చంద్రికాపరిణయము – 4. ద్వితీయాశ్వాసము

చ. అపుడు రణోత్సుకుం డగు సి◊తాంబుజసాయకుకంటిసన్నఁ గీ
రపటలి, చల్లగాడ్పు, తొవ◊రాయఁడు, కోయిలపౌఁజు, చైత్రుఁ, డ
చ్చపుఁదెలిఱెక్కపుల్గు, లని ◊సల్పఁగఁ జాలుదు నేనె నేనె యం
చపరిమితాగ్రహస్ఫురణ ◊నమ్మునిఁ జుట్టిరి సత్వరంబుగన్. 80

టీక: అపుడు =ఆసమయమందు; రణోత్సుకుం డగు =యుద్ధమునం దుత్సాహము గలవాఁడైన; సితాంబుజసాయకు=పద్మ బాణుఁడగు మన్మథునియొక్క; కంటిసన్నన్=కనుసంజ్ఞచేత; కీరపటలి=చిలుకలగుంపు; చల్లగాడ్పు=మందమారుతము; తొవరాయఁడు=చంద్రుఁడు; కోయిలపౌఁజు=కోకిలలసైన్యము; చైత్రుఁడు=వసంతుఁడు;అచ్చపుఁదెలిఱెక్కపుల్గులు=హంసలు; అనిన్=యుద్ధమును; చల్పఁగన్=చేయుటకు; నేనె నేనె చాలుదు నంచు=(అహమహమికతో)నేనొక్కడనే నేనొక్కడనే సరి పోదు ననుచు; అపరిమితాగ్రహస్ఫురణన్ – అపరిమిత=మితిలేని, ఆగ్రహ=కోపముయొక్క, స్ఫురణన్=ఆవిర్భావముచేత; సత్వరంబుగన్=వేగముగ; అమ్మునిన్=ఆవసంతర్షిని; చుట్టిరి =చుట్టుకొనిరి. అనఁగా రణోత్సుకుం డగు నాపంచ శరుఁడు కనుసైగఁజేయఁగ, శుకసమూహాదులు నేనొక్కఁడనే రణము సల్పుటకు సమర్థుఁడ ననఁగా నేనొక్కఁడనే రణము సల్పుటకు
సమర్థుఁడ ననుచు నహమహమికచే మునినిఁ జుట్టుముట్టి రనిభావము.

సీ. శైత్యవత్కరకుంత◊చటులధారారేఖ, శమినేత నాటించెఁ ◊జలువమిన్న,
తళుతళు క్కన వేగ ◊జళిపించి మావిక్రొం,దళపుఁ గత్తిని మౌని ◊నఱకె సురభి,
కడుఁ జంచరీకసం◊ఘము మ్రోయ ఘనజాల,కంబుల యతి మొత్తె ◊గడుసుగాడ్పు,
కటురజోగ్నికణాళి ◊గ్రమ్మఁ జెందొవమందు,తిత్తుల మునిఁ గప్పె ◊హత్తి యంచ,

తే. యిట్టు లాదిట్ట లందఱుఁ ◊జుట్టుముట్టి, గట్టితన ముట్టిపడ నురు◊క్షాంతికవచ
ధారి జడదారి నొప్పించి ◊ధైర్యలీల, నడఁప లేకున్కి గని మరుం ◊డపుడు గడఁగి. 81

టీక: చలువమిన్న=చంద్రుఁడు; శైత్యవ త్కర కుంత చటుల ధారారేఖన్ – శైత్యవత్=చల్లఁదనము గల, కర=కిరణము లనెడు, కుంత=ఈఁటెలయొక్క, చటుల=చలించుచున్న, ధారారేఖన్=వాదరచేతను; శమినేతన్=మునిపతిని; నాటించెన్=గ్రుచ్చెను; సురభి=వసంతుఁడు; తళుతళుక్కనన్=తళతళ మనునటుల; వేగ=శీఘ్రముగ; జళిపించి=ఆడించి; మావిక్రొందళపుఁ గత్తిని = మావిచిగురాకనెడు కత్తిచేత; మౌనిన్=మౌనిని; నఱకెన్=ఖండించెను; గడుసు=కఠినమైన; గాడ్పు=వాయువు; ఘనజాలకంబులన్=గొప్ప మొగ్గలనెడు లోహముద్గరసంఘములచేత; యతిన్ = మునిని; కడున్=మిక్కిలి; చంచరీక=తుమ్మెదలయొక్క; సంఘము=గుంపు; మ్రోయన్=ధ్వనిచేయుచుండఁగ; మొత్తెన్ = కొట్టెను; అంచ=హంస;కటురజోగ్నికణాళి – కటు=తీక్ష్ణమగు, రజః=పరాగ మనెడు, అగ్నికణాళి=మిడుఁగుఱుల గుంపు; క్రమ్మన్= పైకొనఁగ; జెందొవమందుతిత్తులన్= ఎఱ్ఱగలువ లనెడు మాదకద్రవ్యవిశేషము గల భస్త్రికలచేత; మునిన్=ఋషిని; హత్తి =చేరి; కప్పెన్=కప్పెను; ఇట్టులు=ఈప్రకారము; ఆదిట్ట లందఱున్ = ఆధైర్యవంతు లైన చంద్రాదు లందఱును; చుట్టుముట్టి=పరివేష్టించి; గట్టితనము= సామర్థ్యము; ఉట్టిపడన్= అతిశయింపఁగ; ఉరుక్షాంతికవచధారిన్ – ఉరు=అధికమగు, క్షాంతి=శమ మనెడు, కవచ=బొందల మును, ధారిన్=ధరించినవాఁడగు; జడదారిన్=మునిని; నొప్పించి=బాధించి; ధైర్యలీలన్=(మునియొక్క) ధైర్యవిలాసమును; అడఁప లేకున్కి=అడఁగఁజేయకుండుటను; కని =చూచి; అపుడు=ఆసమయమునందు; మరుండు=మన్మథుఁడు; కడఁగి = ప్రయత్నించి. దీని కుత్తరపద్యస్థక్రియతో నన్వయము.

చంద్రుఁడు కిరణములను కుంతములచేతను, వసంతుఁడు చూతపల్లవ మను తరవారిచేతను, మలయానిలము మొగ్గలను నినుపగుదియలచేతను, అంచ చెందొవలను మందుతిత్తులచేతను బాధించియు శమ మను కవచమును ధరించిన శమినేత ధైర్యము నడఁపలేకుండుటంజూచి మదనుఁడు (ముందుచెప్పఁబోవు) పద్మముకుళాస్త్రములను మునిపై నించెనని భావము.

చ. చనని నవాగ్రహస్ఫురణఁ ◊జక్కెరవిల్తుఁడు తేజి బోరునన్
మునిపతిమీఁద నూకి కడు◊ముట్టక మ్రోయుగొనంబు తుంటవిం
ట నొనరఁ గూర్చి చంద్రఋతు◊నాథులు గన్గొని యౌర! మేలు మే
లనఁ బరితేజితాబ్జముకు◊ళాస్త్రపరంపర నించె నుద్ధతిన్. 82

టీక: చక్కెరవిల్తుఁడు=మారుఁడు; చనని నవాగ్రహస్ఫురణన్=వీడని నూతనక్రోధముయొక్క స్ఫురణచేతను; తేజిన్ =గుఱ్ఱ మగు శుకమును; బోరునన్=బోరను ధ్వని గలుగునటులు; మునిపతిమీఁదన్=ఋషిమీఁదను; నూకి=త్రోలి; కడున్=మిక్కిలి; ముట్టక=తాఁకకయే; మ్రోయుగొనంబు=మొరయుచున్న యల్లెత్రాటిని; తుంటవింటన్=చెఱకువింటియందు; ఒనరన్=అను కూలముగ; కూర్చి=జతపఱచి; చంద్రఋతునాథులు=చంద్రుఁడు, వసంతుడును; కన్గొని=చూచి; ఔర=ఆశ్చర్యము;మేలు మేలనన్=మేలు మేలని ప్రశంసింపఁగ; పరితేజిత=చికిలిపెట్టఁబడిన; అబ్జముకుళ=తామరమొగ్గ లనెడు; అస్త్ర=తూపులయొక్క; పరంపరన్=గుంపును; ఉద్ధతిన్=వేగముచేత; నించెన్=కప్పెను.

అనఁగా మన్మథుఁడు తనగుఱ్ఱమును మునిమీఁదికి విడిచి, తనంతటనె మొరయుచున్న యల్లెత్రాటిని (అనఁగా తుమ్మెద బారు ననుట) చెఱకువింట నెక్కిడి చంద్రాదులు పొగడఁగ పద్మబాణములు మునిపై నించె నని భావము.

చ. మదనబిసప్రసూనశర◊మండలి యాజడదారిసామిపే
రెద వడిఁ దాఁకునత్తఱిఁ ద◊దీయపరాగము చిందుటల్ స్తవా
స్పద మయి వొల్చె తద్విశిఖ◊జాలసమాహతిభిన్నమౌనిరా
జదృఢరమేశ భక్తికవ◊చస్ఫుటచూర్ణమనీష దార్చుచున్. 83

టీక:మదనబిసప్రసూనశరమండలి – మదన=మన్మథునియొక్క, బిసప్రసూన=పద్మములను,శరమండలి=తూఁపులగుంపు; ఆజడదారిసామి=ఆమునిరాజుయొక్క; పేరెదన్=విశాల మగు ఱొమ్మును; వడిన్=వేగముగ; తాఁకునత్తఱిన్=తాఁకునప్పుడు; తదీయపరాగము=ఆతామరపూదూఁపుపుప్పొడి; చిందుటల్=రాలుటలు; త ద్విశిఖజాల సమాహతి భిన్న మౌనిరాజ దృఢ రమేశ భక్తికవచ స్ఫుట చూర్ణమనీషన్ – తత్=ఆమన్మథునియొక్క, విశిఖజాల=బాణసమూహముయొక్క, సమాహతి= కొట్టుటచేత, భిన్న=బ్రద్దలయిన, మౌనిరాజ=ఋషిరాజుయొక్క,దృఢ=గాఢమయిన,రమేశభక్తి=విష్ణుభక్తి యనెడు, కవచ= బొందళముయొక్క, స్ఫుట=వ్యక్తమగు, చూర్ణ =పొడియొక్క, మనీషన్=బుద్ధిని; తార్చుచున్=కలుగఁజేయుచు; స్తవాస్పద మయి=స్తుతి కర్హమయి; పొల్చెన్=ఒప్పెను.

మన్మథుని పద్మబాణసమూహము మునీశ్వరుని ఱొమ్మును దాఁక, నాసమయమం దాపద్మబాణపరాగము చిందుటలు మన్మథబాణములచే భేదింపఁబడిన విష్ణుభక్తి యనెడు కవచముయొక్కపొడి యను భ్రమను కలిగించె నని భావము.

చ. వరజవశక్తిచేఁ బలుకు◊వాల్దొరపేరెదఁ దాఁకి తాఁకునం
బరిహృతకుట్మలాత్మ మగు ◊మారునితామరమొగ్గముల్కి ని
బ్బరముగఁ బర్వఁ దద్రసము ◊భాసిలె తన్మునిధైర్యజీవనో
త్కరములు పీల్చి వెగ్గలము◊గాఁగఁ గడున్ వెడలించుపోలికన్. 84

టీక: వరజవశక్తిచేన్—వర=శ్రేష్ఠమగు, జవ=వేగముయొక్క, శక్తిచేన్=సామర్థ్యముచేత; పలుకువాల్దొర=మునిరాజుయొక్క; పేరెదన్=విపులమగు వక్షమును; తాఁకి =తగిలి; తాఁకునన్=తాఁకుటచేత; పరిహృతకుట్మలాత్మము—పరిహృత=పోఁగొట్టఁ బడిన, కుట్మలాత్మము=కోరకావస్థగలది; అగు=ఐనట్టి; మారునితామరమొగ్గముల్కి=మన్మథుని పద్మకోరకబాణము; నిబ్బరముగన్=అధికముగ; తద్రసము =దానియొక్క మకరందము; పర్వన్=వ్యాపింపఁగ; తన్మునిధైర్యజీవనోత్కరములు – తన్ముని =ఆమునియొక్క, ధైర్య=ధైర్య మనెడు, జీవన=ఉదకముయొక్క, ఉత్కరములు=సమూహములను; పీల్చి=త్రావి; వెగ్గలముగాఁగన్=మిక్కుటము కాఁగ; కడున్=మిక్కిలి; వెడలించుపోలికన్ =పైకి వెళ్ళఁగ్రక్కురీతిగ; భాసిలెన్=ప్రకాశించెను.

అనఁగా నతివేగముగ తామరమొగ్గతూఁపు జడదారియెడ దాఁకి కోరకభావము వీడి మకరందము కాఱఁగా నది యా మునిధైర్య మను నుదకమును ద్రావి యధిక మగుటచే వెడలఁగ్రక్కురీతి భాసిలె నని భావము.

చ. అచలసమాధియోగగతి ◊నందిన యమ్మునిఁ జెందదయ్యె న
వ్యచలనరేఖ యప్పు డస◊మాశుగకాండము పర్వినం గరం
బచలసమాధియోగగతి ◊నందిన యమ్ముని నెట్లు చెందు న
వ్యచలనరేఖ యెంత యస◊మాశుగకాండము పర్వినన్ మహిన్. 85

టీక: అప్పుడు=ఆసమయమందు; కరంబు=మిక్కిలి; అసమాశుగ=మన్మథునియొక్క;కాండము =బాణము, జాత్యేకవచన ముగా నిది ప్రయోగింపఁబడినది; పర్వినన్=వ్యాపించినను; అచలసమాధియోగగతిన్ – అచల=చలింపని, సమాధి=చిత్తవృత్తి నిరోధముచే నైన, యోగగతిన్=ధ్యానగతిని; అందిన=పొందినట్టి; అమ్మునిన్=ఆజడదారిని; నవ్యచలనరేఖ=నూతన మగు చాంచల్యపరంపర; చెందదయ్యెన్=పొంద దయ్యెను; అచలసమాధియోగగతిన్ – అచలసమ=పర్వతసమాన మగు, అధి యోగ=ధ్యానముయొక్క, గతిన్ =రీతిని; అందిన=పొందినట్టి; అమ్మునిన్=ఆతపసిని; ఎంత=ఎంతకాలము; అసమ= సాటి లేనిదగు, ఆశుగకాండము =వాయుబృందము; పర్వినన్=వ్యాపించినను; మహిన్=భూమియందు; నవ్యచలనరేఖ=నూతన మగు చాంచల్యపరంపర; ఎట్లు=ఏరీతి; చెందున్=పొందును? అనఁగా లోకమందు వాయుసంఘము పర్వతమును జలింపఁ జేయనట్లు చలింపని సమాధియోగమందున్న యామునిని మన్మథుని బాణబృందము చలింపఁజేయఁజాల దయ్యెనని భావము.

మ. తనకంజాతశరంబు లిట్లు మునిచం◊ద్రస్ఫీతతేజంబుచే
వనవీథిన్ వికలత్వ మొందఁ గని దు◊ర్వారావలేపక్రమం
బున నాకంతుఁడు కేలుదోయిఁ గొని నే◊ర్పుల్ మీఱఁ బూమొగ్గనే
జను దద్వక్షము గుప్పునం బొడిచె నో◊జం జైత్రుఁ డౌనౌ యనన్. 86

టీక: తనకంజాతశరంబులు=తనసంబంధు లగు పద్మబాణములు; మునిచంద్ర స్ఫీత తేజంబుచేన్ – మునిచంద్ర=మునిచంద్రుని యొక్క, స్ఫీత=అధికమగు,తేజంబుచేన్=కాంతిచేత; ఇట్లు=ఈప్రకారము; వనవీథిన్=అడవియందు; వికలత్వము=నిరర్థక త్వమును; ఒందన్=పొందఁగ, ఇచట ముని యనెడు చంద్రునికాంతిచే, వనవీథిన్=ఉదకమందు, కమలములు వికలత్వము ననఁగా ముకుళనమును పొందె నను నర్థము స్ఫురించుచున్నది; కని=చూచి; దుర్వా రావలేప క్రమంబునన్ — దుర్వార = నివారించుట కశక్యమైన, అవలేప=గర్వముయొక్క, క్రమంబునన్=రీతిచేత; ఆకంతుఁడు =ఆమన్మథుఁడు; పూ మొగ్గనేజను =పూమొగ్గ యను తోమరమును; కేలుదోయిన్=రెండుచేతులచే; కొని =తీసి; నేర్పుల్=చాతుర్యములు; మీఱన్=అతిశయిం పఁగ; తద్వక్షము=ఆమునిఱొమ్మును; గుప్పునన్=శీఘ్రముగ; చైత్రుఁడు=వసంతుఁడు; ఔనౌ యనన్=పొగడఁగ; ఓజన్ = ఉత్సాహముతో; పొడిచెన్=గ్రుచ్చెను. అనఁగా మన్మథుఁడు తనపద్మబాణములు వ్యర్థములు కాఁగానే యమోఘ మగు పూమొగ్గ యను తోమరముతో మునిం బొడిచె నని భావము.

చ. దళ మగు రోస మెచ్చఁ దన◊తత్తడి నోరగఁ బోవఁ జేసి ని
స్తులపథికాసృగక్త మను◊సొంపున రోహితదీప్తిజాతముల్
గలయఁగ మించు నూతనప◊లాశసుమం బను బాగుదారచేఁ
జలమున నయ్యతిన్ నఱకె ◊సారససాయకవీరుఁ డంతటన్. 87

టీక: అంతటన్ =అటుపిమ్మట; సారససాయకవీరుఁడు=మన్మథవీరుఁడు; దళము=అధికము; అగు రోసము=అయినట్టి కోపము; ఎచ్చన్=అతిశయింపఁగ; తనతత్తడిన్=తనవాహనమైన చిలుకను; ఓరగన్=ప్రక్కకు; పోవన్=పోవునటులు; చేసి =ఒనర్చి; నిస్తులపథికాసృగక్తము – నిస్తుల=నిస్సమాన మగు, పథిక=విరహులయొక్క, అసృక్=రక్తముచే; అక్తము = పూయఁబడినది; అను సొంపునన్=అనువిధంబున; రోహితదీప్తిజాతముల్—రోహిత=ఎఱ్ఱనైన, దీప్తి=కాంతులయొక్క, జాత ముల్=పుంజములు; కలయఁగన్=వ్యాపింపఁగా; మించు =అతిశయించు; నూతన=క్రొత్త; పలాశసుమం బను = మోదుగపూ వను; బాగుదారచేన్=చూరకత్తిచేత; చలమునన్=మాత్సర్యముచేత; అయ్యతిన్=ఆమునిని; నఱకెన్= ఖండించెను.

అనఁగా మన్మథుఁడు క్రోధ మతిశయింపఁగ తనవాహనము నొకప్రక్కకుఁ దోలి, పథికులరక్తముచేఁ దడిసినదో యన నెఱ్ఱనగు మోదుగుసుమ మను చూరకత్తిచే మునిని నఱకె నని భావము.

చ. మునిపతి కేమిటన్ జుఱుకు◊ముట్టకయుండినఁ గాంచి తేజి చ
య్యన డిగి యప్డు నైకనిశి◊తాయుధజాతము పూని మిక్కిలం
గనుఁగొనలన్ రుషానలశి◊ఖాతతి పర్వ మరుండు చంద్రచం
దనపవమానముఖ్యవృతిఁ ◊దా నడచెన్ యతిమీఁది కుద్ధతిన్. 88

టీక: మునిపతికి=జడదారిసామికి; ఏమిటన్=ఏయస్త్రముచేతను; చుఱుకు ముట్టక=వేఁడితాఁకక; ఉండినన్=ఉండఁగ; కాంచి = చూచి; తేజి=గుఱ్ఱమునుండి; చయ్యనన్=శీఘ్రముగా; డిగి =దిగి; అప్డు =ఆసమయమునందు; నైక నిశి తాయుధ జాతము – నైక=అనేకములైన, నిశిత=తీక్ష్ణములైనట్టి, ఆయుధ=కుంతాద్యాయుధములయొక్క, జాతము=సమూహమును; పూని = గ్రహించి; మిక్కిలన్=అతిశయించునట్లు; కనుఁగొనలన్=నేత్రాంతములయందు; రుషానల శిఖా తతి – రుషానల=కోపాగ్ని యొక్క, శిఖా=జ్వాలలయొక్క, తతి=సమూహము; పర్వన్= వ్యాపించుచుండఁగ; మరుండు=మన్మథుఁడు; చంద్ర
చందన పవమాన ముఖ్య వృతిన్ – చంద్ర=చంద్రుఁడు, చందనపవమాన =మలయానిలము, ముఖ్య=ఆదిగాఁగలవారియొక్క, వృతిన్=మేళనముచేతను; తాన్=తాను (మన్మథుఁడు); ఉద్ధతిన్=గర్వముచేత; యతిమీఁదికిన్=మునిమీఁదికి; నడచెను.

క. నడచి యళిఘంటికాధ్వని, యడరఁ బరాగాగ్నికణచ◊యంబులు వెడలం
గడు నమరురాగసుమ మను, బెడిదం బగు శక్తి వైచె ◊భీకరలీలన్. 89

టీక: నడచి =గమించి; అళి ఘంటికా ధ్వని—అళి=తుమ్మెదలను, ఘంటికా=చిఱుగంటలయొక్క, ధ్వని=నాదము; అడరన్ =అతిశయింపఁగ; పరాగాగ్నికణచయంబులు – పరాగ=పుప్పొడియనెడు, అగ్నికణ=స్ఫులింగములయొక్క,చయంబులు =సమూహములు; వెడలన్=బయలుదేఱుచుండఁగ; కడునమరురాగసుమము – కడున్=మిక్కిలి, అమరు=ఒప్పియున్న, రాగసుమము=బంధూకపుష్పము; అను=అనెడు; బెడిదం బగు=సమర్థమైన; శక్తి న్ =శక్తిని; భీకరలీలన్=భయంకరమగు క్రియచేతను, ‘లీలా విలాస క్రియయోః’ అని యమరుఁడు; వైచెన్=వేసెను. అనఁగా భృంగధ్వని యనెడు చిఱుగంటలధ్వని చేతను, పుప్పొడి యను నగ్నికణములచేతను నొప్పు మంకెనపుష్పమను శక్తిని (శక్త్యాయుధమును) మునిపైకి వేసెనని భావము.