చంద్రికాపరిణయము – 4. ద్వితీయాశ్వాసము

ఉ. ఆలలితాంగి యొక్క భవి◊కాహమునన్ క్షణదోదయాఖ్య పాం
చాలవసుంధరాపతికి ◊శ్యామ యనం బొగడొందు సుందరీ
మౌళియెడన్ జనించె, నల◊మానవభర్తయు భూరిహర్షభూ
షాకలితాత్ముఁడై యునిచెఁ ◊జంద్రిక యన్శుభనామ మింతికిన్. 125

టీక: ఆలలితాంగి=ఆచిత్రరేఖ; ఒక్క భవికాహమునన్=ఒకశుభదినమునందు;క్షణదోదయాఖ్యపాంచాలవసుంధరాపతికిన్ – క్షణదోదయాఖ్య=క్షణదోదయుఁ డను పేరుగల, పాంచాలవసుంధరాపతికిన్=పాంచాలదేశపురాజునకు; శ్యామయనన్ = శ్యామ యను పేరిట; పొగడొందు=ప్రసిద్ధిని పొందినట్టి; సుందరీమౌళియెడన్ = కాంతారత్నమునందు; జనించెన్=పుట్టెను; అలమానవభర్తయు=ఆక్షణదోదదయరాజును; భూరిహర్షభూషాకలితాత్ముఁడై – భూరి=అధికమగు, హర్ష=సంతసముచేత, భూషా=ఆభరణములచేతను, కలిత=పొందఁబడిన, ఆత్ముఁడై=మనమును దేహమును గలవాఁడై; ఇంతికిన్=కూఁతునకు; చంద్రికయన్శుభనామము= చంద్రిక యను శుభనామధేయమును; ఉనిచెన్=ఉంచెను.

చిత్రరేఖ పుడమియం దొకశుభదినమున పాంచాలరాజైన క్షణదోదయునికి శ్యామయను నారీరత్నమందు కూఁతురై జన్మించెను. ఆకూఁతురునకు క్షణదోదయుఁడు చంద్రిక యను మంగళకరమైన పేరును పెట్టెను.

మ. తనకార్యంబున కీగతిం జని యమ◊ర్త్యస్త్రీలలామంబు పా
వనమౌన్యుక్తి నిజాదివర్ణరహిత◊త్వం బూని ధాత్రిం జనిం
చిన వార్తన్ విని చింత నొంది మదిఁ ద◊త్స్నేహంబుతో దివ్యచి
హ్ననికాయంబులు గల్గఁ జేసె నవలా ◊కబ్జాసనుం డెంతయున్. 126

టీక: అబ్జాసనుండు=నలువ; తనకార్యంబునకున్=మునితపోభంగరూప స్వకార్యమునకు; ఈగతిన్=ఈరీతిగా; చని=పోయి; అమర్త్యస్త్రీలలామంబు = దేవాంగనారత్నమగు చిత్రరేఖ; పావనమౌన్యుక్తిన్ = పవిత్రమగు మునిశాపోక్తిచేత; నిజాదివర్ణరహిత త్వంబు – నిజ=అమర్త్యస్త్రీశబ్దముయొక్క, ఆదివర్ణ=ప్రథమవర్ణమగు ‘అ’కారముయొక్క, రహితత్వంబు=రాహిత్యమును, అనఁగా ‘అమర్త్యస్త్రీ’లోని ‘అ’కారము తొలగుటవలన ‘మర్త్యస్త్రీ’ యైనదని భావము; ఊని=పూని; ధాత్రిన్=పుడమియందు; జనించిన వార్తన్=జన్మించెనను జనశ్రుతిని;విని=ఆకర్ణించి; చింతన్=విచారమును; ఒంది=పొంది;మదిన్=హృదయమునందు; తత్స్నేహంబుతోన్=ఆచిత్రరేఖయందలి ప్రేమచేత; నవలాకున్=చంద్రికకు; ఎంతయున్=మిక్కిలి; దివ్యచిహ్ననికాయంబులు = దివ్యమగు భాగ్యచిహ్నములయొక్క సమూహములను; కల్గన్=కల్గునట్లుగ; చేసెన్=ఒనరించెను. అనఁగఁ బారిజాతారణ్య మందు బ్రహ్మత్వమునకై తపం బొనరించు వసంతమునితపోభంగమునకుం దాను బంపిన చిత్రరేఖకు నామునిశాపమువలన మర్త్యస్త్రీత్వము రాఁగానే నలువ చింతించి, యాకాంతకు నమోఘభాగ్యచిహ్నములు గలుగఁ జేసె నని భావము.

ఉ. ఆసరసీరుహాక్షి కఖి◊లాద్భుతదాయివిపంచికాకలా
భ్యాస మొనర్పఁ జెంతఁ దగు◊నట్టి ననుం గుముదాఖ్యుఁ గాంచి ప
ద్మాసనుఁ డంపఁ బూర్వసమ◊యామితమైత్త్రి ధరిత్రిఁ జేరి యు
ద్భాసితతద్రహస్యగతిఁ ◊దన్వికి నేర్పితి నేర్పు పెంపునన్. 127

టీక: ఆసరసీరుహాక్షికిన్ = ఆచంద్రికకు; అఖిలాద్భుతదాయివిపంచికాకలాభ్యాసము – అఖిల=సమస్తజనులకు, అద్భుత = ఆశ్చర్యమును, దాయి=ఇచ్చునట్టి, విపంచికాకలా=వీణావిద్యయొక్క, అభ్యాసము=నేర్పుటను; ఒనర్పన్=చేయుటకు; కుముదాఖ్యున్=కుముదుఁడను పేరుగల; చెంతన్ తగునట్టి ననున్= సమీపమునందున్న నన్ను; కాంచి = చూచి; పద్మాస నుఁడు =నలువ; అంపన్=పంపఁగా; పూర్వసమయామితమైత్త్రిన్ – పూర్వసమయ=పూర్వకాలమందున్నట్టియు, అమిత= అధికమగునట్టియు, మైత్త్రిన్=స్నేహముచేతను; ధరిత్రిన్=భూమిని; చేరి=పొంది; ఉద్భాసితతద్రహస్యగతిన్ – ఉద్భాసిత = ప్రకాశించుచున్న, తత్=ఆవీణావిద్యయొక్క, రహస్య=నిగూఢమగు, గతిన్ =రీతిని;తన్వికిన్=చంద్రికకు; నేర్పు పెంపునన్ = నైపుణ్యాతిశయముచేత; నేర్పితిన్=అభ్యసింపఁజేసితిని.

అనఁగ నలువ చెంతనున్న కుముదుఁడను పేరుగల నన్నుఁ జూచి, పుడమికిఁ బోయి చంద్రికకు వీణావిద్యారహస్యమును దెలుపు మనఁగా, నేను బూర్వస్నేహంబున భూమింజేరి తద్విద్యారహస్యము నామెకు నేర్పితి నని భావము.

తే. అంత నొకనాఁడు శారదా◊కాంతవలన
వింతరాగంబు లొకకొన్ని◊విని ముదమున
వాని నన్నింటి నారాజ◊వర్యసుతకుఁ
దెలిపెద నటంచుఁ బుడమి కే◊తెంచు నపుడు. 128

టీక: అంతన్=అటుపిమ్మట; ఒకనాఁడు =ఒకదినమందు; శారదాకాంతవలనన్=సరస్వతీదేవివలన; వింతరాగంబులు=విచిత్ర మగు రాగములను; ఒకకొన్ని=కొన్నింటిని; విని=ఆకర్ణించి; ముదమునన్=సంతసముచేత; వాని నన్నింటిన్ = ఆరాగముల నన్నిటిని; ఆరాజవర్యసుతకున్=ఆచంద్రికకు; తెలిపెద నటంచున్ =తెలియఁజేసెద ననుచు; పుడమికి=భూమికి; ఏతెంచునపుడు = వచ్చుచున్న సమయమందు;

సీ. కనుదోయి కింపూన్చు ◊కలికికుంకుమబొట్టు, దార్చిననెమ్మోముఁ◊దమ్మిదాని,
నీటుగాఁ దీర్చిన ◊కాటుకరేఖచే, నొప్పారు విమలాక్షి◊యుగముదాని,
నునుపు లౌ తొడలని◊గ్గున వింతవగ దోఁచు, నవ్యచీరాచ్ఛాద◊నమ్ముదానిఁ,
బసపుచాల్పూఁతచేఁ ◊బచ్చదామరపెంపు, దలఁకించు పాణిపా◊దమ్ముదాని,

తే. జలదనికటస్థలి రహించు ◊చపలవోలెఁ, బర్ణదళశాలపొంతఁ జూ◊పట్టుదాని,
నొక్క మునికాంత నీయద్రి◊చక్కిఁ గాంచి, చాల వైచిత్రి నెమ్మది ◊సందడింప. 129

టీక: కనుదోయికిన్=కనుఁగవకు; ఇంపూన్చుకలికికుంకుమబొట్టు – ఇంపు=సొంపును, ఊన్చు=చేయుచున్న, కలికి = సుందరమగు, కుంకుమబొట్టు=కాశ్మీరతిలకము; తార్చిన=దిద్దిన; నెమ్మోము తమ్మిదానిన్=అందమగు ముఖకమలము గలదానిని; నీటుగాన్=శృంగారముగ; తీర్చినకాటుకరేఖచేన్=దిద్దినకాటుకరేకచేత; ఒప్పారు విమలాక్షియుగముదాని – ఒప్పారు =ప్రకాశించుచున్న; విమల=నిర్మలమగు; అక్షియుగముదాని = కనుదోయి గలదానిని; నునుపు లౌ తొడలనిగ్గునన్ = నునుపులగు తొడలయొక్క కాంతిచేత; వింతవగ=ఆశ్చర్యకరమగు విలాసము; తోఁచు=ప్రకట మగుచున్న; నవ్యచీరాచ్ఛాదనమ్ముదానిన్ – నవ్య=నూతనమగు, చీరాచ్ఛాదనమ్ముదానిన్ = నారకోఁకగలదానిని; పసపుచాల్పూఁతచేన్ = పసపు సమృద్ధిగాఁ బూయుటచే; పచ్చదామరపెంపు=పసపుతామరపూలయొక్క అతిశయమును; తలఁకించు=చలింపఁజేయు; పాణిపాదమ్ముదానిన్ = హస్తపాదములు గలదానిని, ప్రాణ్యంగము లగుటచే నేకవద్భావము. జలదనికటస్థలిన్ – జలద=మేఘముయొక్క, నికటస్థలిన్=సమీపప్రదేశమునందు; రహించు =ఒప్పుచున్న; చపలవోలెన్= మెఱపుతీఁగవలె; పర్ణదళశాల=మోదుగాకులతోఁ గప్పఁబడిన పర్ణశాలయొక్క; పొంతన్=సమీపమున; చూపట్టుదానిన్=కను పట్టుదానిని; ఒక్క మునికాంతన్= ఒకమునిపత్నిని; ఈయద్రిచక్కిన్=ఈపర్వతస్థానమందు; కాంచి = చూచి; చాల వైచిత్రి = మిక్కిలి యాశ్చర్యము; నెమ్మదిన్=మనమునందు; సందడింపన్=అతిశయింపఁగా.

చ. కళ గలమోము, కెంపుసిరి ◊గాంచినపల్దెర, తేనె లొల్కు ప
ల్కులు, బిగువైన చన్నుఁగవ, ◊కుందనపుంజిగి నేలు ముద్దుచె
క్కులు గల యీచెలిం బ్రియపుఁ◊గూర్మివగ న్ననవిల్తుపోరునం
గలయక యున్నచోఁ దలఁపఁ◊గల్గునొకో నవసౌఖ్యమం చొగిన్. 130

టీక: కళ గలమోము = కాంతి గల ముఖము; కెంపుసిరిన్ కాంచినపల్దెర – కెంపుసిరిన్=ఎఱ్ఱనికాంతిని; కాంచినపల్దెర=పొంది నట్టి మోవి; తేనె లొల్కు పల్కులు = మకరందమును జిల్కు మాటలు; బిగువైన చన్నుఁగవ =బిగుతుగల పాలిండ్లును; కుందనపుంజిగిన్ = అపరంజికాంతిని; ఏలు ముద్దుచెక్కులు =గ్రహించిన సుందరమగు కపోలములు; కల =కలిగినట్టి; ఈచెలిన్ = ఈమునిపత్నిని; ప్రియపు కూర్మిన్ = ప్రియమగు చెలిమిచేతను; వగన్=విలాసముచేతను; ననవిల్తుపోరునన్= సురతమునందు; కలయక యున్నచోన్ = కూడకయుండినయెడల; నవసౌఖ్యము=నూతనమగు సుఖము; దలఁపఁగల్గు నొకో= తలఁపవచ్చునా? తలఁపరాదని భావము; అంచున్=అని తలఁచుచు; ఒగిన్=క్రమముగా.

ఉ. తాపసరాట్కుమారసమ◊తాకలితాకృతి నాత్మవిద్య మా
యాపటిమన్ భరించి, తదు◊దారనవచ్ఛదశాలఁ జేరి, యు
ద్దీపితభక్తిఁ దన్మునిపి◊తృప్రముఖానవరక్షమీశరా
జీపదపద్మము ల్వినతి◊చేయుచు నంతటఁ దత్కథాగతిన్. 131

టీక: తాపసరాట్కుమారసమతాకలితాకృతిన్ – తాపసరాట్కుమార=మునిశ్రేష్ఠుని కుమారునియొక్క, సమతా=సమత్వ ముతో, కలిత=కూడుకొన్న, ఆకృతిన్=ఆకారమును; ఆత్మవిద్యన్ =స్వభావసిద్ధమైన విద్యచేత; మాయాపటిమన్ = మాయ యొక్క పటుత్వము (సామర్థ్యము) చేత; భరించి=వహించి, నామాయచేత మునిపుత్త్రాకృతిని ధరించి యని భావము; తదుదార నవచ్ఛదశాలన్ – తత్=ఆమునికుమారునియొక్క, ఉదార=ఉత్కృష్టమగు, నవ=నూతనమైన, చదశాలన్=పర్ణశాలను; చేరి =సమీపించి; ఉద్దీపితభక్తిన్=అధికమగు భక్తిచేత; తన్మునిపితృప్రముఖానవరక్షమీశరాజీపదపద్మముల్ –తన్ముని=ఆముని యొక్క,పితృ=తండ్రి, ప్రముఖ=మొదలుగాఁగల, అనవరక్షమీశ=పెద్దమునులయొక్క, రాజీ=పంక్తియొక్క, పదపద్మముల్ =పాదకమలములను; వినతిచేయుచున్=నమస్కరించుచు; అంతటన్=అటుమీఁద; తత్కథాగతిన్–తత్=ఆమునులయొక్క, కథాగతిన్=కల్పితవృత్తాంతముయొక్కరీతిచే. దీని కుత్తరపద్యమందున్న క్రియతో నన్వయము.

తే. ప్రొద్దు గడపుచు నుండ మ◊త్పూర్వకర్మ
గౌరవమ్మున నమ్ముని◊కాంతుఁ డచటి
కుట్టిపడ్డట్లు కన్నూడి◊నట్టు లపుడు
వేగమున వచ్చెఁ దత్సభ ◊వెఱఁగుపడఁగ. 132

టీక: ప్రొద్దు గడపుచు నుండన్=పూర్వోక్తకథచేఁ కాలము బుచ్చుచుండఁగ; మత్పూర్వకర్మగౌరవమ్మునన్ – మత్=నా యొక్క, పూర్వకర్మ=పూర్వజన్మదుష్కర్మముయొక్క, గౌరవమ్మునన్= ఆధిక్యతచేత; అమ్మునికాంతుఁడు = ఆ ముని నాథుఁడు; అచటికిన్=ఆపర్ణశాలకు; ఉట్టిపడ్డట్లు=హఠాత్తుగ; కన్నూడినట్టులు=నేత్రములూడిన విధముగ; అపుడు = ఆ సమయమునందు; తత్సభ =ఆసభ; వెఱఁగుపడఁగన్=ఆశ్చర్యమునందు నటులు; వేగమున=శీఘ్రముగ; వచ్చెన్.

ఉ. వచ్చిన నమ్మునీశుఁ గని ◊వారక గుండియ వ్రీల నంత నే
నచ్చటఁ దెచ్చుకోలు ధృతి ◊నయ్యతితో శపనోక్తిజాలకం
బెచ్చఁగఁ బెద్దప్రొద్దు కల◊హించితి నప్డు పరస్పరోగ్రఘో
షోచ్చలితాత్మతన్ సభ య◊హో యని యబ్బుర మూని నిల్వఁగన్. 133

టీక: వచ్చినన్=రాఁగానే; అమ్మునీశున్=ఆమునినాథుని; కని =చూచి; వారక=నిలువక; గుండియ=హృదయము; వ్రీలన్ =చీలఁగ; అంతన్=ఆమీఁద; నేను, అచ్చటన్ =ఆస్థలమందు; తెచ్చుకోలు ధృతిన్ =తెచ్చిపెట్టుకొన్న ధైర్యముచేత; అయ్యతి తోన్ =ఆమునితోడ; శపనోక్తిజాలకంబు – శపనోక్తి=తిట్టులయొక్క, జాలకంబు=సమూహము; ఎచ్చఁగన్=అతిశయింపఁగ; పెద్దప్రొద్దు=దీర్ఘకాలము; సభ =సభయందుండిన జనులు; పరస్పరోగ్రఘోషోచ్చలితాత్మతన్ – పర స్పర=మా యన్యోన్యుల యొక్క, ఉగ్ర=తీక్ష్ణమగు, ఘోష=ధ్వనిచేత, ఉచ్చలిత=మిక్కిలి చలించిన;ఆత్మతన్=మనసుగలవా రగుటచేత; అహో యని = అహోయనుచు; అబ్బురము =ఆశ్చర్యమును; ఊని=పూని; నిల్వఁగన్=నిలుచుండఁగ; అప్డు =ఆసమయమందు; కలహిం చితిన్ = జగడమాడితిని.

క. ఆయతిపతి యాయెడ మ
న్మాయాగతి నెల్లఁ దెలిసి ◊న న్గాంచి మనో
భూయఃపరికందళితమ
హీయఃప్రతిఘారసాప్తి ◊నిట్లని పలికెన్. 134

టీక: ఆయతిపతి=ఆమునిరాజు; ఆయెడన్=ఆసమయమందు; మన్మాయాగతిన్ – మత్=నాయొక్క, మాయాగతిన్= కపటరీతిని; ఎల్లన్=అంతయు; తెలిసి=తెలిసికొని; న న్గాంచి=నన్నుఁ జూచి; మనోభూయఃపరికందళితమహీయః ప్రతిఘా రసాప్తి న్ – మనః=మనమునందు, భూయః=అధికముగా, పరికందళిత=అంకురించినట్టియు, మహీయః= అధికమగు, ప్రతిఘారస=క్రోధరసముయొక్క, ఆప్తి న్=ప్రాప్తిచేత; ఇట్లని పలికెన్ =ఈరీతిగా ననెను. ఆమునినాథుఁడు నాకపటము నంతయు నెఱిఁగినవాఁడై, కోపగించి వక్ష్యమాణప్రకారముగఁ బలికె నని భావము.

శా. ఓరీ కిన్నర! యిట్లు పాపమతివై ◊యుద్వృత్తి మౌనీశ్వరా
కారం బూని మందగనైకరతికాం◊క్షాయుక్తిచే మీఱి యౌ
రా రాఁ జెల్లునె యిప్డు నీవు పవిధా◊రారూపశాపోక్తి దు
ర్వారేభాహితమూర్తివై పొడమరా ◊వైళంబె యియ్యద్రిపైన్. 135

టీక: ఓరీ కిన్నర=ఓ కిన్నరుఁడా! ఇట్లు=ఈప్రకారము; పాపమతివై =పాపబుద్ధి గలవాఁడవై; ఉద్వృత్తిన్=దుష్టవృత్తిచేత; మౌనీ శ్వరాకారంబు = మునివేషమును; ఊని = ధరించి; మందగనైకరతికాంక్షాయుక్తిచేన్ – మందగనా = నాభార్యయొక్క, ఏక= ముఖ్యమగు, రతి=సురతమునందలి, కాంక్షా=కోరికతోడి, యుక్తిచేన్=కూడికచే; మీఱి=అతిక్రమించి; రాఁ జెల్లునె = రాఁ దగునా? ఔరా=ఆశ్చర్యము; ఇప్డు =ఆసమయమందు; నీవు, పవిధారారూపశాపోక్తిన్ – పవి=వజ్రాయుధముయొక్క, ధారా రూప=వాదరవంటిదగు,శాపోక్తిన్=శాపవచనముచేత; వైళంబె =శీఘ్రముగనే; ఇయ్యద్రిపైన్=ఈపర్వతముమీఁద; దుర్వారేభా హితమూర్తివై – దుర్వార = నివారించుటకు శక్యము గాని, ఇభాహితమూర్తివై = సింహ (గజరిపు)శరీరముగల వాఁడవై; పొడమరా = జన్మింపుమురా.