విజ్ఞప్తి
సహృదయులారా!
కాళిదాసుని మేఘసందేశము మనస్సులో నుంచుకొని నేనీ కావ్యమును రచించితిని. గ్రంథనామము గబ్బిలము. శ్రోతలకిది కటువుగా దోచవచ్చును. కానీ అందలి కథానాయకుడు ప్రణయసందేశము నంపును. ఇతడంపునది తుకతుక నుడుకు నశ్రుసందేశము. అతని శిక్షాకాల పరిమితి యొక సంవత్సరము. ఇతని శిక్ష ఆజన్మాంతము. తరతరములు. దీని కవధి లేదు. అతడు మన్మథాగ్నితప్తుడు. ఇతడు క్షుధాగ్ని పీడితుడు.
“నాదు కన్నీటి కథ సమన్వయము సేయ
నార్ద్రహృదయంబు గూడ కొంతవసరంబు”
అని యితడు వాపోవును. కులీనులగు రాజులకువలె హంసలు, చిలకలు మున్నగు నుత్తమపక్షి దూతలితనికి జిక్కుట అసంభవము. కావున నిట్టిడుల జీర్ణకుటీరములలో నిరంతరము దర్శన మిచ్చు గబ్బిలము నితనికి సందేశహారిగా బరిగ్రహించితిని. రసజ్ఞుల కిందలి యౌచితి సులభగ్రాహ్యము. ఇంట బ్రవేశించి దీపమార్పిన గబ్బిలమును జూచి తన కన్నీటి కథ నీశ్వరునితో చెప్పుమని వీడు ప్రార్థించె గాని నిజమున కతని యుద్దేశ్యము దేశారాధన. కైలాసయానమునకు నాపన్నిన త్రోవ కొంత వక్రతకు గురియైనది. ఇది దోషము కాదనుకొందును. ఈ కృతి రసజ్ఞ లోకాదరణ నందిన నా శ్రమ ఫలోన్ముఖము కాగలదు.
నేనీ గ్రంధమును ముగించు నవసరమున గుంటూరు జిల్లా బోర్డు ప్రెసెడెంటుగారును, దేశభక్తులును, కళాభిమానులునగు శ్రీ కల్లూరి చంద్రమౌళి చౌదరిగారు మా యూరు దయచేసి గ్రంధము నామూలాగ్రముగా విని పతిత్వము వహించుట కంగీకరించుట నా యదృష్టము. వారికి నా నమస్కారములు. వారికి నేను కృతజ్ఞుడను.
– గ్రంధకర్త
చిక్కినకాసుచే తనివి చెందు నమాయకు డెల్ల కష్టముల్
బొక్కెడు బువ్వతో మరచిపోవు క్షుధానల దగ్ధమూర్తి న
ల్దిక్కులు గల్గు లోకమున దిక్కరియున్న యరుంధతీ సుతుం
డొక్కడు జన్మమెత్తె భరతోర్వరకుం గడగొట్టు బిడ్డడై
పూపవయస్సులో వలసపోయిన చక్కని తెల్గు కైతకున్
ప్రాపకమిచ్చినట్టి రఘునాథనృపాలకు డేలియున్న తం
జాపురి మండలంబునకు చక్కగ దక్షిణభాగ భూములన్
కాపురముండె నప్పరమ గర్భదరిద్రుడు నీతిమంతుడై
ముప్పు ఘటించి వీని కులమున్ కబళించి (తదీయ) దేహమున్
పిప్పియొనర్చు నీ భరతవీరుని పాదము కందకుండగా
చెప్పులు కుట్టి జీవనము సేయును గాని నిరాకరింప లే
దెప్పుడు; నప్పువడ్డది సుమీ భరతావని వీని సేవకున్
వాని ఱెక్కల కష్టంబు లేనినాడు
సస్యరమ పండి పులకింప సంశయించు
వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు
భోజనము బెట్టు వానికి భుక్తిలేదు
వాని తలమీద పులిమిన పంకిలమును
కడిగి కరుణింప లేదయ్యె గగనగంగ
వాని నైవేద్యమున నంటువడిన నాడు
మూడుమూర్తులకు కూడ కూడులేదు
పామునకు పాలు చీమకు పంచదార
మేపుకొనుచున్న కర్మభూమిం జనించు
ప్రాక్తనంబైన ధర్మదేవతకు కూడ
నులికిపడు జబ్బు కలదు వీడున్న చోట
వాని నుద్ధరించు భగవంతుడే లేడు
మనుజుడెట్లు వాని కనికరించు
వాడు చేసికొన్న పాపకారణమేమొ
యింతవరకు వాని కెరుక లేదు
ఆ యభాగ్యుని రక్తంబు నాహరించి
యినుపగజ్జెల తల్లి జీవనము సేయు
కసరి బుసకొట్టు నాతని గాలిసోక
నాల్గుపడగల హైందవ నాగరాజు
కులములేని నేను కొడుకుల పుట్టించి
యీ యఘాతమందె త్రోయవలెనె
భార్య యేల పుట్టుబానిసకని వాడు
జరుపసాగె బ్రహ్మచర్య దీక్ష
ఉదయమాది రక్తమోడ్చి కష్టము జేసి
యినుని సాగనంపి యిల్లు సేరి
ఉన్న గంజి త్రావి యొక్కనాడా పేద
ప్రక్కమీద మేను వాల్చియుండె
భూ నభముల క్రొంజీకటు
లేనుగునకు మదమువోలె యెసక మెసగె సం
ధ్యా నాట్యకేళి మాని మ
హానటుడు శివారవముల నారంభించెన్
ముక్కు మొగమున్న చీకటి ముద్ద వోలె
విహరణము సేయసాగె గబ్బిల మొకండు
దాని పక్షానిలంబున వాని చిన్ని
యాముదపు దీప మల్లన నారిపోయె
తిల్లిక నారిపి దయ్యపు
పిల్ల వలెం తిరుగు తబిసిపిట్ట నరయగా
పల్లవితమయ్యె నాతని
యుల్లంబున క్రొత్త క్రొత్త యూహాంకురముల్