చంద్రికాపరిణయము – 4. ద్వితీయాశ్వాసము

ఉ. చెన్నగుజాళువాయొళవు, ◊చిన్నరికెంపులమెట్లు, నీలపు
న్వన్నియ నొప్పు కాయలు, న◊వంబగు వజ్రపుకర్వె, పచ్చలం
బన్నినయట్టిమేరువును, ◊బాగగుతంత్రులు మించ నొప్పు మే
ల్కిన్నర చెంతఁ జేరి యొక◊కిన్నరకంఠి యొసంగ నయ్యెడన్. 98

టీక: చెన్నగుజాళువాయొళవు =ప్రకాశించుచున్న బంగరుదండము; చిన్నరికెంపులమెట్లు = చక్కనగు కెంపులసరికట్లు; నీలపున్వన్నియన్=నల్లనిచాయచేత; ఒప్పు కాయలు ఒప్పుచున్న కాయలు; నవంబగు =క్రొత్తనైన; వజ్రపుకర్వె వజ్రముల యొక్క కకుభము; పచ్చలన్=గరుడపచ్చలచేత; పన్నినయట్టి = రచించినట్టి; మేరువును=శిఖరమును; బాగగుతంత్రులు =శ్రేష్ఠమగు తీగెలు; మించన్=అతిశయింపఁగ; ఒప్పు =ప్రకాశించుచున్నట్టి; మేల్కిన్నర=శ్రేష్ఠమైన వీణాభేదమును; ఒక కిన్నర కంఠి=ఒకముదిత; చెంతఁ జేరి=చిత్రరేఖాసమీపమును బొంది; ఒసంగన్=ఈయఁగా; అయ్యెడన్=ఆసమయమందు. దీని కుత్తరపద్యమునందలి ‘పల్కించె’ నను క్రియతో నన్వయము.

మ. సరసత్వంబునఁ గేల నూని యల యో◊షామౌళి చక్కన్ రిరి
మ్మరిగామారి యటంచు రిప్పనిమగా◊మమ్మారి యంచు న్విభా
స్వరనానానవరక్తిఁ దానతతి మిం◊చన్ గౌళ వాయించి, ని
బ్బరపు న్వేడుకఁ జేయుపంతువిధముల్ ◊పల్కించె నప్పట్టునన్. 99

టీక: అల యోషామౌళి =ఆచిత్రరేఖ; సరసత్వంబునన్ =రసికతతో; కేలన్=హస్తముచేత; ఊని=(కిన్నెరను) గ్రహించి; చక్కన్ =సొంపుగా; రిరిమ్మరిగామారి యటంచు రిప్పనిమగామమ్మారి యంచున్ = ఈప్రకారమనుచు; విభాస్వరనానానవరక్తిన్ – విభాస్వర=ప్రకాశించుచున్న, నానా=అనేకవిధములగు, నవరక్తిన్=నూతనమగు సొంపుచేత; తానతతి మించన్ =తాన యను శబ్దజాల మతిశయింపఁగ; గౌళ వాయించి = గౌళరాగమును పలికించి; నిబ్బరపు న్వేడుకఁ జేయుపంతువిధముల్=మిక్కిలి వినోదము గొల్పునట్టి శ్రేష్ఠమగు రీతులను; పల్కించెన్=వాయించెను; అప్పట్టునన్=ఆసందర్భమున, దీనికి ఉత్తరపద్యస్థ మగు ‘సల్పె’ నను క్రియతో నన్వయము. అనఁగ చిత్రరేఖ కుముదాక్షి యొసంగిన కిన్నర దీసికొని, సరిగమాదిస్వరములను వాయించి, గౌళయను రాగమును తానతతి ననఁగ తాన యనుశబ్దములతో ననేకరీతుల వాయించె నని భావము.

మ. బళిరే మైసిరితీరు, నిల్కడలు సే◊బా, సయ్యరే పేరణీ
కలనం, బౌర పదాళికాభినయవై◊ఖర్యంబు, మజ్జారె కో
పులవైచిత్రి, యహో వినిర్మలకరాం◊భోజాతవిన్యాస, మం
చలివేణుల్ వినుతింప సల్పె నటనం ◊బాకొమ్మ తత్సన్నిధిన్. 100

టీక: ఈపద్యమందు ‘బళరే, సేబాసు, అయ్యారే, ఔర,మజ్జారె, అహో’ యను పదములు ప్రశంసార్థకము లని యెఱుంగునది. మైసిరితీరు=దేహకాంతియొక్కరీతి, బళిరే! నిల్కడలు=ధైర్యములు, సేబాసు! పేరణీకలనంబు=భాండముపైఁజేయునృత్యము, అయ్యరే ! పదాళికాభినయవైఖర్యంబు – పదాళికా=గానోపయోగిపదపుంజములయొక్క, అభినయవైఖర్యంబు= పదార్థాభి నయరీతి, ఔర! కోపులవైచిత్రి =నాట్యసంబంధులగుతీర్పులయొక్కవిచిత్రత, మజ్జారె! వినిర్మలకరాంభోజాతవిన్యాసము – వినిర్మల=స్వచ్ఛమగు, కరాంభోజాత=కరకమలములయొక్క, విన్యాసము=ఉంచుట, అహో ! అంచున్= ఈప్రకారము వచింపుచు; అలివేణుల్=స్త్రీలు; వినుతింపన్=కొనియాడఁగ; ఆకొమ్మ =ఆచిత్రరేఖ; తత్సన్నిధిన్=ఆమునిసమీపమందు; నట నంబు = నాట్యమును; సల్పెన్=చేసెను. అంగనలు నుతియించుచుండఁగఁ జిత్రరేఖ మునిసన్నిధి నభినయించి నాట్యముఁ జేసె నని తాత్పర్యము.

క. ఈలీల నన్నివిద్యలు, వేలుపుతొవకంటి చూపి ◊విపులసమాధి
శ్రీలాభగౌరవంబున, శైలాభం దెమలకున్న◊శమిఁ గాంచి రహిన్. 101

టీక: ఈలీలన్=ఈరీతిగ; వేలుపుతొవకంటి =చిత్రరేఖ; అన్నివిద్యలున్=ఎల్లవిద్యలు; చూపి=ప్రదర్శించి; విపులసమాధిశ్రీ లాభగౌరవంబునన్ – విపుల=విశాలమగు, సమాధి=చిత్తవృత్తినిరోధముయొక్క,శ్రీ =సంపదయొక్క,లాభ=ప్రాప్తివలన నైన; గౌరవంబునన్ = గరుత్వముచేత; శైలాభన్=పర్వతమువలె; తెమలకున్నశమిన్=చలింపకున్నమునిని; రహిన్=ప్రీతితో; కాంచి=చూచి.

చ. అనుపమకాంచిరమ్యతట◊హాటకకింకిణికాఝణంఝణ
ధ్వని చెలరేఁగ, నానియమి◊దండకుఁ జేరి, యొయార మెచ్చ న
వ్వనిత తపోధనేంద్రపద◊వారిజయుగ్మము కేల నంటి, యొ
య్యనఁ దలఁ జేర్చి, నూత్నమధు◊రామృతపూరసమోక్తి నిట్లనున్. 102

టీక: అనుపమ కాంచి రమ్యతటహాటకకింకిణికా ఝణంఝణధ్వని – అనుపమ=అసమానమగు,కాంచి=ఒడ్డాణములయొక్క,రమ్య=మనోహరమగు,తట=ప్రదేశమందలి,హాటకకింకిణికా=బంగారుచిఱుగంటలయొక్క,ఝణంఝణధ్వని = ఝణఝణ యను శబ్దము; చెలరేఁగ=అతిశయింపఁగ; ఆనియమిదండకున్=ఆమునిసమీపమునకు; చేరి, ఒయారము=విలాసము; ఎచ్చన్ = అతిశయింపఁగ; అవ్వనిత=ఆచిత్రరేఖ; తపోధనేంద్రపదవారిజయుగ్మము – తపోధనేంద్ర=జడదారిసామియొక్క, పదవారిజయుగ్మము=పాదకమలద్వయమును; కేలన్=హస్తముచేత; అంటి=తాఁకి; ఒయ్యనన్=తిన్నగా; తలన్=శిర మును; చేర్చి=కదియించి; నూత్నమధురామృతపూరసమోక్తిన్ – నూత్న=క్రొత్తనగు, మధుర=తియ్యని, అమృత=సుధ యొక్క, పూర=ప్రవాహముతోడ, సమ=సదృశమగు, ఉక్తిన్=వాక్యమును; ఇట్లు=ఈప్రకారముగ; అనున్=పలికెను.

సీ. తెఱగంటిదొరలకుఁ ◊దీఱలేనివిరాళి, మొనపుచక్కఁదనానఁ ◊దనరుదాన,
కులుకుచిత్తరువుబొ◊మ్మలకు జీవమునించఁ,గలపాటవగ నేర్చి ◊యలరుదాన,
రంభాదికనిలింప◊రామలఁ దలవంపఁ, జేయు నాట్య మెఱింగి ◊సెలఁగుదాన,
హరిగిరిశాదిది◊వ్యసభాళి బిరుదు లె,న్నైనఁ జేకొని నిచ్చ ◊నడరుదాన,

తే. పలుకుతొయ్యలి వీవంచు ◊నలువ మెచ్చ, నలఘుసాహిత్యవిద్యాప్తి ◊వెలయుదాన,
చిత్రరేఖాసమాఖ్య రా◊జిల్లుదాన, నిన్ను సేవింపవచ్చితి ◊నియమిచంద్ర! 103

టీక: తెఱగంటిదొరలకుఁన్=దేవశ్రేష్ఠులకు; తీఱలేనివిరాళిన్=ఎడతెగనిమోహమును; మొనపు=కలుగఁజేయు;చక్కఁదనానన్ = సౌందర్యముచేత; తనరుదానన్= ఒప్పుచున్నదానను;
కులుకుచిత్తరువుబొమ్మలకున్=చిత్తరువునందు వ్రాసిన చక్కనిబొమ్మలకు; జీవము=ప్రాణమును; నించఁగల పాటవగన్= నిండఁ జేయుటయందు సామర్థ్యము గల్గిన గానముయొక్కసొంపును; నేర్చి=అభ్యసించి; అలరుదానన్=ప్రకాశించుదానను; రంభాదికనిలింపరామలన్—రంభాదిక=రంభమొదలగు, నిలింపరామలన్= దేవాంగనలను; తలవంపన్=శిరమువంచునట్లు, చేయునాట్యము=చేయునట్టి నాట్యము; ఎఱింగి=తెలిసి; చెలఁగుదానన్=ప్రకాశించుదానను; హరిగిరిశాదిదివ్యసభాళిన్ – హరి=కృష్ణుఁడు, లేదా ఇంద్రుఁడు,గిరిశ=శివుఁడు, ఆది=మొదలుగాఁ గలవారియొక్క, దివ్య= మనోహరమగు, సభాళిన్=సభాసమూహములయందు; ఎన్నైనన్=ఎన్నిటినైన, లెక్కకు మించి యనుట; బిరుదులు=జయ చిహ్నములను; చేకొని=గ్రహించి; నిచ్చ =ఎల్లప్పుడు; అడరుదాన=ఒప్పుచున్నదానను; నలువ=బ్రహ్మదేవుఁడు; ఈవు=నీవు; పలుకుతొయ్యలివి=సరస్వతివి; అంచున్=అనుచు; మెచ్చన్=మెచ్చునటులు; అలఘు సాహిత్యవిద్యాప్తిన్ – అలఘు=అధికమగు, సాహిత్యవిద్యా=నాటకాలంకారాదిసాహిత్యవిద్యలయొక్క, ఆప్తిన్=ప్రాప్తిచేత; వెలయుదానన్=ఒప్పుచున్నదానను; చిత్రరేఖాసమాఖ్యన్=చిత్రరేఖ యను నామముచేత; రాజిల్లుదానన్=ప్రకాశించుదానను; నియమిచంద్ర = ఓ మునిశ్రేష్ఠుఁడా! నిన్ను సేవింపవచ్చితిన్ = నిన్నుఁ గొలుచుటకు వచ్చితిని.

నియమిచంద్రా! దేవోత్తములకును మోహమును గొల్పు నందముచేతను, అచేతనములగు బొమ్మలకును ప్రాణ మిచ్చు నంతటి గానముచేతను, రంభాదిదేవాంగనలకు నలవిగాని నాట్యముచేతను దనరుచు, అనేకశివకేశవాద్యుత్తముల సభల యందు బిరుదములఁ గొని మించుచు, నలువ సరస్వతివి నేవే యని మెచ్చునంతటి సాహిత్యవిద్యచే నొప్పుచుండుదాన, చిత్ర రేఖ యను పేరు గలదాన, నేను నిన్ను సేవింపవచ్చితి నని భావము.

క. అనునెడ నమ్మునికులమణి, కనుఁగవ నర విప్పి ◊కాంతఁ గన్గొని యంతన్
బునరనవధికసమాధిక,లన నక్షులు మోడ్చి నిశ్చ◊లతచే నుండన్. 104

టీక: అనునెడన్=అని పలుకునపుడు; అమ్మునికులమణి=ఆఋషిశ్రేష్ఠుఁడు; కనుఁగవన్=కనుదోయిని; అర విప్పి = సగము దెఱచి; కాంతన్=చిత్రరేఖను; కన్గొని=చూచి; అంతన్=అటుపిమ్మట; పునరనవధికసమాధికలనన్ – పునః=మఱల, అనవధిక =అంతములేని, సమాధి=చిత్తవృత్తినిరోధముయొక్క, కలనన్ =ప్రాప్తిచేత; అక్షులు=నేత్రములను; మోడ్చి=ముకుళించి; నిశ్చ లతచే =అచంచలతచేత; ఉండన్ =ఉండఁగ.

ఉ. కాంచి తపస్విచిత్తగతి ◊గాంచఁగ లేక యయారె మామకా
భ్యంచిత శాంబరీమహిమ ◊కయ్యతి లోఁబడు నంచు నెంచి త
త్కాంచనగాత్రి యాళిజన◊తాయుతి మిక్కిలి చెంతఁజేరి నే
త్రాంచలసీమ నవ్వు వొల◊యన్ మునిఁ బల్కె నవోక్తిచాతురిన్. 105

టీక: తత్కాంచనగాత్రి =ఆచిత్రరేఖ; కాంచి=చూచి; తపస్విచిత్తగతిన్=మునియొక్క మనస్థ్సితిని; కాంచఁగ లేక=తెలియఁ జాలక; అయారె =ఆశ్చర్యము! మామకాభ్యంచితశాంబరీమహిమకున్ – మామక=నాసంబంధి యగు, అభ్యంచిత=శ్రేష్ఠ మగునట్టి, శాంబరీమహిమకున్=మాయాసామర్థ్యమునకు; అయ్యతి=ఆముని; లోఁబడు నంచున్=వశపడు ననుచు; ఎంచి = తలఁచి; ఆళిజనతాయుతిన్=సఖీజనముతోడి కూడికచేతను; మిక్కిలి చెంతఁజేరి =అత్యంతసమీపమును బొంది; నేత్రాంచల సీమన్ =నయనాంతముల ప్రదేశమునందు; నవ్వు =స్మితము; పొలయన్=వ్యాపింపఁగ; నవోక్తిచాతురిన్ – నవ=నూతనమైన, ఉక్తిమాటలయందలి, చాతురిన్=నేర్పుచేత; మునిన్=వసంతునిగూర్చి; పల్కెన్=పలికెను.

సీ. జవరాలినునుగుబ్బ◊చన్నులఁ జేరుట, వసుధాధరస్థలీ◊వసతి గాఁగ,
నతివరత్యంతశ్ర◊మాంబులఁ దోఁగుట, నమరాపగావగా◊హనము గాఁగ,
తెఱవకెమ్మోవిక్రొం◊దేనియ ల్గ్రోలుట, నిరుపమామృతపాన◊సరణి గాఁగ,
కొమ్మతో రతికూజి◊తమ్ములు నొడువుట, సరసాగమాంతాళి◊చదువు గాఁగఁ,

తే. దలఁపఁ బద్మాంబకాభిఖ్య◊దైవతంబు, మసలక దయారసంబున ◊నొసఁగు సు మ్మ
ఖండితానందగరిమ ని◊క్కలన మనుము, వట్టి యీఖేదకనివృత్తి ◊గట్టి మౌని. 106

టీక: మౌని=వసంతుఁడా! జవరాలినునుగుబ్బచన్నులఁ జేరుట=స్త్రీలయొక్క నునుపుగుబ్బచన్నులను బొందుట; వసుధాధర స్థలీవసతి=పర్వతప్రదేశమందలి నివాసము; కాఁగన్= అగునటులు;
అతివరత్యంతశ్రమాంబులన్ – అతివ=వనితయొక్క, రత్యంత=సురతాంతమువలన నైన, శ్రమాంబులన్=శ్రమోదకముల యందు; తోఁగుట= మునుఁగుట; అమరాపగావగాహనము – అమరాపగా=స్వర్గంగయందు, అవగాహనము =స్నానము; కాఁగన్= అగునటులు; తెఱవకెమ్మోవిక్రొందేనియల్ – తెఱవ=వనితయొక్క, కెమ్మోవి=అరుణాధరోష్ఠముయొక్క, క్రొందేనియల్=నూతనమధుర రసములను; క్రోలుట=పానముచేయుట; నిరుపమామృతపానసరణి – నిరుపమ=సాటిలేని, అమృత=సుధయొక్క, పాన సరణి=పానముయొక్కరీతి; కాఁగన్= అగునటులు;కొమ్మతోన్=కాంతతో; రతికూజితమ్ములు=మణితములు; నొడువుట=పలుకుట; సరసాగమాంతాళిచదువు – సరస= శ్రేష్ఠ మగు, ఆగమాంత=వేదాంతములయొక్క, ఆళి=బృందముయొక్క,చదువు =చదువుట; కాఁగన్= అగునటులు; తలఁపన్=భావింపఁగ; పద్మాంబకాభిఖ్యదైవతంబు = పద్మాంబకుఁ డను పేరుగల దేవత, పద్మములు బాణములుగా గల దేవుఁడు మన్మథుఁ డనుట; మసలక=తడవు సేయక; దయారసంబునన్=కృపారసముచేత; అఖండితానందగరిమన్ = అఖండానందాతిశయమును; ఒసఁగున్=ఇచ్చును; సుమ్ము=సత్యము; వట్టి =నీరసమగు;ఈఖేదకనివృత్తిన్=దుఃఖకర మగు నీనివృత్తిమార్గమును; కట్టి=బంధించి, విరమించి యనుట; ఇక్కలనన్=ఈరీతిగ; మనుము=వర్తింపుము.

అనఁగ స్త్రీకుచంబుల నెనయుట పర్వతనివాస మనియు, సురతాంతశ్రమవారి మునుగుట స్వర్గంగాస్నాన మనియు, నధరరసాస్వాద మమృతరసాస్వాద మనియు, స్త్రీలతో రతికూజితములు నుడువుట వేదాంతవిద్యల చదువుట యనియుఁ దలఁచి మన్మథుని ధ్యానింతువేని, మునిచంద్రా! నీకు నతం డఖండానందము నొసంగును. కేవలము నీరసమగు నీనివృత్తిమార్గ మును వదలు మని భావము.

సీ. పరమకాశ్యాకృతిఁ ◊బ్రబలదే నియమీశ, సోమమండలదాస్య◊రోమవల్లి,
యనవద్యమధురాత్మ ◊నలరదే మునికాంత, జలరుహేక్షణమధు◊స్రావిమోవి,
పురుషోత్తమస్థేమఁ ◊బొసఁగదే యతిచంద్ర, యచలకల్పోరోజ◊ యలఘునాభి,
శ్రీరంగవైఖరిఁ ◊జెలఁగదే దమివర్య, కనకజాతీయాంగి ◊కన్నుదోయి,

తే. యగుట నిత్యపవిత్రరూ◊పాప్తి నడరు, కలికితోఁ గూడి యుండినఁ ◊గాక కలదె
యతనుసుఖరాశి యిట్టి మ◊హాఘదాయి, ఘోరకాంతారమహి నున్న◊ధీరముఖ్య. 107

టీక: నియమీశ=ఓమునిరాజా! సోమమండలదాస్యరోమవల్లి – సోమమండలత్ =చంద్రమండలమువలె నాచరించుచున్న, ఆస్య=ముఖము గల స్త్రీయొక్క, రోమవల్లి=నూఁగారు; పరమకాశ్యాకృతిన్ – పరమ=ఉత్కృష్టమగు, కాశి=వారణాసి యొక్క, ఆకృతిన్ =స్వరూపముచేత; ప్రబలదే =అతిశయింపదా యని కాకువు. పరమక=ఉత్కృష్టమగు, ఇచట స్వార్థ మందు కప్రత్యయము, అసి=ఖడ్గముయొక్క, ఆకృతిన్=స్వరూపముచేత ప్రబలదా యని స్వభావార్థము. శ్లేషయందు శసల కభేదము నవలంబించుట యాలంకారికసమ్మతము. మునికాంత=మునినాథా! జలరుహేక్షణమధుస్రావిమోవి – జలరుహేక్షణ=వనజాక్షియొక్క, మధుస్రావి=మకరందమును స్రవించు, మోవి=ఓష్ఠము; అనవద్యమధురాత్మన్ – అనవద్య=నిర్దుష్టమగు, మధురాత్మన్ =మధుర యను దివ్యక్షేత్రము యొక్క యాకారముచేత; అలరదే =ప్రకాశింపదా యని కాకువు. మధురాత్మన్ – మధుర=తీయని, ఆత్మన్=స్వరూపము చేత, అలరదా యని స్వభావార్థము. యతిచంద్ర=ఓమునిచంద్రుఁడా! అచలకల్పోరోజ యలఘునాభి = ఇంచుకతక్కువగా పర్వతము లగుచున్న స్తనములు గల దానియొక్క లోతైన పొక్కిలి; పురుషోత్తమస్థేమన్ – పురుషోత్తమ=పురుషోత్తమక్షేత్రముయొక్క, స్థేమన్=మహిమచేతను; పొసఁగదే=ఒప్పదా యని కాకువు. పొక్కిలి, పురుషోత్తమస్థేమన్ – పురుషోత్తమ = పున్నాగపుష్పముయొక్క, స్థేమన్= మహిమవంటి మహిమచే పొసఁగదా యని స్వభావార్థము. దమివర్య=యతిశ్రేష్ఠుఁడా! కనకజాతీయాంగి కన్నుదోయి – కనకజాతీయ=సువర్ణప్రకారము గల, అంగి=దేహము గలదాని యొక్క, ఇచట ‘ప్రకారవచనే జాతీయర్’ అని జాతీయప్రత్యయము, కన్నుదోయి=నేత్రయుగ్మము; శ్రీరంగవైఖరిన్ – శ్రీరంగ = శ్రీరంగమను పుణ్యక్షేత్రముయొక్క, వైఖరిన్=రీతిచేత; చెలఁగదే=ప్రకాశింపదా యని కాకువు. శ్రీరంగవైఖరిన్ – శ్రీ=సిరికి, రంగ = విహారస్థానముయొక్క, వైఖరిన్=రీతిచే, చెలఁగదా యని స్వభావార్థము. అగుటన్=ఈప్రకారముగ వనితావయవములు పుణ్యక్షేత్రాకృతిని బొందుటచేత; నిత్యపవిత్రరూపాప్తిన్ – నిత్య=నిరంతరము, పవిత్ర=నిర్మలమగు, రూప=స్వరూపముయొక్క, ఆప్తిన్=ప్రాప్తిచేత; అడరుకలికితోన్=ఒప్పుచున్నకాంతతో; కూడి యుం డినఁ గాక =కలసియుండినం గాక; ఇట్టి =ఈప్రకారము; మహాఘదాయిఘోరకాంతారమహిన్ – మహత్=అధికమగు, అఘ = పాపమును, ‘అఘం దుఃఖే చ పాపే చ’ అని విశ్వము, దాయి=ఇచ్చుచున్న, ఘోర=భయంకరమగు, కాంతారమహిన్= అరణ్యభూమియందు; ఉన్నన్=ఉన్నచో, ధీరముఖ్య=పండితోత్తముఁడ! అతనుసుఖరాశి – అతను=అధికమగు, సుఖరాశి =ఆనందరాశి, మన్మథసుఖరాశి యని స్వభావార్థము; కలదె=ఉండునా?

అనఁగ రోమవల్లి పరమకాశ్యాకృతిని, మోవి మధురాత్మతను, పొక్కిలి పురుషోత్తమక్షేత్రగరిమను, కనుదోయి శ్రీరంగ వైఖరిని బొందియుండుటచే, సర్వదా పవిత్రరూపమును పొందిన కలికితోడఁ గూడి యుండిన నతనుసుఖము ఘటిల్లును గాని, యఘప్రదమగు నీ భయంకరారణ్యములో నుండినచో నెట్లు ఘటిల్లు నని భావము.