దిలకింపఁగ రమ్మటంచు మో
దాయతిఁ బిల్వఁ బంచెఁ బవ◊నాంకురపాళికఁ, జూతమే వయ
స్యా! యచలేంద్రుదివ్యమహి◊మాతిశయంబు ప్రియంబు పొంగఁగన్. 4

టీక: ఈయగరాజమౌళి =పర్వతశ్రేష్ఠ మగు నీహేమకూటము; మనము,ఇచ్చటన్=ఈప్రదేశమున; ఉండుట = ఉండుటను; తాన్=తాను; ఎఱింగి =తెలిసికొని; ఆత్మీయసమగ్రవైభవగతిన్= తనయొక్క సమగ్రమైన వైభవరీతిని; తిలకింపఁగన్=చూచు టకు; రమ్మటంచున్ = రావలయు ననుచు; పవనాంకురపాళికన్=మందమారుతపరంపరను; మోదాయతిన్=సంతోషాతి శయముచేత; పిల్వన్=పిలుచుటకు; పంచెన్=పంపెను; వయస్యా=సఖుఁడా! ప్రియంబు =ప్రేమము; పొంగఁగన్=మించఁగా; అచలేంద్రు దివ్య మహిమాతిశయంబు –అచలేంద్రు=హేమకూటముయొక్క; దివ్య=లోకోత్తరమగు; మహిమాతిశయంబు = మహిమోన్నతిని; చూతమే = చూతమా. హేమకూటవనమందున్న సుచంద్రునిపై హేమకూటముననుండి మందమారుత పరంపర ప్రసరింపఁగాఁ దన విభవాతిశయము గాంచుటకు హేమకూటము సుచంద్రునిఁ బిల్వ మందమారుతమును బంపినదా యన్న ట్లుండె నని భావము. ఇందు గమ్యోత్ప్రేక్ష.

చ. అని జననేత తత్ప్రియస◊ఖాగ్రణికేల్ కయిదండఁ బూని, చ
క్కని తెలిమిన్న మెట్టికలు ◊గట్టిన త్రోవ నగేంద్ర మెక్కెఁ, బా
వనమరుదుచ్చలత్కిసల◊వారమృషావ్యజనాళిఁ బార్శ్వసీ
మ నలరు మల్లికాయువతి◊మండలి యింపుగ వీవ నత్తఱిన్. 5

టీక: అని = ఇట్లని; జననేత = సుచంద్రుఁడు; పార్శ్వసీమన్=ఇరుప్రక్కలను; అలరు =ఒప్పుచున్న; మల్లికాయువతిమండలి = మల్లెతీవియ లనెడు స్త్రీలగుంపు; పావన మరుదుచ్చల త్కిసల వార మృషావ్యజనాళిన్ – పావన=పవిత్రమగు, మరుత్= గాలి చేత, ఉచ్చలత్=మిక్కిలి కదలుచున్న, కిసల= పల్లవములయొక్క, ‘కిసాలయం కిసలయం కిసాలం కిసలం కిసమ్’ అని ద్విరూపకోశము, వార=సమూహమనెడు, మృషావ్యజన=కృత్రిమతాళవృంతములయొక్క, ఆళిన్ = సమూహముచేత, ‘కిసలవారమిషవ్యజనాళిన్’ అని పాఠమందు, కుసుమవార మను నెపము గల సురటీలగుంపుచేత నని యర్థము. ఇంపుగన్ = సొంపుగా; వీవన్ = వీచుచుండఁగా; అత్తఱిన్=ఆసమయమందు; తత్ప్రియసఖాగ్రణికేల్= శ్రేష్ఠుఁడగు ఆ ప్రియసఖుని హస్త మును; కయిదండన్=హస్తాలంబముగ; పూని= గ్రహించి; చక్కని తెలిమిన్న మెట్టికలు గట్టిన త్రోవన్=సుందర మగు వజ్ర మణులసోపానములు గట్టిన దారిచే; నగేంద్రము=హేమకూటమును; ఎక్కెన్ = అధిష్ఠించెను.

సుచంద్రుఁడు హేమకూటము నధిష్ఠించుతఱి నుభయపార్శ్వములందు మందమారుతముచేఁ బల్లవములు చలించు చుండఁగా మల్లికాలతలనెడు కాంతలు సురటీలచే వీచుచున్నయటు లుండె నని భావము. గమ్యోత్ప్రేక్ష.

క. అలరారు వేడ్కఁ దద్గిరి
కులరాడ్వైభవముఁ గాంచు ◊కుతలేశ్వరుతో
నలరాచెలి యిట్లను మధు
జలరాశితరంగనినద◊జయయుతఫణితిన్. 6

టీక: అలరారు వేడ్కన్=ఒప్పుచున్న సంతోషముతోడ; తద్గిరికులరాడ్వైభవమున్ = ఆపర్వతరాజైన హేమకూటముయొక్క వైభవమును; కాంచు=చూచుచున్న; కుతలేశ్వరుతో=రాజుతోడ; అలరాచెలి =ఆరాజసఖుఁడు; మధుజలరాశి తరంగ నినద జయయుత ఫణితిన్ – మధుజలరాశి =పూదేనియసముద్రముయొక్క, తరంగ=అలలయొక్క, నినద=ధ్వనియొక్క, జయ = గెలుపుతోడ, యుత=కూడుకొనిన, ఫణితిన్=వాక్కుచేత; ఇట్లనున్= వక్ష్యమాణరీతిగాఁ బలికెను. ద్వ్యక్షరీప్రాసకందము.

సీ. కరిరాజధీపూర◊పరిరాజితోదార, హరిరాజిహృతసార◊శరదపాళి,
నగచారివరజాత◊మృగచాతురీభీత,మృగచాలనోద్భూత◊పృథులధూళి,
సకలాజరీగూహ◊నకలావిలీనాహ,పికలాపినీవ్యూహ◊బిలగృహాళి,
లలితాపగోర్మిత◊రలితాసితాబ్జాత,గలితాసవజసాతి◊విలసనాళి,

తే. మహిప! కనుఁగొను తనుజను◊ర్మహిమజనన,జనకకలరవకులరవ◊ధ్వనితసురభి
భరితఘనరవవనచర◊తురగవదన,కులజలదచూళి యిమ్మహా◊కుధరమౌళి. 7

టీక: కరిరాజ ధీపూర పరిరాజి తోదార హరిరాజి హృత సార శరదపాళిన్ – కరిరాజ=గజశ్రేష్ఠము లనెడు,ధీపూర=బుద్ధి రాశిచేత, పరిరాజిత=మిగుల ప్రకాశించుచున్న, ఉదార=ఉత్కృష్టమగు, హరి=సింహములయొక్క, రాజి=పంక్తిచేత, హృత=హరింపఁబడిన, సార=శ్రేష్ఠమగు, కాదేని హృతసార=హరింపఁబడిన సారము గల, శరద=మేఘములయొక్క, పాళిన్ = గుంపు గలదియు; నగచారివర జాత మృగ చాతురీ భీత మృగ చాలనోద్భూత పృథుల ధూళిన్ – నగచారివర=వనచరశ్రేష్ఠులయొక్క, జాత= గుంపుయొక్క,మృగ=వేఁటయొక్క,‘మృగః పశౌ కురఙ్గే చ కరి నక్షత్రభేదయోః,యాచ్ఞాయాం మృగయాయాం చ’ అని
విశ్వము, చాతురీ=చాతుర్యమువలన, భీత=భయపడినట్టి, మృగ=లేళ్ళయొక్క, చాలన=సంచరణముచేత, ఉద్భూత =ఉద యించిన, పృథుల=అధికమగు,ధూళిన్=పరాగముగలదియు; సకలాజరీ గూహనకలా విలీనాహపికలాపినీ వ్యూహ బిలగృహాళిన్ – సకల = సమస్తమగు, అజరీ = దివ్యస్త్రీలయొక్క, గూహనకలా =దాఁగిలిమూఁత లనెడు నాటలయందు, విలీన=డాఁగినట్టి, ఆహపికలాపినీ=సర్పస్త్రీలయొక్క, అహిశబ్దముపై ‘తస్యేదమ్’ అని అణ్ ప్రత్యయము వచ్చి ఆహ యని యైనది, వ్యూహ = సంఘము గల, బిలగృహ =గుహలయొక్క, ఆళిన్ =పంక్తి గలదియు; లలితాపగోర్మి తరలి తాసితాబ్జాత గలితాసవజ సాతివిలస నాళిన్ – లలిత=మనోజ్ఞములగు, ఆపగా = నదులయొక్క, ఊర్మి = తరఁగలవలన, తరలిత = చలింపఁజేయఁబడిన, అసిత = నల్లనైన, అబ్జాత = పద్మములవలన, గలిత = జాఱినట్టి, ఆసవ = మకరందమువలన, జ =పుట్టినట్టి, సాతివిలసన=అత్యంతప్రకాశము గల, అళిన్ = తుమ్మెదలు గలిగినదియు; తనుజను ర్మహిమజనన జనక కలరవ కుల రవ ధ్వనిత సురభి భరిత ఘనరవ వనచర తురగవదన కుల జలదచూళిన్ – తను జనుః =దేహ మెత్తుటయొక్క, కాదేని మనసిజునియొక్క, ‘జనుర్జనన జన్మాని’ అని యమరుఁడు, మహిమజనన = ఉత్కర్షో త్పత్తికి, జనక=సంపాదకములైన, కలరవ=కోకిలలయొక్క, కుల =గుంపుయొక్క,రవ=ధ్వనులచేత, ధ్వనిత = సంజాత ధ్వని యగు, సురభి=వసంతముచేత, భరిత =నిండినట్టి, దీనికి చూళియం దన్వయము. ఘనరవ=గొప్పధ్వనులు గల, వనచర=కిరాతకులయొక్కయు, తురగవదన= కిన్నరులయొక్కయు, కుల=గుంపులును, జలద=మేఘములును గల, చూళిన్ = అగ్ర భాగము గలదియు నైన, ‘ఘనతర’ యను పాఠమున భరితమై ఘనతరమైన వన మందుఁ జరించు చున్నకిన్నరస్త్రీలు గల దని యర్థము. జలదచూళు లనఁగా ఘనకచలు. ఇమ్మహాకుధరమౌళిన్=ఈగొప్పపర్వతరాజును, మహిప = సుచంద్రుఁడా! కనుఁగొను = అవలోకింపుము.

మ. జననాథేశ్వర! కంటె రత్నకటకాం◊చత్స్వర్ణమౌళ్యాప్త మై,
యనిశాత్యాశ్రితరాజసింహనిచయం◊బై, సంవృతానేకవా
హిని యై, చందనగంధవాసితము నై, ◊యీశైలవర్యంబు దాఁ
దనరెన్ నీవిట నొందుమాత్రనె భవ◊త్స్వారూప్యముం గాంచెనాన్. 8

టీక: జననాథేశ్వర=సుచంద్రుఁడా! ఈశైలవర్యంబు=ఈపర్వతశ్రేష్ఠము; తాన్ = తాను; నీవు; ఇటన్ = ఇచట; ఒందుమాత్రనె= చేరినంతమాత్రముననె; భవత్స్వారూప్యమున్=నీసాటిని; కాంచెనాన్=పొందెనా యనునట్లు;రత్నకటకాంచత్స్వర్ణమౌళ్యాప్త మై – రత్న=రత్నమయము లగు, కటక=చరులందు, అంచత్=ఒప్పుచున్న, స్వర్ణ=సంపెంగ లనెడు, మౌళి=అశోకము లనెడు, ‘మౌళిః కఙ్కేళి చూతయోః’ అని విశ్వము, రత్నకటక=రత్నపుఁగడియములను, అంచత్స్వర్ణమౌళి=బంగరుకిరీట మును, ఆప్త మై= పొందినదై; అనిశాత్యాశ్రితరాజసింహనిచయంబై – అనిశ=ఎల్లప్పుడును, అత్యాశ్రిత=మిక్కిలి యాశ్రయించి నట్టి, రాజసింహ= పెద్దసింగము లనెడు నృపశ్రేష్ఠులయొక్క, ‘స్యురుత్తరపదే వ్యాఘ్ర పుఙ్గ వర్షభ కుఞ్జరాః, సింహ శార్దూల నాగాద్యాః పుంసి శ్రేష్ఠార్థగోచరాః’ అని యమరుఁడు, నిచయంబై =సమూహము గలదై; సంవృతానేకవాహిని యై – సంవృత= చుట్టుకొనఁబడిన, అనేక=అనేకములగు, వాహిని యై = నదులనెడు సేనలు గలదై; చందనగంధవాసితము నై = చందనతరువు లనెడు శ్రీగంధముయొక్క పరిమళముచేత వాసిత మైనదై; తనరెన్ = ఒప్పెను; కంటె=చూచితివా?

చ. అనుపమధాతుధూళియుతి, ◊నంచితకుంజనిషక్తి నొప్పు నీ
ఘనసితరత్నగండతటిఁ ◊గ్రాలెడుపొన్న నృపాల! కాన్పు తె
ల్లని తొలుగౌరు నెక్కినయి◊లాధరవైరియె చుమ్ము, కానిచో
నొనరునె దేవవల్లభత◊యున్, సుమనోభరణంబు దానికిన్. 9

టీక: నృపాల=సుచంద్రుఁడా! కాన్పు=చూడుము; అనుపమధాతుధూళియుతిన్ – అనుపమ=సాటిలేని, ధాతు=జేగురు యొక్క, ధూళి=పరాగముయొక్క, యుతిన్=సంబంధముచేతను; అంచితకుంజనిషక్తిన్ – అంచిత=ఒప్పుచున్న, కుంజ= పొదలయొక్క, దంతములయొక్క, నిషక్తిన్= సంబంధముచేతను; ఒప్పు = ఒప్పుచున్న; ఈ ఘనసితరత్నగండతటిన్ = ఈ ఘనమగు వజ్రమణిమయమైన స్థూలోపలప్రదేశమందు; క్రాలెడు పొన్న = ఒప్పునట్టి పొన్నచెట్టు; తెల్లని తొలుగౌరు నెక్కిన యిలాధరవైరియె చుమ్ము = తెల్లనైన యైరావతము నెక్కిన పర్వతవైరి యగునింద్రుండే చుమీ! కానిచోన్=అటు గానియెడ; దేవవల్లభతయున్ =దేవవల్లభ మగుటయు, ‘పున్నాగః పురుష స్తుఙ్గః కేసరో దేవవల్లభః’ అని యమరుఁడు; సుమనోభరణంబు = పుష్పభరణమును, దేవతాపోషణమును; దానికిన్=ఆపున్నాగమునకు; ఒనరునె = ఘటిల్లునా? అనఁగా సురరాజు గానిచో దేవవల్లభతయు, సుమనోభరణంబు ఘటిల్లవు గావున సురరాజే యనుట. వజ్రమణిమయ మయి ధాతుధూళివిరాజితం బగు గండోపల మైరావతంబును బోలి యున్నదనియు, దానిపై నున్న పుష్పించిన పున్నాగము దేవేం ద్రునిఁ బోలి యున్నదనియు భావము. రూపకాలంకారభేదము.

సీ. బహునీలతటులఁ గ◊న్పట్టు సూర్యాకృతుల్, పొందమ్ము లని త్రెంపఁ ◊బూని పూని,
నవవజ్రకటకమం◊డలిఁ దోఁచు నైజమూ◊ర్తులఁ బరేభమనీషఁ ◊గ్రుమ్మి క్రుమ్మి,
కురువిందమయపాద◊సరణిఁ గ్రాలెడు ఘన,మ్ముల వశామతిఁ గేల ◊నలమి యలమి,
గారుడగ్రావశృం◊గములఁ బొల్చు సురాధ్వ,తటినిఁ బెన్నది యంచుఁ ◊దఱిసి తఱిసి,

తే. యలఘువీథి భయోపబృం◊హకదురంత, బృంహితార్భటి దిక్కోటి ◊వ్రీలఁజేయు,
సమదవైఖరి నీయద్రి ◊సంచరించు, వనగజశ్రేణి కనుఁగొంటె ◊మనుజవర్య! 10

టీక: మనుజవర్య =సుచంద్రుఁడా! ఈయద్రిన్=ఈపర్వతమందు; సమదవైఖరిన్=మదయుక్త మైనరీతితోడ; సంచరించు వన గజశ్రేణి=తిరుగుచున్న యరణ్యగజసమూహము; బహునీలతటులన్ – బహు=అధికములగు, నీల=నీలమణిమయము లగు, తటులన్=చఱులయందు; కన్పట్టు సూర్యాకృతుల్=ప్రతిఫలించునట్టి సూర్యబింబములు; పొందమ్ములని =బంగరు పద్మము లనుకొని; త్రెంపన్=తెంచుటకు; పూని పూని=ప్రయ త్నించి, ప్రయత్నించి; నవవజ్రకటకమండలిన్ – నవ=నూతనమగు, వజ్ర=వజ్రమణిమయములగు, కటక=నితంబప్రదేశములయొక్క,మండలిన్ = సమూహమందు; తోఁచు =ప్రతిఫలించు; నైజమూర్తులన్ = తమశరీరములను; పరేభమనీషన్=ఇతరగజములను బుద్ధిచేత; క్రుమ్మి క్రుమ్మి=కొమ్ములతోఁ బొడిచి పొడిచి; కురువిందమయపాదసరణిన్ =పద్మరాగమణిమయమైన ప్రత్యంతపర్వతమార్గమందు; క్రాలెడు =ఒప్పుచున్న; ఘనమ్ములన్ =మబ్బులను; వశామతిన్=ఆఁడేనుఁగులను బుద్ధిచేత; కేలన్=తుండములచేత; అలమి యలమి=ఆక్రమించి, యాక్రమించి; గారుడగ్రావ శృంగములన్ – గారుడగ్రావ =గారుత్మతమణిమయములగు; శృంగములన్=శిఖరములయందు; పొల్చు=ఒప్పునట్టి (ప్రతిబింబించినట్టి); సురాధ్వతటినిన్=ఆకాశగంగను; పెన్నది యంచున్=పెద్దనది యనుచు; తఱిసి తఱిసి = సమీ పించి, సమీపించి;అలఘువీథిన్=అధికమగు వనవీథియందు; భయోపబృంహక దురంత బృంహితార్భటిన్ – భయ=భీతికి, ఉపబృంహక = వర్ధకమగు, దురంత=పారము లేని, బృంహిత=స్వకీయధ్వనులయొక్క, ఆర్భటిన్=అతిశ యముచేత; దిక్కోటిన్= దిక్స మూహమును; వ్రీలన్=చీలునట్లుగా; చేయున్=చేయును; కనుఁగొంటె= చూచితివా?

ఈహేమకూటము నానావిధమణికూటములతో విరాజిల్లుచున్నదనియు, నిందుఁ బెక్కు మదపుటేనుఁగులగుంపు లున్న వనియు భావము. భ్రాన్తిమదలంకారము.

చ. కలితమణీశరాసఘన◊కాండభృతిన్, వరవాజిసంగతిం,
బొలుచుసువర్ణకూట మరి◊భూపవిదారణఁ జూడఁ గాంచనా
చలవిజయప్రయాణపరి◊సన్నహనాత్మతఁ బూనుటల్ కడుం
దెలిపె మరుద్గతిధ్వనదు◊దీర్ణగుహాచయభేరికాధ్వనుల్. 11

టీక: కలిత మణీశరాస ఘనకాండ భృతిన్—కలిత=ఒప్పుచున్న, మణీశరాస=మణులు దాపిన విండ్లయొక్కయు, ఇంద్ర ధనువుయొక్కయు, ఘనకాండ= గొప్పనైన బాణములయొక్కయు, బాణములవలె నున్న (తద్రూపముగా నేర్పడిన) మేఘ ములయొక్కయు, భృతిన్=ధారణముచేత; వర వాజి సంగతిన్ –వర=శ్రేష్ఠములైన; వాజి=పక్షులనెడు గుఱ్ఱములయొక్కయు, సంగతిన్ =సాంగత్యముచేత; పొలుచు=ఒప్పునట్టి; సువర్ణకూటము= హేమకూటము; అరిభూపవిదారణన్=శత్రురాజభేదన మును; చూడన్=కనుటకు; కాంచనాచల విజయ ప్రయాణ పరిసన్నహ నాత్మతన్ – కాంచనాచల= మేరుపర్వతమునకు, విజయ= జయముకొఱకైన, ప్రయాణ= పయనముయొక్క, పరిసన్నహన=సన్నాహమందు, ఆత్మతన్ = చిత్తము గల్గుటను; పూనుటల్=వహించుటలను; మరుద్గతి ధ్వన దుదీర్ణ గుహాచయ భేరికా ధ్వనుల్—మరుద్గతి = వాయువుయొక్క గమనము చేత, ధ్వనత్=ధ్వని సేయుచున్న, ఉదీర్ణ=ఉత్కటమగు, గుహాచయ=గుహలసమూహము లనెడు, భేరికా= భేరులయొక్క, ధ్వనుల్ = శబ్దములు; కడున్=మిక్కిలి; తెలిపెన్=ఎఱింగించెను.

వాతాభిఘాతమున గుహాచయము మ్రోఁగుచుండఁగా మణీశరాసఘనకాండభృతి, వరవాజిసంగతులచే నొప్పుచున్న హేమకూటము శత్రుభేదనమునకై మేరుపర్వతమునకుఁ బయనము చేయుచుఁ బ్రయాణ భేరీనాదము సేయుచున్నటు లున్న దని భావము. గమ్యోత్ప్రేక్ష.

చ. మనుకులరాజచంద్ర! కను◊మా ప్రతిబింబితపర్ణజాలన
మ్రనఖరయుక్తిఁ దోఁచు నల◊మౌక్తికశృంగనృసింహమూర్తి పెం
పొనరె నధిత్యకాప్రభవి◊తోన్నతవిద్రుమవల్లికల్ పలా
శనజఠరంబు సీర్చి పెలు◊చం బయి నెత్తు నవాంత్రపాళిగన్. 12

టీక: మనుకులరాజచంద్ర=సుచంద్రుఁడా! ప్రతిబింబిత పర్ణజాల నమ్ర నఖర యుక్తిన్ – ప్రతిబింబిత= ప్రతిఫలించినట్టి, పర్ణజాల =ఆకులగుంపనెడు, నమ్ర=వంగినట్టి, నఖర=గోళ్ళయొక్క, యుక్తిన్=సంబంధముచేత; తోఁచు = తోఁచునట్టి; అలమౌక్తిక శృంగనృసింహమూర్తి = ఆముత్యములశిఖర మనెడు నృసింహస్వామి; అధిత్యకా ప్రభవి తోన్నత విద్రుమవల్లికల్ – అధి త్యకా =పర్వతోర్ధ్వప్రదేశమందు, ‘ఉపత్యకాద్రే రసన్నాభూమి రూర్ధ్వ మధిత్యకా’ అని యమరుఁడు, ప్రభవిత= సంజాతప్రభ వము లైన, ఉన్నత=విశాలము లయిన, విద్రుమవల్లి కల్=పగడపుఁదీవలు; పలాశన=రాక్షసుని (హిరణ్యకశిపుని)యొక్క; జఠరంబు=పొట్టను; పెలుచన్= ఆగ్రహముచేత; చీర్చి=బ్రద్దలు చేసి; పయిన్=మీఁదికి; ఎత్తు=ఎత్తునట్టి; నవ=క్రొత్తనగు; అంత్ర =ప్రేవులయొక్క; పాళిగన్=గుంపగుచుండఁగా; పెంపొనరెన్= ఒప్పారెను; కనుమా=చూడుమీ.

ఈహేమకూటమునందు ముక్తామయమగు నొకశృంగము నృసింహునిఁ బోలి, దానియందుఁ బ్రతిఫలించిన పల్లవములు నఖములఁ బోలి యుండఁగా, నధిత్యకలయం దుదయించిన పగడపుఁదీవలు హిరణ్యకశిపుజఠరము సీర్చి పైకెత్తిన ప్రేఁగులా యనునట్లు విలసిల్లె నని భావము.

సీ. వదనాంబుజమరీచి◊వారంబు తొలుదొల్త, నృక్షనాయకమాన◊రీతి నొంపఁ,
గలితవీక్షాపాత◊కలనంబు లంతంతఁ, బుండరీకమదైక◊భూతి మాన్ప,
సరసోరుయుగవిభా◊సారంబు మునుమున్న, కదళికామహిమంబుఁ◊ గడకుఁ దేర్పఁ,
గబరికాబంధవై◊ఖరి మించి వేవేగఁ, బరమఘనాఘన◊స్ఫురణఁ దూల్ప,

తే. నలరి కాంతారమృగనికా◊యముల నడఁప, నిరతమృగయానువర్తనా◊పరత నరతఁ
గాంచి యిచ్చటి తటులఁ జ◊రించు చెంచు,చంచరీకాలకలఁ జూడు ◊జనవరేణ్య! 13

టీక: జనవరేణ్య=సుచంద్రుఁడా! ఇ చ్చటి తటులన్=ఈహేమకూటపు సానువులయందు; వదనాంబుజమరీచివారంబు – వదనాంబుజ=ముఖకమలముయొక్క, మరీచి=కాంతులయొక్క, వారంబు=సమూహము; తొలుదొల్తన్= తొల్తనే; ఋక్ష నాయక=భల్లూకశ్రేష్ఠముయొక్క, చంద్రునియొక్క యని యర్థాంతరము; మానరీతిన్= అహంకారభంగిని; నొంపన్= అడంపఁగా; కలితవీక్షాపాతకలనంబులు – కలిత=ఒప్పుచున్న; వీక్షాపాతకలనంబులు =దృక్పాతముల వ్యాప్తులు; అంతంతన్= ముందు గనే; పుండరీకమదైకభూతిన్ – పుండరీక= శార్దూలములయొక్క, తెల్లదామరలయొక్క యని యర్థాంతరము; మద= గర్వముయొక్క; ఏక=ముఖ్యమగు; భూతిన్=సంపదను; మాన్పన్= పోగొట్టఁగా; సరసోరుయుగవిభాసారంబు – సరస=శ్రేష్ఠమగు, ఊరు=తొడలయొక్క,యుగ=కవయొక్క, విభాసారంబు = కాంతి సారము; మునుమున్న=ముందుముందుగనే; కదళికా=లేళ్ళయొక్క, ‘కదళీ కన్దళీ చీన శ్చమూరు ప్రియకావపి’ అని యమ రుఁడు, అనఁటులయొక్క యని యర్థాంతరము; మహిమంబున్=అతిశయమును, కడకున్ తేర్పన్=దూరీకరింపఁగా; కబరికాబంధవైఖరి – కబరికాబంధ=కేశబంధముయొక్క; వైఖరి=రీతి; వేవేగన్=అతివేగముగా; పరమఘనాఘనస్ఫురణన్ –పరమ=శ్రేష్ఠమగు; ఘనాఘన= మదపుటేనుఁగులయొక్క, వార్షుకాబ్దములయొక్క యని యర్థాంతరము; స్ఫురణన్= ప్రకా శమును; తూల్పన్= తొలఁగింపఁగా; అలరి =సంతసించి; కాంతారమృగనికాయములన్=అరణ్యమృగసమూహములను; అడఁపన్=అడంచుటకు; నిరతమృగ యానువర్తనాపరతన్ – నిరత=ఎల్లపుడు, మృగయానువర్తనా=వేట ననుసరించుటయందు, పరతన్=ఆసక్తిచేత; నరతన్= నరత్వమును; కాంచి=పొంది; చరించు=సంచరించుచున్న; చెంచుచంచరీకాలకల = తుమ్మెదలవంటి ముంగురుగల చెంచు కాంతలను; చూడు= చూడుము. ‘శ్లో. భామాసేయం బలిజకులజా భావభూభాగధేయమ్’ అనునట్లు చెంచుశబ్ద ప్రయోగము.

ఈపర్వతమందుఁ జరించు చెంచువనితలు తమముఖకాంతి ఋక్షమానమును, దృక్కాంతి పుండరీకములగర్వమును, తొడలు కదళీమదమును, కొప్పులు ఘనాఘనములదర్పమును తమసంకల్పమునకు మునుమున్నే తొలఁగఁజేయఁగా సంత సించి నిరతమృగయాపరత్వముచే నరజన్మమెత్తినవారే కాని వాస్తవముగ మనుష్యస్త్రీలు కా రని భావము.

చ. నికటఝరీకృపీటసర◊ణిం దనరూపము సూచి భవ్యమౌ
క్తికమయకూటసీమఁ దగు◊కేసరి తాఁ బ్రతిసింహబుద్ధిఁ గో
పకలనమై వడిన్ దుమికి ◊పైకొని సీర్చి తదంతరస్థర
త్నకులము లంచు నాత్మఁ గొని ◊దారున వెల్వడెఁ గాన్పు మోనృపా! 14

టీక: ఓనృపా=ఓసుచంద్రుఁడా! భవ్యమౌక్తికమయకూటసీమన్ – భవ్య=మనోజ్ఞమైన, మౌక్తికమయ= ముక్తామయ మగు, కూటసీమన్ =శిఖరప్రదేశమందు; తగు=ఒప్పునట్టి; కేసరి=సింహము; నికట ఝరీ కృపీటసరణిన్ – నికట=సమీపమందలి, ఝరీ=సెలయేటియొక్క, కృపీటసరణిన్=జలప్రదేశమందు; తనరూపము =తనప్రతిబింబమును; చూచి=అవలోకించి; తాన్= తాను; ప్రతిసింహబుద్ధిన్=ప్రతిస్పర్ధి యగు మఱియొక సింహ మను బుద్ధిచేత; కోపకలనమై= కోపావిష్టమై; వడిన్=వేగముగా; దుమికి=ఆజలములో దుమికి; పైకొని=కవిసి; సీర్చి=బ్రద్దలు చేసి; తదంతరస్థరత్నకులములు=ఆజలమధ్యమున నుండు రత్న జాలములు; అంచున్=అనుచు; ఆత్మన్=మనమునందు; కొని=అనుకొని; దారునన్=వేగముగా; వెల్వడెన్ = బయల్పడెను; గాన్పుము =అవలోకింపుము. ఈహేమకూటముయొక్క మౌక్తికమయ మగు నొకశృంగమందుఁ దగు సింహము చెంత నున్న సెలయేటిప్రవాహమునఁ బ్రతిఫలించిన తనరూపమును జూచి ప్రతిసింహ మనుకొని కోపించి, దుమికి, సీర్చి, యది ప్రతిసింహము కాదు జలాంతరమున నున్న రత్నచయ మనుకొని వేగముగ వెల్వడె నని భావము.

చ. అలఘుపరాగహేమవస◊నాంచల మించుక జాఱఁ దేఁటిచూ
పుల మరు గెల్చు నీసొబగు◊పొంకముఁ గన్గొని మోహతాపసం
కలనత నో మహీరమణ! ◊కంటివె యీ వనలక్ష్మి వేఁడియూ
ర్పులు వెడలించెఁ జంపకపుఁ◊బువ్వుల మాఁగినగాడ్పుచాలునన్. 15

టీక: ఓమహీరమణ=ఓ సుచంద్రుఁడా! ఈవనలక్ష్మి = ఈవనసంపద యనెడు నొక స్త్రీ; అలఘుపరాగహేమవసనాంచలము – అలఘు=విశాలమగు, పరాగ=పుప్పొడి యనెడు, హేమవసన=స్వర్ణవస్త్రముయొక్క, అంచలము=అగ్రము; ఇంచుక= కొంచెము; జాఱన్ =జీరాడఁగా; తేఁటిచూపులన్= తుమ్మెదలనెడు చూపులచేత; మరు గెల్చు నీసొబగుపొంకమున్ = కాముని నోడించు నీసౌందర్యముయొక్క పొందికను; కన్గొని=అవలోకించి; మోహతాపసంకలనతన్—మోహ=వలపువలన నైన, తాప =సంతాపముయొక్క, సంకలనతన్=సంబంధముచేత, ‘సంకలయతీతి సంకలనః’ కర్త్రర్థమందు నంద్యాదిల్యుట్ప్రత్యయము; చంపకపుఁబువ్వుల మాఁగినగాడ్పుచాలునన్=సంపెంగిపువ్వుల సంబంధియైన మాఁగిన గాడ్పులయొక్కగుంపు చేత; వేఁడి యూర్పులు వెడలించెన్= ఉష్ణ మగు నిశ్వాసములను విడిచెను; కంటివె=చూచితివా?

ఇందు సుచంద్రునందు వనలక్ష్మికిఁ దదీయసౌందర్యవిశేషాద్యవలోకనమహిమచేఁ బ్రథమరాగోదయ మైనట్లు వ్యక్తమగు చున్నది కావున నభిలాషహేతుకవిప్రలంభశృంగారము వ్యజ్యమానమగును. విప్రలంభ మనఁగావియోగకాలావచ్ఛిన్నరతియె. నాయికానాయకులకు వైయధికరణ్యము వియోగ మని కొంద ఱభిప్రాయపడినారు గాని యట్లైనచో ‘శ్లో. ఏకస్మిన్ శయనే పరాఙ్ముఖతయా వీతోత్తరం తామ్యతో రన్యోన్యస్య హృది స్థితేప్యనునయే సంరక్షతో ర్గౌరవమ్’ ఇత్యాదికావ్యములయం దేకశయ్యావిప్రలంభము చెప్పఁబడినది యసంగత మగును గావున వియుక్తుండ నైనవాఁడ నను బుద్ధియె వియోగమ్మని సిద్ధాంతము. ఇట్టి విప్రలంభమునకు సుచంద్రుఁ డాలంబనవిభావంబును, తదీయ సౌందర్యాదు లుద్దీపనవిభావంబులును, వేఁడి యూర్పు లనుభావంబులును, ఆక్షిప్యమాణరోమాంచాశ్రుపాతాదులు సాత్త్వికములును. తాదృశచింతాదైన్యాదులు వ్యభి చారులును పరిపూర్ణము లగు కారణకార్యసహకారు లుండుటంబట్టి లోకోత్తరవిభవంబు ఘటించినయది. విభావానుభావాది స్వరూపము ముందు వివరింపఁబడును.

చ. అతులఫణీశరమ్యకట◊కాన్వితమై, నిజమూర్ధభాగసం
భృతమలినాన్యపుష్కరఝ◊రీతిలకం బయి, కాలికానుషం
జిత మయి, దేవసేవ్య మయి ◊చెన్నగు నీకుధరాధిరాజ మో
క్షితివరచంద్ర! కైకొనుట ◊చిత్రమె ధాత్రి గిరీశనామమున్. 16

టీక: ఓక్షితివరచంద్ర =ఓరాజచంద్రుఁడా! అతుల ఫణీశ రమ్య కట కాన్వితమై – అతుల=అసమానము లగు, ఫణీశ=సర్పశ్రేష్ఠ ములచే, రమ్య= మనోజ్ఞము లగు, కటక=చరులతోడ, అన్వితమై=కూడుకొన్నదై, సాటిలేని ఫణీశుఁలనెడు రమ్య మయిన కడియములచేఁ గూడినదై యని యర్థాంతరము; నిజ మూర్ధభాగ సంభృత మలినాన్య పుష్కర ఝరీతిలకం బయి—నిజ= తన దైన, మూర్ధభాగ=శిరోభాగమందు, సంభృత=భరింపఁబడిన, మలినాన్య=నిర్మల మగు, పుష్కర= జలము గల, ఝరీ తిలకం బయి =శ్రేష్ఠ మగు సెలయేళ్ళు కలదయి, మలినాన్య యగు పుష్కరఝరీ యనఁగ వ్యోమగంగ గల దయి యని యర్థాంతరము; కాలికానుషంజిత మయి – కాలికా=మేఘమాలచేత, పార్వతీదేవిచేత నని యర్థాంతరము, అనుషంజిత మయి =సంసక్త మయి; దేవసేవ్య మయి =దేవతలకు విహరించు స్థల మయి, ఇంద్రాదిభజనీయ మయి; చెన్నగు= ఒప్పుచున్న; ఈకుధరాధి రాజము =ఈపర్వతశ్రేష్ఠము; ధాత్రిన్=భూమియందు; గిరీశనామమున్=గిరిశ్రేష్ఠమను పేరిని, శివనామము నని యర్థాంతరము; కైకొ నుట =స్వీకరించుట; చిత్రమె = ఆశ్చర్యకరమా? గరీశునందున్న గుణగణముతో విరాజితం బగు నీపర్వతమునకు గిరీశ మను నామ ముండుట యాశ్చర్యకరము గా దనుట.

సీ. అలరుఁదీవియలఁ బా◊యక మించుక్రొందేఁటి,జోటిమ్రోఁత లొయారి◊పాట గాఁగ,
స్థలకంజినీకం◊జములగాడ్పు దారిఁ బైఁ, బర్వుపుప్పొడి పచ్చ◊పావడలుగఁ,
గనకశృంగాగ్రసం◊గతపాండుకాండదా◊నీకముల్ నవపుండ◊రీకములుగ,
నతిచలచ్ఛదయుక్తి ◊నలరురంభాస్తంభ◊జాలంబు జయపతా◊కాలి గాఁగ,

తే. భోగవతికావతంసముల్ ◊పుణ్యతరులు, రాజశార్దూలసంఘముల్ ◊ప్రాంతవీథిఁ
గొలువఁ బేరోలగం బున్న◊చెలువుఁ బూనె, నీధరాభృద్వరునిఁ గంటె ◊ భూధరేంద్ర! 17

టీక: భూధరేంద్ర =ఓరాజేంద్రుఁడా! అలరుఁదీవియలన్=పువ్వులతోఁ గూడిన తీవలను; పాయక=వదలక; మించుక్రొందేఁటి జోటిమ్రోఁతలు—మించు=అతిశయించునట్టి, క్రొందేఁటిజోటి=వయసుతుమ్మెదబోఁటులయొక్క, మ్రోఁతలు=ఝంకారములు; ఒయారిపాట గాఁగన్= నారీమణులపాట యగుచుండఁగా; స్థలకంజినీకంజములగాడ్పు దారిన్ – స్థలకంజినీ=మెట్టదామరతీవలయొక్క, కంజముల=పద్మములయొక్క, గాడ్పుదారిన్ =వాయుప్రసరణమార్గముచేత; పైఁ బర్వుపుప్పొడి =పయి కెగయు పుష్పరేణువు; పచ్చపావడలుగన్=పసిఁడిపంచెలు గాఁగ; కనకశృంగాగ్ర సంగతపాండుకాండదానీకముల్—కనక= సువర్ణమయము లగు, శృంగ=శిఖరములయొక్క, అగ్ర=కొనల యందు, సంగత=కూడియున్న, పాండు=తెల్లనగు, కాండద =మేఘములయొక్క, అనీకముల్=గుంపులు; నవపుండరీకము లుగన్ =శ్వేతచ్ఛత్రములు కాఁగా; అతిచల చ్ఛద యుక్తి న్ –అతిచలత్=మిక్కిలి కదలుచున్న, ఛద=పర్ణములయొక్క, యుక్తిన్=సంబంధముచేత; అలరు= ఒప్పుచున్న; రంభాస్తంభ= అనఁటిస్తంభములయొక్క, జాలంబు=గుంపులు; జయపతాకాలి కాఁగన్ = విజయధ్వజముల గుంపులు కాఁగా; భోగవతికా వతంసముల్ =వేశ్యారత్నములు, నాగకన్యకాశ్రేష్ఠములు; పుణ్యతరులు=మిక్కిలి పుణ్యశీలు రైనవారు, మనోజ్ఞము లగు వృక్షములు, ‘పుణ్య మ్మనోజ్ఞేఽభిహితం తథా సుకృత ధర్మయోః’ అని విశ్వము; రాజశార్దూలసంఘముల్ = రాజ శ్రేష్ఠుల గుంపులు, వ్యాఘ్రశ్రేష్ఠముల గుంపులు; ప్రాంతవీథిన్=సమీపప్రదేశమందు; కొలువన్=సేవించుచుండఁగా ; పేరోలగం బున్న చెలువున్=కొలువుకూటమందున్న యందమును; పూనెన్=వహించెను; ఈధరాభృద్వరునిన్=ఈపర్వత శ్రేష్ఠమును, ఈ రాజశ్రేష్ఠము నని ధ్వనితార్థము; కంటె =అవలోకించితివా?

క్రొందేఁటిజోటిమ్రోతలు నారీమణులగానంబులుగాను, మెట్టదామరలనుండి వెడలుగాడ్పునఁ బైఁబర్వు పుప్పొడి పసుపు పంచగాను, శిఖరాగ్రమందు వెలయు తెల్లమబ్బు శ్వేతచ్ఛత్రముగాను, కదలుచున్న యాకులు గల యనంటులు జయపతాక ములుగాను శోభిల్లుచుండఁగా, నాగకన్యకాశ్రేష్ఠంబు లనెడు వేశ్యారత్నంబులు, మనోహరములగు వృక్షములనెడు పుణ్య వంతులు, శ్రేష్ఠములగు పులు లనెడు రాజశ్రేష్ఠులు చెంతలం గొలుచుచుండఁగా పేరోలగం బున్న రాజరత్నమువలె నీధరాధర శ్రేష్ఠము తేజరిల్లుచున్న దని తాత్పర్యము.

వ. వెండియు నీహేమకూటంబు హేమకూట ప్రభాకూట సంధ్యారాగోదయవైఖరీ పరిఫుల్ల్యమాన గిరిమల్లి కావల్లికా ప్రసూనాంబుజాత ప్రవాహ సంవర్ధితం బగుట నాత్మనిదానాభిధానంబునం బ్రసిద్ధిం బొందు నతి మంజుల హింజులపుంజ వలయంబు నడుమం జెలువూను పారిజాతమహీజాత లతానికాయకాయమానం బుల క్రింద నందంబు లగుకురువిందవేదికాబృందంబులపై నిండువేడుక నెమ్మనంబుల మెండుకొన నెచ్చెలి పిండు పసిండిదండియలు వూని సుతి మీట నతికలిత కలనాద కాకలీస్వర విలసనంబున విషమాంబక బిరుదగీతవ్రాతంబులు పాడు తెఱగంటికలువకంటిదంటల నవీన తానసంతానమానంబులం జొక్కి సం జాతపులకప్రరోహంబులం బొలుచు చెలువున నుదారకోరకవారంబులం జూపట్టు నీరంధ్రప్రియాళుప్రతా నంబులవలన నీరంధ్రప్రియాళు ప్రతాన నికుంజగేహంబుల నొక్కయెడ నైన నినభయంబు గానక సుఖం బుండి యాఖండలశిలాగండోపలఫలక ప్రతిఫలి తాధిత్యకాస్థల రమమాణ గరుడమాణవకమూర్తులం గని వెఱ దొరయ నచ్చటం జొరఁబాఱు చిలువదొరల ఫణాతల మణికులభాస్వద్ఘృణిపూరంబులకు నిలువ నోపక వెడలి పఱతెంచు కటికిచీకటి కిన్నరాంబుజముఖీ కదంబక విరచిత నూతన దోహద ధూమంబుల యోజం దేజరిల్ల సద్యస్సముత్పద్యమాన ఫలమిళిత శాఖాకలితంబు లగు దాడిమీ కులంబులఁ దిలకించి యచ్చటి కాశ్రయింపం జనుదమని నిజప్రియజనంబులఁ బిలుచు రాచిలుకచిలుకలకొలకుల కలికిపలు కులు విని యలరు కర్ణికారవారంబులవలనఁ గర్ణికారవార ప్రవాళశ్రేణు లబ్జరాగతోరణ మాలికలును, నిస్తుల గోస్తనీ విలంబమాన ఫుల్లగుచ్ఛంబు లచ్ఛమౌక్తిక వితానంబులును, నమలకకుత్థ్సల నానట్యమాన మత్తాళిపాళిక లభిరూపధూపధూమమాలికలునుం గాఁగ నమరు మందార వీరున్మందిరంబున సంపెంగ తీవ జాళువాగొలుసుల నుయ్యెల లూఁగు సాధ్యమిథ్యామధ్యాజనంబుల చరణపయోజసంయోజనంబు లకు లక్ష్యంబులై తదీయ స్పర్శన వినిర్గతానురాగకందళంబుల యందంబునం జివురించు నశోకానోక హంబులవలన నశోకానోకహకసుమవిసర వర్షిత మరంద ధారాళధారా గౌరవంబునఁ బెనులోయఁ బడిన ధగధగని పగడంపుఁగోనల భుగభుగ వలచు కపురంపుటనంటుల చప్పరంబుల క్రిందం జెప్పరాని వేడుక ముప్పిరిగొన విచ్చలవిడి డాఁగిలిమ్రుచ్చులాడునెడ నెడయనివడి యడర నుదంచిత చంచరీకమాలికల నుల్లసిత పల్లవంబుల నుత్తుంగ నిస్తుల స్తబకంబుల నుజ్జ్వలత్కళికాకులంబుల నుల్లసిల్లు తరుణవ్రతతికలం గల కుడుంగరంగంబులలోఁ దమ్ముఁ దెలియకుండ డాఁగియున్న యన్నులమిన్నల వీక్షింపఁ జరించు సిద్ధరాజ తనూజా సమాజంబుల నిశాత విలోచనాపాతంబుల నపూర్వవిలాసంబుఁ గాంచు తిలకనగతిల కంబులవలనఁ దిలకనగతిలక కుసుమ గళ న్మకరంద సంపర్కంబునం బదనైన ముత్తియంపుదొనల నిండిన సంకుమదపంకంబునం బొంకంబుగా మృదుమృదుత్వగభినవదళంబుల నలినభవునిం గొలువఁ జనిన తమతమ రమణునికై సందేశంబులు లిఖించి చెలుల నంచి పంచశర పంచశరీప్రపంచిత రహణశిఖి శిఖాంచల చంచలిత మానసంబున నడలి బడలి చెలువ మెలుపు కలువదొర రాయరంగులం బఱచిన కలువరేకు జముకాణంబులపయిం బొరలు గంధర్వసౌగంధికగంధిరత్నంబుల సంతాపంబు సన విరి నీరు నించియు, కెంజివురులం గప్పియుఁ, జల్లపుప్పొడులు సల్లియు, నలరుజొంపంబులం బొదివియు, శీతలోపచారంబులు సేయు తత్ప్రియవయస్యాలలామంబులకుం దోడునీడలై, చూడం దగు వాసంతికా జాతంబు లలసవాతపోత ప్రచారంబులం గౌఁగిలింప నవారిత సుమనోవికాసంబునం బొలుపు గాంచు కురు వకలతా వలయంబులవలనఁ గురువకలతావలయ వల్లవపల్లవాధరామండల మధ్యస్థల సందర్శనీయ పురందరశిలాశిఖర నందనందన సంభృత రంజిత వేణుదండాయమాన మానిత కటకవాల వాయజ సూత్రానుబింబంబు లహిరూపంబులుగా నెఱింగి యుప్పొంగి చెంగున నెగసి చరణంబులం ద్రొక్కిపట్టి చంచూపుటంబుల సించి ఱెక్కల నడిచి యేమియుం దేరకున్న విస్మయంబు మనంబు బెరయ విఫల ప్రయత్నంబులై పుడమి వ్రాలు కాంతార మయూర దారకంబులం జొచ్చి కికాకిక కేళి సల్పు గరుడసరోజ ముఖీ నికరంబుల దరస్మిత విలాసంబున సమధిక పథికచేతస్తాప సంవర్ధక ప్రసవామోద పరంపరలఁ జెన్నుమీఱు పున్నాగపూగంబులవలనఁ బున్నాగ పూగ మధుసాల రసాలముఖ్య దివ్యతర్వంతరంబున మంజులకంజరాగ భిత్తిభాగ మరీచిపుంజంబు భాస్వదాతప ప్రాబల్య ఖంజనంబును, శాతకుంభకుంభవిభా డంబరంబు సంధ్యారాగారంభంబును, వలభిన్మణివలభి రుచిరరుచి పూరంబు నిబిడ తిమిర వివర్ధనం బును, ముక్తోల్లోలవిభాసారంబు దారకానిసర్గంబును, భూరిస్తంభ సంగ్రథిత హీరదర్పణ ద్యుతిజాతంబు నిస్తంద్ర చంద్రికా కల్ప నంబునుం గావింప నక్షీణ క్షణదైక విలసనంబునం బొలుచు కేళికాహర్మ్యంబున మిక్కిలి పిక్కటిల్లు మక్కువఁ జక్కెరవిల్తుజగడంబుల మగలఁ జొక్కించి యాత్మీయ పుంభావసంభా వనా సంభూతశ్రమంబు దూలఁ జెంగటి వనుల సంచరించు నాగకన్యావతంసంబుల యాగాఢ నిశ్శ్వాస సమీరంబుల తోరంబగు సిరి నొప్పారు సిందువారంబులవలన సిందువారాది నగవార శిలాతలంబుల నురులు దాల్చియు, నెత్తమ్ము లిమ్ముగాఁ బ్రవహించు సెలయేఱులపై వలలు సేర్చియు, స్వజాతి ద్విజా తుల రాఁబిలుచు పులుగుల దీములు గట్టియు, జిగురుఁగండె లమర్చియు, విచిత్రతరవనపతత్త్రిగోత్రం బులం బట్టుకొను తలంపున మెండైన పొదలనుండి యప్పటప్పటికి వానిం గానఁ దమకించి చెంచెత లెత్తు నెమ్మొగంబు తమ్మిచాయల వసంతసమయ సముదిత సౌభాగ్యమ్మునం బొదలు చామ్పేయ ధాత్రీరుహం బులవలనఁ జామ్పేయధాత్రీరుహ కుసుమగళిత పరాగరాశి మధురసనదీ పులినదేశంబునఁ గపురంపుట నంటి లేయాకుఁ బఱచి మరకత మకరకేతనాహితమూర్తిని నిలిపి తదేకపూజాతాత్పర్యంబున నున్న సద్గ ణోత్తములకు విరు లొసంగు నంతరంగంబునఁ బ్రమదావనంబు సొచ్చి ప్రమథమధురోష్ఠీతల్లజంబులు గేల నూది నిక్కి విటపాంతరాభివేష్టిత మల్లికాప్రసూనంబులఁ గోయునెడఁ దత్కర సంయోగంబువలన నిజేష్ట ఫలలాభంబు చేకూరెనో యన రమ్యఫలంబులం బెంపొందు మాకందంబులవలన మాకందవాసనాభి వాసిత పవమాన ప్లవమాన నీలాశోకరజస్తోమంబు ప్రవర్గ్యోపక్రమ నిర్గచ్ఛద్ధూమ వర్తనంబునం బర్వ నమం దానంద కందళితచిత్తారవిందంబులతో ముందుముందుగఁ బఱతెంచు పురందరాది బృందారకవర్గంబుల తనూశ్రమంబుఁ దెరలం జేయు శీతలతర తాపసాశ్రమ నానావిధ వసుధారుహ నివహంబుల చెంతలం దదీయ శాఖాప్రసవముఖ వినిష్ఠ్యూత మధుపాళికం బ్రసవితంబులగు విశారద విటపి పటలంబులవలనను, వలను మిగిలి మేరుకుధరంబునుంబోలె శక్రపురాతిభాసురంబును, హిమవన్నగంబునుంబోలె గోభృత్కా ర్ముకాన్వితకాళికాతిశోభితంబును, మందరధరంబునుంబోలె వ్యాళాధిరాజ పరివేష్టితంబును, ఋశ్యమూ కాద్రియుంబోలె హరిజాతికలితంబును, మాల్యవద్గోత్రంబునుంబోలె రామసంచారసంగతంబును, నీలాచ లంబునుంబోలె పురుషోత్తమభూషితంబును, గంధమాదనగ్రావంబునుంబోలె మహావరాహపాళికాలింగి తంబును, సమామోద సంకలిత శ్యామా మహితం బయ్యును నసమామోద సంకలిత శ్యామామహితంబై, వీనఘనార్భటి విఘూర్ణిత మహాబిలం బయ్యును నవీనఘనార్భటి విఘూర్ణిత మహాబిలంబై, మరాళికా శ్రిత కటక స్థలవనజాతం బయ్యును నమరాళికాశ్రిత కటకస్థల వనజాతంబై, సదృక్ష రాజసారంగ సంతాన సంకలితం బయ్యును నసదృక్ష రాజసారంగ సంతాన సంకలితంబై, కాలాహితసుమనోనగభాసమానం బయ్యును నకాలాహిత సుమనో నగభాసమానంబై యొప్పుచున్నయది విలోకింపుము.

టీక: వెండియున్=మఱియును; ఈహేమకూటంబు=ఈహేమకూటపర్వతము, దీనికి వచనాంతమందున్న యొప్పుచున్న దను క్రియతో నన్వయము; హేమకూట ప్రభాకూట సంధ్యారాగోదయ వైఖరీ పరిఫుల్ల్యమాన గిరిమల్లికా వల్లికా ప్రసూనాంబు జాత ప్రవాహ సంవర్ధితం బగుటన్ – హేమకూట=కనకశిఖరములయొక్క, ప్రభాకూట=కాంతిపుంజ మనెడు, సంధ్యారాగ= సాయంకాలసూచక మగు నారుణ్యముయొక్క, ఉదయ = ఆవిర్భావముయొక్క, వైఖరీ = రీతిచేత, పరిఫుల్ల్యమాన = విక సించుచున్న, గిరిమల్లికా=కుటజవృక్షములయొక్క, వల్లికా=లతలయొక్క, ప్రసూన= పుష్పములయొక్క, అంబుజాత = మకరందసమూహముయొక్క,ప్రవాహ=వఱదచేత, సంవర్ధితం బగుటన్=వృద్ధిఁబొందింపఁ బడినదైన హేతువుచేత; ఆత్మనిదా నాభిధానంబునన్—ఆత్మ=తమకు, నిదాన=ఆదికారణముయొక్క, అభిధానంబునన్=పేరిచేత; ప్రసిద్ధిం బొందు నతిమంజుల హింజులపుంజ వలయంబు నడుమన్ –ప్రసిద్ధిం బొందు=ఖ్యాతిఁ గాంచునట్టి, అతిమంజుల=మిక్కిలి మనోహరము లగు, హింజుల=నీరుగన్నెరులయొక్క, అంబుజాతమువలన వృద్ధి నందినది గావున నీరుగన్నెర లని పేరు పొందినదట, ‘నిచుళో హింజుళో హింజుః’ అని యమరుఁడు, పుంజ వలయంబు నడుమన్ =వలయాకారమగు గుంపుల నడుమను; చెలువూను పారిజాత మహీజాత లతానికాయ కాయమానంబుల క్రిందన్ – చెలువూను=సౌందర్య మొందు, పారిజాత=పారిజాత మనెడు, మహీజాత=వృక్షములయొక్క, లతానికాయ=తీవగుంపుయొక్క, కాయమానంబుల క్రిందన్=పందిళ్ళ క్రింద; అందంబు లగు కురువిందవేదికా బృందంబులపైన్ – అందంబు లగు=సుందరములైన, కురువిందవేదికా=పద్మరాగమణులతోఁ గట్టిన తిన్నెల యొక్క, బృందంబులపైన్=సమూహములమీఁద; నిండువేడుక=పరిపూర్ణకుతూహలము; నెమ్మనం బులన్=మంచి మనస్సు లందు; మెండుకొనన్=అతిశయింపఁగా; నెచ్చెలిపిండు=ప్రియసఖీసమూహము; పసిండిదండియలు =బంగరువీణలు; పూని =వహించి; సుతి మీటన్=శ్రుతిని అతిశయింపఁజేయఁగా, శ్రుతి యనఁగా స్వరారంభకావయవవిశేషము. ‘శ్లో.ప్రథమశ్రవణా చ్ఛబ్ద శ్శ్రూయతే హ్రస్వమాత్రకః, సాశ్రుతి స్సంపరిజ్ఞేయా స్వరావయవలక్షణా’ అని శ్రుతిలక్షణము; అతికలిత=మిక్కిలి కలయుచున్న; కలనాద=అవ్యక్తమధురధ్వని గల; కాకలీ స్వర=మధురమై అస్ఫుటమైన స్వరముయొక్క; విలసనంబునన్ =ఉన్మేషముచేత; విషమాంబక=పంచబాణునియొక్క; బిరుద=సామర్థ్యచిహ్నములయొక్క; గీత=గానములయొక్క; వ్రాతంబులు=సమూహములు; పాడు=పాడెడు; తెఱగంటి=దేవతాసంబంధినులగు; కలువకంటిదంటల=దిట్టతనము గల స్త్రీలయొక్క; నవీన=అపూర్వమగు; తాన= తానకారముతోఁ బాడెడు పాటలయొక్క; సంతానమానంబులన్= సమూహగౌర వములచేత; చొక్కి=సుఖపరవశమై; సంజాత పులక ప్రరోహంబులన్ – సంజాత= పుట్టినట్టి, పులక=రోమాంచములయొక్క, ప్రరోహంబులన్=అంకురములచేత; పొలుచు చెలువునన్=ఒప్పు చందంబున; ఉదారకోరకవారంబులన్ – ఉదార=గొప్ప లయిన, కోరక=కలికలయొక్క, వారంబులన్=సమూహములచేత; చూపట్టు=కన్పడుచున్న; నీరంధ్ర=దట్టమైన; ప్రియాళు ప్రేంకణములయొక్క; ప్రతానంబులవలనన్=సమూహములవలన, ఈ పంచమ్యంతమునకు ముందు రాఁగల పంచమ్యంతము లకు ‘వలను మిగిలి’ అను క్రియతో నన్వయము; నీరంధ్ర ప్రియాళు ప్రతాన నికుంజగేహంబులన్ – నీరంధ్ర=దట్టమైన; ప్రియాళు =ప్రేంకణములయొక్క; ప్రతాన=సమూహముయొక్క, నికుంజ గేహంబులన్=పొదరిండ్లయందు; ఒక్కయెడ నైనన్= ఒక సమయమం దైనను; ఇనభయంబున్=సూర్యభయమును; కానక= చూడక; సుఖంబుండి=సుఖముతోడ వసించి; ఆఖండల శిలా గండోపల ఫలక ప్రతిఫలి తాధిత్యకాస్థల రమమాణ గరుడ మాణవక మూర్తులన్ – ఆఖండలశిలా=ఇంద్రనీలమణుల యొక్క,గండోపలఫలక=పలకలవంటి స్థూలోపలములయందు,ప్రతిఫలిత=ప్రతిబింబితములైన, ఇది మాణవకమూర్తులకు విశేషణము,అధిత్యకాస్థల= పర్వతోర్ధ్వప్రదేశమందు, రమమాణ= క్రీడించుచున్న, గరుడ=గరుడపక్షులయొక్క, మాణవక =బిడ్డలయొక్క,మూర్తులన్=శరీరములను; కని=చూచి; వెఱ దొరయన్=భయమొదవఁగా; అచ్చటన్=ఆనికుంజగేహ ములయందు; చొరఁబాఱు=చొచ్చుచున్న; చిలువదొరల ఫణాతల మణికుల భాస్వద్ఘృణిపూరంబులకున్ – చిలువదొరల= ఫణి శ్రేష్ఠములయొక్క, ఫణాతల=పడగలయందున్న, మణికుల=మణుల సమూహముయొక్క,భాస్వత్=ప్రకాశించుచున్న, ఘృణి=కాంతులయొక్క, కాదేని మణిసమూహ మనెడు సూర్యకిరణములయొక్క యని యర్థము, పూరంబులకున్=ప్రవాహ ములకు; నిలువన్ ఓపక=ఉండఁజాలక; వెడలి=బయలుదేఱి; పఱతెంచు=పోవునట్టి; కటికిచీకటి= గాఢాంధకారము; కిన్న రాంబుజముఖీ కదంబక విరచిత నూతన దోహద ధూమంబుల యోజన్– కిన్నరాంబుజముఖీ= కిన్నరస్త్రీలయొక్క, కదంబక =సమూహముచేత, విరచిత=చేయఁబడిన, నూతన=నవీన మగు, దోహద = దోహద మనఁగా తరుగుల్మలతాదుల కకాల మందు పుష్పఫలాదినిమిత్తమై చేయు క్రియావిశేషము. అట్టి క్రియావిశేషము లెవ్వి యన, దాడిమికి పొగ, అశోకమునకు స్త్రీపాద తాడనము, పొగడకు ముఖసీధువు, గోరింట కాలింగనము, బొట్టుగునకు వీక్షణము, మామిడికి కరస్పర్శము, సంపెఁగకు ముఖ రాగము, కొండగోఁగునకు సల్లాపము, వావిలికి ఊర్పు, మోరటికి పాట, సురపొన్నకు నవ్వు ఇత్యాదిగాఁ దెలియవలయు. అట్టి దోహదరూపమైన, ధూమంబుల=పొగలయొక్క, యోజన్ =రీతిచేత; తేజరిల్లన్=ప్రకాశింపఁగా; సద్యస్సముత్పద్య మాన ఫలమిళిత శాఖాకలితంబులగు దాడిమీ కులంబులన్ – సద్యస్సముత్పద్యమాన=తత్కాలోత్పద్యమానములగు, ఫల= ఫలముల చేత,మిళిత=కూడుకున్నట్టి, శాఖా=కొమ్మలచేత, కలితంబులగు=ఒప్పుచున్నట్టి, దాడిమీ కులంబులన్= దానిమ్మ చెట్లగుంపులను; తిలకించి=చూచి; అచ్చటికిన్=అప్రదేశమునకు; ఆశ్రయింపన్=ఆశ్రయించుటకు; చనుదమని =పోవుదమని; నిజప్రియ జనంబులన్=తమ ప్రియులను; పిలుచు =ఆహ్వానముఁ జేయుచున్న; రాచిలుకచిలుకల కొలకుల=శ్రేష్ఠమైన శుకాం గనలయొక్క; కలికి= అందమైన; పలుకులు= మాటలను; విని=ఆకర్ణించి; అలరు=వికసించు; కర్ణి కారవారంబులవలనన్= కొండగోఁగుల సమూహమువలన; కర్ణికారవార = కొండగోఁగుగుంపులయొక్క; ప్రవాళ= పల్లవములయొక్క; శ్రేణులు= పరంపరలు; అబ్జరాగ=పద్మరాగమణిమయములైన; తోరణ మాలికలును=తోరణముల గుంపులును; నిస్తుల=అసమానములగు; గోస్తనీ =ద్రాక్షయొక్క; విలంబమాన=వ్రేలాడుచున్నట్టి; ఫుల్ల=వికసించినట్టి; గుచ్ఛంబులు = గుత్తులు; అచ్ఛ=స్వచ్ఛమగు; మౌక్తిక =ముత్యములయొక్క; వితానంబులును =మేలుకట్లును; అమల= స్వచ్ఛమగు; కకుత్థ్సల=శ్రేష్ఠప్రదేశమందు; నానట్యమాన =విహరించుచున్నట్టి; మత్త=మదించిన; అళి=తుమ్మెదలయొక్క; పాళికలు= గుంపులు; అభిరూప=మనోహరమగు; ధూప =ధూపసంబంధియైన; ధూమ=పొగయొక్క; మాలికలున్=సమూహము లును; కాఁగన్=అగుచుండఁగా; అమరు= ఒప్పుచున్న; మందారవీరుత్=కల్పలతలయొక్క; మందిరంబునన్=గృహ మందు; సంపెంగతీవ జాళువాగొలుసులన్= సంపంగితీవ లనెడు బంగరుగొలుసులయందు; ఉయ్యెల లూఁగు=డోలావిహా రము సేయుచున్న; సాధ్య మిథ్యామధ్యా= తనుమధ్య లైన సాధ్యాంగనలయొక్క; జనంబుల= సమూహములయొక్క; చరణపయోజ=పాదపద్మములయొక్క; సంయోజ నంబులకున్=సంబంధములకు; లక్ష్యంబులై= విషయంబులై; తదీయ స్పర్శన వినిర్గతానురాగ కందళంబుల యందంబునన్ – తదీయ స్పర్శన = ఆసాధ్యస్త్రీల పాదపయోజస్పర్శచేత, వినిర్గత =వెడలి వచ్చిన, అనురాగ=ప్రీతియొక్క, కందళంబుల యందంబునన్=అంకురముల భంగి; చివురించు నశోకానోకహంబుల వలనను = చిగురించుచున్న యశోకవృక్షములవల్లను, అశోకమునకు నబలాపాదతాడనము దోహద మని తెలుపఁబడియె; అశోకానోకహ కుసుమ విసర వర్షిత మరంద ధారాళ ధారా గౌరవంబునన్ – అశోకానోకహ= అశోకవృక్షములయొక్క, కుసుమ విసర = పుష్పసమూహముచేత, వర్షిత=వర్షింపఁబడినట్టి, మరంద=పూఁదేనియయొక్క, ధారాళ= అధికమగు, ధారా =ధారలయొక్క, గౌరవంబునన్=అతిశయముచేత; పెనులోయఁ బడిన ధగధగని పగడంపుఁ గోనలన్ = పెద్దకొండచీలిక యందుఁ బడిన ధగధగమని మెఱయు పగడములయొక్క కోనలందు; భుగభుగ వలచు =భుగ భుగమని పరిమళించు; కపురంపుటనంటుల =కర్పూరపుటనఁటులయొక్క; చప్పరంబుల క్రిందన్ = పందిళ్ళ క్రిందను; చెప్పరాని వేడుక =చెప్ప నలవిగాని సంతసము; ముప్పిరిగొనన్ = మిక్కిలి వృద్ధిఁ బొందఁగా; విచ్చలవిడి=యథేచ్ఛముగా; డాఁగిలిమ్రుచ్చులాడునెడన్ =డాఁగిలిమ్రుచ్చులను నాటలాడునపుడు; ఎడయని వడి=సందు లేని వేగము; అడరన్=ఒప్పఁగా; ఉదంచిత=మిక్కిలి యొప్పు చున్న; చంచరీకమాలికలన్=భృంగపంక్తులచేతను; ఉల్లసిత పల్లవంబులన్=ప్రకాశించుచున్నచిగురుటాకులచేతను; ఉత్తుంగ =ఉన్నతమగు; నిస్తుల=సాటిలేని; స్తబకంబులన్= గుత్తులచేతను; ఉజ్జ్జ్వలత్కళికాకులంబులన్ = ప్రకాశించుచున్న మొగ్గల గుంపుచేతను; ఉల్లసిల్లుతరుణవ్రతతికలన్ =ప్రకాశించుచున్న లేఁతలతలయందు; కల = ఉండినట్టి; కుడుంగరంగంబులలోన్ =లతాగృహములయొక్క మధ్యప్రదేశములయందు;తమ్మున్; తెలియకుండ డాఁగియున్న = ఎఱుఁగకుండ దాఁగికొని యున్న; అన్నులమిన్నల =ఉత్తమస్త్రీలను; వీక్షింపన్=చూచుటకు; చరించు = సంచరించుచున్న; సిద్ధరాజతనూజా= సిద్ధ రాజకన్యకలయొక్క; సమాజంబుల=సంఘములయొక్క; నిశాత= తీక్ష్ణములగు; విలోచన=దృష్టులయొక్క; ఆపాతంబు లన్=ప్రసరణముచేత; అపూర్వవిలాసంబున్ = లోకోత్తరవిలాసమును; కాంచు తిలకనగ తిలకంబులవలనన్=కాంచునట్టి శ్రేష్ఠములగు తిలకవృక్షములవలనను, తిలకవృక్షము లనఁగా బొట్టుగుచెట్లు. వీనికి దోహదము వీక్షణ మని తెలుపఁబడియె; తిలకనగతిలక కుసుమ గళన్మకరంద సంపర్కంబునన్ –తిలకనగతిలకకుసుమ =శ్రేష్ఠములగు బొట్టుగులయొక్క పుష్పముల వలన, గళత్=జాఱుచున్నట్టి, మకరంద=పూఁదేనియయొక్క, సంపర్కంబునన్ =సంబంధమువలన; పదనైన=ఆర్ద్రమైన; ముత్తియంపుదొనలన్ = ముత్యపుదొనలయందు; నిండిన సంకుమద పంకంబునన్ = నిండినట్టి జవ్వాదిబురదచేత; పొంకంబు గాన్ = సుందరమగునట్లుగా; మృదు మృదుత్వగభినవదళంబులన్ –మృదు= మెత్తనగు, మృదుత్వక్ =భూర్జవృక్షము యొక్క, ‘భూర్జే చర్మి మృదుత్వచౌ’ అని యమరుఁడు, అభినవ=నూతనమగు, దళంబులన్= పత్త్రములయందు; నలిన భవునిన్=బ్రహ్మను; కొలువన్=సేవించుటకు; చనిన తమతమ రమణునికై = పోయినట్టి తమతమ ప్రియునికొఱకు; సందే శంబులు =స్వీయవృత్తాంతములు; లిఖించి=వ్రాసి; చెలులన్=సకియలను; అంచి =పంపి; పంచశర పంచశరీ ప్రపంచిత రహణశికీ శిఖాంచల చంచలిత మానసంబునన్ – పంచశర=మన్మథునియొక్క, పంచశరీ = శరపంచకముచేత, ‘పంచానాం శరాణాం సమాహారః’ అని ద్విగువు చేసి, ఙీప్ప్రత్యయము చేయఁగా పంచశరీ యని యైనది, ప్రపంచిత= విస్త రింపఁజేయఁ బడిన, రహణ=వియోగ మనెడు, శిఖి=అగ్నియొక్క, శిఖా=జ్వాలలయొక్క, అంచల =అగ్రములచేత, చంచలిత=మిక్కిలి చలింపఁ జేయఁబడిన,మానసంబునన్=మనస్సుచేత; అడలి=దుఃఖించి ; బడలి =అలసి; చెలువము =అందమును; ఎలపు= చేయుచున్న; కలువదొరరా=చంద్రకాంతమణులయొక్క; అరంగులన్= తిన్నెలమీఁద; పఱచిన కలువరేకు జముకాణంబుల పయిన్= పఱచినట్టి కలువఱేకు లను నాస్తరణవిశేషములందు; పొరలు= పరివర్తనము సేయుచున్న; గంధర్వ=గంధర్వుల యొక్క; సౌగంధికగంధిరత్నంబుల=స్త్రీరత్నములయొక్క, సౌగంధిక మనఁగా మంచి పరిమళము గల యొకవిధమైన కలువ. దానిగంధమువంటి గంధము గల వారలు సౌగంధికగంధులు. వారలలో శ్రేష్ఠులు సౌగంధికగంధిరత్నంబులు, ‘సౌగంధికంతు కహ్లారమ్, రత్నం స్వజాతిశ్రేష్ఠేఽపి’ అని యమరుఁడు; సంతాపంబు = సంతాపము; చనన్=పోగొట్టుటకు; విరినీరు=పుష్పజల మును; నించియు=పూరించియు, కెంజివురులన్=ఎఱ్ఱని చిగురుటాకులచేత, కప్పియున్=ఆచ్ఛాదించియు, చల్లపుప్పొడులు చల్లియున్ =చల్లని పుష్పరేణువులను జల్లియు; అలరుజొంపంబులన్ = పువ్వుల గుబురులచేత; పొదివియున్= కప్పియు; శీతలోపచారంబులు =శైత్యోపచారములను; చేయు=చేయుచున్నట్టి; తత్ప్రియవయస్యాలలామంబులకున్ = వారియొక్క ప్రియసఖీరత్నములకు; తోడునీడలై=సహాయములై; చూడన్=అవలోకించుటకు; తగు=ఒప్పుచున్న; వాసంతికాజాతంబులు =బండిగురువెందతీవల గుంపులు; అలస వాతపోత =మందమారుతముయొక్క; ప్రచారంబులన్=సంచారము చేత; కౌఁగి లింపన్=ఆలింగనము సేయఁగా;అవారిత సుమనో వికాసంబునన్=అడ్డగింపఁబడని కుసుమవికాసముచేత; పొలుపుఁ గాంచు కురువకలతా వలయంబువలనన్ = అందమగు గోరంటతీవల వలయములవలనను, ‘ఆలిఙ్గనేన కురవో హరిణేక్షణానా మామోద గౌరవభృతో భువి సర్వ ఏవ’ అనుటవలన హరిణేక్షణాలింగనమే కురవకామోదహేతు వైనను, వాసంతికాజాతంబు నందే స్త్రీ లింగమహిమచే స్త్రీజాతత్వారోపమున విచ్ఛిత్తి విశేషము నపేక్షించి యిట్లు కవి వచించె. ఇట్లు మఱికొన్ని దోహదము లిందు వచింపఁబడినయవి;

కురువకలతావలయ వల్లవ పల్లవాధరా మండల మధ్యస్థల సందర్శనీయ పురందరశిలా శిఖర నందనందన సంభృత రంజిత వేణుదండాయమాన మానిత కటకవాల వాయజ సూత్రానుబింబంబులు – కురువకలతా వలయ = గోరింటతీవలగుంపనెడు, వల్లవ పల్లవాధరామండల =యాదవాంగనల గుంపుయొక్క, మధ్యస్థల = మధ్యభాగమందు, సందర్శనీయ=చూడ సొంపై నట్టి, పురందరశిలాశిఖర =ఇంద్రనీలమణిమయమైన శిఖర మనెడు, నందనందన =కృష్ణుని చేత, సంభృత=భరింపఁబడిన, రంజిత=ప్రకాశించునట్టి, వేణుదండాయమాన=వేణుదండమువలె నాచరించుచున్న, మానిత= పూజిత మగు, కటక=(అద్రి) నితంబప్రదేశమందలి, వాలవాయజసూత్ర = సూత్రాకార మగు వైడూర్యముయొక్క, ‘వైడూర్యం వాలవాయజమ్’ అని యమ రుఁడు, అనుబింబంబులు=ప్రతిబింబములను; అహిరూపంబులుగాన్=సర్పములుగా; ఎఱింగి= తెలిసికొని; ఉప్పొంగి= విజృంభించి; చెంగున నెగసి =చెంగున పైకి లేచి, చెంగనునది ధ్వన్యనుకరణశబ్దము; చరణంబులన్ త్రొక్కిపట్టి =పాదముల చేతఁ ద్రొక్కిపట్టి; చంచూపుటంబులన్=ముక్కులయొక్క యగ్రభాగములచేత; చించి =బ్రద్దలు చేసి; ఱెక్కలన్=పక్షములచేత; అడిచి=కొట్టి; ఏమియున్ తేరకున్నన్=ఏమియు తేటపడకుండఁగా; విస్మయంబు=ఆశ్చర్యము; మనంబు=మనస్సును; బెరయన్= పొందఁగా; విఫలప్రయత్నంబులు ఐ=నిష్ఫలమైన యత్నములుగలవి యై; పుడమిన్= భూమియందు; వ్రాలు= పడుచున్న; కాంతారమయూర దారకంబులన్=వనమయూరముల బిడ్డలను; చొచ్చి=చేరి; కికాకిక కేళిన్= ‘కికాకిక’ యను ధ్వనివిశేష ముతోఁ గూడిన క్రీడను; సల్పు=చేయునట్టి; గరుడసరోజముఖీ=గరుడస్త్రీలయొక్క; నికరంబుల=గుంపుల యొక్క; దరస్మిత విలాసంబునన్=మందహాసవిలాసముచేత; సమధిక=మిక్కిలి యధికమౌనట్లుగా; పథిక=పాంథుల యొక్క; చేతస్తాప=మనస్సంతాపమునకు; సంవర్ధక=మిక్కిలి వర్ధక మగునట్టి; ప్రసవ=పుష్పములయొక్క; ఆమోద= పరిమళముయొక్క; పరంపరలన్=సమూహములచేత; చెన్నుమీఱు=అందమగు; పున్నాగ పూగంబులవలనన్= పొన్నల గుంపులవలనను; పున్నాగ=పొన్నలు; పూగ=పోఁకలు; మధు=ఇప్పలు;సాల=ఏపెలు; రసాల=తీయమావులు; ముఖ్య= మొదలుగాఁ గల; దివ్య=లోకోత్తరములగు;తరు=వృక్షములయొక్క; అంతరంబునన్=మధ్యభాగమున; మంజుల కంజరాగ భిత్తిభాగ మరీచిపుంజంబు భాస్వ దాతప ప్రాబల్య ఖంజనంబును – మంజుల =మనోజ్ఞమగు, కంజరాగ=పద్మరాగమణుల యొక్క, భిత్తిభాగ=గోడలయొక్క ప్రదేశసంబంధులగు, మరీచి=కాంతులయొక్క,పుంజంబు=గుంపు, భాస్వదాతప = సూర్యాతపముయొక్క, ప్రాబల్య=అతిశయముయొక్క, ఖంజనంబును=నిలుకడను, ‘ఖజి గతివైక్లబ్యే’ అని యనుశాస నము. ‘ఖండనంబు’ నను పాఠము స్పష్టార్థకము. పద్మరాగభిత్తికాంతిపుంజము వృద్ధాతపమును బోలియున్నదనుట; శాత కుంభ కుంభ=కనకకలశములయొక్క; విభా=విశేషకాంతియొక్క; ఆడంబరంబు= విజృంభణము; సంధ్యారాగారంభంబును =సంధ్యాసమయారుణిమయొక్క ప్రాదుర్భావమును; వలభిన్మణి=ఇంద్రనీలములయొక్క;వలభి=చంద్రశాలలయొక్క; రుచిర=మనోహరమగు;రుచి=కాంతులయొక్క;పూరంబు =గుంపు; నిబిడ=దట్టమైన; తిమిర=చీకటికి; వివర్ధనంబును = ఛేదనమును; ముక్తా=ముత్యములయొక్క; ఉల్లోల=మిక్కిలి తరలమైన; విభా =విశేషకాంతియొక్క;సారంబు=స్థిరాంశము, ‘ముక్తాఫలేషుచ్ఛాయాయా స్తరలత్వ మివాన్తరా’ అని ముత్యములయందుఁ దరలత్వము లావణ్యలక్షణమున రసార్ణవసుధా కరములోఁ జెప్పఁబడినది, అది పూర్వము వ్రాయఁబడియె; తారకానిసర్గంబును=నక్షత్రస్వభావమును; భూరిస్తంభ సంగ్రథిత హీరదర్పణ ద్యుతిజాతంబు – భూరిస్తంభ=సువర్ణస్తంభములయందు, సంగ్రథిత =కట్టఁబడిన,హీరదర్పణ=వజ్రదర్పణముల యొక్క, ద్యుతిజాతంబు=కాంతిపుంజము; నిస్తంద్ర చంద్రికా కల్పనంబును –నిస్తంద్ర =జాగరూకమైన అనఁగా తేజరిల్లునట్టి, చంద్రికా=వెన్నెలయొక్క,కల్పనంబును =ఉత్పాదనమును; కావింపన్=చేయఁగా; అక్షీణ క్షణదైక విలసనంబునన్ – అక్షీణ = అధికమగు, క్షణదా=రాత్రియొక్క, ఏక=ముఖ్యమగు, విలసనంబునన్=ప్రకాశముచేత; పొలుచు=ఒప్పునట్టి; కేళికాహర్మ్యం బునన్=క్రీడాసౌధమునందు; మిక్కిలి=అతిశయమగునట్లుగా; పిక్కటిల్లు =వృద్ధిఁబొందునట్టి; మక్కువన్=ప్రేమచేత; చక్కెర విల్తు జగడంబులన్=మదనకదనములందు; మగలన్=భర్తలను; చొక్కించి=సుఖపరవశులను జేసి; ఆత్మీయ=తమసంబంధి యైన; పుంభావ=పురుషాయితముయొక్క; సంభావనా =నిష్పాదనమువలన;సంభూత=పుట్టినట్టి;శ్రమంబు=ఖేదము; తూలన్ =తొలఁగుటకు; చెంగటి వనులన్=సమీపములందలి వనములయందు; సంచరించు=విహరించుచున్న; నాగకన్యావతంసం బుల =శ్రేష్ఠలగు నాగక్యలయొక్క; ఆగాఢ =మిక్కిలి దట్టమగు;నిశ్శ్వాస సమీరంబులన్=నిశ్శ్వాసవాయువులచేత; తోరం బగు సిరిన్=అధికమైన పుష్పఫలసంపదచేత; ఒప్పారు =ఒప్పుచున్న; సిందువారంబులవలన=వావిలిచెట్లవలనను; సిందువా రాది =వావిళ్ళు మొదలగు; నగవార=చెట్లసమూహములు గల; శిలా=పాషాణములయొక్క;తలంబులన్=ప్రదేశములయందు; ఉరులు=మృగబంధనంబులు; తాల్చియున్=ధరించియు;నెత్తమ్ములన్=పర్వతములమీఁది సమప్రదేశమునందు; ఇమ్ముగాన్ = ఇంపుగా; ప్రవహించు సెలయేఱులపైన్=పాఱుచున్న సెలయేఱులమీఁద; వలలు=బంధరజ్జువులను; చేర్చియున్= ఉంచి యును; స్వజాతి ద్విజాతుల =తమజాతి పక్షులను; రాఁబిలుచు=చేరఁబిల్చుచున్న; పులుగుల=పక్షులయందు; దీములు =పక్షులను బట్టుటకై పెంపుడుపక్షులు లోనగువానిని; కట్టియున్=బంధించియు; జిగురుఁగండెలు=జిగురుతోఁ గూడిన పేనిన దారపుఁగండెలను; అమర్చియున్=సిద్ధముచేసియును; విచిత్రతర వనపతత్త్రి గోత్రంబులన్= నానావర్ణములు గల వనపక్షుల గుంపులను; పట్టుకొను తలంపునన్=గ్రహించు నుద్దేశమున; మెండైన పొదలన్=గొప్పనైన పొదలయందు;ఉండి = దాఁగి యుండి; అప్పటప్పటికిన్ =ప్రతిక్షణమందు; వానిన్=ఆయురులు మొదలుగాఁ గల వాటిని; కానన్=చూచుటకు; తమకించి = త్వరపడి; చెంచెతలు=చెంచుస్త్రీలు; ఎత్తు నెమ్మొగంబుల తమ్మిచాయలన్ =ఎత్తునట్టి సుందరమైన ముఖపద్మముల కాంతుల చేత; వసంతసమయ =వసంతకాలమందు; సముదిత=ఉదయించిన; సౌభాగ్యమ్మునన్=విభవాతిశయముచేత; పొదలు= ఒప్పుచున్న; చామ్పేయ ధాత్రీరుహంబులవలనన్=సంపెంగచెట్లవలనను; చామ్పేయధాత్రీరుహ=సంపెంగచెట్లయొక్క; కుసుమ =పువ్వులవలన; గళిత=జాఱినట్టి; పరాగరాశి =పుప్పొడిసమూహ మనెడు; మధురసనదీపులిన =మకరందనదీ సైకతముయొక్క; దేశంబునన్=ప్రదేశమునందు; కపురంపుటనంటిలేయాకున్ =కర్పూరపుటనంటి లేఁతయాకును; పఱచి =విస్తరించి; మరకత మకర కేతనాహితమూర్తిని =మరకతమణిమయ మగు శివమూర్తిని; నిలిపి=స్థాపించి; తదేకపూజా తాత్పర్యంబునన్ – తత్=ఆసాంబమూర్తియొక్క,పూజా=పూజయందలి; తాత్పర్యంబునన్=ఆసక్తిచేత; ఉన్న=ఉన్నటు వంటి; సద్గణోత్తములకున్=ప్రమథశ్రేష్ఠులకు; విరు లొసంగు నంతరంగంబునన్=పూవుల నిచ్చు మనస్సుచేత; ప్రమదావనంబు =ఉద్యానవనమును; చొచ్చి =ప్రవేశించి; ప్రమథమధురోష్ఠీతల్లజంబులు=ప్రశస్తలైన ప్రమథాంగనలు; కేలన్=హస్తములచేత; ఊఁది=ఊనుకొని; నిక్కి=మీఁదికి సాగి; విటపాంతర=శాఖాంతరములయందు; అభివేష్టిత=చుట్టుకొనియుండునట్టి; మల్లికా ప్రసూనంబులన్ =మల్లెపూవులను; కోయునెడన్=కోయునప్పుడు; తత్కర సంయోగంబువలనన్=ఆప్రమథస్త్రీల కరసంప ర్కమువలన; నిజేష్ట ఫలలాభంబు =తమ కిష్టమైన ఫలములయొక్క లాభము; చేకూరెనో యనన్=ఘటిల్లెనో యనునట్లు; రమ్యఫలంబులన్=మనోహరము లగు పండ్లచేతను, లాభములచేతను; పెంపొందు మాకందంబులవలనన్=వృద్ధిఁబొందు మావులవలనను; మాకందవాసనాభివాసిత పవమాన ప్లవమాన నీలాశోక రజ స్తోమంబు – మాకంద=రసాలపుష్పముల యొక్క, వాసనా=పరిమళముచేత, అభి వాసిత=వలచునట్టి, పవమాన=వాయువుచేత, ప్లవమాన=తేలియాడుచున్న, నీలా శోకరజః=నల్లని యశోకకుసుమముల పరాగముయొక్క, స్తోమంబు=సమూహము; ప్రవర్గ్య=అగ్నిష్టోమాద్యంగవిశేష హోమముయొక్క; ఉపక్రమ =ప్రారంభమందు; నిర్గచ్ఛత్=వెడలి వచ్చుచున్న; ధూమ=పొగయొక్క; వర్తనంబునన్=వృత్తి వంటి వృత్తిచేత; పర్వన్=వ్యాపింపఁగా; అమందానంద =అధికానందముచేత; కందళిత=అంకురించినట్టి; చిత్తారవిందంబుల తోన్= చిత్తములనెడు కమలములచేత; ముందుముందుగన్ =తొలుతొల్త; పఱతెంచు=పరుగెత్తి వచ్చునట్టి;పురందరాది బృందా రకవర్గంబుల =ఇంద్రుఁడు మున్నగు దేవతలసమూహముయొక్క;తనూశ్రమంబున్=దేహశ్రమను; తెరలంజేయు= పోగొట్టు నట్టి; శీతలతర=మిక్కిలి చల్లనైన; తాపసాశ్రమ=మున్యాశ్రమములయందలి; నానావిధ=వివిధములైన; వసుధారుహ=చెట్ల యొక్క; నివహంబుల=సమూహములయొక్క; చెంతలన్ = సమీపప్రదేశములయందు; తదీయ=ఆచెట్లకు సంబంధించిన, శాఖా= కొమ్మ లనెడు స్త్రీలయొక్క యని శాఖాగతస్త్రీలింగమునఁ జెప్పవలయు. స్త్రీముఖనిష్ఠ్యూతగండూషము వకుళమునకు దోహద ముగాఁ జెప్పఁబడియుండెఁగదా; ప్రసవముఖ= పుష్పము లనెడు ముఖములవలన;వినిష్ఠ్యూత=ఉమియఁబడిన; మధు=మకరందముయొక్క;పాళికన్=సమూహముచేత; ప్రసవితంబులగు = పుష్పించినవి యగు; విశారద విటపి పటలం బులవలనను =పొగడమ్రాఁకుల సమూహమువలనను, ‘విశారదో మధ్య గన్ధో వకుళ స్సచ కేసరః’ అని రత్నమాల; వలను మిగిలి =ఒప్పి; మేరుకుధరంబునుం బోలెన్ =మేరుపర్వతమువలె; శక్రపురాతిభాసురంబును=ఇంద్రపురముచే భాసిల్లునది, శక్ర=మద్దిచెట్లచేతను,పుర=గుగ్గిలపుఁజెట్లచేతను, అతిభాసురంబు=మిక్కిలి ప్రకాశించునది యని భావము. ‘శక్రోమహేన్ద్రే హేమాద్రౌ కుటజేఽర్జునభూరుహే’ అనియు, ‘పురం పురి శరీరే చ గుగ్గులే కథితః పురః’ అనియు విశ్వము; హిమవన్నగం బునుం బోలెన్=హిమవత్పర్వతంబువలె; గోభృత్కార్ము కాన్విత కాళికాతిశోభితంబును – గోభృత్+కార్ముక= శివుని తోడను, త్రిపురవధకాలమున మేరువు శివునికి కార్ముక మగుట ప్రసిద్ధము, అన్విత= కూడియున్న, కాళికా=పార్వతిచేత, అతిశోభితంబును=మిక్కిలి ప్రకాశించునదియు; గోభృత్కార్ముక=ఇంద్రధనువుతోడ, అన్విత =కూడుకొన్న, కాళికా= మేఘపంక్తిచేత, అతిశోభితంబును=మిక్కిలి ప్రకాశించునదియు; మందరధరంబునుంబోలెన్=మందరపర్వతమువలె; వ్యాళాధిరాజ =వాసుకిచేతను, దుష్టగజశ్రేష్ఠముచేతను; పరివేష్టితంబును=చుట్టుకొనఁబడినదియు; ఋశ్యమూకాద్రియుం బోలెన్=ఋశ్యమూకపర్వతమువలె; హరిజాతి =కపిగణముతో, సింహగణముతో;కలితంబును=కూడినదియు; మాల్యవ ద్గోత్రంబునుంబోలెన్=మాల్యవంతపర్వతమువలె; రామ=శ్రీరామునియొక్క, పశువిశేషముయొక్క, ‘రామః పశు విశేష స్స్యాత్’ అని విశ్వము; సంచార=సంచరణముచేత; సంగతంబును=కూడుకొన్నదియు; నీలాచలంబునుంబోలెన్= నీలాద్రి వలె; పురుషోత్తమ=సర్వేశ్వరునిచేత, మంచిపొన్నలచేత; భూషితంబును=అలంకరింపఁబడినదియు; గంధమాదన గ్రావం బునుంబోలెన్=గంధమాదనశైలమువలె, ‘గ్రావాణౌ శైల పాషాణౌ’ అని యమరుఁడు; మహావరాహపాళికాలింగితంబును= విష్ణుమూర్తియొక్క చిహ్నముతోఁ గూడుకొన్నదియు, ‘మహావరాహో గోవిన్ద స్సుషేణః కనకాఙ్గదీ’ అని విష్ణుసహస్ర నామము; మహత్=గొప్పలైన, వరాహపాళికా=అడవిపందులయొక్కగుంపుతో; ఆలింగితంబును=కూడుకొన్నదియు;సమ =అనురూపమయిన; ఆమోద =సంతసముతో; సంకలిత =కూడుకొన్న; శ్యామా=యౌవనమధ్యస్థలగు స్త్రీలచేత; మహితం బయ్యును = ఒప్పుచున్నదయ్యును; అసమామోద=సరిలేని పరిమళముతోడ; సంకలిత=కూడుకొన్న; శ్యామా=ప్రేంకణపుఁ దీవలచేత; ‘శ్యామాతు మహిళాహ్వయా’ అని యమరుఁడు; మహితంబు ఐ =ఒప్పుచున్నదై, విరోధాభాసాలంకారము; వీన =పక్షిరాజములయొక్క;ఘన=గొప్పలైన; ఆర్భటి=ద్వనులచేత; విఘూర్ణిత=వ్యాప్తమైన; మహాబిలంబు=గొప్పగుహలు గలది; అయ్యును; నవీన=క్రొత్తలగు;ఘన=మేఘములయొక్క; ఆర్భటి=ద్వనులచేత; విఘూర్ణిత=వ్యాప్తమైన; మహాబిలంబు ఐ =ఆకాశము గలదై, విరోధపరిహారము; మరాళికా=పెంటియంచలచేత; ఆశ్రిత=ఆశ్రయింపఁబడిన; కటకస్థల=పర్వతనితంబ ప్రదేశములందలి; వనజాతంబయ్యును=జలపూరము గల దయ్యును; అమరాళికా=దేవపరంపరలచేత; ఆశ్రిత=ఆశ్రయింపఁ బడిన; కటకస్థల=పర్వతనితంబ ప్రదేశములందలి; వనజాతంబు ఐ=అరణ్యసమూహము గలదై; సదృక్షరాజ=మంచి భల్లూక ముఖ్యములయొక్కయు; సారంగ =లేళ్ళయొక్కయు; సంతాన =సంతతులచేత; సంకలితంబు=కూడుకొన్నది; అయ్యును; అసదృక్ష =సరిలేని; రాజసారంగ=శ్రేష్ఠగజములయొక్క; సంతాన =సంతతులచేత; సంకలితంబు ఐ = కూడుకొన్నదై; కాలా హిత సుమనః=యమునికి శత్రువైన దేవునియొక్క, అనఁగా శివునియొక్క; నగ=పర్వతమగు కైలాసమువలె; భాసమానంబు అయ్యును=ప్రకాశమానమయ్యును; అకాల=అకాలమందు, అనఁగా సమయము గాని సమయమందు; ఆహిత =ధరింపఁ బడిన; సుమనః=పూవులతోఁ గూడిన; నగ=వృక్షములచేత; భాసమానంబు ఐ=ప్రకాశమానమై; ఒప్పుచున్నయది; విలోకింపుము = చూడుము.

చ. అని లలితోక్తి నాప్రియవ◊యస్యశిఖామణి చిత్తసీమఁ బా
యనిలలితోఁ దదద్రిమహి◊మాతిశయం బెఱిఁగింప, నప్పు డా
మనుకులరాజమౌళి బిల◊మండలి చొక్కపుఁదీవెయింటిమేల్
మను కులరాజకాంతతట◊మార్గములం గనుఁగొంచు నేఁగుచున్. 19

టీక: అని =ఇట్లని; లలితోక్తిన్=మనోజ్ఞమైన వాక్కుచేత; ఆ ప్రియవయస్యశిఖామణి =ఆప్రియసఖరత్నంబైన కుముదుండు; చిత్తసీమన్=హృదయసీమను; పాయని లలితోన్=వదలని ప్రీతితోడ; తదద్రిమహిమాతిశయంబు=ఆహేమకూటముయొక్క మహిమావిశేషమును; ఎఱిఁగింపన్= తెలుపఁగా; అప్పుడు=ఆసమయమున; ఆమనుకులరాజమౌళి = మనువంశపు రాజులలో శ్రేష్ఠుండగు నా సుచంద్రుఁడు; బిలమండలి = గుహాచయముయొక్క; చొక్కపు = శ్రేష్ఠమగు; తీవెయింటి = లతాగృహముల యొక్క; మేల్=అతిశయముచేత; మను=వర్తించునట్టి; కుల=మంచిజాతివియైన; రాజకాంత=చంద్రకాంతమణులయొక్క; తట=ప్రదేశములయొక్క; మార్గములన్=త్రోవలను; కనుఁగొంచున్=చూచుచు; ఏఁగుచున్=పోవుచు. దీనికి ముందుపద్యమం దున్న కోనఁ గనియెన్ అను క్రియతో నన్వయము. సుచంద్రుఁడు చూచుచు నేఁగుచున్న గుహామార్గములు చంద్రకాంతమణి ఖచితములై యిరుప్రక్కల లతాగృహములచే నావరింపఁబడిన వని భావము.

సీ. కట్టెండ వెడఁదకాఁ◊కఁ గఱంగి ప్రవహించు, జవ్వాదిడిగ్గియ◊చాల లోయఁ
బడుచుఁ జొక్కపుఁ గ్రొత్త◊పటికంపుఁజఱిపజ్జ, బాగైన కెంపురా◊పణుకువాలు
పొదరుఁ బొన్నల రాలు◊పుప్పొడియిసుముపైఁ, బగిలి యొప్పెడు వేరు◊పనసపంటి
నీటికాల్వలఁ బ్రోచి ◊పాటించు జేజేల,మ్రాఁకుతీవలఁ జుట్టి◊రాఁగ నలరు

తే. దాకపందిలిక్రింద ని◊ద్దంపువేడ్క, దవిలి కోలాట మాడుగం◊ధర్వసతుల
చారు సౌవర్ణకటకసిం◊జా నినాద,కుల ఘుమఘుమాయమాన మౌ ◊కోనఁ గనియె. 20

టీక: కట్టెండ వెడఁదకాఁకన్ – కట్టెండ =అధికమైన యెండయొక్క,వెడఁద=విశాలమగు,కాఁకన్=వేఁడిచేత; కఱంగి = ద్రవించి; ప్రవహించుజవ్వాదిడిగ్గియ –ప్రవహించు=పాఱునట్టి, జవ్వాది=సంకుమదముయొక్క,డిగ్గియ=నడబావి;చాలన్=మిక్కిలి; లోయన్=కొండనడిమిచీలికయందు; పడుచున్=పడినట్టి దగుచు; చొక్కపుఁగ్రొత్తపటికంపుఁజఱిపజ్జన్ – చొక్కపు=ఉత్తమ మైన, క్రొత్త=నూతన మైన, పటికంపు=స్ఫటికములయొక్క, చఱి = తటముయొక్క, పజ్జన్=సమీపమున; బాగైన కెంపురా పణుకువాలు – బాగైన =అందమైన, కెంపురా=పద్మరాగమణులయొక్క, పణుకు = సందులయందలి, వాలు = దీర్ఘమైన; పొదరుఁబొన్నల = పొదలైన పున్నాగములవలన; రాలుపుప్పొడియిసుముపైన్ = పడుచుండిన పుప్పొడి యను నిసుకపై; పగిలి=బ్రద్దలై; ఒప్పెడు వేరుపనసపంటినీటికాల్వలన్ – ఒప్పెడు = ప్రకాశించునట్టి, వేరుపనస=వేరుపనసలయొక్క,పంటి= ఫలసంబంధి యగు, నీటికాల్వలన్=జలప్రవాహములవలన; ప్రోచి =పోషించి; పాటించు =ఆదరించుచున్న; జేజేలమ్రాఁకుతీవ లన్=కల్పవృక్షములతీవలను; చుట్టిరాఁగన్=పరివేష్టించి రాఁగా;అలరు దాకపందిలిక్రిందన్=ఒప్పుచున్న ద్రాక్షపందిలియొక్క క్రిందను; నిద్దంపువేడ్కన్=స్నేహయుక్తమైన వేడుకను; తవిలి=పొంది;కోలాట=కోలాటమనెడు క్రీడావిశేషమును; ఆడు=ఆడు చున్న; గంధర్వసతుల=గంధర్వస్త్రీలయొక్క; చారు సౌవర్ణకటక సింజా నినాదకుల ఘుఘుమాయమానము ఔ – చారు= సుందరమగు, సౌవర్ణకటక=బంగరుకడియములయొక్క, సింజా=చిన్నగంటలయొక్క, నినాదకుల = ధ్వనిసమూహము చేత, ఘుమఘుమాయమానము ఔ=ఘుమఘుమ యను ధ్వని గలిగినట్టి దగు; కోనన్=పర్వతమందలి రహస్యప్రదేశమును; కనియెన్=చూచెను. ఎండకాఁకచేఁ గఱఁగి ప్రవహించునట్టి జవ్వాదిచే నేర్పడిన డిగ్గియ, పటికంపుఁజఱి దగ్గఱ నున్న కెంపు రాలపణుకులయందు పొదలై పెరిఁగియున్న పొన్నచెట్లనుండి రాలిన పుప్పొడియిసుకమీఁద నున్న వేరుపనసపండ్లరసముల కాల్వలను, పోషించి కల్పవృక్షపుఁదీవలను ఆదరించును. అట్టి కల్పవృక్షపుఁదీవలను చుట్టుకొని వృద్ధిఁబొందునట్టి ద్రాక్ష పందిళ్ళక్రింద గంధర్వస్త్రీలు కోలాట మాడునట్టి కోనను చూచె నని భావము.

లయగ్రాహి. మానిత నవీన కిస◊లానురతి కానఘ పి◊కీనిచయ గానముల◊చే, నళినికానీ
కానుగత మానసచ◊రీనిరుపమానరుతి◊చే, నళికులీనవని◊తానికర నానా
ధ్వానములచే, ననిల◊యానమునఁ బైనిగుడు ◊సూనతతి తేనియల◊సోన రొదచే, నిం
పైన యలకోనఁ గని ◊యానృపతి దా నెనసె ◊మానసతటీ నివిశ◊మాన ముద మంతన్. 21

టీ. మానిత నవీన కిసలానురతికానఘ పికీనిచయ గానములచేన్ –మానిత=శ్రేష్ఠమగు, నవీన=క్రొత్తనైన,కిసల=పల్లవములందు, ‘కిసాలం కిసలం కిసమ్’ అని ద్విరూపకోశము, అనురతిక= అనురక్తి కలిగినట్టి, అనఘ=ఒచ్చెములేనట్టి, పికీనిచయ = ఆఁడు కోయిలలగుంపులయొక్క, గానములచేన్=గీతములచేతను; నళినికానీకానుగత మానసచరీ నిరుపమాన రుతిచేన్ – నళినికా = పద్మలతలయొక్క, అనీక=సంఘములను, అనుగత =అనుసరించినట్టి, మానసచరీ=హంసస్త్రీలయొక్క, నిరుపమాన = సాటిలేనట్టి, రుతిచేన్=ధ్వనిచేతను; అళి కులీనవనితా నికర నానా ధ్వానములచేన్ – అళి=తుమ్మెదలయొక్క, కులీనవనితా =కులస్త్రీలయొక్క, ఆఁడుతుమ్మెదలయొక్కయనుట, నికర = సమూహముయొక్క, నానా = అనేకప్రకారములగు, ధ్వాన ములచేన్ = నాదములచేతను; అనిలయానమునన్= వాతప్రసారముచేత; పైన్=మీఁదను; నిగుడు=వ్యాపించునట్టి, సూనతతి =పూగుత్తులయొక్క; తేనియలసోన=మకరందపువర్షముయొక్క; రొదచేన్ =ధ్వనిచేతను; ఇంపైన =సొంపైన; అలకోనన్ = ఆ కోనను; కని=చూచి; ఆనృపతి = ఆసుచంద్రుఁడు; మానసతటీ=హృదయప్రదేశమును; నివిశమాన = ప్రవేశించుచున్న; ముదము = ఆనందము; అంతన్=అంతటను; తాన్=తాను; ఎనసెన్=పొందెను.

తే. ఇట్టు లక్కోన నెనసి త◊దీయ చిత్ర, మహిమ మెంతయుఁ గాంచుచు ◊మనుజనేత
తళుకుఁ బ్రాఁగెంపు మెట్టుల◊దారి డిగ్గి, యాత్మహితుతోడ నొయ్యన ◊యరుగ నచట. 22

టీ. మనుజనేత =సుచంద్రుఁడు;ఇట్టులు=ఈప్రకారమున; అక్కోనన్=ఆకోనను; ఎనసి =పొంది; తదీయ చిత్రమహిమము = ఆ కోనకు సంబంధించిన చిత్రమైన మహిమము; ఎంతయున్=మిక్కిలి; కాంచుచున్=చూచుచు; తళుకుఁ బ్రాఁగెంపు మెట్టులదారిన్ – తళుకు=ప్రకాశించుచున్న, ప్రాఁగెంపు=చిరంతనపద్మరాగములయొక్క, మెట్టులదారిన్=సోపానమార్గమునుండి; డిగ్గి = దిగి; ఆత్మహితుతోడన్=తనచెలికానితోడ; ఒయ్యన=తిన్నగ; అరుగన్=పోవుచుండఁగా; అచటన్=ఆప్రదేశమందు; దీని కుత్తర పద్యముతో నన్వయము.

చ. పగడపుఁగంబముల్, తళుకుఁ◊బచ్చలబోదెలు, కెంపుదూలముల్,
జగమగఱాలదెంచికలు, ◊చక్కని నీలపుఁబల్కచాల్, మెఱుం
గగు తెలిమిన్నలోవయును, నచ్చపు బంగరు పేరరంగునం
దగఁ గనుపట్టు నొక్క విక◊సన్మణిమండప మప్డు దోఁపఁగన్. 23

టీ. పగడపుఁ గంబముల్=విద్రుమస్తంభములు; తళుకు=ప్రకాశించుచున్న; పచ్చల=గారుత్మతమణులయొక్క; బోదెలు = స్తంభములమీఁద నుంచు నవయవవిశేషములు; కెంపుదూలముల్=పద్మరాగమణులదూలములు;జగ=శ్రేష్ఠములగు; మగఱాల =వజ్రములయొక్క; దెంచికలు=దూలములమీఁద నడ్డముగా నుంపఁబడు గృహావయవవిశేషములు; చక్కని =అందమైన; నీలపు=నీలమణులయొక్క; పల్కచాల్= దెంచికలమీఁద వేయఁబడు పల్కలవరుసలు; మెఱుంగగు =ప్రకాశించుచున్న; తెలిమిన్న=స్ఫటికములయొక్క; లోవయును=చూరును; తగన్=ఒప్పుచుండఁగా; అచ్చపు=శ్రేష్ఠమగు; బంగరు=సువర్ణము యొక్క; పేరు=విశాలమైన; అరంగునన్=వేదికయందు;కనుపట్టు=కనఁబడునట్టి; ఒక్క వికసన్మణిమండపము=ఒకప్రకాశ మానమగు మణిమందిరము; అప్డు =ఆసమయమందు; తోఁపఁగన్=అగపడుచుండఁగా. దీనికి వసించెనను నుత్తరపద్యమందు గల క్రియతో నన్వయము. ఇందుత్తాలంకారము. ‘ఉదాత్త మృద్ధే శ్చరితం శ్లాఘ్యం నాన్యోపలక్షణమ్’ అని తల్లక్షణము.

చ. కనుఁగొని యానృపాలరతి◊కాంతుఁడు విస్మయ మంతరంబులో
నెనయఁగ నోవయస్య మన ◊మిచ్చట నిల్తమె కొంత ప్రొద్దటం
చనువుగ మందయానమున ◊నమ్మణిమండపమౌళిఁ జేరి, యం
దొనరఁగ రత్నపీఠి ముద◊మొప్ప వసించె, వసించు నంతటన్. 24

టీ. కనుఁగొని =చూచి; ఆనృపాలరతికాంతుఁడు=ఆసుచంద్రుఁడు; విస్మయము=ఆశ్చర్యము; అంతరంబులోన్=హృదయ మందు; ఎనయఁగన్ =వృద్ధిఁబొందఁగా; ఓవయస్య =ఓసఖుఁడా! మనము, ఇచ్చటన్, కొంతప్రొద్దు=కొంతసేపు; నిల్తమె=వసిం తమా; అటంచున్ =అని చెప్పుచు; అనువుగన్=అనుకూలముగా; మందయానమునన్=తిన్నని గమనముచేత; అమ్మణిమం డపమౌళిన్ =ఆమణిమయమండపశ్రేష్ఠమును; చేరి=పొంది; అందున్=ఆమంటపమందు;ఒనరఁగన్=ఇంపుగను; రత్నపీఠిన్ =రత్నమయమైన పీఠమందు; ముదము=సంతసము; ఒప్పన్=అతిశయిల్లగా; వసించెన్=కూర్చుండెను; వసించు నంతటన్. = అట్లు కూర్చుండినంతలో. దీనికి ముందుపద్యముతో నన్వయము.

సీ. ఒకమణిపుత్రిక ◊యొయ్యారమునఁ జేరి, కపురంపు వలపుబా◊గా లొసంగె,
నొక సాలభంజిక ◊యుదిరిపువ్వుల కెంపుఁ,బావడ నేరు పే◊ర్పడఁగ వీచె,
నొక వసుప్రతిమ యిం◊పూన్చు తెల్లని తావిఁ,బొదివించెడు కలాచి ◊పూని నిలిచె,
నొక చొకాటపుబొమ్మ◊యొయ్య నొయ్యన పొన్న,విరిచాలు గూర్చిన ◊సురటి విసరె,

తే. నిటులు పాంచాలికామణి◊పటల మూడి,గము లుచితరీతి దార్ప, నా ◊యమరకేళి
మండపశ్రీ నుతించుచు ◊మనుజభర్త, దండఁ జెలి గొల్వ సుఖలీల ◊నుండె నంత. 25

టీ. ఒకమణిపుత్రిక =ఒకమణిమయప్రతిమ;ఒయ్యారమునన్=విలాసముగా; చేరి=సమీపమునకు వచ్చి; కపురంపువలపు = కర్పూరపరిమళము గల; బాగాలు=వక్కపొడితో జేరిన విడెములు; ఒసంగెన్=ఇచ్చెను;
ఒక సాలభంజిక=ఒకబొమ్మ; ఉదిరిపువ్వుల కెంపుఁబావడన్=బంగారుపూవులు గల చెంగావివస్త్రముచేత; నేరు పేర్పడఁగన్= చాతుర్య మేర్పడునట్టు; వీచెన్=విసరెను; ఒక వసుప్రతిమ =ఒక బంగరుబొమ్మ; ఇంపూన్చు= అందమగు; తెల్లని =శుభ్రమగునట్టి; తావిన్ =పరిమళమును; పొదివించెడు =పొందించునట్టి; కలాచి =తమ్మపడిగము; పూని =వహించి; నిలిచెన్. ఒక చొకాటపుబొమ్మ=ఒక స్వచ్ఛమైన ప్రతిమ; ఒయ్యనొయ్యన =తిన్నతిన్నగా; పొన్నవిరిచాలు=పొన్నపువ్వులగుంపు; కూర్చిన సురటిన్ = పొదివిన వ్యజనముచేత; విసరెన్. ఇటులు=ఈప్రకారము; పాంచాలికామణిపటలము=పాంచాలికాశ్రేష్ఠములగుంపు; ఊడిగములు=ఉపచారములు; ఉచితరీతిన్ = యోగ్యమైన రీతిచేత; తార్పన్=చేయుచుండఁగా; ఆ యమర కేళిమండప శ్రీన్ – ఆ, అమర=దేవతలయొక్క, కేళిమండప= విలాసమందిరముయొక్క, శ్రీన్=సంపదను; నుతించుచు=కొనియాడుచు;మనుజభర్త=సుచంద్రుఁడు; దండన్=సమీపమందు; చెలి=సఖుఁడు; కొల్వన్=సేవించుచుండఁగ; సుఖలీలన్=సుఖముచేతనైన విలాసముతోడ; ఉండెన్=వసించెను; అంతన్=ఆ సమయమందు; దీనికి వ్యవహితోత్తరపద్యమందున్న ‘ఒక్కసింగంబు వడిఁ బొదనుండి వెడలె’ నను దానితో నన్వయము.

చ. కరు లిల వ్రాల, శంబరని◊కాయము దూలఁ, దరక్షులోకము
ల్వెఱఁ బరువంద, మత్తకద◊ళీచయముల్ బెగడొంద, గండకో
త్కరములు స్రుక్క, ఋక్షసము◊దాయము నెవ్వగఁ జిక్కఁ, గీశము
ల్తరుతతి నీఁగ, సూకరకు◊లంబులు డాఁగ, మహాద్భుతంబుగాన్ 26

టీ.కరులు=ఏనుఁగులు; ఇలన్=భూమియందు; వ్రాలన్=పడుచుండఁగ; శంబరనికాయము=హరిణవిశేషములయొక్క సమూహము, ‘రఙ్కు శమ్బర రోహిషాః’ అని యమరుఁడు; తూలన్=తొలఁగుచుండఁగా; తరక్షులోకముల్=సివంగుల గుంపులు, ‘తరక్షుస్తు మృగాదనః’ అని యమరుఁడు; వెఱన్=భీతిచేత; పరువందన్=పాఱుచుండఁగ; మత్త =మదించిన; కదళీచయముల్=ఇఱ్ఱులగుంపులు, ‘కదళీ కన్దళీ చీన శ్చమూరుప్రియకావపి’ అని యమరుఁడు; బెగడొందన్=భయపడఁగ; గండకోత్కరములు = ఖడ్గమృగములసముదాయములు; స్రుక్కన్=వెనుదీయఁగ; ఋక్షసముదాయము =ఎలుఁగుబంట్ల గుంపు, ‘ఋక్షాచ్ఛభల్ల భాలూకాః’ అని యమరుఁడు; నెవ్వగన్=మిక్కిలివిచారముచే; చిక్కన్=పట్టువడఁగా; కీశముల్=కోఁతులు, ‘మర్కటో వానరః కీశః’ అని యమరుఁడు; తరుతతిన్=వృక్షసమూహమందు; ఈఁగన్= తూఱఁగా; సూకరకులంబులు=అడవిపందులగుంపులు; డాఁగన్=దాఁగుచుండఁగా; మహాద్భుతంబుగాన్= మిక్కిలివింతగా. ఈపద్యమున కుత్తర పద్యస్థక్రియతో నన్వయ మని యెఱుంగునది.

సీ. అఖిల జంతు నిఖాద◊నారూఢిమైఁ బోలె, నతివివృతంబైన ◊యాస్య మమర,
నాశేభములఁ జీర్ప◊నట్టి సిబ్బితిఁ బోలె, నతి గన్నఖరసం◊తతి వెలుంగ,
స్వమృగహింసావిహా◊రము గాంచురతిఁ బోలెఁ, దలపై నెగయు వాల◊దండ మొనర,
నిగుడు కోపాంకుర◊నికరం బగుటఁ బోలె, సితకేసరముల కెం◊జిగి చిగుర్ప,

తే. వక్రదంష్ట్రలు శతకోటి ◊వాదు గెలువ, వర్తులపుఁ గన్నుగవ భాను◊వాసిఁ గేర,
ఘుటఘుటార్భటి ఘనకోటి◊పటిమ దెగడ, నొక్క సింగంబు వడిఁ బొద◊నుండి వెడలె. 27

టీ. అఖిల జంతు నిఖాదనారూఢిమైఁ బోలెన్ – అఖిల =సమస్తమైన, జంతు=జంతువులయొక్క, నిఖాదన=భక్షణముయొక్క, ఆరూఢిమైన్ పోలెన్ = అలవాటుచేతబలె; అతివివృతంబైన =అతివిశాలమైన; ఆస్యము=నోరు; అమరన్=ఒప్పుచుండఁగా; ఆశేభములన్=దిగ్గజములను; చీర్పనట్టి సిబ్బితిన్ పోలెన్=బ్రద్దలుసేయమిచే కల్గిన సిగ్గుచేతబలె; నతి=వంగుటను; కన్న= పొందిన; నఖరసంతతి =గోళ్ళసముదాయము; వెలుంగన్=ప్రకాశింపఁగా; స్వమృగ=స్వజాతిమృగములయొక్క; హింసా=వధయనెడు; విహారము =క్రీడను; కాంచురతిన్ పోలెన్=పొందుటయం దాసక్తి చేతబలె; తలపైన్=శిరమునందు; ఎగయు=చేరియున్న; వాలదండము=దండముతో సమానమగు తోఁక; ఒనరన్= ఒప్పుచుండఁగా; నిగుడు=వ్యాపించుచున్న; కోప=కోపముయొక్క; అంకుర=మొలకలయొక్క; నికరంబు=సమూహము; అగుటన్ పోలెన్= అగుటచేతబలె; సిత=తెల్లనగు; కేసరములన్=మెడమీఁది వెంట్రుకలయందు; కెంజిగి=రక్తకాంతి; చిగుర్పన్=ఉదయించు చుండఁగా; వక్రదంష్ట్రలు =కుటిలమగు కోఱలు; శతకోటి=వజ్రాయుధముయొక్క; వాదు=వాదమును; గెలువన్=గెలుచుచుండఁగా, అనఁగ కోఱలు వజ్రాయుధతుల్యములుగా నున్నవనుట; వర్తులపుఁ గన్నుగవ=గుండ్రమగు కనుదోయి; భానువాసిన్= సూర్యాధిక్యతను; కేరన్=పరిహసించుచుండఁగా;ఘుటఘుటార్భటి=ఘుటఘుటమను ధ్వని; ఘనకోటి=మేఘబృందము యొక్క; పటిమన్ = సామర్థ్యమును; తెగడన్=తిరస్కరింపఁగా; ఒక్క సింగంబు =ఒక సింహము; వడిన్=వేగముచేత; పొదనుండి వెడలెన్ = పొదలోనుండి బయల్పడెను.

సమస్తమృగములను బెదరించుచు, విశాలముఖము, వంగినగోఱులు, శిరస్సునందుఁ జేర్పఁబడిన వాలము, ఎఱ్ఱని కేస రాగ్రములు, వజ్రాయుధతుల్యము లగు కోఱలును, సూర్యబింబమును దిరస్కరించు కనుఁగవయుఁ గల యొక సింహము పొదనుండి వెల్వడె నని భావము.

క. వెలలి జిఘృక్షాగౌరవ,కలనన్ లంఘింప నృపతి ◊గన్గొని నిజని
స్తుల చంద్రహాసధారం, దలఁ ద్రెవ్వఁగ నేసె నద్భు◊తంబుగ నంతన్. 28

టీ. వెలలి =వెడలి; జిఘృక్షా=గ్రహణేచ్ఛయందలి; గౌరవ=ఆదరముయొక్క;కలనన్= ప్రాప్తిచేత; లంఘింపన్=దుముకఁగా; నృపతి=సుచంద్రుఁడు; కన్గొని =చూచి; నిజ=తనదగు;నిస్తుల=సాటిలేనిదగు; చంద్రహాస=కత్తియొక్క; ధారన్=అంచుచేత; తలన్=(ఆసింగముయొక్క) శిరస్సును; త్రెవ్వఁగన్=తెగునటుల; ఏసెన్=వైచెను; అద్భుతంబుగన్=ఆశ్చర్యముగ; అంతన్= అంతలో. దీని కుత్తరపద్యముతో నన్వయము.

మ. క్షితినాథేంద్ర శితాసిసంహతిభవా◊సృగ్వ్యాప్త తత్సింహరా
జ తనూదీధితిసంధ్యలో వెడలు భా◊స్వన్మూర్తి నా నొక్కమా
నిత తేజస్తతి దోఁచె నంత నచట ◊న్వీక్షింప నయ్యెన్ రమా
పతి నా పూరుషరూప మొక్కటి జగ◊త్ప్రస్తుత్య దీవ్యద్ద్యుతిన్. 29

టీక: క్షితినాథేంద్ర శితాసి సంహతి భవాసృ గ్వ్యాప్త తత్సింహరాజ తనూదీధితి సంధ్యలోన్ – క్షితినాథేంద్ర = సుచంద్రునియొక్క, శిత=తీక్ష్ణమగు, అసి=కత్తియొక్క,సంహతి=ప్రహారమువలన,భవ=పుట్టిన, అసృక్=రక్తముచేత, వ్యాప్త =పొందఁబడిన, తత్సింహరాజ =ఆమృగరాజుయొక్క, తనూదీధితి=దేహకాంతి యనెడు, సంధ్యలోన్=సంధ్యాకాలమందు; వెడలు=ఉద యించు; భాస్వన్మూర్తి నాన్ =భానుఁడో యనఁగ; ఒక్కమానిత తేజస్తతి = ఒకానొక పూజ్యమైన తేజస్సమూహము; తోఁచెన్ = కనిపించెను; అంతన్= అంతలో; అచటన్=ఆతేజఃపుంజమందు; జగత్ప్రస్తుత్య=లోకములచే స్తుతింపఁదగినట్టి; దీవ్యత్=ప్రకా శించుచున్న; ద్యుతిన్ =కాంతిచేతను; పూరుషరూప మొక్కటి = ఒకానొక పూరుషాకృతి; రమాపతి నాన్ =నారాయణుఁడో యనఁగ; వీక్షింపన్=చూచుటకు; అయ్యెన్ = ఆయెను (తారసిల్లెను).

సుచంద్రుని ఖడ్గముచే ఖండింపఁబడిన యాసింహముయొక్క రక్తసిక్తమగు శరీరకాంతి యను సంధ్యయం దుదయించిన తేజఃపుంజ మనెడు సూర్యబింబమందు తద్గతనారాయణమూర్తియో యన్నటు లొక పూరుషాకృతి చూపట్టె నని భావము.

చ. అది గని యానృపాలుఁడు మ◊నోంబురుహంబున విస్మయాంకురం
బొదవఁగ నుండఁ, గిన్నరత ◊నూనుచుఁ, దత్పురుషావతంస మా
యుదధిగభీరుఁ జేరి, విన◊యోన్నతి, ‘భానుకులాయ, శత్రువ
ర్యదమనపణ్డితాయ, భవ◊తేఽస్తు నమో’ యని మ్రొక్కె, మ్రొక్కినన్. 30

టీ. ఆనృపాలుఁడు =ఆసుచంద్రుఁడు; అది గని=ఆపురుషరూపమును జూచి; మనోంబురుహంబునన్=చిత్తకమలమందు; విస్మయాంకురంబు=ఆశ్చర్యము; ఒదవఁగన్=కలుగునటుల; ఉండన్=ఉండఁగా; కిన్నరతన్=కిన్నరత్వమును; ఊనుచున్ =వహించుచు; తత్పురుషావతంసము=ఆపురుషశ్రేష్ఠుఁడు; ఆ ఉదధిగభీరున్= ఆసముద్రగంభీరుఁడగు సుచంద్రుని; చేరి=సమీ పించి; వినయోన్నతిన్=వినయాతిశయముచే; భానుకులాయ=సూర్యవంశస్థుఁడవైనట్టి; శత్రువర్యదమనపణ్డితాయ=పగ తురఁ బరిమార్చుటయందు పండితుఁడవైన; భవతే=నీకొఱకు; నమః=నమస్కారము; అస్తు=అగుఁగాక; అని =అనుచు; మ్రొక్కెన్=ప్రణమిల్లెను; మ్రొక్కినన్=ఇట్లు ప్రణమిల్లఁగా. దీని కుత్తరపద్యముతో నన్వయము.

తే. ఆదరంబునఁ గెంగేల ◊నతని నెత్తి, దండఁ గూర్చుండఁ గావించి ◊ధరణిభర్త
తత్కథా శ్రవణైక ము◊దాయుతాత్మ, నప్పురుషమౌళిఁ గాంచి యి◊ట్లనుచుఁ బలికె. 31

టీ. ధరణిభర్త =భూపతి యగు సుచంద్రుఁడు; ఆదరంబునన్=ప్రీతితోడ; కెంగేలన్=ఎఱ్ఱనైన హస్తముచే; అతనిన్=ఆ కిన్నరుని; ఎత్తి =లేవఁదీసి; దండన్=సమీపమున; కూర్చుండన్=ఉపవేశించునట్లు; కావించి=చేసి; తత్కథా శ్రవణైక ముదాయుతాత్మన్ – తత్కథా =అతనియొక్కకథయొక్క; శ్రవణ=వినుటయందు; ఏక=ముఖ్యమగు; ముదా=సంతసముచేత; యుత=కూడినట్టి; ఆత్మన్=మనస్సుచేత; అప్పురుషమౌళిన్=ఆపురుషశ్రేష్ఠుని; కాంచి=అవలోకించి; ఇట్లనుచుఁ బలికెన్=వక్ష్యమాణప్రకారముగా వచించెను.

చ. అకలుషరూపశోభివి, మ◊హామతిశాలివి, కిన్నరత్వబో
ధకశుభపాళి, విట్టి విబు◊ధస్తుతివృత్తిఁ జెలంగు నీకు ని
త్యకటుతరేభవైరిరమ◊ణాకృతి యేగతిఁ జెందె, నెట్లు త
ద్వికృతి యడంగెఁ, దెల్పఁగద◊వే విన వేడుక వుట్టె నియ్యెడన్. 32

టీ. అకలుషరూపశోభివి – అకలుష=ఒచ్చెములేని, రూప=స్వరూపముచేత, శోభివి=ప్రకాశించునట్టివాఁడవు; మహామతి శాలివి=గొప్పబుద్ధితో నొప్పువాఁడవు; కిన్నరత్వబోధకశుభపాళివి – కిన్నరత్వ=కిన్నరత్వమునకు, బోధక=జ్ఞాపకములగు, శుభ=మంగళకరమైన, పాళివి=చిహ్నములు గలవాఁడవు, ‘పాళిః కేతు ర్ధ్వజో లిఙ్గమ్’ అని యమరుఁడు; ఇట్టి = ఈవిధమగు; విబుధస్తుతివృత్తిన్= పండితస్తవనీయము, లేదా దేవస్తవనీయ మగు వర్తనముచేత; చెలంగు నీకున్=ఒప్పునట్టి నీకు; నిత్య కటుత రేభవైరిరమ ణాకృతి – నిత్య=ఎల్లప్పుడు, కటుతర=కఠినతరమగు, ఇభవైరిరమణ=గజరిపుశ్రేష్ఠమైన సింగముయొక్క,ఆకృతి = ఆకారము; ఏగతిన్=ఏవిధముగా; చెందెన్=అమరెను; ఎట్లు =ఏవిధముగా; తద్వికృతి =ఆసింహభావము;అడంగెన్=నశిం చెను; తెల్పఁగదవే=తెల్పవే; ఇయ్యెడన్=ఇచట; వినన్=వినుటకు; వేడుక=కుతూహలము; పుట్టెన్=ఉదయించెను. ఇట్టిలోకోత్తరగుణశాలి వగు నీకు సింహత్వము గలుగుట యెట్లు, మరల నది పోవుట యెట్లు విశదీకరింపు మని భావము.

క. అను జనపతి వాక్యము మది
కనివారితమోద మొసఁగ, ◊నాఘనుఁడు పునః
పున రవనతి ఘటియించుచుఁ
దనకథ వివరించె ని ట్లు◊దారమృదూక్తిన్. 33

టీ. అను జనపతి వాక్యము =ఉక్తప్రకారమగు సుచంద్రునివచనము; మదికిన్=చిత్తమునకు;అనివారితమోదము=అపరిమితానం దమును; ఒసఁగన్=ఘటింపఁజేయఁగా; ఆఘనుఁడు=ఆదివ్యపురుషుఁడు; పునఃపునరవనతి=పలుమాఱు నమస్కారములను; ఘటియించుచున్=చేయుచు; ఇట్లు=వక్ష్యమాణప్రకారమున; ఉదారమృదూక్తిన్=అతిశయమార్దవయుతమైన పలుకులచేత; తనకథ =తనవృత్తాంతమును; వివరించెన్=విశదీకరించెను.

సీ. కలిమితొయ్యలిదాల్పు◊బలుసామిపొక్కిట, మనుతమ్మి యేవేల్పుఁ ◊గనిన తల్లి,
మినుకుఁజాల్తుద దెల్పు ◊మిన్న లోఁ గాంచుజో,గులటెంకి యేవేల్పు◊కలికి వీడు,
చిలుకుముద్దులవీణె◊చెలియగాఁ దగు చాన, బొమ్మరిం డ్లేవేల్పు ◊నెమ్మొగంబు,
లీరేడుజగముల◊వారలఁ బుట్టించు, తీరువ యేవేల్పు ◊పారుపత్తె

తే. మట్టి పెనువేల్పు హరిహయ◊ హవ్యవాహ, హరిజ హరిరిపు హరిణాంక◊గురుపరిబృఢ
హరిణహయ హయముఖరాజ ◊హరులు గొలువ, హాళిఁ బేరోలగం బుండు ◊నవసరమున. 34

టీ. కలిమితొయ్యలిదాల్పు బలుసామి పొక్కిటన్ – కలిమితొయ్యలిదాల్పు = లక్ష్మీధరుండగు, బలుసామి = గొప్పదేవుని యొక్క, విష్ణువుయొక్క యనుట, పొక్కిటన్ =నాభియందు; మను=ఉండునట్టి, తమ్మి=తామర, ఏవేల్పున్=ఏదేవుని; కనిన తల్లి = కనినట్టి తల్లియో; మినుకుఁజాల్తుద = ఉపనిషద్రూపమగు వేదాంతము; తెల్పు మిన్న= తెలియఁజేయునట్టి యుత్కృష్టుని; లోన్=అంతరంగ మందు; కాంచు=దర్శించు; జోగులటెంకి=యోగులయొక్క నివాసస్థలము; ఏవేల్పు=ఏదేవునియొక్క; కలికి వీడు=అంద మైన పురము. అనఁగా సత్యలోకమందుఁ బరబ్రహ్మను ధ్యానించు యోగులు వసించియుందురని భావము. ఏవేల్పు నెమ్మొగంబులు=ఏదేవునియొక్క చక్కని మొకములు; చిలుకుముద్దులవీణె చెలియ=అతిశయమై, సుందరమైన వీణయొక్క సకియ; కాఁదగు =అగునట్టి; చాన =సరస్వతీరూపిణి యగు స్త్రీయొక్క; బొమ్మరిండ్లు =బాలికలు బొమ్మల నుంచి క్రీడించు గృహములో; ఏవేల్పు పారుపత్తె ము= ఏదేవుని యధికారము; ఈరేడుజగములవారలన్=పదునాల్గులోకములయందున్నవారిని; పుట్టించు తీరువ =కలిగించునట్టి పనియో;
అట్టి పెనువేల్పు =అట్టి పెద్దదేవుండు, అనఁగా బ్రహ్మదేవుఁడు; హరిహయ= ఇంద్రుండు;హవ్యవాహ =అగ్ని;హరిజ=సూర్య సుతుఁడైన యముఁడు; హరిరిపు=రాక్షసుం డగుటచే విష్ణుశత్రువగు నిరృతి; హరిణాంకగురు పరిబృఢ =చంద్రజనకుఁడగు సముద్రునకు అధిపతి యగు వరుణుండు, ‘ప్రచేతా వరుణః పాశీ యాదసాంపతి రప్పతిః’ అనియు, ‘ప్రభుః పరిబృఢోఽధిపః’ అనియు నమరుఁడు; హరిణహయ =లేడి వాహనముగాఁగల వాయువు; హయముఖరాజ=కిన్నరాధిపతి యగు కుబేరుండు; హరులు=శివుండును; కొలువన్= సేవించుచుండఁగా; హాళిన్=ఆసక్తిచేత; పేరోలగం బుండు నవసరమునన్=కొలువుకూటం బున నుండుతఱి. దీని కుత్తరపద్యస్థ మైన యిట్లనున్ అను దానితో నన్వయము.

చ. కొలువున నిల్చి భక్తివిధిఁ ◊గొల్చు మహామనువర్ణదేవతా
కులములలో నజత్వ మొన◊గూర్చు మహామనువర్ణదేవతా
వళు లొకకొన్నిపర్విన న◊వజ్వలనోజ్జ్వలకీలికాప్లుతిం
గళవళ మందఁ గాంచి, యల◊కంజభవుండు ప్రియోక్తి నిట్లనున్. 35

టీ. కొలువునన్=కొలువుకూటమందు; నిల్చి=నిల్చుకొని; భక్తివిధిన్=భక్తివిధానముచేత; కొల్చు=సేవించుచున్న; మహామను వర్ణదేవతాకులములలోన్ –మహామను =మహామంత్రములయొక్క, వర్ణ=బీజములయొక్క, దేవతా = తదధిష్ఠానదేవతల యొక్క, కులములలోన్=సమూహములలో; అజత్వము=బ్రహ్మత్వము; ఒనగూర్చు=చేయుచున్న; మహామను = మహా మంత్రములయొక్క, వర్ణదేవతావళులు = వర్ణాధిష్ఠానదేవతాసంఘములు; ఒకకొన్నిపర్వినన్= ఒకానొక కొన్నిచుట్టుకొనఁగా; నవజ్వలనోజ్జ్వలకీలికాప్లుతిన్ – నవ = నూతనమగు, జ్వలన = అగ్నియొక్క, ఉజ్జ్వల = ప్రకాశించుచున్న, కీలికా = మంటల యొక్క; ఆప్లుతిన్=ఆప్లుతికి (దుముకుటకు); కళవళ మందన్=కలఁతనొందఁగా; అలకంజభవుండు =ఆబ్రహ్మదేవుఁడు; కాంచి =చూచి; ప్రియోక్తిన్=ప్రియవచనముచేత; ఇట్లనున్=వక్ష్యమాణప్రకారముగాఁ బలికెను. పారిజాతారణ్యమున తపంబొనరించు వసంతుఁడను విప్రుని తపోగ్నిజ్వాలలచేఁ గంది మహామనువర్ణదేవతలు నలువను వలగొనఁ దిలకించి యతఁడు వక్ష్యమాణప్రకారముగా వచించె నని భావము.

చ. కటకట సర్వలోకశుభ◊కాంక్ష లొసంగుచు నిచ్చ మించు మీ
కిటులభజింపరాని యవి◊హీనవిపత్తిక సేరె నెట్లు, త
త్పటిమ హరింతుఁ దెల్పుఁ డన ◊పద్మజుని న్మనువర్ణదేవతా
పటలము మ్రొక్కి యిట్లనియెఁ ◊బాయని దైన్యము మోముఁ జెందఁగన్. 36

టీ. కటకట =కష్టము (అయ్యో!); సర్వలోకశుభకాంక్షలు—సర్వ=సమస్తమైన, లోక=భువనములకు, ‘లోకస్తు భువనే జనే’ అని యమరుఁడు,శుభకాంక్షలు =మంగళప్రదమగు కోరికలను; ఒసంగుచు=ఇచ్చుచు; నిచ్చ=ఎల్లపుడు; మించు మీకున్= అతిశయించుచున్న మీకు; ఇటుల =ఈరీతిని; భజింపరాని=సేవింప నలవిగాని; అవిహీనవిపత్తిక=అధికమగు నాపద; చేరె నెట్లు= ఏరీతి సమకూరెను; తత్పటిమన్ = ఆ యాపదయొక్క బలమును; హరింతున్ = పోగొట్టుదును; తెల్పుఁడు=విన్న వింపుడు; అనన్= అనఁగా; మనువర్ణదేవతాపటలము – మను =మంత్రములయొక్క, వర్ణ=బీజములయొక్క,దేవతా= అధి ష్ఠానదేవతల యొక్క; పటలము=సమూహము; పద్మజునిన్=నలువను; మ్రొక్కి=నమస్కరించి; పాయని దైన్యము=వీడని దీనత్వము; మోముఁ జెందఁగన్=ముఖమును జేరియుండఁగ; ఇట్లు=వక్ష్యమాణప్రకారముగ; అనియెన్=వచించెను.

శా. ఆరమ్యాగమమార్గగద్విజశరణ్యం ◊బై యిలం బారిజా
తారణ్యంబు సెలంగు, నయ్యటవి బ్ర◊హ్మత్వంబు రాఁ గోరి దు
ర్వారాత్మద్రఢిమాప్తి మామకజప◊వ్యాపారపారంగతుం
డై రాజిల్లు తపస్వి యొక్కఁడు వసం◊తాభిఖ్య నింపొందుచున్. 37

టీ. ఇలన్=పుడమియందు; ఆరమ్యాగమమార్గగద్విజశరణ్యం బై – ఆరమ్య=అంతటను మనోజ్ఞమగు, ఆగమమార్గ= వేద మార్గమును, గ=పొందినట్టి, ద్విజ=బ్రాహ్మణులకు, శరణ్యం బై = రక్షక మైనదై. ఆరమ్య+ అగమ అను విభాగముచేత, వృక్ష వీథులఁ జేరిన పక్షుల కని యర్థాంతరము దోఁచుచున్నది ; పారిజాతారణ్యంబు =పారిజాతవనము; చెలంగున్=ఒప్పును; అయ్యటవిన్=ఆపారిజాతారణ్యమందు; బ్రహ్మత్వంబు రాఁ గోరి = బ్రహ్మత్వమును కాంక్షించి; దుర్వారాత్మద్రఢిమాప్తిన్ – దుర్వార=దుర్నివారమగు, ఆత్మద్రఢిమ=మనోదార్ఢ్యముయొక్క, ఆప్తిన్=ప్రాప్తిచే; మామక జపవ్యాపార పారంగతుండై – మామక=నాకు సంబంధించిన మంత్రముయొక్క, జపవ్యాపార=జపరూపవ్యాపారమందు, పారంగతుండై = పారము ముట్టిన వాఁడై; వసంతాభిఖ్య నింపొందుచున్=వసంతుఁడను నామముచే నొప్పినవాఁడగుచు; తపస్వి యొక్కఁడు =ఒకానొక తపసి; రాజిల్లున్=ప్రకాశించును.

చ. కనఁ డితరంబు, దా వినఁ డొ◊కానొక విప్రవరోక్తిఁ, బల్కఁ డిం
పున నొకమాట, నిట్టి దమ◊భూషితుఁడై ముని నిశ్చలాంతరం
బెనసి యతృప్తికృజ్జపస◊మేధనవైఖరి మించుఁ, దత్ప్రవ
ర్తన మిటు లయ్యె, దీని నొక◊దారి నడంపఁగఁ జూడు మిత్తఱిన్. 38

టీ. తాన్=ఆవసంతుఁడు; ఇతరంబు=మఱియొక వస్తువును; కనఁడు=చూడడు; ఒకానొక విప్రవరోక్తిన్ =ఒకానొకటైన పక్షి శ్రేష్ఠంపునాదమును; వినఁడు=ఆకర్ణింపఁడు, ఒక్క బ్రాహ్మణోత్తముని వాక్యమునైన వినఁడని తోఁచుచున్నది ; ఇంపునన్=ఆనందముతో; ఒకమాట పల్కఁడు=ఒక్కమాటనైన వచింపఁడు; ఇట్టి =ఈరీతి; దమభూషితుఁడై =ఇంద్రియనిగ్రహముచే భూషితుఁడై; ముని=వసంతాఖ్యుఁడు; నిశ్చలాంతరంబు =చలింపని మనస్సును;ఎనసి=పొంది; అతృప్తికృ జ్జప సమేధన వైఖరిన్ – అతృప్తికృత్=అసంతుష్టిని జేయు, జప=జపముయొక్క, సమేధన=వృద్ధియొక్క,వైఖరిన్=రీతిచేత; మించున్= అతిశయించును; తత్=ఆవసంతునియొక్క; ప్రవర్తనము=నడవడి; ఇటులు=ఈరీతిగా; అయ్యెన్=ఉండెను; దీనిన్=ఈ నడ వడికను; ఇత్తఱిన్=ప్రస్తుతము; ఒకదారిన్=ఒక యుపాయముచే; అడంపఁగన్= అడఁచుటకు; చూడుము=అలోచింపుము.

చ. అన వనజాసనుం డలమ◊హాయతి యెంతకుఁ జొచ్చె నౌర! స
జ్జనవినుతాజభావగతిఁ ◊జక్కగ నొందెడివాఁడె , యెట్టు లై
న నొక నవాంతరాయము వె◊నంగఁగఁ జేసెద నంచుఁ జింతతోఁ
దనరఁగ నుండ, నప్పు డగ◊దారి విరించిగుఱించి యిట్లనున్. 39

టీ. అనన్=ఈరీతిగఁజెప్పఁగా; వనజాసనుండు=నలువ; అలమహాయతి =ఆవసంతుఁడు; ఎంతకున్ చొచ్చెన్= ఎంతకుఁ దలపడెను; ఔర=ఆశ్చర్యము; సజ్జనవినుతాజభావగతిన్ – సజ్జన=సత్పురుషులచే, వినుత=స్తుతింపఁబడిన,అజభావగతిన్ =బ్రహ్మత్వగతిని; చక్కగన్=సరిగా; ఒందెడివాఁడె = పొందఁగలవాఁడె; ఎట్టు లైనన్=ఏరీతి నైన; ఒక నవాంతరాయము=ఒకా నొక నూతనమైన విఘ్నమును; పెనంగఁగన్=కలయునటుల; చేసెదనంచున్=చేయుదు ననుచు; చింతతోన్ =ఆలోచనతో; తనరఁగ నుండన్ = అతిశయించుచు నుండఁగా; అప్పుడు=ఆసమయమున; అగదారి=ఇంద్రుఁడు; విరించిగుఱించి=బ్రహ్మ నుద్దేశించి; ఇట్లు=వక్ష్యమాణప్రకారముగ; అనున్= పలికెను.

చ. యతి యన నెంత, తన్మనుజ◊పైకసమాధి యనంగ నెంత, త
ద్వ్రత మన నెంత, యియ్యెడ ము◊దంబున విఘ్నము దార్తు రిమ్మరు
త్సతు లఖిలేశ! యిట్టి సుర◊తామరసేక్షణ లుండ, లోకసం
తతినుతశక్తి మించు రతి◊నాయకుఁ డుండ, విచారమేటికిన్. 40

టీ. అఖిలేశ = బ్రహ్మదేవుఁడా! యతి యనన్ = యతి యగు వసంతుఁ డనఁగ; ఎంత=ఎంతమాత్రము, సాధారణుఁ డనుట; తత్=అతనియొక్క; మనుజప=మంత్రజపముయొక్క; ఏక=ముఖ్యమగు;సమాధి యనంగన్= చిత్తవృత్తి నిరోధ మనునది; ఎంత=ఎంతమాత్రము, సులభముగఁ జలింపఁజేయఁ దగినదని భావము; తత్=అతనియొక్క;వ్రత మన నెంత =వ్రతనియమ మనునది యెంత మాత్రము, స్వల్ప మనుట; ఇమ్మరుత్సతులు=ఈదేవాంగనలు; ఇయ్యెడన్=ఈసమయమందు; ముదంబు నన్=సంతోషము చేత; విఘ్నము=అంతరాయమును; తార్తురు=చేయుదురు; ఇట్టి సురతామరసేక్షణలు=ఇట్టి దేవాంగనలు; ఉండన్=ఉండఁగ; లోక=జనులయొక్క, లేదా లోకములయొక్క; సంతతి=సమూహముచేత; నుత=కొనియాడఁదగిన; శక్తిన్ =సామర్థ్యముచేత; మించు=అతిశయించు; రతినాయకుఁడు=మన్మథుఁడు; ఉండన్=ఉండఁగ; విచారము=వంత; ఏటికిన్= ఎందుకు, అనవసర మనుట. మహాయోగుల ధృతిఁ గలంచు దేవాంగనలు, మన్మథుఁడు నుండ విచార మేటి కని భావము.

సీ. ఏలదే బంటుగా ◊నీమేనకాకాంత, యచలగాధికుమారు ◊నంతవాని,
నేఁచదే సొబగుచే ◊నీధాన్యమాలిని, వింతగా శాండిల్యు ◊నంతవాని,
నెమ్మెతోఁ గలయదే ◊యీయూర్వశీవామ, హాళిమై జాబాలి ◊యంతవాని,
నెనయవే వరుసతో ◊నీవేల్పుచెలిచాలు, లలమండకర్ణజు ◊నంతవాని,

తే. నిట్టి సురసుందరులు గల్గ ◊నింతపనికి, మనములోఁ జాలఁ జింత నీ◊వెనసె దేల?
వీరిలో నొక్కవెలఁది న◊మ్మారుఁ గూర్చి, పంచు మీకార్య మిపుడె ఫ◊లించుఁగాని. 41

టీ. ఈమేనకాకాంత=ఈ మేనక యను సురాంగన; అచల=చలింపని; గాధికుమారు నంతవానిన్ = విశ్వమిత్రు నంతటివానిని; బంటుగాన్=దాసునిగా; ఏలదే=పరిగ్రహింపదా యని కాకువు.
ఈధాన్యమాలిని=ధాన్యమాలిని యను నీ సురాంగన; శాండిల్యు నంతవాని=శాండిల్యమహాముని యంతటివానిని; వింతగా = చిత్రముగా; సొబగుచేన్ =సౌందర్యముచే; ఏఁచదే =శ్రమపెట్టదా యని కాకువు.
ఈయూర్వశీవామ=ఊర్వశి యను నీ సురాంగన; జాబాలి యంతవానిన్= జాబాలిమహర్షి యంతటివానిని; హాళిమైన్= ఆసక్తి చేత; ఎమ్మెతోన్=ప్రేమతో; కలయదే=పెనఁగదా యని కాకువు.
ఈవేల్పుచెలుచాలులు=ఈసురాంగనాసమూహములు; అలమండకర్ణజు నంతవానిన్ = ఆ మండకర్ణజుఁ డను పేరు గల మహా ముని యంతటివానిని; వరుసతోన్=క్రమముగా; ఎనయవే=పొందవా యని కాకువు.
ఇట్టి సురసుందరులు=ఇట్టి సామర్థ్యము గల సురసుందరాంగులు; కల్గన్=ఉండఁగా; ఇంతపనికిన్=ఇంత స్వల్పకార్యము నకు; మనములోన్=మనసునందు; చాలన్=మిక్కిలి; చింత=విచారము; ఈవు =నీవు; ఎనసెదు ఏల= పొందెద వేల?వీరిలోన్= ఈ సురసుందరులలో; ఒక్కవెలఁదిన్= ఒక్కసుందరిని; అమ్మారున్=ఆమన్మథునితో; కూర్చి= చేర్చి; పంచుము = పంపించుము; ఇపుడె=ఈక్షణమందె; ఈకార్యము=ఈపని; ఫలించుఁగాని= ఫలవంత మగును. మహామునుల మనంబు చలింపఁజేయు సామర్థ్యము గల్గిన సురాంగన లుండ మీ రింతపనికిఁ జింతింపఁ బని లేదని భావము.

చ. అన నమృతంపుఁదేట జత ◊యందిన యాసురరాజుమాట చ
య్యన శ్రుతిపర్వమై మదిని ◊హర్షమహాపగఁ బొంగఁ జేయ , ‘నీ
పని కిది కార్యమౌర’ యని ◊పల్కువెలందిమగండు కంతుఁ బి
ల్వ ననిలుఁ బంచి, వేల్పునవ◊లాతలమిన్నల నంతఁ గాంచినన్. 42

టీ. అనన్=ఈప్రకారము పలుకఁగ; అమృతంపుఁదేట జత=అమృతసారమునకు సమత్వమును; అందిన =పొందిన; ఆసుర రాజుమాట =ఆయింద్రుని మాట; చయ్యనన్=శీఘ్రముగ (వెంటనే); శ్రుతిపర్వమై=వినసొంపయి; మదిని =మనసునందు; హర్షమహాపగన్=సంతస మను గొప్ప యేటిని; పొంగఁ జేయన్=ఉబుకఁజేయఁగ; ఈపనికిన్=దీనికి; ఇది =ఇంద్రోక్తమైన యుపాయము; కార్యము=చేయఁదగినది; ఔర యని, పల్కువెలందిమగండు =నలువ; కంతున్=మన్మథుని; పిల్వన్= పిలుచుటకు; అనిలున్=వాయుదేవుని; పంచి=పంపి; అంతన్=అటుపిమ్మట; వేల్పునవలాతలమిన్నలన్=సురాంగనాశిరో మణులను; కాంచినన్=చూడఁగ. దీని కుత్తరపద్యస్థక్రియతో నన్వయము.

సీ. వెలవెల నై తోఁచె ◊నలచంద్రకళ యత్య,తులతమశ్శ్రీఁ బొందఁ◊గలనె యనుచుఁ,
దల యెత్త లేదయ్యె ◊నలరంభ ధీరకుం,జరము సెన్కిన మనఁ◊జాల ననుచుఁ,
దెలివి వాయఁగఁ బొల్చె ◊నలతార హంసుని,గొడవఁ బోయిన మహం◊బడఁగు ననుచు,
శ్యామలలో నీఁగె ◊నలమాధవి ధరిత్రి, ఘనులగోసృతి నిల్వఁ◊గలనె యనుచు,

తే. నిట్టు లనిమేషకాంత ల◊హీనభంగ,వృత్తి సంధించి చలియింపఁ ◊జిత్తమందు
వే యెఱిఁగి చిత్రరేఖ య◊న్వేల్పుచెలువ, నలువకు జొహారు గావించి ◊నిలిచె నపుడు. 43

టీ. అలచంద్రకళ=ఆ చంద్రకళ యను సురాంగన; యత్యతులతమశ్శ్రీన్—యతి=వసంతుఁడను తపసియొక్క, అతుల= అధికమగు, తమశ్శ్రీన్=తమోగుణాతిశయమును; పొందఁ గలనె యనుచున్=చూడఁ గలనా యనుచు, అనఁగా వసంతుడను తపసియొక్క తమోగుణమును పరీక్షింపగలనా యనుచు; వెలవెల నై తోఁచెన్ =చిన్నఁబోయినదై కన్పడెను. ఇట చంద్రకళ= చంద్రరేఖ, అత్యతుల=మిక్కిలి యధికమగు, తమశ్శ్రీన్=రాహువుయొక్క అతిశయమును, కాంచునా యను నర్థము శబ్దశక్తి స్వభావమువలన ధ్వనించుచున్నది.అలరంభ= రంభ యను నా దేవాంగన; ధీరకుంజరము =పండితశ్రేష్ఠుఁడగు వసంతుఁడు; చెన్కినన్=ఎదిరించినచో; మనఁజాల ననుచున్ =బ్రతుకఁజాల నని; తలయెత్తలేదయ్యెన్= శిరము ఎత్తలేదని యర్థము. అనఁటి గంభీరగజము ఎదిరించిన మనఁజాల దను నర్థాంతరము స్ఫురించుచున్నది.
అలతార =తార యను సురాంగన; హంసునిగొడవన్=పరమహంసుఁడగు వసంతుని నిరోధమందు; పోయినన్= ప్రవర్తించిన యెడల; మహంబు=తేజము; అడఁగు ననుచున్ =నివర్తించు ననుచు; తెలివి వాయఁగన్=ప్రజ్ఞ వీడినట్లు; పొల్చెన్= అగపడెను. రిక్క ప్రొద్దు నెదిరించినచోఁ దేజ ముడుగు నని తెలివిపాయునటుల అగపడెనని యర్థాంతరము దోఁచుచున్నది. అలమాధవి=మాధవి యనునట్టి యా దేవాంగన; ఘనులగోసృతిన్=పెద్దలయొక్క వాక్యమునకు;నిల్వఁగలనె యనుచున్= తాళఁగలనా యని; ధరిత్రిన్=భూమియందు; శ్యామలలోన్=స్త్రీలలో; ఈఁగెన్=చొచ్చెను; మాధవి=లతావిశేషము; ఘనులగో సృతిన్ =మేఘములయొక్కజలధారకు; నిల్వఁగలనె యనుచున్ =నిలువఁగలనా యని; శ్యామలలోన్ =లతలయందు; ధరి త్రిన్ =భూమియందు;ఈఁగెన్=ప్రవేశించెను అని యర్థాంతరము దోఁచుచున్నది.
ఇట్టులు=ఈరీతిగా; అనిమేషకాంతలు=దేవాంగనలు; అహీన=అధికమగు; భంగవృత్తిన్=భంగవర్తనను; సంధించి=పొంది; చిత్తమందు=మనసునందు; చలియింపన్=చలింపఁగా; అపుడు=ఆసమయమందు; చిత్రరేఖయన్వేల్పుచెలువ=చిత్రరేఖ యను సురాంగన; వే=శీఘ్రముగ; యెఱిఁగి =గుర్తించి; నలువకున్=బ్రహ్మకు; జొహారు గావించి =నమస్కరించి; నిలిచెన్=నిల్చెను. నలువ వసంతుఁడను మహర్షియొక్క తపోవిఘ్నమునకై పంపుటకుఁ జంద్రకళాదిసురాంగనల నవలోకింప, వారు తపోవిఘ్న మొనరింపఁజాలమని చలింపఁగఁ, జిత్రరేఖ యనుసురాంగన వారిచందంబు గుర్తెఱిఁగి నలువకు నమస్కరించి నిల్చెనని భావము.

చ. నిలిచి యవార్య యౌవన వి◊నిర్మల సుందరభావ సత్కళా
కుల జని తైక దర్పమును ◊గూడిన చేడియ గాన ముందు దాఁ
దెలియక ధాత కిట్లను స◊తీమణి, ‘దేవ! భవన్మనోహితం
బలర నొనర్తు, నన్ను దయ ◊నంపుము నిర్జరు లెల్ల మెచ్చఁగన్.’ 44

టీక: నిలిచి =నిలుచుండి; అవార్య యౌవన వినిర్మల సుందరభావ సత్కళా కుల జనితైక దర్పమును – అవార్య =వారించుట కశక్యమైన, యౌవన=తారుణ్యముయొక్క, వినిర్మల =అత్యమలమగు,సుందరభావ=సౌందర్యముయొక్క, సత్కళా=శ్రేష్ఠ మగు విద్యలయొక్క, కుల=సమూహముచేత, జనిత=పుట్టింపఁబడిన, ఏక=ముఖ్యమగు, దర్పమును=మదమును; కూడిన చేడియ గాన=పొందియున్న వనితగాన; తాన్=తాను; ముందు తెలియక = ముందు రాఁబోవు దాని నెఱుంగక; సతీమణి =చిత్ర రేఖ; ధాతకున్ =బ్రహ్మకు; ఇట్లనున్ =వక్ష్యమాణప్రకారమునఁ బలికెను. దేవ=స్వామీ! భవత్=మీయొక్క; మనోహితంబు= మనసునకు హితమైన పనిని; అలరన్=సంతోషించునటుల; ఒనర్తున్=చేతును; నన్నుదయ నంపుము = నన్ను దయతోఁ బంపుము ; నిర్జరు లెల్ల మెచ్చఁగన్=దేవతలందఱు మెచ్చు కొనుచుండఁగా, ఈపద ముత్తరపద్యముతో నన్వయించును.

చ. మరుఁడు సహాయుఁ డై బలస◊మగ్రతతో వెనువెంట రాఁగ, స
త్వరగతి ధాత్రి నొంది, యల◊తాపసుఁ జేరి, భవత్కృపాపరి
స్ఫురితకలావిలాసములఁ ◊జొక్కపువేడుక నిక్కఁ జేసి, బం
ధురనిజశక్తి నిచ్చటికిఁ ◊దోకొని వచ్చెద నేలి బంటుగన్. 45

టీక: మరుఁడు =మన్మథుఁడు; సహాయుఁ డై=తోడై; బల=సేనలయొక్క; సమగ్రతతోన్=పరిపూర్ణతచేత; వెనువెంట రాఁగన్= ఎడఁబాయక రాఁగ; సత్వరగతిన్=శీఘ్రగమనముచేత; ధాత్రి నొంది=భూమిని జేరి; అలతాపసుఁ జేరి = ఆవసంతుని సమీపించి; భవత్కృపాపరిస్ఫురితకలావిలాసములన్ – భవత్=మీయొక్క, కృపా=దయచేత, పరిస్ఫురిత=ప్రకాశింపఁజేయఁబడిన, కలా = విద్యలయొక్క, విలాసములన్=లీలలచేత; చొక్కపువేడుకన్=శ్రేష్ఠమైన యభిలాషను; నిక్కఁ జేసి=అతిశయింపఁజేసి; బంధుర=అధికమగు; నిజశక్తిన్ = స్వసామర్థ్యముచేత; బంటుగన్ =సేవకునిఁగ; ఏలి=పాలించి; ఇచ్చటికిన్=ఇచ్చటికి;తోకొని వచ్చెదన్= తోడుకొని వత్తును.

సీ. జలపానసంరక్తి ◊సడలించి మోవితే,నియ గ్రోలుతమిఁ జాల ◊నింప వచ్చు,
తొలుపల్కుఁజదువులు ◊వొలియించి రతికూజి,తంబులు నడపుటల్ ◊దార్ప వచ్చు,
ధ్యాననైశ్చల్యంబు ◊దలఁగించి వలఱేని,కలహంపుఁజింతలోఁ ◊గలప వచ్చు,
యతివేషవైఖరి ◊నడఁగించి విటపాళి, యెంచుమేల్ సొగసు చే◊యింప వచ్చు,

తే. నొంటి దిరుగుట మాన్పి యిం◊పొనరు సఖులఁ, గూడి విహరించుతెఱఁగు వే ◊కూర్ప వచ్చు
నాత్మచాతురి నేమి సే◊యంగరాదు, తపసి నివ్వేళ ననుఁ బంపు ◊తమ్మిచూలి. 46

టీక: తపసిన్=వసంతుని; జలపానసంరక్తిన్ = ఉదకపానమందుఁ గల యాసక్తిని; సడలించి=వదలించి; మోవితేనియ గ్రోలు తమిన్ = కాంతాధరరసమును బానముసేయునట్టి యాసక్తిని; చాలన్=మిక్కిలి; నింప వచ్చున్=కల్గజేయవచ్చును; తొలుపల్కుఁజదువులు =వేదపాఠములను; పొలియించి=నశింపఁజేసి; రతికూజితంబులు=మణితములను; నడపుటల్ = జరపుటలను; తార్ప వచ్చున్=చేయవచ్చును;
ధ్యాన=ధ్యానమందలి; నైశ్చల్యంబున్=చాంచల్యరాహిత్యమును; తలఁగించి=వదలించి; వలఱేనికలహంపుఁజింతలోన్ = సురతవిషయకచింతయందు; కలపవచ్చున్=ప్రవేశింపఁజేయవచ్చును;
యతివేషవైఖరిన్=మునివేషముయొక్క రీతిని; అడఁగించి =పోఁగొట్టి; విటపాళి=విటసమూహము; ఎంచు=ప్రశంసించునట్టి; మేల్ సొగసు=శ్రేష్ఠమగు నందమును; చేయింప వచ్చున్ = ఘటింపఁజేయవచ్చును;
ఒంటి దిరుగుటన్=జతలేక సంచరించుటను; మాన్పి=పోఁగొట్టి; ఇంపొనరు సఖులన్=ఆనందముచే నొప్పుచున్నకాంతలను; కూడి=కలసి; విహరించుతెఱఁగున్=క్రీడించు క్రమమును; వే =శీఘ్రముగ;కూర్ప వచ్చున్=ఘటింపవచ్చును; ఆత్మచాతురిన్=బుద్ధిచాతుర్యముచేత; ఏమి సేయంగరాదు=ఏమి చేయుటకు రాదు, సర్వమును చేయవచ్చు ననుట; ఇవ్వేళన్ = ఈసమయమునందు; తమ్మిచూలి=ఓ నలువా! ననుఁ బంపు = నన్ను పంపుము. బుద్ధిచాతుర్యముచేత జలపానాది ముని ధర్మములను బోఁగొట్టి వసంతునకు విటవేషము ధరింపఁజేయవచ్చు నని నలువనుగుఱించి చిత్రలేఖ యను సురాంగన విన్న వించె నని భావము.

చ. తొలకరిచూపు లిం పొసఁగు◊ధూపము లై పయిఁ బర్వఁ, గంధరో
జ్జ్వలకలనిస్వనం బుడుక◊చాల్ రొద యై విన వేడ్కఁ దార్పఁ, బూ
విలుగలవేల్పురాసివము ◊వేగమె మౌనికి రేఁచి, మత్కుచా
చలయుగరంగవీథి ఘన◊సంభ్రమతన్ నటియింప నూన్చెదన్. 47

టీ. తొలకరిచూపులు=ప్రథమావలోకనములు; ఇంపొసఁగుధూపము లై = ఆనందము నిచ్చు ధూమవిశేషములై; పయిఁ బర్వన్ = పైపై వ్యాపింపఁగా; కంధరోజ్జ్వలకలనిస్వనంబు = కంఠమందుదయించిన రవము, అనఁగ రతికూజిత మని భావము; ఉడుక చాల్ రొద యై = చర్మవాద్యసమూహముయొక్క ధ్వని యై, ఆవేశమును జేయు చర్మవాద్యముయొక్క ధ్వనిరూపమయి; వినన్=వినుటకు; వేడ్కన్=సంతోషమును; తార్పన్= చేయుచుండఁగ; పూవిలుగలవేల్పురాసివము =మన్మథావేశమును; వేగమె =శీఘ్రముగనె; మౌనికి =వసంతుఁడను మునికి; రేఁచి=అతిశయింపఁజేసి; మత్కుచాచలయుగరంగవీథిన్ – మత్= నాయొక్క; కుచాచల=పర్వతములవంటి స్తనములయొక్క, యుగ=జంటయను,రంగవీథిన్ =నాట్యస్థలమందు; ఘనసంభ్ర మతన్=అధికత్వరచేతను, ‘సంభ్రమో వేగ హర్షయోః’ అని విశ్వము; నటియింపన్=నాట్యముచేయునటుల; ఊన్చెదన్= చేయుదును. కటాక్షములు నల్లవనుట కవిసమయము గావున చూపులను ధూపమును వేసి, మణిత మను జమిడికి ధ్వనిని సోఁకఁ జేసి, వసంతునకు మన్మథావేశమును దెప్పించి, నా కుచయుగమను నాట్యరంగమున నర్తింపజేతు నని భావము.

సీ. వలఱేని మనములో ◊మొలపించు క్రొంజూపు,తూపులధైర్యంబు ◊దూల్ప నేనిఁ,
దలఁపుల నెవ్వేళ ◊తలఁగక యూరించి, కెరలుమేల్కళలఁ జొ◊క్కింపనేనిఁ,
గౌఁగిట నలమి చొ◊కాటపుఁగూటమిఁ, గలయంగఁ బేరాసఁ ◊గొలుపనేనిఁ,
దులకించుమోహంపు◊వలఁ జిక్కి వెనువెంటఁ,బాయక తిరుగంగఁ ◊జేయనేనిఁ,

తే. బలుకువాల్దొర నివ్వేల్పు◊పడఁతు లెల్ల, వినుతి సేయంగ విటునిఁ గా◊వింపనేని,
నజరకులమునఁ బుట్టితి◊నంచు నిచ్చ, పలుకఁగా సిగ్గు గాదె య◊బ్జాతజన్మ! 48

టీ. అబ్జాతజన్మ=బ్రహ్మదేవుఁడా! వలఱేనిన్=మన్మథుని; మనములోన్=మనసునందు; మొలపించు క్రొంజూపుతూపులన్ – మొలపించు=ఉదయింపఁజేయు, క్రొంజూపుతూపులన్=క్రొత్తచూపు లను బాణములచేత; ధైర్యంబు=ధృతిని; తూల్పనేనిన్ = చలియింపఁజేయని యెడలను; ఎవ్వేళన్=ఎప్పుడును; తలఁపులన్= కోరికలను;తలఁగక=ఎడతెగకుండునటుల; ఊరించి=పుట్టించి; కెరలుమేల్కళలన్ = అతిశయించు విద్యలచేత; చొక్కింపనేనిన్=పరవశమొందింపనియెడలను; కౌఁగిటన్=కవుఁగిలియందు; అలమి=ఆక్రమించి; చొకాటపుఁగూటమిన్ =శ్రేష్ఠమగు సంగమమందు; కలయంగన్=కూడుటకు; పేరాసన్=గొప్పయాశను; కొలుపనేనిన్=పుట్టింపనియెడలను; తులకించు = ఒప్పుచున్న; మోహంపువలన్ = మోహమను జాలమందు; చిక్కి= పట్టువడి; వెనువెంటన్= వెంబడివెంబడి; పాయక=ఎడఁబాయక; తిరుగంగన్=తిరుగునటుల; చేయనేనిన్=ఒనర్పనియెడలను; పలుకువాల్దొరన్=మునిరాజగు వసంతుని; ఇవ్వేల్పుపడఁతు లెల్లన్ = ఈసురాంగన లెల్ల; వినుతి సేయంగన్=ప్రస్తుతి చేయు చుండఁగ; విటునిఁ గావింపనేనిన్ = జారుని గావింపనియెడలను; అజరకులమునన్=దేవతావంశమందు; పుట్టితినంచున్=జన్మించితి ననుచు; నిచ్చ=ఎల్లప్పుడును; పలుకఁగాన్ = వచించుటకు సిగ్గు గాదె = లజ్జ కాదా, సిగ్గగు ననుట;

ఓనలువా! నేను క్రొంజూపులచే కామమును బుట్టించి ధైర్యమును దొలఁగించియు, మఱియు కౌఁగిలించి సురతమం దాసక్తిఁ బుట్టించియు, మోహ మను జాలమునఁ దగులుకొని నావెంటఁదిరుగంగఁ జేయుచు నామహర్షిని విటునిఁ గావింపనైతినేని దేవతా వంశమందుఁ బుట్టితి నని చెప్పుకొనుట నాకు లజ్జాకర మని భావము.

చ. అనఁ దెఱగంటికొమ్మ పలు◊కాత్మమనఃప్రమదంబు గూర్ప న
వ్వనరుహసూతి యాదరణ◊వైఖరి నిట్లను, ‘నోనెలంత! ది
వ్యనికర వర్ణ్య విభ్రమక◊లాప్రవిమోహిత సర్వలోక వై
తనరెడు నీకు ధాత్రి నొక◊తాపసు లోఁబడ నూన్చు టబ్రమే! 49

టీక: అనన్ =పూర్వోక్తప్రకారముగాఁ బలుకఁగా; తెఱగంటికొమ్మ పలుకు = దేవాంగన యగు చిత్రరేఖవాక్యము; ఆత్మమనః ప్రమదంబు – ఆత్మ=తనయొక్క, మనః=మనస్సుయొక్క, ప్రమదంబు=సంతసమును; కూర్పన్ = చేయఁగ; అవ్వనరుహ సూతి =ఆబ్రహ్మదేవుఁడు; ఆదరణవైఖరిన్=మన్ననరీతిచే; ఇట్లు=వక్ష్యమాణప్రకారముగ; అనున్=పలికెను; ఓనెలంత = ఓ చిత్రరేఖా! దివ్యనికర వర్ణ్య విభ్రమకలాప్రవిమోహిత సర్వలోకవు – దివ్య=స్వర్గమందుఁ బుట్టిన దేవాదులయొక్క, నికర = సము దాయముచేత, వర్ణ్య =పొగడఁదగిన, విభ్రమకలా=భ్రామకవిద్యలచే, ఆప్రవిమోహిత= బాగుగా మోహింపఁజేయఁబడిన, సర్వ లోకవు=సమస్తలోకములు గలదానవు; ఐ=అయి; తనరెడు నీకున్=అతిశయించు నీకు; ధాత్రిన్=పుడమియందు; ఒక తాపసున్ =ఒకమునిని; లోఁబడ నూన్చుట=వశమగునట్లు చేయుట; అబ్రమే=ఆశ్చర్యమా, ఆశ్చర్యము కాదనుట. సమస్తవశ్యవిద్యలచే లోకముల నెల్ల మోహింపఁజేయు నీకుఁ బుడమి నొకతాపసుని మోహింపఁజేయు టరుదా యని భావము.

ఉ. చొక్కపునీటునం, గలల◊సొంపున, చారువిలాసవైఖరిం
జక్కఁదనంబునం, సరసచాతురి, నీసురయౌవతంబులో
నెక్కువదాన వౌట చెలి ◊యిచ్చ ఘటించితిఁ గాక దీని కీ
తక్కినవారిచే నగునె ◊తార్పఁగ నీదృశకార్య మెంతయున్. 50

టీక: చొక్కపునీటునన్=శ్రేష్ఠమగు మురిపెముచేత; కలలసొంపునన్=విద్యలయొక్క ప్రాచుర్యముచేత; చారువిలాసవైఖరిన్ – చారు=సుందరమగు, విలాస=హాసాదులయొక్క, వైఖరిన్=రీతిచేతను;చక్కఁదనంబునన్=సౌందర్యముచేతను; సరస = మనోజ్ఞమగు; చాతురిన్ = చాతుర్యముచేతను; ఈసురయౌవతంబులో=ఈదేవతాస్త్రీసమూహములో; ఎక్కువదాన వౌటన్ = అధికురాలవు గాన; చెలి=చిత్రరేఖా! ఇచ్చన్=ఇచ్ఛచేత; దీనికిన్ =ఈకార్యమునకు; ఘటించితిఁ గాక=నియోగించితిని; ఈ తక్కినవారిచేన్=నీకంటె నితరులైన వీరిచేత; ఈదృశకార్యము=ఇటువంటి గొప్పపని; ఎంతయున్=మిక్కిలి; తార్పఁగన్= చేయుటకు; అగునె=సాధ్యపడునా, కాదని కాకువు. స్మరశాస్త్రమందు ప్రావీణ్యముగలదాన వగుటచే సౌందర్యమందు నెక్కు వైనదానవగుటచే నీచేఁదక్కనితరులచే నీపని కాదని సమ్మతిచే నియోగించితి నని భావము.

సీ. ననబోఁడి యతులఘ◊నస్ఫూర్తిఁ దూలింపఁ, జాలదే నీనీల◊వాలకాంతి,
లీలం దమీశావ◊లేపంబు విదళింపఁ, జాలదే నీయాస్య◊జలజదీప్తి,
వనజానన యహీన◊మునిప్రౌఢిఁ గలఁగింపఁ, జాలదే నీరోమ◊పాళికాంతి,
ముదిత సత్తాపస◊ముజ్జృంభణముఁ బెంపఁ,జాలదే నీపదో◊జ్జ్వలనఖాళి,

తే. యచలవక్షోజపరమహం◊సౌఘమహిమ, నడఁపఁ జాలదె నీమంద◊యానలీల
యగుటఁ దల్లక్ష్మి చెలు వందు◊నట్టి నీకు, పడఁతి యొకమౌని నిల మోహ◊పఱచు టెంత. 51

టీక: ననబోఁడి =చిత్రరేఖా! నీనీలవాలకాంతి =నీయొక్కనల్లనైన కురులకాంతి, ‘వాలః కచే శిశౌ మూర్ఖే’ అని విశ్వనిఘంటువు. యతులఘనస్ఫూర్తిన్ – యతుల=మునులయొక్క, ఘన=అధికమైన, స్ఫూర్తిన్=సామర్థ్యమును; తూలింపఁ జాలదే= చలింపఁజేయ సమర్థము గాదా యని కాకువు; అతుల=సరిలేని, ఘన=మేఘముయొక్క,స్ఫూర్తిన్=ప్రకాశమును తూలింపఁ జాలదే యని యర్థాంతరము దోఁచుచున్నది;
లీలన్=విలాసముచే; నీయాస్యజలజదీప్తి = కమలమువంటి నీ ముఖముయొక్కకాంతి, ‘ఉపమితం వ్యాఘ్రాదిభి స్సామాన్యా ప్రయోగే’ యను సూత్రమువలన సమాసము; దమీశావలేపంబు=మునిశ్రేష్ఠునియొక్క గర్వమును, ‘దర్పోఽవలేపోఽవష్టంభః’ అని యమరుఁడు; విదళింపఁజాలదే=పోగొట్టఁజాలదా యని కాకువు; తమీశ యను విభాగమందు ‘ద్రుతప్రకృతికము మీఁది పరుషములకు సరళము లగు. ఆదేశసరళములకు ముం దున్న ద్రుతంబునకు బిందుసంశ్లేషంబులు విభాషనగు’ అను సూత్రము లచే దకారమును బిందువును వచ్చినవి. తమీశ=నిశాపతి యగు చంద్రునియొక్క, ‘రజనీ యామినీ తమీ’ అని యమరుడు, అవలేపంబు=గర్వమును, నీయాస్యజలజదీప్తి లీలచే విదళింపఁజాలదా యను నర్థము స్ఫురించుచున్నది. వనజానన=చిత్రరేఖా! నీరోమపాళికాంతి=నీనూఁగారు కాంతి; అహీనమునిప్రౌఢిన్ – అహీన=అధికమగు, మునిప్రౌఢిన్= మునులయొక్క ప్రాగల్భ్యమును; కలఁగింపఁజాలదే=కలఁతపఱుపఁజాలదా యని కాకువు; నీరోమపాళికాంతి=నీనూఁగారు కాంతి; అహీన=ఆదిశేషునియొక్క, మునిప్రౌఢిన్=మౌనముద్రను,బిగువు ననుట, కలఁగింపఁజాలదే యను నర్థాంతరము స్ఫురించుచున్నది. ముదిత=చిత్రరేఖా! నీపదోజ్జ్వలనఖాళి=నీపాదములయందు ప్రకాశించు నఖపంక్తి; సత్తాపసముజ్జృంభణమున్ –సత్=శ్రేష్ఠ మగు, తాపస=మునులయొక్క, ముత్=సంతసముయొక్క, జృంభణమున్ =అతిశయమును; పెంపఁజాలదే=ఖండింపఁ జేయఁ జాలదా, ఖండించు ననుట; నీనఖపంక్తి, సత్తాపసముజ్జృంభణమున్ – సత్=నక్షత్రములయొక్క, తాపసముజ్జృంభణ మున్=తాపాతిరేకమును, పెంపఁజాలదా=అతిశయింపఁజేయఁజాలదా యను నర్థము దోఁచుచున్నది. అచలవక్షోజ=పర్వతములవంటి స్తనములుగల చిత్రరేఖా! పరమహంసౌఘమహిమన్ –పరమహంస=సన్న్యాసులయొక్క, ఓఘ=సమూహముయొక్క, మహిమన్=సామర్థ్యమును; నీమందయానలీల, అడఁప జాలదె =అడఁగింపఁజాలదా, చాలు ననుట; పరమహంసౌఘమహిమన్ –పరమ=ఉత్కృష్టములగు,హంస=రాజహంసలయొక్క, ఓఘ=సమూహముయొక్క, మహిమన్=సామర్థ్యమును, నీమందయానలీల అడఁగింపఁజాలదా అను నర్థాంతరము దోఁచుచున్నది.అగుటన్= ఈప్రకారము కావుటవలన; తల్లక్ష్మి చెలువందునట్టి నీకున్=ఆనీలవాలకాంత్యాదిసంపదచే నొప్పుచున్నట్టినీకు; పడఁతి = ఓ చిత్రరేఖా! ఒకమౌనిన్=ఒకమునిని; ఇలన్=భూమియందు; మోహపఱచు టెంత = మోహపరచు టెంతమాత్రము అసాధ్యము కాదనుట.

చిత్రరేఖా! నీకురులు, ముఖము, నూఁగారు, నఖములు, నీమందయానములే మునులధృతి దూల్చుచుండఁగఁ బుడమి నొకమునిని, మోహపఱచుట నీ కకించిత్కర మని భావము.

చ. అలవిరివింటిదంట ముద◊మారఁగ నీ వెనువెంట రా, ధరా
స్థలివడిఁజేరి, యామునియు◊దారతపఃక్రమ మెల్ల మాన్చి, యు
జ్జ్వలగతి వచ్చునీకుఁ జెలు◊వా యొనగూర్తు వహింప నీసురా
బలలు శిరోనతిం బవలు◊పంజులు చెంద్రికపావడన్ రహిన్.’ 52

టీక: చెలువా=చిత్రరేఖా! అలవిరివింటిదంట =దిట్టతనముగల యామన్మథుఁడు; ముదమారఁగన్=సంతసము నిండఁగా; నీ వెనువెంట రాన్ = నీవెంబడి రాఁగ; ధరాస్థలిన్=భూప్రదేశమును; వడిన్=వేగమున; చేరి=పొంది; ఆముని=ఆవసంతుని యొక్క; ఉదారతపఃక్రమ మెల్లన్=యెక్కువైన తపమెల్లను; మాన్చి=పోఁగొట్టి; ఉజ్జ్వలగతిన్=ప్రకాశించుగమనముచేత; వచ్చునీకున్=వచ్చునట్టి నీకు; ఈసురాబలలు =ఈదేవాంగనలు; శిరోనతిన్=తలవంపును; వహింపన్=పొందునటుల; పవలుపంజులు=పగలుదివిటీలను; చెంద్రికపావడన్=కుసుంభపువస్త్రమును; రహిన్=ప్రీతితో; ఒనగూర్తున్=ఇత్తును.

ఇల వసంతుని తపోభంగ మొనరించివచ్చునీకు నితరసురాంగనలకు లజ్జ గలుగునటుల పవలుపంజులు, వస్త్రములు బహుమతిగా నిత్తు నని భావము.

తే. అని యనేకవిధంబుల ◊నాదరంబు, దొలఁక రంభాదినిర్జరీ◊కులము లాత్మఁ
గలఁకచేఁ గుంద నప్పల్కు◊కలికిమగఁడు, చెలిమి నాచిత్రరేఖతోఁ ◊బలుకునపుడు. 53

టీక: అని =ఈప్రకారము వచించి; అనేకవిధంబులన్=నానారీతులచేత; ఆదరంబు=మన్నన; తొలఁకన్=అతిశయింపగా; రంభాదినిర్జరీకులములు = రంభ మొదలగుదేవాంగల గుంపులు; ఆత్మన్=చిత్తమందు; కలఁకచేన్=కలఁతచేత; కుందన్ = చింతింపఁగ; అప్పల్కుకలికిమగఁడు=ఆబ్రహ్మ; చెలిమిన్=నెయ్యముతో; ఆచిత్రరేఖతోన్, పలుకునపుడు = మాటలాడు చుండఁగా.

సీ. ననసేసకొప్పు నొం◊దిన యొంటిపొరచెంద్ర,కావిరుమాల విం◊తై వెలుంగ,
రతికౌఁగిలింతఁ దో◊రపుఁజిక్కు గన్న మొ,గ్గలసరుల్ పేరెదఁ ◊జెలువుమీఱ,
నెలవంకరేఖల ◊నిలిచి పైఁజెదరుక,ప్పురపుగందపుఁదావి ◊బుగులుకొనఁగఁ,
గలికిగోణమ్ముపైఁ ◊గట్టిన క్రొత్తగే,దఁగిఱేకువంకి యం◊దముగ మెఱయఁ,

తే. జిలుకకోయిలమూఁకలు ◊సేరి నడవఁ, గలువఱేఁ డామనియుఁ బార్శ్వ◊ముల రహింప,
శారికలు నైజజయవిద్య◊చయముఁ జదువ, వేడ్కఁ జనుదెంచె నపుడు పూ◊వింటిజోదు. 54

టీక: ననసేసకొప్పున్=పుష్పయుక్తమగు కొండెసిగను; ఒందిన=పొందినట్టి; ఒంటిపొరచెంద్రకావిరుమాల =ఒంటిమడత గల చెంగావి తలగుడ్డ; వింతై =చిత్రమైనదై; వెలుంగన్=ప్రకాశింపఁగా;
రతికౌఁగిలింతన్=రత్యాలింగనముచేత; తోరపుఁజిక్కు గన్న = మిక్కిలి పెనఁగిన; మొగ్గలసరుల్=మొగ్గలతోఁ గూర్చిన హారములు; పేరెదన్=విశాలమగువక్షమునందు; చెలువుమీఱన్= అందముచే నతిశయింపఁగా;
నెలవంకరేఖలన్=నఖక్షతములందు; నిలిచి =తగులుకొని; పైఁజెదరు కప్పురపుగందపుఁదావి – పైఁజెదరు = మీఁది కెగయు చున్న; కప్పురపుగందపుఁదావి = కర్పూరగంధముయొక్క పరిమళము; బుగులుకొనఁగన్ = నెఱసికొనఁగా; కలికిగోణమ్ముపైన్ = సుందరమగు కాసెదట్టిపైన; కట్టిన =కట్టినట్టి; క్రొత్తగేదఁగిఱేకువంకి =నూతనమగు కేతకీదళ మనెడి బాకు; అందముగన్=సుందరముగా; మెఱయన్=ప్రకాశించుచుండఁగా;
చిలుకకోయిలమూఁకలు =శుకపికసేనలు; చేరి నడవన్=సమీపించి నడచుచుండఁగా; కలువఱేఁడామనియున్ = చంద్రుఁడును వసంతుఁడును; పార్శ్వముల = ఇరుప్రక్కలయందు; రహింపన్=ఒప్పుచుండఁగా; శారికలు =గోరువంకపక్షులు; నైజజయ విద్యచయమున్ = తనసంబంధ మగు బిరుదులను; చదువన్=పఠింపఁగా; వేడ్కన్ = సంతసముచే; అపుడు=ఆసమయమున; పూవింటిజోదు =మన్మథుఁడు; చనుదెంచెన్=వచ్చెను.

మ. వలరా జ ట్లరుదేర, నానలువ దీ◊వ్యద్రత్నసింహాసన
స్థలి నొయ్యన్ డిగి చేర వచ్చి, నతి నొం◊దం బాణిచే నెత్తి, య
ర్మిలితోఁ గౌఁగిటఁ గూర్చి, యంత రతినా◊రీభర్తతో నందదు
జ్జ్వలపీఠిన్ వసియించెఁ, జెంగటనె ని◊ల్వం దద్బలవ్రాతముల్. 55

టీక: వలరాజు=మన్మథుఁడు; అట్లు = పూర్వోక్తప్రకారమున; అరుదేరన్=రాఁగ; ఆనలువ =ఆబ్రహ్మదేవుఁడు; దీవ్యత్= ప్రకాశించుచున్న; రత్నసింహాసనస్థలిన్=రత్నమయసింహాసనమునుండి; ఒయ్యన్ =శీఘ్రముగ; డిగి =దిగి; చేర వచ్చి = సమీపమునకు వచ్చి; నతి నొందన్ = (మన్మథుఁడు) నమస్కరింపఁగా; పాణిచే నెత్తి = హస్తముచే లేవఁదీసి; అర్మిలితోన్ = ప్రేమతో; కౌఁగిటన్ కూర్చి = కౌఁగిలించి; అంతన్=అటు పిమ్మట; తత్ =ఆమన్మథునియొక్క; బలవ్రాతముల్ =శుకపికాది సేనాసమూహములు; చెంగటనె = సమీపమందే; నిల్వన్=ఉండఁగా; రతినారీభర్తతోన్=మన్మథునితో; నందదుజ్జ్వలపీఠిన్ = ఆనందకర మగు ప్రకాశించుచున్న పీఠమందు; వసియించెన్=కూర్చుండెను. నలువ మన్మథుఁడు రాఁగానే అతని నెదుర్కొని కౌఁగిలించి రత్నమయసింహాసనమునఁ గూర్చుండఁబెట్టుకొనె నని భావము.

చ. ఘనవినయాత్మ నున్నయల◊కంజశరుం దిలకించి యవ్విరిం
చనుఁ డనురక్తి దోఁప చతు◊రానని నొక్కటి యై రహించు తి
న్ననిమధురోక్తిఁ బల్కు, ‘రతి◊నాయక! నిన్గనుగొన్న నామదిన్
మనిచెఁ బ్రమోదసంతతి ర◊మాపతిఁ గాంచినదారి నియ్యెడన్. 56

టీక: ఘనవినయాత్మన్ = అధికమగు వినయము గల బుద్ధిచేత; ఉన్న=ఉన్నట్టి; అలకంజశరున్ = ఆమన్మథుని; తిలకించి = చూచి; అవ్విరించనుఁడు=ఆబ్రహ్మదేవుఁడు; అనురక్తి తోఁపన్ = అనురాగ ముదయింపఁగా; చతురాననిన్=నాల్గుముఖ ములచేత, ‘చతుర్ణామాననానాం సమాహారశ్చతురాననీ, సంఖ్యాపూర్వో ద్విగుః’ అని సమాసము; ఒక్కటి యై రహించు తిన్ననిమధురోక్తిన్ = ఒక్కటైన మృదుమధురోక్తిని; పల్కున్=పల్కెను;(అది యేమన) రతినాయక =మన్మథుఁడా! నిన్గను గొన్నన్= నిన్నుఁజూడఁగా; ఇయ్యెడన్=ఇపుడు; రమాపతిన్= విష్ణుమూర్తిని; కాంచినదారిన్=చూచినరీతిని; నామదిన్ = నామనస్సునందు; ప్రమోదసంతతి =ప్రమోదమును; మనిచెన్= వృద్ధిఁ బొందించెను.

చ. సరసతరాసమాస్త్రములు ◊సంతతజీవికశింజినీలతా
స్ఫురితశరాసనోత్తమముఁ ◊బూని తలంపఁగ మేటి వై సుమా
కరసఖ నీవు రాజిలఁగఁ◊గాదె సమస్తజగజ్జనుల్ పర
స్పరపరివైమతీగతులు ◊బాసి ప్రియప్రమదాప్తి నుబ్బుటల్. 57

టీక: సరసతరాసమాస్త్రములు – సరసతర=మిక్కిలిశ్రేష్ఠమగు, అసమ=సాటిలేని, అస్త్రములు=బాణములు, మకరందముతోఁ గూడుకొన్న బేసిసంఖ్యగల పూఁదూపు లని తోఁచుచున్నది; సంతత జీవిక శింజినీలతా స్ఫురిత శరాసనోత్తమమున్ – సంతత = అవిచ్ఛిన్నమైన, జీవిక=జీవనము గలిగిన, శింజినీలతా=అల్లెత్రాటిచేత, తుమ్మెదనారి యని తోఁచుచున్నది, స్ఫురిత= ప్రకాశించుచున్న, శరాసనోత్తమమున్ =మేటివింటిని, పూని =గ్రహించి, ఇక్షుధనువును గ్రహించి యని భావము; తలంపఁగన్ =ఆలోచింపఁగ; మేటి వై =అగ్రేసరుఁడ వై; సుమాకరసఖ = వసంతునకు సఖుఁడ వైన మన్మథుఁడా! నీవు రాజిలఁగఁ గాదె =నీవు సర్వోత్కర్షముగ నుండుటవలనఁ గదా; సమస్తజగజ్జనుల్ = ఎల్లజగములలో నుండు జనులు; పరస్పరపరివైమతీగతులు –పరస్పర= అన్యోన్యము, పరివైమతీగతులు =ప్రణయకలహములవలన నైన మనస్తాపములను; పాసి =వదలి; ప్రియప్రమ దాప్తిన్ = సంతోషముచే; ఉబ్బుటల్=విజృంభించుటలు. చెఱకువిల్లు, పూఁదూపులును, తుమ్మెదనారియుఁ బూని నీవు విజృంభించుచుండఁగఁ గదా సమస్తజనులు వైమతులఁ బాసి విజృంభింతు రని భావము.

సీ. మునిభామకై యింద్రుఁ◊బెనుఁగోడిగా లస,ద్ధృతిఁ దూల్చి మించిన ◊దిట్టతనము,
నొక్క కాత్యాయని ◊నొందంగ సెగకంటి, పౌరుషం బరచేసి ◊ప్రబలునేర్పు,
హంసాఖ్యఁ దగు కైర◊వారిపితృప్రసూవి,సంపర్కగతిఁ గూర్చి ◊యొప్పుచలము,
గురుపత్నిఁ గలయ స◊త్కులనేత యగువాని, సతతంబుఁ గుందించు ◊చతురవృత్తి,

తే. నఖిలభువనాభినవ్యమ◊హాద్భుతౌఘ, కల్పనానర్గళస్ఫూర్తి ◊గాంచి వెలయ,
మాదృశుల కెన్న నలవియె ◊మంజుకంజ,బాణజితలోకజాల, శం◊బరవిఫాల! 58

టీక: మునిభామకై =అహల్యకై; ఇంద్రున్=దేవేంద్రుని; పెనుఁగోడిగాన్ =కుక్కుటముగా; లసత్=ప్రకాశించుచున్న; ధృతి = ధైర్యమును; తూల్చి =పోఁగొట్టి; మించిన=అతిశయించిన యట్టి, దిట్టతనమున్=సామర్థ్యమును; ఇచట పెనుఁగోడిగాల నను చోట పెద్దకోడిగపుఁజేష్టలచేత నని యర్థాంతరము దోఁచుచున్నది. ఒక్క కాత్యాయనిన్ = ఒక్కతి యైన పార్వతిని, ‘ఉమా కాత్యాయనీ’ అని అమరము; ఒందంగన్=పొందుటకు; సెగకంటి
పౌరుషంబు = ఈశ్వరశరీరమును; అరచేసి =సగము చేసి; ప్రబలునేర్పున్ = అతిశయించిన నైపుణ్యమును; ఈచరణమందు ఒక్క కాత్యాయనిన్ = సగమేండ్లుగల ముదిమిముదితను, ‘కాత్యాయ న్యర్ధవృద్ధాచ’అని యమరుఁడు, సెగకంటిపౌరుషమును = సెగకంటియొక్కశరీరధర్మము నను నర్థమును దోఁచుచున్నది; హంసాఖ్యన్=సూర్యనామముచేత; తగు=ఒప్పుచున్న; కైరవారి=ఆదిత్యునికి; పితృప్రసూ=సాయంసంధ్యయొక్క, ‘సాయం సంధ్యా పితృప్రసూః’ అని యమరుఁడు; విసంపర్కగతిన్ =విశేషమైన సంబంధమును; కూర్చి=కలుగఁజేసి; ఒప్పుచలమున్ = ఒప్పిదమగు మాత్సర్యమును; హంసాఖ్యఁదగు=పరమహంస యను ప్రసిద్ధి నొందు; కైరవారి=ఆదిత్యునికి; పితృప్రసూ= తండ్రివలనఁ బుట్టినవానియొక్క, తోఁబుట్టుస్త్రీలయొక్కయని భావము; విసంపర్కగతిన్ =విశేషమైన సంబంధమును; కూర్చి= కలుగఁజేసి యను నర్థాంతరము దోఁచుచున్నది.
గురుపత్నిఁ గలయ =బృహస్పతిభార్య యగు తారను గలయుటకు; సత్కులనేత యగువానిన్= రిక్కలఱేఁడగు చంద్రుని; సతతంబున్=ఎల్లపుడును; కుందించు చతురవృత్తిన్=క్షీణింపఁజేయు చాతుర్యమును; మంచికులమువారిలోఁ బెద్దను సత తంబుఁ గుందించు నను నర్థము ధ్వనించుచున్నది; అఖిలభువనాభినవ్య మహాద్భుతౌఘ కల్ప నానర్గళ స్ఫూర్తిన్ – అఖిలభువన=సమస్తలోకములకు, అభినవ్య=మిక్కిలి నూతనమగు, మహాద్భుతౌఘ=అత్యాశ్చర్యసంఘముయొక్క, కల్పన=కల్పించుటయందు, అనర్గళ=నిరంకుశమగు, స్ఫూర్తిన్= సామర్థ్యమును; కాంచి =పొంది; వెలయన్=ప్రకాశింపఁగా; మాదృశులకు=మాబోఁటివారికి; ఎన్నన్=గణించు టకు; మంజు కంజబాణ జిత లోకజాల=మనోహరమగు పద్మబాణములచే జయింపఁబడిన లోకసమూహము గలవాఁడా, శంబరవిఫాల = శంబరాంతకుఁడా, అలవియె = వశమా? కాదనుట.
ఇంద్రశివసూర్యచంద్రులధృతిఁ దూల్చి కామపరతంత్రులఁ జేసిన నీసామ ర్థ్యము నెన్న మాబోఁటివారి కలవిగాదని తాత్పర్యము.

చ. కనుగలవిల్లు వూని కడు◊గాటపుసంపెఁగమొగ్గముల్కిచాల్
గొని కలనాదసైన్యములుఁ ◊గొల్వఁగ వీవలితేరి నెక్కి నీ
వనికి రమాకుమారక! భు◊జాంచితశక్తిఁ గడంగ డాఁగఁడే
ఘనకరవీరసూనదరిఁ ◊గాలవిరోధి భయావిలాత్ముఁడై.’ 59

టీక: రమాకుమారక =మన్మథుఁడా! నీవు, కనుగలవిల్లు పూని =చెఱకుసింగిణి గ్రహించి; కడుగాటపుసంపెఁగమొగ్గముల్కిచాల్ – కడుగాటపు=మిక్కిలి సమర్థమైన, సంపెఁగమొగ్గ =సంపెంగమొగ్గ లనెడు, ముల్కిచాల్=బాణబృందమును; కొని=గ్రహించి; కలనాదసైన్యములు=కోయిల లను సైనికులు; కొల్వఁగన్=సేవింపఁగ; వీవలితేరి నెక్కి=మందమారుత మనెడు రథము నెక్కి; భుజాంచితశక్తిన్=భుజబలముచేత; అనికిన్=యుద్ధమునకు; కడంగన్=ప్రయత్నింపఁగా; కాలవిరోధి=శంకరుఁడు; భయావి లాత్ముఁడై = భయముచేఁ గలఁతనొందినవాఁడై; ఘనకరవీరసూనదరిఁన్ – ఘన=అధికమగు, కరవీరసూన=గన్నెరుకుసుమ మనెడు; దరిన్=గుహయందు; డాఁగఁడే = దాఁగఁడా యని కాకువు.

క. అని వినుతిపూర్వకంబుగ, మనసిజునిం బలికి యపుడు ◊మఱియు నతనితోన్
తనకార్య మెల్లఁ దేటగ, వనజాసనుఁ డిట్లు వలుకు ◊వరమృదుఫణితిన్. 60

టీక: అని=ఈప్రకారము; వినుతిపూర్వకంబుగన్=స్తుతిపూర్వకముగ; మనసిజునిన్=వలరాజును; పలికి=వచించి; అపుడు = ఆసమయమునందు; మఱియున్=ఇంకను; అతనితోన్=ఆమన్మథునితో; తనకార్య మెల్లన్ = తనపని యంతయు; తేటగన్= వెల్లడిగ; వనజాసనుఁడు=బ్రహ్మ; ఇట్లు=వక్ష్యమాణప్రకారమున; వరమృదుఫణితిన్ =శ్రేష్ఠమగు మృదువాక్యరీతిగ; పలుకున్ =పలికెను.

శా. ‘వింటే మన్మథ! మత్ప్రభుత్వమున కు◊ర్విం బుట్టు విఘ్నావళిన్
గెంటం దార్చుచు మామకాత్మహితభం◊గిన్ మించు నీ వుండుటల్
కంటం గానక బ్రహ్మభావమున కా◊కాంక్షించి యొక్కండు పెన్
గొంటే యౌ ముని దెచ్చినాఁ డిటఁ దపః◊కుల్యాధ్వసంచారితన్. 61

టీక: మన్మథ=మన్మథుఁడా! మత్ప్రభుత్వమునకున్= నాదొరతనమునకు; ఉర్విన్=భూమియందు; పుట్టు విఘ్నావళిన్ = ఉదయించు నంతరాయములను; గెంటం దార్చుచు=చలింపఁజేయుచు; మామకాత్మహితభంగిన్ = నాశరీరముకొఱకు హిత మైన విధముచే; మించు నీ వుండుటల్ =అతిశయించు నీవునికిని; కంటం గానక =చూడక; బ్రహ్మభావమునకు=బ్రహ్మత్వము నకు; ఆకాంక్షించి =ఆశపడి; ఒక్కండు పెన్ గొంటే యౌ ముని = ఒక దుష్టతపస్వి; తపఃకుల్యాధ్వసంచారితన్ – తపఃకుల్యా= తపస్సనెడు కృత్రిమనదియొక్క, అధ్వసంచారితన్=మార్గసంచారముచేత; ఇటన్=ఇచ్చటికి; తెచ్చినాఁడు, వింటే=వింటివా. అనఁగా పుడమి నాబ్రహ్మత్వమునకుఁ బుట్టినట్టి యంతరాయములను బోఁగొట్టు నీయునికిని దెలియక యొకజడదారి బ్రహ్మ త్వమును గోరి తపం బొనరించుచున్నాడని భావము.

చ. ముని యజభావ మందఁ దప◊ముల్ గడుఁ జేసినఁ జేయుఁగాక, పా
వన మనురాజజాతజప◊వైఖరి మించిన మించుఁ గాక, ని
త్యనియమవృత్తిఁ దాలిచినఁ ◊దాలుచుఁ గాక, విచారమేల నో
మనసిజ! నాకు నీవు బలు◊మక్కువతమ్ముఁడ వై చెలంగఁగన్. 62

టీక: ఓమనసిజ = ఓమన్మథుఁడా!ముని =వసంతుఁడు; అజభావ మందన్= బ్రహ్మత్వమును పొందుటకు; తపముల్ =తపం బులు; కడున్=మిక్కిలి; చేసినన్=ఒనరించినను; చేయుఁగాక=ఒనరించుఁ గాక; పావనమనురాజజాతజపవైఖరిన్ – పావన = పవిత్రమగు, మనురాజజాత=మంత్రశ్రేష్ఠముల సమూహముయొక్క, జపవైఖరిన్=జపవిధానముచేత; మించినన్ = అతిశ యించిన; మించుఁ గాక = అతిశయించుఁ గాక; నిత్యనియమవృత్తిన్ = ఎల్లపుడు నియమవృత్తిని; తాలిచినన్= ధరించిన; తాలుచుఁ గాక = ధరించును గాక; నాకు నీవు, పలుమక్కువతమ్ముఁడ వై చెలంగఁగన్ = మిక్కిలి ప్రేమగల తమ్ముఁడ వై యుండఁగా; విచారమేల = చింత యెందుకు, చింత పనిలేదని భావము. నలువ విష్ణుమూర్తి నాభికమలమునందు జన్మించినవాఁ డగుటచే మన్మథున కన్న యని భావము.

చ. హరి సకలాధిపత్యము సు◊మాశుగ! మా కొనగూర్చె మున్ను త
త్పరిభవకార్యసంహృతియుఁ ◊దత్పరిపాలనమున్ ఘటింపఁగా
నిరతముఁ గర్త వీ వగుట ◊నేర్పున నీ విలఁ జేరి తన్మునీ
శ్వరతప మెల్లఁ దూల్పఁ దగు ◊సారమహామహిమంబు లెంచఁగన్. 63

టీక: సుమాశుగ =మన్మథుఁడా! హరి =విష్ణుమూర్తి; మున్ను=పూర్వము; సకలాధిపత్యము =సమస్తభువనాధిపత్యము; మా కొనగూర్చెన్ = మాకు కలుగఁ జేసెను; తత్పరిభవకార్యసంహృతియున్ – తత్=ఆయాధిపత్యముయొక్క, పరిభవకార్య = తిరస్కారకార్యముయొక్క, సంహృతియున్ = ప్రతిక్రియయును; తత్పరిపాలనమున్=ఆయాధిపత్యపరిపాలనమును; ఘటింపఁగాన్=ఘటింపఁజేయుటకు; నిరతమున్ = ఎల్లప్పుడు; కర్త వీ వగుటన్ = నీవు కర్త వగుటవలన; నేర్పునన్=జాణ తనముచేత; నీవు ఇలఁ జేరి =నీవు పుడమిని ప్రవేశించి; సారమహామహిమంబు లెంచఁగన్ = పరాక్రమాతిశయము లెంచఁగా; తన్మునీశ్వరతప మెల్లన్ = ఆమునీశ్వరుని తపము నంతయు; తూల్పఁ దగున్ = భంగము చేయవలెను.

చ. అనఘ కలాకలాపిని య◊నల్పవిలాసిని చిత్రరేఖ పే
రను దగు నీవధూనికర◊రత్నము నీవెనువెంట రాఁగ, వే
చని ధరఁ జేరి, యానియమి◊చంద్రుతపం బెడలించి, వానిఁ దూ
ల్ప నిజశక్తి నేతదబ◊లాపరిచారకుఁ జేయు మంగజా! 64

టీక: అంగజా=మన్మథుఁడా! అనఘ కలాకలాపిని – అనఘ=అమోఘములైన, కలా=మన్మథవిద్యలే, కలాపిని = భూషణ ముగాఁ గల్గినయట్టిదియు; అనల్ప=అధికమగు, విలాసిని =విలాసములు గలిగినట్టిదియు; చిత్రరేఖ పేరను =చిత్రరేఖ యను పేరిచేత; తగు=ఒప్పుచున్నట్టి; ఈవధూనికరరత్నము = ఈనారీకులరత్నము; నీవెనువెంటన్= నీవెంబడి; రాఁగన్=వచ్చు చుండఁగా; వే చని = త్వరగా వెళ్ళి; ధరఁ జేరి =పుడమి నొంది; ఆనియమిచంద్రుతపంబు = ఆమునిశ్రేష్ఠుని (వసంతుని) తప స్సును; ఎడలించి =తొలఁగించి; వానిఁ దూల్పన్=ఆమునిని దూలించుటకై; నిజశక్తిన్=స్వసామర్థ్యముచేత; ఏతదబలా= ఈ చిత్రరేఖకు; పరిచారకున్=సేవకునిగా; చేయుము=ఒనర్పుము.

చ. అలికవిలోచనోగ్రతప◊మంతయు ము న్నడఁగించినట్టి నీ
బలము చలంబు దివ్యశర◊పాండితి నేఁడును జూపి, మౌని ని
చ్చెలువ కధీనుఁ జేయు మిఁకఁ ◊జెప్పెడి దేమి రతీశ, సర్వముం
దెలిసిననీకు దీనఁ దగ ◊నిల్పుము మద్భువనాధిపత్యమున్.’ 65

టీక: రతీశ =మన్మథుఁడా! మున్ను=పూర్వమందు; అలికవిలోచనోగ్రతప మంతయున్=శంకరుని తీక్ష్ణతపము నంతయు; అడఁ గించినట్టి నీబలము = పోఁబెట్టినట్టి నీసామర్థ్యము; చలంబు = పట్టుదల; దివ్యశరపాండితి = అమోఘమగు బాణవిద్యాపాండి త్యము; నేఁడును=ఇపుడును; చూపి=కనిపింపఁజేసి; మౌనిన్=మునిని; ఇచ్చెలువకు=ఈచిత్రరేఖకు; అధీనున్=స్వాధీనునిగ; చేయుము= ఒనరింపుము; సర్వముం దెలిసిననీకున్=సర్వజ్ఞుఁడ వగు నీకు; ఇఁకన్=ఈమీఁద; చెప్పెడి దేమి =చెప్పవలసిన దేమున్నది, ‘కిమర్పితాత్మభారాణాం వక్తవ్య మవశిష్యతే’ యను న్యాయమువలన నీకుఁ దెలుపున దేమియును లేదని భావము; దీనన్=ఈ కార్యమువలన; మద్భువనాధిపత్యమున్ =నాలోకాధిపత్యమును; తగన్=యుక్తముగ; నిల్పుము= ఉంపుము.

ఉ. నా విని నల్వఁ జూచి, రతి◊నాయకుఁ డిట్లను, ‘వాగధీశ! యి
ట్లీవు వచింపఁగాఁ దగవె, ◊యీఘనకార్యభరంబు నాది గా
దే, విబుధుల్ నుతింప జగ◊తీస్థలిఁ జేరి, మునీంద్రు దేవరా
జీవదళాక్షితో నెనయఁ◊జేసెద, మానుము వంత నెమ్మదిన్. 66

టీక: నా విని =ఈప్రకారము వచింపఁగా విని; రతినాయకుఁడు=మన్మథుఁడు; నల్వఁ జూచి=బ్రహ్మను చూచి; ఇట్లనున్=వక్ష్య మాణప్రకారముగఁ బల్కెను; వాగధీశ=ఓ నలువా! ఇట్లు=పూర్వోక్తప్రకారమున; ఈవు=నీవు; వచింపఁగాఁ దగవె = పలుకుట ఉచితమా, కాదనుట; ఈఘనకార్యభరంబు = ఈగొప్ప కార్యభారము; నాది గాదే = నాదే కద యని కాకువు; విబుధుల్ = దేవ తలు; నుతింపన్=స్తుతిచేయఁగ; జగతీస్థలిఁ జేరి = పుడమి సొచ్చి; మునీంద్రున్=వసంతుని; దేవరాజీవదళాక్షితోన్=దేవాంగన యైన చిత్రరేఖతో; ఎనయఁ జేసెదన్=కలయునటుల చేసెదను; నెమ్మదిన్=హృదయమునందు; వంత=దుఃఖమును; మానుము = వదలుము.

చ. అళితతిపోటుఁగూఁత లెగ◊యం, బెనుమావులు డిగ్గి చిల్కరౌ
తులు నడవన్, మహాబలము ◊దోడ్తన చుట్టికొనం, దపస్వి ని
శ్చలధృతి సాలమండలము ◊చయ్యన లగ్గలు వట్టి పట్టి యీ
నెలఁతయురోజదుర్గతటి ◊నిల్పెదఁ దత్పటుహృన్మహీవిభున్’. 67

టీక: అళితతిపోటుఁగూఁతలు=తుమ్మెదగుంపుల శూరవాక్యములు; ఎగయన్=అతిశయించుచుండఁగా; చిల్కరౌతులు =శుకములను రౌతులు; పెనుమావులు =పెద్ద చూతవృక్షము లను గుఱ్ఱములను; డిగ్గి=దిగి; నడవన్ =నడచుచుండఁగా; మహాబలము =వీవలి యను సైన్యము; తోడ్తన=వెంటనె; చుట్టికొనన్=ఆవరింపఁగా; తపస్వి నిశ్చలధృతి సాలమండలము – తపస్వి=మునియొక్క, నిశ్చల=చలింపని; ధృతి=ధైర్యమనెడు, సాలమండలము=ప్రాకారమండలము, ‘ప్రాకారో వరణ స్సాలః’ అని యమరుఁడు; చయ్యనన్=శీఘ్రముగ; లగ్గలు వట్టి పట్టి =ప్రాఁకిప్రాఁకి; ఈనెలఁతయురోజదుర్గతటిన్ = ఈ చిత్రరేఖయొక్క పర్వతతుల్యమగు స్తనము లనెడు కోటయందు; తత్పటుహృన్మహీవిభున్ – తత్=ఆమునియొక్క, పటు= సమర్థమైన, హృత్=హృదయమనెడు, మహీవిభున్=భూపతిని; నిల్పెదన్=బంధింతును.

చ. అన మరుఁ బల్కునం బ్రమద◊మంది విరించి సువర్ణచేలముల్
ఘనమణిభూషణంబు లల◊కంతునకున్ సురకాంతకుం బ్రియం
బెనయ నొసంగి, యంత రజ◊నీశ వసంత సమీర తామ్రలో
చనవర ముఖ్యమారబల◊సంతతి నాదృతి సేసి యిట్లనున్. 68

టీక:అనన్=ఈప్రకారము పలుకఁగ; మరు పల్కునన్=మన్మథవాక్యముచేత; విరించి=నలువ; ప్రమదమంది =సంతసించి; సువర్ణచేలముల్=బంగారువస్త్రములు; ఘన=అధికమగు; మణిభూషితంబులు=మణిమయాభరణంబులు; అలకంతునకున్ =ఆమన్మథునికి; సురకాంతకున్=దేవాంగనకు; ప్రియంబు=ప్రేమము; ఎనయన్=పొందునటుల; ఒసంగి=ఇచ్చి; అంతన్= అటు పిమ్మట; రజనీశ వసంత సమీర తామ్రలోచనవర ముఖ్యమారబలసంతతిన్ –రజనీశ=చంద్రుఁడు, వసంత=వసంతుఁడు, సమీర=వాయువు, తామ్రలోచనవర=పికశ్రేష్ఠములు, ముఖ్య=ఆదిగాఁ గల; మారబలసంతతిన్=మన్మథసైన్యమును; నాదృతి సేసి =ఆదరించి; ఇట్లు=వక్ష్యమాణప్రకారము; అనున్=పలికెను. అనఁగా మునితపోభంగ మొనరింప సమకట్టి యున్న మన్మథునకును, దేవాంగనకును బ్రహ్మ కనకాంబరములును, మణి భూషణములును బహుమతిగా నొసంగి, మన్మథసహాయు లగు చంద్రవసంతాదులను ప్రియోక్తుల నాదరించె నని భావము.

సీ. తెఱవ నవ్వుల యోగి◊ధృతిఁ గలంపకమున్న, నెఱయు వెన్నెలలు పై◊నింప వన్న,
నెలఁత కేలను మౌని◊కళ లంటకయమున్న, చిగురాకు నెమ్మొనఁ ◊జేర్ప వన్న,
సకిపైఁట యతిఁ జొక్కఁ ◊జక్కవీవకమున్న, ప్రబలుచల్లదనానఁ ◊గ్రమ్మ వన్న,
చెలిపాట యమివీను◊లలరఁ బాడకమున్న, కలనాదభంగికల్◊తెలుప వన్న,
తే. యోకుముదమిత్త్ర, యోచైత్ర, ◊యోసమీర, యోపికాధీశ మీనేర్పు ◊లొనరఁ జూపి,
పడఁతి కాజడదారి లోఁ◊బఱప రన్న, మన్మనోభీష్టకార్యంబు ◊ మనుప రన్న. 69

టీక: తెఱవ =చిత్రరేఖ; నవ్వులన్=మందహాసములచేత; యోగిధృతిన్=మునియొక్క ధైర్యమును; కలంపకమున్న= కలఁత పఱపకముందె; నెఱయు వెన్నెలలు = వ్యాపించు చంద్రికలను; పై నింప వన్న = పైని గప్పుమా; నెలఁత=చిత్రరేఖ; కేలను=హస్తముచేత; మౌనికళలు=వసంతునియొక్క కళాస్థానములను; అంటకయమున్న= స్పృశింపక ముందే, స్త్రీపురుషులకు నొక్కొక్కదినమందు నొక్కొక్కయంగమునఁ గళ యుండుట కళాశాస్త్రప్రసిద్ధము; చిగురాకునెమ్మొనన్ = చిగురుటాకుయొక్క అగ్రమును; చేర్ప వన్న=కూర్పుమా; సకి=చిత్రరేఖ; పైఁటన్=పైఁటకొంగుచేతను, అనఁగా ముసుగుకొంగుచేతను; యతిన్=మునిని; చొక్కన్=పరవశించునటుల; చక్కన్=అనుకూలముగ; వీవకమున్న=విసరకమునుపే; ప్రబలుచల్లదనానన్=అధికమగు చల్లదనముచేత; క్రమ్మవన్న=పై కొనుమా; చెలి=చిత్రరేఖ; పాటన్=పాటను; యమివీనులు=మునియొక్క కర్ణములు; అలరన్=సంతోషించునటుల; పాడకమున్న = పాడకమునుపే; కల=అవ్యక్తమధురమగు; నాద=ధ్వనులయొక్క; భంగికల్ =రీతులు; తెలుప వన్న=తెలియఁజేయుమా; ఓకుముదమిత్త్ర=ఓచంద్రుఁడా! ఓచైత్ర=ఓవసంతుఁడా! ఓసమీర=ఓమందమారుతమా! ఓపికాధీశ =ఓకోకిలరాజా! ఈ చంద్రా దులకు పూర్వచరణములందు చెప్పఁబడిన విషయమునకు క్రమముగా నన్వయ మని యెఱుంగునది; మీనేర్పులు=మీజాణ తనములను; ఒనరన్=ఒప్పునటులు; చూపి=ప్రదర్శించి; పడఁతికిన్=చిత్రరేఖకు; ఆజడదారిన్=ఆమునిని; లోఁబఱపరన్న= వశపఱపుఁడీ; మన్మనోభీష్టకార్యంబు=నామనమున కిష్టమగు పనిని; మనుపరన్న= సిద్ధించునట్లు చేయుఁడీ.

చ. అని నిజమిత్త్రవర్యనిచ◊యంబుల నీగతిఁ బల్కి యమ్మరు
ద్వనధరవేణికామణి వి◊ధాత రహిం దన కొప్పగించి పం
చిన విరివింటిజోదు పిక◊సేనలతో సురవారిజాక్షితో
ఘన మగు వేడ్క వొంగఁ దద◊గారము వెల్వడి వచ్చె నంతటన్. 70

టీక: విధాత=బ్రహ్మదేవుఁడు; అని=ఈప్రకారముగ; నిజమిత్త్రవర్యనిచయంబులన్—నిజ=స్వకీయులగు, మిత్త్రవర్య=మిత్త్ర శ్రేష్ఠులయొక్క, నిచయంబులన్=సమూహములను; ఈగతిన్=ఈరీతిని; పల్కి=వచించి; అమ్మరుద్వనధరవేణికామణిన్ = మేఘతుల్యమగు వేణిగల యా సురాంగనారత్నమును; రహిన్=ప్రీతితో; తన కొప్పగించి =తనయధీనము చేసి; పంచినన్= పంపఁగా; విరివింటిజోదు=మన్మథుఁడు; పికసేనలతో =కోకిలబలములతో;సురవారిజాక్షితో=దేవాంగనతో; ఘనమగు వేడ్క = అధికమగు సంతసము; పొంగన్=అతిశయింపఁగా; తదగారము =ఆవిరించిమందిరమునుండి; వెల్వడి వచ్చెన్ =బయలు దేఱి వచ్చెను; అంతటన్=అటు పిమ్మట. ముందరిపద్యముతో నన్వయము.

సీ. చిలుకతత్తడిరౌతు◊చేతితియ్యనివింట, గాఢకృపీటజ◊కాండ మెగసె,
నుడురాజు పఱతెంచు◊నెడఁ బుండరీకంబు, వికలత్వమున నిరా◊వీథిఁ ద్రెళ్ళె,
కరువలి కడ్డమై ◊వెఱఁ గూన్చె నలఘన,పద్యనవ్యాత్మభీ◊ప్రదమహాహి,
యామని రాఁగఁ జ◊య్యన విగతచ్ఛదం,బుగఁ జూడఁబడె నప్డు ◊పురుషకాళి,

తే. నిర్జరవధూటికావామ◊నేత్రసీమ, జడిగొని పరిప్లవత్వంబు ◊సరగఁ దోఁచె,
ని ట్లశకునంబు లేపున ◊నెన్ని యున్న, వానిఁ జూడక యధికగ◊ర్వంబుతోడ. 71

టీక:చిలుకతత్తడిరౌతు=మన్మథునియొక్క; చేతితియ్యనివింటన్= చేతియందున్న చెఱకువింటినుండి; గాఢ=అధికమగు; కృపీటజకాండము=అగ్నిసంఘము; ఎగసెన్=పైకి వచ్చెను. కృపీట మనఁగా నుదకము, దానియందుఁ బుట్టినది కృపీటజము. ‘కృపీటయోని ర్జ్వలనః’ అని యగ్నికి జలమందుఁ బుట్టుటకు ప్రమాణము. పయనించి యున్న వలరాజుయొక్క కార్ముకము నుండి యుల్కాపాత మవశకున మని భావము. ఇచట మన్మథుని వింటివలన కృపీటజకాండ మనఁగ జలజబాణ మెగసె నని శబ్దశక్తిస్వభావముచే సహజార్థము దోఁచుచున్నది. ఉడురాజు=చంద్రుఁడు; పఱతెంచు నెడన్ =త్వరచే వచ్చుచున్న సమయమందు; వికలత్వమునన్=విచ్ఛేదముచేత; పుండరీ కము =శ్వేతచ్ఛత్రము; ఇరావీథిన్ = భూప్రదేశమందు, ‘ఇరా భూ వాక్సురాప్సు స్యాత్’అని యమరుఁడు; త్రెళ్ళెన్= పడెను. చంద్రుఁడు వచ్చుచుండఁగా నతని శ్వేతచ్ఛత్రము విఱిగి భూతలమునందుఁ బడుట నశకున మని భావము. చంద్రోదయమందు పుండరీకము అనఁగాఁ దెల్లతామర చెడి, ఇరావీథిని ననఁగా జలమందుఁ ద్రెళ్ళె నని సహజార్థము దోఁచుచున్నది. కరువలికిన్=మారుతమునకు; అడ్డమై =అడ్డమైనదై; నవ్యాత్మభీప్రదమహాహి – నవ్య=నూతనమగు, ఆత్మ=మనస్సునకు, భీప్రద=భయమునిచ్చు, మహాహి =గొప్పసర్పము; అలఘనపద్యన్= ఆగొప్పమార్గమునందు; వెఱఁ గూన్చెన్=నిశ్చేష్టత కలిగించెను. మార్గమధ్యమందు పా మడ్డమైనచో నశకునమని భావము. అలఘనపద్యన్= ఆయాకాశమార్గమందు, అవ్యాత్మ భీప్రదమహాహి – అవి=సూర్యునియొక్క, ‘అవయ శ్శైల మేషార్కాః’ అని యమరుఁడు, ఆత్మ=శరీరమునకు, భీప్రద=భయ ప్రదమగు, మహాహి=గొప్పసర్పమగు రాహువు; వెఱఁ గూన్చె నని స్వభావార్థము శబ్దశక్తిచేఁ దోఁచుచున్నది. ఆమని రాఁగన్= వసంతుఁడు రాఁగ; అప్డు =ఆసమయమున; విగతచ్ఛదంబుగన్=వస్త్రహీనముగ; పురుషకాళి = పురుషుల బృందము; చయ్యనన్=శీఘ్రముగ; చూడఁబడెన్= అవలోకింపఁబడెను. వసంతుఁడు బయలుదేఱు నపుడు దిగంబరపురుష బృందము కన్పడుట యశకున మని భావము. వసంతుఁడు రాఁగా, పురుషకాళి=పున్నాగతరువులగుంపు, ‘పున్నాగే పురుషః’ అని యమరుఁడు, విగతచ్ఛదంబుగన్=రాలినయాకులు గలదై, ‘ఛదస్స్యాత్పట పర్ణయోః’ అని విశ్వము, చూడఁబడె నను
స్వభావార్థము దోఁచుచున్నది. నిర్జరవధూటికావామనేత్రసీమన్ – నిర్జరవధూటికా=చిత్రరేఖయొక్క, అవామనేత్రసీమన్=కుడికంటిపట్టున; జడిగొని =అతిశ యించి; పరిప్లవత్వంబు=చాంచల్యము; సరగన్=వేగముగ; తోఁచెన్=కనిపించెను. స్త్రీలకు దక్షిణనేత్రస్పంద మశకున మని భావము. చిత్రరేఖయొక్క వామనేత్రసీమ యనఁగా సుందరమైన నేత్రములయొక్క ప్రదేశమందుఁ బరిప్లవత్వము దోఁచె ననుట సహజార్థము; ఇట్లు= ఈప్రకారము; అశకునంబులు=దుశ్శకునములు; ఏపునన్=అతిశయముచేత; ఎన్నియున్నన్= ఎన్ని కల్గినను; వానిఁ జూడక = ఆయశకునములను సరకుసేయక; యధికగర్వంబుతోడ = ఎక్కుడు కావరముతో, కంజశరుఁడు ధాత్రిం దొరసె నని మీఁది కన్వయము. మునితపోభంగ మొనరించుటకు అశకునము లెన్ని తోఁచినను, వాని సరకుసేయక దర్ప ముతోఁ బోవుచు నని భావము.

మ. అలసత్యాధ్వము డిగ్గి యప్డు తప మొ◊య్యన్ దాఁటి దీవ్యజ్జన
స్థల మాపిమ్మట నొంది యంతట మహ◊స్థానంబునుం బొంది వే
ల్పులరావీ డట వేడ్క డగ్గఱి భువ◊ర్లోకేంద్ర మవ్వేళఁ జే
రి లలిం గంజశరుండు దా దొరసె ధా◊త్రిన్ మేరుమార్గంబునన్. 72

టీక: కంజశరుండు=మన్మథుఁడు; అలసత్యాధ్వము =ఆసత్యలోకమునుండి; డిగ్గి =దిగి; అప్డు=ఆసమయమందు; తపము= తపోలోకమును; ఒయ్యన్ =తిన్నగ;దాఁటి=అతిక్రమించి; దీవ్యత్=ప్రకాశించుచున్న;జనస్థలము=జనర్లోకమును; ఆపిమ్మటన్ =అటుపిమ్మట; ఒంది=పొంది; అంతటన్=అటుపిమ్మట; మహస్థానంబునుం బొంది =మహర్లోకమును పొంది; వేల్పులరా వీడు=ఇంద్రపట్టణమును; అట=అచ్చట; వేడ్కన్=సంతోషముతో; డగ్గఱి =సమీపించి; అవ్వేళన్=ఆసమయమునందు; భువ ర్లోకేంద్రము=భువర్లోకశ్రేష్ఠమును; చేరి=సమీపించి; లలిన్=క్రమముగ; తాన్=తాను; ధాత్రిన్=పుడమిని; మేరుమార్గంబునన్= మేరుపర్వతమార్గమున; దొరసెన్=ప్రవేశించెను. అనఁగా మన్మథుఁడు సత్యలోక,తపోలోక,జనర్లోక,మహర్లోక,స్వర్లోక, భువ ర్లోకములను దాఁటి భూలోకమును మేరుమార్గముచేఁ బ్రవేశించె నని భావము.

చ. ధర నిటు లొంది, యంత సము◊దారగిరీనపురీఝరీదవో
త్కరముల నెల్లఁ గన్గొనుచుఁ, ◊గాముఁడు వింధ్యముఁ జేరె నందుఁ బ
ద్మరిపుసుతోర్మిజాంబుకణ◊మండలపుష్పితనీపనిత్యభా
స్వర మగు పారిజాతవన◊వర్యము గన్నుల కింపుఁ గూర్పఁగన్. 73

టీక: కాముఁడు=మన్మథుఁడు; ధరన్=భూమిని; ఇటు లొంది = ఈప్రకారము పొంది; అంతన్=అటుపిమ్మట; సముదార గిరీన పురీ ఝరీ దవోత్కరములన్ – సముదార=ఉత్కృష్టము లగు, గిరీన (గిరి+ఇన)=పర్వతరాజములయొక్క, పురీ=నగరముల యొక్క, ఝరీ=నదులయొక్క, దవ=వనములయొక్క,ఉత్కరములన్=సమూహములను; ఎల్లన్=సర్వమును;కన్గొనుచున్ =చూచుచు; వింధ్యమున్=వింధ్యపర్వతమును; చేరెన్=సమీపించెను; అందున్=ఆవింధ్యపర్వతమందు; పద్మరిపుసుతోర్మి జాంబుకణ మండల పుష్పిత నీప నిత్య భాస్వరము – పద్మరిపుసుతా=చంద్రునకు గూతురగు నర్మదానదియొక్క, ఊర్మిజ= అలలవలనఁ బుట్టిన, అంబుకణ=నీటితుంపురులయొక్క, మండల=సమూహముచేత, పుష్పిత =పూచిన, నీప=కడిమిచెట్ల చేత, నిత్య=ఎల్లపుడును, భాస్వరము=ప్రకాశించునది; అగు=అయినట్టి; పారిజాతవనవర్యము=పారిజాతవనశ్రేష్ఠము; కన్ను లకు= నేత్రములకు; ఇంపుఁ గూర్పఁగన్ = ఆనందము కలుగఁజేయుచుండఁగా. ముందరి పద్యముతో నన్వయము. మన్మథుఁడు వింధ్యముఁ జేరెను. అచ్చట గొప్పగొప్ప పర్వతములను, పర్వతములం దున్ననదులను జూచుచు, నర్మదా తరంగములవలనఁ బుట్టిన తుంపురులచేఁ జెన్నుమీఱు కడిమిమ్రాకులచేఁ బ్రకాశించు పారిజాతవనము తన కన్నులకు వేడుకఁ గల్గఁ జేయుచుండగా నని భావము.

చ. గురుజవశక్తి వచ్చి యొక◊కోయిలవేగరి తద్వసంతభూ
సురతిలకాశ్రమం బిదియ◊చు మ్మని తెల్పఁగఁ గంతుఁ డందు ని
ర్జరసతితో, నిజాప్తవర◊జాలముతో వసియించెఁ దత్ప్రసూ
నరసకులార్ద్రమారుతము◊నన్ స్వతనూశ్రమ మెల్లఁ బాయఁగన్. 74

టీక: కంతుఁడు=మన్మథుఁడు; గురు=అధికమగు; జవశక్తి న్=వేగసామర్థ్యముచేతను; ఒకకోయిలవేగరి = ఒక కోయిలయను వేగులవాఁడు; వచ్చి=సమీపించి; తద్వసంతభూసురతిలకాశ్రమంబు=ఆవసంతుఁ డను బ్రాహ్మణశ్రేష్ఠునియొక్క ఆశ్రమము; ఇదియచుమ్ము అని= ఇదేసుమా యని; తెల్పఁగన్=తెలియఁజేయఁగ; అందున్=ఆవనమందు; నిర్జరసతితోన్=దేవాంగనతో; నిజ=తనయొక్క; అప్తవర=మేలైన యిష్టులయొక్క; జాలముతోన్=సంఘముతో; తత్ప్రసూనరసకులార్ద్రమారుతమునన్ – తత్=ఆవనముయొక్క, ప్రసూనరస=పుష్పరసముయొక్క, కుల=సమూహముచేత, ఆర్ద్ర=తడుపఁబడిన, మారుతమునన్= వాయువుచేత; స్వ=తనయొక్క; తనూశ్రమము=శరీరాయాసము; ఎల్లన్=అంతయు; పాయఁగన్=తొలఁగునట్లు; వసియిం చెన్ =నివసించెను. వసంతు డనుమునియొక్క యాశ్రమ మిది యని కోయిల చెప్పఁగ నాప్తవర్గముతో మన్మథుఁ డావనమందు నిలిచె నని భావము.

చ. చెలు వగు మైత్త్రిఁ గోయిలవ◊జీరులఁ దుమ్మెదకమ్మగట్టుమూఁ
కల గొరువంకరాదొరల◊గాటపుఁజిల్కలకాల్బలంబులన్
నలినకలంబవీరబల◊నాథుఁడు చైత్రుఁడు తద్బలోచితో
జ్జ్వలలతికాకుటీపటలిఁ ◊జక్కగఁబాళెము డించె నయ్యెడన్. 75

టీక: నలినకలంబవీర బలనాథుఁడు=పద్మములు బాణముగాఁ గల వీరుఁడైన మన్మథునియొక్క సైన్యాధిపతియగు; చైత్రుఁడు =వసంతుఁడు; చెలువగు మైత్త్రిన్=ఒప్పుచున్న స్నేహముచేతను; కోయిలవజీరులన్= కోయిల లనెడు శూరులను; తుమ్మెద కమ్మగట్టు మూఁకలన్= తుమ్మెద లను కమ్మగట్టులయొక్క సేనలను; గొరువంకరాదొరలన్=శారికాశ్రేష్ఠము లనుదొరలను; గాటపుఁజిల్కలకాల్బలంబులన్=దృఢము లైన చిల్క లనుకాల్బలములను; తద్బలోచితోజ్జ్వలలతికాకుటీపటలిన్ – తద్బల = ఆసేనలకు, ఉచిత=అనుకూలమగు, ఉజ్జ్వల=ప్రకాశించు,లతికా=తీవలయొక్క,కుటీ=గుడిసెలయొక్క,పటలిన్= సమూ హమందు; అయ్యెడన్ =ఆసమయమునందు; చక్కగన్=బాగుగ; పాళెము=దండును; డించెన్=దించెను. అనఁగా కంతునికి సేనాధిపతి యగువసంతుఁడు కోయిలలు మొదలగు సేనాగణముల ననుకూలమగు లతాగృహముల విడియించె నని భావము.

సీ. చివురించు నెఱకెంపు◊చివురాకుగమి కట్టు,నట్టి కౌసుంభాంబ◊రాళిఁ బోలఁ,
జాలఁ దోఁచిన నూత్న◊జాలకశ్రేణి మేల్,హురుమంజిముత్తెపు◊సరులఁ బోల,
నళు లెక్క నరదోఁచు ◊తెలిపూలచాలు కై,శ్యములఁ జేర్చిన గర్భ◊కములఁ బోల,
నలరుగుత్తుల నిండ ◊నలరు పుప్పొడి గుబ్బ,కవలపై నలఁదుగం◊దవొడిఁ బోల,

తే. సరసశృంగారవైఖరి ◊ధరణిఁ బొదలు, లతిక లయ్యెడ వీక్షించు◊కుతుక మొసఁగెఁ
జైత్రకాంతాగమనదిష్ట◊సముచితౌజ్జ్వ,లీపరిభ్రాజదుత్తమా◊లీల నొంది. 76

టీక: చివురించు నెఱకెంపు చివురాకుగమి – చివురించు=పల్లవించుచున్న, నెఱకెంపు=మిక్కిలి యెఱ్ఱనైన, చివురాకుగమి= చిగురుటాకుల గుంపు; కట్టునట్టి =ధరించియున్న; కౌసుంభ=కుసుంబారంగుగల; అంబరాళిన్=వస్త్రసమూహములను; పోలన్=పోలియుండఁగ,చాలన్=మిక్కిలి; తోఁచిన =ఉదయించి యున్న; నూత్న=క్రొత్తనైన; జాలకశ్రేణి =మొగ్గలచాలు; మేల్=శ్రేష్ఠమగు; హురు మంజి ముత్తెపుసరులన్=హురుమంజిదేశమునఁ బుట్టిన ముత్యముల హారములను; పోలన్=పోలియుండఁగ, అళు లెక్కన్= భృంగము లధిష్ఠింపఁగ; అరదోఁచు =సగము గనిపించు; తెలిపూలచాలు=తెల్లపూవులబంతి; కైశ్యములన్=కేశ సమూహములందు,‘తద్బృన్దే కైశికం కైశ్యమ్’ అని యమరుఁడు; చేర్చిన=ఉంచినట్టి; గర్భకములన్=కేశమధ్యమునందుంచిన దండలను, ‘కేశమధ్యేతు గర్భకమ్’ అని యమరుఁడు; పోలన్=పోలియుండఁగ, అలరుగుత్తులన్=పూవుగుత్తులయందు; నిండన్=పూర్ణముగ; అలరు=ఒప్పుచున్న; పుప్పొడి=పుష్పపరాగము; గుబ్బకవల పైన్ = స్తనయుగ్మముపై; అలఁదు=పూసిన; గందవొడిన్=బుక్కాపొడిని; పోలన్=పోలియుండఁగ, సరస=మనోజ్ఞమగు; శృంగార=సౌందర్యముయొక్క; వైఖరిన్=రీతిచేత; ధరణిన్=పుడమియందు; పొదలు లతికలు= వృద్ధి నొందుచున్న తీవలు; చైత్రకాం తాగమనదిష్ట సముచి తౌజ్జ్వలీ పరిభ్రాజ దుత్తమాలీలన్ – చైత్రకాంత=వసంతుఁడను ప్రియుని యొక్క, ఆగమనదిష్ట=ఆగమనసమయమునకు, అనఁగాఁ బ్రియుఁడు వచ్చువేళకు, సముచిత=అనుకూల మగు, ఔజ్జ్వలీ= ప్రకాశముచేత, పరిభ్రాజత్=వెలుఁగుచున్న, ఉత్తమాలీలన్=వరవర్ణినీవిలాసమును; ఒంది=పొంది; అయ్యెడన్=ఆసమయ మందు; వీక్షించుకుతుకము=చూచువేడుకను; ఒసఁగెన్=ఇచ్చెను.

చిగురుటాకులు కుసుంభావస్త్రములను, మొగ్గలు హురుమంజిముత్యపుసరులను, తుమ్మెదలు ముసురుటచే సగము గనఁబడు తెలిపూలచాలు కొప్పున ధరించు సరములను, పుప్పొడిచేఁ గప్పఁబడిన పూగుత్తులు గందవొడి యలందిన పాలిం డ్లను పోలియుండ, లతలు వసంతుం డను ప్రియునియొక్క యాగమనసమయమున కుచితశృంగారవైఖరిని ధరియించి, యుత్తమస్త్రీల లీలను బొందియుండె నని చెప్పుటచే లతలయందు వాసకసజ్జాత్వము దోఁచుచున్నది. ప్రియుఁడు రాఁగలఁడని సురత సామగ్రీసన్నాహము చేసి తనువు నలంకరిచుకొనునది వాసకసజ్జ యని దాని లక్షణము.

ఉ. డాసె సుమాళిఁ దుమ్మెదమి◊టారి, దమిం జివు రాని కోయిలల్
మ్రోసె, రసాలకేసరస◊మూహసుగంధము దిక్తటంబులం
బూసె మెకంబు నెక్కుదొర, ◊మున్మును పైకొను కాఁకచే ధృతిం
బాసె వియోగి, యోగివన◊పాళిక నామని యాక్రమింపఁగన్. 77

టీక: తుమ్మెదమిటారి=భృంగస్త్రీ; సుమాళిన్=పూబంతిని; డాసెన్=సమీపించెను; కోయిలల్=పికములు;తమిన్ = ఆసక్తితో; చివురు=చిగురాకును; ఆని=తిని; మ్రోసెన్=ధ్వనిఁజేసెను (పాడెను); మెకంబు నెక్కుదొర=వాయువు; రసాలకేసరసమూహ సుగంధము—రసాల=తియ్యమావులపూలయొక్క, కేసర=పొన్నపూలయొక్క, సమూహ=గుంపుయొక్క, సుగంధము= పరిమళమును; దిక్తటంబులన్= దిక్ప్రదేశములయందు; పూసెన్= లేపనము చేసెను; వియోగి = వియుక్తుఁడు; మున్మును= ముందుముందు; పైకొను=మీఱుచున్న; కాఁకచేన్= (ఎడబాటునందలి)వేఁడిమిచే; ధృతిన్=ధైర్యమును; పాసెన్=వదలెను;
యోగివనపాళికన్=మునితపోవనమును; ఆమని=వసంతుఁడు; ఆక్రమింపఁగన్=ఆవరించుచుండఁగ.

అనఁగా వసంతకాలము రాఁగానే తుమ్మెదలు కుసుమములను జేరె ననియు, కోయిలలు గూసె ననియు, రసాలకేసర పుష్పముల సుగంధము గలవాయువు విసరె ననియు, విరహుల ధృతి సడలె ననియు భావము.

చ. మునివన మంతయుం దనచ◊మూపతి యత్తఱి నాక్రమింప, మిం
చినబలదర్పగౌరవము◊చే విషమాశుగవీరశేఖరుం
డని కిదె చుమ్ము వేళ యని ◊యాప్తమతిం బికమంత్రి దెల్పఁ, జ
య్యన వెడలెన్ రసాలవిశి◊ఖాసము సూనశరాళిఁ బూనుచున్. 78

టీక: మునివనము=వసంతమునియొక్క తపోవనము; అంతయున్=సర్వమును; తనచమూపతి=తనసేనాపతి యగు నామని; అత్తఱిన్=ఆసమయమందు; ఆక్రమింపన్= ఆవరింపఁగ; పికమంత్రి = కోకిల మనుసచివుఁడు; ఆప్తమతిన్=హితబుద్ధిచేత; అనికిన్ =యుద్ధమునకు; ఇదె చుమ్ము=ఇదియే చూడుము; వేళ యని=సమయ మని; తెల్పన్=తెలియఁజేయఁగ; విషమా శుగవీరశేఖరుండు = మన్మథవీరాగ్రేసరుఁడు; మించిన బలదర్పగౌరవముచేన్ – మించిన = అతిశయించిన, బల =సారము యొక్క,దర్ప=గర్వముయొక్క,గౌరవముచేన్=గురుత్వముచేత;రసాలవిశిఖాసము=రసాలబాణాసనమును; సూనశరాళిన్ =పూఁదూపుల సమూహములను; పూనుచున్=ధరించుచు; చయ్యనన్=శీఘ్రముగ; వెడలెన్ =బయలుదేఱెను.

అనఁగాఁ దనచమూపతి యగువసంతుఁడు మునితపోవనము నాక్రమించినపిమ్మట పిక మనుమంత్రి యుద్ధమునకు నిది సమయ మని తెలుపఁగ, మన్మథుఁడు రసాలబాణాసమును, పుష్పబాణములను గొని వెడలె నని భావము.

సీ. అరిరాజచిత్తభీ◊కరకరకాండప్ర,చండిమ మనురాజ◊మండలంబు,
క్రొందళంబులఁ జాలఁ ◊గూర్చుక హరివితా,నములతోఁ జైత్రసే◊నావిభుండు,
కన్నుల నెఱమంటఁ ◊గ్రక్కుచుఁ గలరుతుల్, బెరయ నానావన◊ప్రియబలంబు,
కనకరజోరేఖఁ ◊గనుపట్టు వరగంధ,పటిమ రాజిలు మహా◊బలకులంబు,

తే. తొలుదొలుతఁ దీవ్రవిస్ఫూర్తిఁ ◊దొడరి నడవఁ, జిలుక మేల్పక్కిపై నెక్కి ◊యలరువింటి
దంట యమ్మౌనిఁ గదిసె దు◊ర్దాంతశారి,కాళి యాత్మైకబిరుదప◊ద్యములు చదువ. 79

టీక: అరిరాజ చిత్త భీకర కర కాండ ప్రచండిమన్ – అరిరాజ=శత్రురాజులయొక్క, చిత్త=మనసునకు, భీకర=భయంకరమగు, కర=హస్తమునందున్న, కాండ=బాణములయొక్క, ప్రచండిమన్=ప్రాబల్యముచేత; మనురాజమండలంబు – మను=వర్తించు, రాజమండలంబు=క్షత్త్రియబృందము; ఇచట అరిరాజ=శ్రేష్ఠమగు జక్కవలయొక్క, చిత్త=మనసునకు, భీకర=భయంకర మగు, కరకాండ=కిరణగణముయొక్క, ప్రచండిమన్=ప్రాబల్యముచేత, మను=వర్తించు,రాజమండలంబు=చంద్రమండలమని స్వభావార్థము దోఁచుచున్నది. క్రొందళంబులన్=క్రొత్తసేనలను; చాలన్=మిక్కిలి; కూర్చుక=జతపఱచుకొని; హరివితానములతోన్ =గుఱ్ఱపుగుంపులతో; జైత్రసేనావిభుండు=జయశీలుఁ డగు సేనాధిపతి; ఇచ్చట క్రొందళంబులన్=చిగురాకులను, కూర్చుకొని, హరివితానములతోన్ =శుకబృందములతో, చైత్రసేనావిభుండు = సేనాధిపతి యగు వసంతుఁ డని స్వభావార్థము దోఁచుచున్నది. కన్నులన్=కన్నులచేత, నెఱమంటన్=అధికమగు జ్వాలలను, క్రక్కుచున్=విడుచుచు, కలరుతుల్=కలిగినవీరాలాపములు, బెరయన్=వ్యాపింపఁగ, నానావనప్రియబలంబు=అనేకవిధము లగు చెంచుమూఁక; ఇచ్చట, కన్నులన్=కన్నులచేత, ఎఱ మంటన్=మంటివంటి యెఱుపును, క్రక్కుచున్=విడుచుచు, కలరుతుల్=అవ్యక్తమధుర మగు ధ్వనులు, బెరయన్=వ్యాపిం పఁగ, నానావనప్రియబలంబు=అనేకవిధము లగు కోయిలలగుంపు లని స్వభావార్థము దోఁచుచున్నది. కనకరజోరేఖన్=బంగరుపొడిరేఖచేతను; కనుపట్టు =చూపట్టుచున్న; వర=శ్రేష్ఠమైన; గంధపటిమన్=గర్వాతిశయముచేత, ‘గన్ధో కన్ధక ఆమోదే లేశే సమ్బన్ధ గర్వయోః’ అని విశ్వము; రాజిలు=ప్రకాశించు; మహాబలకులంబు – మహత్=అధికమగు, బల=సేనలయొక్క, కులంబు=గుంపు; ఇచ్చట, కనకరజోరేఖన్= సంపెఁగపుష్పములయొక్కపరాగశ్రేణిచేత, కనుపట్టు = చూపట్టుచున్న, వర=శ్రేష్ఠమైన, గంధ=పరిమళములయొక్క, పటిమన్=సారముచేత, రాజిలు=ప్రకాశించు, మహాబల = వాయువుయొక్క, కులంబు = సంఘ, మని స్వభావార్థము దోఁచుచున్నది. తొలుదొలుతన్=ముందుముందుగ; తీవ్రవిస్ఫూర్తిన్=అధిక మగు విజృంభణముతో; తొడరి=పూని; నడవన్=నడచుచుండఁగ; అలరువింటిదంట=మన్మథుఁడు; దుర్దాంతశారికాళి=నివారించుటకు శక్యముగాని గోరువంకలగుంపు; ఆత్మైకబిరుదపద్య ములు —ఆత్మ=తనయొక్క, ఏక=ముఖ్యమగు, బిరుదపద్యములు=జయచిహ్నములు గలపద్యములను; చదువన్= చదువుచుండఁగా; చిలుక మేల్పక్కిపై నెక్కి= మేలగు శుకవాహనము నెక్కి; అమ్మౌనిన్=ఆమునిని; కదిసెన్=సమీపించెను.

అనఁగా చంద్రుఁడు, సేనాపతి యగు వసంతుఁడు, కోయిలలు, మందమారుతము, అనేకసేనలతో ముందుముందు నడచు చుండఁగా మన్మథుఁడు శుకవాహనము నెక్కి, సామర్థ్యచిహ్నములు గల పద్యములు గోరువంకలు చదువుచుండఁగ, వసంత ముని మీఁదికిఁ బోయె నని తాత్పర్యము.

చ. అపుడు రణోత్సుకుం డగు సి◊తాంబుజసాయకుకంటిసన్నఁ గీ
రపటలి, చల్లగాడ్పు, తొవ◊రాయఁడు, కోయిలపౌఁజు, చైత్రుఁ, డ
చ్చపుఁదెలిఱెక్కపుల్గు, లని ◊సల్పఁగఁ జాలుదు నేనె నేనె యం
చపరిమితాగ్రహస్ఫురణ ◊నమ్మునిఁ జుట్టిరి సత్వరంబుగన్. 80

టీక: అపుడు =ఆసమయమందు; రణోత్సుకుం డగు =యుద్ధమునం దుత్సాహము గలవాఁడైన; సితాంబుజసాయకు=పద్మ బాణుఁడగు మన్మథునియొక్క; కంటిసన్నన్=కనుసంజ్ఞచేత; కీరపటలి=చిలుకలగుంపు; చల్లగాడ్పు=మందమారుతము; తొవరాయఁడు=చంద్రుఁడు; కోయిలపౌఁజు=కోకిలలసైన్యము; చైత్రుఁడు=వసంతుఁడు;అచ్చపుఁదెలిఱెక్కపుల్గులు=హంసలు; అనిన్=యుద్ధమును; చల్పఁగన్=చేయుటకు; నేనె నేనె చాలుదు నంచు=(అహమహమికతో)నేనొక్కడనే నేనొక్కడనే సరి పోదు ననుచు; అపరిమితాగ్రహస్ఫురణన్ – అపరిమిత=మితిలేని, ఆగ్రహ=కోపముయొక్క, స్ఫురణన్=ఆవిర్భావముచేత; సత్వరంబుగన్=వేగముగ; అమ్మునిన్=ఆవసంతర్షిని; చుట్టిరి =చుట్టుకొనిరి. అనఁగా రణోత్సుకుం డగు నాపంచ శరుఁడు కనుసైగఁజేయఁగ, శుకసమూహాదులు నేనొక్కఁడనే రణము సల్పుటకు సమర్థుఁడ ననఁగా నేనొక్కఁడనే రణము సల్పుటకు
సమర్థుఁడ ననుచు నహమహమికచే మునినిఁ జుట్టుముట్టి రనిభావము.

సీ. శైత్యవత్కరకుంత◊చటులధారారేఖ, శమినేత నాటించెఁ ◊జలువమిన్న,
తళుతళు క్కన వేగ ◊జళిపించి మావిక్రొం,దళపుఁ గత్తిని మౌని ◊నఱకె సురభి,
కడుఁ జంచరీకసం◊ఘము మ్రోయ ఘనజాల,కంబుల యతి మొత్తె ◊గడుసుగాడ్పు,
కటురజోగ్నికణాళి ◊గ్రమ్మఁ జెందొవమందు,తిత్తుల మునిఁ గప్పె ◊హత్తి యంచ,

తే. యిట్టు లాదిట్ట లందఱుఁ ◊జుట్టుముట్టి, గట్టితన ముట్టిపడ నురు◊క్షాంతికవచ
ధారి జడదారి నొప్పించి ◊ధైర్యలీల, నడఁప లేకున్కి గని మరుం ◊డపుడు గడఁగి. 81

టీక: చలువమిన్న=చంద్రుఁడు; శైత్యవ త్కర కుంత చటుల ధారారేఖన్ – శైత్యవత్=చల్లఁదనము గల, కర=కిరణము లనెడు, కుంత=ఈఁటెలయొక్క, చటుల=చలించుచున్న, ధారారేఖన్=వాదరచేతను; శమినేతన్=మునిపతిని; నాటించెన్=గ్రుచ్చెను; సురభి=వసంతుఁడు; తళుతళుక్కనన్=తళతళ మనునటుల; వేగ=శీఘ్రముగ; జళిపించి=ఆడించి; మావిక్రొందళపుఁ గత్తిని = మావిచిగురాకనెడు కత్తిచేత; మౌనిన్=మౌనిని; నఱకెన్=ఖండించెను; గడుసు=కఠినమైన; గాడ్పు=వాయువు; ఘనజాలకంబులన్=గొప్ప మొగ్గలనెడు లోహముద్గరసంఘములచేత; యతిన్ = మునిని; కడున్=మిక్కిలి; చంచరీక=తుమ్మెదలయొక్క; సంఘము=గుంపు; మ్రోయన్=ధ్వనిచేయుచుండఁగ; మొత్తెన్ = కొట్టెను; అంచ=హంస;కటురజోగ్నికణాళి – కటు=తీక్ష్ణమగు, రజః=పరాగ మనెడు, అగ్నికణాళి=మిడుఁగుఱుల గుంపు; క్రమ్మన్= పైకొనఁగ; జెందొవమందుతిత్తులన్= ఎఱ్ఱగలువ లనెడు మాదకద్రవ్యవిశేషము గల భస్త్రికలచేత; మునిన్=ఋషిని; హత్తి =చేరి; కప్పెన్=కప్పెను; ఇట్టులు=ఈప్రకారము; ఆదిట్ట లందఱున్ = ఆధైర్యవంతు లైన చంద్రాదు లందఱును; చుట్టుముట్టి=పరివేష్టించి; గట్టితనము= సామర్థ్యము; ఉట్టిపడన్= అతిశయింపఁగ; ఉరుక్షాంతికవచధారిన్ – ఉరు=అధికమగు, క్షాంతి=శమ మనెడు, కవచ=బొందల మును, ధారిన్=ధరించినవాఁడగు; జడదారిన్=మునిని; నొప్పించి=బాధించి; ధైర్యలీలన్=(మునియొక్క) ధైర్యవిలాసమును; అడఁప లేకున్కి=అడఁగఁజేయకుండుటను; కని =చూచి; అపుడు=ఆసమయమునందు; మరుండు=మన్మథుఁడు; కడఁగి = ప్రయత్నించి. దీని కుత్తరపద్యస్థక్రియతో నన్వయము.

చంద్రుఁడు కిరణములను కుంతములచేతను, వసంతుఁడు చూతపల్లవ మను తరవారిచేతను, మలయానిలము మొగ్గలను నినుపగుదియలచేతను, అంచ చెందొవలను మందుతిత్తులచేతను బాధించియు శమ మను కవచమును ధరించిన శమినేత ధైర్యము నడఁపలేకుండుటంజూచి మదనుఁడు (ముందుచెప్పఁబోవు) పద్మముకుళాస్త్రములను మునిపై నించెనని భావము.

చ. చనని నవాగ్రహస్ఫురణఁ ◊జక్కెరవిల్తుఁడు తేజి బోరునన్
మునిపతిమీఁద నూకి కడు◊ముట్టక మ్రోయుగొనంబు తుంటవిం
ట నొనరఁ గూర్చి చంద్రఋతు◊నాథులు గన్గొని యౌర! మేలు మే
లనఁ బరితేజితాబ్జముకు◊ళాస్త్రపరంపర నించె నుద్ధతిన్. 82

టీక: చక్కెరవిల్తుఁడు=మారుఁడు; చనని నవాగ్రహస్ఫురణన్=వీడని నూతనక్రోధముయొక్క స్ఫురణచేతను; తేజిన్ =గుఱ్ఱ మగు శుకమును; బోరునన్=బోరను ధ్వని గలుగునటులు; మునిపతిమీఁదన్=ఋషిమీఁదను; నూకి=త్రోలి; కడున్=మిక్కిలి; ముట్టక=తాఁకకయే; మ్రోయుగొనంబు=మొరయుచున్న యల్లెత్రాటిని; తుంటవింటన్=చెఱకువింటియందు; ఒనరన్=అను కూలముగ; కూర్చి=జతపఱచి; చంద్రఋతునాథులు=చంద్రుఁడు, వసంతుడును; కన్గొని=చూచి; ఔర=ఆశ్చర్యము;మేలు మేలనన్=మేలు మేలని ప్రశంసింపఁగ; పరితేజిత=చికిలిపెట్టఁబడిన; అబ్జముకుళ=తామరమొగ్గ లనెడు; అస్త్ర=తూపులయొక్క; పరంపరన్=గుంపును; ఉద్ధతిన్=వేగముచేత; నించెన్=కప్పెను.

అనఁగా మన్మథుఁడు తనగుఱ్ఱమును మునిమీఁదికి విడిచి, తనంతటనె మొరయుచున్న యల్లెత్రాటిని (అనఁగా తుమ్మెద బారు ననుట) చెఱకువింట నెక్కిడి చంద్రాదులు పొగడఁగ పద్మబాణములు మునిపై నించె నని భావము.

చ. మదనబిసప్రసూనశర◊మండలి యాజడదారిసామిపే
రెద వడిఁ దాఁకునత్తఱిఁ ద◊దీయపరాగము చిందుటల్ స్తవా
స్పద మయి వొల్చె తద్విశిఖ◊జాలసమాహతిభిన్నమౌనిరా
జదృఢరమేశ భక్తికవ◊చస్ఫుటచూర్ణమనీష దార్చుచున్. 83

టీక:మదనబిసప్రసూనశరమండలి – మదన=మన్మథునియొక్క, బిసప్రసూన=పద్మములను,శరమండలి=తూఁపులగుంపు; ఆజడదారిసామి=ఆమునిరాజుయొక్క; పేరెదన్=విశాల మగు ఱొమ్మును; వడిన్=వేగముగ; తాఁకునత్తఱిన్=తాఁకునప్పుడు; తదీయపరాగము=ఆతామరపూదూఁపుపుప్పొడి; చిందుటల్=రాలుటలు; త ద్విశిఖజాల సమాహతి భిన్న మౌనిరాజ దృఢ రమేశ భక్తికవచ స్ఫుట చూర్ణమనీషన్ – తత్=ఆమన్మథునియొక్క, విశిఖజాల=బాణసమూహముయొక్క, సమాహతి= కొట్టుటచేత, భిన్న=బ్రద్దలయిన, మౌనిరాజ=ఋషిరాజుయొక్క,దృఢ=గాఢమయిన,రమేశభక్తి=విష్ణుభక్తి యనెడు, కవచ= బొందళముయొక్క, స్ఫుట=వ్యక్తమగు, చూర్ణ =పొడియొక్క, మనీషన్=బుద్ధిని; తార్చుచున్=కలుగఁజేయుచు; స్తవాస్పద మయి=స్తుతి కర్హమయి; పొల్చెన్=ఒప్పెను.

మన్మథుని పద్మబాణసమూహము మునీశ్వరుని ఱొమ్మును దాఁక, నాసమయమం దాపద్మబాణపరాగము చిందుటలు మన్మథబాణములచే భేదింపఁబడిన విష్ణుభక్తి యనెడు కవచముయొక్కపొడి యను భ్రమను కలిగించె నని భావము.

చ. వరజవశక్తిచేఁ బలుకు◊వాల్దొరపేరెదఁ దాఁకి తాఁకునం
బరిహృతకుట్మలాత్మ మగు ◊మారునితామరమొగ్గముల్కి ని
బ్బరముగఁ బర్వఁ దద్రసము ◊భాసిలె తన్మునిధైర్యజీవనో
త్కరములు పీల్చి వెగ్గలము◊గాఁగఁ గడున్ వెడలించుపోలికన్. 84

టీక: వరజవశక్తిచేన్—వర=శ్రేష్ఠమగు, జవ=వేగముయొక్క, శక్తిచేన్=సామర్థ్యముచేత; పలుకువాల్దొర=మునిరాజుయొక్క; పేరెదన్=విపులమగు వక్షమును; తాఁకి =తగిలి; తాఁకునన్=తాఁకుటచేత; పరిహృతకుట్మలాత్మము—పరిహృత=పోఁగొట్టఁ బడిన, కుట్మలాత్మము=కోరకావస్థగలది; అగు=ఐనట్టి; మారునితామరమొగ్గముల్కి=మన్మథుని పద్మకోరకబాణము; నిబ్బరముగన్=అధికముగ; తద్రసము =దానియొక్క మకరందము; పర్వన్=వ్యాపింపఁగ; తన్మునిధైర్యజీవనోత్కరములు – తన్ముని =ఆమునియొక్క, ధైర్య=ధైర్య మనెడు, జీవన=ఉదకముయొక్క, ఉత్కరములు=సమూహములను; పీల్చి=త్రావి; వెగ్గలముగాఁగన్=మిక్కుటము కాఁగ; కడున్=మిక్కిలి; వెడలించుపోలికన్ =పైకి వెళ్ళఁగ్రక్కురీతిగ; భాసిలెన్=ప్రకాశించెను.

అనఁగా నతివేగముగ తామరమొగ్గతూఁపు జడదారియెడ దాఁకి కోరకభావము వీడి మకరందము కాఱఁగా నది యా మునిధైర్య మను నుదకమును ద్రావి యధిక మగుటచే వెడలఁగ్రక్కురీతి భాసిలె నని భావము.

చ. అచలసమాధియోగగతి ◊నందిన యమ్మునిఁ జెందదయ్యె న
వ్యచలనరేఖ యప్పు డస◊మాశుగకాండము పర్వినం గరం
బచలసమాధియోగగతి ◊నందిన యమ్ముని నెట్లు చెందు న
వ్యచలనరేఖ యెంత యస◊మాశుగకాండము పర్వినన్ మహిన్. 85

టీక: అప్పుడు=ఆసమయమందు; కరంబు=మిక్కిలి; అసమాశుగ=మన్మథునియొక్క;కాండము =బాణము, జాత్యేకవచన ముగా నిది ప్రయోగింపఁబడినది; పర్వినన్=వ్యాపించినను; అచలసమాధియోగగతిన్ – అచల=చలింపని, సమాధి=చిత్తవృత్తి నిరోధముచే నైన, యోగగతిన్=ధ్యానగతిని; అందిన=పొందినట్టి; అమ్మునిన్=ఆజడదారిని; నవ్యచలనరేఖ=నూతన మగు చాంచల్యపరంపర; చెందదయ్యెన్=పొంద దయ్యెను; అచలసమాధియోగగతిన్ – అచలసమ=పర్వతసమాన మగు, అధి యోగ=ధ్యానముయొక్క, గతిన్ =రీతిని; అందిన=పొందినట్టి; అమ్మునిన్=ఆతపసిని; ఎంత=ఎంతకాలము; అసమ= సాటి లేనిదగు, ఆశుగకాండము =వాయుబృందము; పర్వినన్=వ్యాపించినను; మహిన్=భూమియందు; నవ్యచలనరేఖ=నూతన మగు చాంచల్యపరంపర; ఎట్లు=ఏరీతి; చెందున్=పొందును? అనఁగా లోకమందు వాయుసంఘము పర్వతమును జలింపఁ జేయనట్లు చలింపని సమాధియోగమందున్న యామునిని మన్మథుని బాణబృందము చలింపఁజేయఁజాల దయ్యెనని భావము.

మ. తనకంజాతశరంబు లిట్లు మునిచం◊ద్రస్ఫీతతేజంబుచే
వనవీథిన్ వికలత్వ మొందఁ గని దు◊ర్వారావలేపక్రమం
బున నాకంతుఁడు కేలుదోయిఁ గొని నే◊ర్పుల్ మీఱఁ బూమొగ్గనే
జను దద్వక్షము గుప్పునం బొడిచె నో◊జం జైత్రుఁ డౌనౌ యనన్. 86

టీక: తనకంజాతశరంబులు=తనసంబంధు లగు పద్మబాణములు; మునిచంద్ర స్ఫీత తేజంబుచేన్ – మునిచంద్ర=మునిచంద్రుని యొక్క, స్ఫీత=అధికమగు,తేజంబుచేన్=కాంతిచేత; ఇట్లు=ఈప్రకారము; వనవీథిన్=అడవియందు; వికలత్వము=నిరర్థక త్వమును; ఒందన్=పొందఁగ, ఇచట ముని యనెడు చంద్రునికాంతిచే, వనవీథిన్=ఉదకమందు, కమలములు వికలత్వము ననఁగా ముకుళనమును పొందె నను నర్థము స్ఫురించుచున్నది; కని=చూచి; దుర్వా రావలేప క్రమంబునన్ — దుర్వార = నివారించుట కశక్యమైన, అవలేప=గర్వముయొక్క, క్రమంబునన్=రీతిచేత; ఆకంతుఁడు =ఆమన్మథుఁడు; పూ మొగ్గనేజను =పూమొగ్గ యను తోమరమును; కేలుదోయిన్=రెండుచేతులచే; కొని =తీసి; నేర్పుల్=చాతుర్యములు; మీఱన్=అతిశయిం పఁగ; తద్వక్షము=ఆమునిఱొమ్మును; గుప్పునన్=శీఘ్రముగ; చైత్రుఁడు=వసంతుఁడు; ఔనౌ యనన్=పొగడఁగ; ఓజన్ = ఉత్సాహముతో; పొడిచెన్=గ్రుచ్చెను. అనఁగా మన్మథుఁడు తనపద్మబాణములు వ్యర్థములు కాఁగానే యమోఘ మగు పూమొగ్గ యను తోమరముతో మునిం బొడిచె నని భావము.

చ. దళ మగు రోస మెచ్చఁ దన◊తత్తడి నోరగఁ బోవఁ జేసి ని
స్తులపథికాసృగక్త మను◊సొంపున రోహితదీప్తిజాతముల్
గలయఁగ మించు నూతనప◊లాశసుమం బను బాగుదారచేఁ
జలమున నయ్యతిన్ నఱకె ◊సారససాయకవీరుఁ డంతటన్. 87

టీక: అంతటన్ =అటుపిమ్మట; సారససాయకవీరుఁడు=మన్మథవీరుఁడు; దళము=అధికము; అగు రోసము=అయినట్టి కోపము; ఎచ్చన్=అతిశయింపఁగ; తనతత్తడిన్=తనవాహనమైన చిలుకను; ఓరగన్=ప్రక్కకు; పోవన్=పోవునటులు; చేసి =ఒనర్చి; నిస్తులపథికాసృగక్తము – నిస్తుల=నిస్సమాన మగు, పథిక=విరహులయొక్క, అసృక్=రక్తముచే; అక్తము = పూయఁబడినది; అను సొంపునన్=అనువిధంబున; రోహితదీప్తిజాతముల్—రోహిత=ఎఱ్ఱనైన, దీప్తి=కాంతులయొక్క, జాత ముల్=పుంజములు; కలయఁగన్=వ్యాపింపఁగా; మించు =అతిశయించు; నూతన=క్రొత్త; పలాశసుమం బను = మోదుగపూ వను; బాగుదారచేన్=చూరకత్తిచేత; చలమునన్=మాత్సర్యముచేత; అయ్యతిన్=ఆమునిని; నఱకెన్= ఖండించెను.

అనఁగా మన్మథుఁడు క్రోధ మతిశయింపఁగ తనవాహనము నొకప్రక్కకుఁ దోలి, పథికులరక్తముచేఁ దడిసినదో యన నెఱ్ఱనగు మోదుగుసుమ మను చూరకత్తిచే మునిని నఱకె నని భావము.

చ. మునిపతి కేమిటన్ జుఱుకు◊ముట్టకయుండినఁ గాంచి తేజి చ
య్యన డిగి యప్డు నైకనిశి◊తాయుధజాతము పూని మిక్కిలం
గనుఁగొనలన్ రుషానలశి◊ఖాతతి పర్వ మరుండు చంద్రచం
దనపవమానముఖ్యవృతిఁ ◊దా నడచెన్ యతిమీఁది కుద్ధతిన్. 88

టీక: మునిపతికి=జడదారిసామికి; ఏమిటన్=ఏయస్త్రముచేతను; చుఱుకు ముట్టక=వేఁడితాఁకక; ఉండినన్=ఉండఁగ; కాంచి = చూచి; తేజి=గుఱ్ఱమునుండి; చయ్యనన్=శీఘ్రముగా; డిగి =దిగి; అప్డు =ఆసమయమునందు; నైక నిశి తాయుధ జాతము – నైక=అనేకములైన, నిశిత=తీక్ష్ణములైనట్టి, ఆయుధ=కుంతాద్యాయుధములయొక్క, జాతము=సమూహమును; పూని = గ్రహించి; మిక్కిలన్=అతిశయించునట్లు; కనుఁగొనలన్=నేత్రాంతములయందు; రుషానల శిఖా తతి – రుషానల=కోపాగ్ని యొక్క, శిఖా=జ్వాలలయొక్క, తతి=సమూహము; పర్వన్= వ్యాపించుచుండఁగ; మరుండు=మన్మథుఁడు; చంద్ర
చందన పవమాన ముఖ్య వృతిన్ – చంద్ర=చంద్రుఁడు, చందనపవమాన =మలయానిలము, ముఖ్య=ఆదిగాఁగలవారియొక్క, వృతిన్=మేళనముచేతను; తాన్=తాను (మన్మథుఁడు); ఉద్ధతిన్=గర్వముచేత; యతిమీఁదికిన్=మునిమీఁదికి; నడచెను.

క. నడచి యళిఘంటికాధ్వని, యడరఁ బరాగాగ్నికణచ◊యంబులు వెడలం
గడు నమరురాగసుమ మను, బెడిదం బగు శక్తి వైచె ◊భీకరలీలన్. 89

టీక: నడచి =గమించి; అళి ఘంటికా ధ్వని—అళి=తుమ్మెదలను, ఘంటికా=చిఱుగంటలయొక్క, ధ్వని=నాదము; అడరన్ =అతిశయింపఁగ; పరాగాగ్నికణచయంబులు – పరాగ=పుప్పొడియనెడు, అగ్నికణ=స్ఫులింగములయొక్క,చయంబులు =సమూహములు; వెడలన్=బయలుదేఱుచుండఁగ; కడునమరురాగసుమము – కడున్=మిక్కిలి, అమరు=ఒప్పియున్న, రాగసుమము=బంధూకపుష్పము; అను=అనెడు; బెడిదం బగు=సమర్థమైన; శక్తి న్ =శక్తిని; భీకరలీలన్=భయంకరమగు క్రియచేతను, ‘లీలా విలాస క్రియయోః’ అని యమరుఁడు; వైచెన్=వేసెను. అనఁగా భృంగధ్వని యనెడు చిఱుగంటలధ్వని చేతను, పుప్పొడి యను నగ్నికణములచేతను నొప్పు మంకెనపుష్పమను శక్తిని (శక్త్యాయుధమును) మునిపైకి వేసెనని భావము.

ఉ. దాన నొకింతయున్ విధృతిఁ ◊దాల్పని యాదమినేతఁ జూచి, త
త్సూనశరుండు బీరమున ◊శూరత యుట్టిపడంగ నయ్యెడన్
మానితపారిజాతసుమ◊నఃకలికాగద కేల నెత్తి, య
మ్మౌనిని మోఁదె దివ్యకుసు◊మప్రతతుల్ మరుదాళి నింపఁగన్. 90

టీక: దానన్ = ఆశక్తి యను నాయుధముచేత; ఒకింతయున్ = కొంచెమయినను; విధృతిన్ = అధైర్యమును; తాల్పని = ధరింపనట్టి; ఆదమినేతన్=ఆమునిరాజును; చూచి=అవలోకించి; తత్సూనశరుండు=ఆమన్మథుఁడు; బీరమునన్=పరాక్ర మముచేత; శూరత=శౌర్యము; ఉట్టిపడంగన్=అతిశయింపఁగా; అయ్యెడన్=ఆసమయమందు;మానిత పారిజాతసుమనః కలికాగద – మానిత=శ్రేష్ఠమగు, పారిజాతసుమనః=పారిజాతపుష్పముయొక్క, కలికా=మొగ్గ యనెడు, గద=గదాయుధ మును; కేలన్ ఎత్తి=హస్తముతో నెత్తి; మరుదాళి=దేవసంఘములు; దివ్యకుసుమప్రతతుల్ – దివ్య=స్వర్గమందున్న, కసుమ = పుష్పములయొక్క,ప్రతతుల్=సమూహములను; నింపఁగన్=నిండించుచుండఁగ; అమ్మౌనిని=ఆమునిని; మోఁదెన్=కొట్టెను.

ఆముని శక్తి యను నాయుధమునకు ధైర్యము చెడకయుండుటం జూచి, మరుఁడు శౌర్యముతో పారిజాతకోరక మను గదతో నతని మోఁదె నని భావము.

ఉ. అందుల కింతయుం జలన◊మందనిపెంపున కబ్బురం బెదం
జెంది, ప్రసూనకోశతటిఁ ◊జెల్వగు గేదఁగిఱేకుఁజిక్కటా
రంది, యనూనరోషగతి ◊నమ్మునిఁ గ్రుమ్మె మరుండు శాంకరా
మందమనోధృతిక్షపణ◊మాన్యభుజాబలరేఖ హెచ్చఁగన్. 91

టీక: అందులకున్=ఆగదాయుధప్రహారమునకు; ఇంతయున్=ఇంచుకైనను; చలనమందని=చలింపని; పెంపునకున్= మహ త్త్వమునకు; అబ్బురంబు=ఆశ్చర్యము; ఎదన్=హృదయమందు; చెంది=పొంది; ప్రసూనకోశతటిన్ – ప్రసూన=పూవనెడు, కోశ=ఒరయొక్క, తటిన్=ప్రదేశమందు; చెల్వగు గేదఁగిఱేకుఁ జిక్కటారు – చెల్వగు=అందమైన, గేదఁగిఱేకు=కేతకీదళ మనెడు, చిక్కటారు=చూరకత్తిని; అంది=పొంది; అనూనరోషగతిన్ – అనూన=తక్కువకాని, రోష=క్రోధముయొక్క, గతిన్= ప్రాప్తిచేత; మరుండు =మన్మథుఁడు; అమ్మునిన్=ఆమునిని; శాంక రామంద మనోధృతి క్షపణ మాన్య భుజాబల రేఖ – శాంకర=శంకరునికి సంబంధించిన, అమంద=అధికమగునట్టి,మనోధృతి=మనస్థైర్యముయొక్క, క్షపణ=పోగొట్టుటచేత, మాన్య=పొగడఁదగిన, భుజాబల=భుజబలముయొక్క,రేఖ=విలాసము; హెచ్చఁగన్=అతిశయింపఁగ; క్రుమ్మెన్=పొడిచెను.

అనేకవిధము లగు నస్త్రములకు చలనమందకయున్న మునిశక్తికి మనమున నబ్బుర మంది, యామరుండు వెతకి కేతకీ దళమను కటారు గొని మునిని పొడిచె నని భావము.

చ. సరసబలంబు గొల్వ సుమ◊సాయకుఁ డంతటఁ బోక మౌని డా
సి రమణ మొగ్గ యన్ గుదియఁ ◊జేకొని మొత్తి ప్రవాళ మన్మహా
పరశువుఁ బూని వే యడిచి ◊బాగగు మంకెనవంకిఁ బట్టి ప
ల్తరములఁ గ్రుమ్మి యార్చె హిమ◊ధాముఁడు గన్గొని మెచ్చ నయ్యెడన్. 92

టీక: సుమసాయకుఁడు=మన్మథుఁడు; సరసబలంబు – సరస=శ్రేష్ఠమగు, బలంబు=సేన; కొల్వన్=సేవింపఁగా; అంతటఁ బోక = అంతటితో నిలువక; మౌనిన్=మునిని; డాసి=సమీపించి; రమణన్=ఆసక్తిచేత; మొగ్గ యన్ గుదియన్=కోరకమను గదను; చేకొని=గ్రహించి;మొత్తి=కొట్టి; ప్రవాళమన్మహాపరశువున్=చిగురనునట్టి గొప్పగండ్రగొడ్డలిని; పూని=గ్రహించి; వే=వేగముగ; అడిచి =కొట్టి; బాగగు మంకెనవంకిన్= శ్రేష్ఠమగు బంధూకమనెడు బాకును; పట్టి=పట్టుకొని; పల్తరములన్=అనేకరీతులచే; అయ్యెడన్=ఆసమయమందు; హిమధాముఁడు=చంద్రుఁడు; కన్గొని =చూచి; మెచ్చన్=మెచ్చుకొనునట్లు; క్రుమ్మి = పొడిచి; ఆర్చెన్=అఱచెను.

మరుఁడు పలువిధములైన ఆయుధములను ప్రయోగించినను ముని చలింపకుండుటఁ జూచి, మునిని సమీపించి, మొగ్గ యను గుదియతో మొత్తి, చిగురా కనుపరశువుతోఁ గొట్టి, మంకెన యనుబాఁకుతోఁ బొడిచె నని భావము.

తే. ఇట్టు లమ్మారుఁ డమ్ముని ◊నెనసి యని ఘ
టించు నవ్వేళ నిది వేళ◊యంచుఁ దలఁచి
చిత్రరేఖావధూటి వి◊చిత్రరీతి
శమి కనతిదూరమున సఖీ◊జనము గొలువ. 93

టీక: ఇట్టులు= ఈప్రకారము; అమ్మారుఁడు=ఆమన్మథుఁడు;అమ్మునిన్=ఆమునిని; ఎనసి=కలసి; అనిన్= యుద్ధమును; ఘటించు నవ్వేళన్=చేయునట్టి యాసమయమందు; ఇది వేళ యంచున్=ఇది తగిన సమయమనుచు; తలఁచి=స్మరించి; చిత్రరేఖావధూటి=చిత్రరేఖ యను దేవాంగన; విచిత్రరీతిన్=ఆశ్చర్యమగువిధముచే; శమికి=మునికి; అనతిదూరమునన్= సమీపమందు; సఖీజనము=చెలికత్తెలు; కొలువన్=సేవింపఁగా. తిలకాళి దిలకించు నను నుత్తరపద్యస్థక్రియతో నన్వయము.

సీ. తిలకాళిఁ దిలకించుఁ ◊జెలి పెండ్లితఱిఁ గాంచు,తెఱఁగు తపస్వికిఁ ◊దెలుపుకరణి,
గోఁగుచెంగటఁ బల్కుఁ ◊గోమలి ప్రియములు, పలుకుటల్ దపసికిఁ ◊దెలుపుకరణి,
మావిపైఁ గరముంచు ◊మగువ కళాస్థాన,మలముటల్ మౌనికిఁ ◊దెలుపుకరణిఁ,
గ్రోవిఁ గౌఁగిటఁ దార్చుఁ ◊గుముదాక్షిపరిరంభ,కలనంబు యోగికిఁ ◊దెలుపుకరణి,

తే. నిట్టు లప్పారికాంక్షి క◊హీనమదన,తంత్రవిజ్ఞానగరిమను ◊దరుణి దెలుప
వల్లి దోహదచర్య దై◊వాఱ నపుడు, హాళి దళుకొత్తఁ దద్వనీ◊కేళి సలిపె. 94

టీక: చెలి=చిత్రరేఖ; పెండ్లితఱిన్=వివాహసమయమందు; కాంచు తెఱఁగున్=చూచునట్టి రీతిని; తపస్వికిన్=జడదారికి; తెలుపు కరణిన్=తెలియఁజేయు రీతిగ; తిలక=బొట్టుగుచెట్లయొక్క; ఆళిన్=పంక్తిని; దిలకించున్=చూచెను. కోమలి=చిత్రరేఖ; ప్రియములు పలుకుటల్ =ప్రియోక్తులు పలుకురీతిని; తపసికిన్=మునికి; తెలుపుకరణిన్=తెలియఁజేయు రీతిగా; గోఁగు=కర్ణికారముయొక్క; చెంగటన్= సమీపమందు; పల్కున్=పలికెను.మగువ =దేవాంగన; కళాస్థానము=కామశాస్త్రప్రసిద్ధమగు కళాస్థానమును; అలముటల్=ఆక్రమించుటలు, స్పృశించుటలను అనుట; మౌనికిన్=తపసికి; తెలుపుకరణిన్=తెలియఁజేయురీతిగ; మావిపైన్=చూతవృక్షము మీఁద; కరము=హస్తమును; ఉంచున్=ఉంచెను. కుముదాక్షి=చిత్రరేఖ; పరిరంభ=కౌఁగిలింతయొక్క; కలనంబు =చేయుటను; యోగికిన్=మునికి; తెలుపుకరణిన్=తెలియఁ
జేయు నటుల; క్రోవిన్=కురువకమును; కౌఁగిటన్=భుజాంతరమందు; తార్చున్=చేర్చెను. ఇట్టులు=ఈప్రకారముగ; అప్పారికాంక్షికిన్=ఆమునికి; అహీన మదనతంత్ర విజ్ఞాన గరిమను – అహీన=అధికమగు, మదన తంత్ర=కామశాస్త్రముయొక్క; విజ్ఞాన=తెలివియొక్క; గరిమను=అతిశయమును; తరుణి=వనిత(చిత్రరేఖ); తెలుపన్=తెలియఁ జేయుటకు; వల్లి దోహదచర్య – వల్లి=తీవలయొక్క, దోహదచర్య=దోహదములయొక్క క్రియ; దైవాఱన్=అతిశయింపఁగ; అపుడు=ఆసమయమున; హాళి =ఉత్సాహము; తళుకొత్తన్=అతిశయింపఁగ; తద్వనీకేళి=ఆవనమునందలి విహారమును; సలిపెన్= ఒనరించెను.

ఇందు దోహద మనఁగాఁ దరుగుల్మలతాదుల కకాలమున ఫలపుష్పదాయక క్రియావిశేషము. ‘తరుగుల్మలతాదీనా మకాలే ఫలపుష్పయోః, ఆధానాయక్రియా యాస్యా త్స దోహద ఇతీర్యతే’ అని తల్లక్షణము. ‘ఆలిఙ్గనా త్కురవక శ్చమ్పకో ముఖదర్శనాత్, చూతో యోషిత్కరస్పర్శా త్తిలకో దృక్ప్రసారణాత్, ఆకర్ణనా త్కర్ణికార స్త్వశోకః పాద తాడనాత్’ ఇత్యాది గా దోహదవిశేషములు దెలియవలయు.

సీ. దమి దీన నైనఁ జి◊త్తము బయల్పఱచునో, యని సంచరించు న◊భ్యర్ణపదవి,
ముని దీననైన నూ◊తనరక్తిఁ దాల్చునో, యని పాడుఁ దేనియల్ ◊చినుకుపాట,
శమి దీననైన ని◊శ్చలభావ ముడుపునో, యని పొదల్ దూఱు ల◊తాళి గదల,
యతి దీననైన ధై◊ర్యముఁ బాయఁ జేయునో, యని పల్కు సఖుల నొ◊య్యారి పలుకు,

తే. నియమి దా దీననైనఁ గ◊న్విప్పు నొక్కొ, యని మసలు దండ రాసాప్తి ◊నాళియుక్తి,
నైన నానాతి చిత్రచ◊ర్యానిరూఢిఁ, దాపససమాధివైఖరి ◊దఱుఁగ దయ్యె. 95

టీక: దమి=మునివర్యుఁడు; దీన నైనన్=దీనిచేతనైనను; చిత్తము=మనసును; బయల్పఱచునోయని=తెలియఁబఱచునా యని; అభ్యర్ణపదవిన్=సమీపస్థానమందు; సంచరించున్=తిరుగును.
ముని=జడదారి; దీన నైనన్=దీనిచేతనైనను; నూతనరక్తిన్=నూతన మగు ననురాగమును; తాల్చునో యని = వహించునా యని; తేనియల్చినుకుపాట= మకరందమును గురియు గీతమును; పాడున్=పాడును.
శమి =జడదారి; దీన నైనన్=దీనిచేతనైనను; నిశ్చలభావము=నిశ్చలత్వమును; ఉడుపునో యని =విడుచునా యని; లతాళి =తీవలగుంపులు; కదలన్=కదలునటులు; పొదల్=కుంజములను; తూఱున్=ఈఁగును.
యతి=మునిరాజు; దీన నైనన్=దీనిచేతనైనను; ధైర్యమున్ =ధృతిని; పాయఁ జేయునోయని =విడుచునా యని; సఖులన్= చెలికత్తెలతో; ఒయ్యారి పలుకు=విలాసోక్తిని; పల్కున్=వచించును.
నియమి=జడదారి; తాన్=తాను; దీన నైనన్=దీనిచేతనైనను; కన్విప్పు నొక్కొయని =కనులు దెఱచునా యని; దండన్= సమీపమందు; ఆళియుక్తిన్=సకియలతోడికూడికచేతను; రాసాప్తిన్—రాస=కోలాటముయొక్క; ఆప్తిన్=ప్రాప్తిచేత; మసలున్=విహరించును; ఐనన్=అయినను; ఆనాతిచిత్రచర్యానిరూఢిన్—ఆనాతి=ఆదేవాంగనయొక్క, చిత్రచర్యా= విచిత్ర కార్యములయొక్క, నిరూఢిన్ = అతిశయముచేత; తాపససమాధివైఖరి =మునిమనస్థైర్యముయొక్క రీతి; తఱుఁగ దయ్యెన్ = తక్కువపడ దయ్యెను.

చిత్రరేఖ ముని హృదయమును దెలుపునా యని సమీపమందు సంచరించినను, అనురాగమును పూనునా యని రమణీయగానముఁ జేసినను, చలించునా యని లతలు గదలఁ బొదలు దూఱినను, ధైర్యమును విడుచునా యని సఖులతోఁ బ్రియో క్తులు పలికినను, కనులనైన విప్పునా యని సకియలఁగూడి కోలాట మాడినను, కొంచెమైనను మునియొక్క సమాధి తక్కువ గాలేదని భావము.

ఉ. ఆయతిలోకమౌళిహృద◊యంబు బయల్పడ కున్కి గాంచి యా
తోయజనేత్ర యాళితతి◊తో మునిసన్నిధిఁ జేరి జాళువా
కాయలవీణె గైకొని త◊గన్ శ్రుతిఁ గూర్చి యొయార మెచ్చఁగా
నాయెడ నేర్పు మించ గమ◊పాదికపుంఖణ మూన్చి వేడుకన్. 96

టీక: ఆయతిలోకమౌళిహృదయంబు =ఆమునిరాజుయొక్క చిత్తము; బయల్పడక=వెల్వడక; ఉన్కి=ఉండుటను; కాంచి =చూచి; ఆతోయజనేత్ర =ఆచిత్రరేఖ; ఆళితతితోన్=సకియలగుంపుతో; మునిసన్నిధిన్=యతిసమీపమును; చేరి=పొంది; జాళువాకాయలవీణెన్=బంగరుకాయలు గల వీణెను; కైకొని =గ్రహించి; తగన్ =ఒప్పునటులు; శ్రుతిన్=స్వరముల కారంభక మైన సుతిని, ‘స్వరా శ్శ్రుతిభ్య స్సంజాతాః’ అని సంగీతరత్నాకరము; కూర్చి= కలుగఁజేసి; ఒయారము=విలాసము; ఎచ్చఁగాన్=అతిశయింపఁగా; ఆయెడన్=ఆసమయమందు; నేర్పు=నైపుణ్యము; మించన్=అతిశయించునటులు; వేడుకన్ =సంతోషముతో; గమపా దికపుంఖణము – గ=గాంధారము, మ=మధ్యమము, ప=పంచమము, ఆదిక=మొదలుగాఁ గల, స్వరములయొక్క, పుంఖణము=మూర్ఛనను, స్వరారోహావరోహక్రమము ననుట. గమపాద్యక్షరములు గాంధారాదిస్వర వాచకము లనుట సంగీతశాస్త్రమందు సంకేతింపఁబడినది; ఊన్చి=చేసి. దీనికి వీణె వాయించె నను ఉత్తరపద్యస్థక్రియతో నన్వయ మని తెలియవలయును. అనఁగా నామునివర్యునియొక్క యాశయము దెలియక చిత్రరేఖ సకియలతోఁ గూడి, యా మునిసన్నిధిం జేరి, బంగరు కాయలు గల మంచివీణను దీసికొని సుతిచేసి, గమపాదిస్వరముల వాయించె నని భావము.

సీ. ఘనమార్గవిభవంబు ◊వనితవేణినె గాదు, శ్రుతిపర్వరాగసం◊తతి నెసంగె,
సమతాళవిస్ఫూర్తి ◊సతిగుబ్బలనె గాదు, నవ్యగీతప్రతా◊నముల నెనసెఁ,
గలహంసవైఖరి ◊చెలిగతులనె గాదు, సరసప్రబంధపుం◊జమునఁ దోఁచెఁ,
బల్లవంబులపెంపు ◊పడఁతికేలనె గాదు, సొగసైనపదపాళి ◊సొంపు పూనె,

తే. ననుచు వనదేవతాజనం ◊బభినుతింప, రక్తివిధమును దేశీయ◊రాగగతియుఁ,
జిత్రతరమంద్రరాగజ◊శ్రీలు వెలయ, నింతి మునిచెంత వీణె వా◊యించె నంత. 97

టీక: ఘనమార్గవిభవంబు – ఘనమార్గ=ఆకసముయొక్క, విభవంబు=నైల్యము, లేదా, ఘన=మేఘముయొక్క, మార్గ= కస్తురియొక్క, విభవంబు=నైల్యము; వనితవేణినెగాదు – వనిత=చిత్రరేఖయొక్క, వేణినె కాదు=జడయందే కాదు; శ్రుతిపర్వ రాగసంతతిన్ – శ్రుతిపర్వ=చెవుల కింపగు, రాగ=భైరవి, తోడి మొదలగు రాగములయొక్క, సంతతిన్=సమూహమందు; ఎసంగెన్=ఒప్పెను; ఘనమార్గవిభవంబు – ఘనమార్గ=గొప్పదైన సంగీతభేదముయొక్క, విభవంబు=అతిశయము, రాగసం తతి నెసంగె నని యర్థము. మార్గము, దేశి యని సంగీతము రెండువిధములు. మహేశునియొద్దనుండి బ్రహ్మాదులచేఁ దేఁబడి, భరతాదులచేఁ బ్రకటింపఁబడినది మార్గము. దేశదేశమునందు భిన్నముగాఁ బ్రచారము గలది దేశి యని తెలియునది. సమతాళవిస్ఫూర్తి – సమ=సమానమగు, తాళ=తాళఫలములయొక్క,విస్ఫూర్తి =అతిశయము; సతిగుబ్బలనె గాదు = చిత్ర రేఖయొక్క స్తనములందే కాదు; నవ్యగీతప్రతానములన్ – నవ్య=నూతనమగు, గీత=గానముయొక్క,ప్రతానములన్=పుంజ ములను; ఎనసెన్=పొందెను; సమతాళవిస్ఫూర్తి – సమ=సమగతి గల చంచత్పుటాదితాళములయొక్క,విస్ఫూర్తి =అతిశ యము, గీతప్రతానముల నెనసె నని యర్థము. కలహంసవైఖరి – కలహంస=రాయంచయొక్క, వైఖరి=గతివిశేషము; చెలిగతులనె గాదు=చిత్రరేఖయొక్క నడకలయందే కాదు; సరసప్రబంధపుంజమునన్ తోఁచెన్= ‘చతుర్భిర్ధాతుభి ష్షడ్భి శ్చాఙ్గై ర్యస్మాత్ప్రయుజ్యతే, తస్మాత్ప్రబన్ధః కథితః’ అని సంగీతరత్నాకరములో ప్రబన్ధలక్షణము. ఇట్టి లక్షణము గల సరసమైన ప్రబంధమందు కాన్పించె నని భావము. ‘శ్లో. చక్ర వాకః క్రౌఞ్చ సహస్వరాధోధ్వనికుండిని, ఆర్యా గాధా ద్విపదగా కలహంసశ్చ తోటకః’ అని సంగీతరత్నాకరమందున్నది. అనఁగా, కలహంసవృత్తముయొక్క వైఖరి ప్రబంధమునఁ దోఁచె నని యర్థము. పల్లవంబులపెంపు=చిగురాకులయొక్క అతిశయము; పడఁతికేలనె గాదు=చిత్రరేఖయొక్క కరమునందే కాదు; సొగసైనపద పాళిన్=సుందరమగు ధ్రువపదములయొక్క బృందమునందు; సొంపు =అందమును; పూనెన్=పొందెను. పల్లవంబులపెంపు = గీతములందలి మొదటిపాదములయొక్క అతిశయము, ధ్రువాదులఁ బొందె నని యర్థము. అనుచున్=ఈప్రకారము వచించుచు; వనదేవతాజనంబు=వనదేవతలు; అభినుతింపన్=కొనియాడఁగ; రక్తివిధమును =రక్తి యొక్కరీతిని; దేశీయరాగగతియున్=దేశీయరాగముయొక్కరీతియును; చిత్రతరమంద్రరాగజశ్రీలు—చిత్రతర=విచిత్రమగు, మంద్ర=హృదయస్వరములవలనను, రాగ=శుద్ధస్వరములవలనను,జ=పుట్టిన,శ్రీలు=రచనలు; వెలయన్=ప్రకాశింపఁగ; ఇంతి=చిత్రరేఖ; మునిచెంత=మునిసమీపమునందు; అంతన్=అప్పుడు; వీణె వాయించెన్=వీణను పలికించెను.

ఉ. చెన్నగుజాళువాయొళవు, ◊చిన్నరికెంపులమెట్లు, నీలపు
న్వన్నియ నొప్పు కాయలు, న◊వంబగు వజ్రపుకర్వె, పచ్చలం
బన్నినయట్టిమేరువును, ◊బాగగుతంత్రులు మించ నొప్పు మే
ల్కిన్నర చెంతఁ జేరి యొక◊కిన్నరకంఠి యొసంగ నయ్యెడన్. 98

టీక: చెన్నగుజాళువాయొళవు =ప్రకాశించుచున్న బంగరుదండము; చిన్నరికెంపులమెట్లు = చక్కనగు కెంపులసరికట్లు; నీలపున్వన్నియన్=నల్లనిచాయచేత; ఒప్పు కాయలు ఒప్పుచున్న కాయలు; నవంబగు =క్రొత్తనైన; వజ్రపుకర్వె వజ్రముల యొక్క కకుభము; పచ్చలన్=గరుడపచ్చలచేత; పన్నినయట్టి = రచించినట్టి; మేరువును=శిఖరమును; బాగగుతంత్రులు =శ్రేష్ఠమగు తీగెలు; మించన్=అతిశయింపఁగ; ఒప్పు =ప్రకాశించుచున్నట్టి; మేల్కిన్నర=శ్రేష్ఠమైన వీణాభేదమును; ఒక కిన్నర కంఠి=ఒకముదిత; చెంతఁ జేరి=చిత్రరేఖాసమీపమును బొంది; ఒసంగన్=ఈయఁగా; అయ్యెడన్=ఆసమయమందు. దీని కుత్తరపద్యమునందలి ‘పల్కించె’ నను క్రియతో నన్వయము.

మ. సరసత్వంబునఁ గేల నూని యల యో◊షామౌళి చక్కన్ రిరి
మ్మరిగామారి యటంచు రిప్పనిమగా◊మమ్మారి యంచు న్విభా
స్వరనానానవరక్తిఁ దానతతి మిం◊చన్ గౌళ వాయించి, ని
బ్బరపు న్వేడుకఁ జేయుపంతువిధముల్ ◊పల్కించె నప్పట్టునన్. 99

టీక: అల యోషామౌళి =ఆచిత్రరేఖ; సరసత్వంబునన్ =రసికతతో; కేలన్=హస్తముచేత; ఊని=(కిన్నెరను) గ్రహించి; చక్కన్ =సొంపుగా; రిరిమ్మరిగామారి యటంచు రిప్పనిమగామమ్మారి యంచున్ = ఈప్రకారమనుచు; విభాస్వరనానానవరక్తిన్ – విభాస్వర=ప్రకాశించుచున్న, నానా=అనేకవిధములగు, నవరక్తిన్=నూతనమగు సొంపుచేత; తానతతి మించన్ =తాన యను శబ్దజాల మతిశయింపఁగ; గౌళ వాయించి = గౌళరాగమును పలికించి; నిబ్బరపు న్వేడుకఁ జేయుపంతువిధముల్=మిక్కిలి వినోదము గొల్పునట్టి శ్రేష్ఠమగు రీతులను; పల్కించెన్=వాయించెను; అప్పట్టునన్=ఆసందర్భమున, దీనికి ఉత్తరపద్యస్థ మగు ‘సల్పె’ నను క్రియతో నన్వయము. అనఁగ చిత్రరేఖ కుముదాక్షి యొసంగిన కిన్నర దీసికొని, సరిగమాదిస్వరములను వాయించి, గౌళయను రాగమును తానతతి ననఁగ తాన యనుశబ్దములతో ననేకరీతుల వాయించె నని భావము.

మ. బళిరే మైసిరితీరు, నిల్కడలు సే◊బా, సయ్యరే పేరణీ
కలనం, బౌర పదాళికాభినయవై◊ఖర్యంబు, మజ్జారె కో
పులవైచిత్రి, యహో వినిర్మలకరాం◊భోజాతవిన్యాస, మం
చలివేణుల్ వినుతింప సల్పె నటనం ◊బాకొమ్మ తత్సన్నిధిన్. 100

టీక: ఈపద్యమందు ‘బళరే, సేబాసు, అయ్యారే, ఔర,మజ్జారె, అహో’ యను పదములు ప్రశంసార్థకము లని యెఱుంగునది. మైసిరితీరు=దేహకాంతియొక్కరీతి, బళిరే! నిల్కడలు=ధైర్యములు, సేబాసు! పేరణీకలనంబు=భాండముపైఁజేయునృత్యము, అయ్యరే ! పదాళికాభినయవైఖర్యంబు – పదాళికా=గానోపయోగిపదపుంజములయొక్క, అభినయవైఖర్యంబు= పదార్థాభి నయరీతి, ఔర! కోపులవైచిత్రి =నాట్యసంబంధులగుతీర్పులయొక్కవిచిత్రత, మజ్జారె! వినిర్మలకరాంభోజాతవిన్యాసము – వినిర్మల=స్వచ్ఛమగు, కరాంభోజాత=కరకమలములయొక్క, విన్యాసము=ఉంచుట, అహో ! అంచున్= ఈప్రకారము వచింపుచు; అలివేణుల్=స్త్రీలు; వినుతింపన్=కొనియాడఁగ; ఆకొమ్మ =ఆచిత్రరేఖ; తత్సన్నిధిన్=ఆమునిసమీపమందు; నట నంబు = నాట్యమును; సల్పెన్=చేసెను. అంగనలు నుతియించుచుండఁగఁ జిత్రరేఖ మునిసన్నిధి నభినయించి నాట్యముఁ జేసె నని తాత్పర్యము.

క. ఈలీల నన్నివిద్యలు, వేలుపుతొవకంటి చూపి ◊విపులసమాధి
శ్రీలాభగౌరవంబున, శైలాభం దెమలకున్న◊శమిఁ గాంచి రహిన్. 101

టీక: ఈలీలన్=ఈరీతిగ; వేలుపుతొవకంటి =చిత్రరేఖ; అన్నివిద్యలున్=ఎల్లవిద్యలు; చూపి=ప్రదర్శించి; విపులసమాధిశ్రీ లాభగౌరవంబునన్ – విపుల=విశాలమగు, సమాధి=చిత్తవృత్తినిరోధముయొక్క,శ్రీ =సంపదయొక్క,లాభ=ప్రాప్తివలన నైన; గౌరవంబునన్ = గరుత్వముచేత; శైలాభన్=పర్వతమువలె; తెమలకున్నశమిన్=చలింపకున్నమునిని; రహిన్=ప్రీతితో; కాంచి=చూచి.

చ. అనుపమకాంచిరమ్యతట◊హాటకకింకిణికాఝణంఝణ
ధ్వని చెలరేఁగ, నానియమి◊దండకుఁ జేరి, యొయార మెచ్చ న
వ్వనిత తపోధనేంద్రపద◊వారిజయుగ్మము కేల నంటి, యొ
య్యనఁ దలఁ జేర్చి, నూత్నమధు◊రామృతపూరసమోక్తి నిట్లనున్. 102

టీక: అనుపమ కాంచి రమ్యతటహాటకకింకిణికా ఝణంఝణధ్వని – అనుపమ=అసమానమగు,కాంచి=ఒడ్డాణములయొక్క,రమ్య=మనోహరమగు,తట=ప్రదేశమందలి,హాటకకింకిణికా=బంగారుచిఱుగంటలయొక్క,ఝణంఝణధ్వని = ఝణఝణ యను శబ్దము; చెలరేఁగ=అతిశయింపఁగ; ఆనియమిదండకున్=ఆమునిసమీపమునకు; చేరి, ఒయారము=విలాసము; ఎచ్చన్ = అతిశయింపఁగ; అవ్వనిత=ఆచిత్రరేఖ; తపోధనేంద్రపదవారిజయుగ్మము – తపోధనేంద్ర=జడదారిసామియొక్క, పదవారిజయుగ్మము=పాదకమలద్వయమును; కేలన్=హస్తముచేత; అంటి=తాఁకి; ఒయ్యనన్=తిన్నగా; తలన్=శిర మును; చేర్చి=కదియించి; నూత్నమధురామృతపూరసమోక్తిన్ – నూత్న=క్రొత్తనగు, మధుర=తియ్యని, అమృత=సుధ యొక్క, పూర=ప్రవాహముతోడ, సమ=సదృశమగు, ఉక్తిన్=వాక్యమును; ఇట్లు=ఈప్రకారముగ; అనున్=పలికెను.

సీ. తెఱగంటిదొరలకుఁ ◊దీఱలేనివిరాళి, మొనపుచక్కఁదనానఁ ◊దనరుదాన,
కులుకుచిత్తరువుబొ◊మ్మలకు జీవమునించఁ,గలపాటవగ నేర్చి ◊యలరుదాన,
రంభాదికనిలింప◊రామలఁ దలవంపఁ, జేయు నాట్య మెఱింగి ◊సెలఁగుదాన,
హరిగిరిశాదిది◊వ్యసభాళి బిరుదు లె,న్నైనఁ జేకొని నిచ్చ ◊నడరుదాన,

తే. పలుకుతొయ్యలి వీవంచు ◊నలువ మెచ్చ, నలఘుసాహిత్యవిద్యాప్తి ◊వెలయుదాన,
చిత్రరేఖాసమాఖ్య రా◊జిల్లుదాన, నిన్ను సేవింపవచ్చితి ◊నియమిచంద్ర! 103

టీక: తెఱగంటిదొరలకుఁన్=దేవశ్రేష్ఠులకు; తీఱలేనివిరాళిన్=ఎడతెగనిమోహమును; మొనపు=కలుగఁజేయు;చక్కఁదనానన్ = సౌందర్యముచేత; తనరుదానన్= ఒప్పుచున్నదానను;
కులుకుచిత్తరువుబొమ్మలకున్=చిత్తరువునందు వ్రాసిన చక్కనిబొమ్మలకు; జీవము=ప్రాణమును; నించఁగల పాటవగన్= నిండఁ జేయుటయందు సామర్థ్యము గల్గిన గానముయొక్కసొంపును; నేర్చి=అభ్యసించి; అలరుదానన్=ప్రకాశించుదానను; రంభాదికనిలింపరామలన్—రంభాదిక=రంభమొదలగు, నిలింపరామలన్= దేవాంగనలను; తలవంపన్=శిరమువంచునట్లు, చేయునాట్యము=చేయునట్టి నాట్యము; ఎఱింగి=తెలిసి; చెలఁగుదానన్=ప్రకాశించుదానను; హరిగిరిశాదిదివ్యసభాళిన్ – హరి=కృష్ణుఁడు, లేదా ఇంద్రుఁడు,గిరిశ=శివుఁడు, ఆది=మొదలుగాఁ గలవారియొక్క, దివ్య= మనోహరమగు, సభాళిన్=సభాసమూహములయందు; ఎన్నైనన్=ఎన్నిటినైన, లెక్కకు మించి యనుట; బిరుదులు=జయ చిహ్నములను; చేకొని=గ్రహించి; నిచ్చ =ఎల్లప్పుడు; అడరుదాన=ఒప్పుచున్నదానను; నలువ=బ్రహ్మదేవుఁడు; ఈవు=నీవు; పలుకుతొయ్యలివి=సరస్వతివి; అంచున్=అనుచు; మెచ్చన్=మెచ్చునటులు; అలఘు సాహిత్యవిద్యాప్తిన్ – అలఘు=అధికమగు, సాహిత్యవిద్యా=నాటకాలంకారాదిసాహిత్యవిద్యలయొక్క, ఆప్తిన్=ప్రాప్తిచేత; వెలయుదానన్=ఒప్పుచున్నదానను; చిత్రరేఖాసమాఖ్యన్=చిత్రరేఖ యను నామముచేత; రాజిల్లుదానన్=ప్రకాశించుదానను; నియమిచంద్ర = ఓ మునిశ్రేష్ఠుఁడా! నిన్ను సేవింపవచ్చితిన్ = నిన్నుఁ గొలుచుటకు వచ్చితిని.

నియమిచంద్రా! దేవోత్తములకును మోహమును గొల్పు నందముచేతను, అచేతనములగు బొమ్మలకును ప్రాణ మిచ్చు నంతటి గానముచేతను, రంభాదిదేవాంగనలకు నలవిగాని నాట్యముచేతను దనరుచు, అనేకశివకేశవాద్యుత్తముల సభల యందు బిరుదములఁ గొని మించుచు, నలువ సరస్వతివి నేవే యని మెచ్చునంతటి సాహిత్యవిద్యచే నొప్పుచుండుదాన, చిత్ర రేఖ యను పేరు గలదాన, నేను నిన్ను సేవింపవచ్చితి నని భావము.

క. అనునెడ నమ్మునికులమణి, కనుఁగవ నర విప్పి ◊కాంతఁ గన్గొని యంతన్
బునరనవధికసమాధిక,లన నక్షులు మోడ్చి నిశ్చ◊లతచే నుండన్. 104

టీక: అనునెడన్=అని పలుకునపుడు; అమ్మునికులమణి=ఆఋషిశ్రేష్ఠుఁడు; కనుఁగవన్=కనుదోయిని; అర విప్పి = సగము దెఱచి; కాంతన్=చిత్రరేఖను; కన్గొని=చూచి; అంతన్=అటుపిమ్మట; పునరనవధికసమాధికలనన్ – పునః=మఱల, అనవధిక =అంతములేని, సమాధి=చిత్తవృత్తినిరోధముయొక్క, కలనన్ =ప్రాప్తిచేత; అక్షులు=నేత్రములను; మోడ్చి=ముకుళించి; నిశ్చ లతచే =అచంచలతచేత; ఉండన్ =ఉండఁగ.

ఉ. కాంచి తపస్విచిత్తగతి ◊గాంచఁగ లేక యయారె మామకా
భ్యంచిత శాంబరీమహిమ ◊కయ్యతి లోఁబడు నంచు నెంచి త
త్కాంచనగాత్రి యాళిజన◊తాయుతి మిక్కిలి చెంతఁజేరి నే
త్రాంచలసీమ నవ్వు వొల◊యన్ మునిఁ బల్కె నవోక్తిచాతురిన్. 105

టీక: తత్కాంచనగాత్రి =ఆచిత్రరేఖ; కాంచి=చూచి; తపస్విచిత్తగతిన్=మునియొక్క మనస్థ్సితిని; కాంచఁగ లేక=తెలియఁ జాలక; అయారె =ఆశ్చర్యము! మామకాభ్యంచితశాంబరీమహిమకున్ – మామక=నాసంబంధి యగు, అభ్యంచిత=శ్రేష్ఠ మగునట్టి, శాంబరీమహిమకున్=మాయాసామర్థ్యమునకు; అయ్యతి=ఆముని; లోఁబడు నంచున్=వశపడు ననుచు; ఎంచి = తలఁచి; ఆళిజనతాయుతిన్=సఖీజనముతోడి కూడికచేతను; మిక్కిలి చెంతఁజేరి =అత్యంతసమీపమును బొంది; నేత్రాంచల సీమన్ =నయనాంతముల ప్రదేశమునందు; నవ్వు =స్మితము; పొలయన్=వ్యాపింపఁగ; నవోక్తిచాతురిన్ – నవ=నూతనమైన, ఉక్తిమాటలయందలి, చాతురిన్=నేర్పుచేత; మునిన్=వసంతునిగూర్చి; పల్కెన్=పలికెను.

సీ. జవరాలినునుగుబ్బ◊చన్నులఁ జేరుట, వసుధాధరస్థలీ◊వసతి గాఁగ,
నతివరత్యంతశ్ర◊మాంబులఁ దోఁగుట, నమరాపగావగా◊హనము గాఁగ,
తెఱవకెమ్మోవిక్రొం◊దేనియ ల్గ్రోలుట, నిరుపమామృతపాన◊సరణి గాఁగ,
కొమ్మతో రతికూజి◊తమ్ములు నొడువుట, సరసాగమాంతాళి◊చదువు గాఁగఁ,

తే. దలఁపఁ బద్మాంబకాభిఖ్య◊దైవతంబు, మసలక దయారసంబున ◊నొసఁగు సు మ్మ
ఖండితానందగరిమ ని◊క్కలన మనుము, వట్టి యీఖేదకనివృత్తి ◊గట్టి మౌని. 106

టీక: మౌని=వసంతుఁడా! జవరాలినునుగుబ్బచన్నులఁ జేరుట=స్త్రీలయొక్క నునుపుగుబ్బచన్నులను బొందుట; వసుధాధర స్థలీవసతి=పర్వతప్రదేశమందలి నివాసము; కాఁగన్= అగునటులు;
అతివరత్యంతశ్రమాంబులన్ – అతివ=వనితయొక్క, రత్యంత=సురతాంతమువలన నైన, శ్రమాంబులన్=శ్రమోదకముల యందు; తోఁగుట= మునుఁగుట; అమరాపగావగాహనము – అమరాపగా=స్వర్గంగయందు, అవగాహనము =స్నానము; కాఁగన్= అగునటులు; తెఱవకెమ్మోవిక్రొందేనియల్ – తెఱవ=వనితయొక్క, కెమ్మోవి=అరుణాధరోష్ఠముయొక్క, క్రొందేనియల్=నూతనమధుర రసములను; క్రోలుట=పానముచేయుట; నిరుపమామృతపానసరణి – నిరుపమ=సాటిలేని, అమృత=సుధయొక్క, పాన సరణి=పానముయొక్కరీతి; కాఁగన్= అగునటులు;కొమ్మతోన్=కాంతతో; రతికూజితమ్ములు=మణితములు; నొడువుట=పలుకుట; సరసాగమాంతాళిచదువు – సరస= శ్రేష్ఠ మగు, ఆగమాంత=వేదాంతములయొక్క, ఆళి=బృందముయొక్క,చదువు =చదువుట; కాఁగన్= అగునటులు; తలఁపన్=భావింపఁగ; పద్మాంబకాభిఖ్యదైవతంబు = పద్మాంబకుఁ డను పేరుగల దేవత, పద్మములు బాణములుగా గల దేవుఁడు మన్మథుఁ డనుట; మసలక=తడవు సేయక; దయారసంబునన్=కృపారసముచేత; అఖండితానందగరిమన్ = అఖండానందాతిశయమును; ఒసఁగున్=ఇచ్చును; సుమ్ము=సత్యము; వట్టి =నీరసమగు;ఈఖేదకనివృత్తిన్=దుఃఖకర మగు నీనివృత్తిమార్గమును; కట్టి=బంధించి, విరమించి యనుట; ఇక్కలనన్=ఈరీతిగ; మనుము=వర్తింపుము.

అనఁగ స్త్రీకుచంబుల నెనయుట పర్వతనివాస మనియు, సురతాంతశ్రమవారి మునుగుట స్వర్గంగాస్నాన మనియు, నధరరసాస్వాద మమృతరసాస్వాద మనియు, స్త్రీలతో రతికూజితములు నుడువుట వేదాంతవిద్యల చదువుట యనియుఁ దలఁచి మన్మథుని ధ్యానింతువేని, మునిచంద్రా! నీకు నతం డఖండానందము నొసంగును. కేవలము నీరసమగు నీనివృత్తిమార్గ మును వదలు మని భావము.

సీ. పరమకాశ్యాకృతిఁ ◊బ్రబలదే నియమీశ, సోమమండలదాస్య◊రోమవల్లి,
యనవద్యమధురాత్మ ◊నలరదే మునికాంత, జలరుహేక్షణమధు◊స్రావిమోవి,
పురుషోత్తమస్థేమఁ ◊బొసఁగదే యతిచంద్ర, యచలకల్పోరోజ◊ యలఘునాభి,
శ్రీరంగవైఖరిఁ ◊జెలఁగదే దమివర్య, కనకజాతీయాంగి ◊కన్నుదోయి,

తే. యగుట నిత్యపవిత్రరూ◊పాప్తి నడరు, కలికితోఁ గూడి యుండినఁ ◊గాక కలదె
యతనుసుఖరాశి యిట్టి మ◊హాఘదాయి, ఘోరకాంతారమహి నున్న◊ధీరముఖ్య. 107

టీక: నియమీశ=ఓమునిరాజా! సోమమండలదాస్యరోమవల్లి – సోమమండలత్ =చంద్రమండలమువలె నాచరించుచున్న, ఆస్య=ముఖము గల స్త్రీయొక్క, రోమవల్లి=నూఁగారు; పరమకాశ్యాకృతిన్ – పరమ=ఉత్కృష్టమగు, కాశి=వారణాసి యొక్క, ఆకృతిన్ =స్వరూపముచేత; ప్రబలదే =అతిశయింపదా యని కాకువు. పరమక=ఉత్కృష్టమగు, ఇచట స్వార్థ మందు కప్రత్యయము, అసి=ఖడ్గముయొక్క, ఆకృతిన్=స్వరూపముచేత ప్రబలదా యని స్వభావార్థము. శ్లేషయందు శసల కభేదము నవలంబించుట యాలంకారికసమ్మతము. మునికాంత=మునినాథా! జలరుహేక్షణమధుస్రావిమోవి – జలరుహేక్షణ=వనజాక్షియొక్క, మధుస్రావి=మకరందమును స్రవించు, మోవి=ఓష్ఠము; అనవద్యమధురాత్మన్ – అనవద్య=నిర్దుష్టమగు, మధురాత్మన్ =మధుర యను దివ్యక్షేత్రము యొక్క యాకారముచేత; అలరదే =ప్రకాశింపదా యని కాకువు. మధురాత్మన్ – మధుర=తీయని, ఆత్మన్=స్వరూపము చేత, అలరదా యని స్వభావార్థము. యతిచంద్ర=ఓమునిచంద్రుఁడా! అచలకల్పోరోజ యలఘునాభి = ఇంచుకతక్కువగా పర్వతము లగుచున్న స్తనములు గల దానియొక్క లోతైన పొక్కిలి; పురుషోత్తమస్థేమన్ – పురుషోత్తమ=పురుషోత్తమక్షేత్రముయొక్క, స్థేమన్=మహిమచేతను; పొసఁగదే=ఒప్పదా యని కాకువు. పొక్కిలి, పురుషోత్తమస్థేమన్ – పురుషోత్తమ = పున్నాగపుష్పముయొక్క, స్థేమన్= మహిమవంటి మహిమచే పొసఁగదా యని స్వభావార్థము. దమివర్య=యతిశ్రేష్ఠుఁడా! కనకజాతీయాంగి కన్నుదోయి – కనకజాతీయ=సువర్ణప్రకారము గల, అంగి=దేహము గలదాని యొక్క, ఇచట ‘ప్రకారవచనే జాతీయర్’ అని జాతీయప్రత్యయము, కన్నుదోయి=నేత్రయుగ్మము; శ్రీరంగవైఖరిన్ – శ్రీరంగ = శ్రీరంగమను పుణ్యక్షేత్రముయొక్క, వైఖరిన్=రీతిచేత; చెలఁగదే=ప్రకాశింపదా యని కాకువు. శ్రీరంగవైఖరిన్ – శ్రీ=సిరికి, రంగ = విహారస్థానముయొక్క, వైఖరిన్=రీతిచే, చెలఁగదా యని స్వభావార్థము. అగుటన్=ఈప్రకారముగ వనితావయవములు పుణ్యక్షేత్రాకృతిని బొందుటచేత; నిత్యపవిత్రరూపాప్తిన్ – నిత్య=నిరంతరము, పవిత్ర=నిర్మలమగు, రూప=స్వరూపముయొక్క, ఆప్తిన్=ప్రాప్తిచేత; అడరుకలికితోన్=ఒప్పుచున్నకాంతతో; కూడి యుం డినఁ గాక =కలసియుండినం గాక; ఇట్టి =ఈప్రకారము; మహాఘదాయిఘోరకాంతారమహిన్ – మహత్=అధికమగు, అఘ = పాపమును, ‘అఘం దుఃఖే చ పాపే చ’ అని విశ్వము, దాయి=ఇచ్చుచున్న, ఘోర=భయంకరమగు, కాంతారమహిన్= అరణ్యభూమియందు; ఉన్నన్=ఉన్నచో, ధీరముఖ్య=పండితోత్తముఁడ! అతనుసుఖరాశి – అతను=అధికమగు, సుఖరాశి =ఆనందరాశి, మన్మథసుఖరాశి యని స్వభావార్థము; కలదె=ఉండునా?

అనఁగ రోమవల్లి పరమకాశ్యాకృతిని, మోవి మధురాత్మతను, పొక్కిలి పురుషోత్తమక్షేత్రగరిమను, కనుదోయి శ్రీరంగ వైఖరిని బొందియుండుటచే, సర్వదా పవిత్రరూపమును పొందిన కలికితోడఁ గూడి యుండిన నతనుసుఖము ఘటిల్లును గాని, యఘప్రదమగు నీ భయంకరారణ్యములో నుండినచో నెట్లు ఘటిల్లు నని భావము.

మ. ఉరురామైకగుణానువర్ణనమొ, కాం◊తోచ్చైస్తనాగస్థలీ
పరివాసంబొ, సతీవరాంఘ్రిభజనా◊ప్రాశస్త్యమో, సౌదృశో
త్కరసేవాగతియో, ప్రియారుణకరా◊త్యాలోకనంబో, మదిం
గర మూహింపఁగ నిట్టి నీతప మనం◊గా నేమి మౌనీశ్వరా! 108

టీక: ఉరురామైకగుణానువర్ణనమొ – ఉరు=అధికమైన, రామ=దాశరథియొక్క, ఏక=ముఖ్యమగు, గుణ=కల్యాణ గుణ ములయొక్క, అనువర్ణనమొ=స్తుతించుటయో; రామా=సుందరియొక్క, ఏక=ముఖ్యమగు, గుణ=సౌందర్యాదిగుణముల యొక్క, అనువర్ణనమొ=వర్ణించుటయో యని స్వభావార్థము దోఁచుచున్నది; కాంతోచ్చైస్తనాగస్థలీపరివాసంబొ – కాంత= రమణీయమైన, ఉచ్చైస్తన=గొప్పవైన, ‘సాయం చిరం ప్రాహ్ణే ప్రగేవ్యయేభ్యష్ట్యుట్యులౌతుట్చ’ అని అవ్యయము మీఁద ట్యు ట్యుల్ప్రత్యయతుడాగమములు వచ్చినవి, అగస్థలీ=పర్వతప్రదేశములయందు, పరివాసంబొ =నివాసమో; కాంతా=వనిత యొక్క, ఉచ్చైః=ఉన్నతమైన, స్తనాగ=పర్వతములవంటి కుచములయొక్క, స్థలీ=ప్రదేశమందు, పరివాసంబొ యని స్వభా వార్థము; సతీవరాంఘ్రిభజనాప్రాశస్త్యమో – సతీవర=శంకరునియొక్క, అంఘ్రి=పాదములయొక్క, భజనా=సేవ యొక్క, ప్రాశస్త్యమో=ప్రశస్తతయో; సతీవరా=ఉత్తమస్త్రీలయొక్క, అంఘ్రిభజనా=చరణసేవయొక్క, ప్రాశస్త్యమో=ప్రశస్త తయో యని స్వభావార్థము దోఁచుచున్నది; సౌదృశోత్కరసేవాగతియో– సౌదృశోత్కర=విద్వాంసులసమూహముయొక్క, సేవా=భజన యొక్క, గతియో=ప్రాప్తియో; సౌదృశోత్కర=సుదృశలైన స్త్రీసంబంధిబృందముయొక్క,సేవాగతియో యని స్వభావార్థము దోఁచుచున్నది; ప్రియారుణకరాత్యాలోకనంబో – ప్రియ=ప్రియమగు, అరుణకర=సూర్యకిరణములయొక్క, అత్యాలోకనం బో =నిరంతర మైన చూచుటయో; ప్రియా=ప్రియురాలియొక్క, అరుణ=ఎఱ్ఱనైన,కర=హస్తములయొక్క, అత్యాలోకనంబో యని స్వభావార్థము దోఁచుచున్నది;
మౌనీశ్వరా=జడదారిసామీ! మదిన్=మనసునందు; కరము=మిక్కిలి; ఊహింపఁగన్=వితర్కింపగ; ఇట్టి=ఈవిధమగు; నీతప మనంగా నేమి = నీతప మనఁగా నేమి, ఏవిధమైన దనుట. శ్రీరామశివాదులగుణకీర్తనమా నీవు చేయు తప మని భావము. నారీగుణకీర్తనమా నీవు చేయు తప మని స్వభావాభిప్రాయము.

మ. చెలిటెక్కుల్ గని, కొమ్మపాట విని, యో◊షిన్మౌళి నెమ్మోముతా
వులమే లాని, నెలంతమే నలమి, పూ◊వుంబోఁడికెమ్మోవితే
నెలచా ల్గ్రోలి, సమేతరాక్షసుఖ మెం◊తేఁ గాంచఁగా లేక మి
క్కిలి యాత్మాధిగతైకహృత్సుఖనిష◊క్తిన్ మౌని! కాంక్షింతురే. 109

టీక: మౌని=మునివర్యా! చెలిటెక్కుల్=వనితావిలాసములను; కని=చూచి; కొమ్మపాటన్= స్త్రీగానమును; విని=ఆకర్ణించి; యోషిన్మౌళి నెమ్మోముతావులమేలు – యోషిన్మౌళి=నారీరత్నముయొక్క, నెమ్మోము=సుందరవదనముయొక్క, తావుల =పరిమళములయొక్క, మేలు=సారమును; ఆని=ఆఘ్రాణించి; నెలంతమేను=కాంతాశరీరమును; అలమి=కౌఁగిలించి; పూవుంబోఁడి కెమ్మోవితేనెలచాలు – పూవుంబోఁడి = కుసుమకోమలమైన స్త్రీయొక్క, కెమ్మోవి= ఎఱ్ఱనియధరముయొక్క, తేనెల = తేనెవంటిరసముయొక్క, చాలు=పరంపరను; క్రోలి=పానముచేసి; సమేతరాక్షసుఖము=పంచేంద్రియములయొక్క, అనఁగాఁ జక్షుశ్శ్రోత్రజిహ్వాఘ్రాణత్వగింద్రియములయొక్క యనుట, సుఖము=సుఖమును; ఎంతేన్=మిక్కిలి; కాంచఁగా లేక =పొందలేక; మిక్కిలి=అతిశయముగ; ఆత్మాధిగతైకహృత్సుఖనిషక్తిన్ – ఆత్మ=పరమాత్మవలన, అధిగత=పొందఁబడి నట్టియు, ఏక=ముఖ్యమైనట్టియు,హృత్సుఖనిషక్తిన్=హృదయసుఖసంబంధమును; కాంక్షింతురే=కోరుదురా యని కాకువు.

అనఁగా బుద్ధిమంతులు స్త్రీవిలాసదర్శన, తదీయగానశ్రవణ, తన్ముఖగంధాఘ్రాణ, తదధరరసపాన, తదాలింగన జనిత మగు పంచేంద్రియసుఖమును గోరక, కేవలపరమాత్మవలనఁ బొందఁబడిన హృత్సుఖమును మాత్రము కోరరని భావము.

సీ. సుమసౌకుమార్యాప్తి ◊నమరునీనెమ్మేను, ఘనపంచశిఖికీలఁ ◊గంద కున్నె,
నెలపుల్గుపెంపూని ◊యలరునీకనుదోయి, సూర్యదర్శనసక్తి ◊స్రుక్కఁబడదె,
తమ్మియందమ్మూని ◊తనరునీనెమ్మోము, శుచిభసితచ్ఛాయ ◊సొగసెడయదె,
తళుకుకెంజిగురాకు ◊సొలపూనునీయంఘ్రి, సూచిపై మెట్టిన ◊ సొంపు సెడదె,

తే. యకటకట నీవొకిం తైన ◊యంతరంగ,మునఁ దలంపవుగాని స◊ద్భోగయోగ్య
భావమున మించు నీయట్టి ◊భవ్యమూర్తి, కీదృశమహాతపోగ్లాని ◊నెనయఁదగునె. 110

టీక: సుమసౌకుమార్యాప్తిన్ – సుమ=పుష్పములయొక్క, సౌకుమార్య=సుకుమారత్వముయొక్క, ఆప్తిన్=ప్రాప్తిచేత; అమరునీనెమ్మేను =ఒప్పుచున్న నీసుందరశరీరము; ఘనపంచశిఖికీలన్ – ఘన=గాఢమగు, పంచశిఖి=పంచాగ్నుల యొక్క, కీలన్=జ్వాలచేత; కందకున్నె=పరితపింపకుండునా? నెలపుల్గు=చకోరములయొక్క; పెంపు=సౌందర్యమును; ఊని =పొంది; అలరునీకనుదోయి=ప్రకాశించు నీకనుగవ; సూర్య దర్శనసక్తి న్ – సూర్య=సూర్యునియొక్క, దర్శన=చూచుటయొక్క, సక్తి న్=సంబంధముచేత; స్రుక్కఁబడదె=తపింపదా? తమ్మియందమ్ము – తమ్మి=కమలముయొక్క,అందమ్ము=సౌందర్యమును;ఊని=పొంది; తనరు=ఒప్పుచున్న; నీనెమ్మోము =నీచక్కనిముఖము; శుచిభసితచ్ఛాయన్ – శుచి=శుభ్రమగు,భసిత=భస్మముయొక్క, ఛాయన్=కాంతిచేత, శుచిభ= తెల్లని కిరణములు గల చంద్రునియొక్క, సితచ్ఛాయన్=తెల్లనికాంతిచేత, అనఁగా వెన్నెలచేత; సొగసు=అందమును; ఎడయదె= విడువదా?తళుకుకెంజిగురాకుసొలపూనునీయంఘ్రి – తళుకు=ప్రకాశించుచున్న,కెంజిగురాకు=ఎఱ్ఱనిచిగురుటాకుయొక్క, సొలపు = మృదుత్వమును, ఊను=పొందినట్టి, నీయంఘ్రి =నీపాదము; సూచిపైన్=సూదిమీఁద; మెట్టినన్=త్రొక్కఁగ; సొంపు=అంద మును; చెడదె =వీడదా? అకటకట =అయ్యో కష్టము! నీవు,ఒకింతైన =కొంచెమైన;అంతరంగమునన్=మనస్సునందు; తలంపవుగాని=స్మరింపవుగాని; సద్భోగయోగ్యభావమునన్ – సత్=శ్రేష్ఠమగు, భోగ=సుఖమునకు,యోగ్యభావమునన్ =యోగ్యత్వముచేత;మించు=ఒప్పు చున్న; నీయట్టి=నీవంటి; భవ్యమూర్తికిన్=మంగళమూర్తికి;ఈదృశమహాతపోగ్లానిన్ – ఈదృశ=ఇటువంటి,మహత్=గొప్ప నగు, తపః=తపమువలన కల్గిన, గ్లానిన్=దుఃఖమును; ఎనయఁదగునె =పొందఁదగునా?

అనఁగా లోకోత్తరమృదులసుందరావయవములు గల్గిన నీకు ఘోరతపం బొనరింప నుచితము గాదని భావము.

మ. అసమజ్వాలశిఖాళి వ్రేఁగిన నిరా◊హారంబు గైకొన్నశీ
తసరిద్వారులఁ గ్రుంకియున్న భుజగీ◊తంద్రీపరిధ్వంసిసా
హసవృత్తిం గయికొన్న నీ కతనుక◊ల్యానంద మెట్లబ్బు భ
వ్యసితాంభోరుహలోచనాంఘ్రియుగసే◊వం దక్క యోగీశ్వరా. 111

టీక: యోగీశ్వరా =జడదారిసామీ! అసమజ్వాలశిఖాళిన్ – అసమ=సరిలేని,జ్వాల=మంటలయొక్క,శిఖా=అగ్రముల యొక్క, ఆళిన్= పంక్తిచేత; వ్రేఁగినన్=పరితపించినను; నిరాహారంబు=భోజనాభావమును; కైకొన్నన్=గ్రహించినను, ఉప వాసముండిన ననుట; శీతసరిద్వారులన్ – శీత=చల్లనైన, సరిత్=నదులయొక్క,వారులన్=నీటియందు; క్రుంకియున్నన్ = మునిఁగినను; భుజగీతంద్రీపరిధ్వంసిసాహసవృత్తిన్ – భుజగీ=శక్తిమూలాధారస్థకుండలినీశక్తియొక్క, తంద్రీ=నిద్రను, పరి ధ్వంసి=పోఁగొట్టెడు, సాహసవృత్తిన్=తెగువపనిని; కయికొన్నన్=గ్రహించినను, మహాయోగసాధ్యమగు మూలాధారస్థ కుండలినీశక్తిని మేల్కొల్పునంతటి తెగువను స్వీకరించిన ననుట,

‘శ్లో. భుజఙ్గాకారరూపేణ మూలాధారం సమాశ్రితా, శక్తిః కుణ్డలినీనామ బిసతన్తునిభా శుభా|
మూలకన్దం ఫణాగ్రేణ దష్ట్వా కమలకన్దవత్, ముఖేన పుచ్ఛంతం గృహ్య బ్రహ్మరన్ధ్రం సమాశ్రితా|
పద్మాసనగత స్స్వస్థో గుదమాకుఞ్చ్య సాధకః, వాయు మూర్ధ్వగతీం కుర్వన్ కుమ్భకావిష్టమానసః|
వాయ్వా ఘాతవశాదగ్నిస్స్వాధిష్ఠానగతో జ్వలన్, జ్వలనాఘాతపవనాఘాతై రున్నిద్రితోహిరాట్|
రుద్రగ్రన్థిం తతో భిత్త్వా విష్ణుగ్రన్థిం భినత్త్యతః, బ్రహ్మగ్రన్థిం చ భిత్త్వైవం కమలాని భినత్తి షట్|
సహస్రకమలే శక్తి శ్శివేన సహ మోదతే, సాచావస్థాపరాజ్ఞేయా సైవ నిర్వృతికారణమ్|’

అని వామకేశ్వరమహాతంత్రమున నున్నది.

భవ్యసితాంభోరుహలోచనాంఘ్రియుగసేవం దక్కన్ – భవ్య=మంగళమూర్తి యగు, సితాంభోరుహలోచన=తెల్లదామరల వంటి కన్నులు గల విష్ణుమూర్తియొక్క, అంఘ్రియుగసేవం దక్కన్=పాదద్వయముయొక్క సేవవలనం గాక; ఇచట సితాం భోరుహలోచనా=పద్మములవంటి కన్నుల గల స్త్రీయొక్క, అంఘ్రియుగసేవం దక్కన్ =పాదసేవచేఁ దప్ప నను స్వభావార్థము స్ఫురించుచున్నది; నీకున్, అతనుకల్యానందము – అతను=అధికమగు, కల్యానందము =శుభప్రదమగు నానందము, అనఁగ జన్మమృత్యుజరావర్జిత మగు నానందము ననుట; ఇచట, అతనుకల్యానందము =మన్మథయుద్ధసంబంధమైన యానందమని స్వభావార్థము స్ఫురించుచున్నది, అతను=మన్మథునియొక్క, కలి=యుద్ధము, కలిశబ్దమునకు యుద్ధ మర్థమనుట స్పష్టము; ఎట్లబ్బున్=ఏవిధముగా కల్గును?

అనఁగాఁ బంచాగ్నిజ్వాలలచేఁ గందినను, పస్తుండినను, చల్లనినీటఁ గ్రుంకినను, మహాయోగసామర్థ్యముఁ బొంది మూలా ధారస్థకుండలినీశక్తిని మేల్కొల్పినను, విష్ణుమూర్తిసేవం దక్క అనఁగా శరీరశోషకకర్మల నెన్నింటిని జేసినను బ్రహ్మజ్ఞానము లేక యతనుకల్యాణ మబ్బదని భావము. స్త్రీసేవనముచేతనే మన్మథసుఖము కలుగునని స్వభావాభిప్రాయము.

సీ. మాతంగయుతదావ◊మహికన్నఁ గొంచమే, వరవిప్రవృతకేళి◊వనధరిత్రి,
ఘనపంకమయశైవ◊లినికన్న నల్పమే, యమలహంసాంచితా◊బ్జాకరంబు,
శైలాటగృహదగ◊చ్ఛటకన్నఁ దక్కువే, సద్వితానోద్యోత◊సౌధపాళి,
యనిశ మిరాశనం◊బునకన్న నింద్యమే, పుణ్యసుదృక్కృత◊భోజనంబు,

తే. కాన నీకాన నీవృత్తి◊గరిమ మెల్ల, మాని నే మానితప్రీతి◊మహిమఁ గొల్వ
మౌని యిమ్మౌనిలింపస◊ద్మంబుఁ జేరు, దాన మోదానపాయత ◊దాల్తు విపుడు. 112

టీక: మౌని =వసంతుఁడా! వరవిప్రవృతకేళివనధరిత్రి – వర=శ్రేష్ఠులగు, విప్ర=బ్రాహ్మణులచేత, వృత=ఆవరింపఁబడిన, కేళి వన=ఉద్యానవనముయొక్క, ధరిత్రి=భూమి; మాతంగయుతదావమహికన్నన్ – మాతంగ=చండాలురతో, యుత=కూడి కొన్న, దావమహికన్నన్ =వనభూమికంటె; కొంచమే=తక్కువయా? యని కాకువు. ఇచట వర=శ్రేష్ఠమగు, వి=పక్షులచేత, ప్రవృత=ఆవరింపఁబడిన, కేళివనధరిత్రి=ఉద్యానవనభూమి, మాతంగయుత=గజములతోఁ గూడుకొన్న, దావమహికన్నన్ = అరణ్యభూమికన్న, తక్కువయా యని స్వభావార్థము దోఁచుచున్నది. అమలహంసాంచితాబ్జాకరంబు – అమల=నిర్దోషులగు, హంస=పరమహంసలచేత, అంచిత=ప్రకాశించుచున్న, అబ్జాకరంబు =తామరకొలను; ఘనపంకమయశైవలినికన్నన్–ఘన=అధికమగు, పంకమయ=పాపమయమైన,శైవలినికన్నన్=నదికన్న, ‘శైవలినీ తటినీ హ్రాదినీ ధునీ’ అని యమరుఁడు; అల్పమే=కొంచెమా యని కాకువు. ఇచట స్వచ్ఛములైన హంసలతోఁ గూడి యున్న కొలను, ఘనపంకమయ=అధికమగు బురదతోఁజేరియున్న, శైవలినికన్న స్వల్పమా యను స్వభావార్థము దోఁచు చున్నది. సద్వితానోద్యోతసౌధపాళి – సత్=సత్పురుషులయొక్క, వితాన=సమూహముచేత, ఉద్యోత=ప్రకాశము గల, సౌధపాళి= మేడలయొక్క గుంపు; శైలాటగృహదగచ్ఛటకన్నన్ – శైలాట=కిరాతులకు, ‘కిరాత సింహౌ శైలాటౌ’అని రత్నమాల, గృహత్=ఇల్లువలె నాచరించు, అగచ్ఛటకన్నన్=కొండలగుంపుకన్న; తక్కువే=తక్కువయా యని కాకువు. ఇచట, సద్వితా నోద్యోతసౌధపాళి = శ్రేష్ఠమగు మేలుకట్లచే ప్రకాశము గల మేడలగుంపు, శైలాటగృహదగచ్ఛటకన్నన్ – శైలాట =సింహములకు, గృహత్=ఇల్లువలె నాచరించు, అగచ్ఛటకన్నన్=కొండలగుంపుకన్న, తక్కువయా యను స్వభావార్థము దోఁచుచున్నది. పుణ్యసుదృక్కృతభోజనంబు – పుణ్య=పవిత్రమైన,సుదృక్=విద్వాంసులచేత, కృత=చేయఁబడిన, భోజనంబు=ఆహారము, ‘పుణ్యం మనోజ్ఞేఽభిహితం తథా సుకృతధర్మయోః’ అని విశ్వము; అనిశమిరాశనంబునకన్నన్ – అనిశము=ఎల్లపుడు, ఇరా = సురయొక్క, ‘ఇరా భూ వాక్సురామ్బుషు’ అని వైజయంతి, అశనంబునకన్నన్=భోజనముకన్న; నింద్యమే = నింద్యమా? యని కాకువు. ఇచట, పుణ్యసుదృక్కృతభోజనంబు పుణ్య=మనోహరలైన, సుదృక్=వామేక్షణలచేత, కృత=చేయఁబడిన, భోజనంబు=ఆహారము; అనిశమిరాశనంబునకన్నన్ – అనిశము=ఎల్లపుడు, ఇరాశనంబునకన్నన్ = జలభక్షణముకంటె; నింద్యమే = నింద్యమా? యని స్వభావార్థము దోఁచుచున్నది.కానన్=కాఁబట్టి; ఈకానన్=ఈయడవియందు; నీవృత్తిగరిమము=నీవ్యాపారాతిశయము; ఎల్లన్=అంతయు; మాని=విడిచి; నేన్=నేను; మానితప్రీతిమహిమన్=మేలైన ప్రేమయొక్క పేరిమిచేత; కొల్వన్=సేవించుచుండఁగ; ఇమ్మౌ=అనుకూలమగు; నిలింపసద్మంబున్=స్వర్గధామమును; చేరు=పొందుము; దానన్=దానిచేత; ఇపుడు, మోదానపాయతన్ – మోద=సంతో షముయొక్క, అనపాయతన్=అపాయరాహిత్యమును; తాల్తువు=వహింతువు.

మాతంగసంకులమగు వనభూమికన్నను, పంకభూయిష్ఠమగు నదికన్నను, కిరాతకులకు నివాస మగు పర్వతసమూ హముకన్నను, ఎల్లపుడుఁ జేయు సురాపానముకన్నను, విప్రులతోఁ గూడియున్నయుద్యానవనము, పరమహంసలతోఁ గూడియున్నకొలను, సత్పురుషులతోఁ గూడియున్నమేడలు, పవిత్రులగు విద్వాంసులచే నిర్మింపఁబడిన భోజనమును హీనము లయినవి గావు గనుక నాతోడఁ స్వర్గముఁ జేరి సంతోషాతిశయమును బొందుమని భావము. ఏనుఁగులు మొదలగు వానితోఁ గూడినయడవి మొదలగువానికన్నను, మంచిపక్షులు మొదలగువానితోఁ గూడిన యుద్యానవనము మొదలగునవి మిక్కిలి యుత్తమములు, కావున, నీవు నాతోఁ గూడ స్వర్గము చేరి సుఖింపు మని స్వభావాభిప్రాయము.

చ. పలుమఱు వట్టిపల్కు లిఁకఁ◊బల్కఁగ నేల యతీంద్ర, త్వత్సము
జ్జ్వలతరరూపయౌవనరు◊చావరవిభ్రమకౢప్తమోహ నై,
బలుతమి నిన్నుఁ జేరి ధృతిఁ ◊బాసిన నన్ రతిఁ జొక్కఁజేయు ము
త్కలికల నీకధీనగతిఁ ◊దాల్చితి సూనశరుండు సాక్షిగన్. 113

టీక: యతీంద్ర =మునిశ్రేష్ఠుఁడా! పలుమఱున్=మాటిమాటికి; వట్టిపల్కులు=వ్యర్థపుమాటలను; ఇఁకన్=ఈమీఁద; పల్కఁగన్ = పల్కుటచే; ఏల=ఏమి ప్రయోజనము? త్వత్సముజ్జ్వలతరరూపయౌవనరుచావరవిభ్రమకౢప్త మోహ నై –త్వత్=నీయొక్క, సముజ్జ్వలతర=మిక్కిలి ప్రకాశించుచున్న, రూప= ఆకృతిచేతను, యౌవన=తారుణ్యముచేతను, రుచా=కాంతిచేతను, ఇట హలంతలక్షణటాప్ప్రత్యయము వచ్చి రుచా యని ఆకారాంతరూపము, వర=ఉత్తమమగు,విభ్రమ=చక్కదనము లేదా విలా సముచేతను, కౢప్త=కలిగింపఁబడిన, మోహనై = మోహముగలదాన నై; బలుతమిన్=అత్యాసక్తిచేత; నిన్నుఁ జేరి =నిన్ను సమీ పించి; ధృతిఁ బాసిన నన్=ధైర్యము విడిచిన నన్ను; రతిన్=సురతముచేత; చొక్కఁజేయుము=పరవశింపఁ జేయుము; సూన శరుండు సాక్షిగన్ =మన్మథుఁడు సాక్షి యగునట్లు; ఉత్కలికలన్=ఉత్కంఠలచేత; నీకున్, అధీనగతిన్=స్వాధీనవిధిని; తాల్చితిన్=ధరించితిని.

చ. అని మునిరాజునిశ్చలత ◊నాత్మవచోర్థచయోరరీకృతిన్
మనమున నిశ్చయించి యల◊మత్తమతంగజయాన యేమి వ
చ్చిన నిఁక వచ్చుఁ గాక యని ◊చిక్కనిధైర్యము పూని యేలు న
న్ననుపమరక్తి నంచు దమి◊హస్తముఁ బట్టి కళం దెమల్చినన్. 114

టీక: అలమత్తమతంగజయాన=మదపుటేనుఁగుయొక్క గమనమువంటి గమనము గల యాచిత్రరేఖ; అని=ఇట్లు పలికి; ముని రాజునిశ్చలతన్=మునీశ్వరునియొక్క నిశ్చలత్వమును; ఆత్మవచోర్థచయోరరీకృతిన్—ఆత్మవచః=తనవాక్కులయొక్క, అర్థచయ=అర్థసమూహముయొక్క,ఉరరీకృతిన్=అంగీకారమును,‘ఊరీకృత మురరీకృత మఙ్గీకృతమ్’ అని యమరుఁడు; మనమునన్=మనస్సునందు; నిశ్చయించి=నిర్ణయించుకొని; ఏమి వచ్చినన్=ఏమి యాపద వచ్చినను; ఇఁకన్=ఈమీఁద; వచ్చుఁగాక యని, చిక్కనిధైర్యము = గాఢమగు ధృతిని; పూని = వహించి; నన్నున్, అనుపమరక్తి న్=అసమానమగు నను రాగముచేత, ఏలు = పాలింపుము; అంచున్= అనుచు; దమిహస్తమున్=మునిహస్తమును; పట్టి = గ్రహించి; కళన్ = కళాస్థాన మును; తెమల్చినన్=చలింపఁజేయఁగ. ఉత్తరపద్యస్థక్రియతో నన్వయము.

అనఁగఁ జిత్రరేఖ తాను జెప్పిన వాక్యముల కాయతివర్యుఁ డంగీకరించె నని యాతని నిశ్చలత్వముచే భ్రమించి, ఇఁక మీఁద నేమైనఁ గానిమ్మని దృఢమైన ధైర్యముతో మునికరమును బట్టి కళాస్థానమును జలింపఁజేసె నని భావము.

క. ఆతఱి నాయతివర్యుం, డాతతముగఁ దెఱచె లోచ◊నాబ్జములు మనో
భూతప్రతిఘోజ్జ్వలన,స్ఫీతజ్వాలద్విలోల◊జిహ్వాంచలుఁ డై. 115

టీక: ఆయతివర్యుండు=ఆవసంతుఁడు; ఆతఱిన్ =ఆసమయమునందు; లోచనాబ్జములు=కనుఁదామరలను; ఆతతముగన్ = విశాలముగ; మనోభూత ప్రతి ఘోజ్జ్వలన స్ఫీత జ్వాల ద్విలోల జిహ్వాంచలుఁ డై – మనోభూత=మనసునందుఁ బుట్టిన, ప్రతిఘా = కోప మనెడు, ‘ప్రతిఘా రుట్ క్రుధౌ స్త్రియామ్’ అని యమరుఁడు, ఉత్=అధికమగు, జ్వలన=అగ్నియొక్క, స్ఫీత=అధిక మగు, జ్వాలత్=మంటవలె నాచరించునట్టియు, విలోల=చలించుచున్నట్టియు, జిహ్వాంచలుఁ డై=నాలుకచివరగలవాఁ డై; తెఱచెన్= విప్పెను. అంత ముని, మనసునం దుదయించు కోపాగ్నిజ్వాలయో యన్నటు లుండు నాలుకకలవాఁడై, కనులు విప్పె నని భావము.

వ. ఇవ్విధంబున నవ్వాచంయమిసార్వభౌముండు తత్పద్మినీహృత్పద్మ సాధ్వసాపాదన చమత్కారి దినాంత సంధ్యాయమాన కోపరసశోణిమధురంధరంబు లగు నేత్రపుష్కరంబులు విప్పి, చెప్పరాని యాగ్రహభంగిఁ జెంగట నున్న యక్కురంగలోచనామణిం గనుంగొని, తోఁకఁ ద్రొక్కిన పెనుజిలువచెలు వున దీర్ఘం బగునిట్టూర్పు సడలించుచు, ‘నో నిలింపచాంపేయగంధి యగంధమహాంధకజిత్పరిపంథి మదాంధకార సంబంధంబునఁ గన్నుగానక మానక నిగుడుమనస్థైర్యంబున దవంబులు చేరి వనంబుల దినంబులుగడుపుచు నమలయమలక్ష్మీసాంగత్యంబున నున్న నన్ను నూరకయె పెచ్చుపెరుఁగు తెచ్చు కోలువలపునఁ బచ్చవిల్తుకయ్యంబునకు నెయ్యం బుంపు మని మదీయకరంబుఁ బట్టఁజెల్లునే, యైన నది యేమి సేయం జను నియ్యెడ నీ వేలుపుఁదొయ్యలితనంబు దూలి యియ్యవని మనుజవనిత వై పుట్టి, సుదోషాకరసమాఖ్యం దగు నొక్కయిరాపుం జెట్టవట్టి యుండెదు గాక’ యని శపియించె నపుడు. 116

టీక: ఇవ్విధంబునన్=ఈప్రకారముగ; అవ్వాచంయమిసార్వభౌముండు =మునిచక్రవర్తి యగు నావసంతుఁడు; తత్పద్మినీ హృత్పద్మ సాధ్వసాపాదన చమత్కారి దినాంత సంధ్యాయ మానకోపరస శోణిమధురంధరంబులు – తత్పద్మినీ=ఆపద్మినీ జాతిస్త్రీయొక్క, హృత్పద్మ=హృదయకమలమునకు, సాధ్వసాపాదన=భయాపాదకమగు, చమత్కారి=విచిత్రమగు, దినాంత=పగటిచివరయందలి, సంధ్యాయమాన=సంధ్యవలె నున్న, కోపరస=క్రోధరసముయొక్క,శోణిమ=ఎఱ్ఱదనము యొక్క, ధురంధరంబులు=భారవహములు; అగు=అయినట్టి; నేత్రపుష్కరంబులు=కనుదామరలను; విప్పి=తెఱచి; చెప్ప రాని=వచించుట కలవిగాని; ఆగ్రహ=కోపముయొక్క; భంగిన్=రీతిచేత; చెంగటన్=సమీపమందు; ఉన్న యక్కురంగ లోచనామణిన్ = ఉన్నట్టి స్త్రీరత్నమగు చిత్రరేఖను; కనుంగొని=చూచి; తోఁకఁ ద్రొక్కిన పెనుజిలువచెలువునన్ = తోఁక ద్రొక్కిన పెనుసర్పము కైవడి; దీర్ఘం బగునిట్టూర్పు=నిడుద యగు నిశ్వాసమును; సడలించుచున్=విడుచుచు; ఓ నిలింపచాంపేయ గంధి = చంపకపుష్పముయొక్క పరిమళమువంటి (దేహ)పరిమళము గలిగిన యో సురాంగనా! అగంధమహాంధకజిత్పరి పంథి మదాంధకారసంబంధంబునన్ – అగంధ=అధికమగు, మహాంధకజిత్=అంధకాసురుని జయించిన శంకరునికి, పరి పంథి = శత్రువైన మన్మథునియొక్క, మద=గర్వమనెడు, అంధకార=చీఁకటియొక్క, సంబంధంబునన్=సంయోగముచేత; కన్ను గానక=కన్ను దెలియక; మానక=వదలక; నిగుడు=కలుగునట్టి; మనస్థైర్యంబునన్=మనస్సుయొక్క దార్ఢ్యముచేత; దవంబులు =అరణ్యములు; చేరి=ప్రవేశించి; వనంబులన్=తపోవనములయందు; దినంబులు=వాసరములను; గడుపుచు = వెచ్చిం చుచు; అమలయమలక్ష్మీసాంగత్యంబునన్ – అమల=స్వచ్ఛమగు, యమ=నియమముయొక్క, లక్ష్మీ=సంపద యొక్క, సాంగత్యంబునన్=సంబంధముచేత; ఉన్న నన్నున్=ఉన్నట్టి నన్ను; ఊరకయె=నిష్కారణముగ; పెచ్చుపెరుఁగు తెచ్చుకోలువలపునన్ – పెచ్చుపెరుఁగు=అతిశయించు, తెచ్చుకోలువలపునన్=ఆరోపితకామముచేతను; పచ్చవిల్తుకయ్యం బునకున్= మన్మథయుద్ధమునకు, అనఁగా సురతమునకు; నెయ్యంబు=ప్రేమను; ఉంపుము అని = ఉంచుమనుచు; మదీయ కరంబున్ =నాయొక్కహస్తమును; పట్టన్=గ్రహింపఁగా; చెల్లునే=తగునా? ఐనన్=అటులైనను; అది=ఆకరమును బట్టు కొనుట; ఏమి సేయం జనున్=ఏమి చేయఁ బోవును, ఆకార్యము నిరర్థక మనుట; ఇయ్యెడన్=ఈసమయమందు; నీ వేలుపుఁ దొయ్యలితనంబు=నీ దేవాంగనాత్వము; తూలి=తొలఁగి; ఇయ్యవనిన్=ఈపుడమియందు; మనుజవనితవు =మనుష్యస్త్రీవి; ఐ=అయి; పుట్టి=జనించి; సుదోషాకరసమాఖ్యన్=సుదోషాకరుఁడను నన్వర్థనామముచేత; తగు=ఒప్పునట్టి; ఒక్కయిరాపున్ = ఒక్క మద్యపాయిని; జెట్టవట్టి=వివాహమాడి; యుండెదు గాక=ఉందువు గాక; అని=అనుచు; అపుడు; శపియించెన్= శాపము నిచ్చెను.

అనఁగ నామునిసార్వభౌముఁడు కోపముచే నెఱ్ఱనగుకన్నులు దెఱచి, చిత్రరేఖను జూచి, తోఁక ద్రొక్కినపాముభంగి నిశ్వాసంబు విడుచుచు, ‘ఓదేవాంగనా నీవు మదనమదాంధకారముచేఁ గన్నుగానక దవంబులఁ జేరి తపం బొనరించుచున్న నన్ను నకార ణంబుగ సురతమునకై నామీఁద ప్రేమ ముంచుమని కరంబు గ్రహించుట యుక్తముగా’దని పలికి, యిప్పుడె నీదేవాంగనాత్వము తొలఁగి మనుజాంగనవై పుట్టి, సుదోషాకరుఁ డను పేరుగల నొక యిరాపునిఁ బెండ్లియాడు మని శపించె నని భావము.

సీ. తనక్రొందళములమ◊న్నన చెట్లపాలుగాఁ, జనియె సూనశ్రీల ◊నెనసి మధువు,
తనతరోగరిమ మెం◊తయు ధూళిపాలుగా, నరిగె వడంకుచు ◊నసదుగాడ్పు,
తనమహస్ఫూర్తి తొ◊ల్తనె యగ్నిపాలుగాఁ, బఱచె వెల్వెలఁ బాఱి ◊పద్మవైరి,
తనపాత్రవృత్తి తో◊డ్తనె మింటిపాలుగా, నడఁగెఁ గొమ్మలఁ బి◊కాద్యభ్రగాళి,
తే. తనపురారాతిభీకరో◊దగ్రవిగ్ర,హస్ఫురణ భూతిపాలుగా ◊నతనుఁ డేగె,
చాపశతజాతములు వన◊స్థలిని వైచి, యమ్మహామౌని కోపాప్తి ◊నడరు నపుడు. 117

టీక: అమ్మహామౌని=ఆవసంతుఁడు; కోపాప్తి న్=కోపప్రాప్తిచేత; అడరు నపుడు =అతిశయించు నపుడు; మధువు=చైత్రుఁడు; తనక్రొందళముల మన్నన =తనయొక్క నూతనమగు సేనలయొక్క మన్నన; చెట్లపాలుగాన్=చెట్లపాలు కాఁగా; సూనశ్రీలన్ – సు=మిక్కిలి, ఊన=కొదువపడిన, శ్రీలన్=సంపదలను, ఎనసి=పొంది; చనియెన్=పోయెను.మునికి కోపము వచ్చి యతిశ యించు నపుడు చైత్రుఁడు తనదండు చెట్లపాలు కాఁగా, సంపదల వీడిపోయెనని తాత్పర్యము. ఇచటఁజైత్రుఁడు క్రొందళము లనఁగఁ జిగురాకులు చెట్లపాలు కాఁగా, అనఁగా వృక్షములయందు చేరఁగానే సూనశ్రీల ననఁగా ప్రసూనసంపదలను పొంది చనియె నని స్వభావార్థము. వసంతము రాఁగానె మ్రాఁకు లంకురించుటయును, పుష్పించుటయును సహజమని భావము. అసదుగాడ్పు=మందమారుతము; తనతరోగరిమము=తనబలిమియొక్క యతిశయము; ఎంతయున్=మిక్కిలి; ధూళి పాలుగాన్=దుమ్ముపాలు కాఁగా; వడంకుచున్=వణఁకుచు; అరిగెన్=పోయెను. మలయానిలము తనసామర్థ్యము ధూళి పాలై పోఁగా, భయపడి వణఁకుచుఁ బోయె నని భావము. అసదుగాడ్పు=మందమారుతము; తనతరోగరిమము=తనయొక్క వేగాధిక్యము; ధూళిపాలుగాన్=దుమ్ములోఁ గలియఁగ; వడంకుచున్=చలించుచు; అరిగె నని స్వభావార్థము. అనఁగ మారుత మునకు ధూళిలోఁ గలయుటయు, చలించుటయు సహజమని భావము. పద్మవైరి=చంద్రుఁడు; తనమహస్ఫూర్తి=తనప్రతాపస్ఫూర్తి; తొల్తనె=మొదటనె; అగ్నిపాలుగాన్=అగ్నిపాలైపోవ; వెల్వెలఁ బాఱి =వివర్ణముగలవాఁడై, కాంతిహీనుఁడై యనుట; పఱచెన్=పాఱిపోయెను. చంద్రుఁడు తనప్రతాప మగ్నిపాలు కాఁగానే కాంతిహీనుఁడై పాఱిపోయె నని భావము. తనమహస్ఫూర్తి=తనకలాస్ఫూర్తి; తొల్తనె=మొదటనె; అగ్నిపాలుగాన్=అగ్నిపాలై పోవ, అగ్నిహోత్రుఁడు మొదట చంద్రుని ప్రథమకలను పానము చేయుననుట ప్రసిద్ధము. దీనికి ‘ప్రథమాం పిబతే వహ్నిః’ అను వచనము ప్రమాణము; వెల్వెలఁ బాఱి =వెలవెలనై, పఱచుట సహజ మని భావము.
పికాద్యభ్రగాళి=పికము మున్నగు పక్షులగుంపు; తనపాత్రవృత్తి =తనయొక్క తగినవార మనెడు వర్తనము; తోడ్తనె =వెంటనె ; మింటిపాలుగాన్ = ఆకాశములో గలసిపోఁగా, అనఁగా వ్యర్థము కాఁగా; కొమ్మలన్=స్త్రీలయందు; అడఁగెన్=దాఁచుకొనెను. కోయిల మొదలగు పక్షులగుంపు తనసంబంధి యగు యుద్ధాదులకు తగినవాఁడను వృత్తి మింటిపాలు కాఁగా వెంటనె భయపడి స్త్రీల మఱుగున దాగికొనె నని భావము. ఇచ్చట కోయిలలు మొదలగునవి, తనపాత్రవృత్తి =తనయొక్క పాత్రము అనఁగా ఱెక్కలసంబంధి యైన వ్యాపారము, ఎగయుట యనుట, మింటిపాలుగాన్ = ఆకాశమునందు వర్తింపఁగ, కొమ్మలన్ = వృక్ష శాఖలందు, అడఁగె నని స్వభావార్థము. కోయిలలు మున్నగు పక్షులు మింటి కెగిరి కొమ్మలయందుఁ జేరుట సహజ మని యభిప్రాయము. అతనుఁడు=మన్మథుఁడు; తనపురారాతిభీకరోదగ్రవిగ్రహస్ఫురణ—తన=తనసంబంధి యగు, పురారాతి=శంకరునికి, భీకర = భయప్రదమైనట్టియు, ఉదగ్ర=అధికమైనట్టియు, విగ్రహ=విరోధముయొక్క, స్ఫురణ=స్ఫురించుట; భూతిపాలుగాన్= బూడిదలో కలియగనె; చాపశరజాతములు=విల్లమ్ములసమూహములను; వనస్థలిన్=వనమందు; వైచి =పడవేసి; ఏగెన్=పో యెను. అనఁగ మన్మథుఁడు శంకరునికి భీకర మగు తనమాత్సర్యస్ఫురణము భూతిపాలు కాఁగానే అడవిలో ధనస్సును, బాణములను పాఱవైచి పోయె నని భావము. మన్మథుని విగ్రహస్ఫురణ మనఁగా శరీరస్ఫురణము. భూతిపా లనఁగా నాశరీ రము భస్మీభూతము కాఁగానే, వనస్థలిన్=నీటియందు, శరజాతము లనఁగా తనకు బాణములైన అరవిందాదులను విడిచి పోయె నని స్వభావార్థము. మన్మథుని శరీరము హరనేత్రాగ్నిచే భస్మ మగుటయు, నతని బాణము లగు నరవిందాదులు జలము నందుండుటయు సహజ మని భావము.

క. ఈరీతి మునీశ్వరవా,గ్భూరీతిభయార్తచంద్ర◊కుసుమాస్త్రపికీ
కీరీతిరోహితతఁ గని, నారీతిలకంబు వెఱపు◊నన్ మదిఁ గలఁగన్. 118

టీక: ఈరీతిన్=ఈప్రకారముగ; మునీశ్వర వా గ్భూరీతి భ యార్త చంద్ర కుసుమాస్త్ర పికీ కీరీ తిరోహితతన్ – మునీశ్వర= జడదారి సామియొక్క,వాక్=శాపరూపవచన మనెడి, భూరి=అధికమగు,ఈతి=పీడవలన నైన, భయ=వెఱపుచేత, ఆర్త= పీడితులగు, చంద్ర=చంద్రునియొక్క, కుసుమాస్త్ర=మన్మథునియొక్క, పికీ=ఆఁడుకోయిలలయొక్క, కీరీ=ఆఁడుచిల్కల యొక్క, తిరోహితతన్=తిరోహితత్వమును, వెనుదిరుగుటను; కని=చూచి; నారీతిలకంబు=చిత్రరేఖ, వెఱపునన్=భయము చే, మదిన్= మన మందు; కలఁగన్=కలఁతపడఁగ. దీనికి నుత్తరపద్యస్థమగు ‘పల్కు’ అను క్రియతో నన్వయము.

మునీశ్వరశాపమునకు చంద్రమన్మథపికకీరములు భయముచే తిరోధానమును బొందుటను జూచి చిత్రరేఖ భయపడి కలఁత నొందె నని భావము.

ఉ. అయ్యతివర్యుఁ జేరి విన◊యంబున నంఘ్రుల వ్రాలి పల్కు, నో
యయ్య! భవత్ప్రభావగతి ◊నాత్మ నెఱుంగక ప్రాజ్యగర్వసా
హాయ్యమునన్ ఘటించితి మ◊హాగము నైన దయాత్మఁ బ్రోవవే
యియ్యెడ నీకు నే ననఁగ ◊నెంత త్వదుక్తి మరల్చి నెమ్మదిన్. 119

టీక: అయ్యతివర్యున్=ఆమునిశ్రేష్ఠుని; చేరి=సమీపించి; వినయంబునన్=అడఁకువచేత; అంఘ్రులన్=పాదములందు; వ్రాలి =ఒరగి; పల్కున్=పలికెను; ఓ అయ్య=ఓమునినాథా! భవత్ప్రభావగతిన్ – భవత్=మీయొక్క, ప్రభావగతిన్=సామర్థ్య విధమును; ఆత్మన్=చిత్తమందు; ఎఱుంగక=తెలియక; ప్రాజ్యగర్వసాహాయ్యమునన్ – ప్రాజ్య=అధికమగు, గర్వ=అహం కారముయొక్క, సాహాయ్యమునన్=తోడ్పాటుచేత, మహాగమున్=గొప్పయపరాధమును; ఘటించితిన్=చేసితిని; ఐనన్ =అట్లైనను; ఇయ్యెడన్=ఈసమయమందు; నీకున్, నే ననఁగ నెంత=నేనెంతటిదానను,అల్పురాల ననుట; త్వదుక్తిన్=నీశాప వాక్యమును; నెమ్మదిన్=నిండుమనముచేత; మరల్చి =త్రిప్పి;దయాత్మన్=దయతోఁ గూడిన చిత్తముచేత; ప్రోవవే=కావుమా.

చ. కటకట నిర్జరీత్వ ముడు◊గన్ ధర మర్త్యవధూటికాత్మ నే
నెటులు జనింతు, నైన మఱి ◊యేగతి దుష్టసమాఖ్యఁ బూని స
త్పటలవినిందనీయగతిఁ ◊దాల్చినవాని వరించి యోర్తు, నా
వటముగ నీదుమాట ముని◊వర్య మరల్చి దయాత్మఁ బ్రోవవే. 120

టీక: నిర్జరీత్వము=దేవాంగనాత్వము; ఉడుగన్=పోవఁగ; ధరన్=భూమియందు; మర్త్యవధూటికాత్మన్=మనుష్యాంగనా రూపముచేత; ఏనెటులు జనింతున్ = ఏవిధముగా నేను పుట్టుదును; ఐనన్=అట్లు జనించినను; మఱి యేగతి =మఱి యేరీతిగ; దుష్టసమాఖ్యన్=దుష్టనామమును; పూని=వహించి; సత్పటలవినిందనీయగతిన్ – సత్పటల =సత్సమూహమునకు, వినింద నీయ=మిక్కిలి గర్హితమగు, గతిన్=రీతిని; తాల్చినవానిన్=ధరించినవానిని; వరించి=కోరి; ఓర్తున్=సహింతును? కటకట = అతికష్టము; మునివర్య =మునిశ్రేష్ఠుఁడా! ఆవటముగన్=ఉపాయముగ; నీదుమాటన్=నీశాపరూపవాక్యమును; మరల్చి= త్రిప్పి; దయాత్మన్=దయతోఁ గూడిన చిత్తముచేత; ప్రోవవే=రక్షింపుమా.

అనఁగ మునినాథా! నీశాపమున నాదేవత్వము వీడినను సహింతును గాని, దుష్టసమాఖ్యను బూనిన మద్యపాయిని పెండ్లి యాడి యెటు లోర్తును? యుక్తిచే నీశాపోక్తిని మరల్చి, నన్నుఁ బ్రోవు మని భావము.

చ. అనువనితాప్రియోక్తిఁ గరు◊ణాయతనాయితమానసాబ్జుఁడై
మునికులముఖ్యుఁ డిట్లను న◊మోఘము మద్వచనంబు లైన నే
ర్పున నిఁక దాని కన్యగతిఁ ◊బూన్తుఁ బయోజదళాక్షి యంచుఁ బా
వననిపుణత్వరూఢి దయి◊వాఱ యతీశుఁడు పల్కు వెండియున్. 121

టీక: అనువనితాప్రియోక్తిన్ = ఈప్రకారము పలుకుచున్న చిత్రరేఖయొక్క ప్రియమైన పలుకులను; కరుణాయతనాయిత మానసాబ్జుఁడై – కరుణా=కరుణయొక్క, ఆయతనాయిత=గృహమువలె నాచరించుచున్న, మానసాబ్జుఁడై = చిత్తకమలము గలవాఁడై; మునికులముఖ్యుఁడు=మునిశ్రేష్ఠుఁడు; ఇట్లు=వక్ష్యమాణప్రకారముగ; అనున్=పలికెను; పయోజదళాక్షి=పద్మనేత్రి వగు చిత్రరేఖా! మద్వచనంబు=నామాటలు;అమోఘములు=రిత్తవోవునవి కావు; ఐనన్=అట్లైనను; నేర్పునన్=నైపుణ్యముచేత; ఇఁకన్= ఈమీఁద; దానికిన్ = ఆశాపవాక్యమునకు; అన్యగతిన్ = అర్థాంతరమును; పూన్తున్ అంచు = కలుగఁజేతు ననుచు;
పావననిపుణత్వరూఢి – పావన=పరిశుద్ధమగు, నిపుణత్వ=నైపుణ్యముయొక్క, రూఢి=ప్రసిద్ధి; దయివాఱన్=అతిశయించు నటులు; వెండియున్=మఱియును; యతీశుఁడు=మునిశ్రేష్ఠుఁడు; పల్కున్=పల్కెను.

చ. సరసిజగంధి వింటివె సు◊చంద్రసమాఖ్య రహించుభూపతిం
బరిణయ మందు మంచు నల◊భవ్యవచస్తతి కర్థమౌట ను
ర్వర ఘనరాజవంశమున ◊రాజిలి జిష్ణువిరోధిభేదనా
దరు నినవంశమౌళిమణిఁ ◊దన్వి వరించి చెలంగె దెంతయున్. 122

టీక: సరసిజగంధి=పద్మముయొక్క గంధమువంటి గంధము గల చిత్రరేఖా! వింటివె =వింటివా? అలభవ్యవచస్తతికిన్ = సుదోషాకరసమాఖ్యఁదగునొక యిరాపు ననెడి వచనజాతమునకు; సుచంద్రసమాఖ్య రహించుభూపతిం బరిణయ మందు మంచున్ = సుచంద్రుండను పేరుగల రాజును వివాహము చేసికొను మని; అర్థమౌటన్=అర్థ మగుటవలన, ఎటులనఁగ, దోషా శబ్దమునకు రాత్రి యను నర్థము, ఆరాత్రిని జేయువాఁడు దోషాకరుఁడు అనఁగా చంద్రుఁడు గావునను, సుదోషాకరుఁడన సుచంద్రుఁ డని యర్థము. ఇరా యనఁగ భూమి, ‘ఇరా భూ వాక్సురాప్సు స్యాత్’ అని యమరుఁడు, కావున నిరాపుఁడనఁగా భూపుఁ డని యర్థము. ఈరీతిగా సుదోషాకరాఖ్యుఁడగు నిరాపు డనఁగా సుచంద్రుఁ డను పేరుగల రాజని యర్థము; ఉర్వరన్ =భూమియందు; ఘనరాజవంశమునన్=గొప్పరాజవంశమందు; రాజిలి=ఒప్పినదానవై; జిష్ణువిరోధిభేదనాదరున్ – జిష్ణు విరోధి=ఇంద్రశత్రువు లగు రాక్షసులయొక్క, భేదన=బ్రద్దలుచేయుటయందు, ఆదరున్=ఆదరముగలవానిని; ఇనవంశమౌళి మణిన్=సూర్యవంశశిరోరత్నమును; వరించి=కోరి; తన్వి=చిత్రరేఖా! ఎంతయున్=మిక్కిలి; చెలంగెదు=ఒప్పెదవు.

తే. అఖిలభూమిధురాభర◊ణాఢ్యు నాధ,రాభుజునిఁ జెట్టవట్టి దు◊ర్వారవిభవ
సంగతి శతసహస్రవ◊త్సరము ధరణి, నలరి యంత భవద్రూప◊మందె దనిన. 123

టీక: అఖిలభూమిధురాభరణాఢ్యున్ – అఖిల=సమస్తమగు, భూమిధురా=భూభారముయొక్క, భరణ=భరించుటచేత; ఆఢ్యున్=అధికుఁడగు; ఆధరాభుజునిన్=ఆరాజును (సుచంద్రుని); చెట్టవట్టి =వివాహమాడి; దుర్వారవిభవసంగతిన్ – దుర్వార=అనివార్యమగు, విభవ=సంపదయొక్క,సంగతిన్=సంబంధముచేత; శతసహస్రవత్సరము=నూఱువేలసంవత్సర ములు; ధరణిన్=భూమియందు; అలరి=ఒప్పి; అంతన్=అటుపిమ్మట; భవద్రూపము=నీదేవాంగనారూపమును; అందెదు = పొందుదువు; అనినన్=అనఁగా. దీని కుత్తరపద్యస్థక్రియతో నన్వయము. అనఁగ సార్వభౌముఁడగు సుచంద్రునిఁ బెండ్లియై లక్ష సంవత్సరములు పుడమియందుండి యామీఁద నీదేవాంగనారూపమును బొందగలవని భావము.

చ. విని ప్రమదప్రవాహపరి◊వేష్టితమానస చిత్రరేఖ యం
త నలమునీశుపాదనలి◊నంబులకుం బ్రణమిల్లి యాఘనుం
డనుప హితాళిపాళియుతి ◊నాస్థలి నల్లనఁ బాసి యాత్మకాం
చనమయకేళికానిలయ◊సంస్థలిఁ జేరె రయంబు మించఁగన్. 124

టీక: ప్రమదప్రవాహపరివేష్టితమానస – ప్రమద=సంతోషమను, ప్రవాహ=ప్రవాహముచే, పరివేష్టిత=చుట్టఁబడిన, మానస= చిత్తము గలదగు; చిత్రరేఖ, విని=మునివచనమును విన్నదై; అంతన్=అటుపిమ్మట; అలమునీశుపాదనలినంబులకున్ = ఆమునీశ్వరుని పాదకమలములకు; ప్రణమిల్లి=నమస్కరించి; ఆఘనుండు = గొప్పవాఁడైన యావసంతుఁడు; అనుపన్= పంపివేయఁగ; హితాళిపాళియుతిన్ – హిత=అనుకూలురగు, ఆళి=సకియలయొక్క, పాళి=పంక్తియొక్క, యుతిన్= కూడికచేతను; ఆస్థలిన్=ఆపారిజాతారణ్యప్రదేశమును; అల్లనన్=తిన్నగ; పాసి=వదలి; ఆత్మకాంచనమయకేళికానిలయ సంస్థలిన్ – ఆత్మ=తనయొక్క,కాంచనమయ=సువర్ణమయమగు, కేళికానిలయ=కేళీగృహముయొక్క, సంస్థలిన్ =ప్రదేశ మును; రయంబు మించఁగన్ = త్వరతోడ; చేరెన్=చేరెను. పుర్వోక్తవాక్యములను విన్నదై చిత్రరేఖ వసంతమునికి నమస్కరించి సంతసమున సకియలం గూడి స్వకీయకాంచనమయగృహమును జేరె నని భావము.

ఉ. ఆలలితాంగి యొక్క భవి◊కాహమునన్ క్షణదోదయాఖ్య పాం
చాలవసుంధరాపతికి ◊శ్యామ యనం బొగడొందు సుందరీ
మౌళియెడన్ జనించె, నల◊మానవభర్తయు భూరిహర్షభూ
షాకలితాత్ముఁడై యునిచెఁ ◊జంద్రిక యన్శుభనామ మింతికిన్. 125

టీక: ఆలలితాంగి=ఆచిత్రరేఖ; ఒక్క భవికాహమునన్=ఒకశుభదినమునందు;క్షణదోదయాఖ్యపాంచాలవసుంధరాపతికిన్ – క్షణదోదయాఖ్య=క్షణదోదయుఁ డను పేరుగల, పాంచాలవసుంధరాపతికిన్=పాంచాలదేశపురాజునకు; శ్యామయనన్ = శ్యామ యను పేరిట; పొగడొందు=ప్రసిద్ధిని పొందినట్టి; సుందరీమౌళియెడన్ = కాంతారత్నమునందు; జనించెన్=పుట్టెను; అలమానవభర్తయు=ఆక్షణదోదదయరాజును; భూరిహర్షభూషాకలితాత్ముఁడై – భూరి=అధికమగు, హర్ష=సంతసముచేత, భూషా=ఆభరణములచేతను, కలిత=పొందఁబడిన, ఆత్ముఁడై=మనమును దేహమును గలవాఁడై; ఇంతికిన్=కూఁతునకు; చంద్రికయన్శుభనామము= చంద్రిక యను శుభనామధేయమును; ఉనిచెన్=ఉంచెను.

చిత్రరేఖ పుడమియం దొకశుభదినమున పాంచాలరాజైన క్షణదోదయునికి శ్యామయను నారీరత్నమందు కూఁతురై జన్మించెను. ఆకూఁతురునకు క్షణదోదయుఁడు చంద్రిక యను మంగళకరమైన పేరును పెట్టెను.

మ. తనకార్యంబున కీగతిం జని యమ◊ర్త్యస్త్రీలలామంబు పా
వనమౌన్యుక్తి నిజాదివర్ణరహిత◊త్వం బూని ధాత్రిం జనిం
చిన వార్తన్ విని చింత నొంది మదిఁ ద◊త్స్నేహంబుతో దివ్యచి
హ్ననికాయంబులు గల్గఁ జేసె నవలా ◊కబ్జాసనుం డెంతయున్. 126

టీక: అబ్జాసనుండు=నలువ; తనకార్యంబునకున్=మునితపోభంగరూప స్వకార్యమునకు; ఈగతిన్=ఈరీతిగా; చని=పోయి; అమర్త్యస్త్రీలలామంబు = దేవాంగనారత్నమగు చిత్రరేఖ; పావనమౌన్యుక్తిన్ = పవిత్రమగు మునిశాపోక్తిచేత; నిజాదివర్ణరహిత త్వంబు – నిజ=అమర్త్యస్త్రీశబ్దముయొక్క, ఆదివర్ణ=ప్రథమవర్ణమగు ‘అ’కారముయొక్క, రహితత్వంబు=రాహిత్యమును, అనఁగా ‘అమర్త్యస్త్రీ’లోని ‘అ’కారము తొలగుటవలన ‘మర్త్యస్త్రీ’ యైనదని భావము; ఊని=పూని; ధాత్రిన్=పుడమియందు; జనించిన వార్తన్=జన్మించెనను జనశ్రుతిని;విని=ఆకర్ణించి; చింతన్=విచారమును; ఒంది=పొంది;మదిన్=హృదయమునందు; తత్స్నేహంబుతోన్=ఆచిత్రరేఖయందలి ప్రేమచేత; నవలాకున్=చంద్రికకు; ఎంతయున్=మిక్కిలి; దివ్యచిహ్ననికాయంబులు = దివ్యమగు భాగ్యచిహ్నములయొక్క సమూహములను; కల్గన్=కల్గునట్లుగ; చేసెన్=ఒనరించెను. అనఁగఁ బారిజాతారణ్య మందు బ్రహ్మత్వమునకై తపం బొనరించు వసంతమునితపోభంగమునకుం దాను బంపిన చిత్రరేఖకు నామునిశాపమువలన మర్త్యస్త్రీత్వము రాఁగానే నలువ చింతించి, యాకాంతకు నమోఘభాగ్యచిహ్నములు గలుగఁ జేసె నని భావము.

ఉ. ఆసరసీరుహాక్షి కఖి◊లాద్భుతదాయివిపంచికాకలా
భ్యాస మొనర్పఁ జెంతఁ దగు◊నట్టి ననుం గుముదాఖ్యుఁ గాంచి ప
ద్మాసనుఁ డంపఁ బూర్వసమ◊యామితమైత్త్రి ధరిత్రిఁ జేరి యు
ద్భాసితతద్రహస్యగతిఁ ◊దన్వికి నేర్పితి నేర్పు పెంపునన్. 127

టీక: ఆసరసీరుహాక్షికిన్ = ఆచంద్రికకు; అఖిలాద్భుతదాయివిపంచికాకలాభ్యాసము – అఖిల=సమస్తజనులకు, అద్భుత = ఆశ్చర్యమును, దాయి=ఇచ్చునట్టి, విపంచికాకలా=వీణావిద్యయొక్క, అభ్యాసము=నేర్పుటను; ఒనర్పన్=చేయుటకు; కుముదాఖ్యున్=కుముదుఁడను పేరుగల; చెంతన్ తగునట్టి ననున్= సమీపమునందున్న నన్ను; కాంచి = చూచి; పద్మాస నుఁడు =నలువ; అంపన్=పంపఁగా; పూర్వసమయామితమైత్త్రిన్ – పూర్వసమయ=పూర్వకాలమందున్నట్టియు, అమిత= అధికమగునట్టియు, మైత్త్రిన్=స్నేహముచేతను; ధరిత్రిన్=భూమిని; చేరి=పొంది; ఉద్భాసితతద్రహస్యగతిన్ – ఉద్భాసిత = ప్రకాశించుచున్న, తత్=ఆవీణావిద్యయొక్క, రహస్య=నిగూఢమగు, గతిన్ =రీతిని;తన్వికిన్=చంద్రికకు; నేర్పు పెంపునన్ = నైపుణ్యాతిశయముచేత; నేర్పితిన్=అభ్యసింపఁజేసితిని.

అనఁగ నలువ చెంతనున్న కుముదుఁడను పేరుగల నన్నుఁ జూచి, పుడమికిఁ బోయి చంద్రికకు వీణావిద్యారహస్యమును దెలుపు మనఁగా, నేను బూర్వస్నేహంబున భూమింజేరి తద్విద్యారహస్యము నామెకు నేర్పితి నని భావము.

తే. అంత నొకనాఁడు శారదా◊కాంతవలన
వింతరాగంబు లొకకొన్ని◊విని ముదమున
వాని నన్నింటి నారాజ◊వర్యసుతకుఁ
దెలిపెద నటంచుఁ బుడమి కే◊తెంచు నపుడు. 128

టీక: అంతన్=అటుపిమ్మట; ఒకనాఁడు =ఒకదినమందు; శారదాకాంతవలనన్=సరస్వతీదేవివలన; వింతరాగంబులు=విచిత్ర మగు రాగములను; ఒకకొన్ని=కొన్నింటిని; విని=ఆకర్ణించి; ముదమునన్=సంతసముచేత; వాని నన్నింటిన్ = ఆరాగముల నన్నిటిని; ఆరాజవర్యసుతకున్=ఆచంద్రికకు; తెలిపెద నటంచున్ =తెలియఁజేసెద ననుచు; పుడమికి=భూమికి; ఏతెంచునపుడు = వచ్చుచున్న సమయమందు;

సీ. కనుదోయి కింపూన్చు ◊కలికికుంకుమబొట్టు, దార్చిననెమ్మోముఁ◊దమ్మిదాని,
నీటుగాఁ దీర్చిన ◊కాటుకరేఖచే, నొప్పారు విమలాక్షి◊యుగముదాని,
నునుపు లౌ తొడలని◊గ్గున వింతవగ దోఁచు, నవ్యచీరాచ్ఛాద◊నమ్ముదానిఁ,
బసపుచాల్పూఁతచేఁ ◊బచ్చదామరపెంపు, దలఁకించు పాణిపా◊దమ్ముదాని,

తే. జలదనికటస్థలి రహించు ◊చపలవోలెఁ, బర్ణదళశాలపొంతఁ జూ◊పట్టుదాని,
నొక్క మునికాంత నీయద్రి◊చక్కిఁ గాంచి, చాల వైచిత్రి నెమ్మది ◊సందడింప. 129

టీక: కనుదోయికిన్=కనుఁగవకు; ఇంపూన్చుకలికికుంకుమబొట్టు – ఇంపు=సొంపును, ఊన్చు=చేయుచున్న, కలికి = సుందరమగు, కుంకుమబొట్టు=కాశ్మీరతిలకము; తార్చిన=దిద్దిన; నెమ్మోము తమ్మిదానిన్=అందమగు ముఖకమలము గలదానిని; నీటుగాన్=శృంగారముగ; తీర్చినకాటుకరేఖచేన్=దిద్దినకాటుకరేకచేత; ఒప్పారు విమలాక్షియుగముదాని – ఒప్పారు =ప్రకాశించుచున్న; విమల=నిర్మలమగు; అక్షియుగముదాని = కనుదోయి గలదానిని; నునుపు లౌ తొడలనిగ్గునన్ = నునుపులగు తొడలయొక్క కాంతిచేత; వింతవగ=ఆశ్చర్యకరమగు విలాసము; తోఁచు=ప్రకట మగుచున్న; నవ్యచీరాచ్ఛాదనమ్ముదానిన్ – నవ్య=నూతనమగు, చీరాచ్ఛాదనమ్ముదానిన్ = నారకోఁకగలదానిని; పసపుచాల్పూఁతచేన్ = పసపు సమృద్ధిగాఁ బూయుటచే; పచ్చదామరపెంపు=పసపుతామరపూలయొక్క అతిశయమును; తలఁకించు=చలింపఁజేయు; పాణిపాదమ్ముదానిన్ = హస్తపాదములు గలదానిని, ప్రాణ్యంగము లగుటచే నేకవద్భావము. జలదనికటస్థలిన్ – జలద=మేఘముయొక్క, నికటస్థలిన్=సమీపప్రదేశమునందు; రహించు =ఒప్పుచున్న; చపలవోలెన్= మెఱపుతీఁగవలె; పర్ణదళశాల=మోదుగాకులతోఁ గప్పఁబడిన పర్ణశాలయొక్క; పొంతన్=సమీపమున; చూపట్టుదానిన్=కను పట్టుదానిని; ఒక్క మునికాంతన్= ఒకమునిపత్నిని; ఈయద్రిచక్కిన్=ఈపర్వతస్థానమందు; కాంచి = చూచి; చాల వైచిత్రి = మిక్కిలి యాశ్చర్యము; నెమ్మదిన్=మనమునందు; సందడింపన్=అతిశయింపఁగా.

చ. కళ గలమోము, కెంపుసిరి ◊గాంచినపల్దెర, తేనె లొల్కు ప
ల్కులు, బిగువైన చన్నుఁగవ, ◊కుందనపుంజిగి నేలు ముద్దుచె
క్కులు గల యీచెలిం బ్రియపుఁ◊గూర్మివగ న్ననవిల్తుపోరునం
గలయక యున్నచోఁ దలఁపఁ◊గల్గునొకో నవసౌఖ్యమం చొగిన్. 130

టీక: కళ గలమోము = కాంతి గల ముఖము; కెంపుసిరిన్ కాంచినపల్దెర – కెంపుసిరిన్=ఎఱ్ఱనికాంతిని; కాంచినపల్దెర=పొంది నట్టి మోవి; తేనె లొల్కు పల్కులు = మకరందమును జిల్కు మాటలు; బిగువైన చన్నుఁగవ =బిగుతుగల పాలిండ్లును; కుందనపుంజిగిన్ = అపరంజికాంతిని; ఏలు ముద్దుచెక్కులు =గ్రహించిన సుందరమగు కపోలములు; కల =కలిగినట్టి; ఈచెలిన్ = ఈమునిపత్నిని; ప్రియపు కూర్మిన్ = ప్రియమగు చెలిమిచేతను; వగన్=విలాసముచేతను; ననవిల్తుపోరునన్= సురతమునందు; కలయక యున్నచోన్ = కూడకయుండినయెడల; నవసౌఖ్యము=నూతనమగు సుఖము; దలఁపఁగల్గు నొకో= తలఁపవచ్చునా? తలఁపరాదని భావము; అంచున్=అని తలఁచుచు; ఒగిన్=క్రమముగా.

ఉ. తాపసరాట్కుమారసమ◊తాకలితాకృతి నాత్మవిద్య మా
యాపటిమన్ భరించి, తదు◊దారనవచ్ఛదశాలఁ జేరి, యు
ద్దీపితభక్తిఁ దన్మునిపి◊తృప్రముఖానవరక్షమీశరా
జీపదపద్మము ల్వినతి◊చేయుచు నంతటఁ దత్కథాగతిన్. 131

టీక: తాపసరాట్కుమారసమతాకలితాకృతిన్ – తాపసరాట్కుమార=మునిశ్రేష్ఠుని కుమారునియొక్క, సమతా=సమత్వ ముతో, కలిత=కూడుకొన్న, ఆకృతిన్=ఆకారమును; ఆత్మవిద్యన్ =స్వభావసిద్ధమైన విద్యచేత; మాయాపటిమన్ = మాయ యొక్క పటుత్వము (సామర్థ్యము) చేత; భరించి=వహించి, నామాయచేత మునిపుత్త్రాకృతిని ధరించి యని భావము; తదుదార నవచ్ఛదశాలన్ – తత్=ఆమునికుమారునియొక్క, ఉదార=ఉత్కృష్టమగు, నవ=నూతనమైన, చదశాలన్=పర్ణశాలను; చేరి =సమీపించి; ఉద్దీపితభక్తిన్=అధికమగు భక్తిచేత; తన్మునిపితృప్రముఖానవరక్షమీశరాజీపదపద్మముల్ –తన్ముని=ఆముని యొక్క,పితృ=తండ్రి, ప్రముఖ=మొదలుగాఁగల, అనవరక్షమీశ=పెద్దమునులయొక్క, రాజీ=పంక్తియొక్క, పదపద్మముల్ =పాదకమలములను; వినతిచేయుచున్=నమస్కరించుచు; అంతటన్=అటుమీఁద; తత్కథాగతిన్–తత్=ఆమునులయొక్క, కథాగతిన్=కల్పితవృత్తాంతముయొక్కరీతిచే. దీని కుత్తరపద్యమందున్న క్రియతో నన్వయము.

తే. ప్రొద్దు గడపుచు నుండ మ◊త్పూర్వకర్మ
గౌరవమ్మున నమ్ముని◊కాంతుఁ డచటి
కుట్టిపడ్డట్లు కన్నూడి◊నట్టు లపుడు
వేగమున వచ్చెఁ దత్సభ ◊వెఱఁగుపడఁగ. 132

టీక: ప్రొద్దు గడపుచు నుండన్=పూర్వోక్తకథచేఁ కాలము బుచ్చుచుండఁగ; మత్పూర్వకర్మగౌరవమ్మునన్ – మత్=నా యొక్క, పూర్వకర్మ=పూర్వజన్మదుష్కర్మముయొక్క, గౌరవమ్మునన్= ఆధిక్యతచేత; అమ్మునికాంతుఁడు = ఆ ముని నాథుఁడు; అచటికిన్=ఆపర్ణశాలకు; ఉట్టిపడ్డట్లు=హఠాత్తుగ; కన్నూడినట్టులు=నేత్రములూడిన విధముగ; అపుడు = ఆ సమయమునందు; తత్సభ =ఆసభ; వెఱఁగుపడఁగన్=ఆశ్చర్యమునందు నటులు; వేగమున=శీఘ్రముగ; వచ్చెన్.

ఉ. వచ్చిన నమ్మునీశుఁ గని ◊వారక గుండియ వ్రీల నంత నే
నచ్చటఁ దెచ్చుకోలు ధృతి ◊నయ్యతితో శపనోక్తిజాలకం
బెచ్చఁగఁ బెద్దప్రొద్దు కల◊హించితి నప్డు పరస్పరోగ్రఘో
షోచ్చలితాత్మతన్ సభ య◊హో యని యబ్బుర మూని నిల్వఁగన్. 133

టీక: వచ్చినన్=రాఁగానే; అమ్మునీశున్=ఆమునినాథుని; కని =చూచి; వారక=నిలువక; గుండియ=హృదయము; వ్రీలన్ =చీలఁగ; అంతన్=ఆమీఁద; నేను, అచ్చటన్ =ఆస్థలమందు; తెచ్చుకోలు ధృతిన్ =తెచ్చిపెట్టుకొన్న ధైర్యముచేత; అయ్యతి తోన్ =ఆమునితోడ; శపనోక్తిజాలకంబు – శపనోక్తి=తిట్టులయొక్క, జాలకంబు=సమూహము; ఎచ్చఁగన్=అతిశయింపఁగ; పెద్దప్రొద్దు=దీర్ఘకాలము; సభ =సభయందుండిన జనులు; పరస్పరోగ్రఘోషోచ్చలితాత్మతన్ – పర స్పర=మా యన్యోన్యుల యొక్క, ఉగ్ర=తీక్ష్ణమగు, ఘోష=ధ్వనిచేత, ఉచ్చలిత=మిక్కిలి చలించిన;ఆత్మతన్=మనసుగలవా రగుటచేత; అహో యని = అహోయనుచు; అబ్బురము =ఆశ్చర్యమును; ఊని=పూని; నిల్వఁగన్=నిలుచుండఁగ; అప్డు =ఆసమయమందు; కలహిం చితిన్ = జగడమాడితిని.

క. ఆయతిపతి యాయెడ మ
న్మాయాగతి నెల్లఁ దెలిసి ◊న న్గాంచి మనో
భూయఃపరికందళితమ
హీయఃప్రతిఘారసాప్తి ◊నిట్లని పలికెన్. 134

టీక: ఆయతిపతి=ఆమునిరాజు; ఆయెడన్=ఆసమయమందు; మన్మాయాగతిన్ – మత్=నాయొక్క, మాయాగతిన్= కపటరీతిని; ఎల్లన్=అంతయు; తెలిసి=తెలిసికొని; న న్గాంచి=నన్నుఁ జూచి; మనోభూయఃపరికందళితమహీయః ప్రతిఘా రసాప్తి న్ – మనః=మనమునందు, భూయః=అధికముగా, పరికందళిత=అంకురించినట్టియు, మహీయః= అధికమగు, ప్రతిఘారస=క్రోధరసముయొక్క, ఆప్తి న్=ప్రాప్తిచేత; ఇట్లని పలికెన్ =ఈరీతిగా ననెను. ఆమునినాథుఁడు నాకపటము నంతయు నెఱిఁగినవాఁడై, కోపగించి వక్ష్యమాణప్రకారముగఁ బలికె నని భావము.

శా. ఓరీ కిన్నర! యిట్లు పాపమతివై ◊యుద్వృత్తి మౌనీశ్వరా
కారం బూని మందగనైకరతికాం◊క్షాయుక్తిచే మీఱి యౌ
రా రాఁ జెల్లునె యిప్డు నీవు పవిధా◊రారూపశాపోక్తి దు
ర్వారేభాహితమూర్తివై పొడమరా ◊వైళంబె యియ్యద్రిపైన్. 135

టీక: ఓరీ కిన్నర=ఓ కిన్నరుఁడా! ఇట్లు=ఈప్రకారము; పాపమతివై =పాపబుద్ధి గలవాఁడవై; ఉద్వృత్తిన్=దుష్టవృత్తిచేత; మౌనీ శ్వరాకారంబు = మునివేషమును; ఊని = ధరించి; మందగనైకరతికాంక్షాయుక్తిచేన్ – మందగనా = నాభార్యయొక్క, ఏక= ముఖ్యమగు, రతి=సురతమునందలి, కాంక్షా=కోరికతోడి, యుక్తిచేన్=కూడికచే; మీఱి=అతిక్రమించి; రాఁ జెల్లునె = రాఁ దగునా? ఔరా=ఆశ్చర్యము; ఇప్డు =ఆసమయమందు; నీవు, పవిధారారూపశాపోక్తిన్ – పవి=వజ్రాయుధముయొక్క, ధారా రూప=వాదరవంటిదగు,శాపోక్తిన్=శాపవచనముచేత; వైళంబె =శీఘ్రముగనే; ఇయ్యద్రిపైన్=ఈపర్వతముమీఁద; దుర్వారేభా హితమూర్తివై – దుర్వార = నివారించుటకు శక్యము గాని, ఇభాహితమూర్తివై = సింహ (గజరిపు)శరీరముగల వాఁడవై; పొడమరా = జన్మింపుమురా.

చ. అని ముని శాప మిచ్చిన భ◊యంబు మనంబున నిండి యుండ న
య్యనఘుని పాదపద్మముల ◊నయ్యెడఁ జయ్యన వ్రాలి భక్తిచే
కొని యిటు లంటి, నో నియమి◊కుంజర! మీరు మహాగసుండ నై
నను ననుఁ బ్రోవ రయ్య కరు◊ణాసదనం బగు మానసంబునన్. 136

టీక: ముని =జడదారి; అని=ఈప్రకారముగ; శాప మిచ్చినన్=శాప మీయఁగా; భయంబు=వెఱపు;మనంబునన్=మనస్సు నందు; నిండియుండన్=పరిపూర్ణమయి యుండఁగా; అయ్యనఘునిపాదపద్మములన్ = పుణ్యాత్ముఁడగు నామునియొక్క పాదకమలములందు; అయ్యెడన్=ఆసమయమందు; చయ్యనన్=శీఘ్రముగ; వ్రాలి=ఒరగి; భక్తిచేకొని =భక్తి వహించి; ఇటు లంటి=వక్ష్యమాణప్రకారముగఁ బలికితిని; ఓనియమికుంజర = ఓమునిశ్రేష్ఠుఁడా! మీరు, మహాగసుండను = నేను గొప్ప యప రాధము గలవాఁడను; ఐనను =అట్లైనను; ననున్, కరుణాసదనం బగు మానసంబునన్ =దయకు నెలవైన మనస్సుతో; ప్రోవ రయ్య = రక్షింపుఁడయ్య.

మ. వనజంతూత్కరహింసనోగ్రతరదు◊ర్వ్యాపారసంలబ్ధి మే
దినిఁ గన్పట్టు మతంగజారివరమూ◊ర్తిం బూని వర్తింప నో
ర్తునె యయ్యో మునివర్య యిప్డు నవకా◊రుణ్యంబు నాపై ఘటిం
చి ననుం బ్రోవవె పాపవే మదుపల◊క్ష్యీభూతశాపోక్తికన్. 137

టీక: వనజంతూత్కరహింసనోగ్రతరదుర్వ్యాపారసంలబ్ధిన్ – వనజంతు=అడవిమృగములయొక్క, ఉత్కర= సమూహము యొక్క, హింసన=సంహరించుటయందు, ఉగ్రతర=అతితీక్ష్ణమగు, దుర్వ్యాపార=దుష్టవృత్తియొక్క, సంలబ్ధిన్=ప్రాప్తిచేత; మేదినిన్=భూమియందు; కన్పట్టు=చూపట్టుచున్న; మతంగజారివర=సింహశ్రేష్ఠముయొక్క; మూర్తిన్=శరీరమును; పూని =గ్రహించి; వర్తింపన్=ఉండుటకు; ఓర్తునె=సహింతునా? అయ్యో =అకటా! మునివర్య=మునిశ్రేష్ఠుఁడా! ఇప్డు=ఈసమయ మందు; నవకారుణ్యంబు=నూతనమగు దయను; నాపైన్=నాయందు; ఘటించి=ఉంచి;ననున్, ప్రోవవె =రక్షింపవే; మదుప లక్ష్యీభూతశాపోక్తికన్ – మత్=నేను, ఉపలక్ష్యీభూత=లక్ష్యముగాఁ గలదైన, శాపోక్తికన్ = శాపవచనమును; పాపవే =తొలగింపుమా!

తే. అన దయామయమానసుం ◊డగుట మౌని
మామకీనోక్తి నిజ, మైన ◊మయుకులేంద్ర!
వర్షపంచకము హరీంద్ర◊భావ మూని
యంత నీరూప మందెద ◊వనుచు ననిచె. 138

టీక: అనన్=ఇట్లు ప్రార్థింపఁగా; దయామయమానసుండు=కృపామయమగు హృదయము గలవాఁడు; అగుటన్ = కావుట వలన; మౌని=జడదారి; మామకీనోక్తి =నామాట; నిజము=సత్యమైనది; ఐనన్=అయినను; మయుకులేంద్ర= కిన్నర శ్రేష్ఠుఁడా, ‘తురఙ్గవదనో మయుః’ అని యమరుఁడు; వర్షపంచకము=ఐదేండ్లు; హరీంద్రభావము=సింహత్వమును;ఊని=పొంది; అంతన్ =ఆమీఁద; నీరూపము=నీపూర్వరూపమును; అందెదవు=పొందెదవు; అనుచు = అని పలుకుచు; అనిచెన్=పంపెను.

చ. అనిచిన నేను నమ్మునికు◊లాగ్రణికిం బ్రణమిల్లి మన్మనో
మనసిజశాంబరీకులచ◊మత్కృతి యెంతకుఁ దెచ్చె నంచుఁ బా
యని పెనుచింతతోఁ గలఁగ ◊నాంతర మేనటు వాసి యీవినూ
తనమణిమండపోత్తమము ◊దారునఁ జేరి వసించి యున్నెడన్. 139

టీక: అనిచినన్=పంపఁగా; నేను, అమ్మునికులాగ్రణికిన్ = ఆమునిశ్రేష్ఠునికి; ప్రణమిల్లి =నమస్కరించి; మన్మనో మనసిజ శాంబరీకుల చమత్కృతి – మత్=నాయొక్క, మనః=మనస్సునందలి, మనసిజ=మన్మథునియొక్క, శాంబరీకుల = మాయా బృందముయొక్క, చమత్కృతి=చమత్కారము; ఎంతకుఁ దెచ్చె నంచున్ = ఎంత పని (హాని) చేసె ననుచు; పాయని=వీడని; పెనుచింతతోన్=అధికమైన విచారముతో; ఆంతరము=అంతరంగము; కలఁగన్=కలఁతపడఁగ; ఏను=నేను; అటు పాసి =ఆ స్థలమునువిడిచి; ఈవినూతనమణిమండపోత్తమము=ఈక్రొత్తరవలచవికను; దారునన్= శీఘ్రముగ; చేరి =ప్రవేశించి; వసించి ఉన్నెడన్= కూర్చుండి యున్న సమయమందు.

సీ. కురువిందరుచి నాజిఁ ◊గుదియించు రదరాజి, వక్రతాశాతతా◊వళిత మయ్యె,
నెలపుల్గుకవడంబు ◊గలఁచునేత్రయుగంబు, వృత్తతాహరితతా◊యత్త మయ్యె,
నంబుదావళినీలి ◊నడఁచుశిరోజాళి, ఖర్వతాశోణతా◊కలిత మయ్యె,
నలరుతామరగోము ◊నలయించునెమ్మోము, వివృతతా విపులతా◊భివృత మయ్యె,

తే. నహహ యని పశ్యదఖిలవా◊హాస్యవితతి, విస్మయం బూన బుధవర్ణ్య◊విమలరూప
గౌరవంబున మించు మ◊ద్గాత్ర మపుడు, భీమకంఠీరవాకృతి◊స్థేమ గనియె. 140

టీక: కురువిందరుచిన్=పద్మరాగమణికాంతిని; ఆజిన్=యుద్ధమందు; కుదియించురదరాజి=క్రుంగజేయుచున్నదంతపంక్తి, పద్మరాగములను దిరస్కరించు దంతపంక్తి యని భావము; వక్రతాశాతతావళితము – వక్రతా=కుటిలత్వముచేతను, శాతతా = తీక్ష్ణత్వముచేతను, వళితము=చుట్టఁబడినది; అయ్యెన్=ఆయెను. నెలపుల్గుకవ డంబు – నెలపుల్గుకవ=చకోరమిథునముయొక్క, డంబు=గర్వమును; కలఁచునేత్రయుగంబు = కలఁత పఱచు కనుదోయి; వృత్తతా హరితతాయత్తము – వృత్తతా=వర్తులత్వమునకు, హరితతా=పీతత్వమునకు,ఆయత్తము=స్వాధీనము; అయ్యెన్=ఆయెను. అంబుదావళి=మేఘపంక్తియొక్క; నీలిన్ =నల్లఁదనమును; అడఁచుశిరోజాళి=అడఁగద్రొక్కు కురులగుంపు; ఖర్వతాశోణతా కలితము – ఖర్వతా=కుఱుచఁదనముచేతను, శోణతా=రక్తత్వముచేతను, ఆకలితము=పొందఁబడినది; అయ్యెన్= ఆయెను. అలరుతామరగోమున్ – అలరు=ప్రకాశించు,తామర=కమలముయొక్క, గోము=సౌకుమార్యమును, అందము ననుట; అలయించు నెమ్మోము = శ్రమపఱచుచున్న చక్కనిముఖము; వివృతతా విపులతాభివృతము – వివృతతా = తెఱచుకొని యుండుటచేతను, విపులతా=వైశాల్యముచేతను, అభివృతము = ఆవరింపఁబడినది; అయ్యెన్ = ఆయెను. అహహ యని = ఆశ్చర్య మాశ్చర్య మని; పశ్యదఖిలవాహాస్యవితతి – పశ్యత్=చూచుచున్నట్టియు, అఖిల=సమస్త మైన, వాహాస్యవితతి =కిన్నరుల బృందము; విస్మయంబు=ఆశ్చర్యమును; ఊనన్=పొందఁగా; బుధవర్ణ్యవిమలరూపగౌరవంబు నన్ – బుధ=దేవతలచేత, వర్ణ్య=పొగడఁదగిన, విమల=స్వచ్ఛమగు, రూప=సౌందర్యముయొక్క, గౌరవంబునన్= అతిశ యముచేత; మించు=ఒప్పునట్టి; మద్గాత్రము=నాశరీరము; అపుడు=ఆసమయమందు; భీమ కంఠీర వాకృతి స్థేమన్ – భీమ= భయంకరమగు, కంఠీరవ=సింహముయొక్క, ఆకృతి=ఆకారముయొక్క, స్థేమన్=స్థైర్యమును; కనియెన్=పొందెను.

అనఁగఁ బద్మరాగములవంటి నాదంతములు కుటిలములై పదనుగల వైనవి. చకోరయుగమువంటి నాకనుదోయి గుండ్రమై హరితవర్ణము గలదయ్యెను. మేఘపంక్తివలె నల్లనైన నాకురులు కుఱుచనివై యెఱ్ఱనైనవి. కమలముంటి నామోము తెఱవఁబడి నదై విశాల మయ్యెను. ఇట్లు నాశరీరము కిన్నరబృందము చూచుచుండఁగ భయంకర మగు సింహాకృతిని బొందె నని భావము.

వ. ఇట్టు లతులనాగవిదళనవ్యాపార నవీనశతమఖకరవాలాయమాన ఖరనఖరంబులును, నక్షీణమృగ క్షతజకటాజ్యధారా సముజ్జ్వల జ్జఠరజ్వలన సమున్నత జ్వాలాయమాన రసనాకిసలయంబును, నమందతుంద కారామందిర బందీకృత స్వభృత సారంగకులీన సారంగవిమోచనలాలసా విలసనోత్త మాంగ రాజసదన వదనద్వారాశ్రిత చంద్రరేఖాయమాన వక్రదంష్ట్రాయుగంబును, నాత్మీయహరి తానుబోధక భాస్వద్విరోచనమండలాయమాన నిస్తులలోచనద్వయంబును, నలయప్రభావోరరీకృ తాఖిలజంతు నికృంతన తంతన్యమాన చాతుర్యపృష్ఠేకృత కీనాశపాశాయమాన దీర్ఘవాలంబును, నతిఘనఘనాఘనస్థైర్య సమున్మీలనశీల నిబిరీసనిశ్వాసమారుత ప్రచారకారణ మహాబిలాయమాన నాసారంధ్రంబును, గల సింహాకారంబు నివ్వటిల్ల నుల్లంబు జల్లు మన మదాప్తజనంబులు చెంతల నిలువ లేక యెల్లెడలకుం జన సకలజగద్వార పారావారగిళనపానసమ ర్థాక్షుద్రక్షుధోదన్యా పరి క్షుభితమానసంబు పక్షీకరించి యనేకకాంతారజంతుసంతానంబుల మెక్కుచుఁ, దదీయాసృక్పూ రంబు గ్రోలి సొక్కుచు, దుష్టవర్తనంబున నింతకాలం బిచ్చటఁ దిరిగి తిరిగి భవత్కరహేతిధారామాహా త్మ్యంబునఁ బూర్వరూపంబు గంటి, నీవలన మంటి నిన్ను నేమని సన్నుతింతు నని యత్తురంగవద నుండు వెండియుఁ బ్రణామంబులు గావించి యవ్విభుండు నయభాషణంబుల నుపలాలింప నానం దించె నప్పుడు. 141

టీక: ఇట్టులు=ఈప్రకారము; అతులనాగ విదళనవ్యాపార నవీన శతమఖ కరవాలాయమాన ఖర నఖరంబులును – అతుల= సాటిలేని, నాగ=ఏనుఁగు లనెడు, అతులన=సాటిలేని, అగ=కొండలయొక్క, కొండలవంటి తులలేని గజముల ననుట, విద ళనవ్యాపార=బ్రద్దలుచేయు నుద్యోగమునందు, నవీన=నూతనమగు, శతమఖ=ఇంద్రునియొక్క,కరవాలాయమాన =వజ్రా యుధమువలె నాచరించుచున్న, ఖర=తీక్ష్ణములగు, నఖరంబులును=గోళ్ళును; అక్షీణ మృగక్షతజ కటాజ్యధారా సముజ్జ్వల జ్జఠరజ్వలన సమున్నత జ్వాలాయమాన రసనాకిసలయంబును – అక్షీణ=ఎడతెగని, మృగక్షతజ= మెకములనెత్తురను, కట=అధికమగు, ఆజ్యధారా=ఘృతధారచేత, సముజ్జ్వలత్=మండుచున్న, జఠరజ్వలన=జఠరాగ్నియొక్క, సమున్నత= నిడుదయగు, జ్వాలాయమాన =మంటవలెనాచరించుచున్న, రసనాకిసలయంబును=లేయాకువలె నున్న నాలుకయును; అమంద తుంద కారామందిర బందీకృత స్వభృత సారంగకులీన సారంగ విమోచన లాలసా విలస నోత్తమాంగ రాజసదన వదన ద్వారాశ్రిత చంద్రరేఖాయమాన వక్రదంష్ట్రాయుగంబును – అమంద=అధికమగు, తుంద=కడు పనెడు, కారామందిర= చెఱసాలయందు, బందీకృత=చెరవేయఁబడిన, స్వభృత=తనచేఁ బోషింపఁబడిన, సారంగకులీన =మృగ(లేళ్ళ)జాతియందుఁ బుట్టిన, సారంగ=కురంగములయొక్క, విమోచన=విడిపించుటయందలి, లాలసా=ఆసక్తియొక్క, విలసన=విలాసముచేత, ఉత్తమాంగ=శిరస్సనెడు, రాజసదన=రాజగృహముయొక్క, వదన =ముఖమనెడు, ద్వార=వాకిటిని, ఆశ్రిత=ఆశ్రయించిన, చంద్రరేఖాయమాన=చంద్రరేఖవలె నాచరించుచున్న, వక్ర= వంకరయైన, దంష్ట్రాయుగంబును =కోఱజంటయును; ఆత్మీయ హరి తానుబోధక భాస్వ ద్విరోచన మండలాయమాన నిస్తులలోచనద్వయంబును – ఆత్మీయ=తనసంబంధి యగు, హరితా= సింహత్వమునకు, అనుబోధక = సూచకమగు, భాస్వత్=ప్రకాశించుచున్న, విరోచన=అగ్నియొక్క, మండలాయమాన= కుప్పవలె నున్న, నిస్తుల = సాటిలేని, లోచన ద్వయంబును=నేత్రయుగ్మమును, ఇచట హరితా=విష్ణుత్వమును, అనుబోధక= సూచించునవియు, భాస్వత్= ప్రకాశించుచున్నవియు నగు, విరోచనమండలాయమాన=సూర్యచంద్రమండలములవలె నాచ రించుచున్న కనుఁగవ యని యర్థాంతరము దోఁచుచున్నది. ‘వహ్నీంద్వర్కా విరోచనాః’ యని రత్నమాల; అలయ ప్రభావో రరీకృ తాఖిల జంతు నికృంతన తంతన్యమాన చాతుర్య పృష్ఠేకృత కీనాశ పాశాయమాన దీర్ఘవాలంబును – అలయ=నాశము లేని, ప్రభావ=మహిమచేత, ఉరరీకృత=అంగీకరింపఁబడిన, అఖిల=సమస్తమైన, జంతు=ప్రాణులయొక్క, నికృంతన=ఛేదన మందు, తంతన్యమాన =మిక్కిలి వృద్ధిఁ బొందుచున్న, చాతుర్య=నేర్పుచేత,పృష్ఠేకృత=పృష్ఠభాగమందుంపఁబడిన, కీనాశ =యమునియొక్క, పాశాయమాన=పాశాయుధమువలె నాచరించుచున్న, దీర్ఘవాలంబును =పొడవైన తోఁకయును; అతిఘన ఘనాఘన స్థైర్యసమున్మీలనశీల నిబిరీస నిశ్వాసమారుత ప్రచార కారణ మహాబిలాయమాన నాసారంధ్రంబును – అతిఘన= మిక్కిలి యధికమైన, ఘనాఘన=మత్తగజము లను వర్షాకాలమేఘములయొక్క, స్థైర్య=దార్ఢ్యముయొక్క, సమున్మీలన= ఉత్పాటనము, శీల=స్వభావముగాఁ గల, నిబిరీస=దట్టమగు, నిశ్వాసమారుత=నిట్టూర్పువాయువుయొక్క, ప్రచార=సంచా రమునకు, కారణ=హేతుభూతమగు, మహాబిలాయమాన=ఆకాశమువలె నాచరించుచున్న, ‘మేఘద్వారం మహాబిలమ్’ అని యమరుఁడు, నాసారంధ్రంబును=నాసికారంధ్రమును; కల = ఉన్నట్టి; సింహాకారంబు =సింహముయొక్క స్వరూపము; నివ్వటిల్లన్=ఒప్పుచుండఁగ; ఉల్లంబు=మనము; జల్లుమనన్=తల్లడిల్లఁగా ననుట; మదాప్తజనంబులు=నామిత్రులు; చెంతలన్ =సమీపమందు; నిలువ లేక =నిలుచుండలేక;ఎల్లెడలకున్=అంతటను; చనన్=పోఁగా; సకల జగద్వార పారావార గిళన పాన సమర్థాక్షుద్ర క్షుధోదన్యా పరిక్షుభిత మానసంబు –సకల=సమస్త మగు, జగద్వార(జగత్+వార)=లోకసమూహముయొక్క, పారావార=సముద్రములయొక్క, గిళన=తినుటయందు, పాన=త్రాగుటయందు, సమర్థ=శక్తిగల, అక్షుద్ర=అధికమగు, క్షుధా+ఉదన్యా=ఆఁకలిదప్పులచేత, పరిక్షుభిత= క్షోభపడిన, మానసంబు=హృదయమును; పక్షీకరించి =అంగీకరించి; అనేక కాంతార జంతు సంతానంబులన్ – అనేక=అసంఖ్యాకములగు, కాంతార=అరణ్యమందలి,జంతు=మృగములయొక్క, సంతానంబులన్=గుంపులను; మెక్కుచున్=తినుచు; తదీయాసృక్పూరంబున్ – తదీయ =ఆమృగసంబంధమైన, అసృక్ =రక్తముయొక్క, పూరంబున్=ప్రవాహమును; క్రోలి=పానముఁ జేసి; చొక్కుచున్=పరవశత నొందుచు; దుష్టవర్తనంబునన్= చెడువృత్తిచేత; ఇంతకాలంబు= ఇంతవఱకు; ఇచ్చటన్=ఈపర్వతమందు; తిరిగి తిరిగి =క్రుమ్మరిక్రుమ్మరి; భవ త్కర హేతి ధారా మాహాత్మ్యంబునన్ – భవత్ =మీయొక్క, కర=హస్తమందలి, హేతి=ఖడ్గముయొక్క,ధారా=వాదరయొక్క, మాహా త్మ్యంబునన్=మహిమచేత; పూర్వరూపంబున్ = పూర్వమందున్నకిన్నరరూపమును; కంటిన్=పొందితిని; నీవలనన్= నీ కారణముగ; మంటిన్=జీవించితిని; నిన్ను, ఏమని సన్నుతింతున్=ఏమని కొనియాడెదను; అని=అనుచు; అత్తురగవదనుండు =ఆకిన్నరుఁడు; వెండియున్=మఱియును; ప్రణామంబులు=వందనంబులను; కావించి =చేసి; అవ్విభుండు=ఆసుచంద్రుఁడు; నయభాషణంబులన్=అనునయోక్తులచేత; ఉపలాలింపన్=ఊఱడింపఁగ; ఆనందించెన్=సంతసించెను; అప్పుడు=ఆసమయ మందు.

అనఁగ, వజ్రాయుధతుల్యము లగు తీక్ష్ణనఖములును, అధికమగుమెకంబుల రక్త మను ఘృతధారచేతఁ బైకెగయు జఠ రాగ్నిమంటవలె నున్న నాలుకయు, అధిక మగు కడుపనెడు కారాగృహమందు బంధింపఁబడిన స్వపోషితమృగసంబంధి మృగంబులను విడిపించుటకై యక్కఱఁబూని శిరమనురాజస్థానమునకు ద్వారమయిన ముఖమునం గాచికొని యున్న చంద్ర రేఖవలె నుండు కోఱలును, నిప్పులకుప్పవలె నున్న కనుఁగవయు, సర్వప్రాణుల సంహరించు యముని దండమువలె నున్న వాలదండమును, కాలమేఘంబులఁ దూలించు గాఢమారుతమునకు స్థానంబగు నాకసంబువలె మత్తగజంబులఁ బాఱంద్రోలు నిట్టూర్పులకుఁ జోటై యున్న నాసారంధ్రంబులు గల్గి, సింహాకృతిఁ బూని నిలువఁ, జెంగట నున్న సంగడికాండ్రు విడిచి పరు విడుటయు, నంత నాకు మున్నీటినీటి నెల్లంగ్రోలునంతటి నీరువట్టును, నెల్లజగంబులం దినునంతటి యాఁకలియును బొడమ, నీయడవిలో నుండు మెకంబుల నెల్ల మెక్కుచు నింతకాలం బిచ్చట విచ్చలవిడిఁ గ్రుమ్మరుచుండి, నీఖడ్గమహిమంబున నాతొంటి రూపంబు గంటి నని సుచంద్రునితోఁ గుముదుండు విన్నవించె నని భావము.

తే. వరకలాసాంద్రుఁ డైన యా◊వసుమతీశ
చంద్రు నలగోనికాయప్ర◊చారమహిమ
కుముదుఁ డతిమంజులామోద◊సమితి నలరె
పుష్కరచరాళి వైచిత్రిఁ ◊బొందుచుండ. 142

టీక: వరకలాసాంద్రుఁడు – వర=శ్రేష్ఠమగు, కలా=విద్యలచేత, సాంద్రుఁడు=నిండినవాఁడు; ఐన=ఐనట్టి; ఆవసుమతీశచంద్రు నలగోనికాయ ప్రచార మహిమ – ఆవసుమతీశచంద్రు =రాజశ్రేష్ఠుఁడగు నాసుచంద్రునియొక్క, అలగోనికాయ= ఆవాక్య సమూహముయొక్క, ప్రచార=ప్రసక్తియొక్క, మహిమ=సామర్థ్యముచేత; ఆవసుమతీశ =ఆరాజనెడి, చంద్రు= నిశాపతి (చంద్రుని) యొక్క, అలగోనికాయ=ఆకిరణపుంజముయొక్క, ప్రచారమహిమచేత నని యర్థాంతరము దోఁచుచున్నది. కుముదుఁడు= కుముదుఁడను పేరుగల కిన్నరుఁడు; అతి మంజులామోద సమితిన్ – అతి=అధికమగు, మంజుల=మనోజ్ఞ మగు, ఆమోద= సంతసముయొక్క, పరిమళముయొక్క, సమితిన్=సమూహముచే; పుష్కరచరాళి=దేవబృందము; అర్థాం తరమున, పుష్కర =కమలములను, చర=పొందిన, అళి=భృంగము; వైచిత్రిన్=విచిత్రతను; పొందుచుండన్, అలరెన్ = సంత సించెను.

అనఁగ విద్యలచే పరిపూర్ణుం డగు సుచంద్రునియొక్క వచనకదంబముచేఁ గుముదుఁ డను కిన్నరుఁడు దేవతలు చూచి వైచిత్రిని పొందుచుండఁగ సంతసించె నని భావము. కాంతులచే పరిపూర్ణుం డగు చంద్రునియొక్క కిరణపుంజముచేత కలువ మనోజ్ఞమగు పరిమళముతో భృంగములు సంతోషించునట్లు వికసించి ప్రకాశించె నని యర్థాంతరమునకు భావము.

మ. కలితారాతివిరామ, రామరుచిసం◊గప్రస్ఫురద్భామ, భా
మలవక్త్రాహతసోమ, సోమనుతశుం◊భద్భూరిసంగ్రామ, గ్రా
మలసద్వేణుసకామ, కామకలిసం◊పల్లాలసశ్యామ, శ్యా
మలరోచిశ్చయవామ, వామనతనూ◊మాన్యత్రిలోకీక్రమా! 143

టీక: కలితారాతివిరామ – కలిత=చేయఁబడిన, అరాతి=శత్రువులయొక్క, విరామ=నాశముగలవాఁడా, రామ రుచి సంగ ప్రస్ఫుర ద్భామ – రామ=మనోహరమగు, రుచి=కాంతియొక్క, సంగ =సంబంధముచేత, ప్రస్ఫురత్ =ప్రకాశించుచున్న, భామ =సూర్యుఁడుగలవాఁడా, ‘భామః క్రోధేరవౌ దీప్తౌ’ అని విశ్వము. సూర్యబింబమందుండు నారాయణమూర్తి తన కాంతి పుంజములచే నాసూర్యునిఁ బ్రకాశింపఁజేయువాఁడని భావము; భామల వక్త్రాహత సోమ – భా=కాంతిచేత, అమల= స్వచ్ఛ మగు, వక్త్ర=ముఖముచేత, ఆహత=కొట్టఁబడిన, సోమ =చంద్రుఁడు గలవాఁడా, సోమ నుత శుంభ ద్భూరి సంగ్రామ – సోమ= శివునిచేత, నుత=ప్రశంసింపఁబడిన, శుంభత్=ప్రకాశించుచున్నట్టి, భూరి=అధికమైన,సంగ్రామ = యుద్ధము గలవాఁడా; గ్రామ లస ద్వేణు సకామ – గ్రామ=స్వరసందోహముచేత, లసత్=ప్రకాశించుచున్న, వేణు=మురళియందు, సకామ= కోరికతోఁ గూడినవాఁడా, కామకలి సంప ల్లాలస శ్యామ – కామకలి=మన్మథయుద్ధముయొక్క, సంపత్ = సంపదయందు, లాలస= ఆసక్తి గల, శ్యామ= కాంతలు గలవాఁడా; శ్యామలరోచి శ్చయ వామ – శ్యామలరోచిః=నల్లనికాంతులయొక్క, చయ=సమూ హముచేత, వామ= మనోహరుఁడైనవాఁడా; వామనతనూ మాన్య త్రిలోకీక్రమా – వామనతనూ = త్రివిక్రమాకృతిచేత, మాన్య = పూజ్యమైన, త్రిలోకీ క్రమా =ముల్లోకములయందుఁ బాదన్యాసము గలవాఁడా!

క. సత్యాహితాంతరంగా, సత్యాశయపుండరీక◊చంచద్భృంగా,
సత్యాత్మకగుణసంగా, సత్యాలయయోగియోగ◊సంతతరంగా! 144

టీక: సత్యాహి తాంతరంగా – సత్యా=సత్యభామయందు, ‘నామైకదేశే నామగ్రహణ’ మను న్యాయమువలన సత్యభామా నామైకదేశమగు సత్యాశబ్దమునకు సత్యభామ యని యర్థమని యెఱుంగునది, ఆహిత=ఉంపఁబడిన, అంతరంగా =మనస్సు గలవాఁడా, సత్యభామయందు ఆసక్తి గలవాఁడని భావము; సత్యాశయపుండరీక చంచ ద్భృంగా – సతీ= పార్వతీదేవియొక్క, ఆశయపుండరీక = హృత్కమలమందు, చంచత్=చలించుచున్న, భృంగా =తుమ్మెదరూప మైన వాఁడా, పార్వతి తన హృ త్పుండరీకమున నెల్లపుడు నారాయణమూర్తిని ధ్యానించుచున్నదని భావము; సత్యాత్మక గుణ సంగా – సత్యాత్మక = సత్య రూపమగు, గుణ=శౌర్యాదిగుణములయొక్క, సంగా = సంబంధము గలవాఁడా; సత్యాలయ యోగి యోగ సంతత రంగా – సత్య=సత్యలోకమే, ఆలయ = నివాసముగాఁ గల, యోగి=మునులయొక్క, యోగ=ధ్యానమె, సంతత=ఎల్లపుడును, రంగా =నాట్యస్థానముగాఁ గలవాఁడా!

సత్యలోకమందు వసించి తపం బొనరించు మునుల ధ్యానమునందు నెడఁబాయకుండు వాఁడని భావము.

ఉత్సాహవృత్తము: కరివరాంగబహులభంగ◊కరణసంగతగ్రహా
చరరథాంగ! హరిశతాంగ◊జనక! రంగదద్రిజాం
తరసుమంగళాబ్జభృంగ!◊తతపతంగమందిరా!
పరభుజంగరిపుతురంగ!◊ప్రబలరంగభూషణా! 145

టీక: కరివ రాంగ బహుల భంగకరణ సంగత గ్రహాచర రథాంగ – కరివర=గజేంద్రునియొక్క, అంగ =దేహమును, బహుల= అనేకప్రకారములు, భంగకరణ = నాశము సేయుటయందు, సంగత = ఆసక్తమైన, గ్రహ=మొసలియొక్క,ఆచర = సంహారక మగు, రథాంగ = చక్రాయుధము గలవాఁడా, గజేంద్రునిం బట్టుకొన్న మొసలిని సంహరించిన చక్రాయుధము గలవాఁ డని భావము; హరి శతాంగ జనక – హరి=మారుతము, ‘యమానిలేన్ద్ర చన్ద్రార్క విష్ణు సింహాంశు వాజిషు, శుకాహి పిక భేకేషు హరిః’ అని యమరుఁడు, శతాంగ=రథముగాఁ గల మన్మథునకు, జనక = తండ్రి యైనవాఁడా; రంగ దద్రిజాంతర సుమంగ ళాబ్జ భృంగ – రంగత్=చలించుచున్న, అద్రిజా=పార్వతీదేవియొక్క, అంతర = హృదయ మనెడు, సుమంగళ= మంగల ప్రదమగు, అబ్జ =కమలమునకు, భృంగ=భ్రమరరూపుఁ డైనవాఁడా, అనఁగా పార్వతీ దేవి యెల్లపుడును హృదయకమల మందు నారాయణమూర్తిని నిల్పుకొని ధ్యానించుచున్నది గాన నామె హృదయకమలమునకు భ్రమరప్రాయుఁడై యున్నవాఁ డని భావము; తత పతంగ మందిరా – తత=విశాలమగు, పతంగ=సూర్యుఁడే, ‘పతంగౌ పక్షి సూర్యే చ’ అని యమరుఁడు, మందిరా = గృహముగాఁ గలవాఁడా, సూర్యమండలమందు సర్వదా వసించు వాఁడని తాత్పర్యము. ఇందుకు ‘ధ్యేయ స్సదా సవితృమణ్డలమధ్యవర్తీ నారాయణః’ అను వచనము ప్రమాణము; పర భుజంగరిపు తురంగ – పర =ఉత్కృష్టుఁడగు, భుజంగ రిపు=గరుత్మంతుఁడె, తురంగ = గుఱ్ఱముగాఁ గలవాఁడా; ప్రబల రంగ భూషణా – ప్రబల=ఉత్కృష్టమగు, రంగ=శ్రీరంగవిమా నమునకు, భూషణా=అలంకారప్రాయుఁడైనవాఁడా! ‘ఈహ మీఱ సూర్యగణము ◊లేడు గాంతమైన ను, త్సాహవృత్త మనఁగఁ గృతులఁ ◊జాగుచుండు’ నని ఉత్సాహవృత్తలక్షణ మప్పకవీయమునఁ జెప్పఁబడినది.

గద్యము: ఇది శ్రీమదనగోపాలప్రసాదసమాసాదితోభయభాషాకళాకళత్ర రేచర్లగోత్రపవిత్ర సురభిమల్లక్షమాపాలసత్పుత్ర కవిజనవిధేయ మాధవరాయప్రణీతం బైన చంద్రికాపరిణయంబను మహాప్రబంధంబునందు ద్వితీయాశ్వాసము.

గద్యము: ఇది శ్రీసతీరమణకరుణాసమాసాదితసర్వసౌభాగ్యభాగ్యనగరమహారాజ్యసంకలిత శ్రీజటప్రోలుసంస్థానప్రాజ్యసకలసామ్రాజ్య శ్రీ రేచర్లగోత్రపవిత్ర కవిజనగేయ శ్రీవేంకటజగన్నాథరాయసత్పుత్ర సత్సంప్రదాయ శ్రీసురభి వేంకటలక్ష్మణరాయ పరిపోష్య సరసవైదుష్య తదాస్థానతలమండిత శేషసదాశివపండిత విరచితశరదాగమసమాఖ్యవ్యాఖ్యయందు ద్వితీయాశ్వాసము.