గబ్బిలము

శిలవంటి యూరిసత్తులకు నెత్తుటికూడు
        రేపులు మాపులు మేపలేక
ఆచారమని తప్పదని వెంటబడివచ్చు
        గురుల దక్షిణ లిచ్చుకొనగలేక
మంత్రతంత్రముల సోమరిమాంత్రికుల బారి
        బడి ధైర్యమును చిక్కబట్టలేక
శతసహస్ర క్రూర మతసింహములు సేయు
        కుటిలగర్జన తట్టుకొనగలేక

అనుగు తమ్ముల సిరు లోర్చుకొనగ లేక
పిచ్చిపూజల మమతలు విడువలేక
అమరనుతమైన మాదు దేశాభ్యుదయము
యుట్టికిని స్వర్గమున కెక్క కూగులాడు

విందుభుజించి పొమ్మనుచు పిల్చుట కర్హతలేదు నాకు క
ర్మంది పతంగినీ పనికిమాలిన సంఘము సమ్మతించునే
పొందులు పొత్తులు న్మనకు ముప్పదినూర్ల కులాలవారికిన్‌
నందుల నాగులం గొలిచి నవ్వులపా లగుచున్న జాతికిన్‌

స్వయముగ నన్నపూర్ణ తన భర్తకు సిద్ధము జేసియున్న య
వ్యయ రుచిరాన్నమున్‌ శివుని పంక్తి భుజించిన పూజ్యురాల వ
న్వయము తరించె నిట్టి మునిపక్షిణివై కులభేద బుద్ధిచే
కయికొనకుందువే సఖుల గర్భదరిద్రుల యాతిథవ్యముల్‌

తుల వాక్రుచ్చగ రాని నెత్తుటిసిరాతో వ్రాయుచున్నారు మ
త్కులజుల్‌ దుఃఖరసోత్కటంబులగు పెక్కుల్‌ కావ్యముల్‌ జాతి లు
బ్ధుల వజ్రస్థిరచిత్తులన్‌ కరగి సంతోషించునో యీప్సితం
బులు పండింపక సుంకునో సమసి మామూల్‌ త్రోవలం ద్రొక్కునో

కవిగారికిదె నమస్కారం బనెడు వాడు
        కళకులెమ్మని పరోక్షమున బలుకు
కవనంబునకు మేను కరగి మెచ్చినవాడు
        కవిచెంత వెరబెరికముగ మసలు
విద్యాకళంకంబు వెదకజాలనివాడు
        జాతిలేదని నోరు చప్పరించు
శాఖీయులకు సహస్రములు బోసిన దాత
        అన్యుల మధురవాక్యముల దనుపు

జీవకళలు చెక్కు శిల్పిని నిరసించి
శిల్పమునకు పూజ సేయునట్టి
వక్రచరితులైన వ్యక్తులు గలచోట
కళల కకట ప్రేతకళల గతులు

పోటీసేయ సమర్ధులయ్యెదరె మా ముక్కన్న తిక్కన్నతో
మేటుల్‌ షేకుసుపీయరుల్‌ బయిరనల్‌ మిల్టన్లు గోల్డుస్మితుల్‌
నాటైనారు స్వకీయులైన కవులీనా డన్యభాషాకవుల్‌
నీటైరక్కట కాలమాంత్రికుని పాండిత్యప్రభావంబునన్‌

జాతీయోద్యమ యుద్ధరంగ మహితోత్సాహ ప్రతిధ్వానముల్‌
కూతల్‌ బెట్టుచు నాల్గుజాతులకు గగ్గుర్పాటు కల్పించెడిన్‌
స్వాతంత్య్రంబను స్వర్గసౌఖ్యమున మా భాగంబు మాకిత్తురో
ఖాతాలేదని త్రోసిపుచ్చెదరొ వక్కాణింపవే చెల్లెలా

కలధౌతాద్రిగుహల్‌ ప్రతిధ్వను లెసంగన్‌ తెల్గు రాష్ట్రార్థమై
గలభా రేచిరి సోదరాంధ్ర జను లాకర్ణింపవో నీవు చె
ల్లెల రాష్ట్రంబు గడించినారనుచు హాళిం దేలితో తెల్గు బి
డ్డల యత్నా లనరాదు గాని యవి సోడాబుడ్డి యుద్రేకముల్‌

బలియైనాడు ధరాహితార్థము మహాభాగుండు యేసుండు త
త్ఫలితంబై కనుపట్టు భిన్నమత సిద్ధాంతంబులుం జీలికల్‌
కులముల్‌ కుట్ర లనైకమత్యములు చిక్కుల్‌ చీదరల్‌ రిత్త బో
ధలు వేదాలు పదాలు రాల్ప వరచేతన్‌ ముక్తిముక్తామణిన్‌

భోగులాహారించు భుక్తి కన్నుల జూచి
        పరమపేదలు దుఃఖపడని చోటు
సాంఘికాచార పంచాస్యగర్జనమున
        బెదరక జ్ఞానంబు పెరుగుచోటు
జాతివైషమ్య రాక్షస పదాహతి చేసి
        కందక కళలు పెంపొందుచోటు
పరిపాలక క్రూరతర కరాసికి లొంగి
        పోక స్వేచ్ఛాలక్ష్మి పొదలుచోటు

అనదబిడ్డలు చూడ నెయ్యంపుసుతుల
ముద్దులాడని గుణనిధుల్‌ పుట్టుచోటు
చెప్పగదవమ్మ చూచివచ్చితివె నీవు
నిశ్చయంబుగ వాసముండెదను నేను

పయిపై నవ్వులు పల్కరింపులు మృషాబాంధవ్యముల్‌ సూపి యా
పయి శత్రుత్వము సేయు నాగరికతా భ్రష్ట స్వభావాధముల్‌
సయితానుల్‌ చరియింపనట్టి ధర గోష్పాదంబు గన్పట్టినన్‌
దయతో నాకెరిగింపుమమ్మ యచటన్‌ నాయిల్లు గట్టించెదన్‌

కళలం దాచెడు చుప్పనాతితన మింకం దేశమందున్నచో
కలదే ముక్తి ప్రపంచసభ్యతకు మార్గం బుండునే జాతికిన్‌
తలయుం దోకయు లేని తొంబది సమాధానంబులం జెప్పి పే
దల వంచించు కళానిహంతలె యనర్థం బీ శుభక్షోణికిన్‌